Showing posts with label సముద్రం. Show all posts
Showing posts with label సముద్రం. Show all posts

Sunday, 29 January 2017

లక్షద్వీప్‌






లక్షద్వీప్‌
పేరుకే లక్షద్వీప్‌... ఉన్నది 36 దీవులే!

లక్షద్వీప్‌... ఆ పేరు వినగానే అక్కడ అన్ని దీవులున్నాయేమో అనుకుంటారంతా. కానీ అది కేవలం 36 దీవుల సమాహారం. అరేబియా సముద్రంలో ఆణిముత్యాల్లా మెరిసే ఆ దీవుల్ని చూడాలని బయలుదేరాం. అక్కడ విహరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. హైదరాబాద్‌ నుంచి కొచ్చీ చేరుకుని ఆ దీవుల్లోని పర్యటకశాఖ నుంచి అనుమతి తీసుకున్నాం. పర్యటక శాఖవారి ఓడలో అయితే భోజన, వసతి సదుపాయాలూ సముద్ర క్రీడలూ అన్నీ వాళ్లే ఏర్పాటుచేస్తారు. నెల రోజుల ముందుగానే యాత్రకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం.

అది 150 గదుల ఓడ!
కొచ్చీలో లక్షద్వీప్‌ కేంద్రం దగ్గర ఉదయం 9 గంటలకు ఓడ ఎక్కడానికి అందరం కలిశాం. లగేజీ స్కానింగ్‌ చేశాక చెక్‌ఇన్‌ అయ్యాం. అక్కడే ఓడ బోర్డింగు పాసులు అందజేశారు. పర్యటకులందరికీ కాంప్లిమెంటరీ టీషర్టూ, ఆ దీవుల క్యాలెండరూ, టోపీలూ జ్ఞాపికలుగా ఇచ్చారు. బస్సులో కె.వి. సముద్రం అనే ఓడ దగ్గరకు సరిగ్గా 11 గంటలకు చేరుకున్నాం. మాతోపాటు ఆ దీవుల నివాసితులు కూడా ఆ ఓడ ఎక్కారు. ఐదు అంతస్తులతో 150 గదులతో మొత్తం 750 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంది. ఐదో అంతస్తులో మొదటి తరగతి AC గది తీసుకున్నాం. రైల్లోని రెండో AC మాదిరిగానే ఓడలో కూడా కిందొక బెర్తూ పైనొక బెర్తూలాంటి మంచాలు ఉన్నాయి. టేబులూ రెండు కుర్చీలూ లగేజీ పెట్టుకునేందుకు వీలుగా ఓ బీరువా, అటాచ్డ్‌ టాయ్‌లెట్‌ ఉన్నాయి. గది చిన్నగా సౌకర్యంగా ఉంది. కిటికీలోనుంచి చూస్తే కనుచూపుమేరా అనంతసాగరమే. లక్షదీవుల్లో 36 ఉన్నప్పటికీ పది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అధికార భాష మలయాళం. అయితే చాలామంది హిందీ మాట్లాడగలరు. మధ్యాహ్నం రెండుగంటలకు భోజనం ముగించుకుని ఓడ చూడ్డానికి బయలుదేరాం. సమాచార కేంద్రం, హాస్పిటల్‌, భోజనశాల, వినోదకార్యక్రమాలు నిర్వహించే హాలు... అన్నీ ఉన్నాయి. కెప్టెన్‌ అనుమతితో ఫ్రంట్‌ ఆపరేషన్‌ రూములో ఓడ వివరాలన్నీ తెలుసుకున్నాం. GPS నావిగేషన్‌, సెక్యూరిటీ, వాతావరణం, సిగ్నల్‌ వ్యవస్థ ఇలా సముద్రప్రయాణానికి అవసరమైనవాటి అన్నింటి గురించీ వివరించారు. మా టూర్‌ మేనేజర్‌ అన్ని అంతస్తుల్లోకి వెళ్లి ఓడలో ఉన్న సదుపాయాలూ భోజనవేళలతోపాటు యాత్ర గురించిన వివరాలు తెలియచేశాడు. సాయంత్రానికి అందరం ఓడ పైనున్న డెక్‌కు చేరుకున్నాం. సాగరతీర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అందరం ఆనందంగా గడిపాం. రాత్రి 8 గంటలకు డైనింగ్‌హాల్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రమించాం.

అక్కడ మద్యపానం నిషిద్ధం!
రెండోరోజు వేకువనే సూర్యకిరణాలు క్యాబిన్‌లోకి రావడంతో మెలకువ వచ్చింది. డెక్‌పైకి వెళ్లి సూర్యోదయాన్ని చూస్తే కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యుడు పైకి వస్తున్నాడా అనిపించింది. ఉదయభానుడి కిరణాలతో అలలు వెండి వెలుగులో మెరుస్తున్నాయి. అక్కడక్కడా పైకి ఎగురుతూ మళ్లీ నీళ్లలోకి దూకే టూనా చేపల్ని చూస్తుంటే ఆ కాంతికిరణాల మెరుపుకి ఆనందంతో అవి నృత్యం చేస్తున్నట్లే ఉంది. అల్పాహారం ఓడలోనే ముగించి లైఫ్‌జాకెట్‌లు ధరించి పడవల్లో తీరం చేరుకున్నాం. కనుచూపుమేరలో మినికాయ్‌ దీవి నీలిజలాలతోనూ కొబ్బరితోటలతోనూ ఆకర్షిస్తోంది. కొచ్చి నుంచి ఈ దీవికి సుమారు 400 కిలోమీటర్ల దూరం. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 గంటలపాటు ఓడలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం.

మినికాయ్‌దీవివాసుల ఆచార వ్యవహారాలూ మిగిలినవారికంటే భిన్నంగా ఉంటాయి. పురుషులు మలయాళీల వస్త్రధారణలోనే ఉన్నారు. స్త్రీలు రంగురంగుల బురఖాలు ధరించారు. ముస్లిం జనాభా ఎక్కువ. తీర ప్రాంతంలో ఉండే తేమ వాతావరణమే అక్కడా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడు. ఉక్కబోత ఉన్నా చెమట లేదు. ఎండ తీవ్రత మాత్రం తెలుస్తోంది. లక్షదీవుల్లో మద్యపానం నిషేధం. బంగారం అనే ఒక్క దీవిలోనే అనుమతిస్తారు. మేం 1885లో సర్‌ జేమ్స్‌ నికోలస్‌ డగ్లస్‌ నిర్మించిన వైట్‌హౌస్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడ చల్లని తీయని కొబ్బరిబొండాలతో స్వాగతించారు. ఐదు అంతస్తుల ఎత్తున్న లైట్‌హౌస్‌లో వృత్తాకారంలో ఉన్న 400 మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ నుంచి చూస్తే ఎక్కడా నేల కనిపించకుండా పైకి లేచిన కొబ్బరితోటలూ అలలు అంతగాలేని గంభీరముద్రలోని నీలిసాగరజలాలూ తీరంవెంబడి చూడచక్కగా కట్టిన రిసార్టులూ ఈతకొలనులతో ప్రకృతి అందాలన్నీ అక్కడే కొలువుదీరాయా అనిపించింది. అన్ని అంతస్తులు ఎక్కిన శ్రమంతా ఎటుపోయిందో తెలియదు. అక్కడ నుంచి అందరం రిసార్టుకి చేరుకున్నాం. అక్కడే పర్యటక శాఖ ఉచితంగా ఏర్పాటుచేసిన వాటర్‌స్పోర్ట్స్‌కు లైఫ్‌జాకెట్‌తో వెళ్లాం. చిన్న పడవలతో స్వయంగా తెడ్డు వేసుకుంటూ కయాకింగ్‌ చేసి ఆనందించాం. ముఖానికి మాస్క్‌ వేసుకుని సముద్రంలోపలున్న జీవుల్ని చూసే స్నోర్కలింగ్‌కి వెళ్లాం. వాటర్‌స్కూటర్‌, బనానా బోట్‌రైడ్‌లకు మాత్రం ఇష్టమైన వాళ్లు టిక్కెట్లు కొనుక్కుని వెళ్లారు. కొంతమంది స్కూబా డైవింగ్‌కి వెళ్లారు. భోజన సమయానికి అందరం తిరిగి రిసార్టుకి చేరుకున్నాం. టూనా చేప వంటకాలతో భోజనం వడ్డించారు.

సాంఘిక జీవనం!
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక విలేజ్‌ టూర్‌కి ఆటోల్లో తీసుకెళ్లారు. అక్కడ మహిళలు స్వయంగా తయారుచేసిన కొబ్బరి స్వీటు, మసాలావడ, తేనీటిని అల్పాహారంగా ఇచ్చారు. పక్కనే వాళ్ల ఇళ్లు ఉన్నాయి. మధ్యలో అందరికీ ఉమ్మడిగా ఉన్న వంటగదిలో కొందరు స్త్రీలు సముద్రంమీదకి పనికి వెళ్లిన తమ మగవాళ్లకోసం కొన్ని వంటకాలు చేస్తూ కనిపించారు. పదిమంది స్త్రీలు రోజూ వంతులవారీగా అన్ని రకాల వంటల్నీ కొబ్బరి మట్టల్ని మండించే మట్టిపొయ్యిలమీద చేస్తుంటారట. వాళ్లలా సాంఘిక జీవనం కొనసాగించడం ఎంతో ముచ్చటగొలిపింది. గ్రామంలో జనాభా కేవలం రెండువేలమంది మాత్రమే. సాయంత్రం వరకూ ఆ పచ్చటి చెట్ల మధ్య గడిపి ఓడమీదకి చేరుకున్నాం.

