రాజస్థాన్ - ఎడారి దారిలో చుట్టూ ఉన్న ఎడారే రాజస్థాన్ పర్యాటక రంగానికి ఒయాసిస్! రాజులు పోయినా.. వారు నిర్మించిన ప్రాసాదాలు నేటికీ ఠీవీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో నిప్పుల కొలిమిలా ఉండే ఈ ఎడారి ప్రాంతం.. శీతాకాలంలో దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో భలేగా ఉంటుంది. November - February: పర్యటనకు అనుకూల సమయం. ఇదే సీజన్‌లో ఇక్కడ బికనీర్ ఒంటెల పండగ, జైపూర్ మ్యూజిక్ ఫెయిర్, ఫుష్కర్ ఫెయిర్, జైసల్మేర్ ఫెస్టివల్ ఇలా సంప్రదాయ పండగలు ఎన్నో జరుగుతుంటాయి. థార్ ఎడారిలో జీప్ సఫారీ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
June - September: పేరుకే వానాకాలం. కానీ, ఇక్కడ భారీ వర్షాలేం ఉండవు. ఈ సమయంలోనూ వెళ్లిరావొచ్చు.
దర్శనీయ స్థలాలు: జైపూర్, అజ్మీర్, బికనీర్, పుష్కర్, జోధ్‌పూర్, జైసల్మేర్... |
కశ్మీరు లోయలో.. పర్యాటక ప్రియులు ఒక్కసారైనా చూడాలనుకునే ప్రాంతం జమ్మూ కశ్మీర్. సంస్కృతి, ఆహార్య వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. హిమగిరి సొగసులు, శ్రీనగర్‌లో హౌస్‌బోటు షికారు మధురానుభూతిని మిగుల్చుతాయి. January - February: దట్టమైన మంచుతో ఉంటుంది. స్కేటింగ్ విన్యాసాలు, హిమసీమల్లో విహరించాలని భావించేవారు ఈ సమయంలో వెళ్తుంటారు.
March - June: సమశీతోష్ణంగా ఉంటుంది. పిల్లలతో వచ్చి జాలీగా సెలవులు గడపవచ్చు.
September - October: లేహ్-లద్దాఖ్ దారిలో బైకులు దూసుకుపోతుంటాయి. కశ్మీరు లోయ సౌందర్యం చూడాలంటే ఇది అనువైన సమయం.
దర్శనీయ స్థలాలు: శ్రీనగర్, లెహ్, లద్దాఖ్, ఉదంపూర్, పుల్వామా, వైష్ణోదేవి ఆలయం |
ఉత్తరాఖండ్ - ఆధ్యాత్మికం.. పర్యాటకం.. దైవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. చార్‌ధామ్ యాత్రలోని క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువుదీరాయి. హిమాలయాల సౌందర్యం, హిమనీ నదుల వయ్యారాలు.. ఉత్తరాఖండ్‌ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాయి. December - January: మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హిమాలయాల సౌందర్యం చూడాలనుకుంటే వెళ్లొచ్చు.
February - May: ప్రశాంత వాతావరణం ఉంటుంది. నైనిటాల్, డెహ్రాడూన్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
July-September: భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రతికూల సమయం.
October - November: సాహసక్రీడలకు అనుకూలం. మంచుతెరల్లో ఇక్కడి ప్రదేశాలు మరింత మనోహరంగా కనిపిస్తాయి.
దర్శనీయ స్థలాలు: చార్‌ధామ్ యాత్ర (కేదార్‌నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి), రుషీకేశ్, హరిద్వార్, నైనిటాల్, అల్మోరా, డెహ్రాడూన్ |
ఉత్తర్‌ప్రదేశ్-వారణాసి- పవిత్ర సంగమం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వారణాసి ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆధ్యాత్మిక సుగంధాలు, గంగా, యమున తరంగాలు, నవాబుల హవేలీలు లాంటి ఎన్నో విశేషాల సంగమం ఉత్తర్‌ప్రదేశ్. April - May: ఎండలు ఎక్కువ. పర్యాటకుల సందడి తక్కువ. అయితే ఎండలు ఎలా ఉన్నా.. May మాసాంతంలో పర్యాటకులు కాశి, ప్రయాగ క్షేత్రాలకు వస్తుంటారు.
