Showing posts with label Karnataka - కర్ణాటక. Show all posts
Showing posts with label Karnataka - కర్ణాటక. Show all posts

Friday, 20 July 2018

చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపి







July 20, 2018


చారిత్ర‌క‌, శిల్ప‌క‌ళా హంపి



దక్షిణ భారతదేశంలో అత్యంత ఖ్యాతి పొందిన ప్రాంతం కర్నాటకలోని హంపి. అద్భుతమైన కట్టడాలు, అరుదైన శిల్పకళా సౌందర్యాలు, ప్రకృతి సోయగాలు, నీటి పరవళ్ళు, సుందరమైన ప్రకృతి ఇలా.. పరవశించే ప్రదేశాల అందాలను ఆస్వాదించాలంటే హంపిని తప్పకుండా చూడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు ఇక్కడి పురాతన కట్టడాలు, నాటి రాజుల పాలనలోని వసతులు, సౌకర్యాలు, సాంప్రదాయాలు, ప్రమాణాలు వంటి అనేకమైన అంశాలను పరిశీలించవచ్చు. అందుకే విద్యార్థుల విజ్ఞానయాత్రలలో హంపి తప్పకుండా ఉంటుంది. శతాబ్దాల నాటి చరిత్రనూ అక్కడి కట్టడాలపై చూడొచ్చు. అందుకే ఆ చారిత్రక ప్రదేశంలో మనమూ ఈ వారం 'జర్నీ' చేద్దాం పదండి!!

పాఠశాలలకు మూడురోజులు సెలవులు రావటంతో హంపి వెళ్లేందుకు నేను, నా సతీమణి, ఇద్దరు పిల్లలు, అత్తగారితో కలిసి బయల్దేరాం. ఉదయం 7 గంటలకు అనంతపురం నుంచి కారులో బళ్లారి చేరుకున్నాం. కర్నాటక రోడ్డు సరిగా లేనందున 167 కిలోమీటర్ల హంపి చేరడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. హంపికి చేరుకోవాలంటే కర్నాటకలోని అన్ని ప్రాంతాల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. సందర్శకులు సాధారణంగా బెంగళూరు, బళ్లారి మార్గంగా వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చినా ముందుగా హోస్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి హంపికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో హుబ్లీ నుంచి గుంతకల్లు మీదుగా వెళ్లే రైళ్లు హోస్‌పేటలో ఆగుతాయి. అంటే, హంపికి చేరాలంటే రైలు మార్గమూ అందుబాటులో ఉన్నట్లే! హోస్‌పేట ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉండటంతో ఇక్కడ బస చేసేందుకు మంచి హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. సందర్శకులు విరివిగా వస్తుండడంతో నార్త్‌, సౌత్‌తో పాటు డిమాండ్‌ ఉన్న వంటకాలను అందిస్తారు.

హోస్‌పేట నుంచి హంపికి 15 కిలోమీటర్లు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు ఈ మార్గంలో తిరుగుతాయి. హోస్‌పేట నుంచి హంపికి కడ్డిరాంపురం, కమలాపురం మీదుగా రెండు దార్లు ఉన్నాయి. కాలి నడకన హంపి చూడాలనుకునేవారు కమలాపురం మీదుగా వెళ్ళడం మంచిది.

శ్రీవిరూపాక్ష దేవాలయం 
హంపి ప్రాంతంలో చూడాల్సిన ప్రధాన సందర్శనా ప్రదేశం విరుపాక్ష దేవాలయం. ఈ పురాతన ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి. దేశాలయ ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తు, కిందిభాగం 20 అడుగులు వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి, పదకొండు అంతస్థులతో ఉంటుంది. దీనిని 'బీష్టప్పయ్య గోపురం' అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సమయంలో గోపురం, రంగమంటపం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవాలయ మహాప్రాంగణం 510 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవు ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలతోపాటు వంటశాల, కార్యాలయం, పక్కనే రాతితో నిర్మితమైన నీటి కోనేరును చూడవచ్చు.

రాజ తులాభారం
విజయనగర కాలంలో దసరా పండగను ఘనంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది. పురంధరదాసుల మంటపం నుంచి పైకి వెళితే, రాతి స్తంభాలు ఒకదానిపై మరొకటి అమర్చి కనపడతాయి. దీనిని రాజతులాబారంగా పిలుస్తారు. మహానవమి నాడు ఇక్కడ ఒక త్రాసును కట్టి, ఒకవైపున రాజు మరోవైపున వజ్రవైడూర్యాలను తూచేవారని, వాటిని ప్రజలకు పంచేవారని చెబుతారు.

ఉగ్ర నరసింహ 
హంపిలో ఉగ్రనరసింహ విగ్రహం చాలా పెద్దది. దీని ఎత్తు సుమారుగా 22 అడుగులు. క్రీ.శ. 1528లో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణుడిచే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వజ్ర, వైడూర్యాలు ఉంటాయనే ఆశతో దుండగులు ఈ విగ్రహం చేతిని, కాలును ధ్వంసం చేశారట!

హజరా రామాలయం 
ఈ దేవాలయం అంతఃపురాన్ని పోలి ఉంటుంది. క్రీ.శ 1513లో దీనిని నిర్మించారు. ఈ దేవాలయానికి దక్షిణ భారతదేశంలో ఎంతో ఖ్యాతి ఉంది. దేవాలయం గోడలపై రామాయణం, పురాణాలను తెలిపే ప్రతిమలు, రాతలను నాటి శిల్పకారులు చెక్కారు. చూపరులకు ఈ దేవాలయ సందర్శన ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.

మహానవమి దిబ్బ 
రాజుల కాలంలో వినియోగించే రచ్చబండ ఇది. చతురస్రాకారంలో ఉండే ఈ రచ్చబండ 22 అడుగుల ఎత్తు, పై భాగంలో 80 అడుగుల వెడల్పు ఉంటుంది. కృష్ణదేవ రాయలు ఒడిశాపై విజయం సాధించిన సందర్భంలో దీనిని నిర్మించి నట్లు తెలుస్తుంది. ఈ దిబ్బను అప్పటి పోర్చుగీసు రాయబారి అతిసుందరంగా నిర్మించారు. ఈ దిబ్బ పైభాగం, కింద భాగంలో అప్పటి సంస్కృతులు తెలిపే శిల్పాలు దర్శనమిస్తాయి. దీని ఎదురుగా సుమారుగా 20 గజాల దూరంలో నల్లరాతి కళ్యాణి కోనేరు ఉంది. దీనిని కర్నాటక పురావస్తు శాఖ వారు వెలుగులోకి తెచ్చారు. వీక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రీతిలో ఈ నిర్మాణం ఉంటుంది.

కమల మహల్‌ 
దీనిని లోటస్‌ మహల్‌, చిత్రాంగిని మహల్‌ అని పిలుస్తారు. రెండు అంతస్థులలో ఉండే ఈ నిర్మాణం సున్నపుగారతో నిర్మించారు. ఈ ప్రదేశంలో మండు వేసవిలోను చల్లదనం ఉండే రీతిలో కిటికీలను, ద్వారాలను నిర్మించారు. అప్పట్లో దీనిని రాణి విశ్రాంతి మందిరంగా చెబుతారు.

గజశాల 
పట్టపుటేనుగులను కట్టేందుకు నిర్మించిన అతి పెద్ద గజశాల ఇక్కడ కనిపిస్తుంది. ఏనుగులకు ఆహారం, నీరు అందించేందుకు మావటివాడు వెళ్లేందుకు వీలు కల్పించే రీతిలో నిర్మాణాలు చేశారు. ఈ కట్టడాలు చూడటానికి పైభాగం గోళాకారంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా హంపిలోని ప్రతి కట్టడం రాజసం ఉట్టిపడేలా, నేటికీ చెక్కుచెదరని నాటి రాజుల పాలనాదక్షత, ప్రజల అంకితభావానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి.

తుంగభద్ర ఆనకట్ట 
హోస్‌పేట నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు అన్ని సమయాల్లో వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆనకట్ట పొడవు 2 మైళ్ళు, ఎత్తు 160 అడుగులు. అప్పట్లో సుమారుగా రూ.15 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. డ్యాము నందు విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం, ఆకర్షణీయమైన గార్డెన్స్‌, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది.

వీలైనంత వరకూ సందర్శకులు హోస్‌పేట నుంచి ఆహార పదార్థాలను తెచ్చుకుంటారు. హంపిలోనూ చిరు హోటళ్ళు ఉంటాయి. హంపిలో సైకిళ్ళు, మోటారు వాహనాలు అద్దెకు లభిస్తాయి. సందర్శకులకు పోలీస్‌ యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉంటుంది. హంపి చూడదగిన వారు కనీసం రెండురోజుల పాటు సమయం కేటాయిస్తే పూర్తిస్థాయిలో హంపిని చూడవచ్చు. టిడి డ్యామ్‌ దగ్గరలో ఉన్నందున డ్యాంను, అక్కడి పార్కులను, బోటింగ్‌ను బాగా ఎంజారు చేయవచ్చు. అయితే డ్యామ్‌ పైకి వాహనాలకు సాధారణంగా అనుమతుండదు. అధికారుల ప్రత్యేక అనుమతితో డ్యామ్‌ సందర్శన సాధ్యమవుతుంది. హంపికి కొత్తగా వెళ్లేవారికి, అక్కడి విశేషాలు వివరించడానికి గైడ్స్‌ అందుబాటులో ఉంటారు. గైడు అవసరం లేని వారు దాని చరిత్ర తెలిపే పుస్తకాన్ని కాస్త ఓపిగ్గా తిరగేయగలిగితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మేము పుస్తకం కొని, స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది సహకారంతో హంపి సోయగాలను తృప్తిగా చూడగలిగాం.

- వి. రవిచంద్ర


Sunday, 24 June 2018

పడమటి కనుమలలో రైలు ప్రయాణం






పడమటి కనుమలలో హాయి హాయిగా!
మైమరపించే రైలు ప్రయాణం

దట్టమైన పడమటి కనుమలు.. కొండల్ని కప్పేస్తున్నట్లుగా కనిపించే మేఘాలు.. మార్గమధ్యలో అడవుల నడుమ పల్లెటూళ్లు.. ఎత్తైన కొండల మధ్యభాగంలో సొరంగాలు.. వర్షాలకు హోరెత్తుతూ కనిపించే సెలయేళ్లు.. ఏమాత్రం అలసట తెలియని ఎనిమిది గంటల ప్రయాణం.. అప్పుడే అన్ని సొరంగాలు పూర్తయ్యాయా అంటూ నిట్టూర్పు.. వెరసి బెంగళూరు - మంగళూరు రైలు ప్రయాణం. వర్షాకాలంలో వెళ్లేందుకే అనేక మంది ఎదురుచూస్తుంటారు. జూన్‌ వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు వర్షాలు ఆరంభమవుతాయా? మనం ఎప్పుడు బయలుదేరేద్దామా? అంటూ చిన్నారులే కాదు పెద్దలు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు.