అంతా అక్షరాస్యులే!
మర్నాడు ఉదయం ఆరు గంటలకు కాల్‌పెనీ అనే మరో దీవికి చేరుకున్నాం. అల్పాహారం ఓడలోనే ముగించి ఉత్సాహంతో ఈ దీవిలోకి అడుగుపెట్టాం. ఈ దీవి జనాభా నాలుగు వేలు కాగా అందరూ అక్షరాస్యులే. వాళ్లలో దాదాపు 500 మంది వైద్యులేనట. లక్షదీవుల్లో మెట్రిక్‌ పాసయిన మొదటి మహిళది కూడా ఈ దీవేనట. ఆమెకిప్పుడు 83 సంవత్సరాలు. ఓ గ్రామంలో ఉన్న ఆమెను చూశాం. ఆ దీవిలో దక్షిణంవైపు అలలు సముద్రక్రీడలకు అనుకూలంగా లేకపోవడంతో నార్త్‌ ఎండ్‌ టిప్‌కు తీసుకుని వెళ్లారు. పది నిమిషాల ప్రయాణంలో అటూ ఇటూ కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో మునగచెట్లు ఉన్నాయి.

నార్త్‌ ఎండ్‌ టిప్‌కు చేరుకోగానే మూడువైపులా సముద్రం కనిపించింది. అక్కడ అలలు అంత ఉధృతంగా లేవు. మధ్యలో బండరాళ్లూ అడుగున ఇసుకరేణువులు కనిపించేంత తేటగా ఉన్నాయక్కడి జలాలు. కాసేపు అక్కడ గడిపి తిరిగి రిసార్టుకి చేరుకుని సముద్ర క్రీడలకు వెళ్లాం. కాల్‌పెనీలో 1947లో సంభవించిన తీవ్ర తుఫానువల్ల కొంత భూభాగం విడిపోయింది. కాస్త దూరంలో ఉన్న ఆ దీవికి మమ్మల్ని పడవల్లో తీసుకువెళ్లారు. సముద్రంలోపల నాచుమొక్కలూ సీకుకుంబర్‌... వంటి జంతువులూ ఎక్కువగా ఉన్నాయి. ఆ జంతువుల్ని పట్టుకుంటే మెత్తని స్పాంజుల్లా ఉన్నాయి. స్నోర్కలింగ్‌కి వెళ్లినప్పుడు వివిధ ఆకారాల్లో రంగుల్లో ఉన్న కోరల్స్‌ కనిపించాయి. వాటిమధ్యలో అటూఇటూ తిరుగుతోన్న గోల్డ్‌ఫిష్‌లూ చారల చేపలూ స్నేక్‌ ఫిష్‌లూ... ఇలా చాలా రకాలు కనిపించాయి. మధ్యాహ్న భోజనానంతరం గ్రామంలో తిరుగుతూ అక్కడ నివసిస్తోన్న కుటుంబాలతో మాటలు కలిపాం.

అక్కడి ప్రజలు సౌమ్యులూ స్నేహశీలురూ. మా సంభాషణ అంతా హిందీలో సాగింది. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించాం. కొబ్బరినూనె, కొబ్బరిపొడి తయారీ చూపించారు. తరవాత మహిళలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి తయారుచేస్తోన్న టీషర్టు యూనిట్‌ని కూడా చూశాం. ధర తక్కువగా ఉండటంతో వాటిని కొనుక్కున్నాం. తిరిగి సాయంత్రానికి రిసార్టుకి చేరుకున్నాం. అక్కడ స్థానిక జానపద, సంప్రదాయ నృత్యరీతుల్ని ప్రదర్శించారు. మల్‌ అనే భాషలో వారు పాడుతున్న పాట అర్థం కాకపోయినా వారి లయవిన్యాసాలను చూసి ముగ్ధులమయ్యాం. చేతిలో డప్పులాంటి పరికరంతో శబ్దం చేస్తూ అడుగులు వేసే తీరు ఎంతో బాగుంది. రాత్రికి ఓడకు చేరుకున్నాం.

వందల రకాల చేపలు!
మూడోరోజు ఉదయానికల్లా లక్షద్వీపాల రాజధాని అయిన కవరట్టి అనే దీవికి వెళ్లాం. 11 వేల జనాభా ఉన్న ఆ దీవి అన్నింటికన్నా పెద్ద దీవి కూడా. ఇక్కడ కొన్ని ఇళ్లు అధునాతనంగా ఉన్నాయి. అక్కడ సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్లారు. రంగురంగుల చేపలూ సీఅనీమోన్‌లూ బ్రెయిన్‌ కోరల్సూ ఫింగర్‌ కోరల్సూ లాంటివాటిని చూపించారు. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది. కోరల్స్‌ సేకరించడం నిషిద్ధం. కొందరు స్కూబాడైవింగ్‌ చేస్తే మిగిలిన వాళ్లు తీరందగ్గరే వాటర్‌స్కూటర్‌, నీబోర్డు... తదితర క్రీడలతో కాలం గడిపారు. భోజన సమయానికి అందరం రిసార్టుకి చేరుకున్నాం. కాసేపు విశ్రమించాక మినీ బస్సులో గ్రామ సందర్శనకు వెళ్లాం. రోడ్లన్నీ సిమెంట్‌తో వేసినవే. ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుచేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కనే మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. ఆ సాయంత్రం స్థానిక బాలికలతో ఏర్పాటుచేసిన జానపద నృత్య కార్యక్రమం ఎంతో అలరించింది. తేనీటి విందు అయ్యాక తిరిగి ఓడను చేరుకోవడానికి మరపడవల్లో బయలుదేరాం. రాత్రికి డెక్‌పై అందరం ఆనందంగా గడిపి అడ్రస్‌లు తీసుకుని, మర్నాడు ఉదయం 9 గంటలకు కొచ్చీ చేరుకున్నాం.

Saturday, 11 June 2016

అంతర్వేది .. గోదావరి సంగమ ప్రదేశం !

గోదావరి తల్లి గురించి ఎంతో మంది కవులు కవితల రూపంలో, రచయితలు పాటల రూపంలో వర్ణన లు చేశారు. నదీ తీరానికి ఇరువైపులా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పచ్చని పంట పొలాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే, మరో వైపు కనుచూపుమేర ఉన్న సముద్రం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. గోదావరి నది ఉరుకులు, పరుగులు తీస్తూ బంగాళాఖాతం సముద్రం లో కలిసే దృశ్యాలు తప్పక చూడాల్సిందే .. అక్కడి సముద్ర ప్రవాహాల శబ్దాలు విని తీరాల్సిందే ..! ఆ ప్రదేశం పేరే ' అంతర్వేది' !!

అంతర్వేది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అందమైన గ్రామం మరియు ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 100 కి. మీ ల దూరంలో, కాకినాడకు 111 కి. మీ ల దూరంలో .. సఖినేటి పల్లి మండలంలో కలదు. ఇక్కడ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కలదు. గోదావరి నది సముద్రంలో కలిసే 'సంగమ ప్రదేశం' గా అంతర్వేది కి పేరు. ఇక్కడున్న కొన్ని సందర్శనీయ స్థలాలను గమనిస్తే ..

ఇతర సందర్శన స్థలాలు !
అన్న చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును 'అన్న - చెళ్ళెళ్ళ గట్టు' అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు 4KM ల మేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.

ఇతర విశేషాలు
అంతర్వేది, సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

వసతి సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

రవాణా సౌకర్యాలు
బస్సు
అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి (100 KM), కాకినాడ (111 KM) ల నుండి రావులపాలెం(63 KM), రాజోలు(27 KM) మీదుగా సకినేటిపల్లి(19 KM) చేరవచ్చు. విజయవాడ(200 KM), ఏలూరు(140 KM) ల నుండి నరసాపురం(21 KM) మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి కలవు.

రైలు
అంతర్వేది కి సమీపాన నరసాపూర్ రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి. హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా డైరెక్ట్ గా నరసాపురం చేరవచ్చు. నరసాపూర్ నుండి సఖినేటిపల్లికి అలాగే అంతర్వేది కి ప్రభుత్వ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

విమానం
అంతర్వేది కి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి రైలు లేదా బస్సులో ప్రయాణించి సఖినేటి పల్లి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు.

