Showing posts with label సిక్కిం. Show all posts
Showing posts with label సిక్కిం. Show all posts

Sunday, 23 April 2017

హిల్‌ స్టేషన్స్‌









కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్స్‌
చలో బిలో 24


ఎండలు మండే వేసవికాలం. మిట్టమధ్యాహ్నమే కానక్కర్లేదు, పొద్దు పొడిచిన కొద్ది గంటలకే నిప్పులు చెరిగే సూర్యుడి తాకిడికి పట్టపగలే చుక్కలు కనిపించే కాలం. ఇలాంటి మండు వేసవిలో మీరూ మీ కుటుంబం 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న శీతల ప్రదేశాలకు వెళ్ళిరండి... వేసవిని చల్లగా గడిపేయాలనుకుంటే సరదాగా చల్లచల్లని హిల్‌ స్టేషన్లకు ఓ టూర్‌ వేసి రండి.అందరికీ తెలిసినవే కాదు, అంతగా తెలియని ప్రదేశాలను కూడా ఓసారి చూసి రండి. చూడచక్కని కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్లను మచ్చుకు ఓ ఐదింటిని ఇక్కడ చూపిస్తున్నాం. సరదాగా ఓ లుక్కేయండి.

పాపులర్‌ హిల్‌స్టేషన్స్‌
మనదేశంలో దాదాపు వంద వరకు హిల్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఊటీ, కోడైకెనాల్, సిమ్లా, నైనితాల్, ముస్సోరి, శ్రీనగర్, షిల్లాంగ్, మౌంట్‌ అబు వంటి పాపులర్‌ హిల్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవే కాకుండా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని హిల్‌ స్టేషన్లలో హిమాచల్‌లోని కుఫ్రీ, నహాన్, డార్జిలింగ్‌ చేరువలోని కాలింపాంగ్, ఉత్తరాఖండ్‌లోని కౌసాని, ఔలి, తమిళనాడులోని యెళగిరి, సిక్కింలోని పెల్లింగ్, నామ్చి, మేఘాలయలోని జోవై వంటివి చాలానే ఉన్నాయి. సాధారణ పర్యాటకులు బాగా తెలిసిన చోట్లకే వెళుతుంటారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులు ఎక్కువ మందికి తెలియని ప్రదేశాలను అన్వేషించి మరీ వెళుతుంటారు. పాపులర్‌ హిల్‌ స్టేషన్లలో వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రదేశాల కంటే తగిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే రద్దీలేని ప్రదేశాలకు వెళ్లడమే మంచిదని పర్యాటక నిపుణుల సలహా. పడమటి కనుమల్లోనూ తూర్పు కనుమల్లోనూ చాలా హిల్‌స్టేషన్లే ఉన్నాయి. ఇవి వేసవిలో చల్లగానే ఉన్నా, హిమాలయాలకు చేరువగా ఉండే హిల్‌స్టేషన్లు మరింత చల్లగా ఉంటాయి. వేసవి మధ్యాహ్న వేళ కూడా AC టెంపరేచర్‌ను ఆస్వాదించాలంటే హిమగిరుల చెంతకు చేరుకోవాల్సిందే!



కులూ - మనాలీ

ఉత్తర భారత పర్యాటకంలో కులూ మనాలీ జంట పదాలుగానే వినిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ రెండు పట్టణాలూ జంట పట్టణాలు కావు గానీ, ఒకదానికి మరొకటి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడకు వెళ్లే పర్యాటకులు రెండింటినీ చూసే తిరిగి వస్తుంటారు. వేసవి విడిది కేంద్రాలుగా పేరుపొందిన ఈ పట్టణాల పరిసరాల్లో అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి నాలుగువేల అడుగులకు పైగా ఎత్తున ఉండే కులూ మనాలీ పట్టణాలు ప్రకృతి సోయగాలకు నిలయాలు. నడివేసవిలో సైతం ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. వేసవిలో సైట్‌ సీయింగ్, వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఈ పట్టణాలు చాలా అనువుగా ఉంటాయి.

