Friday, 4 March 2016

ఓహో అహోబిళం


కొన్ని నెలలుగా నల్లమల అడవులవైపునున్న అహోబిళం దేవాలయంతోబాటు వాటి చుట్టూ వున్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించాలన్న ఆలోచనలో వున్న నేను, తోడుగా వచ్చే ఔత్సాహికులైన యువకులకోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక యువమిత్రుడుని కలిసిన సమయంలో " అన్నా రేపు శనివారం స్వాతి నక్షత్రం.ఆ రోజు పర్వదినంగా బావించి అహోబిళంలో ఉన్న నవ నరసింహస్వాములను  దర్శించడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్తున్నాము, ఈ సమయంలో అక్కడికి చాలా మంది వస్తారు, మీరు కూడ వస్తారా..? " అని అడిగాడు... నేను దేనికోసం ఎదురుచూస్తున్నానో...!! అదే సమయం నాకు ఎదురుకావడంతో నా సంసిద్దత వ్యక్తం చేసాను. వారిది దైవభక్తి..మరి నాది ప్రకృతి భక్తి.. ఏది ఏమి అయితేనేమి నాకు కావల్సింది అక్కడ తిరగడానికి తోడుగా మనుషులు కావాలి, మామూలు సమయాలలో అక్కడ వంటరిగా తిరగలేము, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూవుంటాయి.

ఎవరి వారి ఆలోచనలతో మరునాటి తెల్లవారు జామునే 5 గంటలకే నలుగురం రెండు మోటర్‌బైకులలో బయలుదేరాము. మా ఊరినుండి షార్ట్‌కట్‌లో వెళ్తే  80 కిలోమీటర్లు ఉండవచ్చు. దారిపొడవునా తెల్లని పొగమంచులా కమ్ముకొని ఉన్నది, చూడటానికి చలికాలపు తెల్లగా మంచులా ఉన్నా అది మంచు కాదు " మొగలి " అని అంటారు. ఊటిలో ఉన్నట్టుగా ఉన్నది వాతావరణం, తెల్లటిమేఘంలా రహదారిమీద దూదిపింజలా మెల్లిగా ఎగురుతూ పోతున్నది " మొగలి "...!  ఆరోగ్యానికి అంతమంచిది కాకపోయినా మంచులా ఫీల్ అవుతూ దారిపొడవునా " మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా సాగిపోతున్నది " అని వెనుక అమ్మాయిలేకున్నా... పాట పాడుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాగలమర్రి వూరు మీదుగా 7:30 నిమిషాలకు అహోబిళం చేరుకున్నాము.
దిగువ అహోబిళం దర్శించకుండానే కొండమీదున్న ఎగువ అహోబిళం చేరుకొన్నాము. గంభీరమైన రెండు పర్వతశ్రేణుల మద్యన నెలకొనివున్నది ప్రధాన ఎగువ అహోబిళం. అక్కడ కూడ ప్రధాన దేవాలయం దర్శించకుండా.. దేవాలయానికి ఎడుమపక్క నున్న చిన్న చెక్క బ్రిడ్జీమీదుగా వెనుకకు చేరుకున్నాము. అక్కడ నుండి మహావృక్షాలతో నిండి ఉన్న నల్లమల్ల అడవులతో విస్తరించివున్న పర్వతాలను ఎక్కడానికి ముందుకు అడుగేసాము.

