Tuesday, 7 June 2016

మంచుపూల వనాల్లో...

కాశ్మీరుకి బయల్దేరే ముందు మేము పడ్డ ఆందోళన ఇంతా అంతా కాదు. 'కాశ్మీరా? ఫరవాలేదా? అక్కడంతా అల్లర్లట కదా, కాల్పులట కదా' అని మా మిత్రులు, సన్నిహితులూ మొదట్లో భయపెట్టారు. తీరా అక్కడికి చేరాక ఆ భయమంతా పటాపంచలైపోయింది. మీడియా కాస్త ఎక్కువ చేస్తోందేమో అనే అనుమానం వచ్చింది.

విశాఖపట్నం నుండి విమానంలో బయలుదేరిన మేము అంటే మా అమ్మా నాన్నా నేనూ ఢిల్లీలో దిగి, అక్కడ ఆ రాత్రి బస చేసి, మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో కాశ్మీరుకు చేరాం. దారిలో విమానంలోంచి హిమాలయాలను చూడడం గొప్ప అనుభవం. ఆ కొండలన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కట్టిన తెల్లటి ఇసుక గూళ్లలా కనిపించాయి. పై నుండి భూమిని చూడటమే ఒక వింత అనుభవమయితే అలాంటిది ఏకంగా హిమాలయాలనే చూడటం మహా అద్భుత అనుభవం.

ముందుగానే జమ్ముకాశ్మీర్ పర్యాటక కేంద్రం వారి రూమ్స్‌ను ఇంటర్నెట్‌లో బుక్ చేసుకున్నందువల్ల హోటల్ 'లలారుఖ్' చేరుకుని గదిలో సామన్లు పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత శ్రీనగర్‌లోని అందమైన ప్రాంతాలు చూడడానికి బయల్దేరాం.

ఇంకొన్ని కళ్లుంటే...
ఊరు చూపెట్టడానికి ఆటోవాడు ఎంత తీసుకుంటాడని అక్కడివారిని అడిగితే, మమ్మల్ని వారు చాలా విచిత్రంగా చూశారు. ఎందుకలా చూశారో మొదట మాకు అర్థం కాలేదు. పర్యాటకులు చలికి భయపడి ఎక్కువగా ఆటోల్లో తిరగరనీ, సుమోల్లోనే తిరుగుతారనే విషయం తర్వాత తెలిసింది. మేం ఒక సుమో మాట్లాడుకుని పావు గంటలో దాల్ సరస్సు పక్క నుంచి 'మొగల్ నిషాద్' గార్డెన్స్‌కు వెళ్లాం. ఆ గార్డెన్ ముందు వైపు దాల్ సరస్సు వెనుక మంచు కొండలు. మధ్యలో తివాచీ పరిచినట్లు పచ్చదనం. చూడడానికి నాకు ఇంకొన్ని కళ్లుంటే బావుండేదనిపించింది.

కాశ్మీరులో గొప్పవారైనా, పేదవారైనా ఇంటి పై కప్పును రేకులతోనే వేసుకుంటారు. కప్పులన్నీ ఇంగ్లీషు 'ఎ' ఆకారంలో ఉండి కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా ఉంటాయి.

తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్లాం. ఆ చోటంతా మంచు నిండుగా అందంగా కనిపించింది. ఆ ముందు రోజు వరకూ బాగా వర్షం పడి, దారంతా మంచుతో నిండిపోయి యాత్రికులను ఇబ్బంది పెట్టిందట. కాని మేం వెళ్లిన రోజునుండే వర్షాలు తగ్గి, రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఊడుస్తున్నారు. మన దగ్గర మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు అక్కడ మంచును ఊడ్చి పారేస్తున్నారు.

స్టెడ్జ్ బళ్లపై తిరిగాం
గుల్మార్గ్ మంచు కొండల్లో ఆడుకోవాలనుకునే వాళ్లు అక్కడే పొడవాటి జర్కిన్లు, బూట్లూ అద్దెకు తీసుకోవచ్చు. మేము 'స్లెడ్జ్' బళ్ల మీద చిన్న చిన్న మంచుకొండలు ఎక్కాము. ఈ బళ్లను మనుషులే తాడుకట్టి లాగుతారు. ఆ మంచుకొండల పై బళ్లతో జారుతూ వెళుతుంటే ఎవ్వరైనా సరే బాల్యంలోకి వెళ్లిపోవలసిందే.

