Showing posts with label Tamilnadu. Show all posts
Showing posts with label Tamilnadu. Show all posts

Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

Saturday, 8 December 2018

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు









సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు
ఆరు ముఖాలు ఆరు ధామాలు


ఆదిదంపతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో వీధికొక మురుగన్‌ ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలయాలన్నిటికీ మకుటాయమైనవిగా, మహిమాన్వితమైనవిగా తమిళనాడులోని ‘ఆరుపడై వీడుగళ్‌’ (ఆరు దివ్యధామాలు) ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒక్కో ఆలయానిదీ ఒక్కో ప్రత్యేకత.


తిరుచందూర్‌
సాగరతీరంలో

ఆరుపడై వీడుగళ్‌ సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరింటిలో అయిదు కొండలపై ఉండడం విశేషం. ఒక్క తిరుచందూరు ఆలయం సాగరతీరంలో ఉంటుంది. అన్నిటికన్నా మహిమాన్వితమైనదిగా దీన్ని పరిగణిస్తారు. శూరపద్ముడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి దేవతల సేనాని అయిన కుమారస్వామి తన సేనలతో ఇక్కడ విడిది చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. రణసన్నద్ధుడైనట్టు సర్వాలంకారాలతో సమ్మోహనకరంగా కనిపించే మురుగన్‌ రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదంటారు భక్తులు. ఈ స్వామివారి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందనీ, దుష్ట శక్తుల పీడ నివారణ అవుతుందనీ నమ్మకం. ఆలయానికి సమీపంలోని సముద్ర తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి 92 కి.మీ. దూరంలో కన్యాకుమారి చక్కటి పర్యాటక ప్రదేశం.

ఎక్కడుంది?: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరన్‌) జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తూత్తుకుడికి 46 కి.మీ., తిరునల్వేలికి 53 కి.మీ., మదురైకి 180 కి.మీ. దూరంలో తిరుచందూర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి తిరునల్వేలికి నేరుగా రైలు సదుపాయం ఉంది. మదురై వరకూ రైలులో వెళ్ళి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాలలో తిరుచందూరు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి తిరునల్వేలి వరకూ ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రైళ్ళ కన్నా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. సమీప విమానాశ్రయం ట్యుటికోరన్‌లో
ఉంది.

తిరుప్పరన్‌కుణ్రమ్‌
పెళ్ళిళ్ళకు ప్రసిద్ధి

ఎక్కడుంది?: తమినాడులోని మదురై నగర శివార్లలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తిరుప్పరన్‌కుణ్రమ్‌ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: ఒకే కొండలో మలచిన ఆలయం ఇది. దీన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. దేవసేన (దేవయాని)తో సుబ్రహ్మణ్యస్వామికి ఇక్కడే వివాహం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అందుకే వివాహాలు చేసుకోవడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా తమిళులు భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. తిరుప్పరన్‌కుణ్రమ్‌ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గరలోని మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం మరో ముఖ్యమైన యాత్రాస్థలం.

పళని
కావడి మొక్కుల జ్ఞానక్షేత్రం

ఎక్కడుంది?: తమినాడులోని దిండిగల్‌ జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: దిండిగల్‌కు 57 కి.మీ., కోయంబత్తూరుకు 118 కి.మీ., మదురైకి 120 కి.మీ. దూరంలో పళని ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి ఈ మూడు ప్రాంతాలకూ నేరుగా రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది.
ప్రత్యేకతలు: పళనిని ‘తిరు ఆవినన్‌కుడి’ అని కూడా అంటారు. ఇక్కడి బాల సుబ్రహ్మణ్యుణ్ణి ‘దండాయుధపాణి’ అనీ, ‘వేలాయుధుడ’నీ పిలుస్తారు. కుడిచేత దండాన్ని పట్టుకొని, ఎడమ చేతిని నడుముకు ఆన్చి, కౌపీనంలో బాల సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. పళనిని ‘జ్ఞాన క్షేత్రం’ అంటారు. జ్ఞానప్రదాతగా దండాయుధపాణిని ఎందరో తమిళ కవులు స్తుతించారు. మురుగేశుడికి మొక్కుకొని కావళ్ళు ఎత్తే సంప్రదాయం ఇక్కడే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయాన్ని చేరుకోడానికి 690 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చిన్న రైలులో కూడా వెళ్ళవచ్చు.

స్వామిమలై
ఓంకార ఉపదేశ స్థలం

ఎక్కడుంది?: తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 6 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తిరుచురాపల్లి (తిరుచ్చి) నుంచి సుమారు 80 కి.మీ. దూరంలో స్వామిమలై ఉంది. తిరుచ్చికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల నుంచి కుంభకోణానికి నేరుగా (వీక్లీ) రైలు సౌకర్యం ఉంది. లేదా తిరుచ్చిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కుంభకోణం చేరుకోవచ్చు. సమీపవిమానాశ్రయం తిరుచ్చిలో ఉంది.
ప్రత్యేకతలు: స్వామిమలైలోని సుబ్రహ్మణ్యుణ్ణి ‘స్వామినాథుడు’ అని పిలుస్తారు. ఈ ఆలయానికి 60 మెట్లు ఉంటాయి. అవి భారతీయ సంప్రదాయంలోని అరవై సంవత్సరాలకు సంకేతమని పెద్దలు చెబుతారు. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని తండ్రి అయిన శివుడికి మురుగన్‌ ఉపదేశించాడనీ, ఆ ప్రదేశం ఇదేననీ స్థలపురాణం పేర్కొంటోంది. తండ్రికే గురువైన స్వామి వెలసిన చోటుగా దీన్ని ‘గురుమలై’ అని కూడా అంటారు. కుంభకోణం చుట్టుపక్కల అనేక సందర్శనీయ స్థలాలూ, ఆలయాలూ ఉన్నాయి.

పళముదిర్చోళై
అటవీ ప్రాంతంలో ఆరోగ్య దాత

ఎక్కడుంది?: తమిళనాడులోని మదురైకి సుమారు 24 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు: ‘ఆరుపడై వీడు’ ఆలయాల్లో తన దేవేరులు వల్లి, దేవసేనలతో కుమారస్వామి కొలువైన ఏకైక గుడి ఇది. అడవుల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. సమీపంలో ‘నూపురగంగ’ అనే జలప్రవాహం ఉంటుంది. ఈ స్వామిని కూడా ఆరోగ్యప్రదాతగా అర్చిస్తారు. ప్రముఖ తమిళ కవయిత్రి, సాధువు అయిన అవ్వయార్‌ను స్వామి పరీక్షించింది ఇక్కడే అని ఐతిహ్యం. ఈ ఆలయంలో స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి దగ్గరలో అనేక జలపాతాలున్నాయి. భక్తులు వీటిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. శివ, గణేశ ఆలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి.

తిరుత్తణి
365 మెట్ల స్వామి వాసం


ఎక్కడుంది?: తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 67 కి.మీ., చెన్నైకి 83 కి.మీ. దూరంలో తిరుత్తణి ఉంది. ఆ నగరాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ బస్సు, రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరుపతి, చెన్నై నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో తిరుత్తణి చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: తమిళనాడుకు ఒక చివర ‘తిరుచందూర్‌’ ఉంటే, మరో చివర ‘తిరుత్తణి’ ఉంది. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఈ ఆలయానికి చేరుకోడానికి 365 మెట్లు ఎక్కాలి. అవి ఏడాదిలోని 365 రోజులకు సంకేతం అంటారు. వల్లి-సుబ్రహ్మణ్యుడు కలుసుకున్న చోటు, వారి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే అభీష్ట సిద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తిరుత్తణికి సుమారు 50 కి.మీ. దూరంలో ‘వల్లిమలై’ ఉంది. వల్లీదేవి స్వస్థలంగా దాన్ని భావిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తులకు పైన ఉండే గొడుగు రుద్రాక్షలతో చేసి ఉండడం విశేషం.

Thursday, 22 November 2018

అరుణాచ‌లం









అరుణాచ‌లం
అగ్ని రూపం నిశ్చల దీపం
నేడు అరుణాచ‌లంలో కార్తీక దీపం


గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం.
‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి.
‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి.
‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. 
అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.


ఏమిటీ అరుణాచలం...
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

మహా దీపం
అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి. ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ భరణి దీపంతోనే..పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ‘కార్తిగై దీపం’గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నేతిని వినియోగిస్తారు. ఈ దీపం పది రోజుల పాటు  వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ,  గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్‌ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.

రమణ సందేశం...
తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌




Wednesday, 21 November 2018

అరుణాచలం!









సర్వపాపహరం
అరుణాచలం!


ఆ పేరు తలిస్తేనే పాపరాశి దగ్ధమవుతుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వర జ్యోతిర్లింగమే అరుణాచలమని విశ్వాసం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువుదీరి ఉన్నాడు. అరుణేశ్వరి, అరుణేశ్వరుల సాన్నిధ్యం సర్వసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వాసం. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడన్నది నమ్మకం.

అరుణాచలాన్నే అణామలై అనీ తిరువణ్ణామలై అనీ అంటారు. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అణామలై అంటే తమిళంలో పెద్దకొండ. ఈ కొండ సాక్షాత్తూ పరమేశ్వర లింగమేనని పెద్దలు చెబుతారు. కార్తిక పౌర్ణమినాడు ఇక్కడ విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ఒక పక్క నుంచి చూస్తే... కొండ నందీశ్వరుడిలా కనిపిస్తుంది. అరుణాచలం మీదనే రమణ మహర్షిలాంటి సిద్దులు తపస్సు చేశారు. గిరిప్రదక్షిణ కోసం రమణాశ్రమం దగ్గరున్న వినాయకుడి గుడి ముందునుంచీ నడక ప్రారంభిస్తారు. ఆ మార్గంలో ఎన్నో తీర్థాలూ, క్షేత్రాలూ. ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి మాసంలోనూ పౌర్ణమినాటి రాత్రి వేలాది భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తారు.

అగ్నిలింగ ఆవిర్భావం
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మవిష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అది ఏనాటికీ తేలలేదు. ఓ రోజున ఒక పెద్ద జ్యోతి స్తంభం రూపంలో వారిముందు అవతరించింది. ఆ జ్యోతి అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి.. ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని అశరీరవాణి పలికింది. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని చూడటానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంస వాహనం ఎక్కి ఆ వెలుగు స్తంభం పైభాగాన్ని దర్శించడానికి బయలుదేరాడు. ఆ స్తంభం తుదీ మొదలూ అటు బ్రహ్మకు కానీ, ఇటు విష్ణుమూర్తికి కానీ అంతుపట్టలేదు. ఇద్దరూ బయలుదేరిన చోటికే వచ్చారు. తామిద్దరిలో ఎవరూ గొప్ప కాదనీ, తేజోమయమైన అగ్నిస్తంభమే గొప్ప అనీ ఆమోదించారు. తమ అహంకారాన్ని నశింప చేసినవాడు తేజోలింగ రూపుడైన శివుడేనని అర్థమైంది. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడున్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడన్నది నమ్మకం.