ఓబులం, అహోబిళం, అహాబిలం, అహబిలగిరి, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, అచల చాయమేరు, సింగనేల్ కున్నం, నిధి, నగరి, శేషాద్రి, నరసంహ్మతీర్థం, గరుడాచలం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఎగువ అహోబిళానకి 8కి.మీ. దూరంలో వున్న ఉక్కు స్థంభం నుంచి విష్ణుమూర్తి నరసింహుని రూపంలో వచ్చి హిరణ్యకశ్యపుని వధించే సమయంలో ఉగ్ర నరసింహస్వామిని అహోబిలుడిగా దేవతలందరూ స్తుతించటం వలన ఈ క్షేత్రానికి అహోబిళం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో 9 ఆలయాలు, 6 కోనేర్లు, 122 మంటపాలు, అనేక చత్రాలు వున్నాయి.
మా నడక మార్గమద్యన ఒక ప్రదేశంలో కొందరు భక్తులు కాలినడకన నడిచే భక్తులకోసం ఉచితంగా " నాస్టా " ఏర్పాటు చేసారు, ఆగకుండా వెళ్తున్న నన్ను మా ఫ్రెండ్ ఆపాడు.  " ఇక్కడ  టిఫిన్ తినకపోతే మరెక్కడ పైన దొరకదు. మర్యాదగా ఇక్కడ టిఫిన్ చేసి వెల్దాము " అన్నాడు..ఇష్టం లేకపోయినా ఆగక తప్పలేదు నాకు. ఆహోబిళం దగ్గరలో నున్న గ్రామాల నుండి, ఆళ్ళగడ్డ నుండి కొందరు భక్తులు ఉచితంగా భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఏడాదీ అక్కడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు, వారికి  మొక్కుబడిలో అదొక భాగం. ఎత్తైన చెట్ల కింద గ్యాస్ పొయ్యి. మరో రెండు కట్టెల పొయ్యిలతో అక్కడ వంటలు వండుతున్నారు. మహావృక్షాలమద్యన కాలినడకన అక్కడకు చేరిన భక్తులంతా అరటాకులలో పొంగలి, వేరుశనక్కాయి చెట్నీ కలుపుకొని ఆరగిస్తున్నారు. నేనంతగా పొంగలి ఇష్టపడను.  కాస్త సంకోచిస్తూ ఆరటాకు తీసుకొని టిఫెన్ తెచ్చుకున్నాను. మొదటి ముద్ద నోట్లో పెట్టుకొన్న రెండు క్షణాలకు  పొంగలి రుచి నా జిహ్వకు మహాద్భుతంగా తోచింది.. ఏముందా పొంగలిలో అని చూస్తే..! ఏముంది చాలా సింపుల్..ముంతమామిడి పప్పు ( జీడిపప్పు) తో పొంగలి, అందులోకి చెట్నీ..కాకపోతే చట్నీలో నిమ్మరసం పిండినట్లున్నారు కారకారంగా పుల్లపుల్లగా..! అందులోకి మల్లి టమోటా ఊరగాయి కలుపుకొని తింటుంటే..నాసామిరంగా..!. మావూళ్ళొ చెప్పుకొనే ఉపమానం గుర్తొచ్చింది.. మరదలుపిల్ల మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదోరకమైన పిలుపుతో ఆ పిల్ల " మావా " అంటుందట..అట్లా ఉన్నదారుచి..ఒక్క రుచే కాదు శుచి కూడ చాలా శుబ్రతగా ఉన్నది. అసలు పొంగలి ఇష్టపడనీ నేను మరోమారు పెట్టించుకొని లాగించేసా, నా తిండిపోతుతనం చూసిన మా ఫ్రెండ్స్ " ఇక చాల్లే ఎక్కువగా తింటే ట్రెక్కింగ్ చేయడం చాలాకష్టం " అని చెప్పగానే..ఆపేసా..కాని నా కడుపులోని ఆత్మారాముడు ఊరుకోవట్లేదు.లొట్టలేసుకుంటూ..గోలపెడుతున్నాడు." నాకింకా కావాలి " అంటూ...! వాడిని ’ మద్యాహ్నం భోజనం ఉండదు ఇలా మారాం చేసావంటే ’ అని బెదిరింపుతో బుజ్జిగించి అక్కడనుండి కదిలాను. మామూలుగా ఒక సామెత ఉంది, " కళ్ళు కావాలంటాయి..కడుపు వద్దంటుందీ " అని..కాని దీనికి రివర్స్ " కడుపు కావాలంటున్నది..కళ్ళు వద్దని వారిస్తున్నట్లుంది నా పరిస్థితి.