తర్వాత 'హజరత్‌బల్ దర్గా'కి వెళ్లాం. మహ్మద్ ప్రవక్త వెంట్రుక ఉండడం వల్లే అది వారికి ఎంతో పవిత్రం. ఆ దర్గా వెనుక భాగం నుంచి దాల్ సరస్సులో బోట్ షికారు చేశాం. మధ్యలో ఒక చోట చిన్న ద్వీపంలా కనిపించింది. అక్కడ నాలుగు చినార్ చెట్లు ఉన్నాయి. అందుకే ఆ చోటుని 'చార్ చినార్' అంటారు. బోటులో అక్కడిదాకా వెళ్లొచ్చాం.

సింధునదిలో గంతులేశాం
రెండవ రోజు మేము సోన్‌మార్గ్ వెళ్లాం. దారిలో మాకు కొన్ని స్కూళ్లు కనబడ్డాయి. స్కూలు పిల్లలు ఎండలో కూర్చోవడం చూసి పాపమనిపించింది. వారంతా ఎండ కోసం అక్కడ కూర్చున్నారని తెలిశాక నవ్వుకున్నాం. సోన్‌మార్గ్ వెళ్లే దారికి ఇరుపక్కలా ఆవాల పొలాలు ఎక్కువగా కనిపించాయి. ఆ మొక్కలకి పసుపు పచ్చ పూలు ఉంటాయి. దారి పొడుగూతా ఎటు చూసినా పసుపు పచ్చ అందాలే.

సోన్‌మార్గ్ కూడా గుల్మార్గ్ లాగే మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మంచు కరిగి సింధూనదిగా ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కి పారుతున్న నదిని చూస్తే అందమైన లేడి పిల్ల చెంగు చెంగున గంతులేసి పరిగెడుతున్నట్లు ఉంటుంది. నదిలో చెయ్యి పెడితే షాక్ కొట్టేంత చల్లగా ఉన్నాయి. అయినా సరే ముఖం కడుక్కొని, ఆ నీళ్లు తాగి, మా దగ్గరున్న సీసాల్లో నింపుకొని కదల్లేక కదిలాం.

అక్కడ నుంచి ఆసియాలోనే అతి పెద్ద సరస్సయిన వుళ్లారు సరస్సు చూడడానికి వెళ్లాం. సరస్సు చుట్టూ పార్కులాంటిది కట్టారు. మంచు కొండలు, చెట్లు చూస్తున్నప్పుడు కాశ్మీరు వాళ్లు వాళ్ల సినిమాలు తీయడానికి వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదనిపించింది.

అందాల 'టులిప్' గార్డెన్
అక్కడి నుండి శ్రీనగర్‌లోని ఫేమస్ టులిప్ గార్డెన్‌కి వెళ్లాము. అక్కడ రంగు రంగుల 'టులిప్స్' చూపరులను కట్టిపడేస్తాయి. నలుపు, తెలుపు, గులాబి, కాషాయం, ఎరుపు, పసుపు ఇంకా బోలెడు రంగురంగుల టులిప్స్‌ను చాలా అందమైన ఆకృతుల్లో పెంచారు. ఆ తోటను చూస్తే చిన్నప్పుడు చదివిన జానపద కథల్లో యువరాణుల పూల తోట ఇదేనేమో అనిపించింది.

