Wednesday, 9 April 2014

కేదార్ నాథ్






ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక BUTTERFLY EFFECT


ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect.

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ. 2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం. ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం. మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది. నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై, కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం. తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది. శైవక్షేత్రం శ్మశానమయ్యింది.

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.
బడబాగ్నికి సలిలం లక్ష్యం.
దేహాగ్నికి దేహమే లక్ష్యం.
ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.
నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా ! — అల్లమప్రభు.


కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి, దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది. హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి. పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన అడుగుల్లో నావి కూడా ఉన్నాయి. 2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు, కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి.. ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు. సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది. అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది. అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది. హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది. రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి. ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది. సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా. ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు. స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు. హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర. మొన్న జరిగిన విలయంలోనూ గుడి చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే. ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు. లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం. రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి. మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు… దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము. వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు. దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు. కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది. జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం.. ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి. నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా… కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది. అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్ హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం. కానీ, ఇంతలా కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు. మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు. ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది. ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు. చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం.



Saturday, 1 February 2014

తెలంగాణ శైవక్షేత్రాలు

ముక్తిమార్గ సోపానాలు ..
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్‌
ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయమామృతాత్‌

కష్టాల నుండి, మృత్యువు నుండి రక్షించమని పరమశివుడిని వేడుకుంటూ భక్తులు మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తారు. మన హిందూ దేవతల్లో శివుడు ఆదిదేవుడుగా కొలువబడుతాడు. హిందువుల ప్రధాన ఆరాధ్య దైవం పరమశివుడు. మనకున్న పండుగల్లో మహాశివరాత్రి ప్రధానమైంది. ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం, శివ పార్వతుల కల్యాణం జరిగిన రోజుగా కూడా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణ చతుర్దశినాడు శివుని జన్మ నక్షత్రమున ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. శివుడు ఈరోజే లింగాకారంలో ఉద్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతిమాసంలో శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. కాని మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రినే ‘మహాశివరాత్రి’ అంటారు.

ఈ పండుగను భక్తులు శివుడికి బిల్వదళాలతో, ఉపవాసాలతో, జాగరణలతో ప్రీతి కలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు, జాగరణ సమయంలో శివలీలల కథా పారాయణాలు చేస్తారు. ప్రధాన శైవ క్షేత్రాల్లో మూడు రోజుల ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తారు. పూజారులు, ఋత్విక్కులు పఠించే నమక, చమకాలు, మృత్యుంజయ మంత్రాల వల్ల శివరాత్రి పండుగ శక్తి అధికమై, భక్తులకు ఆ ఫలాలు అందుతాయి.

తపస్సు, యోగం, ధ్యానం వంటి వాటితో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనలో పాజిటివ్‌ ఎనర్జీని పెంపొదిస్తుంది. శివుడి నుండే యోగసంప్రదాయం మొదలైంది. శక్తి స్వరూపుడు, కాల స్వరూపుడు, ఆదిమధ్యాంత రహితుడైన పరమశివుడిని ఆరాధిస్తే, మానవులకు, పశు పక్ష్యాదులకు మోక్షం తప్పక సిద్ధిస్తుందని పురాణ గాథలు, ప్రత్యక్ష అనుభవాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. అటు వంటి పరమశివుడు ఎక్కడ ఏ రూపంలోనైనా కొలువై ఉండవచ్చు. శక్తి సర్వాంతర్యామి. అతడికి ఒక కోవెల నిర్మించి అందు లో నిక్షిప్తం చేయడం మనకు సాధ్యం కాదు. కానీ మానవులందరి స్థాయి ఒకేవిధంగా ఉండదు. కొందరు పూజతో, కొందరు అర్చనతో, కొందరు స్తోత్రంతో, కొందరు జపంతో తమ భక్తిమార్గాన్ని, మోక్ష మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరి ఆనందం స్థాయిలో వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే మన భారతదేశంలో లక్షలాదిగా శివుడికి దేవాలయాలు నిర్మించబడ్డాయి. తెలంగాణాలో కూడా వందలు, వేల సంఖ్యలో శివాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ, ప్రాచీన శైవక్షేత్రాలను ఈ సందర్భంగా దర్శించుకుందాం.

శ్రీశైల ఉత్తర ద్వారంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లాలో నల్లమల అడవి ప్రాంతంలో కొండలో కలిసిపోయి ఉంటుంది. సంవత్సరం మొత్తం కొండలో నుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ప్రకృతి రమణీయంగా కన్పిస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుండి 100 కి.మీ. దూరంలో శ్రీశైలం వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది.

పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి గురించి తపస్సు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది మహర్షులు వందల సంవత్సరాల పాటు శివుడి గురించి ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లు స్కంద పురాణం వల్ల తెలుస్తుంది. ఉమామహేశ్వరాన్ని దర్శించుకొని మాత్రమే శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలి. అప్పుడే శ్రీశైల యాత్ర పరిపూర్ణమైనట్లని పెద్దలు చెప్తారు.

ఉమామహేశ్వర స్వామి ఆలయం ఒక కొండమీద ఉంది. ఈ కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీనికి పక్కన పాపనాశిని ఉంటుంది. ఈ పాపనాశిని నుండి ఐదు ధారలుగా ఒకే చోటునుండి ప్రవహిస్తుంది. ఈ కొండ క్రింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ ఐదు గుడులలో ఐదు శివలింగాలున్నాయి. వీటిని పంచలింగాలని అంటారు. అదేవిధంగా ఇక్కడ జంటలింగాల దేవాలయం కూడా ఉంది.

కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్నవరంగల్‌ జిల్లా కొమురవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ‘పుట్టమన్ను’చే స్వామి విగ్రహం ప్రతిష్టించబడింది. 500 సంవత్సరాల క్రితం తయారుచేయబడిన ఈ విగ్రహం నేటి వరకు చెక్కుచెదరకుండా భక్తుల పాలిట కల్పతరువై వెలిసి ఉంది. స్థానిక అర్చకుల కథనం ప్రకారం స్వామి విగ్రహం నాభి ప్రాంతంలో పుట్టు లింగం ఉందని ప్రతీతి. యాదవుల ఆడపడుచైన ‘గొల్ల కేతమ్మ’ను లింగ బలిజల ఆడపడుచైన ‘బలిజ మేడమ్మ’ను స్వామి వివాహం చేసుకున్నట్లు, ఆ కారణంగా స్వామికి ఇరుపక్కలా గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మల విగ్రహాలుంటాయి. స్వామి వారికి వీర శైవ ఆగమం ప్రకారం లింగ బలిజలు పూజలు నిర్వహిస్తారు.

ప్రతీ సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లన్న జాతర ఉగాది వరకు కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ ముందు రోజు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జాతర సమయంలో ‘బోనం – పట్నం’ అనే మొక్కుబడులను భక్తులు చెల్లించుకుంటారు. జాతర చివర్లో, హోళీ పండుగ ముందు ‘పెద్ద పట్నం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో వీరశైవ పూజారులు వీరభద్రుడ్ని, భద్రకాళిని పూజించి రాత్రి వేళ చతురస్రాకారంలో టన్నుల కొద్దీ కట్టెలను పేర్చి అగ్ని ప్రతిష్ట చేస్తారు.

వరంగల్‌ పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఐనవోలు గ్రామముంది. ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది. ఇక్కడి ప్రధాన దైవతం ‘ఐనవోలు మల్లన్నగా’ ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని కాకతీ రెండవ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించినట్లు సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆలయానికి తూర్పు, దక్షిణ దిశల్లో రెండు కీర్తి తోరణాలు నిర్మించబడ్డాయి.

ఐనవోలు మల్లన్న బ్రహ్మూెత్సవాలు ప్రతీ శివరాత్రి సందర్భంగా జరుగుతాయి. అశ్వ, నంది, పర్వత, రావణ వాహనాలను అధిరోహించి, చివరి రోజు రథారూఢుడై పుర వీధుల్లో స్వామి ఊరేగింపు జరుగుతుంది. అయిదవ రోజు అగ్ని గుండాల కార్యక్రమం, వసంతోత్సవం, పుష్పయాగం నిర్వహించబడతాయి.

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
హైదరాబాదుకు 30 కి.మీ. దూరంలో భవానీసమేత శ్రీ రామలిం గేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది త్రేతాయుగం నాటిదని ఐతిహ్యం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా హనుమత్‌ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చెనపుడు ఇక్కడి కొండలు, చెట్లు, ఆహ్లాదమైన ప్రకృతిని చూసి శివలింగం ప్రతిష్టించాలని సంకల్పించగా మహర్షులు ముహూర్తాన్ని నిర్ణయించారు. రాముడు హనుమంతుడిని శివ లింగాన్ని తీసుకురమ్మని వారణాసికి పంపెను. హనుమంతుడు కావల్సిన శివలింగాన్ని ఎంచుకోలేక సందిగ్ధావస్థలో 101 శివ లింగాలను తీసుకొచ్చాడట. కానీ ముహూర్త సమయం మించిపోవడంతో రాముడు వ్యాకలుడై ఉండగా, స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగ రూపాన్ని రాముడికి అందించాడట. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ట పూర్తి అయినది. రాముడు తాను తెచ్చిన లింగాలను ప్రతిష్టించలేదనే బాధతో లింగాలన్నింటినీ తోకతో చుట్టి విసిరివేశాడట. దాంతో కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో లింగాలన్నీ చెల్లాచెదురైనాయి. ఇప్పటికీ కీసర పరిసర ప్రాంతాల్లో మనకు చాలా శివ లింగాలు కనిపిస్తాయి.

వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయంతెలుగుదేశాన్ని పాలించిన, పౌరుష పరాక్రమాలకు మారుపేరుగా నిలిచిన కాకతీయుల కాలంలో వేయి స్తంభాల గుడి నిర్మించబడింది. ఇందులో పరమ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. విశిష్ట నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్య కాలంలో కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయం చుట్టూ చెక్కబడిన శిల్పాలు, వాటిని చూడడానికి సుమారు పది అడుగుల ప్రదక్షిణా పథం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తయిన ద్వారం నిర్మించబడింది. దీనికి ఎదురుగా సూర్య దేవాలయం, దక్షిణాభిముఖంగా వాసుదేవాలయం ఉన్నాయి. కాబట్టి ఈ వేయి స్తంభాల గుడి త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధిచెందింది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన నంది విగ్రహం జీవం ఉట్టిపడేలా ఉంటుంది. హనుమకొండలో ఉన్న ఈ చారిత్రక రుద్రేశ్వర స్వామి దేవాలయం వేయి స్తంభాల గుడిగా కాకతీయుల కళా విభవానికి అద్దం పడుతుంది. కాకతీయ రాజులు ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా భద్రకాళీ ఆలయానికి, వరంగల్‌ కోటకు, రామప్ప దేవాలయానికి వెళ్ళేవారని చెబుతారు. రుద్రేశ్వరాలయంలో నిత్య పూజలు, అభిషేకాలతో పాటు కార్తిక పౌర్ణమి, మహా శివరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

వేములవాడ – కోడెమొక్కుల రాజరాజేశ్వరస్వామి దేవాలయంతెలంగాణలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వేములవాడ అగ్రగణ్యమైంది. ప్రధాన దైవం శ్రీరాజరాజేశ్వరుడు. ఈ ఆలయాన్ని చాళుక్యవంశ రాజులు నిర్మించారు. జగత్పతి అయిన పరమేశ్వరుడు ఇక్కడ నివాసం ఉండడం వల్ల ఈ క్షేత్రం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి పొందింది.

వృత్రాసురుని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యా దోషాన్ని నివారించు కునే ప్రయత్నంలో అనేక క్షేత్రాలను దర్శించినాడు. అయినా అతనికి ఫలితం లభించలేదు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు రాజేశ్వర క్షేత్రాన్ని చేరుకొని, ధర్మకుండంలో స్నానం చేసి, దేవదేవుని దర్శించి బ్రహ్మహత్యాదోషం నుండి విముక్తుడైనాడు.

