Showing posts with label Kerala - కేరళ. Show all posts
Showing posts with label Kerala - కేరళ. Show all posts

Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..






వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

Friday, 1 June 2018

కేరళ సౌందర్యం

పడమటి కనుమల్లో.. తొలకరి జల్లుల్లో..
ఊరూరా సెలయేళ్లు. ఓచోట ముందుకు ఉరికే నదీనదాలు. మరోచోట వెనక్కి మళ్లిన సాగర జలాలు. ఈ వాగుల్లోకి వంగి చూస్తూ పొంగిపోయే కొబ్బరి చెట్లు.. ఇదీ కేరళ సౌందర్యం. ఎన్నెన్నో అందాలు తురుముకున్న పడమటి కనుమలు.. తొలకరి జల్లుల్లో మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. రుతురాగాల వేళ.. కమ్ముకొచ్చే కారుమబ్బులు.. అమాంతంగా కురిసే వానజల్లులు.. వెల్లివిరిసే హరివిల్లులతో మలయాళసీమ మరింత మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. కేరళలోని ఈ ప్రాంతాలకు వెళ్లిరండి మరి.
హరిత భరితం వయనాడ్‌
యనాడ్‌ జిల్లా వానల రాకతో కడిగిన ముత్యంలా మెరిసిపోతూ దర్శనమిస్తుంది. కాబిని, పనమరామ్‌ నదుల మధ్య ఉన్న వయనాడ్‌లో సారవంతమైన నేలలు ఎక్కువ. ఈ జిల్లా సముద్రమట్టానికి 700 నుంచి 2100 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అటవీ విస్తీర్ణం ఎక్కువే. వయనాడ్‌ జిల్లా పరిపాలనా కేంద్రం కల్పెట్టా. ఆదివాసీలు ఎక్కువగా ఉంటారిక్కడ. కాఫీ, టీ తోటలు కనిపిస్తాయి. సుగంధ ద్రవ్యాలు విశేషంగా పండిస్తారు. కొండలు, లోయలు, మైదానప్రాంతాలు, కాలువలు.. ఇలా ఈ ప్రాంతమంతా హరిత భరితమే.
 