మూడో రోజు పహల్గాం వెళ్లాం. అక్కడికి వెళ్లే దారిలో లిడ్డర్ వేలీ కనబడుతుంది. లిడ్డర్ వేలీ అంటే అదేదో లోయ కాదు - ఒక నది. ఆ నదిలో ఎవరు గేలం వేసినా తప్పనిసరిగా చేప తగులుతుందని విని ఆశ్చర్యపోయాం. దీన్ని బట్టి ఆ నదిలో ఎన్ని లక్షల చేపలున్నాయో అనిపించింది! ఆ నీళ్లు మానస సరోవరం దగ్గరి మంచు కరిగి ప్రవహిస్తుండడం వల్ల వచ్చినవట. ఎలాగూ మానస సరోవరం వరకూ వెళ్లలేం కదా అని ఆ నీళ్లలో కాసేపు దిగి ఆడుకున్నాం. ఆ నీళ్లు కూడా ఒళ్లు జిల్లుమనేంత చల్లగా ఉన్నాయి. అక్కడి పారే నదులు అంత అందంగా ఎందుకుంటాయా అని ఆలోచిస్తే ... పారే నీటికి ఇరుపక్కలా కొండ రాళ్లు ఉండడం వల్లనేమో అన్పించింది. మన దగ్గర ఇసుక ఉన్నట్టు. నీరు ఆ రాళ్లకు తగుల్తూ, ఆ రాళ్ల సందుల్లోంచి పైకి చిందుతూ తుంపర్లుగా లేస్తూ వెళ్లడం మనోహరంగా కన్పించే దృశ్యం. అదే రోజు శ్రీనగర్‌లో పారి మహల్ కూడా వెళ్లాం. పారి మహల్ నుంచి దాల్ సరస్సు మొత్తం కనిపిస్తుంది.

కాశ్మీరీలు యాత్రికుల్ని గౌరవిస్తారు
శ్రీనగర్‌లో మనుషులు చాలా స్నేహశీలతతో కనిపించారు. యాత్రికులను గౌరవిస్తారు. పర్యాటకుల్ని మోసం చేయరు. ఒకరోజు అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని మమ్మల్ని జీలమ్ నదికి తీసుకెళ్లమని అడిగితే ఇంత దగ్గరగా ఉన్న దానికి ఆటో ఎందుకని చెప్పి దారి చూపించాడే కానీ అటూ ఇటూ తిప్పి డబ్బులు అడగాలనుకోలేదు. అక్కడి మనుషులతో మనం కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు టీ తాగి వెళ్లమనో, భోంచేసి వెళ్లండనో ఎంతో మర్యాదగా వాళ్లింటికి ఆహ్వానిస్తారు. మనుషుల పట్ల వారు చూపించే ప్రేమకు కళ్లు చిప్పిల్లాయి నాకు.

చలిపులికి భయపడిపోయాను
మేం వెళ్లింది ఏప్రిల్ నెలలో. అక్కడ పగటి గరిష్ఠ ఉష్టోగ్రత 25 డిగ్రీల కంటే ఎక్కువ లేదు. అదే చలికాలంలో మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుందట. అయితే మన ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకూ ఉంటుందని చెబితే 'అమ్మో ... మేము అక్కడ వస్తే మాడి మసైపోతామేమో' అని నవ్వారు. చలంటే ఎంతో ఇష్టపడే నేను రాత్రుళ్లు 8 రగ్గులు కప్పుకుని పడుకోవాల్సి వచ్చింది. మొదట్లో అరచేతులు కనిపించనంత పొడుగాటి చొక్కాల్లాంటివి చూసి ఆశ్చర్యపోయా. ఒకర్నిద్దర్ని చూసి అవిటి వారేమో అనుకున్నాను. ఎండ వచ్చేకొద్దీ ఒక్కొక్కరూ చేతుల్ని బయటకి తీయడం చూసి 'హమ్మయ్య' అనుకున్నాను. చలికి భయపడి అరచేతుల్ని చొక్కాల్లోపల ఉంచుకున్నారని అర్థమైంది.

మన స్కూళ్లు ఏప్రిల్, మే మాసాల్లో మూసేస్తే అక్కడ చలికి భయపడి నవంబర్, డిసెంబర్లలో మూసేస్తారట. మనవి వేసవికాలం సెలవులైతే వాళ్లవి శీతాకాలం సెలవులన్నమాట. అన్నం పొయ్యి మీద నుంచి దించగానే తినెయ్యాలి అక్కడ. లేదంటే క్షణాల్లో బిరుసెక్కిపోతుంది. 'కీషవ' అనే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లిక్విడ్ స్వీట్‌ని నేను చాలా ఇష్టంగా తాగాను.

