Showing posts with label శిల్ప సంపద. Show all posts
Showing posts with label శిల్ప సంపద. Show all posts

Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

Friday, 20 July 2018

చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపి







July 20, 2018


చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపి



దక్షిణ భారతదేశంలో అత్యంత ఖ్యాతి పొందిన ప్రాంతం కర్నాటకలోని హంపి. అద్భుతమైన కట్టడాలు, అరుదైన శిల్పకళా సౌందర్యాలు, ప్రకృతి సోయగాలు, నీటి పరవళ్ళు, సుందరమైన ప్రకృతి ఇలా.. పరవశించే ప్రదేశాల అందాలను ఆస్వాదించాలంటే హంపిని తప్పకుండా చూడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు ఇక్కడి పురాతన కట్టడాలు, నాటి రాజుల పాలనలోని వసతులు, సౌకర్యాలు, సాంప్రదాయాలు, ప్రమాణాలు వంటి అనేకమైన అంశాలను పరిశీలించవచ్చు. అందుకే విద్యార్థుల విజ్ఞానయాత్రలలో హంపి తప్పకుండా ఉంటుంది. శతాబ్దాల నాటి చరిత్రనూ అక్కడి కట్టడాలపై చూడొచ్చు. అందుకే ఆ చారిత్రక ప్రదేశంలో మనమూ ఈ వారం 'జర్నీ' చేద్దాం పదండి!!

పాఠశాలలకు మూడురోజులు సెలవులు రావటంతో హంపి వెళ్లేందుకు నేను, నా సతీమణి, ఇద్దరు పిల్లలు, అత్తగారితో కలిసి బయల్దేరాం. ఉదయం 7 గంటలకు అనంతపురం నుంచి కారులో బళ్లారి చేరుకున్నాం. కర్నాటక రోడ్డు సరిగా లేనందున 167 కిలోమీటర్ల హంపి చేరడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. హంపికి చేరుకోవాలంటే కర్నాటకలోని అన్ని ప్రాంతాల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. సందర్శకులు సాధారణంగా బెంగళూరు, బళ్లారి మార్గంగా వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా ముందుగా హోస్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి హంపికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో హుబ్లీ నుంచి గుంతకల్లు మీదుగా వెళ్లే రైళ్లు హోస్‌పేటలో ఆగుతాయి. అంటే, హంపికి చేరాలంటే రైలు మార్గమూ అందుబాటులో ఉన్నట్లే! హోస్‌పేట ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉండటంతో ఇక్కడ బస చేసేందుకు మంచి హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. సందర్శకులు విరివిగా వస్తుండడంతో నార్త్‌, సౌత్‌తో పాటు డిమాండ్‌ ఉన్న వంటకాలను అందిస్తారు.

హోస్‌పేట నుంచి హంపికి 15 కిలోమీటర్లు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు ఈ మార్గంలో తిరుగుతాయి. హోస్‌పేట నుంచి హంపికి కడ్డిరాంపురం, కమలాపురం మీదుగా రెండు దార్లు ఉన్నాయి. కాలి నడకన హంపి చూడాలనుకునేవారు కమలాపురం మీదుగా వెళ్ళడం మంచిది.

శ్రీవిరూపాక్ష దేవాలయం 
హంపి ప్రాంతంలో చూడాల్సిన ప్రధాన సందర్శనా ప్రదేశం విరుపాక్ష దేవాలయం. ఈ పురాతన ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి. దేశాలయ ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తు, కిందిభాగం 20 అడుగులు వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి, పదకొండు అంతస్థులతో ఉంటుంది. దీనిని 'బీష్టప్పయ్య గోపురం' అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సమయంలో గోపురం, రంగమంటపం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవాలయ మహాప్రాంగణం 510 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవు ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలతోపాటు వంటశాల, కార్యాలయం, పక్కనే రాతితో నిర్మితమైన నీటి కోనేరును చూడవచ్చు.

రాజ తులాభారం
విజయనగర కాలంలో దసరా పండగను ఘనంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. పురంధరదాసుల మంటపం నుంచి పైకి వెళితే, రాతి స్తంభాలు ఒకదానిపై మరొకటి అమర్చి కనపడతాయి. దీనిని రాజతులాబారంగా పిలుస్తారు. మహానవమి నాడు ఇక్కడ ఒక త్రాసును కట్టి, ఒకవైపున రాజు మరోవైపున వజ్రవైడూర్యాలను తూచేవారని, వాటిని ప్రజలకు పంచేవారని చెబుతారు.

ఉగ్ర నరసింహ 
హంపిలో ఉగ్రనరసింహ విగ్రహం చాలా పెద్దది. దీని ఎత్తు సుమారుగా 22 అడుగులు. క్రీ.శ. 1528లో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణుడిచే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వజ్ర, వైడూర్యాలు ఉంటాయనే ఆశతో దుండగులు ఈ విగ్రహం చేతిని, కాలును ధ్వంసం చేశారట!

హజరా రామాలయం 
ఈ దేవాలయం అంతఃపురాన్ని పోలి ఉంటుంది. క్రీ.శ 1513లో దీనిని నిర్మించారు. ఈ దేవాలయానికి దక్షిణ భారతదేశంలో ఎంతో ఖ్యాతి ఉంది. దేవాలయం గోడలపై రామాయణం, పురాణాలను తెలిపే ప్రతిమలు, రాతలను నాటి శిల్పకారులు చెక్కారు. చూపరులకు ఈ దేవాలయ సందర్శన ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.

మహానవమి దిబ్బ 
రాజుల కాలంలో వినియోగించే రచ్చబండ ఇది. చతురస్రాకారంలో ఉండే ఈ రచ్చబండ 22 అడుగుల ఎత్తు, పై భాగంలో 80 అడుగుల వెడల్పు ఉంటుంది. కృష్ణదేవ రాయలు ఒడిశాపై విజయం సాధించిన సందర్భంలో దీనిని నిర్మించి నట్లు తెలుస్తుంది. ఈ దిబ్బను అప్పటి పోర్చుగీసు రాయబారి అతిసుందరంగా నిర్మించారు. ఈ దిబ్బ పైభాగం, కింద భాగంలో అప్పటి సంస్కృతులు తెలిపే శిల్పాలు దర్శనమిస్తాయి. దీని ఎదురుగా సుమారుగా 20 గజాల దూరంలో నల్లరాతి కళ్యాణి కోనేరు ఉంది. దీనిని కర్నాటక పురావస్తు శాఖ వారు వెలుగులోకి తెచ్చారు. వీక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రీతిలో ఈ నిర్మాణం ఉంటుంది.

కమల మహల్‌ 
దీనిని లోటస్‌ మహల్‌, చిత్రాంగిని మహల్‌ అని పిలుస్తారు. రెండు అంతస్థులలో ఉండే ఈ నిర్మాణం సున్నపుగారతో నిర్మించారు. ఈ ప్రదేశంలో మండు వేసవిలోను చల్లదనం ఉండే రీతిలో కిటికీలను, ద్వారాలను నిర్మించారు. అప్పట్లో దీనిని రాణి విశ్రాంతి మందిరంగా చెబుతారు.

గజశాల 
పట్టపుటేనుగులను కట్టేందుకు నిర్మించిన అతి పెద్ద గజశాల ఇక్కడ కనిపిస్తుంది. ఏనుగులకు ఆహారం, నీరు అందించేందుకు మావటివాడు వెళ్లేందుకు వీలు కల్పించే రీతిలో నిర్మాణాలు చేశారు. ఈ కట్టడాలు చూడటానికి పైభాగం గోళాకారంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా హంపిలోని ప్రతి కట్టడం రాజసం ఉట్టిపడేలా, నేటికీ చెక్కుచెదరని నాటి రాజుల పాలనాదక్షత, ప్రజల అంకితభావానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి.

తుంగభద్ర ఆనకట్ట 
హోస్‌పేట నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు అన్ని సమయాల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆనకట్ట పొడవు 2 మైళ్ళు, ఎత్తు 160 అడుగులు. అప్పట్లో సుమారుగా రూ.15 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. డ్యాము నందు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం, ఆకర్షణీయమైన గార్డెన్స్‌, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది.

వీలైనంత వరకూ సందర్శకులు హోస్‌పేట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకుంటారు. హంపిలోనూ చిరు హోటళ్ళు ఉంటాయి. హంపిలో సైకిళ్ళు, మోటారు వాహనాలు అద్దెకు లభిస్తాయి. సందర్శకులకు పోలీస్‌ యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉంటుంది. హంపి చూడదగిన వారు కనీసం రెండురోజుల పాటు సమయం కేటాయిస్తే పూర్తిస్థాయిలో హంపిని చూడవచ్చు. టిడి డ్యామ్‌ దగ్గరలో ఉన్నందున డ్యాంను, అక్కడి పార్కులను, బోటింగ్‌ను బాగా ఎంజారు చేయవచ్చు. అయితే డ్యామ్‌ పైకి వాహనాలకు సాధారణంగా అనుమతుండదు. అధికారుల ప్రత్యేక అనుమతితో డ్యామ్‌ సందర్శన సాధ్యమవుతుంది. హంపికి కొత్తగా వెళ్లేవారికి, అక్కడి విశేషాలు వివరించడానికి గైడ్స్‌ అందుబాటులో ఉంటారు. గైడు అవసరం లేని వారు దాని చరిత్ర తెలిపే పుస్తకాన్ని కాస్త ఓపిగ్గా తిరగేయగలిగితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మేము పుస్తకం కొని, స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది సహకారంతో హంపి సోయగాలను తృప్తిగా చూడగలిగాం.

- వి. రవిచంద్ర


Monday, 23 April 2018

బాదామి ఐహోలె శిల్ప సంపద




DATE

అడుగడుగున గుడి ఉంది... ఆ గుడిలో దైవముంది..!
‘అక్కడ జలపాతాల జడినీ సుందర నదీతీరాలనీ వీక్షిస్తే పౌరాణిక గాథల్ని వినిపిస్తాయి. ఎర్రనినేలనీ రాతి కొండల్నీ గుహల్నీ పలకరిస్తే శతాబ్దాల చరిత్ర లోతుల్లోకి తీసుకెళతాయి. ఆ గోడలని కళ్లతో ఆర్తిగా తడిమితే నాటి శిల్పుల ఉలి విన్యాసాలు సాక్షాత్కరిస్తాయి. అటు ప్రకృతి అందాలకూ ఇటు చాళుక్యుల కళావైభవానికీ వేదికలుగా నిలిచిన ఆ ప్రాంతాలే ఐహోలె, పట్టడకల్‌, బాదామి...’ అంటున్నారు విశాఖవాసి డా.మాదాబత్తుల తిరుమలరావు.

విశాఖపట్నం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, కర్ణాటకలోని హోస్పేట్‌లో దిగి, అక్కడినుంచి ప్యాసింజర్‌లో బయల్దేరి బాదామి చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క రైల్వేస్టేషన్‌ బాదామి. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడం, ప్యాసింజర్‌ రైళ్లు కూడా నిమిషమే ఆగడంతో ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ కర్ణాటకలోని భాగల్‌కోట్‌ జిల్లాలోని మలప్రభ నదీతీరంలోని బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రదేశాల గురించి సినీపరిశ్రమకి బాగా తెలుసు. అందుకే అక్కడ సందర్శకుల తాకిడి కన్నా సినిమా షూటింగులే ఎక్కువ. తమిళ, కన్నడ చిత్రాలతో బాటు తెలుగు చిత్రాలు కూడా షూట్‌ చేశారు. విక్రమార్కుడు, ఢమరుకం, దరువు, రౌడీ రాథోడ్‌, శక్తి, త్రిపుర... తదితర సినిమాలన్నీ చిత్రీకరించారక్కడ.

