Showing posts with label చార్‌ధాం యాత్ర. Show all posts
Showing posts with label చార్‌ధాం యాత్ర. Show all posts

Wednesday, 6 June 2018

బదరీ నాధ్






బదరీ నాధ్
జోషిమఠ్, భవిష్య బదరి

కర్రా నాగలక్ష్మి 

నందప్రయాగ నుంచి మా ప్రయాణం బదరీ నాధ్ వైపు సాగింది. సుమారు 63 కిలో మీటర్ల ప్రయాణం తరువాత విష్ణు ప్రయాగ చేరేం. బదరీనాథ్ దారిలో వున్న పంచప్రయాగలలో ఒకటిగా ఈ విష్ణు ప్రయాగని లెక్కపెడతారు. ఇక్కడ అలకనంద  'నీతి పాస్' లో పుట్టిన దౌళిగంగతో సంగమించి విష్ణు గంగగా పిలవబడుతోంది. ధౌళి గంగ నీరు చాలా తెల్లగా ప్రవహిస్తూ పాల నురుగను తలపిస్తుంది.

సంగమం నుంచి కాలినడకను రెండు మూడు కిలో మీటర్లు వెళితే విష్ణు కుండం వస్తుంది. పచ్చని ప్రకృతి మధ్యన యీ కుండం చాలా ప్రశాంతతను కలుగ జేస్తుంది. అందుకనేనేమో నారదుడు విష్ణుమూర్తి కొరకై యిక్కడ తపస్సు చేసుకొని విష్ణుమూర్తిని పిన్నును చేసుకున్నాడు . పురాతనమైన పాడు పడ్డ చిన్న మందిరం, విష్ణుకుండినులు తప్ప మరకమీద లేవు.

విష్ణ ప్రయాగలో 400MW హైడెల్ పవర్ ప్రోజెక్ట్ నిర్మ్ంచిన తరువాత ఇక్కడ జనావాసాలు పెరిగాయి, కాలక్రమేణా విష్ణు కుండానికి ప్రాముఖ్యత పెరిగి ఈ మందిరం పునరుధ్దరింప బడుతుందని ఆశిద్దాం.

విష్ణుప్రయాగకి దగ్గరగా ఉన్న 'హనుమన్ చట్టి' నుంచి కాలినడకన వెళితే హనుమంతుడి మందిరం ఉందని అన్నారు, కాని ఆ నిర్జనమైన దారిలో మందిరానికి వెళ్లే సాహసం చెయ్యలేక పోయేము.

సంగమ ప్రదేశంలో విష్ణు గంగ పైన షడ్భుజాకారంలో ఓ చిన్న మందిరం వుంది, ఆ మందిరం 'అహల్యా బాయి హోల్కర్' చే నిర్మింపబడిందని, అందులో ఆమె తపస్సు చేసుకొనేదని స్థానికులు చెప్పేరు.

మేం వెళ్లినప్పుడు ఆ మందిరానికి మరమ్మత్తులు చేస్తున్నారు .

హైడల్ పవర్ ప్రాజక్టు రావడంతో ఈ గ్రామం పట్నంగా మారింది. ఇళ్లు, గెస్ట్ హౌసులు  స్కూల్స్ వచ్చేయి. రోడ్లుకూడా విశాలంగా మారేయి.

విష్ణు ప్రయాగ నుంచి మనకి మంచుతో కప్పబడ్డ పర్వతాలు కన్పించి కనువిందు చేస్తాయి. పాతికేళ్లముందు ఋషికేశ్ నుంచే చలి మొదలయేది, అడపాదడపా గడ్డకట్టిన మంచు కొండలపై కనిపిస్తూ, ఒక్కో మలుపులో వరసగా తెల్లని మంచుకప్పుకున్న యెత్తైన పర్వతాలు కనువిందు చేసేవి. కాని ఇప్పుడు అలాంటి సుందర దృశ్యాలు సుమారుగా లేవనే చెప్పాలి .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో చిన్న ఊరు ' హేలంగ్ '. ఈ  ఊరులో పదికి మించి ఇళ్లు ఉండవు కాని ఈ 
ఊరుకి దగ్గరగా ఉన్న మూడు మందిరాలవల్ల యీ ఊరు యాత్రీకులలో ప్రాముఖ్యతను పొందింది.

ఇక్కడ నుండి సుమారు రెండుకిలోమీటర్ల దూరంలో కొండదిగువన పంచబదరీ క్షేత్రమైన 'ధ్యానబదరి
' మందిరాన్ని దర్శించుకోవచ్చు. చాలా చిన్న మందిరం . ఇక్కడ బదరీ నారాయణుడు ధ్యానం చేసుకున్నాడనేది స్థలపురాణం వల్ల తెలుస్తోంది .