Friday, 10 June 2016

అండమాన్‌ -ఓ మహా ఆకర్షణ

రొస్ ఐలాండ్
అండమాన్‌ ఒక గాయం. సునామీ మిగిల్చి వెళ్ళిన గాయం గురించి నేను మాట్లాడటం లేదు. సెల్యూలర్‌ జైలు చూశాక, ఆ జైలులో ఖైదీలు అను భవించిన వర్ణనాతీత వేదనలు విన్నాక అండమాన్‌ ఎర్రటి పుండు మానిన గాయం లాగానే అన్పించింది నాకు. వందల సంఖ్యలో ఉరితీయబడిన ఖైదీలు, భయానక బాధల నడుమ కూడా చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు వీరసావర్కార్‌ లాంటి ధిక్కార స్వరాలు క్రౄర, కసాయి బ్రిటిష్‌ జైలర్లు. అండమాన్‌లో అడుగిడిన సాయంత్రమే సెల్యులర్‌ జైలును చూడడం, లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రోగ్రామ్‌లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు సజీవంగా ముందుకు రావడంతో మనసు వికలమై పోయింది. ఆ రాత్రి కలల నిండా ఖైదీలే. వారి హృదయ విదారక ఆర్తనాదాలే. పోలీసుల కరకు బూట్లచప్పుడు గుండెల మీద ఆనుతున్నట్టుగా అన్పించి చాలాసేపు నిద్రపట్టలేదు. ఆ తర్వాత తిరగిన సుందర ప్రదేశాలు మొదటి రోజు చేదు అనుభవాన్ని కొంతవరకు తగ్గించేయి. సెల్యూలర్‌ జైలు చూడ్డానికి వెళ్ళకముందు సన్‌సెట్‌ పాయింట్‌కి వెళ్ళాం. మేమున్న గెష్టహౌస్‌కి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుంది. మెలికలు తిరిగిన రోడ్లు. దట్టమైన అడవిగుండా మా ప్రయణం సాగింది. కొబ్బరి చెట్లు, ఆకాశన్నంటే పోక చెట్లు దారిపొడుగునా ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన మొగలి పొదలు చాలా కన్పడ్డాయి. అయితే ఈ పొదలు కొబ్బరి చెట్లంత పొడవున్నాయి. పెద్ద పెద్ద ఆకుల్తో పొడవుగా ఎదిగిన ఈ చెట్ల నుండి మొగలి పొత్తుల్ని ఎలా కొస్తారా అని తెగ ఆశ్చర్యపోయాన్నేను. కొబ్బరి, పోక, మొగలి ముప్పేటలా అల్లుకున్న ఆ తోటల్లోంచి మా కారు చాలా వేగంగా దూసుకెళ్ళసాగింది. అపుడపుడూ సముద్రం కూడా దర్శనమిస్తోంది. అకాశం రంగులో నీళ్ళు. స్వచ్ఛంగా వున్నాయి.
మంగ్రూన్ చెట్లు

ఓ నలభై నిముషాలు ప్రయాణం చేసాక సూర్యాస్తమయ ప్రదేశం వచ్చింది. ఎదురుగా నీలిరంగు సముద్రం. సముద్రానికి అటువేపు చిన్న దీవి. ఆ చిన్న దీవిలో ఎత్త్తైన కొండవెనక్కి సూర్యుడు జారిపోతున్న అద్భుతదృశ్యం కంటపడింది. టైమ్‌ చూస్తే నాలుగున్నరే అయ్యింది. మరి కాసేపట్లో చీకట్లు అలుముకున్నాయి. ఐదింటికల్లా చీకటిపోయింది. అప్పటి వరకు నీలాకాశం రంగులో కనబడిన సముద్రం నల్లటి దుప్పటి కప్పుకుని పడకేసీనట్లనిపించింది. సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గర అటవీశాఖవారి అందమైన అతిధి గృహం వుంది. బయట లాన్‌లో కూర్చుంటే నల్లటి దుప్పట్లో దూరిన సముద్రం గురకలు పెట్టినట్టుగా చిరు కెరటాలు తీరాన్ని తాకుతూ విరుగుతున్న సవ్వడి విన్పిస్తుంది. వేడిగా ఓ టీ తాగేసి మేము తిరుగు ప్రయాణమయ్యా౦. చీకటి దట్టమైపోయింది. కొబ్బరి చెట్లు, పోక, మొగలి పొదలు ఏకమైపోయాయి. చల్లటి సముద్రగాలిని ఆస్వాదిస్తూ ఓ గంట తర్వాత మా గెస్ట్‌ హవుస్‌కి వచ్చేం.

మేము బస చేసిన గెస్ట్‌ఔస్‌ సముద్రానికి ఆనుకుని వుంది. మేమున్న రూమ్‌ పేరు నికోబార్‌. పెద్ద పెద్ద చెట్లతో గెస్ట్‌హౌస్‌ చాలా బావుంది. మేము రూమ్‌లో కెళ్ళగా ఓ కుర్రాడొచ్చి తలుపు తట్టాడు. 

”నమస్కారం సార్‌” అంటూ పలకరించాడు. 
తెలుగోడివా అంటే ”మాది విజయనగరం. ఇక్కడ క్యాంటీన్‌లో వంట చేస్తా. ఏమేం స్పెషల్స్‌ కావాలో చెప్పండి.” అన్నాడు. 
మాకు బోలెడంత సంతోషం వేసింది. అతని పేరు మల్లిఖార్జున్‌. మేమున్నన్ని రోజులు మంచి భోజనం పెట్టాడు. చేపలు, పీతలు, నాటుకోడి అన్నీ ఆంద్రా స్టయిల్‌లో వండి వడ్డించే వాడు కాంటీన్‌లో.

మర్నాడు హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళ్ళాలనేది మా ప్రోగ్రామ్‌. పోర్ట్‌ బ్లయర్‌ నుంచి హేవ్‌లాక్‌కి షిష్‌మీద రెండు గంటల ప్రయాణం. ఉదయం ఎనిమిందింటికి షిిప్‌ బయలురుతుందని రెడీగా వుండమని చెప్పి వెళ్ళాడు ప్రొటోకాల్‌ చూస్తున్న భండారి.

మర్నాడు ఉదయం తొందరగా బ్రేక్‌ఫాష్ట్‌ చేసేసి షిప్‌ బయలుదేరే ప్రదేశానికి వెళ్ళాం. అక్కడంతా చాలా రష్‌గా, గోలగా వుంది. వివిధ ప్రదేశాలకు బయలుదేరే షిప్‌లు అక్కడ ఆగివున్నాయ్‌. మా షిప్‌ పేరు వంగర్‌ అని, అది హేవ్‌లాక్‌ ఐలాండ్‌కి వెళుతుందని భండారి చెప్పి మమ్మల్ని అందులో ఎక్కించాడు. మేము లోపలి కెళుతుండగా ఓ కబురు కూడా చెప్పాడు. విఐపి లాంజ్‌లో ఖాళీలేవని, ఒక రూమ్‌ వున్నా అది శుభ్రంగా లేదని, పబ్లిక్‌తో పాటు కూర్చోవాల్సి వుంటుందని చెప్పాడు. ఏం ఫర్వాలేదు. ఇంతటి జలరాశిని వదిలి పెట్టి రూమ్‌ల్లో ఏం కూర్చుంటాంలే అని అతనితో చెప్పి మేము మాకిచ్చిన రూమ్‌లో కెళ్ళి మా బ్యాగు పెడుతుండగానే షిప్‌ బయలుదేరింది. ఇంతలో ఇంజన్‌ రూమ్‌లో వుండే అటెండెంట్‌ వచ్చి పైకి వెళదాం రండి అని మమ్మల్ని కెప్టెన్‌ కేబిన్‌ల్లోకి తీసుకెళ్ళాడు. కనుచూపు మేరంతా నీలం రంగులో పరుచుకున్న బంగాళాఖాతం. 

నేను కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తుంటే ”ఏం సార్‌ తెలుగువారా?” అనే పిలుపు వినబడింది.
”అవును. ఎలా గుర్తు పట్టారు.”అన్నాం.
”తెలిసిపోతుంది సార్‌. మాది వైజాగు. నా పేరు స్వామినాథం నేను ఈ షిప్‌ కెప్టెన్‌ని” అంటూ పరిచయం చేసుకున్నాడు.
‘ఆహా! బావుందండి. చూస్తుంటే అండమాన్‌లో ఆంధ్రవాళ్ళు బాగానే వున్నట్టున్నారు.
”అవును. చాలామంది వున్నారు. వైజాగు నించి షిప్‌లో వస్తుంటారు.” అంటూ ఆయన కబుర్లలోకి దిగారు.
మా కోసం కుర్చీలు తెప్పించి వేయించారు. 
నేను కన్నార్పకుండా ఆ మహాసాగరాన్ని చూస్తున్నాను. మా షిప్‌ చాలా వేగంగా వెళుతోంది. మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు ఎదురౌతున్నాయి. దట్టమైన అడవులు కన్పిస్తున్నాయి. నీలపు నీళ్ళు అంచుల వెంబడి విస్తరించిన ముదురాకుపచ్చ అడవుల సౌందర్యం చూసి తీరాల్సి౦దే. నేను చాలా బీచ్‌లు చూసాను గాని కెరటాలను తాకుతూ వుండే అడవుల్ని ఎక్కడా చూడలేదు. ఒడ్డుకు చాలా దూరంగా కొబ్బరి తోటలు చూసాను కానీ ఇలాంటి అడవుల్ని చూళ్ళేదు. నీళ్ళల్లో మునిగి వుండే మంగ్రవ్స్‌ మొక్కల్ని కూడా నేను అక్కడే చూసాను.