చాళుక్యరాజులలో గొప్పవాడు రెండవ అరికేసరి. ఇతడి తంత్ర పాలకుడు పెద్దనార్యుడు. రాజేశ్వరదేవుని వద్దకు వచ్చే భక్తులకు అన్నదాన సత్రాలు వేములవాడలో ఉండేవి. పెద్దనార్యుని కోరిక మేరకు సత్రాల నిర్వహణకు శతవర్తన విస్తారమైన భూమిని, 8 నివర్తనాల నీరునేలను దానమిస్తూ శాసనం వేయించాడు. ఈ శాసనం వల్ల వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోడానికి వీలవుతుంది.

వేములవాడలో ప్రధాన ఆలయమైన రాజేశ్వర స్వామి ఆలయం కాక అనేక ఇతర ఉప ఆలయాలున్నాయి. రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం, కాశీ విశ్వేశ్వరాలయం, కోదండ రామాలయం, ఉమా మహేశ్వరాలయం, బాలా త్రిపురసుందరీ దేవి ఆలయం, బాల రాజేశ్వరాలయం, విఠలేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కనకదుర్గ, మహాలక్ష్మి ఆలయాలు, బద్ది పోచమ్మ గుడి (శీతలాదేవి ఆలయం) ద్వాదశ లింగాలు, శివ పంచాయతనములు మొదలైన దేవతల ఆలయాలు వివిధ కాలాల్లో నిర్మించబడి నాటినుండి నేటివరకు పూజలందుకుంటున్నాయి.

కష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం వాడపల్లి. ఇది కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం. దీనికి మూడు వైపులా నీరు, ఒక వైపు భూభాగం ఉంది. ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఏకైక జలదుర్గం. దీనిచుట్టూ లోతైన కందకం ఉండి బలిష్టంగా నిర్మించబడింది.

వాడపల్లిలో రెండు ప్రాచీన, ప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు నిర్మించ బడినాయి. రాష్ట్ర రాజధాని నుంచి జహీరాబాదు వెళ్ళే మార్గంలో ఝరాసంగమనే గ్రామంలో పరమశివుడు సంగమేశ్వర స్వామిగా వెలసినాడు. ఈయననే కేతకీ సంగమేశ్వరుడని కూడా అంటారు. పూర్వం ఈ ప్రాంతం కేతకీ వనమని, శౌనకాది మునులు ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడున్న గుండాన్ని ‘అమృత గుండం’ అంటారు.

కాళేశ్వరం – ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి దేవాలయంభారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద, గౌతమీ పురాణాల్లో కనిపిస్తుంది. దేవాలయంలో మొదట కాళేశ్వరుడిని (యముడు) పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. ముక్తేశ్వర స్వామిని దర్శించిన భక్తులకు స్వామి ముక్తినివ్వడంతో యముడికి పని లేకుండా పోయిందట. ఆయన శివుడికి మొరపెట్టుకోగా తన పక్కనే యముడిని సైతం లింగాకారంలో నిల్చోమన్నాడట. తనని అర్చించి యముడిని అర్చించకుండా వెళ్ళే వారికి ముక్తి దొరకదు. అట్టి వారిని యముడు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట.

ముక్తేశ్వర స్వామి లింగంలో విశేషంగా రెండు రంధ్రాలుంటాయి. వీటిలో నీటిని పోసి అభిషేకం చేస్తే మైలు దూరానికి ఆవల ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని చెబుతారు. చారిత్రకంగా వేంగి రాజైన విష్ణువర్ధనుడు కాళేశ్వర రాజ్యాన్ని జయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం 26 కోనేరులను కలిగి పెద్ద పట్టణంగా విలసిల్లింది. కాకతి ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి స్వామికి అర్పించాడట. ముక్తేశ్వర, కాళేశ్వర స్వాములతో పాటు ఇక్కడ సరస్వతి ఆలయం, రామాలయం, ఆది ముక్తేశ్వర ఆలయం, బ్రహ్మాలయం కూడా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణానికి 3 కి.మీ. దూరంలో పానుగల్లు గ్రామం ఉంది. ఈ గ్రామం కందూరు చోళులు, కాకతీయులకు రాజధానిగా నిలిచింది. చారిత్రకంగా పానుగల్లుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రముఖ శివ కవి పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పానగల్లును ప్రస్తావించడం జరిగింది. పానగల్లు నగరంలో శిథిల శివాలయాలు, నందీశ్వర విగ్రహాలు, పానవట్టాలతో కూడిన శివలింగాలు, శివుని పానవట్టం ఆకృతి కలిగిన రాళ్ళు ఈ ప్రాంతంలో లభించడం వలన ‘పానవట్టపు కల్లు’ క్రమంగా పానగల్లుగా మారి ఉండవచ్చని చారిత్రకుల కథనం.

పానగల్లులో ఎన్నో శిల్పకళా నిలయాలైన దేవాలయా లున్నాయి. వాటిలో ఛాయా సోమేశ్వరాలయం ముఖ్యమైంది. ఈ క్షేత్రాలే కాక ఇంకా తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం, పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం, సలేశ్వరం శివాలయం, భావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం, రామప్ప, దేవాలయం, ఖాజీపేట మల్లికార్జున దేవాలయం…. ఇట్లా ఇంకా చాలా దేవాలయాలు అతి పురాతనమ్కెనవి, ప్రసిద్ధమైనవి తెలంగాణా అంతటా ఉన్నాయి.

Thursday, 28 November 2013

కార్తీకమాసంలో పంచారామ సందర్శనం





కార్తీకమాసంలో పంచారామ సందర్శనం 

సాధారణంగా రద్దీ సమయాలలో పుణ్యక్షేత్ర సందర్శనం నాకు ఇష్టం ఉండదు. పుణ్యం మాట దేవుడెరుగు. ఆ ఇబ్బందులు పడలేమనే అలా వెళ్ళం. అందుకే ఖాళీ సమయాలలో ఆయా క్షేత్రాలు దర్శించి సావకాశంగా చూడటం అలవాటైంది. పంచారామాలను ఇది వరకు రెండు మూడు సార్లు అన్నీ ఒక్కసారే కాక పోయినా వీలుని బట్టి చూశాము. ఎందుకో ఈ సారి కార్తీక మాసంలో పంచారామ సందర్శనం చేయాలని అనిపించింది. మొదటి మూడు వారాలలో కుదరలేదు. ఇక నాల్గవ వారంలో ఆదివారం రాత్రికి ఉయ్యూరు నుంచి RTC వాళ్ళు ఈ స్పెషల్ బస్ ఏర్పాటు చేశారని తెలిసి మా అబ్బాయి రమణతో వివరాలు కనుక్కోమని చెప్పాం. వాడు అడిగి తెలుసుకొని బుక్ చేస్తే ఆయన ఇంటికే వచ్చి బుక్ చేస్తాడని చెప్పాడు. అట్లాగే RTC ఉద్యోగి వెంకటేశ్వర రావు మా ఇంటికి వచ్చి డబ్బు కట్టించుకొని నాకు, మా శ్రీమతి ప్రభావతికి, మా మనుమరాలు రమ్యకు టికెట్స్ బుక్ చేశాడు. పెద్దలకు 490 రూపాయలు పిల్లలకు 380 రూపాయలు. మొత్తం రాను పోను 700 కిలోమీటర్ల ప్రయాణం. చౌకే అనిపించింది. ఆదివారం రాత్రి పదకొండున్నరకు బస్సు బస్సుస్టాండులో బయల్దేరుతుందని అన్నీ చూసిన తర్వాత సోమవారం రాత్రి పన్నెండుకు ఉయ్యూరు చేరుతుందని చెప్పాడు. సోమవారం పంచారామ దర్శనం అని ఏంతో సంతోషించాం.

ఆదివారం రాత్రి ఎనిమిదింటికే భోజనాలు పూర్తీ చేసుకొని పదకొండు గంటలకు ఆటోలో ముగ్గురం బస్ స్టాండ్ చేరాం. "పల్లె వెలుగు బస్సు". రాత్రి పన్నెండు గంటలకు ఉయ్యూరులో బయల్దేరింది. మొత్తం 53 మంది, ఇద్దరు డ్రైవర్లు జోగేశ్వరరావు వెంకటేశ్వర రావు. ఆదివారం రాత్రికి బెజవాడ, అక్కడి నుండి అమరావతికి రాత్రి రెండుమ్బావుకు చేరింది. దర్శనం చేసి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలో డ్రైవర్లు ఎవరికీ చెప్పలేదు. ఇది ఒక లోపం.

దేవాలయం ఆవరణలో ఉన్న పంపుల దగ్గరే ఆడ, మగా అందరం స్నాలు చేశాం. అక్కడే ఉన్న రావి, ఉసిరి చెట్ల కింద ఆడవాళ్ళు దీపాలు వెలిగించుకొన్నారు. ఇదంతా అయ్యే సరికి మూడున్నర అయింది. వెంటనే అక్కడే ఉన్న దర్శనం లైనులో నిల్చున్నాం. ఒక్కో టికెట్టు నూట పాతిక రూపాయలు. కొని వెంటనే ముందుకెళ్ళాం. అక్కడి నుండి సరాసరి మెట్లు ఎక్కి శ్రీ అమరేశ్వర స్వామిని సందర్శించాం. దివ్య దర్శనంగా భాసించింది. ఉషోదయానికి పూర్వమే ప్రభాత శివ దర్శనం అయినందుకు ఏంతో సంతృప్తిగా ఉంది. అమ్మ వారు శ్రీ బాలచాముండీ దేవిని, క్షేత్ర పాలకుడు శ్రీ వేణు గోపాల స్వామిని దర్శించి బయటికి వచ్చేసరికి తెల్లవారు ఝామున నాలుగుమ్బావు మాత్రమే అయింది. బస్సు సత్తెన పల్లి రోడ్డులో ఉందని తెలుసుకొని అక్కడికి చేరాం. అక్కడ ఒక బడ్డీ కొట్లో మంచి కాఫీ తాగాం. ఆరురూపాయలు ఒక్కో కాఫీ. వెంటనే బస్ తలుపు తీసి అందులో ఎక్కి కూర్చున్నాం. ఇలాంటి అవకాశం రాదు అనుకోని నాతొ తెచ్చుకొన్న పుస్తకాలు తీసి సంధ్యా వందనం నిత్య పూజ చదువుకొని తర్వాత మహాన్యాసం చదివినాక చమకాలతో ఏక రుద్రాభిషేకం చదివి, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం పూర్తీ చేసి, శివ అష్టోత్తర, శతనామావళి పూర్తీ చేశా. ఆ తర్వాత "బిల్వ అస్తోత్తరం" కూడా చదివి పూర్తీ చేశాను. ఇదంతా అయ్యే సరికి ఆరు గంటలయింది. కొందరు అక్కడి రోడ్ మీద ఉన్న దుకాణాలలో టిఫిన్లు చేశారు. మేము మాత్రం ఇంటి నుంచి తెచ్చుకొన్న గారేలు, బిస్కట్లు తిని, కమలాలు తిని మందులు వేసుకోన్నాం. ఉదయం తొమ్మిదింటికి అందరు చేరారు. డ్రైవర్లు ఇద్దరూ మంచి వాళ్ళే. బస్సు కూడా కత్తి లాగా ఉంది. డ్రైవర్లూ కత్తులే. అందుకే యెంత దూరం అయినా యిట్టె నరికేసి నట్లు ..బస్ ను బాగా నడిపించారు. ముద్దు ముద్దుగా తొమ్మిదింటికి అంటే మేము దిగిన ఏడు గంటల తర్వాత బయల్దేరింది. ఈ ఆలస్యం రోజంతా ఇబ్బంది పెట్టింది.

