Showing posts with label Himachal Pradesh. Show all posts
Showing posts with label Himachal Pradesh. Show all posts

Wednesday, 27 June 2018

కులు మనాలి






కులు మనాలి

మంచు పర్వతాల్ని చూడగానే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలై పోతారు. ఈ ప్రదేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మంచు ముక్కలతో ఆడుకోడానికి పోటీపడతారు. అలాంటి ప్రాంతం ఏదనుకుంటున్నారా? అంతగా అందర్నీ మైమరిపించగలిగేది ఒకే ఒక్క ప్రాంతం. అదే కులు మనాలి. 


కులు మనాలి అంటే ఒకే ఊరు పేరు అనుకుంటారు. రెండు వేర్వేరు ఊరి పేర్లు. ఇవి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ చివర్లో ఉంటాయి. ముందుగా కులు, అక్కడ్నుండి 45 కిలోమీటర్ల దూరంలో మనాలిలు... తెల్ల మంచు దుప్పటి కప్పుకుని మరీ స్వాగతం చెబుతాయి. సిమ్లా నుంచి మనాలి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా తొమ్మిది గంటలసేపు ప్రయాణం చేయాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుండైతే మనాలికి వెళ్లే ప్యాకేజీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుండి 18 గంటల ప్రయాణం.

కులు, మనాలీలు పుణ్యక్షేత్రాలు కావు. ఇవి రెండూ కేవలం వేసవి విడిది కేంద్రాలు మాత్రమే. కులులో రఘునాథ్‌, మనాలీలో హిడింబి ఆలయాలు ఉంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత శిఖరాల నడుమ నెలకొని ఉంటుంది. అందువల్ల కులు, మనాలి ఊళ్ల చుట్టూ ఎత్తైన కొండలే దర్శనమిస్తాయి.

వేసవికాలంలో కులు, మనాలిలో చాలా చల్లగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్న కొండలమీద ఒక్కటంటే ఒక్కటి కూడా పచ్చని చెట్టు ఉండదు. వర్షాకాలం తర్వాత సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో చెట్టన్నీ పచ్చగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. సెప్టెంబర్‌ నాటికి యాపిల్‌పంట వస్తుంది.

నవంబర్‌ నుంచి కులు, మనాలి ప్రాంతాల్లోని కొండలన్నీ మంచుతో నిండి ఉంటాయి. మనాలి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రొహతంగ్‌ కనుమ చూడదగ్గ ప్రాంతం. ఈ కనుమ దాటి వెళ్తే హిమాచల్‌లో చిట్టచివరిగా ఉండేది లాహుల్‌ జిల్లా, దాని తర్వాత లడక్‌ ప్రాంతం వస్తుంది. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ నెలల దాకా మనాలిలోని కొండలన్నీ మంచుతో నిండిపోతాయి. అక్కడ్నుండి రొహతంగ్‌ కనుమదాకా వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్లన్నీ మంచుతో మూసుకుపోతాయి. కులు, మనాలిలో అసలయిన అందం నవంబర్‌ నుంచే ప్రారంభం అవుతుంది.

ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ మంచుమీద జరిగే స్కైయింగ్‌ ఆటలు చాలా ఆహ్లాదంగా సాగుతాయి. కేవలం మంచులో ఆడుకోడానికే పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందుకే ఈ నెలల్లో కులు, మనాలి ప్రాంతాల్లోని హోటళ్లలో గదులు దొరకడం చాలా కష్టం.

ఇక్కడి గదుల అద్దె దాదాపు 800 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఇవే గదులు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అయితే 300 నుండి 400 రూపాయల దాకా వుంటాయి. ఇక్కడ చక్కటి పచ్చళ్లు, పప్పుతో మాంచి తెలుగు భోజనం ఏర్పాటు చేసే హోటళ్లు కూడా ఉన్నాయి.