ఉదయం 7.00 గంటలైంది. (ఈ మార్గంలో మరో నాలుగు రైళ్లున్నప్పటికీ పడమటి కనుమల అందాల్ని చూసేందుకు ఇదే అత్యంత అనువైంది) తమకు కేటాయించిన ఆసనాల్లో స్థిరపడ్డారు. సీట్లు లభించని ప్రయాణికులు ఓపిగ్గా నిలుచునే పరిసరాల్ని చూస్తున్నారు. అప్పటికే యశ్వంతపుర ప్లాట్‌ఫారంపై సందడి తారాస్థాయికి చేరుకుంది. ఇంకెప్పుడా అని ప్రయాణికులు గడియారాల వైపు తరచూ చూసుకుంటున్నారు. సమయం 7.10 అయిందని తెలుసుకునేలోపే సిగ్నల్‌లో పచ్చలైట్‌ వెలిగింది. వెనువెంటనే గార్డ్‌ నుంచి ఈల శబ్దం వినిపించింది. మందగామిగా రైలు బయలుదేరింది. చూస్తుండగానే వేగం పుంజుకుంది. నగరంలోనే ఉన్న చిక్కబాణవార స్టేషన్‌లో ఒక నిముషంపాటు ఆగింది. తిరిగి ప్రయాణమైన రైలు ఈసారి నెలమంగల స్టేషన్‌లో కాసేపు విశ్రమణ. ఇక నగరం అక్కడితో పూర్తయిందనేలా గుంపులుగుంపులుగా కనిపించిన ఇళ్లు మాయమయ్యాయి. నెలమంగల తరువాత కుణిగల్‌, యడియూరు, బాలగంగాధరనాథ నగర స్టేషన్లు వచ్చాయి. ఆ తరువాత త్యాగమూర్తి బాహుబలి విగ్రహమున్న శ్రవణబెళగొళ స్టేషన్‌ చూడొచ్చు. దూరం నుంచే వింధ్యగిరి పర్వతాన్ని, శిఖరాగ్రంలో కనిపించే గోమటేశ్వరుడిని దూరం నుంచి మనసారా మొక్కుకున్నారు ప్రయాణికులు. ఆ తరువాత చెన్నరాయపట్టణ, హాసన్‌, సకలేశపుర స్టేషన్లలో రైలు ఆగింది. ఆగిన స్టేషన్లలో చక్కిలాలు, నిప్పట్లు, కారం బొరుగులు, పనస తొనలు... ఇలా రకరకాల తినుబండారాల్ని రైల్లోనే బుట్టల్లో విక్రయించే వ్యాపారుల నుంచి ప్రయాణికులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. అప్పటి వరకు కనిపించిన సూర్యతాపం సకలేశపుర స్టేషన్‌ దాటగానే మేఘాల ప్రవాహానికి కరిగిపోయింది. సకలేశపుర స్టేషన్‌ నుంచి రైలు పరుగులు తీస్తుంటే కనిపించిన దృశ్యాలకు మాటల్ని కూర్చడం సాధ్యం కాదనిపించింది. అడవి మధ్యలో పెద్దపెద్ద గొట్టాలు కానవస్తాయి. బహుశా ఎత్తినహొళె ఎత్తిపోతల పథకం కోసం నిల్వ ఉంచినవేమో అనే భావన.

ఎత్తైన కొండలు.. సొరంగాలు.. వాటిల్లో దూసుకెళ్తుంటే కమ్ముకునే చీకట్లకు రైల్లో ఆబాలగోపాలం కేరింతలతో స్వాగతం పలికింది. అప్పుడే వర్షం వచ్చిందేమో సొరంగాలపై నుంచి హోరెత్తుతూ దూకుతున్న ధారలు దిగువన సెలయేళ్లుగా ప్రవహిస్తున్నాయి. దట్టమైన అడవుల మధ్య కనిపించే నదులు భలే గమ్మత్తుగా ఉన్నాయి. సొరంగంలో వెళ్తుంటే చిమ్మచీకట్లు... ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవని ప్రయాణికులు ఓనమాలు రాని విద్యార్థి కాన్వెంట్‌లో కూర్చున్న తొలిరోజు ఎలాంటి అనుభూతిని అనుభవిస్తాడో అలాంటి భావనతో వింతగా చూస్తూ కనిపించారు. మొదటి పది సొరంగాలు వచ్చినప్పుడు పెద్దపెట్టున కేకలు పెట్టిన ప్రయాణికులు ఆ తరువాత నిశ్శబ్ద ప్రేక్షకుల్నా పరిసరాల్ని చూస్తుండిపోయారు. అలా ఏకంగా 77 సొరంగాల్ని, వందలాది వంతెనల్ని దాటుకుంటూ రైలు వెళ్తుంటే మూడు గంటల సమయం క్షణాల్లా గడిచింది. అడవుల్ని దాటుకున్న రైలు నిదానంగా ప్రయాణించడాన్ని చూస్తే ఏదో స్టేషన్‌ వస్తున్నట్లుగా అనిపించింది. అప్పటికి మధ్యాహ్నం 2.20 గంటలు - దూరం నుంచి సుబ్రమణ్యరోడ్‌ అనే బోర్డును చూసి మేం దిగాల్సిన స్టేషన్‌ వచ్చిందని తెలుసుకుని గబగబా కిందకు దిగేవారెందరో! అక్కడ అల్పాహారానికి 15 నిముషాలకు పైగా రైలు నిలుస్తుందని తెలుసుకుని మళ్లీ ఎక్కితే ఎలా ఉంటుందని నిట్టూరుస్తుండగా రైలు మంగళూరు వైపు బయలుదేరింది. ఇలాంటి అనుభవం కావాలనుకునేవారు జూన్‌ నుంచి వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాలండోయ్‌!





Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..






వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

Wednesday, 13 June 2018

ఆగుంబే






దక్షిణాది చిరపుంజీ.. ఆగుంబే!

వాహనాల రణగొణ ధ్వనులుండవు.. ఇరుగుపొరుగు నివాసుల మాటలు వినిపించవు.. కనీసం కనిపించరు కూడా! అక్కడక్కడ భయంకరమైన నిశ్శబ్ద రాజ్యం. అప్పుడప్పుడూ వర్షపు హోరు.. సాధారణ జీవితానికి దూరంగా ఇలాంటి వాతావరణంలో కొద్ది రోజులైనా విహరించాలని తపించనివారు అరుదు. అందుకే వర్షాకాలం ఆరంభం కావడంతోనే దక్షిణాది చిరపుంజిగా పేరుపొందిన ఆగుంబెను అత్యధికులు సందర్శిస్తుంటారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని ఈ కుగ్రామం వర్షాకాలం వస్తేచాలు సందడిగా మారుతుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సాధారణ బస లభిస్తున్నా సందర్శకులకు కొదవ ఉండదు. మొన్నటి వరకు ఒకే పూటకూళ్ల ఇల్లు మాత్రమే ఉండేది. ఇటీవలి కాలంలో అనేక సంస్థలు హోటళ్లను నిర్వహిస్తున్నాయి. కొండల్ని తాకుతూ వెళ్లే మేఘాలు, అప్పుడప్పుడూ ఏకధాటి వర్షం కురిసే సందర్భాలు.. పచ్చదనంతో సింగారించుకుని కనిపించే పరిసరాలు ఆగుంబె ప్రాంతాన్ని మైమరిపిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనుకుంటారు. సూర్యాస్తమయాన్ని చూడడం ఇక్కడి ప్రత్యేకత. నల్లతాచులు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. వీటిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనిపిస్తారు. పడమటి కనుమల్లో వర్షాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడి అడవుల్లో కనిపించే అపురూపమైన వృక్ష సంపదపై కూడా అధ్యయనాలు కోకొల్లలు. శివమొగ్గ, ఉడుపి, మంగళూరు నుంచి బస్సు సదుపాయం దండి. రైల్లో ఉడుపి వరకు వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో కూడా చేరుకుంటారు. వర్షంలో తడుస్తూ సాహస యాత్ర చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసమే జూన్‌ మొదటి వారం నుంచి సందడి కనిపిస్తుంది. సాధారణంగా వర్షాలు వద్దనుకునేవారు నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మక్కువ చూపుతుంటారు.





Monday, 23 April 2018

బాదామి ఐహోలె శిల్ప సంపద




DATE

అడుగడుగున గుడి ఉంది... ఆ గుడిలో దైవముంది..!
‘అక్కడ జలపాతాల జడినీ సుందర నదీతీరాలనీ వీక్షిస్తే పౌరాణిక గాథల్ని వినిపిస్తాయి. ఎర్రనినేలనీ రాతి కొండల్నీ గుహల్నీ పలకరిస్తే శతాబ్దాల చరిత్ర లోతుల్లోకి తీసుకెళతాయి. ఆ గోడలని కళ్లతో ఆర్తిగా తడిమితే నాటి శిల్పుల ఉలి విన్యాసాలు సాక్షాత్కరిస్తాయి. అటు ప్రకృతి అందాలకూ ఇటు చాళుక్యుల కళావైభవానికీ వేదికలుగా నిలిచిన ఆ ప్రాంతాలే ఐహోలె, పట్టడకల్‌, బాదామి...’ అంటున్నారు విశాఖవాసి డా.మాదాబత్తుల తిరుమలరావు.

విశాఖపట్నం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, కర్ణాటకలోని హోస్పేట్‌లో దిగి, అక్కడినుంచి ప్యాసింజర్‌లో బయల్దేరి బాదామి చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క రైల్వేస్టేషన్‌ బాదామి. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడం, ప్యాసింజర్‌ రైళ్లు కూడా నిమిషమే ఆగడంతో ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ కర్ణాటకలోని భాగల్‌కోట్‌ జిల్లాలోని మలప్రభ నదీతీరంలోని బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రదేశాల గురించి సినీపరిశ్రమకి బాగా తెలుసు. అందుకే అక్కడ సందర్శకుల తాకిడి కన్నా సినిమా షూటింగులే ఎక్కువ. తమిళ, కన్నడ చిత్రాలతో బాటు తెలుగు చిత్రాలు కూడా షూట్‌ చేశారు. విక్రమార్కుడు, ఢమరుకం, దరువు, రౌడీ రాథోడ్‌, శక్తి, త్రిపుర... తదితర సినిమాలన్నీ చిత్రీకరించారక్కడ.