పంచారామాలు, వాటి వివరాలు

  1. అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. దీనిని అమరారామం అంటారు. స్వామి అమరేశ్వర స్వామి. ఇంద్రుడు ప్రతిస్టించాడు. ఆయన ముఖం అఘోరం. స్వరూపం శాంతి స్వరూపం. అమ్మవారు బాలచాముండేశ్వరి .
  2. రెండోది పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలోని భీమేశ్వరవామి. అలాగే ప్రక్కనే గునుపూడిలో ఉన్న సోమేశ్వర స్వామి. స్వామి పేరు సోమేశ్వరుడు. సద్యోజాత ముఖం. స్వరూపం నిత్య నూతనం. చంద్ర ప్రతిష్టితం. అమ్మ వారు పార్వతి దేవి. ఈ క్షేత్రాన్ని సోమారామం అంటారు.
  3. మూడవది పశ్చిమగోదావరిలోనే పాలకొల్లులో ఉన్న క్షీరారామం. స్వామి రామలింగేశ్వరుడు. ఈశాన ముఖం. లోకమంతా తానే అయిన స్వరూపం. శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం. అమ్మవారు పార్వతి దేవి.
  4. నాల్గవది ద్రాక్షారామం. తూర్పు గోదావరి జిల్లాలో దాక్షారంలో ఉంది. స్వామి భీమేశ్వరుడు. తత్పురుష ముఖం. స్వరూపం ఆత్మ. స్వయంభువు . అమ్మ వారు మాణిక్యాంబ.
  5. అయిదవది కుమారారామం. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో ఉంది. స్వామి కుమారారామ భీమేశ్వరుడు. వామ దేవ ముఖం. సత్య సుందర స్వరూపం. కుమార స్వామి ప్రతిష్టితం. అమ్మవారు బాలా త్రిపుర సుందరి.
అమరారామం
కృష్ణానదీ తీరంలో ఉన్న మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం అమరారామం. ఇంద్ర ప్రతిష్ట కనుక అమరేశ్వరుడు అయాడు. తారకాసుర కంఠాన్నిశివుడు చేదించినప్పుడు శివుని అమృత లింగం అయిదు భాగాలుగా విడిపోయి ఒక భాగం అమరావతిలో పడింది. దీనిని ఇంద్రుడు ప్రతిస్తించాడు. మిగిలినవి పైన చెప్పిన నాలుగు చోట్లపడి ఆరామాలయ్యాయి. కృష్ణానది పడమటి దిశ నుంచి తూర్పుకు మలుపు తిరిగిన చోట ఆలయం నిర్మించారు. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి స్కాంద, బ్రహ్మ, పద్మ పురాణాలలో ఉంది. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగుదిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలున్నాయి. దక్షిణ ద్వారంలో ముఖ మండపం ఉంది. తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణా నదీ ప్రవాహం ఉంటుంది. ఇది పంచాయతన క్షేత్రం కూడా అంటే గణపతి, అంబిక, సూర్యనారాయణ, శ్రీ మహా విష్ణువు అంశ అయిన వేణు గోపాలస్వామి ఉంటారు. క్షేత్ర పాలకుడు కాల భైరవుడు. ఇది శివ కేశవులకు అభేదమైన క్షేత్రం. మూల విరాట్ శ్రీ అమర లింగేశ్వర స్వామి 36 అడుగుల ఎత్తున్న లింగాకారం. పై అంతస్తులో 9 అడుగులు ఎత్తైన శ్వేత లింగాకారం ఉండగా, మిగిలిన 23 అడుగుల లింగం కింది అంతస్తులో గోడ కట్టి మూసి వేయ బడి ఉంది.



ఏకాదశ లింగాలు మూడు ప్రాకారాలలో ప్రతిస్తింపబడ్డాయి. ముఖ మండపం దక్షిణ ముఖం గాను, గర్భాలయం తూర్పు ముఖంగా ఉంది. మొదటి ప్రాకారంలోకి ప్రవేశించగానే ప్రాకార దేవతలు ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీవిశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదాలు, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వరుడు, పార్దివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుదు, మహిషాసుర మర్దిని, కోసలేశ్వరుడు, వీరభద్రుడు అనే దేవతామూర్తులను సందర్శించాలి.



తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది స్నానఘట్టం కనీపిస్తుంది. ఇక్కడి నుంచి మొదటి ప్రాకారంలోకి వస్తే పశ్చిమ ద్వారం వైపు ఉత్తరాభి ముఖంగా లింగాకారంలో అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వరుడు, గణపతి, నందిని దర్శించాలి. తూర్పు ముఖంగా ఉన్న జ్వాలాముఖి అమ్మ వారిని దర్శించాలి. మారేడు వృక్షాలు, పున్నాగ వృక్షాలు పవిత్రతకు చిహ్నాలుగా ఉంటాయి. కృష్ణానది మరొక వైపు ఎదురుగా కనీపించే "వైకుంఠ పుర క్షేత్రం" చూస్తె పంచారామాలలో ఉన్న మొదటి క్షేత్రమైన అమరావతి వైభవం, ప్రత్యేకత తెలుస్తాయి.

రెండో ప్రాకారం తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఒళ్ళు గగుర్పోడుస్తాయి. ప్రాకారం లోపల ప్రదక్షిణంగా వెళ్తే విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు మధ్య నవగ్రహమండపం, అక్కడే శ్రీ కృష్ణ దేవ రాయలు, అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి కాలాలలో, తులాభారం తూగిన మండపాలున్నాయి. తర్వాత నవగ్రహమండపం, దానికెదురుగా యాగాశాల చూడచ్చు. పడమటి వైపు సంతాన వేణుగోపాలస్వామి, వాయవ్యంలో కుమారస్వామి, ఈశాన్యంలో సిందూరం రంగులో శ్రీ ఆంజనేయస్వామి.



మూడవ ప్రాకారంలో 23 మెట్లు ఎక్కి పైకి వెళ్లి ఆగ్నేయంలో పస్చిమాభి ముఖంలో ఉన్న కాళహస్తీశ్వర స్వామిని దర్శించ వచ్చు. కొంత దూరం కిందికి నడిస్తే మెట్ల దారి కనీపించి నైరుతికి వెడితే తూర్పు ముఖంగా శ్రీశైలమల్లేశ్వర స్వామిని దర్శించవచ్చు. ప్రదక్షిణం చేస్తూ వెడితే ధ్వజ స్తంభం కనీపిస్తుంది. అక్కడ గోడ పై ఉన్న జ్యోతిర్లిన్గాలను చూడాలి. తూర్పు ముఖంగా కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు. తూర్పు ధ్వజ స్తంభం వద్ద సూర్య భగవానుడిని చూడాలి. ఇక్కడి నుంచి సభా మండపంలోకి వెళ్ళాలి. ఉత్త్తర దక్షిణాభి ముఖంగా ఉన్న బాలచాముండేశ్వరి అమ్మ వారిని దర్శించి తరించాలి. నంది మండపం, నందిని చూసి, గర్భాలయంలో ఉన్న 9 అడుగుల లింగాకార అమరేశ్వర స్వామి మూల విరాట్టును దర్శించి జన్మ చరితార్ధం చేసుకోవాలి. స్వామికి అభిషేకాలు నిర్వహించుకో వచ్చు, శుద్ధ స్పటిక లింగాకార శివ లింగమే అమరేశ్వర లింగం. వెనక్కి వెళ్లి నంది మండపంలో శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి శివ కేశవులకు భేదం లేదని గ్రహించాలి. తర్వాత నిలుచున్నా ప్రమాణంలో ముఖం అంతా పసుపు, ముఖం పై యెర్ర కుంకుమ బొట్టులో ఉన్న బాల చాముండీ శ్వరి అమ్మ వారిని దర్శించి అనుగ్రహం పొందాలి. మూడవ ప్రాకారం పైన తారకాసుర వధ ఘట్టం మొత్తం రంగు చిత్రాలలో చిత్రింప బడి ఉండటం చూస్తాం. కార్తీకంలో ను, మహా శివరాత్రి నాడు ఇక్కడ విశేష కార్య క్రమాలు జరుగుతాయి.

అమరావతి పూర్వపు పేరు ధాన్య కటకం. ఒకప్పటి ముఖ్య పట్నం. కోట్ల రాజ వాఆఅమ్శస్తులు పాలించారు. వెంకటాద్రి నాయుడు వల్ల ఇక్కడ పట్నం ఏర్పడింది. 1795లో రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి మార్చాడు. తన పరగణాలో ఒకే ముహూర్తంలో 108శివ లింగాలను వెంకటాద్రి నాయుడు ప్రతిస్టించాడు. శాతవాహనులు మొదలైన రాజులెందరో స్వామిని దర్శించి కానుకలందించారు. ఆలయంలో ఎక్కడ చూసినా శిలాశాసనాలు కనిపిస్తాయి. మూడవ ప్రాకారంలో ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద, రాజా వెంకటాద్రి నాయడి ముఖ మండపం ఉంది. కొమ్మ నాయుని శాసనం, కోట కేత రాజుల శాసనాలు, అనవేమా రెడ్డి శాసనం, కృష్ణ దేవరాయ శాసనం, హాద్రికం పెద్దప్పం గారి శాసనం ముఖ్యం గా అందరూ చూడాలి.

దీనికి దగ్గరలో ధరణి కోటలో బౌద్ధ స్తూపం, మ్యూజియం తప్పక చూడాల్సినవి. స్తూపం శాలి వాహనుల కాలంలో 100అడుగుల ఎత్తు 138 అడుగుల వ్యాసం, 521 అడుగుల చుట్టు కొలత గల జాతక కదా విశేషాలతో ఉన్న శిల్ప కళా వైభవం వర్ణనా తీతం. నాగ రాజుల కాలం నుండి నాగార్జునుని కాలం వరకు నాల్గు దశల్లో ఇది పూర్తీ అయింది. ఇక్కడి విశ్వ విద్యాలయంలో శిల్పం చిత్ర లేఖనం, సంగీతం వాస్తు శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, వైద్య శాస్త్రం మొదలైనవి బోధించే వారు. చైనా టిబెట్, బర్మా, సింహళం నుంచి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి విద్య నేర్చే వారు.అమరావతి మ్యూజియం మన దేశం లోనే మొదటి శ్రేణికిచెందింది. ఆలయం దగ్గరే షిర్డీ సాయి, సత్యశాయి, కపోతేశ్వర ధ్యాన మందిరాలు చూడదగినవి. కృష్ణానదికి ఎదురుగా ఎత్తైన తిన్నె మీద ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిభారీ విగ్రహం దర్శనీయమైంది. అందువల్ల అమరావతి హిందువులకు, బౌద్ధులకు ప్రధాన ఆరాధనా స్తలం అయింది.



మా పంచ రామములు బస్సు అమరావతిలో దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం తొమ్మిదింటికి బయల్దేరింది. బెజవాడ బెంజ్ సర్కిల్ కు పదిన్నరకు చేరి అక్కడి నుండి కంకిపాడు వచ్చి అక్కడ పావుగంట రీసెస్ కోసం ఆగి, మానికొండ గుడివాడ, కైకలూరు, ఆకివీడు, అర్తమూరు, ఉండి మీదుగా భీమవరంకు మధ్యాహ్నం రెండు గంటలకు సుమారు అయిదు గంటలు ప్రయాణించి చేరింది. డ్రైవర్లు అరగంటలో దర్శనం చేసుకొని రావాలని చెప్పారు. బస్ ఆగిన చోటు నుండి గుడికి వెళ్ళటానికే పావు గంట పట్టింది. దారిలో వినాయక స్వామి గుడి షిర్డీ సాయి బాబా గుడి అయ్యప్ప గుడులు చూసి శ్రీ భీమేశ్వరాలయం చేరాం. విపరీత మైన రద్దీ గా ఉంది. యాభై రూపాయల టికెట్ కొని ముగ్గురం లైన్ లో నిలబడి ఉన్నాం. దాదాపు గంట ఇరుకు క్యూలో కాళ్ళు నెప్పి పుట్టేలా నిలబడి భీమేశ్వర స్వామిని దర్శించాం. అమ్మ వారు పార్వతి దేవిని సందర్శించాం. అసలు ఇక్కడ చూడాల్సింది గునుపూడిలో ఉన్న సోమేశ్వరాలయం అందుకే దీనికి సోమారామం అని పేరొచ్చింది. కానిమా బస్ వాడు దీనినే చూపించాడు. ఇది వరకే మేం సోమారామం చూశాం కనుక నిరాశ పడలేదు.