ఎన్నెన్నో అద్భుతాలు
అరుణాచలం అద్భుతాలకు నిలయం. పరమశివుడి గణాలలో భృంగి ప్రధాన సేవకుడు. భృంగికి శివుడి మీద మాత్రమే భక్తి. అందుకే ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుండేవాడు. ఓ రోజున భృంగి ప్రదక్షిణ చేసే సమయానికి అమ్మవారు, శివుడి ఎడమవైపు అతుక్కొని అర్ధనారీశ్వరిగా ఉన్నారు. భృంగి తేనెటీగ రూపాన్ని ధరించి అమ్మవారికి, అయ్యవారికి మధ్యన దూరిపోయి శివ ప్రదక్షిణను పూర్తి చేశాడు. అందుకు మెచ్చుకున్న శివుడు భృంగికి మోక్షం ఇవ్వబోయాడు.. అమ్మవారు వద్దని వారించారు. ఈ ప్రణయ కలహాన్ని అర్చక స్వాములు ఓ ఉత్సవంగా జరుపుతారు. అరుణాచల గోపురాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు. ఇక్కడున్న ఓ గోపురానికి కిరిగోపురం అని పేరు. దీన్ని భళ్లాల మహారాజు కట్టించినట్లు చెబుతారు. భళ్లాలుడు శివభక్తుడు. గొప్పదాత. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం కలగలేదు.

ఆ రాజును పరీక్షించేందుకు శివుడే స్వయంగా బయల్దేరాడు. కొంతమంది జంగమ దేవరలను వెంటపెట్టుకొని తాను కూడా జంగమయ్య వేషం వేసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. తమకు సేవ చేసేందుకు కొందరు దేవదాసీలు కావాలని రాజును కోరాడు జంగమయ్య. రాజు అలాగే పంపాడు. ఆ జంగమ దేవరలలో మిగిలిన వారికి రాజు పంపిన దాసీలందరూ సరిపోయారు. పెద్ద జంగమయ్యకు మాత్రం ఒక్కరూ మిగల్లేదు. దాంతో రాజు రెండో భార్య తానే దాసీగా వెళ్లింది. ఆమె వెళ్లేసరికి పెద్ద జంగమయ్య నిద్రపోతున్నాడు. ఆయనకు ఫలాలను సమర్పించే ఉద్దేశంతో తాకి లేపింది. రాణి ఆయనను తాకగానే పెద్ద జంగమయ్య పసిబాలుడిలాగా మారిపోయాడు. అప్పుడామె ఆ బిడ్డను ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. రాజు బిడ్డను తాకగానే బిడ్డ అంతర్థానమై పోయింది. రాజు, రాణి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు "ఓ రాజా నీవు బాధపడవద్దు. నేను నీకు కుమారుడిని. నీ మరణానంతరం నీకు అగ్ని సంస్కారాన్ని కూడా నేనే చేస్తాను' అని వరమిచ్చాడు. భళాల రాజు మరణానంతరం శివుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ నాటికి కూడా, రాజు పరమపదించిన రోజున అరుణాచలేశ్వరుడికి ఆ దుర్వార్తను వినిపిస్తారు. ఆ తర్వాత, ఆలయం తలుపులు మూసివేస్తారు. అనంతరం స్వామి భళ్లాల రాజు పాలించిన పళ్లి కొండపట్టు వెళతాడు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి, భళ్లాల రాజుకు ఆబ్దికం పెట్టిస్తారు. ఆ తర్వాత, ఉత్సవమూర్తి తిరిగి ఆలయానికి చేరుకుంటాడు. ఇవన్నీ అయ్యాకే భక్తులకు దర్శన భాగ్యం. ఇలాంటి స్థల పురాణ గాథలు భక్తలోకంలో విశేష ప్రచారంలో ఉన్నాయి.

- శ్రీమల్లి, 7382927069




Friday, 31 August 2018

‘కంచి’ - బంగారు బల్లి








‘కంచి’
బంగారు బల్లి


ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

తమిళనాడులోని కాంచీపురంలో అడుగుపెట్టగానే.. మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72 కిమీలో మీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది.

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ‘కంచి’కి రావల్సిందేనని మన పూర్వికులు చెబుతుండేవారు. అందుకే కాబోలు కథలను ముగించేప్పుడు.. కథ ‘కంచి’కి అనేవారు.

హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి.

‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం. అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు.

ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

కంచి వెళ్లినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు, కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి. వేదంతంగల్ పక్షుల అభయారణ్యం, ఎలగిరి హిల్స్, శ్రీపెరుంబదర్, కంచి పీఠం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి.

‘బంగారు బల్లి’.. కథ!
కంచి కథ ముగించేప్పుడు.. ‘బంగారు బల్లి’ గురించి తెలుసుకోకపోతే కథ కంచికి వెళ్లదు. శరీరం మీద బల్లి పడగానే.. కంచి నుంచి వచ్చినవారిని తాకితే దోషం పోతుందని అంటారు. లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లిని తాకాలని అంటారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. గౌతమ అనే మహర్షికి ఇద్దరు శిష్యుటు ఉండేవారు. ఒక రోజు వారిద్దరు నది నుంచి కుండతో నీరు తీసుకొస్తారు. అయితే, ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించారు. మహర్షి ఆ బల్లిని చూసి.. ఇద్దరిని బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. శపవిముక్తి కోసం ప్రార్థించగా.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతాడు. దీంతో పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్లకు వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వారిద్దరూ సూర్య, చంద్రుల ప్రతిరూపాలుగా బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా భక్తులకు దోషనివారణ చేయాలని ఆదేశిస్తాడు. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.



Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..






వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

అరుణాచలేశ్వరుడు






అగ్నిలింగాకారంలో కనిపించే అరుణాచలేశ్వరుడు!
పంచభూతాల్లో అగ్నిలింగం
ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించే గిరి ప్రదక్షిణం
పాపాలు హరించే శివపుణ్యక్షేత్రం


భరతఖండం వేదభూమి. లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువైవున్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలం. గాలి, నీరు, భూమి, వాయువు, అగ్ని అనే పంచభూతాల్లో ఒకటి. ప్రకృతిలో మమేకమై పరమాత్మునితత్వం ఉట్టిపడేలా వెలసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. ఈ పేరు మదిలో తలంపుకు రాగానే మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తుంది. ప్రతి యేటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అణువణువునూ శివతేజంతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అంతేనా.. అరుణాచలం అనగానే రమణమహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రం తిరువణ్ణామలై. అలాంటి అరుణాచలేశ్వరుని గురించి ప్రత్యేక కథనం.

చరిత్ర పుటలను తిరగేస్తే...
దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములు హరించునది అనే అర్థం కూడా వస్తుంది. తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అణ్ణామలై అనగా పెద్దకొండ అని అర్థం. ఇక్కడ కొలువైవున్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేదాలు, పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వరకాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు.

శివాజ్ఞ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయం...
అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురము నిర్మించబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా ఈ ఆలయంలో జరిగే పూజాపునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కందపురాణంలోని అరుణాచలేశ్వర మహాత్మ్యంలో ఉంది. ఈ జ్యోతిర్లిగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9, 10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళ రాజుల శాసనాలు చెపుతున్నాయి. తిరువణ్ణామలై పల్లవులు, చోళులు, విజయనగరరాజులు, కన్నడ రాజులు, టిప్పుసుల్తాన్‌ ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల ఏలుబడిలో వుంది.. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడటానికి రెండు నేత్రాలు చాలవు. వీటిని పోటీపడి మరీ నిర్మించారా అనిపిస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది ఒకటి.

పంచభూత క్షేత్రాల్లో ఒకటి
పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూతస్థలాల్లో అరుణాచలం ఒకటి. అన్నామలేశ్వరుడు(అగ్ని) కనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకాంబరేశ్వర ఆలయం (పృథ్వీలింగం - భూమి), జంబుకేశ్వరుడు (జలలింగం - నీరు), కాళహస్తీర్వుడు (వాయులింగం - గాలి), చిదంబరేశ్వరుడు (ఆకాశలింగం - ఆకాశం). దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు.

గిరిప్రదక్షిణం కాదు.. సాక్షాత్‌ శివప్రదక్షిణం
ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్‌ జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తే సాక్షాత్‌ ఆ శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం. రమణ మహర్షి ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. పాదచారులై శివనామ స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే గిరిప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కొండలపై ఉండే మహాఔషధ మొక్కల ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. దీన్నే గిరివాలం అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాపవిముక్తులవుతారని, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలచుకుంటే అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తులు భావిస్తారు. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్‌ ఆఫ్‌ ఎర్త్‌ (భూహృదయం)గా అభివర్ణించారు. స్కందపురాణంలో అన్నికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని పేర్కొన్నారు.

అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు..
అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువణ్ణామలై శాశ్వతమైన శాంతినొసగే ప్రశాంతభూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణాచలేశ్వరుడు కొలువైవున్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చటి చెట్లతో చుట్టూత కొండలతో అణువణువునా ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్ని కొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్ర కొండ అని, కలియుగంలో రాతి కొండ అనే పేర్లు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండని తేజో లింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు. కొండ చుట్టూ ఎనిమిది లింగాలు, ఎనిమిది నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. ఎనిమిది లింగాలు అంటే ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం (ఈ లింగంపై ప్రజలు నాణేలు వేస్తారు), ఈశాన్య లింగం అనే పేర్లు ఉన్నాయి.

యేడాదిలో 4 బ్రహ్మోత్సవాలు
ఈ క్షేత్రంలో ఒక యేడాదిలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీక మాసం (నవంబరు, డిసెంబరు)లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాగే, ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్రపౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఎలా వెళ్ళాలి...
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది. అలాగే, రమణాశ్రమంలో కూడా గదులు అద్దెకు ఇస్తారు. అయితే, ఇక్కడ గదులను ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు.





