Showing posts with label పర్వతాలు. Show all posts
Showing posts with label పర్వతాలు. Show all posts

Saturday, 31 March 2018

పచ్‌మఢీ





చల్లటి ఒడి.. పచ్‌మఢీ

జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.. పాండవులకు నీడనిచ్చిన గుహలు.. ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం.. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు.. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీ. సాత్పురా-వింధ్య పర్వత సానువుల్లో.. దట్టమైన అరణ్యంలో.. ఉన్న పచ్‌మఢీలో గుహలు.. జలపాతాలు.. కొండలు.. లోయలు.. ఎన్నెన్నో అందాలు.  వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీ విశేషాలివే...

బ్రిటిష్‌ పాలకులు పాలిస్తున్న రోజులవి. సెంట్రల్‌ ఇండియా ప్రావిన్స్‌లో అధికారిగా చేరాడు జేమ్స్‌ ఫార్సిథ్‌. సహజంగా ప్రకృతి ప్రేమికుడైన జేమ్స్‌ సాత్పుర-వింధ్య పర్వత పంక్తుల్లోని పచ్చదనం చూసి మైమరచిపోయాడు. రోజూ పరివారం సహా అడవుల బాట పట్టడం అతని పని. కొండలు, కోనలు విహరించేవాడు. అలా తిరుగుతుండగా.. ఒకరోజు ఆయనకు ఐదు గుహలు కనిపించాయి. వనవాస కాలంలో పంచ పాండవులు ఈ గుహల్లో నివసించారని అంటారు. పాంచ్‌ అంటే ఐదు అనీ, మఢీ అంటే గుహ అని అర్థం. వెరసి ఈ ప్రాంతానికి పాంచ్‌మఢీ అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు కాస్తా పచ్‌మఢీగా స్థిరపడింది. పచ్‌మఢీలో పంచ పాండవుల గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుహల్లోని బండలపై రంగులతో వేసిన చిత్తరువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలకు సమీపంలోనే పాంచాలి సరస్సు కూడా ఉంది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధారామంగా విలసిల్లిందని చెప్పేవాళ్లూ ఉన్నారు.

మహాదేవ శంకర..
పాండవ గుహలకు సమీపంలోని మరో గుహలో శివాలయం ఉంటుంది. దీనిని జటాశంకర గుహ అని పిలుస్తారు. భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరమ శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని స్థల పురాణం. గర్భాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 108 శివలింగాలు కనిపిస్తాయి. గుహలో గుప్త గంగ అనే కుండం కూడా ఉంది. అతి పురాతమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాండవ గుహలకు కొంత దూరంలో మహాదేవ కొండ ఉంటుంది. కొండపై అరవై అడుగుల పొడవున్న గుహ ఉంది. దీనిని బడే మహదేవ్‌ గుహ అని పిలుస్తారు. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని చెబుతారు. గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో జలకుండం ఉంది. ఇందులోని జలాలు శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.

రాజేంద్రగిరి
పచ్‌మఢీలో ఉన్న ప్రముఖ వ్యూపాయింట్లలో రాజేంద్రగిరి ఒకటి. ఇది సముద్రమట్టానికి మూడున్నరవేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఈ కొండపైకి వస్తుంటారు. ఇక్కడే అందమైన ఉద్యానవనం కూడా ఉంది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనిని సందర్శించడంతో.. ఈ కొండకు రాజేంద్రగిరి అని పేరు పెట్టారు. ఆనాడు రాష్ట్రపతి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమై చరిత్రకు సాక్షిగా కనిపిస్తుంది. ఈ గిరిపైనే విడిది కేంద్రమైన రవిశంకర్‌ భవనం ఉంటుంది.

దూప్‌గఢ్‌
సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్‌గఢ్‌ వ్యూ పాయింట్‌. 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్‌ నుంచి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. పచ్‌మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

వెండి జిలుగులు

పచ్‌మఢీ చుట్టుపక్కల సుందరమైన జలపాతాలు ఉన్నాయి. అందులో రజత్‌ ప్రతాప్‌ జలపాతం ప్రధానమైనది. 351 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దూకుతుంది. ఈ జలపాతంలో నీళ్లు వెండి వెలుగులు జిలుగుతాయి. దీనిని సిల్వర్‌ ఫాల్‌ అని కూడా అంటారు. జలపాతం కింద ప్రవాహం తక్కువే! పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు అనుకూలంగా ఉంటుంది. పచ్‌మఢీ అరణ్యంలో సాల వృక్షాలు, రావి, జువ్వి, వెదురు చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ అడవి గుండా ప్రవహించే రజిత జలపాతం నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, మరెన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఎప్పుడు అనుకూలం

దట్టమైన అడవిలో ఉన్న పచ్‌మఢీకి వేసవి విడిదిగా పేరుంది. ఈ సమయంలో ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. వేసవిలో (ఏప్రిల్‌- జూన్‌) పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నవంబర్‌-ఫిబ్రవరి వరకు శీతాకాల విహార కేంద్రంగానూ దీనికి మంచి పేరుంది.

బస: పచ్‌మఢీలో రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్స్‌ మొదలు రిసార్ట్స్‌ వరకు అన్ని రకాల ఆతిథ్యం లభిస్తుందిక్కడ. గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దక్షిణాది ఆహారం దొరకడం కష్టమే. ఉత్తరాది వంటకాలు, చైనీస్‌ రుచులు అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.
సాత్పురా కీ రాణి

పచ్‌మఢీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ బ్రిటిష్‌ అధికారి ఫార్సిథ్‌ జేమ్స్‌ కీలక పాత్ర పోషించాడు. ఉన్నతాధికారులను ఒప్పించి పచ్‌మఢీని వేసవి విడిదిగా తీర్చిదిద్దాడు. సాత్పురా పర్వత శ్రేణుల్లోని కొండలు, జలపాతాలు, అడవుల వివరాలతో ‘ద హైల్యాండ్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇండియా’ అనే పుస్తకం కూడా రాశాడు జేమ్స్‌. అందులో పచ్‌మఢీని ‘క్వీన్‌ ఆఫ్‌ సాత్పురా’ (సాత్పురా కీ రాణి) అని అభివర్ణించాడు. పచ్‌మఢీని ఆయన తొలిసారిగా గుర్తించిన ప్రదేశాన్ని ఫార్సిథ్‌ పాయింట్‌గా పిలుస్తారు. 1964లో ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి విచ్చేశారు. అప్పటి నుంచి దీనిని ‘ప్రియదర్శిని వ్యూ పాయింట్‌’ అని కూడా పిలుస్తున్నారు.
అప్సర విహార్‌

అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటాయి. రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తాయి. పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది. భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట. అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు. జలపాతం అందాలే కాదు.. చుట్టూ ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.
బీ ఫాల్‌

పచ్‌మఢీలో అందరినీ ఆకట్టుకునే మరో జలపాతం బీ ఫాల్‌. దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అంటారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జలప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకులు జలకాలాడేందుకు వీలుగా ఉంటుంది బీ ఫాల్‌. ఈ జలపాతం నుంచే పచ్‌మఢీవాసులకు తాగునీరు సరఫరా అవుతుంది.
ఎలా వెళ్లాలి?

విమానయానం
* భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి 195 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు సింగిల్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* పచ్‌మఢీకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పిపరియా. ఇక్కడి నుంచి పచ్‌మఢీకి 55 కిలోమీటర్లు.
* సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి పిపరియాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లాలి.

Sunday, 11 March 2018

అనంతగిరి






ఆహ్లాదసిరి... అనంతగిరి

తెల్లారితే చాలు ఉరుకులు పరుగులు. గంటల కొద్దీ ట్రాఫిక్‌ తిప్పలు.. ఆఫీసులో సమస్యలు.. ఇంట్లో ఇబ్బందులు.. మానసిక బాధలు.. ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక. వామ్మో ఖర్చులకు భయపడి విరమణ. అయినా ఏదో పోగట్టుకుంటున్నామనే వేదన. కాస్త సేదతీరి మనసుని ఆహ్లాదపరుచుకోవాలనే ఆలోచన. ఇది సగటు మనిషి తపన.. వాస్తవమే... యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ ప్రజలకు విశ్రాంతి కావాలంటే ఏదైనా టూర్‌కు వెళ్లాలి మరి. అది ఎక్కడో దూరాన ఉన్న ఊటి, కోడైకెనాల్‌, వైజాగ్‌, అరకు వెళ్తేనే దొరుకుతుందనేది పాత మాట. ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో మనల్ని కనువిందు చేసే ప్రాంతం హైదరాబాద్‌కు అతి దగ్గర్లోనే ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అంతగా ప్రచారంలోకీ రాలేదు కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి చెట్ల కొమ్మల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, రయిమనిపించే రహదారులు, దూరం నుంచే హత్తుకునే కొండలు, ఉట్టిపడేలా కనిపించే సేలయేటిధారలు.. పురి విప్పిన నెమళ్ల నాట్యాలు, రమ్మని పిలిచేలా రాతి కట్టడాలు,సేద తీర్చుకొమ్మనే గుహలు ప్రకృతి ప్రేమికుల మనసును నిలువునా దోచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉదయించే బాలభానుని, అస్తమించే సూర్యచంద్రుని వాడియైన కిరణాలతో ఆ ప్రాంతం మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అవును అక్కడికెళ్తే మనసుకెంతో హాయి.. కుటుంబానికెంతో జారు.. కాస్త ఆధ్యాత్మికం.. ఇంకాస్త ఆహ్లాదం.. ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం.. హైదరాబాద్‌కి సుమారు 70 కిలో మీటర్ల దూరంలో మనల్ని కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి గురించి.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. 3,763 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య అనంత పద్మనాభస్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం వినే ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనంతగిరినే చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి పురాణ ప్రసిద్ధి కూడా ఉంది. విష్ణు పురాణంలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. ఆలయ సమీపంలో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలూ కనిపిస్తాయి. ఇందులో మహర్షులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. మహావృక్షాలతో నిండిన దట్టమైన అనంతగిరి అభయారణ్యంలోని ఈ ఆలయం ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో స్వామి రూపం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి కిలోమీటరున్నర దూరంలో బుగ్గరామ లింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ అందమైన జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వర్షాకాలంలో సందర్శకులు వస్తుంటారు. ఇంకో విషయేమంటే తాండూరు వాసులు ఈ అడవిని దాటుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోనే 10 ఎకరాల్లో రీ ప్లాంటేషన్‌ కింద యూకలిప్టస్‌ చెట్లను ప్రభుత్వం పెంచుతోంది. అనంతగిరి కొండల పైన వ్యూ పాయింట్‌ ఒకటి ఉంది. అక్కడి నుంచి చూస్తే దగ్గర గ్రామాలతో పాటు చుట్టూ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. 50 ఏళ్ల క్రితం ఉన్న అనంతగిరికి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు రాజీవ్‌ నగర్‌కాలనీ సమీపంలోని రెండు రోడ్ల వద్దనే అడవి జంతువులు దర్శనమిచ్చేవి. జన సంచారం కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఒక్కరు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిది లేదు. జనం తాకిడి ఎక్కువైంది. అడవిలో అణువణువు తిరిగే వీలుంది. అందుకే ప్రస్తుతం జంతువులు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం సుమారు 100 రకాల పక్షులు ఉన్నాయి. నెమలి, అడవి పంది, కొన్ని రకాల పాములు, కుందేళ్లు మాత్రమే ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జింకలను పెంచుతున్నారు. అనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో 11 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా ప్రజలతో పాటు, హైదరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. వారాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి అందమైన ప్రకృతి మధ్య ఆనందగా గడపడానికి అనువైన ప్రాంతమిది.

ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు. ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి, భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించడానికి కావాల్సిన అహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా, అంతే కాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమివ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంతగిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు. ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందానదిగా ప్రసిద్ధి చెందిందన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీనదిగా మారింది. ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్ల గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచికుందునకు 'అనంత పద్మనాభస్వామి' రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనానిశిని అని పిలిచే భగీరథగుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం జనాల్లో వుంది.

ఆకర్షణీయం..పర్యాటక భవనం..

పర్యాటకుల తాకిడిని పరిశీలించిన అప్పుడున్న వైఎస్‌ ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భవనాన్ని నిర్మించింది. రిసెప్షన్‌ రెస్టారెంట్‌ పేరుతో ఉన్న ఈ భవనంలో వెజ్‌, నాన్‌ వెజ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. తందూరి రోటీని ఇక్కడ బాగా ఇష్టపడుతారు. చిన్నారుల కోసం ఈతకొలను, రెస్టారెంట్‌, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులున్నాయి. సెమినార్‌ హాల్‌ అందుబాటులో ఉంది. ఇక్కడ సమావేశాలు జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇతర దేశాల్లో మాదిరిగా ఏకోటూరిజం, జంగిల్‌ పార్కు తదితర పర్యాటక అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు.

సినిమా షూటింగ్‌లకు విడిది...
అనంతగిరిలో సినిమా షూటింగ్‌లు బాగా జరుగుతుంటాయి. అందమైన రోడ్డు మలుపులు, రోడ్డుకిరువైపులా అల్లుకున్న వృక్షాలు, కోనేరు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో దర్శకులు చిత్రీకరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సినీ తారలు, కథానాయకులు, దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మంచి ప్రదేశమని ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సినిమాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అడ్డా, లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్‌, అరుంధతి, నువ్వునేను, అదుర్స్‌ సినిమాలతో పాటు మంచి పేరున్న హీరోల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. ఎన్‌టిఆర్‌ కాలం నుంచి నేటి ఆయన మనువడి వరకు ఈ ప్రాంతం సుపరి చితమని చెప్పొచ్చు. పద్మనాభ స్వామి ఆలయం కింది భాగాన ఉన్న మెట్లు చాలా ఆకర్షించే విధంగా ఉంటాయి. చుట్టూ అడవి విస్తరించి అందమైన చెట్లతో ఆకర్షిస్తుంటే ఔరా అనిపిస్తుంది. ఇక్కడున్న కొలను ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలా మంది విహారయాత్రకు వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు ఇక్కడే తింటుంటారు. ఇక్కడే నువ్వు నేను సినిమాలోని 'నువ్వే నాకు ప్రాణం.. నేనే నీకు లోకం'అనే పాటను చిత్రీకరించారు.

ప్రకృతి ఒడిలో... క్షయ చికిత్సాలయం
అనంతగిరిలోని గాలికి వెలకట్టలేని విలువ ఉంది. అదే తరహాలో ప్రకృతి ఒడిలో క్షయ వైద్య శాల ఒదిగి ఉంది. ఇక్కడి పర్యవరణానికి పరవశించి నైజాం నవాబులు వారి కాలంలోనే క్షయ చికిత్సాలయాన్ని నిర్మించారు. ఈ గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు నయమవుతాయని నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షయ చికిత్సాలయ పరిధి తగ్గించి పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. మంచిదే కానీ క్షయ చికిత్సాలయంలో రోగులను చేర్చుకోవడం తగ్గించింది. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కంటే రోగులు తక్కువగానే ఉంటారు. 3 వందలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా రోగులు మాత్రం 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారు. అనంతగిరి క్షయ చికిత్సాలయం స్థానంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే ఉంది. ప్రభుత్వం మెడికల్‌ కళాశాలకు ప్రయ త్నం చేయకుండా ఎర్రగడ్డలో ఉన్న మానసిక, చాతి ఆసుపత్రిని ఇక్కడకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే క్షయ ఆసుపత్రి మరమ్మతులు శరవేగంగా జరుపుతోంది. స్థానికులు మాత్రం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గతంలో నిమ్స్‌ ఆసుపత్రి అధికారులు, కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు అనంతగిరిని, క్షయ హాస్పిటల్‌ను సందర్శించి వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను ఆరాతీశారు. ఇక్కడున్న పరిస్థితులపై ఓ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. కళాశాల ఏర్పాటైతే వికారాబాద్‌ అనే కంటే అనంతగిరి ఎక్కువ ప్రచారంలో ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు అనంతగిరి జిల్లా కేంద్రంగా పెట్టాలన్న ప్రతిపాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి.