చాళుక్య భీముడు అనే రాజు పేర భీమవరం ఏర్పడింది. భీమవరం దగ్గర ఉండి రాజులు వీర శైవులు. వీరికాలంలో నూజివీడు జల్లి సీమలలో భీమవరం శోభాయమానంగా విలసిల్లింది. 1434 లో దేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. ఒకసారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమరామంలో శివుని అమృత లింగ శకలం పడి ఉందని, అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి అన్నపూర్ణా సమేత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు. అలాగే మాటలు వచ్చాయి. రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు.

SOMESWARA SWAMY TEMPLESOMESWARA SWAMY TEMPLE

సోమేశ్వర ఆలయం ముందున్న చంద్ర పుష్కరిణిలో స్నానం చేయాలి. దానికి ఎదురుగా పదిహేను అడుగుల నందీశ్వర దర్శనం చేయాలి. నందిని దాటి ఏడు అంతస్తుల ముఖ మండపం దాటి లోపలికి వెడితే, దక్షిణంలో సూర్య నారాయణుడు ఉత్తరంలో సుబ్రహ్మణ్య స్వామి, ఈశాన్యంలో నవగ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖంలో గణపతి, ఉత్తరాన కుమార స్వామి, సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖంగా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మవారు కోటికాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు. గర్భాలయంలో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తున కన్పిస్తాడు. దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్నపూర్ణ అమ్మవారు దర్శన మిస్తారు. దక్షిణాన కళ్యాణ మండపం ఉంది.

క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమంలో తూర్పు ముఖంగా ఉంటాడు. అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకోవచ్చు. శ్రీ నాదకవి సార్వ భౌముడు భీమపురాణంలో అగస్త్య మహర్షి సోమారామాన్ని సందర్శించినట్లు రాశాడు.

రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు. శాప విమోచనం తెలపమంటే చంద్రపుష్కరిణిలో స్నానం చేసి అక్కడి శివుడిని అభిషెఏకిస్తే విమోచనం జరుగుతుందని చెప్పాడు. అలాగే చేశాడు. అందుకే అది చంద్రపుష్కరిణి అని పేరొచ్చింది. స్వామికి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది.

మళ్ళీ బస్సు దగ్గరకు చేరే సరికి మూడున్నర అయింది. అందరు వచ్చేసరికి అయిదు దాటింది. అప్పుడు బయల్దేరి మావూళ్ళమ్మ అమ్మవారిని దర్శించాం. మేము తెచ్చుకొన్న పూరీలను కూరతో పాటు కడుపు నిండా లాగించాం. కమలాలు కొని తిన్నాం. ఇక్కడ రోడ్లు ఇరుకు. అక్కడి నుండి బయల్దేరి రాత్రి ఏడున్నరకు పాల కోల్లు చేరాం. ఇక్కడ క్షీరామమం ఉంది.

క్షీరారామం
శ్రీ మహా విష్ణువు చే ప్రతిస్తింప బడి బ్రహ్మ చేత సేవింపబడిన దివ్య క్షేత్రం క్షీరారామం. పావు తక్కువ ఎనిమిదికి బస్ ఆగిన చోటు నుండి మేమిద్దరం నడుచుకొంటూ వచ్చి క్షీరారామ రామలింగేశ్వర్ఫా స్వామిని దర్శించాం. మా మనవరాలు రమ్య భీమవరం దెబ్బకు అలసిపోయి రాలేనంది. మిగిలిన రెండు క్షేత్రాలకూ రమ్య రాలేదు బస్సులోనే ఉంది. వందలాది పంచారామ స్పెషల్ బస్సులు రాష్ట్రం నలుమూలల నుండి ఈ నాల్గవ సోమవారం నాడు పంచారామ దర్శనం కోసం వేలాది భక్తులు తరలి వచ్చారు. అన్నీ లక్సరీ బస్సులే. రామ లింగేశ్వర దర్శనం తర్వాత పార్వతీ అమ్మవారిని గణపతి మొదలైన దేవతామూర్తులను జనార్దనస్వామిని దర్శించం. ఆలయం బయట పాలకొల్లు స్పెషల్ పాపడి పావుకిలో నలభై రూపాయలు పెట్టి కొన్నాం. అక్కడి నుండి బస్ దగ్గరకు చేరాం. దగ్గరలో ఉన్న హోటల్లో రెండు ప్లేట్ల ఇడ్లీ లు తెచ్చాను. నేను మా ఆవిడా చెరో ప్లేట్ తిన్నాం. ప్లేట్ పది రూపాయలు రెండిడ్లీలు. ఒక ప్లేట్ కింద లెక్క. బాగున్నాయి. ఇప్పుడు క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసు కొందాం.

Kshira rama temple main entranceinside temple view

పూర్వం వ్యాఘ్ర పాడుదు అనే మహర్షికి ఉపమన్యువు అనే కుమారుడు పుట్టాడు. కొడుకు సర్వ వేదం విదుడై పవిత్రంగా జీవించేవాడు. సరైన యోగాభ్యాసం చెయ్యక పోవటం వల్ల యోగ భ్రస్టూడై నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తల్లి పాలు కొని పోయ్యలేక పిండి పాలు పోసి పెంచుతుంది. ఒక సారి తల్లితో మేనమమల ఇంటికి వెడితే అక్కడ మంచి ఆవుపాలు తాగి ఆ రుచి మరిగి ఇంటికి వచ్చిన తర్వాత పిండి పాలు తాగనని మారాం చేస్తాడు. రోజు రోజుకీ చిక్కి పోతున్నాడు. తండ్రి కొడుక్కి శివ పంచాక్షరి బోధించి జపించమంటాడు. ఉపమన్యువు మహా నిష్టతో జపిస్తాడు. భక్తికి మెచ్చిన శివుడు మారు వేషంలో వచ్చి శివ నింద చేస్తాడు. యితడు మంత్రించిన విభూతిని శివుడి పై జల్లగా వేష దారి శివుడు అర్ధ నారీశ్వరుడై పోతాడు. ఉపమన్యువును ఎత్తుకొని పార్వతీ దేవికి ఇచ్చి పెంచమంటాడు. ఆమె హస్తం నుంచి పాలు ప్రవహిస్తాయి. అప్పుడు ఆ ప్రాంతం అంతా క్షీరకొలను అంటే పాలకొలనుగా మారిపోయింది. అదే పాలకొల్లు క్షీరారామ అయింది. ఈ గ్రామం ఉపమన్యు పురం అయింది. పాలుకారే మర్రి, రావి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కూడా పాలకొల్లు అయింది అంటారు.

త్రిమూర్తి ఆలయం గా క్షీరారామం ప్రసిద్ధి చెందింది. ఆలయం లో పార్వతీ పర మేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, సరస్వతీ సహిత బ్రహ్మ దేవుడు కొలువై ఉన్నారు. దేవాలయ శిఖరం 120 అడుగుల ఎత్తు ఉండి దూరానికీ దర్శన మిస్తుంది. గోపురం పై తపోనిస్టలో ఉన్న శివుడు ఇంద్రాది అష్ట దిక్పాలకులు, పంచ ముఖ పరమేశ్వరుడు, నాట్య గణపతి, లక్ష్మీ గణ పాటి, సరస్వతి గజ లక్ష్మి, కాలియా మర్దనం, శివలీలలు, దశావతారాలు మొదలైన ఎన్నో శిల్పాలు కను విందు చేస్తాయి. 1774ఏప్రిల్ 14నశ్రీ బచ్చు అమ్మయ్య గారు గోపుర నిర్మాణానికి పూనుకోన్నారని స్తానికులు అంటారు.


Carvings on the wall

దేవాలయ రాజగోపురం దాటి లోపలి వెడితే శివుని సిమెంటు విగ్రహం పెద్ద సైజ్లో కనీ పిస్తుంది. ధ్వజస్తంభం ఉత్తరాన ఆంజనేయ స్వామి గుడి, దక్షిణంలో వీరభద్రుని గుడి ఉంటాయి. ఉత్తర దక్షిణంగా విశాల మండపం వివాహాది శుభ కార్యాలకు యజ్ఞాలకు ఉపయోగ పడేట్లుగా నిర్మించారు . దీనినే " పంచముఖ ప్రాంగణం " అంటారు . శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి చుట్టూ జనార్దన స్వామి, వినాయకుడు సుబ్రహ్మణ్యుడు, గోకర్నేశ్వరుడు వేర్వేరు విమాన శిఖరాల తో కొలువై దర్శన మిస్తారు. స్పెషల్ దర్శనం పది రూపాయలు . శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన రామ లింగేశ్వర స్వామి స్పటిక లింగం తారకాసుర వధలో అతని కంఠంలో ఉన్న అమృత లింగాన్ని కుమార స్వామి చేదిన్చినప్పుడు పడిన నొక్కులే పంచారామాలలో లింగాలపై నొక్కులుగా కనీ పిస్తాయి ఇక్కడి శివలింగం మొన దేలి ఉండటం వల్ల " కొప్పు " భాగాన్ని సూచిస్తోందని అంటారు . శాసనాలలో ఈ స్వామిని " కొప్పు రామ లింగేశ్వరుడు "గా పేర్కొన్నారు . ఈ లింగం అమృత లింగం లోని శిరస్సుభాగమే నని అందరూ చెబుతారు.

ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలో సూర్యోదయాన సూర్య కిరణాలు పెద్ద గోపురం రెండ వ అంతస్తు నుండి ప్రాకారాలను దాటి రామ లింగేశ్వర లింగం పై ప్రసరించటం ఇక్కడి విశేషం . ఆలయ ముఖ ద్వారం పై విష్ణు మూర్తికి క్షీరా రామేశ్వరుడు " సుదర్శన చక్రం " ప్రసాదించే సుందర శిల్పం చూడ ముచ్చటగా ఉంటుంది . ఇక్కడి శివుని అర్చిస్తే దారిద్ర బాధ ఉండదని నమ్మకం . ప్రాకార మండపంలో శిల్ప కళా విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది . పడమర " రుణహర గణపతి" ని దర్శించి నందీశ్వరుని కి ప్రదక్షిణం చేసి, శ్రీ క్షీరారామ లిన్గేశ్వరుడిని దర్శించాలి . ఈ గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు ఉండవు అని నమ్మకం . స్వామి పవళింపు సేవ గది చూడాల్సిందే నటరాజ విగ్రహం ఆకర్ష ణీయం.

ఇక్కడి అమ్మ వారు పార్వతీ దేవి . స్వామికి ఎదురుగా దక్షిణాన ఉత్తర ముఖం గా, స్వామికి కుడి వైపు ఉంటుంది . శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీ చక్రమును ప్రతిష్టించారు . అమ్మవారిని " త్రిపుర సుందరీ దేవి "గా కూడా పిలుస్తారు . జనార్దన స్వామి లక్ష్మీ దేవి సమేతంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించి, పూజించి, కొలువైనాడు శంఖ, చక్ర గద, పద్మ ధరుడై, దశావతారాలు చెక్కిన మకర తోరణాలతో భక్త వత్సలుడై ఉంటాడు .

ప్రాకారంలో దుండి గణపతి, లలితా దేవి, వాసవీ కన్యకా పరమేశ్వరి, వీర భద్రుడు, సప్త మాతృకలు, బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి వైష్ణవి, వారాహీ, చాముండీ వాహనాల తో దర్శన మిస్తారు . నైరుతిలో సరస్వతి అమ్మ వారు పుస్తక పాణి యై దర్శన మిస్తుంది . శ్రీ సంతోష రూపా దేవి, దుర్గా దేవీలనూ చూడ వచ్చు పడమర తూర్పు ముఖంగా నెమలి వాహనం పై కార్తికేయుడున్నాడు . వాయవ్యంలో మహిషాసుర మర్దిని ఉత్తరాన కంచి కామాక్షి, నాగేంద్రస్వామి, సుందోప సుందులు, నట రాజు, దత్తాత్రేయ స్వామి, ఆది శంకరా చార్యులు, శనీశ్వరుడు రాధ కృష్ణుల విగ్రహాలు చూడ వచ్చు .

