Showing posts with label కేరళ. Show all posts
Showing posts with label కేరళ. Show all posts

Saturday, 30 December 2017

కేరళ... ఓ అందాల భరిణె..!


కేరళ... ఓ అందాల భరిణె..!




‘ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చని చెట్లూ, చేయి ఎత్తితే అందేంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్లు తిరిగిపోయే లోతైన లోయలూ, పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటల కొండలూ, కొబ్బరిచెట్ల సౌందర్యంతో తడిసిముద్దవుతోన్న బ్యాక్‌వాటరూ... అవన్నీ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అనిపించింది’ అంటూ కేరళ అందాల గురించి చెప్పుకొస్తున్నారు వరంగల్‌కు చెందిన బండి రవీందర్‌.



నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగ్గ మొదటి 50 ప్రదేశాల్లో కేరళ ఉండటంతో కేరళ అందాలను చూడాలనుకుని ఉపాధ్యాయ కుటుంబ మిత్రులమంతా కలిసి 80 మందిమి బయలుదేరాం. వరంగల్‌ నుంచి ఎర్నాకుళం జంక్షన్‌కు 24 గంటల ప్రయాణం. రెండు ట్రావెల్‌ బస్సుల్లో కొచ్చీకి వెళ్లి ముందే బుక్‌ చేసుకున్న హోటల్లో దిగాం. స్నానపానాదులు అయ్యాక డచ్‌ ప్యాలెస్‌, మ్యూజియంలను చూసి సాయంత్రం హార్బర్‌కు వెళ్లాం. ఇది ప్రకృతి సిద్ధమైన హార్బర్‌. మనదేశంలోని పోర్టుల్లోకెల్లా పెద్దది. ఆ రాత్రి బోటు అద్దెకు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆనందంగా గడిపాం.



గురువాయూర్‌లో...
తెల్లవారి త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌కి బయలుదేరాం. దారి పొడవునా కొబ్బరిచెట్లే. వేలు, లక్షల కొబ్బరిచెట్లను చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూడుగంటల ప్రయాణం తరవాత గురువాయూర్‌కి చేరుకున్నాం. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని భూలోక వైకుంఠంగా చెబుతారు. తెలుగువారికి తిరుపతి, శ్రీశైలం ఎలానో కేరళీయులకి గురువాయూర్‌, శబరిమల అలాగే. ఇందులోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆడవాళ్లు తెల్లని చీరలూ మగవాళ్లు చొక్కా లేకుండా తెల్లని అంగవస్త్రం, లుంగీతో దేవుణ్ణి దర్శించుకోవాలి. అయస్కాంత లక్షణాలున్న నల్లని రాయితో మలిచిన చిన్నికృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యాం. గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు. ఊర్‌ అంటే స్థలం. బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ స్థలంలో స్వయంగా కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్‌ అని పేరొచ్చిందట. గురువాయురప్పన్‌గా పిలుచుకునే ఇక్కడి చిన్నికృష్ణుడి దర్శనం సమస్త పాపహరణంగా భావిస్తారు. ఏటా ఫిబ్రవరిలో గురువాయూర్‌ ఉత్సవం పదిరోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మొదటిరోజు అనయోట్టం ఉత్సవం ఏనుగుల పరుగుపందెంతో మొదలవుతుంది. పందెంలో గెలిచిన ఏనుగు ఏడాదిపాటు దేవుని ఉత్సవ విగ్రహాన్ని మోసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇక్కడి ఏనుగులను నడిచే గురువాయురప్పన్‌లుగా భావిస్తారు. అందుకే ఎంతోమంది ఏనుగులను దేవాలయానికి విరాళంగా ఇస్తుంటారు. వాటిని ప్రత్యేక క్యాంపులో సంరక్షిస్తున్నారు. దైవదర్శనం తరవాత ఏనుగుల క్యాంపు చూడ్డానికి వెళ్లాం. అక్కడ 56 ఏనుగులు ఉన్నాయి. అవన్నీ మగవే కావడం విశేషం. నాలుగు దశాబ్దాలపాటు దేవాలయంలో సేవచేసి 1976లో మరణించిన కేశవన్‌ సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నిర్మించారు. ఆ మధ్యాహ్నం మున్నార్‌కు బయలుదేరాం.



మున్నార్‌లో...
ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌, గురువాయూర్‌కి 180 కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంది. ఆ దారిలో ఎత్తయిన కొండలూ లోతైన లోయలూ కొండలమీద నుంచి ఉరికే జలపాతాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జలపాతం కనిపించినప్పుడల్లా ఆగుతూ సాగిన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకు మున్నార్‌కి చేరుకున్నాం. ఉదయం కర్టెన్లు తీసి చూస్తే, వెనక వైపంతా పెద్దలోయా, పచ్చనిచెట్లూ, కొండలూ, వాటి మధ్యలో అందమైన ఇళ్లూ... చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతో అందంగా అనిపించింది. అల్పాహారం తిన్నాక మున్నార్‌ అందాలను చూడ్డానికి బయలుదేరాం. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లూ, చేతికి అందుతాయేమోనన్నంత దగ్గరగా తెల్లని మబ్బులూ, చూస్తేనే కళ్లు తిరిగిపోతాయనిపించే లోతైన లోయలూ, కొండలనిండా పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటలూ... మరోలోకంలో విహరిస్తున్నట్లే అనిపించింది. ఇక్కడ 30కి పైగా టీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. దారిలో రెండుమూడు తోటల్లో బస్సు ఆపి కాసేపు వాటిల్లో తిరిగి, దగ్గర్లోని టాటా టీ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. లోపల తేయాకుని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో గైడ్‌ చూపించాడు. కమ్మని రుచిగల టీని ఉచితంగా అందించారు. అక్కడి అవుట్‌లెట్స్‌లో రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు.



అక్కడినుంచి 13 కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కు వెళ్లాం. దీన్ని 1953లో రెండుకొండల మధ్యలో నిర్మించారు. జలవిద్యుచ్ఛక్తి తయారీతోబాటు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోందీ డ్యామ్‌. ఇక్కడే బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. తరవాత 20 కి.మీ. దూరంలోగల ఎరవికుళం వైల్డ్‌లైఫ్‌ పార్కుకి బయలుదేరాం. కేరళలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనట. ఇక్కడ అంతరించిపోతున్న నీలిగిరి థార్‌, లాంగర్‌, సాంబార్‌, గౌర్‌, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే నీలకురింజి మొక్కలు ఉన్నాయి. అవి పూలుపూసిన సంవత్సరం పార్కులోని కొండలు మొత్తం నీలంరంగులో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని అనాముడి అనే ఎత్తయిన కొండ ఈ పార్కులోనే కనిపిస్తుంది. ఈ కొండ పెద్ద ఏనుగు తల రూపంలా ఉండటంవల్ల అనాముడి (మలయాళంలో ఏనుగుతల)అని పిలుస్తారు. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్‌ అనీ అంటారు.

తరవాత మజిలీ 90 కి.మీ. దూరంలోని తెక్కడి. ఈ దారిలో అన్నీ సుగంధద్రవ్యాల తోటలే. దారిలో మైలాదుమ్‌పురా వద్ద సుగంధద్రవ్యాల పార్కుకి వెళ్లాం. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క...వంటి మొక్కలను  ప్రత్యక్షంగా చూడొచ్చు. అన్ని భాషల్లో వివరించడానికి గైడ్లు ఉన్నారు. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయో వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో అన్నీ చక్కగా తెలుగులో వివరించారు. అక్కడి షాపుల్లో తాజా దినుసుల్ని కొనుక్కున్నాం. మిరియాల తరవాత ఎక్కువగా కనిపించేవి రబ్బర్‌ తోటలే. రబ్బరు ఉత్పత్తిలో 90 శాతం కేరళ రాష్ట్రానిదే. ఈ చెట్లన్నింటికీ కాండం దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి ఉన్నాయి. ఆ కవర్లలోకి తెల్లని ద్రవం(లేటెక్స్‌) వస్తుందనీ దాన్నే రబ్బురుగా మలుస్తారనీ చెప్పారు. సాయంత్రానికి తెక్కడికి చేరుకున్నాం. అక్కడ పెరియార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. ఇందులో పులులూ, ఏనుగులూ, సాంబార్‌లూ, కోతులూ ఉన్నాయి. వీటిని చూడ్డానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటుచేశారు. పడవలో వెళ్లి చూడాలి. ఆ రాత్రికి తెక్కడిలోని మార్షల్‌ ఆర్ట్‌ థియేటర్‌కు వెళ్లి, కలారిపట్టు అనే యుద్ధవిద్యనుచూసి, అలెప్పీకి బయలుదేరాం.



అలెప్పీలో...
బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. హౌస్‌ బోటులకీ స్నేక్‌ బోటులకీ ఇది పేరొందిన ప్రదేశం. మున్నార్‌ నుంచి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం. బస్సులో వస్తుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉందీ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌బోటులు రెడీగా ఉన్నాయి. మనం చెల్లించే ధరనుబట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌డెక్‌ ఉంటుంది.



ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతాయి. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మేం రెండు బోట్లు అద్దెకు తీసుకుని వెళ్లాం. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

అలెప్పీ నెహ్రూట్రోఫీ బోట్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి. ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం జరుగుతాయివి. వీటినే స్నేక్‌ బోట్‌ రేసెస్‌ అనీ అంటారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లి, పద్మనాభస్వామి గుడినీ కోవలం బీచ్‌నీ సందర్శించి వెనుతిరిగాం.

Saturday, 2 September 2017

మదరాంతేశ్వర స్వామి

రోజు రోజుకూ పెరిగే గణపయ్య

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన గణపతిని పూజించిన అనంతరమే అన్ని కార్యాలను ప్రారంభిస్తాం. మూషిక వాహనుడైన విఘ్నేశ్వరునికి దేశంలో ఆలయాలు అనేకం ఉన్నాయి. తొలి పండగను వినాయక చవితిగా జరుపుకొంటాం. జగన్మాత కుమారుడైన స్వామికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది.