మేం సుమోలో వెళ్తున్నప్పుడు ఒక ఉద్యోగిని కలిశాం. మాతో కాసేపు మాట్లాడిన తరువాత 'కాశ్మీరు గురించి, మా వాళ్ల గురించి మీ వాళ్లతో ఏమని చెప్తారు' అని అడిగాడాయన. 'ఇక్కడ ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని' చెబుతాం అని బదులిస్తే అతను చాలా సంతోషించాడు.

- ఎస్.ఎ. కిరణ్మయి

అందాలొలుకు(లు)... మనాలి. . .

హిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌కి మధ్యలో ఉన్నదే మనాలి. అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్‌ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్‌ జంగిల్‌లో కాపురాలు చేస్తున్న హైటెక్‌ నగరవాసికి ప్రశాంత కూడలి ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా అంటారు.

ఉత్తర భారతావనిలో ఘనమైన హిల్‌ స్టేషన్‌లలో ఒకటిగా చెప్పుకోదగిన కులు లోయ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనదే మనాలి. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యపట్టణమైన సిమ్లాకు ఉత్తరాన 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో... బియాస్‌ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి మూడు కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉండటం విశేషం. చుట్టూ మంచు లోయల మధ్య వేడినీటి కొలనులు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.

నాటి మనువాలయమే...
పూర్వం ‘మను’ అనే ముని నివసించిన ప్రాంతం కాబట్టి అతని పేరునే ‘మనాలి’గా ఏర్పడింది. అయితే ఒకప్పుడు దీనిని మనువాలయగా పిలిచేవారట. అంటే మను నివసించిన ప్రదేశం అని పేరు.

వాతావరణం...

మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్‌లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్‌లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్‌తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.

సాహసవీరులకు సేదతీర్చే...
ఇక్కడికి వచ్చే ఔత్సాహిక మంచు స్కేటర్స్‌కి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. సోలాంగ్‌ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాలు ఇక్కడ మంచు స్కయింగ్‌కి అనుకూలం. ఇక్కడ జనాభా మొత్తం 4,200 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హిందీ, హిమాచల్‌, ఇంగ్లీష్‌ భాషలు మాట్లాడతారు.

దుస్తులు...
మనాలి ప్రజలు పొడవైన ఉలెన్‌ కోటు వేసుకుంటారు. దానిని ‘చోళ’ అని పిలుస్తారు. నడుముకు కట్టుకునే బెల్టులా ‘డోరా’ అనే వెయిస్ట్‌ క్లాత్‌ కట్టుకుంటారు. ‘సుతాన్‌’ అనే టైట్‌ ప్యాంట్లను వేసుకుంటారు. ‘టోప’ అనే బ్లాక్‌ క్యాప్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. ‘లాచూ’ అనే బుజాలు కప్పుకునే ఒకరకం బ్లాంకెట్‌ కూడా వేసుకుంటారు. ఇవన్నీ చలినుంచి రక్షించే సాధనాలే అవడం విశేషం.

ఆహారం...
వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్‌ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్‌, రెడ్‌ రైస్‌ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.

వసతులు...
లెక్కకి మిక్కిలిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు ఉన్నాయి. ఎంత ఖర్చు పెడితే అంత... అన్నట్లుగా ఇక్కడ అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి అభిరుచుల మేరకు అన్ని వసతులను అందజేస్తుంటాయి ఇక్కడి హోటళ్ళు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను కూడా అందజేయటం ఇక్కడి హోటల్‌ యాజమాన్యాల ప్రత్యేకత. టూరిస్ట్‌లు కూడా వారి వారి రేంజ్‌ను బట్టి వారికి కావలసిన హోటళ్లలో దిగుతుంటారు.

ఎలా వెళ్లాలంటే...
మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్‌నగర్‌ నుంచి నేరో గేజ్‌ లైన్‌ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ చంఢీఘఢ్‌ దాకా ఉంది. చంఢీఘఢ్‌ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.

