Wednesday, 19 April 2017

ఉపమాక వేంకటేశ్వరాలయం





ఉపమాక వేంకటేశ్వరాలయం
ఉపమానం చెప్పలేని వేల్పు వేంకటేశ్వరుడు

ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. ‘కలౌ వేంకటనాయక’ అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఉపమాక వేంకటేశ్వరస్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినవారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్లి తీరతారని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బందుర సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనదని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు.

క్రీ.శ. ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని, 11వ శతాబ్దంలో రామానుజులవారు ఈ ఆలయాన్ని దర్శించారనీ తెలుస్తోంది.

స్థలపురాణంద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రతీరంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వేంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా, దక్షిణ సముద్ర తీరమంతా అరణ్యప్రాంతమని, అక్కడ అడవి  జంతువులుగా జన్మిస్తే, తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. మాట నిల»ñ ట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు... ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి, ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.

ఆరు భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం:ఇక్కడి వేంకటేశ్వరుడు ఆరు భుజాలు, పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయ ముద్రలో ఉంటూ, భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చుని, క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేంచేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది.

ఎక్కడ ఉంది?విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం క్రీ.పూ 6వ శతాబ్దానికి చెందినది. తుని – విశాఖపట్టణం ప్రాంతాలకు మధ్యగా ఎన్‌హెచ్‌ – 5 నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది ఉపమాక గ్రామం.

స్వామి దర్శనం17, 18 శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతో ముచ్చటపడి విలువైన పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని చేయించుకున్నాడట. ధారణకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముందు రోజు రాత్రి ఆ రాజుకి కలలో స్వామి దర్శనమిచ్చి, ‘ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా, నాకు సమర్పించకుండా నువ్వు ఎందుకు ధరించాలనుకుంటున్నావు’ అని అడిగాడట. పశ్చాత్తాప పడిన రాజు మరునాడు ఊరేగింపుగా ఉపమాక వచ్చి స్వామి వారికి కిరీటం సమర్పించాడట.

క్షేత్ర విశేషాలుగరుడాద్రి పర్వతంపై గుర్రంపై వేటకు వెళ్తున్న రూపంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ఎదురుగా ఉన్న బందుర సరస్సులో బ్రహ్మ తపస్సు చేశాడట. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు∙ స్వామి వారు పగలు తిరుపతిలోను, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరి (విశ్రాంతి కోసం) ఉంటారని క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. అందువల్లే ఉదయం 5గం.లకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి, పూజాదికాలు నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు∙ కొండ దిగువన బేడా మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులు, పక్కన ఉపాలయంలో ఆండాళ్లమ్మవారు కనువిందు చేస్తారు∙ బందుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

స్వామివారికి కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలు, నవరత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు∙ అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తర ద్వారదర్శనం, ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది∙ దూరం నుంచి ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు∙ భక్తులు దగ్గరుండి మూలవిరాట్‌కు అనునిత్యం పంచామృత అభిషేకం  చేయించుకోవచ్చు.

పంచామృతాభిషేక సమయంలో స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే, సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం∙ స్వామివారికి తమ కోరికను విన్నవించి, అది నెరవేరిన తరవాత కాలి నడకన కొండపైకి వస్తాననుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, నెరవేరిన వెంటనే కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని స్థానికులు చెబుతారు∙ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్‌ స్వామివారు భారతదేశంలో ప్రతిష్ఠించిన 108 స్థూపాలలో ఇది 48వది.

ఎలా చేరుకోవాలి?రోడ్డు మార్గం
రైల్వే స్టేషన్‌ నుంచి 4 కిలోమీటర్లు∙ రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి గంటగంటకూ ఆర్టీసీ బస్సులు∙ తుని, యలమంచిలి ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కువగా ఉన్నాయి∙ నర్సీపట్నం రోడ్, అడ్డ రోడ్, నక్కపల్లి ప్రాంతాల నుంచి సర్వీస్‌ ఆటోలు నడుస్తూనే ఉంటాయి.
రైలు మార్గంచెన్నై – కలకత్తా మార్గంలో తునిలో దిగితే, అక్కడ నుంచి 20 కి.మీ. దూరం∙
కొన్ని రైళ్లు నర్సీపట్నం రోడ్‌ స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడి నుంచి ఉపమాక గ్రామం కేవలం 4 కి.మీ.

డా.పురాణపండ వైజయంతి



Tuesday, 18 April 2017

కదిలె పాపహరేశ్వరుడు

సప్తగుండాల నడుమ కదిలె పాపహరేశ్వరుడు

కదిలె పాపహరేశ్వర క్షేత్రం

సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో పచ్చటి అడవి అందాల ప్రకృతి ఒడిలో... మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై వెలిసిన స్వయంభూ లింగాకారుడాయన. తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. అదే కదిలె పాపహరేశ్వర క్షేత్రం. తన భక్తుడి పరమభక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఈ ఆలయానికి.. ఈ ప్రాంతానికీ ‘కదిలె’ అని పేరొచ్చింది. తన భక్తుడిని పాపవిముక్తుడిని చేయడంతో స్వామి పాపహరేశ్వరుడయ్యాడు. దట్టమైన అడవులు.. ఎల్తైన కొండల నడుమ కొలువైన ఈ శివాలయంలో ఎన్నో విశేషాలు, వింతలు, ఏకశిలతో చేసిన శిల్పకళాకృతులు ఉన్నాయి.

