Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

Sunday, 30 September 2018

తొండమనాడు - కూర్చున్న శ్రీనివాసుడు









తొండమనాడు
కూర్చున్న శ్రీనివాసుడు


ప్రభాతవేళ తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని మేల్కొల్పేందుకు ఆలపించే సుప్రభాతం ఎంత మధురంగా ఉంటుందో అభయ, కటి హస్తాలతో దర్శనమిచ్చే శ్రీవారి రూపం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. అయితే ఆ నిలువెత్తు రూపానికి భిన్నంగా శ్రీదేవీ భూదేవిసమేతంగా సుఖాసీనుడై యోగముద్రలో ఉన్నట్టుండే శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే తిరుపతికి సమీపంలోని తొండమనాడు వెళ్లాల్సిందే.

‘‘దొమ్ములు చేసిన యట్టి తొండమాన్‌ చెక్కురవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు’’ అంటూ తొండమాన్‌ చక్రవర్తి గురించి వివరించాడు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. శ్రీనివాసుడి సేవలో తరించిన రాజుగా తొండమానుడికి ఎంతో పేరుంది. శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడు ఈ తొండమాన్‌ చక్రవర్తి. ఆయన తన చివరి దశలో తిరుమలకు వెళ్లి స్వామిని సేవించే పరిస్థితిలేక... తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకున్నాడు. చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీవారు తొండమాన్‌ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించాడు. సుఖాసీనుడై చక్రవర్తి సేవలందుకున్నాడు. స్వామి విగ్రహం ఒక చేతితో యోగముద్ర, మరో చేత్తో అభయహస్తం కలిగి ఉండటంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తుంది.

తొండమానుడి నిర్మాణం
శ్రీవారికి గొప్ప భక్తుడైన తొండమానుడు అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడ సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు తొండమానుడితో ‘కలియుగం అంతమయ్యే వరకూ నేను శేషాచల కొండల్లోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంటాను. అక్కడ నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించి దాని మధ్యలో బంగారు విమానాన్ని ఏర్పాటు చేయి’ అని ఆదేశిస్తాడు. దీనికి అంగీకరించిన తొండమానుడు విశ్వకర్మ సహాయంతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడు. రత్న ఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి, దాని చుట్టూ మూడు ప్రాకారాలతో, మూడు ప్రదక్షిణ మార్గాలనూ, మూడు మండపాలనూ, వంటశాలలనూ, బంగారుబావినీ నిర్మిస్తాడు. ఆనంద నిలయ విమానంపైన వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనే విమాన వేంకటేశ్వరుడు. ఆయనను దర్శించిన వెంటనే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి గోపురం ఆనంద నిలయమని ప్రసిద్ధి. రోజూ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చాకే రాజ్యపాలన వ్యవహారాలు చూసుకోవడం తొండమానుడికి అలవాటు. ఒక సొరంగ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లివచ్చేవాడట. అయితే, కొంతకాలానికి వృద్ధాప్యం కారణంగా తొండమానుడు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లలేకపోయేవాడు. దీంతో స్వామినే తన కోటలో వెలిసి, తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని వేడుకుంటాడు. దీంతో శ్రీవారు అభయహస్తంతో ఆసీన భంగిమలో శ్రీదేవీ, భూదేవిలతో కలిసి తొండమనాడులో స్వయంభూగా వెలిశాడు.

తామరగుంట పుష్కరిణి
తిరుమలలోని ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే జలాన్ని కాలువల ద్వారా తొండమనాడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. రేణిగుంట రాళ్లకాలువ మీదుగా ఈ నీల్లు తొండమనాడు చెరువులోకి వస్తాయి. దీన్ని తామరగుంట చెరువుగా పిలుస్తారు. అంతరాలయ ద్వారంమీద తొండమానుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయ విమాన శిఖరం తిరుమలలో ఆనంద నిలయంమీద ఉన్నట్లే ఇక్కడా ఉండటం విశేషం. ఈ ఆలయం గత రాజుల వైభవానికి చిహ్నంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. గద్వాల్‌ మహారాణి ఈ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చినట్లు ఆలయచరిత్ర పేర్కొంటోంది. ఆ రోజుల్లో స్వామికి నిత్య పూజలు, సేవలు, నివేదనలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారని ప్రతీతి. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతి శ్రావణమాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. యోగ ముద్రలో వెలసిన స్వామిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.

ఇలా చేరుకోవచ్చు
తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్లు, శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందీ తొండమనాడు గ్రామం. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, శ్రీకాళహస్తిల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి మీదుగా పాపానాయుడుపేట వెళ్లే బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

- ఆడెపు రాజ్‌కుమార్‌

Tuesday, 18 September 2018

మహావిద్యాగణపతి








మహావిద్యాగణపతి



సత్యప్రమాణాల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీనందనుడిని పూజిస్తారు. చోళరాజుల కాలంనాటి నల్లరాతి విగ్రహంతోపాటు ఆలయ మండపంలో ముఫ్ఫైరెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఇంటా గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటుచేశారిక్కడ.

విగ్రహం వెనక...
ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండేళ్ల కిందట... చల్లపల్లిలోని కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా మూడు అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

ఎన్నెన్ని రూపాలో...
లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలనూ, కింది వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణం. కానీ మహావిద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకూ ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్ఫైరెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు
ఇక్కడ కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుంచే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితోపాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహర చతుర్ధినాడు ప్రత్యేక హోమాలు, కార్తికమాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్రబహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి...
విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉందీ మహావిద్యాగణపతి ఆలయం. బస్‌స్టాండ్‌ నుంచి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

- ముత్తా నారాయణరావు

Sunday, 5 August 2018

గండికోట








గండికోట రహస్యమిదే!