ఎలావెళ్లాలి?
* వయనాడ్‌కు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌ కొజికోడ్‌ (85 కి.మీ). హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కొజికోడ్‌కు రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి కల్పెట్టాకు బస్సులు, ట్యాక్సీలో వెళ్లొచ్చు.
* ఎర్నాకులం, త్రిశూర్‌, కొచ్చి, తిరువనంతపురం నుంచి కూడా వయనాడ్‌ జిల్లా కేంద్రానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, బెంగళూరు నుంచి వయనాడ్‌కు ట్రావెల్‌ బస్సులు కూడా నడుస్తున్నాయి.
వయల్‌ (వరి పంటలు), నాడ్‌ (ప్రాంతం) వరి అధికంగా పండే ప్రాంతం కావడంతో దీనిని వయల్‌నాడ్‌ అంటారు. అదే వయనాడ్‌గా స్థిరపడింది  
చూడాల్సినవి
వయనాడ్‌ వణ్యప్రాణి 
సంరక్షణ కేంద్రం
కురువా ద్వీపం, కాబిని నది 
బాణాసుర సాగర్‌
మీన్‌ముట్టి జలపాతం
లక్కిడీ వ్యూపాయింట్‌
నీలిమల వ్యూ పాయింట్‌, చెంబ్రా పీక్‌
సంద్రమంత సంతోషం కోవలం
* కోవలం బీచ్‌ సాహస క్రీడలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. కోవలం సర్ఫింగ్‌ క్లబ్‌ నిర్వాహకులు యాత్రికులకు సర్ఫింగ్‌ శిక్షణ కూడా ఇస్తుంటారు.
ఎలావెళ్లాలి?
* ముందుగా తిరువనంతపురం చేరుకోవాలి. అక్కడి నుంచి సులభంగా కోవలం వెళ్లొచ్చు.
కోవలం అంటే ‘కొబ్బరిచెట్ల వనం’ అని అర్థం. కేరళ అనగానే నారికేళ వృక్షాలే కళ్లముందు కదలాడుతాయి. కోవలంలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ రాజధాని త్రివేండ్రం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పర్యాటక కేంద్రం సముద్ర తీరాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు చేపలవేటకు ప్రసిద్ధిగా ఉన్న ఈ ప్రాంతం 1970 నుంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. హిప్పీలు తమ కార్యకలాపాలకు దీనిని అడ్డాగా మలుచుకోవడంతో ట్రావెలోకంలో కోవలం పేరు వినిపించడం మొదలైంది. కేరళలోని సుందర ప్రదేశాలకు దీటుగా ఇప్పుడు పర్యాటకులను అలరిస్తోంది. ఏడాది పొడవునా కోవలంలో పర్యాటకుల రద్దీ కనిపిస్తుంది. రుతుపవనాల వేళ తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తుంటాయి. ఆకాశంలో నల్లని మబ్బులు బారులు తీస్తాయి. చిరుజల్లులు మొదలయ్యాక మనసులో సంతోషం సంద్రమంత ఉప్పొంగుతుంది.  
చూడాల్సినవి
లైట్‌హౌస్‌ బీచ్‌
హవా బీచ్‌
సముద్ర బీచ్‌
కోవలం చేపల మార్కెట్‌
వెల్లయానీ సరస్సు
తిరువనంతపురం 
వానలో.. నావలో..  అలెప్పీ
నీటిపై తేలియాడుతున్నట్టుండే అలప్పుజా(అలెప్పీ)కు ‘తూర్పు వెనీస్‌’ అన్న పేరుంది. అలెప్పీలో అడుగడుగునా కాలువలే. వాటిలో తేలికపాటి తెప్పలతో మొదలుపెడితే.. రాజభవనాన్ని మరిపించే హౌస్‌బోట్ల వరకు రకరకాలు కనిపిస్తాయి. కాలువ గట్లు ఆకుపచ్చ తివాచీ పరచినట్టు పచ్చగా ఉంటాయి. కొబ్బరిచెట్ల ఆకులు ఈ కాల్వలకు గొడుగు పడుతుంటాయి. సహజ సౌందర్యంతో కనువిందు చేసే అలెప్పీలో సకుటుంబ సమేతంగా హౌస్‌బోట్‌లో విహరిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఇక్కడి వెంబనాడ్‌ సరస్సు సౌందర్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సరస్సులో పతిరమన్నాల్‌ ద్వీపంలో విహరించకుండా పర్యాటకులు తిరుగు ప్రయాణమవ్వరు. కాలువలు, సరస్సులే కాదు.. బీచ్‌లతో కూడా అలరిస్తుంది అలెప్పీ!
ఎలా వెళ్లాలి?
* విజయవాడ, విశాఖపట్టణం నుంచి అలెప్పీకి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
* సికింద్రాబాద్‌ నుంచి ఎర్నాకులం వరకు రైళ్లో వెళ్లి.. అక్కడి నుంచి బస్సులో అలెప్పీ (58 కి.మీ) చేరుకోవచ్చు.
* అలెప్పీ సమీపంలో కొచ్చి విమానాశ్రయం ఉంది. హైదరాబాద్‌ నుంచి కొచ్చీకి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. విజయవాడ, విశాఖల నుంచి సింగిల్‌స్టాప్‌ సర్వీసులు ఉన్నాయి.
చూడాల్సినవి
అలెప్పీ బీచ్‌
కృష్ణపురం బీచ్‌
అలెప్పీ లైట్‌హౌస్‌
ముళ్లక్కల్‌ దేవీ ఆలయం
అంబలపుజా దేవాలయం
తనువెల్లా హరివిల్లు  తెన్మల
గరాల రణగొణ ధ్వనులకు దూరంగా.. కీచురాళ్ల ఇచ్చికాలకు దగ్గరగా.. ఉన్న మనోహరమైన సీమ తెన్మల. కొల్లం నగరానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనదేశంలో తొలి పర్యావరణ యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశమిది. తెన్మల అంటే తేనె గుట్ట అని అర్థం. ఒకప్పుడు ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట తేనెపట్టులతో అలరిస్తూ ఉండేది. ఇప్పుడన్ని తేనెటీగలు లేవనుకోండి. కానీ, ఇక్కడి వనంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, చెట్లు దండిగా ఉన్నాయి. తొలకరి పలకరింపుతో తెన్మల తనువెల్లా హరివిల్లు విరబూస్తుంది. ప్రకృతి ఆరాధకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. సాహస యాత్రికుల కోసం ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌ వంటి ఆటలూ అందుబాటులో ఉన్నాయి.  భారీ వృక్షాల మధ్య నుంచి నేలకు పాతిక అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక మార్గంపై నడక మధురమైన అనుభూతినిస్తుంది.
ఎలా వెళ్లాలి?
* కొల్లం నుంచి తెన్మలకు 66 కి.మీ దూరం. తిరువనంతపురం 72 కి.మీ. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కొల్లం, తిరువనంతపురానికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులోగానీ, ట్యాక్సీలో గానీ తెన్మల చేరుకోవచ్చు.
* హైదరాబాద్‌ నుంచి తిరువనంతపురానికి నాన్‌స్టాప్‌ విమానసర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌ నుంచి కనెక్టింగ్‌ సర్వీసులు ఉన్నాయి.
చూడాల్సినవి
లీజర్‌ జోన్‌
నక్షత్రవనం
తెన్మెల డ్యామ్‌
బటర్‌ఫ్లై సఫారీ
వేలాడే వంతెన
షెండుర్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
పాండవుల గుహ

