Showing posts with label నదీమతల్లి. Show all posts
Showing posts with label నదీమతల్లి. Show all posts

Tuesday, 11 December 2018

నర్మద జన్మస్థలి








నర్మద జన్మస్థలి



యమునా నదిలో ఏడుసార్లు, సరస్వతిలో మూడుసార్లు, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులవుతారని ఓ నమ్మకం. అత్యంత పవిత్రమైన నర్మదానదిని చూస్తేనే.. అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాంటి పవిత్ర నదీమతల్లి నర్మద జన్మస్థానమే అమర్‌ కంటక్‌. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రదేశం.. అపురూపమైన జలపాతాలు.. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ విశేషాలు..

ఎటుచూసినా.. దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద. పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే... కనుచూపు మేరలో ఎత్తౖన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంకేముంది మీరు పడ్డ శ్రమనంతా.. అతి తేలిగ్గా మరిచిపోతారు. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్ కంటక్. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్ కంటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

పురూరవుడి తపోఫలితంగా...
పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై 'నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర'ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.

నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

పుట్టినచోటే గుడి
నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది.

అమర్ కంటక్ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతరలు సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్లాలంటే...
విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలా స్‌పూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో రైల్లో పిండ్రా వరకు వెళ్లి అద్దె వాహనాల్లో అమర్ కం టక్ వెళ్లవచ్చు. లేదా బిలాస్‌పూర్ నుంచే నేరుగా ట్యాక్సీలలో 120 కిలోమీటర్ల దూరం లోని అమర్ కంటక్ వెళ్ళవచ్చు.

కపిలధార
అమర్ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

ఏనుగు కాళ్ళ నుండి దూరితే పుణ్యం..!
నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుం ది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది.

నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించ వచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతా లనూ వీక్షించవచ్చు.

నర్మద పుట్టుకపై ఎన్నో పురాణాలు
నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ కథలు వినిపిస్తుంటాయి. క్రీ॥శ॥ 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద. అలా అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!



Sunday, 5 August 2018

మహాబలేశ్వర్‌









కృష్ణమ్మ పుట్టిల్లు
మహాబలేశ్వర్‌



‘‘ఏదైనా పుణ్యక్షేత్రానికైతే వస్తా!!’’ ఇది ఇంట్లో పెద్దవారి మాట.
జలపాతాలు, సరస్సులు చూపిస్తానంటేనే వస్తామంటారు పిల్లలు.
ట్రెక్కింగులు, కయాకింగులు ఉంటేనే ఓటేస్తారు యువకులు.
పచ్చదనం, చల్లదనం అందరూ కోరుకుంటారు.
ఇవన్నీ ఒకేచోట ఉన్నాయంటే భలే భలే అనాల్సిందే! అవన్నీ ఆస్వాదించాలంటే కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ వెళ్లాల్సిందే!


కృష్ణమ్మ.


ఆ తల్లి అడుగుపెట్టిన చోటల్లా పచ్చదనమే. తెలుగింట ధాన్యరాశులు కురిపించిన కృష్ణమ్మ ఒడ్డున పుణ్యక్షేత్రాలెన్నో! పర్యాటక విశేషాలెన్నెన్నో!! ఆ నది జన్మించిన మహాబలేశ్వర్‌ యాత్రాస్థలిగా, వినోద కేంద్రంగా పర్యాటకులను అలరిస్తోంది. ఆరు రుతువుల్లోనూ ఇక్కడ ఆమని తిష్టవేస్తుంది. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో ఆహ్లాదాన్ని అందించే మహాబలేశ్వర్‌ వానాకాలంలో పచ్చదనంతో పలకరిస్తుంది. కొండల అంచులను ఒరుసుకుంటూ కదలిపోతున్న మేఘమాలికలు.. పరవశంతో ప్రణయగీతాన్ని ఆలపించేలా చేస్తాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న పర్వత ప్రాంతం మహాబలేశ్వర్‌. ఈ సుందర ప్రదేశం సముద్ర మట్టానికి 4,718 అడుగుల ఎత్తులో ఉంటుంది. సహ్యాద్రి పర్వత సానువుల్లో నెలకొని ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది.
కొండపై కోట
శతాబ్దాలకు పూర్వం సింగన్‌ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడి మహాబలేశ్వరుడి దేవాలయం కూడా ఆయన హయాంలోనే నిర్మించారు. 17వ శతాబ్దంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహాబలేశ్వర్‌ను కైవసం చేసుకున్నాడు.1656లో ప్రతాప్‌గఢ్‌ కోటను కట్టించాడు. ఇది మహాబలేశ్వర్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపై కోటలో భవానీదేవి, మహాదేవ ఆలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోటలోకి అనుమతిస్తారు.
చూడచక్కని వ్యూపాయింట్లు
హిల్‌స్టేషన్‌గా పేరున్న మహాబలేశ్వర్‌లో దాదాపు 30 వ్యూపాయింట్లు ఉన్నాయి. విల్సన్‌ పాయింట్‌ అత్యంత ఎత్తయిన ప్రదేశం. ఆ తర్వాతి స్థానం కొన్నాట్‌ శిఖరానిది. ఆర్ధర్స్‌ సీట్‌ పాయింట్‌, హెల్సెన్‌ పాయింట్‌ ఇలా రకరకాల వ్యూ పాయింట్ల నుంచి మహాబలేశ్వర్‌ సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో ఆస్వాదించొచ్చు. ఏనుగు తల ఆకారంలోని పర్వతాన్ని ఎలిఫెంట్‌ హెడ్‌ పాయింట్‌గా పిలుచుకుంటారు. ఈ వ్యూపాయింట్‌ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు చూడొచ్చు. సూర్యాస్తమయం సమయానికి పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటారు. ముంబయి పాయింట్‌ నుంచి కూడా మలి సంధ్య మనోహరంగా కనిపిస్తుంది. సాహసయాత్రికుల కోసం పలు వ్యూపాయింట్ల దగ్గర ట్రెక్కింగ్‌ అందుబాటులో ఉంది. స్థానికంగా ఉన్న అడ్వెంచర్‌ క్లబ్‌లు ట్రెక్కింగ్‌, ర్యాపెలింగ్‌ క్రీడలు నిర్వహిస్తుంటాయి.