పెన్నానది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రావతి చిన్నగా ఉరకలేస్తుంటుంది. ఎప్పుడో గాని ఈ నదులు ఉధృతంగా ప్రవహించవు. అందుకే కాబోలు శతాబ్దాలు గడుస్తున్నా గండికోట చెక్కుచెదరక నిల్చుంది. కోటలోని రహస్యాలు పదిలంగా ఉన్నాయి. రెండో హంపీగా పేరున్న గండికోటలో పాగా వేసేందుకు ఎందరో రాజులు ఎన్నెన్నో యుద్ధాలు చేశారు. పెన్నాలో నెత్తురు పారించారు. ఇప్పుడదే కోటకు కులాసాగా చేరిపోవచ్చు. దిలాసాగా విహరించవచ్చు. పెన్నా లోయ సోయగాలు మనసారా ఆస్వాదించవచ్చు.

అందమైన లోయలు, శత్రుదుర్భేద్యమైన కోట, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసినా అబ్బురపరిచే దృశ్యాలు.. గండికోట రహస్యమిదే! కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున ఉంటుందీ కోట. పూర్వం ఈ ప్రాంతాన్ని గిరిదుర్గం అనేవారు. పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య భారీ గండి ఏర్పడింది. ఆ సమీపంలో కోటను నిర్మించడంతో దీనికి గండికోట అని పేరొచ్చింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న లోయ గుండా పెన్నా నది వయ్యారాలు ఒలకబోస్తూ ప్రవహిస్తుంటుంది.



ఎందరో రాజులు..

11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజు త్రైలోక్యమల్లకు సామంతుడుగా ఉన్న కాకరాజు ఈ కోటను నిర్మించారు. విజయనగర రాజుల ఏలుబడి తర్వాత గండికోటపై పెమ్మసాని పాలకుల ఆధిపత్యం కొనసాగింది. పదహారో శతాబ్దంలో గోల్కొండ నవాబు అబ్దుల్‌ కులీకుతుబ్‌ షా ప్రధాని, సైన్యాధికారి మీర్‌జుమ్లా గండికోటను ముట్టడించాడు. తర్వాత హైదర్‌ అలీ, టిప్పుసూల్తాన్‌ స్వాధీనపరుచుకున్నారు. టిప్పు సుల్తాన్‌ మరణం తర్వాత స్వాతంత్య్రం వచ్చే వరకు ఇక్కడ ఆంగ్లేయుల పెత్తనం కొనసాగింది. 1980లో కేంద్ర పురాతత్వ శాఖ గండికోటను తమ అధీనంలోకి తీసుకుంది.

పునాదుల్లేని కోట..

గండికోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. పునాదులు లేకుండానే కొండలపై కోట గోడలను నిర్మించడం విశేషం.  నిర్మాణంలో ఎర్రటి నున్నటి రాళ్లను వినియోగించారు. 1,200 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు ఉన్న కోట చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. కోటలో 21 దేవాలయాలు ఉన్నాయి. 55 స్తంభాలతో, అరుదైన శిల్పకళతో మాధవరాయస్వామి ఆలయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడి రంగనాయక ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత గాథలు దర్శనమిస్తాయి. ఆలయ మూలవిరాట్టు రంగనాయకస్వామి విగ్రహం ప్రస్తుతం మైలవరం పురావస్తు మ్యూజియంలో ఉంది. కోటలో జుమ్మా మసీదు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవేగాక కారాగారం, ఎర్రకోనేరు, ధాన్యాగారం, రామబాణపు బురుజు, రాయలచెరువు, రంగమహల్‌, ఆయుధ కర్మాగారం, వ్యాయామశాల ఇలా సందర్శనీయ స్థలాలెన్నో ఉన్నాయి.
ఇలా వెళ్లొచ్చు..

* కడప నుంచి గండికోట 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం ఇతర ప్రధాన నగరాల నుంచి కడపకు బస్సులు, రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

* గండికోటకు సమీపంలో (32 కి.మీ) ఉన్న రైల్వేస్టేషన్‌ ముద్దనూరు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి, రాయలసీమ, తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లు ముద్దనూరు మీదుగా వెళ్తాయి. ఇక్కడి నుంచి గండికోటకు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. విజయవాడ నుంచి నేరుగా జమ్మలమడుగు వెళ్లే రైలు ఉంది. అక్కడి నుంచి సులభంగా గండికోటకు చేరుకోవచ్చు.


యస్‌. మహమ్మద్‌ ఆరీఫ్‌

Saturday, 28 July 2018

కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం









కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం



సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్‌... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే..
కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్‌ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు.



Wednesday, 27 June 2018

అరకు






అందాల అరకు

ప్రకృతి రమణీయత చూడాలంటే అరకులోయ వెళ్లాల్సిందే. ఇక్కడికి రాష్ట్రంలోని వారే కాకుండా, దేశ విదేశాలనుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. అరకులోయ సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అణువణువునా ప్రకృతి రమణీయత, అద్భుత పర్వత పంక్తులు ఇక్కడ దర్శనమిస్తాయి.

విశాఖపట్నానికి ఇది 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుకు చాలా దగ్గర్లో ఉంటుంది. నయగారాలను ఒలికించే జలపతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మైమరపిస్తుంది. ఇక్కడ ప్రకృతి సోయగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే గానీ వర్ణించనలవి కాదు. దాదాపు 36 కిలోమీటర్ల పరిథిలో విస్తరించి ఉన్న ఈ అందాల అరకు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం.

అరకులోయకు ఘాట్‌రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు రోడ్డుకి రెండు వైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్‌కి ఇది అనువైన ప్రాంతం. భలే సరదాగా ఉంటుంది. అరకు వెళ్లే మార్గంలో మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జ్‌లు స్వాగతం చెబుతాయి. ఇక మధ్యమధ్యలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకులోయను సందర్శించే వారు తప్పక వెళ్లాల్సిన చోటు బొర్రా గుహలు. ఇవి అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

తిరుమల మెట్ల ప్రయాణం






ఆహ్లాదం తిరుమల మెట్ల ప్రయాణం

తిరుమల. తెలుగువారి జీవితంలో ఓ భాగం. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి సందర్శించని తెలుగు వారు ఉండరు. ఎన్నిసార్లు చూసినా కొత్తగా, సరికొత్తగా ఉండే పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ కనిపించే తిరుమలకు మెట్ల దారిలో వెళితే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదకరం కూడా.