అసలు అక్కడ అలాంటి ప్రకృతిరమణీయ వాతావరణంలో వనభోజనంలా టిఫెన్ ఆరగిస్తుంటే చెప్పలేని అనుభూతే అది...! అంతేనా.. కాలినడకన వస్తున్న భక్తులను ఈ దాతలు ఒకటికి రెండు మూడు సార్లు అడిగి పిలుస్తున్నారు. మొహమాటస్తులను సైతం బతిమాలి టిఫిన్ పెడుతున్నారు. మరి కొన్న చోట్ల ఇడ్లీలు, పూరీలు పెడుతున్నారు. మేము తెచ్చుకున్న కిన్లీ బాటిల్స్‌ని నేను తీస్తుంటే వద్దని మా ఫ్రెండ్స్ వారించారు, " అర్రె కిన్లీ నీళ్ళకన్న మాంచి రుచికరమైన, మినరల్స్ ఉన్న నీళ్ళు ఇక్కడున్నాయి. అవి తాగి మన వద్దనున్న ఖాలీ బాటిల్స్‌లలో ఆ నీళ్ళను పట్టుకొని వెళ్దాం "  అన్నారు. కొండలపైన నుండి చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న మంచినీటి ధారలు అక్కడక్కడ చాలా ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద డ్రమ్ములలో పడుతున్నారు. అందులో ఏమాత్రపు నులకలు గాని లేక రంగు గాని లేదు..చాలా స్వచ్చంగా తేటతెల్లంగా వున్నాయి, ఒక్క సారి మన రాష్ట్ర రాజధాని భాగ్యనగర కార్పోరేషన్ రంగుతేలిన నీళ్ళు గుర్తుకొచ్చాయి..! నగరానికి... ప్రకృతివరమైన ఇక్కడ నీళ్ళకు.. ఎంతతేడా..?  అనుకున్నాను.!
 ఎగువ అహోబిల ప్రధాన ఆలయానికి 1కి.మీ దూరంలో నున్న వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఎత్తైన మహావృక్షాల కింద ఆలయమంటపము ఉండగా దాని గర్భగుడిమాత్రం కొండకు చివరి అంచునున్న బిళంలో దేవతావిగ్రహాలు ఉన్నవి. వేదాద్రి పర్వతానికి పడమటి భాగాన వరాహ రూపమున భార్య అయిన వసుంధరాదేవితో స్వామి వేంచేసి యున్నారు. అందుకే ఈ స్వామిని వరాహ నరసింహస్వామి అని అంటారట..! మా మిత్రుల దర్శనం అయ్యాక అక్కడ నుండి పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న సెలయేళ్ళ మద్యన మా నడక ప్రారంభం అయ్యింది. ఈ తోవలో నడక కాస్త కష్టంగానే ఉంటుంది, ఒకపక్కన పాచిపట్టిన బండరాల్లు, మరోపక్కన నీటి ప్రవాహం చాలా జాగ్రత్తగా నడవాలి. వేలల్లో జనం ఒక ప్రవాహంలా నడుస్తున్నారు, పిల్లలు యువకులు, నడివయస్కులు, వృద్దులు, స్త్రీలు. తమిళనాడునుండి తమిళ కారన్స్, కర్నాటక నుండి కన్నడ కంఠీరవలు ఎక్కువగా కనపడుతున్నారు. నడవలేని వృద్దలను ఒక పెద్దకర్రకు దుప్పటితో జోలకట్టి అందులో తీసుకెల్తున్నారు. మద్యలో ఏటవాలుగా ఉండవలసిన తాపలు కొద్దిగా నిటారుగా ఉండడం మూలాన జాగ్రత్తగా ఎక్కవలసివచ్చింది.
జ్వాలా నరసింహస్వామి :
వేదాచలం అనే పర్వతాల మధ్యన అచల భూమామేరు అనే పర్వతం ప్రాంతమది. ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 4 కి.మీ దూరంలో ఉన్నది.  చాలా ఇరుకైన కాలిబాట..ఒక పక్కన చాలా లోతైనా లోయ ఉన్నది, వీటిని దాటుకుంటూ ఆలయానికి చేరవగా కొద్దిదూరంలో ఉన్న జలపాతం  కిందనుండి ఆలయానికి చేరుకోవాలి కాని జలపాతానికి మరో పక్కన పెద్ద లోయ ఉన్నది. చాలా జాగ్రత్తగా జలపాతం కిందనుండి తడుస్తూ దాటి ఆలయానికి చేరుకున్నాము. హిరణ్య కశ్యపుని సంహారానంతరం క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోవడం వంటి రూపంలో వుండటంతో స్వామిని జ్వాలా నరసింహస్వామి అంటారు. స్వామిని శాంతింపజేసేందుకు ఇంద్రాది దేవతలు చేసిన అభిషేక జలమే భవనాశిని పుణ్యతీర్థంగా అయింది. ఈ ఆలయం ముందు ఒక కొండ గృహ, దాని క్రింద చిన్న గుండం ఎర్రని నీటితో నిండి ఉన్నది. హిరణ్యకశ్యపుని రక్తంలో తడిసిన హస్తాలను స్వామి కడగడం వల్ల నీరు ఎర్రగా మారిందని అక్కడి వారి ఒక విశ్వాసం. ఈ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు. హిరణ్యకశ్యపుని వెంటాడుతున్న నరసింహుడు మూడువిగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడనుండి తిరిగి వస్తున్న సమయంలో కొందరు జలపాతనీటిని బాటిల్స్‌లలో నింపుకుంటున్నారు...! ఎందుకూ అన్నట్లు మా మిత్రులవైపు చూసాను నేను. " అవి కొన్ని వనమూలికల గుండా ప్రవహిస్తూ వస్తున్న ఔషద నీరు, తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం "  అన్నారు.

