Showing posts with label శివయ్య. Show all posts
Showing posts with label శివయ్య. Show all posts

Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

Thursday, 22 November 2018

అరుణాచ‌లం









అరుణాచ‌లం
అగ్ని రూపం నిశ్చల దీపం
నేడు అరుణాచ‌లంలో కార్తీక దీపం


గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం.
‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి.
‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి.
‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. 
అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.


ఏమిటీ అరుణాచలం...
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

మహా దీపం
అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి. ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ భరణి దీపంతోనే..పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ‘కార్తిగై దీపం’గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నేతిని వినియోగిస్తారు. ఈ దీపం పది రోజుల పాటు  వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ,  గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్‌ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.

రమణ సందేశం...
తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌




Wednesday, 21 November 2018

అరుణాచలం!









సర్వపాపహరం
అరుణాచలం!


ఆ పేరు తలిస్తేనే పాపరాశి దగ్ధమవుతుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వర జ్యోతిర్లింగమే అరుణాచలమని విశ్వాసం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువుదీరి ఉన్నాడు. అరుణేశ్వరి, అరుణేశ్వరుల సాన్నిధ్యం సర్వసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వాసం. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడన్నది నమ్మకం.

అరుణాచలాన్నే అణామలై అనీ తిరువణ్ణామలై అనీ అంటారు. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అణామలై అంటే తమిళంలో పెద్దకొండ. ఈ కొండ సాక్షాత్తూ పరమేశ్వర లింగమేనని పెద్దలు చెబుతారు. కార్తిక పౌర్ణమినాడు ఇక్కడ విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ఒక పక్క నుంచి చూస్తే... కొండ నందీశ్వరుడిలా కనిపిస్తుంది. అరుణాచలం మీదనే రమణ మహర్షిలాంటి సిద్దులు తపస్సు చేశారు. గిరిప్రదక్షిణ కోసం రమణాశ్రమం దగ్గరున్న వినాయకుడి గుడి ముందునుంచీ నడక ప్రారంభిస్తారు. ఆ మార్గంలో ఎన్నో తీర్థాలూ, క్షేత్రాలూ. ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి మాసంలోనూ పౌర్ణమినాటి రాత్రి వేలాది భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తారు.

అగ్నిలింగ ఆవిర్భావం
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మవిష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అది ఏనాటికీ తేలలేదు. ఓ రోజున ఒక పెద్ద జ్యోతి స్తంభం రూపంలో వారిముందు అవతరించింది. ఆ జ్యోతి అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి.. ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని అశరీరవాణి పలికింది. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని చూడటానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంస వాహనం ఎక్కి ఆ వెలుగు స్తంభం పైభాగాన్ని దర్శించడానికి బయలుదేరాడు. ఆ స్తంభం తుదీ మొదలూ అటు బ్రహ్మకు కానీ, ఇటు విష్ణుమూర్తికి కానీ అంతుపట్టలేదు. ఇద్దరూ బయలుదేరిన చోటికే వచ్చారు. తామిద్దరిలో ఎవరూ గొప్ప కాదనీ, తేజోమయమైన అగ్నిస్తంభమే గొప్ప అనీ ఆమోదించారు. తమ అహంకారాన్ని నశింప చేసినవాడు తేజోలింగ రూపుడైన శివుడేనని అర్థమైంది. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడున్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడన్నది నమ్మకం.

ఎన్నెన్నో అద్భుతాలు
అరుణాచలం అద్భుతాలకు నిలయం. పరమశివుడి గణాలలో భృంగి ప్రధాన సేవకుడు. భృంగికి శివుడి మీద మాత్రమే భక్తి. అందుకే ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుండేవాడు. ఓ రోజున భృంగి ప్రదక్షిణ చేసే సమయానికి అమ్మవారు, శివుడి ఎడమవైపు అతుక్కొని అర్ధనారీశ్వరిగా ఉన్నారు. భృంగి తేనెటీగ రూపాన్ని ధరించి అమ్మవారికి, అయ్యవారికి మధ్యన దూరిపోయి శివ ప్రదక్షిణను పూర్తి చేశాడు. అందుకు మెచ్చుకున్న శివుడు భృంగికి మోక్షం ఇవ్వబోయాడు.. అమ్మవారు వద్దని వారించారు. ఈ ప్రణయ కలహాన్ని అర్చక స్వాములు ఓ ఉత్సవంగా జరుపుతారు. అరుణాచల గోపురాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు. ఇక్కడున్న ఓ గోపురానికి కిరిగోపురం అని పేరు. దీన్ని భళ్లాల మహారాజు కట్టించినట్లు చెబుతారు. భళ్లాలుడు శివభక్తుడు. గొప్పదాత. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం కలగలేదు.

ఆ రాజును పరీక్షించేందుకు శివుడే స్వయంగా బయల్దేరాడు. కొంతమంది జంగమ దేవరలను వెంటపెట్టుకొని తాను కూడా జంగమయ్య వేషం వేసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. తమకు సేవ చేసేందుకు కొందరు దేవదాసీలు కావాలని రాజును కోరాడు జంగమయ్య. రాజు అలాగే పంపాడు. ఆ జంగమ దేవరలలో మిగిలిన వారికి రాజు పంపిన దాసీలందరూ సరిపోయారు. పెద్ద జంగమయ్యకు మాత్రం ఒక్కరూ మిగల్లేదు. దాంతో రాజు రెండో భార్య తానే దాసీగా వెళ్లింది. ఆమె వెళ్లేసరికి పెద్ద జంగమయ్య నిద్రపోతున్నాడు. ఆయనకు ఫలాలను సమర్పించే ఉద్దేశంతో తాకి లేపింది. రాణి ఆయనను తాకగానే పెద్ద జంగమయ్య పసిబాలుడిలాగా మారిపోయాడు. అప్పుడామె ఆ బిడ్డను ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. రాజు బిడ్డను తాకగానే బిడ్డ అంతర్థానమై పోయింది. రాజు, రాణి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు "ఓ రాజా నీవు బాధపడవద్దు. నేను నీకు కుమారుడిని. నీ మరణానంతరం నీకు అగ్ని సంస్కారాన్ని కూడా నేనే చేస్తాను' అని వరమిచ్చాడు. భళాల రాజు మరణానంతరం శివుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ నాటికి కూడా, రాజు పరమపదించిన రోజున అరుణాచలేశ్వరుడికి ఆ దుర్వార్తను వినిపిస్తారు. ఆ తర్వాత, ఆలయం తలుపులు మూసివేస్తారు. అనంతరం స్వామి భళ్లాల రాజు పాలించిన పళ్లి కొండపట్టు వెళతాడు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి, భళ్లాల రాజుకు ఆబ్దికం పెట్టిస్తారు. ఆ తర్వాత, ఉత్సవమూర్తి తిరిగి ఆలయానికి చేరుకుంటాడు. ఇవన్నీ అయ్యాకే భక్తులకు దర్శన భాగ్యం. ఇలాంటి స్థల పురాణ గాథలు భక్తలోకంలో విశేష ప్రచారంలో ఉన్నాయి.