Saturday, 30 December 2017

కేరళ... ఓ అందాల భరిణె..!


కేరళ... ఓ అందాల భరిణె..!




‘ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చని చెట్లూ, చేయి ఎత్తితే అందేంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్లు తిరిగిపోయే లోతైన లోయలూ, పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటల కొండలూ, కొబ్బరిచెట్ల సౌందర్యంతో తడిసిముద్దవుతోన్న బ్యాక్‌వాటరూ... అవన్నీ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అనిపించింది’ అంటూ కేరళ అందాల గురించి చెప్పుకొస్తున్నారు వరంగల్‌కు చెందిన బండి రవీందర్‌.



నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగ్గ మొదటి 50 ప్రదేశాల్లో కేరళ ఉండటంతో కేరళ అందాలను చూడాలనుకుని ఉపాధ్యాయ కుటుంబ మిత్రులమంతా కలిసి 80 మందిమి బయలుదేరాం. వరంగల్‌ నుంచి ఎర్నాకుళం జంక్షన్‌కు 24 గంటల ప్రయాణం. రెండు ట్రావెల్‌ బస్సుల్లో కొచ్చీకి వెళ్లి ముందే బుక్‌ చేసుకున్న హోటల్లో దిగాం. స్నానపానాదులు అయ్యాక డచ్‌ ప్యాలెస్‌, మ్యూజియంలను చూసి సాయంత్రం హార్బర్‌కు వెళ్లాం. ఇది ప్రకృతి సిద్ధమైన హార్బర్‌. మనదేశంలోని పోర్టుల్లోకెల్లా పెద్దది. ఆ రాత్రి బోటు అద్దెకు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆనందంగా గడిపాం.



గురువాయూర్‌లో...
తెల్లవారి త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌కి బయలుదేరాం. దారి పొడవునా కొబ్బరిచెట్లే. వేలు, లక్షల కొబ్బరిచెట్లను చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూడుగంటల ప్రయాణం తరవాత గురువాయూర్‌కి చేరుకున్నాం. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని భూలోక వైకుంఠంగా చెబుతారు. తెలుగువారికి తిరుపతి, శ్రీశైలం ఎలానో కేరళీయులకి గురువాయూర్‌, శబరిమల అలాగే. ఇందులోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆడవాళ్లు తెల్లని చీరలూ మగవాళ్లు చొక్కా లేకుండా తెల్లని అంగవస్త్రం, లుంగీతో దేవుణ్ణి దర్శించుకోవాలి. అయస్కాంత లక్షణాలున్న నల్లని రాయితో మలిచిన చిన్నికృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యాం. గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు. ఊర్‌ అంటే స్థలం. బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ స్థలంలో స్వయంగా కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్‌ అని పేరొచ్చిందట. గురువాయురప్పన్‌గా పిలుచుకునే ఇక్కడి చిన్నికృష్ణుడి దర్శనం సమస్త పాపహరణంగా భావిస్తారు. ఏటా ఫిబ్రవరిలో గురువాయూర్‌ ఉత్సవం పదిరోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మొదటిరోజు అనయోట్టం ఉత్సవం ఏనుగుల పరుగుపందెంతో మొదలవుతుంది. పందెంలో గెలిచిన ఏనుగు ఏడాదిపాటు దేవుని ఉత్సవ విగ్రహాన్ని మోసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇక్కడి ఏనుగులను నడిచే గురువాయురప్పన్‌లుగా భావిస్తారు. అందుకే ఎంతోమంది ఏనుగులను దేవాలయానికి విరాళంగా ఇస్తుంటారు. వాటిని ప్రత్యేక క్యాంపులో సంరక్షిస్తున్నారు. దైవదర్శనం తరవాత ఏనుగుల క్యాంపు చూడ్డానికి వెళ్లాం. అక్కడ 56 ఏనుగులు ఉన్నాయి. అవన్నీ మగవే కావడం విశేషం. నాలుగు దశాబ్దాలపాటు దేవాలయంలో సేవచేసి 1976లో మరణించిన కేశవన్‌ సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నిర్మించారు. ఆ మధ్యాహ్నం మున్నార్‌కు బయలుదేరాం.