ఉద్భవమూర్తి..
మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.


టిప్పుసుల్తాన్‌ వెనుదిరిగాడు..
ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్‌ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.


ప్రసాదంగా అప్పం..
ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్‌. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఎలా చేరుకోవాలి...

  • కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.
  • కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.
  • మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

Wednesday, 14 June 2017

మున్నార్‌ సోయగాలు

మైమరిపించే మున్నార్‌ సోయగాలు



వేసవిలో ప్రకృతి అందాల మధ్య సేదతీరాలంటే కేరళలోని మున్నార్‌ వెళ్లాల్సిందే. జలపాతాలు, లోయలు, తేయాకు తోటల అందాలతో మున్నార్‌ స్వర్గలోకాన్ని తలపిస్తుంది. నాలుగు రోజులు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే మున్నార్‌ చుట్టుపక్కల ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టేసి రావచ్చు. ఆ విశేషాలు ఇవి...

అట్టుకల్‌ వాటర్‌ఫాల్స్‌
ప్రకృతి సృష్టి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లే దారి ఇరుకుగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనం నడిపించాలి.

దేవికుళం
మున్నార్‌ సమీపంలో ఉండే హిల్‌స్టేషన్‌ ఇది. అందమైన లోయలు, ఎత్తైన పర్వతాలతో దేవికుళం మనోహరంగా ఉంటుంది. మండు వేసవిలోనూ చల్లటిగాలి మిమ్మల్ని పరవశింప చేస్తుంది. మరిచిపోలేని ట్రెక్కింగ్‌ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

మత్తుపెట్టి ఇండో స్విస్‌ ఫామ్‌
మున్నార్‌ సమీపంలో ఉండే మత్తుపెట్టి డ్యామ్‌ పాపులర్‌ పిక్నిక్‌ స్పాట్‌. డ్యామ్‌లో బోట్‌ రైడ్‌ చేయొచ్చు. ఇక్కడ అధిక దిగుబడిని అందించే రకరకాల పశువులను బ్రీడింగ్‌ చేస్తుంటారు. పర్యాటకులను మూడు షెడ్ల వరకు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు. డ్యామ్‌లో బోటింగ్‌ చేయడానికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అనుమతి ఉంటుంది. ఫామ్‌ను సందర్శించడానికి ఉదయం 9 నుంచి 11 వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు అనుమతిస్తారు. బోటింగ్‌ ఫీజు రూ.300. పావుగంట నదిలో విహరించొచ్చు. ఫామ్‌ ఎంట్రీ ఫీజు రూ.5.

ఫొటో పాయింట్‌
మున్నార్‌ వెళ్లిన వారు తప్పక సందర్శించాల్సిన స్పాట్‌ ఇది. ఇక్కడి నుంచి తేయాకు తోటల అందాలు, సిల్వర్‌ ఓక్‌ ట్రీల సోయగాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న కొండలు, చిన్న సరస్సులు నయనానందకరంగా ఉంటాయి. కెమెరాలకు పని చెప్పడానికి అనువైన ప్రదేశం ఇది. అందుకే ఈ ప్రదేశానికి ఫొటో పాయింట్‌ అని పేరు స్థిరపడింది.

పోతమేడు
మున్నార్‌కు 6కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే టీ, కాఫీ తోటల అందాలు, లోయలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడికి 60 కి.మీ దూరంలోని ముత్తిరపుళ రివర్‌, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌ అందాలు కనిపిస్తాయి. ఫొటోగ్రఫీని ఇష్టపడే వారు దీన్ని తప్పక సందర్శించి తీరాల్సిందే.

ఎలా చేరుకోవాలి?
విమానంలో : మున్నార్‌లో ఎయిర్‌పోర్టు లేదు. సమీపంలో అంటే రోడ్డు మార్గంలో 110 కి.మీ దూరంలో కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. కొచ్చిన్‌ నుంచి కారు తీసుకుని మున్నార్‌ చేరుకోవచ్చు. మదురై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 140 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి క్యాబ్‌ లేక బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు.
బస్సులో: కేరళ, తమిళనాడులోని ముఖ్యమైన పట్ణణాలు, నగరాల నుంచి మున్నార్‌కు బస్సు సదుపాయాలున్నాయి.
రైలులో : మున్నార్‌కు 110 కి.మీ దూరంలో అళువా రైల్వేస్టేషన్‌ ఉంది. ఎర్నాకుళం రైల్వేస్టేషన్‌, మదురై రైల్వేస్టేషన్‌ 130 కి.మీ దూరంలో ఉన్నాయి. రైలులో ఇక్కడి వరకు చేరుకుంటే క్యాబ్‌లో లేదంటే బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు. 


వసతి : మున్నార్‌లో బస చేయడానికి రిసార్టులు, హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.

విశేషాలు...

  • సముద్ర మట్టానికి 1600 నుంచి 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
  • ఆగస్టు నుంచి మే వరకు సందర్శించడానికి అనువైన సమయం.
  • ఉష్ణోగ్రతలు 0 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటాయి.
  • మున్నార్‌లో ఏటా ఉత్పత్తి అయ్యే తేయాకు 50 వేల మెట్రిక్‌ టన్నులు(5 కోట్ల కేజీలు) ఉంటుంది.

Saturday, 10 June 2017

గురువాయూర్‌ ఆలయం - మహిమాన్వితం.. మనోహరం

ప్రకృతి అందాలకు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సకు, అనేకమైన అపురూపమైన ఆలయాలకు నెలవు కేరళ. అటువంటి కేరళలో స్వర్గ మర్త్య పాతాళలోకాలూ కలసిన భూలోక వైకుంఠం గురువాయూర్‌. అసలు ఈ పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో కూడి, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సాయంతో సముద్రగర్భంలోకి చేరకుండా కాపాడిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలి ఇది. అంతకుముందు వరకు రుద్రతీర్థం అనే పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి వారి పేరు మీదుగానే గురువాయూరు అనే పేరొచ్చింది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక చేత శంఖం మరో చేత చక్రం మరో రెండు చేతులలోనూ గదాపద్మాలను, మెడలో తులసి మాలను ధరించిన స్వామి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవేమో అన్నంత నయన మనోహరంగా ఉంటుంది. మీ మనసులోని భావాలన్నీ నాకు తెలుసు, మీరు కోరకుండానే నేనే తీరుస్తానుగా మీ కోర్కెలను అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ సుందర స్వరూపాన్ని చూడగానే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి.

అన్నట్లు ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం తక్కిన అన్ని విగ్రహాలలాగా రాతితో లేదా పంచలోహాలతో తయారైనది కాదు. పాతాళాంజనమనే విశిష్టమైన వనమూలికలతో రూపొందించినది. ఇక్కడ పరిణయమాడితే జీవితమంతా పరిమళభరితమే అనే విశ్వాసంతో భక్తులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. నామకరణాలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి.

ఆపదలు, గండాలు, దీర్ఘవ్యాధులు తొలగాలని స్వామికి మొక్కుకుని, ఆయా ఆపదలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోగానే తమ బరువుకు సరిపడా బంగారం, వెండి, రూపాయి కాసులు, ఆకుకూరలు, కూరగాయలు, వెన్న, పటికబెల్లం... ఇలా ఒకటేమిటి, తమ స్తోమతకు తగ్గట్టుగా తులాభారం తూగుతూ కనిపిస్తారు. కొందరు భక్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలనూ సమర్పిస్తుంటారు. ఆయా ఆభరణాలను భద్రపరచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని అనునిత్యం అంటిపెట్టుకుని పంచనాగులనే పేరుగల ఐదుసర్పాలు సంరక్షిస్తుంటాయి.

సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి చేరువలో రుద్రతీర్థమనే పేరుగల పెద్ద కోనేరు ఉంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. ఏకాదశి, రోహిణీ నక్షత్ర వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. ఏనుగులకు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత, గౌరవాభిమానాలూ దక్కుతాయి. ఏనుగు పందేలు కూడా జరుగుతాయి. అవి అల్లాటప్పాగా కాదు.. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉల్లాసోత్సాహాలతో నిర్వహిస్తారు. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం కాబట్టి ఆలయంలో మడీ తడీ శుచీ శుభ్రతలకు ప్రాముఖ్యతనిస్తారు.

చుట్టుపక్కల చూడ దగ్గ స్థలాలు:
మమ్మియూర్‌ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్‌ క్యాంప్‌ శాంక్చువరీ, పున్నతూర్‌ కొట్ట, పార్థసారథి ఆలయం, వెంకటాచలపతి ఆలయం, చోవళూర్‌ శివాలయం, పళయూర్‌ చర్చ్, గురువాయూర్‌ దేవస్థాన దారుశిల్ప కళాసంస్థ, నవముకుందాలయం, చాముండేశ్వరి ఆలయం, హరికన్యక ఆలయం, నారాయణంకులాంగర ఆలయం మొదలైనవి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Sunday, 23 April 2017

భక్తులను అనుగ్రహించే బొజ్జగణపతి ఆలయం

కేరళలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న గణపతి ఆలయం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా ఎడమ కాలును పైకి మడిచి కూర్చున్న భంగిమలో కాకుండా కుడికాలిని పైకి మడిచి ఎడమకాలిని కిందికి పెట్టి భిన్నంగా కనిపించడం ఒక విశేషం కాగా, కేరళ ఆలయాలకు భిన్నంగా తమిళనాడు రీతిన కట్టడంతో, చిన్న ఆవరణలోనే మహాగణపతి కొలువుదీరడం మరో విశేషం. మహా మహిమాన్వితుడిగా పేరున్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరికలెన్నో కోరుకుని అవి తీరాక కొబ్బరికాయలు కొడుతూ కనిపించే భక్తజనులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు.

తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో నాగర్‌కోయిల్‌ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల పద్మనాభపురం అప్పట్లో కేరళ రాజధాని. ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్‌ అనే రాజు పద్మనాభపురంలో రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవన ప్రాంగణంలోనే చిన్నపాటి గణపతి ఆలయం ఉండేది.

గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రలకు, వేటకు, ఇతర దేశయాత్రలకు బయలుదేరేవారు ఎవరైనా ఆ కాలంలో. తదనంతర కాలంలో రాజా మార్తండవర్మ ట్రావెన్‌కోర్‌ రాజవంశాన్ని పద్మనాభదాసులుగా ప్రకటించి, అనంతుడు వెలసిన పురానికి రాజధానిని మార్చాడు. 1795వ సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా సాదరంగా తోడుకొని వచ్చి, పళవంగాడుగా పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో పునఃప్రతిష్ఠించారు.ఆనాటినుంచి పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు స్వామి.

ఆలయ విశేషాలు
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో దూరానికే కొట్టవచ్చినట్లుగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలో మండపాలెన్నో ఉన్నాయి. రహదారి మీద ఉండే చిన్న రాజగోపురం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, మండప స్తంభాలపైన ఎంతో రమణీయంగా చెక్కిన శ్రీ లక్ష్మీ సరస్వతీ విగ్రహాలు, ఇతర మూర్తులు దర్శనమిస్తాయి. అన్నింటికీ మించి ముఖమండపం గోడలపైన శిల్పసౌందర్యంలో ఒకదానికొకటి పోటీపడుతున్నట్లుగా చెక్కి ఉన్న 32 రకాలైన గణపతి చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇవిగాక ఉపాలయాలెన్నో ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, ధర్మశాస్త్త్ర, నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటాయి.

నాడు రాజులకు మాత్రమే.. నేడు పేదలకు కూడా
అలనాడు ట్రావెన్‌కోర్‌ రాజవంశీకుల పూజలందుకున్న పళవంగాడు మహాగణపతి నేడు పేదలకు కూడా దర్శనమిస్తూ, వారి కోర్కెలు తీరుస్తూ, మొక్కులనూ సంతోషంగా స్వీకరిస్తున్నాడు. కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి.

పూజలూ... ఉత్సవాలూ
రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే భక్తులకు నిర్మాల్య దర్శనం కల్పిస్తారు. అనంతరం ఉషఃకాలపూజ, నైవేద్యం, ఉచ్చపూజ, దీపారాధనలతో సహా మొత్తం 21 రకాల పూజాకైంకర్యాలు జరుగుతాయి. ప్రతినెలా సంకటహరచతుర్థి పూజ, హస్తానక్షత్ర పూజ, ప్రత్యేకపూజ, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే గణపతి హోమానికి ఎంతో గొప్ప పేరు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి, ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకునే వినాయక వరద చతుర్థి అంగరంగవైభవంగా జరుగుతాయి.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరువనంతపురం వరకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లకు అతి సమీపంలో గల ఈ ఆలయానికి వెళ్లడం చాలా సులభం.

ఇతర ప్రదేశాలు...
అనంతపద్మనాభస్వామి ఆలయం, కుంటాలలో గల మరో అనంతుని ఆలయం, ఇంకా కేరళ రాజవంశీకులున్న కోట... అసలు కేరళలో అడుగుపెట్టడమే భూలోక స్వర్గానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. మహామహిమాన్వితుడైన పళవంగాడు మహాగణపతి ఆలయ సందర్శనం అనంతమైన ఫలాలనిస్తుందని విశ్వాసం.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Wednesday, 11 January 2017

అనంత పద్మనాభస్వామి కోనేటిలో కొలువైన గుహాలయం...

ఎక్కడైనా సరే, ఆలయ ప్రాంగణంలో అందమైన కోనేరు, ఆ కోనేటిలో తామరలు తేలుతూ ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ఈ ఆలయమే కోనేటిలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఆలయం ఏమైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినదా అంటే, కానే కాదు- కనీసం పన్నెండు వందల ఏళ్ల క్రితం నాటిది. కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న ఈ ఆలయంలో సపరివారంగా కొలువైన వేలుపు అనంత పద్మనాభస్వామివారు.

పాలకడలిలోన.. శేషతల్పముపైన శయనించే ఓ స్వామీ... అన్నట్లుగా.. అనంతుడనే సర్పంపై పద్మనాభుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కన్నులరమోడ్చి, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్న భంగిమను చూస్తుంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే చెప్పనలవి కాని ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాలు మనసులను అలముకుంటాయి. స్వామివారి మూలమూర్తికి అటూ ఇటూ ఉన్న దేవేరులు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు మనస్సుకు నిండుదనాన్ని చేకూరుస్తాయి.

కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్‌లో గల ఈ ఆలయం అనంతమైన సంపదలకు అధినేతగా తిరువనంతపురంలో కొలువైన స్వామి వారి ఆలయానికి మూలస్థానమని ఆలయ అర్చకులు చెబుతారు. రెండెకరాల సువిశాలమైన ఈ కొలనుకు కుడి పక్కన ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక బిలం. ఆ బిలంలో నిత్యం నీరు కూడా ఉంటుంది. స్వామివారు ఈ గుహ నుంచి తిరువనంతపురంలోని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారని స్థానికుల కథనం.

స్థలపురాణం: 
తుళు బ్రాహ్మణ వంశానికి చెందిన దివాకర ముని వి(బి)ల్వమంగళం అనే యోగి ఇప్పుడున్న ఆలయప్రాంతంలో తపస్సు చేస్తుండేవాడట. ఆయనను పరీక్షించడానికా అన్నట్లు ఓ రోజున స్వామివారు ఒక బాలుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట. బ్రహ్మాండమైన తేజస్సుతో, చూడముచ్చటగా ఉన్న ఆ బాలుడి ముఖాన్ని చూడగానే ముని సంభ్రమాశ్చర్యాలకు లోనై, ‘‘ఎవరు నాయనా నువ్వు’’ అని అడిగాడట. ఆ బాలుడు తాను ఇల్లూ వాకిలీ, అమ్మానాన్న ఎవరూ లేని అనాథనని చెప్పడంతో జాలిపడి, తన వద్దనే ఉండిపొమ్మని అడిగాడట.

అప్పుడా బాలుడు తాను ఏమి చేసినా, తనను ఏమీ అనకూడదని,  తనకు కోపమొస్తే క్షణం కూడా ఉండకుండా వెళ్లిపోతానని, అందుకు ఒప్పుకుంటేనే అక్కడ ఉంటానని షరతు పెట్టాడట. ముని అందుకు ఒప్పుకోవడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, ఆ బాలుడు అక్కడే ఉండిపోయాడట. ఆ బాలుడు ఎన్ని తుంటరి పనులు చేసినా, ముని మౌనంగా సహించేవాడట. అయితే ఓరోజున ధ్యానంలో మునిగి ఉన్న మునికి బాలుడు తన తుంటరిపనులతో తపోభంగం కలిగించడంతో కోపంతో చేతులతో గెంటేశాడట. దాంతో ఆ బాలుడు ఒక తేజోపుంజంలా మారిపోయి, గుహలోంచి బయటకు దొర్లుకుంటూ వెళ్లిపోయాడట. చేష్టలుడిగి చూస్తుండిపోయిన మునికి ‘‘నీకెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే అనంతపద్మనాభుడు కొలువుండే ఆనంతన్ కోట్ అనే ప్రదేశానికి రావచ్చు అని అశరీరవాణి పలుకులు వినిపించాయట.

తనది భ్రమేమోనని భావించిన ముని తిరిగి తపస్సులో లీనమయ్యాడట. అయితే, కన్నుమూసినా, తెరచినా, ఆ బాలుడి నగుమోమే కనుల ముందు కనిపిస్తూ ఉండడంతో ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ అనంత పద్మనాభస్వామివారేనని  అర్థమైంది. దాంతో ముని తన తప్పిదానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, అడుగుజాడలను బట్టి బాలుని వెతుక్కుంటూ వెళ్లాడట. ఒక కొండగుహ ముందు ఆ బాలుడి అడుగుజాడలు అదృశ్యం కావడంతో గుహలోకి వెళ్లాడట. ఓ చోట గుహ అంతమై, సముద్రానికి దారితీసింది. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లిన మునిని ఓ పెద్దకెరటం లాక్కుపోయి, ఒడ్డుకు విసిరేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ ఓ అడవి కనిపించింది. దూరాన ఉన్న ఆ అడవిలో ఆ బాలుడు కనిపించినట్లే క నిపించి, అంతలోనే మాయం అయ్యాడట.

అతణ్ణి అనుసరిస్తూ వెళ్లిన మునికి ఆ బాలుడు ఒక పెద్ద విప్పచెట్టు మీదికి ఎక్కడం కనిపించి, చెట్టు వద్దకు చేరాడట. ఇంతలో ఆ వృక్షం పెద్ద శబ్దం చే స్తూ కిందికి ఒరిగిపోయి, చూస్తుండగానే వేయిపడగల అనంతుడి రూపాన్ని సంతరించుకుంది. ఆ సర్పంపై ఆసీనుడైన అనంతపద్మనాభస్వామి చిరునవ్వుతో మునిని ఆశీర్వదించాడట. అక్కడే స్వామి శ్రీదేవి, భూదేవితో కలసి శిలావిగ్రహంగా మారిపోయాడని స్థలపురాణం చెబుతోంది. ఇదే కథ కొద్దిపాటి భేదాలతో కనిపిస్తుంది. శ్రీకోవిల్ అని పిలుచుకునే ఈ ఆలయం నమస్కార మండపం, తిటప్పల్లి, ముఖమండపం అని మూడు భాగాలుగా ఉంటుంది. జలదుర్గామాత విగ్రహం ఆలయంలోనికి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. నమస్కార మండపం నుంచి ఆలయంలోనికి దారి ఉంటుంది.