హేలంగ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల నడక తరువాత పంచకేదార క్షేత్రమైన ' కపాలేశ్వర మందిరాన్ని , భవిష్య కేదార్ మందిరాన్ని దర్శించుకో వచ్చు .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో వూరు 'పిపల్ కోటి'. దీని గురించి ప్రత్యేకంగా యెందుకు చెప్తున్నానంటే యీ 'పిపల్ కోటి'లో మనకి కాలసిన దక్షిణ భారతదేశముపు ఫలహారాలు దొరకుతాయి . ఇప్పడు మనకి బదరీనాథ్ లో కూడా మన ఆహారాలు గత అయిదారు సంవత్సరాలుగా దొరకుతున్నాయి . కాని 'పిపల్ కోటి' లో పాతిక సంవత్సరాల నుంచి (అప్పట్లోనే మొదటి మారు యాత్రకి వెళ్లేం ) పాతికేళ్ల కిందట బదరీలో అన్నం పెరుగు దొరికేవి కావు. పాలు లేని కాఫీ, టీలు వుండేవి. అప్పట్లో మంచి టీ టిఫిన్స్ , భోజనం ' పిపల్ కోట ' లోనే దొరికేవి.

జోషీమఠ్
ఋషికేశ్ కి సుమారు 251 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చమోలి జిల్లాలో వుంది జోషిమఠ్ . శీతాకాలంలో బదరీనాథుని మందిరం మూసివేసినప్పుడు ఆ విగ్రహాలను జోషిమఠ్ లో వుంచి పూజలు చేస్తారు .

శంకరాచార్యుల వారు పురాణాలలో వున్న బదరీనాధ్ వర్ణనను అనుసరించి యిక్కడకు రాగా హిమపాతం వల్ల బదరీకి దారి మూసుకు పోగా ఆది శంకరులు తన శిష్యులతో యిక్కడ బస చేసి మఠస్థాపన చేసి మంచు కరిగినతరువాత బదరీ చేరి నారద కుండంలో వున్న విగ్రహాలను వెలికి తీసి ప్రతిస్టించేరు . శంకర భగవత్పాదులు నివాసమున్న స్థలం వారు వాడిన వస్తువుల యిక్కడ మనం చూడొచ్చు . శంకరాచార్యుల వారిచే స్థాపింపబడ్డ బదరీపీఠం జోషిమఠలో వుంద్ , యీ మఠం అధర్వణ వేదానికి సమర్పితమైంది.

జోషిమఠ్ లో టాక్సీ స్టాండు నుంచి కిందకి దిగితే నరసింహ మందిరం వస్తుంది . ఇది చాలా పురాతన మైన మందిరం , లోపల పూజారుల నివాసాలు వున్నాయి , పైన గదులలో ఆదిశంకరుల పడక , ఆసనం మొదలైనవి చూడొచ్చు . యీ మందిరానికి వున్న ప్రాముఖ్యత యేమిటంటే యీ మందిరం లో వున్న మూలవిరాట్టు కి ఒక చెయ్య విరిగిపోయి వుంటుంది . రెండో చెయ్య విరిగి పోయిన నాడు బదరీనాథ్ మందిరప్రాంతం మొత్తం నేలమట్టం అయిపోతుందట . తర్వాత బవిష్య బదరీ లో బదరీనారాయణుడు పూజలందుకుంటాడట.

జోషిమఠ్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న తపోవనం వెళ్లొచ్చు . తపోవనం ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం అని అంటారు .

ఎక్కువ యాత్రీకుల తాకిడి లేని ప్రదేశం , ఆశ్రమాలు తప్ప మరేమీలేవు .

పచ్చని ప్రకృతి , ప్రశాంత కావాలనుకునే వారు తప్పక వెళ్ల వలసిన ప్రదేశం .

జోషిమఠ్ వూరులోంచి కొండపైకి వెళితే అక్కడ రెండుదారులు వస్తాయి . ఒకటి ఔలి , రెండవది తపోవనం వైపు వెళతాయి , బవిష్య బదరీ వెళ్లాలంటే తపోవనం రోడ్డు మీదుగా వెళ్లాలి .

భవిష్య బదరి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు అంతగా లేవు , జోషిమఠ్ నుంచి టాక్సీ తీసుకోవచ్చు . ఋషికేశ్ నుంచి వచ్చిన టాక్సీలలో కూడా వెళ్లొచ్చు .