మాలోల నరసింహస్వామి :
అక్కడ నుండి తిరిగి వచ్చిన తోవలోనే  వెనకకు ఒక అర కి.మీటర్ వచ్చాక ఒక కొండనుండి మరో కొండకు నిర్మించిన ఇనుప వంతన ద్వార వేదాద్రి శిఖరం మీదకు ఎక్కనారంభించాము, ఇది ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 2 కి.మీ దూరంలో వున్నది..ఒక కిలో మీటరు శిఖరం ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పచ్చదనంతో పరిచిన వేదాద్రి శిఖరం, గరుడాచలం, వేదాచలం కొండలు కనపడ్డాయి,  అద్భుతమైన దృశ్యం అది.. ఒక్కసారిగా " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "  అన్న సిరివెన్నెల చరణాలు గుర్తొచ్చాయి. వేదాద్రి శిఖరాన ఒక చదునైన ప్రదేశంలో మాలోల నరసింహస్వామి గుడి వున్నది, లక్ష్మీదేవితో కలిసి దర్శనిమిస్తున్నందున మాలోల నరసింహస్వామి అని పిలుస్తున్నారు. మా మిత్రబృందం గుడిలోపలే చాలా సేపు ఉన్నారు..పొర్లుదండాలు పెడుతున్నారు ఇద్దరు. ఎంతకూ బయటకు రావట్లేదు,  సరే వారు వచ్చేసమయంలోపల మరో చోటకు వెళ్ళవచ్చని మరొక మిత్రునితో కలసి గుడివెనుక నుండి కాలిబాట వెంటా అడవిలోనకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇరుకుగా ఉన్న ప్రమాదకరమైన దారి అది..కాస్త కాలు జారినా లోతైన లోయలో జారడం ఖాయం. ఒక కిలోమీటర్ దూరం నడిచాక పక్కనే వున్న మరో కొండకు చేరాము అక్కడ దాదాపుగా 100 అడుగుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద బండరాయి ఉన్నది, దానిమీద ఏదో " లిపి " కనపడుతున్నది, అది తెలుగా లేక సంస్కృతమా..లేక మరో ఏదన్న బాషనా..? అర్థమే కావట్లేదు, ఎవరన్న ఆ " లిపి " మీద పరిశోదనలు చేస్తున్నారో లేదో..మరి..!?  చదునైన ఆ పెద్ద రాయి మీద నడుచుకుంటూ ఓ 100 అడుగులు వెళ్ళాక రెండు కొండలమద్యన ఇరుకైన స్థలం లో ప్రహ్లాదుడి " బడి " ఉన్నది. అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించాడని అక్కడివారి నమ్మకం, ఆ చిన్న గుడిలో నరసింహస్వామి, ప్రహ్లాద విగ్రహాలున్నవి. పక్కనే ఏటువాలుగా ఉన్న కొండమీద చిన్న చిన్న జలపాతాలు ఉన్నవి,  చూడచక్కని ప్రకృతి రమణీయ ప్రదేశమది. అక్కడ నుండి తిరిగి వెనకకు బయలదేరాము. 

