Showing posts with label పయనించెనెచటికో మనసు పరవశించెనెందుకో. Show all posts
Showing posts with label పయనించెనెచటికో మనసు పరవశించెనెందుకో. Show all posts

Friday, 10 June 2016

ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్‌ ప్రయాణం

నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను. అందులోను హిమాలయాల్లోకి పయనం అంటే ఇంక ఆలోచించేదే ముంది? అమర్‌నాథ్‌ ప్రయాణం అనుకోకుండా, హఠాత్తుగా సంభవించింది. నా సహచరుడితో పాటు నా తమ్ముడు, అతని భార్య, వాళ్ళ అక్క కూడా వచ్చారు. శ్రీనగర్‌, అమర్‌నాథ్‌ చాలా చలి ప్రాంతాలు కాబట్టి బోలెడంత ఉలెన్‌ సామగ్రితో శుక్రవారం ఉదయం మా ప్రయాణం మొదలైంది. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్‌ బయలుదేరాం.

నాకు ఢిల్లీ నుండి శ్రీనగర్‌ వెళ్ళే దారిలో కనబడే హిమాలయాలు చూడడం చాలా ఇష్టం. హిమాలయాల మీద నుంచి విమానం వెళుతున్నపుడు, మంచుతో కప్పబడిన, మహాత్తుంగ పర్వతశ్రేణులు, లోయలు, ఆ లోయల్లోని ఆవాసాలు చూస్తున్నప్పుడు మనసు దూదిపింజెలాగా ఎగిరి, ఆ హిమాలయాలమీద తిరుగాడుతుంది. అయితే ఈసారి కొండలన్నీ నిజరూపాన్ని ప్రదర్శించాయి తప్ప ఒక్క పిసరు కూడా మంచు లేదు. పర్వతశ్రేణులు ఠీవిగా నిలుచున్నాయి శుభ్రంగా స్నానం చేసినట్టు. అది వేసవి కావడం వల్ల మంచు మొత్తం కరిగిపోయింది. నా మనసు కూడా నీరయి పోయింది మంచు కనబడక.

చలితో గడగడలాడిపోతాం కాబోలు, శ్రీనగర్‌ అంటే చలి కదా అనుకుని భుజాలమీద శాలువాలు తగిలించుకున్న మాకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఎర్రటి ఎండ ఈడ్చికొట్టింది. చురచురా కాలుస్తున్న ఎండ, ఇది శ్రీనగరా, జమ్మూనా అనే అనుమానాన్ని కలిగించింది. అంత వేడిగా వుందన్నమాట. హమ్మో! ఇంత ఎండేంటిరా బాబూ అని ఆపసోపాలు పడుతూ మా గెస్ట్‌హౌస్‌ చేరాం. అక్కడి వాతావరణం మమ్మల్ని కొంత సేదతీర్చింది. చుట్టూ కనబడే పచ్చటి, ఆకాశమంత ఎత్తు ఎదిగిన చీనార్‌ చెట్లు, గెస్ట్‌హౌస్‌ను ఆనుకుని ప్రవహించే జీలం నది మీంచి వచ్చే చల్లగాలి తగలగానే ఎండ, గిండ అంతా మర్చిపోయాం. శ్రీనగర్‌లో చినార్‌ మహావృక్షాలు చాలా అందంగా వుంటాయి. వందల సంవత్సరాలున్న అతిపెద్ద చెట్లు కూడా కనబడతాయి.

శ్రీనగర్‌ కొంత ప్రశాంతంగానే వున్నట్లు కనబడింది. క్రితం సంవత్సరం అల్లర్లతో అట్టుడుకింది కానీ ప్రస్తుతం మామూలుగానే వుంది. భద్రతా దళాలు కూడా తగ్గినట్లనిపించింది. ఇంతకుముందు అడుగడుగునా పోలీసుతో, సిఆర్‌ఫిఎఫ్‌ వాళ్ళో, బిఎస్‌ఎఫ్‌ వాళ్ళో కనబడే వాళ్ళు ప్రస్తుతం అక్కడ జీవితం ప్రశాంతంగా వుందన్న భ్రమ అయితే కలిగింది. మేము శ్రీనగర్‌లో చూడాల్సినవన్నీ ఆ రోజు సాయంత్రమే చూసేసాం. ముఖ్యంగా ఆపిల్‌ గార్డెన్‌లో చిన్నపిల్లలమే అయ్యాం. విరగకాసిన ఆపిల్‌ పండ్లు కనబడగానే ఆ గార్డెన్‌లోకి చొరబడి బోలెడన్ని ఫోటోలు దిగాం. శ్రీనగర్‌లో ఎనిమిదైనా చీకటి పడదు. ఎనిమిదన్నర రాత్రివేళ పగలే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మర్నాడు తొందరగా లేవాలి కాబట్టి తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసాం.

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్ళిన వాళ్ళలో బహుశా నేనే ఎలాంటి భక్తి భావనలు లేకుండా, ఒక అడ్వంచర్‌ యాత్రలాగా వెళ్ళానేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రయాణం చాలా కఠినతరమైంది. అడుగడుగునా ప్రమాదం వుంది. భక్తి పారవశ్యంలో మనుష్యులు సాధారణంగా శరీర కష్టాన్ని లెక్క చేయరు. దేవుడి కోసం ఎలాంటి కష్టాన్నయినా భరించేస్తారు. నేను మాత్రం అమర్‌నాథ్‌ యాత్రని ఒక సాహసయాత్రగానే చూసాను. నాకు తెలుసు ఆ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందో. అదొక ప్రకృతిపరమైన అద్భుతం. అంతే.

మర్నాడు ఉదయం నాలుగు గంటలకి మేము ఇనోవాలో వున్నాం. మామూలుగా అయితే ఆ వేళపుడు చలి గడగడలాడించేస్తుంది. వొళ్ళంతా ఉలెన్‌ కప్పుకుంటే కానీ తట్టుకోలేం ఆ చలిని. కానీ అంత విపరీతమైన చలేమీ లేదు. ప్లెజంట్‌గా, హాయిగా వుంది. రోడ్డుకిరువైపులా బారులు తీరిన చీనార్‌ చెట్లు, ఎత్తైన పర్వత సముదాయం కళ్ళకి పండగ చేస్తుంటే మా వాహనం వేగంగా బాల్డాక్‌ వేపు దూసుకెళుతోంది. శ్రీనగర్‌ దాటి బయటకు వచ్చేస్తుంటే దర్శనమిచ్చింది సింధూ నది. ఆ ఉరవళ్ళు, పరవళ్ళు చూసితీరాల్సిందే. హిమాలయన్‌ రేంజస్‌. మహోత్తుంగ శ్రేణులు. ఆ కొండల్లోంచి జాలువారే అసంఖ్యాకమైన జలపాతాలు, అంతెత్తు కొండల్లోంచి వేగంగా ఉరికొస్తూ సింధూనదిలో లీనమయ్యే దృశ్యాలు మనల్ని రెప్ప వేయనీయవు. అమర్‌నాథ్‌ చేరేవరకు సింధు మనతోనే వుంటుంది. మనతో పాటే ప్రయాణం చేస్తుంది. ఒక చోట సన్నటి పాయలాగా, మరోచోట మన ఊళ్ళో కాలువలంత విశాలంగా, ఉధృతిగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహవేగం నునుపు దేలిన రాళ్ళమీద గలగల సంగీతాన్ని ఆలపిస్తుంటుంది. ఆ ఉదయపువేళ, సింధునది సంగీతాన్ని వింటూ మోహపరవశులం కావాల్సిందే. అక్కడక్కడా మంచుటోపీలు పెట్టుకున్న పర్వశ్రేణులు, మంచుకరుగుతూ దిగువకు జాలువారే జలపాతాలు, ఆ జలపాతాల్ని ఆత్మీయంగా తనలో లీనం చేసుకునే సింధునది, ఆ పర్వతాల విశాలత్వం ముందు మనం మరుగుజ్జులమే అవుతాం. అపురూపమైన దృశ్యాలలో మునిగి తేలుతూ, ఆ సౌందర్యాన్నంతటిని ఔపోసన పట్టేయ్యాలన్నంత ఆత్రంతో కన్నురెప్పవేయకుండా కూర్చున్నాను నేను. మనస్సంతా మహా సంతోషంతో నిండిపోయింది. గుండెల్లోంచి రక్తం బదులు గాఢమైన అనుభూతి పొంగిపొర్లుతోంది. నేను మనిషిని మాత్రమే వాహనంలో వున్నాను. నా మనసు ఆ కొండల్లో తిరుగుతోంది. ఆ మంచులో పొర్లుతోంది. ఆ జలపాతాల్లో స్నానిస్తోంది. చల్లటి నదిలో ఈత కొడుతోంది.

నేను ఇలాంటి మానసిక స్థితిలో మునిగివుండగానే బాల్టాక్‌ వచ్చేసింది. నా కళ్ళు కూడా నేలమీదకొచ్చాయి. ఒక నిర్మానుష్య, నిరామయ స్థితిలోంచి మనుష్యులు, వాహనాలు కిటకిటలాడే స్థలంలోకి హఠాత్తుగా వొచ్చిపడ్డాం. హెలికాప్టర్ల రొద, గుర్రాల సకిలింపులు. అసంఖ్యాకంగా వెలసిన టెంట్లు, ఆప్రాంతమంతా సందడిగా, పెద్ద సంతలాగా వుంది. మేము వాహనం దిగి బయటకు రాగానే చలిగాలి గిలిగింతలు పెట్టింది. బ్యాగుల్లో వున్న ఉలెన్‌ అంతా వొంటిమీదికి చేరిపోయింది. సడన్‌గా వర్షం పడుతుంది అంటే రెయిన్‌ కోటుకూడా వాటికి తోడయ్యింది. బ్యాగుల్లో దాదాపు ఐదు కిలోల బరువు తగ్గిపోయి, మా శరీరాలు హఠాత్తుగా ఐదు కిలోలు బరువు పెరిగిపోయాయి. చుట్టూపరుచుకున్న సౌందర్యాన్ని చూస్తూ నిలబడ్డాం. మూడు హెలికాప్టర్లు జనా న్ని మోసుకువెళుతున్నాయి. ఇట్టేవెళ్ళి అట్టే తిరిగొస్తున్నాయి.

ఓ అరగంట తర్వాత మా వంతుకూడా వచ్చింది. హెలికాప్టర్‌లో ఎక్కేముందే మా బరువు చెక్‌చేసారు. అందరం బరువు పెరిగాం. సంతోషంలో ఉబ్బిపోయామనుకుంటా అని నేనంటే అందరూ నవ్వారు. ఒక్కొక్కళ్ళకి ఐదు వేలు వసూలు చేసారు హెలికాప్టర్‌ వాళ్ళు. ఇంజన్‌ ఆపకుండానే హడావుడిగా ఎక్కిస్తున్నారు. విపరీతమైన గాలి. మేము కూడా పరుగులెడుతూ వెళ్ళి కూర్చున్నాం. హెలికాప్టర్‌ గాల్లోకి లేచింది. కొండల మధ్యనుంచి వెళుతుంటే కింద సింధునది కనిపిస్తుంది. కొండల అంచులో గుర్రాలమీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వాళ్ళు చీమల బారుల్లా కన్పిస్తున్నారు. ఏడు నిమిషాల్లో హెలికాప్టర్‌ గమ్యం చేరింది. మేము దిగుతుంటే ఎవరో కామెంట్‌ చేసారు. “వీడిదుంపతెగ ఐదువేలు తీసుకుని అయిదు నిమిషాలైనా తిప్పలేదు” అని. ఎక్కి కూర్చుని సర్దుకోగానే దిగండి, దిగండి అంటూ హెచ్చరికలు. ఉరుకులు పరుగులతో హెలికాప్టర్‌ దిగి, మాకోసం ఎదురుచూస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ దగ్గరకు నడిచాం. అతను తెలుగువాడు. రండి రండి అంటూ మమ్మల్ని ఆహ్వానించి C.R‌.P.F‌. వాళ్ళ కేంప్‌ ఆఫీసులోకి తీసుకెళ్ళాడు. అక్కడ చలి ఎక్కువగానే వుంది. మేము కూర్చోగానే విలటరీ దుస్తుల్లో వున్న వ్యక్తి మాకు వేడి వేడి టీ తెచ్చి ఇచ్చాడు. ఆ చలిలో టీ తాగడం హాయిగా అన్పించింది. కేంప్‌లో వున్న ఆఫీసర్‌ మాకోసం గుర్రాలను మాట్లాడటం కోసం, గుర్రాల యజమానులను పిలిపించాడు. అక్కడినుండి ఆరు కిలోమీటర్లు కొండలపైన గుర్రాలమీద వెళ్ళాలి. అదికూడా అమర్‌నాథ్‌ గుహవరకు తీసుకువెళ్ళరు. అక్కడ మళ్ళీ నిటారుగా వుండే మెట్లెక్కాలి. ఒక్కొక్కరికి 800/- రూపాయలవుతుందని ఆయన మాకు వివరించాడు. మేము సరే అన్నాం. గుర్రాల వాళ్ళు గుర్రాలు తేవడానికి వెళ్ళారు. ఆఫీసర్‌ మాతో అక్కడి విశేషాలు మాట్లాడుతూ సడన్‌గా ఓ మాటన్నాడు. ఆ మాట వింటున్న వాళ్ళ గుండె ఝల్లుమంది. వెన్నులోంచి భయం జరాజరా పాకినట్లయింది. ఆయన హిందీలో ఇలా అన్నాడు. “గుర్రాలలో సూసైడల్‌ టెండన్సీస్‌ ఇక్కడ చాలా ఎక్కువ. అవి చనిపోవాలనుకుంటే తల పక్కకు వాల్చేస్తాయి. లేదా దేనికైనా తలను కొట్టుకుంటాయి. అపుడు గుర్రంతో పాటు దాని మీద ప్రయాణించేవారికి చాలా రిస్క్‌. ఇటీవల ఒకామెని మోసుకెళుతున్న గుర్రం హఠాత్తుగా చనిపోయి కిందికి పడిపోయింది. దాని మీద కూర్చున్న మహిళ శవం కూడా దొరకలేదు. కొండల్లో మంచులో ఎక్కడికో జారిపోయింది.” అన్నాడు. నేను వెంటనే “వాట్‌ ఈస్‌ ది ప్రికాషన్‌” అంటే “నథింగ్‌” అన్నాడు. ఆ మాటలు విని అందరూ జడుసుకున్నట్టు ముఖాలు పెట్టారు. ఈ లోపు గుర్రాలొచ్చాయి. ఆయనకి థాంక్స్‌ చెప్పి టెంట్‌ లోంచి బయట పడ్డాం. గుర్రాలెందుకు ఆత్మహత్య చేసుకుంటాయా అని ఆలోచిస్తూ, మాకోసం మాట్లాడిన గుర్రాలవేపు నడిచాం.