చూడదగిన ప్రదేశాలు బిజిలీ మహదేవ్‌ దేవాలయం...
సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో... కులు ప్రాంతానికి 10 కి.మీ. దూరంలో ప్రఖ్యాత బిజిలీ మహదేవ్‌ దేవాలయం ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కులు ప్రాంతంలో ఉన్న లోయల్లో మౌంటెనైఉ టెక్కర్స్‌కి ఆహ్లాదంగా ఉండటమే గాక వాళ్లలోని సాహసాపేక్షను ఈ ప్రాంతంలో పర్వతాలను అధిరోహించి మరీ తీర్చుకుంటుంటారు.

హిడింబి దేవాలయం...
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక్కడ భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి దేవాలయం ఉండటం. పైగా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండటం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండటం విశేషం.

రహల్లా జలపాతం...
సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్‌ కనుమ ప్రాంతంలో పర్యాటకులు నయాగారా జలపాతం చూసిన అనుభూతిని పొందుతారు. మనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్‌ మనాలి ప్రాంతం ఉంది. అక్కడ పురాతన కోటలు... సంప్రదాయ మను దేవాలయం చూడదగిన ప్రదేశాలు. వీటన్నితో మనాలి దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

హంపి






ఆంధ్రభోజుని అందాల నగరం హంపి
అహో ఆంధ్రభోజా… శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!

ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.


అనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతిని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా… ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు…
మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం…
హంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తైన గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృంగేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్పగా వర్ణసముదా యంతో చిత్రించారు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అందిస్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామాలయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

అలాగే అక్కడి నుంచి విఠలేశ్వరాలయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అంటారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారంభించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.


అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆలయ బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రించారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చెక్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆలయం మీద రామాయణ గాథకు సంబంధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడంతో ఈ ఆలయాన్ని సహస్రరామాలయం… అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం…
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాలలో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభించాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండకు మార్చాడు.

విఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది…

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే… ఓర చూపుల దేవి ఊరేగిరాగా… రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా…’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

ఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋలతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనోజ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగుడిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికిరువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వందలాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురంలో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసపడతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటే మాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
– దామర్ల విజయలక్ష్మి, అనంతపురం



సలేశ్వరం





సలేశ్వరం
ఒక దివ్య చారిత్రక ప్రకృతి..

సాధారణంగా ఒక టూర్‌లో దేవాలయాలను గాని, చారిత్రక ప్రదేశాలను గాని, ప్రకృతి రమణీయ ప్రదేశాలను గాని ఏదో ఒకటే చూస్తాం. కాని ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉండే అరుదైన ప్రదేశాల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవుల్లో ఉంది. పేరు సలేశ్వరం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేమార్గంలో 150 కిలోమీటర్ల మైలు రాయి దగ్గర ఫరహాబాద్ గేటు ఉంటుంది. అక్కడి నుండి 32 కి.మీ. దట్టమైన అడవుల్లోకి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌వారి అనుమతితో వెళ్లొచ్చు. 10 కి.మీ. వెళ్ళగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిల భవనాలు కనిపిస్తాయి.

నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు, చల్లదనానికి ముగ్దుడై వందేళ్ళకు ముందే అక్కడ వేసవి విడిదిని నిర్మించుకొన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి ఫరహాబాద్(అంటే అందమైన ప్రదేశం) అని పేరొచ్చింది. అంతకు ముందు దాని పేరు పుల్లచెలిమల (పులుల చెలిమలు). ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. 'టైగర్ సఫారీ' పేరిట ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులను, పులులను చూపిస్తారు.

నిజాం విడిది (రాంపూర్ చెంచుపెంట) చౌరస్తా నుంచి ఎడమకు తిరిగి 22 కి.మీ. వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్‌క్యాంప్ వస్తుంది. అక్కడ వాహనాలు ఆపుకోవాలి. అక్కడ నుండి సలేశ్వరం అనే జలధార (వాటర్‌ఫాల్స్)ను చేరుకోవడానికి 2 కి.మీ నడవాలి. రెండు పొడవైన, ఎత్తైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయక్కడ. ఆ గుట్టల మధ్య ఒక లోతైన లోయ (సుమారు అర కి.మీ.)లోకి ఈ జలధార దుముకుతుంది. తూర్పువైపున్న గుట్టను అర కిలోమీటరు దిగి (పశ్చిమం వైపుకి) తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమపు గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొసను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. అలా దిగేటప్పుడు మనలని ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి.