ఉరుకులు పరుగుల నేటి నవనాగరిక, యాంత్రిక జీవితంలో మనిషికి కాసింత ఊరటనిచ్చే వాటిలో కుటుంబ సమేతంగా జరిపే విహార, తీర్థయాత్రలు ప్రధానమైనవి. 28 సంవత్సరాల నా పాత్రికేయ జీవితంలో కుటుంబ సమేతంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరడం మధురానుభవం.


ఓ శనివారం డ్యూటీ చేసి, కాచిగూడ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడంతో తిరుమల తిరుపతికి మా కుటుంబ ప్రయాణం సాగింది. ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాల్సిన మా రైలు.. మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.

చలో... శ్రీవారిమెట్లు
తిరుపతి బస్టాండ్‌లో అలిపిరి బస్సెక్కి శ్రీవారిమెట్ల స్టాప్‌లో దిగి ఉచిత లగేజీ కౌంటర్లో సామాన్లు భద్రపరిచాం. అనంతరం శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమలకు మా కుటుంబ అధిరోహణ యాత్ర ప్రారంభమయ్యింది.


పచ్చటి ప్రకృతి ఒడిలో ఠీవిగా నిలబడి, రారండంటూ ఆహ్వానంతో పాటు, సవాలు విసురుతున్నట్లుగా కనిపించే శేషాద్రి కొండల్లో... ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన 2,350 మెట్లు ఎక్కుతూ, తిరుమల చేరడంలో ఉన్న శ్రమ, ఆనందం కలగలిసిన అనుభూతిని ఎవరికి వారు వ్యక్తిగతంగా పొందాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం.

పొలోమంటూ పిల్లలు, పెద్దలు
నాలుగేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ, ఆడమగ తేడా లేకుండా మెట్లదారిలో హరితవనాల సౌందర్యం, పిల్లగాలి వీచికల ద్వారా హాయిగా తాకిన శేషాద్రి వనాల పరిమళాలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ తిరుమల దిశగా కదిలిపోవడం ఈ ఈ దారిలో నిత్యకృత్యం. సుదూర యాత్రలు చేసే బహుదూరపు బాటసారులను గుర్తు చేసుకొంటూ... ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఆపసోపాలు పడేవారు కొందరైతే, ఇదేం కష్టమైన పని కాదంటూ చెంగు చెంగున లేడిపిల్లల్లా, కోడెదూడల్లా దూసుకుపోయే వారు మరికొందరు. 'మీకు హైబీపీ ఉంటే మెట్ల దారి నడక ప్రాణంతకం' అన్న ముందస్తు హెచ్చరికను పక్కన పెట్టి, బిక్కు బిక్కుమంటూ నడిచే భక్తులు కొందరైతే, తమ శరీరాన్ని మోయటమే కష్టంగా భావించే స్థూలకాయులు సైతం మెట్ల దారిలో పాట్లు పడటం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.

900 మెట్లు చేరితే...
మెట్లదారిలో 900వ మెట్టు చేరగానే మేమున్నామంటూ భక్తుల నమోదు ప్రత్యేక కౌంటర్‌ ఉద్యోగులు పలుకరిస్తారు. తొమ్మిది వందల మెట్లు ఎక్కిన ప్రతి ఒక్క యాత్రికుడి/రాలి ఫోటోతీసి శ్రీవారి ఉచిత దర్శన అనుమతి పత్రాన్ని ఇస్తారు.

అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ హాయిగా సాగిన మెట్లదర్శన భక్తులకు అసలు పరీక్ష 1600 మెట్లు చేరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే మెట్లను మోకాలి మెట్లుగా చెబుతారు. నిట్టనిలువుగా నిర్మించిన మెట్లను ఎక్కడం అంత తేలిక కాదు. నాలుగు మెట్లు ఎక్కడం, కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత మరోనాలుగు మెట్లు... ఇలా భారంగా, ఓ పరీక్షలా సాగుతుంది. ప్రయాణం 2100 మెట్లు దాటిన తర్వాత మరో చెక్‌ పాయింట్‌లో యాత్రికుల ఫొటో పత్రాలను మరోసారి పరీక్షించి, టీటీడీ స్టాంపువేసి మరీ ఇస్తారు. ఇక్కడి నుంచి మిగిలిన 250 మెట్ల ప్రయాణం 'అదిగో.. అల్లదిగో శ్రీహరివాసమూ' అన్నట్లుగా... గోవింద, గోవిందా అంటూ సాగిపోతుంది. శ్రీవారి మెట్లలో ఆఖరి మెట్టుపైన ఉన్న మండపం చేరడంతో ప్రతి ఒక్కరికీ ఏదో సాధించామన్న సంతృప్తి, శ్రీవారి పాదాల చెంతకు చేరామన్న భరోసా కలుగుతాయి.

మెట్ల మార్గం ద్వారా తమ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను బేరీజు వేసుకొనే యాత్రికులు చాలామందే కనిపిస్తారు. ఏడాదికి ఓ సారైనా మెట్లదారిలో తిరుమల చేరందే తమకు తృప్తి ఉండదని, గత కొద్ది సంవత్సరాలుగా ఇలా చేయడం జీవితంలో ఓ భాగం చేసుకొన్నామని చెప్పేవారూ కనిపిస్తారు.

