Monday, 28 September 2015

యాగంటి




కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌంద్రయంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.

ఆలయాలు
యాగంటి దేవాలయము కర్నూలు  జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం వున్నది.

యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తలంచి తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

అగస్త్య పుష్కరిణి

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి.



The Pushkarini is suitable for holy baths.

సహజసిద్ధమైన గుహలు
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

యాగంటి బసవన్న

ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం పురావస్తుశాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్విత మైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానంలో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.


కాకులకు శాపం
ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.



యాగంటి


అగస్త్యముని గుహ



యాగంటి నంది విగ్రహం చరిత్ర.


Sunday, 27 September 2015

రామాబాణంతో ఏర్పడిన జలధార

రామాబాణంతో ఏర్పడిన జలధార

రంగారెడ్డి జిల్లాలోని తాండూరు మండలం జుంటుపల్లిలో కొలువైన శ్రీరామస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 600 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. గోల్కొండ నవాబుల కాలంలో కృష్ణవదన్ రావు, శ్యామారావు సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. గండిపేట ప్రాంతానికి చెందిన వీరు జుంటుపల్లి పరిసరాల్లో వైరాగుల వలె పర్యటిస్తున్నారట. ఆ సమయంలో అక్కడ గల కోనేరులో శ్రీరాముని విగ్రహ శిలాఫలకం దొరికిందట. ఆ తర్వాత రాముడు వీరి కలలో ఆలయ నిర్మాణం చేయాలని ఆదేశించాడని ఇక్కడి స్థలపురాణం. 
అలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ గల శ్రీరాముని విగ్రహం నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తుంది. గుట్టపై,  400 అడుగుల ఎత్తులో  గల  విగ్రహం నుంచి నీరు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మంది ఈ రహస్యాన్ని పరిశోధించేందుకు ప్రయత్నించినా ఆ విషయం తెలియలేదు. మానవునికి అంతుచిక్కని మహిమలు నేటికీ ఎన్నో వున్నాయని అంగీకరించవలసిందే.

ఈ ప్రాంతంలో ఉన్న మరో గుట్టపై ఏడాది పొడుగునా నీరు ఉండే చోటు వుంది. ఈ నీటి దొన గురించి ఓ కథ ప్రచారంలో వుంది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడు కొండ పై భాగాన వున్నప్పుడూ వారికి నీరు కావలసి వచ్చిందని, ఆ సమయంలో రాముడు ఆ బండరాతిపై బాణాన్ని ప్రయోగించి, శిలను చీల్చి నీటిని రప్పించాడని చెబుతుంటారు. అలాగే ఇక్కడే సీతమ్మ దొన కూడా వుంది. ఈ రెండిటినీ కలిపి గాడిదొనలు అంటారు. ఈ నీటిలో స్నానం చేయటం వలన దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. 
ఆలయంలో ఏటా నిర్వహించే జాతరలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీపంలోనే భీమా నది ఉపనది అయిన కగ్నా నదిపై జుంటుపల్లి నీటి పారుదల ప్రాజెక్టు కూడా ఉంది. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు సెలవు దినాల్లో ఇక్కడికి విహారానికి వస్తుంటారు.

పుష్కర గోదావరి పుణ్యక్షేత్రాలు

ఐనవిల్లి
అయినవిల్లి గ్రామంలోని వినాయక దేవాలయం ఇక్కడ ప్రసిద్ధ క్షేత్రం. ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయ క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

అప్పనపల్లి
అప్పనపల్లి బాలాజీ దేవాలయముగా విరాజిల్లుతున్న ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము కలదు. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉన్నది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

కోరుకొండ
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం - 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది.

కోటిపల్లి
సోమేశ్వరస్వామి దేవస్థానంగా అలరారుతున్న ఈ ఆలయం... పవిత్ర గౌతమీ తీర్థం ఒడ్డునే ఉంది. గౌతమిలో పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పునః పునః చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం ...భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.

మందపల్లి
శీ మందేశ్వరాలయం స్వామి (శనీశ్వరాలయం) ఆలయం దగ్గరలో దండిచి మహర్షి ఆశ్రమం ఉండేది. పురాణాల ప్రకారం దండిచి మహర్షి తన వెన్నెముకను ఇంద్రుడుకి వజ్రాయుధంగా అసురలను చంపడానికి ఇక్కడే దానం ఇస్తాడు.

మురమళ్ళ
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము - ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.