అమర్‌నాథ్‌కి అసలైన ప్రయాణం మొదలైంది. గుర్రమెక్కడం కష్టమే. నా గుర్రం నడిపే వ్యక్తి పేరు షరీఫ్‌. గుర్రం పేరు రాజా. షరీఫ్‌ సహాయంతో గుర్రమెక్కగలిగాను. అతను నన్ను పట్టుకుని కూర్చోబెట్టి, కాళ్ళకు రింగులు తొడిగాడు. రాజా మీద నా స్వారీ మొదలైంది. నాలుగడుగులు వేసేసరికి ఒళ్ళంతా కదిలిపోవడం, ఓ పక్కకి జారిపోవడం. హమ్మో! ఆరు కిలోమీటర్లు దీనిమీద కూర్చోవాలా? అన్పించేలా గుర్రం మీద ప్రయాణం మొదలైంది. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ప్రయాణమది.

కొండవాలు మీద ఏమాత్రం ఎడ్జ్‌ లేని చోట గుర్రం, దాని పక్కనే షరీఫ్‌ నడుస్తున్నారు. కిందికి చూస్తే కళ్ళు తిరిగేంత లోతైన లోయ. ఆ లోయలో ఉధృతంగా ప్రవహిస్తున్న సింధునది. గుర్రం కాలు జారితే నేరుగా పడేది నదిలోనే. మధ్యలో కొండల్లో కూడా పడొచ్చు. ప్రయాణం సాగుతున్నంతసేపు ఫరీఫ్‌ కబుర్లు చెబుతూనే వున్నాడు. సలహాలిస్తూనే వున్నాడు. “ఆప్‌ నీచే మత్‌ దేఖో! ఊపర్‌ దేఖో! ఆస్మాన్‌ కితనా సుందర్‌ హై! పహాడ్‌ కితనా సుందర్‌ హై. ఉస్‌ కో దేఖో! నీచే మత్‌ దేఖో (కింది లోయలోకి చూడొద్దు. పైన ఆకాశం కొండలు చాలా అందంగా వుంటాయి. వాటిని చూడు గానీ కిందికి అస్సలు చూడకు.) అంటూ నాకు కౌన్సిలింగ్‌ లాంటిది చేస్తూనే వున్నాడు. కానీ నా దృష్టి లోయమీదే. గుర్రం ఎత్తులెక్కుతున్నపుడు వెనక్కి వాలమని, కిందికి దిగుతున్నపుడు ముందుకు వొంగమని చెబుతాడు. గుర్రాలు నడిపే వాళ్ళందరి గొంతులోంచి ‘పీఛే’, ‘ఆగే’ అనే మాటలు ఆగకుండా వినిపిస్తూనేవుంటాయి. గుర్రం పెద్ద పెద్ద బండరాళ్ళమీద కాళ్ళేసి పైకి ఎక్కుతున్నప్పుడు, వాలులోంచి కిందికి దిగుతున్నపుడు మన ప్రాణాలు అరచేతిలోకి వస్తాయి. ఎన్నోసార్లు ఇంక మనపని అయిపోయింది. పడిపోతాం అనిపిస్తుంది. మంచు మీద, మంచు కరిగిన చిత్తడి మీద గుర్రం నడుస్తున్నపుడు చాలా భయమని పిస్తుంది. ఇంతెత్తు బండల మీద షరీఫ్‌ గుర్రాన్ని ఎక్కిస్తున్నపుడు, కిందికి దిగుతున్నపుడు నేను అమ్మో! అంటూ చాలా సార్లు అరిచాను. అతను నన్ను ఒకచేత్తో పట్టుకుని జారిపోకుండా చాలాసార్లు సాయం చేసాడు.

సన్నటి కాలి బాట లాంటి దారి మీదే పోయే గుర్రాలు వచ్చే గుర్రాలు. నడిచేవాళ్ళు. ఒక్కోసారి అటు యిటు గుర్రాలు నడిచేదారిలేక ఆగిపోయేవి. మా గుర్రం కొండ అంచుమీద నిలబడి పోయేది. కిందికి చూస్తే కళ్ళు తిరిగినంత పనవుతుంది. మెల్లగా క్రాస్‌ చేసి బయలు దేరేవి. చుట్టూ ఉత్తంగ హిమాలయ పర్వతాల శ్రేణులు. కొన్ని మంచుతో కప్పబడి, ఎండపడి ధవళవర్ణంలో మెరిసిపోయేవి. నీలం రంగు ఆకాశం. స్వచ్ఛంగా అక్కడక్కడా కొండలమీద కూర్చున్న నల్లమబ్బులు. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఎంజాయ్‌ చేద్దామంటే, కూర్చున్నది గుర్రం మీదాయే! పడకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవడానికే కష్టంగా వుంది. సగం దూరం నడిచాక, కొన్ని ఎత్తులెక్కి, కిందికి దిగి భయంతో గడగడలాడాక ప్రయాణం అలవాటైంది. ఏమవుతుందిలే. కిందపడతాం. కానీయ్‌. అంతమంది వెళుతున్నారు. నేనెందుకు భయపడాలి. ఎంజాయ్‌ ద ట్రిప్‌. చుట్టూ అపరిమితమైన సౌందర్యం. చూడు. మళ్ళీ ఛాన్సు రాదు.’ సెల్ఫ్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చుకుంటూ, షరీఫ్‌ పాడుతున్న కాశ్మీరీ పాటలు ఎంజాయ్‌ చెయ్యడం మొదలుపెట్టాను. అతనితో కబుర్లు చెప్పసాగాను. అతను తన గుర్రం గురించి విశేషాలు, అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలు, తనొకసారి వైజాగ్‌ వచ్చానని, వైజాగ్‌కి మూడు పేర్లున్నాయి కదా అని విశాఖపట్టణం, వైజాగ్‌, వాల్తేర్‌ అంటూ చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెంత మంది ఆంధ్రా ప్రయాణికుల్ని తన గుర్రం మీద తీసుకెళ్ళాడో చెప్పాడు. ఇలా కబుర్లలో మునగడం వల్ల మనసులో బిగపట్టిన భావమేదో, భయం కావొచ్చు సడలినట్లయింది. కానీ ఆ కొండలవాలు మీద, గుర్రం మీద ప్రయాణం మాత్రం అత్యంత ప్రమాదకరమైందే. చాలా రిస్క్‌తో కూడుకున్నది. ప్రాణాలకు తెగించి ప్రయాణం చెయ్యడమే. బహుశ భక్తితో వచ్చేవాళ్ళ మనసులో ఒక భావన ఉండొచ్చు! ఇట్లాంటి చోట చనిపోయినా ఫర్వాలేదు. విధిని నమ్మేవాళ్ళు మాత్రం ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఈ కొండల్లో చావాలని రాసిపెట్టివుంటే ఎవరాపగలరు అనే ఒక భరోసా వాళ్ళ మనసుల్లో ఉండొచ్చు. నాకలాంటి నమ్మకాలు లేవు. నా ప్రయాణం ప్రకృతిలోకి. నాకు అమర్‌నాథ్‌ గుహ, అక్కడ ఏర్పడే మంచు శివలింగం గమ్యం కాదు. కానీ ఆ గుహలో ఆ మంచుమూర్తి ఏర్పడకపోతే ఈ ప్రయాణమే కుదరదు. ఇంత ప్రమాదకరమైన ప్రయాణం జనాలు చేసేది ఆ మంచుమూర్తిని దర్శించుకోవడానికే. నేను దీన్నొక సాహసయాత్రగానే ఎంజాయ్‌ చేసాను. భయం, గగుర్పాటు, విభ్రమం లాంటి భావాలు అడుగడుగునా కలుగుతాయి కానీ భక్తి మాత్రం నాకసలు కలగనే కలగదు. భయం కూడా చాలా తక్కువసార్లు. హఠాత్తుగా గుర్రం ముందుకి తూలినపుడు, పెద్ద పెద్ద బండరాళ్లమీద జారినపుడు గుండె గొంతులోకొస్తుంది. ప్రయాణం మొదట్లో కెమెరా బయటకు తీసి ఫోటోలు తీసే సాహసం చెయ్యలేకపోయాను. రెండు చేతులతో గుర్రాన్ని పట్టుకోవడమే సరిపోతుంది. అయితే ప్రయాణం సగం పైన సాగాక కొంత ధైర్యమొచ్చి కెమెరా తీసి, వీడియో తీసాను. ఫోటోలు క్లిక్‌ చెయ్యడం చాలా కష్టం. వీడియో కొంచం తేలిక. నేను ప్రయాణిస్తున్న దారిని, కొండవాలుని, కింది లోయని, సింధుని రికార్డ్‌ చేసాను. అయితే అప్పటికే చాలావరకు కిందికొచ్చేసాం. ఎత్తైన కొండల్ని షూట్‌ చెయ్యలేకపోయాను. కెమెరా పట్టుకుని పైకి కిందికి చూస్తే ఇంకేం లేదు. కిందపడటం ఖాయం. “ఇంకెంత దూరం షరీఫ్‌ భయ్యా” అని వందసార్లు అడిగివుంటాను. “ఆగయా! వో దేఖో, వో గుఫా హైనా వోయీ హై (అదిగో వచ్చేసాం. ఆ కన్పడే గుహే)” అంటూ చెప్పేవాడు.

ఓ గంటన్నర ప్రయాణం తర్వాత జనంతో, షాపులతో, పోలీస్‌, సి.ఆర్‌.పి.ఎఫ్‌లతో కిటకిట లాడుతున్న ప్రదేశంలో మా గుర్రం రాజా ఆగింది. చెయ్యందించి షరీఫ్‌ నన్ను గుర్రం దింపాడు. కాలుకింద పెట్టగానే ఒళ్ళంతా చాలా బరువన్పించింది. 14,000 వేల అడుగుల ఎత్తుమీద ఉన్నాం. ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. మాతోపాటే వున్న పోలీసాయన మమ్మల్ని CRPF క్యాంపు ఆఫీసుకు వెళదామని, అక్కడ కాసేపు రెస్ట్‌ తీసుకుని పైకి వెళదామని సూచించాడు. నా పరిస్థితి ఏం బాగోలేదు. ఒక్క అడుగు వెయ్యలేకపోయాను. మెట్లెక్కడంలో, ఎత్తులెక్కడంలో నాకు చాలా సమస్యలున్నాయి. ఒకసారి మైసూర్‌ వెళ్ళినపుడు, నిటారుకొండ శ్రావణ బెల్గోడా ఎక్కడానికి ప్రయత్నించినపుడు నేను ఫెయింట్‌ అయి కిందపడిపోయాను. వాంతి చేసుకుని ఒళ్ళంతా చెమటలు పట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. సగం దారిలో అలా జరగడం వల్ల నా సహచరుడు చాలా భయపడ్డాడు. మనుష్యులు మోసే డోలీ మీద మిగతా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. ఇపుడు కూడా అదే యిబ్బంది ఎదురైంది. “మేడం! కొంచం దూరమే వుంది. క్యాంప్‌ ఆఫీసులో రెస్ట్‌ తీసుకుందురు గానీ పదండి” అంటాడు. ఊహూ! నేనొక్క అడుగెయ్యలేక కూలబడిపోయాను. కొంచం సేపు అలా కూర్చున్నాక, మంచి నీళ్ళు తాగి సేదతీరి చాలా మెల్లగా నా శరీరాన్ని ఈడ్చుకుంటూ, ఊపిరి పీల్చడంలో చాలా కష్టపడుతూ క్యాంప్‌ ఆఫీసు వరకు నడిచాను. మమ్మల్ని మోసుకొచ్చిన గుర్రాలు కిందనే ఆగిపోయాయి. మేము గుహ వరకు వెళ్ళి వచ్చాక మమ్మల్ని మళ్ళీ కిందికి తీసుకెళతాయి.