మున్నార్‌లో...
ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌, గురువాయూర్‌కి 180 కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంది. ఆ దారిలో ఎత్తయిన కొండలూ లోతైన లోయలూ కొండలమీద నుంచి ఉరికే జలపాతాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జలపాతం కనిపించినప్పుడల్లా ఆగుతూ సాగిన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకు మున్నార్‌కి చేరుకున్నాం. ఉదయం కర్టెన్లు తీసి చూస్తే, వెనక వైపంతా పెద్దలోయా, పచ్చనిచెట్లూ, కొండలూ, వాటి మధ్యలో అందమైన ఇళ్లూ... చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతో అందంగా అనిపించింది. అల్పాహారం తిన్నాక మున్నార్‌ అందాలను చూడ్డానికి బయలుదేరాం. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లూ, చేతికి అందుతాయేమోనన్నంత దగ్గరగా తెల్లని మబ్బులూ, చూస్తేనే కళ్లు తిరిగిపోతాయనిపించే లోతైన లోయలూ, కొండలనిండా పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటలూ... మరోలోకంలో విహరిస్తున్నట్లే అనిపించింది. ఇక్కడ 30కి పైగా టీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. దారిలో రెండుమూడు తోటల్లో బస్సు ఆపి కాసేపు వాటిల్లో తిరిగి, దగ్గర్లోని టాటా టీ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. లోపల తేయాకుని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో గైడ్‌ చూపించాడు. కమ్మని రుచిగల టీని ఉచితంగా అందించారు. అక్కడి అవుట్‌లెట్స్‌లో రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు.



అక్కడినుంచి 13 కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కు వెళ్లాం. దీన్ని 1953లో రెండుకొండల మధ్యలో నిర్మించారు. జలవిద్యుచ్ఛక్తి తయారీతోబాటు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోందీ డ్యామ్‌. ఇక్కడే బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. తరవాత 20 కి.మీ. దూరంలోగల ఎరవికుళం వైల్డ్‌లైఫ్‌ పార్కుకి బయలుదేరాం. కేరళలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనట. ఇక్కడ అంతరించిపోతున్న నీలిగిరి థార్‌, లాంగర్‌, సాంబార్‌, గౌర్‌, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే నీలకురింజి మొక్కలు ఉన్నాయి. అవి పూలుపూసిన సంవత్సరం పార్కులోని కొండలు మొత్తం నీలంరంగులో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని అనాముడి అనే ఎత్తయిన కొండ ఈ పార్కులోనే కనిపిస్తుంది. ఈ కొండ పెద్ద ఏనుగు తల రూపంలా ఉండటంవల్ల అనాముడి (మలయాళంలో ఏనుగుతల)అని పిలుస్తారు. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్‌ అనీ అంటారు.

తరవాత మజిలీ 90 కి.మీ. దూరంలోని తెక్కడి. ఈ దారిలో అన్నీ సుగంధద్రవ్యాల తోటలే. దారిలో మైలాదుమ్‌పురా వద్ద సుగంధద్రవ్యాల పార్కుకి వెళ్లాం. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క...వంటి మొక్కలను  ప్రత్యక్షంగా చూడొచ్చు. అన్ని భాషల్లో వివరించడానికి గైడ్లు ఉన్నారు. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయో వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో అన్నీ చక్కగా తెలుగులో వివరించారు. అక్కడి షాపుల్లో తాజా దినుసుల్ని కొనుక్కున్నాం. మిరియాల తరవాత ఎక్కువగా కనిపించేవి రబ్బర్‌ తోటలే. రబ్బరు ఉత్పత్తిలో 90 శాతం కేరళ రాష్ట్రానిదే. ఈ చెట్లన్నింటికీ కాండం దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి ఉన్నాయి. ఆ కవర్లలోకి తెల్లని ద్రవం(లేటెక్స్‌) వస్తుందనీ దాన్నే రబ్బురుగా మలుస్తారనీ చెప్పారు. సాయంత్రానికి తెక్కడికి చేరుకున్నాం. అక్కడ పెరియార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. ఇందులో పులులూ, ఏనుగులూ, సాంబార్‌లూ, కోతులూ ఉన్నాయి. వీటిని చూడ్డానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటుచేశారు. పడవలో వెళ్లి చూడాలి. ఆ రాత్రికి తెక్కడిలోని మార్షల్‌ ఆర్ట్‌ థియేటర్‌కు వెళ్లి, కలారిపట్టు అనే యుద్ధవిద్యనుచూసి, అలెప్పీకి బయలుదేరాం.