- శ్రీమల్లి, 7382927069




Sunday, 23 September 2018

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కచోటే







సోమశిల
ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కచోటే
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణానికి దగ్గరలో


బోళాశంకరుడి అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను చెబుతారు. వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా చాలనుకుంటారు. అలాంటిది దేవదేవుడు ఒకేచోట పన్నెండు రూపాల్లో పూజలందుకుంటున్న ప్రాంతం సోమశిల. ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడ పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలూ కొలువై ఉండటం విశేషం.

మనసుదోచే నల్లమల అందాలూ
పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలూ
మధురానుభూతిని మిగిల్చే పడవ ప్రయాణాలూ...
ఇలా ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తున్న సోమశిల ఆధ్యాత్మికంగానూ అంతే ప్రసిద్ధి చెందింది. కృష్ణుడి ఆనతిమేరకు ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయాలుగా సోమశిలలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు పేరు. ఒకవైపు ఆధ్యాత్మికతనూ మరోవైపు ప్రకృతి అందాలనూ తనలో ఇముడ్చుకున్న సోమశిల నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ఇక్కడికివచ్చి చేరడంతో కృష్ణమ్మ కొత్త అందాలను సంతరించుకుని పర్యటకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పుష్కర ఘాట్‌లో స్నానాలు చేసి పన్నెండు జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్న తర్వాత నదిలో పడవ ప్రయాణం ద్వారా చుట్టుపక్కల ఉన్న పర్యటక ప్రాంతాలనూ వీక్షించవచ్చు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్నీ దర్శించుకోవచ్చు.

స్థలపురాణం
ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త జాప్యం అవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరోలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీనుంచి తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం పన్నెండు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోతుంది. తర్వాతికాలంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల నమ్మకం.

ఒకే చోట...
పదకొండో శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలనూ ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీవిశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు... ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహమవుతుందనీ సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఒకసారి వచ్చి మనసులోని కోర్కెలు స్వామికి తెలియజేస్తే అవి తప్పక నెరవేరతాయని చెబుతారు.

ఎలా వెళ్లాలంటే...
ప్రకృతి ప్రేమికులకు సోమశిల ప్రయాణం ఒక మరపురాని మధురానుభూతి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ పూర్తిస్థాయిలో రావడంతో ప్రస్తుతం పుష్కరఘాట్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక్కడి కృష్ణానది ఈత కొట్టడానికి అనువైనది కావడం, చుట్టూ పర్యటక ప్రదేశాలు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎక్కువ సంఖ్యలో పర్యటకులూ, భక్తులూ వస్తుంటారు. హైదరాబాద్‌కి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కొల్లాపూర్‌ వరకు ప్రతి అరగంటకూ ఒక ఆర్టీసీ బస్సు సిద్ధంగా ఉంటుంది. జలమార్గం ద్వారా అయితే... కర్నూలులోని శ్రీశైలం, నందికొట్కూరు నుంచి పడవల్లో రావచ్చు.

- జి.వెంకటేష్‌

Friday, 31 August 2018

సలేశ్వర మల్లిఖార్జున స్వామి









సలేశ్వర మల్లిఖార్జున స్వామి



సలేశ్వర మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:
అక్కడి ప్రతి చెట్టు నిత్యం స్మరిస్తూనే ఉంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే ప్రతి నీటి బొట్టు లింగాన్ని తాకాలని తపిస్తూనే ఉంటుంది. ప్రకృతి ఒడిలో కొలువైనట్లుగా కనిపించే సలేశ్వరుడు యాత్ర నాగర్ కర్నూల్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల అమరనాధ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం యాత్ర:
ఉగాది వెళ్లిన తొలి పౌర్ణమి సమయంలో కేవలం 5 రోజులు మాత్రమే భక్తులు దర్శించుటకు వీలు కలిగే సలేశ్వర యాత్ర:

శివుడు మల్లిఖార్జున స్వామి రూపంలో కీకారణ్యంలో వేలసంవత్సరాల క్రితం వెలసిన క్షేత్రం సలేశ్వరం.

హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా ,లింగాల మండలం మన్ననూరు, అచ్చంపేట గ్రామాల అటవీ ప్రాంతంలో సలేశ్వర మల్లిఖార్జున స్వామి వెలిసారు. చుట్టూ కొండలు ఉండటం వలన శైలాలు(కొండలు) పేరు మీదుగా మొదట శైలేశ్వరం అని కాలక్రమేణా వాడుక భాషలో ప్రజలు సలేశ్వరంగా ఈ ప్రాంతాన్ని పిలవటం మొదలయింది. సలేశ్వర యాత్ర అతి కఠిన తరమైనది కావున తెలుగు రాష్ట్రాల అమర్ నాధ్ యాత్రగా పేరుపొందింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గ మధ్యలో మన్ననూర్ అటవీ ప్రాంతంలో 150 వ మైలు రాయి వద్ద నుండి అటవీ మార్గం ద్వారా 20 కిలోమీటర్లు వాహనాలు పై ప్రయాణిస్తే సలేశ్వరం కు వెళ్లే మార్గంకు చేరుకుంటాము. ఈ 20 కిలో మీటర్లు కూడా క్లిష్టమైన అటవీ ప్రాంతం,మట్టిరోడ్డు కావటం మరియు సింగిల్ రోడ్డు వల్ల 20 కిలోమీటర్లు చేరుకోవటానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది,శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదు వెళ్లే మార్గం లో సరిగ్గా 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్ననూరు వస్తుంది.