Thursday, 15 March 2018

శ్రీరంగం - పెరియ కోయిల్‌





పెరియ కోయిల్‌.. శ్రీరంగం

పాలకడలి నుంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం. సమున్నత గోపురాలతో, విశాల ప్రాకారాలతో, శ్రీరంగనాధుని నామస్మరణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది. 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొనివుంది. కోయిల్‌ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు. శ్రీరంగాన్ని పెరియకోయిల్‌ అని కూడా అంటారు. దీనర్థం పెద్ద దేవాలయం అని. శ్రీరంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం అంటారు. కంబోడియాలోని అంగ్‌కార్‌వాట్‌ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అయితే అది పర్యాటక స్థలం మాత్రమే. దీంతో నిత్యం పూజలందుకుంటున్న క్షేత్రాల్లో శ్రీరంగమే పెద్దది. శ్రీరంగనాథుడిని దర్శించినంతనే మనకు సాక్షాత్తు ఆ శేషసాయిని దర్శించున్న దివ్యానుభూతి కలుగుతుంది. వేల సంవత్సరాలుగా కోట్లాది భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్న శ్రీరంగ పుణ్యక్షేత్ర సందర్శన మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది.

విభీషణుడికి రాముడు ఇచ్చిన విగ్రహం..
సీతా అపహరణం తరువాత అగ్రజుడైన రావణుడికి అతని సోదరుడు విభీషణుడు పలు హితవచనాలు చెబుతాడు. స్త్రీలను అపహరించడం తగదనిహితవు పలుకుతాడు. అయితే రావణుడు ఈ మాటలను పెడచెవిన పెడ్తాడు. దీంతో విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతాడు. రావణ వధ అనంతరం విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రంగనాధుడి విగ్రహాన్ని అతనికిస్తాడు. లంకకు వెళ్లే సమయంలో ఎక్కడా నేల మీద వుంచకూడదని షరతు విధిస్తాడు. లంకకు వెళుతున్న విభీషణుడు కావేరి దాని ఉపనది మధ్యలో వున్న ద్వీపంలో కాసేపు విశ్రమించేందుకు భూమిపై విగ్రహాన్ని వుంచుతాడు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా విగ్రహం రాలేదు. ఆ ప్రదేశాన్ని పాలించిన ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చుతాడు. స్వామివారు కూడా అక్కడే వుండేందుకు ఇష్టపడటంతో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కునకు తిరుగుతారు.

శయనమూర్తి..ప్రధాన ఆలయంలో స్వామివారు శయనమూర్తిగా వుంటారు. క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు అదే భంగిమలో ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడం విశేషం. మహావిష్ణువు నాభినుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడరు. దీనర్థం సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని క్షేత్రగాధ వెల్లడిస్తోంది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీరామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు వుండి స్వామిసేవలో పాల్గొన్నారు. భాష్యాకార్లకు ప్రత్యేకమైన మందిరం వుంది.

లౌకికవాదానికి ప్రతీక..దిల్లీ సుల్తాన్‌ కాలంలో ఇక్కడ మూర్తిని దిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది. అక్కడ సుల్తాన్‌ కుమార్తె స్వామిభక్తురాలిగా మారింది. అనంతరం ఆ విగ్రహాన్ని శ్రీరామానుజాచార్యుల వారు శ్రీరంగానికి తీసుకువస్తారు. సుల్తాన్‌ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైంది. ఇప్పటికీ ఆ ఘటనకు ప్రతీకగా పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధారణలో కనిపిస్తారు. నివేదనగా రోటీని సమర్పిస్తారు.

ఏడు ప్రాకారాలు..శ్రీరంగనాధుని ఆలయంలో మొత్తం ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు వున్నాయి. ఒక్కో ప్రాకారంలో పలు ఆలయాలు నెలకొనివున్నాయి. శ్రీరంగనాధునికి ఏడాదిలో మూడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చిత్తిరై (ఏప్రిల్‌-మే), తాయ్‌ (జనవరి-ఫిబ్రవరి), పంగుణి (మార్చి-ఏప్రిల్‌) ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అనుంగుభక్తుడు గరుడాళ్వర్‌కు ప్రత్యేకమైన మందిరం వుంది. సాగరమథనం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడు ధన్వంతరికి కూడా ఒక మందిరం వుండటం విశేషం. మాతృమూర్తి రంగనాయకి తాయర్‌తో పాటు శ్రీదేవి, భూదేవిలు కూడా ఆలయంలో భక్తులను ఆశీర్వదిస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు..* శ్రీరంగం సమీపంలోని రైల్వేస్టేషన్‌ తిరుచినాపల్లి. ఇక్కడ నుంచి శ్రీరంగం 9 కి.మీ. దూరంలో ఉంది.
* దేశంలోని పలుప్రాంతాల నుంచి శ్రీరంగానికి రహదారి సౌకర్యముంది.
* తిరుచినాపల్లి విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా శ్రీరంగం చేరుకోవచ్చు.



Monday, 5 February 2018

పంచభూతలింగాలు





పంచభూతలింగాలు 

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచభూతలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

  1. పృథ్విలింగం:
    ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
  2. ఆకాశలింగం:
    ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
  3. జలలింగం:
    ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
  4. తేజోలింగం:
    తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
  5. వాయులింగం:
    ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

Wednesday, 17 January 2018

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం






స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం

గతంలో 'కేప్ కొమరిన్'గా ఖ్యాతి చెందిన కన్యాకుమారి తమిళనాడులో కలదు. ఈ పట్టణం ఇండియాకు దక్షిణ భూభాగా దిశలో కోనలో వుంది. కన్యాకుమారి ప్రాంతంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. దీనికి వాయువ్యం మరియు పడమరలో కేరళ రాష్ట్రం వుంటుంది. ఉత్తరం వైపు మరియు తూర్పున తిరునల్వేలి జిల్లా వుంటుంది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 85 కి.మీ. ల దూరంలో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. టెంపుల్స్ మరియు బీచ్ లు - కన్యాకుమారిలోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతిని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారిలో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే, అవి వివేకానంద రాక్ మెమోరియల్, వత్తకోట్టై ఫోర్ట్, పద్మనాభపురం పలద్సు, తిరువల్లువార్ విగ్రహం, వవతురాయి, ఉదయగిరి ఫోర్ట్ మరియు గాంధీ మ్యూజియం.

టవున్ లోని ప్రసిద్ధ ప్రదేశాలలో కన్యాకుమారి టెంపుల్, చితరాల్ హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు , నాగరాజా టెంపుల్, సుబ్రమణ్య టెంపుల్ మరియు తిరునందికరాయి కేవ్ టెంపుల్ కలవు. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

కేప్ కొమరిన్ చరిత్ర. కన్యాకుమారి మతానికి మరియు కాలాలకు ప్రధాన కేంద్రాలే కాదు, ఇది వర్తక వ్యాపారాలకు కూడా గత కొన్ని శతాబ్దాల నుండి ప్రసిద్ధి. ఈ టవున్ ను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. వాటిలో పాండ్యులు, చొళులు, నాయక లు, చేరాలు ప్రధానమైనవి. కన్యాకుమారి టెంపుల్స్ యొక్క శిల్ప సంపద చూసిన వారికి ఈ ప్రాంత కాలాలకు, నాగరికతకు నిదర్శనాలు గా చెప్పవచ్చు.

ఈ టవున్ వేనాడ్ వంశ పాలనకు వచ్చే సమయానికి ఈ టవున్ రాజధాని పద్మనాభపురం లో కలదు. 1729 నుండి 1758 వరకు , పాలించిన అనిజం తిరునల్ మార్తాండ వర్మ అంటే వేనాడ్ చక్రవర్తి ట్రావెన్ కూర్ ను స్థాపించాడు. దానితో ఈ ప్రాంతం కన్యాకుమారి జిల్లా కిందకు వచ్చింది. సౌత్ ట్రావెన్ కూర్ గా ప్రసిద్ధి చెందింది.

పరావర్ రాజుల పాలన తర్వాత ఈ పట్టణం ట్రావెన్ కూర్ రాజులు చే బ్రిటిష్ అధీనం లో 1947 లో స్వాన్తంత్రం వచ్చే వరకూ పాలించా బడింది. 1947 లో ట్రావెన్ కూర్ ఇండియన్ యూనియన్ లో స్వ పరిపాలన కింద కలదు. ఈ పాలన ట్రావెన్ కూర్ రాజులు చేసారు.

కాల గమనంలో స్త్రీశక్తిస్వరూపిణి వినాయకుని పూర్తిగా మర్చిపోతున్నారు. వినాయకుడికి స్త్రీరూపం వుందని కూడా తెలియనివారు ఎంతోమంది వున్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కరలేదు. హిందూ పురాణాల్లోనే వినాయకప్రస్తావన తక్కువగా వున్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లున్నాయి.

ప్రముఖ పరిశోధకుడు బాలాజ్ ముండకుర్ రాసిన పుస్తకం ప్రకారం వినాయకుడికి వైనాయకి, గణేశుని, గజానుని, విజ్ఞేశుని, గజరూప అనే పేర్లున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపదనెలలో వినాయకుని పుట్టినరోజొస్తుంది.

సహజంగా ఆగస్టునెలలో వచ్చిన వినాయకుడు పుట్టినరోజు నాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించటంవల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువులవిశ్వాసం. విఘ్నాలు తొలగిపోటానికి స్త్రీరూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీలేవుగాని ప్రతి నెలలో వచ్చే నెలవంక 4వ రోజున వినాయకచతుర్ధిపేరిట మహిళలుప్రత్యేకపూజలు చేసేవారనటానికి ఆధారాలు వున్నాయి.

ఎక్కడవుంది?
తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా తనుమలయన్ ఆలయంలో వినాయకవిగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే వున్నాయి. ఇందులో ఓవిగ్రహం సుఖాసనంలో కూర్చునుంది. 4చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమచేతిలో గొడ్డలి,కింది ఎడమచేతిలో శంఖంపట్టుకుని వుంది.

అలాగే కుడివైపున పైచేతిలో కలశం, మరో చేతిలో దండముంది.ఆ పక్కనే మరోవిగ్రహంలో వినాయకవిగ్రహం నిలబడివుంది.దానికి 2చేతులేవున్నప్పటికీవిరిగిపోయి వున్నాయి. 1300యేళ్ళక్రితంనాటి ఈ ఆలయంలో వినాయకుని విగ్రహాలకు ప్రత్యేకతలు వున్నాయని,రిటైర్డ్ పురాతత్వశాస్త్రవేత్త శ్రీశాంతలింగం చెప్పారు.

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకునివిగ్రహాలు కనిపిస్తాయని మరే ఆలయంలో ఈశాన్యదిశలో ఇలా విగ్రహాలు వుండవని ఆయన వివరించారు.క్రీ.శ.550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకప్రస్తావన వుంది.

శివుడి అవతారంగా పేర్కొన్న 200మంది దేవతలపేర్లలో వినాయకునిపేరునిపేర్కొన్నారు. హిందూపురాణాలపై పలుపుస్తకాలు రాసిన దేవదత్ పట్నాయక్ కూడా వినాయకప్రస్తావన తీసుకొచ్చారు.ఆయన కధనంప్రకారం అంధకఅనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు.