తూర్పు ప్రాకారంలో పశ్చిమ ముఖంగా సూర్య బగ వానుడు, కాశీ విశ్వేశ్వరుడు, నగరేశ్వరుడు బాణాసురుడు, కాల భైరవ విగ్రహాలున్నాయి . ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించి చిమ్మిరి నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం . తూర్పున శనీశ్వరుడు లింగా కారంలో ఉండటం విశేషం . నగరేశ్వరుడిని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు . శ్రీరాముడు రావణ వధ దోషాన్ని పోగొట్టుకోవటానికి చేసిన 108శివలింగ ప్రతిస్టలలో 106వ లింగాన్ని ఇక్కడే ప్రతిష్టించినట్లుస్థల పురాణం . .అందుకే పాలకొల్లు అపర కాశి అని పించు కొంటున్నది .

క్రీ శ. 918లో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామాలను గుర్తించి ఆలయాలు నిర్మించాడని చారిత్రిక కధనం. ఈ గుడిలో 75 శిలాశాసనాలున్నాయి. వాటిపై రంగులు పూయటంతో చరిత్ర కనుమరుగౌతోంది. 1136-1640 మధ్య కాలంలో చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతి రాజులు మరెందరో భక్తులు విశేషంగా దానాలు ఇచ్చారు అలయాభి వృద్ధికి కృషి చేశారు. 1176లో వెలనాటి చోడరాజు భార్య గుందాంబిక అఖండ దీపారాధన కోసం భూదానం ఇచ్చింది. 1276లో కోట గణపతిదేవ మహారాజు నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించాడు. 1296లో ఇతని రాణి ఒడయ మహాదేవి దీపావళికి దీపోత్సవానికి శివరాత్రి రోజు బ్రాహ్మణ అన్న సంతర్పనకు 10పుట్ల భూదానం చేసింది. 1316 లో శ్రీ రామనారాయణ చక్రవర్తి శనివార మండపాన్ని కట్టిస్తే, 1385లో కాటయ వేమారెడ్డి ప్రభువు పుష్ప వాహనాన్ని ఏర్పాటు చేశాడు. 1388లో అల్లారెడ్డి రెడ్డి ప్రభువు శివాలయాన్ని కట్టించి "అల్లాడేశ్వరుడు" పేర లింగ ప్రతిష్ట చేశాడు. 1415-1416లో బెళ్ళాపిన్నమనేని, నరహరినేని అనే భక్తులు బంగారు రధాన్ని, కళ్యాణ మండపాన్ని ఇచ్చారు 1596కే పవళింపు సేవ మందిరం ఉంది . 1714లో పాలకొల్లు నిజాం పాలనలోకి వెళ్ళింది. క్షీరారామం పంచారామమే కాకుండా "శిల్పా రామ క్షేత్రం" గా ప్రసిద్ధి చెందింది .

చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వారల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు . ఏకాదశి నాడు రధోత్సవం చేస్తారు 1972 లో శ్రీ రామలింగేశ్వర’’ ఓరిఎంటల్ కాలేజి " ని ఏర్పరచి సంస్కృతవిద్యా బోధన ను ఉచిత భోజన వసతి సదుపాయాలతో కల్పించారు .

పాలకొల్లులో బయల్దేరి రాత్రిపదకొండు నలభై అయిదు నిమిషాలకు ద్రాక్షారామం చేరాము. అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు కొని భీమేశ్వర స్వామి దర్శనం కన్నుల పండువుగా చేసుకోన్నాం. ఆ తర్వాత అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారిని సందర్శించి పునీతులయ్యాం. ఆలయం చాలా పెద్ద ప్రాకారంలో ఉంది. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసు కొందాం .

"ద్రాక్షారామాత్పరం క్షేత్రం – న భూతో న భవిష్యతి" అని వ్యాస భగవానుడు భీమఖండమహా పురాణంలో చెప్పాడు. పంచారామాలలో రెండవదిగా త్రిలింగ క్షేత్రాలలోను రెండవదిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రంగా ద్రాక్షా రామం వర్ధిల్లింది .

శివుడి అమృతలింగం రెండవ భాగం ఇక్కడ పడింది . దీన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ఇక్కడ ప్రతిష్టించాలని సప్త ఋషులు భావించారు . కాని ఇక్కడ అప్పుడు నదిలేదు . గోదావరిని ప్రార్ధించారు . ఆమె మహర్షులతో ప్రయాణమై వచ్చింది . కాని మార్గ మద్యంలో ఋషుల, రాక్షసుల ఆశ్రమాలన్నీ మునిగి పోయాయి దీనికి కోపించిన వారాంతా గోదావరిని అదృశ్యం అయేలా శపించారు . అప్పుడు " తుల్య భాగుడు " అనే రాక్షస రుషి మధ్య వర్తిగా ఉండి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహించేట్లు చేస్తాడు . సప్తరుషులైన కశ్యప, అత్రి, జమదగ్ని, విశ్వా మిత్ర, గౌతమ, వసిష్ట, భారద్వాజుల చేత తీసుకొని రా బడింది కనుక దీనిని " సప్త గోదావరి " అంటారు . రాక్షసులతో వివాదం కారణంగా గోదావరి రాక ఆలస్యం అయి నందున శివుడు బ్రహ్మాది దేవతలా అభ్యర్ధన మేరకు ఇక్కడ ముహూర్త సమయానికి " భీమేశ్వరుడు " అనే పేరు తో మార్గ శిర శుద్ధ చవితి నాడు " స్వయంభు "గా వెలిశాడు . సప్తర్షులు వచ్చి విషయం తెలిసి నివ్వెర పోతారు. ఆలయం లోపలి వెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ విపరీత మైన వేడిగా ఉండటం గమనించారు . ఇంతలో ఆశీర వాణి’’ఇక్కడ స్వయంభుగా శివుడు వెలిశాడు . సూర్యుడు మొదటి సారిగా స్వామిని అర్చించాడు ఈ వేడి తగ్గటానికి ఈ గ్రామంలో ఎనిమిది దిక్కులలోను ఎనిమిది సోమ లింగాలను ప్రతిస్టిం చండి . అప్పుడు ఈ వేడి తగ్గు తుంది " అని వినబడింది.

అప్పుడు సప్తర్షులు తూర్పున కోలంకలో సూర్యుడు, ఆగ్నేయంలో దంగేరులో కశ్యపుడు, దక్షిణాన కోటి పల్లిలో అత్రి మహర్షి, నైరుతి కోరు మిల్లిలో భరద్వాజుడు, పడమర వెంటూరులో విశ్వా మిత్రుడు వాయవ్యం సోమేశ్వరంలో గౌతముడు, ఉత్తరాన వెల్ల గ్రామంలో వసిస్టూడు, ఈశాన్యం పెను మళ్ళలో జమదగ్ని మహర్షులు సోమేశ్వరుని పేర అష్ట లింగాలను ప్రతిష్టించారు . వీటినే " అష్ట సోమేశ్వర క్షేత్రాలు " అంటారు .

ద్రాక్షారామం పంచారామమే కాక పన్నెండవ శక్తి పీఠం కూడా . నవ బ్రహ్మ లలో ఒకరైన దక్ష ప్రజా పతి . ఇక్కడే యజ్ఞం చేశాడు అందువల్ల " దక్ష వాటిక " అయింది . ఇక్కడే పార్వతీ దేవిని అవమానించి అల్లుడు శివుడిని నిందించటం వల్ల పార్వతి యోగాగ్నిలో దహనం చెందింది శివుడిఆజ్న తో వీర భద్రుడు దక్షయ యజ్న విధ్వంసం చేసింది ఇక్కడే ఇక్కడే విష్ణువు చక్రాన్ని తినేశాడు భద్రుడు. సూర్యుని పళ్ళు రాల గొట్టాడు . బతిమాలితే మళ్ళీ ఇచ్చాడు . శివుడు భార్యా వియోగం తో పార్వతీ దేవి సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకొని విలయ తాండవం చేస్తుంటే విష్ణువు చక్రం తో ఆమె దేహాన్ని పద్దెనిమిది ఖండాలు చేశాడు అవి పడిన చోటల్లా శక్తి పీఠం అయింది. ఇది పన్నెండవ శక్తి పీఠం అయింది.

ద్రాక్షారామం ఎత్తైన రాతి ప్రహరీతో నాలుగు వైపులా నాలుగు రాజ గోపురాలతో, అయిదు ప్రాకారాల మధ్య ఉంది. మొదటి ప్రాకారంలో కొబ్బరి తోటలో నైరుతి భాగంలో మంగళవార మండపం, వాయవ్యంలో 70 స్తంభాల సోమవార మండపం, ఈశాన్యములో రుద్ర తీర్ధం, కాల భైరవుడు, అష్ట భైరవులు, తూర్పున అశ్వత వృక్షం మొదలులో శంకర నారాయణులుంటారు. తూర్పున నందీశ్వరుడు ధ్వజ స్తంభం ఉన్నాయి. దక్షిణాన శ్రీ అన్నపూర్ణాసమేత విశ్వేశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి ఆలయాలున్నాయి.



భక్తులు మొదట ప్రధాన ప్రాకార మండపం వద్ద కుడి వైపు నాట్యగణపతిని దర్శించి, ఎడమ వైపున డుండిగణపతిని చూసి, లోపలి వెళ్లి కుడివైపు శ్రీ రామ ప్రతిష్టితమైన క్షేత్రపాలకుడు లక్ష్మీ నారాయణులను దర్శించి, ఎడమ వైపున శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్టించిన విరూపాక్ష స్వామిని చూసి ఆలయ నమూనాను చూడాలి. బాల భీమేశ్వరుడు, నటరాజస్వామి, సప్త మాతృక దర్శనం చేయాలి. సూర్య నారాయణ, సుబ్రహ్మణ్య స్వాములని చూడాలి. మహిషాసుర మర్దిని, చండీశ్వర స్వామి నవగ్రహ, అష్ట దిక్పాలక మండపాలు, శ్రీ వీరభద్రేశ్వరాలయం, వటుక భైరవుడు, లక్ష్మీ గణపతి, నకులేశ్వరుడు, చతుర్ముఖ బ్రాహ్మలు, మొదలైన ప్రాకార దేవతలను చూడాలి.

స్వామి ప్రధాన ఆలయంలో కింది భాగంలో 14 అడుగుల ఎత్తుతో స్పటిక లింగాకారంగల స్వామి లింగ స్వరూపంగా కింది అంతస్తు నుండి పై అంతస్తుకు ఉంటుంది. ప్రధాన ఆలయం కింద భాగంలో శ్రీ సూరేశ్వర స్వామి, శ్రీ దుర్గా దేవి, శ్రీ ఆంజనేయ స్వామి, 108 శివ సాల గ్రామాలతో కూడిన "భీమ సభ". మధ్య ఉన్న స్వామి వారి మూల విరాట్ కు (దీనినే "చీకటి కోణం" అంటారు )ప్రదక్షిణం చేసి, మూడవ ప్రాకారం చుట్టి ప్రవేశించాలి. నాల్గవ ప్రాకారం చూసి, కింది అంతస్తులో మూల విరాట్ కి నమస్కరించాలి. ఇక్కడ పూజ, అభిషేకాలుండవు. వెనక్కి వచ్చి దక్షిణంలో మొదటి ప్రాకారం దగ్గర పది మెట్లు ఎక్కి, పై అంతస్తులో నంది మండపం చేరి మళ్ళీ అయిదవ ప్రాకార ప్రదక్షిణ చేసి తూర్పు ఆగ్నేయంగా కైలాస గణపతిని చూసి ఈశాన్యాన పంచలోహ నటరాజ స్వామిని దర్శించి పార్వతి మందిరాలను చూడాలి. కింది భాగంలో పానవట్టం నుండి 14 అడుగుల ఎత్తు ఉంది పై అంతస్తు వరకు వ్యాపించిన భీమేశ్వర స్వామి పై భాగం మూడు అడుగుల లింగాన్ని దర్శించాలి. ప్రదక్షిణ మండపం లో దక్షిణ నైరుతి లో రాతి స్తంభం పై శ్రీ వ్యాస భగ వానుని విగ్రహం తప్పక దర్శించాలి. అంతరాలయం లో పార్వతీ అమ్మ వారు ఉత్సవ మూర్తులు ఉంటారు.