July - September: ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో హోటల్ గదుల అద్దెలు తక్కువగా ఉంటాయి.
October - February: పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. శివరాత్రి సమయంలో కాశిలో ఆధ్యాత్మిక వైభవం చూసి తీరాల్సిందే!
దర్శనీయ స్థలాలు: వారణాసి, ఆగ్రా, మథుర, లఖ్‌నవు, అలహాబాద్ (త్రివేణి సంగమం), అయోధ్య, ఝాన్సి, సారనాథ్, ఆలీగఢ్, ఫతేపూర్ సిఖ్రి |
గుజరాత్ - సంప్రదాయాల పట్టుకొమ్మ వాణిజ్య సంపదతో తులతూగే గుజరాత్‌లో పర్యాటక కేంద్రాలు చాలానే ఉన్నాయి. అతిథులను ఆకర్షించడంలో గుజరాత్ పర్యాటక శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది. September - October: గుజరాత్‌లో దసరా, దీపావళి పండగలు ఘనంగా జరుగుతాయి. గుజరాతీయుల సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవాలనుకున్నా, ఆహార పదార్థాలు రుచి చూడాలనుకున్నా.. ఇది సరైన సమయం.
November - February: ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇదే సమయంలో రణ్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. తెల్లటి ఇసుక తిన్నెల్లో.. వెన్నెలను చూసేందుకు వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు.
దర్శనీయ స్థలాలు: సోమ్‌నాథ్ ఆలయం, ద్వారకా, అక్షరధామ్, అహ్మదాబాద్, సబర్మతి ఆశ్రమం, గిర్ అభయారణ్యం... |
ఈశాన్య సౌందర్యం ఈశాన్య భారతంలో పొదిగిన ఏడు రాష్ట్రాలు పర్యాటక రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ పర్యాటక కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి కట్టిపడేస్తాయి. November - February: చల్లటి వాతావరణం, నిర్మలమైన ఆకాశం ఆహ్లాదాన్నిస్తాయి.
June - October: వర్షాలు కురుస్తుంటాయి. ఆకాశంలో కారుమబ్బులు, పర్వత పంక్తులపై మంచు తెరలు ప్రకృతికాంత సరికొత్తగా కనిపిస్తుంది. జలధారలతో లోయలన్నీ పొంగిపోతుంటాయి. పర్యాటకులకు కావాల్సినంత ఆనందం దొరుకుతుంది.
దర్శనీయ స్థలాలు: షిల్లాంగ్, చిరపుంజి (మేఘాలయ), జిరో, తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), మాజులీ, గువాహటి (అస్సాం), ఐజ్వాల్ (మిజోరాం), ఇంఫాల్ (మణిపూర్) |
గో.. గో.. గోవా టీనేజ్ కుర్రాడి మొదలు.. ఓల్డేజ్ పెద్దాయన వరకు గోవా అనగానే.. లెట్స్ గో అంటారు. ఏడాది పొడుగునా పర్యాటకుల సందడి కనిపిస్తుందిక్కడ. November - February: దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. చిన్నా-పెద్దా కార్నివాల్స్ జరిగే సీజన్ ఇది.
July - September: ఈ సమయంలో గోవా అందంగా ఉంటుంది. చిరుజల్లుల వేళ బీచ్‌లో విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది.
April-May: పర్యాటకుల తాకిడి ఉండదు. ఎండలు తట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. ఈ సమయంలో గదుల అద్దె తక్కువగా ఉంటుంది. బడ్జెట్ ధరలోనే స్టార్ హోటల్‌లో బస చేయవచ్చు.
చూడాల్సినవి: గోవా బీచుల్లో సరదాగా గడపవచ్చు. ఓల్డ్ గోవా మొత్తం చుట్టి రావొచ్చు. |
తుంగ అల.. హంపి కళ కర్ణాటకలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకు కొదవలేదిక్కడ. October - February: అనుకూలం. మైసూర్ దసరా ఉత్సవాలు, హంపి ఉత్సవాలు ఈ సీజన్‌లోనే జరుగుతాయి.