ఇది దట్టమైన కీకారణ్య ప్రాంతం కావున అటవీ శాఖ అధీనంలో ఉంటుంది.కేవలం చైత్ర శుధ్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విదియ వరకు మాత్రమే 5 రోజులు స్వామి వారి వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే భక్తులను ఆలయం వరకు అనుమతిస్తారు.మిగిలిన రోజుల్లో ఈ ఆలయం కు వెళ్లటం అసాధ్యం. ఈ జాతరలో పాల్గొనటానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జంగమయ్యను అయిన దర్శించుకొని పరవశిస్తారు. అంతేకాదు తరతరాలుగా స్థానిక చెంచులే ఈ జాతరను నిర్వహించడం విశేషం.

అద్బుత మైన ప్రకృతి,ఆకాశం తాకే కొండలు,వాటి కిందనుండి పై వరకు పచ్చని చెట్లు,గుహలు,జలపాతాలు ఈ ప్రాంతం సొంతం,అందుకే 17 వ శతాబ్దం లో అలనాటి నిజాం నవాబ్ అటవీ సంచారానికి వచ్చి ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్దుడు అయ్యి ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో వేసవి విడిది పర్హాబాద్ పేరుతో భవనం నిర్మించుకున్నారు. అనగా అందమైన ప్రదేశం అని అర్థం, అంతకు ముందు దాని పేరు’ పుల్ల చెలమల’. 1973 లో ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం.అడవిలో 20 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించాక వాహనాలు అక్కడ నిలిపి తమకు అవసరమైన దుస్తులు, ఆహార పదార్దాల వంటివి మాత్రమే తీసుకుని కాలి నడకన 5 కిలోమీటర్లు నడవాలి.

ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. ఈ మార్గం కొండలు, ఇరుకైన ప్రాంతాలు, అతి క్లిష్టమైన సన్నని రోడ్లు కలిగి ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక రెండు కొండల మధ్య ఒక వాగు ప్రవాహం కలిగి ఉంటుంది. ఆ కొండలను పట్టుకుని అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ఆ వాగు దాటాలి. ఏ మాత్రం కాలు జారినా వాగు ప్రవాహంలో పడిపోతారు.

ఈ ఆలయంలో చైత్ర శుద్ధ పౌర్ణమి  రోజున చంద్రకిరణాలు నేరుగా స్వామి వారి పై ప్రసరించి తేజోమూర్తి అయిన లింగమూర్తిగా స్వామి దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజున మాత్రమే ఇలా జరుగుతుంది.  కనుకనే ఈ రోజున లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించి కృపపొందుతారు. ఈ ఆలయానికి దగ్గరలో దాదాపు 1000 అడుగుల పై నుండి జాలు వారే తెల్లని స్వచ్చమైన పాలధార లాంటి జలపాతం పడుతుంది. ఈ జలపాతం క్రింద స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఈ జలపాతం కింద స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం.

దట్టమైన అరణ్యం లో ఎన్నో ఔషధ మొక్కలు, ఆకులును తాకుతూ పై నుండి జాలు వారే జలం లో అనేక గుణాలు ఉండి రోగాలు నయం చేస్తాయని చెపుతారు. ఈ ప్రవాహం భక్తులు కొద్ది సంఖ్యలో వెళ్తే తక్కువ ధారతో ఎక్కువ సంఖ్యలో వెళ్తే పెద్ద ధారతో పై నుండి పడడం స్వామి లీల అని చెపుతారు. పుట్టకు దారాలు కట్టి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతాన ఫలం,తిరుగు ప్రయాణంలో కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలని వివాహం కాని వాళ్లు చలువపందిళ్లు వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి మరోసారి ఆ లింగమయ్యకు మొక్కుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటే ఏడాదంతా పంటలు బాగా పండుతాయన్నది రైతుల విశ్వాసం. కష్టమైనా ఈ నడక ప్రయాణాన్ని సాగిస్తున్న భక్తులు “వస్తున్నాo  వస్తున్నా లింగమయ్య” అంటూ దర్శనానంతరం తిరిగి వెళ్తూ “వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం లింగమయ్య” అంటూ చేసే పనుల వల్ల ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది.

చారిత్రక ఆధారాలు:
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై అనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరినే ఈ సలేశ్వరమేనని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16″/10″/3″ గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . “సుళ” తెలుగులో “సుల” అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరంగా చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360-370 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10"/10″/3″. దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది.

స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బి.ఎన్ శాస్త్రి నిరూపించారు.

13వ శతాబ్దంలో పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రం రాసిన ప్రముఖ శివ భక్త పండితుడు పాల్కురి సోమనాధుడు తన గ్రంధాలలో సలేశ్వర ఆలయ విశేషాలు తెలిపారు,దీనిని బట్టి ఎంత ప్రాసస్త్యం ఉన్న ఆలయమో మనం గ్రహించవచ్చు. 17వ శతాబ్దంలో శ్రీశైలం దర్శించిన చత్రపతి శివాజీ అడవుల గుండా ప్రయాణించి సలేశ్వరం చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి.   సలేశ్వర ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో అధ్బుతమైన మల్లెల తీర్దం అనే చారిత్రక జలపాతం ఉంటుంది.

భక్తుల సౌకార్యార్థం కోసం కొందరు స్వచ్ఛంద సంస్థల వారు ఉచితంగా భోజనం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతారని వారికి ఐటీడీఏ, అటవీశాఖ, ఇతర శాఖల అధికారుల సహకారం అందిస్తారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించరాదని సూచించారు. ఆర్టీసీ బస్సులు కూడా రాంపూర్‌పెంట వరకే వెళ్తాయని అక్కడ నుంచి 2KM ఆటొ ప్రయాణం తరువాత కాలినడుకన భక్తులు సలేశ్వరం చేరుకోవాలి. లింగమయ్యను దర్శించుకోవడానికి, వాహనాలను లోపలికి అనుమతి కోసం వసూలు చేసే టోల్‌గేట్ ద్వారా వచ్చె డబ్బులను సలేశ్వరం చుట్టున్న 12 పెంటల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

నల్లమల అడవిలో మొత్తం పంచ లింగాలున్నాయి అంటారు:
శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరం లింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే!