పై అంతస్తు గర్భాలయం లో మూడు వైపులా విశాల మైన కిటికీలతో కింది నుండి పైకొచ్చిన భీమేశ్వర మహా లింగాన్ని దర్శించ వచ్చు. ప్రక్కనే ఉన్న మాణిక్యాంబ అమ్మ వారిని దర్శించాలి. తూర్పు వైపు మెట్ల మీదుగా కిందికి దిగాలి. పది మెట్లు దిగితే శ్రీ చక్రస్థిత అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవది అయిన మాణిక్యాంబ అమ్మ వారిని ప్రత్యెక ఆలయం లో దర్శించాలి.

మాఘ శుద్ధ ఏకాదశికి, భీష్మ ఏకాదశికి, మాణిక్యాంబ సహిత భీమేశ్వర స్వామికి, లక్ష్మీ నారాయణులకు ఒకే ముహూర్తంలో కల్యాణం నిర్వహించటం విశేషం. శివ కేశవ అభేదాన్ని ఇక్కడ చూడగలం.

ఈశాన్యంలో వెలుపలి ప్రాకారంలో డెబ్భై స్తంభాలతో సోమవార మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో వేగాయమ్మ పేటలో మాణిక్యాంబ అమ్మ వారి పుట్టిల్లు., అక్కడే అమ్మవారి పన్నెండవ శరీర భాగం పడిందని అంటారు. కల్యాణం రోజున స్వామి వారు ఊరేగింపుగా వేగాయమ్మ పేటకు వచ్చి వెళ్తారు.

క్రీ పూ. ఒకటవ శతాబ్ది నుండి ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. హాల శాత వాహనుడు హాలుడు గాదా సప్తసతిని సంకలనం చేశాడు. ఆయన సింహళ రాకుమారి లీలావతిని ఇక్కడే సప్త గోదావరి తీరంలో శ్రీ భీమేశ్వరాలయంలో వివాహం చేసుకొన్నట్లు లీలావతి కావ్యంలో రాశాడు.
గోరఖ్ పూర్ కళ్యాణ తీర్దాన్కాలులో లలితా రాగంలో జ్ఞాన పద శివ లింగ ప్రాదుర్భావ పటలంలో అష్టోత్తర దివ్య శత క్షేత్రాలలో "ద్రాక్షారామేత్ భీమేశం" అని వర్ణన ఉంది.
రాజశేఖర కవి రాసిన బాల రామాయణంలో ఈ స్వామి స్తుతి వర్ణన ఉంది.
కవి సార్వ భౌముడు శ్రీనాధుడు భీమఖండంలో ఈ స్వామి మహాత్మ్యాన్ని పరవశించి వర్ణించాడు.
"విభావంబునకు ప్రభవంబును, విలాసంబునకు నివాసంబును, నవ వర్గంబునకు వర్గంబును, ధర్మంబునకు మర్మంబును, దానంబునకు నిదానంబును, విద్యలకు నిలయమై " ద్రాక్షా రామ క్షేత్రం విలసిల్లిందని వర్ణించాడు.
కవి భయంకరుడు వేములవాడ భీమకవి " ద్రాక్షా రామ భీమేశ నందనుడన్ " అని చెప్పుకొన్నాడు.
ప్రౌఢ కవి మల్లన్న తన "రుక్మాంగద చరిత్ర" ను ఈ స్వామికి అంకితమిచ్చాడు.
పదహారవ శతాబ్ది వాడిన సూరన్న కవి "ధనభి రామ కావ్యం" ను ద్రాక్షారామ స్వామికి అర్పణ చేశాడు.
ఈ క్షేత్రానికి ఎందరెందరో రాజులు భూస్వాములు విలువైనవి దానం చేసినట్లు ఇక్కడున్న400 శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఇక్కడి పంచ తీర్దాలైన – దక్ష యజ్ఞం జరిగిన దక్ష తీర్ధం, సతీదేవి శరీర భాగం పడిన ముక్తి క్షేత్రమైన వేగాయమ్మ పేట ఎల్లారమ్మ గుడి, పాప హారిణి అయిన భీమపేటలోని సోమ తీర్ధం, హిమవంతుడు తపస్సు చేసి శంకర వరం పొందిన హైమావతి క్షేత్రం, సప్త ఋషులచే గౌతమిని అంతర్వాహినిగా తీసుకురాబడిన సప్త గోదావరి తీర్ధ క్షేత్రం అందరు ఓపికగా చూడ దగినవి.

ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంద్రేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, కాళేశ్వర, యమేశ్వర, వీరభద్రేశ్వర, బ్రహ్మేశ్వర, కపాలేశ్వర, కుక్కుటేశ్వర, సోమేశ్వర మహేశ్వర,సప్త కోటి రామ లింగేశ్వర క్షేత్రాలన్నీ ద్రాక్షా రామం చుట్టూ ఉన్నాయి. భీమేశ్వరాలయం మొదటి ప్రాకారం లో కాల భైరవాలయం వెనక రుద్ర తీర్ధం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి. ఆలయ వంశ పారం పర్య ట్రస్టీలు వేగాయం పేట జమీన్ దార్లు వాడ్రేవు రంగ నాయకమ్మ గారి కుమారులు వాడ్రేవు విశ్వ సుందర రావు బహద్దర్ ఆలయాన్ని అభి వృద్ధి చేశారు. 125 ఎకరాల ఈనాం భూమిని స్వామికి సమర్పించారు. వీరి మనుమడు రాజా వాడ్రేవు సుందర రత్నాకర రావు ఈ విషయాలను చూస్తున్నారు. ఆలయం దేవాదయ శాఖ ఆధ్వర్యం లో నిర్వ హింప బడుతోంది.

ద్రాక్షారామ సందర్శనం తర్వాత బస్సు బయల్దేరి రాత్రి రెండు గంటలకు సామర్ల కోటలో ఉన్న "కుమారారామం" చేరింది.

ఈ సోమవారం అర్ధ రాత్రి పన్నెండు దాకా దర్శనం ఇచ్చి ఒక పావుగంట మాత్రమే ఆలయ దర్శనం ఆపేసి మళ్ళీ రాత్రి పన్నెండుంబావుకు దర్శనం ఏర్పాటు చేశారు. సామర్ల కోట కుమారారామంలో. రెండు గంటలకు బస్సు దిగి ఒక వంతెన దగ్గర ఆటోలో మనిషికి అయిదు రూపాయలిచ్చి ఆలయం దగ్గరకు చేరాం. ముప్ఫై రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కొని లైన్లో నిలబడి కుమారాభీమేశ్వర స్వామిని దర్శించాం. అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించాం. మిగతా దేవతా మూర్తులను దర్శించి, లడ్డు ప్రసాదం కొని, అప్పుడే వచ్చిన వేడి వేడి పులిహోర ప్రసాదం కూడా కొని తిన్నాం. అందరు వచ్చేసరికి మూడు అయింది. అప్పుడు బస్సు బయల్దేరింది. ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసు కొందాం.



"మున్ను చాళుక్య భీమ రాత్పున్గవుండు-భక్తీ వెలయింప, నాభీమ వరము నందు –నిల్చి యార్తుల కోర్కెల నించు నట్టి –సదయు జాళుక్య భీమేశు సంస్తుతింతు" అన్నాడు శ్రీనాధుడు భీమఖండం లో ఈక్షేత్రాన్ని గురించి.
దీన్ని చాళుక్య భీమవరం అని కూడా అంటారు. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. చాళుక్య భీముడు ఈ పట్నాన్ని కట్టించి రాజధానిగా పాలించి, ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడ కుమార స్వామి అమృత లింగ శకలాన్ని ప్రతిస్టించాడు. కనుక ఈ క్షేత్రం కుమారారామభీమేశ్వరం అయింది. స్కంధా రామం అని పేరు కూడా ఉంది.
సామర్లకోటకు శ్యామల కోట అని పేరు. ఇక్కడ చాళక్య భీముడు కట్టిన కోట ఉంది. అది శిధిలమైంది. కుమారగిరి బావమరది కాటయ వేముడు దీన్ని జయించి శ్యామలా దుర్గాన్ని పునర్నిర్మించ బూనాడు. త్రవ్వుతూ ఉంటే మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం దొరికింది. దాన్ని శ్యామల దేవి పేరుతో కాటయ వేముడు ప్రతిస్టించాడు. దీనికి దక్షిణంగా గ్రామ నిర్మాణం చేసి దానికి శ్యామలా దుర్గం అని పేరు పెట్టాడు. అది క్రమంగా మారి సామర్లకోట అయింది. శ్యామలా దేవి ఇప్పుడు ఈ భీమేశ్వరాలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉన్నారు. ఈ శ్యామలకోట బొబ్బిలి యుద్ధంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. ఒకప్పుడు స్వాములు ఇక్కడ ఉండే వారు. అందుకని స్వాముల కోట అయింది అదే సామర్ల కోట అయింది.

దేవాలయం చుట్టూ 18అడుగుల ఎత్తు ప్రాకారం ఉంది. నాలుగు వైపులా గోపురాలున్నాయి. ఇక్కడి శిల్పకళ ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నమూనా దేవాలయం ఉంది. దక్షిణంగా ప్రదక్షిణ చేస్తూ వెడితే తూర్పున ఉన్న కోనేటిలో స్నానమో పాదప్రక్షాళనో చేసి ఆలయ ప్రవేశం చేయాలి కోనేరుకు భీమగుండం అని, పుష్కరిణి అని పేర్లు. కుమారనది లేక కుమార సరస్సు అంటారు. కుమారారామానికి దగ్గరలో కొమరేరు ప్రవహిస్తోంది. శ్రీ నాధుడు బాదరాయణు డత్యంత భక్తీ నియతి –దివ్య వాహిని గోమరేట దీర్ద మాడి –శిష్య వర్గంబు దాను దర్శించి, మ్రొక్కి –శాశ్వతునకు జాళుక్య భీమేశ్వరునకు అన్నాడు

శివుడు వ్యాస మహర్షిని కాశీ నుంచి వెళ్ళ గొట్టిన తర్వాత ద్రాక్షారామాన్ని, కుమారారామాన్ని సందర్శించి నట్లు భీమ ఖండం లో ఉంది.

ధ్వజ స్తంభం దాటి లోపలికొస్తే నల్ల రాతి నంది విగ్రహం కనిపిస్తుంది ప్రాకార దేవతలను సూర్య దేవుడిని చూసి మహా గణపతి, సప్త మాతృకలు దాటితే దక్షిణ ద్వారం వస్తుంది. ఇది దాటి తూర్పుకు వెడితే సరస్వతీ దేవి కుమార స్వామి కనీ పిస్తారు. వాయవ్యం లో మహిషాసుర మర్దిని, ఉత్తర తూర్పులో శ్రీ మహా విష్ణువు, దక్షిణాన లక్ష్మీదేవి దర్శించి, ఉతర ద్వారం దగ్గరకు చేరాలి. దాన్నిదాటి ప్రాకార మండపం చేరితే చండీశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఈశాన్యాన వల్లీ సుబ్రహ్మన్య స్వామిని దర్శించాలి. ఇక్కడే ఉయ్యాల మండపం ఉంది. ఈ మండపం " ఊపితే కదులుతుంది " ఇదీ విశేషం. ప్రాకారం లో బాలా త్రిపురసుందరి దేవి పశ్చిమాభి ముఖం గా దివ్య కాంతులతో దర్శన మిస్తారు.