కోనేటికి మొసలి సంరక్షణ: 
స్వామి ఆలయం ఉన్న కోనేటినీరు కొబ్బరినీళ్లలా ఎంతో తియ్యగా ఉంటాయి. స్వచ్ఛంగా, తళతళలాడుతూ కనిపించే ఆ కోనేటిలో అతిపెద్ద మొసలి ఒకటి సంచరిస్తూ ఉంటుంది. దాని వయసు కనీసం నాలుగు వందల సంవత్సరాలకు పైనే ఉండి ఉంటుందని అంచనా. పూర్తి శాకాహారి అయిన ఈ మొసలి ఎవరినీ ఏమీ చేయదు. రోజూ కొలనులోంచి వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది. పూజారులు కూడా దీనిని భక్తి ప్రపత్తులతో పూజిస్తుంటారు.

స్వామివారిని కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. విశేషం ఏమిటంటే స్వామివారు కానీ, ఆయన దేవేరులు కానీ, ఎటువంటి లోహమూ లేదా రాతితో నిర్మించిన మూర్తులు కాదు... కాడు శర్కర యోగం అనే 108 రకాల ఔషధ వృక్షాల కలబోతతో నిర్మించినవి. దాదాపు నలభై ఐదు ఏళ్ల క్రితం ఈ దారు (కలప) అంతా శిథిలావస్థకు చేరడంతో, కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ విగ్రహాలను పంచలోహాలతో తాపడం వేయించారట. ఆలయ ప్రాకారం గోడల మీద కలపతో చెక్కిన దశావతారాల దారు శిల్పాలు అత్యద్భుతంగా ఉండి చూపులను కట్టిపడేస్తాయి.
 
ఇక్కడ ఇంకా ఏమేం చూడవచ్చు?
పర్యాటక ప్రదేశాలను చూడాలని కోరుకునే యాత్రికులకు కాసర్‌గోడ్ పర్యటన అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక్కడకు దగ్గరలోని కుంబాల రాజకోటలో సుప్రసిద్ధమైన గోపాలకృష్ణుని ఆలయం ఉంది. దగ్గరలోనే మల్లికార్జున ఆలయం, ట్రిక్కనాడ్, పాండ్యన్ కల్లు ఆలయం, అజనూర్‌లో భద్రకాళి కొలువైన మాడియన్ కులోం ఆలయం, బేళా చర్చ్, శంకరాచార్యులవారు నెలకొల్పిన ఎడినీర్ మఠం, తులూర్ వనంలోగల కేకుళోమ్ ఆలయం, నెల్లికున్ను మసీదు, మాధుర్‌లోని శ్రీమద్ అనంతేశ్వర వినాయకాలయం, మధువాహినీ నదితోపాటు ఎన్నో బీచ్‌లు, వేసవి విడుదులు రకరకాల పర్యాటక ప్రదేశాలున్నాయి.

ఎలా వెళ్లాలంటే..?
అనంతపురా కొలనుగుడికి వెళ్లడానికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్ కాసర్‌గోడ్ స్టేషన్. ఇక్కడి నుంచి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్టేషన్‌లో రైలు దిగగానే బస్సులు, ఆటోలు ఉంటాయి. అలాగే కుంబాల స్టేషన్ కూడా ఉంది. మంగుళూరు ఏర్‌పోర్టుకు వెళ్తే అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి రైలులోనూ, బస్సులోనూ చేరుకోవచ్చు. అలాగే కోజికోడ్, కరిపూర్ ఏర్‌పోర్ట్‌లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

  - డి.వి.ఆర్.భాస్కర్

Monday, 29 August 2016

కృష్ణుయ్య ఐదు దివ్య ధామాలు

‘దేవకి పంట...
వసుదేవు వెంట...
యమునను నడిరేయి దాటితివంట...
వెలసితి వంట..
నందుని ఇంట...
రేపల్లె ఇల్లాయెనంటా....’

పుడుతూనే ఇన్ని లీలలు చేసిన బాలకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ నల్లనయ్య పుట్టినరోజు. తాను వెలసిన క్షేత్రాలంటే కన్నయ్యకు వెన్నముద్దలంత ఇష్టం. అటువంటి ఐదు దివ్య ధామాల్లో స్వామితో కలసి మనమూ విహరిద్దాం రండి.



మధుర - బృందావనం


శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు
శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు. మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం (147కి.మీ.) న్యూఢిల్లీలో ఉంది. సమీప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం(49కి.మీ.).


ద్వారక

ఏడు మోక్షపురుల్లో ఒకటిగా పిలిచే ద్వారక, గుజరాత రాష్ట్రంలో గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం’ అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతంగా ద్వారక సుపరిచితం. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది. జగద్గురువు ఆది శంకారాచార్యులు నెలకొల్పిన నాలుగు ప్రధాన మఠాల్లో ఒకటైన ద్వారకా పీఠం (కాళికా మఠం) ఇక్కడే ఉంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి ఇక్కడే స్వామి ప్రతిమలో లీనమైందని చెబుతారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చూడదగిన ప్రదేశాలు
రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.


గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో దేవకి, వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడని ప్రతీతి. అందుకే గురువాయూర్ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి నారద పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. అర్జునుడి మునిమనుమడు (అభిమన్యుడి కుమారుడు) అయిన పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు నిర్వహించిన సర్పయాగంలో వేలాది పాములు అగ్నికి ఆహుతి అవుతాయి. ఈ పాపం కారణంగా ఆయనకు తీవ్రమైన కుష్ఠు వ్యాధి సోకుతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ సమయంలో గురు దత్తాత్రేయ స్వామి ఆదేశాన్ని అనుసరించి గురువాయూర్లో కొలువైన శ్రీకృష్ణుడిని సేవించి రోగ విముక్తుడవుతాడు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్గా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. బాల కృష్ణుడి రూపంలో స్వామి నేటికీ ఈ దేవాలయంలో సంచరిస్తుంటాడని భక్తుల విశ్వాసం.

చూడదగిన ప్రదేశాలు
గురువాయూర్లోని రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, పున్నత్తూర్ కొట్ట, వెంకటాచలపతి దేవాలయం, పార్థసారథి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, హరికన్యక దేవాలయాలను సందర్శింవచ్చు. గురువాయూర్కు 80 కిమీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం ఉంది. అక్కడ పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ దేవాలయం చూడదగింది.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో గురువాయూర్ వెళ్లొచ్చు. లేదా రోడ్డు మార్గంలో (30 కి.మీ) తేలిగ్గా వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది. (80 కి.మీ). కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది.


ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఇక్కడి కృష్ణ మఠాన్ని 13వ శతాబ్దంలో ద్వైత సంప్రదాయ స్థాపకులు మధ్వాచార్యులు ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఎనిమిది మఠాలు స్థాపించి వాటికి ఎనిమిది మందిని అధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు
చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్ .

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కిమీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).



నెమలి

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. 1953లో నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు అదే గ్రామానికి చెందిన దారా నరసయ్య అనే రైతు పొలం కొన్నారు. అందులోని మట్టిని తవ్వుతుండగా స్వామి విగ్రహం, శంఖం, పాచిక బయటపడ్డాయి. విషయాన్ని కూలీలు షావుకారు దృష్టికి తీసుకువచ్చారు. 1957 ఫిబ్రవరి 6న స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. పౌర్ణమి రోజున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణం జరుగుతుంది. భక్తుల విరాళాలతో నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఎలా చేరుకోవాలి?
ఏపీలో విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెమలి చేరుకునే వీలుంది. ఖమ్మం నుంచి కల్లూరు, చినకోరుకొండ, పొచవరం, వెంకటాపురం, తాళ్లూరు, ఉమ్మడిదేవరపల్లి మీదుగా నెమలి చేరుకోవచ్చు. 

Andhrajyothy

Tuesday, 7 June 2016

ప్రకృతి అందాల కొలమానం కుమారకోమ్


సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ.


సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్ హిల్స్ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగుభూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది.

శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదులపైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్ లాగూన్ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్ జీవనశైలికి ప్రతిబింబం..
కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్ లాగూన్ రిసార్ట్.. కొచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్ చెట్ల మధ్యలో.. వెంబనాడ్ సరస్సు తూర్పుతీరంలో కవనార్ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్ లాగూన్ రిసార్ట్ వెలసింది. కుట్టునాడ్ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్ లాగూన్ హెరిటేజ్ రిసార్ట్... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్‌లోనూ...
ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్‌కి బుకర్ ఫ్రైజును తెచ్చిపెట్టిన "God of Small Things" లో పేర్కొన్న కోకొనట్ లాగూన్ రెస్టారెంట్.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్ లాగూన్ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్ కోకొనట్ లాగూన్ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలు చేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్ లాగూన్‌లోని రిసెప్షన్ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్ మాన్షన్లు, 28 హెరిటేజ్ బంగ్లాలు, 8 ప్రైవేట్ పూల్ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్ లాగూన్ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్ మసాజ్, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయాణాలు, రైస్ బోట్ ప్రయాణాలు, ఫిషింగ్, ఈత లాంటివి ఈ కోకొనట్ లాగూన్ రిసార్ట్ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సి యస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్ నుండి గానీ.. పుతెన్గడి నుండి గానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్ లాగూన్ హెరిటేజ్ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్ ప్రాంతంలో వెంబనాడ్ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమరకోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్లకంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్ సంబరాలు...
కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీజ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్ రేస్ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో.. కొచ్చిన్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్ జెట్టీ ద్వారా కుమరకోమ్ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్ ప్రాంతం అంతా వెంబనాడ్ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్ స్టార్క్ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు...
కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్ గార్డెన్ రిట్రీట్‌లో బోటింగ్, ఫిషింగ్ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోమ్ టూరిస్ట్ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

Friday, 12 February 2016

ప్రకృతి అందాల కొలమనం కుమర కోమ్


సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్‌ హిల్స్‌ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగు భూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదుల పైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం..
కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌.. కొచ్చి నుంచి 78 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధ మైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లోనూ...
ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీ రాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలు చేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయా ణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండి గానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమర కోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహా వసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్ల కంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు... కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీ జ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో..  కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు...
కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమర కోమ్‌ టూరిస్ట్‌ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

Tuesday, 15 September 2015

కొచ్చి - కేరళ - అరేబియా సముద్రరాణి

హాయిగొలిపే సముద్రపు పిల్లగాలులు, సుగంధ ద్రవ్య పరిమళాలు, భిన్న సంస్కృతుల కలబోత ఆ నగర విశిష్టత. ప్రపంచంలోనే ముఖ్యమైన అది పెద్ద నౌకాశ్రయంగా దీనికి పేరుంది. ఒకప్పుడు ఈ నగరాన్ని పోర్చుగీసువారు, తర్వాత డచ్‌వారు ఏలారు. అదే కేరళలోని కొచ్చి నగరం. ఆ నగర విశేషాలు... 