మా ‘వంగర్‌’ సాగర జలాలను చీల్చుకుంటూ హేవలాక్‌ ద్వీపం వైపు వెళుతోంది. వేడి వేడి కాఫీ వచ్చింది. సముద్రపు గాలి చల్లగా వొంటిని తాకుతుంటే, వెచ్చటి కాఫీ తాగడం ఎంత బాగుందో. ఆంధ్ర కెప్టెన్‌ మాకు బోలెడన్ని మర్యాదలు చేసాడు. షిప్‌ అంతా తిప్పిచూపించాడు. ఇంజన్‌ రూమ్‌లోకి తీసుకెళ్లగానే ఆ వేడికి నా శరీరం కాలిపోతుందేవె అన్పించింది. ఆ శబ్దానికి చెవులు చిల్లులడిపోతాయని భయమేసింది. అంత వేడిగా, అంత భయంకరమైన చప్పుడుగా వుందక్కడ. చెవులకి రక్షణగా కప్స్‌ తగిలించుకున్నాగాని ఆ హోరు వినబడుతూనే వుంది. అలాంటి స్థితిలో కూడా పని చెయ్యక తప్పని మనుష్యులున్నారక్కడ. మేము కొంచెం సేపు అటు ఇటు తిరిగి పైకి వచ్చేసాం.
రాధనగర్ బీచ్
ఇంకో పది నిముషాల్లో హేవలాక్‌ ఐలాండ్‌లో వంగర్‌ ఆగింది.
‘సాయంత్రం మా షిప్‌లోనే రండి’ అంటూ మా కెప్టెన్‌ ఆహ్వానించాడు.
మేము వసతి దొరికితే రాత్రిని హేవలాక్‌లోనే గడుపుదామనుకున్నాం.
‘మేము సాయంత్రం బయలుదేరితే వంగర్‌లోనే వస్తామని’ చెప్పి షిప్‌దిగి బయటకొచ్చాం.
అక్కడంతా హడావుడిగా, రద్దీగా వుంది. షిప్‌లోంచి దిగిన యాత్రికులు, కారు హారన్‌ వెతలు గందరగోళంగా వుంది. కొంచెం దూరంలో మా పేర్లు రాసిన ప్లేకార్డు పట్టుకుని ఓ కుర్రాడు నిలబడ్డాడు. మేము అతని దగ్గరకెళ్ళాం.
‘ఆయియె మే౦ సాబ్‌’ అంటూ మమ్మల్ని ఆహ్వానించి కారు దగ్గరకు తీసుకెళ్ళాడు. అతని పేరు జెయిమ్‌. కారు అతనిదే. చక్కటి హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. మేము కారులో కూర్చోగానే ప్రోగ్రామ్‌ ఏంటని అడిగాడు. గెస్ట్‌హౌస్‌కి వెళదామంటే, రూమ్‌లు దొరకడం కష్టమని, ప్రెసిడెంటు పర్యటన సందర్భంగా ఎవరికీ రూమ్‌లివ్వడం లేదని అన్ని గెష్ట్‌ హౌస్‌లు రిపేర్‌ చేస్తున్నారని చెప్పాడు జెయిమ్‌ . ప్రయత్నం చేద్దాం పద అంటే సరే అని బయలుదేరాడు. హేవలాక్‌ ద్వీపం చుట్టూ సముద్రం. ద్వీపం లోపల దట్టమైన అడవిలాగా పెరిగిన కొబ్బరి, పోకచెట్లు.
ఎంత పచ్చగా వుందంటే - ఆ పచ్చదనానికి గుండెలయ తప్పుతుంది. ఆ ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయం కల్గుతుంది. నేను ఆ చెట్లల్లో, పుట్టల్లో పడి పారవశ్యంలో మునిగిన వేళ మా కారు అంతకన్నా అద్భుతమైన ప్రదేశంలో ఆగింది. నీలి సముద్రం ఒడిలో కెరటాల లాలిపాటలో ఒదిగివున్న డాల్ఫిన్స్‌ గెష్టహౌస్‌కి మమ్మల్ని తెచ్చాడు. గెస్ట్‌హౌస్‌కి ఎదురుగా ఎండలో మిల మిల మెరిసిపోతున్న సాగరం. అబ్బ! ఈ గెస్ట్‌హౌస్‌లో ఒక్కరోజున్నా చాలు కదా! ఇంత సౌందర్యం, ఇంత నిశ్శబ్దం, కెరటాల చప్పుడు తప్ప మరేమీ వినబడని ఈ నిరామయ ప్రదేశం. నేను వెంటనే ఆ ప్రాంతంతో ప్రేమలో పడిపోయాను. నేనలా తన్మయంలో మునిగివుండగానే జెయమ్‌ రూమ్‌లివ్వరట. గెష్టహౌస్‌ మూసేసారట అని చెప్పాడు. నాకు చాలా కోపమొచ్చింది. ఎప్పుడో వారం తర్వాత వచ్చే ప్రెసిడెంట్‌ కోసం ఇప్పట్నించే పర్యాటకుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏం భావ్యం? ఇంత అందమైన ప్రాంతం వారం రోజులు బోసిపోవాల్సిందేనా? జనాలను చుట్టూ పక్కలక్కుడా రానీయడం లేదట. రూమ్‌కోసం చాలా ప్రయత్నాలు చేసి చేసేదేంలేక కనీసం ఇక్కడి సముద్రాన్నయినా తాకుదాం. ఇంత స్వచ్ఛంగా మెరిసిపోతున్న జలాలను తాకకుండా ఎలా అనుకుంటూ నీళ్ళలోకి దిగి కెరటాలతో కాసేపు ఆడి, అక్కడి నుండి అయిష్టంగా బయలుదేరాం. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెల్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న నీలి రంగు నీళ్ళు. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, కళ్ళనీళ్ళొచ్చాయి అలా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఆ బీచ్‌లోనే నాకో పెద్ద శంఖం దొరికింది. దాన్ని తాకినపుడల్లా నాకు డాల్ఫిన్స్‌ బీచ్‌ కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
మధ్యాహ్నం అవుతోంది. లంచ్‌కోసం మంచి హోటల్‌కి తీసుకెళ్ళమని జెయిమ్‌కు చెప్పాం. దట్టంగా అల్లుకున్న పొదలు, చెట్లు, పక్షుల కిలకిలా రావాల సంగీతం వినబడుతున్న చక్కటి పొదరిల్లులాంటి హోటల్‌కి తీసుకెళ్ళాడు.
అక్కడికి సమీపంలోనే సముద్రం. పక్షుల పాటల్తో పోటీ పడుతూ కెరటాల హోరు వినబడుతోంది. అంత హాయైన ప్రదేశంలో ఆకలేం వేస్తుంది? అయినా వాళ్ళు పెట్టిందేదో తిని మళ్ళీ మా వాహనంలో కొచ్చి పడ్డాం.

”జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?”
’కోరల్స్‌ చూడ్డానికి ఎలిఫెంటా బీచ్‌ కెళుతున్నాం’అన్నాడు. ”జెయిమ్‌! ఇపుడెక్కడికి తీసుకెళతున్నావ్‌?”
”కోరల్స్‌ ఎక్కడున్నాయ్‌? సముద్రం లోపలికెళ్ళాలి. ”హేవ్‌లాక్‌నుంచి ఓ గంట ప్రయాణ౦. పడవలో ఎలిఫెంటా బీచ్‌కెళ్ళాలి.” ఈ మహా సముద్రంలో పడవ మీదా?” ‘అవును . పడవలోనే వెళ్ళాలి. సముద్రంలోపలి కెళితే గాని కోరల్స్‌ కనబడవు.”అంటుండగానే ఉదయం మేము షిప్‌ దిగిన ప్రాంతానికి వచ్చాం. ఇక్కడినుంచే పడవ మాట్లాడుకోవాలి’అన్నాడు జెయిమ్‌. మేము కారుదిగి నిలబడగానే ఓ కుర్రాడు మా దగ్గరకు వచ్చాడు.’ఇతను సురేష్‌. పడవ ఇతనిదే. మిమ్మల్ని ఎలిఫెంటా బీచ్‌కి తీసుకెళ్ళి, కోరల్స్‌ చూపిస్తాడు. ”చెప్పాడు జెయిమ్‌. రానూ పోనూ మాట్లాడుకొని మేము అతను తెచ్చిన గటిపడవ ఎక్కాం. పడవ ఎంతో అందంగా వుంది. పసుపు. ఎరుపు రంగు గడుతో ఆకర్షణీయంగా వున్న మర పడవ. జెయిమ్‌ కూడా మాతో పాటే పడవెక్కాడు. మోటార్‌ ఆన్‌ చేయగానే పడవ సముద్ర గర్భంవేపు దూసుకెళ్ళసాగింది.