మనాలీ మీదుగా ప్రవహించే బియాస్‌ నదిలో బోటింగ్‌ను, ఇక్కడి పరిసరాల్లోని వేడినీటి బుగ్గల్లో జలకాలాటలను ఆస్వాదించవచ్చు. కులూ మనాలీలలో అడుగడుగునా పురాతన ఆలయాలు తారసపడతాయి. అరుదైన హిడింబ ఆలయం, శృంగి మహర్షి ఆలయం సహా పలు ప్రాచీన ఆలయాలతో పాటు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ ప్యాలెస్, ‘దేవతల కొలను’గా పేరుపొందిన భృగు సరోవరం, గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్, రహాలా జలపాతం, అరుదైన వన్యప్రాణులకు నిలయమైన మనాలీ అభయారణ్యం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలో భూంతార్‌ విమానాశ్రయం ఉంది. అయితే, ఢిల్లీ, చండీగఢ్‌ మినహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలు దొరకవు. విమానాల్లో వెళ్లేవారు ఢిల్లీ లేదా చండీగఢ్‌ చేరుకుని, అక్కడి నుంచి మరో విమానంలో భూంతార్‌ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. కులూ మనాలీ పట్టణాలకు రైలు సౌకర్యం లేదు. వీటికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జోగీందర్‌నగర్, 150 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రదేశాలకు నేరుగా రైళ్లు దొరుకుతాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.




డార్జిలింగ్‌

డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్బొటీ రాక్‌ గార్డెన్‌ వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేసవిలో వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఇది చాలా అనువైన ప్రదేశం.

ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిల నుంచి డార్జిలింగ్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. దక్షిణాది నుంచి విమానాల్లో  వెళ్లేవారైతే ముందుగా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడం తేలికగా ఉంటుంది. రైలులో వెళ్లేవారు ముందుగా న్యూజాల్‌పాయిగుడి స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి హిమాలయన్‌ రైల్వేస్‌కు చెందిన టాయ్‌ ట్రెయిన్‌లో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. అలా కాకుంటే కోల్‌కతాలో రైలు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా చేరుకోవచ్చు.



దిమా హసావో

అస్సాంలోని దిమా హసావో జిల్లా కేంద్రం హాఫ్లాంగ్‌ చూడచక్కని వేసవి విడిది కేంద్రం. స్థానిక దిమాసా భాషలో ‘హాఫ్లాంగ్‌’ అంటే ‘చీమ కొండ’ అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున వెలసిన హాఫ్లాంగ్‌ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హాఫ్లాంగ్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది. హాఫ్లాంగ్‌ కొండపైన, చుట్టుపక్కల వ్యాపించిన వనాల్లో దాదాపు రెండులక్షల జాతులకు పైగా అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఈశాన్య గిరిజన సంస్కృతికి ఆలవాలమైన ఈ ప్రదేశం గ్లైడింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్‌ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది. హాఫ్లాంగ్‌ కొండపై ట్రెక్కింగ్, హాఫ్లాంగ్‌ సరస్సులో పడవ విహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పక్షులు ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశంగా పేరుపొందిన జతింగా ఇక్కడకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఏటా వర్షాకాలంలో రాత్రివేళ ఇక్కడ రకరకాల పక్షులు మూకుమ్మడిగా చనిపోతుంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నిరకాల విశ్లేషణలు చెబుతున్నా, ఈ పరిణామం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

ఎలా చేరుకోవాలి?
విమానంలో వెళ్లాలనుకునే వారికి అస్సాం రాజధాని గువాహటి లేదా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. గువాహటి వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి వేరే రైలు పట్టుకుని హాఫ్లాంగ్‌ వరకు రైలుమార్గంలో చేరుకోవచ్చు.