అన్నవరం
రత్నగిరి కొండలపై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం లో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉన్నది.

బిక్కవోలు
పురాతనమైన, చారిత్రికమైన జైన శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం.శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ గోసేరం

వానపల్లి
ఈ గ్రామములొ ప్రసిద్ద పళ్ళాలమ్మ అమ్మవారి ఆలయము కలదు. ఈ గ్రామము కొత్తపేట - అయినవిల్లి రహదారిలో కలదు.

అంతర్వేది
కృత యుగములోని మాట... ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ద్రాక్షారామం
ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్‌ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది.

ర్యాలీ
ఈ ప్రాంతంలో జగన్మోహినీ - చెన్న కేశవస్వామి ఆలయం ఉంది. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టిం చాడని చెబుతారు. ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం ఉంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అమె సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడ సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం ఉరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది.

జి.మామిడాడ
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం - గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా నందు తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది.

సర్పవరం
భావనారాయణ ఆలయం - పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్ఠత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను. ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి.

పలివెల
శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి - ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములొని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యణ మండపములో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్య మహర్షి ప్రార్థనమేరకు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడా శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు.

పిఠాపురం
పాదగయ క్షేత్రం (కుక్కుటేశ్వర స్వామి)
కుక్కుటేశ్వర దేవాలయం - పురుహూతికా దేవి ఆలయం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.

పెద్దాపురం
మరిడమ్మ తల్లి దేవాలయం, పాండవుల మెట్ట. సూర్యనారాయణ స్వామి దేవాలయం. పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు.శివుడు మరియు వెంకటేశ్వర దేవాలయాలు
భువనేశ్వరి పీఠము. హజరత్‌ షేక్‌ మదీనా పాఛ్ఛా ఔలియా వారి దర్గా

సామర్లకోట
శ్రీ కుమరారామ మందిరం (శ్రీ భీమేశ్వరాలయం), శ్రీ మాండవ నారాయణస్వామి ఆలయం. శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం.. శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము...

ఛాయా సోమేశ్వర ఆలయం - అద్భుత శిల్పవాస్తు రహస్యం

మన దేశంలో ఎన్నో చారిత్రక విశిష్టత కలిగిన ఆలయాలున్నాయి. శతాబ్దాల క్రితమే అనేక దేవాలయాలు భారతావనిలో అనేకం నిర్మింపబడినాయి. అలాంటి వాటిల్లో ప్రతి ఆలయానికీ ఓ ప్రత్యేక ఉంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో విస్తరించిన నల్లగొండ జిల్లాలో అనేక ప్రాంతాలలో ఆ విశిష్ట ఆలయాల ఛాయలు కనిపిస్తాయి. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు వివిధ కాలాలలో వెల్లివిరిసాయని ఇక్కడ దొరికిన ఆధారాలు తెలుపుతున్నాయి. ఎన్నో స్థూపాలు, శిల్పాలు వెలుగు చూశాయి. హిందూ ఆలయాలలో మేళ్ళ చెఱువు, మెట్టపల్లి, వాడపల్లి, యాదగిరి గుట్ట ప్రాశస్త్యం చాలా మందికి తెలిసిందే. కానీ ఎంతో చారిత్రిక నేపథ్యం, నిర్మాణ విలువలు ఉన్నా అంతగా ప్రాచుర్యంలోకి రాని ఒక విశేష ఆలయం ఈ జిల్లాలో ఉంది. అదే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.

జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని ఈ ఆలయంలో మరెక్కడా కనుపించని విశేషం ఉన్నది. అక్కడ గర్భాలయంలోని శివలింగాన్ని నిరంతరం నిలువెత్తు ఛాయ కప్పి ఉండటం. సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. వీరి తర్వాత ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి నిదర్శనం ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని తెలుస్తోంది.

ఛాయ రహస్యమేమింటే..!
ఛాయా ఛాయా సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోడులు (నల్లగొండ / నీలగిరి చోడులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్భుతం. ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకూ తన స్థానాన్ని మార్చుకోదు అనేది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం. అ శాస్త్ర రహస్యాన్ని సూర్యపేటకు చెందిన శ్రీ శేషగాని మహేశ్వర్‌ గారు చేదించారు. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా నిర్మించిన వాస్తుశాస్త్ర అద్బుతం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం లోని ఛాయ రహస్యాన్ని ఆయన ప్రపంచానికి వివరించారు.

