Showing posts with label గుజరాత్‌. Show all posts
Showing posts with label గుజరాత్‌. Show all posts

Wednesday, 14 March 2018

పంచ సరోవరాలు









పంచ సరోవరాలు - దేవాలయాలు



మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

  1. మానస సరోవరం,
  2. పంపా సరోవరం,
  3. పుష్కర్‌ సరోవరం,
  4. నారాయణ సరోవరం,
  5. బిందు సరోవరం,

1. మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.

ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు. ;ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.

ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలా మంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.

ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

2. పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది. సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది.

"శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.

రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

3. పుష్కర సరోవరం
పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4. నారాయణ వన సరోవరం
ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.

అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

పితృదేవతలకు తర్పణాలు:
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌



Tuesday, 31 October 2017

ద్వారక - మునిగి తేలిన నగరం

ద్వారక
మునిగి తేలిన నగరం


ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్‌ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్‌. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్‌ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం
ద్వార్‌ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్‌ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ ధామ్‌ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాథ్‌ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.

ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.  ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్‌ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.

బేట్‌ ద్వారక
బేట్‌ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్‌ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్‌ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్‌ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు.
సికింద్రాబాద్, అహ్మదాబాద్‌ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్‌ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.

గోపరాజు పూర్ణిమాస్వాతి

Sunday, 19 March 2017

ద్వారకను చూసొచ్చాం!








ద్వారకను చూసొచ్చాం!



‘‘శ్రీకృష్ణుడు పాలించిన అలనాటి ద్వారక విశేషాలనూ, సోమనాథ్ జ్యోతిర్లింగ మహాత్త్వాన్నీ వైభోగాలకు నెలవైన చిత్తోడ్, ఉదయ్ పూర్ కోటల అందచందాలను ఏకకాలంలో చూసి రావాలంటే గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలను పర్యటించాల్సిందే. ’’

మా పర్యటనలో భాగంగా ముందుగా మేం అహ్మదాబాద్‌కు వెళ్లాం. మేం వెళ్లింది దసరా సమయం కావడంతో ఎక్కడ చూసినా గార్భా సందడే. గుజరాతీలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకునే పండగల్లో దసరా అత్యంత ముఖ్యమైనది. అందుకే నవరాత్రుల తొలి రోజున గార్భాను పూజామందిరాల్లో పెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తారు. తొమ్మిదిరోజులూ భక్తిశ్రద్ధలతో పూజించి దశమినాడు హోమంతో పూజ పూర్తి చేసి దగ్గరలోని దేవాలయాల్లో ఉన్న పూజారులకు దక్షిణ తాంబూలాలతో గార్భాను సమర్పిస్తారు. చుట్టూ చిల్లులు ఉన్న కుండలో దీపం పెట్టి పైన మూతపెట్టినదే గార్భా. ప్రత్యేక ప్రదేశాల్లోనూ వీధికూడళ్లలోనూ మనం అమ్మవారి విగ్రహం పెట్టినట్లుగా ఈ గార్భాలను పెడతారు. చీకటిపడిన దగ్గర్నుంచీ తెల్లారేవరకూ చేసే ఈ గార్భా నృత్యాలనే రాస్‌ అంటారు.

తీన్‌ దర్వాజా!
ముందుగా మేం అహ్మదాబాద్‌లోని భద్రకాళీ మందిరంలో అమ్మవారిని దర్శించుకున్నాం. దేశానికి పశ్చిమం వైపున ఉండటంవల్లనేమో మనకన్నా గంట ఆలస్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉన్నాయక్కడ. పూర్వం నగరానికి స్వాగత ద్వారంలాంటి తీన్‌ దర్వాజా నేడు ప్రముఖ వ్యాపార కూడలి. దానిగుండానే పురాతన జామామసీదుకు వెళ్లాం. తరవాత సబర్మతీ నదీతీరాన్నే ఉన్న గాంధీజీ ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న మ్యూజియాన్నీ చూశాం. ఆ మ్యూజియంలోని ఆనాటి దినపత్రికల్లో మన ఆంధ్ర పత్రిక కూడా ఉంది. అవన్నీ తిరిగి చూస్తుంటే నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా అనిపించాయి.

శ్రీకృష్ణ ద్వారక!
తరవాత చార్‌ధామ్‌లలో ఒకటైన ద్వారకకు బయలుదేరాం. దారి పొడవునా పవన విద్యుచ్ఛక్తికోసం ఏర్పాటుచేసిన గాలిమరలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి ఏడు గంటలు ప్రయాణించి ఇరుకిరుకు సందులతో ఉన్న ద్వారకలోకి అడుగుపెట్టాం. గోమతీనది అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో విశ్వకర్మ చేతుల్లో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణ రాజధాని ద్వారక ఇదేనా అనిపించింది. అలనాటి ద్వారక అనేకసార్లు సముద్రంలో మునిగిపోయింది. ఏడోసారి నిర్మించినదే ప్రస్తుత ద్వారక. ముందుగా ద్వారకాదీశ మందిరానికి వెళ్లాం. అద్భుతమైన శిల్పకళతో కట్టిన ఆ గుడిలో స్వామివారి నల్లరాతి విగ్రహం చక్కని అలంకరణతో నయన మనోహరంగా ఉంది. కృష్ణభక్తురాలైన మీరాబాయి భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రజలు చూస్తుండగానే గర్భగుడిలోకి వెళ్లి మరి బయటకు రాలేదట. ఆ మహాభక్తురాలు కృష్ణుడిలో ఐక్యమైపోయిందని విశ్వసిస్తారు భక్తులు.

అక్కడకు బెట్‌ ద్వారక ఐదు కిలోమీటర్లు. ఆ దారిలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగం, గోపీతలావ్‌, రుక్మిణీమందిరం, సముద్ర నారాయణుని గుడి మొదలైన దర్శనీయ స్థలాలు ఉన్నాయి. లాంచీలో చిన్నదీవిలా ఉన్న బెట్‌ ద్వారకకు వెళ్లాం. అక్కడ కృష్ణుడు, సత్యభామ, ఇతర దేవేరుల మందిరాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ద్వారక, బెట్‌ ద్వారకల మధ్య గరుత్మంతునిపై తిరిగేవాడట. సూర్యాస్తమయ సమయానికి సముద్రతీరానికి చేరుకున్నాం. నేలనుంచి సుమారు 30-40 అడుగులు కిందకు కుంగిపోయినట్లు దిగబడిపోయిన సముద్ర ఒడ్డును చూస్తుంటే ఒళ్లు జలదరించినట్లయింది. ఏదో ఉపద్రవంతో ఒక్కసారిగా భూమి ముక్కలైపోయినట్లుగా పొరలుపొరలుగా కనిపిస్తుంది. అది చూస్తుంటే నాటి పురాణాలూ ఇతిహాసాలూ నిజంగా జరిగాయా అనిపించకమానదు. గాంధీగారి సొంతూరు!

ద్వారకకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది పోరుబందరు. కృష్ణుడు కుచేలుడికి బహూకరించిన నాటి సుధామపురే నేటి పోరుబందరు. కృష్ణుడు రాజమందిరాన్ని ప్రసాదించినా అందులో నివసించకుండా పక్కనే చిన్న గదిలో ఉంటూ కృష్ణుణ్ణి పూజించి తరించిన ఆ సుధామ మందిరం, దాని పక్కనే ఆయన గదీ నాటి బావీ నేటికీ ఉండటం విశేషం. అక్కడనుంచి తరవాత గాంధీజీ జన్మించిన ఇంటిని చూడ్డానికి బయలుదేరాం. పురాతన భవనమైనా చెక్కుచెదరలేదు. ఎగువ మధ్యతరగతి వైశ్య కుటుంబం కావడంతో ఇల్లు దర్పంగా విశాలంగా ఉంది. బాపూజీ తల్లిదండ్రులవీ బాపూజీ-కస్తూర్బాలవీ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు అలంకరించారు.

ప్రభాస పట్టణ దర్శనం...
అక్కడకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్‌కు రాత్రికి చేరుకున్నాం. పురాణాల్లో దీన్నే ప్రభాస పట్టణంగా చెబుతారు. పాలసముద్రంలాంటి అరేబియా ఒడ్డున విశాలమైన ప్రాంగణాల్లో అద్భుత శిల్పకళా చాతుర్యానికి నితువెత్తు దర్పణంలా మెరిసిపోతుంది ఈ దేవాలయం. మందిరం దగ్గర్లోనే కపిల, హిరణ్య, సరస్వతి అనే మూడు నదుల త్రివేణీ సంగమస్థానం భక్తులతో సందడిగా ఉంది.