కేంప్‌ ఆఫీసులో కొంచెం సేపు కూర్చుని వేడివేడి టీ తాగాక నేను కొంత తేరుకున్నాను. అయినా మెట్లు ఎక్కి పైకి వెళ్ళే సాహసం చెయ్యలేకపోయాను. ఆరువందలు ఇచ్చి డోలీ మాట్లాడుకున్నాను. అప్పటి వరకు గుర్రం నన్ను మోసుకొస్తే, డోలీలో కూర్చోబెట్టి, బతికుండగానే నలుగురు మనుష్యులు పైకి మోసుకెళ్ళారు. కెమెరా, సెల్‌ఫోన్‌లు తీసుకెళ్ళకూడదట. మేము CRPF అతిథులం కాబట్టి మమ్మల్ని చెక్‌ చెయ్యలేరు. నేను డోలీలో కూర్చుని గుహ వరకు వీడియో వేసాను. మా పోలీసాయన గమనించి “వద్దు మేడం. ఫోటోలు తియ్యొద్దు. కెమెరా లోపల పెట్టేయండి” అని హెచ్చరించాడు. నేను కెమెరా లోపల పడేసాను. పదిహేను నిముషాల్లో డోలీ పైకి చేరింది. అమర్‌నాథ్‌ గుహ ముందు నన్ను దింపేసారు. బూట్లు తీసేయమన్నారు. కాళ్ళు నేలమీద పెట్టగానే జివ్వుమన్నాయి. గుహ ఖాళీగా వుంది. ముంచుమూర్తి లేదు. భక్తులు తీవ్ర ఆశాభంగం పొందుతున్నారు. నిజానికి మంచుమూర్తి చాలా రోజులు క్రితమే కరిగిపోయింది. మైనస్‌ డిగ్రీ చలి వుంటేనే మంచు గడ్డకడుతుంది. చలి మాత్రం చాలా వుంది గానీ మైనస్‌ డిగ్రీ లేదు. మెట్లెక్కి వస్తున్న వాళ్ళు చాలా ఆయాసపడుతూ, ఆపసోపాలు పడుతూ వచ్చారు. శివలింగం ఇదే అంటూ చూపించారు. అక్కడేమీ లేదు. పక్కనే కొంత మంచు పేరుకొని వుంది. దాన్ని “పార్వతి మయ్యా” అంటూ చూపించారు. పార్వతి ఇక్కడే వుందట. శివుడు కైలాసం వెళ్ళిపోయాడట. “శివ్‌జి కైలాస్‌ చలే గయా” అని పూజారి అంటే “పార్వతీ కో అకేలే ఛోడ్‌కర్‌ క్యోం చలే గయా” అని నేనంటే “అయ్‌సీ బాత్‌ నహీ కరనా బేటీ” అని రెండు చెంపలూ వాయించుకున్నాడు పూజారి. నాతో వున్న వాళ్ళు నావేపు గుర్రుగా చూసారు. కాళ్ళకు చెప్పుల్లేవు. జివ్వున లాగేస్తున్నాయి. నేను అక్కడ ఒక రెయిలింగ్‌ వుంటే దాని మీద ఎక్కి కూర్చున్నాను. పూజారి నావేపు చాలా కోపంగా చూసి “ఐసా నహీ బైఠనా హై” అన్నాడు. నేనింక అక్కడ వుండకుండా కొంచం కిందికి దిగి వచ్చేసాను. చుట్టూ అద్భుతమైన కొండలు. మంచుతో కప్పబడి, ఎండకు తెల్లగా మెరుస్తున్నాయి. కొన్ని ఒట్టి బండలు, మంచు కానీ, చెట్లుగానీ లేవు. కొన్ని ఆకుపచ్చటి దుప్పట్లు కప్పుకున్న కొండలు. కళ్ళు చెదిరే సౌందర్యం.

అమర్‌నాథ్‌ గుహ చాలా చిన్నది. ఓ పెద్ద కొండలో ఏర్పడిన సహజమైన గుహ. ఆ గుహమీద ఓ పెద్ద రంధ్రం వుంది. ఆ రంధ్రం లోంచి మంచు మెల్లగా జారి పడుతూ లింగాకృతి దాలుస్తుంది. ఒక్కో డ్రాప్‌ పడుతూ, గడ్డ కడుతూ, క్రమంగా గుహపై భాగం వరకూ పెరుగుతుంది. నిలువుగా లింగాకృతిలో ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మంచుమూర్తి కరిగిపోతుంది. నిజానికి వారం రోజుల్లోనే అది కరిగి పోతుందట. క్రితం సంవత్సరం మిలటరీ వాళ్ళు ఏవో రసాయనాలు పూసి కరగకుండా చేసారనే ఆరోపణలు పేపర్లలలో వచ్చాయి. ఈసారి మరి అలాంటిది చేసారో లేదో గానీ మంచుమూర్తి తెలియదు. మొత్తం కరిగిపోయింది. భక్తులు మాత్రం ప్రవాహంలా వస్తూనే వున్నారు. ఈ గుహ, మంచుమూర్తికి సంబంధించి ఒక కథ ప్రచారంలో వుంది. దాని గురించి తర్వాత రాస్తాను.

అమర్‌నాథ్‌ గుహలో నాకు అమితంగా ఆసక్తి కల్గించినవి అక్కడ తిరుగాడుతున్న నాలుగైదు పావురాలు. వాటిని పంచ పాండవులంటారట. చాలా పెద్దగా వున్నాయి. రెండు పావురాలు జంటగా ఎగురుతూ ఆడుతున్నాయి. మిగిలినవి విడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. చాలా అందంగా వున్నాయవి. మనం ఇళ్ళల్లో చూసే వాటికన్న భిన్నంగా వున్నాయి. అంత ఎత్తైన కొండలమీద పావురాలు ఎందుకున్నాయో, ఎలా అక్కడికి చేరాయో అనేది మాత్రం మిస్టరీనే. గమ్మత్తేమిటంటే అవి అందరికీ కనబడవట. నాకు ఐదు కనబడ్డాయి. అవి ఎగురుతూ బయటకెళుతూ గుహలోకి వస్తుండడం వల్ల కొంతమందికి కనబడక పోవచ్చు. అవి పంచపాండవులని, అయిదు కన్పిస్తే గొప్ప అదృష్టమనే కామెంట్లు కూడా విన్నాను. నన్ను డోలీలో మోసుకొచ్చిన రఫీక్‌ “మాజీ! ఆప్‌! లక్కీ హై. ఆప్‌ కో పాంచ్‌కి పాంచ్‌ కబూతర్‌ మిల్‌గయా” అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. భక్తిరసం పొంగిపోర్లే చోట ఇలాంటివి బ్రహ్మాండంగా ప్రచారంలో వుంటాయి. ఆ మంచుకొండల్లో పావురాలు ఏం తిని బతుకుతాయా, మొత్తం మంచుతో కప్పడిపోయినపుడు ఈ పావురాలు ఎక్కడకు పోతాయో అని ఆలోచిస్తూ బూట్లు వేసుకోవడానికి అష్టకష్టాలు పడుతుంటే రఫీక్‌ చొరవగా బూట్లందుకుని తొడగడం మొదలు పెట్టాను. నేను వొద్దని వారిస్తూన్నా విన్పించుకోకుండా “ఆప్‌! హమారా మా జైసే. చప్పల్‌ పెహన్‌నేసే కుచ్‌ నహీ హోగా” (మీరు మీ అమ్మలాంటి వారు. బూట్లు తొడిగితే ఏం కాదు) అన్నాడు. అయినా నాకు చాలా గిల్టీగా అన్పించింది. అతని సహకారంతో బూట్లు తొడుక్కుని, మళ్ళీ డోలీలో కూర్చుని కిందికి దిగేసాం.

CRPF క్యాంపులో కాసేపు కూర్చుని, మళ్ళీ వేడిగా ఓ టీ తాగి, వాళ్ళందరితో ఫోటోలు దిగాం. అక్కడ చాలా మంది తెలుగు పోలీసులున్నారు. చిత్తూర్‌ నుండి, శ్రీకాకుళం, కర్నూల్‌ జిల్లాలకు చెందిన గురునాధరెడ్డి, ధనికుమార్‌, విద్యాధర్‌ మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా నేను గుర్రం దిగి నడవలేని స్థితిలో వున్నపుడు, నా చెయ్యి పట్టుకుని చాలా జాగ్రత్తగా నడిపించిన ధనికుమార్‌కి ఎప్పటికీ కృతజ్ఞురాలనే. అలాగే ్పుష్ట్ర ఆఓ కమాండెంట్‌ హరీందర్‌ సింగ్‌ మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించడంతో పాటు అమర్‌నాథ్‌కి సంబంధించి ఎన్నో విశేషాలు చెప్పాడు. యాత్ర మొదలయ్యిన దగ్గర నుండి ఆగస్టు 12 వరకు అక్కడి స్థితిగతులు ఎలా వుంటాయో చెప్పాడాయన.

ఈ యాత్ర నిర్వహణ మొత్తం CRPFదే. యాత్రకు ముందు యాత్ర తర్వాత నిర్మానుష్యంగా వుండే ఆ ప్రాంతం రెండు నెలల పాటు జనంతో కిటకిటలాడిపోతుంది. గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్లు, దుకాణాలు, అసంఖ్యాకంగా టెంట్‌లు, అడుగడుగునా పోలీస్‌, CRPF జవాన్లు, అధికారులు ఎంతో శ్రమించి అమర్‌నాథ్‌ యాత్రను నిర్వహిస్తారు. సివిలియన్‌ అధికారులు ఒక్కరు కూడా లేరు. అంతా మిలటరీ కంట్రోల్‌ లోనే వుంటుంది. BSNL చాలా కష్టం మీద కొన్ని లాండ్‌లైన్‌లు వేస్తుంది. వాళ్ళ మొబైల్స్‌ మాత్రమే పని చేస్తాయి. గుహ దగ్గర ఏర్పాటయ్యే టెంట్స్‌, దుకాణ సముదాయం, సరుకులు అన్నింటినీ గుర్రాలు నిరంతరాయంగా మోస్తూ వుంటాయి. గుర్రం తప్ప వేరే రవాణా సదుపాయం లేదు. రెండు నెలల పాటు జరిగే మహా జాతర అది. వేలాది మంది మిలటరీ వాళ్ళు శ్రమించి, సెక్యూరిటీ కల్పించి నిర్వహిస్తారు. ఆగస్టు పన్నెండు తర్వాత ఆ అయిదు పావురాలు తప్ప మరో పిట్ట కూడా అక్కడ మిగలదు. మంచు కురవడం మొదలైతే ఆ చుట్టు పక్కలకి కూడా వెళ్ళలేము. 30 అడుగుల మందాన మంచు కురిసి కొండలు, దారులు, సింధు నది అన్నీ కలగలిసి పోతాయట. పావురాలు ఎక్కడికి వెళతాయా? ఏం తింటాయా అని ఆలోచిస్తూ, హరేందర్‌ సింగ్‌ గారికి కృతజ్ఞతలు చెప్పి మేము మా గుర్రాలున్న చోటుకి వచ్చేసాం.