కేరళరాష్ట్ర రాజధాని తిరువనంతపురమైనా వ్యాపార వాణిజ్యాల రాజధానిగా పేరు తెచ్చుకుంది మాత్రం కొచ్చి నగరం. భారతదేశంలోని అందమైన పర్యాటక స్థలాల్లో ఇదొకటి. అంతేకాదు ప్రపంచంలోనే ముఖ్యమైన, పెద్ద నౌకాశ్రయం ఇది. ఎందుకంటే భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యం ఉన్న అతికొద్ది నౌకాశ్రయాల్లో ఇదొకటి. అందుకే ఈ నగరాన్ని 'అరేబియా సముద్ర రాణి' అంటారు.
ఆ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వ్యాపార వాణిజ్యాలు చేయాలని చైనా, అరబ్బు దేశాల వారు ఉవ్విళ్లూరారు. యూరోపియన్‌ దేశస్తులు ఏకంగా ఆ నగరాన్ని తమ సొంతం చేసుకున్నారు. వెనిస్‌ దేశస్థులు సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిరాటంకంగా సాగించారు. వీరందరికీ ఆ నగరమంటే ఎందుకంత ఇష్టమంటే... ఏ దేశంతోనైనా సత్సంబంధాలు చేయడానికి వీలైన నౌకాశ్రయం అక్కడ వుండడమే. ఇన్ని దేశాల సంస్కృతులు అక్కడ ఏళ్ల తరబడి ఉన్నాయి. అందుకే ఆ నగర వీధుల్లో ఇప్పటికీ ఆయా సంస్కృతుల పరిమళం గుబాళిస్తుంది. ప్రకృతి సౌందర్యం పర్యాటకులనే కాదు, నిత్యం అక్కడుండే స్థానికులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.

చరిత్ర పుటల్లో కొచ్చి...
క్రీ.శ.1498లో వాస్కోడిగామా తన వ్యాపార స్థావరంగా కేరళలోని కాలికట్‌ తీరాన్ని ఎంచుకున్నాడు. తర్వాతికాలంలో ఇక్కడే స్థిరపడ్డాడు. మరో రేండేళ్లకు పోర్చుగీసువారు వచ్చి కొచ్చి మహారాజు అనుమతితో స్థిర నివాసం నిర్మించుకున్నారు. 1662-63 ప్రాంతంలో పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గి ఆ ప్రాంతం డచ్చివారి అధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్‌ పాలనలోకి వచ్చింది. అందుకే ఇప్పటికీ యూరోపియన్‌ సంస్కృతిని చాటి చెప్పే రాజప్రాసాదాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. అతి ప్రాచీన చరిత్ర కలిగిన కొచ్చి నగరాన్ని పాత కొత్తల మేలుకలయికగా అభివర్ణించొచ్చు. ఫోర్ట్‌ కొచ్చి, మట్టన్‌చెరి, ఎర్నాకులం, ఎడపల్లి, వెల్లింగ్‌టన్‌, తేవర, నైటిల్ల తదితర ద్పీపాలన్నీ కలిసి కొచ్చి నగరంగా ఏర్పడ్డాయి. ఈ ద్వీపాలన్నింటినీ వంతెనల ద్వారా కలిపారు. 

సందర్శనీయం...
మెరైన్‌ డ్రైవ్‌లోని బోట్‌జెట్టీ నుండి కేరళ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కేటీడీసీ) బోట్లలో మట్టన్‌చెరి, పోర్ట్‌ కొచ్చిలకు వెళ్లొచ్చు. సముద్ర కాలువల (బ్యాక్‌వాటర్స్‌)లో ఈ పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఎర్నాకుళంలోని అత్యంత ఆధునిక ఆకాశ హార్మ్యాలు, ఇంకొక వైపు బోల్‌ఘట్టీ, పోర్ట్‌కొచ్చి, మట్టన్‌చెరి దీవులు, మరోవైపు కొచ్చి నౌకాశ్రయంలో నిలిచి ఉన్న పెద్ద నౌకలు... ఇలా ఎటు చూసినా అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తాయి.
ఫోర్ట్‌కొచ్చిలో రెండంతస్తుల అందమైన డచ్‌ ప్యాలెస్‌ ఉంది. దీన్ని పోర్చుగీసు వారు నిర్మించారు. తర్వాత వచ్చిన డచ్‌వారు దీనికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొచ్చి మహారాజుకు కానుకగా ఇచ్చారుట. అందుకేనేమో దీన్ని డచ్‌ ప్యాలెస్‌ అనే పిలుస్తుంటారు. ఈ కోట గోడలపై చిత్రించిన రామాయణ, మహాభారతాలకు సంబంధించిన చిత్రాలను చూసి తీరవలసిందే. 

యూరోపియన్లు మనదేశంలో నిర్మించిన అతి పురాతన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి కూడా ఇక్కడే ఉంది. వాస్కోడిగామా కొచ్చిలోనే మరణిస్తే, ఆయన మృత దేహాన్ని ఈ చర్చిలోనే సమాధి చేశారు. తర్వాత చాలా కాలానికి ఆయన అస్థికలను పోర్చుగల్‌కు తీసుకెళ్లారని చెప్తుంటారు. అయితే సమాధి ప్రదేశాన్ని ఇప్పుడూ చూడొచ్చు.

చూడాల్సిన ప్రదేశాల్లో మరోటి జ్యూయిష్‌ సినగోగ్‌. ఇది యూదుల ప్రార్థనా మందిరం. ప్రపంచంలోనే అతి పురాతనమైనదట. ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే... చేత్తో పెయింట్‌ చేసిన కొన్ని వందల చైనీస్‌ టైల్స్‌ను నేలమీద పరిచారు. వీటిలో ఏ రెండు చిత్రాలూ ఒకేలా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా వీటి మెరుపు కూడా చెక్కుచెదరలేదు.

ఇక్కడున్న బీచ్‌ చిన్నదైనా అందంగా ఉంటుంది. బీచ్‌ పక్కన యూరోపియన్‌ సంస్కృతిని ప్రతిబింబించే పురాతన భవంతులు కనిపిస్తాయి. బ్యాక్‌ వాటర్స్‌ పక్కనే ఉన్న చైనీస్‌ ఫిషర్‌నెట్స్‌ కొచ్చికే ప్రత్యేకం. చైనాలో తప్ప మరెక్కగా కనిపించని ఈ వలలు ఇక్కడ కనిపిస్తాయి. స్థానికులు వీటితోనే చేపలు పడతారు.
సూర్యాస్తమయమయ్యేసరికి పడవలను సముద్రం ఒడ్డుకి తీసుకువచ్చి ఆపుతారు. ఆ సమయంలో సముద్రం అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు... సముద్రం, ఆకాశం కలిసినట్లుండే ప్రదేశంలో బంగారు కాంతులతో మెరిసిపోయే సాగరశోభలను చూడాల్సిందే. ఆ సమయంలో సముద్రంలో ఎగిరిపడే డాల్ఫిన్లను చూడడం అపురూప దృశ్యం. 

కొచ్చి నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో త్రిపునితురలోని సువిశాల మైదానంలో హిల్‌ ప్యాలెస్‌ ఉంది. ఇది కొచ్చి మహారాజుల నివాస గృహం. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇందులో రాజవంశీయుల రథాలు, యుద్ధ సామగ్రి, దుస్తుల వంటివి చూడొచ్చు. ఆ రాజవంశానికి చెందిన రాజా రవివర్మ చిత్రించిన వర్ణచిత్రాలు కూడా ఇక్కడు న్నాయి. మనసును కట్టిపడేసేలా, జీవకళ తొణకి సలాడే ఆ చిత్రాలను ఇష్టపడనివారు ఉండరేమో. సముద్రపు కాలువల్లోని బోల్‌ఘట్టీ అందమైన చిన్న ద్వీపం. ఇక్కడ డచ్‌వారు నిర్మించిన కోట ఉంది. ప్రస్తుతం దీన్ని హోటల్‌గా మార్చారు. కొచ్చి చుట్టుపక్కల వేగా, ల్యాండ్‌, డ్రీమ్‌ వరల్డ్‌, సిల్వర్‌ స్టార్మ్‌, ఫాంటసీ పార్క్‌ తదితర వాటర్‌ థీమ్‌ పార్కులున్నాయి. ఇవన్నీ పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి. 

వెనిస్‌ ఆఫ్‌ ఇండియా
కొచ్చికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అలెప్పీ ఉంది. దీన్ని 'వెనిస్‌ ఆఫ్‌ ఇండియా'గా పిలుస్తారు. ఇక్కడ వెంబానద్‌ సరస్సులో నిర్వహించే పడవ పందేలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కేరళ అందాలను తనివితీరా చూడాలంటే, ఇక్కడి నుంచి కొచ్చికి బ్యాక్‌ వాటర్స్‌లో పడవ ప్రయాణం చేయాల్సిందే. తెక్కడిలోని ప్రసిద్ధిగాంచిన పెరియార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరీకి కొచ్చి నుండి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. ఏప్రిల్‌, మే నెలల్లో ఇక్కడ త్రిసూర్‌ పూరమ్‌ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ హిల్‌ రిసార్ట్‌ ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తేయాకు, యాలకుల తోటలు కనిపిస్తాయి. భూమాతకు చిలకపచ్చ చీర కట్టినట్లుండే ఈ ప్రాంతం పర్యాటకుల్ని వేరే లోకంలో విహరిస్తున్నామన్న భ్రమ కలిగిస్తుంది.