Sunday, 23 April 2017

హిల్‌ స్టేషన్స్‌









కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్స్‌
చలో బిలో 24


ఎండలు మండే వేసవికాలం. మిట్టమధ్యాహ్నమే కానక్కర్లేదు, పొద్దు పొడిచిన కొద్ది గంటలకే నిప్పులు చెరిగే సూర్యుడి తాకిడికి పట్టపగలే చుక్కలు కనిపించే కాలం. ఇలాంటి మండు వేసవిలో మీరూ మీ కుటుంబం 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న శీతల ప్రదేశాలకు వెళ్ళిరండి... వేసవిని చల్లగా గడిపేయాలనుకుంటే సరదాగా చల్లచల్లని హిల్‌ స్టేషన్లకు ఓ టూర్‌ వేసి రండి.అందరికీ తెలిసినవే కాదు, అంతగా తెలియని ప్రదేశాలను కూడా ఓసారి చూసి రండి. చూడచక్కని కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్లను మచ్చుకు ఓ ఐదింటిని ఇక్కడ చూపిస్తున్నాం. సరదాగా ఓ లుక్కేయండి.

పాపులర్‌ హిల్‌స్టేషన్స్‌
మనదేశంలో దాదాపు వంద వరకు హిల్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఊటీ, కోడైకెనాల్, సిమ్లా, నైనితాల్, ముస్సోరి, శ్రీనగర్, షిల్లాంగ్, మౌంట్‌ అబు వంటి పాపులర్‌ హిల్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవే కాకుండా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని హిల్‌ స్టేషన్లలో హిమాచల్‌లోని కుఫ్రీ, నహాన్, డార్జిలింగ్‌ చేరువలోని కాలింపాంగ్, ఉత్తరాఖండ్‌లోని కౌసాని, ఔలి, తమిళనాడులోని యెళగిరి, సిక్కింలోని పెల్లింగ్, నామ్చి, మేఘాలయలోని జోవై వంటివి చాలానే ఉన్నాయి. సాధారణ పర్యాటకులు బాగా తెలిసిన చోట్లకే వెళుతుంటారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులు ఎక్కువ మందికి తెలియని ప్రదేశాలను అన్వేషించి మరీ వెళుతుంటారు. పాపులర్‌ హిల్‌ స్టేషన్లలో వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రదేశాల కంటే తగిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే రద్దీలేని ప్రదేశాలకు వెళ్లడమే మంచిదని పర్యాటక నిపుణుల సలహా. పడమటి కనుమల్లోనూ తూర్పు కనుమల్లోనూ చాలా హిల్‌స్టేషన్లే ఉన్నాయి. ఇవి వేసవిలో చల్లగానే ఉన్నా, హిమాలయాలకు చేరువగా ఉండే హిల్‌స్టేషన్లు మరింత చల్లగా ఉంటాయి. వేసవి మధ్యాహ్న వేళ కూడా AC టెంపరేచర్‌ను ఆస్వాదించాలంటే హిమగిరుల చెంతకు చేరుకోవాల్సిందే!



కులూ - మనాలీ

ఉత్తర భారత పర్యాటకంలో కులూ మనాలీ జంట పదాలుగానే వినిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ రెండు పట్టణాలూ జంట పట్టణాలు కావు గానీ, ఒకదానికి మరొకటి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడకు వెళ్లే పర్యాటకులు రెండింటినీ చూసే తిరిగి వస్తుంటారు. వేసవి విడిది కేంద్రాలుగా పేరుపొందిన ఈ పట్టణాల పరిసరాల్లో అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి నాలుగువేల అడుగులకు పైగా ఎత్తున ఉండే కులూ మనాలీ పట్టణాలు ప్రకృతి సోయగాలకు నిలయాలు. నడివేసవిలో సైతం ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. వేసవిలో సైట్‌ సీయింగ్, వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఈ పట్టణాలు చాలా అనువుగా ఉంటాయి.