బసశంకరీదేవి...
ముందుగా మేం బసశంకరీదేవి ఆలయానికి బయల్దేరాం. బాదామికి దక్షిణాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. చాళుక్యుల ఆరాధ్యదేవత బసశంకరి. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఎందరికో ఆమె కులదేవత. చారిత్రకంగా చూస్తే- బాదామి చాళుక్యుల కన్నా ముందే ఇక్కడ బసశంకరీదేవి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ ఎత్తైన గోడలతో ముఖమండపం, అర్ధమండపం ఉన్నాయి. బసశంకరీదేవి సింహం మీద కూర్చుని, ఎనిమిది చేతులతో దుర్గాదేవి అవతారంలో దర్శనిమిస్తుంది. దేవాలయంలో ఉన్న ఓ శాసనం ప్రకారం- చాళుక్య రాజైన జగదేకమల్లుడు పురాతన దేవాలయానికి చాలా మార్పులు చేసి కట్టించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ గుడిని పునర్నిర్మించగా, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మాత్రం విజయనగర రాజులు నిర్మించారట. తరవాత శివయోగ మందిరానికి బయల్దేరాం. ఇది బాదామికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు మందిరాలు ఉన్నాయి. ఒక మందిరంలో హనగల్‌ కుమారస్వామిజీ, హనగల్‌ సదాశివ స్వామీజీ సమాధులు ఉన్నాయి. ఈ స్వామీజీలకి అతీతశక్తులుండేవని చెబుతారు. అక్కడి నుంచి అనేక ఆలయాల కూటమి అయిన మహాకూటకి వెళ్ళాం. దీన్నే ఒకప్పుడు దక్షిణ కాశీ అనేేవారు. ఇందులో అతి పెద్దది మహాబలేశ్వర ఆలయం. చాళుక్యరాజైన మొదటి పులకేశి ఈ శివాలయాన్ని నిర్మించాడట.

ఆలయాల సముదాయం... ఐహోలె..!
మహాకూటకి 25 కి.మీ. దూరంలో ఉంది ఐహోలె. ఇది కూడా అనేక ఆలయాల సమూహం. అన్నీ ఓ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి దుర్గగుడి, లాడ్‌ఖాన్‌ దేవాలయం, సూర్యనారాయణ, హచిమల్లి దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, మల్లికార్జున దేవాలయాలు. ఇక్కడే ఓ మ్యూజియం ఉంది. అందులో శాసనాలూ శిల్పాలూ చాళుక్యుల పాలనకీ శిల్పకళావైభవానికీ సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో 120కి పైగా హిందూ, జైన, బౌద్ధ ఆలయాలూ కట్టడాలూ ఉన్నాయి. అందుకే మ్యూజియంలో వాటికి సంబంధించిన మ్యాప్‌ కూడా సందర్శకుల సౌకర్యార్థం ఉంచారు. ఇక్కడి మలప్రభ నదీ తీరంలో గొడ్డలి ఆకారంలో ఓ రాయి ఉంది. ఇది పరశురాముడు సంచరించిన ప్రాంతమనీ, క్షత్రియుల్ని వధించాక గొడ్డలిని కడగడంవల్లే ఈ ప్రాంతంలోని నేలంతా ఎర్రబారిందనీ అంటుంటారు. నది ఒడ్డున ఉన్న రాతి పాదముద్రలు భార్గవరాముడివిగానే భావిస్తారు స్థానికులు.


దుర్గగుడి

శిల్పకళా సంపద
ఐహోలెకి 13 కి.మీ. దూరంలో ఉంది పట్టడకల్‌. బాదామి చాళుక్యుల శిల్పకళకి ప్రతీక పట్టడకల్‌. తొలినాటి ఉత్తర, దక్షిణ భారత ఆలయ వాస్తు సమ్మేళనాన్ని ఇక్కడ చూడొచ్చు అంటారు చరిత్రకారులు. ఇక్కడి ఆలయాలు రెండో విక్రమాదిత్య కాలానికి చెందినవి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కర్ణాటకలోని రెండు ప్రదేశాల్లో ఒకటి హంపి అయితే రెండోది పట్టడకల్‌. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉన్నాయి. ఎనిమిది ఆలయాలు ఒకే కూటమిగా ఒకేచోట ఉండగా, పాపనాథ దేవాలయం ఆ సముదాయానికి దక్షిణాన 0.5 కి.మీ. దూరంలోనూ, జైన నారాయణ దేవాలయం పశ్చిమంగా 1.5 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. ఇక్కడి కడసిద్ధేశ్వర, జంబులింగ ఆలయాలు ఏడో శతాబ్దం నాటివి. గలగనాధ, సంగమేశ్వర, కాశీ విశ్వేశ్వర, మల్లికార్జున, విరూపాక్ష ఆలయాలు 8వ శతాబ్దం నాటివి. వీటిల్లో ముఖ్యంగా చూడదగ్గవి విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు. విరూపాక్ష ఆలయానికి తూర్పున నల్లరాతితో చెక్కిన నంది అద్భుతంగా ఉంది. విక్రమాదిత్యుడు కాంచీపురం మీద విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. తూర్పుముఖంగా 18 ఎత్తైన స్తంభాలతో ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయాన్ని కట్టించారు. మల్లికార్జున ఆలయం కూడా దాదాపు అదే పద్ధతిలో ఉంది. చరిత్రలోకివెళ్లి నాటి శిల్పుల ఉలి చాతుర్యాన్ని అణువణువూ తడిమే మనసు ఉండాలేగానీ పట్టడకల్‌ ఆలయాల శోభని చూడ్డానికి ఎంతకాలమైనా సరిపోదు.


పట్టడకల్‌


బాదామి రాతిగుహల్లో..!
తరవాత బాదామి చూడ్డానికి వెళ్లాం. బాదామి క్రీ.శ.500 నుంచి 757 వరకూ చాళుక్యుల రెండో రాజధానిగా ఉండేది. అందుకే వీళ్లకి బాదామి చాళుక్యులుగా పేరు. బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రాంతాలు నాటి శిల్పుల ప్రయోగాలకు వేదికలు అని చెప్పవచ్చు. చాళుక్యులు వాళ్లను ఎంతగానో ప్రోత్సహించేవారు. అన్ని వందల ఆలయాలూ శిల్పాలూ అక్కడ కనిపించడానికి అదే కారణం. బాదామిలో ముఖ్యంగా చూడాల్సినవి భూతనాథ ఆలయం, అగస్త్యతీర్థం, రాతి గుహాలయాలు. భూతనాథ దేవాలయంలో పెద్ద ముఖమండపం, సభామండపం, అంతరాలయం ఉన్నాయి. కొండల మధ్య ఉండే పెద్ద కోనేరే అగస్త్య తీర్థం. పూర్వం అగస్త్యమహర్షి ఇక్కడే వాతాపి అనే రాక్షసుడిని సంహరించినట్లు పౌరాణిక కథనం.


భూతనాథ దేవాలయం

బాదామిలోని రాతి గుహాలయాలను చూడాల్సిందేే. పెద్ద కొండను తొలిచి నిర్మించిన ఈ నాలుగు ఆలయాల్లో మొదటి గుహనే శైవగుహ అంటారు. ఇందులో నటరాజమూర్తి కొలువుతీరాడు. 18 చేతులతో కమలంమీద నాట్యం చేస్తున్నట్లు ఉన్న ఆ మూర్తి నిజంగా అద్భుతం. ఇక్కడే మహిషాసుర మర్దని, అర్ధనారీశ్వర, హరిహర విగ్రహాలు కూడా ఉన్నాయి. రెండోది వైష్ణవ గుహ. దశావతారాల్లో ఐదవది అయిన వామనావతారాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వామనుడితోబాటు బలి చక్రవర్తి, ఆయన భార్య వింద్యావతి, విష్ణుమూర్తి శిల్పాలు ఉన్నాయి. రెండో గుహ పక్కనే ఓ బౌద్ధ గుహ కూడా ఉంది. అందులో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. మూడో గుహ మహావిష్ణువుది. రాజా కీర్తివర్మ పన్నెండేళ్ల పాలనకు గుర్తుగా అతని తమ్ముడు మంగళేష్‌ ఈ గుహని క్రీ.శ. 578లో రూపొందించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. నాలుగో గుహ ఓ జైన దేవాలయం. జైనుల్లో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం తపస్సు చేసుకుంటున్నట్లు చెక్కారు. ఇక్కడి కొండలమీద చెక్కిన ఆరో శతాబ్దం నాటి కన్నడ లిపిని కూడా చూడవచ్చు. నాటి చాళుక్యుల అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది బాదామి కోట. ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందా పట్టణం. జాలువారే జలపాతాల అందాన్నీ కొండగాలి గిలిగింతల్నీ మొత్తమ్మీద అక్కడి నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవాళ్లకి నాటి చాళుక్యుల రాజధాని బాగుంటుంది అని చెప్పవచ్చు.

ఐహోలెకి 35 కి.మీ. దూరంలో కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదుల సంగమం ఉంది. ఆనాటి చాళుక్య శిల్పశైలికి నిదర్శనం ఈ కూడల సంగమేశ్వర ఆలయం. 12వ శతాబ్దంనాటి శైవ మత వ్యాప్తికి కృషిచేసిన సుప్రసిద్ధ శివభక్తుడు బసవేశ్వరుడు ఇక్కడే జన్మించాడట. అందుకే బసవేశ్వర సమాధి ఒక పక్క మండపంలో ఉంది. చివరగా కూడల సంగమానికి పది కి.మీ. దూరంలో ఉన్న అతి పెద్ద ఆలమట్టి డ్యాం చూడ్డానికి వెళ్లాం. దాని చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిల్లో లవకుశ ఉద్యానవనమూ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఉన్న ఉద్యానవనాలను చూసి వెనుతిరిగాం.



Sunday, 18 March 2018

కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి





అక్కడ ముస్లింలకూ పండగే!

ఉగాది... అంటే హిందువుల పండగ అని అందరికీ తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... కడప జిల్లాలో ఎంతోమంది ముస్లింలకూ ఈ పండగ ప్రత్యేకమైందే. ఆ రోజున వందల మంది ముస్లింలు స్థానికంగా కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

తిరుమల తొలి గడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు - గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే, ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాదినాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతోపాటే వాళ్లూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఆ ఆలయంలో కొనసాగుతోంది. ఆ రోజున కడప రాయడిని దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం.

రమణీయ శిల్పవైభవం
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్‌ థామస్‌ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీన్లోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ.

కన్నుల పండుగలాయ కడప రాయని తేరు
మిన్నునేల శృంగారము మితిమీరినట్లు
కాంతతో శ్రీవేంకటేశ కడప తేరెక్కి
యింత నన్ను గూడి వీధులేగితివి నీవు

అంటూ కప్పురపు నవ్వుల కడప రాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వేంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు అతీతంగా వేలమంది భక్తులు తేరును లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించి పరవశిస్తారు.





Wednesday, 27 September 2017

పంచముఖేశ్వరాలయం









పరమాద్భుతం పంచముఖేశ్వరాలయం



పవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతో పాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్‌లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్‌ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా.

ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామి వారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు.

బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది.

నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామి వారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలు భక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చే వరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు.

మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం:
12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: 
కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక:
8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది.

అదే విధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకేవస్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌



Sunday, 20 August 2017

హంపి

హంపి బాలకృష్ణాలయం అద్భుత శిల్పచాతుర్యం
హంపి పేరు వినగానే మనకు విరూపాక్షాలయమే గుర్తొస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షాలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని అలనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీతి.

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. 15వ శతాబ్దానికి చెందిన సువిశాలమైన, సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ, చారిత్రక సంపదగా యూనెస్కో గుర్తించింది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం అంతరాళం, గర్భగృహం, అర్ధమంటపం లేదా ప్రదక్షిణ మంటపం, ముక్తిమంటపం లేదా రంగమంటపం అని నాలుగైదు విభాగాలుగా ఉంటుంది. ఆలయానికి తూర్పుదిశగా ఉన్న మంటపానికే  రంగమంటపమని పేరు. అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణదిక్కుగా అందమైన అరటి తోట. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను.

అయితే, ఆ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడకంలో లేదు. పశ్చిమానికి వెళితే దీర్ఘచతురస్రాకారపు భవంతి. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యపు గాదె, దానిని ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన చిత్రాన్ని చూడవచ్చు.

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయమర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. అంతరాలయం పై కప్పుపైన సింహతలాటాలు, వాద్యగాళ్ల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రం చేయగా, ఇప్పుడది చెన్నైలోని నేషనల్‌ మ్యూజియంలో ఉంది. కృష్ణుడి విగ్రహం లేదు కదా, ఇంకేముందక్కడ చూడటానికి? అనే సందేహం రావచ్చు... అయితే, ఆలయంలోని శిల్పసంపదను, ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే. ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుమూ వసూలు చేయరు. అంతేకాదు, ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. మనల్ని ఎవరూ అభ్యంతర  పెట్టరు.