బసశంకరీదేవి...
ముందుగా మేం బసశంకరీదేవి ఆలయానికి బయల్దేరాం. బాదామికి దక్షిణాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. చాళుక్యుల ఆరాధ్యదేవత బసశంకరి. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఎందరికో ఆమె కులదేవత. చారిత్రకంగా చూస్తే- బాదామి చాళుక్యుల కన్నా ముందే ఇక్కడ బసశంకరీదేవి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ ఎత్తైన గోడలతో ముఖమండపం, అర్ధమండపం ఉన్నాయి. బసశంకరీదేవి సింహం మీద కూర్చుని, ఎనిమిది చేతులతో దుర్గాదేవి అవతారంలో దర్శనిమిస్తుంది. దేవాలయంలో ఉన్న ఓ శాసనం ప్రకారం- చాళుక్య రాజైన జగదేకమల్లుడు పురాతన దేవాలయానికి చాలా మార్పులు చేసి కట్టించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ గుడిని పునర్నిర్మించగా, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మాత్రం విజయనగర రాజులు నిర్మించారట. తరవాత శివయోగ మందిరానికి బయల్దేరాం. ఇది బాదామికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు మందిరాలు ఉన్నాయి. ఒక మందిరంలో హనగల్‌ కుమారస్వామిజీ, హనగల్‌ సదాశివ స్వామీజీ సమాధులు ఉన్నాయి. ఈ స్వామీజీలకి అతీతశక్తులుండేవని చెబుతారు. అక్కడి నుంచి అనేక ఆలయాల కూటమి అయిన మహాకూటకి వెళ్ళాం. దీన్నే ఒకప్పుడు దక్షిణ కాశీ అనేేవారు. ఇందులో అతి పెద్దది మహాబలేశ్వర ఆలయం. చాళుక్యరాజైన మొదటి పులకేశి ఈ శివాలయాన్ని నిర్మించాడట.

ఆలయాల సముదాయం... ఐహోలె..!
మహాకూటకి 25 కి.మీ. దూరంలో ఉంది ఐహోలె. ఇది కూడా అనేక ఆలయాల సమూహం. అన్నీ ఓ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి దుర్గగుడి, లాడ్‌ఖాన్‌ దేవాలయం, సూర్యనారాయణ, హచిమల్లి దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, మల్లికార్జున దేవాలయాలు. ఇక్కడే ఓ మ్యూజియం ఉంది. అందులో శాసనాలూ శిల్పాలూ చాళుక్యుల పాలనకీ శిల్పకళావైభవానికీ సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో 120కి పైగా హిందూ, జైన, బౌద్ధ ఆలయాలూ కట్టడాలూ ఉన్నాయి. అందుకే మ్యూజియంలో వాటికి సంబంధించిన మ్యాప్‌ కూడా సందర్శకుల సౌకర్యార్థం ఉంచారు. ఇక్కడి మలప్రభ నదీ తీరంలో గొడ్డలి ఆకారంలో ఓ రాయి ఉంది. ఇది పరశురాముడు సంచరించిన ప్రాంతమనీ, క్షత్రియుల్ని వధించాక గొడ్డలిని కడగడంవల్లే ఈ ప్రాంతంలోని నేలంతా ఎర్రబారిందనీ అంటుంటారు. నది ఒడ్డున ఉన్న రాతి పాదముద్రలు భార్గవరాముడివిగానే భావిస్తారు స్థానికులు.


దుర్గగుడి

శిల్పకళా సంపద
ఐహోలెకి 13 కి.మీ. దూరంలో ఉంది పట్టడకల్‌. బాదామి చాళుక్యుల శిల్పకళకి ప్రతీక పట్టడకల్‌. తొలినాటి ఉత్తర, దక్షిణ భారత ఆలయ వాస్తు సమ్మేళనాన్ని ఇక్కడ చూడొచ్చు అంటారు చరిత్రకారులు. ఇక్కడి ఆలయాలు రెండో విక్రమాదిత్య కాలానికి చెందినవి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కర్ణాటకలోని రెండు ప్రదేశాల్లో ఒకటి హంపి అయితే రెండోది పట్టడకల్‌. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉన్నాయి. ఎనిమిది ఆలయాలు ఒకే కూటమిగా ఒకేచోట ఉండగా, పాపనాథ దేవాలయం ఆ సముదాయానికి దక్షిణాన 0.5 కి.మీ. దూరంలోనూ, జైన నారాయణ దేవాలయం పశ్చిమంగా 1.5 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. ఇక్కడి కడసిద్ధేశ్వర, జంబులింగ ఆలయాలు ఏడో శతాబ్దం నాటివి. గలగనాధ, సంగమేశ్వర, కాశీ విశ్వేశ్వర, మల్లికార్జున, విరూపాక్ష ఆలయాలు 8వ శతాబ్దం నాటివి. వీటిల్లో ముఖ్యంగా చూడదగ్గవి విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు. విరూపాక్ష ఆలయానికి తూర్పున నల్లరాతితో చెక్కిన నంది అద్భుతంగా ఉంది. విక్రమాదిత్యుడు కాంచీపురం మీద విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. తూర్పుముఖంగా 18 ఎత్తైన స్తంభాలతో ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయాన్ని కట్టించారు. మల్లికార్జున ఆలయం కూడా దాదాపు అదే పద్ధతిలో ఉంది. చరిత్రలోకివెళ్లి నాటి శిల్పుల ఉలి చాతుర్యాన్ని అణువణువూ తడిమే మనసు ఉండాలేగానీ పట్టడకల్‌ ఆలయాల శోభని చూడ్డానికి ఎంతకాలమైనా సరిపోదు.


పట్టడకల్‌


బాదామి రాతిగుహల్లో..!
తరవాత బాదామి చూడ్డానికి వెళ్లాం. బాదామి క్రీ.శ.500 నుంచి 757 వరకూ చాళుక్యుల రెండో రాజధానిగా ఉండేది. అందుకే వీళ్లకి బాదామి చాళుక్యులుగా పేరు. బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రాంతాలు నాటి శిల్పుల ప్రయోగాలకు వేదికలు అని చెప్పవచ్చు. చాళుక్యులు వాళ్లను ఎంతగానో ప్రోత్సహించేవారు. అన్ని వందల ఆలయాలూ శిల్పాలూ అక్కడ కనిపించడానికి అదే కారణం. బాదామిలో ముఖ్యంగా చూడాల్సినవి భూతనాథ ఆలయం, అగస్త్యతీర్థం, రాతి గుహాలయాలు. భూతనాథ దేవాలయంలో పెద్ద ముఖమండపం, సభామండపం, అంతరాలయం ఉన్నాయి. కొండల మధ్య ఉండే పెద్ద కోనేరే అగస్త్య తీర్థం. పూర్వం అగస్త్యమహర్షి ఇక్కడే వాతాపి అనే రాక్షసుడిని సంహరించినట్లు పౌరాణిక కథనం.


భూతనాథ దేవాలయం

బాదామిలోని రాతి గుహాలయాలను చూడాల్సిందేే. పెద్ద కొండను తొలిచి నిర్మించిన ఈ నాలుగు ఆలయాల్లో మొదటి గుహనే శైవగుహ అంటారు. ఇందులో నటరాజమూర్తి కొలువుతీరాడు. 18 చేతులతో కమలంమీద నాట్యం చేస్తున్నట్లు ఉన్న ఆ మూర్తి నిజంగా అద్భుతం. ఇక్కడే మహిషాసుర మర్దని, అర్ధనారీశ్వర, హరిహర విగ్రహాలు కూడా ఉన్నాయి. రెండోది వైష్ణవ గుహ. దశావతారాల్లో ఐదవది అయిన వామనావతారాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వామనుడితోబాటు బలి చక్రవర్తి, ఆయన భార్య వింద్యావతి, విష్ణుమూర్తి శిల్పాలు ఉన్నాయి. రెండో గుహ పక్కనే ఓ బౌద్ధ గుహ కూడా ఉంది. అందులో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. మూడో గుహ మహావిష్ణువుది. రాజా కీర్తివర్మ పన్నెండేళ్ల పాలనకు గుర్తుగా అతని తమ్ముడు మంగళేష్‌ ఈ గుహని క్రీ.శ. 578లో రూపొందించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. నాలుగో గుహ ఓ జైన దేవాలయం. జైనుల్లో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం తపస్సు చేసుకుంటున్నట్లు చెక్కారు. ఇక్కడి కొండలమీద చెక్కిన ఆరో శతాబ్దం నాటి కన్నడ లిపిని కూడా చూడవచ్చు. నాటి చాళుక్యుల అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది బాదామి కోట. ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందా పట్టణం. జాలువారే జలపాతాల అందాన్నీ కొండగాలి గిలిగింతల్నీ మొత్తమ్మీద అక్కడి నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవాళ్లకి నాటి చాళుక్యుల రాజధాని బాగుంటుంది అని చెప్పవచ్చు.

ఐహోలెకి 35 కి.మీ. దూరంలో కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదుల సంగమం ఉంది. ఆనాటి చాళుక్య శిల్పశైలికి నిదర్శనం ఈ కూడల సంగమేశ్వర ఆలయం. 12వ శతాబ్దంనాటి శైవ మత వ్యాప్తికి కృషిచేసిన సుప్రసిద్ధ శివభక్తుడు బసవేశ్వరుడు ఇక్కడే జన్మించాడట. అందుకే బసవేశ్వర సమాధి ఒక పక్క మండపంలో ఉంది. చివరగా కూడల సంగమానికి పది కి.మీ. దూరంలో ఉన్న అతి పెద్ద ఆలమట్టి డ్యాం చూడ్డానికి వెళ్లాం. దాని చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిల్లో లవకుశ ఉద్యానవనమూ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఉన్న ఉద్యానవనాలను చూసి వెనుతిరిగాం.