మనాలీ మీదుగా ప్రవహించే బియాస్‌ నదిలో బోటింగ్‌ను, ఇక్కడి పరిసరాల్లోని వేడినీటి బుగ్గల్లో జలకాలాటలను ఆస్వాదించవచ్చు. కులూ మనాలీలలో అడుగడుగునా పురాతన ఆలయాలు తారసపడతాయి. అరుదైన హిడింబ ఆలయం, శృంగి మహర్షి ఆలయం సహా పలు ప్రాచీన ఆలయాలతో పాటు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ ప్యాలెస్, ‘దేవతల కొలను’గా పేరుపొందిన భృగు సరోవరం, గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్, రహాలా జలపాతం, అరుదైన వన్యప్రాణులకు నిలయమైన మనాలీ అభయారణ్యం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలో భూంతార్‌ విమానాశ్రయం ఉంది. అయితే, ఢిల్లీ, చండీగఢ్‌ మినహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలు దొరకవు. విమానాల్లో వెళ్లేవారు ఢిల్లీ లేదా చండీగఢ్‌ చేరుకుని, అక్కడి నుంచి మరో విమానంలో భూంతార్‌ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. కులూ మనాలీ పట్టణాలకు రైలు సౌకర్యం లేదు. వీటికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జోగీందర్‌నగర్, 150 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రదేశాలకు నేరుగా రైళ్లు దొరుకుతాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.




డార్జిలింగ్‌

డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్బొటీ రాక్‌ గార్డెన్‌ వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేసవిలో వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఇది చాలా అనువైన ప్రదేశం.

ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిల నుంచి డార్జిలింగ్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. దక్షిణాది నుంచి విమానాల్లో  వెళ్లేవారైతే ముందుగా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడం తేలికగా ఉంటుంది. రైలులో వెళ్లేవారు ముందుగా న్యూజాల్‌పాయిగుడి స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి హిమాలయన్‌ రైల్వేస్‌కు చెందిన టాయ్‌ ట్రెయిన్‌లో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. అలా కాకుంటే కోల్‌కతాలో రైలు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా చేరుకోవచ్చు.



దిమా హసావో

అస్సాంలోని దిమా హసావో జిల్లా కేంద్రం హాఫ్లాంగ్‌ చూడచక్కని వేసవి విడిది కేంద్రం. స్థానిక దిమాసా భాషలో ‘హాఫ్లాంగ్‌’ అంటే ‘చీమ కొండ’ అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున వెలసిన హాఫ్లాంగ్‌ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హాఫ్లాంగ్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది. హాఫ్లాంగ్‌ కొండపైన, చుట్టుపక్కల వ్యాపించిన వనాల్లో దాదాపు రెండులక్షల జాతులకు పైగా అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఈశాన్య గిరిజన సంస్కృతికి ఆలవాలమైన ఈ ప్రదేశం గ్లైడింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్‌ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది. హాఫ్లాంగ్‌ కొండపై ట్రెక్కింగ్, హాఫ్లాంగ్‌ సరస్సులో పడవ విహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పక్షులు ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశంగా పేరుపొందిన జతింగా ఇక్కడకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఏటా వర్షాకాలంలో రాత్రివేళ ఇక్కడ రకరకాల పక్షులు మూకుమ్మడిగా చనిపోతుంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నిరకాల విశ్లేషణలు చెబుతున్నా, ఈ పరిణామం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

ఎలా చేరుకోవాలి?
విమానంలో వెళ్లాలనుకునే వారికి అస్సాం రాజధాని గువాహటి లేదా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. గువాహటి వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి వేరే రైలు పట్టుకుని హాఫ్లాంగ్‌ వరకు రైలుమార్గంలో చేరుకోవచ్చు.