థండా థండా తవాంగ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాకేంద్రమైన తవాంగ్‌ పట్టణం టిబెట్‌ సరిహద్దులకు అతి చేరువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఏకంగా పదివేల అడుగుల ఎత్తున వెలసిన ఈ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. నడి వేసవిలో సైతం ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు లోపే నమోదవుతుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో నిండిన దట్టమైన అడవులు, కొండల మీదుగా నేల మీదకు దూకే జలపాతాలు, సరస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనువిందు చేస్తుంది. బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన తవాంగ్‌లో తవాంగ్‌ బౌద్ధారామం, ఉర్గెలింగ్‌ గోంపా, గ్యాన్‌గోంగ్‌ అని గోంపా వంటి ఆరామాలు టిబెటన్‌ వాస్తుశైలిలో ఆకట్టుకుంటాయి. సెలా పాస్, బుమ్‌లా పాస్‌ వంటి పర్వతమార్గాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కొండలపై వెలసిన మాధురి సరస్సు, నగులా సరస్సు వంటి సరస్సులు, నురానంగ్‌ జలపాతం వంటి జలపాతాలు నిత్యం జలకళతో కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరువలోనే మంచుతో నిండిన గోరిచెన్‌ శిఖరం ఎక్కేందుకు పర్వతారోహకులు మక్కువ చూపుతారు. ఇక్కడి ఈగల్‌ నెస్ట్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి ఆలవాలంగా ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి?
ఇక్కడకు చేరువలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి తవాంగ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి తేజ్‌పూర్‌ వరకు నేరుగా విమానాలు, రైళ్లు దొరకడం కష్టం. అందువల్ల గువాహటి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం మీదుగా ఇక్కడకు చేరుకోవడం కాస్త తేలికగా ఉంటుంది.



గ్యాంగ్‌టక్‌

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చూడ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్‌ అంటే కొండకొన అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన పట్టణం ఇది. ఏడాది పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్‌ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో చేరింది. గ్యాంగటక్‌లో వివిధ హిందూ ఆలయాలతో పాటు బౌద్ధారామాలు చూడముచ్చటగా ఉంటాయి. పట్టణానికి చుట్టుపక్కల సెవెన్‌ సిస్టర్స్‌ జలపాతం సహా పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. పచ్చదనంతో అలరారే ప్రశాంతమైన గ్యాంగ్‌టక్‌ పరిసరాలు వాకింగ్, ట్రెక్కింగ్, సైట్‌ సీయింగ్‌ వంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. తాషీ వ్యూ పాయింట్, గణేశ్‌ టోక్‌ వ్యూపాయింట్‌ వంటి ప్రదేశాల నుంచి గ్యాంగ్‌టక్‌ పట్టణాన్నీ, పరిసరాల్లోని అడవుల పచ్చదనాన్నీ తిలకించవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే హిమాలయన్‌ జూ పార్కు, షింగ్బా రోడో డెండ్రాన్‌ అభయారణ్యం, కాంచన్‌జంగా నేషనల్‌ పార్క్‌ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఎలా చేరుకోవాలి?
గ్యాంగ్‌టక్‌కు నేరుగా విమాన, రైలు సౌకర్యాలేవీ అందుబాటులో లేవు. ఇక్కడకు అతి చేరువలోని విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రాలో ఉంది. గ్యాంగ్‌టక్‌కు ఇది సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగ్దోగ్రా విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం దిగి రోడ్డు మార్గాన రావాలనుకుంటే ట్యాక్సీలు లేదా బస్సుల్లో రావచ్చు. సమీపంలోని రైల్వేస్టేషన్‌ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జాల్‌పాయిగుడిలో ఉంది. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి గ్యాంగ్‌టక్‌ చేరుకోవాల్సి ఉంటుంది.



Monday, 14 November 2016

డార్జిలింగ్‌, సిక్కిం రాష్ట్రాల పర్యటన

హీటర్‌ వాడితే జరిమానా కట్టాలి!