Wednesday, 14 March 2018

పంచ సరోవరాలు









పంచ సరోవరాలు - దేవాలయాలు



మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

  1. మానస సరోవరం,
  2. పంపా సరోవరం,
  3. పుష్కర్‌ సరోవరం,
  4. నారాయణ సరోవరం,
  5. బిందు సరోవరం,

1. మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.

ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు. ;ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.

ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలా మంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.

ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

2. పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది. సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది.

"శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.

రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

3. పుష్కర సరోవరం
పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4. నారాయణ వన సరోవరం
ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.

అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

పితృదేవతలకు తర్పణాలు:
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌



Friday, 9 February 2018

బాహుబలికి మహామస్తకాభిషేకం!





బాహుబలికి మహామస్తకాభిషేకం!

ప్రముఖ జైన క్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ ఒకటి. అక్కడి గోమఠేశ్వరుడికి పన్నెండేళ్లకోసారి మహామస్తకాభిషేకాషాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల జనం హాజరవుతారు. ఫిబ్రవరి 17 నుంచి 25 వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు ఏడోతారీఖున నాంది పలకనున్నారు.

శ్రావణబెళగొళ పేరు పరిచయమున్నవారెవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కడ కొలువై ఉండే ఎత్తైన గోమఠేశ్వరుడి విగ్రహమే. పొడవాటి చేతులూ బలిష్ఠమైన దేహం నిర్వికారమైన నవ్వుతో దిగంబరుడిగా కనిపించే ఈయన్నే బాహుబలి అనీ పిలుస్తారు. జ్ఞాన బోధకుడిగా, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ శాంతిని పాదుగొల్పిన మహనీయుడిగా ఆయనకు జైన మతంలో పవిత్రస్థానముంది. కర్ణాటకరాష్ట్రం హాసన జిల్లా శ్రావణబెళగొళలో ఉన్న ఈయన విగ్రహానికి ఈ ఏడాది 89వ మహామస్తకాభిషేకాన్ని నిర్వహించనున్నారు.

ఎవరీ బాహుబలి...
జైన, విష్ణు పురాణాల్లో బాహుబలి ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం, జైన తీర్థంకరుల్లో మొదటివాడూ ఇక్ష్వాకు వంశస్థుడైన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన చేసేవాడు. ఆయనకు సునందాదేవి, యశస్వతీదేవి అనే ఇద్దరు భార్యల ద్వారా భరతుడు, బాహుబలి అనే పుత్రులు కలిగారు. కొన్ని కారణాలవల్ల వృషభనాథుడు విరక్తుడై రాజ్యాన్ని విభజించి అయోధ్యకు భరతుడినీ, పోదనపురానికి(ఇప్పటి తెలంగాణలోని బోధన్‌ను) బాహుబలినీ రాజులుగా చేసి సర్వసంగపరిత్యాగుడయ్యాడు. జైత్రయాత్రలో భాగంగా బాహుబలితోనూ భరతుడు యుద్ధం చేయాలనుకున్నాడు. ఇద్దరూ యుద్ధ విద్యాసంపన్నులు కాబట్టి వీరి పోరు వల్ల అపార సైన్య నష్టం వాటిల్లుతుందని భయపడ్డ ఇరు పక్షాల మంత్రులూ సోదరులిద్దరే ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనను వీరిద్దరూ అంగీకరించారు. మల్లయుద్ధంలో బాహుబలి భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలని చెయ్యి పైకెత్తాడు. అప్పుడు సోదరుడి కళ్లలో మరణ భయాన్ని చూసి చలించిపోయిన బాహుబలి, వెంటనే విరక్తుడయ్యాడు. రాజ్యం కోసం అన్నతో యుధ్ధమా అని బాధపడి, తన రాజ్యాన్ని సైతం భరతుడికి అప్పగించి, సన్యాసం తీసుకుని తపస్సుచేసి మహత్తర జ్ఞాన సంపన్నుడయ్యాడు.

అదే స్ఫూర్తితో...
అప్పట్లో బాహుబలి పాలించిన బోధన్‌లో అతి ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేదట. దాని స్ఫూర్తితో అప్పటి గంగరాజుల మంత్రి చాముండరాయ కర్ణాటకలోనూ అలాంటిదే నిర్మించాలని తలపెట్టి జైన మతానికి ఆలవాలంగా ఉన్న వింధ్యగిరిపై  క్రీ.శ.981లో దీన్ని ప్రతిష్ఠించి పన్నెండేళ్లకొకసారి మహామస్తకాభిషేకాన్ని జరిపే ఆనవాయితీని ప్రారంభించాడు. విగ్రహాన్ని చెక్కించాడు కాబట్టి తనొక్కడే దానికి అభిషేకం చేయాలని భావించి తొలుత అభిషేకోత్సవాల్లో ఎవర్నీ పాల్గొననివ్వలేదు. తెప్పించిన ద్రవ్యాలన్నీ అయిపోయినా బాహుబలి విగ్రహం కాళ్లదాకా తడవకపోవడం వల్ల అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు తాను తెచ్చిన పాలు పోస్తానని అడగడంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను అనుమతించాడట. అయితే ఆ పాలు విగ్రహాన్ని తడపడమే కాదు నేల మీది దాకా ఒక ధారలా ప్రవహించాయట. ఆ రోజు చాముండరాయ కళ్లు తెరిపించింది జైన దేవతేనని చెప్పుకుంటారు. అప్పటి నుంచీ ఆ వేడుకకి హాజరయిన జనమంతా అభిషేకంలో భాగస్వాములవుతూ ఉంటారు. 17వ తారీఖు నుంచి జరగబోయే ఈ అభిషేకానికి నీళ్లు, పసుపు, చందనం, సర్వౌషధి కషాయం, పువ్వులూ తదితరాలను వినియోగిస్తారు. విగ్రహానికి ఎదురుగా కూర్చుని ఆరువేల మంది దాకా పూజలు తిలకించొచ్చు. ఈ కొండకు ఎదురుగా ఉండే చంద్రగిరిపై నుంచీ రెండు లక్షల మంది వేడుకను వీక్షించగలిగేలా ఏర్పాట్లు చేశారు.

- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు.





Wednesday, 27 September 2017

పంచముఖేశ్వరాలయం









పరమాద్భుతం పంచముఖేశ్వరాలయం



పవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతో పాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్‌లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్‌ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా.

ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామి వారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు.

బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది.

నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామి వారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలు భక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చే వరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు.

మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం:
12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: 
కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక:
8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది.

అదే విధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకేవస్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌



Sunday, 20 August 2017

హంపి

హంపి బాలకృష్ణాలయం అద్భుత శిల్పచాతుర్యం
హంపి పేరు వినగానే మనకు విరూపాక్షాలయమే గుర్తొస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షాలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని అలనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీతి.

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. 15వ శతాబ్దానికి చెందిన సువిశాలమైన, సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ, చారిత్రక సంపదగా యూనెస్కో గుర్తించింది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం అంతరాళం, గర్భగృహం, అర్ధమంటపం లేదా ప్రదక్షిణ మంటపం, ముక్తిమంటపం లేదా రంగమంటపం అని నాలుగైదు విభాగాలుగా ఉంటుంది. ఆలయానికి తూర్పుదిశగా ఉన్న మంటపానికే  రంగమంటపమని పేరు. అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణదిక్కుగా అందమైన అరటి తోట. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను.

అయితే, ఆ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడకంలో లేదు. పశ్చిమానికి వెళితే దీర్ఘచతురస్రాకారపు భవంతి. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యపు గాదె, దానిని ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన చిత్రాన్ని చూడవచ్చు.

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయమర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. అంతరాలయం పై కప్పుపైన సింహతలాటాలు, వాద్యగాళ్ల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రం చేయగా, ఇప్పుడది చెన్నైలోని నేషనల్‌ మ్యూజియంలో ఉంది. కృష్ణుడి విగ్రహం లేదు కదా, ఇంకేముందక్కడ చూడటానికి? అనే సందేహం రావచ్చు... అయితే, ఆలయంలోని శిల్పసంపదను, ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే. ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుమూ వసూలు చేయరు. అంతేకాదు, ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. మనల్ని ఎవరూ అభ్యంతర  పెట్టరు.

ఎలా వెళ్లాలంటే..?
బెంగళూరు నుంచి హోస్పేటకు ఆర్టీసీ బస్సులున్నాయి. రైళ్లున్నాయి. హోస్పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు
విరూపాక్ష దేవాలయం, విరూపాక్ష గుహలు, కడలేకలులో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం, శశిలేకలులో ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిదడుగుల గణేశుని విగ్రహం, హజార రామాలయం, పట్టాభిరామాలయం, కమల్‌ మహల్, హంపీబజార్‌... ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన వీధి ఇది. ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు, రంగురాళ్లు అమ్ముతున్నారు. అచ్యుతరాయాలయం: పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణ్వాంశ స్వరూపుడైన తిరువేంగళనాథుని విగ్రహాన్ని సందర్శించుకోవచ్చు. ఇంకా 900 ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది. గగన్‌ మహల్, ఆర్కియాలజికల్‌ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Saturday, 18 March 2017

చెన్నకేశవ ఆలయం






యుద్ధ విజయసూచికగా హోయసలలు నిర్మించిన ఆలయం

దేశంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. హోయసలలు ఈ ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర దాగివుంది. ఆనాడు ఓ యుద్ధంలో గెలిచిన విజయసూచికగా, చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఆలయ చరిత్ర :
11-12 శతాబ్ద కాలాల్లో హోయసలుల రాజవంశస్థులు వుండేవారు. హళేబీడు ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘బేలూరు’ పట్టణాన్ని తమ రాజధానిగా నియమించుకుని వారు పాలించేవారు. ఈ రెండు పట్టణాలు జంట-పట్టణాలుగా పేరుగాంచాయి. ఆనాడు వారు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానంగా బేలూరులో నిర్మించిన ఈ ‘చెన్నకేశవాలయం’ చూడదగింది. ఈ ఆలయాన్ని హొయసలుల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు.

క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులు, హోయసలుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలులవారు గెలిపొందారు. ఆ విజయ సూచికగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పుడు వారు చోళులపై ‘తాలకాడ్’ యుద్ద విజయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనుక మరో కథనం కూడా వుంది. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడనన్న వాదనలూ వున్నాయి.

ఆలయ విశేషాలు :
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంగా కేశవాలయం పరిగణించబడుతుంది. ఈ ఆలయం చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆ రాజవంశస్థులు ద్రావిడ శైలిలో ‘సబ్బురాతి’తో నిర్మించారు. ఈ ఆలయంపై వున్న శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. అలాగే దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.