ఒకటి అరా లోకలు బళ్లు తప్ప మరే రాకపోక వుండవు , ఓ అయిదారు కిలో మీటర్లు వెళ్లిన తరువాత రోడ్డు కి కుడి వైపున రోడ్డు పైనే వేడినీటి బావి వుంటుంది . అందులో నీరు యెంత వేడిగా వుంటుందంటే నీరు కుతకుతలాడుతూ  వుంటుంది . పసుపు వర్ణం లో లోపలనుంచి మన్ను బయటకి వస్తూ వుంటుంది . మేము బవిష్యబదరి వెళదామనుకొని స్థానికుల దగ్గర సమాచారం సేకరిస్తూ వుంటే వారు యీ బావి గురించి , అందులోంచి వచ్చే పసుపుపచ్చటి మన్ను గురించి చెప్పి ఆ మన్నుకి చాలా మెడిసనల్ వేల్యూ వుందని యెటువంటి చర్మ రోగమైనా తగ్గిపోతుందని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు దానినే చర్మరోగాలకు మందుగా వాడుతారని చెప్పడంతో మేము రెండు మూడు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకు వెళ్లేం . మన్ను వేడిగా వుండటం వల్ల మేం డబ్బా తో తియ్యడాని ప్రయత్నిస్తే డబ్బా కడిగి సొట్టపడింది . అయితే యెలాగో మన్ను కలక్ట్ చేసేం .

సైన్సు ప్రకారం కిందన గంధకం నిక్షేపాలు వున్న చోట వేడినీటి బుగ్గలు యేర్పడతాయని , ఆ ప్రకారంగానే యిక్కడ పైకి వస్తున్న పసుపురంగు మన్నులో గంధకం కలసిందను కుంటే అక్కడ మట్టికి గంధకం వాసనలేదు . నాకు సల్ఫర్ యెలర్జీ వుండడం వల్ల నేను చర్మ రోగాలకు యే ఆయింట్ మెంట్ వాడను , వాడలేను . కాని యీ మన్ను వాడితే నాకు యెటువంటి ఎలర్జీ కలుగలేదు . ఈ వ్యాసం చదివిన పెద్దలు యెవరైనా నా సందేహం తీర్చగలరు .

అక్కడ నుంచి మరే 4 కిలో మీటర్ల ప్రయాణం తరువాత భవిష్య బదరీకి వెళ్లే కాలి దారి దగ్గర ఆగేం .

భవిష్య బదరీ స్థానికులలో ప్రాముఖ్యం పొందినా యెక్కువ యాత్రీకులు రాకపోడం తో యిక్కడ యాత్రీకులకు కావలసిన సదుపాయాలు లేవు  , అంటే నడవ లేని వారికి కోసం గుర్రాలు , డోలీలు లాంటివి , వసతి సౌకర్యాలు లేవు .

భవిష్య బదరి కొండలపై అయిదు కిలో మీటర్ల నడకన చేరుకోవచ్చు . ఆ ప్రాంతంలో రెండే గుర్రాలున్నాయని , ప్రొద్దుట వెళితే గుర్రాలు దొరకొచ్చని , ఆలశ్యం అయితే మన్నుమొయ్యడానికి తీసుకు వెళ్తారని చెప్పడంతో తొందరగా వెళ్లేం, స్థానికులు చెప్పినట్లు మాకు ఆ గుర్రాలు దొరికేయి , అయితే జీను కట్టని గుర్రాల మీద ప్రయాణం మహా సాహసమనే చెప్పాలి . యెలోగోవోలా ప్రయాణించసాగేం . గుర్రాలతోపాటు వూరు మీదుగా వూరంటే  నాలుగు కుటుంబాలు    అంతే , అదేవూరు . అక్కడ ఆ పేదవారిచ్చిన ఆథిధ్యం తీసుకున్నాం , యేదో వారు వండుకున్నది మాకు పెట్టేరు , అది తిని మేం యిచ్చిన డబ్బు వారు పుచ్చుకోకపోతే వారి పిల్లల చేతిలో పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పేం .

వారు వాళ్ల యిళ్ల ముందున్న స్థలంలో కూరగాయలు , గోధుమలు పండించుకుంటున్నారు .

తర్వాత దారిలో మరో పల్లెను కూడా దాటేం , పడిపోతున్న పెద్దపెద్ద రాళ్లను దాటుకొని , జలపాతాలను దాటుకొని పైకి చేరేం . పైన పేద్ద మైదానం , కనుచూపు మేర వరకు పచ్చని తివాసీ పరచినట్లుంది .

అక్కడ నుంచి పచ్చిక మీద నడుస్తూ మరో అర కిలో మీటరు నడిచేం , ఆ నడక ఆయాసం కలుగజేసినా రెండింతలు అహ్లాదాన్నిచ్చింది. కోనిఫర్ చెట్లతో నిండివున్న అడవిని చేరడం అక్కడ చిన్న కుటీరం , అందులో నివసిస్తున్న స్వామీజీని కలుసుకున్నాం , పేరడిగితే స్వామీజీలకు పేరేమిటి ? అనే సమాధానం చెప్పేరు . ఆ కుటీరం యెండని కాని వరాన్ని కాని ఆపలేదు , అలాగే స్వామీజీకి యే రక్షగా యివ్వలేదని చూడగానే తెలుస్తోంది . మరో కాషాయ అంగ వస్త్రం తప్ప మరేమీ లేవు . ఎలా వుంటున్నారు అనే ప్రశ్నకి " యిలాగే " అనే సమాధానం వచ్చింది .