ఎలా వెళ్లాలంటే..?
బెంగళూరు నుంచి హోస్పేటకు ఆర్టీసీ బస్సులున్నాయి. రైళ్లున్నాయి. హోస్పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు
విరూపాక్ష దేవాలయం, విరూపాక్ష గుహలు, కడలేకలులో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం, శశిలేకలులో ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిదడుగుల గణేశుని విగ్రహం, హజార రామాలయం, పట్టాభిరామాలయం, కమల్‌ మహల్, హంపీబజార్‌... ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన వీధి ఇది. ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు, రంగురాళ్లు అమ్ముతున్నారు. అచ్యుతరాయాలయం: పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణ్వాంశ స్వరూపుడైన తిరువేంగళనాథుని విగ్రహాన్ని సందర్శించుకోవచ్చు. ఇంకా 900 ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది. గగన్‌ మహల్, ఆర్కియాలజికల్‌ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Saturday, 18 March 2017

చెన్నకేశవ ఆలయం






యుద్ధ విజయసూచికగా హోయసలలు నిర్మించిన ఆలయం

దేశంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. హోయసలలు ఈ ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర దాగివుంది. ఆనాడు ఓ యుద్ధంలో గెలిచిన విజయసూచికగా, చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఆలయ చరిత్ర :
11-12 శతాబ్ద కాలాల్లో హోయసలుల రాజవంశస్థులు వుండేవారు. హళేబీడు ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘బేలూరు’ పట్టణాన్ని తమ రాజధానిగా నియమించుకుని వారు పాలించేవారు. ఈ రెండు పట్టణాలు జంట-పట్టణాలుగా పేరుగాంచాయి. ఆనాడు వారు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానంగా బేలూరులో నిర్మించిన ఈ ‘చెన్నకేశవాలయం’ చూడదగింది. ఈ ఆలయాన్ని హొయసలుల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు.

క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులు, హోయసలుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలులవారు గెలిపొందారు. ఆ విజయ సూచికగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పుడు వారు చోళులపై ‘తాలకాడ్’ యుద్ద విజయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనుక మరో కథనం కూడా వుంది. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడనన్న వాదనలూ వున్నాయి.

ఆలయ విశేషాలు :
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంగా కేశవాలయం పరిగణించబడుతుంది. ఈ ఆలయం చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆ రాజవంశస్థులు ద్రావిడ శైలిలో ‘సబ్బురాతి’తో నిర్మించారు. ఈ ఆలయంపై వున్న శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. అలాగే దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.





Tuesday, 11 October 2016

ఎల్లోరా గుహలు





ఎల్లోరా గుహలు
నాటి సృజనకు సాక్షం ఎల్లోరా


శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఎల్లోరా గుహలు. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ఓ మచ్చు తునకగా వాటిని చెప్పుకోవచ్చు. కఠినమైన రాతిశిలల్లో దాగి ఉన్న కళాకృతుల అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే! మరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ఎల్లోరా గుహల విశేషాలను ఈ వారం జర్నీలో చూసొద్దాం పదండి!!

మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు పద్దెనిమిది మైళ్ల దూరంలో ఉన్నాయి ఎల్లోరా గుహలు. వాటిని సందర్శించడానికి మేము ఎక్కి ఉన్న ఆటోలు ఎల్లోరాలోని పదహారో గుహకు ఎదురుగా ఉన్న టాక్సీ స్టాండులో ఆగాయి. ప్రపంచవారసత్వ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు బౌద్ధ, జైన, బ్రాహ్మణీయ మతాల శిల్పకళాసృజనకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. మొత్తం 34 గుహలున్న ఎల్లోరాలో శిల్పకళను వీక్షేంచేందుకు రెండు కళ్ళూ చాలవు. ఈ గుహలన్నింటిలో బౌద్ధ గుహలు ప్రాచీనమైనవని, వీటిని క్రీస్తు శకం 500 నుంచి 700 మధ్య కాలంలో చెక్కారని అక్కడ భారత పురాతత్వ శాఖ ఫలకాల ద్వారా తెలుసుకున్నాం.

ఒక్కో గుహా ఒక్కోలా
ఎల్లోరాలోని అత్యంత పురాతనమైన నిర్మాణం ఒకటో గుహ. ఇది ఎనిమిది గదుల విహారం. ఇందులో విశాలమైన ప్రాంగణం ఉంది. రెండో గుహ పెద్ద చైత్యమందిరం. ఇందులో సింహాసనంపై కూర్చొన్న అతి పెద్ద బుద్ధవిగ్రహం, పద్మాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహాలు, అనేక మంది బోధిసత్వుల విగ్రహాలను ఆనాటి శిల్పులు రమణీయంగా మలిచారు. మూడో నెంబర్ గుహ ప్రాంగణం చివరిలో ప్రార్ధనామందిరం ఉంది. ఇక్కడ పద్మాసనంలోని బుద్ధుని పక్కనే నాగశిల్పాల విగ్రహాలున్నాయి. ఐదోనెంబరు గుహ విహారం, ఇందులో రెండు వైపులా ప్రత్యేకంగా గూళ్లు ఉన్నాయి. ఇది అతిధి గృహంగా గానీ, శిష్యులకు బోధనలు చేసే మందిరంగానైనా వాడేవారు. ప్రార్ధనామందిరంలో పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. ఆరో గుహ బౌద్ధ గుహ అయినప్పటికీ వీణాపాణి సరస్వతి విగ్రహంతో పాటు వివిధ బౌద్ధ జాతక కథల శిల్పాలున్నాయి. పదో గుహ సక్రమంగా తీర్చి దిద్దిన బౌద్ధచైత్యమందిరం. ముందు భాగాన్ని ఎక్కువగా నగిషీలు చెక్కి అలంకరించారు లోపలి భాగాన పైన చుట్టూ గ్యాలరీలుగల ఆర్చ్లు ఉన్నాయి. పై కప్పునకు వివిధ ఆకృతులతో నగిషీలు చెక్కారు. ఆనాటి కర్రపనితనాన్నే శిల్పాకృతుల్లోకి తీసుకొచ్చినట్లు కన్పిస్తోంది. స్తంభాలపైన మానవాకృతులను చెక్కారు.

మూడు అంతస్థుల 'తీన్థల్'
పదకొండో గుహ మూడంతస్థుల్లో నిర్మించిన ఒక కట్టడంలా ఉంది. ప్రతి అంతస్థులోనూ వసారాలున్నాయి. వివిధ రకాల బుద్ధుని శిల్పాలతో గేలరీలను నిర్మించారు. తొలి ఎల్లోరా శిల్పకళకి ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. పన్నెండో గుహ మరింత పెద్దది. ఇది కూడా మూడు అంతస్థుల్లో నిర్మితమై ఉంది. దీనిని ఇక్కడ 'తీన్థల్'గా పిలుస్తారు. దీనిలో ప్రతి అంతస్థులోనూ గేలరీలున్నాయి. ఆలయంలోపల అతి పెద్దదైన బుద్ధుని విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో బుద్ధుని రెండు చేతులూ జోడించి ఉంటాయి. ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా మనకు కన్పించదు. తీవ్రధ్యానంలో ఉన్నట్లుగా శిల్పులు అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. బ్రహ్మణమత గుహలు క్రీస్తుశకం 7-9 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కారని అక్కడున్న సూచికలు తెలియజేస్తున్నాయి. అంతవరకూ మేము చూసిన బౌద్ధ గుహల్లో ఉన్న చైత్యమందిరాలు, విహారాలకూ ఇక్కడి గుహలకూ ఏమాత్రం పోలికేలేదు. బౌద్ధకళలాగే ఈ చెక్కడాలు మత సంబంధమైనవే అయినప్పటికీ వాటి వ్యక్తీకరణ మరో రూపంలో ఉంది.

సమష్టి శ్రమకు నిదర్శనం
ఎల్లోరా గుహాలయాల్లో అత్యంత ఉత్కృష్టమైనది పదహారో నెంబరు గుహ. ప్రపంచంలోనే అద్భుతమైన ఏకశిలా నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. మానవ మహామేధస్సుకు, కళాసృజనకూ నిలువెత్తునిదర్శనంలా కన్పిస్తోంది. ఒక కొండలోని సుమారు 30లక్షల ఘనపుటడుగుల రాతిని పూర్తిగా చెక్కి, శిల్పాలను రూపొందించారు. వందలమంది నిర్మాణ నిపుణులు, శిల్పుల సమష్టి శ్రమతో ఈ మహాద్భుతాన్ని సృష్టించారు. ఈ గుహాలయ నిర్మాణానికి మొదటగా, కొండ శిఖరాగ్రం నుంచి ప్రారంభించి, ఒక దీర్ఘచతురస్రాకారపు అగడ్తను రాతి లోతుల్లోకి తవ్వి ఉంటారని స్పష్టమవుతోంది. సుమారు ముప్పైలక్షల ఘనపుటడుగుల రాతిని చెక్కి 107 అడుగుల లోతు, 154 అడుగుల వెడల్పు, 276 అడుగుల వైశాల్యంతో ముందుగా తవ్వి, ఆతర్వాత మధ్యలో మిగిలిన రాతిని దశాబ్దాలపాటు చెక్కి ఉంటారు. గోడలపైనా అపారమైన నగిషీలను చెక్కి, వాటికి అద్భుత నిర్మాణాన్ని జోడించారు. ఇందులో ఒక విశాలమైన ప్రాంగణం, మూడు భవంతులు, వాటిని అను సంధానించే విధంగా ఉపరితల వంతెనను ఏర్పాటు చేసారు. అంతేకాదు, సజీవ పరిమాణంలో ఉన్న ఏనుగుల విగ్రహాలను చూడొచ్చు. ఏనుగులే ఆలయభారాన్ని మోస్తున్నట్లుగా ఉన్న భంగిమలతో శిల్పులు చక్కగా తీర్చిదిద్దారు. గుహ పైకప్పు మూడు విభాగాలు గల పొరలతో సూది వంటి శిఖరాకృతిలో గోపురం ముందుకు పొడుచుకుని ఉండి, మొనదేలినట్లు కన్పిస్తోంది. పైన అర్ధగోళాకృతిలో నిర్మాణం జరిపారు. ఉత్తర ప్రాంగణంలో తొండంలేని ఒక పెద్ద ఏనుగు శిల్పాన్ని ఆనుకుని పెద్ద విజయస్తంభం ఉంది. ఇంకా పైకి వెళితే పన్నెండు ఫలకాలు గల గ్యాలరీ ఉంది. ఇందులో శివపురాణగాథల కల్పనలను శిల్పాలుగా మలిచారు. గోడకు దక్షిణంవైపునఉన్న గ్యాలరీ ఆనుకొని విష్ణువు విగ్రహాలు విభిన్న రూపాల్లో చెక్కారు. గుహకు అన్ని వైపులా రకర కాల శిల్పాలు భారతీయ శిల్పుల కళా ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఎదురుగా యాభై అడుగులు ఎత్తుకలిగి ముఖ్య కట్టడానికి సమాంతరంగా ఉన్న మందిరం ఒకటి ఉంది. ఇరవై చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ మందిరంలో నంది విగ్రహానికి ఇరువైపులా ఒక రాయి, స్తంభం ఉన్నాయి. ఈ ధ్వజస్తంభం సుమారు యాభై అడుగులకు పైగా పొడవుంటుంది. దీనిమీద సూక్ష్మశైలిలో ఎన్నో శిల్పాలను చెక్కి ఉన్నారు. మతాభిప్రాయాలను పక్కనపెడితే ఈ గుహాలయం మాత్రం భారతీయ శిల్పకళకు ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. 25వ గుహ అంతర్భాగంలో ఏడుగుర్రాల రథంపై నిలబడి ఉన్న పెద్ద సూర్యుని విగ్రహం ఉంది.

జైన మత స్మృతులు..
జైన మతానికి సంబంధించిన 30 నుంచి 34వ నంబరు వరకూ ఉన్న గుహల్లో ముఖ్యమైనవి 32, 34 నెంబర్ల గుహలే. 30వ గుహలోని స్తంభాలు, పైకప్పులనూ పద్మాకారపు నగిషీలతో చెక్కారు. వర్ధమాన మహావీరుని విగ్రహం, దాని చుట్టూ చాలా మంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి. 31వ నెంబరు గుహలో కూడా మహావీరుని విగ్రహం, తీర్థంకరుల విగ్రహాలున్నాయి. 32వ గుహను 'ఇంద్రసభ' అంటారని పక్కనే ఉన్న ఫలకంపై రాసారు. దీని ముఖద్వారం వద్ద సుమారు 30 అడుగుల ఎత్తైన ఏనుగు విగ్రహం ఉంది. దానికి సమీపంలోనే అందంగా అలంకరించినట్లు చెక్కిన ప్రార్ధనాలయం ఒకటుంది.. చివరిదైన 34 వ గుహలో ఉన్న విగ్రహాలన్నీ సేవకబృం దాలతో ఉన్న జైన తీర్ధంకరులవే. గోడల్లోనూ స్తంభాలపైనా జైన తీర్ధంకరుల విగ్రహాలను విరివిగా చెక్కారు. ఎల్లోరా సంద ర్శనలో అక్కడక్కడా గైడ్ అవసరమైన చోట గైడ్ హిందీలో చెప్పే విషయాలను మాతో వచ్చిన లియాఖత్ఆలీ తెలుగులోకి అనువదించి మాకు భాషా సమస్యరాకుండా చూసారు.

ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి  మన్‌మాడ్‌కు వెళ్లే రైలుమార్గంలోనే ఔరంగాబాద్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలున్నాయి. వీటిని చేరుకోవడానికి విరివిగా బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఔరంగాబాద్‌లో అందుబాటు ధరల్లోనే హోటళ్లు లభిస్తాయి.
- బెందాళం క్రిష్ణారావు




Saturday, 10 September 2016

లేపాక్షి





నిర్మాణ కౌశలానికి సాక్షి లేపాక్షి

రాచరిక ఠీవి అక్కడి శిల్పసౌందర్యంలో కనిపిస్తుంది. ఆ రాతిశిల్పాల మాటున చారిత్రక విశేషాలెన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి, శిల్పకళా నైపుణ్యానికి, చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి పర్యాటక ప్రదేశం. మరి అలనాటి అద్భుత రాతికట్టడాల విశేషాలను చూసొద్దాం పదండి! సరదాగా పిల్లలను తీసుకుని లేపాక్షి వెళదామని నిర్ణయించుకున్నాం. 'లేపాక్షే ఎందుకు? అక్కడ ఏంటి స్పెషల్?' అంటూ మా వాళ్లంతా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మాకు కాస్త ఎక్కువేలేండి! అందుకే ఈ చారిత్రక ప్రదేశాన్ని మా విహారానికి ఎంచుకున్నాం. ఎక్కువమందిమి కావడంతో ఓ సుమో మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రికే బయల్దేరాం. సుమో అంతా ఒక్కటే సందడి. రాత్రి 12 గంటల వరకు పాటలు, జోక్స్ నవ్వులతో సరదాగా గడిచిపోయింది. అలా పాటలు పాడుతూనే నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారే సరికి అక్కడికి చేరుకున్నాం. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి ఫ్రెష్సప్ అయ్యి, టిఫిన్లు పూర్తి చేశాం. పురాతన విశేషాలను ఔపోశన పట్టిన మా గురవయ్య తాతను అక్కడి నుంచి మాతో పాటే తీసుకెళ్ళాం.

అనంతపురం జిల్లా హిందూపూరుకి తూర్పుగా 14 కి.మీ. దూరంలోనూ, బెంగళూరు - అనంతపురం జాతీయ రహదారిపై గల కొడికండ అడ్డరోడ్డుకు 6 కి.మీల దూరంలోనూ ఉంది లేపాక్షి గ్రామం. క్రీ.శ. 15వ శతాబ్ది చివర ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కొలువులో పెనుకొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ పూర్తి గావించాడని గురవయ్య తాత చక్కగా వివరించారు. మొదటగా మేము లేపాక్షి బసవన్నను చూశాం.

లేపాక్షి బసవన్న

భారతదేశ మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ముందు భాగాన, మెడ కింద ఉన్న గొలుసుకు ఏనుగుకు ఎత్తి పట్టుకున్న రెండు తలల గండబేరుండం, కీర్తి ముఖం, ముత్యాల సరాలు, శిల్పులు సందర్శకులకు ముచ్చటగొలిపేలా ఉంటాయి. ఈ శిల్పం, అలనాటి విజయనగర కాలంలో వ్యవసాయానికి, అందుకు అవసరమైన పశుగణానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో అని తాతయ్య చెప్పుకొచ్చారు. తర్వాత మేమంతా లేపాక్షి ఆలయానికి వెళ్ళాం.

వర్ణ చిత్రాలు 

లేపాక్షి అనగానే గుర్తుకొచ్చేది రెండు విషయాలు. ఒకటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంటిరాతి ఎద్దు శిల్పం, రెండు మధ్యయుగ దక్షిణ భారత చిత్రకళా ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వర్ణచిత్రాలు. అక్కడ ఉన్న దేవాలయాల మండపాల కప్పుల కింద, నిలువెత్తు ప్రమాణంలో ఉన్న అనేక వర్ణ చిత్రాలున్నాయి. వర్ణ చిత్రాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కన్నులపండగనే చెప్పాలి. అక్కడి శిల్పసౌందర్యాన్ని పరిశీలిస్తే, చిత్రకారుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని, అంకితభావాన్ని తెలియజేస్తునట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రాకారం చుట్టుగల మండపం కప్పు కింద రామాయణంలోని ప్రధాన ఘట్టాలు, నాట్యమండపం తూర్పువైపు కప్పు కింద మహాభారత దృశ్యాలు చేయి తిరిగిన, చిత్రకారుల పనితనానికి గీటురాళ్లుగా ఉన్నాయి. ఇదే వరుసలో వటపత్రసాయి, వర్ణ చిత్ర మండపం విశేషం. మనం ఎక్కడ నుంచి చూసిన వటపత్రశాయి మమ్మల్నే చూస్తున్నట్లు మా అందరికీ అనిపించింది. కల్యాణ మండపం తూర్పు వైపున ద్రౌపది స్వయంవరం తరువాత, లేపాక్షి ఆలయ నిర్మాత, విరుపణ్ణ, అతని సోదరులు వీరన్న, కుటుంబ సభ్యులు, వ్యక్తుల చిత్రణకు చిత్రకారులు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. శయణాగారంలోనున్న అర్ధనారీశ్వర శివుని వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడింది. ప్రధానాలయ మహామండపం కప్పుకింద 13 అడుగుల నిడివి ఉన్న వీరభద్రుని వర్ణచిత్రం ఇప్పటివరకూ వెలుగుచూసిన వీరభద్ర వర్ణచిత్రాల్లో అతిపెద్దదని మా తాతయ్య చెప్పారు. లేపాక్షిలో దాదాపు 20 వరకూ శాసనాలున్నాయి. శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట విరుపణ్ణ తండ్రి పేరు లేపాక్షి నంది లక్కుశెట్టి అని తెలిసింది. లేపాక్షి గ్రామం పేరు లేపాక్షి, లేపక్ష, లేపక్షపుర, వీరేశ్వరపురం అని పిలిచేవారట!. ఈ గ్రామం పెనుగొండ రాజ్యం, రొట్టనాడు విషయంలో ఉందనీ శాసనాలను బట్టి తెలుస్తోంది. విరుపణ్ణ అక్కడ దేవాలయ నిర్మాణం చేపట్టక ముందు నుంచే లేపాక్షి గ్రామం ఉందని తెలుస్తోంది. అప్పటికే పాపనాశేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందట!. ఇక్కడ పాపనాశేశ్వరాలయం, వీరభద్రాలయం, రఘునాథాలయం, ఆంజనేయుడిగుడి, ఇటుకరాతి గుడి, నాగలింగం, గణేశ మండపం, యాగమండపం, సోమవార మండపం మొదలైనవి ఉన్నాయి.

వేలాడే స్తంభం 

ఈ పేరు విన్న వెంటనే అందరం వేలాడే స్తంభమా ఎలా ఉంటుంది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాం. లేపాక్షి దేవాలయాన్ని చూసిన వారికి స్థానిక టూరిస్ట్ గైడ్, 'ఇంతవరకూ మీరు చూసింది ఒక ఎత్తయిన, వేలాడే స్తంభాన్ని చూడటం మరో ఎత్తు' అని ఆసక్తిని రేకెత్తించాడు. ఇది ఈశాన్య భాగంలో ఉంది. ఆ స్తంభం అడుగుభాగాన 90 శాతం ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నుంచి ఒక బట్టముక్కను, కాగితాన్ని దూర్చి ఈ వైపు నుండి ఆ వైపుకు లాగాం. ఇదొక వింతలా అనిపించింది. నిజానికి, ఎంతో బరువైన ఆ స్తంభం, దానిమీద పడేకప్పు, దూలాల బరువును లెక్కలోనికి తీసుకొంటే ఆ స్తంభం వేలాడుతుందని చెప్పలేం. స్తంభం నిలబెట్టిన నేలపరుపురాయి, కొంచెం కుంగటం వల్ల, స్తంభం అడుగుభాగం ఒక మూల మాత్రం రాతినేలకు మధ్య ఖాళీ ఏర్పడిందని అనిపిస్తుంది. అన్నీ చూసేటప్పటికి చీకటి పడింది. అప్పటికి అందరం బాగా అలసిపోయాం. ఇంటికి తిరుగుముఖం పట్టాం.

శిల్ప సౌందర్యం 

లేపాక్షి ఆలయ గోడలు, స్థంబాలపైన రాతిశిల్పాలు అపురూపంగా తీర్చదిద్దబడ్డాయి. ఆలయాల్లో ప్రతిష్టించిన మూలమూర్తులనే కాక, అధిష్టానం, పాదవర్గం, స్తంభాలు, బోదెలు, ద్వార బంధాలు, దూలాలు, కప్పులపైన చివరకు ధ్వజస్తంభ, బలి పీఠాలపైనా అందమైన శిల్పాలనెన్నింటినో చెక్కారు. అక్కడి శిల్పాలలో నర్తకిలు, సంగీత కళాకారులు, వివిధ రకాల వృత్తిదారులు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఇలా చెప్పుకుంటూపోతే మొత్తం జనజీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని ఉన్నదున్నట్లుగా మలిచారు. శిల్పులు కల్పనా చాతుర్యానికి అద్దంపడుతున్న చంద్రకాంత, మంచకట్టు, మాళి, అశ్వపాద స్తంభాలపై లతలు, లతాంగులు మమ్మల్ని కట్టిపడేశాయంటే నమ్మండి! అక్కడి కళ్యాణ మండపం నాట్య మండపాల స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలు, అప్పటి శిల్పుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. లేపాక్షి శిల్పాన్ని శైవ, వైష్ణవ శిల్పాలుగా విభాజించారట. అలాగే, ఇక్కడ మనిషితో పాటు సహజీవనం సాగించిన పిట్టలు, జంతువులను కూడా రకరకాల భంగిమల్లో చెక్కారు. ఎలుక నుంచి ఏనుగు వరకు, చిలుక నుండి డేగ వరకు లేపాక్షి దేవాలయ శిల్పంలో చూడవచ్చు. జంతువుల్లో ఎలుక, పిల్లి, ఎలుగుబంటి, గుర్రం, సింహం, పులి, దున్న, ఆవు, ఎద్దు, కోతి, జింక, దుప్పి, ఏనుగు ఉండగా, పిట్టలో చిలుక, గుడ్లగూబ, కాకి, హంస, బాతు మొదలైన శిల్పాలున్నాయి. అలా అవన్నీ చూసేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక మండపంలో కూర్చుని భోజనాలు చేశాం. కొంతసేపు మా పిల్లలు ఆటలాడుకున్నారు.

ఎలా చేరుకోవాలి
బస్సురూట్ :
* లేపాక్షికి కొడికొండ చెక్‌పోస్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, అనంతపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు విరివిగా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. లేపాక్షి, హిందూపురంలో బస చేయవచ్చు.
విజయవాడ నుంచి గుంటూరు, నరసరావుపేట, నంధ్యాల, అనంతపురం, తాడిపత్రి, పెనుగొండ మీదుగా హిందూపురం చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా ఆటోలో 14 కి.మీ దూరంలోనే లేపాక్షికి చేరుకోవచ్చు.
రైలు మార్గం :
లేపాక్షికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో హిందూపురం రైల్వే జంక్షన్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, అనంతపురం, బెంగళూరు నుంచి హిందూపురానికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి.

నూకరాజు స్వర్ణలత



లేపాక్షి
గుండె మెచ్చే గండ శిలలు

లే.. పక్షిలో..
ఒక పక్షి ఉంది.
దాని త్యాగం ఉంది.


లేపాక్షిలో రెండు కన్నులున్నాయ్‌!
అవి కన్న కలలున్నాయ్‌!
ఈ రెండింటి కలబోత.. మరెన్నో కళల పూత.. లేపాక్షి.