ఈ విషయాన్ని పార్వతిశంకరుడికి పిర్యాదుచేయటంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షసుడి ఒక్కరక్తం చుక్కకూడా నేలరాలకూడదు. అలా రాలిన చుక్కలనుంచి మళ్ళీప్రాణంపోసుకునే వరం ఆ రాక్షసుడికుంది.

అందుకే పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మశక్తి అయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తిఅయిన ఇంద్రాణితోపాటు వినాయకుని సహాయం చేయవలసినదిగా ప్రార్ధిస్తుంది. అప్పుడు వీరందరూ ఆ రాక్షసుడిరక్తాన్ని,నేలరాలకుండానే గాలిలో వుండగానే తాగేస్తారు.

రాజస్థాన్ లోని రైరావ్, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికి వినాయకవిగ్రహాలున్నాయి. ముందుగా జానకిశ్రీనివాసన్ వినాయకవిగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్,చేయగా వాటిని అనేకమంది షేర్ చేసుకోవటంతో పాటు వాటిని తమప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికివున్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్తసోధనలో మరిన్ని వినాయకివిగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటి వి, సంఖాలు, మరియు చిన్న మోమెంతో లు దొరుకుతాయి.

హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి. అందమన ఈ కెన్ మరియు వెదురు, చెక్క ఉత్పత్తులు ఇంటి అలంకరణకు లేదా ఫ్రెండ్స్ లేదా బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బాగుంటాయి. సి షెల్ల్స్ తో చేయబడిన కొన్ని నగలు రంగుల సముద్ర ఇసుక వంటివి కూడా షాపింగ్ లిస్టు లో చేర్చవచ్చు.

సిటీ లో ప్రసిద్ధ షాపులు అంటే తమిళ్ నాడు కో ఆప టెక్స్ సేల్స్ ఎంపోరియం మరియు తమిళ్ నాడు క్రాఫ్ట్స్ అండ్ పూమ్పుహార్ లు. ఇక్కడ వివిధ టెక్స్ టైల్స్ మరియు హంది క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. రోడ్ల పై అమ్మే వస్తువులు సరసమైన ధరలలో వుంటాయి. రుచి కర ఆహారాలు సి ఫుడ్ లు కన్యాకుమారి స్థానికులకు ప్రసిద్ధి.

ఈ ఆహారం అధిక మసాలా , కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే కొద్దిపాటి రెస్ట రెంట్లు కూడా కలవు.

కన్యాకుమారి ఎలా చేరాలి ?
సిటీకి సమీప ఎయిర్ పోర్ట్ తిరువనంతపురంలో కలదు. ఎయిర్ పోర్ట్ లో దిగి టాక్సీ లేదా బస్సు లేదా ట్రైన్ లో కన్యాకుమారి చేరవచ్చు. కన్యాకుమారి టవున్ లో ఆటో రిక్షాలు లేదా బస్సులలో ప్రయాణించవచ్చు. లేదా ప్రైవేటు టాక్సీ కూడా అద్దెకు తీసుకోవచ్చు.

రోడ్డు ప్రయాణం
కన్యాకుమారికి రోడ్డు మార్గాలు బాగానే వుంటాయి. పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలనుండి బస్సు లు కన్యాకుమారి కి కలవు.

రైలు ప్రయాణం
పర్యాటకులు కన్యాకుమారికి రైలు లో చేరవచ్చు. ఇక్కడకు సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు వివిధ ప్రదేశాలనుండి చేరతాయి.

విమాన ప్రయాణం
కన్యాకుమారి విమాన ప్రయాణంలో చేరాలంటే, సమీప ఎయిర్ పోర్ట్ 89 కి.మీ.ల దూరంలో తిరువనంతపురంలో కలదు. ఇక్కడ నుండి కన్యాకుమారికి ఇంటర్నేషనల్ మరియు స్థానిక విమానాలు నడుస్తాయి.

ఉత్తమ సమయం
సంవత్సరం పొడవునా నగర వాతావరణం ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలంలో అయినా సరే పర్యటించవచ్చు. అయితే ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు సూచించ వచ్చు.

Sunday, 6 August 2017

జంబుకేశ్వర క్షేత్రం










ప్రకృతి సౌందర్యానికి రమణీయతకు
జంబుకేశ్వర క్షేత్రం


శివుడి పంచభూతలింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ఈ జంబుకేశ్వరం సహజ ప్రకృతి సౌందర్యంతో శోభిల్లే రమణీయ ప్రదేశం. కావేరిని తమిళంలో పొన్ని అని కూడా పిలుస్తారు. పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. జంబుకేశ్వర స్వామివారు భక్తవత్సలుడిగా పేరు పొందిన బోళాశంకరుడు.

చిత్తశుద్ధితో ప్రార్థిస్తే చాలు, కష్టనష్టాలన్నింటినీ చిటికలో తొలగించి, సకల సంపదలూ ప్రసాదిస్తాడని భక్తులు ప్రస్తుతిస్తుంటారు. పవిత్రమైన ఈ శ్రావణమాసంలో శైవ క్షేత్రాలను సందర్శించడం, అభిషేకాలు, అర్చనలు చేయడం ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను అనంతర కాలంలో పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు చేపట్టినట్లు చారిత్రక కథనాలను బట్టి తెలుస్తోంది. జంబుకేశ్వర క్షేత్రానికి తిరువానైకవర్‌ అనే పేరు కూడా ఉంది.

పేరెలా వచ్చింది
జంబూ అంటే తెల్లనేరేడు అని అర్థం. ఇక్కడ తెల్లనేరేడు చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం శంభుడనే రుషి ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివుని ప్రత్యక్షంగా దర్శించుకుని పూజించాలని శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ‘‘నేను ఇక్కడ లింగరూపంలో కొలువుదీరతాను. నువ్వు ఇదే ప్రదేశంలో జంబూవృక్షరూపంలో ఉండి నన్ను సేవించుకుంటూ ఉందువుగానీ’’ అని వరమిచ్చాడు. ఇలా ఆ ముని ఇప్పటికీ జంబూవృక్షరూపంలో ఆలయ ప్రాంగణంలో ఉండి శివుణ్ణి, శివభక్తులను దర్శించుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ స్వామివారు జలరూపంలో ఉండరు. సానవట్టం నుంచి స్వామిని అభిషేకిస్తున్నట్లుగా నీరు ఊరుతూనే ఉంటుంది. పానవట్టం చుట్టూ అర్చకులు వస్త్రాన్ని కప్పుతారు. మళ్లీ అందులోకి నీరు ఊరుతుంటుంది. ఈ వస్త్రాన్నే పిండి, అర్చకులు భక్తులకు తీర్థంగా సమర్పిస్తుంటారు.

అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో, తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. నాలుగవ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతతో చూడముచ్చట గొలుపుతుంటుంది. అత్యద్భుతమైన ఈ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడికోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీ యంత్రం
సాక్షాత్తూ శంకరుని అవతారంగా ప్రస్తుతించే జగద్గురు ఆదిశంకరులవారు జంబుకేశ్వరుని సన్నిధిలో అత్యంత శక్తిమంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, క్షేత్రానికి ఆకర్షణ శక్తిని పెంపొందించినట్లు, అఖిలాండేశ్వరిగా, జగన్మాతగా పేరు గాంచిన ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రాంకితమైన రెండు కర్ణాభరణాలను సమర్పించుకున్నట్లు ఐతిహ్యం. అమ్మవారి మందిరంలో గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి ముద్దులపట్టి, విఘ్నాలకు రాజయిన వినాయకుని మూర్తిని కూడా శంకరులే ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

నిత్యకల్యాణ దంపతులు
ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు. ఈ ఆలయం ఆవరణలోని పలు ముఖ్య ఆలయాలేగాక చుట్టుపక్కల వినాయక, సుబ్రహ్మణ్య, ఇతర శివదేవ పరివార ఆలయాలు, స్వామి భక్తులైన నందరార్, తిరునావుక్కరుసు, మానిక వాసగర్, సంబంధార్‌ తదితర నాయనారుల ఉపాలయాలు కూడా సందర్శనీయమైనవి. తిరుచ్చి సమీపంలోనే కలియుగ వైకుంఠమైన శ్రీరంగం ఉంది.

ఎలా వెళ్లాలంటే..?
చెన్నై నుంచి జంబుకేశ్వరానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి.

డి.వి.ఆర్‌.భాస్కర్‌

Wednesday, 15 March 2017

బృహదీశ్వరాలయం





వేయి సంవత్సరాల ఆ గుడిలో మిస్టరి వింతలే

అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరితో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడి చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు.

13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు వేయు సంవత్సరాల క్రితం కట్టిన గుడి. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం, దక్షిణ కాశీగా పెరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ లింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది .

పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగియండును. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏక శిలా విగ్రహం 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు 2.5 మిటర్ల వెడల్పు కలిగియండును. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని, సిమెంట్ కాని వాడ లేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టారు.

80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం. ఈ గుడికే హైలెట్. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఇక మిట్ట మథ్యాహన సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నులు బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటమనెది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.

ఆ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు ముసేశారు.

ఆ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు.

అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలతో 6 మీ.మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే.

ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది.



తంజావూరు విశేషాలు
తంజావూరు దక్షిణ తమిళనాడులోని ప్రాచీన పట్టణం. కావేరి నదీ తీరాన వున్న ఈ పట్టణం ముఖ్యంగా బృహదీశ్వరాలయం వల్ల ప్రఖ్యాతి గాంచింది. రాజరాజచోళుడు కట్టించిన ఈ ఆలయం యునెస్కొ వారి వారసత్వ సంపదల్లో ఒకటి.ఈ ఆలయంలో అతి భారీ శివలింగం మనం చూడవచ్చు. గుడి కెదురుగా భారి నందిని మనకు దర్శనమిస్తుంది.గుడిలొనికి వెళ్ళే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు తప్పక చూడవలిసిందే.గుడి దోపురం పెద్దగా ఉండటమే కాకుండా ఆ గోపురం మొన నీడ కింద పడకుండా కట్టటం దీని ప్రత్యేకత.ఒక శివరాత్రికి అక్కడికి వెళ్ళాం.అంత పెద్ద లింగానికి అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఇక్కడికి మనవాళ్ళే కాకుండా విదేశీయులు ఎక్కువగా వస్తారు.గుడిలో ఒక చెట్టు వుంటుంది.ఆ చెట్టుపై మూడు బల్లులని లెక్కపెట్టి మన కోరికలు కోరుకుంటే తెరతాయని అంటారు. ఆలయం తరవాత చూడవలసింది కోట.తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియం లో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు.అందులో మనం కుర్చోవచ్చు.ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.
తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.