మా గుర్రలాబ్బాయి , స్వామీజీ కుటీరానికి యెదురుగా వున్న కొండదగ్గరకు మమ్మలని తీసుకు వెళ్లేరు . కొండముందర చిన్న చిన్న కర్రలతో పందిర కట్టి వుంది , వెనుకాతలకొండని ఆనుకొని ఓ రాతి ఆకారం , కొండలోంచి బయటకి వస్తున్నట్టుగా వుంది . మొహం , కాళ్లు చేతులు వున్నాయి , మిగతా అవయవాలు తీరుగా యేర్పడలేదు . అదే బదరీనాథుని బవిష్య రూపమని , ఆకృతి పూర్తిగా యేర్పడిననాడు యిప్పటి బదరీ మూసుకుపోతుందని , యీ ఆకృతి బదరీనారాయణునిగా పూజలందుకుంటుందని వివరించేరు.

ప్రస్తుతం స్వామీజీ పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పేరు .

అక్కడ యెంత ప్రశాంతంగా వుందంటే అలా యెంతసేపైనా గడిపేయొచ్చని అని పించింది .

అయితే మా గుర్రాలబ్బాయి , స్వామీజీ పులులు తిరిగే వేళయిందని అంటే బయలుదేరి పోయేం  .

రోజూ అదే వేళకు పులులు అటు వైపు వస్తాయట , స్వామీజీ రోజూ చూస్తూ వుంటారట , కాని అతనిని యేమి చెయ్యవట . నాకు నమ్మబుద్దికలుగలేదు .

మట్టిలోంచి , నూతులలోంచి విగ్రహాలు బయటకి రావడం చూసేం అలా వచ్చిన విగ్రహాలు పూర్తిగా చెక్కబడి వుండడం కూడా చూసేం , నిరంతరంగా నీటి రాపిడికి ఆకృతులు యేర్పడడం కూడా చూసేం కాని యిక్కడ యెటువంటి నీరు పడకుండా యెవరూ చెక్కకుండా ఓ కొండ నుంచి ఆకృతి వుబ్బుగా పైకి రావడం మహా వింతగా అనిపించింది . రెండు చేతులు , తల , కాళ్లు , మధ్య శరీరం తెలుస్తున్నాయి అలాగే ఓ చెయ్యి పైకెత్తి శంఖం ధరించినట్లు మరొక చెయ్య అభయముద్రలో వున్నట్లు తెలుస్తోంది .

ఆ ప్రదేశాన్ని వదిలి రాలేక రాలేక వచ్చేం .

తర్వాత తపోవనం వైపు ప్రయాణం సాగించేం . భవిష్య బదరీనుంచి సుమారు 10 కిలోమీటర్ల ప్రయాణానంతరం లోయ లాంటి ప్రాంతం చేరుకున్నాం .

మిగతా వివరాలు పై వారం చదువుదాం అంత వరకు శలవు.




బదరీనాథ్ ధాం యాత్ర






బదరీనాథ్ ధాం యాత్ర

భారతదేశంలో ఉన్న ముఖ్యమైన తీర్థ స్థానాలలో ఒకటైన బదరీనాథ్ పేరు తెలియని హిందువు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో నాలుగు ముఖ్యమైన యాత్రలైన రామేశ్వరం, ద్వారక, మధుర, బదరీనాథ్‌లను చార్‌ధాం యాత్ర అని అంటారు.

"ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఈ యాత్రలను చేసుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని తీర్ధ స్థానాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. " అని ఆది శంకరులు అన్నారు.

చార్‌ధాంలలో వొకటైన బదరీనాథ్ ధాంని " విశాల్ బదరి " అని కూడా అంటారు. ఇది వైష్ణవుల 108 దివ్య దేశాలలో 107వ దివ్య దేశంగా, అతి పవిత్ర స్థలంగా చెప్పాబడింది. ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ నాడు మొదలయ్యే ఈ యాత్ర ఆశ్వీజ శుక్ల దశమి వరకు కొనసాగుతుంది.

దేశరాజధాని ఢిల్లి నుంచి సుమారు 520 కిమీ దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరేవాల్ ప్రాంతంలో చమోలి జిల్లాలో వున్నది విశాల్ బదరి. ఢిల్లి నుంచి హరద్వార్, ఋషికేశ్ వరకు రైల్ మార్గం కుడా వుంది. అక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్డు మీద ప్రయాణం సాగుతుంది. దేవప్రయాగ, శ్రీనగర్ (ఉత్తరా ఖండ్), రుద్రప్రయాగ్, కర్ణ ప్రయాగ్, నంద ప్రయాగ్, చమోలి, పిపల్ కోటి, జోషిమఠ్, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్ అనే ప్రాంతాల మీదుగా యీ ప్రయాణం సాగుతుంది.