Wednesday, 15 March 2017

మురుడేశ్వర క్షేత్రం





మురుడేశ్వర క్షేత్రం

మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో బత్కల్‌ తాలూకాలో ఉంది. ఇక్కడికి కర్ణాటకలో ముఖ్య నగరాలైన బెంగుళూరు, మంగళూరు, హుబ్లీ, ధర్మస్థల మొదలయిన నగరాల నుండి బస్సులు ఉన్నాయి. మురుడేశ్వరానికి రైలుమార్గం కూడా ఉంది. కొంకొణ రైల్వేవిభాగంలో మురుడేశ్వర రైల్వేస్టేషన్‌ ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

స్థలపురాణం:రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగానికి, మురుడేశ్వర క్షేత్రంలోంలోని లింగానికి సంబంధం ఉంది. రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణవటువు రూపంలో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమినుండి బయటకి తీసుకురావడానికి వీలుకాకుండా భూస్థాపితమయింది. సాయంసమయాన ఆర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు. అప్పుడు రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహామహిమాన్వితమయిన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

ఆ ప్రదేశాలు, గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. గోకర్ణక్షేత్రంతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. అంటే సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు. పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ఐదుక్షేత్రాలను దర్శించి, అక్కడి శివలింగాలను పూజించారట. పార్వతీ పరమేశ్వరులు ఈ ఐదుక్షేత్రాలలో ఒక్కొక్కచోట వారం రోజులపాటు ఉండి పూజలు చేశారట. ఇక్కడికి దేవతలతో పాటు ఋషులు, మునులు కూడా వచ్చి పూజలు చేశారట.

మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని తయారు చేయడానికి, దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా, విశ్వకర్మ పానవట్టాన్ని తయారుచేశారట. మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం అంటే బంతి అని అర్థం) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది.

ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి మరణభయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీదేవత, తూర్పున మహాదుర్గదేవత, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువైఉండి, రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పత్రాలు, పూలు, పండ్లతో పూజిస్తాడట.

బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట. ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారట. అప్పుడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. అప్పుడు పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు. కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు. భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థంగా పిలువబడుతోంది. బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడు.

ఇక్కడ ఇంద్రుడు ఉన్నప్పుడు, దేవతలందరూ వచ్చి మురుడేశ్వరస్వామిని పూజించారట. కోండమీద సముద్ర సమీపంలో ఉన్న మురుడేశ్వరస్వామి దేవాలయానికి సహజమైన సౌందర్యం, ఆకర్షణ ఉన్నాయి. దేవాలయ విశిష్టత: ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. స్వామిని దర్శించి పూజించడం వల్ల తమ కోరికలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. ఈ క్షేత్రంలో రకరకాల ఆర్జిత సేవలు చేయబడుతున్నాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, సర్వదేవపూజ అంటూ సుమారు 50 రకాల పూజావిధానాలున్నాయి. ఈ పూజకు 5000 రూపాయల నుంచి 10 రూపాయల వరకు రుసుము వసూలు చేయబడుతోంది. శివరాత్రి ఉత్సవములు, పుష్యమాసంలో రథీత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవములను చూసేందుకు దూరప్రాంతాల నుంచి కొన్ని లక్షలమంది భక్తులు వస్తుంటారు.

మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేషప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం. ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమయిన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీనకాలం నాటి ఈ దేవాలయం కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలావస్థ నుండి, అందరి ప్రశంసలను అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్‌.ఎన్‌. శెట్టీ అనే భక్తుడు ముఖ్య కారకుడు.

అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయ పునర్నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుప్రక్కల ఏనుగు ప్రతిమలు నిజమయిన ఏనుగుల వలెనే భ్రమింపజేస్తుంటాయి. ఇప్పుడు ఈ క్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరమంతా రద్దిగా ఉంటుంది. మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం, అందులో ముఖ్యమయినవి. ఈ తీర్థాలన్నీ దేవాలయం అవతల నగరంలో వున్నాయి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, ధీర్ఘకాల రోగాలు నయమయి, తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, అంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం కూడా ఉన్నాయి. దేవాలయమ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతూంటారు. చెట్టునిండుగా ముడుపులను చూడగలం. ఇక్కడ యాత్రీకులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళూ ఉన్నాయి. మురుడేశ్వరాలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతీ భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం మురుడేశ్వరం.





Tuesday, 14 March 2017

ఉడిపి క్షేత్రం





ఉడిపి క్షేత్రం

జగద్గురు, గీతాచార్యుడు భగవాన్‌ శ్రీకృష్ణుడు బాల కృష్ణుని రూపంలో వెలసిన క్షేత్రమే ఉడిపి. కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా. ప్రసిద్ధ కృష్ణమందిరం ఇక్కడ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని శివళ్లి అని పిలిచేవారు. ద్వైతమత స్థాపకులు శ్రీమధ్వాచార్యులు అవతరించిన స్థలం భాగ్యతక్షేత్రం. దానికి సమీపంలో ఉడిపి ఉంది. శ్రీమధ్వాచార్యులు శిష్యులతో కలిసి శ్రీకృష్ణుని విగ్రహ ప్ర‌తిష్ఠ‌ జరిపించారు. దీనికి సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది.



శ్రీమధ్వాచార్యులు త‌న‌కున్న  దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఓడలోని నావికుడు వీరికి గోపిచందనం మూటను కానుకగా సమర్పించాడు. అందులో చందనంతో పాటూ చిన్ని కృష్ణుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పుముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండడం వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంత్యకులానికి చెందిన కనకదాసు కృష్ణదర్శనం కోసం ప్రాధేయపడగా పూజారులు నిరాకరించారు. కనకదాసు భక్తిని మెచ్చిన కృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం. కనకదాసుకు కనిపించిన కిటికిలో నుంచే నేటికీ భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు. దీనిని కనకుడి కిటికీ అంటారు. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండప నిర్మాణం చేశారు. దీనికే కనకదాసు మండపమని పేరు. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.

ఆలయానికి కుడివైపున శ్రీమధ్వతీర్థం ఉంది. తీర్థం మధ్యభాగంలో అందమైన మండపం ఉంది. అందులో శ్రీమధ్వాచార్యుల ప్రతిమ ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. తీర్థానికి ఒకవైపున భగీరథుని మందిరం, మరోవైపు చెన్నకేశవస్వామి మందిరం ఉన్నాయి. ప్రధాన ఆలయమంతా శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణచిత్రాలతో నిండి ఉంటుంది. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే తీర్థమండపం ఉంది. మండపంలోనే స్వామివారికి ఇష్టమైన అటుకులపొడిని ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో తీర్థమండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో మండపం శోభాయమానంగా ఉంటుంది.

గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చేతుల్లో ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయం బయట శ్రీమధ్వాచార్యుల విగ్రహం ఉంది. మరోపక్క శ్రీమధ్వాచార్య పీఠం ఉంది. ఆంజనేయస్వామి భవ్యమందిరంలో స్వామివారు వీరాంజనేయస్వామి అవతారంలో కన్పిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలు ఉన్నాయి.

ఉడిపి వంటకాలు, హోటళ్లు విశేష ఆదరణ పొందాయి. శాకాహార వంటల్లో ఉడిపి శైలి వంటలు ప్రసిద్ధి చెందాయి. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశమంతటా ఉడిపి హోటళ్లు ఉన్నాయి. దక్షిణ భారతీయ శాకాహార వంటలు ఉడిపి ప్రత్యేకత.

ఎలా వెళ్లాలిహైదరాబాద్‌ నుంచి ఉడిపి 767 కి.మీ. దూరంలో ఉంది. రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. విమానంలో వెళ్లాలనుకునేవారు మంగుళూరు వెళ్లి అక్కడి నుంచి ఉడిపి చేరుకోవచ్చు.





Sunday, 29 January 2017

కర్ణాటక కోస్తా తీరం






ఆ ఉదయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం!
అరేబియా సముద్ర అందాలూ సుందర ప్రకృతి దృశ్యాలూ వాటి నడుమ వెలసిన పౌరాణిక క్షేత్రాలతో అలరారే అద్భుత ప్రదేశమే కర్ణాటక కోస్తా తీరం అంటున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన AVS ప్రసాద్‌.

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి, కొల్లూరు, శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ ఏకకాలంలో చూసి రావాలనుకుని పక్కా ప్రణాళికతో కాచిగూడలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడ దిగి, అక్కడ నుంచి తిరిగి ఉదయం ఏడు గంటలకు కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపికి బయలుదేరాం. కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌ వారానికి మూడుసార్లు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన్నే బయలుదేరుతుంది. ఇది కాకుండా బెంగళూరు నుంచి రోజూ రాత్రి 8 గంటలకు బయలుదేరే కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపి, కొల్లూరు చేరుకోవచ్చు.

మేం ఎక్కిన రైలు హాసన్‌ దాటాక కుక్కి క్షేత్రం వరకూ ప్రకృతి కనువిందు చేసింది. ఆ కొద్ది మేర కొండదారి కావడంతో రైలు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ప్రయాణ మార్గానికి ఓ వైపు కొండలూ మరోవైపు లోయలూ సెలయేళ్లతో అద్భుతంగా ఉంది. రైలు సుమారు 50 గుహల గుండా ప్రయాణం చేస్తుంది.

సాయంత్రం ఎనిమిది గంటలకు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని చేరుకుంది. రైల్వేస్టేషనుకు వూరు 5 కి.మీ. దూరం. ఆటోలో శ్రీకృష్ణ ఆలయానికి దగ్గరలోని ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లాం. ఈ ఆలయానికి దగ్గరలోని గీతా మందిర్‌, ఇతర మఠాలు, ఇంకా లాడ్జీల్లో పర్యటకులకు వసతి సౌకర్యం ఉంటుంది. ఆలయానికి వెళ్లేటప్పుడు బస చేసిన తాలూకు కాగితాలనూ మన ఐడీప్రూఫ్‌నూ మరిచిపోకుండా తీసుకెళ్లాలి. ఉదయాన్నే బయలుదేరి ఆలయానికి చేరి స్వామిని దర్శించుకున్నాం. ఒకప్పుడు భూకంపం తరవాత శ్రీకృష్ణ భక్తుడైన కనకదాసు ఎలాగయితే ఆయన్ని దర్శించుకున్నాడో అదేమాదిరిగా భక్తులు కిటికీలో నుంచే చూడాలి. ఉడుపి కృష్ణునికి చేసే అలంకారం ఎంతో ముద్దుగా ఉంటుంది. కృష్ణ జన్మాష్టమిని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. తరవాత మందిరం ముందున్న పుష్కరిణినీ పక్కనే ఉన్న అనంతేశ్వర స్వామినీ చంద్రమౌళీశ్వరుణ్ణీ దర్శించుకుని గదికి వచ్చి అన్నీ సర్దుకుని కారులో కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి బయలుదేరాం.