తంజావూరు విశేషాలు

తంజావూరు దక్షిణ తమిళనాడులోని ప్రాచీన పట్టణం. కావేరి నదీ తీరాన వున్న ఈ పట్టణం ముఖ్యంగా బృహదీశ్వరాలయం వల్ల ప్రఖ్యాతి గాంచింది.నేను పుదుకొట్టైలో పిజి చేసేటప్పుడు మూడు సార్లు ఇక్కడికి వెళ్ళాను.

రాజరాజచోళుడు కట్టించిన ఈ ఆలయం యునెస్కొ వారి వారసత్వ సంపదల్లో ఒకటి.ఈ ఆలయంలో అతి భారీ శివలింగం మనం చూడవచ్చు. గుడి కెదురుగా భారి నందిని మనకు దర్శనమిస్తుంది.గుడిలొనికి వెళ్ళే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు తప్పక చూడవలిసిందే.గుడి దోపురం పెద్దగా ఉండటమే కాకుండా ఆ గోపురం మొన నీడ కింద పడకుండా కట్టటం దీని ప్రత్యేకత.ఒక శివరాత్రికి అక్కడికి వెళ్ళాం.అంత పెద్ద లింగానికి అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఇక్కడికి మనవాళ్ళే కాకుండా విదేశీయులు ఎక్కువగా వస్తారు.గుడిలో ఒక చెట్టు వుంటుంది.ఆ చెట్టుపై మూడు బల్లులని లెక్కపెట్టి మన కోరికలు కోరుకుంటే తెరతాయని అంటారు.

ఆలయం తరవాత చూడవలసింది కోట.తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియం లో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు.అందులో మనం కుర్చోవచ్చు.ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.

తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.






Monday, 13 February 2017

మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

‘‘అడుగడుగునా ఆలయాలకు నెలవైన కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు సంబంధించిన ఆలయాలూ, 108 దివ్యదేశాలల్లోని కొన్ని వైష్ణవ క్షేత్రాలూ కూడా కొలువై ఉన్నాయి. నెల రోజులు పర్యటించినా వీటన్నింటీనీ సందర్శించడం సాధ్యం కాదు. కానీ ఓ ప్రణాళిక ప్రకారం కేవలం 3 రోజుల్లో 40 ఆలయాలు చూడగలిగాం.’’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొచ్చారు M.సరోజని గారు .

తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఈసారి కుంభకోణం చూడాలనుకుని బయలుదేరాం. అందుకే మూడురోజుల్లో వీలయినన్ని ఎక్కువ దేవాలయాలు సందర్శించాలనుకున్నాం. తమిళనాడు దేవాలయాలకు సంబంధించిన ఓ బ్లాగులోని మిత్రుడి సలహాసూచనల సాయంతో తిరుచ్చి నుంచి రైల్లో కుంభకోణం చేరుకున్నాం.

ఆజ్ఞా గణపతి!
ప్రతిరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు టాక్సీలో బయలుదేరి, తిరిగి ఆలయాలు మూసివేసే వరకూ పర్యటిస్తూ మూడురోజుల్లో దాదాపు 40 ఆలయాలు దర్శించాం. మొదటిరోజు కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడిలోని గురుగ్రహక్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఇక్కడి ఆలయంలో ఆపత్సహాయేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అనంతరం తిరుభువనంలో కంబహరేశ్వర, శరభేశ్వర స్వాములను దర్శించుకుని సమీపంలోని గోవిందపురం చేరుకున్నాం. విఠల్‌దాస్‌జీ మహారాజ్‌ మహారాష్ట్ర శైలిలో నిర్మింపజేసిన ఇక్కడి మందిరంలో పాండురంగడిని దర్శనం చేసుకున్నాం. కృష్ణాష్టమి వేడుకలకు అలంకారాలతో ఉన్న ఆ దివ్యమూర్తులను తిలకించి మైమరిచిపోయాం. అక్కడికి దగ్గరలోనే ఉన్న తిరువిడైమరుదూర్‌ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో 20 అడుగుల నందీశ్వరుడి విగ్రహాన్ని చూశాం. ఈ ఆలయంలో కొలువైన మహాలింగేశ్వర స్వామిని మధ్యార్జునేశ్వరుడుగా కూడా పేర్కొంటారు. ఇదే ప్రాంగణంలోని విఘ్నేశ్వరుని ఆజ్ఞాగణపతిగా అర్చిస్తారు.

ఉప్పులేని ప్రసాదం!
అక్కడి నుంచి అయ్యావాడి వెళ్లి ప్రత్యంగిరాదేవిని పూజించాం. సమీపంలోనే ఉప్పిలిఅప్పన్‌ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుతీరిన నారాయణుడికి ఉప్పులేని ప్రసాదాన్ని నివేదించడం విశేషం. తరవాత రాహు గ్రహ క్షేత్రమైన తిరు నాగేశ్వరం చేరుకుని, నాగేశనాథుడిని దర్శించుకున్నాం. దారి పొడవునా పచ్చటి అరటితోటలు కనువిందు చేస్తుండగా తింగలూరు చేరుకున్నాం. అక్కడ ఉన్న చంద్రగ్రహ క్షేత్రంలో పెరియనాయకి అమ్మవారిని అర్చించి, కావేరీతీరానగల తిరువయ్యారుకి చేరుకున్నాం. వాగ్గేయకారుడు సద్గురు త్యాగరాజస్వామి సమాధిని దర్శించి, ఆయన అర్చించిన శ్రీరామ పంచాయతనాన్ని చూశాం. ఆ సాయంకాలం అక్కడి ప్రశాంత వాతావరణంలో మైకులో ఏసుదాసు ఆలపించిన త్యాగరాజ కీర్తన వింటుంటే మనసంతా ఆధ్యాత్మిక చింతనతో నిండిపోయింది.తరవాత అక్కడ నుంచి ఆ వూరిలోనే ఉన్న సుప్రసిద్ధ పంచనదీశ్వర ఆలయానికి వెళ్లాం. ఇక్కడి కుడ్యచిత్రాలు చూసి తీరాల్సిందే. స్వామి ప్రదోష హారతిని కనులారా దర్శించుకొని, కపిస్థలం చేరుకున్నాం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి మాత్రమే కాదు. పంచ కృష్ణ క్షేత్రాల్లో ఒకటని అక్కడి అర్చకుడు తెలిపాడు. ఇక్కడ గజేంద్ర వరదరాజ స్వామిని ఆదిమూలం అని కూడా వ్యవహరిస్తారట. ఇక్కడికి సమీపంలోనే పాపనాశ క్షేత్రం ఉంది. రావణ సంహార పాపప్రక్షాళనార్థం ఇక్కడి రామలింగేశ్వరుడిని శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ప్రదోష హారతిని చూసే భాగ్యం కలిగింది. ఇక్కడినుంచి తిరుకరవూరులోని గర్భరక్షాంబికాదేవి ఆలయానికి వెళ్లాం. గర్భిణులు ఈ అమ్మవారిని సేవిస్తే సుఖప్రసవమై చక్కటి బిడ్డకు జన్మనిస్తారని భక్తుల విశ్వాసం. ప్రసవానంతరం బిడ్డలతో వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్న జంటలు చాలానే కనిపిస్తాయక్కడ. సంతానంలేని వాళ్లు కూడా ఇక్కడి అమ్మవారికి మొక్కుకుంటుంటారట.

తరవాత వేదనారాయణస్వామి కొలువైన వూత్తుకాడు వైష్ణవ క్షేత్రానికి వెళ్లాం. అక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు చేస్తారని అర్చకులు తెలిపారు. వాగ్గేయకారుడైన వూత్తుకాడు వేంకటకవి గానానికి పరవశించిన బాలకృష్ణుడు ఈ ఆలయ ప్రాంగణంలో నర్తించేవాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకుని పట్టీశ్వరంలోని దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నాం. అమ్మవారు శాంతమూర్తిగా చేతిపై చిలుకతో దర్శనమిస్తుంది. రాహు, నవగ్రహ పరిహార పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి.

ఉప్పు ప్రసాదం!
రెండోరోజున కుంభకోణం సమీపంలోనే ఉన్న సూర్య భగవానుడి ఆలయాన్నీ, కంజనూరులోని శుక్రుడి ఆలయాన్నీ దర్శించి వైదీశ్వరన్‌ చేరుకున్నాం. ఇక్కడి స్వామి వైద్యనాథుడు. కుజగ్రహ క్షేత్రమైన ఈ ఆలయంలో కుజ దోష పరిహార పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి భక్తులు ఉప్పు, బెల్లం, మిరియాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాడీ జ్యోతిషానికి కూడా ఈ వూరు ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి బుధ గ్రహ క్షేత్రం తిరువేంగడుకు చేరుకున్నాం. ఆ ఆలయ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ శ్వేతారణ్యేశ్వర స్వామి, బ్రహ్మ విద్యాంబిక, నటరాజస్వామి, అఘోరమూర్తి, శ్వేతకాళి కొలువై ఉన్నారు. వీటిలో ఓ ఆలయ నిర్మాణం కేరళను గుర్తుతెస్తుంది. ఇక్కడి రెండు తటాకాలకు సూర్యచంద్రుల పేర్లు ఉండటం విశేషం.

షష్టిపూర్తి ఉత్సవ వేదిక!
అనంతరం కేతు గ్రహ క్షేత్రమైన కీలపెరుంబళంలో నాగనాథ స్వామినీ సౌందర్యనాయకి అమ్మవారినీ అర్చించి, తిరుక్కడయూర్‌ చేరుకున్నాం. భక్త మార్కండేయునికి పరమశివుడు వరం అనుగ్రహించిన క్షేత్రంగా తిరుక్కడయూర్‌ పేరొందింది. ఇక్కడ స్వామి సుందరేశ్వరుడు. అభిరామి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తాడు. వీరి సన్నిధిలో షష్టిపూర్తి ఉత్సవాలు చేసుకోవడం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తారు. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు వృద్ధ దంపతులకు వారి బంధువులు ఇక్కడ షష్టి పూర్తి వేడుక నిర్వహించడం చూశాం.

పట్టుదారాల దారాసురం!
ఇక శనీశ్వర క్షేత్రమైన తిరునల్లారు శనిదోష నివారణ పూజలకు పేరు. ఇక్కడ దర్భారణ్యేశ్వర స్వామిని సేవించుకొని దారాసురం చేరుకున్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. శిల్పకళాశోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజచోళుడు నిర్మించాడు. ఇక్కడి ఐరావతేశ్వరుని దర్శించి, ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ కుడ్య చిత్రాలనూ ఆసాంతం తిలకించాం. అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోయాం. అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూశాం.

దారాసురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేకపోయాం. అక్కడి నుంచి నాచ్చియార్‌ కోయిల్‌ వెళ్లి శ్రీనివాసుడు, తాయారులతోపాటు గర్భాలయంలో కొలువైన అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు, బలరాముడు, బ్రహ్మమూర్తులను దర్శించాం.

శ్వేత గణపతి!
మూడోరోజు కుంభకోణంలోని ప్రసిద్ధ ఆలయాలతోపాటు చుట్టుపక్కల మరికొన్ని పురాతన దేవాలయాలను దర్శించాం. ముందుగా కుంభకోణం క్షేత్రానికి ఆ పేరు తెచ్చిన ఆది కుంభేశ్వర స్వామినీ మంగళాంబికనూ దర్శించుకున్నాం. తెలుగులో కుంభకోణం అనే పదానికి మరో అర్థముంది. కానీ స్థల పురాణం ప్రకారం కుంభకోణం అనేది ఎంతో ప్రాశస్త్యమైనది. ప్రళయానంతరం సృష్టి పునరుజ్జీవనానికై సర్వేశ్వరుడు జీవాన్ని ఓ కుంభంలో దాచిన క్షేత్రం ఇదేననీ, సృష్టి తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభమైందనీ చెబుతారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన సుప్రసిద్ధ సారంగపాణి ఆలయానికి వెళ్లాం. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 170 అడుగులు. మహాలక్ష్మిని వివాహమాడేందుకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, అశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి సారంగపాణిగా ఇక్కడ అవతరించాడట. గర్భాలయం కూడా రథాకృతిలోనే ఉండటం విశేషం. స్వామి ఇక్కడ శయన భంగిమలో దర్శనమిచ్చాడు. ఇక్కడి అమ్మవారి పేరు కోమలవల్లి. ఈ ఆలయానికి ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం ఉన్నాయి. అర్ధ సంవత్సరం పాటు ఒక్కో ద్వారం తెరచి ఉంచుతారు. ఆలయం గోడలపై భరతనాట్య భంగిమలను కూడా చెక్కారు. అక్కడి నుంచి చక్రపాణి ఆలయానికి వెళ్లి త్రినేత్రుడైన స్వామిని చూశాం. వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించాక, తిరువళంచుళి వెళ్లి శ్వేత గణపతిని సేవించుకున్నాం. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై ఇక్కడికి దగ్గరలోనే ఉంది. దీనికి 60 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లెక్కి కుమారస్వామిని పూజించుకున్నాం. ఈ ప్రాంతంలో అనేక శిల్పశాలలు ఉన్నాయి. వీటిల్లో వందలాది శిల్పులు రాతితోనూ వివిధ లోహాలతోనూ అనేక దేవతామూర్తుల ప్రతిమలను అద్భుతంగా రూపొందిస్తున్నారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఏడోదైన తిరుపుళ్లంపుదంగుడి వెళ్లి, వల్‌విల్‌ రాముని ఆలయంలో శయన భంగిమలో ఉన్న శ్రీ రామచంద్రుని అర్చించుకున్నాం. ఈ గర్భాలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతోబాటు బ్రహ్మ, జటాయువులతో కూడా కొలువుదీరడం విశేషం.

మహామహం పుష్కరిణి!
అక్కడి నుంచి వైష్ణవ దివ్యదేశాల్లో మరొకటైన ఆదనూరు చేరుకుని రంగనాథుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడి గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి, బ్రహ్మ, భృగు మహర్షి, అగ్నిదేవుడు, కామధేనువు కొలువై కనిపిస్తారు. కుంభకోణం తిరిగివచ్చి, ఆది వరాహస్వామి, నాగేశ్వరస్వామి ఆలయాలను మహామహం పుష్కరిణిని చూశాం. కుంభకోణం అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఈ పుష్కరిణే. ఆరు ఎకరాలకు పైగా విస్తీర్ణంతో అలరారే ఈ తటాకం చుట్టూ 16 మండపాలు, తటాకం లోపల 21 బావులు ఉన్నాయి. ఇక్కడ ఏటా మాఘమాసంలో జరిగే ఉత్సవం కాకుండా 12 సంవత్సరాలకొకసారి జరిగే ఉత్సవాలకు లక్షలాది భక్తులు వస్తారు. అనంతరం పట్టాభిరామస్వామి ఆలయంలో సీతాలక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత శ్రీరామచంద్రమూర్తిని సేవించాం. ఇక్కడ ఆంజనేయస్వామి వీణాపాణియై దర్శనమివ్వడం విశేషం. ఇక్కడి వైష్ణవాలయాల్లో మూలవిరాట్‌ విగ్రహాలు పది అడుగులకు పైగా ఎత్తులో నేత్రపర్వంగా ఉన్నాయి.ఓ బ్లాగు ద్వారా పరిచయమై, ఈ ఆలయాలనూ చూసేందుకు మాకు మార్గనిర్దేశం చేసిన మిత్రుడు విజయకుమార్‌గారికి ఫోనులోనే కృతజ్ఞతలు తెలియజేసి, తిరుగుప్రయాణమయ్యాం.

Friday, 13 January 2017

తమిళనాడు యాత్ర

పర్యాటకరంగానికి ఆయువుపట్టు. సహజ అందాలకు, ప్రకృతి రమణీయ తకు పుట్టినిల్లు. దేవాలయాలు కళాత్మక సౌరభాలు. గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం తమిళనాడు సొంతం. కన్యాకుమారి, కుంబకోణం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వ రం, మీనాక్షి, స్వర్ణ దేవాలయం.. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

శ్రీపురం స్వర్ణదేవాలయం
ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గర్లో మలైకుడి సమీప కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్‌ టన్నుల సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది.

బృహదీశ్వర ఆలయం
అత్యంత ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినది తంజా వూరు బృహదీశ్వర ఆలయం. హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడినది

కుంబకోణంలో బ్రహ్మ దేవాలయం
కావేరి, అరసలర్‌ నదుల మధ్య ఏర్పడింది కుంభకోణం. ఈ నగరాన్ని ‘సిటీ అఫ్‌ టెంపుల్స్‌’ గా పిలుస్తుంటారు. ఇక్కడ 188 ఆలయాలున్నాయి. చుట్టుపక్కల మరో 100 టెంపుల్స్‌ వరకూ ఉంటాయి. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్‌ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్‌ టవున్‌లో ‘మహామాహం’ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు.

రామేశ్వరం
హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది రామేశ్వరం. రామేశ్వరాన్ని విష్ణుమూర్తి ఏడవ అవతారం భావిస్తారు. రావణాసురుడి చర నుండి సీతాదేవిని కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి ఇక్కడ నుంచే రాముడు వంతెనను నిర్మించాడట. అందువల్లే రామేశ్వరానికి ఆపేరు. ఈ ప్రాంతంలో సుమారు 64 తీర్దాలు ఉండగా వీటిలో 24 ప్రాముఖ్యత గలవని, ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం
ఈ ఆలయం తిరుచెందూర్‌ తూతుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ  అందమైన దేవాలయాలు, తిరుచెందూర్‌ మురుగన్‌ టెంపుల్, వల్లి గుహ, దత్తాత్రేయ గుహ కలవు.

కన్యాకుమారి
భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.

తప్పక సందర్శించదగినవి
వివేకానంద రాక్, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. వివేకానంద రాక్‌కు సమీపంలోని తిరువళ్లువర్‌ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచినది. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి ‘కుమరి ఆలయం’ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. కాంచీపురం థౌజండ్‌ టెంపుల్స్‌ నగరంగా ప్రఖ్యాతిగాంచింది. తమిళనాడులో చారిత్రక హిందూ ఆలయం  మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. రంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న దివ్యక్షేత్రం శ్రీరంగం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు.  పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరానికి తిమేవ కాయ్, తిరువనైకావల్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబువృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు.  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందిన ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.

Wednesday, 11 January 2017

శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే మోహనం...

పుణ్యతీర్థం

విష్ణుమూర్తి శేషశయనుడై భక్తుల మొరలను ఆలకిస్తూశ్రీరంగనాయకితో కొలువుతీరిన క్షేత్రం... శ్రీరంగం. విశాల ప్రాంగణం, ఎత్తయిన గోపురాలు, దేవతామూర్తుల సముదాయం. దేవాలయంలోనే పట్టణం. ఇవీ ఈ క్షేత్రం విశేషాలు. ‘రంగ రంగ రంగపతి రంగనాథానీ సింగారాలే తరచాయె శ్రీరంగనాథా’... అని అన్నమయ్య సంకీర్తన చేసింది ఈ క్షేత్రం గురించే!

శ్రీరంగనాథుడు, రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం– శ్రీరంగం. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న ఒక ద్వీపం. ‘శ్రీరంగం’ అనే ఊరిలో దేవాలయం లేదు. ‘శ్రీరంగ దేవాలయం’లోనే శ్రీరంగం అనే ఊరు ఉంది. దేవాలయం ఊరు కలగలిసినదే – శ్రీరంగం. దీనిని వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి శయనమూర్తిగా దర్శనమిస్తాడు. క్షీరసాగరంలో పవళించిన శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడడు. సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని ఈ క్షేత్రానికి సంబంధించిన గాథలు చెబుతున్నాయి. స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధి నిర్వర్తిస్తాడనీ, శ్రీరంగంలో శయనిస్తాడనీ తెలుస్తోంది. విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు ఉండి, స్వామి సేవలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం
దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు కి.మీ. పొడవైన ప్రాకారంతో ఈ దేవాలయం నిర్మితమై, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ 50 పైచిలుకు పరివార దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. స్వామివారి రాజగోపురం 236 అడుగుల ఎత్తు కలిగి (ఆసియాలోనే అతి పెద్ద రాజగోపురం), 13 అంతస్థులతో శోభాయమానంగా ఉంటుంది. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలు ఉండగా, తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్ఠించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూలస్థానంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రాంగణంలోనే వసతి సముదాయాలు, వాణిజ్య సముదాయాలు కలిగిన ఆలయం ఇది. కంబోడియాలోని అంకోర్‌వాట్‌ మందిరం వైశాల్యంలో దీని కంటే పెద్దదే అయినప్పటికీ, ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది. కానీ ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం మాత్రం శ్రీరంగమే.

అమ్మవారితో....
కావేరీ నదీ తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ దేవాలయాలు ఉన్నాయి. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో ఆది రంగడు, శివసముద్రంలో మధ్య రంగడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరంలో అంత్య రంగడు. శ్రీరంగంలోని మండపాన్ని భోగమండపం అంటారు. రామ, కృష్ణావతారాలను విభవ అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు ఈ క్షీరాబ్ధి నాథుడే మూలమని ఆళ్వారులు విశ్వసిస్తారు.