సలేశ్వరం జలధార:
కుండం ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడి నుండి కుండం నుండి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒకచోటయితే కేవలం బెత్తెడు దారి మీద నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడ జారితే భక్తుడు శివైక్యం చెందవలసిందే. కుండం (గుండం) చేరిన తరువాత అత్యంత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే రెండు గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండ మూతి నుండి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్లు తోస్తుంది.

జలధార కింద నేను, నా మిత్రుడు రామారావు స్నానం చేశాం. ఆ నీటి చల్లదనానికి ఒళ్ళు పులకించిపోయింది. దోసిళ్ళతో కడుపు నిండా నీళ్ళు తాగాం. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం వల్లనేమో ఆ రోజంతా మాకు ఆకలే కాలేదు. జలధార కింద కుండం, కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకొని రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కొద్దిగా దక్షిణంగా నడిచి కింది గుహలోకి వెళ్ళాం. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి.

జాతర ప్రత్యేకత
సలేశ్వరం జాతర సంవత్సరానికొకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు కొందరు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. భక్తులు దారి పొడవునా 'అత్తన్నం అత్తన్నం లింగమయ్యో', 'పోతున్నం పోతున్నం లింగమయ్యో' అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రక ఆనవాళ్లు
నాగార్జునకొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి (క్రీ.శ. 220 - క్రీ.శ. 360) శాసనాలలో 'చుళ ధమ్మగిరి' గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల కోసం ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ ధమ్మగిరి ఈ సలేశ్వరమేనేమోననిపిస్తుంది. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16" x 10" x 3" (పొడవు x వెడల్పు x ఎత్తు) అంగుళాలుగా ఉంది. ఇలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. 'చుళ' తెలుగులో 'సుల' అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరం (లేదా శూలేశ్వరం) గాను, చివరిగా సలేశ్వరంగానూ మారి ఉంటుందనిపిస్తుంది.

ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుండినుల (క్రీ.శ. 360-క్రీ.శ. 570) కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణం 10" x 10" x 3" అంగుళాలుగా ఉంటుంది. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల చిహ్నమగు 'పూలకుండి' శిలాఫలకం ఉంది. (అయితే అలాంటి కుండ శాతవాహనులకు, ఇక్ష్వాకులకు కూడా చిహ్నంగా ఉండేది.) ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తుగల నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలతో ఉంది. కుడి చేతుల్లో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరుకం, మరో ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది.

వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా, ఎడమవైపున స్త్రీ మూర్తి (?) ఉంది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలు(?) ఉన్నాయి. ఇవే పాతవిగా తోస్తున్నాయి. ఆ విగ్రహాల ముందర ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంది. గుడికి ఎడమ వైపున గల రాతి గోడకి బ్రాహ్మీలిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండూ విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్రకారులు చదివితే విష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చుననిపిస్తోంది.

'స్థల మహాత్మ్యం' అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్రమహాత్మ్య కావ్యంలో దీన్ని (సలేశ్వరం) రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్దిని (గుండం) బ్రహ్మకుండంగా పేర్కొన్నారు. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి నిరూపించారు కూడా.

క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర'లో 'శ్రీ పర్వత క్షేత్ర మహాత్మ్యం'లో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. 17వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర చెపుతోంది.

ప్రకృతి రమణీయత
భారతదేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండవ పెద్ద అడవులుగా పేర్గాంచాయి. ఈ అడవులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో 130 కి.మీ. తరువాత మన్ననూరులో ప్రారంభమవుతాయి. సముద్ర మట్టానికి సుమారు కి.మీ. ఎత్తున ఏర్పడడం వలన ఈ అటవీ ప్రదేశం చల్లగా ఉంటుంది. సలేశ్వరం దగ్గర్లోనే భూమి-గుట్టల సంగమ ప్రాంతం (వ్యూపాయింట్) ఉండటం వలన చల్లగాలులు వీస్తూ అలరిస్తాయి. ఇదే ప్రాంతంలో 'పులుల చెలిమలు' (పులులు నీరు తాగే కుంటలు) కూడా ఉండటం వలన గాలిలో చల్లదనం ఎక్కువ అవుతుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారిపొడవునా అలరిస్తాయి.