కొల్లూరు మూకాంబిక అమ్మ వారు
ఉడుపి నుంచి కుందపుర మీదుగా కొల్లూరుకి 80 కిలోమీటర్ల దూరం. కుందపుర నుంచి కొల్లూరు వరకూ 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు ప్రయాణం మనల్ని మరో లోకంలో విహరింపచేస్తుంది. కొండలూ, లోయలూ, జలపాతాలూ, కాఫీ తేయాకు తోటలూ, రబ్బరూ వక్క చెట్లతో ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లే అనిపిస్తుంది. సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో కొండల మధ్య కొలువైన మూకాంబిక అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని తరించాం. కౌమాసుర అనే రాక్షసుణ్ణి పార్వతీదేవి మూకాంబిక అవతారంతో సంహరించిందన్నది పురాణ కథనం. అక్కడకు పదికిలోమీటర్ల దూరంలోనే కొడ్చాద్రి హిల్స్‌ ఉన్నాయి. సమయాభావంతో మేం అక్కడకు వెళ్లలేదు గానీ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటాయట.

సాగర తీరంలో శివరూపం!
తరవాత బైందూరు మీదుగా 66 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న మురుడేశ్వర్‌ శివక్షేత్రాన్ని చేరుకున్నాం. ఇది ప్రపంచంలోకెల్లా రెండో అతి పెద్ద శివుని విగ్రహం. ఎంతో అందంగా నిర్మించిన ఆ విగ్రహాన్ని తనివితీరా చూసి తరించాం. ఇక్కడి ఆలయ గోపురం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. 21 అంతస్తులతో ఉన్న ఈ గోపురం పై అంతస్తులోకి ఎక్కేందుకు లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. అక్కడ నుంచి అరేబియా సముద్రాన్నీ శివుడి విగ్రహాన్నీ వీక్షించవచ్చు. ఈ విగ్రహం ఇక్కడి బీచ్‌ను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తూ ఆ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ఆ తరవాత ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం శృంగేరికి బయలుదేరాం.

సూర్యాస్తమయం... నయనానందకరం!
మేం శృంగేరికి అగుంటె మీదుగా బయలుదేరాం. ఎందుకంటే అగుంటె సూర్యాస్తమయ వీక్షణ ప్రదేశం. సముద్రమట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుంచి అరేబియా సముద్రంలో అస్తమిస్తోన్న సూర్యుణ్ని చూస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంతోమంది పర్యటకులు సూర్యాస్తమయ సమయానికి ఇక్కడకు చేరుకుని ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక్కడ నుంచి శృంగేరి 25 కి.మీ. మేం అక్కడకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావొచ్చింది. మర్నాడు ఉదయం శారదా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు స్వర్ణాభరణాలంకరణతో పుష్పార్చనలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. అమ్మ దర్శనంతో మా జన్మలు చరితార్ధమయ్యాయన్న భావన కలిగింది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన మొట్టమొదటి పీఠం శృంగేరి. మేం ఉదయాన్నే వెళ్లడంవల్ల భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. శారదా అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న అతి ప్రాచీనమైన విద్యాశంకరుల దేవాలయం కూడా దర్శించుకున్నాం. ఈ ఆలయం హొయసల నిర్మాణశైలిని కలిగి ఉంది. ఈ ఆలయాల పక్కనే తుంగానది వయ్యారంగా ప్రవహిస్తోంది.

ఉదయసంధ్య వేళలో...
ఈ ఆలయం నుంచి తుంగానది మీదుగా కాలినడకన వెళ్లే వంతెన ఉంది. ఆవలి వైపు పీఠాధిపతుల ఆశ్రమం ఉంది. ఉదయం వేళలో ఆ నది మీద కప్పేసిన పొగమంచూ ఆ పొగమంచును చీల్చుకుంటూ వస్తోన్న లేలేత బంగారు సూర్యకిరణాలూ నదిమీదుగా ఎగురుతోన్న పక్షుల గుంపులూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతా... చూస్తుంటే సృష్టికర్త ఓ అందమైన చిత్తరువుని గీసి అక్కడ పెట్టాడా అనిపించింది. ఆ నదిలోని చేపలు భక్తులు వేసే మరమరాల కోసం నీటిమీద ఎగిరెగిరి పడుతున్నాయి. తుంగానదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాంతో కింద ఉన్న భూమి కనిపిస్తుంటుంది. ఆ ఉదయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఇంతకన్నా  అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. అక్కడ అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఆది శంకరులు, తోరణ గణపతి ఆలయాలను దర్శించుకుని వీడలేక వీడలేక ఆ గుడి బయటకు వచ్చాం. అక్కడ నుంచి ఉదయం పది గంటలకే బయలుదేరి హోర్నాడు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాం. శృంగేరి నుంచి హోర్నాడు 45 కిలోమీటర్ల దూరం. ఈ మార్గం కూడా మనల్ని కళ్లు తిప్పుకోనీయదు. ఎత్తయిన కొండలూ వాటి మధ్యనే బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో నిండిన చిన్న చిన్న వూళ్లూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా తోచాయి. అమ్మవారి ఆలయానికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. లగేజీని బస్టాండుకు దగ్గరలోనే ఉన్న ఓ షాపులో పెట్టి దర్శనానికి వెళ్లాం. అరగంటలోనే ఆది శక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దివ్యమంగళ దర్శనం చేసుకుని తరించాం. అగస్త్యేశ్వరుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. దర్శనం తరవాత అమ్మవారి భోజనం చేశాం. ఇక్కడికొచ్చే వాళ్లంతా ఆలయంవారు పెట్టే భోజనం తప్పక తింటారు. అక్కణ్ణుంచి మధ్యాహ్నం మూడు గంటలకే ధర్మస్థలకు బయలుదేరాం.

హోర్నాడు నుంచి కొట్టిగర మీదుగా ధర్మస్థల చేరుకోవాలి. ఇది సుమారు 95 కిలోమీటర్ల దూరం. అయితే కొట్టిగర వరకూ 40 కి.మీ. ప్రయాణం పూర్తిగా కొండలతో ఘాట్‌ రోడ్ల మధ్య సాగిపోతుంది. కొట్టిగర నుంచి ధర్మస్థల వరకూ 45 కిలోమీటర్ల విశాలమైన కొండదారి కిందకి దిగుతూ ఉంటుంది. ఇలా దిగేటప్పుడు మాత్రం చాలా మలుపులు ఉంటాయి. సాయంత్రం ఐదు గంటలకు ధర్మస్థల చేరుకుని ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న గెస్ట్‌హౌస్‌లో దిగి బస చేశాం. ఈ ప్రదేశం తిరుమలలా ఉంది. వూళ్లొకి ప్రవేశించగానే త్రిశూలం పట్టుకుని ఉన్న పెద్ద శివుని విగ్రహం ఉంది. మేం వెళ్లిన రోజునా మర్నాడూ మంజునాథుణ్ణీ అమ్మవార్లనూ తనివితీరా దర్శించుకున్నాం. అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. ఆలయంలోపల చతురస్రాకారపు చెక్కమీద రకరకాలైన దేవతా రూపాలు చెక్కి ఉన్నాయి. లోపల వినాయకుడి ఆలయం కూడా ఉంది. అవన్నీ చూసుకుని సాయంత్రానికి అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని కుక్కి సుబ్రహ్మణ్యస్వామిని చూడ్డానికి వెళ్లాం.

సర్పరక్షిత క్షేత్రం!
ధర్మస్థల, కుక్కి క్షేత్రాల మధ్య ప్రతి అరగంటకీ బస్సులు ఉంటాయి. కుక్కిలో అతి తక్కువ రుసుముతోనే బస చేయడానికి అన్ని వసతులతో కూడిన కుమార కృప, స్కంద కృప, కార్తికేయ మొదలైన అతిథిగృహాలూ ప్రైవేటు లాడ్జీలూ ఉన్నాయి. ఉదయాన్నే ఇక్కడ ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలో కింద శివలింగం, దానికి నాగాభరణం, పైన మళ్లీ నాగాభరణం, ఆపైన దేదీప్యమానంగా వెలిగిపోతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. సుబ్రహ్మణ్యుడికి కుడివైపున ఉమామహేశ్వర మందిరం ఉంది. బయట ఉన్న మరో చతురస్ర ప్రాకారంలో నాగప్రతిష్ఠమండపం, సంకల్ప మండపం, శృంగేరి మఠం, హోసొలిగమ్మ ఉన్నాయి. కుక్కి ముందుగా శివ క్షేత్రం. శివుడు పరీక్షిత్‌ మహారాజుకి వరమివ్వడంతో సుబ్రహ్మణ్యుడు ఇక్కడ వెలిశాడట. సుబ్రహ్మణ్యుడు, ఆది సుబ్రహ్మణ్యుడుగా పుట్ట రూపంలో ఇక్కడే ఉన్న వేరొక ఆలయంలో కొలువై ఉన్నాడు. భక్తులందరూ తప్పకుండా కుమారధారలో స్నానమాచరించి ఈ రెండు ఆలయాలనూ దర్శించుకుంటారు. కుమారధార అనేక ఔషధమొక్కల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి సర్వ శారీరక రోగాలనూ నయంచేయగల శక్తీ, దైవికంగా సర్వపాపాలనూ హరించే శక్తీ ఈ నదికి ఉన్నాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ వధ అనంతరం ఆ పాపాలను హరింపజేసుకునేందుకు ఇక్కడి కుమారధారలో స్నానమాచరించాడన్నది స్థల పురాణం. వాసుకి తపస్సు కారణంగా సర్పజాతి, గరుత్మంతుడి నుంచి ఈ కుక్కి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని చెంత రక్షణ పొందుతుందని ప్రతీతి.