థండా థండా తవాంగ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాకేంద్రమైన తవాంగ్‌ పట్టణం టిబెట్‌ సరిహద్దులకు అతి చేరువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఏకంగా పదివేల అడుగుల ఎత్తున వెలసిన ఈ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. నడి వేసవిలో సైతం ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు లోపే నమోదవుతుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో నిండిన దట్టమైన అడవులు, కొండల మీదుగా నేల మీదకు దూకే జలపాతాలు, సరస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనువిందు చేస్తుంది. బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన తవాంగ్‌లో తవాంగ్‌ బౌద్ధారామం, ఉర్గెలింగ్‌ గోంపా, గ్యాన్‌గోంగ్‌ అని గోంపా వంటి ఆరామాలు టిబెటన్‌ వాస్తుశైలిలో ఆకట్టుకుంటాయి. సెలా పాస్, బుమ్‌లా పాస్‌ వంటి పర్వతమార్గాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కొండలపై వెలసిన మాధురి సరస్సు, నగులా సరస్సు వంటి సరస్సులు, నురానంగ్‌ జలపాతం వంటి జలపాతాలు నిత్యం జలకళతో కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరువలోనే మంచుతో నిండిన గోరిచెన్‌ శిఖరం ఎక్కేందుకు పర్వతారోహకులు మక్కువ చూపుతారు. ఇక్కడి ఈగల్‌ నెస్ట్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి ఆలవాలంగా ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి?
ఇక్కడకు చేరువలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి తవాంగ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి తేజ్‌పూర్‌ వరకు నేరుగా విమానాలు, రైళ్లు దొరకడం కష్టం. అందువల్ల గువాహటి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం మీదుగా ఇక్కడకు చేరుకోవడం కాస్త తేలికగా ఉంటుంది.



గ్యాంగ్‌టక్‌

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చూడ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్‌ అంటే కొండకొన అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన పట్టణం ఇది. ఏడాది పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్‌ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో చేరింది. గ్యాంగటక్‌లో వివిధ హిందూ ఆలయాలతో పాటు బౌద్ధారామాలు చూడముచ్చటగా ఉంటాయి. పట్టణానికి చుట్టుపక్కల సెవెన్‌ సిస్టర్స్‌ జలపాతం సహా పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. పచ్చదనంతో అలరారే ప్రశాంతమైన గ్యాంగ్‌టక్‌ పరిసరాలు వాకింగ్, ట్రెక్కింగ్, సైట్‌ సీయింగ్‌ వంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. తాషీ వ్యూ పాయింట్, గణేశ్‌ టోక్‌ వ్యూపాయింట్‌ వంటి ప్రదేశాల నుంచి గ్యాంగ్‌టక్‌ పట్టణాన్నీ, పరిసరాల్లోని అడవుల పచ్చదనాన్నీ తిలకించవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే హిమాలయన్‌ జూ పార్కు, షింగ్బా రోడో డెండ్రాన్‌ అభయారణ్యం, కాంచన్‌జంగా నేషనల్‌ పార్క్‌ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఎలా చేరుకోవాలి?
గ్యాంగ్‌టక్‌కు నేరుగా విమాన, రైలు సౌకర్యాలేవీ అందుబాటులో లేవు. ఇక్కడకు అతి చేరువలోని విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రాలో ఉంది. గ్యాంగ్‌టక్‌కు ఇది సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగ్దోగ్రా విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం దిగి రోడ్డు మార్గాన రావాలనుకుంటే ట్యాక్సీలు లేదా బస్సుల్లో రావచ్చు. సమీపంలోని రైల్వేస్టేషన్‌ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జాల్‌పాయిగుడిలో ఉంది. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి గ్యాంగ్‌టక్‌ చేరుకోవాల్సి ఉంటుంది.