తెలుగు రాష్ట్రాల్లో అపురూప శిల్ప సంపదతో అలరారుతోన్న క్షేత్రాలలో లేపాక్షి ప్రముఖమైనది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆద్భుత పర్యాటక కేంద్రంలో మార్చి 31 నుంచి రెండు రోజుల పాటు ‘లేపాక్షి ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారా.. అయితే లేపాక్షికి వెళ్లిపోదాం.


ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. నీలిరంగు అట్ట ఉన్న నోట్‌ పుస్తకాలు ఉండేవి. అదేనండి ‘లేపాక్షి నంది’ నోట్‌ పుస్తకాలు. ఆ ఆట్ట మీద వేలడంత సైజులో ఓ నంది చిత్రం ఉండేది. గుర్తొచ్చిందా. అట్టమీద అంగుళం పరిమాణంలో మురిపించిన నంది.. లేపాక్షిలో ఆకాశమంత కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది. 15 అడుగుల ఎత్తు.. 25 అడుగుల పొడవుతో.. మువ్వల పట్టీలతో.. మెడలో గంటలతో.. నిన్నో.. మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది. ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావొస్తోంది. అప్పుడే ఆశ్చర్యపోకండి. అంతకుమించిన విషయాలు.. విశేషాలు.. మరెన్నో ఉన్నాయి లేపాక్షిలో.

వీరభద్రుడి కోసం..
లేపాక్షి విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అచ్యుతరాయల పాలనా కాలంలో పెనుగొండ సంస్థానంలో విరూపణ్ణ కోశాధికారి. ఆయన వీరభద్రుడి వీరభక్తుడు. లేపాక్షిలోని కూర్మగిరిపై వీరభద్రుడికి ఆలయం కట్టించాలని భావించాడు. కోశాగారంలోని ధనం వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టాడు. రాయల వైభవానికి తులతూగే విధంగా.. ఏడు ప్రాకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభువుల అనుమతి లేకుండా ప్రజాధనంతో విరూపణ్ణ ఆలయం కట్టిస్తున్నాడని అచ్యుతరాయలుకు ఫిర్యాదు చేశారు గిట్టనివారు. ఆగ్రహించిన రాజు.. విరూపణ్ణుడి కనుగుడ్లు పెకిలించాల్సిందిగా ఆజ్ఞాపించాడట. ఆ విషయం తెలుసుకున్న విరూపణ్ణ తనకు తానుగా కను గుడ్లు పెకిలించి విసిరేశాడని గాథ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే.. లేపాక్షి ఆలయంలో ఓ రాతిగోడపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆలయంలోని కల్యాణ మంటపం అసంపూర్తిగా మిగిలిపోవడం వెనుక కారణం కూడా ఇదేనని చెబుతారు.

మిగిలినవి మూడే..
లేపాక్షి ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించారు. కాలక్రమంలో నాలుగు ప్రాకారాలు శిథిలమై.. మూడు మాత్రమే మిగిలాయి. వీరభద్రుడి ఆలయం, ఉప ఆలయాలు, నాట్య మంటపం, కల్యాణ మంటపం అన్ని నిర్మాణాలూ ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. 246 స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు. కల్యాణ మంటపంలో పక్కనున్న లతా మంటపంలో 36 స్తంభాలపై 144 రకాల ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ డిజైన్లను ధర్మవరం చేనేతలో వాడటం విశేషం.




అచ్చెరువు.. చిత్తరువు..
లేపాక్షి ఆలయంలో అబ్బురపరిచే మరో విషయం తైలవర్ణ చిత్రాలు. తమ నైపుణ్యంతో ఎన్నో విశేషాలను శిలలపై పొదిగిన శిల్పకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. అద్భుతమైన చిత్రాలతో పురాణేతిహాసాలను కళ్లముందుంచారు చిత్రకారులు. ప్రకృతి సిద్ధమైన రంగులతో వీటిని తీర్చిదిద్దారు. శతాబ్దాలు దాటినా ఆ చిత్రాల్లోని వన్నె తగ్గలేదు. ప్రధాన ఆలయం గర్భగుడి పైకప్పుపై 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గీసిన వీరభద్రుడి చిత్రాన్ని చూశాక ఎలా చిత్రించారా అనిపిస్తుంది. నాట్య మంటపంలో ఎటువైపు నుంచి చూసినా మనవైపే చూసేలా ఉండే శ్రీకృష్ణుని చిత్తరువును చూసి అచ్చెరువొందాల్సిందే. రామయాణ, మహాభారత ఘట్టాలను తెలిపే చిత్రాలు కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల పరిణయం, శివతాండవం వంటి చిత్రాలు.. లేపాక్షికి వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. ఎన్నో అద్భుతాలకు నెలవైన లేపాక్షికి వారాంతాల్లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వందల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడి శిల్పాలను తరచి తరచి చూస్తారు. చిత్రాలను కోరి కోరి వీడియోలు తీస్తుంటారు. ఈ పర్యాటక ప్రాంత సందర్శన మరింత మధురానుభూతిగా మిగిలిపోవాలంటే.. ‘లేపాక్షి ఉత్సవాల’ కన్నా మంచి తరుణం ఏముంటుంది. సంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు.. ఇన్నిటి మధ్య లేపాక్షి విహారం భలేగా సాగిపోతుంది.
భళా నర్తనశాల

70 స్తంభాలతో నిర్మించిన నాట్య మంటపం మధ్యలో 12 స్తంభాలు ప్రత్యేకమైనవి. మధ్యనున్న స్తంభంపై రంభ నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు. బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టుగా, తుంబురుడు వీణను మీటుతున్నట్లుగా, భృంగీశ్వరుడు రంభకు నాట్యం నేర్పుతున్నట్టుగా, దత్తాత్రేయుడు, నటరాజు, శివుడు, పార్వతి తదితర దేవతలు నాట్యాన్ని చూస్తున్నట్టుగా స్తంభాలపై శిల్పాలు మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. మంటపం పైకప్పులో చెక్కిన శతపత్ర (వందరేకుల) పద్మం మరో ఆకర్షణ.
మూలాధారం ఇదే!

లేపాక్షికి వెళ్లే పర్యాటకులు నంది విగ్రహాన్ని చూశాక... వెంటనే ఓ స్తంభం చుట్టూ మూగిపోతారు. నాట్య మంటపం ఈశాన్య దిశలో ఉంటుంది. పైకప్పు ఆధారంగా భూమికి అర అంగుళం ఎత్తులో.. గాలిలో తేలాడుతున్నట్టు ఉంటుంది. యాత్రికులంతా కాగితాన్నో, దుస్తులనో స్తంభం కిందుగా పంపించి.. వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఈ స్తంభాన్ని నాట్య మంటపం మూలాధార స్తంభంగా చెబుతారు. 1902 ప్రాంతంలో.. బ్రిటిష్‌ ఇంజినీరు హ్యయిల్డన్‌ వేలాడే స్తంభాన్ని పరీక్షించాలని పక్కకు నెట్టించగా.. మంటపంలోని మిగిలిన స్తంభాలు కూడా పక్కకు జరిగాయట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట ఆ ఇంజినీరు. ఇప్పటికీ మంటపంలోని స్తంభాలు ఓ పక్కకు ఒరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఏడు పడగల నీడలో..
ఆలయ ప్రాకారాల మధ్యలో ఉన్న ఏడుతలల నాగేంద్రుడి విగ్రహం.. సెల్ఫీ జోన్‌గా మారిపోయింది. ఒక పెద్ద శిలను ఏడు తలల సర్పంగా చెక్కి.. పడగల నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లారట. అప్పటికి వారి తల్లి ఇంకా వంట చేస్తోందట. వంట పూర్తయ్యేలోపు శిల్పులంతా కలిసి.. భారీ శిలను నాగేంద్రుడిగా చెక్కేశారట.
రామాయణంలో..
లేపాక్షికి చారిత్రక గొప్పదనమే కాదు.. పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ తిరుగుతున్న రాముడికి ఈ ప్రాంతంలో రెక్కలు కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనిపించిందట. సీతమ్మను కాపాడేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ శ్రీరాముడు ‘లే.. పక్షి’ అన్నాడట. అదే నేడు లేపాక్షిగా రూపాంతరం చెందిందని అంటారు. లేపాక్షి ఆలయం సమీపంలోని పెద్ద రాతిగుండుపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జటాయువు పక్షి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది.







లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!

విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకూ శిల్పకళా చాతుర్యానికీ వాస్తు నైపుణ్యానికీ ప్రత్యక్ష నిదర్శనమే లేపాక్షి. ఆ శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం.



లే...పక్షీ!
అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో బెంగళూరుకు 122 కి.మీ దూరంలో ఉంది లేపాక్షి. ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఓ చిన్న పట్టణం. తాబేలు ఆకారంలో ఉన్న కూర్మ శైలమనే చిన్న కొండమీది ఆలయ సముదాయమే లేపాక్షి. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని పోతుండగా జటాయువు అడ్డగించిందట. రావణుడు దాని రెక్కలు నరికివేయడంతో అది ఇక్కడే పడి పోయింది. సీతను వెతుకుతూ వచ్చిన రాముడు జటాయువుని చూసి జాలితో ‘లే పక్షీ’ అని పిలిచాడట. అదే లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు.

అతి పెద్ద నంది విగ్రహం! 

లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.1 మీటర్ల (27 Feets) పొడవూ, 4.5 మీటర్ల (15 Feets)ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది. కాసుల పేరూ, చిరుమువ్వలూ, గంటలతో శోభాయమానంగా అలంకరించినట్లుగా చెక్కిన నంది విగ్రహాన్ని ఎంత చూసినా తనివితీరదు. మూపురం మీద శాలువా కప్పినట్లుగా చెక్కారు. నాటి విజయనగర శిల్పుల నేర్పరితనానికి ఆశ్చర్యపోవడం సందర్శకుల వంతవుతుంది. నందీశ్వరుని చెవులు రిక్కించి ఉన్నాయి. వీరభద్రాలయానికి వెనుకగా ఉన్న నాగలింగానికి అభిముఖంగా ఉంటుంది ఈ నంది. ఈ ఆలయం కేంద్రబిందువుగా చుట్టూ ఆలయాలు నిర్మించారు.


స్కంద పురాణంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి. ఉగ్రరూపంలో ఉన్న శివుడి ఝటాజూటం నుంచి పుట్టినవాడే వీరభద్రుడు. అగస్త్య మహామునే స్వయంగా వీరభద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఆయన తపస్సు చేసిన గుహ కూడా గర్భగుడికి పక్కనే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న గుడిని నిర్మించింది విరుపణ్ణ. అతని సోదరుడు వీరన్న నాయక్‌లు. 15-16 శతాబ్దాల మధ్యలో పెనుగొండ సంస్థానాన్ని పాలించిన విజయనగర రాజు అచ్యుతరాయని రాజ్యంలో విరుపణ్ణ కోశాధికారిగా ఉండేవాడు. ఓసారి కలలో వాళ్ల కులదైవం వీరభద్రస్వామి కనిపించి, నేను స్వయంభువుగా కూర్మశైలంపై అవతరించాను. అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. అంతట విరుపణ్ణ, రాజు అనుమతి లేకుండానే ఆలయనిర్మాణాన్ని ప్రారంభించాడట. దాంతో విరుపణ్ణ పేరుప్రఖ్యాతులు చూసి ఓర్వలేని కొందరు "కోశాగారంలోని నిధులన్నీ వీరభద్ర ఆలయ నిర్మాణానికి వెచ్చించాడు." అని రాజుకు చెప్పారట. అప్పటికే ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న రాజు కోపోద్రిక్తుడై విరుపణ్ణ కళ్లు పెరికి వేయమని ఆజ్ఞాపించాడట. విరుపణ్ణ తన కళ్లు తానే వూడపెరికి, గుడికి పడమటి దిక్కున ఉన్న గోడ పైకి వేసి కొట్టాడట. అక్కడ రాతిమీద ఉన్న రెండు గుంటలూ, ఎర్రని మరకలూ ఆ ఆనవాళ్లేనని చెబుతారు.