అంతేకాదు, ఎల్తైన కొండలపై బండరాళ్లలో ఏడాదిపొడవునా ఎండిపోకుండా ఒకే లాంటి జలధారతో ఉండే ఋషిగుండం ప్రధానమైంది. ఇందులోనే పరశురాముడు నిత్యస్నానమాచరించి పాపన్నను పూజించాడు. పక్కపక్కనే ఉన్నా ఒకదాంట్లో వేడిగా, మరోదాంట్లో చల్లగా ఉండే సూర్య, చంద్ర గుండాలు.. పాలవలె తెల్లని నీళ్లతో గల పాలగుండం, ఎంతటి శతృత్వం ఉన్నా.. తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కలిపేసే అత్తాకోడళ్ల గుండం... తీర్థాన్ని తలపించే నీళ్లుగల తీర్థగుండం వీటన్నింటితో పాటు ఆవు మూతి నుంచి జలధార వచ్చే ఆవుమూతి గుండం (గో పుష్కరిణి) ఇక్కడి సప్తగుండాలు.

పాపవిముక్తుడైన పరశురాముడు
మాతృహత్యా పాతకం నుంచి తనను విముక్తుని చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ... 31 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఇక దక్షిణ దిశగా బయలుదేరిన పరశురాముడు గోదావరి తీరప్రాంతమైన ప్రస్తుత నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరాడు. ఇక్కడనే తన తల్లి రేణుకా ఎల్లమ్మని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం దిలావర్‌పూర్‌ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎల్తైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ప్రదేశంలో తపస్సుకు ఉపక్రమించాడు. నల్లనిరాళ్ల మీదుగా పారుతోన్న సెలయేరు... చల్లటి, వేడి, పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాల (చిన్న కోనేరు) కలిగిన ఈ ప్రాంతం ఆయనను అమితంగా ఆకట్టుకుంది.

అక్కడే స్వయంభూగా వెలసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోరతపస్సుకు లింగాకారంలో ఉన్న శివుడు కదిలాడు. దీంతో పరశురాముడు‘శివయ్య కదిలె... శివయ్య కదిలె...’అంటూ పరవశించిపోయాడు. సప్తగుండాలలో స్నానంచేసి, శివయ్యను కొలవడంతో పరశురాముడి పాపమూ పోయింది. దీంతో ఈ ఆలయానికి, ప్రాంతానికి కదిలెగా... ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఇప్పటికీ భక్తులు ‘కదిలె పాపన్న’గా పిలుస్తారు. నాలుగువందల ఏళ్లక్రితం నిమ్మల పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

అపమృత్యుదోషాలు తొలగించే అన్నపూర్ణ
కదిలñ  పాపహరేశ్వరుడు మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వెనుకభాగంలోనే అమ్మవారు కొలువయ్యారు. మాతాన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల, అపమృత్యుదోషాలు, అన్ని సమస్యలూ తొలగిపోతాయని స్థల పురాణం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులూ దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం  ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత.

ఇక్కడ ఉంది
నిర్మల్‌ జిల్లాకేంద్రం నుంచి మొత్తం 21 కిలోమీటర్ల దూరంలో కదిలె  ఆలయం ఉంది. నిర్మల్‌ నుంచి భైంసా వైపు వెళ్లే 61నంబరు జాతీయరహదారిపై నిర్మల్‌ నుంచి 15కిలోమీటర్ల దూరంలో దిలావర్‌పూర్‌ మండలకేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి కదిలె 7కిలోమీటర్లు. ఈ 7కిలోమీటర్లూ ఎల్తైన గుట్టలపై వంపులతో కూడిన ఘాట్‌రోడ్లు, చుట్టూ పచ్చటి అడవులు, స్వచ్ఛమైన పల్లెల గుండా సాగుతుంది. లోయవంటి ప్రదేశంలో చుట్టూ దట్టమైన అడవిలో పాపహరేశ్వరాలయం ఉంటుంది. అభినవ శ్రీశైలంగా ప్రాశస్త్యం కలిగిన కదిలె పాపహరేశ్వారాలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, నిత్యాన్నదానం ఉంటాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు.

ఏకశిలతో మహానంది
పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ ఏకశిలలో కొలువయ్యాడు. నల్లని ఏకశిలతో అందమైన అభరణాలతో నందీశ్వరుడు ఆకట్టుకుంటాడు.