అలెప్పీలో...
బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. హౌస్‌ బోటులకీ స్నేక్‌ బోటులకీ ఇది పేరొందిన ప్రదేశం. మున్నార్‌ నుంచి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం. బస్సులో వస్తుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉందీ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌బోటులు రెడీగా ఉన్నాయి. మనం చెల్లించే ధరనుబట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌డెక్‌ ఉంటుంది.



ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతాయి. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మేం రెండు బోట్లు అద్దెకు తీసుకుని వెళ్లాం. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

అలెప్పీ నెహ్రూట్రోఫీ బోట్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి. ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం జరుగుతాయివి. వీటినే స్నేక్‌ బోట్‌ రేసెస్‌ అనీ అంటారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లి, పద్మనాభస్వామి గుడినీ కోవలం బీచ్‌నీ సందర్శించి వెనుతిరిగాం.

Friday, 9 June 2017

శ్రీ అనంత పద్మనాభస్వామి





శేషశయనా.. అనంతపద్మనాభ

శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన ఆ చిద్విలాసమూర్తి మహారూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభి యందు కలిగిన వాడు కాబట్టే ఆ పురుషోత్తముడిని పద్మనాభుడిగా పిలుస్తాం. శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయంలో వెలువడిన సంపద యావత్‌ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. లక్షల కోట్లు విలువచేసే సంపదతో స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యమూర్తిగా అవతరించారు. అనంతమంటే అంతు లేనిదని అర్థం. అంత సంపదను వందలసంవత్సరాలుగా ఆలయంలో నిక్షిప్తం చేసుకున్న ఆ స్వామి నిజంగా అనంతుడే. లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. ఆర్తితో పిలిస్తే భక్తులను ఆదుకుంటారు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీఅనంత పద్మనాభక్షేత్రం.

స్వామిని పూజించిన బలరాముడుఈ ఆలయ ప్రస్తావన పలు పురాణాల్లో, ఇతిహాసాల్లో వుంది. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్‌ భాగవతం తెలుపుతోంది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలయ చరిత్రపై కచ్చితమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి ఆలయం నిత్యపూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్దులు వెల్లడిస్తున్నాయి.

అనంతశయన మహత్యఅనంతపద్మనాభుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్న దానిపై అనంతశయన మహత్య గ్రంథం వివరాలను తెలుపుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం దివాకరముని అనే విష్ణు భక్తుడు వుండేవాడు. నిత్యం విష్ణునామ సంకీర్తనతో ఆయన నిమగ్నమయివుండేవాడు. ఒకరోజు భగవానుడు ఆయనకు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ముద్దులొలికే ఆ పిల్లవాడిని చూసిన దివాకరుడు తన నివాసంలో వుండాలని కోరాడు. అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్ముడే అన్న అంశాన్ని ముని గుర్తించలేకపోయారు. దీనిపై స్పందించిన చిన్నారి తాను చేసే పనులకు ఎలాంటి అడ్డుచెప్పకూడదని ఒకవేళ చెబితే వెళ్లిపోతానని నిబంధన పెడుతాడు. కొన్నిరోజులకు పిల్లవాడు చేసే అల్లరి ఎక్కువయింది. ఒకనాడు ముని తపోదీక్షలో వుండగా సాలగ్రామాలను తీసుకువచ్చిన స్వామి అతని నోటిలో వేస్తాడు. దీంతో మునికి తపోభంగమైంది. పిల్లవాడిపై పట్టరాని కోపం ప్రదర్శిస్తాడు. పిల్లవాడు వెంటనే అదృశ్యమవుతూ తనను తిరిగి చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన నివాసంలో బాలుడిగా వున్న అంశాన్ని దివాకరముని గుర్తిస్తాడు. వెంటనే స్వామిని అన్వేషిస్తూ సముద్రతీరప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ వున్న భారీ వృక్షం నేలపై పడి శ్రీమహావిష్ణువుగా రూపాంతరం చెందింది. స్వామివారు భారీ రూపంగా దర్శనమిచ్చారు. అనంతుని దర్శనంతో అమితానందం చెందిన దివాకరముని అంతటి పెద్ద రూపాన్ని వీక్షించలేనని ప్రార్థించడంతో యోగదండం కంటే మూడింతలు పెద్దగా మారిపోయారు. స్వామిని కనులారా వీక్షించిన ముని స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను వుంచి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పటికీ ఈ పూజా విధానం ఆలయంలో కొనసాగుతుండటం విశేషం. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో వుంది. నంబూద్రి సన్యాసి వివమంగళ స్వామియార్‌ అనే విష్ణుభక్తుడికి కూడా అనంతుడు ఇలానే దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది.