డార్జిలింగ్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పెల్లింగ్‌, నాథులాపాస్‌, కంచనజంగా, లాచెన్‌, లాచుంగ్‌ హిమాలయాల  సందర్శనకు బయలుదేరాం. మా యాత్ర మొత్తం పదిహేనురోజులు. దిల్లీ చేరుకుని, అక్కడ నుంచి బాగ్దోగ్రాకి విమానంలో వెళ్లాం. అక్కడనుంచి మా టూర్‌ నిర్వాహకులు పంపిన టాక్సీలో డార్జిలింగ్‌కు చేరుకున్నాం. డార్జిలింగ్‌, సిక్కిం పర్యటనలు ముగిశాక, ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాలైన లాచెన్‌, లాచుంగ్‌ హిమాలయాల సందర్శనకు బయలుదేరాం.

గాంగ్‌టక్‌ నుంచి లాచెన్‌ చేరడానికి ఆరుగంటల సమయం పట్టింది. దారిలో సింఘిక్‌ గ్రామంలో దిగి ఓ వ్యూ పాయింట్‌ నుంచి కంచనజంగా, సినియోల్‌చు హిమనగాల సొగసుని చూసి ఆశ్చర్యపోయాం. ఆ గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు దాటాక, లోతైన లోయగుండా ప్రయాణం సాగింది. తీస్తానదిమీద ఉన్న వూగే వంతెన దాటగానే తీస్తా- రాంగ్‌యుంగ్‌చు నదీ సంగమ ప్రదేశం వద్దకు వెళ్లాం. ఈ రెండు నదులూ ఒకటైపోయేది ఎప్పుడెప్పుడా అన్నట్లు వేగంగా పరవళ్లు తొక్కే దృశ్యం మమ్మల్ని చూపు తిప్పుకోనీయలేదు. మళ్లీ గోతులమయమైన దారి గుండా చుంగ్‌థాంగ్‌ అనే మరో చిన్న పట్టణానికి చేరుకున్నాం. ఇది ఉత్తర సిక్కింలోని మరో ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నుంచి దారి రెండుగా చీలుతుంది. ఎడమవైపుగా ప్రయాణిస్తే లాచెన్‌, కుడివైపుగా ప్రయాణిస్తే లాచుంగ్‌ చేరతాం. ఛోప్తాలోయ, గురుదంగ్‌మార్‌ సరస్సుకు వెళ్లాలంటే లాచెన్‌లో బస చేయాలి. యుమ్‌థాంగ్‌లోయ, జీరోపాయింట్‌లకు వెళ్లాలంటే లాచుంగ్‌లో బస చేయాలి. ఈ రెండు చోట్లకూ వెళ్లాలంటే యాత్రికులు టూర్‌ ఏజెన్సీల సాయంతో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ప్రాంతాలు భారత్‌- చైనా సరిహద్దుకి అతి దగ్గరగా ఉన్నాయి. అక్కడ పర్యటించాలంటే రక్షకదళం లేదా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. పర్మిట్లనూ ఐడీకార్డులనూ ఆర్మీ చెక్‌ పోస్టుల దగ్గర తనిఖీ చేసి మాత్రమే ముందుకు అనుమతిస్తారు.