Sunday, 22 January 2017

హిమాచల్‌ ప్రదేశ్‌ - ఆలయాలకు ఆలవాలం






ఆలయాలకు ఆలవాలం హిమసమూహం

వెండిలా తళతళా మెరిసిపోయే హిమాలయ పర్వత శ్రేణులను సందర్శించడానికి అటు భక్తజనులూ, ఇటు పర్యాటక ప్రియులూ కూడా ఉవ్విళూరుతుంటారనడంలో అతిశయోక్తి లేదు. బహుశా అందుకే కాబోలు, దేశానికి పర్యాటకరంగం నుంచి ఆదాయం చేకూర్చే రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక అక్కడి కులూ లోయల సంగతి చెప్పనవసరం లేదు. అక్కడి కొండల మీద వెలుగు నీడలకి వెర్రెత్తిన నికొలన్‌ రోరిచ్‌ అనే రష్యా చిత్రకారుడు గతంలో అక్కడ స్థిరపడి అద్భుతమైన పెయింటింగ్‌లు చేశారు.

సిమ్లా, కుర్గి, నర్కండా, కులు, మనాలి, చంబా, కూపర్, పబ్బర్‌ వంటి ప్రాంతాలు హిమాచల్‌ప్రదేశ్‌ అనే తోటలోని అందమైన పూలు! సోలోంగ్‌నుల్లా నుంచి పథ్రూ వరకు గల లోయ ప్రాంతంలో స్కీయింగ్‌ ఆనందం కోసం దేశవిదేశీ పర్యాటకులు బిలబిలలాడుతుంటారు.

శివరాత్రి అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడి శాలువాలు, రగ్గులు, దుప్పట్లు, తివాచీలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. అంతేకాదు, ఈ హిమవత్పర్వత శ్రేణులలో శక్తిస్వరూపిణి, చింతలు తీర్చే చల్లనితల్లి చింతపూర్ణాదేవి, చారెడేసి కన్నులతో కనువిందు చేసే నయనాదేవి, భీమసేనుడి భార్య హిడింబకు కూడా ఆలయాలున్నాయి.

చింతపూర్ణాదేవి
చింత అంటే బాధలు, ఆందోళనలు. తన భక్తుల చింతలను దూరంచేసే దేవి కాబట్టి ఈ తల్లికి చింతపూర్ణాదేవి అని పేరు వచ్చిందట. దక్షయజ్ఞంలో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమశివుడు భుజాన వేసుకుని తిరుగుతుండగా, విష్ణుమూర్తి ఆ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు, ఆమె పవిత్రపాదం ఇక్కడ పడిందని అంటారు. మరోగాథ ప్రకారం, భగత్‌మయీదాస్‌ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతి నిత్యం అమ్మవారిని పూజించేవాడు. కానీ లౌకిక సంబంధమైన కోరికలు ఏవీ కోరలేదు. ఒకసారి ఈ భక్తుడు తన మామగారి ఊరికి బయలుదేరాడు. అతను కొంతదూరం వెళ్లాక, అలసిపోయి ఒక చెట్టునీడన పడుకొని నిద్రపోయాడు. అతను నిద్రలో ఒక కలగన్నాడు.

ఆ కలలో, ఒక బాలిక కనిపించి, అక్కడ తను పిండ రూపంలో - గుండ్రని రాతి రూపంలో ఉన్నానని, తనకొక ఆలయం నిర్మించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే అతను అక్కడ ఉన్న అమ్మవారిని (పిండ రూపాన్ని) ఆలయంలో ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికి ఇరవై ఆరు తరాల కిందట అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు. సోలాసింఘి పర్వతశ్రేణిలోని అతి ఎత్తయిన ఒక పర్వతశిఖరం మీద చింతపూర్ణాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటుంది. లడ్డు, హల్వా, పాయసం, పళ్లు మొదలైన నివేదనలతోపాటు పూలు, వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు.