కృష్ణుని మహాప్రస్థానం..!
మహా ప్రళయానికి ద్వారక నాశనం కాగా శ్రీకృష్ణుడు సోమనాథ్‌ పక్కనే ఉన్న భాలకా అనే ప్రదేశం చేరుకుని చెట్టు కింద విశ్రమిస్తున్నాడట. ఆయన పాదాన్ని లేడి కన్నులా భావించి కిరాతకుడు వేటకై బాణాన్ని విడవగా అది కృష్ణ పరమాత్మ ప్రాణాలు గైకొందట. బలరాముడు ఆదిశేషుని రూపంలో త్రివేణీసంగమం దగ్గర ఉన్న పుట్ట ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయాడట. శంఖుచక్రాలు సముద్రంలో లీనమై గోమతీ చక్రాల రూపంలో సోమనాథ్‌-ద్వారకల మధ్య ఉన్న సముద్ర ప్రదేశంలో మాత్రమే లభిస్తున్నాయట. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రంలా ఉండి ఇవి లక్ష్మి-విష్ణు స్వరూపంగా సర్వశక్తిమంతమై నేటికీ పూజలందుకుంటున్నాయి.

చిత్తోడ్‌గఢ్‌ కోటలో...


అక్కడ నుంచి రాజుపుత్రుల శౌర్యప్రతాపాలూ వైభోగాలూ దర్శించడానికి రాజస్థాన్‌కు బయలుదేరాం. దారిపొడవునా పాలరాతి కొండలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు ముందు మేవాడ్‌ రాజుల రాజధాని ఈ చిత్తోడ్‌గఢ్‌. క్రీ.శ. 7-16 వరకూ ఎన్నో వైభోగాలతో తులతూగింది. ఖిల్జీల దండయాత్రలో నాశనమైపోయింది. మీరా పూజలందుకున్న కృష్ణమందిరం నేటికీ పూజలందుకుంటూ గత స్మృతుల్లోకి మనల్ని నెడుతుంది. శివమందిరంలో బాల, ఫ్రౌడ, వృద్ధ రూపాలుగా శిరస్సు మాత్రమే కనిపించేలా చెక్కిన ఎత్తైన శివుని విగ్రహం కొంత భయం గొలిపేలా ఉంది. ఆ పక్కనే గోముఖ్‌ రిజర్వాయర్‌, కాళీమందిరం, రాణీ పద్మినీ ప్యాలెస్‌, గులాబీవనం, జైనమందిరం కనిపిస్తాయి.

అద్భుత అందగత్తె అయిన రాణీ పద్మినీ, రాణీ కర్ణావతిల సమాధుల్ని చూశాం. చిత్తోడ్‌ సామ్రాజ్యాధికారం కోసం పసిబిడ్డగా ఉన్న ఉదయ్‌సింగ్‌ని చంపాలనుకున్నారట దాయాదులు. ఈ కుట్రను పసిగట్టిన దాసి పన్నాబాయి ఉదయ్‌సింగ్‌ స్థానంలో అదే వయసున్న తన బిడ్డను ఉంచిందట. దాయాదుల చేతిలో ఆ బిడ్డ హతం కాగా చిన్నారి ఉదయ్‌సింగ్‌తో పన్నాబాయి కోట దాటి తప్పించుకున్న ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఇలా ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నిలయం చిత్తోడ్‌కోట. ప్రస్తుతం కొండజాతివారు ఈ కోటలో సీతాఫలాలు పండించుకుంటూ జీవిస్తున్నారనీ వాళ్లు రాణా ప్రతాప్‌కు సహాయం చేసిన భీల్‌ తెగవారనీ మా గైడ్‌ చెప్పాడు. నార చీరలు తయారుచేయడం, అతి తేలికైన రజాయిలు చేయడం వాళ్ల ప్రత్యేకత అనీ, ప్రభుత్వ సహకారంతో వాటిని కోటలోని దుకాణాల ద్వారా అమ్ముకుంటూ ఆ డబ్బుతోనే జీవించే నిజాయతీ పరులనీ చెప్పాడు. తరవాత అక్కడినుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లాం.

సరస్సుల నగరంలో విహారం... 


మహారాణా ఉదయ్‌సింగ్‌ అడవిలాంటి ఈ ప్రదేశానికి వేటాడుతూ రాగా గోస్వామి ప్రేమ్‌జీ అనే సన్యాసి ఇక్కడ కోటను నిర్మించమన్నాడట. ఆయన ఆదేశంతో 1559లో నాలుగు అంతస్తులుగా కోటనూ నగరాన్నీ నిర్మించాడట. అందుకే ఈ నగరం ఆయన పేరు మీదనే ఉదయ్‌పూర్‌గా స్థిరపడింది. నగరానికి రాణీలాంటి సిటీ ప్యాలెస్‌ పిచోలా సరస్సు పక్కనే ఉన్న కొండమీద ఉంది. ఇప్పటికీ ఉదయ్‌సింగ్‌ వంశంలోని 24వ తరం వారి అధీనంలోనే ఈ కోట ఉంది. వారి కులదైవమైన సూర్యుని ముద్ర ప్రవేశద్వారంపై ఉంటుంది. లోపల విశాలమైన వరండాలూ గదులూ ఉన్నాయి. ఉదయ్‌సింగ్‌ కుమారుడు రాణా ప్రతాప్‌, మొఘల్‌ చక్రవర్తుల కొమ్ముకాస్తున్న జైపూర్‌ రాజు రాజా మాన్‌సింగ్‌ని చంపడానికి తన గుర్రం చేతక్‌కు ముందు ఇనుముతో చేసిన ఏనుగుతొండం కట్టి కదనరంగంలోకి వెళతాడు. మాన్‌సింగ్‌ అధిరోహించిన ఏనుగు, దాన్ని ఓ పిల్ల ఏనుగుగా భావించి చేతక్‌ జోలికి రాదు. అయితే అది దగ్గరకొచ్చాక చేతక్‌ ఒక్కసారిగా కత్తులు కట్టిన తనముందు కాళ్లతో పైకి లేవడంతో రాణా చేతిలో మావటి క్షణాల్లో చనిపోయాడట. కానీ మాన్‌సింగ్‌ కిందకు వంగడంతో ప్రాణాలతో బయటపడతాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ రాణాప్రతాప్‌ను తను గాయపడ్డా కూడా యుద్ధభూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబాల్‌గఢ్‌ వరకూ తీసుకెళ్లి అక్కడ 42 అడుగుల వెడల్పు ఉన్న బనాస్‌ నదిలో దూకి రాణా ప్రాణాలు కాపాడి చేతక్‌ కన్ను మూసిందట. ఆ దృశ్యాలన్నీ తైలవర్ణ చిత్రాల్లో చిత్రించి ఉన్నాయి. ఇక, రాజదర్బారు, సింహాసనాలతోబాటు రాజప్రాసాదానికే తలమానికమైన అద్దాల నెమలి ఆనాటి కళాకారుల పనితనానికి ప్రతీక. మేవాడ్‌ రాజులు సూర్యదర్శనం తరవాతే భోజనం చేస్తారు. శ్రావణమాసంలో సూర్యదర్శనం కష్టం కాబట్టి, ఆ సమయంలో దర్శించుకోవడానికి ప్రజ్వలంగా వెలుగుతున్నట్లున్న సూర్యబింబం ఆకారాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆటపట్టించడానికి నిర్మించిన రాతి తలుపులూ సరదా పుట్టించే వేట దృశ్యాల వర్ణ చిత్రాలూ... ఇలా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు అక్కడ ఉన్నాయి.

పాలరాతితో చేసిన తొట్టెలో బంగారునాణాలను నింపి దసరా కానుకగా జనానికి పంచేవారట. సుగంధద్రవ్యాలతో హోలీ ఆడుకునే చిన్న కొలనూ ఫౌంటెయినూ అద్దాల మందిరమూ ముఖమల్‌ మందిరమూ... ఇలా అవన్నీ చూస్తుంటే సమయమే తెలియలేదు.