ఉదయం టిఫిన్ చేసిన చోటకు చేరుకున్నాము, అక్కడ మరో రకమైన పలహారం పెడుతున్నారు, మరో రౌండ్ వేసారు మా మిత్రబృందం, ఈ సారి టమోటో, జీడిపప్పుతో చేసిన ఉప్మా. మరో రకం " ఉగ్గాని అలియాస్ బొరుగుల ఉప్మా ". !   బొరుగులతో ( మరమరాలు) చేసే ఉపపలహారం అది. చిత్రాన్నం (పులిహోర, యెల్లో రైస్) చేసే విదానంలానే చేస్తారు, కాకపోతే బొరుగులను ముందుగా నీటిలో తడిపి తర్వాత తిరగమాత (పోపు) పెడతారు పులిహోరలాగే బాగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,పసుపు వేసి మనం ఇంట్లో పోపుకు వాడే అన్నిదినసులతోనే తిరగమాత పెట్టాక చివరన అందులో నిమ్మరసం పిండుతారు. " ఉగ్గాని " తోబాటు దానికి కాంబినేషన్‌గా  " నన్ను కొంచం కొంచం కొరక్కుతినవయ్యా..య్యా..యా " అంటున్న మిరపబజ్జీతో తింటుంటే....." ఆ..టేస్టే..వేరు...ఆ టేస్టే వేరు " అని పాటపాడుకొన్నాము.. ఆ ప్రకృతివడిలో..!

పావన నరసింహస్వామి :
పలహారం ఆరగించిన తర్వాత అక్కడ నుండి మరో దిశకు కొద్దిదూరం నడిచాక ఎడమవైపున ఉన్న మరో కొండను దాదాపుగ 1 కి.మీ ట్రెక్కింగ్ చేసాము. తర్వాత దట్టమైన అడవి గుండా, దారిపొడవునా 100 అడుగల ఎత్తు ఉన్న మహావృక్షాలు ..అడవిని కప్పిన పెద్ద గొడుగులా ఉన్నాయి  వాటి క్రిందన మనిషెత్తు ఉన్న ఆకుపచ్చని గడ్డి మద్యలో కాలిబాట వెంట నడక ప్రారంచించాము.  ఎత్తైన చెట్ల ఆకుల మద్యనుండి దూరి వస్తున్న సన్న సన్నని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని తాకి పరావర్తన చెందుతున్న దృశ్యం కన్నుల పండగలాఉంది నాకు.  అప్పటికే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కొందరు భక్తులు ఎదురవుతున్నారు. 5 కి.మీ నడిచాక మద్యాహ్నం 12:30 నిమిషాలకు గరుడాచలంకొండ చివర్లో పావనమనే నదీతీరాన ఉన్న పావన నరసింహక్షేత్రం చేరుకున్నాము. ఇక్కడికి కాలనడకన 6 కి.మీ నడవాలి..వాహనాల ద్వారా రావడానికి కూడ సౌకర్యం ఉన్నది ఘాట్‌రోడ్ ద్వారా 14 కి.మీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నన భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక తిరిగి ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి బయలుదేరాము.

అహోబిళ నరసింహస్వామి : 
ఎగువ అహోబిళంగా పిలిచే ఈ దేవాలయంలో అహోబిళ నరసింహస్వామి వున్నారు. రాజగోపురంద్వార లోనికి వెళ్తే అక్కడ ఒక గుహలో అరుగు మీద దశభుజాలతో హిరణ్యకశిపుని సంహరించే నరసింహావతారంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ప్రక్కగా అభయ వరదముద్రలతో పై చేతులలో తామర మొగ్గలతో చెంచులక్ష్మి విగ్రహం ఉన్నది. అక్కడ దర్శనం ముగించుకొని బయలదేరాము.

కారంజ నరసింహస్వామి :
తిరుగుప్రయాణంలో ఎగువ అహోబిళానికి 1  కి.మీటర్ల దూరంలో భవనాశి నది ప్రవహిస్తున్న చోట వటవృక్షం నీడలో శంఖుఛక్రధారుడుగా కొలువైయున్నందున కారంజ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్కడ నుండి దిగువ అహోబిళానికి 2 కి.మీటర్ల దూరంలో కొండపైన భార్గవ( పరుశు) రాముడు తపస్సు చేసిన స్థానంలో వెలసినందున భార్గవ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్షయ కోనేటి నీరు, చుట్టూపొదలు. పెద్ద వృక్షాలతో అక్కడి ప్రకృతి రమణీయంగా వుంటుంది.