June - September: సీజన్ ఓ మోస్తరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ.
April - May: వేసవిలో ఎండలు మెండుగా ఉంటాయి. కర్ణాటక స్వర్గధామం కూర్గ్‌లో మాత్రం వేసవి పసందుగా ఉంటుంది.
దర్శనీయ స్థలాలు: గోకర్ణం, బెంగళూరు, మైసూర్, శ్రీరంగపట్నం, కూర్గ్, చిక్ మంగళూర్, మురుడేశ్వర్... |
రుతురాగాల వేళలో.. పడమటి కనుమల్లో ఒదిగిన కేరళలో ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, సముద్ర తీరాలు.. ఇలా ఎన్నో! November - February: వాతావరణం బాగుంటుంది. హిల్‌స్టేషన్లు, జలపాతాలు, సముద్ర తీరాలకు వెళ్లొచ్చు.
May - June: నైరుతి రుతుపవనాల రాకతో.. తొలకరి చినుకుల్లో తడిసిపోవాలని పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు.
August: ఈ నెలలోనే కేరళ నూతన సంవత్సరాది ఓనమ్ పండగ జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి పల్లెల్లో పడవ పందేలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా జరుగుతుంటాయి.
దర్శనీయ స్థలాలు: అలెప్పీ, తిరువనంతపురం, మున్నార్, వాయనాడ్, శబరిమల, గురువాయూర్ ఇలా ఎన్నో.. |
ఆధ్యాత్మిక విహారం ఆధ్యాత్మిక కేంద్రాలు, వేసవి విడిదులు తమిళనాడు పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు విహారయాత్రకు వచ్చే వారికి అదనపు ఆనందాన్ని అందిస్తాయి. November - February: మధ్యాహ్నం ఉక్కపోత ఉన్నా.. ఉదయం, సాయంత్రం చల్లగా ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్ ఇది. ధనుర్మాసంలో తమిళనాట ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.
July - November: అడపాదడపా భారీ వర్షాలు కురుస్తాయి. అయినా, దసర, దీపావళి పండగలప్పుడు కంచి, మదురై, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతుంటాయి.
March - May: వేసవిలో ఎండలు దానికి తోడు ఉక్కపోత చికాకు కలిగిస్తాయి. ఈ సమయంలో ఊటి, కొడైకెనాల్, ఎలగిరి హిల్స్ వంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు.
దర్శనీయ స్థలాలు: అరుణాచలం, మహాబలిపురం, కంచి, మదురై, కుర్తాళం, రామేశ్వరం, కన్యాకుమారి, చిదంబరం, కుంభకోణం, శ్రీరంగం మరెన్నో.. |
ఎన్నెన్నో అందాలు.. భారతావని హృదయసీమగా పేరున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటకానికి ఊతమిచ్చే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు, సాత్పురా పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, కోటలు, రాజప్రాసాదాలు ఇలా ఎన్నెన్నో అందాలు.. పర్యటక పటంలో మధ్యప్రదేశ్‌ను దర్జాగా నిలబెట్టాయి. October - April: వాతావరణం అనుకూలంగా ఉంటుంది. December, January మాసాల్లో చలి ఎక్కువగా ఉన్నా.. పర్యాటకులకు ఆనందం పంచుతుంది.
April - May: ఎండలు ఎక్కువగా ఉంటాయి.
June - September: వర్షాకాలంలో నర్మదా నది పరివాహక ప్రాంతాలు అందంగా కనిపిస్తాయి. వింధ్య-సాత్పుర పర్వత శ్రేణుల్లోని జలపాతాలు నిండైన ప్రవాహంతో కళకళలాడుతుంటాయి.
దర్శనీయ స్థలాలు: జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఖజురహో, సాంచి, జబల్‌పూర్, భోపాల్, చిత్రకూట్, హనువంతియా, పచ్‌మఢీ, పాతాల్‌కోట్, గ్వాలియర్ మరెన్నో.. |