కులు-మనాలి
కులు-మనాలి అనే రెండు ప్రాంతాలు కలిసిపోయి, అది ఒకే ఊరు అనుకునే పరిస్థితి ఉంది. కానీ కులు, మనాలి వేర్వేరు ఊళ్లు. మొదట కులు వెళ్లి అక్కడి నుంచి మనాలికి ప్రయాణం కట్టాలి. హిమాచలప్రదేశ్‌ అంటేనే హిమాచల పర్వతాలలో ఉన్న ప్రాంతమని అర్థం. కులు-మనాలి చుట్టూ ఎత్తయిన కొండలే దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాలు వేసవి విడిది ప్రాంతాలు. సెప్టెంబరు నుంచి పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి, ఈ కొండలు కనువిందు చేస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో మంచుమీద స్కైయింగ్‌ జరుగుతూంటుంది. కులు జిల్లాకు దేవతల లోయ అని పేరు.

కులు ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో బిజిలీ మహదేవ్‌ ఆలయం ఉంది. కులులోని రఘునాథ ఆలయం చూడదగినది.భారతీయ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన ప్రాంతం మనాలి. పూర్వం ప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోయి నప్పుడు, తిరిగి సృష్టి చేయడానికై ఓడలో నుండి మనువు ఈ ప్రాంతంలో అడుగుపెడతాడు. అందుకే ఈ ప్రాంతానికి నిమనాలి - మనువు నివసించిన ప్రాంతం అని పేరు. పాత మనాలిలో మనువు ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కాక, పాత మనాలిలోని పురాతన కోటలను, కట్టడాలను, యాత్రికులు సందర్శిస్తూంటారు. మనాలి, దాని పరిసరాలు సప్తర్షుల నివాసంగా చెబుతారు.

అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది. వీరి కుమారుడే ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. మనాలిలో బౌద్ధుల ఆశ్రమాలు కూడా చూడదగిన ప్రదేశాలు. వీటిని గోంపాలు అంటారు. గదన్‌ తెక్చోగోంప, హిమాలయన్‌ న్విన్గమప గోంప మొదలైన ఆశ్రమాలున్నాయి.

హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహించే హోటల్‌ కూడా చూడదగినదే. ఇది పూర్వకాలంలో నగ్గర్‌కోటగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం హోటల్‌గా రూపాంతరం చెంది, హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహణలో ఉంది. దీనిని దర్శించినవారు, ఇందులోని కళానైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. హనీమూన్‌ జంటలను ఆకర్షించే ప్రదేశంగా కూడా మనాలి పేరుపొందింది. ఇంతేకాక, సాహసక్రీడలైన స్కీయింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్‌ బైకింగ్‌ మొదలైన సాహసక్రీడలు కూడా మనాలిలో జరుగుతుంటాయి. ఈ ఆటలలో పాల్గొనాలనే కాక, కేవలం మంచులో సరదాగా ఆటలాడుకోవాలని వచ్చేవారి సంఖ్య కూడా తక్కువ కాదు. మంచుకొండలలోని వేడినీటిబుగ్గలు ప్రకృతిలోని వింతగా, దేవుడిచ్చిన వరంగా చెబుతారు. మనాలికి సీమపంలో రహల్లా జలపాతం కనువిందు చేస్తుంది. ఇది సుమారు 2,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ జలపాతం చూస్తే, నయాగరాని చూసిన అనుభూతి పొందుతారు.

చాముండానందికేశ్వరి
చాముండాదేవిని గురించి దేవీభాగవతం, దుర్గాసప్తశతి మొదలైన పురాణాలలో వివరంగా ఉంది. చాముండాదేవి ఆలయాన్ని సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. కాళికాదేవి చాముండాదేవిగా ఇక్కడ ఉన్నదని చెబుతారు.మరోగాథ కూడా ఉంది. అమ్మవారు ప్రారంభంలో ఒక ఎత్తయిన పర్వతం మీద వెలిసిందని, ఒక అంధ భక్తుడు ప్రతీరోజు అమ్మవారిని దర్శించలేక పోతున్నందున బాధపడి అమ్మవారిని ప్రార్థించాడని, అతనిని కరుణించడానికని దేవి కొండ మీద నుండి ఇప్పుడున్నచోటికి వచ్చిందని స్థానికులు చెబుతారు.