ఆలయ నిర్మాణం విజయనగర చక్రవర్తుల శిల్పశైలినే ప్రతిబింబిస్తూ మూడు విభాగాలుగా ఉంటుంది. ముందుగా కనిపించేది ముఖమండపం. దీన్నే నాట్య మండపం లేదా రంగ మండపంగా పిలుస్తారు. తరువాతది అర్ధమండపం. దానికి లోపలగా ఉండేది గర్భగుడి. అప్పట్లో విరుపణ్ణ ఏడు ప్రాకారాల్లో కట్టించిన ఈ ఆలయంలో ఇప్పుడు మూడు మిగిలి ఉన్నాయి. మెట్లెక్కి ముఖద్వారం దాటి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎత్త‌యిన‌ గోడల మీద ఆనాటి దాతల పేర్లూ శాసనాలూ కన్నడ భాషలో కన్పిస్తాయి. అక్కడి నుంచి ముఖ మండపంలోకి అడుగుపెడితే అక్కడి స్తంభాలన్నింటి మీదా దేవతల శిల్పాలు చెక్కి ఉన్నాయి. డెబ్భై స్తంభాలతో నిర్మించిన ఈ నాట్య లేదా ముఖ మండపం మధ్యలో ఉన్న 12 స్తంభాల మీదా నిలువెత్తు రూపంలో ఉన్న స్వర్గవాసుల విగ్రహాలను చూస్తుంటే ఇంద్రసభ కళ్ల ముందు కనిపిస్తుంది. చిత్రాలు చెక్కిన శిల్పుల ఊహాచాతుర్యానికీ పనితనానికీ జోహారులు అర్పిచాల్సిందే. మండపం మధ్యలో పైకప్పులో అద్భుతమైన శత పత్రకమలం చెక్కబడి ఉంది. అది దాటి అర్ధమండపంలోకి అడుగుపెడితే అక్కడ ఉన్న సీలింగు మీద 23 అడుగుల పొడవూ 13 అడుగుల వెడల్పుతో చిత్రించిన చిత్రం ఆసియాలోకెల్లా అతిపెద్దదిగా చెబుతారు. ఇందులో యోగదక్షిణామూర్తి, చండేశ్‌ అనుగ్రహమూర్తి, భిక్షాటన, హరిహర, అర్ధనారీశ్వర, కళ్యాణసుందర, త్రిపురాంతక, నటరాజ, గౌరీప్రసాదక, లింగోద్భవ.. ఇలా మొత్తం శివుడి పద్నాలుగు అవతారాలనూ అక్కడ చిత్రించడం విశేషం. ఇవన్నీ దాటి గర్భగుడిలో అడుగుపెడితే వీరభద్రస్వామి నిత్యపూజలు అందుకుంటూ దర్శనమిస్తాడు. గర్భగుడిలో ఈశాన్యంలో వాస్తుపురుషుడు, ఆగ్నేయదిశలో ఉన్న స్తంభంలో గజాసుర సంహారం, నైరుతిలో నాట్యగణపతి, వాయువ్యంలో దుర్గాదేవి శిల్పాలు ఉన్నాయి. గర్భగుడికి ముందు తూర్పువైపు పాపనాధీశ్వరుడు, పడమటివైపు రఘునాథస్వామి ఆలయాలు ఉన్నాయి. శైవులూ, వైష్ణవులూ మా దేవుడే గొప్ప అని కొట్లాడుకునే రోజుల్లో శివకేశవులు ఎదురెదురుగా ఉండటమూ, శివుడు కాకుండా వీరభద్రుడు మూలవిరాట్టుగా ఉండటమూ లేపాక్షి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మండపంలోని స్తంభాలమీద సైతం శివకేశవుల రూపాలు పక్కపక్కనే చెక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఓ స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్యపూజలు నిర్వహించడం మరో విశేషం.

గాల్లో స్తంభం! 

గర్భగుడి పైకప్పుమీద వీరభద్రస్వామి వర్ణచిత్రం కనువిందు చేస్తుంది. విరుపణ్ణ భార్య పుత్రుల‌తో సేవ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వర్ణచిత్రం మనదేశంలోకెల్లా పెద్దదట. ఈశాన్యమూలలో ఉన్న అంతరిక్ష స్తంభం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.


లేపాక్షి విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకు ప్రసిద్ధి. చెట్ల లేపనాలతోనూ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులతోనూ పైకప్పుమీద వేసిన చిత్రాలు పర్యాటకులను ఆకట్టుకొంటాయి. గర్భగుడి ప్రాకారంలో తూర్పువైపుకి రాగానే ఆరు అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం మనల్ని ఆకర్షిస్తుంటుంది. పక్కనే బండమీద శివలింగానికి సాలెపురుగు, సర్పం, ఏనుగు, భక్తకన్నప్ప పూజ చేస్తున్న దృశ్యం కన్పిస్తుంది. సమీపంలోనే ఏడు పడగలతో మూడు చుట్టుల మధ్యన శివలింగంతో ఉన్న నాగ లింగాన్ని చూడగానే ఎంతటివారైనా గగుర్పాటుకు లోనవుతారు. నాగలింగానికి ఎదురుగా ఓ వంటశాల ఉంది. ఓ రోజు ప్రధాన శిల్పుల తల్లి వంట చేయడం ఆలస్యమైందట. అది పూర్తయ్యేలోగా సమయం వృథా కాకుండా శిల్పులు నాగలింగాన్ని మలిచారట. అది చూసి ఆమె ఆశ్చర్యపోగా ఆమె దృష్టి తగిలి ఆ విగ్రహానికి చీలిక ఏర్పడిందని చెబుతారు.

ఇదే ప్రాకారంలో అసంపూర్తిగా నిలిచిన కళ్యాణమండపం ఉంది. పార్వతీ కళ్యాణానికి స్వర్గవాసులంతా కదిలి వచ్చినట్లుగా ఇక్కడ శిల్పాలను చెక్కారు. ఐదు తలలూ పది చేతులతో సదాశివుని అవతారంలో పరమేశ్వరుడు అతిథులను స్వాగతించడం కనిపిస్తుంది. రెండు కోతులు నాలుగుగానూ, ఒకే శరీరం మూడు తలలతో చెక్కిన ఆవు బొమ్మ మూడు ఆవులుగానూ కనిపించే శిల్పాలన్నీ లేపాక్షికే తలమానికం. పక్కనే ఉన్న లతామండపంలో సుమారు 136 లతల డిజైన్లు కనిపిస్తాయి. లేపాక్షి ప్రింట్లకు అవే స్ఫూర్తి. ముఖ్యంగా చీరల అంచుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కళ్యాణ మండపానికి కొద్దిదూరంలో నేలమీద చెక్కిన పెద్ద పళ్లాలు ఉన్నాయి. ఆనాటి శిల్పులు వాటిలోనే భోజనం చేసేవారని కొందరూ, కాదు రంగులు కలుపుకునేవారని మరికొందరూ అంటారు. 


దగ్గర్లోనే సీతమ్మ వారి కుడిపాదం ఉంటుంది. ఆ కాలిబొటన వేలి నుంచి అన్ని కాలాల్లోనూ నీరు రావడం విచిత్రం.


ఎలా వెళ్లాలి 

హైదరాబాద్‌ నుంచి హిందూపురానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. హిందూపురం నుంచి లేపాక్షి 14 కి.మీ. దూరంలో ఉంది.
విమానం ద్వారా వెళ్లాలనుకునేవారు బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి 122 కి.మీ దూరంలో ఉన్న లేపాక్షి చేరుకోవచ్చు.





Saturday, 3 September 2016

తంజావూరు - బృహధీశ్వరాలయం A









దివ్యమైన శిల్పాలు
తంజావూరు అందాలు


తంజావూరు చూడాలని చాలా రోజుల నుంచి మేము అనుకొంటున్నాం. చివరకు మా కల ఫలించి తంజావూరును దర్శించడం జరిగింది. ఆ ఊరు చాలా మాములుగా ఉంది. రైలు దిగినపుడు ఈ ఊరిలో బృహధీశ్వరాలయం ఉందా? అన్న సందేహం కలిగింది. ఆ ఆలయంలోని శివుడు పేరుకు తగ్గట్టే ఉంటాడా లేడా అన్న అనుమానమూ పీడించింది. ఎందుకంటే నేను చాలారోజుల నుంచి ఈ గుడి గురించి అక్కడక్కడా వింటూన్నందువల్ల ఈ ఊరిలో దిగగానే గుడి చూడాలన్న ఆత్రం పెరిగిపోయింది. అందుకే చాలా త్వరగా గుడికివెళ్లాం. ఆహా! గుడి గోపురాన్ని చూడగానే నాలో మాటలు ఆగిపోయాయి. ఒక పెద్ద రాజకోటలాగా ఆ మందిరం కనపడి ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. అంత ఎత్తున ఉన్న ఆ గోపురంపై అనేకానేక రకాల శిల్పాలతో కనులకు విందునిస్తున్నాయి. చూసే కొద్దీ చూడాలనే అనిపిస్తుంది. అక్కడి వారిని ఆ గుడి గూర్చి వాకబు చేసాను.

శిల్ప సౌందర్యం గూర్చి వారు ఇలా అంటారు - ఈ గోపురం పై ఉన్న శిల్పాలను శిల్పులు చెక్కడానికి పొద్దున పూనుకొనేవారు. వారు పొద్దుట నుంచి సాయంత్రం దాకా చెక్కి మిగతా పని రేపు పూర్తి చేసుకొందాం అనుకొని వారిళ్లకు వెళ్లేవారట. కాని తెల్లవారి వారు పనికి వచ్చి చూసే సరికి నిన్న మొదలుపెట్టిన శిల్పం పూర్తి అయి ఉండేదట. ఇలా ఎలా జరిగేదంటే అంతా భగవచ్చిత్రం. దేవశిల్పులు వచ్చి ఈ పనిని పూర్తి చేసి వెళ్లేవారు. మానవ మాత్రులు ఎవరైనా ఇంతచక్కటి పనితనాన్ని చూపుతారా అని వారు అన్నారు. నిజమే! ఇంతటి శిల్ప సౌందర్యావిష్కరణ చేసినవారు నిజంగా దివ్యులే అయి ఉంటారు. ఏ మనిషిలోనైనా దైవత్వాన్ని చూడమని చెప్పే మన పురాణ గాధలు నాకు గుర్తుకువచ్చాయి. ఆ శిల్పులకు నేను చేతులెత్తి నమస్కరించాను.

ఇక ఆ కోవెలలోని దైవం ఇంక ఎంత గొప్పగా ఉన్నాడో అని ఆలోచిస్తూ వెళ్లాను. అంతే మహాదేవుడు, మహాశివుడు, పరమేశ్వరుడు, దేవదేవ దేవుడు ఎంతో ఎత్తుగా, ఎత్తుకు తగ్గ వెడల్పున పార్వతీపతి లింగరూపాన ప్రతిష్టించబడి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని లింగం చూడగానే అలౌకికానందం కలిగింది. ఆది అంతాలకు కారణమైన ఈశ్వరుడు సాకారుడయ్యాడా అన్న సందేహాన్ని కలిగించేలా నిలువెత్తు లింగం గర్భగుడిలో కొలువై చిన్మయానందాన్ని కలిగిస్తోంది. నాకు తెలీయకుండానే చేతులు పైకి లేచి ఆ లింగమయ్యకు నమస్కరించాయి. అంత ఎత్తున శివలింగం ఉండడం ఆ తంజావూరుకే కాదు శివభక్తులందరికీ ఆనందం కలిగించే విషయం అనిపించింది. శివభక్తులే కాదు ప్రతి ఒక్కరూ ఆ తంజావూరిలోని శివాలయాన్ని చూసి తీరాల్సిందే. అక్కడి శిల్ప సౌందర్యాన్ని వీక్షించాల్సిందే అనిపించింది.
- యం. కామేశ్వరి


Tuesday, 7 June 2016

హంపి






ఆంధ్రభోజుని అందాల నగరం హంపి
అహో ఆంధ్రభోజా… శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!

ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.


అనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతిని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా… ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు…
మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం…
హంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తైన గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృంగేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్పగా వర్ణసముదా యంతో చిత్రించారు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అందిస్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామాలయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

అలాగే అక్కడి నుంచి విఠలేశ్వరాలయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అంటారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారంభించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.


అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆలయ బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రించారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చెక్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆలయం మీద రామాయణ గాథకు సంబంధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడంతో ఈ ఆలయాన్ని సహస్రరామాలయం… అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం…
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాలలో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభించాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండకు మార్చాడు.

విఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది…

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే… ఓర చూపుల దేవి ఊరేగిరాగా… రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా…’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

ఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋలతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనోజ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగుడిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికిరువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వందలాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురంలో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసపడతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటే మాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
– దామర్ల విజయలక్ష్మి, అనంతపురం



Thursday, 11 February 2016

లింగరాజు ఆలయం






లింగరాజు ఆలయం

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్‌ని విశ్లేషించడం అంటే...గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం. తర్వాత పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలుగా చెప్పుకోదగినవి.

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.

లింగాలకు రాజు:
లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు ముందర నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కత లిపి సాక్ష్యంగా ఉన్నది.

నిర్మాణ శైలి:
లింగరాజ ఆలయం నిర్మాణ పటం - పై నుండి కిందికి విమాన (గర్భగుడి కలిగిన నిర్మా ణం), జగమే హన (అసెంబ్లీ హాల్), నటమందిర (వేడుకలు జరిపే గది) మరియు భోగమండప (సంతర్పణల గది) ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 18 86), అనే చరిత్ర పకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నది.

ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్:
గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం, పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలు. భువనేశ్వర్ యాత్ర ప్రయాణాన్ని ఒడిషలో ప్రారంభించడం ఖచ్చితమైన మార్గం. ఈ నగరం వందకంటే ఎక్కువ ఆలయాలను అందిస్తుంది వాటిలో అనేకమైనవి గొప్ప చారిత్రిక సంబంధం కలిగి ఉన్నాయి.

ఒడిష తరువాత పూరి మరో గమ్యస్థానం. పూరి భారత దేశంలోని పవిత్ర చార్‌దామ్‌లలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం. ఆశక్తికరంగా, ఈ పవిత్ర భూమిని సందర్శిస్తే కనీస ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒడిషలోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయంతో ఈ కోణార్క్ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది, ఇప్పటికీ ఇది శిల్పాలు, చేక్కుల్లలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఒడిష దాని విస్మయ-స్పూర్తితో రాష్ట్రం మొత్తంలో నిర్మాణ శైలిలో పెరుగంచడమే కాకుండా, గర్వించదగ్గ అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. జైన్ స్మరక చిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్య ప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియచేస్తుంది. ఒడిష పట్టణ, గ్రామీణ పరిపూర్ణ సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నివాసితులు నగరాలకంటే గ్రామాలలోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కౄతిని అనుసరిస్తున్నారు, అలాగే వారి సంప్రదాయాన్ని సంరక్షించుకుంటున్నారు. ఒరియా రాష్ట్ర అధికారిక భాష. అయితే హిందీ, ఇంగ్లీష్ వినియోగం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడలేదు.

ఒడిష సంస్కతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగా ఉంది. దీనిని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. ఈ పండుగలే కాకుండా ఒడిషలో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక, కళా వేడుకలు జరుపుకుంటారు.



Monday, 14 September 2015

బృహదీశ్వరాలయం - తంజావూరు (తమిళనాడు) C









బృహదీశ్వరాలయం - తంజావూరు


ఆ ఆలయం పొడవు 793 అడుగులు, గోపురం ఎత్తు 216 అగుడులు. దీని నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి లాంటివేవీ ఉపయోగించలేదు. పునాదులు, గోపురం, శిఖరం... అన్నీ పూర్తిగా రాళ్లతో నిర్మించారు. గోపురం 13 అంతస్తులు. ఆ రాష్ట్రంలోనే అది పెద్ద ఆలయంగా పేరుగాంచింది. చోళులు, పాండ్యులు, నాయకులు... ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అదే తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం.

క్రీ.శ.985 -1012 మధ్య కాలంలో తంజావూరును రాజధానిగా చేసుకుని రాజరాజ చోళుడు పాలించాడు. ఇతను శైవ భక్తుడు. కేరళ, మధురై మొదలుకుని శ్రీలంక వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యంతో పాటూ ఆదాయమూ బాగా పెరిగింది. ఈ విజయానికి గుర్తుగా, దేశమంతటా తన కీర్తి ప్రతిష్టలు తెలియజేయడానికి పెద్ద ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా, రాజధాని తంజావూరులో బృహదీశ్వరాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయ నిర్వహణకు ప్రత్యేకంగా భూములు కేటాయించాడు. దేవాలయ నిధిని ఏర్పాటు చేశాడు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారింది ఇక్కడనుంచేనని చెబుతారు చరిత్రకారులు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1004లో మొదలై 1010 లో పూర్తయింది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. బృహదీశ్వరాలయ ప్రాగణం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.

నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. గోపురం పై కప్పు నిర్మాణానికి 80 టన్నుల బరువుండే ఏక శిలను ఉపయోగించారట. దీని విస్తీర్ణం 25.5 చదరపు అడుగులు. ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈరాళ్లను దాదాపు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.

బృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చి దిద్దారు. ఆలయం నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది.

గర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచిత్రాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచిత్రాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.

పాలనా నమూనా
1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుండి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అది పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.

ఇదీ బృహదీశ్వరాలయమే
ఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద... ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంద్రుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి.

బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి.

బృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు 'ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి' అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు.

దర్శనీయ ప్రాంతాలు
తంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణంలో మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్‌ లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణేలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుండి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.



Wednesday, 9 September 2015

తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం D









తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం




తంజావూరు అంటే బృహదీశ్వరాలయం, సరస్వతి మహల్ అనే ప్రాచ్య లిఖిత భాండాగారం గుర్తుకు వస్తాయి. బృహదీశ్వరాలయానికే రాజరాజేశ్వరం అనే పేరుంది. రాజ రాజ చోళ చక్రవర్తి నిర్మించిన ఆలయం కనుక ఆ పేరొచ్చింది. తంజావూర్ అనే పేరు కూడా ఒక ఐతిహ్యం వల్ల వచ్చింది. తంజన్ అనే రాక్షసుడు చెలరేగుతుంటే విష్ణు అవతారమైన నీల మేఘ పెరుమాళ్, ఆయన భార్య ఆనంద వల్లీ అమ్మాళ్ లు సంహరించారు. తంజన్ కడసారి కోరికగా తన పేరు మీదుగా ఈ పట్టణం వర్ధిల్లాజేయమని కోరాడట. సరేనని ఆ రోజు నుంచి తంజావూర్ అనే పేరును స్తిరం చేశారట. తన్జం అంటే తమిళంలో శరణు అని అర్ధం. అందుకనే దీన్నిశరణార్ధుల నగరం అంటారని తంజాపురీ మహాత్మ్యంలో ఉందట. కులోత్తుంగ చోళ రాజు దీన్ని నిర్మించి తుంగపురం అని పేరు పెట్టాడని స్థల పురాణం చెబుతోంది. దీనికే అలగై అనే పేరూ ఉంది. కుబేరుడు ఇక్కడ ఉండి తపస్సు చేశాడట.

తంజావూర్ ముత్తయార్లు అనే రాజవంశం వారికి రాజధానిగా ఉండేది. తర్వాత చోళ రాజులకూ రాజదాని అయింది. విజయాల మహారాజు ముత్తురాయలను ఓడించి స్వాధీనం చేసుకొన్నాడు. గంగైకొండ చోళుడు రాజధానిని గంగైకొండ చోళపురానికి మార్చాడు. ఇక్కడ నుండే పాండ్య రాజులు, హోయసల రాజులు పాలించారు. చివరికి అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలికాఫర్ విజయ నగరాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత సేవ్వప్ప నాయకుడు స్వతంత్రాన్ని పొంది తంజావూర్ చేరి తంజావూర్ నాయక రాజ వంశాన్ని స్తాపించాడు. వీరిలో కడపటి రాజైన వీర రాఘవుడు మధుర రాజు చొక్కానాధుని చేతిలో ఓడిపోయాడు. తర్వాత పధ్నాలుగేళ్ళు అలగరి అనే సేనాపతి పాలించాడు. శివాజీ మహారాజ్ కు దాయాది తమ్ముడైన ఎకోజీ అలఘిరిని ఓడించి మహారాష్ట్రుల పాలనను ఇక్కడ ప్రారంభించాడు చేశాడు. ఆ వంశం కొంత కాలం పాలించిన తర్వాతా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది.

శ్రీ బృహదీశ్వరాలయం
చోళ రాజులు పరిపాలనలో విశేషమైన వారసత్వాన్ని ఒదిలి పెట్టారు. వారి గొప్ప నిర్మాణమే బృహదీశ్వరాలయం. భారతదేశం లోనే ఉత్కృష్ట దేవాలయం అని పేరు పొందింది. ద్రావిడ శిల్ప కళ విజృంభించిన దేవాలయం. దీనిని లార్డ్ కర్జన్, గాంధీ వంటి ప్రముఖులు సందర్శించారు. ఆలయం చిన్న కోటలో అంటే శివ గంగ కోటలో ఉంది. ఈ కోట మొదటి రాజు సేల్వప్ప నాయకుని పేర ఉంది. చివరి వాడడైన విజయ రాఘవుడు ఈ నగరాన్ని, కోటను నిర్మించాడు. దీని నిర్మాణానికి చాలా నాణ్యమైన గ్రానైట్ ను ఉపాన లేక స్తూపి అనే సుదూర ప్రాంతం నుండి తెప్పించి వాడారట. ఇది రాజ రాజ చోళుని ఆలోచనా, అమలు పరచిన తీరు. 985 -1014లో పాలించిన రాజ రాజ చోళుడు పాలన కాలంలోనే దీని నిర్మాణం జరగటం విశేషం. ఆయన రాజ్యానికి వచ్చిన 19వ సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు ఏళ్ళలో పూర్తీ చేశాడు. ఆయన పాలించిన ఇరవై అయిదవ ఏడాది 1009న 257వ రోజున రాగి కలశాలను విమానం మీద ఉంచి దిగ్విజయంగా పూర్తీ చేశాడు. దీని బరువు 235 పొండ్లు, 2926 ½ కలజుళ అంటే 35 పౌండ్ల బరువున్న బంగారం పూతతో ఉంది. నిర్మాణం జరిగిన ఆరేళ్ళ కాలంలో యుద్ధాలు లేక పోవటం శాంతి నెలకొని ఉండటం బాగా తోడ్పడింది. రాజు ఇంటి పేరు రాజ శేఖర వర్మన్. ఆయనకు రాజ రాజ అని, శివప్ప దేశికార అని బిరుదులున్నాయి. చిదంబర దేవాలయానికి చాలా ధనం దానముగా ఇచ్చాడు.

రాజేశ్వరం అని పిలువబడే ఈ బృహదీశ్వరాలయం కోటకు దక్షిణ భాగాన ఉంది. ముఖ ద్వారం తూర్పున ఉంది. రెండు వైపులా సుబ్రహ్మణ్య, గణపతి చిన్న దేవాలయాలున్నాయి. 90 అడుగుల గోపురం లోపలికి రమ్మని ఆహ్వానించినట్లుంది. ఆలయం లోపలి ప్రాంగణం 500 అడుగుల పొడవు , 250 అడుగుల వెడల్పు ఉంటుంది. రాయి, ఇటుకలతో భూమి పై నడవటానికి వీల్లుగా ఉంటుంది. దక్షిణాన యాగశాల ఉంది. పడమర, ఉత్త్తర భాగాలలో అనేక శివలింగాలున్నాయి. ఈ గది గోడలకు అద్భుతమైన వర్ణ చిత్రాలు చిత్రించి ఉన్నాయి. శివుని విన్యాసాలన్నీ చిత్రితాలై ఉన్నాయి. ఆలయం బయటి కొలతలు 793, 397 ప్డుగుల పొడవు వెడల్పు ఉన్నాయి.

బృహదీశ్వరలింగం
ప్రాంగణంలో పడమటి భాగాన బృహదీశ్వరాలయం ఉంటుంది. దానిలోపల అభాగాలున్నాయి. బృహదీశ్వరలింగం ఉన్నదాన్ని గర్భగృహం అని, తర్వాత దాన్ని అర్ధమండపం అని, మూడవ దాన్ని మహామండపం అని, నాల్గవ దాన్ని స్థాపన మండపం అనీ అంటారు. ఇక్కడ శ్రీ త్యాగరాజ స్వామి కొలువై ఉంటాడు. అయిదవ మండపం నర్తన మండపం, ఆరవది వాద్య మండపం. ఇక్కడే గాయకులూ సంగీత కచేరి చేస్తారు. ప్రతి చోట ద్వార పాలకులుంటారు. వాటి శిల్ప కళ అమోఘం. ఇందులో ఏడు విగ్రహాలు పద్దెనిమిది అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయి. ఇవన్నీ ఏక శిలా నిర్మితాలే.