మళ్ళీ రాజా మీద సవారీ. షరీఫ్‌ చెయ్యందించి గుర్రాల మీద కూర్చోబెట్టాడు. గుర్రం మీద కిందికి దిగడం మాత్రం చాలా భయానకమైన అనుభవం. లోతుల్లోకి దిగుతున్నపుడు షరీఫ్‌ నన్ను కూడా పట్టుకుని దింపేవాడు. అలా చాలా సార్లు జరిగింది. “ఆప్‌ డరనా నహీ. మైహూనా” అని షారూఖ్‌ ఖాన్‌ లెవెల్‌లో భరోసా ఇచ్చేవాడు. బిర్రబిగుసుకుపోయి, ప్రాణాలరచేత పట్టినట్లు గుర్రాన్ని గట్టిగా పట్టుకుని, ఆ లోయల్ని, నదీ ప్రవాహాన్నీ చూస్తూ, ఎదురుగా గుర్రాలొచ్చినపుడు ఇంక నా పనయిపోయింది. లోయలోకి పడ్డం ఖాయం అనుకుంటూ – అలా ఎన్నో సార్లు జరిగింది. రెండుసార్లు గుర్రం తూలి పడబోయింది. ఆ కుదుపులకి నేను కూర్చున్న జీను ఒకపక్కకి జరిగిపోయింది. అది గమనించి నన్ను దింపి జీనును సరిచేసి, తాను కప్పుకున్న ఉన్ని కోటుని కూడా దాని మీద పరిచి నన్ను మళ్ళీ జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ఆ సన్నటి దారిలో విపరీతమైన రద్దీ. వచ్చే గుర్రాలు, పోయే గుర్రాలు. ట్రాఫిక్‌ జామ్‌లు. గుర్రాల్ని వెనక్కి నడిపించినపుడు మాత్రం గుండె జారిపోతుంది. ఆ దారిని విశాలం చెయ్యలేని నిస్సహాయస్థితి వల్లను, మామూలు రోజుల్లో అక్కడంతా మంచే వుంటుంది కాబట్టి రిపేర్లు లాంటివి కూడా జరగవు. రెయిలింగ్‌ లాంటిది కట్టడం కూడా అసాధ్యమే. అందుకే అమర్‌నాథ్‌ యాత్ర అత్యంత ప్రమాదకరంగా వుంటుంది. ప్రాణాలకి భరోసా లేని యాత్ర. ఆ సాహసయాత్ర చేసి తిరిగొచ్చామంటే తిరిగొచ్చాం. అంతే. రాలేకపోనువచ్చు. అన్నిటికి సిద్ధపడే అసంఖ్యాకంగా భక్తులు, వృద్ధులు కూడా తరలి వస్తాను. నాకు భక్తితో సంబంధం లేకపోయినా సాహసాలు చెయ్యడంతో పాటు, అత్యంత మనోహరమైన, సౌందర్యంతో నిండిన ఆ ప్రదేశానికి వెళ్ళడం ప్రాణ సమానం. ప్రాణం పోతుందేమో నన్నంత రిస్క్‌ వున్నప్పటికీ. బహుశ భక్తులు పోతే దైవైక్యంగా భావించొచ్చు. నేను పోతే ప్రకృతైక్యంగా అనుకోవాలి కాబోలు. ఇలాంటి ఆలోచనలతో గంటన్నర పైనే ప్రయాణం చేసి, ఎన్నో ప్రమాదాలను దాటి కిందికొచ్చాం. అప్పటికి టైమ్‌ ఒంటి గంట కావస్తోంది. ఉదయం నించి టీ తప్ప మరేం తినలేదు. మా హెలికాఫ్టర్‌ రెడీగా వుందని ధనికుమార్‌ చెప్పాడు. గుర్రాలకి డబ్బులిచ్చేసాం. షరీఫ్‌కి, రాజాకి బోలెడన్ని కృతజ్ఞలు చెప్పి నేను షరీఫ్‌కి రెండు వందలు టిప్‌ ఇచ్చి గుర్రానికి బాగా తిండి పెట్టు అని చెప్పాను. నేను అంత టిప్‌ ఇవ్వడం చూసి అందరూ గయ్‌మన్నారు. ముఖ్యంగా ధనికుమార్‌, “మేడం మీరు అంతలేసి టిప్‌లివ్వొద్దు. వాళ్ళు మిగతా వాళ్ళని పీడిస్తారు.” అన్నాడు. నాకు ఆ సలహాలేవీ బుర్రకెక్కలేదు. కొండలమీద, ఎత్తైన మెట్లమీద, కొండ అంచుమీద ఎంతో నైపుణ్యంతో గుర్రాన్ని నడిపించిన షరీఫ్‌ మీద, అతని గుర్రం రాజా మీద కలిగిన అభిమాన వ్యక్తీకరణకి అంతకన్నా మార్గం కనబడలేదు. నిజానికి ఆ గుర్రం పాదాలకి నమస్కరించాలి. షరీఫ్‌ పాదాలని కళ్ళకద్దుకోవాలి. గుర్రమెక్కి కూర్చున్న నేనే అంత కష్టపడిపోతే గుర్రంతో పాటు నడిచిన అతని శ్రమని గమనించాలి కదా. ఆ గుర్రం ఆత్మహత్య చేసుకోకుండా నన్ను సురక్షితంగా చేర్చింది కదా!. షరీఫ్‌ చాలా సంబరపడి పోయాడు. బహుశ అంత టిప్‌ ఎవరూ ఇచ్చివుండకపోవచ్చేమో అన్పించింది అతని ముఖం చూసాక. అతని సంతోషం చూసాక నా కృతజ్ఞతాభారం కొంచం తగ్గినట్లయింది. షరీఫ్‌ని, రాజాగుర్రాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందులో సందేహమే లేదు.

ఐదు నిముషాల్లో మమ్మల్ని హెలికాప్టర్‌ బాల్టాక్‌లో దించేసింది. అమర్‌నాథ్‌ కొండలకి గుడ్‌బై చెప్పి హెలికాప్టర్‌లో కూర్చున్నాం. తీరా తిరిగి వచ్చేటప్పుడు ఆ అందాన్నంతా అలా వదిలేసి రావడానికి ఎంత దిగులేసిందో చెప్పలేను. హెలికాప్టర్‌ లోంచి చూస్తుంటే గుర్రాలలో మేము ప్రయాణించిన దారి స్పష్టంగా కనబడుతోంది. వందలాది గుర్రాలు, మనుష్యులు చీమల బారుల్లా కదులుతున్నారు. నాలుగు రోజులు గడిస్తే నరమానవుడెవరూ కన్పించని, ఆ నిర్మానుష్య, నిశ్శబ్ద, నిరామయ పరిసరాలు నా గుండెల్లో వొదిగిపోయాయి. అమర్‌నాథ్‌ గుహ, ఆ గుహలో గుంభనంగా ఏర్పడే మంచుమూర్తి మీద గొప్ప ప్రేమ కలిగింది నాకు ఆ క్షణాన. ఆ మంచుమూర్తిని చూడటానికే కదా ఇన్ని లక్షల మంది ఇక్కడికొస్తున్నారు. భక్తిపారవశ్యంతో కొందరు ప్రకృతి ఆరాధనలో నాలాంటి అల్పసంఖ్యాకులు కొందరు అమితమైన శ్రమకోర్చి, అంతమందిని తన దగ్గరకు రప్పించుకుంటున్న మంచుమూర్తిని ముద్దాడాలన్నంత మైమరపు కలిగింది కానీ అది కాస్తా కరిగి నీరైపోయింది.

రెండున్నరకి ఇనోవాలో మా తిరుగుప్రయాణం మొదలైంది. అందరం చాలా అలిసిపోయాం. ఏమీ తినలేదు. కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా తెరిచి, మళ్ళొకసారి పర్వత సముదాయాలను, జలపాతాలను, సింధునదిని మనసారా చూస్తూ కూర్చున్నాను. అపుడపుడు కళ్ళు మూతలు పడుతున్నా, మూసిన రెప్పల వెనక కూడా అమర్‌నాథ్‌ అందాలే అలరిస్తున్నాయి. కన్ను మూసినా, తెరిచినా అద్భుత సౌందర్యమే. శ్రీనగర్‌లోకి ప్రవేశించామనడానికి నిదర్శనంగా, బారులు తీరిన చినార్‌ చెట్లు స్వాగతం పలికాయి. ఐదుగంటలకి మా గెస్ట్‌ హౌస్‌ చేరాం. చిత్రంగా ఎవరినీ ఆకలి బాధించలేదు కానీ రెండు బ్రెడ్డు ముక్కలు, వేడి వేడి కాఫీ పడేసరికి అందరికీ, అపుడు ఆకలి గుర్తొచ్చింది.

తలారాస్నానం చేసి, గెస్ట్‌ హౌస్‌ పై భాగానికి వెళితే నిదానంగా ప్రవహిస్తున్న జీలం నది కనబడింది. సింధు నది ఉరవళ్ళకి, జీలం నది నిదానానికి పోలికే లేదు. నీళ్ళ వేపు చూస్తూ కూర్చుంటే అలసట అంతా మాయమై ఫ్రెష్‌గా అయిపోయింది.

మర్నాడు శ్రీనగర్‌లో వుండే నా ఫ్రెండ్‌ వహీదా ఇంటికి వెళ్ళాం. వాళ్ళింట్లో మాటల సందర్భంలో అమర్‌నాథ్‌ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 150 సంవత్సరాల క్రితం బూటా మాలిక్‌ అనే పశువుల కాపరి తొలిసారి అమర్‌నాథ్‌ గుహను కనుక్కున్నాడట. అతను ముస్లిమ్‌. అతను పశువుల్ని మేపుకుంటూ ఆ పరిసరాల్లో తిరుగుతున్నపుడు ఒక సిద్ధుడు ఆయనకు కనబడ్డాడట. అతనికి ఒక కమండలం లాంటిది ఇచ్చాడట. ఇంటికెళ్ళి చూస్తే దాంట్లో బంగారం వుందట. మాలిక్‌ మర్నాడు తిరిగొచ్చి చూస్తే సిద్ధుడు కనబడలేదట. సిద్ధుడి కోసం వెతుకుతూ తిరుగుతుంటే, అక్కడొక గుహ, ఆ గుహలో ఏర్పడిన మంచుమూర్తి కనబడిందట. చాలా కాలం అతనక్కడే వుండిపోయి సిద్ధుడి కోసం ఎదురుచూస్తూ ఆ మంచుమూర్తి దగ్గరే ఉండిపోయాడట. క్రమంగా ఈ వార్త బయటకు పొక్కి జనం రావడం మొదలైంది. మొదట్లో హిందువులు, ముస్లిమ్‌లు కలిసి శ్రీనగర్‌ నుండే పెద్ద ఊరేగింపుగా అమర్‌నాథ్‌కి వెళ్లేవారట. జూన్‌ నెలలో పౌర్ణమి రోజున మంచుమూర్తి పూర్తిగా ఏర్పడి, చంద్రుడిలో కళలు తగ్గే కొద్దీ, మంచు కూడా క్రమంగా కరిగిపోయేదట. పౌర్ణమి నాటికి అమర్‌నాథ్‌ చేరేలా శ్రీనగర్‌ నుంచి ఊరేగింపు బయలుదేరేదట.

క్రమంగా అమర్‌నాథ్‌ హిందువుల పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. కాశ్మీర్‌లో వేర్పాటు వాదం మొదలై, ఉధృతమయ్యాక ముస్లింలు పాల్గొనడం తగ్గింది. ఊరేగింపు కూడా శ్రీనగర్‌ నుండి వెళ్ళడం లేదిపుడు. శ్రీనగర్‌కు దగ్గరల్లోని పెహల్‌గావ్‌ బేస్‌ క్యాంప్‌గా రూపొందింది. చాలా వరకు యాత్ర అక్కడ నుండే మొదలవుతుంది. ఇంతకు ముందు యాత్రికుల మీద వేర్పాటువాదుల దాడులు కూడా జరిగాయి. ప్రస్తుతం అడుగడుగునా తుపాకీ పహారాలోనే యాత్ర నడుస్తోంది.

ఇంటర్‌నెట్‌లో ఇంకొక కథ ప్రచారంలో వుంది. అమర్‌నాథ్‌ గుహకి 5000ల సంవత్సరాల చరిత్ర వుందని, పురాణాలలో దీని ప్రసక్తి వుందని, కల్హణుని రాజతరంగిణిలో అమర్‌నాథ్‌గుహ గురించి వుందని, కాశ్మీరీ రాజులు తమ వేసవి విడిదిగా అమర్‌నాథ్‌కి వెళ్ళేవారనే కథనం వుంది. అయితే అమర్‌నాథ్‌ని మొదట కనుగొన్నది మాత్రం ముస్లిమ్‌ పశువుల కాపరి బూటామాలిక్‌ అన్నదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ కూడా వుంది. అమర్‌నాథ్‌ గుహ దగ్గర భక్తులు సమర్పించే సంపదలో ఇప్పటికీ బూటామాలిక్‌ కుటుంబీకులకు వాటా వెళుతుంది. నిజానికి ఈ యాత్ర ఇటీవలిది కాదని, ఎన్నో వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని, కాశ్మీరు, ఆఫ్గనిస్తాన్‌ పరిపాలన కింద ఉన్నపుడు ఈ యాత్రకి బ్రేక్‌ వచ్చివుండచ్చని, ఆ తర్వాతే బూటామాలిక్‌ దీన్ని తిరిగి కనుక్కొని ఉండొచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు.