సలేశ్వరం లోయ సుమారు రెండు కి.మీ. పొడవుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కాన్యన్ అందాలను చాలామంది మెకనెస్‌గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటికోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనుడు చెప్పాడు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తరువాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్ళైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు.

అడవిలో ట్రాఫిక్ జామ్
సలేశ్వరం జాతరకు ఇంతకు ముందు స్థానిక ప్రాంతాలవారే పోయేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు రావడంతో అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ సంవత్సరమైతే రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ఈ జాతరను వీక్షించారని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దాంతో లింగమయ్య దర్శనానికి పర్యాటకులు గంటల తరబడి క్యూలో నిల్చోవలసి వచ్చింది.

ఇంతకు ముందు తిరుపతి దర్శనానికే అలాంటి పరిస్థితి ఉండేది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సివచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వార్త టీవీల్లో కూడా వచ్చింది. ఏప్రిల్ 17న సలేశ్వరానికి వెళ్ళిన మాకు అడవి నుంచి బయటకు రావడానికి ఐదు గంటల సమయం పట్టింది. ఐతే అర్థరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడం భలే ఆనందంగా అనిపించింది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ



గుంటుపల్లి






గౌతమి బుద్ధుని ఘనమైన గురుతు - గుంటుపల్లి

తెలుగునాట గౌతమ బుద్ధిని ఆనవాళ్లకు కొదువలేదు. అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ, ఘంటసాల ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థుని అడుజాడలు ఎన్నో చోట్ల మనకు దర్శనమిస్తాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో గుంటుపల్లి ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలోని ఈ చారిత్రక గ్రామం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలుగొందుతోంది. మన రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో ఒకటైన గుంటుపల్లి విశేషాలు మీకోసం…

ప్రాచీన కాలంలోనే బౌద్ధమత జీవన విధానం ఆంధ్రదేశంలో నలుదిశలా ఫరిఢవిల్లింది. రాజులు, చక్రవర్తులు ఎందరో సిద్ధార్థుని అడుగుజాడల్లో నడిచి ప్రజలకు నిస్వార్ధ సేవచేశారు. ఆ క్రమంలో ఆంధ్రదేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్టస్థానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. క్రీపూ 3వ శతాబ్దానికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయి. గుంటుపల్లిని కొన్నేళ్ల క్రితం వరకు కేవలం బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనం ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమైంది.

చారిత్రక నేపథ్యం…
గుంటుపల్లి ఊరి కొండలపైన ఉన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడవలసిన పురాతన అవశేషాలు గా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనిపించే ఎన్నో ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీపూ 300 నుండి క్రీశ 300 మధ్యకాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.

అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషకుల అభిప్రాయం. బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమిత మవ్వాలి కాని రసానుభూతి కాదు. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది. జీలకర్రగూడెం, కంఠ మనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధా రామాలు కనుగొన్నారు.

ఇవీ.. ఇక్కడి ప్రముఖ నిర్మాణాలు…
గుహాలయం:
క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపం (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణామార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాల్లాగా) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహార్‌లోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలుండడం విశేషం.

పెద్ద బౌద్ధ విహారం:
ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపాలు:
కొండపైని వివిధ ఆృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కు బడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపములు:
క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీపూ 19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికే వారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీటర్లు.

శిధిల మంటపం:
ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ. పూ 1 నుండి క్రీ శ 5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహం:
ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తు వరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంృత అధిష్టానము నాసిక్‌, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యం:
ఇది కూడా క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎతె్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ పూ 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ చైత్య గృహం 11 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉన్నది.

ఇటీవల వెలుగులోకి వచ్చినవి…
డిసెంబర్‌ 4, 2007వ సంవత్సరంలో… ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభానికి చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమైంది. ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి. నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడికారాలు, గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసినట్లు చెబుతున్న ఈ శిలాఫలకంలో ప్రాృత భాషలో ఉన్నది. కేంద్ర పురావస్తు శాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది.