వెలుగు పడినప్పుడు ఏర్పడే స్తంబాల నీడ ఒకదాని మీద మరొకటి పడి చివరకు ఒకటిగా మారి లింగం మీద పడుతున్నాయని, అలా పడటానికి కారణమైన సూర్యకాంతి ధారాళంగా ఆలయంలోకి ప్రవేశించడానికి అనువుగా ప్రహరీగోడ నిర్మించలేదని తేల్చారు. అన్ని ఆలయాలలో కనిపించే ధ్వజస్తంభం కూడా ఇక్కడ ఉండదు. నాడు పరిమితంగా ఉన్న పరికరాలు, సదుపాయాలు సహాయంతో ఎంతో కాలం సూర్యగమనాన్ని, కాంతి మార్గాన్ని గమనించి, లెక్క కట్టి దానికి అనుగుణంగా స్తంభాలను అమర్చి ఒక అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించిన శిల్పుల గొప్పదనం ఎంతైనా శ్లాఘనీయం. ఇక్కడ మరో చిత్రమేమిటంటే ఛాయపడే మార్గంలో ఏదైనా వస్తువును ఉంచితే దాని నీడ కూడా పడుతుంది. అదే కొద్దిగా ప్రక్కన ఉంచితే ఆ వస్తువు నీడ పడదు.

ఆలయ విశేషాలు...
ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. మండప స్థంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.

ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ, అభివృద్ధి, సంరక్షణ, రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం, కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం. తమ ఇష్టదైవ ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజ్ఞాపాటవాలతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి, దానిని కాపాడి నేర్చుకోవాలి. మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ, గౌరవం, ఆదరంతో కూడిన పోషణ, ప్రచారం కల్పించకపోవడం విచారకరం. భావి తరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నది.

Friday, 25 September 2015

ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి. ఈ పట్టణం తిరుపతి నగరానికి 54 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరి పేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది. నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం మరియు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు.

దక్షిణ కైలాసంగా ముద్రపడ్డ ఈ దివ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న రెండు దీపాలలో ఒకటి ఎల్లప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉండటం మరొకటేమో నిశ్చలంగా కదలకుండా ఉండటం. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు నాటి ప్రాచీన భారతీయ వాస్తుకళకు, శిల్ప కళాకారుల పనితనానికి అద్దంపట్టే విధంగా ఉంటాయి. శ్రీ కాళహస్తి పట్టణం చుట్టూ చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ అందులో నుంచి మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు కొన్నే ఉన్నాయి ప్రధానమైన వాటిలో వెయ్యి కాళ్ళ మండపం, 36కు పైగా తీర్థాలు ఇలా ఎన్నో ...

పురాణాల్లో శ్రీకాళహస్తి :
ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు. శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు.

భక్త కన్నప్ప :
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరిలో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు ముఖ్యంగా శివ భక్తులకు ఈ భక్తి కథ బాగా తెలిసిందే.

విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :
ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి.  తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు.  చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తిలోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధానికి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.

శ్రీ కాళహస్తి దేవాలయం
శ్రీకాళహస్తి లో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఒకటిగా ఉన్న కాళహస్తి దేవాలయం తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన ఆకర్షణ. పురాణాలలో పేర్కొన్న విధంగా తనను పరీక్షించిన శివుని కోసం తన కంటినే తీసి ఇచ్చిన పరమ భక్తుడు భక్త కన్నప్ప ఇక్కడనే శివుడుని కొలిచాడు. శివ భక్తులే కాక ఈ కాళహస్తి ఆలయానికి రాహు - కేతు దోషాల నుంచి విముక్తి పొందటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుపతిని సందర్శించేవారు కాళహస్తిలోని కాళహస్తి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.


కన్నప్ప దేవాలయం 
కన్నప్ప దేవాలయం, శ్రీకాళహస్తి లోని ఒక చిన్న కొండ మీద ఉంది. కాళహస్తి లో ఉన్న ఈ ఆలయం గొప్ప శివ భక్తుడైన భక్త కన్నప్ప కు అంకితం చేయబడినది. వేటగాడు అయిన కన్నప్ప ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని చూసిన తరువాత అక్కడి నుంచి దానిని తీసుకువచ్చి నియమాలకు వ్యతిరేకంగా పక్కనే ఉన్న జలాధార నుండి తన నోటిలో నీరు తీసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు.