ఎలా కదలాలంటే..?
హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వైపు వెళ్లే 44నంబరు జాతీయ రహదారిపై దాదాపు 250 కి.మీ. దూరంలో నిర్మల్‌ జిల్లా కేంద్రం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ల నుంచి నేరుగా నిర్మల్‌ జిల్లాకేంద్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నిర్మల్‌ నుంచి కదిలె ఆలయం 21కి.మీ. దూరం వస్తుంది. నిర్మల్‌ నుంచి భైంసావైపు వెళ్లే 61నం. జాతీయరహదారిపై గల దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి 7కి.మీ. దూరంలో గల కదిలెకు చేరుకోవచ్చు. భక్తులు సొంత వాహనాలను కదిలె ఆలయ పరిసరాల వరకూ తీసుకెళ్లవచ్చు.

పాపహరేశ్వరుడి ప్రత్యేకతలెన్నో..
కదిలెలో వెలసిన పాపహరేశ్వరాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని ఏ ఆలయం చూసిన తూర్పు లేదాæ.. ఉత్తరం వైపు ముఖాలను కలిగి ఉంటాయి. కానీ ఈ కోవెల పశ్చిమ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం. పశ్చిమదిశకు అధిపతి అయిన శనేశ్వరుడితో తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పీడించవద్దని ఆదేశించేందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఇలా ఉన్నాడని చెబుతారు. దేశంలో ఇలా పశ్చిమదిశగా ఉన్న శివాలయం ఒకటి కశ్మీర్‌లో ఉంటే.. రెండోది కదిలె ఆలయమే.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 రకాలైన చెట్లన్నీ కలిసి ఒకే వటవృక్షంగా ఉండటం కదిలెకున్న మరో విశేషం. మర్రి, వేప, రావి, జీడి, మద్ది, టేకు.. ఇలా 18 రకాలైన చెట్లు ఒకే వటవృక్షంగా ఉంటాయి. ఈ చెట్టు ఎన్నేళ్లదో ఎవరికీ తెలియదు. దీనిపై పరమశివుడి మెడలో ఉండే నాగుపాము ఉంటుందని, ప్రతీ అమావాస్య, పౌర్ణమి రోజున దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం.
– ఆర్‌.శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

Monday, 10 April 2017

కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!


కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!





లంబసింగి - దక్షిణాది కశ్మీర్‌!
తెలుగురాష్ట్రాల్లోకెల్లా అత్యంత చల్లని ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే లంబసింగి తరవాతే మిగిలినవన్నీ. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామమే లంబసింగి. ఆంధ్రా కశ్మీరుగా పేరొందిన లంబసింగిలో డిసెంబరు - జనవరి నెలల్లో ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలకూ పడిపోతుంది. మిగిలిన కాలాల్లో పది డిగ్రీల సెల్సియస్‌కు మించదు. చలికాలంలో అయితే పదిగంటల తరవాతే సూర్యోదయం. చిత్రంగా ఈ వూరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వాతావరణం యథాప్రకారంగానే ఉంటుంది. వేసవిలో అరకులోకన్నా చల్లగా ఉండే ఈ ప్రదేశంలో ఎటు చూసినా చిక్కని పచ్చదనం పరిచినట్లే ఉంటుంది. ఈ ప్రాంతానికే కొర్ర(కర్ర)బయలు(బయట) అని పేరు. ఎవరైనా పొరబాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారట. అక్కడి దట్టమైన అడవుల్లోని చెట్ల మధ్యలోంచి నడుస్తుంటే ఇంగ్లిష్‌ కవి Robert Frost చెప్పిన 
The woods are lovely, Dark and Deep. అన్న కవిత తప్పక గుర్తొస్తుంది. అక్కడున్న పొడవాటి చెట్ల మధ్యలోని చల్లని వాతావరణం కారణంగానే ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటల పెంపకాన్ని చేపట్టింది అటవీశాఖ. పక్షిప్రేమికులకీ ఇది ఆటవిడుపే. పక్షుల కుహుకుహురాగాలు సందర్శకులకు వీనులవిందు కలిగిస్తుంటాయి. దీనికి 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాత అందాలు గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ ఓ నాలుగు రోజులపాటు ఉండాలనుకునేవాళ్లు చింతపల్లిలో ఉండొచ్చు. చింతపల్లి నుంచి సీలేరు ఘాట్‌రోడ్డు ప్రయాణంలో మబ్బులు మనముందే పరుగులుతీస్తూ మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా మంచుపడుతూ మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే వేసవిని ఆస్వాదించాలనుకునే ప్రకృతిప్రియులు లంబసింగి దారి పడుతున్నారు. కాబట్టి ఆ చల్లని ప్రదేశంలో గడపాలనుకునేవాళ్ల పాలిట స్వర్గధామం ఈ చల్లని కొండగ్రామం!

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 571, విశాఖపట్టణానికి 101, చింతపల్లికి 19, నర్సీపట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి బస్సు, ట్యాక్సీల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్లేవాళ్లు విశాఖపట్టణం వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి బస్సు, ట్యాక్సీల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.