లింగాలలో జరిగే కోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తుల దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రత్యేక బస్సులు భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్, అచ్చంపేట నుండి RTC బస్సులు నడుపుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లిలో RTC క్యాంపులు ఏర్పాటు, లింగాల నుండి కాలినడకన సలేశ్వరం వెళ్ళే భక్తులకు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ నుండి లింగాల, అప్పాయిపల్లి వరకూ ప్రతి 20 నిమిషాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.

సలేశ్వరం చేరుకోవడానికి మార్గాలు:
1. హైదరాబాద్ వైపు నుండి సలేశ్వరం వచ్చే భక్తులు నేరుగా శ్రీశైలం బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగితే సరిపోతుంది. అక్కడ నుండి బస్సులు. ఆటోల రాంపూర్ చెంచు పెంట వరకు ప్రయాణించవచ్చు. తెలంగాణ వైపు నుండి వచ్చే భక్తులకు అచ్చంపేట ,నాగర్ కర్నూలు బస్ డిపోల నుండి సలేశ్వరం కు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

2. శ్రీశైలం వైపు నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్ బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగి సలేశ్వరం చేరుకోవచ్చు.

3. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి మీద గా ఉంది. ట్రాక్టర్ల ద్వారా గిరిజ గుండాల వరకు అతి కష్టంమీద చేరుకొని అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తే సలేశ్వరం చేరుకోవచ్చు.








సలేశ్వరం



సలేశ్వరం గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..!!

గుడి అంటే రోజూ పూజలు, నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు. గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి. ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది? అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!

సలేశ్వరం.
శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

  1. ఆలవాలం.
    అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది. దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.

  2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.
    తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. అక్కడి నుంచి 32కిమీల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.

  3. జాగ్రత్త.
    గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.

  4. లోయలో జాగ్రత్తగా నడవాలి.
    గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.

  5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.
    గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.

  6. లింగమయ్య స్వామి లింగం.
    గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

  7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.

  8. శిధిలావస్థ.
    10కి.మీలు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.

  9. నడకదారులు.
    ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.

  10. చైత్రపౌర్ణమి.
    సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది. చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు. ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.

  11. జలపాతాలు.
    ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

  12. భక్తులతో కిటకిటలాడుతూ.
    నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు. గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

  13. చరిత్రకారులు.
    సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.

  14. ఎలా చేరుకోవాలి..
    • హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం లోయ కనిపిస్తుంది. అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.
    • నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.
ఓం నమః శివాయ..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!



Saturday, 18 March 2017

యనమదుర్రు









యనమదుర్రు
తలకిందులు భంగిమలో ఉన్న శివుడు


చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. కానీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర యనమదుర్రులో మాత్రం శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ, ముఖం, పాదాలు, ఉదరం, మోకాళ్లు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది. జగన్మాత పార్వతిదేవి నెలలపిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత.

ఈ గుడి వెనుక ఒక పురాణకథ ఉంది. లోకాన్ని పట్టి పీడిస్తున్న శంభరున్ని అంతం చేయాలనుకున్న యమధర్మరాజు, శంభరుడు శివుని భక్తుడని శంభరున్ని అంతంచేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు. అదే సమయంలో కైలాసంలో తలకిందులుగా తపస్సు చేస్తున్నశివుడు, పక్కనే బాలింత పార్వతీ దేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్నచోట ప్రత్యక్షం అయ్యారని పురాణకథ. యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివున్ని ప్రతిష్టించి గుడికట్టి, గుడికెదురుగా ఒక కోనేరుని ఏర్పాటు చేసాడని, ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివున్ని దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల విశ్వాసం.




Saturday, 3 September 2016

తంజావూరు - బృహధీశ్వరాలయం A









దివ్యమైన శిల్పాలు
తంజావూరు అందాలు


తంజావూరు చూడాలని చాలా రోజుల నుంచి మేము అనుకొంటున్నాం. చివరకు మా కల ఫలించి తంజావూరును దర్శించడం జరిగింది. ఆ ఊరు చాలా మాములుగా ఉంది. రైలు దిగినపుడు ఈ ఊరిలో బృహధీశ్వరాలయం ఉందా? అన్న సందేహం కలిగింది. ఆ ఆలయంలోని శివుడు పేరుకు తగ్గట్టే ఉంటాడా లేడా అన్న అనుమానమూ పీడించింది. ఎందుకంటే నేను చాలారోజుల నుంచి ఈ గుడి గురించి అక్కడక్కడా వింటూన్నందువల్ల ఈ ఊరిలో దిగగానే గుడి చూడాలన్న ఆత్రం పెరిగిపోయింది. అందుకే చాలా త్వరగా గుడికివెళ్లాం. ఆహా! గుడి గోపురాన్ని చూడగానే నాలో మాటలు ఆగిపోయాయి. ఒక పెద్ద రాజకోటలాగా ఆ మందిరం కనపడి ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. అంత ఎత్తున ఉన్న ఆ గోపురంపై అనేకానేక రకాల శిల్పాలతో కనులకు విందునిస్తున్నాయి. చూసే కొద్దీ చూడాలనే అనిపిస్తుంది. అక్కడి వారిని ఆ గుడి గూర్చి వాకబు చేసాను.

శిల్ప సౌందర్యం గూర్చి వారు ఇలా అంటారు - ఈ గోపురం పై ఉన్న శిల్పాలను శిల్పులు చెక్కడానికి పొద్దున పూనుకొనేవారు. వారు పొద్దుట నుంచి సాయంత్రం దాకా చెక్కి మిగతా పని రేపు పూర్తి చేసుకొందాం అనుకొని వారిళ్లకు వెళ్లేవారట. కాని తెల్లవారి వారు పనికి వచ్చి చూసే సరికి నిన్న మొదలుపెట్టిన శిల్పం పూర్తి అయి ఉండేదట. ఇలా ఎలా జరిగేదంటే అంతా భగవచ్చిత్రం. దేవశిల్పులు వచ్చి ఈ పనిని పూర్తి చేసి వెళ్లేవారు. మానవ మాత్రులు ఎవరైనా ఇంతచక్కటి పనితనాన్ని చూపుతారా అని వారు అన్నారు. నిజమే! ఇంతటి శిల్ప సౌందర్యావిష్కరణ చేసినవారు నిజంగా దివ్యులే అయి ఉంటారు. ఏ మనిషిలోనైనా దైవత్వాన్ని చూడమని చెప్పే మన పురాణ గాధలు నాకు గుర్తుకువచ్చాయి. ఆ శిల్పులకు నేను చేతులెత్తి నమస్కరించాను.