జ్వాలాముఖి
జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. జ్వాలాముఖి దగ్గర సతీదేవి నాలుక పడిందని చెబుతారు. స్వచ్ఛమైన నీలిమంటతో ప్రకాశించే దేవిని పాండవులు కూడా దర్శించారని స్థానిక గాథ చెబుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా ఇక్కడ కొలువుదీరి భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, ఇంకో తొమ్మిది జ్వాలలు ఉన్నాయి. అవి కూడా దేవతలుగా పూజలందుకుంటున్నాయి. మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారికి పాలు, ఫలాలు, కలకండలని నివేదిస్తారు. రోజంతా రకరకాల పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు అయిదుసార్లు ఆరతి జరుగుతుంది. రోజుకొకసారి హోమం చేసి, దుర్గాసప్తసతి పారాయణ చేస్తారు.

హిమాచల్‌ కొండల దారిన...
ఒక్కసారి హిమాచల్‌ప్రదేశ్‌ కొండల వాలుల్లో నడిస్తే చాలు మీకు కొండల పిచ్చి పట్టుకుంటుంది. అలా పర్వతాలు ఎక్కడానికి, పెద్ద పెద్ద మంచు బండరాళ్లు ఎక్కి కొండల మీద తిరగడానికి తగిన శిక్షణ లేకపోతే ఎక్కలేరు. అందుకే అక్కడి మనాలీలో మౌంటెనీరింగ్, స్కీయింగ్‌ నేర్పే శిక్షణాలయం ఉంది. సట్లె్లజ్, బియాస్‌ నదులు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రశాంతంగా ప్రవహిస్తాయి గనుక వాటిలో పడవల పోటీలు, పడవ ప్రయాణాలు బహు చక్కగా సాగుతాయి.

హిమాచలపర్వతాలను ఎలా చేరుకోవాలంటే...?
జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా కాంగ్రా చేరుకోవాలి. కాంగ్రాకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లున్నాయి. విమానంలో వెళ్లాలంటే గగ్గల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. అక్కడినుంచి కాంగ్రాకు క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉంటాయి. కాంగ్రా నుంచి బస్సులో జ్వాలాముఖికి వెళ్లవచ్చు లేదంటే ఢిల్లీ నుంచి ధర్మశాలకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి ట్యాక్సీలో జ్వాలాముఖి ఆలయానికి చేరుకోవచ్చు.

ఉత్తమమైన మార్గం ఏమిటంటే... tourismmin-hp@nic.in, tourism.hp@nic.inకు మెయిల్‌ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌నుంచి అక్కడ చూడదగ్గ ప్రదేశాలు; ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ప్యాకేజీ ఏమిటి... వంటి వివరాలతో కూడిన మెయిల్‌ వస్తుంది. దాని ప్రకారం ప్లాన్‌ చేసుకోవచ్చు.

DVR. భాస్కర్‌



Tuesday, 7 June 2016

అందాలొలుకు(లు)... మనాలి. . .

హిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌కి మధ్యలో ఉన్నదే మనాలి. అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్‌ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్‌ జంగిల్‌లో కాపురాలు చేస్తున్న హైటెక్‌ నగరవాసికి ప్రశాంత కూడలి ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా అంటారు.

ఉత్తర భారతావనిలో ఘనమైన హిల్‌ స్టేషన్‌లలో ఒకటిగా చెప్పుకోదగిన కులు లోయ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనదే మనాలి. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యపట్టణమైన సిమ్లాకు ఉత్తరాన 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో... బియాస్‌ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి మూడు కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉండటం విశేషం. చుట్టూ మంచు లోయల మధ్య వేడినీటి కొలనులు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.