ఎన్నో లాభాలు
తిరుపతి నుంచి బస్సులో వచ్చే యాత్రికులకంటే మెట్లదారిలో కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మెట్ల దారిలో వెళ్లిన భక్తులు 24 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేక క్యూ ద్వారా ఉచితంగా దర్శనం లభిస్తుంది. అంతేకాదు. కాలినడక భక్తులకు 25 రూపాయల ఖరీదు చేసే ఉచిత లడ్డూను సైతం అంద చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద భక్తులకు మెట్లదారి ప్రయాణం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల చేరాలన్నా, తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా ఒక్కొ యాత్రికుడు 90 రూపాయలు బస్సు చార్జీగా చెల్లించాలి. విపరీతంగా పెరిగిన చార్జీల భారం మోయలేని పేదయాత్రికుల్లో కాలినడకనే మెట్లదారిలో తిరుమల వచ్చి వెళ్లే వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని టీటీడీ గణాంకాలే చెబుతున్నాయి. దీనికితోడు మెట్లదారి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మంచీ - చెడూ
ప్రతి చోటా మంచీ, చెడూ ఉండటం సహజమే. దానికి 'తిరుమల తిరుపతి' ఏ మాత్రం మినహాయింపు కాదు. తిరుమల దేవస్థానం అన్నా, శ్రీవారన్నా భక్తి విశ్వాసాలున్న చాలా మందికి అంతులేని భక్తి. అయితే దేవస్థానం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రం దక్షిణల పైన కూడా భక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి వారి కల్యాణం క్యూ దగ్గర నానా హడావిడి చేస్తూ 'దగ్గర నుంచి కల్యాణం చూడండి'  అంటూ భక్తులను ప్రలోభపెట్టి, స్వామివారి సాక్షిగా దక్షిణ పేరుతో లంచాలు డిమాండ్‌ చేసే ప్రబుద్ధ ఉద్యోగులకూ కొదవలేదు.

అయినా కూడా దేశం నలుమూలల నుంచి అనునిత్యం తిరుమలకు వచ్చే వేల, లక్షల భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అసమానం. తిరుమలలో 24 గంటలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, నిత్యాన్నదాన పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

రెండున్నర గంటల మెట్ల నడక, ఎనిమిదిగంటల పాటు క్యూలో నిరీక్షణ, 80 సెకన్ల శ్రీవారి దర్శనంతో మా తిరుమల యాత్ర ముగిసింది.

చొప్పరపు కృష్ణారావు

Friday, 15 June 2018

కోరింగ అభయారణ్యం






కోరింగ.. పిలవంగ

చుట్టూ దట్టమైన చెట్లు.. మధ్యలో చిత్తడి నేలపై నిర్మించిన చెక్కల వంతెన.. ఓ పక్క సముద్రంలో కలుస్తున్న గోదావరి సోయగాలు.. చెట్టు కింద ఆహారం కోసం తచ్చాడుతున్న నీటి పిల్లి.. చెట్టుపైన పొందికగా కట్టుకున్న గూడులో నుంచి తొంగి చూసే ఎలుక... ఇవన్నీ చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ అభయారణ్యానికి వెళ్లాలి.

ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.

పక్షుల విడిది
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్‌, స్టార్క్‌ కొంగలు, కింగ్‌ఫిషర్‌ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి. గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు. చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.

చిక్కటి అడవిలో చెక్క వంతెన
కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు. 200 ఏళ్ల కిందటి పాతలైట్‌ హౌస్‌ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్‌లో వెళ్తారు. హోప్‌ ఐలాండ్‌ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.

వినోదంతో పాటు..
కోరింగ వచ్చే పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. అభయారణ్యం ప్రత్యేకతలను తెలిపేందుకు ఆడియో విజువల్‌ థియేటర్‌ను నిర్మించారు. 25 మంది ఒకేసారి ఇందులో కూర్చొని ఈ వీడియోలు, పర్యావరణ ప్రాధాన్యం వివరించే చిత్రాలు, పర్యాటక విశేషాలు తెలిపే డాక్యుమెంటరీ వీక్షించవచ్చు.




ఎలావెళ్లాలి?

కాకినాడ నుంచి చొల్లంగి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ, సామర్లకోట నుంచి చొల్లంగికి బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.

Friday, 1 June 2018

హార్సిలీ హిల్స్‌






హార్సిలీలో హాయ్‌.. హాయ్‌..

వేసవిలో ప్రయాణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? ఆ జాబితాలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌ పేరు రాసేయండి. ఏసీ గదిలో దొరికే చల్లదనం ఇక్కడ లభిస్తుంది. వేసవి విడిదిగా పేరొందిన ఆ చల్లని కొండ విశేషాలు తెలుసుకుందాం..

అది 1865-67 ప్రాంతం.. డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్‌ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారినికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం.. చల్లదనం.. ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై ఒక బంగ్లాను నిర్మించారు. ఆ ప్రాంతాన్ని వేసవి విడిదిగా తీర్చిదిద్దారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్‌ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.

సంపెంగ పరిమళాలు
తూర్పు కనుమల్లోని దక్షిణ భాగపు కొండల్లో విస్తరించి ఉన్న హార్సిలీ హిల్స్‌ సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంటుంది. అటవీ మార్గంలో ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది. సంపెంగ పూల పరిమళాలతో వీచే కొండగాలికి కోటి రూకలిచ్చినా తక్కువే! హేమంతంలో చలిపంజా విసిరే హార్సిలీ హిల్స్‌.. గ్రీష్మతాపానికి విరుగుడు మంత్రం వేస్తుంది. మండు వేసవిలోనూ ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల లోపే నమోదవుతుంటుంది. అందుకే వేసవి విడిదిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది.


ఏనుగు మల్లమ్మ కొండ


హార్సిలీ హిల్స్‌కు పూర్వనామం ఏనుగు మల్లమ్మకొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట. ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట. అలా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం.

కావాల్సినంత వినోదం..
హార్సిలీ కొండపై పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలనూ, పెద్దలనూ అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉన్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్‌ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకూ దుప్పటి కప్పుకొని నిద్దురోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు.


ఎలా వెళ్లాలి?


హార్సిలీ హిల్స్‌ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన, ప్రైవేట్‌ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి.


తెల్లగడ్ల జాకీర్‌ హుస్సేన్‌

Saturday, 14 April 2018

సింహాద్రి అప్పన్న






అపురూపం... అప్పన్న నిజరూప దర్శనం

వరాహ - నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడు ద్వయరూపాల్లో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవానికి విశాఖపట్నం జిల్లాలోని సింహగిరి ముస్తాబవుతోంది.