ఇక ఆ కోవెలలోని దైవం ఇంక ఎంత గొప్పగా ఉన్నాడో అని ఆలోచిస్తూ వెళ్లాను. అంతే మహాదేవుడు, మహాశివుడు, పరమేశ్వరుడు, దేవదేవ దేవుడు ఎంతో ఎత్తుగా, ఎత్తుకు తగ్గ వెడల్పున పార్వతీపతి లింగరూపాన ప్రతిష్టించబడి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని లింగం చూడగానే అలౌకికానందం కలిగింది. ఆది అంతాలకు కారణమైన ఈశ్వరుడు సాకారుడయ్యాడా అన్న సందేహాన్ని కలిగించేలా నిలువెత్తు లింగం గర్భగుడిలో కొలువై చిన్మయానందాన్ని కలిగిస్తోంది. నాకు తెలీయకుండానే చేతులు పైకి లేచి ఆ లింగమయ్యకు నమస్కరించాయి. అంత ఎత్తున శివలింగం ఉండడం ఆ తంజావూరుకే కాదు శివభక్తులందరికీ ఆనందం కలిగించే విషయం అనిపించింది. శివభక్తులే కాదు ప్రతి ఒక్కరూ ఆ తంజావూరిలోని శివాలయాన్ని చూసి తీరాల్సిందే. అక్కడి శిల్ప సౌందర్యాన్ని వీక్షించాల్సిందే అనిపించింది.
- యం. కామేశ్వరి


Monday, 14 September 2015

బృహదీశ్వరాలయం - తంజావూరు (తమిళనాడు) C









బృహదీశ్వరాలయం - తంజావూరు


ఆ ఆలయం పొడవు 793 అడుగులు, గోపురం ఎత్తు 216 అగుడులు. దీని నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి లాంటివేవీ ఉపయోగించలేదు. పునాదులు, గోపురం, శిఖరం... అన్నీ పూర్తిగా రాళ్లతో నిర్మించారు. గోపురం 13 అంతస్తులు. ఆ రాష్ట్రంలోనే అది పెద్ద ఆలయంగా పేరుగాంచింది. చోళులు, పాండ్యులు, నాయకులు... ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అదే తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం.

క్రీ.శ.985 -1012 మధ్య కాలంలో తంజావూరును రాజధానిగా చేసుకుని రాజరాజ చోళుడు పాలించాడు. ఇతను శైవ భక్తుడు. కేరళ, మధురై మొదలుకుని శ్రీలంక వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యంతో పాటూ ఆదాయమూ బాగా పెరిగింది. ఈ విజయానికి గుర్తుగా, దేశమంతటా తన కీర్తి ప్రతిష్టలు తెలియజేయడానికి పెద్ద ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా, రాజధాని తంజావూరులో బృహదీశ్వరాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయ నిర్వహణకు ప్రత్యేకంగా భూములు కేటాయించాడు. దేవాలయ నిధిని ఏర్పాటు చేశాడు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారింది ఇక్కడనుంచేనని చెబుతారు చరిత్రకారులు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1004లో మొదలై 1010 లో పూర్తయింది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. బృహదీశ్వరాలయ ప్రాగణం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.

నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. గోపురం పై కప్పు నిర్మాణానికి 80 టన్నుల బరువుండే ఏక శిలను ఉపయోగించారట. దీని విస్తీర్ణం 25.5 చదరపు అడుగులు. ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈరాళ్లను దాదాపు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.

బృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చి దిద్దారు. ఆలయం నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది.

గర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచిత్రాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచిత్రాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.

పాలనా నమూనా
1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుండి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అది పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.

ఇదీ బృహదీశ్వరాలయమే
ఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద... ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంద్రుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి.

బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి.

బృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు 'ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి' అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు.

దర్శనీయ ప్రాంతాలు
తంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణంలో మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్‌ లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణేలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుండి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.



Wednesday, 9 September 2015

తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం D









తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం




తంజావూరు అంటే బృహదీశ్వరాలయం, సరస్వతి మహల్ అనే ప్రాచ్య లిఖిత భాండాగారం గుర్తుకు వస్తాయి. బృహదీశ్వరాలయానికే రాజరాజేశ్వరం అనే పేరుంది. రాజ రాజ చోళ చక్రవర్తి నిర్మించిన ఆలయం కనుక ఆ పేరొచ్చింది. తంజావూర్ అనే పేరు కూడా ఒక ఐతిహ్యం వల్ల వచ్చింది. తంజన్ అనే రాక్షసుడు చెలరేగుతుంటే విష్ణు అవతారమైన నీల మేఘ పెరుమాళ్, ఆయన భార్య ఆనంద వల్లీ అమ్మాళ్ లు సంహరించారు. తంజన్ కడసారి కోరికగా తన పేరు మీదుగా ఈ పట్టణం వర్ధిల్లాజేయమని కోరాడట. సరేనని ఆ రోజు నుంచి తంజావూర్ అనే పేరును స్తిరం చేశారట. తన్జం అంటే తమిళంలో శరణు అని అర్ధం. అందుకనే దీన్నిశరణార్ధుల నగరం అంటారని తంజాపురీ మహాత్మ్యంలో ఉందట. కులోత్తుంగ చోళ రాజు దీన్ని నిర్మించి తుంగపురం అని పేరు పెట్టాడని స్థల పురాణం చెబుతోంది. దీనికే అలగై అనే పేరూ ఉంది. కుబేరుడు ఇక్కడ ఉండి తపస్సు చేశాడట.