అరకులోయ
పచ్చకోక కట్టుకున్న తూర్పుకనుమల సిగలో విరిసిన మరో ముగ్ధసింగారమే అరకులోయ. పొగమంచు జలతారు ముసుగేసుకుని, గిరిజనుల థింసా నృత్యగానాలతో పర్యటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది. ఓ పక్క కొండల మధ్యలోంచి దూకే జలపాతాలూ మరోపక్క ఆవులిస్తున్న లోయలూ ఇంకోపక్క చీకటి సొరంగాలూ ఎటుచూసినా ప్రకృతి సుందరి అందాలే. చుట్టూ కొండలూ ఆ మధ్యలోని లోయలో విరిసిన వలిసెపూల అందాలను చూడాలంటే మాత్రం చలికాలం ప్రారంభంలోనే అరకులోయకి ప్రయాణం కట్టాలి. అడవిబిడ్డల మధ్యలో అక్కడి చల్లని వాతావరణంలో ఓ నాలుగురోజులపాటు సేదతీరాలనుకునేవాళ్లు మాత్రం ఎప్పుడైనా బయలుదేరవచ్చు. 36 సొరంగాలు దాటుకుంటూ వెళ్లే విశాఖ - అరకులోయ రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. అరకు వెళ్లే దారిలోనే ప్రాచీనకాలంనాటి బొర్రాగుహలు రాతియుగానికి తీసుకెళ్లిపోతాయి. కాలచక్రం ఓసారి గిర్రున వెనక్కి వెళ్లిపోయి, వేల సంవత్సరాల క్రితం మనిషి జాడల్ని పోల్చగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించకమానదు. ఇక, అక్కడి బొంగు చికెన్‌ రుచి సరేసరి.

బొర్రా గుహల నుంచి కారు లేదా బస్సులో ఘాట్‌రోడ్డులో అరకుకు ప్రయాణం నగరజీవిలోని ఒత్తిడినంతా చేత్తో తీసేసినట్లుగా మాయం చేస్తుంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే ఎత్తైన సిల్వర్‌ ఓక్‌ చెట్లూ వాటికి పాకించిన మిరియాల పాదులూ ఆ మధ్యలోని కాఫీ పొదలూ ఎటుచూసినా ఆటవిడుపే. ఆ కాఫీ తోటలకు ఓ పక్కగా ఆగి, అక్కడి గిరిజన యువతులు అందించే కాఫీని రుచి చూడకపోతే అరకు పరిసరాల్ని అవమానించినట్లే. ఆ చల్లని కొండల్లో వేడి వేడి కాఫీ గొంతు దిగుతుంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇదే అనిపించక మానదు. వంపులు తిరిగిన ఘాట్‌రోడ్డు మెలికలన్నీ దాటుకుని, విశాలమైన మైదానాన్ని తలపించే లోయలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తే ఓ వరసలో పేర్చినట్లుగా గాలికొండ, రక్తకొండ, సుంకరిమెట్ట, చిటమోంగొండి కొండలు కనువిందు చేస్తాయి. తూర్పుకనుమల్లో కెల్లా ఎత్తైన జింధగడ శిఖరం ఇక్కడే ఉంది. లోయలో నుంచి కొండల్లోకి ఒరిగిపోతున్న సూర్యాస్తమయ, సూర్యోదయ దృశ్య అందాల్ని చూసి తీరాల్సిందే. అరకులోయలో నిర్మించిన ట్రైబల్‌ మ్యూజియం, కళాగ్రామాలు గిరిపుత్రుల సంస్కృతీసంప్రదాయాలూ కళలకూ అద్దం పడతాయి. అక్కడే రంగురంగుల పూలసోయగాలూ గులాబీల గుబాళింపులతో కొలువుదీరిన పద్మనాభపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో తిరుగుతుంటే సమయమే గుర్తుకురాదు.

తరవాత సరిగ్గా ఇక్కడకు 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరి కొండల్నీ అక్కడి కాఫీతోటల్నీ ఉరకలెత్తే జలపాతాల్ని కూడా చుట్టేయ్యొచ్చు. పాడేరు వెళ్లే దారిలోని చాపరాయి, కటికి జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆ కొండల్లోని అందాలను వీక్షిస్తూ నాలుగురోజులు ఉండాలనుకునేవాళ్లకోసం పర్యటక శాఖ రిసార్టులతోబాటు ప్రైవేటు హోటళ్లూ లాడ్జ్‌లూ వున్నాయక్కడ. అనంతగిరికి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలోని తైడలో జంగిల్‌బెల్స్‌ రిసార్టులోనూ సేదతీరవచ్చు. అరకులోయలోనూ ప్రభుత్వ అతిథి గృహాలతోబాటు ప్రైవేటు హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముందుగానే వాటిని బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

ఎలా వెళ్లాలి:
విశాఖపట్టణం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకు ఉదయాన్నే రైలు ఉంటుంది. ఆ రైల్లో బొర్రా గుహల వరకూ వెళ్లి, వాటి సందర్శన అనంతరం కాఫీతోటలమీదుగా బస్సు లేదా ప్రైవేటు వాహనంలో అరకులోయకు చేరుకోవచ్చు. తిరిగి విశాఖకు వచ్చేటప్పుడు కారు లేదా బస్సులో వస్తే ఘాట్‌రోడ్డు అందాలను వీక్షించవచ్చు.