మేము కూర్చున్న ఎడమ చేతివేపు సముద్రతీరం వెంబడి దట్టమైన అడవి. నీళ్ళల్లోకి చొచ్చుకొచ్చిన మంగ్రస్‌ చెట్లు. ఎగిసిపడుతున్న కెరటాల మీద ఎగిరెగిరి పడుతున్న పడవ. ఇటీవల ప్రళయకావేరిలో పడవ ప్రయాణం గుర్తొచ్చింది. ఈ సముద్ర కెరటాలు మరింత ఎత్తుగా రావడంతో పడవలోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి. సముద్ర మధ్యంలోకి ఇంత చిన్న పడవలో ప్రయాణం చేయడం సాహసమే. పడవ ఎగిరినపుడల్లా గుండె ఝుల్లుమంటోంది. చుట్టూ అల్లుకున్న ఈ అనంత జలరాశి, నీలపు రంగుతో అందమైన డిజైన్లు, నడినెత్తిమీదున్న సూర్యుడి కిరణాలకి మిల మిల మెరిసిపోతున్న నీళ్లు. ఎగిరెగిరి పడుతున్న మా గటి పడవ. ప్రకృతి సౌందర్యాన్ని, బీభత్సాన్ని, గగుర్పాటుని, సాహసాన్ని ఒకేసారి అనుభవించడం అంటే ఏమిటో అవగతమైన క్షణాలవి. మా పడవ వూగుత, వయ్యరాలు పోత ఎలిఫెంటా బీచ్‌కి చేరింది. బీచ్‌ని ఆనుకుని అడవి. ఈ అడవిలోంచి ఏనుగులతో కట్టెల్ని మోయిస్తారట. లోపల్నించి ఏనుగులు మోసుకొచ్చిన పెద్ద పెద్ద మానుల్ని పడవలమీద ఎగుమతి చేస్తారట. ఒకప్పుడు చాలా ఏనుగులుండేవట. మాకయితే ఒక్కటీ కనబడలేదు. బహుశ అడవి లోపల ఉండొచ్చు.

పడవని కట్టేసి సురేష్‌ వచ్చాడు. అతని చేతిలో ఆక్సిజన్‌ మాస్క్‌ వుంది. ”ఇదెందుకు సురేష్‌ అంటే సముద్రం లోకి వెళ్ళాలి కదా! అన్నాడు. కోరల్స్‌ ఎక్కడున్నాయి? అంటే అక్కడ అంటూ కడలి వేపు చూపించాడు. అమ్మో! అంత లోపలికా అంటే ‘ఫర్వాలేదు నేనున్నాను కదా! భయపడకుండా నా చెయ్యి పట్టుకుని వచ్చేయండి అన్నాడు. ‘మళ్ళీ తనే మీరు చీరతో లోపలికి రాలేరు. అదిగో అక్కడ డ్రస్‌లు అద్దెకిస్తారు. వెళ్ళి మార్చుకురండి అన్నాడు. నా సహచరుడు హాయిగా నిక్కరేసేసుకుని కెరటాల మీద ఈత కొడుతున్నాడు. నేను బట్టలు అద్దెకిచ్చే చిన్న పాక దగ్గరికెళ్ళి ఓ నిక్కరు, టీ షర్ట్‌ తీసుకుని వేసుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలా మందే వున్నారక్కడ. ఎవ్వరికీ వొంటిమీద ఏం వేసుకున్నామన్న స్పృహే లేదు. నీళ్ళతో ఆడుతూ, ఇసుకలో దొర్లుతూ, సముద్ర గర్భంలోకి వెళుతూ అందరూ మహానందనంలో మునిగివున్నారు. కెరటాలతో సయ్యాటకి చీరెంత అడ్డో నేను వేరే డ్రస్సులోకి మారాక అర్ధమైంది. ఇంక లోపలికి వెళదామా అంటూ సురేష్‌ వచ్చాడు. నువ్వు ముందువెళ్ళు అన్నాడు రావ్‌. నా తలకి ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించాడు. నీళ్ళల్లో మునిగి ప్రాక్టీస్‌ చెయ్యమన్నాడు. మొదటిసారి మునగ్గానే నోట్లోకి ఉప్పునీళ్ళు వెళ్ళిపోయి ఉక్కిరిబిక్కిరైపోయాను. అలా నాలుగైదు సార్లు ప్రాక్టీస్‌ చేసాక కాస్త అలవాటయింది.
‘సరే వెళదాం పద’అన్నాను. సురేష్‌ చేయి అందించాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంతకు ముందెప్పుడూ చూడని, కలలో సైతం ఊహించని ఓ అద్భుత ప్రపంచం లోకి చేపపిల్లలా ఈదుకుంటూ వెళ్ళిపోయాను. ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోను నోరు తెరవకుండా మొదటిసారి నీళ్ళల్లోకి మునిగి కళ్ళముందు కనబడిన అపూర్వదృశ్యానికి అబ్బురపడి ‘వావ్‌’ అంటూ నోరు తెరవడంతో నోట్లోకి నీళ్ళు పోయి ఉక్కిరి బిక్కిరై పైకి వచ్చేసాను. సురేష్‌ హెచ్చరికని పాటించి మళ్ళీ నీళ్ళ అడుగుకి వెళ్ళాను. అబ్బ! బతికివున్న రంగు రంగుల కోరల్స్‌. రకరకాల చేపలు. సదుల్లా కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. గుత్తులు గుత్తులుగా, రంగు రంగుల పూల గుత్తుల్లా జీవంతో తొణికిసలాడుతున్న కోరల్స్‌. సురేష్‌ చేతిని గట్టిగా పట్టుకుని అతని వెంబడి అలా అలా నీళ్ళమీద నడుస్తూ, సాగర సంపదని కన్నార్పకుండా చూస్తూ మైమరచిపోయాను. ఇలాంటి దృశ్యాలను డిస్కరరీ ఛానల్‌లో చూస్తూ పరవశించడమే ఇంతకాలం తెలుసు. ఇపుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నానే, తాకగలుగు తున్నానే అనే ఆనందం అణువణువు లోను నిండి పోయింది. అతను నన్ను సాగర గర్భంలోకి, కోరల్స్‌ కమనీయదృశ్యాల్లోకి ఎంతసేపలా లాక్కెళ్ళి పోయాడో గాని గాలి పీల్చుకోవడం కోసం నీళ్ళపైకి రాగానే తీరం చాలా దూరంగా కనబడింది. రావ్‌ చాలా దూరంలో కనబడతున్నాడు. ఇంత లోపలికికొచ్చేసామా అంటూ ఆశ్చర్యపడుతూ, మళ్ళొకసారి నీళ్ళల్లో మునిగి సూర్యకాంతితో సమానంగా మెరుస్తున్న కోరల్స్‌ని తనవితీరా చూసి ఓ చిన్న ముక్కని పీకడానికి ప్రయత్నించాను కానీ రాలేదు. సురేష్‌ అవలీలగా ఓ చిన్న కోరల్‌ని పీకాడు. దాన్ని వెసుకుంటూ నీళ్ళ మీది కొచ్చేం. మెల్లగా ఈదుకుంటూ తీరం చేరాం. ఎలా వుంది అని రావ్‌ అడిగాడు.
అద్భుతం, అపూర్వం అన్నాను. తర్వాత రావ్‌ని తీసుకుని, సురేష్‌ వెళ్ళాడు. నేను ఆ అద్భుతానందాన్ని గుండెల్లోకి ఒంపుకుంటూ కెరటాలతో ఆటాడుతూ నిలబడ్డాను. అక్కడ తీరం వెంబడి రకరకాల ఆకారాలతో చనిపోయిన కోరల్స్‌ వెదజల్లి నట్టున్నాయి. బోలెడన్ని కోరల్స్‌ ఏరాను. వాటన్నింటినీ బాగులో వేసుకున్నాను. రావ్‌ కూడా తిరిగొచ్చాక, మా పడవలో హేవలాక్‌ బయలుదేరాం. ఆ రోజు పౌర్ణమి. సముద్రం మంచి పోటు మీదుంది. కెరటాలు మరింత ఎత్తుకి లేస్తూ పడవని ఢీ కొడుతున్నాయి. నీళ్ళు ఎగిరొచ్చి మమ్మల్ని తడుపుతున్నాయి. హఠాత్తుగా పడవ బోల్తా పడితే? ఏముంది పోయి ఆ కోరల్స్‌ మీదేగా పడతాం. 
‘ఇక్కడ పడవలెప్పుడైనా బోల్తాకొట్టాయా? సురేష్‌ని అడిగాం. 
ఊహూ..డరనా నహీ ..కుచ్‌ నైహోగా అన్నాడు”. 
హమ్‌ నహీడరరే. ఊరికే అడుగుతున్నాం” అన్నాను నేను.