అనంతగిరికి ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుండి ప్రతి అరగంటకు వికారాబాద్‌ వెళ్లే బస్సులుంటాయి. వాటితో పాటు తాండూరు, కర్ణాటక వెళ్లే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. రైలు సదుపాయం ఉన్న వాళ్లు వికారాబాద్‌కు రైళ్లో రావచ్చు. ముంబై వెళ్లే ప్రతి రైలు ఈ స్టేషన్‌లో ఆగుతుంది. బస్టాండ్‌, రైెల్వే స్టేషన్‌ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి అనంతగిరి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు, జీపుల్లో లేదంటే తాండూరు ధారుర్‌ వెళ్లే లోకల్‌ బస్సుల్లో వెళ్లొచ్చు. లేదంటే ప్రత్యేకంగా బైకులు, వాహనాల్లో వెళ్తే ఆనందంగా, సౌకర్యంగానూ ఉంటుంది. వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. అనంతగిరుల్లో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు స్వేచ్ఛగా ఆనందంగా గడిపే అవకాశం లభించింది. పోలీసులు అడవిలో మొబైల్‌ వాహనంలో తిరుగుతుంటారు.

ఆహ్లాదకరం.. 'దామగుండం'...
అనంతగిరికి ముందు దామగుండం గురించి చెప్పుకోవాలి. చుట్టూరా చూడ ముచ్చటైన కొండలు, ఆహ్లాదకరమైన వాతవరణంలో కనువిందు చేసే దామగుండంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. పర్యాటకుల తాకిడి బాగా ఉంటుంది. శని, ఆదివారాల్లో చాలా మంది విక్‌ఎండ్‌ ఎంజారు చేస్తుంటారు. వికారాబాద్‌ వెళ్లే దారిలో పూడూర్‌ ఎక్స్‌రోడ్‌, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన దామగుండం అభివృద్ధిలో పూర్‌ అనే చెప్పొచ్చు. బస్సు సౌకర్యం లేదు. మౌలిక వసతులు లేక పురాతన ఆలయనికి నిత్యం వచ్చే భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు ఎక్కువగా ద్విచక్రవాహనాలు, కార్లు, సుమోల్లో వస్తుంటారు. అక్కడ ఉగాది పర్వదినాల్లో జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కోనేటిలో స్నానాలు చేస్తారు. ఇక్కడ టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇక్కడి మర్రి చెట్లు, వాటి ఊడలతో చిన్నారులు ఆడుకుంటుంటారు. పర్యాటకులు ఫొటోలు కూడా దిగుతుంటారు. ఇక్కడ కొనేరు మండు వేసవిలో సైతం ఎన్నడూ ఎండిపోదు. దామగుండ ఆటవీ ప్రాంతంలో 2 వేల 900 వందల ఎకరాల్లో కేంద్ర నౌకదళానికి చెందిన సంబంధించిన ర్యాడర్‌ సిగల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామగుండ ఆలయనికి సంబంధించిన 42 ఎకరాల భూమిని సైతం నేవీలో పరిధిలోకి తీసుకుంటూ కేవలం ఆలయనికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఆధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీన్ని స్థానికులు, పర్యాటకులు తీవ్రంగా వ్యతిరేకించారు.






అనంతగిరి
ప్రకృతి అందాల సిరి

తరచి చూడాలే కానీ  మనకు దగ్గరరలోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి అనంతగిరి. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌కు కూతవేటులో ఉన్న అనంతగిరికి సాగే ప్రయాణం ఓ మధురానుభూతినిస్తుంది.

పసుపుపచ్చ లోగిలిలో ప్రకృతి అందాలు ఆరబోసినట్టు..!
ఊటీకి తీసిపోని కొండల్లో, కోనల్లో విహరించినట్టు...!
ఆకాశగంగే వచ్చి ఇక్కడ పారుతున్నట్టు...!
మునులు తపస్సు చేస్తున్నట్లు...!
దేవతలు కొలువుదీరినట్టు..!

గతమంతా పునరావృతమైనట్టు.. చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద... ప్రకృతి అందాలు.. చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి.

ఎన్నెన్నో అందాలను తన ఒడిలో నింపుకున్న అనంతగిరి రారమ్మని పిలుస్తోంది...

పిల్లగాలులు మేనును తాకుతుంటే... దారంతా ప్రకృతి అందాలు ఆహ్వానం పలుకుతుంటే మైమరిచిపోవాల్సిందే. కాలుష్యానికి దూరంగా, పచ్చని రమణీయత మధ్య ఉన్న అనంతగిరి ఆలయానికి చేరుకోగానే భారీ హనుమంతుడు, గరుత్మంతుడు భక్తులకు, పర్యాటకులకు దర్శనమిస్తారు! నిత్యం కాంక్రీట్ జంగిల్‌లో రణగొణ ధ్వనుల మధ్య నివసించేవారికి అక్కడికి చేరుకోగానే గొప్ప స్వాంతన చేకూరుతుంది. ఆలయ ముఖద్వారం, పరిసర ప్రాంతాలు పరవశింపచేస్తాయి. ఆధ్యాత్మిక చింతనకు చిగురులు తొడుగుతాయి. భక్తుల కొంగుబంగారంగా పిలుచుకొనే అనంతపద్మనాభుడి ఆలయంలో నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. ఇక్కడి ఆలయ ఆర్చకుల పూజావిధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయ కిందిభాగంలో కోనేరు ఉంటుంది. మెట్ల ద్వారా ఆ దారి గుండా వెళ్తుంటే వానరసమూహాలు... నెమళ్లు తారసపడుతాయి. ఆ దృశ్యాలు వర్ణించలేనివి! దారికిరువైపులా మునులు తిరుగాడిన స్థలాలు.. మార్కండేయుడి తపోవనం దర్శనమిస్తాయి. ఆలయం నుంచి కొంతదూరం వెళ్లగానే పుష్కరిణి కనిపిస్తుంది.అక్కడ భక్తులు స్నానమాచరిస్తారు.

ప్రకృతి రమణీయత:
పుష్కరిణినే మూసీ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నాటి గుహలు... చారిత్రాత్మక, పురాతన కట్టడాలు చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తాయనడానికి అనంతగిరి ఉదాహరణగా చెప్పుకోవచ్చు! పుష్కరిణి దాటగానే దట్టమైన అడవులు.. అందమైన లోకేషన్స్ ఇక్కడి ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఇక్కడ పర్యాటకులు ఆనందంగా గడుపుతూ సేద తీరుతారు. భక్తుల అనంతమైన కోరికలు తీర్చే పేరుండటంతో అనంతపద్మనాభుడిగా పిలుచుకుంటారు. కర్ణాటక, మహార్రాష్ట వాసులకు ఈ ఆలయం ఇంటిదైవంగా విరాజిల్లుతోంది.

మూసీ పుట్టుక ఇక్కడే:

బలరామకృష్ణుల పాదాలు కడిగిన నీరే జీవనదిగా మారింది. కాలక్రమేణా దీనిని మూసీనది అని పిలవడం జరుగుతోంది. ఇది హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మీదుగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి మూసీనది ఉపనది కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

కనువిందు చేసే కోనేరు:
పద్మనాభుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిని భవనాశిని అని పిలుస్తున్నారు. భక్తుల పాపాలను హరించి, వారికి సత్ఫలితాలు ప్రసాదించడంతో ఈ కోనేటికి ఈ పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఈ కోనేటితో పాటు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు ఈ కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పూజలు చేసినట్లయితే కోరికలు ఫలిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

మార్కండేయ గుహ:
పసివయస్సులో తనను యముడు అంతమొందిస్తాడని తెలిసిన మార్కండేయుడు శివసాక్షాత్కారంతో పూర్ణాయుష్కుడవుతాడు. అనంతరం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో తపస్సుకు పూనుకొంటాడు. కలియుగ ప్రారంభంలో మార్కండేయుని భక్తికి మెచ్చిన మహా విష్ణువు అనంత పద్మనాభస్వామి అవతారంగా మార్కండేయునికి దర్శమిస్తాడు.

ఏటా రెండు జాతరలు:
భక్తుల కోరికలు తీర్చడంలో కొంగుబంగారంగా పేరొందిన అనంత పద్మనాభస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏడాదిలో రెండుమార్లు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతర నిర్వహిస్తారు.

ఆలయ ప్రాశస్త్యం:
ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి పురాతనమైంది. 13 వందల ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకృతి ఒడిలో వెలసిన అనంత పద్మనాభ స్వామి పేరు మీదుగానే ఈ కొండలను అనంతగిరి కొండలుగా పిలుస్తున్నారు. అనంతగిరి ప్రత్యేకత గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం విశేషం.

సినిమా షూటింగ్ స్పాట్:
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు ఎంచుకుంటున్నారు. అనంతగిరి కొండలను, అక్కడే కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే రావడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు ఇక్కడి ప్రాంతాలు అనువైనవని సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. నేడు అగ్ర హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు విడిది, భోజన తదితర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని హంగులతో కూడిన హరిత రిసార్ట్ కూడా ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేందుకు అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. టూరిజం రిసార్ట్ ఏర్పాటుతో సినీ పరిశ్రమ వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా మారింది. అంజి, పౌర్ణమి, రెడీ, జయం వంటి ఎన్నో హిట్ సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి.

ఎన్నెన్నో అందాలు:
పక్షుల కిలకిల రావాలు... కుందేళ్ల పరుగులు... నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోట్‌పల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి అలలను ముద్దాడుతూ వచ్చే చల్లని గాలలు బరువెక్కిన శరీరాన్ని తేలికపరుస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టులో జలకాలడుతూ ఆనందంగా గడుపుతారు. వికారాబాద్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో, పెద్దేముల్‌కు సమీపంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు హాలీడే స్పాట్‌గా మారుతోంది.

ఇప్పటికీ రహస్యమే:
భూమి నుంచి గంగ బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గరామలింగేశ్వరాలయంగా పిలువబడుతుంది. శ్రావణమాసం, కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడి కోనేటిలో నిత్యం జలం ప్రవహించడం విశేషం. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికే అంతుపట్టని రహస్యమే!

సూర్యోదయం సరిగ్గా సాయంత్రం స్కూల్ బెల్ కొట్టినట్టు 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చని ప్రకౄఎతి తో కలిసి అద్భుతమైన దౄఎశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉదయాన్నే సూర్యోదయం చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం. ఈ ప్రాంతం పర్యాటకులకి రోజు వారీ బిజీ లైఫ్ స్టైల్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. వారాంతంలోని ఈ ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.

సాహసికులకు ట్రెక్కింగ్:
మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్‌లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు. అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవిలో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్‌గా వెళ్తే మంచిది. అడవిలో సాహసం చేయాలనుకునేవారికి అనంతగిరిలో ఎన్నో ట్రెక్కింగ్ మరియు కామ్పింగ్ అవకాశాలు కలవు. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరం లో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్‌లో ఉన్న కామ్పింగ్ సైట్‌ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో విహారం చాలా బాగుంటుంది.

వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్' మరియు టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.

కోటిపల్లి రిజర్వాయర్:
నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్ అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలంలో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.

రవాణా మార్గం అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో అలసట అస్సలు తెలియదు. కేవలం రెండు గంటల సమయం లోనే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయంలో కూడా తినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, అనంతగిరి లోని భోజన సదుపాయాలు అంతంత మాత్రమే కావడం మరొక ముఖ్య విషయం. ఒక్క మాటలో అనంతగిరి గురించి చెప్పాలంటే ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే వారికి హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న అందమైన ప్రదేశం అని అనవచ్చు.








అనంతగిరి పద్మనాభ స్వామి
ఈ పద్మనాభుడు పవళించడు..!


భక్తుల పాలిట కొంగుబంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు. ఇక్కడ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు.

మూసీ నది జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక। అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః।। అంటూ... అనంతమైన సిరిసంపదలు ఇచ్చే ఆ దేవదేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.

స్థలపురాణం
సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.

ముచుకుందే మూసీ...
రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలం పాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరవైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించు.’ అంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వెళతారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియజేస్తోంది.

ఏటా రెండు సార్లు...
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఇలా చేరుకోవాలి
అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి డెబ్భై  కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్‌ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

అన్నెపు దామోదరరావు


Sunday, 18 February 2018

మానస సరోవరం





మనోహరం మానస సరోవరం.

ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ...’ అంటూ కళ్లు మూసుకుని శివ ధ్యానం చేస్తే మనోఫలకం మీద నిత్యం చూసే శివరూపం సాక్షాత్కరమవుతుంది. కానీ ఆ శివ సాన్నిధ్యంలో తాదాత్మ్యం చెందాలంటే మాత్రం ఆయన కొలువైన ఆ కైలాసాన్నీ, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూసి రావాల్సిందే’ అంటున్నారు ఇటీవలే కైలాస మానస సరోవర యాత్ర చేసి వచ్చిన హైదరాబాద్‌ వాసి ఎస్‌. గీతాంజలి.

మంచుకొండల్లోని మానససరోవరాన్నీ కైలాస పర్వతాన్నీ కళ్లారా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ భోళాశంకరుడి అనుగ్రహం ఇన్నాళ్లకు లభించినట్లుంది. మిత్రులంతా కలిసి ఈ యాత్రకు వెళుతున్నారని తెలుసుకుని నేనూ మా అమ్మాయితో బయలుదేరాను. అక్కడికి వెళ్లేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ కోసం రెండు నెలల ముందు నుంచే వాకింగ్‌, యోగా, ప్రాణాయామం చేశాం. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌... అన్నీ సిద్ధం చేసుకున్నాం.

ఎందుకంటే మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి. టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి. కాబట్టి పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూకి విమానంలో వెళ్లాం. అక్కడికి చేరేటప్పటికి నేపాల్‌ ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు మమ్మల్ని ఆహ్వానించి నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళ్లడానికి కార్లతో సిద్ధంగా ఉన్నారు. నాలుగు గంటల రోడ్డు ప్రయాణం అనంతరం నేపాల్‌ గంజ్‌ చేరుకున్నాం. టూర్‌ నిర్వాహకులు అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గది ఇచ్చారు. భోజనం చేసి సాయంత్రం నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం. అక్కడ సాయంత్రం ధూపదీపాలూ, ఘంటానాదాలూ, భజనలతో సాగే హారతి కార్యక్రమాలను చూసి ఆనందించాం. నేపాల్‌ యాత్రా నిర్వాహకులు ఎంతో ప్రణాళికతో ఉన్నా ప్రకృతి సహకరించకపోవడంవల్ల సెమికోట్‌కి వెళ్లలేకపోయాం.

దేవలోకం!
ఆ మర్నాడు వాతావరణం అనుకూలించడంతో సెమికోట్‌కు చార్టర్డ్‌ విమానంలో బయలుదేరాం. కొండల మధ్యలో నుంచి మేఘాలను తాకుతూ ప్రయాణించడాన్ని ఆనందించేలోగానే మళ్లీ వాతావరణం బాగోలేదని ఓ కొండ ప్రాంతంలో విమానాన్ని ఆపేశారు. దాంతో అందరం కిందకిదిగి కెమెరాలకు పనిచెప్పాం. చుట్టూ ఉన్న మంచుకొండల్ని ఫొటోల్లో బంధించాం. దాదాపు అరగంట తరవాత తిరిగి సెమికోట్‌కు బయలుదేరాం. సెమికోట్‌ సముద్ర మట్టానికి 2910 మీ. ఎత్తున ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఇళ్లన్నీ కొండలమీదే ఉంటాయి. అదేరోజు హెలీప్యాడ్‌లో హిల్‌సా గ్రామానికి బయలుదేరాం.

హిల్‌సా సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ... ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా అనిపించింది. పైలట్‌ చాలా జాగ్రత్తగా విమానాన్ని నడుపుతున్నాడు. ఆ అరగంట ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించింది. హిల్‌సాలో దిగగానే మాకోసం వేడి వేడి భోజనం తయారుచేశారు. అప్పటికే మా అందరికీ ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి మొదలైంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. దాంతో హిల్‌సా నుంచి తిరుగు ప్రయాణం వరకూ రోజూ ఉదయంపూట మాకు ఆ ట్యాబ్లెట్లే శివప్రసాదం.

హిల్‌సా ప్రాంతం అంతటా సౌరశక్తినే వాడుతున్నారు. రాత్రి పది గంటలకు చీకటి పడింది. కాస్త వెలుతురు కూడా లేదు. చుట్టూ ఆ కొండల మధ్యలో, చందమామా నక్షత్రాల వెలుగులో ఆ రాత్రి మరో లోకంలో ఉన్నట్లే అనిపించింది. నిజంగా ఇది దేవలోకమేమో అనిపించిందో క్షణం.