హార్స్‌లీ హిల్స్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నైరుతీదిక్కున ఉన్న మరో చల్లని కొండ ప్రదేశమే హార్స్‌లీ హిల్స్‌. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం చెంచు తెగలకీ పుంగనూరు ఆవులకీ పెట్టింది పేరు. ఆంధ్రా వూటీగానూ పేరొందిన దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మకొండ. ఒకప్పుడు ఇక్కడ నివసించే మల్లమ్మ అనే బాలిక, ఏనుగుల్ని సంరక్షిస్తుండేదట. అక్కడ నివసించే చెంచులకి ఏదైనా జబ్బు చేస్తే మందు ఇచ్చేదట. ఉన్నట్లుండి ఒకరోజు ఆ అమ్మాయి ఆకస్మికంగా మాయమైపోవడంతో ఆమెనో దేవతగా భావించి గుడి కట్టించి పూజించసాగారట చెంచులు. అందుకే దీనికా పేరు. తరవాత కడప జిల్లా కలెక్టరుగా వచ్చిన బ్రిటిష్‌ ఆఫీసరు విలియం డి.హార్స్‌లీ ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చేయడంతో ఇది హార్స్‌లీ హిల్స్‌గా స్థిరపడిపోయింది.

సముద్రమట్టానికి 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వందలకొద్దీ పక్షిజాతులూ ఎలుగుబంట్లూ సాంబార్లూ పాంథర్లూ అడవికోళ్లూ వంటి జంతువులూ; ఎర్రచందనమూ బీడీ కుంకుడూ సీకాయా దేవదారూ వెదురూ వంటి చెట్లకు నిలయమైన కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ; పర్యావరణ ఉద్యానవనమూ; మల్లమ్మ ఆలయం... ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఎత్తైన యూకలిప్టస్‌ చెట్ల నుంచి వీచే చల్లని గాలీ కాఫీ తోటల ఘుమఘుమలూ సందర్శకుల్ని మైమరిపిస్తాయి. దేశంలో జోర్బింగ్‌ క్రీడను అందించే అతికొద్ది ప్రదేశాల్లో ఇదీ ఒకటి. అయితే దీనికోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌... వంటి ఆటలకీ ఇది నెలవే. ఇక్కడకు దగ్గరలోనే గాలిబండ, వ్యూపాయింట్‌, పడవల్లో విహరించే గంగోత్రీ సరోవరం, మదనపల్లి శివాలయాల్నీ సందర్శించవచ్చు. పర్యటకశాఖవారి హరిత అతిథి గృహాలతోబాటు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా ఉంటాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 531 కి.మీ., తిరుపతి నుంచి 128, మదనపల్లె నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే ములకలచెరువు స్టేషన్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి, మదనపల్లిల నుంచి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.



అనంతగిరి
వికారాబాద్‌ సమీపంలో ఉండే అనంతగిరి ఏడాది పొడవునా సందర్శించదగ్గ ప్రదేశం. నిండైన ఆకుపచ్చ చీర కట్టుకున్న ఈ సుందరసీమలో ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు మించదు. అయితే చినుకులు మొదలయ్యే సమయంలో ఇది మరింత అందంగా కనువిందు చేస్తుంటుంది. మనిషి జీవించిన అత్యంత ప్రాచీన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీన గుహలూ మధ్యయుగంనాటి గుడులు పచ్చని అడవులూ జలపాతాలతో మనసును మరోలోకంలో విహరింపజేస్తుందీ ప్రదేశం. అప్పట్లో ఓ ముస్లిం చక్రవర్తి ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కట్టించడం విశేషం. అన్నింటికన్నా ప్రాచీనకాలంనాటి ఈ ఆలయ సందర్శన భక్తులకు ఆనందపారవశ్యాన్నీ కలిగిస్తుంది. ఇక్కడి కొండల్లోనే పుట్టిన ముచికుందా నది హైదరాబాద్‌ గుండా మొత్తం 240 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండజిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడికి సమీపంలోనే ఉన్న నాగసముద్ర సరోవరంలో పర్యటకులు పడవ షికారుకి వెళ్లవచ్చు. ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌..వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌కు సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరికి బస్సు సౌకర్యం ఉంది. కారులోనూ బైక్‌ మీదా కూడా వెళ్లి రావచ్చు.