కోటపైనుండి ఒకవైపు సరస్సు మధ్యలో మహారాజా జగత్‌సింగ్‌ నిర్మించిన వేసవి విడిది లేక్‌ ప్యాలెస్సూ దానికి కొద్దిదూరంలో ఉదయ్‌విలాస్‌ కోటా కనిపిస్తాయి. అక్కడ నుంచి సహేలియోంకీ బాడీకి వెళ్లాం. రాణా సంగ్రామ్‌సింగ్‌ ఆనాటి రోజుల్లోనే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఫౌంటెయిన్లు నిర్మించిన అందమైన ఉద్యానవనమే ఈ సహేలియోంకీ బాడీ. ముందుగా వెల్‌కమ్‌ ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. మనం వస్తుంటే ఇందులోంచి నీళ్లు పైకి చిమ్ముతాయి. తరవాత జోరువాన శబ్దం వినిపించే బాదల్‌ బర్‌సాత్‌, చెట్ల ఆకులూ పొదలమీద పడుతున్న వాన శబ్దాన్ని వినిపించే శ్రావణ బరసాత్‌ ఫౌంటెయిన్లనీ చూశాం. చివరగా తామరకొలను దగ్గరకు వెళ్లాం. దానికి నలువైపులా పాలరాతి ఏనుగుల తొండాల నుంచి నీరు చిమ్మేలా నిర్మించారు. అలాగే కొలను మధ్యలో రకరకాల పక్షుల ముక్కుల నుంచి నీళ్లు రావడం ఎంతో బాగుంది. చివరిగా రాణాప్రతాప్‌ స్మారక స్తూపం చూసి తిరుగు ప్రయాణమయ్యాం.



Friday, 24 February 2017

రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ ఆలయం కనిపిస్తుందట!

గుజరాత్ రాష్ట్రం భావనగర్‌ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉంది కొలియాక్‌ గ్రామం. తీరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక విశాలమైన రాతి చప్టా కనిపిస్తుంది. ఓ పక్క త్రిశూలం, మరోపక్క శివలింగాలు కనిపిస్తాయి. పైన సిందూర వర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఇక్కడ శివలింగాలతో పాటు ఒక నీటి గుంట ఉంది. దీనిని ‘పాండవ కొలను’ అని పిలుస్తారు. భక్తులు ఈ కొలనులో కాళ్లు కడుక్కుని శివుణ్ణి దర్శించుకుంటారు. సముద్రంలో ఆలయమేంటి? దాన్నెవరు నిర్మించారు? ఎలా వెళ్లడం?... అని ఎవరికైనా ఉత్సుకత కలుగుతుంది. మన ఉత్సాహానికి సమాధానాలు దొరికేలోపే ఆ గుడి మాయమైపోతుంది. ఇరవై అడుగుల పొడవున్న ఆలయ ధ్వజస్తంభం పూర్తిగా నీట మునిగి దానిపైనున్న జండా ఒక్కటే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఏమిటీ వింత? అనే మరో కొత్త ప్రశ్న ఎదురవుతుంది.

కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత ఐదుగురు పాండవులూ భాతృ, బంధువర్గ హత్యాపాతకాల నుంచి విముక్తి కోసం ఇక్కడ అయిదు శివలింగాలను ప్రతిష్టించి కొలిచారట. వారి ప్రార్థనను మన్నించడంతో ఆనాటి నుంచి సర్వేశ్వరుడు ఇక్కడ ‘నిష్కలంక మహదేవ్‌’గా పూజలు అందుకుంటున్నాడు. కాలక్రమంలో ముందుకు రావడమో, వెనక్కిపోవడమో సముద్రం లక్షణం. కొన్నిచోట్ల వెనక్కి తగ్గి కొత్త భూభాగాన్ని సృష్టిస్తే... మరికొన్ని చోట్ల ముందుకు వచ్చి ఉన్న భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుంది సముద్రం. అలా ఈ శివాలయం సముద్రంలో మునిగిపోయింది.

అయితే రోజులో కొన్నిగంటల పాటు ఆటు సమయంలో సముద్రమట్టం తగ్గి ఆలయం బయటపడుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజులలో సముద్ర పోటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆటు సమయం కూడా ఎక్కువే కనుక ఆ రెండు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ భాదర్వి అనే వేడుక జరుగుతుంది. భావనగర్‌ రాజవంశీయులు ఆ వేడుకలో పాల్గొని ధ్వజ స్తంభంపై కొత్త జెండాలను ఆవిష్కరిస్తారు. రోజూ ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి ఇస్తారు.

మహాదేవుణ్ణి అర్చించాలనుకునేవారు ఆ సమయం కోసం నిరీక్షించాల్సిందే! ఆ సమయంలోనే నడుములోతు నీళ్లల్లో తాళ్ల సహాయంతో నడుస్తూ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇలా సముద్రం ఆలయాన్ని ముంచి, మళ్లీ వెనక్కి వెళ్లినట్టే... తమను నిండా ముంచిన పాపాలు... ఆ మహేశ్వరుడి అనుగ్రహంతో వెనక్కి మళ్లిపోతాయని భక్తుల విశ్వాసం.

Monday, 14 November 2016

నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగం ఒకటి. ఇది గుజరాత్‌లోని దారుకావనంలో ఉంది. నేటి దారుకావనాన్నే పురాణాలలో కామ్యకవనం అని, ద్వైతవనమనీ పేర్కొన్నారు. దీని గురించిన గాథలు చాలా ఉన్నాయి కానీ, ముఖ్యమైనవాటిని చూద్దాం..

పూర్వం ఒక సముద్రతీరాన గల ఒక వనంలో దారుకుడనే రాక్షసుడుండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం, మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్నవారినే కాదు, అటుగుండా వచ్చీపోయేవాళ్లని కూడా వదలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకుని, తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమిమీద ఉంటే, వారిలో హింసాప్రవృత్తి ఉంటే, వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారుకుడు సముద్రంలోకి వెళ్లి, అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని, అందులో ఉంటూ, సముద్ర ప్రయాణీకులను హింసించ డమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు.

ఒకసారి వాడలా సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి, వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కాసిని నీళ్లుపోసి, ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహామేరకు అతనితో కలసి ఉన్నవారందరూ కూడా మహా పవిత్రమైన, అత్యంత శక్తిమంతమైన శివపంచాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, ‘‘నీవు శివారాధన చేయరాదు. చేస్తే, మా రాజు, రాణి అయిన దారుకా దారుకిల ఆరాధన మాత్రమే చేయాలి. తక్షణం నీ శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తాం’’ అని బెదిరించారు.

సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి, బెదిరించాడు. అయినా వినలేదు. ఇలా లాభం లేదని, కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు అక్కడే జ్యోతిర్లింగరూపంలో కొలువయ్యాడు. అన్ని కథల్లా ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడి భార్య దారుకి పార్వతీదేవికి ప్రియభక్తురాలు కావడంతో తనకు లభించిన కొన్ని శక్తుల వల్ల తన అనుచరుల సాయంతో ఆ అడవినంతటి నీ తీసుకుపోయి సముద్రం అడుగుకు చేర్చింది.దాంతోపాటు ఆ వనంలోకి అడుగుపెట్టిన వారినందరినీ తమ అధీనంలోకి తీసుకుని, వారిని బలవంతంగా తమ రాజ్యప్రజలుగా మార్చసాగింది.

శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి పూజమానవలసిందిగా నిర్బంధిస్తూ, ఆమె, ఆ రాక్షసగణం సుప్రియుని చిత్రహింసల పాలు చేయడం మొదలు పెట్టారు. మరల శివుడు ప్రత్యక్షమై, సుప్రియుడికి ఒక శక్తిమంతమైన ఆయుధాన్నిచ్చాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు వారందరినీ జయించాడు. ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి, వారందరినీ ఏ దుష్టశక్తులూ ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువుతీరి, భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. ఆ రాక్షసగణాన్ని అక్కడినుంచి దూరంగా పంపించి, వారు జనావాసాలలోకి రాకుండా చేసింది జగన్మాత. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి, వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈమేరకు శివపార్వతులు నాగేశ్వరుడు, నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.