లాచెన్‌లో...
మేం ముందుగా లాచెన్‌కు బయలుదేరాం. ఉత్తర సిక్కిం జిల్లా జనసందోహానికి చాలా దూరంగా ఉండటంవల్ల ప్రకృతి దృశ్యాలు స్వర్గాన్ని తలపిస్తాయి. లాచెన్‌కు వెళ్లే దారిలో ఒక్క వాహనాన్ని కూడా మేం చూడలేదు. దారిలో మేం ఏడుగురు అక్కాచెల్లెళ్ల జలపాతాలు, నాగా జలపాతాల దగ్గర ఆగి ఆ సుందర దృశ్యాలను చూశాం. దారంతా గుంతలమయం. ఎక్కడా రోడ్డే ఉండదు. గాంగ్‌టక్‌ నుంచి మొత్తం 120 కిలోమీటర్ల దూరాన్నీ మా నేపాలీ డ్రైవర్‌ కేవలం బ్రేకులూ క్లచ్‌లూ కొడుతూ 5-10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిపాడు. రాత్రి ఆరున్నర గంటలకు మా బసను చేరుకున్నాం. ఉష్ణోగ్రత -6 డిగ్రీలకు పడిపోయింది. అర్ధరాత్రికి -10 డిగ్రీలకు పడిపోతుందని చెప్పారు. హోటల్‌ సిబ్బంది రెండుసార్లు వేడివేడి టీ ఇచ్చి మమ్మల్ని సేదతీర్చారు. గదుల్లో హీటర్లు పెట్టడానికి అనుమతి లేదు. ఒకవేళ పెడితే ఐదువేల రూపాయల జరిమానా కట్టాలి. లాచెన్‌లో స్థానికుల ఇళ్లు చాలా తక్కువ. హోటల్స్‌ ఉన్నప్పటికీ సౌకర్యాలు ఉండవు. అద్భుత హిమ సౌందర్యాన్ని చూడాలన్న సంకల్పం ఉన్నవాళ్లే అక్కడకు వెళ్లగలరు. మా గది బాల్కనీలోంచే లాచెన్‌ చూ నదీ ప్రవాహ పరవళ్ళూ హిమశిఖర శ్రేణులూ మాకు కనువిందు చేశాయి.

ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ...
తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రయాణం. ఛోప్తా లోయ దాటి గురుదంగ్‌మార్‌ సరస్సు చేరడానికి ఆర్మీవారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారు. ఆ ప్రాంతం సముద్రమట్టానికి 17,100 అడుగుల ఎత్తులో ఉన్నందున ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ. ఉదయం 10 గంటల తరవాత వాతావరణం అతి భయానకంగా ఉంటుందట. కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు కమ్మేస్తుంది. ఓ పక్క చలి తీవ్రత, మరోపక్క వేగంగా వీచే గాలులతో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అందుకే తెల్లవారుజామున మూడు గంటలకే లేచి తయారై హోటల్‌ వాళ్ల నుంచి ఫ్లాస్క్‌ తీసుకుని, నిండా వేడి నీళ్లు నింపుకుని, గ్లోవ్సూ ఉన్నికోట్లూ టోపీలూ వేసుకుని బయలుదేరాం. అలా మూడు గంటలపాటు 30 కిలోమీటర్లు ప్రయాణించి ధంగూ అనే గ్రామం చేరుకున్నాం. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్‌లో అల్పాహారం, టీ తీసుకుని తిరిగి మా ప్రయాణం కొనసాగించాం.

రోడోడెండ్రాన్‌ చెట్లూ చంద్రకాంత మొక్కలతో ఛోప్తాలోయ పచ్చగా కనిపించింది. ఏప్రిల్‌-మే నెలల్లో ఈ ప్రాంతం అంతా తెల్లని మంచుతో నిండిపోతుంది. ఆ సమయంలోనే గులాబీ, ఎరుపు రంగుల్లో రోడోడెండ్రాన్‌ పూలు విరగబూసి పూలలోయని తలపిస్తాయి. అందులోనూ ఆ రోజు రాత్రే మంచువర్షం కురియడంతో పచ్చని చెట్లమీద తెల్లని మంచుపూలు పుష్పించినట్లున్న దృశ్యం మరింత అందంగా ఉంది. సగం మంచుతో గడ్డకట్టీ, సగం స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో తీస్తానది ఛోప్తాలోయలో మెలికలు తిరుగుతూ ప్రవహించే దృశ్యం కళ్లను కట్టిపడేస్తుంది. వీటన్నింటి వెనకగా వెండికొండల్ని తలపించే హిమశిఖరాలూ వాటి నుంచి ఉరికే జలపాత సంగీతం మనల్ని మరోలోకంలో విహరింపజేస్తాయి. నలుపు, తెలుపు రంగుల్లోని జడలబర్రెలు అక్కడక్కడా గుంపులుగా గడ్డిమేస్తూ కనిపిస్తాయి.