మానస సరోవరం!
మర్నాడు ఉదయం హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలో ప్రవేశించడానికి మా యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి కాబట్టి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది. కానీ ఇటీవల అనేక ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని నిర్వహిస్తున్నాయి. చైనా ఇమిగ్రేషన్‌ చాలా స్ట్రిక్టు. అవన్నీ పూర్తిచేసుకుని, నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్‌లోని హోటల్‌కి చేరేటప్పటికి సమయం ఆరు గంటలు దాటింది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ అందరం మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకున్నాం. ఎప్పుడెప్పుడు మానస సరోవరాన్ని చూద్దామా అన్న ఆలోచనతోనే తెల్లవారిపోయింది. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాటి ఉదయం 11 గంటలకు మానస సరోవరానికి బయలుదేరాం. ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.

ఇక్కడకు చేరడంతోనే మంచు వర్షం కురవడం మొదలైంది. ఈ సరోవరంలో ఎవరూ స్నానం చేయరు. ఇది ఉప్పునీటి కొలను. ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది. రావణాసురుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకో తలను ఖండిస్తూ శివదర్శనం కోసం తపస్సు చేశాడనీ, పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడనీ చెబుతారు.

అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది. దాన్ని చూడగానే ఓ అద్భుతంలా తోచింది. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉందా సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉన్న ఆ సరస్సు చుట్టూ బస్సులోనే ప్రదక్షిణ చేశాం. అక్కడ మాకు స్నానాలు చేసేందుకు కూడా వీలుగా ఓ చిన్న టెంటు వేశారు నిర్వాహకులు. సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తున్నాయి. అందరం గబగబా మూడు మునకలు వేసి బయటకు వచ్చాం. అందులో స్నానం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది. ఒడ్డు దగ్గరే దీపాలు వెలిగించాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పూజ చేసుకున్నారు. కొందరు యాగాలూ హోమాలూ కూడా చేశారు. మాకు దాని సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే టెంటులు వేసి వసతి ఏర్పాట్లు చేశారు.

దేవతలే దిగి వస్తే...
రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా గోచరిస్తారనీ పురాణాల్లో వింటుంటాం. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు గానీ, మాకెందుకో రాత్రి 2.45 నిమిషాలకు ఆకస్మికంగా మెలకువ వచ్చింది. బయటకు వెళ్లి చూసేసరికి ఓ అద్భుతం మా కళ్లముందు నిలిచింది. సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపించాయి. వాటిని చూడ్డానికి రెండుకళ్లూ చాల్లేదు. రెప్ప వేయకుండా మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డ కట్టించే చలిలో దాదాపు 45 నిమిషాలపాటు ఆ కాంతుల్ని చూస్తూనే ఉన్నాం. మా జన్మ ధన్యమైనట్లుగా భావించాం.

మర్నాడు మానస సరోవరం నుంచి కైలాస పర్వత దర్శనం కోసం వెళ్లాం. ముందుగా యమ ద్వారం వచ్చింది. దానికి మూడు ప్రదక్షిణలు చేసి ఓ ద్వారం గుండా వెళ్లి, రెండో ద్వారం గుండా బయటకు వచ్చాం. ఇక్కడ అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది అనుకుంటూ అంతులేని ఆనందంతో అందరం ఆ శిఖరాన్ని దర్శించుకున్నాం. అయితే కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపించింది. దాని పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ లేదు. అది మాకు ఎంతో చిత్రంగా అనిపించింది. పరిక్రమణ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో హోటల్‌కు తిరిగి వచ్చేశాం. అదే కైలాస పర్వతం చుట్టూ పరికమ్రణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌... వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయట. అవన్నీ చూడలేకపోయినప్పటికీ పరమశివుడు కొలువైన ఆ కైలాసగిరినీ బ్రహ్మ సృష్టించిన ఆ దేవతల సరస్సునీ ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ఆ పరమేశ్వరుడికి మనసులోనే ప్రదక్షిణ చేసుకుని, తిరుగు ప్రయాణమయ్యాం.


Tuesday, 12 September 2017

మహేంద్రగిరి


మహేంద్రగిరి.. ఎంత బాగుందో..!


‘ప్రకృతిలో మమేకమై కొండాకోనల్లో పర్యటించాలన్నా, మేఘాలమీద నడుస్తున్నట్లో గాల్లో తేలుతున్నట్లో ఉన్న అనుభూతిని సొంతం చేసుకోవాలన్నా, సాహసయాత్రలు చేయాలనుకున్నా... మహేంద్రగిరి ఎక్కాల్సిందే’ అంటున్నారు ఇటీవలే అక్కడికెళ్లొచ్చిన శ్రీకాకుళవాసి గేదెల భరత్‌కుమార్‌.

ఒడిశాలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరమైన మహేంద్రగిరి పర్వతాన్ని మిత్రులమంతా కలిసి అధిరోహించాలనుకున్నాం. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం మహేంద్రగిరే. సముద్రమట్టానికి 4925 అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లో ఉన్న ఆ పర్వతాన్ని ఎక్కేందుకు మేము ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకున్నాం. అక్కడినుంచి మూడు బైకులమీద 66 కి.మీ దూరంలోని మహేంద్రగిరి ప్రాంతానికి బయలుదేరాం. ఏడోమైలు, లంజిపొదొరో, జిరంగో, కొయ్‌పూర్‌, మడవ తదితర గ్రామాలు దాటి ముందుకు సాగాం. వంకరలు తిరిగిన ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డు అది. నేల నుంచి నింగి వరకూ పచ్చదనం పరుచుకుందా అనిపించేంతగా అబ్బురపరిచే ఎత్తైన కొండలూ, దారిపొడవునా కనిపించే సెలయేర్లూ, కొండలమీద నుంచి ఉరికే జలపాతాల సోయగాల్ని చూస్తూ 44 కి.మీ మేర సాగిన మా బైకు ప్రయాణం సాహసభరితంగా అనిపించింది.

మడవ గ్రామం దాటాక బుర్ఖత్‌ సమీపంలోని ఓ సాధువు ఆశ్రమం దగ్గర మా బైకులను నిలిపి కాలినడకన బయలుదేరాం. మూడు వైపులా ఎత్తైన కొండల్నీ కనుచూపుమేరలోని కొండలన్నింటినీ మింగేసిన మేఘాలను చూసి మంత్రముగ్ధులయ్యాం. అప్పటికే అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆ వర్షంలో తడుస్తూనే నిటారుగా ఉన్న ఆ కొండల్ని ఎక్కుతూ ముందుకెళ్లాం. కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న కొండలెన్నో ఎక్కాం. ఎత్తుకు చేరుతున్న కొద్దీ మేఘాల నడుమ నడుస్తున్నట్లూ ఆకాశాన్ని అందుకున్నట్లూ గాలిలో తేలుతున్నట్లూ అనుభూతి చెందాం.

సూర్యాస్తమయ సమయానికి మేం మహేంద్రగిరిపైకి చేరుకున్నాం. పచ్చదనంతో నిండిన కొండలను ముద్దాడే నీలాకాశంలో కనువిందు చేసే సూర్యాస్తమయ దృశ్యాల్ని కమ్ముకొస్తున్న చిరుచీకట్లు మెల్లమెల్లగా మింగేయసాగాయి. ఆ అందాల్ని చూస్తూనే ముందుకు సాగాం. చిక్కని చీకటి అడవంతా పరచుకుంది. సుదూరంలోని పలు గ్రామాలూ, పట్టణాల్లో రాత్రి పూట వెలిగి ఉన్న వీధి దీపాలు మిణుగురు పురుగుల గుంపులా కనిపించాయి. ఆ చీకటివెలుగుల దోబూచులాటలో అలా నడుస్తూనే ఉన్నాం. దారిపొడవునా పక్షులూ కీచురాళ్ల చిరుశబ్దాలు వీనులవిందు చేశాయి. అలా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మా నడక, రాత్రి తొమ్మిది గంటలవరకూ సాగి, ఎట్టకేలకు అక్కడున్న బాబా కుటీరానికి చేరుకున్నాం. మా బృందంలో సభ్యుడైన కోరాడ కృష్ణప్రసాద్‌కు ఆ ప్రాంతం చిరపరిచితం కావడం, గతంలో ఆయన అక్కడికి పలుమార్లు వెళ్లి ఉండటంతో చీకటిపడినా నడకమార్గంలో మేం ఎక్కడా దారి తప్పలేదు.

ఈ దట్టమైన అరణ్యంలో పర్వతశిఖరంపైన చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేసుకుని గత పదిహేనేళ్లుగా ప్రఫుల్లబాబా ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఓ యాగశాలను ఏర్పాటు చేసుకుని పదిహేనేళ్లుగా నిత్య హోమం నిర్వహిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఆదివాసీలే ఆయనకు అవసరమైన నిత్యావసరాలను అప్పుడప్పుడూ కింది నుంచి పైకి చేరవేస్తుంటారు.

ఆయన యాగశాల ఎదురుగా ఉన్న మట్టికుటీరంలో ఆ రాత్రికి పడుకున్నాం. అప్పటికే అక్కడ కుండపోతగా వర్షం కురుస్తోంది. మరోవైపు చలిగాలి మమ్మల్ని వణికించేస్తోంది. మాతో పాటు దుప్పట్లు తీసుకుని వెళ్లినా అక్కడి చలి నుంచి అవి ఎంతమాత్రమూ కాపాడలేకపోయాయి. దీంతో బాబా తన దగ్గరున్న రగ్గులు కప్పుకోమని ఇచ్చారు. వాటిని కప్పుకొని చలినుంచి రక్షణ పొందాం.

ఆధ్యాత్మిక కేంద్రం!
ఏడాది పొడవునా మానవ సంచారమే కనిపించని ఈ ప్రాంతం, మహాశివరాత్రి ముందు రోజు మాత్రం భక్తులతో నిండిపోతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు కాలినడకన తరలివచ్చి, శివలింగాలను దర్శించుకుంటారు. ముందురోజు రాత్రికే కొండపైకి చేరుకుని అక్కడే చెట్లూ, పొదల మాటున బస చేస్తారు. చలికాలం కావడంతో ఆ సమయంలో ఎటువైపు చూసినా నెగళ్లే కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో కార్తీక మాసంలోనూ ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ పర్వతంపైనే పరశురాముడు తపస్సు చేశాడనీ చెబుతారు. అందుకు ప్రతీకగా రెండు దశాబ్దాల కిందట ఈ పర్వత శిఖరంపైన పరశురాముడి విగ్రహాన్నీ ఏర్పాటుచేశారు. ధ్యానం, యోగాభ్యాసానికి అనుకూలప్రదేశం కావడంతో వాటి సాధన కోసం వస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అలా వచ్చేవారిలో చాలామందికి బాబా మట్టికుటీరమే శరణ్యం. కానీ అది చాలా చిన్నది. అయినా వచ్చేవాళ్లు వంటసామగ్రి వెంట తెచ్చుకుని అక్కడే వండుకుని నిద్రిస్తుంటారు.

పాండవుల ఆలయాలు
మర్నాడు ఉదయం నిద్రలేవగానే బయటకు వచ్చి చూస్తే మంచుపొరలు చీల్చుకుంటూ వెలుగులు చిమ్మే సూర్యోదయం అనిర్వచనీయ అనుభూతిని మిగిల్చింది. సమీపంలోని బంగాళాఖాతం తీరమూ, గ్రామాలూ, పట్టణాలు అన్నీ కలిసి ప్రకృతి కాన్వస్‌పైన చిత్రకారుడు వేసిన చిత్రాలను తలపించాయి.మేం బస చేసిన ఆశ్రమానికి సమీపంలోనే పాండవుల ఆలయాలు ఉన్నాయి. వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారనీ, అప్పుడు ఈ ఆలయాలను నిర్మించారనీ చెబుతారు. కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి శిథిలమయ్యాయట. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉన్నాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతీ ఆలయాన్ని అత్యంత అరుదైన రాతికట్టుతో నిర్మించారు. దీని వాస్తునిర్మాణం ఓడ్ర శిల్పాన్ని పోలి ఉంది. ఆలయం భూమి లోపలికి దిగినట్లు కనిపిస్తుంది. మెట్లు దిగి లోపలికి వెళ్లాం. ఆలయం ముఖద్వారం పశ్చిమదిశలో ఉంది. ఆలయం వెలుపలి భాగంలో తూర్పున కుమారస్వామి, ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన విఘ్నేశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఎదురుగా రెండు పురాతన బావులున్నాయి. ఎత్తైన కొండమీద వాటిని ఎలా తవ్వారన్న ఆలోచన ఆశ్చర్యానికి గురిచేసింది.






కుంతీ మందిరం నుంచి ఉత్తరదిశలో ఉన్న కొండపైన ధర్మరాజు ఆలయం ఉంది. ఈ పర్వతంపైన ఉన్న ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. దీనికి పశ్చిమదిశలో ముఖద్వారం ఉంటుంది. భక్తులు దీన్ని యుధిష్ఠర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం కళింగ నిర్మాణ శైలిలోని త్రిరథ ఆకారాన్ని పోలి ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం పక్కనుంచి పారే సెలయేటి సవ్వడి మమ్మల్ని చాలాసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండ శిఖరంపైన భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఆ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపైన ఉన్న అన్ని ఆలయాల్లో ఇదే పురాతనమైనది. క్రీ.శ.ఆరో శతాబ్దానికి ముందే ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ పర్వతం కొసన ఉన్న ఓ కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. చుట్టూ చెట్లూ వాటి మధ్య రాళ్లూరప్పలతో కూడిన అత్యంత క్లిష్టమైన మార్గంలో ఆ ఆలయానికి చేరుకున్నాం.





మహేంద్రతనయ నది జన్మస్థలం
స్నానపానాదులు ముగించుకుని మహేంద్ర తనయగా పిలిచే నది పుట్టిన ప్రదేశం చూడ్డానికి వెళ్లాం. ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని వేల ఎకరాలకు తాగు, సాగునీరును అందించే మహేంద్రతనయ ఈ పర్వతంలోనే పుట్టింది. అయితే అది ఎక్కడన్నది కచ్చితంగా చెప్పలేం. దాని ఆనవాళ్లుగా అనేక ప్రవాహాలు చూపిస్తారు. ఎందుకంటే మహేంద్రగిరి పర్వతంపైన ఏడాదిపొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ వర్షపు నీరు ఆ కొండపైన అనేక సెలయేర్లుగా, జలపాతాలుగా పారి కిందికి వచ్చేసరికి నది రూపును సంతరించుకుని, రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వైపు సాగి, 70 కి.మీ మేర ప్రవహించి గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో కలిస్తే, మరో పాయ మందసవైపుగా సాగి 40 కి.మీ.మేర ప్రవహించి బారువవద్ద సముద్రంలో కలుస్తుంది.

జీవవైవిధ్యానికి కేంద్రం
మహేంద్రగిరి జీవవైవిధ్యానికీ కేంద్రమే. నెమళ్లు, ఎగిరే ఉడుతలు, రాక్షస తొండలు, ఏనుగులు, మచ్చల జింకలు, మైనాలు వంటి అనేక రకాల అరుదైన జీవజాలానికి ఇది నివాస కేంద్రం. దాదాపు 1200 రకాల జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ పుష్పజాతులకు చెందిన మొక్కల్లో 35 శాతం మొక్కలకు మహేంద్రగిరి ఆవాస కేంద్రమని గుర్తించారు. దాదాపు 300కు పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అతి త్వరగా అంతరించిపోతున్న, అత్యంత అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇప్పటికీ ఈ పర్వతంపైన లభిస్తున్నాయి.

అక్కడ పూటపూటకీ ఆకాశంలో రంగులు మారిపోసాగాయి. తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచూ, అంతలోనే చురుక్కుమనిపించే సూర్యోదయం, ఉన్నట్టుండి భోరున కురిసే వర్షమూ సాయంసంధ్యా సమయానికి ఆహ్లాదాన్ని పంచే శీతగాలులూ రాత్రికి ఎముకలు కొరికేసే చలీ... ఇలా ఒక్క రోజులోనే అనుభవంలోకి వచ్చిన అక్కడి వాతావరణానికి అచ్చెరువొందుతూనే పర్వతం మొత్తాన్నీ చుట్టి ఆ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం.