అతి ప్రాచీన గాథ:
పూర్వం వాలఖిల్యులనే మునులు దారుకావనంలో శివుని గురించి సుదీర్ఘకాలంపాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువసన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువసన్యాసి వంటిమీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువసన్యాసిని చూసి, మునిపత్నులు మనసు పారేసుకుని, భర్తలను వదిలేసి, ఆ దివ్యసుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి, కోపం కట్టలు తెచ్చుకుంది ఆ మునులలో. ఆ యువసన్యాసి లింగం తెగిపోవాలని శపించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్తా జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణులు భూమి మీదకు వచ్చి, ఆ మునుల తప్పిదాన్ని మన్నించి, లింగాన్ని వెనక్కు తీసుకుని, లోకాలను కాపాడమని శివుని ప్రార్థించారు. శివుడు శాంతించి, భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి, మునులను అనుగ్రహించాడు. వంటిమీద పాములనే వస్త్రాలుగా చుట్టబెట్టుకుని వచ్చాడు కాబట్టి, నాగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా... పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది.

మరోగాథ:
తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో సతీవియోగాన్ని తట్టుకోలేక ఓ నదీతీరానికొచ్చి తాను కూడా దహించుకుపోయాడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా, కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి, ఆ నదీజలాలు వాటి పాలధారలతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్న భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉండి ఉంటుంది. నదిలో దేవతలో, తపస్సులో ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నదీజలాలను తోడేసే ప్రయత్నం చేసి, సాధ్యం కాకపోవడంతో కోపంతో నదిమీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలి పోయింది. నది మధ్యభాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపుచారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి, నీటి అడుగున నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. దారుకలు అంటే దేవదారు వృక్షాలు. ఇక్కడ దేవదారు వృక్షాలు విరివిగా ఉండటం వల్ల దారుకావనమనే పేరు వచ్చింది. ఈ వనంలో 20 మీటర్ల ఎత్తున్న శివుని విగ్రహం చూపరులను కన్నులు తిప్పుకోనివ్వదు. ఆలయం సుందరంగా ఉంటుంది.
D.V.R.భాస్కర్

Thursday, 3 November 2016

అంబాజీ మాత దేవాలయం

హృదయ పీఠం


విగ్రహమే లేని ఆలయం. కళ్లకు గంతలు కట్టుకొని దైవ దర్శనం. సీతాన్వేషణలో రాముడికి ధనుర్భాణాలను ఇచ్చిన దైవం. శ్రీకృష్ణుడు తల నీలాలు సమర్పించిన పుణ్యక్షేత్రం. కృష్ణుడుని భర్తగా పొందడానికి రుక్మిణీదేవి పూజలు చేసిన పుణ్యస్థలం. ఇలా ఎన్నో విచిత్రాలు, ఇంకెన్నో విశిష్టతలు, మరెన్నో పురాణగాథలు గల ఈ పుణ్యక్షేత్రం గుజరాత్‌లోని ఆరావళి పర్వత శ్రేణులలో కొలువై ఉంది. అంబాజీ మాత దేవాలయంగా ప్రపంచమంతా పేరుప్రఖ్యాతలు గల ఈ ఆలయం అత్యంత శక్తిమంతమైన శక్తి పీఠంగా విరాజిల్లుతుంది.

భారతదేశంలోని అతి ప్రాచీన, ఎంతో ఖ్యాతి పొందినది అంబాజీ ఆలయం. గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో బనస్కాంత జిల్లాలోని దంతా తాలూకా సమీపంలో అరసుర్ కొండలపై ఉంటుంది ఈ ఆలయం. మౌంట్ అబూ నుండి 45 కిలోమీటర్లు పాలంపూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే ఈ కొండలు. ఈ కొండలపైనే వేదకాలానికి చెందినదిగా చెప్పుకునే అంబాజీ మాత దేవాలయం ఉంది. అరసుర్ కొండల పేరుతోనే ‘అరాసురి అంబాజీ’గా అమ్మవారిని కొలుస్తారు.

ఈ ఆలయాన్ని చేరుకోవటానికి 999 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయ గోపురంపైన స్వర్ణ కళశాలు సూర్యకాంతిలో మెరుస్తుంటాయి. నగిషీలు చెక్కిన వెండి ఆలయ ప్రధాన ద్వారం చిన్నదిగా ఉంటుంది. పాత పాలరాతి ఫలకాలపైన ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ వేద భాష రాయబడి ఉంటుంది. సతీదేవి హృదయ స్థానం

సతీదేవి శివుడు ఆది దంపతులు. వీరి దాంపత్య అనుబంధం సామన్యులకు అర్థం కానిది. ఒకే ఆత్మ - ఒకే దేహంగా శివపురాణం ఈ దంపతుల కథనాలెన్నింటినో తెలియజేస్తుంది.

సతీదేవి తన తండ్రి దక్షుణి యజ్ఞకుండంలో చేరి ప్రాణత్యాగం చేసినప్పుడు, శివుడు ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని ప్రళయకార రుద్రుడై ముల్లోకాలలో ప్రయాణిస్తుండగా  విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడని, దీంతో సతీ దేవి దేహ ఖండాలు భరతఖండం మీద పడ్డాయని పురాణలు తెలియజేస్తున్నాయి. సతీదేవి శరీర ఖండాలు పడిన 51 స్థలాలు శక్తిపీఠాలయ్యాయి. వాటిలో సతీదేవి హృదయం అంటే గుండె భాగం అరసుర్ కొండల మీద పడింది. సతీదేవి హృదయం నిండా శివుడు కొలువై ఉన్నాడు. అమ్మవారి హృదయం, ఆమె హృదయంలో కొలువున్న శివుడు ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చడానికి వెలిశారని కథనం. ఆ విధంగా అంబాజీ మాత ఆలయం శక్తిపీఠాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఆర్యవంశీయుల ఆరాధ్య దేవత
వేదకాలం నాటి నుంచి ఉన్న సరస్వతి నది ఈ పర్వతశ్రేణులలోనే ప్రవహిస్తుంది. ఈ నదికి దగ్గరలోనే అంబాజీ మాత ఆలయం ఉది. ఆర్యవంశీయులు ఆరాధించే దేవతలలో ఒక దేవతగా అంబాజీమాత పూజలందుకున్నట్టుగా కథనాలు ఉన్నాయి.  రావణుడితో సంగ్రామానికి బయల్దేరిన రాముడికి అంబాజీ మాత తన విల్లంబులను వరంగా ఇచ్చిందంట. అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలతోనే రావణ సంహారం నిర్విఘ్నంగా జరిగిందని చెబుతారు.

అమ్మవారి ఆశీస్సులు అందుకున్న శ్రీకృష్ణుడు ఇక్కడే తలనీలాలు సమర్పించుకున్నాడని, రుక్మిణిదేవి అంబాజీ మాత కృపతోనే శ్రీకృష్ణుని భర్తగా పొందినదని కథనాలు ఉన్నాయి. పాండవులు వనవాసం చేసేటప్పుడు అంబాజీ మాతను కొలిచేవారని, అందువల్లే వారు విజయావకాశాలను పొందారనీ చెబుతారు.

మూర్తి కాదు శ్రీ యంత్రం
మూలమూర్తి ఇక్కడ శ్రీ విస యంత్రం. ఈ యంత్ర పీఠానికే వస్త్రాలు, ఆభరణాలు అలంకరించిన తీరు అమ్మ మూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. ఈ పీఠాన్ని నేరుగా దర్శించకూడదని, కళ్లకు గంతలు కట్టుకొని దర్శించాలనే నియమం ఆసక్తిదాయకంగా ఉంటుంది. అమ్మవారి నిజరూపాన్ని సామాన్యజనం చూసి తట్టుకోలేరనే ఈ నియమం పెట్టారని స్థానికులు చెబుతారు. ఈ యంత్రం ముందు ఒక దీపశిఖ మాత్రమే నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. ఆలయ ఆవరణ అంతా భక్తులు ‘జయ మాతా జీ’ అంటూ సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతుంది.

పౌర్ణమి ప్రత్యేకం
అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు ‘లోక్ మేలా పే’ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. దసరా నవరాత్రి ఉత్సవాలూ వైభవంగా జరుపుతారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ జరిగే గర్భానృత్యాలు అత్యంత నయనానందకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా బాద్రపద పౌర్ణిమ, దీపావళి పర్వదినాల్లో ఉత్సవాలు దీపాలంకరణలతో ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు అంబాజీ ఆలయానికి చేరుకుంటారు.  పౌర్ణమి వెలుగుల్లో, విద్యుత్  దీపాల జిలుగుల్లో దేవాలయ అందం వర్ణించనలవి కాదు.