ఇదీ ఇతిహాసం:
ప్రహ్లాదుడిని రక్షించేందుకు అవతరించిన నృసింహస్వామి విగ్రహ రూపంలో సింహగిరిపై వెలిశాడు. ఆ విగ్రహానికి ఆరాధన లేకపోవడంతో దాని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. షట్‌ చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆకాశమార్గంలో విహరిస్తూ సింహగిరిపై రాత్రి విశ్రమించగా, అదే కొండపై తాను వున్నట్టు స్వామి అతని స్వప్నంలో కనిపించి చెబుతాడు. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో వున్న స్వామిని అక్షయ తృతీయనాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ఆరాధిస్తాడు.తాను చాలా ఏళ్లు వల్మీకం (పుట్ట)లో వున్నందున అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని పురూరవుడిని స్వామి ఆదేశిస్తాడు. దీంతో పుట్ట మన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు.

చందన యాత్ర అంటే:
ఏటా అక్షయతృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. సుమారు 12 మణుగుల (500 కిలోల) శ్రీచందనపు పూతతో స్వామిని నిత్య రూపంలోకి తీసుకువస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి నాలుగు విడతలుగా సమర్పిస్తారు. వైశాఖ శుక్ల పక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందన ఒలుపు ప్రారంభిస్తారు. బంగారు, వెండి బొరిగెలతో చందనం తొలగిస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష పూజలు నిర్వహించి శిరస్సుపైన, ఛాతీపైన చందనాన్ని ముద్దలుగా పెడతారు. మొదట నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు. నిజరూపంలోని స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుపుతారు. అదే రోజు రాత్రి భక్తుల దర్శనాల అనంతరం తొలివిడతగా మూడు మణుగుల (సుమారు 125 కిలోల) శ్రీచందనాన్ని పూతగా వేస్తారు. మిగిలిన తొమ్మిది మణుగుల చందనాన్ని వైశాఖ పూర్ణిమ, జేష్ట పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమలలో మూడేసి మణుగుల చొప్పున సమర్పిస్తారు. నాలుగు విడతల చందన సమర్పణతో స్వామి నిత్య రూపంలోకి వస్తారు.

ఎలా వెళ్ళాలి?:
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 13 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో, విశాఖ విమానాశ్రయం నుంచి సుమారు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది. సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం రైల్వే స్టేషన్‌ ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సింహాచలానికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
వాసు, విశాఖపట్నం




Apr 15, 2018

సింహాచలం
అపురూపం అప్పన్న నిజరూపం

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి దేవుడి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి ఆ రూపాన్ని మదిలో నిలుపుకుని వెనుదిరుగుతారు భక్తులు. ప్రత్యేక సందర్భాల్లో ఆ మూర్తి అలంకరణలో భిన్నత్వం మినహా మిగతా సమయాల్లో దేవతా విగ్రహరూపం ఒకేలా ఉంటుంది. కానీ సింహాచలం కొండల్లో వెలసిన వరాహ నరసింహ మూర్తిని దర్శించుకోవాలంటే ఏడాది మొత్తంలో ఒకే ఒక్క రోజు వీలవుతుంది. మిగతా రోజుల్లో చందనలేపనంలో మునిగిపోయే అప్పన్న ఈ ఏడాది ఏప్రిల్‌ 18న నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు.

ఎటుచూసినా శ్రీచందన పరిమళాలూ సంపెంగల సౌరభాల్లాంటి ఎన్నో ప్రకృతి రమణీయతలతో విరాజిల్లే క్షేత్రం సింహాచలం. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో, మానవ శరీరంతో,  సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే.

చందనోత్సవం...
విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయ తృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది.

యాత్ర ఇలా...
నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచీ ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలుపెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది. రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలూ సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారుచేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.

నాలుగు విడతలుగా
వరాహలక్ష్మీనరసింహ స్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళల నుంచి కొనుగోలు చేస్తారు. మొదట అక్షయ తృతీయనాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు అయిదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట.

చందన ప్రసాదం
చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.

ఇలా చేరుకోవచ్చు
విశాఖపట్నంలో కొలువైన సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి ప్రతి పది నిమిషాలకూ ఓ బస్సు ఉంటుంది.

- ఎం.సత్యనారాయణ, న్యూస్‌టుడే, సింహాచలం





రామతీర్థం రామస్వామి దేవస్థానం






అక్కడ రెండుసార్లు పెళ్ళి!


భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా శ్రీరాముడికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కల్యాణం నిర్వహిస్తారు. అది కూడా శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. ఈ దేవస్థానం ఏర్పాటైన 16వ శతాబ్దం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

ఇక్కడ శ్రీరామ నవమి రోజునే కాదు, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనినే తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు. శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం పగటి పూట, తిరుకల్యాణ మహోత్సవం రాత్రి పూట జరుగుతాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ‘దేవుని పెళి’్ల జరిగాకే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం! రామతీర్థం సీతారాముల తొలి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది జనవరి 27న జరిగింది. రెండో కల్యాణోత్సవం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జరుగనుంది.

తిరుకల్యాణం కథ ఇదీ!
16వ శతాబ్ద కాలంలో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చిందట. ఆమెకు శ్రీరాముడు ప్రత్యక్షమై, ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది. అలాగే శ్రీరాముడు కుంబిళాపురం రాజుకు కూడా కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని కోరాడట. చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయనీ, తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట. అలాగే మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా ఆ భీష్మ ఏకాదశి నాడు సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీ!

ఏకుల వంశీయులే ఆడపెళ్లి వారు
రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు శ్రీరామచంద్రుడు తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదావారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లికి బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుగు శతాబ్దాల కాలం నుంచి ఏకుల వంశీయులే ఆడ పెళ్లివారు! వీరు రాముడి విగ్రహాలను కనుగొన్న మూగ వృద్ధురాలి వంశీయులని చెబుతారు. కేవలం పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు తెలిపారు. వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.