ఎలా వెళ్లాలి?
మహేంద్రగిరిని పర్యటించాలనుకునేవాళ్లకి అక్కడ బస చేయడానికి తగిన సదుపాయాలు లేవు. కాబట్టి ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకుంటే అక్కడ బస చేయడానికి లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 200 కి.మీ దూరంలో, భువనేశ్వర్‌ నుంచి 285 కి.మీ దూరంలోనూ పర్లాఖెమొండి ఉంది. ఒడిశాలోని బ్రహ్మపురం రైల్వేస్టేషన్‌ నుంచి 120 కి.మీ., శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌ నుంచి 40 కి.మీ దూరం ప్రయాణించీ పర్లాఖెమొండి చేరుకోవచ్చు. పర్లాఖెమొండి నుంచి మహేంద్రగిరికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. లేదా కొయిన్‌పూర్‌ వరకూ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించొచ్చు. వ్యక్తిగత వాహనాల్లో వెళితే బుర్ఖత్‌ వరకూ చేరుకోవచ్చు. అక్కడ వాహనాలను నిలిపేసి కాలినడకన ఎక్కాల్సిందే. కొయినపూర్‌లో అటవీశాఖ అతిథిగృహం ఉంది. అక్కడ నలుగురు బస చేసేందుకు వీలుంటుంది. అక్కడ కూడా వాహనాలను నిలిపి కాలినడకన పర్వతాన్ని ఎక్కొచ్చు.







మహేంద్రజాలం చూడాల్సిందే!

తూర్పుకనుమల్లో అందాలు నెలకొన్న కొండలు మహేంద్రగిరులు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పర్వత శ్రేణులపై ప్రకృతి ఎప్పుడూ పరవశిస్తూ ఉంటుంది. చెట్లు, చేమలతో పచ్చలపేరులా మెరిసిపోతున్న మహేంద్రగిరుల్లో.. అక్కడక్కడా వజ్రాలు పొదిగినట్టుగా అపురూప ఆలయాలు దర్శనమిస్తాయి. ముత్యాలు కుమ్మరించినట్టుగా నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ గిరులకు ఏడాదంతా పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వేల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడి పాండవుల ఆలయాలను సందర్శిస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ప్రతిష్ఠించిన మహాలింగాలను భక్తితో పూజిస్తారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో ఉంటాయి మహేంద్రగిరులు. సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్నాయివి. అరుదైన వృక్షసంపద వీటి సొంతం. వనవాసకాలంలో పాండవులు మహేంద్రగిరులపై కొంతకాలం గడిపారని చెబుతారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో మందిరాన్ని నిర్మించుకొన్నారని స్థానిక కథనం. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు అక్కడ పాండవుల పేరిట ఆలయాలు కనిపిస్తాయి. ధర్మరాజు, కుంతీదేవి ఆలయాలు ఒక ప్రదేశంలో ఉండగా.. భీమసేనుడి ఆలయం ఎత్తయిన శిఖరంపై కనిపిస్తుంది. అక్కడికి కొంత దూరంలో అర్జునుడు, నకుల, సహాదేవుల ఆలయాలు ఉన్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో పాండవులు ప్రతిష్టించారని భావించే లింగాలు కనిపిస్తాయి.

కాలప్రవాహంలో ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా.. వాటి ప్రాశస్త్యం మాత్రం తగ్గలేదు. ఏటా శివరాత్రి సందర్భంగా మహేంద్రగిరులపై జరిగే ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు వ్యయప్రయాసలకోర్చి సాహసయాత్రకు పూనుకుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే భక్తులంతా గిరులపైకి చేరుకుంటారు. పూజాసామగ్రి, మంచినీళ్లు, ఆహారం, పళ్లు అన్నీ వెంట తెచ్చుకుంటారు. శివరాత్రి ఉపవాస దీక్షలో ఉంటారు. భజనలతో రాత్రంతా జాగరణ చేస్తారు. మర్నాడు భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. శివరాత్రి సందర్భంగా జనంతో కిటకిటలాడే మహేంద్రగిరులు ఆ తర్వాత బోసిపోతాయి. సాహస యాత్రికులు మాత్రం తరచూ ఇక్కడికి వస్తుంటారు.

ఇలా వెళ్లాలి..

  • మహేంద్రగిరుల యాత్రకు సాహసంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ముందుగా శ్రీకాకుళం, ఇచ్ఛాపురం నుంచి బస్సుల్లో మందస మండలం సింగుపురం చేరుకోవాలి.
  • మహేంద్రగిరులకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పలాస. ఇక్కడి నుంచి మందస మీదుగా సింగుపురం చేరుకోవచ్చు. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
  • సింగుపురం నుంచి వాహనాల్లో.. చొంపాపురం మీదుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామమైన రాజబసకు వెళ్లాలి. ఆపై కాలినడక మొదలవుతుంది. దాదాపు 28 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చల్లని గాలులు, ప్రకృతి సౌందర్యం, గలగల పారే సెలయేళ్లు.. యాత్రికులకు అలసట తెలియనివ్వవు.
కాశీబుగ్గ-మందస

Monday, 10 April 2017

కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!


కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!





లంబసింగి - దక్షిణాది కశ్మీర్‌!
తెలుగురాష్ట్రాల్లోకెల్లా అత్యంత చల్లని ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే లంబసింగి తరవాతే మిగిలినవన్నీ. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామమే లంబసింగి. ఆంధ్రా కశ్మీరుగా పేరొందిన లంబసింగిలో డిసెంబరు - జనవరి నెలల్లో ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలకూ పడిపోతుంది. మిగిలిన కాలాల్లో పది డిగ్రీల సెల్సియస్‌కు మించదు. చలికాలంలో అయితే పదిగంటల తరవాతే సూర్యోదయం. చిత్రంగా ఈ వూరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వాతావరణం యథాప్రకారంగానే ఉంటుంది. వేసవిలో అరకులోకన్నా చల్లగా ఉండే ఈ ప్రదేశంలో ఎటు చూసినా చిక్కని పచ్చదనం పరిచినట్లే ఉంటుంది. ఈ ప్రాంతానికే కొర్ర(కర్ర)బయలు(బయట) అని పేరు. ఎవరైనా పొరబాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారట. అక్కడి దట్టమైన అడవుల్లోని చెట్ల మధ్యలోంచి నడుస్తుంటే ఇంగ్లిష్‌ కవి Robert Frost చెప్పిన 
The woods are lovely, Dark and Deep. అన్న కవిత తప్పక గుర్తొస్తుంది. అక్కడున్న పొడవాటి చెట్ల మధ్యలోని చల్లని వాతావరణం కారణంగానే ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటల పెంపకాన్ని చేపట్టింది అటవీశాఖ. పక్షిప్రేమికులకీ ఇది ఆటవిడుపే. పక్షుల కుహుకుహురాగాలు సందర్శకులకు వీనులవిందు కలిగిస్తుంటాయి. దీనికి 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాత అందాలు గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ ఓ నాలుగు రోజులపాటు ఉండాలనుకునేవాళ్లు చింతపల్లిలో ఉండొచ్చు. చింతపల్లి నుంచి సీలేరు ఘాట్‌రోడ్డు ప్రయాణంలో మబ్బులు మనముందే పరుగులుతీస్తూ మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా మంచుపడుతూ మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే వేసవిని ఆస్వాదించాలనుకునే ప్రకృతిప్రియులు లంబసింగి దారి పడుతున్నారు. కాబట్టి ఆ చల్లని ప్రదేశంలో గడపాలనుకునేవాళ్ల పాలిట స్వర్గధామం ఈ చల్లని కొండగ్రామం!

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 571, విశాఖపట్టణానికి 101, చింతపల్లికి 19, నర్సీపట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి బస్సు, ట్యాక్సీల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్లేవాళ్లు విశాఖపట్టణం వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి బస్సు, ట్యాక్సీల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.




అరకులోయ
పచ్చకోక కట్టుకున్న తూర్పుకనుమల సిగలో విరిసిన మరో ముగ్ధసింగారమే అరకులోయ. పొగమంచు జలతారు ముసుగేసుకుని, గిరిజనుల థింసా నృత్యగానాలతో పర్యటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది. ఓ పక్క కొండల మధ్యలోంచి దూకే జలపాతాలూ మరోపక్క ఆవులిస్తున్న లోయలూ ఇంకోపక్క చీకటి సొరంగాలూ ఎటుచూసినా ప్రకృతి సుందరి అందాలే. చుట్టూ కొండలూ ఆ మధ్యలోని లోయలో విరిసిన వలిసెపూల అందాలను చూడాలంటే మాత్రం చలికాలం ప్రారంభంలోనే అరకులోయకి ప్రయాణం కట్టాలి. అడవిబిడ్డల మధ్యలో అక్కడి చల్లని వాతావరణంలో ఓ నాలుగురోజులపాటు సేదతీరాలనుకునేవాళ్లు మాత్రం ఎప్పుడైనా బయలుదేరవచ్చు. 36 సొరంగాలు దాటుకుంటూ వెళ్లే విశాఖ - అరకులోయ రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. అరకు వెళ్లే దారిలోనే ప్రాచీనకాలంనాటి బొర్రాగుహలు రాతియుగానికి తీసుకెళ్లిపోతాయి. కాలచక్రం ఓసారి గిర్రున వెనక్కి వెళ్లిపోయి, వేల సంవత్సరాల క్రితం మనిషి జాడల్ని పోల్చగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించకమానదు. ఇక, అక్కడి బొంగు చికెన్‌ రుచి సరేసరి.

బొర్రా గుహల నుంచి కారు లేదా బస్సులో ఘాట్‌రోడ్డులో అరకుకు ప్రయాణం నగరజీవిలోని ఒత్తిడినంతా చేత్తో తీసేసినట్లుగా మాయం చేస్తుంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే ఎత్తైన సిల్వర్‌ ఓక్‌ చెట్లూ వాటికి పాకించిన మిరియాల పాదులూ ఆ మధ్యలోని కాఫీ పొదలూ ఎటుచూసినా ఆటవిడుపే. ఆ కాఫీ తోటలకు ఓ పక్కగా ఆగి, అక్కడి గిరిజన యువతులు అందించే కాఫీని రుచి చూడకపోతే అరకు పరిసరాల్ని అవమానించినట్లే. ఆ చల్లని కొండల్లో వేడి వేడి కాఫీ గొంతు దిగుతుంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇదే అనిపించక మానదు. వంపులు తిరిగిన ఘాట్‌రోడ్డు మెలికలన్నీ దాటుకుని, విశాలమైన మైదానాన్ని తలపించే లోయలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తే ఓ వరసలో పేర్చినట్లుగా గాలికొండ, రక్తకొండ, సుంకరిమెట్ట, చిటమోంగొండి కొండలు కనువిందు చేస్తాయి. తూర్పుకనుమల్లో కెల్లా ఎత్తైన జింధగడ శిఖరం ఇక్కడే ఉంది. లోయలో నుంచి కొండల్లోకి ఒరిగిపోతున్న సూర్యాస్తమయ, సూర్యోదయ దృశ్య అందాల్ని చూసి తీరాల్సిందే. అరకులోయలో నిర్మించిన ట్రైబల్‌ మ్యూజియం, కళాగ్రామాలు గిరిపుత్రుల సంస్కృతీసంప్రదాయాలూ కళలకూ అద్దం పడతాయి. అక్కడే రంగురంగుల పూలసోయగాలూ గులాబీల గుబాళింపులతో కొలువుదీరిన పద్మనాభపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో తిరుగుతుంటే సమయమే గుర్తుకురాదు.

తరవాత సరిగ్గా ఇక్కడకు 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరి కొండల్నీ అక్కడి కాఫీతోటల్నీ ఉరకలెత్తే జలపాతాల్ని కూడా చుట్టేయ్యొచ్చు. పాడేరు వెళ్లే దారిలోని చాపరాయి, కటికి జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆ కొండల్లోని అందాలను వీక్షిస్తూ నాలుగురోజులు ఉండాలనుకునేవాళ్లకోసం పర్యటక శాఖ రిసార్టులతోబాటు ప్రైవేటు హోటళ్లూ లాడ్జ్‌లూ వున్నాయక్కడ. అనంతగిరికి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలోని తైడలో జంగిల్‌బెల్స్‌ రిసార్టులోనూ సేదతీరవచ్చు. అరకులోయలోనూ ప్రభుత్వ అతిథి గృహాలతోబాటు ప్రైవేటు హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముందుగానే వాటిని బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

ఎలా వెళ్లాలి:
విశాఖపట్టణం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకు ఉదయాన్నే రైలు ఉంటుంది. ఆ రైల్లో బొర్రా గుహల వరకూ వెళ్లి, వాటి సందర్శన అనంతరం కాఫీతోటలమీదుగా బస్సు లేదా ప్రైవేటు వాహనంలో అరకులోయకు చేరుకోవచ్చు. తిరిగి విశాఖకు వచ్చేటప్పుడు కారు లేదా బస్సులో వస్తే ఘాట్‌రోడ్డు అందాలను వీక్షించవచ్చు.




హార్స్‌లీ హిల్స్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నైరుతీదిక్కున ఉన్న మరో చల్లని కొండ ప్రదేశమే హార్స్‌లీ హిల్స్‌. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం చెంచు తెగలకీ పుంగనూరు ఆవులకీ పెట్టింది పేరు. ఆంధ్రా వూటీగానూ పేరొందిన దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మకొండ. ఒకప్పుడు ఇక్కడ నివసించే మల్లమ్మ అనే బాలిక, ఏనుగుల్ని సంరక్షిస్తుండేదట. అక్కడ నివసించే చెంచులకి ఏదైనా జబ్బు చేస్తే మందు ఇచ్చేదట. ఉన్నట్లుండి ఒకరోజు ఆ అమ్మాయి ఆకస్మికంగా మాయమైపోవడంతో ఆమెనో దేవతగా భావించి గుడి కట్టించి పూజించసాగారట చెంచులు. అందుకే దీనికా పేరు. తరవాత కడప జిల్లా కలెక్టరుగా వచ్చిన బ్రిటిష్‌ ఆఫీసరు విలియం డి.హార్స్‌లీ ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చేయడంతో ఇది హార్స్‌లీ హిల్స్‌గా స్థిరపడిపోయింది.

సముద్రమట్టానికి 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వందలకొద్దీ పక్షిజాతులూ ఎలుగుబంట్లూ సాంబార్లూ పాంథర్లూ అడవికోళ్లూ వంటి జంతువులూ; ఎర్రచందనమూ బీడీ కుంకుడూ సీకాయా దేవదారూ వెదురూ వంటి చెట్లకు నిలయమైన కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ; పర్యావరణ ఉద్యానవనమూ; మల్లమ్మ ఆలయం... ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఎత్తైన యూకలిప్టస్‌ చెట్ల నుంచి వీచే చల్లని గాలీ కాఫీ తోటల ఘుమఘుమలూ సందర్శకుల్ని మైమరిపిస్తాయి. దేశంలో జోర్బింగ్‌ క్రీడను అందించే అతికొద్ది ప్రదేశాల్లో ఇదీ ఒకటి. అయితే దీనికోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌... వంటి ఆటలకీ ఇది నెలవే. ఇక్కడకు దగ్గరలోనే గాలిబండ, వ్యూపాయింట్‌, పడవల్లో విహరించే గంగోత్రీ సరోవరం, మదనపల్లి శివాలయాల్నీ సందర్శించవచ్చు. పర్యటకశాఖవారి హరిత అతిథి గృహాలతోబాటు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా ఉంటాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 531 కి.మీ., తిరుపతి నుంచి 128, మదనపల్లె నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే ములకలచెరువు స్టేషన్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి, మదనపల్లిల నుంచి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.



అనంతగిరి
వికారాబాద్‌ సమీపంలో ఉండే అనంతగిరి ఏడాది పొడవునా సందర్శించదగ్గ ప్రదేశం. నిండైన ఆకుపచ్చ చీర కట్టుకున్న ఈ సుందరసీమలో ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు మించదు. అయితే చినుకులు మొదలయ్యే సమయంలో ఇది మరింత అందంగా కనువిందు చేస్తుంటుంది. మనిషి జీవించిన అత్యంత ప్రాచీన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీన గుహలూ మధ్యయుగంనాటి గుడులు పచ్చని అడవులూ జలపాతాలతో మనసును మరోలోకంలో విహరింపజేస్తుందీ ప్రదేశం. అప్పట్లో ఓ ముస్లిం చక్రవర్తి ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కట్టించడం విశేషం. అన్నింటికన్నా ప్రాచీనకాలంనాటి ఈ ఆలయ సందర్శన భక్తులకు ఆనందపారవశ్యాన్నీ కలిగిస్తుంది. ఇక్కడి కొండల్లోనే పుట్టిన ముచికుందా నది హైదరాబాద్‌ గుండా మొత్తం 240 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండజిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడికి సమీపంలోనే ఉన్న నాగసముద్ర సరోవరంలో పర్యటకులు పడవ షికారుకి వెళ్లవచ్చు. ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌..వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌కు సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరికి బస్సు సౌకర్యం ఉంది. కారులోనూ బైక్‌ మీదా కూడా వెళ్లి రావచ్చు.