ప్రకృతి పరవశం
ఆలయం చుట్టూ గల ఆరావళి పర్వతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాతికతల మేలుకలయికగా పర్యాటకులను ఆనందపరవశులను చేస్తుంది. కొండపైన సూర్యోదయ, సూర్యాస్తమయాల దృశ్యాలను తిలకించడం ఒక మధురానుభూతిగా పర్యాటకులు భావిస్తారు. మన దేశ ప్రధాని నుంచి అంబాజీ ఆలయాన్ని ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది భక్తులు దర్శించుకున్నారు. విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత తమను తాము సమర్పించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం. పర్యాటకులకు శక్తిపీఠాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ లభ్యం అవుతాయి. ఆది శక్తి మహిమను ఈ ఆలయ సమాహారం తెలియజేస్తుంది.

సమీప ఆకర్షణలు
పర్వతశ్రేణులలోని సుందర దృశ్యాలనే కాకుండా రోప్‌వే ఎక్కడం ద్వారా కూడా ఆనందించగలిగిన కొండలు ఇక్కడ ఉన్నాయి.
వేదకాలపు స్వచ్ఛమైన సరస్వతి నది అంబాజీ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గరగా శ్రీ కొటేశ్వర మహాదేవ, వారాహి, గణపతి ఆలయం ఉన్నాయి. ఇది అంబాజీ ఆలయం నుంచి 8 కిలోమీటర్ల దూరం. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం, శక్తి ఆశ్రమం ప్రధాన ఆకర్షణలు.
మన్‌సరోవర్ అనే పెద్ద సరస్సు అంబాజీ ఆలయానికి వెనక వైపుగా ఉంటుంది. దీనిని శ్రీ తపిశంకర్ అనే భక్తుడు 1584-1594 మధ్య నిర్మించాడు. ఈ సరస్సుకు నాలుగు వైపులా మెట్లు, రెండువైపులా దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మహాదేవ్ ఆలయం, మరొకటి అజయ్‌దేవీ ఆలయం. అజయ్‌దేవిని మాతా అంబాజీ సహోదరిగా భావిస్తారు. మన్‌సరోవర్‌లో స్నానమాచరించి ఆలయాన్ని దర్శిస్తారు. ఈ సరస్సు ప్రాకార కుడ్యాల మీద రాజా మాల్‌దేవ్ గురించి శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనం అంబాజీ మాత చరిత్రను గురించిన వివరాలను తెలియజేస్తుంది.
బలరాం వన్యప్రాణుల అభయారణ్యంలో అనేక రకాల పక్షులు, జంతువులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు భారీ స్థాయిలో ఉన్నాయి.
అంబాజీ ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఆకర్షణ మాంగళ్య వనం ఉంది. ఈ తోటలో జ్యోతిష్య మొక్కలు ఉంటాయి. భక్తులు వారి వారి జాతక రాశుల ప్రకారం మొక్కలను ఇంటికి తీసుకొని వెళతారు.

ఇలా చేరుకోవాలి...
విమానమార్గం: 
అంబాజీకి 180 కి.మీ దూరంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ, బస్సులలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు.

రైలుమార్గం: 
అంబాజీకి 20 కి,.మీ దూరంలో రోడ్డు స్టేషన్ ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి.

రోడ్డు మార్గం: 
అహ్మదాబాద్, మౌంట్ అబూ, ఢిల్లీ, పాలంపూర్, హిమ్మత్‌నగర్ మొదలైన నగరాల నుండి అంబాజీకి బస్సు సదుపాయాలు ఉన్నాయి.

- నిర్మలారెడ్డి

Sakshi | October 09, 2016.

Thursday, 6 October 2016

డ్యూమాస్‌ బీచ్‌ - ఆ బీచ్‌లో ఆత్మలు ఉన్నాయా?

అనగనగా ఓ బీచ్‌.. 
చుట్టూ చిమ్మచీకట్లు.. 
హోరున శబ్దం చేసే అలలు.. 
చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక.. 
చిత్రవిచిత్రంగా వీచే పిల్లగాలులు.. 
చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినీవినిపించని మాటలు.. 
అంతలోనే ఒళ్లు గగుర్పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు.. 
దూరంగా ఎవరితోనో కొట్లాటకు దిగినట్టుగా కుక్కల అరుపులు.. 
చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం.. 
ఇవి చాలవూ ఓ మనిషి బిక్కచచ్చిపోవడానికి..?

గుజరాత్‌లోని సూరత్‌కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్‌ బీచ్‌ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు పర్యాటకులు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, అవి రాత్రి పూట బీచ్‌ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయనేది ప్రధానంగా వినిపించే మాట. సాయంత్రం అయితే చాలు. స్థానికులు ఈ బీచ్‌ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్‌ వైపు వెళ్తామనగానే అడ్డుపడతారు. అటువైపు వెళ్లొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్‌లో అంతగా భయపెట్టే అంశమేంటి..?

నల్లని ఇసుక..
నిజానికి డ్యూమస్‌ బీచ్‌ ఒకటి కాదు.. నాలుగు బీచ్‌లను కలిపి డ్యూమస్‌ బీచ్‌గా పిలుస్తారు. వీటిలో రెండు పర్యాటకులకు బాగా తెలిసినవే. మూడో బీచ్‌ను కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక, నాలుగో బీచ్‌లో జనసంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్‌లోనూ కనిపించని విధంగా ఈ బీచ్‌లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. దీనికి స్థానికులు చెప్పే వివరణ.. స్మశానం! అవును, ఒకప్పుడు డ్యూమస్‌ బీచ్‌లో ఓ హిందూ స్మశానం ఉండేది. వేలాది హిందువులను అక్కడే ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద.. సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందని చెబుతారు స్థానికులు.

ఆత్మల సంచారం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించినవారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్‌లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్‌ ఒడ్డున తిరిగేవారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందని, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్టుగా చిత్రవిచిత్రంగా అరుస్తాయని గ్రామస్థులు చెబుతారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్‌ బీచ్‌.. చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకర రూపాన్ని సంతరించుకుంటుంది. పర్యాటకులు, స్థానికులు భయపడేందుకు ఇదీ ఓ కారణం కావొచ్చు.

విచిత్ర ప్రవర్తన..
డ్యూమస్‌ బీచ్‌ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి విచిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్‌కు రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టు, వారితో గొడవ పడుతున్నట్టు కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలదీ ఇదే పరిస్థితి. ఈ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలూ పడతారట ఈ బీచ్‌లో. ఇవి కాకుండా.. పర్యాటకుల శరీరాలను ఏవో గాలులు తాకుతున్నట్టూ, వారిని ముందుకు వెళ్లవద్దనట్టుగా అడ్డుకుంటున్నట్టూ అనుభూతి కలుగుతుందట.

మిస్సింగ్‌...?
స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి, రాత్రి పూట బీచ్‌ను సందర్శించిన కొందరు పర్యాటకులు ఇప్పటికీ కనిపించకుండా పోయారనే ఓ పుకారు సమీప గ్రామాల్లో వినిపిస్తూ ఉంటుంది. గతంలో కొందరు స్థానికులు కూడా బీచ్‌కు వెళ్లి తిరిగిరాలేదట.

భయపెట్టే హవేలి..
ఈ బీచ్‌లో మరింత భయపెట్టే కథలు హవేలి విషయంలో వినిపిస్తాయి. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్‌లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక, పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచే అనుమతించడం లేదు.

అంతా భూటకం..
ఈ మొత్తం కథనాన్ని భూటకమని కొట్టి పారేసేవారూ ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్‌లో రాత్రిపూట బస చేశారు. కానీ, వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా.. తమకు ఎలాంటి అసహజ అనుభవాలూ ఎదురుకాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టారని, నిజానికి డ్యూమస్‌లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో అవి ఫ్లాష్‌ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా.. లేదా అన్నది పక్కన బెడితే, ప్రస్తుతం దేశంలోని డిమాండ్‌ ఉన్న బీచ్‌ల్లో ఇదీ ఒకటిగా మారిపోయింది. ఆత్మలా మజాకానా..!
(సాక్షి స్కూల్ ఎడిషన్)

Monday, 29 August 2016

కృష్ణుయ్య ఐదు దివ్య ధామాలు

‘దేవకి పంట...
వసుదేవు వెంట...
యమునను నడిరేయి దాటితివంట...
వెలసితి వంట..
నందుని ఇంట...
రేపల్లె ఇల్లాయెనంటా....’