ఇక్కడి ఆలయంవారు నిర్వహించే సర్ప సంస్కార సేవలో వరసగా రెండురోజులు పాల్గొన్నాం. ఈ క్రతువుకి ఓ ప్రత్యేక యాగశాల ఉంది. కుటుంబం నుంచి నలుగురిని పూజకు అనుమతి ఇస్తారు. పూజ రెండోరోజున ప్రధాన ఆలయంలో నాగప్రతిష్ఠ జరగడంతో సర్పసంస్కార పూజ ముగుస్తుంది. పూజలో పాల్గొన్న భక్తులకే కాకుండా కుక్కి వచ్చే మిగిలిన భక్తులందరికీ కూడా రోజూ రెండు పూటలా అన్నదానం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించామన్న ఆనందంతో వెనుతిరిగాం. అయితే ఆయా క్షేత్రాల్లోని ఆలయాలను పురుషులు తప్పకుండా పంచె, బనీనుతోనే దర్శించాలి. చొక్కా వేసుకోకూడదు. కండువా కప్పుకోవచ్చు. అదే స్త్రీలయితే చీర, లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ మాత్రమే వేసుకోవాలి.

Friday, 10 June 2016

శ్రీరంగ పట్టణం






జలపాత హోయలు, రంగనాథుని కటాక్షం వెరసి శ్రీరంగ పట్టణం

కర్ణాటకలో మైసూరు తరువాత చెప్పుకోదగ్గ అతి పెద్ద పర్యాటక కేంద్రం శ్రీరంగ పట్టణం. ఇది మైసూరుకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. టిప్పు సుల్తాన్‌ కాలంలో అప్పటి మైసూరు రాజ్యానికి రాజధానిగా విరాజిల్లింది. శ్రీరంగ పట్టణంలో ముందుగా చెప్పుకోదగినది రంగనాథస్వామి ఆలయం. ఎంతో చారిత్రక విశిష్టతను తనలో ఇముడ్చుకున్న ఆ ఆలయంతో పాటు ఎన్నో విహార ప్రదేశాలు ఈ పట్టణంలో ఒదిగిపోయాయి. మైసూర్‌ విహారానికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు శ్రీరంగపట్టణాన్ని కూడా దర్శిస్తారంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే పేరుగాంచిన శ్రీరంగపట్టణ విహార విశేషాలు ..........

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కావేరి తీరప్రాంతంలో ఉన్న శ్రీరంగపట్టణం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుండడంతో ఈ నగరం ఓ ద్వీపంలా కనబడుతుంది. ఇక్కడ కొలువైవున్న శ్రీరంగనాధ స్వామి పేరుతో ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతోన్న ఆ ఆలయం... హోయసల, విజయనగర నిర్మాణశైలికి అద్దం పడుతుంది.

రంగనాథస్వామి దేవాలయానికి ఎదురుగా వినాయకుడి దేవాలయం ఉన్నది. అంతే కాకుండా గంగాధరేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, జ్యోతిమహేశ్వర స్వామి వంటి ఎన్నో దేవాలయాలు శ్రీరంగపట్టణంలో కొలువుదీరి ఉన్నాయి.

పట్టణ చరిత్ర... 

శ్రీరంగపట్టణం... విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్య క్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అంతేగాక మైసూరు రాజ్య రాజధానిగా కూడా విశేష సేవలందించింది ఈ నగరం. రంగ రాయ మహారాజును ఓడించిన వడయార్‌ రాజు 1610లో శ్రీరంగపట్ట ణాన్ని వశపరుచుకున్నాడు. విజయ నగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్‌ రాజును విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, అందువల్ల వడయార్‌ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. రాజా వడయార్‌ రంగరాయను ఓడించిన తరువాత 1610లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. అప్పటి నుండి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను ఎందో వైభవోపేతంగా జరపడం ఆనవాయితీగా మారింది. అప్పటి నుండి మైసూర్‌ దసరా ఉత్సవాలకు ఒక గుర్తింపు వచ్చింది. చాముండేశ్వరీ దేవిని కొలుస్తూ పదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు దేశంలోనే ఎంతో పేరుప్రఖ్యాతులను సంతరించుకున్నాయి.

1610లో రాజా వడయార్‌ వశపరుచున్న శ్రీరంగపట్టణం 1947లో భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు మైసూర్‌ రాజధానిగా వెలుగొందింది. రాజా వడయార్‌ తరువాత, హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం మైసూరు రాజ్యానికి రాజధాని అయ్యింది. టిప్పు సుల్తాన్‌ తన రాజ్యానికి ‘ఖుదాదాద్‌ సల్తనత్‌’ లేదా ‘సల్తనత్‌ ఎ ఖుదా దాద్‌’ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్‌ శ్రీరంగపట్టణాన్ని రాజధాని చేసుకుని, దక్షిణ భారత్‌ లోని చాలా ప్రాంతాలను తన రాజ్యంలో కలుపు కున్నాడు. ఇండో - ఇస్లామీ నిర్మాణ శైలిలో టిప్పుసుల్తాన్‌ సమాధి, టిప్పూ ప్యాలెస్‌, దరియా దౌలత్‌, జుమ్మా మసీదు లాంటి నిర్మా ణాలు ఈ నగరానికి శోభను చేకూర్చుతున్నాయి. ఇలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించి తనదైన శైలి పరిపాలనతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన టిప్పు సుల్తాన్‌ 1799 లో తన సొంత అనుచరగణం విద్రోహ చర్యవల్ల శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్‌ వారిచే చంపబడ్డాడు.

చూడదగ్గ ప్రదేశాలు... 

మైసూర్‌ పర్యటన పూర్తిచేసుకొని శ్రీరంగపట్టణంలో అడుపెట్టగానే ఎన్నెన్నో చారిత్రక నిర్మాణాలు ప్రకృతి రమణీయతలు స్వాగతం పలుకుతాయి. రంగనాథ స్వామి దేవాలయంతో పాటు టిప్పు సుల్తాన్‌ నిర్మించిన జుమ్మా మసీదు, అంతే కాకుండా రంగన్‌ తిట్టు పక్షి అభయారణ్యం, కరిఘట్ట శ్రీనివాస ఆలయం, దరియా దౌల త్‌ గార్డెన్‌, శివనసముద్ర జలపాతం లాంటి ఎన్నో ప్రదే శాలు విహారాన్ని జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి.

దేశంలో రెండవ అతిపెద్ద జలపాతం... 

శివనసముద్ర జలపాతం, భారత్‌ లో రెండవ, ప్రపంచంలో 16వ అతిపెద్ద జలపాతం. శ్రీరంగపట్టణానికి అతి చేరువలో ఉన్న చిన్న నగరం శివనసముద్ర. ఇది కావేరి నది ఒడ్డున ఉంది. ఆసియాలో మొట్టమొదటి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం స్థాపించింది ఇక్కడే కావడం విశేషం. 1902 ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాట చేశారు. కావేరి నదీ మార్గంలో డెక్కన్‌ పీఠభూమి యొక్క రాళ్లు, పర్వత కనుమల్లో నుండి పై నుండి కిందికి దూకుతూ పర్యాటకులను ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది శివనసముద్ర జలపాతం. శివనసముద్ర ద్వీప నగరం... ఇక్కడ కావేరి నదిని జంట జలపాతాలుగా విభజిస్తుంది. ఈ దృశ్యం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద ద్వీపం ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా శ్రీరంగపట్టణంలో మాదిరిగా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.

ఇది ఒక పరిచ్ఛేద జలపాతం. పరిచ్ఛేద జలపాతం అనగా... నీటి ప్రవాహం రెండు లేదా మరిన్ని పాయలుగా విడిపోవడానికి ముందు ఒక చరియ మీదగా కిందకి పడటం వలన ఏర్పడతాయి. ఫలితంగా పక్కపక్కనే ప్రవహించే పలు జలపాతాలు ఏర్పడతాయి. ఈ జలపాతం సగటున 849 మీటర్ల వెడల్పు, 90 మీ ఎత్తుతో సెకనుకు 934 క్యూబిక్‌ మీటర్లను కలిగి ఉంది. గరిష్ట నమోదిత ఘన పరిమాణం సెకనుకు 18,887 క్యూబిక్‌ మీటర్లు. ఇది ఒక జీవ జలపాతం. జూలై నుండి అక్టోబరు వరకు రుతు పవన కాలంలో అత్యధిక ప్రవాహాన్ని కలిగి ఉంటుంది.

బెంగుళూరు నగరానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి ఓ విశిష్టత ఉంది. ఈ జలపాతం యొక్క ఎడమ భాగాన్ని గగనచుక్కీ అని, కుడి భాగాన్ని భారచుక్కీ అని పిలుస్తారు. వాస్తవానికి, భారచుక్కీ జలపాతాలు. గగనచుక్కీ జలపాతాలకు నైరుతి దిశలో కొన్ని కిలోమీటర్లు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే కావేరీ నది కూడా ఉత్తర దిశలో కొన్ని కిలోమీటర్లు పశ్చిమ, తూర్పు భాగాల్లోకి విడిపోతుంది. పశ్చిమ భాగం ఫలితంగా గగనచుక్కీ జంట జలపాతాలుగా విభజించబడుతుంది. అలాగే తూర్పు భాగం ఫలితంగా భారచుక్కీ జలపాతాలు విభజించబడతాయి. గగనచుక్కీ జలపాతాలను శివనసముద్ర వాచ్‌ టవర్‌ నుండి చాలా దగ్గరగా వీక్షించవచ్చు. దక్షిణాది భాషలకు సంబంధిచిన చలనచిత్రాల్లోని జలపాత దృశ్యాలు చాలావరకు ఇక్కడివే కావడం విశేషం. గగనచుక్కీ జలపాతాలకు... దర్గా హజ్రాత్‌ మార్డాన్‌ గాయిబ్‌ నుండి మరొక మార్గం ఉంది. అక్కడ ఉంచిన హెచ్చరికలను పట్టించుకోకుండా, ప్రజలు రాళ్లపై నుండి కిందకి దిగి, వెనుక నుండి జలపాతాలను చూడటానికి ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల ఇక్కడ అప్పుడప్పుడు పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

విద్యుత్‌ ఉత్పాదన... 