ఇవేకాదు, అటు స్వామికార్యం ఇటు స్వకార్యం రెండూ నెరవేరాలనుకునేవాళ్ళకోసం శేషాచలకొండల్లో వెలసిన తిరుమల వెంకన్ననీ, నల్లమల కొండల్లో కొలువైన శ్రీశైల మల్లన్ననీ సందర్శించి, అక్కడి పుణ్యతీర్థాల్లో మునకలేసి, ఆ కొండగాలిలో తేలివచ్చే అడవిపూల పరిమళాల్నీ చెట్ల చల్లదనాన్నీ ఆసాంతం ఆస్వాదించి రావచ్చు. ఆధ్యాత్మిక చింతనతోబాటు ట్రెక్కింగులు చేయాలనుకునే సాహసికులకీ ఈ పుణ్యక్షేత్రాలు నిలయాలే. ఇంకెందుకు ఆలస్యం... ఆనందంగా విహరించండి!

Saturday, 11 June 2016

మహోన్నత ఆలయం ... కేదారేశ్వర్ గుహాలయం !

యుగాంతం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం యుగాంతం 2012. అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు, సునామీలు ఇలా ఎన్నో ప్రకృతి వైపరిత్యాల కారణంగా యుగాంతం అంతమవుతుందని పసిగట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళు తీసిన సినిమా ఇది. వాళ్ళకి సైన్స్ బాగా అంటబట్టింది కాబట్టి ఆ విధంగా తీశారు. మనవాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు బాగా అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి, యుగంతం ఎలా వస్తుందో అని స్వామీజీ వద్దకు వెళ్ళి అడిగితే - 'ఎప్పుడైతే పాపాత్ముల సంఖ్య భూమి మీద పెరిగిపోతుందో అప్పుడు దేవుడు భూమిని భస్మం చేస్తాడని' చెప్పేస్తారు.

శివుడు మూడో కన్ను తెరుస్తాడో? లేడో? మనకైతే తెలీదు కానీ నాలుగో స్తంభం విరిగితే మాత్రం యుగాంతం వస్తుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. అక్కడంటే ఎక్కడో అనుకొనెరు. స్వయాన మన భారతదేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రంలో ..! మహారాష్ట్ర లో ఎన్నో నదులకు, ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ మరియు అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. ఇంతకు ఈ ప్రదేశం చెప్పలేదు కదూ ..! హరిశ్చంద్రగడ్. హరిశ్చంద్రగడ్ ఒక హిల్ ఫోర్ట్ అంటే కొండ కోట. కొండ మీద ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఇంతవరకు చెప్పానే యుగాంతం అని ఆ అలజడి రేపే అంశాలు దాగి ఉన్నాయి. హరిశ్చంద్రగడ్ అహ్మద్ నగర్ జిల్లా కు చెందినదైనా దాని చరిత్ర మాత్రం దగ్గర్లోని మల్షేజ్ ఘాట్ తో ముడిపడి ఉన్నది. ఇక ఆలస్యం ఎందుకు? ఎలాగైనా అక్కడికి వెళ్తాం కదా .. ఆ వెళ్లెదీ కూడా మల్షేజ్ ఘాట్ మీదనే. దాన్ని కూడా చూస్తూ ... చివర ఆ యుగాంతం చేరుకుందాం స్వామీ అని !

మల్షేజ్ ఘాట్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
మల్షేజ్ ఘాట్ కు సమీపాన 150 కి. మీ. దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి మల్షేజ్ ఘాట్ చేరుకోవచ్చు.

రైలు మార్గం
కల్యాణ్ రైల్వే స్టేషన్ మల్షేజ్ ఘాట్ కు 80 కి. మీ. దూరంలో ఉన్న సమీప స్టేషన్. స్టేషన్ నుంచి గంటన్నార లో అక్కడికి చేరుకోవచ్చు.


మల్షేజ్ ఘాట్

మల్షేజ్ ఘాట్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది పూణే జిల్లాలో కలదు. సముద్ర మట్టానికి 700 మీ. ఎత్తున ఉండే ఈ ప్రదేశం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు సరదా రాయుళ్లకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇస్తుంది.


మల్షేజ్ ఘాట్ లో ఏమి చూడాలి?

శివాజీ పుట్టిన కోట, అందమైన జలపాతాలు, డ్యామ్, ఆ డ్యామ్ కు వచ్చే ప్లేమింగో పక్షులను చూడటం మరిచిపోకండి.


మల్షేజ్ జలపాతాలు

మల్షేజ్ జలపాతాలు సహజ అందాలకు ప్రసిద్ధి. పై నుండి కిందకు కు పదే ఆ నీటి ధార ప్రవాహం చూపరులను ఆకట్టు కుంటుంది. ఈ ప్రదేశం వర్షాకాలం స్వర్గధామం అనుకోండీ ..!


పిమ్పల్గావ్ జోగా డ్యామ్

పిమ్పల్గావ్ జోగా డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అందించే అద్భుతమైన దృశ్యాల నెలవుగా వుంది. జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి పక్షుల విహంగ వీక్షణలను చూసి పక్షి ప్రేమికులు ఆనందిస్తారు. ఫ్లెమింగో లాంటి వలస పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు.


హరిశ్చంద్రగడ్

ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ ప్రదేశం రానే వచ్చింది .... హరిశ్చంద్రగడ్. మల్షేజ్ ఘాట్ నుంచి ఈ ప్రదేశం దగ్గరదగ్గర 95 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో పర్వతారోహణ సూచించదగినది.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

హరిశ్చంద్ర గడ్ థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. థానే జిల్లా నుంచి : థానే నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బోర్డ్ తగిలించి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి ఖుబిఫట గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. ఖిరేశ్వర్ నుంచి 7 కి. మీ. వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

పూణే లోని శివాజీనగర్ ఎస్ టి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజూ ఖిరేశ్వర్ కు బస్సులు నడుస్తాయి.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

అహ్మద్ నగర్ జిల్లా నుంచి : నాసిక్, ముంబై లేదా అలైట్ కు వెళ్లే బస్సులు ఎక్కి ఘోటి గ్రామం చేరుకోవాలి. ఘోటి నుంచి సంగమ్‌నేర్ వయా మలేగావ్ మరియు అలైట్ బస్సులు ఎక్కి రాజూర్ గ్రామం చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి 3 దారుల్లో కోట కు చేరుకోవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

రాజూర్ గ్రామం నుంచి పచనై గ్రామం వరకు బస్సులో లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి నేరుగా ఉన్న మార్గంలో ఆ ఎత్తైన చోటుకి చేరుకోవాలి.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

కొత్తగా రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) వరకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. లోయ నుండి 2 - 3 గంటలు కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు.


హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?

కోటుల్ నుండి కొథలె వరకు లోయ ప్రాంతమైన తోలార్ ఖింద్ మార్గం గుండా ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం గంట గంట కు ఉన్నది.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

కొండ మీదకి చేరుకోవటానికి 4 -5 మార్గాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధి గాంచిన రూట్లు ఖిరేశ్వర్ నుంచి గుహలు, వాటర్ ట్యాంక్ ల ను దాటుకుంటూ జున్నార్ దర్వాజా వరకు చేరుకోవాలి. అక్కడి నుండి నేరుగా తోలార్ ఖింద్ కు చేరుకొని కొద్ది దూరం నడవాలి. రాళ్ళ గుట్టలను, తక్కువ అడవులున్న పీఠభూమి మైదానాలను, ఏడు కొండలను దాటుకుంటూ 2 - 3 గంటలు నడిస్తే హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.

గమనిక : నడిచి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గుర్తులు ఉపయోగ పడతాయి.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

ఈ ఏడు కొండలను స్కిప్ చేసి వెళ్లే మార్గం ఒకటి ఉన్నది. అది దట్టమైన అటవి ప్రాంతం కనుక వెళ్తే సమూహంగా(గ్రూప్ లుగా) వెళ్ళాలి. ఈ మార్గాన్ని బలెకిల్ల అంటారు. తోలార్ ఖింద్ నుండి రాక్ క్లైంబింగ్ చేసుంటూ వెళ్తున్న తప్పక ఆయాసం వస్తుంది. కాస్త ఆగుతూ వెళ్ళాలి. ఇలా వెళితే 1 -2 గంటల్లో హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.


కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు

బెల్పడ

మల్షేజ్ ఘాట్ నుంచి కల్యాణ్ వెళ్లే మార్గంలో బెల్పడ గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వయా సధ్లెఘాట్ గుండా 1 కిలోమీటరు దూరం నుడుచుకుంటూ దారిమధ్యలో ఎత్తుపల్లాలను, ఏటా వాలు రాళ్ళను దాటుకుంటూ వెళితే హరిశ్చంద్ర గడ్ చేరుకోవచ్చు.


కొథలె నుండి

హరిశ్చంద్ర గడ్ కు చేరుకోవటానికి సూచించదగిన మరో మార్గం కొథలె గ్రామం. ఇక్కడి నుంచి కోట మూడు కిలోమీటర్లు. నడక మార్గాన వెళ్తున్న మీరు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. దారి మద్యలో నీటి తో నిండిన కుంట లను, చెరువులను గమనించవచ్చు.


హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కేదారేశ్వర్ గుహాలయం



పక్క చిత్రంలో మీరు చూస్తున్నది అపురూపమైన, అద్భుతమైన కట్టడం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని హరిచంద్ర కోట లో ఉన్న కేదారేశ్వర్ స్వామి ఆలయం. ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి, కింద 4 స్తంభాల పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలీదు. ఎవరు నిర్మించారో కూడా తెలీదు. కానీ ఇక్కడున్న నాలుగు స్తంభాలు 4 యుగాలకి(సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం) సంకేతాలు గా నిలిచాయి. ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కనుక, ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే వున్నది. ఎప్పుడైతే ఈ స్తంభం కూడా విరిగిపోతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి మహాత్వమైన గోపురం ఇది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ... గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరూ లోనికి వెళ్ళరు. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు గుడి లో ఉండదు...!! వేసవి, శీతాకాలం లో 5 అడుగుల మేర ఎత్తులో నీరు వుంటుంది.


హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

కొండ మీద చూడవలసినది కోట.

కోట పురాతమైనది చాలా వరకు శిధిలాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం గురించి మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో పేర్కొన్నారు. కోటను కాలచూరి వంశీయులు నిర్మించారు. కోట సముద్ర మట్టానికి 1424 మీ. ఎత్తున ఉంటుంది.


కోట ఆవరణలో అందమైన విష్ణు దేవాలయం దగ్గర్లో పురాతన బౌద్ధ గుహలు ఉన్నాయి. మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం మరియు కేదారేశ్వర్ గుహాలయం కూడా సమీపంలోనే ఉన్నాయి.


సప్త తీర్థ పుష్కరణి

ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరణి చెరువు ఉన్నది. ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటుంది. అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి. మొన్ననే ఆ విగ్రహాలను గుహలకు దగ్గర్లోని హరిశ్చంద్రేశ్వర్ ఆలయానికి తరలించారు. వచ్చి పోయే ట్రెక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులను పడేసేవారు దాంతో గత 7 సంవత్సరాల నుంచి ఈ చెరువు కనీసం స్విమ్ చేయటానికి కూడా ఉపయోగపడటం లేదు. వేసవిలో ఈచెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ... ఫ్రిజ్ ముందర నిలబడ్డట్టు ఉంటుంది.


కొంకణ్ క్లిఫ్

ఇక్కడ అద్భుతమైన సూర్యోదయాలను, సూర్యాస్తమాలను చూడవచ్చు. ప్రకృతి అందాలను, లోయ అందాలను, సహజ ప్రకృతి సన్నివేశాలను కూడా గమనించవచ్చు.


తారామతి పీక్ / తారామంచి

ఈ పిక్నిక్ ప్రదేశం సముద్ర మట్టానికి 1429 మీ. ఎత్తున ఉంటుంది. దీనికి అనుకోని ఉన్న అడవుల్లో చిరుత లను చూడవచ్చు. పశ్చిమ కనుమల లోని కసర రీజన్ లో ఘోడ్‌శెప్(865 మీ.), అజోబా (1375 మీ) కులాంగ్ ఫోర్ట్(1471 మీ) లను కూడా చూడవచ్చు కానీ మసక మసక గా కనిపిస్తాయి.


హరిశ్చంద్రగడ్ గుహలు

దాదాపు కోట అంతటా గుహలు విస్తరించాయి. వాటిలో కొన్ని తారామని పీక్ వద్ద మరియు బస చేసే వద్ద ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.


నాగేశ్వర్ ఆలయం, ఖిరేశ్వర్ దగ్గర

ఇదొక విష్ణు దేవాలయం. ఇది ఖిరేశ్వర్ సమీపంలో ఉన్నది. ఇందులో ప్రధాన దైవం విష్ణువు. శిల్పం 1.5 మీ. పొడవు ఉండి విష్ణువు పడుకొని ఉన్న భంగిమలో ఉంటాడు.


హరిశ్చంద్రేశ్వర్ ఆలయం

ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్ కు వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు. సమీపంలో అనేక వాటర్ ట్యాంక్ కు ఉన్నాయి. ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కుచెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటున్నది.


వసతి సౌకర్యాలు

కొండ మీద ఉన్న గుహాల్లో గణేశ్ ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో 50 వరకు వసతి కల్పించవచ్చు. క్యాంపైనింగ్ కూడా సూచించదగినది.


కొథలె గ్రామంలో వసతి

కొథలె గ్రామంలో బస చేయటానికి చారిటబుల్ ట్రస్ట్ వారు, సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు , దాతలు తక్కువ ధరకే వసతి సదుపాయం కలిపిస్తున్నారు.


ఖిరేశ్వర్ వసతి

ఖిరేశ్వర్ లో రాత్రి పూట బస చేయటానికి లోకల్ స్కూల్ ఉత్తమం. ఇక్కడ చూడటానికి నాగేశ్వర్ ఆలయం మరియు యాదవ గుహలు ఉన్నాయి. పచ్‌నై గ్రామం లో రాత్రి పూట బస చేయటానికి హనుమాన్ ఆలయం సూచించదగినది.


భోజన సౌకర్యాలు

సమ్మర్ లో, వింటర్ లో స్థానికులు తయారు చేసిన వంటలను గుహల వద్ద అమ్ముతుంటారు కాబట్టి తినొచ్చు. ఐతే, మాన్సూన్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు వంటలు చేయరు అప్పుడు మనమే స్వయంపాకం చేసుకోవాల్సిందే ..!


తాగునీటి సౌకర్యం

తాగునీటి అవసరాలకై నిర్మించిన వాటర్ ట్యాంక్ కు గుహల వద్ద ఉన్నాయి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. తోలార్ ఖింద్ మరియు హరిశ్చంద్రగడ్ వద్ద వేసవి మరియు వింటర్ సీజన్ లో నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ అమ్ముతారు.

Friday, 10 June 2016

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .

ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు... కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం... అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి... చల్లని వాతవరణం... చుట్టూ పచ్చని చెట్లు... రంగురంగుల పక్షుల కిలకిలరావాలు... ఆ అనుభూతే వేరు. రాష్ట్రంలో ఉన్న ఎకైక వేసవి విడిదికేంద్రం హర్సిలీ హిల్స్‌. సముద్రమట్టానికి 1314 మీ ఎత్తులో ఉన్న ఈ అద్భుత విహారకేంద్రం... పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతోన్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేదదీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నేడు హార్సిలీ హిల్స్‌ కళకళ లాడుతోంది. ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్‌ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.

మత్తేకించే పూల ఘమఘమలు...
హార్సీలీహిల్స్‌.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్‌ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.

ఆ పేరు ఎలా వచ్చిందంటే...
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వున్న ఈ ప్రాంతం.. ఒకప్పుడు కడప జిల్లాలో వుం డేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీషు హయంలో కలెక్టర్‌గా వున్న డబ్ల్యూ.డి హర్సీలీ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఆయ నకు విశ్రాంతి నిలయంగా వున్న ఈ ప్రాంతం కొన్నాళ్ల తరువాత మెల్లగా ఆయ నకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని ఆధికారిక కార్యక్రమాలు అక్కడి నుంచే సాగేవి. దీంతో ఈ కొండ ప్రాంతాలకు ‘హర్సీలీహిల్స్‌’గా పేరు ముద్ర పడిపోయింది. 1863లో ఆయన వేసివి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మిం చారు. దీనిని ఫారెస్టు బంగ్లా అంటారు. అ తరువాత కార్యలయ భవనం నిర్మిం చారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసా యోగ్యంగా వుండి వాడుకలో వుండడం విశేషం! ఫారెస్టు బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హర్సీలీ పేరు పెట్టారు.