ఇవేకాదు, అటు స్వామికార్యం ఇటు స్వకార్యం రెండూ నెరవేరాలనుకునేవాళ్ళకోసం శేషాచలకొండల్లో వెలసిన తిరుమల వెంకన్ననీ, నల్లమల కొండల్లో కొలువైన శ్రీశైల మల్లన్ననీ సందర్శించి, అక్కడి పుణ్యతీర్థాల్లో మునకలేసి, ఆ కొండగాలిలో తేలివచ్చే అడవిపూల పరిమళాల్నీ చెట్ల చల్లదనాన్నీ ఆసాంతం ఆస్వాదించి రావచ్చు. ఆధ్యాత్మిక చింతనతోబాటు ట్రెక్కింగులు చేయాలనుకునే సాహసికులకీ ఈ పుణ్యక్షేత్రాలు నిలయాలే. ఇంకెందుకు ఆలస్యం... ఆనందంగా విహరించండి!

Friday, 7 April 2017

కాశీకి..పోయాము లింగా!





కాశీకి పోయాము లింగా!


భారత్‌లో ఆధ్యాత్మిక పరమైన భక్తి భావనలు కలిగించే హిందూయాత్రా స్థలాలలో కాశీ (వారణాసి, బెనారస్) అతి విశిష్టమైన, పవిత్రమైన పుణ్య క్షేత్రంగా చెప్తుంటారు. కాశీకి పోయినోడు కాటికి పోయినట్లే అనే నానుడి మా చిన్నతనంలో వింటుండే వాళ్లం. అయితే ఈ ఆధునికయుగంలో, అద్భుతమైన శాస్త్ర, సాంకేతిక ప్రగతి సాధించిన నేటికాలంలో పై మాటలకు అర్థం లేకుండా పోయింది. భూ, వాయు మార్గాలలో పయనించి కాశీ విశ్వనాథుని దర్శించుకుని స్వల్ప సమయంలోనే క్షేమంగా తిరిగి రావచ్చు.




మా కాశీయాత్ర ఫిబ్రవరి 20 తేదీన ప్రారంభై మార్చి 3వ తేదీతో ముగిసింది. ఈ యాత్రలో కాశీతో పాటు అలహాబాద్, ప్రయాగ, గయ - బుద్ధగయ, అయోధ్య, వింధ్యాచల్ లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాలు గల ప్రాంతాలను దర్శించాం. కాశీ గోల్డెన్‌గా ప్రఖ్యాతి పొందిన ఆలయంలో జ్యోతిర్లింగాలలో ప్రప్రథమంగా వెలసిందిగా భావిస్తున్న శ్రీ విశ్వనాథుడు కాశీ విశ్వానాథునిగా ఖ్యాతి పొందాడు. మహ్మదీయులు ముఖ్యంగా ఔరంగజేబు సృష్టించిన విధ్వంసాల పరంపరను తట్టుకుని నిలిచి లక్షలాది హిందువులను వందల సంవత్సరాలుగా ఆకర్షిస్తున్నది విశ్వనాథుని జ్యోతిర్మయ శివలింగం. ఇది గొప్ప శక్తిమంత, మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇన్ని గంగా జలాలు, ఇంత భస్మంతో సంతృప్తి చెందెదవా పరమేషా అనుకుంటూ భక్తులు పవిత్ర గంగా జలాలతో అభిషేకిస్తుంటారు. ఇటీవల పవిత్ర మహా శివరాత్రి రోజున భక్తులంతా సుమారు ఐదు గంటలు క్యూలైన్లలో నిల్చుని ఆ విశ్వనాథుని, ఆ పరమశివున్ని దర్శించుకున్నారు.

శ్రీ విశ్వనాథుని గోల్డెన్ టెంపుల్‌కు అతి సమీపంలోనే సర్వ సంపదల దాత, మాతా అన్నపూర్ణేశ్వరీ మాత ఆలయం ఉంది. మరికొంత దూరంలో లక్ష్మీ స్వరూమైన దేవి విశాలాక్షి ఆలయం ఉంది. శ్రీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని దర్శించిన వారికి ఉత్తమగతులు కలుగునని చెప్తుంటారు.

ఇవేగాక కాలభైరవ్, మాత దుర్గాదేవి, బిర్లా టెంపుల్, సారనాథ్, తులసీ మానస మందిర్, సంకట యోచన మందిర్, దుండిరాజ్ గణేష్, భారతమాత మందిర్‌లు ఉన్నాయి.

బుద్ధుడు తాను గయలో పొందిన జ్ఞానోదయ ఫలితమైన బుద్ధిజాన్ని తన శిష్యులకు బోధించిన స్థలం సారనాథ్. ఇక్కడ థాయ్‌లాండ్, చైనీస్, జపాన్, బర్మా దేశాల ఆలయాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందే బెనారస్(కాశీ)లో పండిట్ మదన్ మాలవ్యా స్థాపించిన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశ్వనాథుని టెంపుల్, విద్యాలయం స్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా విగ్రహం కూడా ఉన్నాయి.