బృహదీశ్వరమహాలింగం నిజంగానే మహా పెద్ద లింగం. 8.7 మీటర్ల ఎత్తు, అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. ఈ లింగానికి అసలు పేరు అద వల్లన్ అంటారట. దీని అర్ధం నాట్యం చేసేవాడు అని. రెండో పేరు దక్షిణ మేరు విటంకన్. ఈ రెండు పేర్లు తిరు విసాప్పైలో లభిస్తాయి. ఇవి చిదంబరేశ్వరుని పేర్లు కూడానట. శైవులకు చిదంబరం పెద్ద ఆధార భూమిట. రాజ రాజు ఈ లింగాన్ని రాజరాజేశ్వర ముదైయార్ అని ముద్దుగా పిలిచేవాడట. దీనికే రాజ రాజేశ్వర్ ప్రభువు అని పేరుంది. ఈ లింగాన్ని బృహదీశ్వరా లింగం అని, ఆలయాన్ని బృహదీశ్వరాలయం అనీ అంటారు. "గ్రేట్ టెంపుల్" అని కూడా పిలుస్తారు. శివలింగం ఉన్నదాని పై భాగాన్ని దక్షిణ మేరు అంటారు. కైలాసాన్ని ఉత్తర మేరు అంటారన్న మాట.

బృహదీశ్వరాలయ స్థపన మండపంలో శ్రీ త్యాగ రాజ శివుడుంటాడు. ఈయన్నే విదంకార్ అంటారు. ఈ శివుడు చోళులకు ఆరాధ్య దైవం. చోళ రాజు ముచుకున్దుడు అసుర సంహారంలో దేవేంద్రునికి సహాయ పడ్డాడని స్థలచరిత్ర. ఇంద్రుడు ప్రీతి చెంది ఇతనికి ఏడు త్యాగ రాజ శివ విగ్రహాలను ఇచ్చాడట. వాటిని తిరువారూర్, తిరునగైక్కోరణం, తిరుక్కరిఎల్, తిరుక్కోలిలి, తిరు మరైక్కాడు, తిరు నల్లారు, తిరువమూర్ లలో ప్రతిష్ట చేశాడట. వీటినే సప్త విటంక క్షేత్రాలు అంటారు. తిరువారూర్లో మహా పెద్ద త్యాగరాజ స్వామి దేవాలయాన్ని కట్టించాడు. దేశం లోనే పెద్ద రధం ఏర్పాటు చేశాడు బ్రహ్మాండమైన పుష్కరిణి నిర్మించాడు. ఈ త్యాగ రాజస్వామి అనుగ్రహం వల్లనే మన కాకర్ల త్యాగయ్య గారు జన్మించటం. ఆ దేవుని పేరు తండ్రి ఈయనకు పెట్టటం అమ్మవారి పేరు కమల అవటం త్యాగయ్య గారి భార్య పేరు కూడా కమల కావటం తమాషాగా ఉంటుంది.

బృహదీశ్వరాలయంలో అనేక చిన్న మండపాలు దేవుల్ల విగ్రహాలు ఉన్నాయి. దేవాలయ విమానం 216 అడుగుల ఎత్తుంటుంది. పద్నాలుగు అంతస్తులున్నాయి. గోడలలో ఉన్న స్తంభాలు గోడలలో గూడులు, అనేక దేవతాగణాలతో శిల్పరమణీయంగా కన్పిస్తుంది. శిఖరం అష్టభుజాకారంలో ఉంది. దాని పైన ఉన్న బంగారు కలశం పన్నెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇరవై అడున్నర అడుగుల ఏకశిలా గ్రానైట్ రాయి పై గోపురం ఉంటుంది శిఖరం, స్తూపం నీడ భూమి మీద పడక పోవటం శిల్ప చాతుర్యం. అత్యాస్చర్య కరం. పైన రెండు నందులు ఆరున్నర అడుగుల పొడవు, అయిదున్నర అడుగుల వెడల్పుతో ఎనభై టన్నుల బరువుతో ఉన్నాయి. వీటిని విమాన శిఖరం పైకి చేర్చటానికి వాలు బల్ల (ఇంక్లైనేడ్ ప్లేన్) ఉపయోగించారని చెబుతారు.

ఉత్తరాన ఉన్న శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి చిన్న దేవాలయం ఆగ్నేయ భాగంలో బృహన్నాయకి అమ్మవారి దేవాలయం ఉన్నాయి. ప్రక్కనే చండీశ్వరాలయం ఉంది. సుబ్రహ్మన్యదేవాలయ శిఖరం 55 అడుగుల ఎత్తు ఉంది 45 అడుగుల బేస్ మీద ఉంటుంది. బృహన్నాయకి అమ్మవారి ఆలయం తర్వాత కాలంలో కట్టిందే. పద మూడవ శతాబ్దంలో పాండ్య రాజు కోనేరి మని కంతన్ రాజు నిర్మించాడు. బృహదీశ్వరాలయం ముందు పెద్ద ధ్వజ స్థంభం ఉంది. చండీశ్వరాలయం రాజ రాజ నిర్మితమే.

బృహన్నంది
శివాలయ ముఖ ద్వారానికి ఎదురుగా ఎత్తైన ప్లాట్ ఫారం మీద అద్భుత ఏక శిలా నిర్మిత మైన నందీశ్వరుడు మన చూపులను లాగేసి అక్కడే నిలిచి చూసేట్లు న్తాడు. పన్నెండు అడుగుల ఎత్తు, పందోమ్మిదిన్నర అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు ఉన్న బృహత్ నంది విగ్రహం ఇది. దేశంలో పెద్ద నందులలో రెండవది మొదటి నంది లేపాక్షిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ బృహన్నంది ఇరవై అయిదు టన్నుల బరువున్న విగ్రహం. లేపాక్షి నందిలా శిల్ప కళ కన్పించదు. తిరుచి నాపల్లి దగ్గరున్న పెరంబదూర్ సమీపంలోని పచ్చ చేమలై అనే చోటు నుండి ఈ నందీశ్వర విగ్రహానికి ఏక శిలను తెచ్చారు. ఈ నందీశ్వరుడు క్రమం గా పెరుగు తుంటే కాలికి మేకు దిగ కొట్టారని చెప్పుకొంటారు. ఇంకో కధనం ప్రకారం ఈ నంది ఇంతగా పెరగటానికి దాని కడుపులో ఒక బావురు కప్పు ఉన్నదని అందుకే పెరిగి పోయిందని అంటారు. దాన్ని కనీ పెట్టి బయటికి తీసేసి ఆ రంధ్రాన్ని పూడ్చారని చెబుతారు. ఈ కప్పను సభా పతి మండపం లోని నూతిలో వదిలేశారని అంటారు.

ఆలయ గోపురం మీద వైష్ణవ, శైవ కధలు శిల్పీకరించారు. గౌతమ బుద్ధుని జ్ఞానోదయ చిత్రం కూడా ఉండటం ఆశ్చర్యం. ముఖ్య విమానానికి ఉత్తర భాగాన నాలుగు మానవ ముఖాలున్న శిల్పాలున్నాయి. వీటి కన్నా కింద ఉన్నది పెద్దది క్రమం గా సైజ్ తగ్గి మిగిలినవి ఉంటాయి. కన్జీవారానికి చెందిన సోమ వర్మ అనే శిల్పి చోళ, నాయక, మహారాష్ట్ర ఆంగ్ల పాలకుల ను చిత్రించాడు అంటే వరుసగా వీరి చోళ దేశ పాలనకు ఇవి ప్రతి బింబాలు. ఇందులో యూరోపియన్ ముఖం ఉన్న వాడు వెనిస్ సముద్ర యాత్రికుడైన మార్కో పోలో అని భావిస్తారు మార్కో పోలో కాంటన్ కు గవర్నర్ గా కొంత కాలం పని చేశాడట. అతను చైనాలో విస్తృతం గా పర్య టించాడు. అందుకే కాంటన్లో ఉన్న అయిదు వందల బుద్ధ విగ్ర్సహాలున్న దేవాలయం లో అతని విగ్రహమూ చేర్చి గౌరవిన్చారట.

అర్ధ మండపంలో చోళ సంస్కృతీ చిత్రాలున్నాయి దక్షిణ దేశ చిత్ర కళా రీతి గోచరిస్తుంది. భూమి నుండి సీలింగ్ వరకు రమణీయ మైన చిత్రకళా తో శోభిస్తుంది. పై భాగాన నాయక రాజుల కాలం,లో ఉన్న తెలుగు దేశపు మనుష్యుల చిత్రాలున్నాయి. వీరిలో సేవ్వప్ప నాయకుడు అచ్చ్యుతప్ప నాయకుడు ప్రసిద్ధం గా ఉన్నారు. చోళుల కాలంలో శైవం బాగా వ్యాప్తి చెందింది. వీరికాలంలో వెలసిన చిత్రాలలో కైలాశశివుడు పార్వతి, శివ గణాలు నందీశ్వరుడు అప్సర గణం ఉంటారు.

రెండవ రకంలో నాలుగు దంతాలున్న తెల్లని ఏనుగైన ఐరావతం, దాన్ని నడిపే యువ మావటి కనిపిస్తారు. ఏనుగు ముందు నడిచే తెల్ల గుర్రం ఉంటుంది. సుందర సెరిమన స్వామి ఉంటారు. మూడో రకంలో సుందర మహర్షి శివుడు కనీ పిస్తారు. భక్త గణం పెద్ద హాల్లో ఉంది వారిని చూస్తూ ఉంటారు. కింది చిత్రాలలో ఆడ వాళ్ళు వంటా వార్పూ చేస్తున్నట్లు చిత్రించారు. అయిదవ భాగంలో నటరాజ స్వామి, ఆయన భక్తులు కన్పిస్తారు. ఆ తర్వాతి దానిలో అందమైన మహిళా చిత్రాలు కనువిందు చేస్తాయి. ఉత్తరం వైపు గోడ మీద త్రిపురాసుర వధ ఘట్టం కనిపిస్తుంది. తర్వాతా దేవతా ముఖాలున్న నాలుగు పెద్ద సైజు తలకాయలు కనిపిస్తాయి.

బృహదీశ్వరునికి బృహత్ కానుకలు
రాజ రాజ చోళుడు తన పాలన ఇరవై తొమ్మిదవ ఏడాది నాడు, రాణీలతో ఆయన సోదరి కుందావై తో వచ్చి స్వామిని దర్శించి అపూర్వ మైన కానుకలు సమర్పించారు. నిత్య పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ భారీగా చేశాడు. సుమారు 489 పౌండ్ల బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించాడు. ఆరువందల పౌండ్ల వెండి వస్తువులు అందజేశాడు. నైవేద్యాలకు ఉత్సవాలకుగాను అనేక ప్రదేశాలలో ఉన్న సేద్యపు భూములను బృహదీశ్వరునికి రాసిచ్చాడు. సిలోన్ దేశంలో ఉన్న భూములు కూదా స్వామికి సమర్పించి తన స్వామి భక్తిని ప్రకటించుకొన్నాడు. వీటి వల్ల ఏడాదికి ఒక లక్షా పదహారువేల కాలముల ధాన్యం వచ్చేది. దీని విలువ యాభై ఎనిమిది వేల కాసులు. ఇవి కాక పదకొండు వందల కాసుల ధనాన్ని స్వామికి సమర్పించాడు రాజ రాజు.

దేవాలయానికి ఉత్తర, దక్షిణ భాగాలలో విశాలమైన పెద్ద మహా వీధులను నిర్మించాడు. తూర్పు నుండి పడమర వరకు 400 మంది దేవ దాశీలకు నివాస గృహాలు ఏర్పరచాడు. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు సంవత్సరానికి వంద కాలముల ధాన్యం వచ్చే భూమి ఇచ్చాడు. నృత్య దర్శకులకు సంగీత గాయకులకు వాద్యకారులకు, దుస్తులు కుట్టే వారికి మొత్తం 212 మంది పురుష సేవకులకు కూడా ఇదే ఏర్పాటు చేశాడు. ఇందులో సంస్కృత అరియం అంటే ద్రావిడ వేదంను పఠించేవారు. వేదాలను అధ్యయన అధ్యాపనం చేసే వారు ఉన్నారు. తనజావూర్ జిల్లాను దక్షిణ దేశ ధాన్య గారం (రైస్ బౌల్) అంటారని చిన్నప్పుడెప్పుడో సోషల్లో చదువుకొన్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...