నీలాల సరస్సు చెంతన...
ఛోప్తా లోయ దాటాక దారి కాస్త మెరుగైంది. ఆర్మీ అవసరాలకోసం నిర్మించిన ఆ రోడ్డులో చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేసి, మా వయసుని దృష్టిలో పెట్టుకుని సరస్సు దగ్గర ఎక్కువసేపు ఉండొద్దని హెచ్చరించారు. మెల్లగా మా వాహనం ఎత్తైన కొండమీదికి చేరింది. సరస్సు దగ్గరకు వచ్చేశామన్న ఆనందంతో వాహనంలోంచి దిగేసరికి చలిగాలి ఈడ్చి కొట్టింది. ఆ వేగానికి నిలబడటమే కష్టమైంది. సమయం ఉదయం 9 గంటలు. మూడువంతులు మంచుతో గడ్డ కట్టి, ఓ వంతు మాత్రం నీలివర్ణపు నీళ్లతో మెరుస్తోన్న సరస్సు వైపు చూసి చకితులమయ్యాం. దానికి పక్కనే బౌద్ధగురువు పద్మసంభవుని ఆరామం, దాని చుట్టూ రంగురంగుల జెండాలు రెపరెపలాడుతూ ఆ సందేశాలను టిబెట్‌కి చేరుస్తున్నట్లున్నాయి. గురుదంగ్‌మార్‌ సరస్సులోని పవిత్ర జలాలను సేవిస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఓ గంటసమయం పాటు ఆ సరస్సు అందాలను కెమెరాలో బంధించాక చివరకు మా వేళ్లు పనిచేయకపోవడంతో ఇక అక్కడ ఉండటం ప్రమాదకరం అని గ్రహించుకుని కారెక్కి వెనుతిరిగాం. చేతివేళ్లు బాగా నొప్పెట్టసాగాయి. ధంగూలోని ఓ హోటల్‌లో మంట దగ్గర చేతులు కాపుకున్నాకగానీ అవి యథాస్థితికి రాలేదు. పెదాలు పగిలి రక్తంకారుతూ కనిపించాయి. అక్కడివాళ్లు నెలకోసారి మాత్రమే స్నానం చేస్తారని ఆ హోటల్‌ వాళ్లు చెప్పారు. జనవరి నెలలో ఇక్కడ ఉండటానికి వీలుకాని పరిస్థితిలో వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసపోతారట. ఇక్కడవాళ్లు గుర్రాలూ, కొండగొర్రెలూ, జడలబర్రెలూ పెంచుతారు. జడలబర్రెల పాలనుంచి వెన్న, కోవా... వంటివి తయారుచేసి విక్రయిస్తారు. మరే వృత్తులకూ ఈ ప్రాంతం అనుకూలం కాదు. మేం ధంగూ నుంచి లాచెన్‌ చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. ఆ రోజు అక్కడే బస చేశాం.

లాచుంగ్‌లో... యుమ్‌థాంగ్‌లోయలో...
లాచెన్‌ నుంచి లాచుంగ్‌ 45 కిలోమీటర్లు. ఆ రోజు హోటల్‌లో బస చేసి, తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరి యుమ్‌థాంగ్‌ లోయకు వెళ్లేసరికి ఓ గంట సమయం పట్టింది. ఆ లోయలో తీస్తానది వెంబడే ఉన్న బౌద్ధుల రంగురంగుల జెండాల రెపరెపల ధ్వని వీనులవిందుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలున్నాయి. వాటిల్లోని సల్ఫర్‌ కారణంగా చర్మసంబంధ రుగ్మతలు మాయమవుతాయని అంటారు. యుమ్‌థాంగ్‌ లోయ నుంచి చూస్తే పౌహురి, సుందుసెన్‌పా హిమశిఖర శ్రేణులు చూపుని మరల్చనీయవు. ఆ లోయ అందాలు చూస్తూ ముందుకి ప్రయాణించేకొద్దీ పచ్చని చెట్లు కనుమరుగై కొండలూ గుట్టలే కనిపించసాగాయి. కొంతదూరం వెళ్లాక హిమగిం¹ుల శ్రేణి మా కళ్లముందు సాక్షాత్కరించింది. అదే జీరోపాయింట్‌. ఉదయించే భానుడి కిరణాలు తాకి హిమగిం¹ులు వెండికొండల్ని తలపిస్తున్నాయి. వాటినుంచి మంచు కరిగి చిన్న ప్రవాహాలుగా మారి లోయలోకి చేరి తీస్తానదిగా పరుగులు తీస్తుంది.