సిరిగలవానికి..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్..
అని శ్రీనాథ కవి అన్నట్లు విశ్వనాథుని సిగలో నుంచి దుమికి పడి లేచినట్లుగా కాశీని ఒరుసుకుని ప్రవహించే గంగా నది దానికి మరింత పవిత్రతను చేకూరుస్తున్నది. బోటులో గంగానదిలో తిరుగుతూ 64 ఘాట్‌లను పరిశీలిస్తూ బోటులోనే కూర్చుని సాయంత్రం 7 గంటలకు గంగమ్మ తల్లికి సమర్పించే హారతిని తిలకించడం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. అతి ముఖ్యమైందిగా చెప్పుకుంటున్న మణి కర్ణికా ఘాట్‌లో స్నానం చేశాం. ప్రధాని మోదీ వాగ్దానం చేసిన గంగానది ప్రక్షాళన ఏది? ఎక్కడ? అది ఎన్నికల వరకేనా అన్న సందేహం కలుగుతుందిప్పుడు అక్కడి పరిస్థితిని చూసినప్పుడు. మరోరోజు అలహాబాద్ ప్రయాగ ప్రయాణమై అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించినాం. గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలమే త్రివేణి సంగమం. ఇక్కడ గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం చేయడం ఆచారంగా వస్తుంది. అలహాబాద్‌లో మరో చారిత్రక ప్రాధాన్యం గల స్థలం.. ఆనంద్ భవన్. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1927లో దీన్ని నిర్మించారు. ఈ భవనం స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. ఆ భవనంలో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైనది. గాంధీ నివసించిన గది, నెహ్రూ గది, ఆయన తనయ ఇందిరా ప్రియదర్శిని గది వేర్వేరుగా ఉన్నాయి. ఆ రోజుల్లో వారు వాడిన వస్తువులు, రాసిన పుస్తకాలు వంటివి ఎన్నో భద్రపరిచి ఉన్నాయిక్కడ.

1963లో నెహ్రూ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా, నెహ్రూపై నాకు గల అభిమానంతో ఈ తీర్మానాన్ని విమర్శిస్తూ నేను రాసిన ఓ ఆర్టికల్ నాటి కృష్ణా పత్రికలో అచ్చవటం, 1964 మే 27న మధ్యాహ్నం నల్లగొండలో ఆంగ్లవార్తలు విని అటు నుంచి కదలబోగా ఓ ప్రత్యేక బులెటిన్ ద్వారా ప్రధాని మరణించారన్న వార్త విని తట్టుకోలేక బోరున విలపిస్తున్న బజార్‌గుండా నా గదికి పరుగెత్తిన జ్ఞాపకాల పుటలు నా మదిలో రెపరెపలాడగా హృదయం బరువెక్కింది.

ఇంకోరోజు గయ ప్రయాణం. గయాసురుడనే రాక్షసుని పేరుతో గయ పేరు ప్రసిద్ధి నొందినట్లు చెబుతారు. ఇక్కడ వెలసిన విష్ణు పాద మందిరం, శక్తిపీఠ మంగళగిరి ఆలయం సందర్శనీయ స్థలాలు. ఇక్కడ సైతం పిండ ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. నా పితృ పాదులకు పిండ ప్రదానం గావించాను.

ఇక్కడ మరో విశేషం.. గౌతముడు జ్ఞానోదయం కలిగి బుద్ధుడుగా పరిణితి చెందిన స్థలం బుద్ధగయ. బౌద్ధ ఆలయంలోని బుద్ధ విగ్రహాన్ని దేశ, విదేశీ బౌద్ధ సన్యాసులే గాక ఇతర ప్రజలు సైతం సందర్శిస్తుంటారు. థాయ్‌లాండ్, చైనా, బర్మా, శ్రీలంక, జపాన్ మొదలైన దక్షిణాసియా దేశాల బౌద్ధ సన్యాసులు ఇక్కడ కన్పిస్తుంటారు.

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
నిరంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

మేము సందర్శించిన ముఖ్య ప్రదేశం అయోధ్య. ఇక్కడ శ్రీరామ జన్మభూమి, సరయూనది, రామమందిర నమూన, శ్రీరామ పట్టాభిషేకం, హనుమాన్ మందిర్ చూడదగిన స్థలాలు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన ప్రదేశమే రామజన్మభూమి. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన సంఘటన. అక్కడ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఆ ప్రదేశాన్ని దర్శించాం.

మేము సందర్శించిన మరి రెండు స్థలాలు.. వింధ్యాచల్, సీతామడిలో సీతాదేవి హనుమంతుని దర్శించుకున్నాం.

ఇలా సాగిన మా యాత్ర చివరగా కాశీ విశ్వనాథునికి అభిషేకం, అన్నపూర్ణా దేవికి కుంకుమార్చన, విశాలాక్షి దర్శనంతో విజయవంతంగా ముగిసింది.
డోకూరి శ్రీనివాసరెడ్డి

Sunday, 2 April 2017

అమర్‌నాథ్‌ యాత్ర

కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్‌ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం.

జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు.

ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం.