ఐదు రోజుల పెళ్ళి... ఆరుదైన పెళ్ళి!
రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్ర్తాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపె ధ్వజారోహణం చేస్తారు. కల్యాణోత్సవం జరిగిన నుంచి ఐదు రోజుల పాటు అర్చకులు ప్రత్యేక హోమాలు, గ్రామ బహిష్కరణ, సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజున సదస్యం అనే పేరుతో పండితులకు సత్కారం, పండిత పరిషత్‌ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగో రోజు రాత్రి పూలతోనూ, విద్యుత్‌ వెలుగులతోనూ అలంకరించిన ప్రత్యేక రథంపై నవ వధూవరులు సీతారామచంద్రులను, లక్ష్మణ స్వామిని రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాన్ని పక్క గ్రామమైన సీతారామునిపేట గ్రామస్థులు మాత్రమే లాగుతారు. ఐదో రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి, ఆ రోజు రాత్రి గరుడ పటాన్ని అవరోహణం చేస్తారు. పూర్ణాహుతి అనంతరం కల్యాణోత్సవాలకు ముగింపు ప్రకటిస్తారు.
పతివాడ రమణ, నెల్లిమర్ల, విజయనగరం

ఒంటిమిట్ట కోదండరామాలయం






కల్యాణ వైభోగమే.. వెన్నెల్లో కల్యాణం
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు...

అంటాడు పోతన.


రామయ్య పెండ్లిని వీక్షించు జన్మ జన్మ అంటారు భక్తులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి ఈ చివర రాయల సీమ వరకూ జరిగే సీతారామ కల్యాణాల్లో విశేషాలెన్నెన్నో!

రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిత్‌ లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో, ఆంధ్రా భద్రాద్రిగా వాసికెక్కిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చంద్రుని వెలుగుల్లో రాత్రి వేళ కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ వుంది. క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని స్వామి వరమిచ్చాడు. దాని ప్రకారమే చైత్ర శుద్ధ చతుర్దశి నాటి రాత్రి ఇక్కడ స్వామివారికి కల్యాణం జరుపుతారు.

పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ రామాలయం కడప-చెన్నై ప్రధాన రహదారిలో కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఒంటిమిట్టలో ఉంది. ఒక రాతి గుట్టపై మూడు గోపురాలతో 32 అద్భుత శిల్పమయ స్తంభాలతో రంగ మండపం, కల్యాణ మండపం ఉన్నాయి. సీతారామలక్ష్మణులు ఒకే శిలపై వెలసి ఉన్నందున ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా వినుతికెక్కింది. దేశంలో హనుమ లేని రామాలయాలు చాలా అరుదు. హనుమంతుడు లేకుండా నిర్మించిన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్టను ప్రభుత్వం టీటీడీ ఆధీనంలోని ఆలయాల్లో విలీనం చేసింది. ఈ నెల 24 నుంచి ఒంటిమిట్టలో 11 రోజుల పాటు తిరుమల తరహాలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 30న ఉత్సవంలో ప్రధానమైన సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది.

రామాలయ ఆవిర్భావం
మట్లి పాలకుల్లో ఒకరైన సదాశివరాయుల కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని 1350లో ఉదయగిరిని పాలించిన కంపరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. 1356లో ఉదయగిరి సింహాసనాన్ని అధిష్ఠించిన కంప సోదరుడైన బుక్కరాయలు ఒంటిమిట్ట కోదండరామాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. మట్లిరాజుల్లో ఒకడైన అనంతరాజు రామాలయ గుడిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ గోపుర నిర్మాణాలు మొదలు పెట్టగా అనంతరాజు కుమారుడైన తిరువెంగళనాఽథ రాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశాడు.

ఇతిహాసాలెన్నో...
రామడు అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ తపస్సు చేసుకొనే మునుల కోరికపై రామలక్ష్మణులు రాక్షస సంహారం చేసినట్లు చెబుతారు. అనంతరం మునుల యజ్ఞయాగాదులకు ఇబ్బందులు కలగకుండా ఒకే శిలలో నిర్మితమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేసినందున, దీనికి ‘ఏకశిలా నగరం’గా పేరువచ్చింది. శ్రీరాముడు అంబులపొది, పిడిబాకు, కోదండం చేతపట్టి రావడంతో ‘కోదండరాముడు’ అనే నామం వచ్చింది. కాగా, దండకారణ్యంలో పర్యటించిన సీతారామలక్ష్మణులు అలసి ఒక చెట్టునీడన చేరారట! ఆ సమయంలో సీతాదేవికి దాహంగా ఉండటంతో రాముడు బాణాన్ని భూమిలోకి సంధించగా గంగ పెల్లుబికింది. దీంతో వారు దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా భూమిలోకి బాణం సంధించగా గంగ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇవి శ్రీరామలక్ష్మణ తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.

జాంబవంత ప్రతిష్ఠ
త్రేతాయుగంలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చిన జాంబవంతుడు ఒక నాటి రాత్రి విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమిచ్చారట. జాంబవంతుడు ఉదయమే లేచి పరిసరాలను వెతకగా గుబురు పొదల్లో ఈ మూర్తులు కనిపించాయి. జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందువల్లే ‘జాంబవంత ప్రతిష్ఠ’ అని పేరు వచ్చింది.

ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చిందంటే..
ఒంటెడు-మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో వేట సాగించేవారు. కంపరాయలు, ఆయన పరివారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీర్చారట. ఈ అన్నదమ్ముల కోరికపై జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా దేవతామూర్తులకు కంపరాయలు గర్భాలయం నిర్మించారు. తరువాత వీరి పేరు మీద ఒంటిమిట్ట గ్రామాన్ని, చెరువును కట్టించారు.

ఇమాంబేగ్‌ పిలుపు.. రామయ్య పలుకు
క్రీ.శ.1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్‌ నభీఖాన్‌ ప్రతినిధి ఇమాంబేగ్‌ ఒంటిమిట్ట కోదండరాముని మహిమను పరీక్షించేందుకు వచ్చాడట. గుడి లోపలికి వెళ్లి ‘‘ఓ రామ..! ఒంటిమిట్ట రఘురామ..!’’ అని మూడు మార్లు పిలువగా గుడిలోంచి ‘‘ఓ.ఓ.ఓ...’’ అనే సమాధానం వినబడిందట. ఇమాంబేగ్‌ ఆనందంతో మోకరిల్లి రాముని భక్తునిగా మారాడు. రాముని కైంకర్యం కోసం బావిని తవ్వించాడు. ఆ బావి నేటికి ఉంది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె దర్గాకు వెళ్ళే ముస్లింలు కోదండరామున్ని దర్శించుకొంటారు.