ఆహ్లాదాన్నిచ్చే చల్లగాలులు...
చల్లని పిల్లగాలులు పర్యటకుల శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో విస్తరించిన కొండలే హర్సీలీ కొండలు. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి మండువేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత వున్న ఈ ప్రాంతం, చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు పర్యాటకులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు. హర్సీలీకొండల వాలుపై సంపెంగ పూల మొక్కలను నాటింది ఈ చెంచులే.

చూడముచ్చటైన చెంచు జానపదం...
ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు - పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్‌ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ... పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుపుతారు.

అరుదైన వన్యసంపద...
భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ - అనే పేరుగల యూకలిప్టస్‌ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో W.D.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందేళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకుల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెండుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరిస్తాయి. మొసళ్ళు మిసమిసలాడుతూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్‌ పూల్‌ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అలరిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమనడం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.

సాహసవీరుల ఖిల్లా...
హర్సీలీహిల్స్‌ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, బంజీ రన్నింగ్‌, గోర్బింగ్‌, రాపెల్లింగ్‌, బర్మాబ్రిడ్జి వాకింగ్‌, బర్మాలూప్స్‌, ఎర్త్‌కేక్‌ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్‌, పెద్దలకు బార్‌, సిమ్మింగ్‌పూల్‌ మొదలు ఆర్డర్‌ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్‌ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో... మైమరిపించే రాయలసీమ స్పెషల్‌ ‘సంగటి - నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్‌ కుక్స్‌ కూడా ఇక్కడ ఉండడం విశేషం.

వసతి సౌకర్యాలు...
పర్యాటక శాఖ పున్నమి రిసార్ట్‌‌స, హరితా హిల్స్‌ రిసార్ట్‌‌స, గవర్నర్‌ బంగ్లా, ఫార ెస్టు బంగ్లా, చిత్తూరు సహకార సమాఖ్య అతిధి గృహం, ఎ.డి.సి క్వార్టర్స్‌ ఇలా లెక్కకు మించిన కాటేజీలు ఇక్కడ వున్నాయి. వీటితో పాటు హెల్త్‌ కబ్ల్‌, మసాజ్‌ సెంటర్‌ కాన్షరెన్సు హల్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా అందుబాటులో వున్నాయి. పర్యాటకులకు మరిన్ని వివరాలు అందించడానికి 09440272241, 08571 27932324 నెంబర్లుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా చేరుకోవాలి...
విమానల ద్యాదా వచ్చే దూరప్రాంత పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానశ్రయాలకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్యారా మదనపల్లికి చేరుకొని హార్సీల్‌హిల్స్‌ వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు మదనపల్లె రోడ్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హార్సీలీ హిల్స్‌ చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు వుంది. అలాగే అద్దె వాహనాల్లో కూడా కొండ మీదకు వేళ్ళవచ్చు.

- ఎస్‌.ఎం.రఫీ, మదనపల్లి
కర్టసీ : సూర్య Daily

Tuesday, 7 June 2016

అందాలొలికే అనంతగిరి

రాష్ట్రంలో ఉక్కు నగరంగా పేరుగాంచిన సుందర నగరం విశాఖ. ఈ అందమైన తీర ప్రాంత పట్టాణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. ప్రశాంతమైన ప్రకృతి నడుమ... దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, సుందర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ శీతలంగా ఉండటమే కాకుండా ఎంతో నయానందకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. రాష్ట్రంలో పేరొందిన హిల్‌ స్టేషన్లలో ఒకటి ఈ అరకు అనంతగిరి. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండల పై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి.

ముఖ్యంగా కొత్తగా పెళైన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసి నా సుగంధ సుమధుర పరిమళాలను అందించే కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనంద సాగరంలో ఓలాడిస్తుంది. అంతేకాకుండా రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పండ్ల తోటలు మాత్రమే కాకుండా వనమూలికలు కూడా లభ్యమవటం విశేషం. 

దక్షిణ బధ్రీనాథ్‌... 
ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలారావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది.

ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి. 

కోరిన కోరికలు తీర్చే... అనంత పద్మనాభుడు...
ప్రకృతి రమణీయతను విశేషంగా కలిగి ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చే యాత్రికులను భక్తి పారవశ్యంలో నింపుతుంది ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికు లు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిప డేస్తున్నట్లుగా ఉంటాయి. 

ఇలా వెళ్ళాలి...
అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే... ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్‌ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.

సాహసికులకు స్వాగతం

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్ - నేపాల్ సరిహద్దులన్నీ హిమాలయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఆశ్చర్యమేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింగ్ స్పాట్‌లలో కొన్ని మీకోసం...



ఎవరెస్ట్ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం, ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉం టుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మం చి ట్రెక్కింగ్ ప్రదే శంగా చేశాయి. ఇక్కడ మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్ హిమాల్ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి.

కాళి గండకి:
అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతై నది. హిందువుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షం పడే ప్రాంతాలు, నేపాల్ లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ నేర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్ మెచ్యూరిటీ (యూయస్ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచం లోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతంగా గుర్తించబడినది. పోఖరా ది సిటీ అఫ్ లేక్స్ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుంది. సహజ సౌందర్యంతో, చిత్రవిచి త్రంగా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

లంగ్ టంగ్:
ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకో వచ్చు. లంగ్‌టంగ్ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్ సరిహద్దుపై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రకాల మొక్కలకు, హిమాలయాల రెడ్ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతు వులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిదిగా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్‌కు చాలా చాలా అనువుగా ఉంటుంది. గోసాయి కుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

పర్వతారోహణము:
800 ల కిలోమీటర్ల నేపాల్‌లోని హిమాలయముల పంక్తి మౌంట్ ఎవరెస్ట్‌తో సహా 8,000 మీటర్లకు పైగా ఉన్న ఎనిమిది పర్వత శిఖరములు, ప్రపంచ ములోనే గొప్పవి. 1994లో దేశము ఈ పర్వత శిఖరములు ఎక్కడానికి అనుమతించినప్పటినుంచి, నేపాల్ హిమాలయములు పర్వతారోహణకు ఆల వాలము అయింది మరియు అందులో విజయము, అపజ యము వేలమంది స్త్రీలు, పురుషులకు అక్కడకు చేరడము అనే సవాలులో నెగ్గాలన్న తపనను పెంచింది. ఈ నేపాల్ హిమాలయములు సాధువులు, తత్వవేత్తలు, పరిశోధ కులు లేదా సాహస ములు చేసేవారు వంటి ఎంతో మందికి ఆకర్షణియముగా ఉన్నాయి.

చూపుతిప్పుకోనివ్వని సోయగాలు:
బర్డ్ వాచింగ్ నేపాల్ పక్షి ప్రేమికులకు మొత్తము 646 జాతులతో(దాదాపు ప్రపంచములో 8% శాతము) స్వర్గధామము, మరియు వాటిలో దాదాపు 500ల జాతులు ఒక్క ఖాట్మండు లోయలోనే చూడవచ్చు. జాతీయ అభయా రణ్యములైన ఫుల్ చోకి, గోదావరి, నాగార్జున్, బాగమతి చెరువు, టౌడహాలు పక్షులను చూసే ప్రదేశములలో బాగా పేరు పొందినవి. మీ బైనాక్యులర్స్ కూడా తెచ్చుకుని ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన అనుభవము కొరకు ఎదురు చూడండి.

మౌంటైన్ ఫ్లైట్ భూమి పైన ఎత్తౖన పర్వత శిఖరములు చేరడము అనే అనుభవమునకు దగ్గరగా రాగలిగింది కేవలము భయానకమైన నిశ్శబ్దము మాత్రమే. పర్వత శిఖరములు మౌంట్ ఎవరెస్ట్,కాంచెనగంగ మరియు టిబె టన్ ప్లేటుల దగ్గరి విహంగ వీక్షణము ఇస్తాయి. పర్వతశిఖరములు అన్ని రక ముల ప్రయాణికులకు నచ్చుతాయి మరియు నేపాల్ పర్యాటకములో పేరు పొందిన ఆకర్షణ అయ్యాయి. సమయాభావంతో లేదా వేరే ఇతర ఏ కారణ ముల వలన అయినా కానీ ఇలా వెళ్ళలేని వారికి, ఈ శిఖరములు హిమాలయ ములకు నాలుగు దిక్కులా ఉన్న అధ్బుతమైన సౌందర్యమును ఒక్క గంటలోనే చూపిస్తాయి.రాక్ క్లైమ్బింగ్ అక్కడ ఉన్న క్లిఫ్ హంగర్స్ కు, ఖాట్మండ్‌లోని రాళ్ళ గోడల పంక్తి ఒక మంచి జీవిత అనుభవము అవుతుంది. ఆలస్యముగా అయినా, ఖాడ్మండ్‌లో రాక్ క్లైమ్బింగ్‌కు అనువుగా ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశముల వలన ఇది పేరు పొందిన ఆట అయింది. మీరు ఈ ఆట కోసము చూడదగిన ప్రదేశములలో నాగార్జున్, బలాజు, శివ్ పురి మరియు బుధానిల్ కంత వంటివి ముఖ్యమైనవి.

Sunday, 3 April 2016

మారేడుమిల్లి - రంపచోడవరం : దేవుని సృష్టించిన సొంత భూమి !

సహజ సిద్ధమైన అటవీ అందాలకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు మారేడుమిల్లి ప్రదేశం. తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 84 km. దూరంలో భద్రాచలం పోయే మార్గంలో ఈ మండలం ఉన్నది. తూర్పు కనుమల అటవీ అందాలను ఇక్కడ తనివితీరా ఆస్వాదించవచ్చు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది భద్రాచలం అడవుల్లో ఉందనమాట..! మారేడుమిల్లి లో వ్యూపాంట్లు అద్భుతంగా ఉంటాయి. డీప్ ఫారెస్ట్ లోనికి వెళ్లే కొలది దారిపోడవునా అడవి జంతువులు, అరుదుగా పులులు మరియు పక్షులు కనిపిస్తాయి. మరొక విషయం ఈ మారేడుమిల్లి అడవులను ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు తన స్థావరంగా ఉపయోగించేవాడట ..! ఇక్కడికి సమీపంలో 12 కి. మీ. దూరంలో రంపచోడవరం గ్రామం ఉన్నది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు పూజలు చేసేవాడట. జలపాతాలు, ప్రకృతి అందాలకు ఇది కూడా మారేడుమిల్లిని ఏమాత్రం తీసిపోదు. మరి ఈ వనవిహారంలో ఏమేమి చూడాలో ఒకసారి తెలుసుకుందాం పదండి !

మారేడుమిల్లి ఎలా చేరుకోవాలి?
మారేడుమిల్లి చేరుకోవాలంటే ..
విమాన మార్గం - మారేడుమిల్లి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం(82 KM) కలదు.
రైలు మార్గం - మారేడుమిల్లి కి సమీపాన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్ గా ఉన్నది. ఇక్కడైతే అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి.
రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటేమో రాజమండ్రి నుంచి, మరొకటేమో భద్రాచలం నుంచి.
1) ఉచిత సలహా ఏంటంటే, రాజమండ్రిలో ట్యాక్సీ లేదా ట్రావెలర్ అద్దెకు మాట్లాడుకోని వెళ్ళాలి.
2) రాజమండ్రి నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, భద్రాచలం అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, రెండు - మూడు గంటలు ప్రయాణించి మారేడుమిల్లి(85 కి.మీ) చేరుకోవాలి.
3) భద్రాచలం నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, రాజమండ్రి అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, 88 కి.మీ. దూరం ప్రయాణించి మారేడుమిల్లి చేరుకోవాలి.

ఏమేమి చూడాలి ?
మారేడుమిల్లిలో మరియు చుట్టుప్రక్కల చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధాన ఆకర్షణ జలతరింగిని జలపాతం. ఈ జలపాతం అందమైన ప్రకృతి ప్రదేశంలో ఉన్నది. దీనిని చూడటానికి తెల్లతెల్లారుజామున వెళితే బాగుంటుంది.

నందవనం
నందవనం - బేంబూ చికెన్ మరియు ఔషధ మొక్కల తోటలకు ప్రసిద్ధి. ఇదికూడా సహజ అందాల కోవకే చెందినప్పటికీ సరైన మేంటెనెన్స్(నిర్వహణ) లేదు. తూర్పు కనుమలు, ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన మొక్కలను సందర్శనకై ఉంచారు.

వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా
వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా ఒక ఎత్తుపల్లాల భూభాగం. సుమారు 260 హెక్టార్ లలో విస్తరించిన ఈ ఏరియాలో 230 రకాల మొక్కలు మరియు అరుదైన మొక్కలను గుర్తుంచారు. ఇది కూడా సందర్శించదగినదే ..!

కార్తీకవనం
కార్తీకవనం మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ముఖ్యంగా కార్తీక మాసంలో(అక్టోబర్ నెలలో) ఇక్కడ వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. రావి, వేప, ఉసిరి, మర్రి మరియు బిల్వ మొక్కలు ఎక్కవగా కనిపిస్తాయి.

కాఫీ మరియు పెప్పర్ తోటలు
నందవనంలో చూడవలసిన మరో స్పాట్ కాఫీ మరియు పెప్పర్ తోటలు. వీటితో పాటు చెట్లు, పొదలు మరియు వివిధ పండ్ల తోటలు చూడవచ్చు.

మదనకున్జ్ - విహార స్థలం
మదన కున్జ్ విహార స్థలం అడవిలోకి వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఇక్కడ పులులు, అడవి దున్నలు, జింకలు, నెమళ్ళు, అడవి కోళ్లు, ఎలుగు బంట్లు చూడవచ్చు. పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అడవి పక్షులు, సీతాకోక చిలుకలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

క్రొకడైల్ స్పాట్
ఇక్కడ పాములేరు వాగు ఉంద. అక్కడే ఈ క్రొకడైల్స్ ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేయటం నిషేధం కారణం మీకు తెలుసుగా ..?

టైగర్ స్పాట్
టైగర్ స్పాట్ మారేడుమిల్లికి 5 కి.మీ. దూరంలో అడవిలో ఉంటుంది. అక్కడికి వెళితే పులుల గాండ్రింపులు వినవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్
సైట్ జంగల్ స్టార్ క్యాంప్ సీట్ కి, రామాయణానికి మధ్య లింక్ ఉంది. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు భావిస్తుంటారు. క్యాంప్ సైట్ పక్కనే మూడు వైపుల నుంచి ప్రవహించే వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు, అడవులు చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.

వనవిహారి రిశార్ట్
మీరు వనవిహారి రిశార్ట్ లో బస చేసేవారితే అక్కడికి సమీపంలోని జంగల్ స్టార్ రిసార్ట్ కు వెళ్ళి, ఆ ప్రదేశ అందాలను, పాములేరు ప్రవాహాన్నీ ఆనందించవచ్చు.

మరిన్ని జలపాతాలు
స్వర్ణ ధార, అమృత ధార అనేవి మారేడుమిల్లిలో చూడవలసిన మరికొన్ని జలపాతాలు. ఇలా ఎన్నో మారేడుమిల్లిలో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు ఉన్నాయి.

రంపచోడవరంలో ...
రంప జలపాతం రంపచోడవరంలో చూడవలసిన ప్రధాన టూరిస్ట్ స్పాట్. ఈ జలపాతం సంవత్సరం పొడవునా నీటి ప్రవాహాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే పురాతన శివాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. అల్లూరి సీతారామరాజు ఈ ఆలయంలోనే పూజలు చేసేవాడట ..!

రంప జలపాతం
శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం రంప చోడవడం గ్రామానికి 4KM దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి మాత దీవించి ప్రసాదించిన నీలకంఠేశ్వర మరియు రంప జలపాతాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో, అడవుల్లో ఉన్న ఈ జలపాతాల శబ్ధాలు ఒకింత అనుభూతిని, ఆనందాన్ని మిగుల్చుతుంది.

పురాతన శివాలయం
స్థానిక ప్రజలు, చుట్టుప్రక్కల ప్రాంతాలైన కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద శివరాత్రి పర్వదినాన, సెలవు దినాల్లో జలపాతాల వద్దకి వచ్చి ఆనందంలో మునిగి తేలుతారు. స్నానాలు ఆచరించి కాలినడకన పక్కనే ఉన్న పురాతన శివాలయంలో పూజలు జరుపుతారు. అల్లూరి సీతారామరాజు కూడా ఆలయంలో పూజలు జరిపారని వినికిడి.