జెయిమ్‌ అందుకుని ”కోరల్స్‌ బావున్నాయా? మీకు నచ్చిందా?” అన్నాడు. 
నేను సమాధానం చెప్పేలోగానే సురేష్‌ ‘మేడమ్‌! మీకు బతికిన కోరల్‌ ఇచ్చాను కదా! అది ఎవ్వరికీ చూపించొద్దు.” అన్నాడు. 
”ఏమౌతుంది చూపిస్తే..” 
”బతికిన కోరల్స్‌్‌ సముద్రంలోంచి తియ్యడం నేరం. పోలీసులు పట్టు కుంటారు”.
”అరే! వాటిని తియ్యకూడదా?మాకు తెలియదు కదా! ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు!” 
”ఫర్వాలేదు. ఏమీకాదు. మీరు ఉప్పునీళ్ళల్లో దాన్ని వేయండి. అది బతుకుతుంది.”అన్నాడు. 

మేమిలా మాటల్లో వుండగానే మా పడవ హేవలాక్‌ తీరం చేరింది. జెయిమ్‌ వెళ్ళి కారు తెచ్చాడు. మేము పడవ దిగి కారులో ఎక్కగానే ”మనమిప్పుడు రాధానగర్‌ బీచ్‌ కెళుతున్నాం” అన్నాడు.

బాగా ఆకలిగా వుంది. ఏమైనా తిందామంటే అక్కడ బీచ్‌లో హొటల్స్‌ వుంటాయని అక్కడ తినొచ్చని చెప్పాడు. ‘అయితే నేను కొబ్బరి బొండాం తాగుతాను! అంటే బొండాలమ్మే బండి దగ్గర ఆపాడు. మన ప్రాంతపు బొండాం కన్నా రెండింతలు పెద్దగా వుంది. లీటర్‌ నీళ్ళుపైనే వున్నాయి. తియ్యగా, చల్లగా చాలా బావున్నాయి కొబ్బరినీళ్ళు. ఓ పెద్ద అడవి, కొండ దాటి రాధానగర్‌ చేరాం. 

మేము అక్కడ హొటల్‌లో తింటున్నపుడు ‘హాయ్‌! అంటూ ఓ విదేశీయుడు పలకరించాడు. అతను ఎలిఫెంటా బీచ్‌ దగ్గర కన్పించాడు. చేతిలో కర్రతో ఇంకొకతనితో కలిసి అడవిలోంచి, కొండదిగి మాకంటే ముందే వచ్చేసాడు. ‘u came before us.how can it be possible?అంటే yah.everything is possible with this’ అంటూ తన కర్ర చూపించాడు. అతను ఫ్రాన్స్‌నించి వచ్చాడట. పెయింటింగు పని చేస్తాడట. సంవత్సరమంతా పనిచేసి డబ్బు కూడబెట్టి నెలరోజులు ఇలా దేశాలు తిరుగుతాడట.’ఆహా! అన్పించింది నాకు.
టిఫిన్‌ తినడం అయ్యాక బీచ్‌లోకి వెళ్ళాం చాలా అందమైన బీచ్‌. బంగారంలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెలు. స్వచ్ఛంగా , తేటగా వున్న నీళ్ళు, నీళ్ళనానుకుని అడవి. ఎక్కడా ఒక్క ప్లాస్టిక్‌ కవర్‌గాని, చెత్తా చెదారంగాని కనబడలేదు. శుభ్రంగా చీపురుతో ఊడ్చినంత నీట్‌గా వుంది బీచ్‌. కళ్లముందు కనబడుతున్న వివిధ రంగులు, బంగారం రంగు ఇసుక, ఆ ఇసుకను తాకుతూ తెల్లటి మల్లెపువ్వు ల్లాంటి కెరటాలు, ఆ కెరటాలను తరుముతున్న నీలం రంగు నీళ్ళు, కొంచెం కన్నుసారిస్తే ఆకుపచ్చటి అడవి. నేనలా మంత్రముగ్ధనై, ప్రకృతి సోయగానికి పరవశమై కళ్ళల్లో నీళ్లు బుకుతుంటే రెప్పవేయకుండా చస్తుండి పోయను. విస్తారమైన ఆ బీచ్‌ కెరటాల సంగీతం తప్ప మహా నిశ్శబ్ధంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాల్సిందే.
ఈ నిశ్శబ్దాన్ని ప్రేమించటానికి, మనలో పేరుకు పోయిన శబ్ద కాలుష్యాన్ని కడుక్కోడానికైనా రాధానగర్‌ బీచ్‌ కెళ్ళాలి. మేమలా చిత్తరువుల్లా కూర్చుని వున్నపుడు జెయిమ్‌ వచ్చాడు. మేము మెల్లగా లేచి మా కారువేపు నడవసాగాం. నేను బోలెడన్ని డెడ్‌ కోరల్స్‌ ఏరుకున్నాను. రకరకాల డిజైన్లవి. మాకు గెష్టహౌస్‌ దొరకలేదు కాబట్టి పోర్ట్‌ బ్లేయర్‌కి తిరిగి వెళ్ళాలి.
మా కారు షిప్‌ ఎక్కాల్సిన యార్డ్‌ వేపు వెళుతోంది. జెయిమ్‌ ఆ ద్వీపం గురించి ముచ్చట్లు చెబుతున్నాడు. అక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారని, పని లేకపోవడమంటూ వుండదని చెబుతూ, కొబ్బరికాయలు తీయడం, ఏరడం, పోకకాయలు తెంపడం,
వాటిని సేకరించడంలాంటి పనులు సంవత్సరమంతా వుంటాయట. టూరిష్ట్‌లకు సంబంధించి కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మా హేవలాక్‌లో ఎవ్వరూ పేదవాళ్ళు లేరు అంటూ చాలా గర్వంగా చెప్పాడు. పోకచెట్టు మీద ఎగబాకుతున్న మనిషి, ఓ చెట్టునుండి ఇంకో చెట్టుకు దూకుతూ కంటబడ్డాడు. సన్నగా, రివటలాగా వుండే పోక చెట్టు చాలా సులువుగా ఒంగుతుంది. ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకు చాకచక్యంగా దూకుతుంటారు. మేము కారు దిగి కొన్ని పోకకాయలు ఏరి తెచ్చుకున్నాం. మేము షిప్‌ ఎక్కే ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఐదుగంటలైంది. వండూర్‌ రెడీగా వుంది. స్వామినాధం మా కోసమే ఎదురు చూస్తున్నాడు. జెయిమ్‌కి డబ్బు చెల్లించేసి అతనికి గుడ్‌బై చెప్పాం. షిిప్‌ ఎక్కడానికి నిలబడినవారిని, ఆ ద్వీపానికి చెందినవారిని గమనిస్తుంటే అందరి నోళ్ళు ఒకే లయలో కదలడం చూసి జెయిమ్‌ని అడిగాం ఏం తింటున్నారు అందరూ అని. ‘గుట్కా’, పాన్‌పరాగు అన్నాడు నవ్వుతూ. హేవలాక్‌లో ప్రతి వొక్కర గుట్కా తింటారని. గుట్కా వ్యాపారం చేసి లక్షలు సంపాదిస్తారని కూడా చెప్పాడు.
మేం షిప్‌లోకి ఎక్కగానే అది బయలుదేరింది. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కు సింధరం రంగులోకి మారింది. అప్పటివరకు నీలి ఆకాశంతో పోటీ పడిన సాగర జలాలు క్రమంగా నలుపు రంగుకి మారుతున్నాయి. షిప్‌ వేగంగా వెళుతోంది. చల్లటిగాలి హాయిగా తాకుతోంది. అపుడే ఓ అద్భుతాన్ని చూసాన్నేను. పడమటి ఆకాశంలో అస్తమించే సూర్యుడు అచ్చం చంద్రుడిలాగానే వున్నాడు. తూర్పు దిక్కుకు చూద్దునుకదా వెండివెన్నెలలు వెదజల్లుతూ పౌర్ణమి చంద్రుడు.రెండు బింబాలు ఒకేలా వున్న అపూర్వ దృశ్యమది. క్రమంగా సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. చుట్టూ దీపాలులేని అఖండజలరాశి.సముద్ర మధ్యంలో మా షిప్‌. నీళ్ళల్లోకి మిల మిల మెరుస్తూ కురుస్తున్న వెన్నెల. నేను నిశ్శబ్దంగా ఒక మూలకి కూర్చుండిపోయి, ప్రకృతిలో లీనమైపోయను. రావ్‌ హైదరాబాద్‌నుంచి వచ్చిన ఒక పోలీసాఫీసర్‌తో కబుర్లలో పడ్డాడు. నేను మాత్రం మాట పలుకు లేకుండా బంగాళాఖాతం మీద మనోహరంగా కురుస్తున్న వెన్నెల్లో తడుస్తూ, తన్మయమౌత తరించిపోయాను. నా ఆనందాన్ని నా ఆత్మీయ నేస్తాలతో పంచుకున్నాను. సముద్రం మధ్యలో సెల్‌ఫోన్‌లు పనిచేయడం ఆశ్చర్యమే. నా కళ్ళతో నేను అనుభవించిన ఆనందాన్ని నా మిత్రుల చెవుల్లో విన్పించడానికి సెల్‌ఫోన్‌ భలే ఉపయోగపడింది. సంతోషం ఇతరులతో పంచుకోవడానికే అని గాఢంగా నమ్ముతాను. వెన్నెల్లో గోదారిని చూసాను గాని వెన్నెల్లో సముద్రం అందాన్ని ఇప్పుడే చూస్తున్నాను.క్రమంగా దీపాలు కనబడసాగాయి. దూరంగా పోర్ట్‌బ్లేయర్‌ ఐలాండ్‌ కనబడుతోంది. దీపాలు దగ్గరయ్యే కొద్దీ వెన్నెల వెలుగులు మసక బారసాగాయి. మా వెంట తెచ్చుకున్న అరిశెలు, మురుకులు స్వామినాధానికిచ్చేసాం. అతను చాలా సంతోషపడిపోయాడు. మాకిచ్చిన ఆతిధ్యానికి ధన్యవాదాలు చెప్పి మేము ‘వండూర్‌” దిగేసాం.