తీస్తానదీ పాయమీద చిన్న చిన్న కొయ్యలతో కచ్చా వంతెన కట్టారు. దాన్ని దాటుతూ వంతెనమీద ఉన్న కొయ్యలు కదలడంతో ఒకతను జారి నీటిప్రవాహంలో పడిపోయాడు. ఓ క్షణం గుండె ఆగిపోయింది. వెనక ఉన్న వాళ్లు వెంటనే అప్రమత్తమై వేగంగా స్పందించి అతన్ని నీళ్ల ప్రవాహంలోంచి బయటకు లాగారు. దాంతో మేం కూడా చాలా జాగ్రత్తగా ఆ కొయ్య వంతెన దాటాం. అది దాటి హిమశిఖరాలపైకి ఆయాసపడుతూ చేరాం. ఫర్లాంగులకొద్దీ స్వచ్ఛంగా మెరిసే మంచుమీదా అక్కడక్కడా లోపలికి కూరుకుపోయే మంచుగుట్టలమీదా భయంభయంగా నడుస్తూ ఆ ప్రాంతం అంతా తిరిగాం. డ్రైవర్‌ హెచ్చరికతో మళ్లీ ఆ కొయ్య వంతెన జాగ్రత్తగా దాటి వచ్చి అక్కడ ఉన్న గుడారాల్లోని స్టాల్స్‌లో టీ తాగుతూ మరోసారి ఆ హిమశిఖర సౌందర్యాన్ని ఆసాంతం వీక్షించాం. మా వాహనం దగ్గరకు వచ్చేసరికి కొండగొర్రెలు కనిపించాయి. అవి మమ్మల్ని చూసి భయంతో కొండ అంచులకు చేరి అక్కడ నుంచి మమ్మల్ని బెదురుచూపులు చూడటం మాకెంతో నవ్వు తెప్పించింది. ఆ హిమశిఖరాలను మళ్లీ మళ్లీ చూస్తూనే వెనుతిరిగి లాచుంగ్‌కీ అక్కడ నుంచి గాంగ్‌టక్‌కు చేరుకుని ఇంటికి తిరిగొచ్చాం.

Friday, 10 June 2016

ఈశాన్య ప్రకృతి అందం... సిక్కిం

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే రాష్ట్రం సిక్కిం. వైశాల్యం, జనాభా పరంగా దేశంలోనే చిన్నదైనా... ఇక్కడ పర్యాటక కేంద్రాలు మాత్రం ఎక్కువే. సిక్కిం వెళ్ళడానికి రైలు మార్గంలో మొదట న్యూజలపాయిగురి అనే ఊరి వరకూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వాయువ్యంగా 95 కి.మీ. దూరంలోనూ, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు ఈశాన్యంగా 125 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. డార్జిలింగ్ నుంచి గ్యాంగ్‌టక్ అయిదు గంటల ప్రయాణం. న్యూజలపాయిగురి రైల్వేస్టేషన్‌లోనే బయట హాలులో పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రపభ్రుత్వ పర్యాటక శాఖల వారి ఆఫీసు గదులు ఉన్నాయి. సిక్కిం వెళ్ళేందుకు ఆ శాఖవారి వాహనాలు ఉన్నాయి. మనకు ఒక్కరికైనా, వాహనం మొత్తం అయినా ఏర్పాటు చేస్తారు. స్టేషన్ బయట ఆవరణలోనే అన్నిరకాల వాహనాలతో ఎంతోమంది ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఉంటారు. ఏమీ మోసం ఉండదు. న్యూజలపాయిగురి నుంచి గ్యాంగ్‌టక్ అయిదు లేక ఆరుగంటల ప్రయాణం. న్యూజలపాయిగురి, సిలిగురి అనే రెండూ కలసిపోయి ఉన్న రెండు పట్టణాలు. సిలిగురి ఊరి బయట బగ్‌డోగ్ర అనేచోట ఒక చిన్న విమానాశ్రయం ఉంది. కలకత్తా నుంచి బగ్‌డోగ్రకు విమాన సర్వీసు ఉంది. బగ్‌డోగ్ర నుంచి గ్యాంగ్‌టక్‌కు ప్రతిరోజూ హెలికాప్టర్ సర్వీసు ఉంది.