చత్ర వట నరసింహస్వామి : 
భార్గవ క్షేత్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పద్మాసీనడై, దక్షణ హస్తం అభయ ముద్రను సూచిస్తూ, గొడుగులాంటి మర్రిచెట్టు నీడలో చత్రవట నరసింహస్వామి వున్నారు.

యోగానంద నరసింహస్వామి :
2 కి.మీ దూరంలో ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పి మూర్తి అయినందున ఇక్కడి స్వామికి యోగానంద స్వామి అని పేరు వచ్చిందట.

దిగువ అహోబిళ వరద నరసింహస్వామి :
ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడు దర్శనమిస్తారు. ఈ శిలా విగ్రహం ఊర్ధ్వహస్తాలతో, శంఖు చక్రాలను కలిగి వామభాగంలో తొడపై లక్ష్మీదేవిని కూర్చండజేసి అభయ, వరద, ముద్రాన్వింతంగా అందంగా తీర్చి దిద్దబడింది. ఒక పక్కగా పట్టపుదేవేరి అమృతవల్లి తాయారు విగ్రహం ఉన్నది.

ఈ విగ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలోని ప్రధాన ఆలయమంటపంలో శిల్పులు చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. రకరకాల నరసింహస్వాముల ప్రతిరూపాలు. కవయిత్రి, రచయత్రి అయిన కథనాయక "మొల్ల "శిల్పం,  శ్రీకృష్ణదేవరాయుల శిల్పాలు ..చాలానే ఉన్నాయి. అక్కడనుండి తిరుగు ప్రయాణం.




అహోబిళం నుండి ఒక రెండు కి.మీటరు ప్రయాణించిన తర్వాత  బైక్ నడుపుతున్న మిత్రుడికి ఎడమపక్కన పచ్చని పొలంలో ఒక నీళ్ళ బావి కనపడడంతో బండిని ఆపేసాడు. మొహం కడుక్కొని ఫ్రెష్ అవుదాము పదా అని పొలంలోకి దారితీసాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అది బావి కాదు..ఒక పురాతన కోనేరు.. కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి మరమత్తులకు నోచుకోలేదు అనుకుంటా పాడుబడిపోయింది. లోపలంతా పాచి కట్టి ఉన్నది. అది కాదు గాని విశేషమూ..కోనేరు చూట్టూ ఉన్న రాతిగోడలమీద బాగవత, మహాభారత, రామాయణ శిల్పాలు చెక్కి వున్నారు..!  సురులు, దేవతలు అమృతం చిలుకుతున్న శిల్పాలు .. చాలా బాగున్నాయి. అందులో భాగంగా రతీభంగిమలు కూడ ఉన్నాయి. పురావస్తుశాఖ వారు బహుశ ఆ కోనేరు గుర్తించారో లేక గుర్తించి కూడా నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కాలేదు మరి. ఎవరో రైతులు బోర్లు వేసి అందులోనుంచే తమ పంటపొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ప్చ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాము.

    
    మరి కొన్ని నరసింహస్వామి అవతారాల ఫోటోస్ క్రింద ఫ్లాష్‌ప్లేయర్‌లో చూడవచ్చు.


ఉపసంహారం :  
ఇక్కడి దేవుల్లను చూసాక నగరాలలో ఉన్న దేవుళ్ళకు కన్ను కుడుతుందేమో..!! ఇంతటి ప్రశాంత వాతావరణం, ప్రకృతివడిలో వోలలాడుతున్న ఈ దేవుళ్ళను చూస్తే ఈర్షపడతారేమో..మన హైదరాబాద్ నగర దేవుళ్ళు...!! పాపం ప్రతిరోజు నగర వాహనాల రణగొణద్వనుల మద్యన, కాలుష్యవాతావరణంలో ఉక్కిబిక్కిరి అవుతూ వుంటారు, అందులోని మన వారి పోటీ భక్తిని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు  మైకులతో హోరెత్తిస్తూ ప్రజల చెవుల్లతోబాటు దేవుళ్ళ చెవుల్లకు తూట్లు పొడుస్తూ ఉంటే  అక్కడి నుండి ఎప్పుడొ పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటారు. అలాంటి వారికి ఇక్కడి స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ, నిశ్శబ్ధవాతావరణంలో పచ్చని ప్రకృతి మద్యనున్న దేవుళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈర్షపుడుతుందేమో...???. కాని ఒక విషయం మాత్రం నిజం, ఏ ఆరునెలలకో లేక సంవత్సరానికో ఒక మారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే భక్తి, పుణ్యం సంగతేమో గాని..స్వచ్చమైన గాలితోపాటు పచ్చని ప్రకృతితో మైమేకం అవితే చాలు... మిగతా రోజులంతా మన వృత్తిలో పనిచేయడానికి ఉత్తేజం కలుగుతుందనుకుంటా..!!!