Sunday, 18 March 2018

కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి





అక్కడ ముస్లింలకూ పండగే!

ఉగాది... అంటే హిందువుల పండగ అని అందరికీ తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... కడప జిల్లాలో ఎంతోమంది ముస్లింలకూ ఈ పండగ ప్రత్యేకమైందే. ఆ రోజున వందల మంది ముస్లింలు స్థానికంగా కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

తిరుమల తొలి గడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు - గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే, ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాదినాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతోపాటే వాళ్లూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఆ ఆలయంలో కొనసాగుతోంది. ఆ రోజున కడప రాయడిని దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం.

రమణీయ శిల్పవైభవం
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్‌ థామస్‌ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీన్లోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ.

కన్నుల పండుగలాయ కడప రాయని తేరు
మిన్నునేల శృంగారము మితిమీరినట్లు
కాంతతో శ్రీవేంకటేశ కడప తేరెక్కి
యింత నన్ను గూడి వీధులేగితివి నీవు

అంటూ కప్పురపు నవ్వుల కడప రాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వేంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు అతీతంగా వేలమంది భక్తులు తేరును లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించి పరవశిస్తారు.





Thursday, 15 March 2018

కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం





కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం

అనంతపురం / తాడిమర్రి: కాటికోటేశ్వరాలయం ప్రాంగణంలో కాకులు కనిపించవు. అసాంఘిక కార్యక్రమాలు జరగవు. అలా ఎవరైనా జరపడానికి ప్రయత్నించినా ఆలయ ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు వారిని చుట్టుముట్టి ఆలయాన్ని దాటి వెళ్లేంతవరకు వదిలిపెట్టవని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నారు. సోదరులు తాగేందుకు నీరు అడగటంతో వారి దప్పిక తీర్చేందుకు భీముడు భూమిని గదతో మోదగా ఇక్కడ గదేగుండం ఏర్పడి నీరు వస్తోందని స్థలపురాణం చెబుతోంది. ఆలయానికి హాజరయ్యే భక్తులు ముందుగా గదేగుండంలో స్నానం చేసిన తరువాత స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఆలయప్రాంగణంలోనే గడుపుతూ రోజూ గదేగుండంలో స్నానం చేయడం ద్వారా రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

ఇటీవల కాలంలో ఆలయ ప్రాంగణంలో దక్షిణకాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. దీంతో పాటు ధ్యానమందిరం, అన్నదాన సత్రం, వసతిగృహాలను భక్తుల విరాళాలతో నిర్మించడంతో ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు వసతులు సులువుగా లభిస్తున్నాయి. ప్రతి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ప్రతిరోజూ పూజలను నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే అనంతపురం వైపు నుంచి వచ్చే భక్తులు నార్పల, గూగూడు, నడింపల్లి మీదుగా చిల్లవారి పల్లి కాటకోటేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. రోజూ అనంతపురం నుంచి రెండు బస్సులు తిరుగుతాయి. ధర్మవరం వైపు నుంచి వచ్చే భక్తులు దాడితోటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
Tags : Crow, Katakoteswaram



Wednesday, 14 March 2018

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు  
‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారంసమయం
ఆదివారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారంఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వేల టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరుహాజరు కావాల్సిన సమయం
సుప్రభాతంఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవఉదయం 3 గంటలకు
అభిషేకంఉదయం 3 గంటలకు
తోమాలఉదయం 3గంటలకు
అర్చనఉదయం 4గంటలకు
నిజపాద దర్శనంఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకంఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవఉదయం 5గంటలకు
విశేషపూజఉదయం 6గంటలకు
కల్యాణోత్సవంఉదయం 10గంటలకు
వూంజలసేవఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవంమధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవంమధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవసాయంత్రం 5గంటలకు

ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250

Tuesday, 13 March 2018

మంగళగిరి - పానకాల నరసింహస్వామి





సగం పానకం ఏమైంది?

గుటకలు వేస్తూ తాగే దేవుడు... బెల్లం చుట్టూ చేరని చీమలు
నృసింహ దేవుడు! పానకమే ఆయనకు అమృతం! నోటికి అందించగానే... గుటకలు వేస్తూ మింగుతాడు! ‘మీ కోసం’ అంటూ సగం వదిలేస్తాడు! గుంటూరు - విజయవాడ నడుమ ఉన్న మంగళగిరి క్షేత్రంలో ఈ వింత కనిపిస్తుంది.

దేశంలో... ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి ముందు నైవేద్యాలు పెట్టడమే! మంగళగిరిలో మాత్రం నేరుగా పానకాన్ని నరసింహుడి నోటికి అందిస్తారు. మనం పానీయాలను తాగేటప్పుడు గుటకలు వేయడం సహజం. అదే విధంగా... మంగళగిరి నరసింహుడి నోటికి పానకం అందించినప్పుడు గుటకల శబ్దం వినిపిస్తుంది. ఎగువ మంగళగిరిలో... ఒక చిన్న గుహలా ఉన్న కొండ అంచులో పది నుంచి 15 సెంమీల వ్యాసంలో బిలాకృతి ఉంటుంది. ఈ బిలానికి రెండువైపులా శంఖు చక్రాల ఆకారాలు కనిపిస్తాయి. ఇదే ఇక్కడి స్వామివారి నిజరూపం. భక్తులు సమర్పించే పానకాన్ని అర్చకులు ఈ బిలంలో శంఖు ద్వారా పోస్తుంటారు.