రాజులైనప్పటికీ స్వామికి దాసులేతిరువనంతపురం ట్రావెన్‌కోర్‌ రాజులు ఏలుబడిలో వుండేది. తిరువనంతపురం పేరు కూడా అనంత పద్మనాభుడి మీదుగా రావడం విశేషం. ట్రావెన్‌కోర్‌ రాజులు స్వామివారికి భక్తులు. తమను తాము ఏనాడు పాలకులుగా వారు ప్రకటించలేదు. పద్మనాభుడికి దాసుడిగా ప్రకటించుకొని అనంతునిపై వున్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు. తొలినాళ్లలో ఆలయాన్ని విస్తరించేందుకు రాజా మార్తాండవర్మ ఇతోధికంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపం, భద్రదీపం అనే పూజా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అనంతరం వారి వంశంలో వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా వుండి అనంతమైన సంపదను పరిరక్షించారు.

మూలవిరాట్టును మూడు ద్వారాల్లో నుంచి దర్శించాలిస్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడంతో తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రోజుల్లో 4వేల శిల్పకారులు, 6వేలమంది కార్మికులు, నూరు ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలోని పలు కళాకృతులను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.

అనంతమైన సంపదకు రక్షకులుకొంతకాలం క్రితం ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్‌కోర్‌ పాలకులు సంరక్షకులుగా వుంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద వుంటుందో ఆ అనంతునికే తెలిసిన రహస్యం.

ఆలయ ప్రాంగణంఅనంతుని ఆలయప్రాంగణంలో అనేక మందిరాలు వున్నాయి. మహాశివునికి ఒక మందిరం వుండటం శివ, కేశవ బంధాన్ని చెబుతుంది. గణపతి మందిరం, యోగ నరసింహస్వామి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, ఒట్టకల్‌ మండపం, అభిశ్రావణమండపం, కులశేఖర మండపం, శ్రీ బలిప్పుర (ప్రదక్షిణ మార్గం, తిరువంబడి కృష్ణస్వామి మందిరం... తదితర వాటిని వీక్షించవచ్చు. ఆలయంలోని కుడ్యకళ ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి* కేరళ రాజధాని తిరువనంతపురం. ఈ నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణాసౌకర్యాలున్నాయి.
* తిరువనంతపురం రైల్వేస్టేషన్‌లో దిగి ఆలయాన్ని చేరుకోవచ్చు.
* తిరునంతపురం విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయం సందర్శించుకునే సౌకర్యముంది.





Wednesday, 15 March 2017

దుర్యోధనుడి గుడి





అక్కడ దుర్యోధనుడు ఎందుకు దేవుడయ్యాడు?

మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను దుష్టత్వానికి ప్రతిబింబంగా భావిస్తారు. విలన్‌కి ఎప్పుడూ సాధారణంగా తిట్లూ శాపనార్థాలేతప్ప పూజలూ పునస్కారాలూ ఉండవుకదా! కానీ దుర్యోధనుణ్ణి మాత్రం ఆ ఊళ్ళో దేవుడిలా కొలుస్తారు. ఆ ఇతిహాస పురుషుడికి జాతర కూడా చేస్తారు. ఎక్కడ? ఏమిటి? అని తెలుసుకోవాలంటే కేరళ వెళ్ళాల్సిందే!