తంజావూర్ ముత్తయార్లు అనే రాజవంశం వారికి రాజధానిగా ఉండేది. తర్వాత చోళ రాజులకూ రాజదాని అయింది. విజయాల మహారాజు ముత్తురాయలను ఓడించి స్వాధీనం చేసుకొన్నాడు. గంగైకొండ చోళుడు రాజధానిని గంగైకొండ చోళపురానికి మార్చాడు. ఇక్కడ నుండే పాండ్య రాజులు, హోయసల రాజులు పాలించారు. చివరికి అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలికాఫర్ విజయ నగరాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత సేవ్వప్ప నాయకుడు స్వతంత్రాన్ని పొంది తంజావూర్ చేరి తంజావూర్ నాయక రాజ వంశాన్ని స్తాపించాడు. వీరిలో కడపటి రాజైన వీర రాఘవుడు మధుర రాజు చొక్కానాధుని చేతిలో ఓడిపోయాడు. తర్వాత పధ్నాలుగేళ్ళు అలగరి అనే సేనాపతి పాలించాడు. శివాజీ మహారాజ్ కు దాయాది తమ్ముడైన ఎకోజీ అలఘిరిని ఓడించి మహారాష్ట్రుల పాలనను ఇక్కడ ప్రారంభించాడు చేశాడు. ఆ వంశం కొంత కాలం పాలించిన తర్వాతా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది.

శ్రీ బృహదీశ్వరాలయం
చోళ రాజులు పరిపాలనలో విశేషమైన వారసత్వాన్ని ఒదిలి పెట్టారు. వారి గొప్ప నిర్మాణమే బృహదీశ్వరాలయం. భారతదేశం లోనే ఉత్కృష్ట దేవాలయం అని పేరు పొందింది. ద్రావిడ శిల్ప కళ విజృంభించిన దేవాలయం. దీనిని లార్డ్ కర్జన్, గాంధీ వంటి ప్రముఖులు సందర్శించారు. ఆలయం చిన్న కోటలో అంటే శివ గంగ కోటలో ఉంది. ఈ కోట మొదటి రాజు సేల్వప్ప నాయకుని పేర ఉంది. చివరి వాడడైన విజయ రాఘవుడు ఈ నగరాన్ని, కోటను నిర్మించాడు. దీని నిర్మాణానికి చాలా నాణ్యమైన గ్రానైట్ ను ఉపాన లేక స్తూపి అనే సుదూర ప్రాంతం నుండి తెప్పించి వాడారట. ఇది రాజ రాజ చోళుని ఆలోచనా, అమలు పరచిన తీరు. 985 -1014లో పాలించిన రాజ రాజ చోళుడు పాలన కాలంలోనే దీని నిర్మాణం జరగటం విశేషం. ఆయన రాజ్యానికి వచ్చిన 19వ సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు ఏళ్ళలో పూర్తీ చేశాడు. ఆయన పాలించిన ఇరవై అయిదవ ఏడాది 1009న 257వ రోజున రాగి కలశాలను విమానం మీద ఉంచి దిగ్విజయంగా పూర్తీ చేశాడు. దీని బరువు 235 పొండ్లు, 2926 ½ కలజుళ అంటే 35 పౌండ్ల బరువున్న బంగారం పూతతో ఉంది. నిర్మాణం జరిగిన ఆరేళ్ళ కాలంలో యుద్ధాలు లేక పోవటం శాంతి నెలకొని ఉండటం బాగా తోడ్పడింది. రాజు ఇంటి పేరు రాజ శేఖర వర్మన్. ఆయనకు రాజ రాజ అని, శివప్ప దేశికార అని బిరుదులున్నాయి. చిదంబర దేవాలయానికి చాలా ధనం దానముగా ఇచ్చాడు.

రాజేశ్వరం అని పిలువబడే ఈ బృహదీశ్వరాలయం కోటకు దక్షిణ భాగాన ఉంది. ముఖ ద్వారం తూర్పున ఉంది. రెండు వైపులా సుబ్రహ్మణ్య, గణపతి చిన్న దేవాలయాలున్నాయి. 90 అడుగుల గోపురం లోపలికి రమ్మని ఆహ్వానించినట్లుంది. ఆలయం లోపలి ప్రాంగణం 500 అడుగుల పొడవు , 250 అడుగుల వెడల్పు ఉంటుంది. రాయి, ఇటుకలతో భూమి పై నడవటానికి వీల్లుగా ఉంటుంది. దక్షిణాన యాగశాల ఉంది. పడమర, ఉత్త్తర భాగాలలో అనేక శివలింగాలున్నాయి. ఈ గది గోడలకు అద్భుతమైన వర్ణ చిత్రాలు చిత్రించి ఉన్నాయి. శివుని విన్యాసాలన్నీ చిత్రితాలై ఉన్నాయి. ఆలయం బయటి కొలతలు 793, 397 ప్డుగుల పొడవు వెడల్పు ఉన్నాయి.

బృహదీశ్వరలింగం
ప్రాంగణంలో పడమటి భాగాన బృహదీశ్వరాలయం ఉంటుంది. దానిలోపల అభాగాలున్నాయి. బృహదీశ్వరలింగం ఉన్నదాన్ని గర్భగృహం అని, తర్వాత దాన్ని అర్ధమండపం అని, మూడవ దాన్ని మహామండపం అని, నాల్గవ దాన్ని స్థాపన మండపం అనీ అంటారు. ఇక్కడ శ్రీ త్యాగరాజ స్వామి కొలువై ఉంటాడు. అయిదవ మండపం నర్తన మండపం, ఆరవది వాద్య మండపం. ఇక్కడే గాయకులూ సంగీత కచేరి చేస్తారు. ప్రతి చోట ద్వార పాలకులుంటారు. వాటి శిల్ప కళ అమోఘం. ఇందులో ఏడు విగ్రహాలు పద్దెనిమిది అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయి. ఇవన్నీ ఏక శిలా నిర్మితాలే.