సాధారణం గా మే, జూన్ మాసాలలో చాలా మంది యీ యాత్ర ప్లాన్ చేసుకుంటారు. ఆ రెండు మాసాలూ భక్తుల రద్దీ వుండడంతో వుండడానికి వసతి దొరకటం చాలా యిబ్బంది అవుతుంది అంతే కాకుండా దర్శనానికి కూడా చాలా సమయం చలిలో వేచి వుండవలసి వస్తుంది. జులై, ఆగస్ట్ నెలలు వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ రెండు మాసాలు కూడా విడిచి పెడితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఈ యాత్రకి అనువుగా ఉంటాయి. మే, జూన్ నెలలలో ఉన్నంత చలి ఉండదు, వాతావరణం ప్లెజెంట్ గా ఉంటుంది. రద్దీ లేకపోవడంతో బదరీనాథునికి చేసే విష్ణు సహస్రనామ సేవ హారతి సేవలలో పాల్గొనవచ్చు.

ఉత్తరాఖంఢ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో హిమాలయాలకూ, దేశ సరిహద్దుకు దగ్గరగా స్వఛ్ఛమైన జలాలతో ఉరుకులు పరుగులతో ప్రవహించే అలకనంద వొడ్డున ఉంది ఈ కోవెల. అలకనంద నది దాటగానే కుడి వైపున ఆది కేదార్ మందిరం, నారదకుండం, ఉష్ణ కుండం ఉంటాయి. బదరీనాధుని దర్శించుకొనే భక్తులు నారదకుండం దర్శించుకొని ఉష్ణకుండంలో స్నానాలు చేసుకొని ఆది కేదారేస్వరుని దర్శించుకొని బదరీనాధుని దర్శించుకుంటారు. కోవెల ముఖ్య ద్వారంలోకి ప్రవేశించగానే ఎడమచేతి వైపు చిన్న మందిరంలో లక్ష్మిదేవి కొలువై ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకి వెళితే వేదాంత దేశిక, రామానుజా చార్యుల మందిరాలను చూడొచ్చు. ఇంకొంచం ముందుకి వెళితే పెద్ద పెద్ద చెవులున్న రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది. ఇతని పేరు గంఠాకర్ణుడని, ఇతడు అక్కడి క్షేత్రపాలకుడని రాసిన బోర్డ్ కనిపిస్తుంది. ప్రస్తుతం పాత విగ్రహానికి క్షతి కలగటంతో దాని స్థానే చిన్న విగ్రహం ప్రతిష్టించేరు.

అక్కడి పూజారులు గంటా కర్ణుని కధ యిలా చెప్తారు. వారు చెప్పిన ప్రకారం గంటాకర్ణుడు, రావణాసురుడు కుబేరునితో యుద్ధానికి వెళ్ళినపుడు అతని ముఖ్య సైన్యాధికారిగా ఉండేవాడని, ఆ యుద్ధములో రావణాసురుడు విజయం పొంది కుబేరుని సామ్రాజ్యమునకు గంటాకర్ణుని పట్టాభిషిక్తుని చేసి లంకకు వెళ్లిపోయెనట. గంటాకర్ణుడు కుబేరుని వద్దకు వెళ్లి అతని రాజ్యము అతనినే ఏలుకొమ్మని తాను శివ ధ్యానంలో గడుపుతానని కోరగా, కుబేరుడు వోడిన రాజ్యం తిరిగి తీసుకొనుట వీరుల లక్షణం కాదని రాజ్యభారం గంటాకర్ణునికే విడిచిపెట్టి కుబేరుడు 'మానా' గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండలలో తాను వొక కొండ రూపం ధరించెనని నేటికి కుడా కుబేరుడు ఆ పర్వతాలలో వొక పర్వతంగా ఉన్నాడని స్థానికుల నమ్మకం. గంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన చేస్తూ తన భక్తితో శివుని మెప్పించి మోక్షాన్ని పొందుతాడు. గంటాకర్ణుని కోరిక మేరకు ఆ పెద్ద గంఠని దర్శించుకున్నవారికి కుడా మోక్షం కలిగేటట్లు శివుడు వరమిచ్చేడన్నది కధ. 2013లో సంభవించిన వరదలలో ఆ గంటకు గంటా కర్ణుని విగ్రహానికి క్షతి కలుగడంతో ఆరెండింటిని తొలగించేరు.