సరసమైన ధరలకే....
షాపింగ్‌ మాల్‌ ప్రియులకు కొచ్చి కచ్చితంగా నచ్చి తీరుతుంది. పర్యటన గుర్తుగా కొనడానకి ఎన్నో హస్తకళాఖండాలు లభిస్తాయి. కథాకళి మాస్క్‌లు, పడవల వాల్‌ హ్యాంగింగ్స్‌, కేరళ సంప్రదాయ చీరలు... ఇలా ఇంకెన్నో వస్తువులు ఆకర్షిస్తాయి. ముఖ్యమైన మరో విశేషమేమంటే ఇక్కడ బంగారు ఆభరణాలు మనం ఊహించనన్ని వెరైటీల్లో దొరుకుతాయి. నాలుగైదు అంతస్తులుగా ఉండే బంగారు షాపులు కనిపిస్తాయి. ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన నగలుంటాయి. ఒక అంతస్తులో రాళ్ల నగలూ, ఒక అంతస్తులో పిల్లలకూ, ఒక అంతస్తులో పెద్దలకీ... ఇలా అన్నమాట.

అక్కడి ఆప్యాయతలు, పండుగలు, సముద్ర గాలులు, కొబ్బరి తోటలు, పడవ షికార్లు, గర్జించే మేఘాలు... అన్నీ పర్యాటకుల మదిలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందమైన ఆ అనుభూతుల్ని ఎన్నిసార్లు నెమరువేసుకున్నా తనివి తీరదు.

కొచ్చికి వెళ్తే అక్కడి వంటలైన పాలడ ప్రథమన్‌ (ఒక రకమైన పాల పాయసం), అరటి, పనస చిప్స్‌, కేరళ హల్వా, ఫళంపురి, అప్పం, ఆడియాపం, కేరళ పరాటాలను తప్పక రుచి చూడాల్సిందే.
కేరళ రాష్ట్రం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, శొంఠి తదితరాలన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. నాణ్యత కూడా బావుంటుంది.
కొచ్చిలో అందరికీ అందుబాటులో ఉండే హోటళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి కొచ్చికి దాదాపు 25 గంటల ప్రయాణం. అక్టోబర్‌ నుండి మే నెల వరకు పర్యటనకు అనువైన సమయం. అయితే ఓనం, క్రిస్‌మస్‌ సమయాల్లో వెళ్తే అక్కడి ఆచార వ్యవహారాలు చూడ్డానికి వీలవుతుంది. కేరళవాసుల ఆచారాలు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, పండుగలు భిన్నంగా ఉంటాయి కనక సందర్శకులకు కన్నుల పండుగే.

Monday, 14 September 2015

గురువాయూర్‌ ఆలయం - త్రిసూర్‌ జిల్లా(కేరళ)

స్థలప్రాశస్త్యం, పవిత్రత, ప్రతిష్ఠాపిత విగ్రహం, విలక్షణవాస్తు సౌందర్యం... ఇలా ఒక్కో ఆలయం ఒక్కో కారణంవల్ల ప్రసిద్ధమవుతుంది. కానీ గురువాయూర్‌ విషయంలో ఇవన్నీ ఏకీకృతం కావడం విశేషం. భూలోక వైకుంఠంగా భక్తుల హృదయాలను దోచుకున్న ఈ ఆలయంలోకి కృష్ణాష్టమి సందర్భంగా అడుగుపెడితే...కోవెలలో అడుగుపెట్టగానే నలువైపులా రాసిన నారాయణనామం అలౌకికానందాన్ని కలిగించగా, తాదాత్మ్యంతో భక్తులు చేసే నారాయణనామ సంకీర్తనం కర్ణపేయంగా ప్రతిధ్వనిస్తుంటుంది. శంఖచక్రగదాపద్మాలను చతుర్భుజాల్లో ధరించి పుష్పమాలాలంకృతుడై కస్తూరీ తిలకాంకితుడైన చిన్నికృష్ణుని రూపాన్ని చూడగానే భక్తులు ఆనందపరవశులవుతారు. నాలుగున్నర అడుగుల ఎత్తున్న ఆ చిన్మయమూర్తిని చూసినవారి హృదయాల్లో చింత చింతాకైనా ఉండదన్నది భక్తుల నమ్మకం. ఎన్నో బాధలతో ఈ నారాయణ సన్నిధానానికి వచ్చి శరణు వేడిన వారంతా తేలికపడ్డ మనసుతో ఇంటికి వెళ్తారట. అందుకే కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో ఉన్న గురువాయూర్‌ ఆలయంవద్ద ఏడాది పొడవునా భక్తులు బారులు తీరతారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఆ నందనందనుడికి జ్యోతుల తోరణాలతో జోతలర్పించే సుందరదృశ్యం చూసి తీరాల్సిందే.

పాతాళశిల!
ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నారాయణీయం!
గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.


అన్నప్రాశన
గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

గజేంద్ర సేవ!
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు.

అసంఖ్యాక భక్తుల ఆదరణకు నోచుకున్న గురువాయూర్‌ దేవస్థానం వాద్యకళాశాలనీ గ్రంథాలయాన్నీ చిత్ర కళాకేంద్రాన్నీ మ్యూజియంనీ వైద్య కేంద్రాన్నీ ఆయుర్వేద ఆసుపత్రినీ శ్రీకృష్ణాకాలేజీనీ స్కూలునీ చక్కగా నిర్వహిస్తూ భక్తజనులకు తన వంతుసేవల్ని అందిస్తూ భూలోక వైకుంఠంగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

Friday, 4 September 2015

శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం – కాలడి

కేరళలో గురువాయూర్  కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని  నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు .అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు .పరమ విశిష్టమైన కాకాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు .ఆ మహాను భావుడే లేక పోతే చైనా ,పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు. ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే .ఆధ్యాత్మిక కీర్తి పతాకని ప్రపంచం అంతా రెపరెప లాడించిన ఆ మహనీయ మూర్తి జన్మ స్థలాన్ని దర్శించాలనే తపన ఈ ఫిబ్రవరి లో తీరింది .ఆ మాహత్మునికి ఏమిచ్చినా హిందూ జాతి  ఋణం తీరనే తీరదు .అలాంటి పవిత్ర కాలడి గురించిన విశేషాలు ఇప్పుడు తెలియ జేస్తున్నాను .

శ్రీ శంకర జన్మ క్షేత్రం గుర్తింపు
ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం .ఈ గ్రామాన్ని గుర్తు పట్టటం మొదట పెద్ద సమస్య గా మారింది. అప్పుడు శృంగేరి పీఠం వారు మహా పండితుడు చారిత్రిక పరిశోధకుడుశంకరుల జీవితం పై అధారిటీ అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారిని కాలడికి పంపారు .అసలు ఆది శంకరుల  జన్మ స్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమనిపంపారు . ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలనా ,పరిశోధనా చేసి కైఫీయత్తులను తిరగేసి ఇప్పుడు శ్రీ శంకరులదేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆది శంకరుల జన్మ క్షేత్రం అని నిర్ధారించి రుజువులతో సహా తెలియ జేశారు .అప్పుడు ఈ ప్రదేశం అంతా ‘’కపిల్లి మన ‘’అనే ఆయన స్వాధీనం లో ఉండేది .ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూర్ మహా రాజా వారికి తెలియ జేశారు ఆ స్థలాన్ని తమకు ఇస్తే అక్కడ శంకర ఆలయం నిర్మించి స్మ్రుతి చిహ్నం గా తీర్చి దిద్దుతామని చెప్పారు .మహా రాజు మహాదానందం పొంది "కపిల్ల మన" నుంచి 1906లో ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకి శృంగేరి పీఠానికి అప్పగించాడు .

శృంగేరి మఠం ఇక్కడ 1910లో శ్రీ ఆది శంకరుల ఆలయాన్ని నిర్మించింది .అదే కాలడి ఆవిర్భావ సంవత్సరం గా భావించారు .సరిగ్గా వంద ఏళ్ళకు 2010లో కాలడి శత వత్సర ఉత్సవాలను పీఠం ఘనం గా నిర్వ హించింది ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారం లోకి తెచ్చింది .లేక పోతే కాలడి అలాగే చరిత్ర గర్భం లో కలిసి పోయి ఉండేదేమో ?బాల శంకరులు తన తల్లి ఆర్యాంబ కోసమై పూర్నా నదిని ఇంటి వరకు మళ్లించిన ప్రదేశం శంకరాలయానికి దగ్గరలోనే ఉంది. దాని తీరం మీదనే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించారు .ఇక్కడే ‘’అచ్యుతాస్తకం ‘’చెప్పారు .శంకర ఆలయం లో శ్రీ శంకర ,శారదాంబ విగ్రహాలు జగన్మొహనం గా కనీ పిస్తాయి నిత్యం అభిషేకం పూజా హోమాదులు నిర్వహించే విశాల ప్రాంగణం ఉంది .శంకరుల తల్లి ఆర్యాంబ సమాధి కూడా ఇక్కడే ఆలయం లో ఉంది అక్కడ నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది . వినాయకుని చిన్న విగ్రహమూ ఉంది .ఇక్కడ తమిళ కన్నడ స్మార్త బ్రాహ్మణులే పూజారులు .
        