జలపాతాల సోయగాలు


ఐదునదుల పుట్టినిల్లు మహాబలేశ్వర్‌ పరిసరాల్లో అద్బుతమైన మూడు జలపాతాలున్నాయి. 600 అడుగుల ఎత్తు నుంచి దుమికే లింగమల జలపాతం ప్రధానమైనది. మహాబలేశ్వర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ధోబీ జలపాతం ఉంటుంది. దీనిని చూసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చైనామన్స్‌ జలపాత సోయగాలు చూపరులను కట్టిపడేస్తాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ వాళ్లు.. చైనా, మలేసియాకు చెందిన ఖైదీలను ఇక్కడ బందీలుగా ఉంచేవారట. వారు స్ట్రాబెర్రీ తోటలను సాగు చేసేవారు. నేటికీ ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉండటం విశేషం. ఇక వెన్నా సరస్సులో బోటింగ్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కయాకింగ్‌ పోటీలు జరుగుతుంటాయి.
ఆధ్యాత్మిక సౌరభాలు

మహాబలేశ్వర్‌లో పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్ష ఆకారంలో ఇక్కడ లింగం దర్శనమిస్తుంది. ఆలయంలో స్వామివారి కోసం పడక కూడా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పరమేశ్వరుడు దీనిపై శయనిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఆలయం మూసివేసే సమయంలో ఏమాత్రం నలగకుండా ఉండే పక్క.. తెల్లారేసరికి చెదిరి కనిపించడం విశేషం. మహాబలేశ్వరుడి ఆలయ సమీపంలో కృష్ణానది జన్మస్థానంలో కృష్ణాబాయి ఆలయం ఉంటుంది.

త్రిమూర్తులే నదులుగా



సాక్ష్యాత్తు విష్ణుమూర్తే ఇక్కడ కృష్ణానదిగా ఉద్భవించాడని అంటారు. దీనికి సంబంధించి పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం మహావిష్ణువు సూచన మేరకు పరమశివుడి పర్యవేక్షణలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాలనుకున్నాడట. యజ్ఞ సమయానికి సరస్వతీదేవి రాకపోవడంతో మరో స్త్రీమూర్తితో క్రతువు నిర్వహణకు పూనుకున్నాడట బ్రహ్మ. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సరస్వతి తన స్థానంలో మరో మహిళ ఉండటాన్ని చూసింది. ఆగ్రహంతో త్రిమూర్తులను నదులుగా మారిపొమ్మని శపించిందట. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణానదిగా, రుద్రుడు వెన్నా నదిగా, బ్రహ్మ కొయినా నదిగా మారారని కథ. ఈ మూడు నదులతో పాటు సావిత్రి, గాయత్రి నదులు కూడా ఇదే ప్రాంతంలో జన్మించాయి. ఐదు నదులు సంగమించే ప్రదేశం.. పంచగంగ. ఇక్కడ మహాదేవుడి ఆలయం ఉంది.
ఎలా వెళ్లాలంటే?

* పుణె నుంచి మహాబలేశ్వర్‌ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పుణెకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ నుంచి రైళ్లు ఉన్నాయి. పుణె నుంచి బస్సులు, ట్యాక్సీల్లో మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు.
* సొంత వాహనంలో వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి మహాబలేశ్వర్‌ సుమారు 590 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్‌, హుమ్నాబాద్‌, సోలాపూర్‌, పండరీపూర్‌, ఫల్టణ్‌ మీదుగా మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు. పండరీపూర్‌ నుంచి పుణె మీదుగా కూడా వెళ్లొచ్చు.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...