నాటి మనువాలయమే...
పూర్వం ‘మను’ అనే ముని నివసించిన ప్రాంతం కాబట్టి అతని పేరునే ‘మనాలి’గా ఏర్పడింది. అయితే ఒకప్పుడు దీనిని మనువాలయగా పిలిచేవారట. అంటే మను నివసించిన ప్రదేశం అని పేరు.

వాతావరణం...

మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్‌లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్‌లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్‌తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.

సాహసవీరులకు సేదతీర్చే...
ఇక్కడికి వచ్చే ఔత్సాహిక మంచు స్కేటర్స్‌కి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. సోలాంగ్‌ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాలు ఇక్కడ మంచు స్కయింగ్‌కి అనుకూలం. ఇక్కడ జనాభా మొత్తం 4,200 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హిందీ, హిమాచల్‌, ఇంగ్లీష్‌ భాషలు మాట్లాడతారు.

దుస్తులు...
మనాలి ప్రజలు పొడవైన ఉలెన్‌ కోటు వేసుకుంటారు. దానిని ‘చోళ’ అని పిలుస్తారు. నడుముకు కట్టుకునే బెల్టులా ‘డోరా’ అనే వెయిస్ట్‌ క్లాత్‌ కట్టుకుంటారు. ‘సుతాన్‌’ అనే టైట్‌ ప్యాంట్లను వేసుకుంటారు. ‘టోప’ అనే బ్లాక్‌ క్యాప్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. ‘లాచూ’ అనే బుజాలు కప్పుకునే ఒకరకం బ్లాంకెట్‌ కూడా వేసుకుంటారు. ఇవన్నీ చలినుంచి రక్షించే సాధనాలే అవడం విశేషం.

ఆహారం...
వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్‌ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్‌, రెడ్‌ రైస్‌ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.

వసతులు...
లెక్కకి మిక్కిలిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు ఉన్నాయి. ఎంత ఖర్చు పెడితే అంత... అన్నట్లుగా ఇక్కడ అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి అభిరుచుల మేరకు అన్ని వసతులను అందజేస్తుంటాయి ఇక్కడి హోటళ్ళు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను కూడా అందజేయటం ఇక్కడి హోటల్‌ యాజమాన్యాల ప్రత్యేకత. టూరిస్ట్‌లు కూడా వారి వారి రేంజ్‌ను బట్టి వారికి కావలసిన హోటళ్లలో దిగుతుంటారు.

ఎలా వెళ్లాలంటే...
మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్‌నగర్‌ నుంచి నేరో గేజ్‌ లైన్‌ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ చంఢీఘఢ్‌ దాకా ఉంది. చంఢీఘఢ్‌ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.

చూడదగిన ప్రదేశాలు బిజిలీ మహదేవ్‌ దేవాలయం...
సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో... కులు ప్రాంతానికి 10 కి.మీ. దూరంలో ప్రఖ్యాత బిజిలీ మహదేవ్‌ దేవాలయం ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కులు ప్రాంతంలో ఉన్న లోయల్లో మౌంటెనైఉ టెక్కర్స్‌కి ఆహ్లాదంగా ఉండటమే గాక వాళ్లలోని సాహసాపేక్షను ఈ ప్రాంతంలో పర్వతాలను అధిరోహించి మరీ తీర్చుకుంటుంటారు.

హిడింబి దేవాలయం...
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక్కడ భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి దేవాలయం ఉండటం. పైగా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండటం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండటం విశేషం.

రహల్లా జలపాతం...
సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్‌ కనుమ ప్రాంతంలో పర్యాటకులు నయాగారా జలపాతం చూసిన అనుభూతిని పొందుతారు. మనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్‌ మనాలి ప్రాంతం ఉంది. అక్కడ పురాతన కోటలు... సంప్రదాయ మను దేవాలయం చూడదగిన ప్రదేశాలు. వీటన్నితో మనాలి దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...