క్షణంలో మారే వాతావరణం 
ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్‌నాథ్‌ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

‘సర్వజనలోక రక్షణం, సకల పాపహరణం’గా వేదశాస్త్రాలు ఉద్ఘాటించే ఆ భద్రాద్రి సీతారాముల కల్యాణ వైభవాన్ని కళ్లారా చూసి తరించాలనుకునే భక్తులు కోకొల్లలు. దాని తరవాత అంతటి ప్రాశస్త్యాన్ని పొంది, చిన్న భద్రాద్రిగా భక్తజనం ఆదరాభిమానాలు చూరగొంటున్న మరో ఆలయం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం..!




శ్రీ రామ రామ రామేతి,
రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం,
రామనామ వరాననే!
ఈ శ్లోకం మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అంటారు. అలాగే ఆ సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తరించాలనుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఆ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆరోజున భద్రాద్రికి వెళ్లలేరు కాబట్టి, ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి, తోచిన రీతిలో కల్యాణం జరిపించే ఆచారం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా వెలసినదే తూ.గో.జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడలోని రామాలయం. 1889లో గ్రామానికి చెందిన ద్వారంపూడి సబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు ఓ చిన్న ఆలయాన్ని కట్టి, అందులో చెక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తరవాత 1939లో ఆలయాన్ని నిర్మించారు. 1950లో తొమ్మిది అంతస్తులతో తూర్పువైపున గాలిగోపురం, తిరిగి 1958లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమగోపురాన్నీ నిర్మించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఈ గోపురాలమీద కేవలం రామాయణ ఘట్టాలేకాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా చెక్కడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయశిఖరం(విమానగోపురం)మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చెక్కారు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఎటువైపు నుంచి చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమగోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కి.మీ. దూరంలోని కాకినాడ కనిపిస్తుంటాయి.

అద్దాల మందిరం..!
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా దేవుడికోసం ఓ అద్దాల మందిరాన్నీ నిర్మించడం ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. పశ్చిమగోపురానికి ఆనుకుని 64 స్తంభాలతో పుష్పకమను పేరుతో కట్టిన మండపంమీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎటు వెళుతున్నామో తెలీదు. కానీ ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మండపం చుట్టూ ఉన్న గోడలమీద ఆకర్షణీయమైన శిల్పాల్లో రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కల్యాణం అనంతరం రాములవారి శ్రీపుష్పయాగాన్ని ఈ అద్దాలమందిరంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామ పుష్కరిణి!
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నదీజలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామకల్యాణానికి పుష్కరిణి నీటినే తీర్ధబిందెలతో తీసుకొచ్చి, స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం, చక్రస్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీకమాసంలో వచ్చే చిలుక ద్వాదశినాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

సీతారాముల కల్యాణం!
భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధనవమిరోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాస అనంతరం చైత్రశుద్ధనవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కల్యాణం కూడా అదేరోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని వూరూవాడా పండగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ కల్యాణమహోత్సవానికి ఎంతో పేరుపొందిన శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం.



భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కల్యాణ క్రతువుని జరపడం పూర్వం నుంచీ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకువెళతారు. ఈ నెల ఐదో తేదీన జరగబోయే కల్యాణానికి కనీసం లక్షమందైనా భక్తులు వస్తారన్నది నిర్వాహకుల అంచనా. నాలుగో తేదీ నుంచే పెళ్లి పనులను ప్రారంభించి,. ఐదో తేదీన 11 గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి కల్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వూరేగిస్తారు. మహాన్నదానం కూడా నిర్వహిస్తారు. చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ గోదావరి పిల్లకాలువలతో భూదేవి మెడలోని పచ్చలహారంలా శోభిల్లే గొల్లలమామిడాడలో ఆ కోదండరామచంద్రమూర్తి ఆలయంతోబాటు కుక్కల నారాయణస్వామి ఆలయాన్నీ సూర్యదేవాలయాన్నీ కూడా సందర్శించవచ్చు. రాజమండ్రి వరకూ రైలూ లేదా బస్సులో వెళ్లి అక్కడ నుంచి కెనాల్‌ రోడ్డు మీదుగా బస్సూ ట్యాక్సీల్లో గొల్లల మామిడాడకు చేరుకోవచ్చు.


ఆరుమిల్లి శ్రీనివాస్‌, 
న్యూస్‌టుడే, పెదపూడి.

Saturday, 1 April 2017

చార్‌ధామ్‌ యాత్ర





చార్‌ధామ్‌ యాత్ర

జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్‌ ధామ్‌ యాత్ర.

గంగోత్రి, యమునోత్రి,  బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్‌ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు.  ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

యమునోత్రిచార్‌ధామ్‌ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.

గంగోత్రిచార్‌ధామ్‌ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు.

కేదార్‌నాథ్‌అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్‌. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్‌ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు  మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది.

బద్రీనాథ్‌జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్‌ చివరి వారం, మే నెలలో చేయవచ్చు.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...