మర్నాడు మా ప్రోగ్రామ్‌ జైలు లోపలి కెళ్ళి చూడ్డం. రోస్‌ ఐలాండ్‌, పీక్‌ పాయింట్‌ (ఎతైన ప్రదేశం) చూడ్డం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌్‌ చేసి సెల్యూ లర్‌ జైలుకి వెళ్ళాం. మొదటి రోజు రాత్రిపూట సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌లో చూసిన జైలు. ఏడు పొడవాటి గోడల్లాగా ఒక వైపు మాత్రమే సెల్‌ తలుపు లుండేలా చాలా ప్లాన్డ్‌గా కట్టిన కరకు నమూనా. ఖైదీలు ఒకరి ముఖాలొకరికి కనబడవు. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేసింది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. ఒకేసారి ముగ్గురిని ఉరితీసే గది, వాసానికి వేలాడుతున్న ఉరితాళ్ళు. వీరసావర్కార్‌ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు వుండేదని, ఈ జైలులో జరిగిన అకృత్యాలను మౌనసాక్షి అదేనని గైడ్‌ చెప్పాడు. సునామీకి ఆ చెట్టు కూలిపోయి, దాని స్థానంలో ఓ పిల్లచెట్టు మొలిచింది. చాలా సేపు ఆ చెట్టు ముందు నిలబడ్డాను. నాతో ఏదో చెప్పాలన్నట్లు ఆకులు గలగల లాడాయి. గుస గుసగా ఏదో చెప్ప ప్రయత్నించాయి.

మనసంతా భారమైపోయింది. అదే మూడ్‌తో సునామీకి బాగా దెబ్బతిన్న రాస్‌ఐలాండ్‌ చూడ్డానికి వెళ్ళాం. పోర్ట్‌ బ్లెయిర్‌కి కన్పిస్తూ వుంటుంది ఈ చిన్న ద్వీపం. అక్కడ బ్రిటిష్‌ వాళ్ళ ప్రాభవ చిహ్నాలు చాలా వున్నాయి. క్లబ్‌లు, చర్చి, వాళ్ళ క్వార్టర్స్‌, టెన్నిస్‌ కోర్టుల్లాంటివన్నీ ప్రస్తుతం కూలిపోయి, ఆ శిధిలాల్లోంచి చెట్టు మొలుచుకొచ్చాయి. ఆ చెట్లు భవనాల ఆకారంలో గమ్మత్తుగా వున్నాయి. సునామీ తీవ్రంగా తాకిన ద్వీపమిది.

అక్కడ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ వుంది. అందులో సునామీ కెరటాల్లో తన కళ్ళ ముందే తన భార్య ఎలా కొట్టుకుపోయిందో ఓ భర్త రాసిన ఉత్తరం వుంది. అన్నింటి కన్నా నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అక్కడి నుండి స్ఫష్టంగా కనబడే సెల్యూలర్‌ జైలు, సెంట్రల్‌ టవర్‌. జైలరు, అధికారులు ఇక్కడి నుండి కూడా జైలును కంట్రోలు చేసేవారని అర్ధమైంది. ప్రస్తుతం ఇక్కడ జనమెవ్వరూ నివసించడంలేదు. టూరిష్ట్‌లు మాత్రమే తిరుగుతున్నారు.
అక్కడి నుండి పోర్ట్‌బ్లెయిర్‌ మొత్తం కనబడే ‘పీక్‌ పాయింట్‌’ కి వెళ్ళాం. చిక్కటి అడవిలోంచి కొండెక్కడం, ఆ కొండమీంచి సముద్రం, చిన్నా చితకా ఐలాండ్స్‌ కనబడ్డాయి. పోర్ట్‌బ్లెయిర్‌ చుట్టూ వుండే సముద్రం కన్పడింది. అడవిలోంచి ఏవో జంతువుల అరుపులు, పక్షుల కిలకిలలు కింద సముద్ర కెరటాలు. చాలా అందమైన ప్రదేశం. మేం తిరుగు ప్రయాణంలో కొండ దిగుతుంటే”తెలుగు ప్రాధమికోన్నత పాఠశాల” పేరుతో తెలుగులో రాసి వున్న బోర్డ్‌ కన్పడింది. భండారిని అడిగితే ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారని చెప్పాడు.

మర్నాడు మ్యూజియమ్‌ చూసాం. అండమాన్‌ చరిత్రకి అద్దం పడుతూ ఎంతో సమాచారముందక్కడ. ఇక్కడ ఈ దీవుల చరిత్ర కొంత రాయాల్సి వుంటుంది. అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ గురించి 1777 వరకు బయట ప్రపంచానికేమీ తెలియదు. 1777లో బ్రిటిష్‌ వాళ్ళు జరిపిన సర్వేలోనే ఇవి బయట పడ్డాయి. అంత వరకు ఈ ద్వీపాల్లో బయట నుంచి అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఆదిమ మానవులుగా పిలవబడే ”నెగ్రిటాస్‌” ”మంగోలాయిడ్స్‌” జాతి ఆదివాసులు శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతుండేవారు. ఇక్కడ మొదట అడుగు పెట్టింది ఇంగ్లీషు వాళ్ళే. వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం సెంటిల్‌మెంటుగా దీన్ని మార్చేసారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వేలాది దేశ భక్తుల్ని ఈ సెటిల్‌ మెంట్లలో నిర్భధించేవారు. ఆ తర్వాత సెల్యూలర్‌ జైలు కట్టారు. ఆ తర్వాత జపాన్‌ వాళ్ళు దాడి చేసి ఈ దీవుల్ని ఆక్రమించు కున్నారు.1947లో భారతదేశానికి సిద్ధించిన స్వతంత్రంతోపాటు అండమాన్‌, నికోబార్‌లు కూడా స్వతంత్రయ్యాయి.

అండమాన్స్‌కి వలస వచ్చిన వాళ్ళలో బెంగాలీయులే అధికులు. ప్రభుత్వ పాలసీ ప్రకారం, పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ‘సెట్లర్స్‌’గా వీళ్లు వచ్చారు. ఈ పునరావాస కార్యక్రమం 1949 నుండి 70 వరకు కొనసాగింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుండే ఎక్కువ మంది ఇక్కడికొచ్చారు. అలాగే ఎంతోమంది ‘ఎక్స్‌సర్వీస్‌మెన్‌’ నికోబార్‌ దీవుల్లో పునరా వాసం పొందారు. వీరిలో పంజాబీలు, మరాఠీలు, మళయాళీలు, తమిళులు, తెలుగు వాళ్ళు వున్నారు. ఇలా బ్రిటీష్‌వాళ్ళు అడుగుపెట్టి, ఈ దీవుల ఉనికిని కనుక్కుని, తన రాజకీయ అవసరాలకు వాడుకున్న తరువాత , ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులు ఇక్కడ చొరబడ్డారు. ఈ నాగరీకుల ప్రవేశంతో అప్పటివరకు స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసులు లోపల్లోపలికి కుంచించుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అండమాన్స్‌లో వున్న 572 దీవుల్లో ఆదివాసులు కొన్ని దీవుల్లో మాత్రమే వున్నారు. నికోబార్‌ ఐలాండ్స్‌లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. జరువాలు, షోమ్‌పెన్‌, గ్రేట్‌ అండమానిస్‌, ఓగ్గ్సు, సెంటీనలీస్‌ అనే ఐదు తెగలకు చెందిన ఆదిమమానవులు, నాగరీక సెట్లర్స్‌ చర్యల వల్ల ప్రమాదంలో వున్నారని ఇటీవల భారత ప్రభుత్వ ఆదివాసీ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తెగలవారిని ”కుతూహలంగా” చూసేవారే తప్ప వారి సమస్యలు వీరికి అర్ధం కావని కూడా పేర్కోనడం గమనించాలి.