పుడుతూనే ఇన్ని లీలలు చేసిన బాలకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ నల్లనయ్య పుట్టినరోజు. తాను వెలసిన క్షేత్రాలంటే కన్నయ్యకు వెన్నముద్దలంత ఇష్టం. అటువంటి ఐదు దివ్య ధామాల్లో స్వామితో కలసి మనమూ విహరిద్దాం రండి.



మధుర - బృందావనం


శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు
శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు. మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం (147కి.మీ.) న్యూఢిల్లీలో ఉంది. సమీప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం(49కి.మీ.).


ద్వారక

ఏడు మోక్షపురుల్లో ఒకటిగా పిలిచే ద్వారక, గుజరాత రాష్ట్రంలో గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం’ అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతంగా ద్వారక సుపరిచితం. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది. జగద్గురువు ఆది శంకారాచార్యులు నెలకొల్పిన నాలుగు ప్రధాన మఠాల్లో ఒకటైన ద్వారకా పీఠం (కాళికా మఠం) ఇక్కడే ఉంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి ఇక్కడే స్వామి ప్రతిమలో లీనమైందని చెబుతారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చూడదగిన ప్రదేశాలు
రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.


గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో దేవకి, వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడని ప్రతీతి. అందుకే గురువాయూర్ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి నారద పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. అర్జునుడి మునిమనుమడు (అభిమన్యుడి కుమారుడు) అయిన పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు నిర్వహించిన సర్పయాగంలో వేలాది పాములు అగ్నికి ఆహుతి అవుతాయి. ఈ పాపం కారణంగా ఆయనకు తీవ్రమైన కుష్ఠు వ్యాధి సోకుతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ సమయంలో గురు దత్తాత్రేయ స్వామి ఆదేశాన్ని అనుసరించి గురువాయూర్లో కొలువైన శ్రీకృష్ణుడిని సేవించి రోగ విముక్తుడవుతాడు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్గా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. బాల కృష్ణుడి రూపంలో స్వామి నేటికీ ఈ దేవాలయంలో సంచరిస్తుంటాడని భక్తుల విశ్వాసం.

చూడదగిన ప్రదేశాలు
గురువాయూర్లోని రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, పున్నత్తూర్ కొట్ట, వెంకటాచలపతి దేవాలయం, పార్థసారథి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, హరికన్యక దేవాలయాలను సందర్శింవచ్చు. గురువాయూర్కు 80 కిమీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం ఉంది. అక్కడ పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ దేవాలయం చూడదగింది.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో గురువాయూర్ వెళ్లొచ్చు. లేదా రోడ్డు మార్గంలో (30 కి.మీ) తేలిగ్గా వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది. (80 కి.మీ). కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది.


ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఇక్కడి కృష్ణ మఠాన్ని 13వ శతాబ్దంలో ద్వైత సంప్రదాయ స్థాపకులు మధ్వాచార్యులు ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఎనిమిది మఠాలు స్థాపించి వాటికి ఎనిమిది మందిని అధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు
చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్ .

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కిమీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).



నెమలి

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. 1953లో నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు అదే గ్రామానికి చెందిన దారా నరసయ్య అనే రైతు పొలం కొన్నారు. అందులోని మట్టిని తవ్వుతుండగా స్వామి విగ్రహం, శంఖం, పాచిక బయటపడ్డాయి. విషయాన్ని కూలీలు షావుకారు దృష్టికి తీసుకువచ్చారు. 1957 ఫిబ్రవరి 6న స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. పౌర్ణమి రోజున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణం జరుగుతుంది. భక్తుల విరాళాలతో నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఎలా చేరుకోవాలి?
ఏపీలో విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెమలి చేరుకునే వీలుంది. ఖమ్మం నుంచి కల్లూరు, చినకోరుకొండ, పొచవరం, వెంకటాపురం, తాళ్లూరు, ఉమ్మడిదేవరపల్లి మీదుగా నెమలి చేరుకోవచ్చు. 

Andhrajyothy

ఐదు ద్వారకలు








ఐదు ద్వారకలు



‘‘మధ్యప్రదేశ్‌ నర్మదాతీరంలోని ఓంకారేశ్వరుణ్ణీ ఉజ్జయినీ మహంకాళేశ్వరుణ్నీ రాజస్థాన్‌లోని చారిత్రక కోటల్నీ గుజరాత్‌లో కృష్ణభగవానుడు నడయాడిన ప్రదేశాలనూ ముఖ్యంగా పంచద్వారకలుగా చెప్పే ఐదు శ్రీకృష్ణ మందిరాల్నీ ఏకకాలంలో చూసొచ్చా’మంటూ ఆయా విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన మాఢభూషి అరవిందవల్లి.



పంచద్వారకలైన మూల ద్వారక, బెట్‌ద్వారక, శ్రీనాథ్‌ద్వారక, కాంక్రోలి ద్వారక, డాకోర్‌ ద్వారకలకు వెళ్లాలని ఆలోచన. ఒకరోజు ఓ ప్రకటనలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ఇరవై రోజుల యాత్ర గురించి చదివి వెంటనే టిక్కెట్లు తీసుకున్నాం. బెంగళూరు నుంచి దిల్లీ Sampark Kranti Expressలో బయలుదేరి రాత్రి 11.30కి భోపాల్‌కి చేరుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మాతోపాటు వచ్చారు. మా టూర్‌ ఆపరేటరు మరో 8 మందితోనూ వంటవాళ్లతోనూ సామాన్లతో ముందే భోపాల్‌ చేరుకుని మా అందర్నీ బస్సులో ఉజ్జయినీకి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయినీకి చేరుకున్నాం.

భస్మ దర్శనం!
ఉదయం ఎనిమిది గంటలకే స్నానపానాదులూ కాఫీటిఫిన్లూ కానిచ్చి మర్నాడు మహాకాళేశ్వరుని భూరిదర్శనంకోసం మా గుర్తింపుకార్డులతో గుడిదగ్గర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రోజుకి 300 మందిని మాత్రమే ఆ దర్శనానికి అనుమతిస్తారు. అక్కణ్ణించి ఓంకారేశ్వరుణ్ణి చూడ్డానికి బస్సులో ఇండోర్‌ మీదుగా వెళ్లాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం నాలుగుగంటలకు ఓంకారేశ్వరుడి దర్శనానికి వెళ్లాం. అభిషేకాలు చేయించుకుని తిరిగి బస్సులో ఉజ్జయినీకి ప్రయాణమయ్యాం. రాత్రి పదకొండు గంటలకు ఉజ్జయినీకి వెళ్లాం. కానీ రెండు గంటలకే లేచి మహాకాళేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. అప్పటికే చాలామంది ఉన్నారు. నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ శివలింగాన్ని అభిషేకించవచ్చు. జలాభిషేకం తరవాత అందర్నీ మూలవిగ్రహానికి ఎదురుగా పెద్ద హాలులో కూర్చోబెట్టి పంచామృత అభిషేకం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసి లింగాన్ని వెన్నా పూలూ పండ్లతో అలంకరించి భూరి (కొన్ని గంటల ముందు కాల్చిన శవం తాలూకూ భస్మం)తో అభిషేకం చేస్తారు. ఈ సేవను స్త్రీలు చూడకూడదని ముఖంమీద కొంగు కప్పుకోమని చెబుతారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లూ వాద్యాలూ తాళాలూ ఢమరుక ధ్వనులూ హరహరమహాదేవ అనే నినాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ అనుభూతిని వర్ణించలేం.