హిందు ముస్లిమ్‌ల సౌహార్ద్రానికి సాక్షిగా నిలిచిన అమర్‌నాథ్‌, మతసామరస్యపు పువ్వుల్ని పూయించాలని ఆశిద్దాం. ఒక ముస్లిమ్‌ యువకుడు కనుక్కొన్న అమర్‌నాథ్‌ గుహ ఈరోజు కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమవ్వడం ఎంత మానవీయంగా వుందో, నమ్మకాలు, మానవీయ కోణాన్ని తగ్గించకూడదని అర్థం చేసుకోవాలి. ఈ కోణం నాలాంటి మతాతీతంగా బతికే వాళ్ళకి గొప్ప సంతోషాన్ని కల్గించి తీరుతుంది.

శ్రీనగర్‌కి గుడ్‌బై చెప్పేసి మేము ఎయిర్‌పోర్టు వైపు బయలుదేరాం. అద్భుతానుభావాలను పంచిన అమర్‌నాథ్‌ ప్రయాణం ఆ విధంగా ముగింపుకొచ్చింది.




కొండవీటి సత్యవతి

Saturday, 5 March 2016

ROAD TRIP - హైదరాబాద్ - వయా గోవా - మున్నార్.









హైదరాబాద్ - వయా గోవా - మున్నార్
ROAD TRIP


ఆగష్ట నెల మూడో తేది సోమవారం ఉదయం 5:30కు జడ్చర్ల లో మా రోడ్ ట్రిప్ మొదలయింది. కర్నూలు నుండి వచ్చిన మధు అనే నా కాలేజి క్లాస్‌మేట్‌ని పికప్ చేసుకొని అక్కడ నుండి బాదామికి మద్యాహ్నానికి చేరాము.



మరసటి రోజు ఉదయం పదుకొండు గంటల వరకు అక్కడ చూడాలసిన ప్రదేశాలు చూసి అక్కడ నుండి గోవాకు ప్రయాణం..

ఒక పక్కన వర్షం, మంచు.. కొండల మీదుగా...మేఘాల మద్యన పచ్చని ప్రకృతిలొ ఒక పక్కన పాత పాటలు వింటూ ప్రయాణం. మాటల్లో వర్ణించలేని అనుభూతి..!

రాత్రికి గోవా చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్‌లో బస.. మరసటి రోజు సమయాలనుకూలతను బట్టి కొన్ని ప్రదేశాలు చూసేసి ఆ మరసటి రోజు ఉదయం మద్యాహ్నంగా ప్రయాణం.... బీచ్ వెంబడీ రోడ్ ప్రయాణం...మరో వైపు పచ్చదనం.

కార్వార్ మీదుగా గోకర్ణ చేరి.. అక్కడ నైట్ హాల్ట్. మరసటి ఉదయం అక్కడ నుండి మురుడేశ్వర్.



అక్కడ నుండి జోగ్ ఫాల్స్ అవి చూసుకొని సాగర్ మీదుగా షిమొగా చేరి అక్కడ నైట్ హాల్ట్.



మరసటి రోజు ఉదయం అక్కడ నుండి ఇక్కేరి అనే కేలడి రాజుల చారిత్రక ప్రాంతం సంధర్శన..

"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం 

నా రోడ్ ట్రిప్‌లో భాగంగా ఆరవ రోజు.. హోటల్ రూమ్‌లో పొద్దున్నే ల్యాప్ టాప్ ముందర కూర్చోని చుట్టు పక్కల ఏమేమ్ వున్నాయో చూడదగ్గ ప్రదేశాలంటూ వెదుకుతూ కుర్చున్నాను. మా టూర్ ఫ్రోగ్రామర్ మాత్రం ఇక్కడ దగ్గరలో ఏవి లేవు అన్ని వంద కిలోమీటర్ల్ దాటి వెళ్లాలి దానికన్నా "ఆగుంబే" వెళ్లిపోవడం మంచిదంటూ కూర్చున్నాడు. నాకేమో చుట్టూ వున్న చూడదగ్గ ప్రదేశాలను చూడకుండా వెళ్లడం ఇష్టం లేదు. గూగుల్ సెర్చ్‌లో మంచి ఆర్కిటెక్చర్ వున్న దేవాలయం ఫోటొ కనపడ్డది. ఆ ఫోటో పట్టుకొని అదెక్కడ... అని వెదికితే.. మేముంటున్న షిమొగా వూరుకు 90 కిలోమీటర్ల దూరంలో వున్నదని చూపిస్తున్నది. మా టూర్ ఫోగ్రామర్ మాత్రం మళ్లీ వెనక్కు 90 కిలోమీటర్ల్ వెళ్లడం ఎందుకు "ఆగుంబే" దారిలొ ఏవైనా వుంటే చూసుకొంటూ వెళ్లిపోదాం అని చెబుతున్నాడు. నేను ససేమిరా అంటు పట్టు బట్టి బయలు దేరాం.

వాస్తవంగా జోగ్ ఫాల్స్ నుండి షిమొగాకు వచ్చే దారిలొ "సాగర్" అనే వూరు వున్నది. మేము ఆ వూరు మీద నుండే వచ్చి షిమోగాలో నైట్ హాల్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఆ దేవాలయం సాగర్ వద్ద నుండి ఓ మూడు కిలోమీటర్ల్ లోనకు ప్రయాణించాలి. తిరిగి వెనక్కు వెళ్లి చూడటం అంత అవసరమా అని మిత్రుల ఆలోచన.. ! ఫోటోలో ఆ ఆర్కిటెక్చర్ చూడగానే ఆకట్టుకొంది...!


సాగర్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఎడమ వైపుకు వెళ్లాక ఈ "ఇక్కేరి" దేవాలయం కనపడ్డది. అప్పటి వరకు అయిష్టంగా వచ్చిన ఇద్దరు మిత్రులు..ఆ దేవాలయం ముఖ ద్వారం చూడగానే మొహాలు విప్పారాయి.ఆ ఆర్కిటెక్చర్....ఆ పచ్చని ప్రదేశం మద్యలో ఆ కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతున్న దేవాలయం చూడగానే వీరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన మైమరుపు... హమ్మయ్య అనుకొన్నాను నాలోపల...! అది గాని అతి సాదారణంగా వుండుంటేనా...?? అంతే " చెబితే విన్నావా.. చూడు ఏవైనా బాగున్నదా.. ఇలాంటివి మనూళ్లో లేవా ఏంటి.. వీటి కోసం అన్నేసి గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలా" అంటు నామీద దాడి చేసేవాళ్లు.


లోపలి వెళ్లగానే ఆ శిల్పాలను.. వాటిని మలిచిన తీరును చూస్తూ అబ్బరపడిపోతున్నాం. ఫోటోస్ తీసుకోవడానికే సత్తాను చేతుల్లోకి తెచ్చుకొంటూ ఉత్సాహ పడిపోతున్నాం అందరం. అదో రకమైన శైలి అవి. దేవాలయం పైన మాత్రం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనపడుతున్నది. మండపాలు మరో శైలి.. ఇలా చాలా రకాలు కనపడుతున్నాయి. గుర్తించడం నాబోటి అఙ్ఞానికి చాలా కష్టం.


మరో వైపున శిల్పం మొత్తం ఆనవాలే లేకుండా కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

లోపల గర్భ గుడికు ముందు శిల్పాలతో చెక్కిన పదుల సంఖ్యలో స్థంభాలతో కూడిన పెద్ద హాల్ వున్నది. అక్కడ ఫోటోస్ తీయడానికి తగినంత వెలుగు లేకపోవడంటొ ఫోటోస్ సరిగ్గా తీయలేకపోయాను. లోపలికి కెమెరా ట్రైపాడ్ అనుమతి లేదట.


దాదాపుగా ఓ గంటన్నర సమయం ఫోటోస్ తీయడానికే గడిచిపోయింది. అక్కడ నుండి తిరిగు ప్రయాణానికి కారులొ సిద్దమవుతూ.. అక్కడే వున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చిరుద్యోగిని కలిసి చుట్టూ వున్న మరిన్ని చూడతగ్గ ప్రదేశాల వివరాలు తెలుసుకొందామని కారులో నుండి అతని వద్దకు వెళ్లాను. అలా వెళ్లడం వలన నాకు మరింత చరిత్ర తెలుసుకొవడానికి దోహద పడింది. ఒక రకంగా నా బుర్రకు మేత దొరికింది. నిజంగా ఆ క్షణం అలా సమాచారం సేకరించాలనే తలంపు రావడమన్నది లక్కీనే అనుకోవాలి.


ఆ చిరుద్యోగిని కాస్త కదపగానే మెల్లి మెల్లగా చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. బయలు దేరాలనుకొన్న ఇద్దరు మిత్రులు కూడ వచ్చి చేరి మళ్లీ తిరిగి ఆయనతో పాటు ఆ చరిత్ర వింటూ ఆశ్చర్యపోతూ మళ్లీ మరికొన్ని మేము చూడ కుండా మిస్ అయినా శిల్పాల ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టాం.


ఆ టెంపుల్ గురించి ముద్రిత సమాచారం అక్కడ హింధీలో వుండటం వలన కేవలం ఆ ఆర్కియాలజీ డిపార్ట్‌మెట్ం చిరుద్యోగి చెప్పిన చరిత్ర విశేషాలనే నేనిక్కడ ఇస్తున్నాను. ఇవి ఎంత వరకు అథింటికేట్ అన్నది నేను కూడ చెప్పలేను గానీ.. .. ఆయన మాటల్లోనే....

కేలడీ నాయకులు అని పిలువ బడుతున్న చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ),శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు ( విక్కీలో మాత్రం మొత్తం 17 మంది రాజుల పేర్లు చెబుతున్నది ). కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. వీరి బంగారను అక్కడుకు, విజయనగరం సామ్రాజ్యపు వజ్రాలు వైఢూర్యాలు వీరికి ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన వీళ్లు విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించే వారట. అలా 24 క్యారెట్స్ బంగారం అనే కొలతను వీరి నుండే ప్రారంభమైందట. వీరి పాలన దాదాపుగా 250 సవంత్సారల పైనా సాగింది. (1540 - 1760 )

వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రుడు, పూర్తి చంద్రుడు ఆకారంతో చలా మనిలో వుండేవట. వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. మరొక విషయం భారతదేశంలొ దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది.


అంతే కాకుండా దేవాలయానికి ముఖ ద్వారం వద్దనే "నంధీశ్వరుడి" మండపం వుంటుంది ఇదొక కొత్త శైలి. అందునా గర్భ గుడిలోని ప్రధాన విగ్రహానికి చాలా దూరంలో (58 అడుగులు) వున్నది. మళ్లీ గర్భ గుడిలొ మరొక అమృత శిలగా పిలవబడుతున్న ట్రాన్స్‌పరెంట్ నంధీ విగ్రహం వున్నది. చీకటిలో టార్చి లైట్ వెలిగించినా ఆ వెలుగు ఆ విగ్రహం గుండా మరో వైపుకు ప్రవహిస్తుందట.



ఇక ఈ అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుదట...! ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారట. ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువ బడుతున్నారు.



ఇక అన్ని గుళ్లల్లోను వుండే "రతి భంగిమల" విగ్రహాలు ఇక్కడా చెక్కబడి వున్నాయి. నేనిప్పటి వరకు చూసిన ప్రతి హిందూ దేవాలయాలలో ఈ వాత్సాయనుడి రతిభంగమలు చూస్తూనే వున్నాను. బహుశ ప్రపంచానికి ఈ దేశం నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమైందేమో అని అనిపిస్తూ వుంటుంది నాకు. మద్యలో ఏర్పడిన నాగరికత పౌర సమాజం నుండి వచ్చిన మత పెద్దలు వీటిని సమాజ హితం కోసమంటూ కొన్ని అంక్షలు పెట్టడం వలన అయితేనేమి..? సెక్స్ అన్నది కేవలం "మగవాడి" సామర్థ్యానికి, గొప్పదనానికి ప్రతీక అనే ఒక భావజాలంలో వుండడం వలన అది నలుగురిలో ఒక సబ్జెక్ట్ లాగ మాట్లాడుకొనే దశను కోల్పోయి అదొక అశ్లీలత, బూతు వ్యవహారంగా భౌతిక ప్రపంచంలో చలామని కావడం మొదలయ్యింది.