విభీషణుడికి రాముడిచ్చిన విగ్రహం
వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సంతుష్టుడై తాను ఆరాధించేది శ్రీరంగనాథుడిననీ, కనుక నీవు కూడా ఆరాధించమనీ ఆ ఆరాధనను ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. అలా రంగనాథ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. సీతాపహరణం తరువాత విభీషణుడు రావణుడితో విభేదించి, రాముని  శరణు కోరి ఆశ్రయం పొందాడు. విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రావణ వధ అనంతరం తమ ఆరాధ్య దైవం అయిన రంగనాథుడి విగ్రహాన్ని అతడికి ఇస్తూ ‘లంకకు తీసుకెళ్లు. కాని దారిలో ఎక్కడా ఈ విగ్రహాన్ని నేల మీద ఉంచకూడదు’ అని వివరించాడు. కానీ విభీషణుడు ఉభయ కావేరుల మధ్యనున్న ద్వీపంలో విశ్రమించేందుకు విగ్రహాన్ని దించి తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆశ్చర్యంగా ఆ విగ్రహం రాలేదు. ఈ సంగతి తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చి, ‘స్వామివారు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నందున ఇక్కడే దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడదాం’ అన్నాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కునకు తిరిగారని స్థల పురాణం చెబుతోంది.

చంద్రగిరికి చేరిన ఉత్సవమూర్తి
ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తిని పెరియ పెరుమాళ్‌ అనీ, ఉత్సవమూర్తిని నంబెరుమాళ్‌ అనీ అంటారు. ఒకానొక సమయంలో తురుష్కుల వలన ఉపద్రవం ఏర్పడినప్పుడు శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతానికి చేర్చారనీ, ఆ సమయంలో మరొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించార నీ చరిత్ర.

బంగారు స్తంభాలు...
గర్భాలయంలో శ్రీరంగనాథుని ఎదుట ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్‌ అంటారు. ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి గాయత్రి మండపం, గర్భాలయానికి ముందున్న ప్రదేశానికి చందన మండపం, ప్రదక్షిణకు తిరువణ్ణాళి ప్రదక్షిణం అని పేరు.

ప్రాకారాలు...
మొదటి ప్రాకారంలో ద్వారపాలకుడు, యాగశాల, విరజా బావి, చిలకల మండపం, కణ్ణన్‌ సన్నిధి ఉన్నాయి. రెండో ప్రాకార గోపుర ద్వారంలో పవిత్రోత్సవ మండపం, దొర మండపం ఉన్నాయి. ఇక్కడ ఉన్న విరజా మండపం క్రింది నుంచి విరజానది ప్రవహిస్తోందని పండితులు చెబుతారు. విణ్ణప్పం అంటే అభ్యర్థన జరిగే మండపంలో ధ్వజారోహణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్తంభాల మీద ఉన్న వినీత ఆంజనేయస్వామి వరాలివ్వగల శక్తిమంతుడని చెబుతారు. మూడవ ప్రాకారాన్ని అలినాడన్‌ తిరువీధి అంటారు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి,  వెలుపల వాలి సుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్‌ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంది. ప్రాకారానికి ఎడమ భాగంలో ధాన్యం కొలిచే మండపం, దీని ప్రక్కన నంజీయర్‌ సన్నిధి ఉన్నాయి. ఈ ప్రాకారంలో ఇంకా చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, వేదవ్యాస సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి, వైకుంఠనాథన్‌ సన్నిధి, సూర్య పుష్కరిణి... వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం పది దినాలు శ్రీరంగనాథులు కొలువుతీరే వేయి కాళ్ల మండపం ఉంది. దీనిని సహస్రస్థూణా మండపం అంటారు. ఈ మండపంలో స్వామి వేంచేసి ఉండే స్థలానికి తిరుమామణి మండపం అని పేరు.

ఉత్సవాలు..
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనం సుప్రసిద్ధం. ఉగాది, విజయదశమి మొదలైన ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నిత్యం ఉత్సవ సంబరమే.

లౌకికవాదానికి ప్రతీక...
ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో ఇక్కడ మూర్తిని ఢిల్లీకి తరలించాడనీ, సుల్తాన్‌ కుమార్తె స్వామి భక్తురాలిగా మారిందనీ, అనంతరం ఈ విగ్రహాన్ని రామానుచార్యులు శ్రీరంగానికి తీసుకువచ్చాడనీ, సుల్తాన్‌ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైందని చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఇప్పటికీ పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధరించి, కనిపిస్తారు. రోటీలను నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా ఉంది. షేక్‌ చినమౌలానా ఈ ఆలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. ఈయనది ప్రకాశం జిల్లా కరవది గ్రామం.

ఈ దేవాలయంలో గరుడాళ్వార్‌ 25 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. 30 మీటర్ల పొడవాటి వస్త్రంతో స్వామిని అలంకరిస్తారు. అతి సుందరమైన శిల్పకళతో ఒక మండపం ఇక్కడి గరుడాళ్వార్‌కి ఉంది. ఈ ఆలయంలో మాత్రమే శ్రీరంగనాథస్వామిని భక్తిప్రపత్తులతో ఆరాధించిన మహమ్మదీయ రాణి తుళ్లకునాచ్చియార్‌ చిత్రం ఉంది. ఈ ఆలయంలో భగవద్‌ శ్రీరామానుజాచార్య స్వామి పార్థివ దేహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో కొన్నాళ్లు భద్రపరిచారు. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం ప్రాకృతిక ఉపద్రవాల అంచున ఉంది. గతంలో చాలాసార్లు డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్‌ వారి దాడులను తట్టుకుని కాలపరీక్షకు నిలబడింది.

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సాధ్యం కాని ఇంతటి బృహత్తరమైన ఆలయాన్ని ఆ రోజుల్లో మనవారు ఎలా నిర్మించగలిగారో అంతుచిక్కదు. ఆలయంలో ఉన్న వెయ్యి స్తంభాల మండపం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇన్ని స్తంభాలను ఎంత మంది శిల్పులు, ఎలా నిర్మించారో అంతు చిక్కదు. బరువైన రాళ్లను ఎత్తయిన ప్రదేశాలోకి ఏ విధంగా తీసుకువెళ్లారన్నది సమాధానం లేని ప్రశ్న.

దర్శన వేళలు...:
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మధ్యాహ్నం 12 నుంచి 1.5 మధ్య తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 మధ్య పూజ జరుగుతుంది. ఈ సమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6 నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే 50 రూపాయలు టికెట్‌ కొనుగోలు చేయాలి. శీఘ్ర దర్శనం కావాలనుకుంటే 250 రూపాయల టికెట్‌ కొనాలి.

సౌకర్యాలు...: వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేట్‌ హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. సాధారణ హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ వరకు చాలా అందుబాటులో ఉన్నాయి.

ఇలా చేరుకోవచ్చు...
తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇక్కడి నుంచి దూరం కేవలం 9 కి.మీ. పావుగంటలో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగానికి 15 నిమిషాలలో చేరుకోవచ్చు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి 333 కిలోమీటర్లు.
– డా. పురాణపండ వైజయంతి

Saturday, 10 December 2016

పళని మురుగన్







కొండలలో కోటి జ్ఞానకాంతుల స్వామి పళని మురుగన్



శివపార్వతుల గారాల తనయుడు, దేవసేనాధిపతి, తారకాసురుడనే రాక్షస సంహారానికి ఉద్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. సకల విద్యాపారంగతుడిగా, జ్ఞానప్రదాతగా, దండాయుధపాణిగా, నిత్యయవ్వనుడుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పేరుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలకు, ఆయనను అర్చించే భక్తులకు తెలుగునాట కొదవలేనప్పటికీ తమిళనాడు, కర్ణాటకలలో మనకన్నా అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అడుగడుగునా గుడులు కట్టి పూజించడం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. తమిళనాట గల ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యక్షేత్రం పళని. దండాయుధపాణిగా, బాలమురుగన్‌గా, పళని మురుగన్‌గా తమిళులు కొలిచే ఈ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనదిగా, మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది.

స్థలపురాణం:
వినాయకచవితినాడు మనందరం చెప్పుకునే కథ ఒకటుంది. అదేమంటే గణాధిపత్యం కోసం పోటీపడుతున్న కుమారులతో భూమండలంలోని అన్ని పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసి, ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో, వారికే గణాధిపత్యమిస్తానని శివుడు చెప్పడం, ఆ మాట వినడంతోటే తన మయూర వాహనాన్ని అధిరోహించి, కుమారస్వామి వాయువేగంతో వెళ్లిపోవడం, వినాయకుడు తెలివి తేటలను ఉపయోగించి, నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, మూడుమార్లు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ మహిమతో కుమారస్వామి ఏ పుణ్యతీర్థానికేగినా అన్నగారే తనకన్నా ముందుగా వచ్చి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వెళ్లిన ఆనవాళ్లు కనిపించి ఖిన్నుడై, కైలాసం వచ్చేసరికి, ఈ పరీక్షలో గణేశుడే నెగ్గాడంటూ గణాధిపత్యాన్ని వినాయకుడికే కట్టబెట్టడం.. ఆ ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం...

ఇంత వరకూ కథ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో, వినాయకచవితి రోజున తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడు జరిగిన పరిణామానికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో బాధపడతాడు. తలిదండ్రుల మీద అలిగి, అన్నగారిలాగా తనకు కూడా పరిపక్వమైన జ్ఞానం లభించాలనే కాంక్షతో తన అలంకారాలన్నింటినీ వదిలేసి, భూలోకం వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఒక కొండమీద గల ప్రశాంతమైన వాతావరణంలో తపస్సులో మునిగిపోయాడు. కైలాసంలో కుమారుని జాడ తెలియక పార్వతీదేవి బెంగపడుతుంది. పరమేశ్వరుడు పత్నిని ఊరడించి, ఆమెను వెంటబెట్టుకుని కొడుకుని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు. ఇద్దరూ కలసి వెతుకుతుండగా, తమిళనాడులోని తిరు ఆవినంకుడి అనే ప్రదేశం వద్దకు రాగానే కొండశిఖరం బంగారు కాంతులతో మెరుస్తూ కనపడటంతో తమ కుమారుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుంటారు.

తపోదీక్షలో ఉన్న పుత్రుని చేరదీసి, ముద్దాడుతూ, ‘నువ్వే నా జ్ఞానఫలానివిరా బంగారుకొండా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులు కుమారుని అనుగ్రహిస్తారు. తల్లిదండ్రుల ఊరడింపుతో కుమారస్వామి అలకమానతాడు కానీ, ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చడంతో తన అంశను అక్కడే వదిలి, తలిదండ్రులతో తిరిగి కైలాసం చేరతాడు. ఇదీ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పురాగాథ. ఆ ప్రదేశమే ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అర్చించే పళని ఆలయం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు.