భక్తులు నివేదించే పాత్రలో కచ్చితంగా సగం మాత్రమే లోపలికి పోతుంది. మిగిలిన సగాన్ని భక్తులు తీర్థంగా సేవిస్తారు. వందల సంవత్సరాలుగా ఈ చిత్రం జరుగుతూనే ఉంది. లోపల ఉన్న పానకం ఒక్క చుక్క కూడా బయటకు రాదు. ఈ కొండ ఒక అగ్నిపర్వతమని.. అందులో ఉన్న గంధకాన్ని చల్లబరచేందుకే పూర్వీకులు ఈ బిలాకృతిని ఏర్పరిచి పానకం పోయడం మొదలుపెట్టారని కొందరు వాదిస్తారు. అయితే... ఈ కొండలో ఎలాంటి గంధకం నిల్వలు లేవని, అది సాధారణ కొండ మాత్రమేనని పరిశోధనల్లో తేలింది. మంగళగిరి పానకాల స్వామి క్షేత్రంలో మరో వింత ఏమిటంటే... నిత్యం బెల్లం పొడికొట్టి, లీటర్ల కొద్ది పానకం తయారు చేస్తున్నా ఒక్క చీమ కూడా రాకపోవడం గమనార్హం.

పురాణగాథ ఇది...కృతయుగంలో నముచి అనే రాక్షసుడు విష్ణువు వదిలిన చక్రాయుధం నుంచి తప్పించుకునేందుకు మంగళగిరి కొండపై ఉన్న చిన్న బిలంలో దాగున్నాడట! అప్పుడు స్వామి సూక్ష్మ సుదర్శన రూపంలో అదే బిలంలో చేరి నముచిని వధించాడట! ఉగ్రరూపంలో ఉన్న స్వామిని శాంతపరిచేందుకు దేవతలు అమృతాన్ని నివేదించారట. తదనంతరం స్వామివారు అక్కడే స్వయంవ్యక్తమై వెలిశారని... కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవుపాలను, ద్వాపరయుగంలో నేతిని, కలియుగంలో బెల్లం పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నారని పురాణ గాథ వివరిస్తోంది.

- మంగళగిరి





Sunday, 11 March 2018

అప్పలాయిగుంట





అప్పలాయిగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

వైకుంఠనాధుడు శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా చిత్తూరు జిల్లా తిరుమలగిరుల్లో స్వయంభువుగా అవతరించారు. ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుని వివాహం పద్మావతి దేవితో అంగరంగవైభవంగా జరిగింది. తిరుమల కొండలకు వెళ్లే ముందు స్వామివారు జిల్లాలోని పలుప్రాంతాల్లో నివాసం ఉన్నారు. భక్తుల ప్రార్థనలు ఆలకించి కొన్ని రోజులు భక్తులను అనుగ్రహించేందుకు అక్కడే ఉండేవారు. నారాయణవరంలో వివాహం తరవాత అప్పలాయిగుంటలో నివాసమున్నారు. సాక్షాత్తు స్వామివారు నివసించిన పవిత్రప్రదేశమిది. ప్రసన్నంగా భక్తులను ఆశీర్వదించడంతో ప్రసన్న వేంకటేశ్వరస్వామిగా ఖ్యాతిచెందారు.

అప్పులయ్య కథపూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ (రుణం లేని) సరోవరం అని పిలిచేవారు. అప్పలాయిగుంట అని పేరు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగు అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరు అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరు వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద ‘ నేను ఋణం తీసుకోలేదు’ అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటి లో మునిగిపోకుండా తెలుతుంది. దీంతో గ్రామస్థులందరు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్ఱుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్యగుంట అనే పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయిగుంటగా ప్రసిద్ధి చెందింది.

స్థల పురాణంతిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకుని, పసుపు దుస్తులతోనే తిరుమలకు మరవలికి (వరుడు, వధువు ఇంట జరిగే లాంఛనాలు) బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు.

ఆలయ చరిత్రఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. దీని ముఖద్వార గోడ మీద క్రీ.శ. 1585 కాలం నాటి వేంకటపతిరాయల దానశాసనం ఉంది. కాబట్టి ఆలయం అంతకు ముందే నిర్మించి ఉంటారని అభిప్రాయం. ఇక్కడ పూర్వం స్థానికంగా కార్వేటి నగర రాజులు పరిపాలించారు కాబట్టి వారే ఆలయ ఆలనపాలనా చూసుకొంటూ వచ్చారు. తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని స్వాధీన పరచుకొని జీర్ణోద్ధరణ చేసి, ఏప్రిల్‌ 30, 2006న మహాసంప్రోక్షణ చేసి అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం నిర్వహిస్తారు. స్వామి ప్రసన్నవదనంతో అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. రోగాల బారిన పడిన భక్తులు ఇక్కడ ఉన్న భారీ వాయునందనునికి మొక్కితే రోగ విముక్తలవుతారని ప్రశస్తి.

* తోరణ ద్వారం ఉండటం వలన ఈ క్షేత్రాన్ని సులభంగానే గుర్తించవచ్చు.
* ఇది ప్రసన్న వేంకటేశ్వరస్వామి పద్మావతీ సమేతంగా వెలసిన చోటు.
* ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే గోదాదేవి కూడా ఆలయంలో అమ్మవారికి సమాంతరంగా ఆమెలాగే వెలుపల ఉంటుంది.

ఎలా చేరుకోవాలి
* ఈ క్షేత్రం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో, తిరుచానూరు నుంచి చెన్నైకు వెళ్లే దారిలో ఉంది.
* రైలు ద్వారా రేణిగుంట, తిరుపతి, పుత్తూరు రైల్వేస్టేషన్లకు చేరుకొని అక్కడ నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
* తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకునే సదుపాయముంది.






Monday, 5 February 2018

పంచభూతలింగాలు





పంచభూతలింగాలు 

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచభూతలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

  1. పృథ్విలింగం:
    ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
  2. ఆకాశలింగం:
    ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
  3. జలలింగం:
    ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
  4. తేజోలింగం:
    తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
  5. వాయులింగం:
    ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

నవనందులు





నవనందులు

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.

ప్రథమ నంది:- నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతంవిశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.

నాగనంది:- నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.

సోమనంది:- నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

శివనంది:- నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది.

తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. విష్ణునంది లేక కృష్ణ నంది, శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం..

ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.

సూర్యనంది:- నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.

గరుడ నంది:- సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

వినాయక నంది:- మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

మహానంది:- నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు.


సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది.

కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.




Friday, 13 October 2017

సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ


సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి  నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.

శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి  క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. 


అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి.

సంతాన వృక్షానికి పెరుగుతున్న  భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్‌ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...