బృహదీశ్వరమహాలింగం నిజంగానే మహా పెద్ద లింగం. 8.7 మీటర్ల ఎత్తు, అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. ఈ లింగానికి అసలు పేరు అద వల్లన్ అంటారట. దీని అర్ధం నాట్యం చేసేవాడు అని. రెండో పేరు దక్షిణ మేరు విటంకన్. ఈ రెండు పేర్లు తిరు విసాప్పైలో లభిస్తాయి. ఇవి చిదంబరేశ్వరుని పేర్లు కూడానట. శైవులకు చిదంబరం పెద్ద ఆధార భూమిట. రాజ రాజు ఈ లింగాన్ని రాజరాజేశ్వర ముదైయార్ అని ముద్దుగా పిలిచేవాడట. దీనికే రాజ రాజేశ్వర్ ప్రభువు అని పేరుంది. ఈ లింగాన్ని బృహదీశ్వరా లింగం అని, ఆలయాన్ని బృహదీశ్వరాలయం అనీ అంటారు. "గ్రేట్ టెంపుల్" అని కూడా పిలుస్తారు. శివలింగం ఉన్నదాని పై భాగాన్ని దక్షిణ మేరు అంటారు. కైలాసాన్ని ఉత్తర మేరు అంటారన్న మాట.

బృహదీశ్వరాలయ స్థపన మండపంలో శ్రీ త్యాగ రాజ శివుడుంటాడు. ఈయన్నే విదంకార్ అంటారు. ఈ శివుడు చోళులకు ఆరాధ్య దైవం. చోళ రాజు ముచుకున్దుడు అసుర సంహారంలో దేవేంద్రునికి సహాయ పడ్డాడని స్థలచరిత్ర. ఇంద్రుడు ప్రీతి చెంది ఇతనికి ఏడు త్యాగ రాజ శివ విగ్రహాలను ఇచ్చాడట. వాటిని తిరువారూర్, తిరునగైక్కోరణం, తిరుక్కరిఎల్, తిరుక్కోలిలి, తిరు మరైక్కాడు, తిరు నల్లారు, తిరువమూర్ లలో ప్రతిష్ట చేశాడట. వీటినే సప్త విటంక క్షేత్రాలు అంటారు. తిరువారూర్లో మహా పెద్ద త్యాగరాజ స్వామి దేవాలయాన్ని కట్టించాడు. దేశం లోనే పెద్ద రధం ఏర్పాటు చేశాడు బ్రహ్మాండమైన పుష్కరిణి నిర్మించాడు. ఈ త్యాగ రాజస్వామి అనుగ్రహం వల్లనే మన కాకర్ల త్యాగయ్య గారు జన్మించటం. ఆ దేవుని పేరు తండ్రి ఈయనకు పెట్టటం అమ్మవారి పేరు కమల అవటం త్యాగయ్య గారి భార్య పేరు కూడా కమల కావటం తమాషాగా ఉంటుంది.

బృహదీశ్వరాలయంలో అనేక చిన్న మండపాలు దేవుల్ల విగ్రహాలు ఉన్నాయి. దేవాలయ విమానం 216 అడుగుల ఎత్తుంటుంది. పద్నాలుగు అంతస్తులున్నాయి. గోడలలో ఉన్న స్తంభాలు గోడలలో గూడులు, అనేక దేవతాగణాలతో శిల్పరమణీయంగా కన్పిస్తుంది. శిఖరం అష్టభుజాకారంలో ఉంది. దాని పైన ఉన్న బంగారు కలశం పన్నెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇరవై అడున్నర అడుగుల ఏకశిలా గ్రానైట్ రాయి పై గోపురం ఉంటుంది శిఖరం, స్తూపం నీడ భూమి మీద పడక పోవటం శిల్ప చాతుర్యం. అత్యాస్చర్య కరం. పైన రెండు నందులు ఆరున్నర అడుగుల పొడవు, అయిదున్నర అడుగుల వెడల్పుతో ఎనభై టన్నుల బరువుతో ఉన్నాయి. వీటిని విమాన శిఖరం పైకి చేర్చటానికి వాలు బల్ల (ఇంక్లైనేడ్ ప్లేన్) ఉపయోగించారని చెబుతారు.

ఉత్తరాన ఉన్న శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి చిన్న దేవాలయం ఆగ్నేయ భాగంలో బృహన్నాయకి అమ్మవారి దేవాలయం ఉన్నాయి. ప్రక్కనే చండీశ్వరాలయం ఉంది. సుబ్రహ్మన్యదేవాలయ శిఖరం 55 అడుగుల ఎత్తు ఉంది 45 అడుగుల బేస్ మీద ఉంటుంది. బృహన్నాయకి అమ్మవారి ఆలయం తర్వాత కాలంలో కట్టిందే. పద మూడవ శతాబ్దంలో పాండ్య రాజు కోనేరి మని కంతన్ రాజు నిర్మించాడు. బృహదీశ్వరాలయం ముందు పెద్ద ధ్వజ స్థంభం ఉంది. చండీశ్వరాలయం రాజ రాజ నిర్మితమే.

బృహన్నంది
శివాలయ ముఖ ద్వారానికి ఎదురుగా ఎత్తైన ప్లాట్ ఫారం మీద అద్భుత ఏక శిలా నిర్మిత మైన నందీశ్వరుడు మన చూపులను లాగేసి అక్కడే నిలిచి చూసేట్లు న్తాడు. పన్నెండు అడుగుల ఎత్తు, పందోమ్మిదిన్నర అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు ఉన్న బృహత్ నంది విగ్రహం ఇది. దేశంలో పెద్ద నందులలో రెండవది మొదటి నంది లేపాక్షిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ బృహన్నంది ఇరవై అయిదు టన్నుల బరువున్న విగ్రహం. లేపాక్షి నందిలా శిల్ప కళ కన్పించదు. తిరుచి నాపల్లి దగ్గరున్న పెరంబదూర్ సమీపంలోని పచ్చ చేమలై అనే చోటు నుండి ఈ నందీశ్వర విగ్రహానికి ఏక శిలను తెచ్చారు. ఈ నందీశ్వరుడు క్రమం గా పెరుగు తుంటే కాలికి మేకు దిగ కొట్టారని చెప్పుకొంటారు. ఇంకో కధనం ప్రకారం ఈ నంది ఇంతగా పెరగటానికి దాని కడుపులో ఒక బావురు కప్పు ఉన్నదని అందుకే పెరిగి పోయిందని అంటారు. దాన్ని కనీ పెట్టి బయటికి తీసేసి ఆ రంధ్రాన్ని పూడ్చారని చెబుతారు. ఈ కప్పను సభా పతి మండపం లోని నూతిలో వదిలేశారని అంటారు.