ఇక ఆదికేదార్ కధ
శివుడు పార్వతీ సమేతుడై యిక్కడ నివాసముండేవాడట. మహా భారత యుద్ధానంతరము విచలిత మనస్కుడయిన విష్ణుమూర్తి మహర్షుల సలహాను అనుసరించి తపస్సు చేసుకొనేందుకు అనువైన ప్రదేశాన్ని వెతుకగా విష్ణుమూర్తికి ఆదికేదార్ ప్రాంతం తపస్సాచరించుటకు అనువైనదిగా తోచుతుంది. కాని అప్పటికే శివ పార్వతులు అక్కడ నివాసముండుట చూచి ఆ ప్రదేశమును కపటము ద్వారా జయించి అక్కడ తపస్సు చేసుకోవాలని తలంచుతాడు. అందులో భాగంగా పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి పోవు మార్గంలో చిన్న బాలుని రూపంలో రోదిస్తూ ఉంటాడు. బాలుని పై జాలితో పరమేశ్వరుడు వారిస్తున్నా వినక పార్వతి ఆ బాలుని తమ నివాసానికి తెచ్చి సపర్యలు చేస్తుంది. మరునాడు పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళ్లగా విష్ణుమూర్తి తపస్సమాధిలో మునిగిపోతాడు. తిరిగి వచ్చిన పర్వతీ పరమేశ్వరులు తేజోమూర్తి అయిన విష్ణు మూర్తిని చూచి జరిగిన మోసము గ్రహించి విష్ణుమూర్తికి యిష్ఠమైన శనగపప్పు ఆప్రదేశములో పండ కోడదనే శాపాన్ని పెట్టి ఇప్పటి కేదార్ కు చేరుకుంటారు. ఇక్కడ ఇతర పదార్ధములతో పాటు శనగ పప్పును నైవేద్యంగా సమర్పించడం కనిపిస్తుంది.

బదరీనాధ్ కోవెల దగ్గరనుంచి అలకనంద వొడ్డునే సుమారు వొక కిలొమీటరు దూరంలో విష్ణుమూర్తి బాలుని రూపంలో పార్వతికి లభించిన చోటును చూడొచ్చు.

వైకుంఠములో విష్ణుమూర్తిని కానక అతనిని వెతుకుతూ భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఆ కురుస్తున్న హిమపాతం మధ్యలో తపస్సమాధిలో ఉన్నవిష్ణుముర్తిని చూచి తాను బదరిక వృక్షముగా మారి తన స్వామిని హిమాపాతము నుండి కాపాడుతూ ఉంటుంది. కాలాంతరమున విష్ణుమూర్తి మనస్సు శాంతించగా ఇహలోకానికి వచ్చి తనరక్షణకై బదరికా వృక్షముగా అవతరించిన లక్ష్మిని గుర్తించి తాను ఆ ప్రదేశములో బదరీనాధునిగా పిలువబడి పూజింపబడతానని చెప్పెను.

గర్భ గుడిలో రెండు చేతులలో శంఖు, చక్రాలు ధరించి యోగముద్రలో తామరపువ్వుపై కూర్చున్న నాలుగు చేతుల బదరీనాధుని విగ్రహంతో పాటు కుబేరుడు, నర నారాయణులు, నారదుడు, గరుత్మంతుడు, ఉద్దవుడు, నవదుర్గలు మిగతా కొన్ని దేవతా మూర్తులను చూడొచ్చు.

బదరీనాథ్ కోవెలకి అరకిలొమీటరు దూరంలో బ్రహ్మ కపాలంలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. బ్రహ్మ నాలుగో ముఖం అన్నీ తప్పుడు మాటలు మాట్లడేదట, దానికి ఆగ్రహించిన విష్ణుమూర్తి తన చక్రంతో ఆ తలను ఖండించగా అది భూలోకంలో ఇక్కడ పడిందట.

బదరీనాథ్ నుండి భారత దేశపు సరిహద్దు ఆఖరు జనావాస గ్రామంగా పిలువా బడే "మానా" గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

భారత దేశపు ఆఖరి టీ దుకాణం లో వేడివేడి తీ తాగి సేద తీరి వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించు కోవచ్చు. వ్యాస గుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా వినాయకుడు గణేశ గుహలో కూర్చొని మహాభారతాన్ని రచించెనని చెప్తారు. వ్యాసగుహకు కొద్ది దూరం లో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది. పెద్ద శబ్దం తో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు. యిక్కడ అంతర్వాహిని అయిన సరస్వతీ నది తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది.

భీమ్ పుల్ నుంచి వొక కిమీ దూరంలో చిన్న మహాలక్ష్మి మందిరం చూడొచ్చు విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చినప్పుడు లక్ష్మీ దేవి మొదట కాలు పెట్టిన ప్రదేశంగా చెప్తారు. రెండు కిలోమీటర్లు నడిచి వెళితే ద్రౌపతి సమాధిని చూడొచ్చు. అక్కడి నుంచి మరో కిలోమీటరు నడిస్తే కుంతీదేవి సమాధి చూడొచ్చు. కుంతీ దేవి సమాధి నుంచి " వసుధార " మరో మూడు కోలోమీటర్ల దూరం వుంటుంది. కాని వసుధార వరకు వెళ్ళాలంటే మిలటరీ పెర్మిషన్ తెచ్చుకోవాలి. అందుకే మేము కుంతీదేవి సమాధి వరకు వెళ్లి కూడా వసుధార వెళ్లలేకపోయేం. వ్యాస గుహ దగ్గర వున్న కొండలపై వో గుఱ్ఱం ఆకారం కనిపిస్తుంది. అది విష్ణు మూర్తిని దివి నుంచి భువికి తెచ్చిన గుఱ్ఱంగా చెప్తారు. వ్యాస గుహ దగ్గర వున్న స్థానికులని ఎవరిని అడిగినా దీనిని చూపిస్తారు.