వాతావరణం
మామూలుగా ఐతే మారేడుమిల్లి ని మాన్సూన్ తరువాత సందర్శించాలి. మాన్సూన్ లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి అడవుల్లో జారిపడే అవకాశం లేకపోలేదు..! ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా రాత్రిళ్ళు చల్లగా ఉంటుంది ... ఉదయం వేడిగా ఉంటుంది. వేసవి లో సందర్శన ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

వసతి
మారేడుమిల్లి లో బస చేయటానికి రెండు ప్రదేశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారు ఎకో- టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా రెండు రిసార్ట్ లను నడుపుతున్నది. ఒకటేమో వనవిహారి రిసార్ట్, మరొకటేమో జంగల్ స్టార్ రిసార్ట్.
వనవిహారి రిసార్ట్
వనవిహారి రిశార్ట్ లో చాలా గదులు అద్దెకు లభిస్తాయి. ఇందులో ఏసీ, నాన్ - ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. జంటలకి లేదా చిన్న చిన్న గ్రూప్ లు గా వచ్చేవారికి ఈ రిశార్ట్ సూచించదగినది.
జంగల్ స్టార్ రిశార్ట్
జంగల్ స్టార్ రిశార్ట్ 10 -20 మంది కలిసి గ్రూప్ లు గా వచ్చేవారికి సూచించదగినది. టెంట్ వసతి, రాత్రుళ్ళు చలి మంటలు ఇక్కడి ప్రత్యేకతలు. ఫుడ్ మరియు ఊరికి దూరంగా ఉండటం ప్రతికూలతగా చెప్పవచ్చు.

భోజన సౌకర్యాలు
మారేడుమిల్లి లో, రంపచోడవరం లో చిన్న చిన్న హోటళ్లు అనేకం ఉన్నాయి. మారేడుమిల్లి లో తినటానికి సూచించదగిన ప్రదేశం వనవిహారి రిశార్ట్ క్యాంటీన్. ఇక్కడ ఫుడ్ అమోఘం. ఇక్కడ బేంబూ చికెన్ రుచి చూడటం మరవద్దు ..! బేంబూ తినటానికి స్పెషల్ గా హోటల్ అంటూ ఏదీ లేదు. అన్ని హోటళ్ళలో ఈ చికెన్ వండుతారు.

ట్రిప్ ఎలా సాగుతుంది ?
మొదటి రోజు
మారేడుమిల్లికి టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడలో ఏ ట్రావెల్ ఏజెంట్ నైనా సంప్రదించి రెండురోజుల పాటు వనవిహారంలో ఉండవచ్చు. కొన్ని ట్రావెల్ సంస్థలు గైడ్ ను పెట్టి వసతి, భోజనాలు, రవాణా సదుపాయాలను కలిస్తున్నాయి.
రాజమండ్రిలో దిగి, టెంపో వాహనాన్ని లేదా తూఫాన్ వాహనాన్ని మాట్లాడుకోని, దారి మధ్యలో గోకవరం వద్ద అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేసుకొని మారేడుమిల్లి చేరుకుంటే ఆ అనుభూతే వేరు. రూమ్ లు వనవిహారిలో ముందుగానే ఆన్‌లైన్ లో బుక్ చేసుకుంటే మంచిది. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొన్నా ప్రాబ్లమ్ లేదు. చెక్ - ఇన్ అయి, వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్అప్ అయి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.

ఫారెస్ట్ ట్రెక్
ఫారెస్ట్ ట్రెక్ మధ్యాహ్న సమయంలో ప్రారంభిస్తారు. వీలైతే మధ్యాహ్నం తిని కానీ లేదా రిశార్ట్ నుండి ప్యాక్ చేసుకొని గాని 12 కి. మీ. వరకు ట్రెక్ చేయవచ్చు. తిరిగి సాయంత్రం రావాలి సుమీ ..! ఈ 12 కి. మీ. ట్రెక్ లో మొదట మీరు చేరుకోవలసిన ప్రదేశం జంగల్ స్టార్ రిశార్ట్. ఇక్కడ మీరు పాములేరు ప్రవాహాన్నీదాటవలసి వస్తుంది. ఈ ప్రవాహాన్నీ దాటితే మీరు 1 కిలోమీటర్ అదనపు దూరం ట్రెక్ చేయవచ్చు. దాటే సమయంలో ఆ చల్లని నీటి ప్రవాహం కాళ్ళకు తగులుతుంటే ఆ పూల వాసనలు, మట్టి వాసనలు అహా..! ఇది తనివితీరా ఆనందం అంటే ఆ క్షణంలో బాధలు గీదలు ఏమీ గుర్తుకురావు. ప్రవాహాన్నీ దాటిన తరువాత తీసుకొచ్చిన ప్యాకెట్ ను తెరిచి భోజనం చేస్తే బాగుంటుంది. అడవిలో ట్రెక్ చేస్తున్నప్పుడు అదేదో తెలీని ఆనందం, ఉత్సాహం దరి చేరుతుంది. వివిధ పక్షుల కిలకిల రాగాలు చెవులకు ఇంపుగా అనిపిస్తాయి. దారి పొడవునా వివిధ రకాల మొక్కలను కెమరా ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు. వృక్షశాస్త్రం చదివేవారికి ఉపయోగపడొచ్చు. ట్రెక్ పూర్తవగానే సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల కు ఊర్లో కి వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ లు తినవచ్చు. ఉదయం టిఫిన్ సప్పగానే, మధ్యాహ్నం లంచ్ సప్పగానే సాగింది. డిన్నరైనా కాస్త నాన్ - వెజ్ లాగించండి. రిసార్ట్ క్యాంటీన్ లో గాని, లేదా రిసార్ట్ కు దగ్గర్లోని షాప్ లో గాని వెళ్ళి బేంబూ చికెన్ లాగించండి. డిన్నర్ అయిన తరువాత క్యాంప్ ఫైర్ వెలిగించి ఆట పాట లతో చిందులేయండి. నిద్రవస్తే వెళ్ళి బజ్జొండీ ..!
తరువాతి రోజు
ఉదయాన్నే లేచి రూమ్ చెక్ -ఔట్ అయి (ఖాళీ చేస్తున్నట్టు), జలతరింగిని జలపాతం వైపు అడుగులు వేయాలి. అక్కడ గంట -రెండుగంటలు ఉండి చుట్టుప్రక్కల అందాలను ఆనందించవచ్చు. ఆతరువాత రంప జలపాతం వైపు ప్రయాణించాలి. సమయముంటే స్వర్ణ ధార, అమృత ధార జలపాతాలను చూడవచ్చు.
రంపచోడవరం వెళ్లే మార్గంలో భూపతి పాలెం వద్ద ఆగి, రిజర్వాయర్ అందాలనూ వీక్షించవచ్చు. రంపచోడవరం చేరుకొని, అక్కడి నుంచి 4 కి. మీ. దూరం ప్రయాణించి రంప జలపాతం చేరుకోవచ్చు. పక్కనే ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే సరికి మధ్యాహ్నం లంచ్ టైమ్ అవుతుంది. పక్కనే ఉన్న హోటళ్ళలో భోజనం లాగించవచ్చు. ఇక్కడ కాసింత విశ్రాంతి తీసుకోవటానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గెస్ట్ - హౌస్ లు ఉన్నాయి. తిరుగు ప్రయాణం రంపచోడవరం నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో రాజమండ్రి బయలుదేరి, అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ బస్ ఎక్కితే ఉదయం 8 గంటలప్పుడు దింపుతుంది. రెండు రోజుల మారేడుమిల్లి - రంపచోడవరం ట్రిప్ చాలా బాగుంది కదూ ..! మీరు కూడా ఈ ట్రిప్ ని ఇంతకంటే ఎక్కువ ఆనందంతో గడిపి, మీ అనుభూతులను మాతో పంచుకోండి ..!

Friday, 4 March 2016

ఓహో అహోబిళం


కొన్ని నెలలుగా నల్లమల అడవులవైపునున్న అహోబిళం దేవాలయంతోబాటు వాటి చుట్టూ వున్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించాలన్న ఆలోచనలో వున్న నేను, తోడుగా వచ్చే ఔత్సాహికులైన యువకులకోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక యువమిత్రుడుని కలిసిన సమయంలో " అన్నా రేపు శనివారం స్వాతి నక్షత్రం.ఆ రోజు పర్వదినంగా బావించి అహోబిళంలో ఉన్న నవ నరసింహస్వాములను  దర్శించడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్తున్నాము, ఈ సమయంలో అక్కడికి చాలా మంది వస్తారు, మీరు కూడ వస్తారా..? " అని అడిగాడు... నేను దేనికోసం ఎదురుచూస్తున్నానో...!! అదే సమయం నాకు ఎదురుకావడంతో నా సంసిద్దత వ్యక్తం చేసాను. వారిది దైవభక్తి..మరి నాది ప్రకృతి భక్తి.. ఏది ఏమి అయితేనేమి నాకు కావల్సింది అక్కడ తిరగడానికి తోడుగా మనుషులు కావాలి, మామూలు సమయాలలో అక్కడ వంటరిగా తిరగలేము, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూవుంటాయి.

ఎవరి వారి ఆలోచనలతో మరునాటి తెల్లవారు జామునే 5 గంటలకే నలుగురం రెండు మోటర్‌బైకులలో బయలుదేరాము. మా ఊరినుండి షార్ట్‌కట్‌లో వెళ్తే  80 కిలోమీటర్లు ఉండవచ్చు. దారిపొడవునా తెల్లని పొగమంచులా కమ్ముకొని ఉన్నది, చూడటానికి చలికాలపు తెల్లగా మంచులా ఉన్నా అది మంచు కాదు " మొగలి " అని అంటారు. ఊటిలో ఉన్నట్టుగా ఉన్నది వాతావరణం, తెల్లటిమేఘంలా రహదారిమీద దూదిపింజలా మెల్లిగా ఎగురుతూ పోతున్నది " మొగలి "...!  ఆరోగ్యానికి అంతమంచిది కాకపోయినా మంచులా ఫీల్ అవుతూ దారిపొడవునా " మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా సాగిపోతున్నది " అని వెనుక అమ్మాయిలేకున్నా... పాట పాడుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాగలమర్రి వూరు మీదుగా 7:30 నిమిషాలకు అహోబిళం చేరుకున్నాము.
దిగువ అహోబిళం దర్శించకుండానే కొండమీదున్న ఎగువ అహోబిళం చేరుకొన్నాము. గంభీరమైన రెండు పర్వతశ్రేణుల మద్యన నెలకొనివున్నది ప్రధాన ఎగువ అహోబిళం. అక్కడ కూడ ప్రధాన దేవాలయం దర్శించకుండా.. దేవాలయానికి ఎడుమపక్క నున్న చిన్న చెక్క బ్రిడ్జీమీదుగా వెనుకకు చేరుకున్నాము. అక్కడ నుండి మహావృక్షాలతో నిండి ఉన్న నల్లమల్ల అడవులతో విస్తరించివున్న పర్వతాలను ఎక్కడానికి ముందుకు అడుగేసాము.

ఓబులం, అహోబిళం, అహాబిలం, అహబిలగిరి, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, అచల చాయమేరు, సింగనేల్ కున్నం, నిధి, నగరి, శేషాద్రి, నరసంహ్మతీర్థం, గరుడాచలం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఎగువ అహోబిళానకి 8కి.మీ. దూరంలో వున్న ఉక్కు స్థంభం నుంచి విష్ణుమూర్తి నరసింహుని రూపంలో వచ్చి హిరణ్యకశ్యపుని వధించే సమయంలో ఉగ్ర నరసింహస్వామిని అహోబిలుడిగా దేవతలందరూ స్తుతించటం వలన ఈ క్షేత్రానికి అహోబిళం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో 9 ఆలయాలు, 6 కోనేర్లు, 122 మంటపాలు, అనేక చత్రాలు వున్నాయి.
మా నడక మార్గమద్యన ఒక ప్రదేశంలో కొందరు భక్తులు కాలినడకన నడిచే భక్తులకోసం ఉచితంగా " నాస్టా " ఏర్పాటు చేసారు, ఆగకుండా వెళ్తున్న నన్ను మా ఫ్రెండ్ ఆపాడు.  " ఇక్కడ  టిఫిన్ తినకపోతే మరెక్కడ పైన దొరకదు. మర్యాదగా ఇక్కడ టిఫిన్ చేసి వెల్దాము " అన్నాడు..ఇష్టం లేకపోయినా ఆగక తప్పలేదు నాకు. ఆహోబిళం దగ్గరలో నున్న గ్రామాల నుండి, ఆళ్ళగడ్డ నుండి కొందరు భక్తులు ఉచితంగా భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఏడాదీ అక్కడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు, వారికి  మొక్కుబడిలో అదొక భాగం. ఎత్తైన చెట్ల కింద గ్యాస్ పొయ్యి. మరో రెండు కట్టెల పొయ్యిలతో అక్కడ వంటలు వండుతున్నారు. మహావృక్షాలమద్యన కాలినడకన అక్కడకు చేరిన భక్తులంతా అరటాకులలో పొంగలి, వేరుశనక్కాయి చెట్నీ కలుపుకొని ఆరగిస్తున్నారు. నేనంతగా పొంగలి ఇష్టపడను.  కాస్త సంకోచిస్తూ ఆరటాకు తీసుకొని టిఫెన్ తెచ్చుకున్నాను. మొదటి ముద్ద నోట్లో పెట్టుకొన్న రెండు క్షణాలకు  పొంగలి రుచి నా జిహ్వకు మహాద్భుతంగా తోచింది.. ఏముందా పొంగలిలో అని చూస్తే..! ఏముంది చాలా సింపుల్..ముంతమామిడి పప్పు ( జీడిపప్పు) తో పొంగలి, అందులోకి చెట్నీ..కాకపోతే చట్నీలో నిమ్మరసం పిండినట్లున్నారు కారకారంగా పుల్లపుల్లగా..! అందులోకి మల్లి టమోటా ఊరగాయి కలుపుకొని తింటుంటే..నాసామిరంగా..!. మావూళ్ళొ చెప్పుకొనే ఉపమానం గుర్తొచ్చింది.. మరదలుపిల్ల మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదోరకమైన పిలుపుతో ఆ పిల్ల " మావా " అంటుందట..అట్లా ఉన్నదారుచి..ఒక్క రుచే కాదు శుచి కూడ చాలా శుబ్రతగా ఉన్నది. అసలు పొంగలి ఇష్టపడనీ నేను మరోమారు పెట్టించుకొని లాగించేసా, నా తిండిపోతుతనం చూసిన మా ఫ్రెండ్స్ " ఇక చాల్లే ఎక్కువగా తింటే ట్రెక్కింగ్ చేయడం చాలాకష్టం " అని చెప్పగానే..ఆపేసా..కాని నా కడుపులోని ఆత్మారాముడు ఊరుకోవట్లేదు.లొట్టలేసుకుంటూ..గోలపెడుతున్నాడు." నాకింకా కావాలి " అంటూ...! వాడిని ’ మద్యాహ్నం భోజనం ఉండదు ఇలా మారాం చేసావంటే ’ అని బెదిరింపుతో బుజ్జిగించి అక్కడనుండి కదిలాను. మామూలుగా ఒక సామెత ఉంది, " కళ్ళు కావాలంటాయి..కడుపు వద్దంటుందీ " అని..కాని దీనికి రివర్స్ " కడుపు కావాలంటున్నది..కళ్ళు వద్దని వారిస్తున్నట్లుంది నా పరిస్థితి.