మేము అక్కడున్నప్పుడే కొందరు కాలేజీ యువతీయువకులు అక్కడికొచ్చారు. అందులొ ఉత్తర, దక్షణ భారతదేశీయులు వున్నారు. అందరిలాగ ఒకరిద్దరు యువకులు ఈ భంగిమలు చూడగానే మొహం విప్పారి తోటి వారికి చెప్పాలనే ఉత్సాహంతో వెర్రికేక పెట్టి చూపుతుండగా మరి కొందరు తమతో వున్న అమ్మాయిలకు కూడ చూపి వాళ్లెలా ఫీల్ అవుతారో అని గమనించసాగారు. దానికా ఒకరిద్దరు అమ్మాయిలు "హ్మ్..దానిదేమున్నది అవన్ని సహజం అప్పట్లో.. దేవాలయాల్లో అదొక అంశం" అంటూ అదొక సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లా మరొక సబ్జెక్ట్ అనే భావంతో ఎటువంటి వికారాలు, అసభ్యమైన కోణాలు లేకుండా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఇక్కడ ప్రభుత్వాలు వెబ్‌సైట్స్ మీద బ్యాన్ విదిస్తే విదించొచ్చు కాని ఇలాంటి దేవాలయాలలొ బహిరంగంగా వున్న ఈ భంగిమలను చూడకుండా ఎవరు ఆప లేరు కదా..?



ఇక దేవాలయం విషయానికొస్తే..

ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే చాలా చాలా సాంకేతికమైన విషయాలు బాగా తెలుస్తాయి. అంత టెక్నికల్‌గా నిర్మించారు ఈ దేవాలయాన్ని.

ఇక్కడికి చేరాలనుకొనే దారి. కర్నాటకలోని జోగ్ ఫాల్స్ నుండి షిమోగా వెళ్లే దారి మద్యలో "సాగర్" అనే తాలుకా ఎదురవుతుంది. ఆ వూరి నుండి లోపలికి ఓ మూడు కిలోమీటర్ల్ ప్రయాణిస్తే ఈ "ఇక్కేరి" టెంపుల్‌కు వెళ్లొచ్చు. షిమోగా నుండి 90 కిలోమీటర్ల్ సాగర్ వైపు ప్రయాణించినా ఇక్కడికి చేరుకోవచ్చు.

వీటి చుట్టు పక్కల ఇంకా చూడాలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మాకున్న సమయభావం వలన అవన్నీ చూల్లేకపోయాం. కేలడి వూరు అందులోని టెంపుల్, అక్కడే వున్న కేలడీ రాజుల కోటలు నాలుగు వున్నాయి. ఇవే కాక చాలా చాలా పచ్చని లాండ్ స్కేప్స్ చాలా వున్నాయి. ఇక్కడ నుండి ఆగుంబే వెళ్లే దారిలొ "తీర్థ హల్లి" అనే మరొక వూరు వొస్తుంది. అబ్బో ఆ వూరు చుట్టు కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణిస్తే చాలు ఎన్నో జలపాతాలు, పచ్చని ల్యాండ్ స్కేప్స్, సరస్సులు బోలెడు చూడొచ్చు. మొత్తం పచ్చదనమే..ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చదనమే కనపడుతుంది. ప్రకృతి ఆరాధకులకు పండగే పండగ.........!!

ఈ ఇక్కేరి రాజధాని గురించి మరింత క్షుణ్నంగా సమాచారం కోసం గూగుల్‌, విక్కీలో చాలా దొరుకుతుంది. అక్కడ మరింత సమాచారం తెలుసుకోవచ్చు.


అప్పట్లో ఎన్నేసి రకాల స్త్రీలకు జడ కుచ్చులు వేసారో ఈ శిల్పంలో చూడొచ్చు.....



అప్పటి అంతపుర స్త్రీలు ధరించిన "వ్యానిటీ బ్యాగ్" ఈ చిత్రంలో..!!



ఇస్లామిక్ పరిపాలనలో సింహాలకు ముస్లీమ్ రాజుల్లా వుండే వారి గడ్డాలనే ఇక్కడున్న సింహాలకు ముస్లీమ్ సింహాల్లాగా శిల్పాలను అక్కడక్కడ చెక్కించారు.

























తర్వాత తీర్థ హల్లి మీదుగా ఆగుంబే. మద్యలో కుంభవృష్టితో వర్షం. ఆ వర్షంలోనే మేఘాల మద్యన ఘాట్ రోడ్ లో ఎత్తైన కొండ మీద కుండాద్రి బెట్టను చేరుకొన్నాం అదొక అడ్వేంచర్ మాకు. కింద ఏమున్నదో కూడ కనపడనంతగా మేఘాలలో వుండిపోయాము. అక్కడ నుండి సాయింత్రం ఆగుంబే చేరాము. కాని చుట్టు పక్కల చూట్టానికి వాతావరణం అనుకూలించలేదు. చాలా జలపాతాలు, ల్యాండ్ స్కేప్స్ మరియూ కుద్రేముఖ్ లాంటి సీనరీ కలిగిన ప్రదేశాన్ని చూడలేకపోయాము.. కుంభవృష్టితో ఒక్కటే వాన. అక్కడ నుండి బయలు దేరి రాత్రి తొమ్మిదికి ఉడిపికి చేరుకొని అక్కడే నైట్ హాల్ట్.. దర్శనాలు..అన్నీను.

పొద్దున్నే సేయింట్ మేరీ ఐల్యాండ్ చూడాలనుకొని వెళ్లాం.. ఊహు. సముద్రంలో తుఫాన్ కదిలకలతో ఐల్యాండ్ కూడ క్యాన్సిల్.. అక్కడ నుండి మడికెరకు ప్రయాణం.... మద్యలో...!!

కార్కాల అనే వూరికి చేరాం. ఇదే వూరికి నేను ఓ 15 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఒక ముఖ్యమంత్రి సొంత వారు కావడం చేత ఇక్కడకు వెళ్లాను. తిరిగి ఇప్పుడు గుర్తు పెట్టుకొని వెళ్లాను. ఇక్కడొక విశేషమున్నది..! అక్కడ నుండి మూడబిదిరి లోని జైన్ దేవాలయాన్ని చూసుకొని సాయింత్రం మడికెరి (కూర్గ్) చేరుకొన్నాం. కాని కూర్గ్‌కు వెళ్లే మార్గ మద్యలో వున్న ఘాట్ రోడ్ మాత్రం భలే వున్నది, ఎన్నెన్ని వొంపులు..ఎన్నెన్ని మెలికలో.. స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చోవాల్సిందే.. అదీను ఆకు పచ్చని కొండల నడుమ.. ప్చ్ ఆ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ చేయడమన్నది ఒక అడ్వేంచరే..! ఫుల్ ఆఫ్ జాయ్ అంటే ఏమిటో అర్థమవుతుంది.

మరసటి రోజు ఉదయం వర్షంలోనే "అబ్బి ఫాల్స్" చూసుకొన్నాం.. అక్కడకు దగ్గరలోనే "మండద పట్టి" అనే కొన్ని ల్యాండ్ స్కేప్స్ వున్న ప్రాంతాలు వున్నాయి. కాని నా ఫ్రెండ్స్ అనాసక్తితో చూడకుండానే వెనుతిరగాల్సి వొచ్చింది. అక్కడ నుండి కోస్‌కోడె అనే కేరళ ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. ఇక ఆ ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు గానీ.. చాలా రద్దీగల రహదారి అది. మద్యలో "తలసరి" అనే వూరులో భోజనం. అక్కడే వున్న ఒక చిన్న పాటి కోటను సందర్శించి తిరిగి అక్కడ నుండి "కోజ్‌కోడె" కు సాయింత్రానికి చేరుకొన్నాం. వర్షాకాలం వలన అక్కడ బ్యాక్ వాటర్ బోట్ హోమ్‌లో బస చేయడానికి అవకాశం లేకపోవడం వలన అక్కడ నుండి గురువాయర్‌కు వెల్దామని ఫ్రెండ్స్ ప్రప్ఫొజల్‌తో.. ఇంత వరకు చూడలేదాయన్ని.. సరే నేను చూసినట్లుంటుంది.. అలాగే ఒక పలకరింపు పలకరిస్తే ఓ పనైపోతుంది కదా రాత్రికి గురువాయర్ చేరుకొన్నాం.

తెల్లారు జామున్నే గురువాయిర్‌ని పలకరించేసాను, పాపం అక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఏదో కోరిక కోరడం.. అందుకోసమే ఆయన్ని దర్శించుకోవడం చేస్తున్నారు, ఒక్కరు కూడ ఆయన క్షేమ సమాచారాలు విచారించ లేదు..!! బహుశ నేనొక్కడీనే అనుకొంటాను.. "ఎలా వున్నావయ్యా, అంతా క్షేమమే కదా.. కుశలమేనా!" అని కుశలోపరి ప్రశ్నలతో పలకరించి... అక్కడ నుండి మున్నార్‌కు బయలు దేరాం. మున్నారు పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతుంది.








ఓ రెండు మూడు రోజులు గడిపేసి మూడో రోజున తెల్లారు జామునే హైదరాబాద్‌కు బయలు దేరాం. మద్యలో మధురై మీదుగా ప్రయాణం చేసి మరసటి తెల్లారు జామున రెండు గంటలకు ఒక ఫ్రెండ్‌ని కర్నూల్‌లో అతని ఇంటి వద్ద దింపేసాము. బాగా డ్రైవ్ చేసే మూడ్‌లో వుండటం మూలాన అక్కడే నిద్రకు ఉపక్రమించకుండా.. అలానే హైదారాబాద్‌కు బయలు దేరి తెల్లారు జామున ఆరుగంటలకు నా గమ్య స్థానం చేరుకొన్నాం. దాదాపు 24 గంటలు నిర్విరామంగా డ్రైవ్ చేయడం.. అందునా వర్షంలో.... అదొక అడ్వేంచర్.. అనుభూతినిచ్చింది. నా స్టామినా మీద నేనే ఒక ప్రయోగం చేసుకొన్నాను.

మొత్తం పదిహేను రోజుల పాటు 3,600 కిలోమీటర్ల పచ్చని ప్రకృతిలో ప్రయాణం చేసి.. చేసి పచ్చగా మారిపోయాను.... నేనొక్కడినే డ్రైవ్ చేయడం.... ఒక ఆనందం. ఫ్యూచర్‌లో దేనికి పనికిరాకుండా పోయినా "డ్రైవర్" ఉద్యోగం చేసుకోనైనా బతకొచ్చనే ధైర్యం వచ్చిందబ్బా..!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మొత్తం ఈ ట్రిప్ అంతా నాకు కొత్తే.. ఏ దారులు తెలీవు, కాని "గూగుల్" మ్యాప్ ద్వారా మొత్తం తిరిగాను. గోవాలొ గల్లీ గల్లీ తిరిగాను. అస్సల్ ఎటుపోతే ఏది వొస్తుందో..! ఎక్కడికి చేరుతామో కూడ తెలియని నేను. పుర్తిగా గూగుల్ మ్యాప్ మీద ఆదార పడ్డాను.

ఎక్కడ.. ఎన్ని కిలోమీటర్ల్ వద్ద.. ఎన్ని మీటర్ల వద్ద ఎటువైపు మలుపు తిరగాలో కూడ ప్రతీది చెబుతూ వచ్చింది ఆ గూగులమ్మాయ్.. గొంతు మాత్రం యమ స్వీట్. ఒకో సారి దగ్గరి దారిలో తీసుకెళ్లి గమ్యం చేరుస్తుండేది..! ఒక వేళ దారి తప్పోయినా ..? తప్పోయిన దారి నుండి మళ్లీ డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది పాపం ఆ గూగుల్ అమ్మాయి... ఎంత మంచిదో. ? జై గూగులమ్మాయ్..!!


యాగంటి బసవయ్య రంకె లేసేను - మహానంది


కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది, భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.


ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది. రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.
మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90 సంవత్సరాల క్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు.. మన పూర్వీకులంటే అర్థం కాలేదా..? అదేనండి మన వా’నరులు’ పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది. ముందే కోతులు.. ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.

ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రము నుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసర ప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.



ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.


రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు. తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.



ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ కాలక్రమేనా యాగంటిగా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.



బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు. మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు. ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.
మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.




- మహానంది -


ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమ ప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12 కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.


మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.


ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’ ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.! జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!


ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.