నికోబార్‌ ఐలాండ్‌కి మేము వెళ్ళలేక పోయా౦ కానీ అక్కడి ఆదివాసులకు సంబంధించి అనేక చిత్రాలు మ్యూజియంలో ప్రదర్శించారు. వారి ఇళ్ళు, ఆహారపుటల వాట్లు వస్త్రధారణ ఎంతో భిన్నంగా వుంటాయి. సునామీలో వేలాదిగా నికోబార్‌లో వుండే ఆదివాసులు చనిపోయరని, కొన్ని ద్వీపాలు శాశ్వతంగా సముద్రంలో కలిసి పోయాయని రాసివుంది. నికోబార్‌ ఐలాండ్‌ వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి, రక్షణ ఏర్పాట్లు అవసరమని, ఆదివాసులు ఎవరినీ నమ్మరని, ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదమని భండారి మాకు చెప్పడంతో మేము ఆ ప్రస్తావన వదిలేసుకున్నాం.

అద్భుతానుభవాల్ని గుండెల్లో పదిల పరుచుకుని అండమాన్‌ ద్వీపానికి, గెష్ట్‌హౌస్‌ సిబ్బందికి వీడ్కొలు పలికి మేము చెన్నైె విమానం ఎక్కాం. విమానం అనంతజలరాశి మీద ఎగురుతుంటే దాని నీడ చేపలాగా నీళ్ళల్లో కనబడింది. ఎన్నో ద్వీపాలు. నీలిరంగు నీళ్ళు చుట్టుకున్న ఆకుపచ్చటి ఐలాండ్స్‌. అండమాన్‌లో గాల్లో ఎగిరి చెన్నైలో దిగేవరకు రవ్వంత భమి కనబడదు. నీళ్ళే నీళ్ళు. చెన్నైలో దిగేటప్పుడు ఓ గమ్మత్తు జరిగింది. ల్యాండ్‌ అవడానికి విమానం చాలా కిందకి దిగింది. అయితే ఎందుకనో దిగకుండా కిందే ఎగురుతూ తిన్నగా వెళ్ళసాగింది. నెల్లరు దాటి పులికాట్‌ మీదుగా వెళ్ళి వెనక్కి తిరిగింది. నాయుడుపేట, తిరుపతి రోడ్డు స్ఫష్టంగా కన్పడుతుంటే నాకు ప్రతిమ గుర్తొచ్చింది. ప్రతిమా! మీ ఊరి మీద ఎగురుతున్నానని అరిచి చెప్పాలన్పించింది. సెల్‌ఫోన్‌ వాడనిస్తే ఫోన్‌లో చెప్పేదాన్నేమో! చెన్నై చుట్టూ చక్కర్లు కొట్టి లాండ్‌ అయ్యిుంది విమానం. మేము హైదరాబాద్‌ ప్లయిట్‌ కోసం ఎదురుచస్తూ లాంజ్‌లో కూర్చున్నాం.

ఓ మహా నిశ్శబ్ధ్దంలోంచి, పచ్చటి ప్రకతిలోంచి, నీలాల సంద్రపు కౌగిలిలోంచి విడివడి మళ్ళీ జనారణ్యంలోకి అడుగు పెట్టడంతో మా అండమాన్‌ ద్వీపాలయత్ర ముగింపుకొచ్చింది. జనాభాతో కిటకిట లాడుతున్న ఈ ప్రాంతాలెక్కడ 572 ద్వీపాలకు కలిపి నివసిస్తున్న నాలుగు లక్షల మంది ఎక్కడ. అందులో బెంగాలీలు, మళయాలీలు, తెలుగు వాళ్ళు, ముస్లిమ్‌లు, క్రిష్టియన్‌లు కలిసి మెలిసి సామరస్యంగా జీవించే అండమాన్‌ ఓ అద్బుత యత్రా స్థలం.

ప్రకృతికి అతి సమీపంగా, శబ్దరాహిత్యంలో తరించాలనుకునే వాళ్ళకి చక్కటి గమ్యం. ప్రకృతి ప్రేమికులను పారవశ్యంలో ముంచేయగల మహాసంద్రం బంగాళాఖాతం అడుగడుగునా పాదాలను తాకుత మనల్ని పునీతుల్ని చేస్తుంది. పునరాగమనకాంక్షని రగిలిస్తుంది. మళ్ళెపుడు…అంటూ మనల్ని బలంగా తనవేపు లాక్కెళ్ళిపోగల మహా ఆకర్షణ అండమాన్‌.

May 20, 2008
కొండవీటి సత్యవతి

మంగళూరు - సహ్యాద్రి శోభ, సెరియేళ్ళనాదంతో ఆకర్షించే మంగళూరు

సముద్ర తీరప్రాంతం, చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్ల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహ్యాద్రి కొండల వంపుసొంపులు, అక్కడ ప్రవహించే సెలయేళ్ళ శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్‌, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం. రాష్ట్రానికే గాక, భారతదేశానికి తొలి నౌకాశ్రయాన్నిచ్చిన నగరం మంగళూరు. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని అయిన ఈ నగరం అధికార, పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతోంది.

నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉండటం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తుంటాయి. అంతేకాక, మలబార్‌ తీరంలో మంగళూరు కూడా ఒక భాగమే కావటం గమనార్హం. రాష్ట్ర భాష అయిన కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాష అయిన తుళు, కేరళకు సరిహద్దుల్లో ఉండటం వల్ల మళయాలం, కొంకణి జనాభా కూడా ఉండటం వల్ల కొంకణి భాషలు మంగళూరులో వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలే కాకుండా... హిందీ, ఆంగ్లం కూడా మాట్లాడతారు.

మంగళూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృ తులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృ భాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును కుడ్ల అని పిలుస్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం. అలాగే నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమస్థానం కావటంవల్ల మంగళూరుకు ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. కొంకణి భాషలో మంగళూరును కొడియల్‌ అని పిలుస్తుంటారు. ఇక ముస్లింలలో ఒక వర్గంవారైతే ఈ నగరాన్ని మైకల అని ముద్దుగా పిల్చుకుంటారు. దక్షిణ కేరళ ప్రాంత ప్రజలు మాత్రం మంగళాపురంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే 2006లో సువర్ణ కర్ణాటక పేరుతో మంగళూరును మంగలూరుగా కర్ణాటక ప్రభుత్వం మార్పుచేసింది.

సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉండే మంగలూరు పట్టణం అరేబియా సముద్రంలో భాగమైన కొంకణ తీరంలో ఉండే గోవాకు దగ్గర్లో ఉంది. 3వ జాతీయ రహదారుల ద్వారా మంగళూరు దేశానికి కలుపబడుతుంది. మహారాష్ట్రలోని పణవెల్‌ నుంచి ప్రారంభమై కేరళలోని క్రణగాణురు జంక్షన్‌ వరకూ మంగళూరు రహదారి వెళుతుంది. NH - 48 మంగళూరు నుంచి బయలుదేరి కర్ణాటక రాజధాని తూర్పువైపుకు బెంగళూరుదాకా వెళుతుంది. NH - 13 ఈశాన్య మార్గంలో షోలాపూర్‌ మీదుగా మడికరి, మైసూర్‌ పట్టణాలమీదుగా పోతుంది. మంగళూరు నుంచి బెంగళూరు వరకూ మధ్య ప్రతిదినం 300 బస్సులు నడుస్తుంటాయి.

దర్శనీయ స్థలాలెన్నో..!
మంగళూరు చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో పణం బూర్‌ బీచ్‌, ఉల్లాల్‌ బీచ్‌, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం, లాల్‌బాగ్‌, సుల్తాన్‌ బత్తెరీ, మంగళాదేవి ఆలయం, కద్రి దేవాలయం, సెయింట్‌ అలోసియస్‌ చర్చి,  కొత్త మంగళూరు రేవు, గోకర్ణనాథేశ్వర ఆలయం, శరవు మహా గణపతి ఆలయం.. తదితరాలు ముఖ్యంగా  చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు.

రవాణా మార్గాల విషయానికి వస్తే.. 
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ మంగళూరు నుంచి సుదూర ప్రాంతాలకు బస్సులను నడుపుతోంది. మంగళూరు - బెంగళూరు మధ్య ఫ్యాసింజర్‌ రైల్వే సౌకర్యంలేని కారణంగా KSRTC  బస్సుల్ని నడుపుతోంది. ఇక్కడి నుండి అంకోలా, హుబ్లీ, బెల్గాం, పూణె, ముంబాయి వంటి ప్రధాన నగరాలకు కూడా బస్సు సౌకర్యం ఉండడం విశేషం. విమానమార్గం విషయానికి వస్తే.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నగర నడిబొడ్డుకు ఈశాన్యదిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఊరి పొలిమేరలైన బజ్‌పేలో ఉంది.
కర్టసీ : సూర్య Daily

కన్యాకుమారి అగ్రము... సాగర అందాలకు అగ్రస్థానం.

వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం...
మహాత్ముని స్మారక చిహ్నం...
ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు.
పర్యాటక భారతావనికి చివరి మజిలీగా...
త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా...
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి.

మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి పూట ఏకకాలంలో జరిగే సూర్యా స్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికుడుండడేమో.

త్రివేణి సంగమ క్షేత్రం...
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే...
కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌...
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం...
వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియాలోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం...

కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం...
బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర...
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌...

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి...
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి...
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే..
విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు.
చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.
తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు.
ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

కర్టసీ : సూర్య Daily

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...