భక్త కన్నప్ప గురించి ఒక్కమాటలో .. 
కన్నప్ప ఒక వేటగాడు. ఈయన నిత్యం శివుణ్ని ఆరాదించేవాడు. ఒకనాడు శివుడు అలా అతనిని కొలిచే సమయంలో కన్నప్ప భక్తిని పరీక్షించడం కోసం తన కంటి నుండి రక్తం కార్చేవాడు వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామివారికి అమర్చాడు వెంటనే మరో కంటి నుండి రక్తం కారడం మొదలవడంతో భక్తుడైన కన్నప్ప సందేహీంచకుండా తన రెండవ కన్నుని కూడా పీకి స్వామివారికి అమర్చాడు. దీనికి చూసి ఎంతగానో ముగ్ధుడైన శివుడు ప్రత్యెక్షమై అతనిని కరుణించి ముక్తిని ప్రసాదించాడు.

చతుర్ముఖేశ్వర దేవాలయం 
బ్రహ్మ మరియు మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తి లోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. ఈ గుడిలో శివలింగం నాలుగు దిక్కులూ చూసే నాలుగు ముఖాలతో వుండడం విశేషం. చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలున్న వాడని అర్ధం. ఈ దేవాలయం గోడల మీద శివుడికి చెందిన పురాణ గాధల చిత్రాలు వున్నాయి.

సహస్ర లింగ దేవాలయం 
శ్రీకాళహస్తి లో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఒకటి సహస్ర లింగ దేవాలయం. ఒక అందమైన అడవి మధ్యలో వున్న ఈ గుడి పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ‘సహస్ర' అంటే వేయి అని అర్ధం - ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన శివలింగం వుండడం వల్ల ఈ గుడికి ఆ పేరు అంతేనా .. ఈ దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ జన్మలోనూ, పూర్వజన్మల్లోనూ చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం 
శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతం లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు. ఇది కాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే వుంది. ఈ దైవం ఆశీస్సుల కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తారు.

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం 
శ్రీకాళహస్తిలోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ దేవాలయం 1200 - 1500 ఏళ్ళ నాటిదంటారు. పరిసరాల్లో వున్న గుళ్ళతో పోలిస్తే ఈ గుడి చిన్నదే అయినప్పటికీ ఎంతో మంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తారు. గమ్మత్తేమిటంటే ఈ చిన్న గుళ్ళోనే దక్షిణ భారతంలో కెల్లా అతి పెద్ద శివలింగం వుంది.


గుడిమల్లం
శ్రీకాళహస్తి కి 54 కి. మీ. దూరంలో ఉన్న గుడిమల్లంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది అదేమిటంటే ఇక్కడున్న శివలింగం లింగరూపంలో కాకుండా మానవ రూపంలో వేటగానివలె ఉంటుంది. పురుషాంగముతో పోలి ఉన్న ఈ లింగం ప్రపంచంలో అతి పురాతనమైన శివలింగంగా ఖ్యాతి గడించింది.

వేయిలింగాల కోన జలపాతం 
వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం చేస్తారు. చుట్టూ శివలింగాలను పోలి వున్న రాళ్ళతో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని భావిస్తారు. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయనే నమ్మకం వల్ల ఎంతో మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.


భరద్వాజ తీర్థం 
శ్రీకాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం వుంది. ఈ తీర్థం నెలకొని వున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్ల తో ఉండి ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ తీర్థం మధ్య ధ్యానముద్రలో వున్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం వుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ తీర్థం లో మునక వేయడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

 

ఉబ్బలమడుగు జలపాతం 
ఉబ్బల మడుగు జలపాతం శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం జలకళతో కళకళలాడుతూ ఉంటుంది. టెక్కింగ్ మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. ఈ జలపాతాన్ని వీక్షించడానికి స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.


తలకోన జలపాతం 
శ్రీకాళహస్తి పట్టణానికి 82 కి. మీ. దూరంలో ఉన్న తలకోన జలపాతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కెల్ల ఎత్తైనది. ఈ జలపాతానికి సమీపంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది. అలాగే జలపాతం కింద గుంటలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

 
వసతి గృహాలు 
యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము తో పాటుగా పలు ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుంది.
శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి? 
వాయు మార్గం శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతిలోని రేణిగుంట ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ వుంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.

కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :
ఈ పట్టణం లో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.

అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది. ఒక దివ్యమైన ప్రయాణానుభూతి కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...