అమ్మ వారి దర్శనం తర్వాత రెండు మెట్లు దిగి చతురస్రాకార గర్భ గుడి లో భీమేశ్వర స్వామి పాను వట్టం పై తెల్ల పాల రాతి రంగులో ఉన్న పన్నెండు అడుగుల ఎత్తున్న శివ లింగం పై అంతస్తు దాకా ఉంటుంది. దీనినే " యోగ లింగం " అంటారు. కింది అంతస్తు గర్భ గుడి కి దక్షిణ ప్రాకారం ఉంది. ఇది చాలా చీకటి ప్రాకారం. కింది అంతస్తులో శివలింగాన్ని దర్శించటమే కాని పూజాదికాలుండవు. పై అంతస్తులో రుద్రభాగంలో అభిషేకాలు, పూజాలు నిర్వహించాలి. కింది అంతస్తులోకి గర్భగుడి నుండి కిందికి దిగి దక్షిణంలో ఉన్న మెట్ల ద్వారా పై అంతస్తుకు చేరచ్చు. ఈ మెట్లు చిన్నవి తల వంచి వెళ్ళాలి లేకుంటే పై అంతస్తుకు తల తగులుతుంది. ఈ దక్షిణ ఆగ్నేయ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. కిందికి దిగటానికి ఉత్తరాన మెట్లుంటాయి. ఈ ఉత్తర ఈశాన్య ద్వారమే చంద్ర ద్వారం. ఈ సూర్య, చంద్ర ద్వారాలు రెండు గర్భగుడికి నాశికారంధ్రాలు అంటారు. మానవుడి నాసికా ద్వారాల్లలో ఎడమ వైపుది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగీశ్వరుడు ఈ రెండు నాడుల గుండా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణ వాయువును సహస్రారంలో అంటే శిరస్సులో చేర్చి పరమాత్మ అనుభూతి పొంది ఆనందమయమైన జీవికి ఇది యోగ మార్గం గా నిర్మించిన ద్వారాలు గా వీటిని భావిస్తారు.

గర్భాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుంటాయి. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య భగవానుడి ఉషః కిరణాలు ఉదయాన స్వామి పాదాల పైన సాయంత్రం అమ్మ వారి పాదాల మీద పడటం విశేషం. కార్తీక మాసం లో, మార్గ శిర మాసం లో, మహా శివ రాత్రి నాడు విశేష పూజలు అభి షెకాలు నిర్వహిస్తారు. శరన్నవ రాత్రులలో శ్రావణ మాసం లో అమ్మ వారికి కుంకుమ పూజ విశేషం. మాఘ బహుళ ఏకాదశి నాడు స్వామికి గ్రామోత్సవం కల్యాణోత్సవం రధోత్సవం వైభవం గా జరుగుతాయి.

అనేక మంది రాజులు పాలించిన ప్రదేశం ఇది. నంద వంశ రాజుల నుంచి తూర్పు చాళుక్యుల వరకు దీన్ని పాలించి స్వామిని దర్శించి కానుకలర్పించారు. కాళింగ దేశం నుండి పిఠాపురం రాజ మండ్రి వరకు పాలించిన చాళుక్యులు ఈ ప్రాంతాన్ని దర్శించిన వారే. కుబ్జ విష్ణు వర్ధనుడి దగ్గర నుంచి మేడ విజయాదిత్యుని వరకు ముప్ఫై మంది పాలించారు. చాళుక్య భీముడు కుమారా రామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. తన యుద్ధాలవిజయాలకు ప్రతీక గా దీన్ని నిర్మించాడు. ఈయన 300 యుద్ధాల విజేత ఈయన. కుమారారామ భీమేశ్వరాన్నిరాజధానిగా చేసుకొని పాలించాడు. వీర చాళుక్యుడు అని పించుకొన్నాడు. అందుకే చాళుక్య కుమారారామభీమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు.

ఈ రంతం కొంతకాలం గోల్కొండ నవాబుల అధీనం లోను ఉంది. ఈ నాటి హుసేన్ పురం వరకు వ్యాపించి ఉండేది. కొంతకాలం పెద్దాపురం సంస్థానంలో, పిఠాపురం సంస్థానంలోను ఉండేది. ఆలయ పశ్చిమ ద్వారం వద్ద పశ్చిమ గోడకు ఒక గణ పతి విగ్రహం ఉంది. ఈ విగ్రహం నాభిలో ఒక వజ్రం ఉండేదని, రాత్రి పూట ఆ వజ్రం నుంచి కాంతి పుంజాలు వెలువడి భక్తులకు మార్గదర్శకంగా ఉండేది. దాన్నెవరో దొంగిలించారు. వ్యాసుడు హీమేశ్వరుని, రాజ నారయుణుడి ని దర్శించాడుఅని భీమేశ్వర పురాణం లో ఉంది.

" రాజ నారాయణ స్వామి రమ్య భావన – తార్క్ష్య కేతన పతికి నర్తనము గారపు –కుమారా రామ మాహర్మరేఖయ –చాళుక్య భీమేశు సదన వాటి " అని వర్ణించాడు శ్రీ నాధుడు.
ఆలయానికి పడమర రెండు కిలో మీటర్ల దూరం లో మాండవ్య లక్ష్మి దేవి సహిత నారాయణ స్వామి ఆలయం ఉంది. దీనికే " రాజ నారాయణ స్వామి ఆలయం " అంటారు.

కాటన్ దొర ఏర్పాటు చేసిన నీటి కాలువల వల్ల ఈ గ్రామానికి సామర్లకోటతో సంబంధం తెగిపోయింది. గ్రామం నామ మాత్రం గా మిగిలింది. అయితే వంతెనలు నిర్మించటం వల్లసామర్ల కోటకు రాక పోకలు జరుగుతున్నాయి.

ఇలా పంచారామాలను ఈ కార్తీక మాసంలో, అందునా సోమవారం నాడు దర్శించే అరుదైన అవకాశం లభించి, జీవితం ధన్యమైనదనిపించింది. తెల్లవారుజామున మూడు గంటలకు మా బస్సు బయల్దేరి మళ్ళీ వచ్చిన దారిలోనే పాలకొల్లు, భీమవరం దాటి కైకలూరు చేరేసరికి మంగళవారం ఉదయం ఎనిమిదింటికి చేరింది. అక్కడ ఒక అరగంట "రిసెస్" కు సమయం కోసం బస్ స్టాండ్ లో ఆపారు డ్రైవర్లు. ’’ఒకటి రెండు’’ కానిచ్చి ఎనిమిదిన్నరకు బయల్దేరి గుడివాడ మీదుగా ఉయ్యూరు ఉదయం పది పది కి చేరాం. న్యాయంగా సోమవారం రాత్రి ఉయ్యూరు చేరాలి. కాని పది గంటలు ఆలస్యం గా ఉయ్యూరు చేరాము. మా మనుమరాలును ఇంటి దగ్గర దింపి ఇంటికి వచ్చి పళ్ళు తోముకొని, స్నానం చేసి, సంధ్య పూజాదికాలు నిర్వహించాను, మా కోడలు రాణికి ముందే ఫోన్ చేసి మాకు కూర పచ్చడి చేసి పంపమని చెప్పాను. అలాగే మేము వచ్చేసరికి కారియరులో మా మనవడు చరణ్ చేత పంపింది. టిఫిన్ గా సీరియల్ తిన్నాం. అన్నం వండుకొని ఆ కూరా పప్పు పులుసుతో తిన్నాం. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయల్దేరి బెజవాడ వెళ్లి బస్సులో తణుకు సాయంత్రం నాలుగింటికి చేరి అక్కడ నన్నయ భట్టారక పీఠంలో "రామాయణ భారతాలలో మానవ విలువలు" పై ప్రసంగించి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరాను. ఇలా ఆదివారం నుండి మంగళ వారం దాకా మూడు రాత్రులు నిద్రలేకుండా గడిపాను. అయినా ఆనందంగా హాయిగా ఉంది.
పంచారామ సందర్శనం సర్వం సంపూర్ణం.




Thursday, 12 September 2013

భూటాన్‌!


ఆనందం... పచ్చదనం... భూటాన్‌!
పర్యావరణంలో ముందుంటది... సంతోషమే ఈ దేశం బలం... ఎక్కడో ఏంటో ఆసక్తికరమైన ఆ వివరాలేంటో?
మనం పచ్చదనం పర్యావరణంపై బోలెడు నినాదాలు వింటూనే ఉంటాం. కానీ వీటిని పరిరక్షించుకోవడంలో ఎంత ముందున్నాం? ఈ విషయంలో భూటాన్‌ ప్రత్యేక స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో పర్యావరణ రక్షణపై ప్రత్యేక నిబంధన ఉంది ఈ దేశంలో మాత్రమే. దేశ వైశాల్యంలో 60 శాతం అడవులు ఉండాలన్నది ఇక్కడి రాజ్యాంగ నిబంధన. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మొక్కలు కానుకలుగా ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. 






జెండా:
పతాకంపై జాతీయ చిహ్నం డ్రాగన్‌ ఆకారం తెలుపు నలుపు రంగుల్లో ఉంటుంది. దీని తెలుపు స్వచ్ఛతకు గుర్తు. పసుపు రంగు రాజ్యాధి కారానికి, కాషాయం బౌద్ధమతానికి సూచికలు.
  • ఈ దేశానికి కార్బన్‌ నెగెటివ్‌ కంట్రీగా పేరు. ఎందుకంటే భూటాన్‌లోని చెట్లు ఈ దేశంలో విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌ మొత్తాన్నీ పీల్చేసుకున్నా ఇంకా మరింత కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే సామర్థ్యం కల్గి ఉంటాయి. రకరకాల పరిశ్రమలు, వాహనాలూ ఇతర రూపంలో ఏటా భూటాన్‌ విడుదల చేస్తున్న కార్బన్‌డయాక్సైడ్‌ 15 లక్షల టన్నులు కాగా, అక్కడి చెట్లు 60 లక్షల టన్నుల కార్బన్‌ వాయువును పీల్చుకుంటున్నాయి.
  • మరో ప్రత్యేకతా ఉంది.. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి కన్నా ప్రజల ఆనందానికే ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే సంతోష సూచిక ఉంటుంది. అదే గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌. ఏటా ప్రజల ఆనందాన్నే లెక్కిస్తారు.
  • భూటాన్‌.... దక్షిణాసియాలోని చిన్న దేశం. చుట్టూ భూభాగాలే సరిహద్దులుగా ఉన్న దేశమిది. దక్షిణ, తూర్పు, పడమర దిశల్లో భారత్‌, ఉత్తరాన చైనా దేశంలో భాగమైన టిబెట్‌ ఉన్నాయి.
  • భూటాన్‌లో విద్యా, వైద్యం ఉచితం. పర్యాటకులకు కూడా.
  • ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని రెండే రెండు నగరాల్లో రాజధాని థింపూ ఒకటి. ఇక్కడ కూడళ్లలో పోలీసులే నిలబడి ట్రాఫిక్‌ సంకేతాలిస్తారు.
  • భూటాన్‌లో బౌద్ధమతానికి ఎక్కువ ప్రాధాన్యం.
  • ఈ దేశంలో మొత్తం 24 భాషలు మాట్లాడుతారు.
  • పొగాకు అమ్మకాల్ని నిషేధించిన ఏకైక దేశమిది.
  • భూటాన్‌లో 1999 వరకూ టీవీ, అంతర్జాలం వాడటం నిషిద్ధమట.
  • మొదటిసారిగా ఇతర దేశాల పర్యాటకుల్ని అనుమతించింది 1974లో.
  • 1999 నుంచి ఇక్కడ ప్లాస్టిక్‌ సంచీలు వాడటం నిషిద్ధం.
  • ఈ దేశ జాతీయ జంతువు ‘టకిన్‌’. విచిత్రమైన రూపంతో ఉండే ఈ జంతువు ఇక్కడ మాత్రమే ఉంటుంది. తలేమో మేకలా, శరీరమేమో జడలబర్రెలా ఉంటుంది.

Thursday, 25 July 2013

మద్ది ఆంజనేయస్వామి







ఈ గుడికి చెట్టే శిఖరం!!


చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయస్వామిగా వెలిసి దేశంలోనే ప్రముఖ హనుమద్‌ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్రకాలువను ఆనుకుని మద్దిచెట్టు తొర్రలో వెలిసిన స్వయంభూ క్షేత్రం మద్ది ఆంజనేయస్వామి ఆలయం. 50 సంవత్సరాల క్రితం చిన్న చెట్టు తొర్రలో ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం ప్రముఖ దేవాలయాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.