కొల్లం జిల్లా పోరువళి గ్రామంలో ఉంది పెరువిరుతి మలనాడి గుడి. ఇక్కడ దుర్యోధనుడే దైవం. నిజానికి అక్కడ ఏ విగ్రహమూ ఉండదు. ఆరుబయట ఓ వేదిక ఉంటుంది. భక్తులు తమలోతాము సంకల్పం చెప్పుకుని, ఆ వేదిక వద్ద మనస్సులో దైవాన్ని స్మరించుకుంటూ ప్రార్థన చేయాలి. దుర్యోధనుడు పేదలు, అణగారిన వర్గాల రక్షకుడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గుడిలో ఉపదేవతలుగా కొలువై ఉన్నదెవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఇంతకూ ఎవరో తెలుసా? దుర్యోధనుడి భార్య భానుమతి, అతడి తల్లి గాంధారి, సోదరి దుస్సల, గురువు ద్రోణుడు, ఆప్తమిత్రుడు కర్ణుడు. బాగుంది కదూ! అణగారిన వర్గాల రక్షకుడుగా దుర్యోధనుడు ఇక్కడ కొలువు తీరడం నిజంగా ఓ గొప్ప విశేషమే!

Monday, 16 November 2015

అయ్యప్ప - 18 మెట్లు





అయ్యప్ప 18 మెట్లు

గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులూ, దిగే భక్తులూ మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్‌ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. అప్పటి నుంచీ దీనికి ‘పొన్ను పదునెట్టాంబడి’గా పేరు వచ్చింది. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు.

1998లో, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్య ఇచ్చిన మూడున్నర కోట్ల రూపాయల విరాళంతో ఆలయానికి బంగారు తాపడం చేశారు. అప్పుడే ఆలయానికి ఉత్తర, దక్షిణ గోడల మీద సుమారు పదహారు చదరపుటడుగుల్లో శ్రీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను చెక్కించారు. గర్భగుడి ప్రధాన ద్వారానికీ, తలుపులకూ, హుండీకీ కూడా బంగారు పూత పూయించారు.

అరిగిపోయిన పద్ధెనిమిది మెట్లకు కొత్తగా పంచలోహపు మెట్ల తొడుగు ఈ మధ్యే చేయించారు. వానలు వస్తే ఇబ్బంది లేకుండా పైభాగంలో కప్పులా రేకులు అమర్చారు. ఈ మెట్లు అయిదడుగుల పొడవు, తొమ్మిది అంగుళాల వెడల్పు, ఒకటిన్నర అడుగుల మందం కలిగి ఉంటాయి. భక్తులు ఎక్కినప్పుడు సహకరించడానికి పడికి రెండువైపులా పోలీసులుంటారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు మిగిలినవారిని ఆపేసి వారిని మాత్రమే అనుమతిస్తారు.

అయ్యప్ప వాహనం పులి కాదా?
అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద ‘వాజి’ వాహనం అంటే ‘గుర్రం’ వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం. అంతేకాని పులి కాదు. పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందళ రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు.

18 అయ్యప్ప మెట్ల కథ
శబరిమల అయ్యప్పస్వామి దీక్షలో ‘పదునెట్టాంబడి’ (పద్ధెనిమిది మెట్ల)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ మెట్లను ఎక్కి, స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు! పవిత్రమైన ఆ మెట్ల వెనుక ఎంతో కథ ఉంది..

శబరిగిరి శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి యోగాలయం ముందు భాగంలో ఉన్న పద్ధెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ లేదా ‘పదునెట్టు త్రిపాడికల్‌’ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికే ప్రతి భక్తుడూ విధిగా మండల దీక్ష (41 రోజులు) తీసుకుంటారు. ఈ మెట్లు అఖండ సాలగ్రామ శిలతో, పరశురాముని ద్వారా నిర్మితమయ్యాయని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని ‘పరశురామ క్షేత్రం’ అని కూడా అంటారు. ఈ మెట్లు మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీక.

ఆ 18 మెట్లు ఎందుకంటే ...
అసలు ఈ పద్ధెనిమిది మెట్లు ఎందుకున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్న సహజమైనదే. హరిహరసుతుడైన అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 సంవత్సరాలు పందలరాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తరువాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం- దేవతా రూపాలు దాల్చి పద్ధెనిమిది మెట్లుగా అమరాయనీ, అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారనీ చెబుతారు. పట్టబంధాసనంలో ఆయన కూర్చొని, చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చారనీ, యోగసమాధిలోకి వెళ్ళి, జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారనీ పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని ‘సన్నిధానం’ అని వ్యవహరిస్తారు.