సింషాపురా తర్వాత ఆసియాలో రెండవ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్ర ఈ జలపాతం వద్ద ఏర్పాటు చేయబడింది. 1902 ఏర్పాటు చేసిన ఈ జలవిద్యుత్‌ కేంద్రం ఇప్పటికీ నిరాటంకంగా పని చేస్తుంది. మైసూర్‌ దివాన్‌ శేషాద్రి ఐయ్యర్‌ ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రారంభంలో కోలార్‌ బంగారు గనులకోసం ఉపయోగించారు. దీనివల్ల కోలార్‌ బంగారు గనులు ఆసియాలో జల విద్యుత్తును పొందిన మొట్టమొదటి నగరంగా పేరు గాంచింది.

అరుదైన పక్షులకు ఆలవాలం... రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యం. 

శ్రీరంగపట్టణానికి అతిదగ్గరలో ఉన్న రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యంలో... పెయింటెడ్‌ స్టార్క్‌, ఓపెన్‌-బైల్డ్‌ స్టార్క్‌, బ్లాక్‌ హెడెడ్‌ లిబిస్‌, రివర్‌ టెర్న్‌, గ్రేట్‌ స్టోన్‌ ప్లోవర్‌, ఇండియన్‌ శాగ్‌ లాంటి ఎన్నో అరుదైన పక్షిజాతులు ఈ అరణ్యంలో మనకు దర్శనమిస్తాయి. ‘పక్షి కాశి’ అని పిలువబడే ఈ పక్షి అభయారణ్యం 67 చకిమీ వైశాల్యం కలిగి ఉన్నది. శ్రీరంగపట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉన్నది. కావేరి నదీ పరీవాహక ప్రదేశాన్ని సందర్శించిన పక్షి శాస్తవ్రేత్త డా సలీం అలీ తొలిసారిగా ఈ ప్రాంతంలో అరుదైన పక్షులు ఉన్నట్టు కొనుగొన్నాడు. ఈ విషయాన్ని వడయార్‌ రాజులకు తెలిపి వారిని ప్రేరేపించాడు. దాంతో వడయార్‌ రాజు 1940లో ఈ ప్రాంతాన్ని పక్షి అభయారణ్యంగా ప్రకటించారు.

శ్రీనివాసుడు కొలువైన ‘కరిఘట్ట’... 

శ్రీరంగపట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లకొండ (బ్లాక్‌ హిల్‌) పై వెలిసిన శ్రీనివాసుడు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. కరిఘట్ట అని పిలవబడే ఈ ప్రాంతంలో వేంకటేశ్వర స్వామి సంచరించాడని పురాణగాధ. నల్ల కొండ పై వెలిశాడు కాబట్టి ఇక్కడ శ్రీనివాసున్ని ‘కరిగిరివాసుడు’ (కరి అనగా ‘నలుపు’, గిరి అంటే... ‘కొండ’) అని పిలుస్తారు.



కక్కబె - Kakkabe






 కమనీయ ప్రకృతి దృశ్యం... కక్కబె

కాఫీ తోటలు...
ఏలకుల పరిమళాలు...
నారింజ పండ్ల తోటలు...
జలపాతాలు...
కొండలతో దోబూచులాడే మేఘాలు...
పర్వతారోహకులకు అనువైన కొండలు...
ఇలాంటి చూడ ముచ్చటైన ప్రృతి అందాలు ఆ ప్రాంతం సొంతం.
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని ‘కక్కబె’ అనే గ్రామంలో ఈ రమణీయ దృశ్యాలు కొలువుదీరి ఉన్నాయి.
అంతేకాదు... ఆసియా ఖండంలోనే అత్యధిక పరిమాణంలో తేనె ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా కూడా ఈ కక్కబెకు మరో రికార్డు ఉంది.


ఓ చిన్న గ్రామం ఇది...
ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా తేనె తుట్టెలే దర్శనమిస్తాయి. దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతం ఓ కుగ్రామమైనప్పటికీ... స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా ఇక్కడున్నాయి. కాఫీ తోటల్లో ఉన్న పురాతన బంగళాలు... ప్రస్తుతం స్టే హోంలుగా సేవలందిస్తున్నాయి.

కొడగు ప్రజల సంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉండే కాఫీ తోటల్లో విహరిస్తూ... రమణీయమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉంటే... కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదంటారు పర్యాటకులు. కాఫీ తోటలతో పాటు... ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న తడియాండల్‌ కొండలు పర్వతారోహకులకు స్వర్గధామాలు. ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో శిఖరం నుంచి చూస్తే అరేబియా సముద్రం ప్రత్యేక అందాలను సంతరించుకుందా అనిపిస్తుంది. కక్కబెకు సమీపంలో ఉన్న సల్నాడ్‌ రాజప్రాసాదం మరో ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని పాలించిన దొడ్డవీరరాజు ఈ రాజప్రాసాదాన్ని నిర్మిం చినట్టు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నాటి ఈ ప్యాలెస్‌ను చూసేందుకు పర్యాటకులు విశేషంగా వస్తారు.

ఇలా ఎలా వెళ్లాలి...
బెంగళూరు, మైసూరు నగరాల నుంచి మడికెరెకు బస్సు సదుపాయం ఉంది. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కక్కబె చేరుకోవచ్చు. ప్రైవేట్‌ బస్సులు, టాక్సీల సదుపాయం కూడా ఉంది. ఈ గ్రామంలో ఉన్న హోంస్టేలు, రిసార్టులు, హోటళ్లలో బస చేసేందుకు రోజుకు వెయ్యి నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తారు.



Tuesday, 7 June 2016

హంపి






ఆంధ్రభోజుని అందాల నగరం హంపి
అహో ఆంధ్రభోజా… శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!

ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.


అనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతిని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా… ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు…
మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం…
హంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తైన గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృంగేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్పగా వర్ణసముదా యంతో చిత్రించారు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అందిస్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామాలయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

అలాగే అక్కడి నుంచి విఠలేశ్వరాలయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అంటారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారంభించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.


అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆలయ బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రించారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చెక్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆలయం మీద రామాయణ గాథకు సంబంధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడంతో ఈ ఆలయాన్ని సహస్రరామాలయం… అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం…
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాలలో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభించాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండకు మార్చాడు.

విఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది…

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే… ఓర చూపుల దేవి ఊరేగిరాగా… రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా…’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

ఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋలతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనోజ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగుడిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికిరువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వందలాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురంలో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసపడతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటే మాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
– దామర్ల విజయలక్ష్మి, అనంతపురం



చిక్‌మగళూర్‌






 ప్రకృతి సోయగం, ఆధ్యాత్మిక సౌరభం చిక్‌మగళూర్‌ 

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటలు పెంచింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్‌ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం శృంగేరి ఈ జిల్లాలోనే ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు పాలించిన సుందర ప్రదేశం చిక్‌మగళూరు విశేషాలు....

చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వ్చంది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు కూడా ఉన్నది.

జిల్లా చరిత్ర...
1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబా బుడాన్‌ గిరి కొండల పై భారతదేశంలోనే మొట్ట మెదటిసారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్‌ మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారతదేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబైఉ దేశాల నుండి తీసుకొని వచ్చాడు. బాబా బుడాన్‌ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్‌ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్‌ (బాబా బుర్హాన్‌) కొండలని పిలుస్తారు. 


సుందర పర్వత కేంద్రాలు...
కెమ్మనగుండి:
బాబా బుడాన్‌ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్‌ రాజు కృష్ణరాజ వాడేయార్‌ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్‌. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించ వలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్‌-పాయింట్‌ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి.

కుద్రేముఖ్‌...
జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 కి.మీల నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాషలో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్థం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్‌ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్‌ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వతశ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్‌లో ఉన్న కుద్రేముఖ్‌ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్‌ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది.

ముల్లయనగిరి:
ముల్లయనగిరి బాబు బుడాన్‌ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలోనైన ఒకేలాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది.ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు.ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూడా ఉన్నది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వతశ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.

దత్త పీఠం (బాబా బుడాన్‌ గిరి):
చిక్‌మగళూరుకి ఉత్తరాన బాబా బుడాన్‌ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉన్నది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉన్నది. ఈ కొండలు హిమాలయాలకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇది ఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా మరియు సూఫీ అయిన బాబా బుడాన్‌ (దాదా హయాత్‌ కలందర్‌) వల్ల వచ్చింది.

జలపాతాల హొయలు...
మాణిక్యధార జలపాతం:
ఈ జలపాతం బాబా బుడాన్‌ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపాతం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగిస్తోంది. 


కళ్ళహతిగిరి జలపాతం:
కెమ్మనగుండి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్లహతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపాతం అనికూడా పిలుస్తారు. 122 మీటర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీరభద్ర దేవాలయం కూడా ఉన్నది.


హెబ్బె జలపాతం:
కెమ్మనగుండి పర్వత కేంద్రం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడు తుంది. దొడ్డ హెబ్బె (పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బె (చిన్న హెబ్బె) జలపాతం. ఇంకా ఇవేకాకుండా శాంతి, హనుమానైఉ గుండి, కదంబి జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

పుణ్యక్షేత్రాలకు నెలవు..
శృంగేరి:
చిక్‌మగళూరు కి 90 కిలోమీటర్ల పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదాదేవి దేవాలయం ఉన్నది, శారదదేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్‌ దేవాలయం హొయసల రాజుల కాలంలో ప్రారంభించబడివిజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్థంభం మీద పడడం విశేషం.

హొరనాడు:
చిక్‌మగళూరుకు 100 కిలోమీటర్లల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పునరుద్ధరణ ఇటీవలికాలంలోనే జరిగింది. ఆదిశక్తితో ప్రాణప్రతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వ్చన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది.

కలస:
చిక్‌మగళూరుకు నైఋతి దిశలో 92 కిలోమీటర్ల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉన్నది. భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి. దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాలయం కాళేశ్వర దేవాలయం ఉన్నది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండ అని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడని చెబుతారు. ఈ శిలపై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.

గురు దత్తాత్రేయ, బాబా బుడాన్‌ స్వామి దర్గాహ్‌:
బాబా బుడాన్‌ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ కొండపై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్‌ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్లు జాతరను, ఉర్సును నిర్వహిస్తారు.

అమృత్‌పుర:
చిక్‌మగళూరు పట్టణానికి 67 కిలోమీటర్ల ఉత్తరంలో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్‌ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది.

బేలవాడి:
చిక్‌మగళూరుకి ఆగ్నేయంలో 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే హళేబీడు ఉన్నది. ఇలా ప్రకృతి రమణీయతను, ఆద్యాత్మికతను తనలో కలుపుకొని ఉన్న ఏకైక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది చిక్‌మగళూర్‌.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...