శంకరాచార్య కీర్తి స్థంభం
శంకరాలయానికి దగ్గరే శృంగేరి పీఠం ఉంది .ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం లోనే శ్రీ శంకరులు 243పంక్తుల ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రాశారు .కాలడి దేవస్థానం అధీనం లో ఉంది .రామ కృష్ణ మఠం కూడా సమీపం లో ఉంది .కాలడి గ్రామం లో ప్రవేశించ గానే మనకు కంచి కామ కోటి పీఠంవారు నిర్మించిన ఎనిమిది అంతస్తుల’’ కీర్తి స్థంభం ‘’అనే బృహత్ భవనం కానీ పిస్తుంది .అది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శించారిక్కడ .పై అంతస్తుకు వెళ్లి నగర దర్శనం చేయ వచ్చు శ్రీ శంకరాచార్య ,శ్రీ గనేశుల పెద్ద విగ్రహాలు ఇందులో ఉన్నాయి .
     


చూడాల్సిన ప్రదేశాలు
కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం .ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు .అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది .ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య .
కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి  శివ శర్మ ప్రతిస్టించాడు .ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు .అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు .అలానే రోజూ చేసేవారు .అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది .అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం .
నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది .ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది .ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు . మంజప్ప కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో శివ శర్మ పూజారిగా ఉన్న ‘’మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ‘’ఉంద. అలాగే ‘’తెక్కే మదోం ‘’అనే చోట శ్రీ కృష్ణుని గుడి పక్కనే తిరుచ్చి శంకర మఠం ఉంది ఈ మతానికి  చెందిన వారికే పూజార్హత .
శంకరుని తల్లి ఆర్యామ్బకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయం లోనే ఉంది .పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు .ఈ ప్రాంతాన్ని ‘’కపిల్లమన’’ అంటారు .ఆనాటి నుంచి ఈనాటి  వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండటం విశేషం .
కాలడి కరవు (ఆడట్టు కడవు )దగ్గరే నది మార్గం మారి కాలడి  గ్రామం ఏర్పడింది .ఇక్కడే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం స్థాపించారు .శ్రీ కృష్ణ ఉత్సవాలలో ఇక్కడి నుండే జలాన్ని తీసుకు వెడతారు
‘’మూతల ల కడవు ‘’అంటే మొసలి ఘాట్ -క్రోకడైల్ ఘాట్ అంటారు .ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు. ఇవి కాక శ్రీ శంకరాచార్య యూని వర్సిటి, కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి చూడ తగిన ప్రదేశాలు .

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం)
11-2-14 మంగళ వారం

అరుణాచలం
తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం .తనివి తీర అగ్ని జ్యోతిర్లిన్గాన్ని దర్శించి తరించాం . నిన్న రాత్రి దర్శనం ఇప్పుడు ప్రభాత దర్శనం .మనసు నిండుగా ఉంది తర్వాత అమ్మ వారి దర్శనం చేశాం .అక్కడా హాయిగా దర్శనమయింది .లోపల ఉన్న కుమారస్వామి గణేష్ మందిరాలను కూడా చూసి బయటికి సంతృప్తి తో వచ్చాం .అక్కడే ఉన్న హోటల్ లో ఇడ్లీ తిని కాఫీ తాగాం . గిరి ప్రదక్షిణం అరుణా చలేశ్వరుడిని చూడటం మల్లికా గారికి ఇదే మొదటి సారి .మేము చాలా సార్లు చూశాం .ఆమె కు ఎంతో అనుభూతి కలిగింది .ఇన్ని సార్లు వచ్చినా నేనెప్పుడూ గిరి ప్రదక్షిణం చేయలేదు .పద్నాలుగు కిలో మీటర్లు చుట్టి రావాలి .మధ్యలో ఎనిమిది శివలింగాలను చూడాలి .ఇవి అష్ట దిక్పాలకులు స్థాపించిన లింగాలుగా ప్రసిద్ధి. వీటితో బాటు ఆది అరుణాచలేశ్వర దేవాలయాన్ని కూడా దర్శించాలి. ఇవన్నీ తిరిగి రావటానికి మూడు వందల రూపాయలకు ఆటో మాట్లాడుకొన్నాం గుడి దగ్గరే .మమ్మల్ని చివరికి రమణాశ్రమం దగ్గర దించాలని చెప్పాం.
  
          
.అలాగే అని బయల్దేరాడు .వరుసగా ఎనిమిది లింగాలు ఇంద్ర ,ఆగ్ని,వాయు,  కుబేర ఈశాన వరుణ, యమ,నైరుతి శివ లింగాలను దర్శించం ప్రతి చోటా ఆగటం చూడటం ఫోటోలు తీయటం చేశాం .మధ్యలో ఆది అరుణాచలేశ్వర దేవాలయం లో శివ దర్శనం అమ్మ వారి దర్శనం చేశాం .అంతా పూర్తీ అయ్యేసరికి గంట సమయం పైనే పట్టింది .ఇదే మొదటి సారి. బాగాఉంది .ఈ గిరి ప్రదక్షిణం కోసమే మంచి రోడ్డు వేశారు .ఇదివరకు కొండ  దగ్గర నుండి ప్రదక్షణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఊరు పెరిగింది .కనుక గిరి ప్రదక్షిణం కాదు ‘’పురి ‘’ప్రదక్షిణం అన్నాను .గిరి చుట్టూ ఉన్న ఓషధుల గాలి మనకు సోకి ఆరోగ్యాన్నిస్తుందని భావన .శేషాద్రి స్వామి ఆశ్రమం చ దగ్గర దిగాం .లోపలి వెళ్లి చూశాం .ఆయన పేర ఉన్న లింగానికి అభిషేకం జరుగు తోంది. శేషాద్రి స్వామి మహాభక్తుడుగా ప్రసిద్ధి. ఆయన జీవిత చరిత్ర పుస్తకం అక్కడే ఉన్న షాప్ లో లేదని ప్రింట్ అవుతోందని చెప్పారు  .దీనికి దగ్గరే ఉంది శ్రీ రమణాశ్రమం . శ్రీ రమణాశ్రమం నడిచి శ్రీ రమణాశ్రమం కు వెళ్లాం నేనిది వరకు ఎన్నో సార్లు సందర్శించాను .నాకు మహా ప్రశాంతం గా ఉంటుంది .ఇక్కడ .అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్లాలని పిస్తుంది .మల్లిక గారికి కూడా కొత్త .ఒకటి రెండు సార్లు ఇక్కడ ఆశ్రమం లో రాత్రి ఉన్నాం .ఇప్పుడు మళ్ళీ .అన్నీ తిరిగి చూశాం .గోశాల ,
                          
భోజన శాల వంట శాల మహర్షికి ఇష్టమైన లక్ష్మీ ఆవు పావురం కోతి పిల్లి కుక్కా వాటి సమాధులు తిరిగి చూశాం .తర్వాతా ఆశ్రమ లో రమణుల అమ్మ వారి సమాధి శివలింగం అభిషేకం చూశాం .రమణ మహర్షి ధ్యాన మందిరం ఎంతో ప్రశాంతం గా ఉంది .ధ్యానం చేసే వాళ్ళు అన్ని దేశస్థుల వారూ ఉన్నారు .ఇక్కడ కులానికి వర్గానికి వివక్షతకు స్థానం లేదు అది చాలు .అందరం ఒకటే నని తెలియ జేయటానికి .పుస్తక శాలలో శ్రీ కావ్య కంఠ గణ పతిరాసిన’’ఉమా సాహస్రం ‘’ అలాగే ‘’రుభు గీత ‘’పూర్తీ పుస్తకాలు ,శ్రీపింగళి  లక్ష్మీ కాంతం గారి అబ్బాయి సూర్య సుందరం గారు రాసిన ‘’రుభు గీతా సారం ‘’చిన్న పుస్తకం ఫోటోలు కొన్నాను.
                   

అందరం రమణాశ్రమంలో  భోజనం చేయాలను కొన్నాం .అదొక దివ్యాను భూతి. సరిగ్గా పదకొండున్నరకు భోజనం పెడతారు .పది నిముషాలు ముందు అక్కడికి చేరాలి .అయితే మనం యెంత మంది భోజనానికి వస్తామో ఆఫీస్ లో ముందుగా చెప్పితే చాలు .అన్నం, గోరు చిక్కుడు కాయ కూర ,సాంబారు ,రసం, ఖీర్ అనే పాయసం ,మజ్జిగ నిమ్మకాయ ఊరగాయ తో మహా ప్రసాదం గా భోజనం అడిగి అడిగి వడ్డించారు. అందరూ ఒకే పంక్తి లో కూర్చుంటే ఎంతో ముచ్చటగా ఉంది. అందరూ ఎంతో ఆనందించారు. పన్నెండు గంటలకు రమణాశ్రమం  వదిలి ఆటో మీద ఆకాష్ హోటల్ కు చేరుకొన్నాము ఒక గంట విశ్రాంతి తీసుకొన్నాం .
            
చెన్నై కి చేరిక 

సామాను తీసుకొని ఎదురుగుండా ఉన్న బస్ స్టాండ్ చేరాం. పావుతక్కువ రెండు గంటలకు మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎక్కాం  వందరూపాయలు బస్ చార్జి .కారు లో వెళ్ళటానికి ఈ రెండు వందల కిలో మీటర్ల దూరానికి మూడు వేల అయిదు వందలు అడిగారు .అంత అనవసరం అని బస్ లోనే వెళ్లాం .నైవేలీ మీదుగా బస్ చెన్నైకి నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి సాయంత్రం అయిదున్నరకు చేరింది .దారిలో జీడి మామిడి తోటలు విపరీతం గా కని  పించాయి అలాగే గురవాయూర్ నుంచి వస్తున్నప్పుడు కూడా జీడి తోటలు బాగా ఉన్నాయి .అక్కడి నుంచి సామాను తో ఆటోలో రెండు వందలిచ్చి షినాయ్ నగర్లో ఉన్న మా మేన కోడలు కళా చంద్ర శేఖర్ ల ఇంటికి అరగంట లో చేరాం .వెంటనే కాఫీ ఇచ్చింది కళ. తాగి ,స్నానాలు చేశాం .అప్పటికే ఆఫీస్ నుండి చంద్ర శేఖర్ ,మా మేనల్లుడు శ్రీనివాస్ వచ్చి మా కోసం ఎదురు చూస్తున్నారు .చంద్ర శేఖర్ కు కృతజ్ఞతలు చెప్పి అతను తీసుకొన్న శ్రద్ధకు మానిటరింగ్ కు ,ఫోన్ పలకరింపులకు ఏంతో మెచ్చాము .అందుకే దీన్ని ‘’శర్మా చంద్ర శేఖర విజయం ‘’అన్నాను .ముసి ముసి నవ్వ్వులు నవ్వాడు చంద్ర శేఖర్ .అతని ప్రణాళికయే ఇది .మా అబ్బాయి శర్మ తో అతను సంప్రదిస్తూ ప్లాన్ తయారు చేసి ఇద్దరూ కలిసి ఈ కేరళ ట్రిప్ విజయానికి కృషి చేశారు .భోజనం చేసి పడుకున్నాం .నాకు నిద్ర పట్టలేదు .అందరూ పడుకొన్నారు .
         