అన్ని విగ్రహాల్లాంటిది కాదు:
పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్ని విగ్రహాలలా రాతితో మలిచింది కాదు. నవపాషాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినది. ఈ నవ పాషాణాలనే తొమ్మిది విధాలైన మూలికలు అని కొందరంటారు, తొమ్మిది భయంకరమైన విషాలనూ ప్రత్యేకమైన పాళ్లలో కలిపితే అమృతం వంటి ఔషధం తయారవుతుందని, అందుకే దీనిని భోగార్ అనే ముని ఈ విగ్రహాన్ని ప్రత్యేకశ్రద్ధతో మలచాడని క్షేత్రపురాణం చెబుతోంది. ఈ ఆలయం దాదాపు పదహారు గంటలసేపు తెరిచే ఉంటుంది. అందరూ స్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా గర్భాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ మందిరం క్రీస్తుశకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ కట్టించగా, దానిని పాండ్యరాజులు పునరుద్ధరించారు.

అద్భుతమైన శిల్పసంపదతో, కేవలం కౌపీనం మాత్రమే కట్టుకుని, చేతిలో శూలాయుధం పట్టుకుని, చూడగానే ఆకట్టుకునే అందమైన విగ్రహంతో కనువిందు చేస్తాడు ఈ దేవసేనాని, దండాయుధ పాణి. కావడి మొక్కులంటే ఇష్టమట ఈస్వామికి. అంటే ఏదయినా ఆపద కలిగినప్పుడు తాము సమర్పించగలిగినదానిని కావిళ్లకొద్దీ సమర్పించుకుంటామని మొక్కుకుని, ఆపద తీరగానే, నియమ నిష్ఠలతో స్వామికి కావిళ్లలో కానుకలు మోసుకుంటూ నృత్యగానాలతో స్వయంగా సమర్పించుకుంటారు భక్తులు. తండ్రి అయిన శివునిలాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తికమాసంలో అయితే రోజుకు కనీసం 700 మార్లు భక్తుల అభిషేకాలందుకుంటాడు ఈ స్వామి. వల్లీ, దేవసేన ఆయన భార్యలు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిరోజున స్వామివారికి కన్నుల పండువగా కల్యాణోత్సవం జరుగుతుంది.

పర్యాటక స్థలాల పళని
పళని చుట్టూ బోలెడన్ని పర్యాటక స్థలాలున్నాయి. తిరునావినంకుడి ఆలయం, ఇదుంబన్ ఆలయం, పదగణపతి ఆలయం, తిరు అవినాకుడి ఆలయం, పెరియ నాయకి అమ్మన్ ఆలయం, పెరియన్ అవుడైయర్ ఆలయం, కన్నడి పెరుమాల్ ఆలయం, పళని కొండలు, పార్వతీదేవికి తల్లిగా పేర్కొనే మరియమ్మన్ ఆలయం, మురుగన్ విగ్రహ శిల్పి భోగర్ సమాధి ఆలయం, కురుంజి అందవార్ ఆలయం, లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ముఖ్యమైనవి. అసలు పళని కొండలే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ పళని ఆలయాన్ని చేరుకోవాలంటే మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం.

ఎప్పుడు వెళ్లాలి?
వాతావరణ పరిస్థితుల రీత్యా పళని వెళ్లేందుకు చలికాలమే అనకూలమని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్షాకాలంలో కొండ ఎక్కడం కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే హాయిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను తనివితీరా తిలకింవచ్చు. పళనిలో ప్రత్యేకమైన కొంగలు బారులు తీరుతాయి. నారాయణ పక్షులు, గోల్డెన్ వడ్రంగి పిట్టలు కనువిందు చేస్తాయి. వాటి కిలకిలరావాలతో మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలంలోనే పళనిలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కావడి ఉత్సవం, మార్గశిరశుద్ధ షష్ఠికి జరిగే కల్యాణోత్సవం ఒకటి.

వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, రాహు, కేతు, కుజగ్రహదోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం, నాగదోషం వగైరాలతో బాధపడేవారు పళని సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించుకుని స్వాంతన పొందుతారు. అంతేకాదు, జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుని బుద్ధిమాంద్యంతో బాధపడేవారు కన్నులారా సందర్శించుకుని ఆయా బాధలనుంచి విముక్తి పొందుతుంటారు.

ఎలా వెళ్లాలంటే..?
పళని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్లడం సులువే. రైలు, బస్సు, విమాన మార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి పళనికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. రైలు మార్గం: పొల్లాచ్చి మీదుగా మధురై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలుంది. అలాగే తిరుచెందూరు నుంచి మధురై మీదుగా పళని వెళ్లేందుకు రైలుంది. చెన్నై సెంట్రల్ నుంచి పళని వెళ్లేందుకు ప్రత్యేకంగా రైలుంది. ఎలాగైనా పళని చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు, బస్సులు విరివిగా ఉన్నాయి. వాయుమార్గం: పీలమేడు లేదా కోయంబత్తూరు, మధురై వరకు విమానంలో వెళ్తే అక్కడినుంచి పళనికి బస్సులు, రైళ్లు ఉన్నాయి.

D.V.R. భాస్కర్

Monday, 14 November 2016

చిదంబరం

ఇదే... చిదంబర రహస్యం!
‘‘ ‘ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్ర తారాది తంవందే సాత్వికం శివం’ అంటూ నటరాజస్వామిని ఆరాధిస్తుంటాం. ఆ రూపాన్ని కళ్లారా చూడాలన్న కోరికతో ఇటీవలే చిదంబర క్షేత్రాన్ని దర్శించి వచ్చాం’’ అంటూ ఆ ఆలయ విశేషాలు చెప్పుకొస్తున్నారు వైజాగ్‌కు చెందిన బొమ్మకంటి పద్మావతి.



చిదంబరంలో దిగగానే నేరుగా నటరాజస్వామి దేవాలయానికే వెళ్లాం. ఆలయం చుట్టూ తిలై అనే రకం చెట్లున్నాయి. అందుకే దీన్ని తిలై చిదంబరం అంటారు. దీని అసలు పేరు చితాంబళం. క్రమంగా చిదంబరంగా మారింది. చిత్‌ అంటే మనస్సు. అంబళం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని అర్థం. అందుకే దీన్ని చిదాకాశం అనీ పిలుస్తారు. 


పట్టణం మధ్యలోని 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో నటరాజు, శివకామి అమ్మన్‌, గణపతి, గోవిందరాజ పెరుమాళ్‌, మురుగన్‌లు కొలువై ఉన్నారు. ప్రాంగణంలో మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి. మొదటిది చిత్‌ అంబళం. ఇందులో నటరాజస్వామి, ఆయన అర్ధాంగి శివకామ సుందరి కొలువై ఉంటారు. దీనికి ఎదురుగా ఉన్నదే పొన్‌ అంబళం లేదా కనకసభ. తరవాతది 56 స్తంభాలున్న నృత్యమండపం. నాలుగోది రాజసభ లేదా వెయ్యిస్తంభాల మండపం. వెయ్యి రేకుల పద్మం(సహస్రారామం)గుర్తుగా చెప్పే ఈ హాలుని ఉత్సవ సమయాల్లోనే తెరుస్తారు. దేవసభగా పిలిచే ఐదో మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంద, శివానంద నాయకి, మురుగన్‌, చండికేశ్వరులు కొలువై ఉన్నారు. 


నటరాజస్వామి! 
చిదంబరం స్వయంభూక్షేత్రం. పంచభూత క్షేత్రాల్లో ఒకటి. దీన్నే ఆకాశలింగ క్షేత్రమనీ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు ఆనంద తాండవరూపంలో నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. పూర్వకాలంలో వారణాసి నుంచి వ్యాఘ్రపాదుడు అనే యోగి వచ్చి ఇక్కడ స్వయంభూలింగం కలదనీ అది కూడా నటరాజ రూపంలో ఉన్నదనీ గుర్తించాడట. ఈ యోగి పులిచర్మాన్ని ధరించేవాడట. అందుకే వ్యాఘ్రపాదుడని పేరు. ఇక్కడ శివుడు చేసే ఆనందతాండవాన్ని చూడ్డానికి శ్రీమహావిష్ణువూ, ఆయన వెంట ఆదిశేషుడు పతంజలి రూపంలో దేవాలయానికి వచ్చేవారట. ఆలయకుడ్యాలమీద చిత్రించి ఉన్న ఆ ఇద్దరి చిత్రాలూ అందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.ఆలయానికి పశ్చిమదిశలో ఉన్న గోపురంమీద సూర్యతేజస్సుగల సింహముఖం ఉంది. తూర్పుదిక్కున ఉన్న గోపురంమీద సోమస్కందుడి రూపం కనిపిస్తుంది. దీన్నే శివశక్తి స్వరూపంగా భావిస్తారు. దక్షిణ గోపురంమీద మార్కండేయుణ్ణి కాపాడే ఈశ్వరుణ్ని యమస్వరూపంగా చెబుతారు.


12, 13వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, చేర రాజులు అభివృద్ధిపరిచినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ ఆలయానికి సంబంధించి అనేక విషయాలు గుర్తించారు. మానవదేహానికీ ఈ దేవాలయ నిర్మాణానికీ దగ్గర పోలికలు ఉన్నాయట. 

చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ భూమధ్యరేఖలోని బిందువు, ఈ నటరాజ విగ్రహంలోని కాలిబొటనవేలుని సూచిస్తుందనీ చెబుతారు. ఆకాశలింగం(చిదంబరం), వాయులింగం (కాళహస్తి), భూలింగం(కాంచీపురం), అగ్నిలింగం(తిరువణైక్కవల్‌), జలలింగం (తిరువణ్ణామలై) అనే పంచభూతలింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళరేఖలో 79 డిగ్రీల 41నిమిషాల తూర్పు అక్షాంశంమీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతంగా చెబుతారు. 

చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవ రంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒకరోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. యోగశాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్యా అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమచేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న నాలుగు స్తంభాల మండపం నాలుగు వేదాలకూ ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిమీద 64 కళలకూ గుర్తుగా 64 బీములు ఉంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురంమీద ఉన్న నవ కలశాలూ నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకుని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక. 


చిదంబర రహస్యం! 
ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపమూలేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడో రూపమే చిదంబర రహస్యం.. గర్భాలయంలోని వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు... ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం... అదే చిదంబర రహస్యం. 


ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నటరాజస్వామిని దర్శించి బయటకు వచ్చి వెనుతిరిగిచూస్తే ఆలయ గోపురం వెనుకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. అనేక విశిష్టతలున్న చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుని తాదాత్మ్యంతో తిరిగివచ్చాం.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...