ఆలయ గోపురం మీద వైష్ణవ, శైవ కధలు శిల్పీకరించారు. గౌతమ బుద్ధుని జ్ఞానోదయ చిత్రం కూడా ఉండటం ఆశ్చర్యం. ముఖ్య విమానానికి ఉత్తర భాగాన నాలుగు మానవ ముఖాలున్న శిల్పాలున్నాయి. వీటి కన్నా కింద ఉన్నది పెద్దది క్రమం గా సైజ్ తగ్గి మిగిలినవి ఉంటాయి. కన్జీవారానికి చెందిన సోమ వర్మ అనే శిల్పి చోళ, నాయక, మహారాష్ట్ర ఆంగ్ల పాలకుల ను చిత్రించాడు అంటే వరుసగా వీరి చోళ దేశ పాలనకు ఇవి ప్రతి బింబాలు. ఇందులో యూరోపియన్ ముఖం ఉన్న వాడు వెనిస్ సముద్ర యాత్రికుడైన మార్కో పోలో అని భావిస్తారు మార్కో పోలో కాంటన్ కు గవర్నర్ గా కొంత కాలం పని చేశాడట. అతను చైనాలో విస్తృతం గా పర్య టించాడు. అందుకే కాంటన్లో ఉన్న అయిదు వందల బుద్ధ విగ్ర్సహాలున్న దేవాలయం లో అతని విగ్రహమూ చేర్చి గౌరవిన్చారట.

అర్ధ మండపంలో చోళ సంస్కృతీ చిత్రాలున్నాయి దక్షిణ దేశ చిత్ర కళా రీతి గోచరిస్తుంది. భూమి నుండి సీలింగ్ వరకు రమణీయ మైన చిత్రకళా తో శోభిస్తుంది. పై భాగాన నాయక రాజుల కాలం,లో ఉన్న తెలుగు దేశపు మనుష్యుల చిత్రాలున్నాయి. వీరిలో సేవ్వప్ప నాయకుడు అచ్చ్యుతప్ప నాయకుడు ప్రసిద్ధం గా ఉన్నారు. చోళుల కాలంలో శైవం బాగా వ్యాప్తి చెందింది. వీరికాలంలో వెలసిన చిత్రాలలో కైలాశశివుడు పార్వతి, శివ గణాలు నందీశ్వరుడు అప్సర గణం ఉంటారు.

రెండవ రకంలో నాలుగు దంతాలున్న తెల్లని ఏనుగైన ఐరావతం, దాన్ని నడిపే యువ మావటి కనిపిస్తారు. ఏనుగు ముందు నడిచే తెల్ల గుర్రం ఉంటుంది. సుందర సెరిమన స్వామి ఉంటారు. మూడో రకంలో సుందర మహర్షి శివుడు కనీ పిస్తారు. భక్త గణం పెద్ద హాల్లో ఉంది వారిని చూస్తూ ఉంటారు. కింది చిత్రాలలో ఆడ వాళ్ళు వంటా వార్పూ చేస్తున్నట్లు చిత్రించారు. అయిదవ భాగంలో నటరాజ స్వామి, ఆయన భక్తులు కన్పిస్తారు. ఆ తర్వాతి దానిలో అందమైన మహిళా చిత్రాలు కనువిందు చేస్తాయి. ఉత్తరం వైపు గోడ మీద త్రిపురాసుర వధ ఘట్టం కనిపిస్తుంది. తర్వాతా దేవతా ముఖాలున్న నాలుగు పెద్ద సైజు తలకాయలు కనిపిస్తాయి.

బృహదీశ్వరునికి బృహత్ కానుకలు
రాజ రాజ చోళుడు తన పాలన ఇరవై తొమ్మిదవ ఏడాది నాడు, రాణీలతో ఆయన సోదరి కుందావై తో వచ్చి స్వామిని దర్శించి అపూర్వ మైన కానుకలు సమర్పించారు. నిత్య పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ భారీగా చేశాడు. సుమారు 489 పౌండ్ల బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించాడు. ఆరువందల పౌండ్ల వెండి వస్తువులు అందజేశాడు. నైవేద్యాలకు ఉత్సవాలకుగాను అనేక ప్రదేశాలలో ఉన్న సేద్యపు భూములను బృహదీశ్వరునికి రాసిచ్చాడు. సిలోన్ దేశంలో ఉన్న భూములు కూదా స్వామికి సమర్పించి తన స్వామి భక్తిని ప్రకటించుకొన్నాడు. వీటి వల్ల ఏడాదికి ఒక లక్షా పదహారువేల కాలముల ధాన్యం వచ్చేది. దీని విలువ యాభై ఎనిమిది వేల కాసులు. ఇవి కాక పదకొండు వందల కాసుల ధనాన్ని స్వామికి సమర్పించాడు రాజ రాజు.

దేవాలయానికి ఉత్తర, దక్షిణ భాగాలలో విశాలమైన పెద్ద మహా వీధులను నిర్మించాడు. తూర్పు నుండి పడమర వరకు 400 మంది దేవ దాశీలకు నివాస గృహాలు ఏర్పరచాడు. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు సంవత్సరానికి వంద కాలముల ధాన్యం వచ్చే భూమి ఇచ్చాడు. నృత్య దర్శకులకు సంగీత గాయకులకు వాద్యకారులకు, దుస్తులు కుట్టే వారికి మొత్తం 212 మంది పురుష సేవకులకు కూడా ఇదే ఏర్పాటు చేశాడు. ఇందులో సంస్కృత అరియం అంటే ద్రావిడ వేదంను పఠించేవారు. వేదాలను అధ్యయన అధ్యాపనం చేసే వారు ఉన్నారు. తనజావూర్ జిల్లాను దక్షిణ దేశ ధాన్య గారం (రైస్ బౌల్) అంటారని చిన్నప్పుడెప్పుడో సోషల్లో చదువుకొన్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం.



Sunday, 16 August 2015

బృహదీశ్వరాలయం E









బృహదీశ్వరాలయం


బృహదీశ్వర ఆలయం (తమిళం) పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

చరిత్ర:
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటుతున్నాయి.

నిర్మాణము:
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడినది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై మరియు మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడినది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.

ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పుర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడినది. పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 km ఎత్తుకు చేర్చబడినది. అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి. దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడినది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.

ఆలయ విగ్రహాలు:
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నవి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...