స్థలపురాణం
పచ్చనిపొలాల నడుమ మద్దివృక్షం కింద ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో దర్శనమిచ్చే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించడం వెనక చాలా లోతైన పురాణ గాథ ఉంది. మద్వాసురుడు అనే రాక్షసుడు త్రేతాయుగంలో రావణసైన్యంలో ఉండేవాడు. రాక్షసుడైనప్పటికీ మద్వాసురుడు ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు. రామ రావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న ఆంజనేయస్వామి వారిని చూసిన మద్వాసురుడు అస్త్రసన్యాసం చేసి ‘‘హనుమా హనుమా’’ అంటూ తనువు చాలించాడు. అతడే ద్వారయుగంలో మ«ధ్వకుడుగా జన్మించాడు. ఈ యుగంలో కౌరవ, పాండవుల యుద్దంలో కౌరపక్షాన పోరాడుతున్న మధ్వకుడు ఆర్జునునిజెండాపై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారిని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్వుడుగా జన్మించి ఆంజనేయస్వామి వారి దర్శనం కోసం అనుక్షణం పరితపించేవాడు. నిత్యం ఎర్రకాలువలో దిగి స్నానమాచరించి ఆంజనేయస్వామి కోసం తపస్సు చేసేవాడు.

ఒకరోజు స్నానంచేసి, ఒడ్డుకు చేరబోతున్న మద్వుడు వయోభారంతో తూలి కాలువలో పడిపోబోయాడు. అప్పుడు ఎవరో తనను చెయ్యి పట్టుకుని ఆపినట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే, వానరం ఒకటి తన చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి ఒక ఫలాన్ని ఇచ్చింది. అది మొదలు ఆ వానరం రోజూ మద్వుడికి సపర్యలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళుతుండేది. ఒకనాడు మద్వుడికి ఆ వానరం ఆంజనేయస్వామిలా గోచరించింది. ‘నేను ఎంత పాపిష్టివాడిని! ఇంతకాలం స్వామివారితో సపర్యలు చేయించుకున్నానా!’ అని బాధపడ్డాడు. ఇంతలో స్వామి ప్రత్యక్షమై ‘‘మద్వా ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశాను కాబట్టి విచారించక వరం కోరుకో’’ అన్నాడు. మద్వుడు ‘‘స్వామీ మీరు ఎల్లప్పుడూ నా చెంత ఉండేలా వరం ప్రసాదించండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి ‘‘నీవు మద్దిచెట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిల రూపంలో ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో వెలుస్తాను. మనిద్దరినీ కలిపి మద్ది ఆంజనేయస్వామిగా భక్తులు పిలుస్తారు’’ అని చెప్పినట్లు స్థలపురాణం.

ప్రదక్షిణలతో పరవశించే దైవం
కోరిన కోర్కెల తీరాలంటూ శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని వస్తుంటారు. ముఖ్యంగా వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడిన వారు ఈ స్వామి వారి ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

దీక్షల దేవుడు
శబరిమలైలో అయ్యప్ప స్వామి మాలధారణకు ఎంత విశిష్టత ఉందో, గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి హనుమద్దీక్షలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఏటా హనుమజ్జయంతి, కార్తీక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హనుమద్‌ దీక్షలు చేపట్టిన హనుమత్‌ దీక్షాధారులు శ్రీమద్ది క్షేత్రంలో స్వామి వారి సన్నిధిలో ఇరుముడులు సమర్పిస్తుంటారు.

స్వామిని సందర్శించాకనే...
గోదావరి జిల్లాల్లో ఏపని మొదలు పెట్టాలన్నా ఈ దేవస్థానాన్ని సందర్శించి ఆ పని మొదలుపెట్టడం ఆనవాయితీ. ఈ ప్రాంతం నుంచి సినీరంగంలో స్థిరపడిన నటులు, దర్శకులు తమ సినిమా ప్రారంభంలో ఈ దేవస్థానాన్ని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీ. అదే విధంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా దేవస్థానాన్ని సందర్శించి ప్రచారం ప్రారంభించడం అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఆలయానికి ఇలా వెళ్లాలి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ద్వారా చేరుకోవచ్చు. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెంకు బస్సు సర్వీసులు ఉన్నాయి. రైలు ద్వారా చేరాలనుకునేవారు ఏలూరు రైల్వే స్టేషన్‌ నుంచి జంగారెడ్డిగూడేనికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గల ఈ దేవాలయం చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
– అచ్యుత రాము, సాక్షి,
జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా






మహిమాన్వితం... మద్ది క్షేత్రం..!

వాయునందనుడూ, వజ్రబల సమన్వితుడూ, అంజనీ పుత్రుడూ అయిన ఆంజనేయుడిని అర్చిస్తే చాలు ముక్కోటి దేవతలనూ పూజించిన ఫలితం దక్కుతుందట. అంతటి మహిమాన్వితుడైన హనుమ తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన చోటు మద్ది ఆంజనేయస్వామి దేవాలయం. మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

హనుమంతుడికి రాముడంటే ఎంతిష్టమో తనను శరణువేడిన భక్తులన్నా అంతే ప్రీతి. తలచినంతనే తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. అంతేకాదు, ఆయన్ను నమ్మిన వారికి మనోబలాన్నీ, బుద్ధి కుశలతనూ, మంచి వాక్కునూ అనుగ్రహిస్తాడు. వాయునందనుడిని భక్తితో కొలవాలే కానీ అసురుడినైనా అక్కున చేర్చుకుంటాడు. దీనికి నిదర్శనమే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గురవాయిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం. ఓ అసుర భక్తుడి కోరికను మన్నించిన స్వామి అక్కడే ఓ చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిశాడు.

స్థల పురాణం..
సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా క్రీ.శ.1166వ సంవత్సరంలో ఆ వూరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు.

ప్రదక్షిణ మొక్కులు..
తీరని కోర్కెలు ఉన్నవారూ పలు సమస్యలతో సతమతమవుతున్నవారూ ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. దీనితోపాటు శని దోషాలూ, రాహు కేతు దోషాలూ, నవగ్రహ దోషాలూ ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వైష్ణవ సంప్రదాయంలో మద్ది ఆంజనేయస్వామికి నిత్యపూజలూ, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రòక్తంగా జరుపుతారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దూరాభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.

వేడుకలు, ఉత్సవాలు...
మద్ది క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలను అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆది, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్‌ కళ్యాణాలూ, లక్ష్మీ కుంకుమార్చనలూ జరుపుతారు. కార్తిక మాసం నెల రోజులూ ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడినీ దర్శించి సంపూర్ణ క్షేత్ర దర్శన ఫలాన్ని పొందుతారు.

ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వేంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే...
ఏలూరు నుంచి 50 కిలోమీటర్లూ, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకూ బస్సు ఉంటుంది.


కొండవీటి అనిల్‌కుమార్‌, ఈనాడు, తాడేపల్లిగూడెం
- కార్తిక్‌, న్యూస్‌టుడే, లింగపాలెం




Wednesday, 1 August 2012

శివయ్య లాలింపు

మొన్నీ మధ్య తమిళనాడు వెళ్లాను అక్కడ చాలా గుళ్లూ గోపురాలు తిరిగాను. ఇందులో భాగంగా.. అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం.. తిరుమెచ్చూరు వెళ్లాను  ఇది చెన్నైకి ఓ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి లలితాంబిక ఆలయంలో శిల్ప సంపదను దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శివుడు పార్వతీ దేవిని లాలిస్తూ.. వేడుకుంటున్నట్లుగా ఇక్కడి గుడి గోడలపై చెక్కిన "క్షేత్ర పురాణేశ్వర" శిల్పం, ఆహా ఎంతటి దేవదేవుడికైనా భార్య అలక తీర్చేందుకు పాట్లు తప్పవు కదా అనిపించింది. ఇంకో విచిత్రమేంటంటే.. శిల్పానికి ఎడమ వైపు నుంచి చూస్తే పార్వతీదేవి కళ్లు ఆగ్రహంతో ఉన్నట్లుగాను, కుడివైపు నుంచి చూస్తే ప్రసన్నంగానూ కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితపు శిల్పుల ప్రావీణ్యతకు ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Monday, 14 February 2011

కొండనే మలుచుకున్న 'కోనేటిరాయడు'



14 Feb 2011

95 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం

కోట్లాదిమంది ఆరాధ్యదైవమైన శ్రీవెంకటేశ్వరుని భారీ విగ్రహం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో రూపు దిద్దుకుంటోంది. 95 అడుగుల విగ్రహం భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విగ్రహం పూర్తయితే తిరుపతి వచ్చిన భక్తులంతా తిరువణ్ణామలై రావాల్సిందేనని, ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ వెంకటేశ్వరుని విగ్రహం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.

రాళ్లను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో తమిళులకు ప్రత్యేకత వుంది. తంజావూరు, మధురై, మహాబలిపురంలలోని శిల్ప సౌందర్యమే ఇందుకు నిదర్శనం. కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం మరో ఉదాహరణ. ఇదే ఆదర్శంగా తీసుకున్న శిల్పులు ఏకంగా 95 అడుగుల ఎత్తయిన తిరుమలేశుని విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మరో విశేషముంది. సాధారణంగా రాళ్లను తొలచి విగ్రహాలుగా మలుస్తారు. కానీ ఇక్కడ కొండనే విగ్రహంగా మలచడం విశేషం.

పెరుమాళ్‌గా మారిన శివుడు
తిరువణ్ణామలై నుంచి వేలూరుకు వెళ్లే దారిలో 32 కి.మీ దూరంలో వున్న గాంగేయలూరులో ఈ అద్భుతం రూపు దాలుస్తోంది. వాస్తవానికి ఈ విగ్రహం విషయంలో ముందు అనుకున్నదొకటి. కానీ జరుగుతున్నది మరొకటి. 1998లో ఇక్కడ శివుడి (చంద్రశేఖరుడు) విగ్రహాన్ని తయారు చేయాలని కంచి శంకరమఠం నిర్వాహకులు భావించారు. ఇందుకోసం గాంగేయలూరు చుట్టూ వున్న కొండలను పరిశీలించారు.

దాదాపు వంద కొండలను పరిశీలించిన తరువాత, చివరిగా 'గోపురం కొండ'ను ఎన్నుకున్నారు. ఇక్కడ తయారు చేసే విగ్రహాన్ని చెన్నై-మహాబలిపురం రోడ్డులోని ముత్తుక్కాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 22,550 చదరపు అడుగుల వైశాల్యంలో విగ్రహం తయారు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలైమామణి ముత్తయ్య స్థపతి సారథ్యంలో విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ, శివుని శిలను పెరుమాళ్‌గా మార్చాలని శంకరమఠం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ విగ్రహం తయారీ పనులు జరుగుతున్నాయి. 25 అడుగుల పీఠం ఎత్తుతో కలిపి మొత్తం 120 అడుగుల ఎత్తుతో విగ్రహం తయారవుతోంది. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. సుమారు వెయ్యి టన్నులు బరువు కలిగిన పెరుమాళ్ విగ్రహాన్ని గాంగేయలూరు నుంచి ముత్తుక్కాడు వరకు తీసుకొచ్చేందుకు మార్గమధ్యంలోని వంతెనలు తట్టుకునేస్థితిలో లేవు.

భారీ విగ్రహం అంత దూరం తీసుకొచ్చే ప్రయత్నంలో దెబ్బతినే అవకాశం కూడా వుందని నిపుణులు హెచ్చరించడంతో నిర్వాహకులు ఆందోళన చెందారు. ఈ కారణంగా విగ్రహం తయారీ పనులు నిలిచిపోయాయి కూడా. అయితే విగ్రహం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం మంచిది కాదని భావించిన గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని ఆశ్రయించారు. అప్పట్లో తితిదే పాలకమండలి నుంచి N.యువరాజ్ నేతృత్వంలోని పలువురు సభ్యులు వచ్చి ఈ పనులను పరిశీలించి, విగ్రహాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. అంతేగాక గాంగేయలూరులోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానించారు. ఎట్టకేలకు పనులు ఊపందుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నామలై, పడవేడు, రేణుకామ్మాళ్ వంటి ప్రసిద్ధ ఆలయాలున్న తిరువణ్ణామలై జిల్లాలో పెరుమాళ్ విగ్రహమున్న గాంగేయలూరు కూడా మరో పుణ్యక్షేత్రంగా మారడం ఖాయం.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...