చూడాల్సినవివే...
గ్యాంగ్‌టక్ కొండ వాలులో పరుచుకున్న చిన్న పట్టణం. కులు, మనాలి, డార్జిలింగ్ మొదలైన వేసవి విడిది ప్రదేశాలతో పోల్చిచూస్తే గ్యాంగ్‌టక్ చాలా చౌక ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే హోటలు గదులు రోజుకు 300/- రూ॥లు మాత్రమే. గ్యాంగ్‌టక్ నగరం ఏ మాత్రం కాలుష్యం లేని అత్యంత పరిశుభ్రమయినదని ప్రసిద్ధి. గ్యాంగ్‌టక్‌లో చూడవలసినవి రాజవంశీయుల బౌద్ధ ఆలయం, రాజభవనం. ఇవి రెండూ ఊరిలోనే ఒక చిన్న ఎత్తయిన గుట్టమీద ఉన్నాయి. రెండవది టిబెట్ వారి గ్రంధాలయం, మ్యూజియం. ఇది టిబెట్ సంస్కృతికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం. చార్టెన్ అనే పెద్ద స్థూపం చూడదగ్గది. ఊరిలోనే సుమారు 500 రకాల మొక్కలున్న ఒక వనం ఉంది. నగరం నుంచి 14 కి.మీ. దూరంలో - మనం వేరే ప్రదేశాలలో చూడలేని అనేకరకాల వృక్ష జాతులు, మొక్కలు ఉన్న ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. నగరం నుంచి 24 కి.మీ. దూరంలో ఉన్న రుమ్‌టెక్ బౌద్ధ ఆలయం చారిత్రాత్మకమైనది. చైనా వారి దాడి సమయంలో టిబెట్ నుంచి తప్పించుకుని వచ్చిన కర్మపా స్వామి నివాసం, ఆయన శాఖకు సంబంధించిన కార్యాలయం అక్కడ ఉన్నాయి. సిక్కిం వెళ్ళేవారు తప్పనిసరిగా చూడవలసినది సోంగా సరస్సు. గ్యాంగ్‌టక్ నగరం నుంచి 34 కి.మీ. దూరంలో పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు దగ్గర దృశ్యం మాటలలో వర్ణించలేనిది. ఎవరికి వారు చూచి అనుభవించి, ఆనందించవలసినదే. ఇక గ్యాంగ్‌టక్ నగరం నుంచి తూర్పుగా పద్నాలుగువేల అడుగుల ఎత్తున వున్న నాధులా కనుమ ఉంది. ఇది మనదేశానికి, చైనా దేశానికి మధ్య సరిహద్దు. ఈ కనుమ దగ్గర మధ్యాహ్నంలోపే వెళ్ళాలి. మధ్యాహ్నానికి ఇక్కడ దట్టమైన పొగమంచు అల్లుకుపోతుంది. అయితే ఈ కనుమ దగ్గరకు వెళ్ళటానికి ప్రతిరోజూ 'ఇంతమంది' అని మాత్రమే అనుమతిస్తారు. ఈ అన్ని ప్రదేశాలకు ప్యాకేజీ టూర్లు నడిపేవారు కోకొల్లలుగా ఉంటారక్కడ.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...