Friday, 4 March 2016

ఓహో అహోబిళం


కొన్ని నెలలుగా నల్లమల అడవులవైపునున్న అహోబిళం దేవాలయంతోబాటు వాటి చుట్టూ వున్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించాలన్న ఆలోచనలో వున్న నేను, తోడుగా వచ్చే ఔత్సాహికులైన యువకులకోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక యువమిత్రుడుని కలిసిన సమయంలో " అన్నా రేపు శనివారం స్వాతి నక్షత్రం.ఆ రోజు పర్వదినంగా బావించి అహోబిళంలో ఉన్న నవ నరసింహస్వాములను  దర్శించడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్తున్నాము, ఈ సమయంలో అక్కడికి చాలా మంది వస్తారు, మీరు కూడ వస్తారా..? " అని అడిగాడు... నేను దేనికోసం ఎదురుచూస్తున్నానో...!! అదే సమయం నాకు ఎదురుకావడంతో నా సంసిద్దత వ్యక్తం చేసాను. వారిది దైవభక్తి..మరి నాది ప్రకృతి భక్తి.. ఏది ఏమి అయితేనేమి నాకు కావల్సింది అక్కడ తిరగడానికి తోడుగా మనుషులు కావాలి, మామూలు సమయాలలో అక్కడ వంటరిగా తిరగలేము, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూవుంటాయి.

ఎవరి వారి ఆలోచనలతో మరునాటి తెల్లవారు జామునే 5 గంటలకే నలుగురం రెండు మోటర్‌బైకులలో బయలుదేరాము. మా ఊరినుండి షార్ట్‌కట్‌లో వెళ్తే  80 కిలోమీటర్లు ఉండవచ్చు. దారిపొడవునా తెల్లని పొగమంచులా కమ్ముకొని ఉన్నది, చూడటానికి చలికాలపు తెల్లగా మంచులా ఉన్నా అది మంచు కాదు " మొగలి " అని అంటారు. ఊటిలో ఉన్నట్టుగా ఉన్నది వాతావరణం, తెల్లటిమేఘంలా రహదారిమీద దూదిపింజలా మెల్లిగా ఎగురుతూ పోతున్నది " మొగలి "...!  ఆరోగ్యానికి అంతమంచిది కాకపోయినా మంచులా ఫీల్ అవుతూ దారిపొడవునా " మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా సాగిపోతున్నది " అని వెనుక అమ్మాయిలేకున్నా... పాట పాడుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాగలమర్రి వూరు మీదుగా 7:30 నిమిషాలకు అహోబిళం చేరుకున్నాము.
దిగువ అహోబిళం దర్శించకుండానే కొండమీదున్న ఎగువ అహోబిళం చేరుకొన్నాము. గంభీరమైన రెండు పర్వతశ్రేణుల మద్యన నెలకొనివున్నది ప్రధాన ఎగువ అహోబిళం. అక్కడ కూడ ప్రధాన దేవాలయం దర్శించకుండా.. దేవాలయానికి ఎడుమపక్క నున్న చిన్న చెక్క బ్రిడ్జీమీదుగా వెనుకకు చేరుకున్నాము. అక్కడ నుండి మహావృక్షాలతో నిండి ఉన్న నల్లమల్ల అడవులతో విస్తరించివున్న పర్వతాలను ఎక్కడానికి ముందుకు అడుగేసాము.

ఓబులం, అహోబిళం, అహాబిలం, అహబిలగిరి, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, అచల చాయమేరు, సింగనేల్ కున్నం, నిధి, నగరి, శేషాద్రి, నరసంహ్మతీర్థం, గరుడాచలం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఎగువ అహోబిళానకి 8కి.మీ. దూరంలో వున్న ఉక్కు స్థంభం నుంచి విష్ణుమూర్తి నరసింహుని రూపంలో వచ్చి హిరణ్యకశ్యపుని వధించే సమయంలో ఉగ్ర నరసింహస్వామిని అహోబిలుడిగా దేవతలందరూ స్తుతించటం వలన ఈ క్షేత్రానికి అహోబిళం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో 9 ఆలయాలు, 6 కోనేర్లు, 122 మంటపాలు, అనేక చత్రాలు వున్నాయి.
మా నడక మార్గమద్యన ఒక ప్రదేశంలో కొందరు భక్తులు కాలినడకన నడిచే భక్తులకోసం ఉచితంగా " నాస్టా " ఏర్పాటు చేసారు, ఆగకుండా వెళ్తున్న నన్ను మా ఫ్రెండ్ ఆపాడు.  " ఇక్కడ  టిఫిన్ తినకపోతే మరెక్కడ పైన దొరకదు. మర్యాదగా ఇక్కడ టిఫిన్ చేసి వెల్దాము " అన్నాడు..ఇష్టం లేకపోయినా ఆగక తప్పలేదు నాకు. ఆహోబిళం దగ్గరలో నున్న గ్రామాల నుండి, ఆళ్ళగడ్డ నుండి కొందరు భక్తులు ఉచితంగా భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఏడాదీ అక్కడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు, వారికి  మొక్కుబడిలో అదొక భాగం. ఎత్తైన చెట్ల కింద గ్యాస్ పొయ్యి. మరో రెండు కట్టెల పొయ్యిలతో అక్కడ వంటలు వండుతున్నారు. మహావృక్షాలమద్యన కాలినడకన అక్కడకు చేరిన భక్తులంతా అరటాకులలో పొంగలి, వేరుశనక్కాయి చెట్నీ కలుపుకొని ఆరగిస్తున్నారు. నేనంతగా పొంగలి ఇష్టపడను.  కాస్త సంకోచిస్తూ ఆరటాకు తీసుకొని టిఫెన్ తెచ్చుకున్నాను. మొదటి ముద్ద నోట్లో పెట్టుకొన్న రెండు క్షణాలకు  పొంగలి రుచి నా జిహ్వకు మహాద్భుతంగా తోచింది.. ఏముందా పొంగలిలో అని చూస్తే..! ఏముంది చాలా సింపుల్..ముంతమామిడి పప్పు ( జీడిపప్పు) తో పొంగలి, అందులోకి చెట్నీ..కాకపోతే చట్నీలో నిమ్మరసం పిండినట్లున్నారు కారకారంగా పుల్లపుల్లగా..! అందులోకి మల్లి టమోటా ఊరగాయి కలుపుకొని తింటుంటే..నాసామిరంగా..!. మావూళ్ళొ చెప్పుకొనే ఉపమానం గుర్తొచ్చింది.. మరదలుపిల్ల మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదోరకమైన పిలుపుతో ఆ పిల్ల " మావా " అంటుందట..అట్లా ఉన్నదారుచి..ఒక్క రుచే కాదు శుచి కూడ చాలా శుబ్రతగా ఉన్నది. అసలు పొంగలి ఇష్టపడనీ నేను మరోమారు పెట్టించుకొని లాగించేసా, నా తిండిపోతుతనం చూసిన మా ఫ్రెండ్స్ " ఇక చాల్లే ఎక్కువగా తింటే ట్రెక్కింగ్ చేయడం చాలాకష్టం " అని చెప్పగానే..ఆపేసా..కాని నా కడుపులోని ఆత్మారాముడు ఊరుకోవట్లేదు.లొట్టలేసుకుంటూ..గోలపెడుతున్నాడు." నాకింకా కావాలి " అంటూ...! వాడిని ’ మద్యాహ్నం భోజనం ఉండదు ఇలా మారాం చేసావంటే ’ అని బెదిరింపుతో బుజ్జిగించి అక్కడనుండి కదిలాను. మామూలుగా ఒక సామెత ఉంది, " కళ్ళు కావాలంటాయి..కడుపు వద్దంటుందీ " అని..కాని దీనికి రివర్స్ " కడుపు కావాలంటున్నది..కళ్ళు వద్దని వారిస్తున్నట్లుంది నా పరిస్థితి.

అసలు అక్కడ అలాంటి ప్రకృతిరమణీయ వాతావరణంలో వనభోజనంలా టిఫెన్ ఆరగిస్తుంటే చెప్పలేని అనుభూతే అది...! అంతేనా.. కాలినడకన వస్తున్న భక్తులను ఈ దాతలు ఒకటికి రెండు మూడు సార్లు అడిగి పిలుస్తున్నారు. మొహమాటస్తులను సైతం బతిమాలి టిఫిన్ పెడుతున్నారు. మరి కొన్న చోట్ల ఇడ్లీలు, పూరీలు పెడుతున్నారు. మేము తెచ్చుకున్న కిన్లీ బాటిల్స్‌ని నేను తీస్తుంటే వద్దని మా ఫ్రెండ్స్ వారించారు, " అర్రె కిన్లీ నీళ్ళకన్న మాంచి రుచికరమైన, మినరల్స్ ఉన్న నీళ్ళు ఇక్కడున్నాయి. అవి తాగి మన వద్దనున్న ఖాలీ బాటిల్స్‌లలో ఆ నీళ్ళను పట్టుకొని వెళ్దాం "  అన్నారు. కొండలపైన నుండి చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న మంచినీటి ధారలు అక్కడక్కడ చాలా ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద డ్రమ్ములలో పడుతున్నారు. అందులో ఏమాత్రపు నులకలు గాని లేక రంగు గాని లేదు..చాలా స్వచ్చంగా తేటతెల్లంగా వున్నాయి, ఒక్క సారి మన రాష్ట్ర రాజధాని భాగ్యనగర కార్పోరేషన్ రంగుతేలిన నీళ్ళు గుర్తుకొచ్చాయి..! నగరానికి... ప్రకృతివరమైన ఇక్కడ నీళ్ళకు.. ఎంతతేడా..?  అనుకున్నాను.!
 ఎగువ అహోబిల ప్రధాన ఆలయానికి 1కి.మీ దూరంలో నున్న వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఎత్తైన మహావృక్షాల కింద ఆలయమంటపము ఉండగా దాని గర్భగుడిమాత్రం కొండకు చివరి అంచునున్న బిళంలో దేవతావిగ్రహాలు ఉన్నవి. వేదాద్రి పర్వతానికి పడమటి భాగాన వరాహ రూపమున భార్య అయిన వసుంధరాదేవితో స్వామి వేంచేసి యున్నారు. అందుకే ఈ స్వామిని వరాహ నరసింహస్వామి అని అంటారట..! మా మిత్రుల దర్శనం అయ్యాక అక్కడ నుండి పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న సెలయేళ్ళ మద్యన మా నడక ప్రారంభం అయ్యింది. ఈ తోవలో నడక కాస్త కష్టంగానే ఉంటుంది, ఒకపక్కన పాచిపట్టిన బండరాల్లు, మరోపక్కన నీటి ప్రవాహం చాలా జాగ్రత్తగా నడవాలి. వేలల్లో జనం ఒక ప్రవాహంలా నడుస్తున్నారు, పిల్లలు యువకులు, నడివయస్కులు, వృద్దులు, స్త్రీలు. తమిళనాడునుండి తమిళ కారన్స్, కర్నాటక నుండి కన్నడ కంఠీరవలు ఎక్కువగా కనపడుతున్నారు. నడవలేని వృద్దలను ఒక పెద్దకర్రకు దుప్పటితో జోలకట్టి అందులో తీసుకెల్తున్నారు. మద్యలో ఏటవాలుగా ఉండవలసిన తాపలు కొద్దిగా నిటారుగా ఉండడం మూలాన జాగ్రత్తగా ఎక్కవలసివచ్చింది.
జ్వాలా నరసింహస్వామి :
వేదాచలం అనే పర్వతాల మధ్యన అచల భూమామేరు అనే పర్వతం ప్రాంతమది. ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 4 కి.మీ దూరంలో ఉన్నది.  చాలా ఇరుకైన కాలిబాట..ఒక పక్కన చాలా లోతైనా లోయ ఉన్నది, వీటిని దాటుకుంటూ ఆలయానికి చేరవగా కొద్దిదూరంలో ఉన్న జలపాతం  కిందనుండి ఆలయానికి చేరుకోవాలి కాని జలపాతానికి మరో పక్కన పెద్ద లోయ ఉన్నది. చాలా జాగ్రత్తగా జలపాతం కిందనుండి తడుస్తూ దాటి ఆలయానికి చేరుకున్నాము. హిరణ్య కశ్యపుని సంహారానంతరం క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోవడం వంటి రూపంలో వుండటంతో స్వామిని జ్వాలా నరసింహస్వామి అంటారు. స్వామిని శాంతింపజేసేందుకు ఇంద్రాది దేవతలు చేసిన అభిషేక జలమే భవనాశిని పుణ్యతీర్థంగా అయింది. ఈ ఆలయం ముందు ఒక కొండ గృహ, దాని క్రింద చిన్న గుండం ఎర్రని నీటితో నిండి ఉన్నది. హిరణ్యకశ్యపుని రక్తంలో తడిసిన హస్తాలను స్వామి కడగడం వల్ల నీరు ఎర్రగా మారిందని అక్కడి వారి ఒక విశ్వాసం. ఈ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు. హిరణ్యకశ్యపుని వెంటాడుతున్న నరసింహుడు మూడువిగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడనుండి తిరిగి వస్తున్న సమయంలో కొందరు జలపాతనీటిని బాటిల్స్‌లలో నింపుకుంటున్నారు...! ఎందుకూ అన్నట్లు మా మిత్రులవైపు చూసాను నేను. " అవి కొన్ని వనమూలికల గుండా ప్రవహిస్తూ వస్తున్న ఔషద నీరు, తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం "  అన్నారు.