షాపింగ్ – 12-2-14బుధ వారం
నా  సంధ్య ,పూజా ,పారాయణ అయిన తర్వాతా టిఫిన్ చేసి కాఫీ రెండో సారి తాగి పదింటికి ఆటో లో బయల్దేరి ‘’మదర్ షా ‘’అనే వస్త్రాలయానికి వెళ్లాం .ఎప్పుడూ ఇక్కడే బట్టలు కొంటాం .క్వాలిటీ బాగా ఉంటుంది .అన్ని రకాలు ఉంటాయి .మా అమ్మాయికి, కోడళ్ళకు మా ఆవిడకు చీరలు కొన్న్నాం. మనవరాళ్ళు ఇద్దరికీ పట్టు పరికిణీబట్టలు కొన్నాం .మా సువర్చలాన్జనేయ స్వామికి వస్త్రాలు కొందామను కొంటె మంచివి దొరకలేదు .అమ్మ వారికి మాత్రం  తీసుకొన్నాం  .అన్నీ పూర్తీ అయి ఇంటికి చేరే సరికి ఒంటి గంట దాటింది .భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నాం . కపాలేశ్వర ,పార్ధ సారధి కోవెల దర్శనం సాయంత్రం నాలుగింటికి ఏ.సి.టాక్సీ  నాలుగు గంటలకు ఆరువందల రూపాయలకు మాట్లాడుకొని బయల్దేరాం .ముందుగా మైలాపూర్ లో శ్రీ కపాలేశ్వర స్వామిని దర్శించాం .అక్కడి నుండి ట్రిప్లికేన్ లో శ్రీ పార్ధ సారధి స్వామి ని సందర్శించాం .అక్కడ ముప్పావు గంట లేట్ అయింది దర్శానికి ‘’.మీసాల కృష్ణుడు పార్ధ సారధి’’ .మా చిన్నప్పుడు ఎప్పుడు మద్రాస్ కు మా అక్కయ్యా వాళ్ళ ఇంటికి వచ్చినా మా అక్కయ్య లోపా ముద్ర మమ్మల్ని ఈ రెండు గుడులకూ తీసుకు వెళ్ళేది .బీచ్ లు చూసే వాళ్ళం .అక్కడి నుంచి టి నగర్ లో ఉన్న మా బంధువులు నోరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మద్రాస్ సిమెంట్స్ లో అత్యున్నత అధికారి గా పని చేసిన శ్రీ నోరి రామ క్రిష్ణయ్యగారుగారింటికి వెళ్లి దంపతులను చూశాం.
                   
.వీరిది ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు .రామ క్రిష్నయ్య గారు మా రెండో కోడలు ఛి . సౌ ఇందిరకు చిన తాత గారు . చాలా మంచి వారు .ఈ ప్రదేశానికి వచ్చినప్పుడల్లా వల్లూరు వెళ్లి మా ఇంటికీ వచ్చే వారు .అయిదారు నెలల క్రితమే వచ్చి వెళ్ళారు దంపతులు .మా శ్రీమతి,కి  మల్లికా గారికి చీరా జాకెట్ పెట్టి గౌరవించారు ఆయన సతీ మణి.అక్కడి నుండి సరాసరి షినాయ్  నగర్ చేరుకొని భోజనం చేసి పడుకోన్నాం. నిద్ర అసలు పట్టనే లేదు. ఈ రెండు రోజుల్లో మల్లిక గారి దగ్గర బంధువు అయిన గాయని,బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు  ఎస్ పి శైలజ గారింటికి వేల్దామను కొన్నాం .మల్లికా గారు ఆమె కు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నానని ,పది హీను రోజులు అక్కడే ఉంటానని చెప్పారు .ఆమెకు ఇవ్వటానికి సరసభారతి పుస్తకాలు కూడా తీసుకొని వెళ్లాను .కాని ఆశా భంగమే అయింది .అలాగే వెస్ట్ మాంబళం లో ఉన్న ‘’సంజీవినీ పీఠం’’ను కూడా దర్శించాలను కొన్నాం .కాని సమయం చాల లేదు .అదీ చూడలేక పోయాం . శ్రీ సాయి మందిర సందర్శనం –ఉయ్యూరు ప్రయాణం 13-2-14-గురువారం ఉదయమే అన్నీ పూర్తీ  చేసి ఆటోలో దగ్గరలోనే ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరానికి వెళ్ళాము.ఇక్కడ ఈ మందిరాన్ని ఏర్పాటు చేసిన వారు స్వామి కేశవయ్యజీ .మహా భక్తులు .తెలుగు వారే .ఎంతో ప్రాచుర్యం పొందిన మందిరం ఇది సినీ గాయిని ఎస్ జానకి మొదలైన వారంతా దర్శించి హాయిగా గానం చేసి తరిస్తున్న ప్రదేశం .చాలా సార్లు చూశాను .కేశవయ్య గారి చేతనే ఉయ్యూరు లో కే.సి.పి వారు ఫాక్టరీ దగ్గర శ్రీ సాయిబాబా మందిరాన్ని ప్రారంభింప జేశారు మద్రాస్ లో నూ ఇక్కడా బాబా చిత్ర పటాలే .ఆ తర్వాతా ఉయ్యూరు లో విగ్రహం పెట్టారు .కాని మద్రాస్ లో ఇంకా ఆ చిత్ర పటానికే అ పూజాదికాలు జరుగుతాయి .ప్రశాంత మైన ధ్యాన మందిర్ ప్రసాదాలు వినాయక గుడు ఉన్నాయి .దర్శనం తర్వాత అమర స్టోర్స్ కు వెళ్లి ప్రిస్టేజ్ చిన్నకుకర్ ,ఇండక్షన్ స్టవ్ వగైరాలు కొని ఇంటికి చేరాం .అమర స్టోర్స్ లో మంచి స్టీల్ వస్తువులు లభిస్తాయి .భోజనం చేసి విశ్రాంతి తీసుకొన్నాం . రాత్రి ఎనిమిదిన్నరకల్లా భోజనాలు పూర్తీ చేసుకొని కాల్ టాక్సీ లో సామాను పెట్టుకొని తొమ్మిదింటికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ చేరాం .పది గంటలకు తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ లో ఎక్కి S7లో -3,4,6,8 మా రిజర్వేషన్ బెర్త్  లలో చేరి పడుకోన్నాం .తెల్లవారు ఝామున మూడున్నరకే నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి బెజవాడ చేరింది ట్రెయిన్ .సామాన్లు కూలీలకిచ్చి రెండు వందలు సమర్పించుకొని  బయట మా  కోసం ఉన్న రామూ టాక్సీ ఎక్కి ఉయ్యూరుకు అయిదింటికి  అంటే పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం హాయిగా ఉయ్యూరు చేరాం .కేరళ ట్రిప్ సర్వం సంపూర్ణం .మద్రాస్ లో మా మేన కోడలు కళా  చంద్ర శేఖర్ అబ్బాయి బాలాజీ మా మేనల్లుడు శ్రీనివాస్ లు ఏంతో మర్యాదా మన్ననా ఆప్యాయతా ఆదరణా చూపించారు మమ్మల్ని ముగ్ధుల్ని చేశారు .అందుకే ఈయాత్ర ఇంత సంతృప్తిగా జరిగింది . ఇన్ని రోజుల యాత్రలో మద్రాస్ వచ్చే వరకు అంటే అయిదవ తెడ్డె నుండి పదకొండవ తేదీ వరకు కన్యాకుమారిలో ఒక పూట ,రమణాశ్రమం లో ఒక పూట మాత్రమె మేము ముగ్గురం భోజనం చేశాం .మల్లికా గారు రమణాశ్రమం లో మాత్రమె భోజనం చేశారు .మిగిలిన రోజులన్నీ టిఫిన్ ల తో సరి పెట్టుకోన్నాం.అయినా ఏ మాత్రం నీరసం గా అని పించలేదు ఉత్సాహం తగ్గలేదు .ఆకలి  అని పించి ఇబ్బందీ పడలేదు . ఏ రోజు కా రోజు ఆరోజు ఖర్చులు లెక్క వేసి నలుగురికీ పంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాల్సి వస్తే ఇచ్చి ఎక్కడా రూపాయ్ తేడాలేకుండా జాగ్రత్త గా గడిపాము .అందువల్ల అపార్ధాలు వచ్చే అవకాశం లేకుండా చేశాను . రాం బాబు  కే లెక్కలన్నీ అప్ప గించాను వాడు జాగ్రత్త గా అన్నీ బాధ్యత గా చూశాడు .నలుగురం ఆనందించాం అందుకే ‘’కేరళ ట్రిప్ సక్సెస్ ‘’. చూసిన క్షేత్రాల గురించి వివరం గా విశేషాలతో వెంటనే తెలియ జేస్తాను . సంపూర్ణం .

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...