యింకా యిక్కడ చూడ వలసిన ప్రదేశాలు యివి నవదుర్గా మందిరం, శివకోవెల, చరణ పాదుక, ఊర్వశి మందిరం, పంచ శిలలుగా చెప్పబడే నర శిల నారాయణ శిల, నారద శిల, గరుడ శిల, వరాహ శిల, పంచ ధారలుగా చెప్పే నాలుగు వేద ధారలు, వసుధారలు.

బదరినాథ్ మందిర ప్రాంగణం లోంచి వెనుక వైపుకి చూస్తే నరశిల, నారాయణశిల కనిపిస్తాయి, వాటిపైన కాషాయరంగు పతాకాలు వుండడం కూడా గమనించ వచ్చు. నారదశిల, గరుడశిలలు ఉష్ణకుండం దగ్గర చూడొచ్చు. వరాహశిలఅలకనంద నది దాటి మందిరానికి వచ్చేటప్పుడు అలకనంద నదిలో కుడివైపున చూడొచ్చు.

వేదధారలుగా పిలువబడే నాలుగు ధారలు మానా గ్రామం వెళ్ళే దారిలో కొండల మీంచి రోడ్డు మీదకు ప్రవహిస్తూ కనిపిస్తాయి. వసుధార భీంపూల్ దగ్గర నుంచి దూరంగా కొండలలో వాతావరణం బాగుంటే కనిపిస్తుంది.

ఊర్వశి మందిరం
సతీదేవి మొక్క 108 పీఠాలలొ యిది వొకటి. యిక్కడ సతీ దేవి యొక్క ఊరువు భాగం పడిందని అంటారు. యీ ప్రదేశం లోనే విశ్వామిత్రుని ఊరువులనుంచి ఊర్వశి వుద్భవించిందని అంటారు. యీ మందిరం చాలా చిన్నది. యిది బదరీనాథ్ గ్రామంలో వుంటుంది. స్థానికులు దీనిని 'ఊర్వశి మాతా మందిర్ ' గా వ్యవహరిస్తారు.

చరణ్ పాదుక -- బదరీనాథ్ కోవెల వెనుక వైపునుంచి కాలి బాటన వెళితే స్వఛ్చమైన నవ్వు మొహాలతో ఆప్యాయంగా పలుకరించి టీ తాగండి ,భోజనం చేసి వెళ్ళండి అని పిలిచే స్టానికుల యిళ్ల మధ్య నుంచి వెళ్ళితే కొంత దూరంలో " అఘొరీ బాబా ఆశ్రమం " కనిపిస్తుంది. దానిని దాటుకొని స్వచ్చమైన సెలయేరు ప్రక్కగా పచ్చని కొండ చరియలలో ప్రయాణం చేస్తూ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చరణ్ పాదుక చేరుకోవచ్చు. యిక్కడ నారాయణుడు తన పాదరక్షలు విడిచి పెట్టి ఆదికేదార్ వెళ్ళేడనేది యిక్కడ ప్రచారంలో వున్న కధ.

శంకరాచార్యులు బదరీ నాథ్ గురించి వేదాలలో చదివి యీ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి విగ్రహాలు నారద కుండంలో వున్నట్లు తెలుసుకొని వాటిని బయటికి తీయించి తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేసి తనతో కుడా వచ్చిన నంబూద్రి బ్రాహ్మణులను నిత్య పూజాది కార్య క్రమాలు నిర్వర్తించుటకు నియమించెనని చెప్తారు. యిప్పటికి యిక్కడ నంబూద్రి వంశస్తులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శంకరా చార్యులచే నిర్మించ బడ్డ యీ దేవాలయం రెండు మూడు మార్లు జరిగిన ప్రకృతి విపరీతాలకు నేలకూలిందని అంటారు. 2013 లో సంభవించిన వరదలలో యీ కోవెలకు ఎక్కువ హాని జరుగలేదు.