పర్యాటకులకు ఆహ్లాదం పంచే "తలకోన" జలపాతం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

తలకోన ప్రాంత విశేషాలు
ప్రసిద్ధ నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ తలకోన జలపాతం ఉండడం విశేషం. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్యభాగంలో జలపాతం ఉండడం వల్ల ఇక్కడకు చేరుకునే పర్యాటకులకు అదోరకమైన చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే ఇక అక్కడి నుంచి కదిలిరావడానికి పర్యాటకులకు మనస్సు అంగీకరించదు.

తలకోన జలపాతాన్ని సందర్శించే ముందు ఆ ప్రాతంలో ఓ శివాలయం ఉన్నది. ఇక్కడ శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. స్వామివారితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులు తీసుకువెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆపై జలపాతం వద్దకు చేరుకోవాలంటే నడకబాట పట్టాల్సిందే.

కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతాన్ని మనం సందర్శించవచ్చు. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాత దృశ్యం బహు అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలాంటి ప్రదేశంలోని నీటిలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

తలకోనలో వసతి సౌకర్యాలు
జలపాతానికి ముందుగా ఉన్న ఆలయం ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖచే నిర్మించబడిన ఓ అతిధి గృహం ఉంది. ఇది తప్ప ఇక్కడ చెప్పుకో దగ్గ సౌకర్యాలు లేదు. ఆలయానికి ముందు భాగంలో పూజా సాముగ్రి విక్రయించే చిన్న దుకాలు రెండో మూడో ఉన్నాయి. అలాగే ఆలయానికి పక్కగా ఓ చిన్న హోటల్ అందుబాటులో ఉంది.

తలకోనకు వెళ్లే చాలామంది పర్యాటకులు తినే పదార్ధాలను తమతోనే తీసుకువెళ్తారు. తినే పదార్ధాలు ఏమీ తీసుకుని వెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్‌లో ముందుగానే చెబితే భోజనాన్ని సమకూరుస్తారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు.

అలాగే పర్యాటకుల్లో ఏ కొద్దిమందో తప్ప మిగిలినవారు సాయంత్రానికి సమీపంలోని గ్రామానికి లేదా సొంత ప్రదేశానికి పయనమవుతారు.

రవాణా సౌకర్యాలు
తిరుపతి పట్టణం నుంచి తలకోన 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి యెర్రావారిపాళెం చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారిపాళెం వరకు ఎళ్లప్పుడూ బస్సు సౌకర్యం ఉండగా అక్కడి నుంచి తలకోనకు చేరడానికి వ్యాన్, ఆటోల సౌకర్యం ఉంది. సినిమా షూటింగ్‌లకు తలకోన పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు ఏడాదిలో చాలారోజులు షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి.

అందాలొలికే అనంతగిరి

రాష్ట్రంలో ఉక్కు నగరంగా పేరుగాంచిన సుందర నగరం విశాఖ. ఈ అందమైన తీర ప్రాంత పట్టాణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. ప్రశాంతమైన ప్రకృతి నడుమ... దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, సుందర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ శీతలంగా ఉండటమే కాకుండా ఎంతో నయానందకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. రాష్ట్రంలో పేరొందిన హిల్‌ స్టేషన్లలో ఒకటి ఈ అరకు అనంతగిరి. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండల పై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి.

ముఖ్యంగా కొత్తగా పెళైన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసి నా సుగంధ సుమధుర పరిమళాలను అందించే కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనంద సాగరంలో ఓలాడిస్తుంది. అంతేకాకుండా రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పండ్ల తోటలు మాత్రమే కాకుండా వనమూలికలు కూడా లభ్యమవటం విశేషం. 

దక్షిణ బధ్రీనాథ్‌... 
ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలారావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది.

ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి. 

కోరిన కోరికలు తీర్చే... అనంత పద్మనాభుడు...
ప్రకృతి రమణీయతను విశేషంగా కలిగి ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చే యాత్రికులను భక్తి పారవశ్యంలో నింపుతుంది ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికు లు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిప డేస్తున్నట్లుగా ఉంటాయి. 

ఇలా వెళ్ళాలి...
అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే... ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్‌ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...