మాలోల నరసింహస్వామి :
అక్కడ నుండి తిరిగి వచ్చిన తోవలోనే  వెనకకు ఒక అర కి.మీటర్ వచ్చాక ఒక కొండనుండి మరో కొండకు నిర్మించిన ఇనుప వంతన ద్వార వేదాద్రి శిఖరం మీదకు ఎక్కనారంభించాము, ఇది ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 2 కి.మీ దూరంలో వున్నది..ఒక కిలో మీటరు శిఖరం ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పచ్చదనంతో పరిచిన వేదాద్రి శిఖరం, గరుడాచలం, వేదాచలం కొండలు కనపడ్డాయి,  అద్భుతమైన దృశ్యం అది.. ఒక్కసారిగా " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "  అన్న సిరివెన్నెల చరణాలు గుర్తొచ్చాయి. వేదాద్రి శిఖరాన ఒక చదునైన ప్రదేశంలో మాలోల నరసింహస్వామి గుడి వున్నది, లక్ష్మీదేవితో కలిసి దర్శనిమిస్తున్నందున మాలోల నరసింహస్వామి అని పిలుస్తున్నారు. మా మిత్రబృందం గుడిలోపలే చాలా సేపు ఉన్నారు..పొర్లుదండాలు పెడుతున్నారు ఇద్దరు. ఎంతకూ బయటకు రావట్లేదు,  సరే వారు వచ్చేసమయంలోపల మరో చోటకు వెళ్ళవచ్చని మరొక మిత్రునితో కలసి గుడివెనుక నుండి కాలిబాట వెంటా అడవిలోనకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇరుకుగా ఉన్న ప్రమాదకరమైన దారి అది..కాస్త కాలు జారినా లోతైన లోయలో జారడం ఖాయం. ఒక కిలోమీటర్ దూరం నడిచాక పక్కనే వున్న మరో కొండకు చేరాము అక్కడ దాదాపుగా 100 అడుగుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద బండరాయి ఉన్నది, దానిమీద ఏదో " లిపి " కనపడుతున్నది, అది తెలుగా లేక సంస్కృతమా..లేక మరో ఏదన్న బాషనా..? అర్థమే కావట్లేదు, ఎవరన్న ఆ " లిపి " మీద పరిశోదనలు చేస్తున్నారో లేదో..మరి..!?  చదునైన ఆ పెద్ద రాయి మీద నడుచుకుంటూ ఓ 100 అడుగులు వెళ్ళాక రెండు కొండలమద్యన ఇరుకైన స్థలం లో ప్రహ్లాదుడి " బడి " ఉన్నది. అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించాడని అక్కడివారి నమ్మకం, ఆ చిన్న గుడిలో నరసింహస్వామి, ప్రహ్లాద విగ్రహాలున్నవి. పక్కనే ఏటువాలుగా ఉన్న కొండమీద చిన్న చిన్న జలపాతాలు ఉన్నవి,  చూడచక్కని ప్రకృతి రమణీయ ప్రదేశమది. అక్కడ నుండి తిరిగి వెనకకు బయలదేరాము. 

ఉదయం టిఫిన్ చేసిన చోటకు చేరుకున్నాము, అక్కడ మరో రకమైన పలహారం పెడుతున్నారు, మరో రౌండ్ వేసారు మా మిత్రబృందం, ఈ సారి టమోటో, జీడిపప్పుతో చేసిన ఉప్మా. మరో రకం " ఉగ్గాని అలియాస్ బొరుగుల ఉప్మా ". !   బొరుగులతో ( మరమరాలు) చేసే ఉపపలహారం అది. చిత్రాన్నం (పులిహోర, యెల్లో రైస్) చేసే విదానంలానే చేస్తారు, కాకపోతే బొరుగులను ముందుగా నీటిలో తడిపి తర్వాత తిరగమాత (పోపు) పెడతారు పులిహోరలాగే బాగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,పసుపు వేసి మనం ఇంట్లో పోపుకు వాడే అన్నిదినసులతోనే తిరగమాత పెట్టాక చివరన అందులో నిమ్మరసం పిండుతారు. " ఉగ్గాని " తోబాటు దానికి కాంబినేషన్‌గా  " నన్ను కొంచం కొంచం కొరక్కుతినవయ్యా..య్యా..యా " అంటున్న మిరపబజ్జీతో తింటుంటే....." ఆ..టేస్టే..వేరు...ఆ టేస్టే వేరు " అని పాటపాడుకొన్నాము.. ఆ ప్రకృతివడిలో..!

పావన నరసింహస్వామి :
పలహారం ఆరగించిన తర్వాత అక్కడ నుండి మరో దిశకు కొద్దిదూరం నడిచాక ఎడమవైపున ఉన్న మరో కొండను దాదాపుగ 1 కి.మీ ట్రెక్కింగ్ చేసాము. తర్వాత దట్టమైన అడవి గుండా, దారిపొడవునా 100 అడుగల ఎత్తు ఉన్న మహావృక్షాలు ..అడవిని కప్పిన పెద్ద గొడుగులా ఉన్నాయి  వాటి క్రిందన మనిషెత్తు ఉన్న ఆకుపచ్చని గడ్డి మద్యలో కాలిబాట వెంట నడక ప్రారంచించాము.  ఎత్తైన చెట్ల ఆకుల మద్యనుండి దూరి వస్తున్న సన్న సన్నని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని తాకి పరావర్తన చెందుతున్న దృశ్యం కన్నుల పండగలాఉంది నాకు.  అప్పటికే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కొందరు భక్తులు ఎదురవుతున్నారు. 5 కి.మీ నడిచాక మద్యాహ్నం 12:30 నిమిషాలకు గరుడాచలంకొండ చివర్లో పావనమనే నదీతీరాన ఉన్న పావన నరసింహక్షేత్రం చేరుకున్నాము. ఇక్కడికి కాలనడకన 6 కి.మీ నడవాలి..వాహనాల ద్వారా రావడానికి కూడ సౌకర్యం ఉన్నది ఘాట్‌రోడ్ ద్వారా 14 కి.మీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నన భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక తిరిగి ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి బయలుదేరాము.

అహోబిళ నరసింహస్వామి : 
ఎగువ అహోబిళంగా పిలిచే ఈ దేవాలయంలో అహోబిళ నరసింహస్వామి వున్నారు. రాజగోపురంద్వార లోనికి వెళ్తే అక్కడ ఒక గుహలో అరుగు మీద దశభుజాలతో హిరణ్యకశిపుని సంహరించే నరసింహావతారంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ప్రక్కగా అభయ వరదముద్రలతో పై చేతులలో తామర మొగ్గలతో చెంచులక్ష్మి విగ్రహం ఉన్నది. అక్కడ దర్శనం ముగించుకొని బయలదేరాము.

కారంజ నరసింహస్వామి :
తిరుగుప్రయాణంలో ఎగువ అహోబిళానికి 1  కి.మీటర్ల దూరంలో భవనాశి నది ప్రవహిస్తున్న చోట వటవృక్షం నీడలో శంఖుఛక్రధారుడుగా కొలువైయున్నందున కారంజ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్కడ నుండి దిగువ అహోబిళానికి 2 కి.మీటర్ల దూరంలో కొండపైన భార్గవ( పరుశు) రాముడు తపస్సు చేసిన స్థానంలో వెలసినందున భార్గవ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్షయ కోనేటి నీరు, చుట్టూపొదలు. పెద్ద వృక్షాలతో అక్కడి ప్రకృతి రమణీయంగా వుంటుంది.

చత్ర వట నరసింహస్వామి : 
భార్గవ క్షేత్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పద్మాసీనడై, దక్షణ హస్తం అభయ ముద్రను సూచిస్తూ, గొడుగులాంటి మర్రిచెట్టు నీడలో చత్రవట నరసింహస్వామి వున్నారు.

యోగానంద నరసింహస్వామి :
2 కి.మీ దూరంలో ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పి మూర్తి అయినందున ఇక్కడి స్వామికి యోగానంద స్వామి అని పేరు వచ్చిందట.

దిగువ అహోబిళ వరద నరసింహస్వామి :
ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడు దర్శనమిస్తారు. ఈ శిలా విగ్రహం ఊర్ధ్వహస్తాలతో, శంఖు చక్రాలను కలిగి వామభాగంలో తొడపై లక్ష్మీదేవిని కూర్చండజేసి అభయ, వరద, ముద్రాన్వింతంగా అందంగా తీర్చి దిద్దబడింది. ఒక పక్కగా పట్టపుదేవేరి అమృతవల్లి తాయారు విగ్రహం ఉన్నది.

ఈ విగ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలోని ప్రధాన ఆలయమంటపంలో శిల్పులు చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. రకరకాల నరసింహస్వాముల ప్రతిరూపాలు. కవయిత్రి, రచయత్రి అయిన కథనాయక "మొల్ల "శిల్పం,  శ్రీకృష్ణదేవరాయుల శిల్పాలు ..చాలానే ఉన్నాయి. అక్కడనుండి తిరుగు ప్రయాణం.




అహోబిళం నుండి ఒక రెండు కి.మీటరు ప్రయాణించిన తర్వాత  బైక్ నడుపుతున్న మిత్రుడికి ఎడమపక్కన పచ్చని పొలంలో ఒక నీళ్ళ బావి కనపడడంతో బండిని ఆపేసాడు. మొహం కడుక్కొని ఫ్రెష్ అవుదాము పదా అని పొలంలోకి దారితీసాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అది బావి కాదు..ఒక పురాతన కోనేరు.. కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి మరమత్తులకు నోచుకోలేదు అనుకుంటా పాడుబడిపోయింది. లోపలంతా పాచి కట్టి ఉన్నది. అది కాదు గాని విశేషమూ..కోనేరు చూట్టూ ఉన్న రాతిగోడలమీద బాగవత, మహాభారత, రామాయణ శిల్పాలు చెక్కి వున్నారు..!  సురులు, దేవతలు అమృతం చిలుకుతున్న శిల్పాలు .. చాలా బాగున్నాయి. అందులో భాగంగా రతీభంగిమలు కూడ ఉన్నాయి. పురావస్తుశాఖ వారు బహుశ ఆ కోనేరు గుర్తించారో లేక గుర్తించి కూడా నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కాలేదు మరి. ఎవరో రైతులు బోర్లు వేసి అందులోనుంచే తమ పంటపొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ప్చ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాము.

    
    మరి కొన్ని నరసింహస్వామి అవతారాల ఫోటోస్ క్రింద ఫ్లాష్‌ప్లేయర్‌లో చూడవచ్చు.


ఉపసంహారం :  
ఇక్కడి దేవుల్లను చూసాక నగరాలలో ఉన్న దేవుళ్ళకు కన్ను కుడుతుందేమో..!! ఇంతటి ప్రశాంత వాతావరణం, ప్రకృతివడిలో వోలలాడుతున్న ఈ దేవుళ్ళను చూస్తే ఈర్షపడతారేమో..మన హైదరాబాద్ నగర దేవుళ్ళు...!! పాపం ప్రతిరోజు నగర వాహనాల రణగొణద్వనుల మద్యన, కాలుష్యవాతావరణంలో ఉక్కిబిక్కిరి అవుతూ వుంటారు, అందులోని మన వారి పోటీ భక్తిని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు  మైకులతో హోరెత్తిస్తూ ప్రజల చెవుల్లతోబాటు దేవుళ్ళ చెవుల్లకు తూట్లు పొడుస్తూ ఉంటే  అక్కడి నుండి ఎప్పుడొ పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటారు. అలాంటి వారికి ఇక్కడి స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ, నిశ్శబ్ధవాతావరణంలో పచ్చని ప్రకృతి మద్యనున్న దేవుళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈర్షపుడుతుందేమో...???. కాని ఒక విషయం మాత్రం నిజం, ఏ ఆరునెలలకో లేక సంవత్సరానికో ఒక మారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే భక్తి, పుణ్యం సంగతేమో గాని..స్వచ్చమైన గాలితోపాటు పచ్చని ప్రకృతితో మైమేకం అవితే చాలు... మిగతా రోజులంతా మన వృత్తిలో పనిచేయడానికి ఉత్తేజం కలుగుతుందనుకుంటా..!!!

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...