ఈ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే జరుగుతుంది. మిగతా ఆరునెలలు కోవెల తలుపులు మూసివేస్తారు. యీ ప్రాంతంలో కార్తీక మాసం మొదలు వైశాఖ మాసం వరకు హిమపాతం విపరీతంగా వుండడంతో యిక్కడి ప్రజలు యీ ఆరునెలలు ఆణి మఠ్, జోషిమఠ్ లలో గడుపుతారు. యీ ఆరునెలలు బదరీ నాథుని మూర్తులను ఆణి మఠ్ లో వున్న కోవెలలో వుంచి పూజలు నిర్వహిస్తారు. యీ కోవేలని వృద్ద బదరి అని అంటారు. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియ నాడు బదరీ కోవెల తలుపులు ఆ జిల్లా కలెక్టర్ సమీపంలో తెరుస్తారు. తలపులు మూసినప్పటి అఖండ దీపం ఆరునెలల తరువాత కూడా వెలుగుతూ వుండడం వో విశేషం. ఆ రోజున అఖండ దీపం దర్శించు కోడానికి ప్రపంచ నలుమూలాల నుంచి వేలాది భక్తులు తరలి వస్తారు.

ఉత్తరాఖండ్ యాత్రలు చేసుకోనే వారికి ముఖ్యంగా చేసే సూచన యేంటంటే తగినన్ని వులెన్స్ పట్టుకు వెళ్ళడం, అందాజుగా వారం రోజులు యాత్ర అంటే మరో నాలుగు రోజులు కలుపుకొని అన్ని రోజులకు సరిపడే విధంగా ప్రణాళిక వేసుకుంటే మంచిది. యెటువంటి ప్రాకృతిక విపత్తులు లేకుండా యాత్ర జరిగితే మంచిదే కాని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో హెచ్చు తగ్గులు విపరీతంగా  ఉంటాయి. అన్నింటికీ తగు జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణం.

యాత్రలు ఎందుకు చెయ్యాలి అంటే మనిషిలో సహన శక్తిని పెంచుతుందట. భగవన్నామ స్మరణతో యాత్ర మొదలు పెట్టండి.

కర్రా నాగలక్ష్మి 

Saturday, 18 March 2017

‘గంగోత్రి’



‘గంగోత్రి’
గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రం

దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్‌ధామ్‌లలో ఒకటి. అక్కడ గంగానది బాగీరథి పేరుతో పిలువబడుతుంది. పూర్వం గంగాదేవిని భూమికి తీసుకోవడానికి భాగీరథుడు కారణం కాబట్టి.. ఆ పేరు వచ్చింది. గంగాదేవి భూవిలో నదిరూపంలో ప్రతిష్టితమవడానికి ఓ పురాణగాధ వుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

పురాణ గాధ :పూర్వం ‘సగరుడు’ అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ‘ఆశ్వమేధ’ యాగం చేశాడు. అప్పుడు సగరుని వైభవాన్ని చూసిన స్వర్గరాజు దేవేంద్రుడు సగరుడు తనపదవికి పోటీకి వస్తాడేమోనన్న భయపడతాడు. దాంతో సగరుడి యాగాన్ని ఎలాగైనా భంగం కలిగించాలని భావించి సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరిస్తాడు. అనంతరం ఆ అశ్వాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టి వేసి ఏమీ తెలియనట్టుగా తిరిగి వెళ్లిపోతాడు. ఈ మొత్తం తతంగం సగరుని 60 వేల కుమారులకు తెలియదు. ఆ అశ్వాన్ని కపిలమునియే అపహరించాడని భావించి.. అశ్వరక్షణార్ధం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపో దీక్షలో ఉన్న కపిలమునిని భంగం కలిగిస్తారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆ కపిలముని.. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు.

అలా కపిల మునిచే భస్మం కావింపబడ్డ తన పిత్రుల ఊర్ధ్వ గతుల కోసం సగరుని మనుమడు అయిన భాగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పిత్రులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే.. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభశివుడేనని చెప్తుంది. అప్పుడు భాగీరథుడు.. గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.

Wednesday, 9 April 2014

కేదార్ నాథ్






ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక BUTTERFLY EFFECT


ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect.

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ. 2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం. ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం. మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది. నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై, కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం. తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది. శైవక్షేత్రం శ్మశానమయ్యింది.

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.
బడబాగ్నికి సలిలం లక్ష్యం.
దేహాగ్నికి దేహమే లక్ష్యం.
ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.
నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా ! — అల్లమప్రభు.


కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి, దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది. హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి. పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన అడుగుల్లో నావి కూడా ఉన్నాయి. 2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు, కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి.. ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు. సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది. అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది. అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది. హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది. రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి. ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది. సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా. ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు. స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు. హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర. మొన్న జరిగిన విలయంలోనూ గుడి చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే. ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు. లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం. రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి. మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు… దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము. వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు. దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు. కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది. జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం.. ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి. నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా… కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది. అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్ హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం. కానీ, ఇంతలా కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు. మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు. ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది. ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు. చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...