రాజస్థాన్‌లో...
తరవాత ఉజ్జయినీలో ఉండే మహంకాళి, భైరవస్వామి, విష్ణాలయాలు అన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి అక్కడ జైపూరుకి వెళ్లే రైలు ఎక్కి ఉదయానికి చేరుకున్నాం. అక్కడ భవంతులూ ఆఫీసులూ అన్నీ గులాబీరంగులోనే ఉన్నాయి. ముందుగా జంతర్‌మంతర్‌కు వెళ్లాం. ఇది ఖగోళశాస్త్రం, జ్యోతిషం నేర్చుకునేవాళ్లకి పాఠశాల లాంటిది. సూర్యుడి వెలుతురూ నీడలతోనే సమయమూ దినమూ తిథీ వారమూ నక్షత్రమూ రాశీ వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుగా కట్టిన సిమెంట్‌ కట్టడాలను అక్కడ చూడవచ్చు. పక్కనే ఉన్న సిటీప్యాలెస్‌లో రాజామాన్‌సింగ్‌ వాడిన వస్తువుల రాజకుటుంబీకుల ఫొటోలూ ఉన్నాయి. సిటీప్యాలెస్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాచీన జైపూర్‌ కోటను చూసి జలమహల్‌ చూడ్డానికి వెళ్లేటప్పటికి రాత్రి ఏడున్నర అయిపోయింది. చుట్టూ నీళ్లూ మధ్యలో దీపాలతో అది అందంగా ఉంది.

మర్నాడు ఉదయం మూడు గంటలకు జైపూరు నుంచి బికనీరుకి ప్రయాణమయ్యాం. సాయంత్రం నాలుగు గంటలకు బికనీరు చేరుకున్నాం. కనకమహల్‌, మేఘమహల్‌ చూశాక సభామండపంమీద చిత్రపటాలనూ పాలరాతి శిల్పాలనూ వీక్షించాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కణ్ణుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌నాక్‌ గ్రామంలోని మూషికాలయంలోని ప్రాంగణమంతా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాళ్లతో ఎక్కడ వాటిని తొక్కేస్తామేమోనని భయం కలుగుతుంది. గుడిలోపల వేలకొద్దీ ఎలుకలు ఉన్నాయి. గుడి బయట ఒక్క ఎలుకా లేదు. ఎలుక విగ్రహానికి రోజూ సాయంత్రం హారతినిస్తారట. తిరిగి బికనీరుకి చేరుకున్నాం. ఉదయాన్నే బస్సులో జైసల్మేరు వెళ్లాం. జనవరి నెల కావడంతో చలి బాగా ఉంది. దారంతా పొగమంచు... డ్రైవరు జాగ్రత్తగా నడిపాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌దేవ్‌ బాబా సమాధి ఉన్న వూరు చేరుకున్నాం. రాజస్థానీలకు ఆరాధ్యదైవం రామ్‌దేవ్‌ బాబా. ప్రజలు తమ కోరికలను బాబాకు చెప్పుకుని అవి తీరాక బట్టతో తయారుచేసిన గుర్రపు బొమ్మలూ, తీపి వంటకాలను మేళతాళాలతో తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తారు.

అది చూశాక మూడు గంటలకు జై సల్మేర్‌ చేరుకున్నాం. ఆ వూళ్లొ అన్ని ఇళ్లూ ఆఫీసులూ బంగారురంగులో ఉన్నాయి. దీన్ని గోల్డెన్‌ సిటీ అంటారు. ఇక్కణ్ణించి గోబీ ఎడారి, థార్‌ ఎడారులకు వెళ్లొచ్చు. మమ్మల్ని సాయంత్రం నాలుగు గంటలకల్లా గోబీ ఎడారిలో వదిలారు. అక్కడ ఒంటెలమీద ఇద్దరం చొప్పున కూర్చుని ఎడారిలో ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాం. ఎడారిలో కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. ఉదయాన్నే కోట చూడ్డానికి వెళ్లాం. ఇందులో రెండు గుడులు ఉన్నాయి. ఒకటి శీతలామాత ఆలయం, రెండోది జైనమందిరం. దీన్నే శ్వేత మందిరం అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని ప్రతీ కోటా చూడదగ్గదే. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి పది గంటలకు బయలుదేరి జోధ్‌పూర్‌కి చేరుకున్నాం. జోథ్‌పూర్‌ను సన్‌సిటీ అంటారు. ఈ కోటను ముగ్గురు చక్రవర్తుల హయాంలో కట్టించారు. ఇది పూర్తయ్యేసరికి మూడువందల సంవత్సరాలు పట్టింది. యుద్ధాల్లో శిథిలమైన కోటను పునర్నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందనీ ఇది సుమారు 600 ఏళ్ల నాటిదనీ గైడు చెప్పాడు. కోట పైకి చేరుకుని చూస్తే వూరంతా కనిపిస్తుంది. నీలం రంగు ఇళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎండ నుంచి రక్షిస్తుందన్న కారణంతో నీలిరంగు వేస్తారనీ అందుకే దీన్ని నీలినగరం అంటారనీ గైడు చెప్పాడు. అక్కణ్ణుంచి పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్నీ ఆ తరవాత చిత్తౌడ్‌గఢ్‌లోని కోటల్నీ చూసి పంచద్వారకల్లో ఒకటైన శ్రీనాథ్‌ ద్వారకకు చేరుకున్నాం.

నాథ్‌ ద్వారక!
నాథ్‌ద్వారానే శ్రీనాథ్‌ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు ఏడేళ్ల పిల్లాడిగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడున్న విగ్రహాన్ని 17వ శతాబ్దంలో మధుర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే హారతి ఇస్తూ స్వామిని మేలుకొలుపుతారు. తరవాత కాసేపు గుడి మూసి స్వామిని అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. దీన్నే శింగార్‌ సేవ అని పిలుస్తారు. ఇక్కడ అభిషేకానికి భక్తులు పాలే కొని ఇస్తారు. తరవాత అక్కణ్ణుంచి కాంక్రోలి ద్వారకకు వెళ్లాం. ఉదయ్‌పూర్‌ సమీపంలోని రాజసమండ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని కృష్ణుణ్ణి ద్వారకాధీశ్‌గా కొలుస్తారు. ఇక్కడి విగ్రహం కూడా మధుర నుంచే వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చింతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇవన్నీ ఆయన నడయాడిన స్థలాలే. అక్కణ్ణుంచి ఉదయపూర్‌కి చేరుకుని కోట చూడ్డానికి వెళ్లాం. అది చాలా అందంగా ఉంది. ఆ రాత్రికి అక్కడే ఉండి మౌంట్‌ అబూకి చేరుకున్నాం. అక్కడ బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్లాం. అది చాలా పెద్దది. హాల్లో 2000 మంది కూర్చునే స్థలం ఉంది. ఇక్కడకు వెళ్లినవాళ్లంతా రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తారు. తరవాత ఆబ్రూ దేవాలయానికి వెళ్లాం. 500 మెట్లు ఎక్కి పెదవి ఆకారంలో ఉన్న గుహలోని దేవీమాతను దర్శించుకున్నాం. రాజస్థానీ భాషలో ఆబ్రూ అంటే పెదవి అని అర్థం. ఇది క్రమేణా ఆబూగా మారింది. ఎర్రచలువరాతితో కట్టిన దిల్‌వారా మందిరాలను చూసి ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మధ్యాహ్నం భోజనం చేసి రాజస్థాన్‌ సరిహద్దుల్లో నుంచి గుజరాత్‌లోకి ప్రయాణించాం.

