మున్నార్:
కేరళలోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను సందర్శించేలా చేస్తాయి.
చిరపుంజీ:
మేఘాలయ స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటయిన చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన Nohkalikai Falls(నోహ్కలికై జలపాతం) ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది. చిరపుంజీ కేవలం దృశ్య వీక్షణం కొరకు మాత్రమే కాదు సాహసోపేతమైన పర్యటనలకు కూడా అనుగుణంగా ఉంటుంది. చిరపుంజిని ఆగస్టు మాసంలోనే సందర్శించాలి.
అగుంబే:
కర్నాటకలోని మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశం నుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. అగుంబే సందర్శించాల్సిన సమయం సమయం ఆగస్టు మాసం.
కొడైకెనాల్:
తమిళనాడు కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుమతి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.
లాహౌల్:
ఇండియాకి, టిబెట్‌కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో లాహౌల్ వుంది. ఇక్కడ ఎక్కువ మంది బౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్‌క, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు. అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులు:
గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే! ఈ సెలవుల విహార ప్రదేశం అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే.
బికనేర్:
బికనేర్ రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి మధ్యలో గల ప్రధాన ఎడారి పట్టణం. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, రుచికరమైన భుజియాలకు, రంగు రంగుల పండుగలకు, అద్భుతమైన భవనాలకు, అందమైన శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఒంటెల పండగ ప్రసిద్ధి చెందినది. బికనేర్ సందర్శించదలచుకొన్న పర్యాటకులు ప్రసిద్ధ ఇసుక రాయి కట్టడ లాల్ఘర్‌ను తప్పనిసరిగా చూడాలి. ఈ ప్రదేశాన్ని వేసవి కాలం కంటే ఆగస్టు మాసం సందర్శనకి అనువైనది.
ముస్సూరీ :
ఉత్తరాఖండ్ ముస్సూరీని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం ఇక్కడ కల శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్ వాలీకి ప్రసిద్ధి గాంచినది. అందమైన ప్రదేశాలతో కూడిన ఈ పట్టణంలో అనేక ప్రాచీన దేవాలయాలు, కొండలు, జలపాతాలు, లోయలు మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కలవు. ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఇక్కడనే ఉంది.
పాండిచేరి:
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణికునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్‌స విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.
మండు:
మధ్యప్రదేశ్ మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది. మండు అంటే ఒక ఆనందాల భూమి. సాంప్రదాయక మాల్వా ఆహారాలు అయిన దాల్ బాత్ మరియు మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది. ఇక్కడ చూడవలసిన వాటిలో బాజ్ బహదూర్ మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటులు , తాజ్ మహల్ వలే మార్బుల్‌తో నిండిన హోశాంగ్ టూంబ్స్ మొదలైనవి ఉన్నాయి.
కూర్గ్:
కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటకలోని ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుకనే కూర్గ్‌ను “ఇండియాలోని స్కాట్‌లాండ్” అని, “కర్నాటకలోని కాశ్మీర్” అని అభివర్ణిస్తారు. కూర్గ్‌లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలలో అబ్బే ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, టిబెట్ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్ చేసే వారికి పుష్ఫగిరి ఫాల్స్, కోటిబెట్ట, నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. కూర్గ్‌ను సందర్శించాలంటే, ఆగస్ట్ మాసం నుండి నుండి నవంబర్ మాసం వరకు అనుకూల సమయం.
మహాబలేశ్వర్:
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్ స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, ప్రతాప్ ఘడ్ కోట వంటివి కూడా మహాబలేశ్వర్‌లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. ఇంతటి వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్‌ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే ఆగస్టు మాసంలో తప్పక సందర్శించావల్సినదే!
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హేమకుండ్‌కు వెళ్ళే దారిలో ఉన్నది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ తెలుపు మరియు పసుపు అనేమోన్‌స,, డైసీలు, హిమాలయ నీలిరంగు గసగసాల మరియు పాము లిల్లీ వంటి అనేక 300 జాతుల పుష్పాలను చూడవొచ్చు. ఈ పుష్పాలతో పాటు నలుపు హిమాలయ ఎలుగుబంట్లు, తహర్‌స, కస్తూరి జింక, మంచు చిరుతలు మరియు సేరోవ్‌స వంటి అరుదైన జంతుజాలాన్ని మరియు అరుదైన సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.
ఉదయపూర్:
బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభయారణ్యాలకు ప్రసిద్ది పొందిన రాజస్థాన్‌లోని ఉదయపూర్ 'సరస్సుల నగరం' గా పిలువబడే అందమైన ప్రదేశం. మహారాణా ఉదయ సింగ్ నిర్మించిన, గోల్ మహల్ గా పిలువబడే రాజ్ ఆంగణ్ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగ్ మందిర్, నెహ్రూ గార్డెన్, ఏక్ లింగ జీ దేవాలయం, రాజీవ్ గాంధీ పార్‌క, శ్రీనాథ్ జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ మధ్య కాలం బాగుంటుందని పర్యాటకులు భావిస్తుంటారు.
కన్యాకుమారి :
కన్యాకుమారి పట్టణం మనదేశానికి దక్షిణ భూభాగాన చివరలో ఉంది. ఈ ప్రదేశంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు, ప్రత్యేకించి పౌర్ణమి రోజులలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే అవి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం. సీఫుడ్ లు కన్యాకుమారి ప్రసిద్ధి చెందినది. కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.