అసలు అక్కడ అలాంటి ప్రకృతిరమణీయ వాతావరణంలో వనభోజనంలా టిఫెన్ ఆరగిస్తుంటే చెప్పలేని అనుభూతే అది...! అంతేనా.. కాలినడకన వస్తున్న భక్తులను ఈ దాతలు ఒకటికి రెండు మూడు సార్లు అడిగి పిలుస్తున్నారు. మొహమాటస్తులను సైతం బతిమాలి టిఫిన్ పెడుతున్నారు. మరి కొన్న చోట్ల ఇడ్లీలు, పూరీలు పెడుతున్నారు. మేము తెచ్చుకున్న కిన్లీ బాటిల్స్‌ని నేను తీస్తుంటే వద్దని మా ఫ్రెండ్స్ వారించారు, " అర్రె కిన్లీ నీళ్ళకన్న మాంచి రుచికరమైన, మినరల్స్ ఉన్న నీళ్ళు ఇక్కడున్నాయి. అవి తాగి మన వద్దనున్న ఖాలీ బాటిల్స్‌లలో ఆ నీళ్ళను పట్టుకొని వెళ్దాం "  అన్నారు. కొండలపైన నుండి చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న మంచినీటి ధారలు అక్కడక్కడ చాలా ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద డ్రమ్ములలో పడుతున్నారు. అందులో ఏమాత్రపు నులకలు గాని లేక రంగు గాని లేదు..చాలా స్వచ్చంగా తేటతెల్లంగా వున్నాయి, ఒక్క సారి మన రాష్ట్ర రాజధాని భాగ్యనగర కార్పోరేషన్ రంగుతేలిన నీళ్ళు గుర్తుకొచ్చాయి..! నగరానికి... ప్రకృతివరమైన ఇక్కడ నీళ్ళకు.. ఎంతతేడా..?  అనుకున్నాను.!
 ఎగువ అహోబిల ప్రధాన ఆలయానికి 1కి.మీ దూరంలో నున్న వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఎత్తైన మహావృక్షాల కింద ఆలయమంటపము ఉండగా దాని గర్భగుడిమాత్రం కొండకు చివరి అంచునున్న బిళంలో దేవతావిగ్రహాలు ఉన్నవి. వేదాద్రి పర్వతానికి పడమటి భాగాన వరాహ రూపమున భార్య అయిన వసుంధరాదేవితో స్వామి వేంచేసి యున్నారు. అందుకే ఈ స్వామిని వరాహ నరసింహస్వామి అని అంటారట..! మా మిత్రుల దర్శనం అయ్యాక అక్కడ నుండి పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న సెలయేళ్ళ మద్యన మా నడక ప్రారంభం అయ్యింది. ఈ తోవలో నడక కాస్త కష్టంగానే ఉంటుంది, ఒకపక్కన పాచిపట్టిన బండరాల్లు, మరోపక్కన నీటి ప్రవాహం చాలా జాగ్రత్తగా నడవాలి. వేలల్లో జనం ఒక ప్రవాహంలా నడుస్తున్నారు, పిల్లలు యువకులు, నడివయస్కులు, వృద్దులు, స్త్రీలు. తమిళనాడునుండి తమిళ కారన్స్, కర్నాటక నుండి కన్నడ కంఠీరవలు ఎక్కువగా కనపడుతున్నారు. నడవలేని వృద్దలను ఒక పెద్దకర్రకు దుప్పటితో జోలకట్టి అందులో తీసుకెల్తున్నారు. మద్యలో ఏటవాలుగా ఉండవలసిన తాపలు కొద్దిగా నిటారుగా ఉండడం మూలాన జాగ్రత్తగా ఎక్కవలసివచ్చింది.
జ్వాలా నరసింహస్వామి :
వేదాచలం అనే పర్వతాల మధ్యన అచల భూమామేరు అనే పర్వతం ప్రాంతమది. ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 4 కి.మీ దూరంలో ఉన్నది.  చాలా ఇరుకైన కాలిబాట..ఒక పక్కన చాలా లోతైనా లోయ ఉన్నది, వీటిని దాటుకుంటూ ఆలయానికి చేరవగా కొద్దిదూరంలో ఉన్న జలపాతం  కిందనుండి ఆలయానికి చేరుకోవాలి కాని జలపాతానికి మరో పక్కన పెద్ద లోయ ఉన్నది. చాలా జాగ్రత్తగా జలపాతం కిందనుండి తడుస్తూ దాటి ఆలయానికి చేరుకున్నాము. హిరణ్య కశ్యపుని సంహారానంతరం క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోవడం వంటి రూపంలో వుండటంతో స్వామిని జ్వాలా నరసింహస్వామి అంటారు. స్వామిని శాంతింపజేసేందుకు ఇంద్రాది దేవతలు చేసిన అభిషేక జలమే భవనాశిని పుణ్యతీర్థంగా అయింది. ఈ ఆలయం ముందు ఒక కొండ గృహ, దాని క్రింద చిన్న గుండం ఎర్రని నీటితో నిండి ఉన్నది. హిరణ్యకశ్యపుని రక్తంలో తడిసిన హస్తాలను స్వామి కడగడం వల్ల నీరు ఎర్రగా మారిందని అక్కడి వారి ఒక విశ్వాసం. ఈ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు. హిరణ్యకశ్యపుని వెంటాడుతున్న నరసింహుడు మూడువిగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడనుండి తిరిగి వస్తున్న సమయంలో కొందరు జలపాతనీటిని బాటిల్స్‌లలో నింపుకుంటున్నారు...! ఎందుకూ అన్నట్లు మా మిత్రులవైపు చూసాను నేను. " అవి కొన్ని వనమూలికల గుండా ప్రవహిస్తూ వస్తున్న ఔషద నీరు, తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం "  అన్నారు.

మాలోల నరసింహస్వామి :
అక్కడ నుండి తిరిగి వచ్చిన తోవలోనే  వెనకకు ఒక అర కి.మీటర్ వచ్చాక ఒక కొండనుండి మరో కొండకు నిర్మించిన ఇనుప వంతన ద్వార వేదాద్రి శిఖరం మీదకు ఎక్కనారంభించాము, ఇది ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 2 కి.మీ దూరంలో వున్నది..ఒక కిలో మీటరు శిఖరం ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పచ్చదనంతో పరిచిన వేదాద్రి శిఖరం, గరుడాచలం, వేదాచలం కొండలు కనపడ్డాయి,  అద్భుతమైన దృశ్యం అది.. ఒక్కసారిగా " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "  అన్న సిరివెన్నెల చరణాలు గుర్తొచ్చాయి. వేదాద్రి శిఖరాన ఒక చదునైన ప్రదేశంలో మాలోల నరసింహస్వామి గుడి వున్నది, లక్ష్మీదేవితో కలిసి దర్శనిమిస్తున్నందున మాలోల నరసింహస్వామి అని పిలుస్తున్నారు. మా మిత్రబృందం గుడిలోపలే చాలా సేపు ఉన్నారు..పొర్లుదండాలు పెడుతున్నారు ఇద్దరు. ఎంతకూ బయటకు రావట్లేదు,  సరే వారు వచ్చేసమయంలోపల మరో చోటకు వెళ్ళవచ్చని మరొక మిత్రునితో కలసి గుడివెనుక నుండి కాలిబాట వెంటా అడవిలోనకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇరుకుగా ఉన్న ప్రమాదకరమైన దారి అది..కాస్త కాలు జారినా లోతైన లోయలో జారడం ఖాయం. ఒక కిలోమీటర్ దూరం నడిచాక పక్కనే వున్న మరో కొండకు చేరాము అక్కడ దాదాపుగా 100 అడుగుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద బండరాయి ఉన్నది, దానిమీద ఏదో " లిపి " కనపడుతున్నది, అది తెలుగా లేక సంస్కృతమా..లేక మరో ఏదన్న బాషనా..? అర్థమే కావట్లేదు, ఎవరన్న ఆ " లిపి " మీద పరిశోదనలు చేస్తున్నారో లేదో..మరి..!?  చదునైన ఆ పెద్ద రాయి మీద నడుచుకుంటూ ఓ 100 అడుగులు వెళ్ళాక రెండు కొండలమద్యన ఇరుకైన స్థలం లో ప్రహ్లాదుడి " బడి " ఉన్నది. అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించాడని అక్కడివారి నమ్మకం, ఆ చిన్న గుడిలో నరసింహస్వామి, ప్రహ్లాద విగ్రహాలున్నవి. పక్కనే ఏటువాలుగా ఉన్న కొండమీద చిన్న చిన్న జలపాతాలు ఉన్నవి,  చూడచక్కని ప్రకృతి రమణీయ ప్రదేశమది. అక్కడ నుండి తిరిగి వెనకకు బయలదేరాము. 

ఉదయం టిఫిన్ చేసిన చోటకు చేరుకున్నాము, అక్కడ మరో రకమైన పలహారం పెడుతున్నారు, మరో రౌండ్ వేసారు మా మిత్రబృందం, ఈ సారి టమోటో, జీడిపప్పుతో చేసిన ఉప్మా. మరో రకం " ఉగ్గాని అలియాస్ బొరుగుల ఉప్మా ". !   బొరుగులతో ( మరమరాలు) చేసే ఉపపలహారం అది. చిత్రాన్నం (పులిహోర, యెల్లో రైస్) చేసే విదానంలానే చేస్తారు, కాకపోతే బొరుగులను ముందుగా నీటిలో తడిపి తర్వాత తిరగమాత (పోపు) పెడతారు పులిహోరలాగే బాగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,పసుపు వేసి మనం ఇంట్లో పోపుకు వాడే అన్నిదినసులతోనే తిరగమాత పెట్టాక చివరన అందులో నిమ్మరసం పిండుతారు. " ఉగ్గాని " తోబాటు దానికి కాంబినేషన్‌గా  " నన్ను కొంచం కొంచం కొరక్కుతినవయ్యా..య్యా..యా " అంటున్న మిరపబజ్జీతో తింటుంటే....." ఆ..టేస్టే..వేరు...ఆ టేస్టే వేరు " అని పాటపాడుకొన్నాము.. ఆ ప్రకృతివడిలో..!

పావన నరసింహస్వామి :
పలహారం ఆరగించిన తర్వాత అక్కడ నుండి మరో దిశకు కొద్దిదూరం నడిచాక ఎడమవైపున ఉన్న మరో కొండను దాదాపుగ 1 కి.మీ ట్రెక్కింగ్ చేసాము. తర్వాత దట్టమైన అడవి గుండా, దారిపొడవునా 100 అడుగల ఎత్తు ఉన్న మహావృక్షాలు ..అడవిని కప్పిన పెద్ద గొడుగులా ఉన్నాయి  వాటి క్రిందన మనిషెత్తు ఉన్న ఆకుపచ్చని గడ్డి మద్యలో కాలిబాట వెంట నడక ప్రారంచించాము.  ఎత్తైన చెట్ల ఆకుల మద్యనుండి దూరి వస్తున్న సన్న సన్నని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని తాకి పరావర్తన చెందుతున్న దృశ్యం కన్నుల పండగలాఉంది నాకు.  అప్పటికే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కొందరు భక్తులు ఎదురవుతున్నారు. 5 కి.మీ నడిచాక మద్యాహ్నం 12:30 నిమిషాలకు గరుడాచలంకొండ చివర్లో పావనమనే నదీతీరాన ఉన్న పావన నరసింహక్షేత్రం చేరుకున్నాము. ఇక్కడికి కాలనడకన 6 కి.మీ నడవాలి..వాహనాల ద్వారా రావడానికి కూడ సౌకర్యం ఉన్నది ఘాట్‌రోడ్ ద్వారా 14 కి.మీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నన భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక తిరిగి ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి బయలుదేరాము.

అహోబిళ నరసింహస్వామి : 
ఎగువ అహోబిళంగా పిలిచే ఈ దేవాలయంలో అహోబిళ నరసింహస్వామి వున్నారు. రాజగోపురంద్వార లోనికి వెళ్తే అక్కడ ఒక గుహలో అరుగు మీద దశభుజాలతో హిరణ్యకశిపుని సంహరించే నరసింహావతారంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ప్రక్కగా అభయ వరదముద్రలతో పై చేతులలో తామర మొగ్గలతో చెంచులక్ష్మి విగ్రహం ఉన్నది. అక్కడ దర్శనం ముగించుకొని బయలదేరాము.

కారంజ నరసింహస్వామి :
తిరుగుప్రయాణంలో ఎగువ అహోబిళానికి 1  కి.మీటర్ల దూరంలో భవనాశి నది ప్రవహిస్తున్న చోట వటవృక్షం నీడలో శంఖుఛక్రధారుడుగా కొలువైయున్నందున కారంజ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్కడ నుండి దిగువ అహోబిళానికి 2 కి.మీటర్ల దూరంలో కొండపైన భార్గవ( పరుశు) రాముడు తపస్సు చేసిన స్థానంలో వెలసినందున భార్గవ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్షయ కోనేటి నీరు, చుట్టూపొదలు. పెద్ద వృక్షాలతో అక్కడి ప్రకృతి రమణీయంగా వుంటుంది.

చత్ర వట నరసింహస్వామి : 
భార్గవ క్షేత్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పద్మాసీనడై, దక్షణ హస్తం అభయ ముద్రను సూచిస్తూ, గొడుగులాంటి మర్రిచెట్టు నీడలో చత్రవట నరసింహస్వామి వున్నారు.

యోగానంద నరసింహస్వామి :
2 కి.మీ దూరంలో ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పి మూర్తి అయినందున ఇక్కడి స్వామికి యోగానంద స్వామి అని పేరు వచ్చిందట.

దిగువ అహోబిళ వరద నరసింహస్వామి :
ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడు దర్శనమిస్తారు. ఈ శిలా విగ్రహం ఊర్ధ్వహస్తాలతో, శంఖు చక్రాలను కలిగి వామభాగంలో తొడపై లక్ష్మీదేవిని కూర్చండజేసి అభయ, వరద, ముద్రాన్వింతంగా అందంగా తీర్చి దిద్దబడింది. ఒక పక్కగా పట్టపుదేవేరి అమృతవల్లి తాయారు విగ్రహం ఉన్నది.

ఈ విగ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలోని ప్రధాన ఆలయమంటపంలో శిల్పులు చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. రకరకాల నరసింహస్వాముల ప్రతిరూపాలు. కవయిత్రి, రచయత్రి అయిన కథనాయక "మొల్ల "శిల్పం,  శ్రీకృష్ణదేవరాయుల శిల్పాలు ..చాలానే ఉన్నాయి. అక్కడనుండి తిరుగు ప్రయాణం.




అహోబిళం నుండి ఒక రెండు కి.మీటరు ప్రయాణించిన తర్వాత  బైక్ నడుపుతున్న మిత్రుడికి ఎడమపక్కన పచ్చని పొలంలో ఒక నీళ్ళ బావి కనపడడంతో బండిని ఆపేసాడు. మొహం కడుక్కొని ఫ్రెష్ అవుదాము పదా అని పొలంలోకి దారితీసాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అది బావి కాదు..ఒక పురాతన కోనేరు.. కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి మరమత్తులకు నోచుకోలేదు అనుకుంటా పాడుబడిపోయింది. లోపలంతా పాచి కట్టి ఉన్నది. అది కాదు గాని విశేషమూ..కోనేరు చూట్టూ ఉన్న రాతిగోడలమీద బాగవత, మహాభారత, రామాయణ శిల్పాలు చెక్కి వున్నారు..!  సురులు, దేవతలు అమృతం చిలుకుతున్న శిల్పాలు .. చాలా బాగున్నాయి. అందులో భాగంగా రతీభంగిమలు కూడ ఉన్నాయి. పురావస్తుశాఖ వారు బహుశ ఆ కోనేరు గుర్తించారో లేక గుర్తించి కూడా నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కాలేదు మరి. ఎవరో రైతులు బోర్లు వేసి అందులోనుంచే తమ పంటపొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ప్చ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాము.

    
    మరి కొన్ని నరసింహస్వామి అవతారాల ఫోటోస్ క్రింద ఫ్లాష్‌ప్లేయర్‌లో చూడవచ్చు.


ఉపసంహారం :  
ఇక్కడి దేవుల్లను చూసాక నగరాలలో ఉన్న దేవుళ్ళకు కన్ను కుడుతుందేమో..!! ఇంతటి ప్రశాంత వాతావరణం, ప్రకృతివడిలో వోలలాడుతున్న ఈ దేవుళ్ళను చూస్తే ఈర్షపడతారేమో..మన హైదరాబాద్ నగర దేవుళ్ళు...!! పాపం ప్రతిరోజు నగర వాహనాల రణగొణద్వనుల మద్యన, కాలుష్యవాతావరణంలో ఉక్కిబిక్కిరి అవుతూ వుంటారు, అందులోని మన వారి పోటీ భక్తిని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు  మైకులతో హోరెత్తిస్తూ ప్రజల చెవుల్లతోబాటు దేవుళ్ళ చెవుల్లకు తూట్లు పొడుస్తూ ఉంటే  అక్కడి నుండి ఎప్పుడొ పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటారు. అలాంటి వారికి ఇక్కడి స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ, నిశ్శబ్ధవాతావరణంలో పచ్చని ప్రకృతి మద్యనున్న దేవుళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈర్షపుడుతుందేమో...???. కాని ఒక విషయం మాత్రం నిజం, ఏ ఆరునెలలకో లేక సంవత్సరానికో ఒక మారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే భక్తి, పుణ్యం సంగతేమో గాని..స్వచ్చమైన గాలితోపాటు పచ్చని ప్రకృతితో మైమేకం అవితే చాలు... మిగతా రోజులంతా మన వృత్తిలో పనిచేయడానికి ఉత్తేజం కలుగుతుందనుకుంటా..!!!

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...