బంగారు ద్వారక!
దారిలో గబ్బర్‌ అనే వూరిలో అంజేమాత గుడికి వెళ్లాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇక్కడే సతీదేవి గుండె పడిందని చెబుతారు. అది చాలా పెద్ద గుడి. రాత్రికి సిద్ధాపూరులో విశ్రమించి ఉదయాన్నే మాతృగయకు వెళ్లాం. అక్కడ తల్లికి పిండప్రదానాలు చేసేవాళ్లు చేసుకున్నారు. ఎందుకంటే తల్లికి పిండప్రదానం చేసే చోటు ఇదొక్కటేనట. ఇక్కడి బిందుసరోవరంలో స్నానం చేసి పిండప్రదానం చేస్తే మంచిదని భాగవతంలో ఉన్నట్లు పూజారులు చెప్పారు. తరవాత మూల ద్వారకకు చేరుకున్నాం. అరేబియా సముద్రతీరంలోని ఈ నగరాన్ని ఒకప్పుడు గోల్డెన్‌సిటీగా పిలిచేవారు. క్రీ.పూ. 1500నాటి పురాతన నగరమే ద్వారక. తప్పక చూడాల్సిన సప్త పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయంలో సాయంత్రం హారతి దర్శనం చేసుకుని మళ్లీ ఉదయాన్నే గోమతీనదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుని వెన్న ప్రసాదాలు స్వీకరించాం. తరవాత సముద్రంలో ఉన్న బెట్‌ ద్వారకకు మరబోటులో వెళ్లాం. సముద్రపు పక్షులు మా తలమీదుగా ఎగురుతూ మేం వేసే మరమరాలు తింటూ ఆలయం వరకూ వచ్చి మళ్లీ మాతో ద్వారకకు వచ్చాయి. బెట్‌ద్వారకలో కృష్ణుడి పరివారం ఉండేదట. అక్కడి స్వామిని దర్శించుకుని నాగేశం చేరుకున్నాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ పార్వతీపరమేశ్వరులు నాగ్‌, నాగిని రూపాల్లో ఉంటారు. పిల్లలు లేనివాళ్లు ఇక్కడ అమ్మే జంటపాముల బొమ్మలు పెట్టి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

డాకోర్‌ రణ్‌ఛోడ్‌రాయ్‌!
తరవాత సోమనాథ్‌ ఆలయాన్నీ కృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్నీ బోయవాడు బాణం వేసిన చోటునీ చూసి భావనగర్‌కు బయలుదేరాం. అక్కడ సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న రాయి మీద పాండవులు శివలింగాలు పెట్టి పూజ చేశారట. సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఐదు శివలింగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఉదయం పదిగంటలలోపే ఇది సాధ్యం. ఆ తరవాత నీళ్లు వచ్చి ఏమీ కనిపించవు. కానీ మేం ధైర్యం చేసి బురదలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుని గంటన్నరలో వెనక్కి వచ్చాం. సాయంత్రానికి డాకోర్‌ ద్వారకకు చేరుకున్నాం. ఇక్కడ కృష్ణుణ్ని రణ్‌ఛోడ్‌రాయ్‌జీగా కొలుస్తారు. బోడన అనే భక్తుడి కోరిక మేరకు నిండుపౌర్ణమినాడు కృష్ణుడు ఇక్కడకు వచ్చాడట. అందుకే పున్నమినాడే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి ఆలయనిర్మాణం ఎంతో బాగుంది. అక్కడ కృష్ణుణ్ణి దర్శించుకున్నాక రుక్మిణీదేవి ఆలయాన్నీ చూసొచ్చాం. ఇక్కడితో మా పంచద్వారకలు పూర్తయ్యాయి. మర్నాడు గాంధీనగర్‌, అహ్మదాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి వెనుతిరిగాం.



Saturday, 23 July 2016

నిష్కళంక మహదేవుడు

పాపాలనుబాపే సముద్రలింగేశ్వరుడు..
నిష్కళంక మహదేవుడు..


తెలిసీ తెలియకుండా మనం నిత్యం చేసే పాపాలను తొలగించి మనల్ని పాప ప్రాయచిత్తాల నుంచి విముక్తుల్ని చేసి నిష్కళంకులుగా మార్చే ధైవం ఎవరు అంటూ.. అదే కేవలం నిష్కళంక మహాదేవుడితోనే జరుగుతుంది, కోరిన వారికెళ్లా వరాలనిచ్చే బోలా శంకరుడు.. తనను తప్పస్సుతో అరాధించిన పరమభక్తులను నిష్కళంకులుగా మార్చి నిష్కళంక మహాదేవుడి మారి లింగస్వరూపంలో వారిన కనురించాడు. అబిషేక ప్రియుడైన ఈ మహాదేవుడ్ని రోజూ అభిషేకించే భాగ్యాన్ని సముద్రుడికి కల్పించాడు. అంతేకాదు భక్తులు కూడా అరాధించేందుకు వీలుగా రోజులో కొన్న గంటలు మాత్రం అవకాశం కల్పించాడు.



గుజరాత్‌ తీరం వెంట అరేబియా సముద్రంలో ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఓ గడ్డమీద నిష్కళంక మహదేవ్‌గా విరాజిల్లుతున్నాడు పరమశివుడే నిష్కళండ మహాదేవుడు. రోజులో కొన్ని గంటలు మినహా మిగతా సమయంలో ఆ గుడి సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది. ఉదయం, సాయంత్రాల్లో అలలు వెనక్కు తగ్గిన కొన్ని గంటలే స్వామి దర్శనం. బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు రామచంద్రుడు శివుణ్ని అర్చించాడు. అలాగే కౌరవులతో జరిగిన యుద్ధంలో బంధువులను చంపిన పాపాన్ని పరిహారం చేసుకునేందుకు పాండవులూ మహాదేవుడ్నే శరణువేడారు. మహాభారత యుద్ధం తరువాత పాండవులు శివుడిని కొలిచిందీ, వాళ్లను కరుణించి పరమశివుడే ఐదు లింగ రూపాల్లో వెలసిందీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు ముప్ఫైకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్‌ గ్రామంలోనేనని ప్రతీతి. భక్తుల దోషాలనూ, పాపాలనూ తొలగించే దేవుడిగా ఇక్కడి శివుడు పూజలందుకుంటున్నాడు.

స్థల పురాణం...
పాండవ కౌరవ యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు జయకేతనం ఎగురవేశారు. కానీ... ఎంతోమంది రక్తసంబంధీకులనూ పెద్దలనూ ఈ యుద్ధంలో భాగంగా చంపాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. అదే విషయాన్ని కృష్ణభగవానుడికి విన్నవించుకున్నారు. అందుకు పరిష్కారంగా ఆయన పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. 'ఈ ఆవును వదిలేయండి. ఈ జెండా చేత పట్టుకొని దాని వెంట నడవండి. ఏ ప్రాంతంలో అయితే ఆ ఆవు రంగూ, జెండా రంగూ తెల్లగా మారతాయో, అక్కడే మీరు పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించండి' అని చెప్పాడు.

పాండవులంతా ఆ ఆవునడచిన దారిన నడిచారు. ఓ రోజు సముద్ర తీరం వెంట నల్లావు ప్రయాణించ సాగింది. అలా నడుస్తూ ఉండగా ఓ చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే సోదరులంతా కూర్చుని మహాదేవుడ్ని ధ్యానించారు. భోళాశంకరుడు కరిగిపోయాడు. ధ్యానముద్రలో ఉన్న ఆ ఐదుగురు అన్నదమ్ముల ముందూ ఐదుశివలింగాల రూపంలో ఉద్భవించాడు. ఆ శివలింగాలను చూసిన పాండవులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.

దర్శనం ఇలా...
ఈ ఆలయాన్ని చూడాలంటే గుజరాత్‌ భావ్‌నగర్‌ నుంచి కొలియాక్‌ గ్రామానికి వెళ్లాలి. అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిలుచుంటే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. అదే శివుడు వెలసిన ప్రాంతానికి గుర్తు. పోటు తగ్గినప్పుడు కాలి నడకన ఇక్కడికి వెళ్లొచ్చు. 500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఆ ప్రాంగణంలోనే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి. అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి.

ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా గోపురంతో కూడిన గుడిలాంటి నిర్మాణమేమీ ఇక్కడ ఉండదు. పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్లే సమయమూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. 17వ శతాబ్దంలో భావ్‌నగర్‌ మహారాజు భావ్‌సింగ్‌ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు. ఆ రోజు భావ్‌నగర్‌ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు.

మరుసటేడాది మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలు సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు. ఉదయం ఏడు గంటలకూ, సాయంత్రం ఆరున్నర గంటల సమయంలోనూ ఇక్కడ హారతి నిర్వహిస్తారు. ఆ రోజు తిథిని బట్టి హారతి సమయాలు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇక, ఇక్కడి నీళ్లలో అస్థికలు కలిపితే చనిపోయిన వాళ్లకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మిక. సముద్రం లోపల, ప్రశాంత వాతారణంలో హరహర మహాదేవ నాదాలు సాయంత్రం మళ్లీ సాగరుడు పలకరించే దాకా రోజూ వినిపిస్తూనే ఉంటాయిక్కడ!

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...