మెట్టుకో దేవత!
అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ 41 రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్ష పాటించాలి. ఇరుముడి కట్టుకొని (స్వామివారి నెయ్యాభిషేకానికి అవసరమైన నెయ్యిని నింపిన కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి) మాత్రమే ‘పడి’ని ఎక్కాలి. ‘పదునెట్టాంబడి’ గురించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి...

పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు: 1.మహాంకాళి 2. కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7. కృష్ణ పింగళ 8. హిడింబ 9.బేతాళ 10. నాగరాజ 11. కర్ణ వైశాఖ 12. పుళిందిని 13. రేణుకా పరమేశ్వరి 14. స్వప్న వారాహి 15.ప్రత్యంగళి 16.నాగ యక్షిణి 17. మహిషాసుర మర్దని 18. అన్నపూర్ణేశ్వరి

వదిలేయాల్సింది వీటినే!
ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద... ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు. అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్ర చేస్తారు.

ఆ మాయోపాయాలు ఏమిటంటే: 

  1. అష్ట రాగాలు - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దర్పం, అహంకారం
  2. పంచేంద్రియాలు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 
  3. త్రిగుణాలు - సత్వ గుణం, రజో గుణం, తమో గుణం 
  4. సంస్కార రాహిత్యం అంటే మంచి నడవడిక లేకపోవడం 
  5. చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం.

18 మెట్ల పేర్లేమిటంటే...
ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. అవి: 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక

అయ్యప్ప విడిచిన అస్త్రాలు
అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. ఆ అస్త్రాలు: 1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం

పద్ధెనిమిది కొండలు
శబరిగిరి చుట్టూ ఉన్న 18 కొండలకు ఈ మెట్లు ప్రతీకలంటారు. అవి: 1.పొన్నాంబళమేడు 2. గౌదవమల 3. నాగమల 4. సుందరమల 5. చిట్టమ్బలమల 6. ఖలిగిమల 7. మాతంగమల 8. దైలాదుమల 9. శ్రీపాదమల 10. దేవరమల 11. నీల్కల్‌మల 12. దాలప్పార్‌మల 13. నీలిమల 14. కరిమల 15. పుత్తుశేరిమల 16. కాళైకట్టి మల 17. ఇంజప్పార మల 18. శబరిమల

పవిత్ర ఆహుతి
‘పడి’కి ముందు భాగంలోని పవిత్ర ‘ఆహుతి’ సుమారు 70 రోజుల పాటు (ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకూ) అఖండంగా మండుతూనే ఉంటుంది.
ముద్ర టెంకాయలు (స్వామివారి అభిషేకం కోసం నెయ్యి నింపిన టెంకాయలు) పగులగొట్టి, నెయ్యిని స్వామివారికీ, కొబ్బరి చిప్పలను ఈ ఆహుతికి సమర్పిస్తారు. ఇటువంటి పవిత్ర ఆహుతి మరే ఇతర దేవాలయాల్లోనూ లేదు. అలాగే ఇన్ని నియమాలను పాటించి దైవదర్శనం చేసుకొనే ఆలయం కూడా మరొకటి లేదు.

విగ్రహ పునఃప్రతిష్ఠ
శబరిమలలో పరశురాముడు, పందళరాజు ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండూ రాతివే. 1910 మార్చి 27న ప్రభాకరన్‌ తంత్రివర్యులు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తరువాత దేవాలయం అగ్నికి ఆహుతైన కారణంగా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952లో మరోసారి అగ్నిప్రమాదంలో విగ్రహం ఆహుతైంది. 1953లో తిరిగి ఒకటిన్నర అడుగుల పంచలోహ విగ్రహాన్ని కంథరుర్‌ శంకర్‌ మేల్‌ తంత్రి చేతులమీదుగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పులు చెంగనూరుకు చెందిన అయ్యప్పన్‌, నీలకంఠన్‌. హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి కూడా వీరే శిల్పకారులని తెలుస్తోంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకోవడంతో, కొత్త ధ్వజస్తంభాన్ని గత ఏడాది జూన్‌లో ప్రతిష్ఠాపన చేశారు.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...