Sunday, 14 February 2016

ఆగస్ట్‌లో పర్యాటక ప్రదేశాలు






ఆగస్ట్‌లో పర్యాటక ప్రదేశాలు

మున్నార్‌:
కేరళలోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్‌ హిల్‌ స్టేషన్‌ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. సైట్‌ సీయింగ్‌ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్‌ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. మున్నార్‌ పర్వత శ్రేణుల వాతావరణం ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను సందర్శించేలా చేస్తాయి.

చిరపుంజీ:
మేఘాలయ స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటయిన చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన Nohkalikai Falls(నోహ్కలికై జలపాతం) ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది. చిరపుంజీ కేవలం దృశ్య వీక్షణం కొరకు మాత్రమే కాదు సాహసోపేతమైన పర్యటనలకు కూడా అనుగుణంగా ఉంటుంది. చిరపుంజిని ఆగస్టు మాసంలోనే సందర్శించాలి.

అగుంబే:
కర్నాటకలోని  మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశం నుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ కూడా కలదు. అగుంబే సందర్శించాల్సిన సమయం సమయం ఆగస్టు మాసం.

కొడైకెనాల్‌:
తమిళనాడు కొడైకెనాల్‌ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్‌ స్టేషన్‌. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. తమిళంలో కొడైకెనాల్‌ అంటే అర్ధం అడవుల బహుమతి. ఇది హనీమూన్‌ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

లాహౌల్‌:
ఇండియాకి, టిబెట్‌కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్‌ ప్రదేశ్‌లో లాహౌల్‌ వుంది. ఇక్కడ ఎక్కువ మంది బౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. విహారాలకు, కిబ్బర్‌ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్‌ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్‌ వాలీ నేషనల్‌ పార్‌‌క, కీ విహారం, కున్‌ జుమ్‌ పాస్‌ ఇక్కడి ఇతర ఆకర్షణలు. అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి.

అండమాన్‌ నికోబార్‌ దీవులు:
గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్‌ మరియు నికోబార్‌ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే! ఈ సెలవుల విహార ప్రదేశం అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. మీరు స్కూబా డైవింగ్‌ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే.

బికనేర్‌:
బికనేర్‌ రాజస్థాన్‌ రాష్ట్రంలో థార్‌ ఎడారి మధ్యలో గల ప్రధాన ఎడారి పట్టణం. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, రుచికరమైన భుజియాలకు, రంగు రంగుల పండుగలకు, అద్భుతమైన భవనాలకు, అందమైన శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఒంటెల పండగ ప్రసిద్ధి చెందినది. బికనేర్‌ సందర్శించదలచుకొన్న పర్యాటకులు ప్రసిద్ధ ఇసుక రాయి కట్టడ లాల్ఘర్‌ను తప్పనిసరిగా చూడాలి. ఈ ప్రదేశాన్ని వేసవి కాలం కంటే ఆగస్టు మాసం సందర్శనకి అనువైనది.

ముస్సూరీ :
ఉత్తరాఖండ్‌ ముస్సూరీని సాధారణంగా 'క్వీన్‌ ఆఫ్‌ హిల్స్' అని పిలుస్తారు. ఈ హిల్‌ స్టేషన్‌ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం ఇక్కడ కల శివాలిక్‌ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్‌ వాలీకి ప్రసిద్ధి గాంచినది. అందమైన ప్రదేశాలతో కూడిన ఈ పట్టణంలో అనేక ప్రాచీన దేవాలయాలు, కొండలు, జలపాతాలు, లోయలు మరియు వైల్డ్ లైఫ్‌ శాంక్చురీలు కలవు. ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే నేషనల్‌ అకాడమీ ఇక్కడనే ఉంది.

పాండిచేరి:
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణికునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డుప్లెక్‌‌స విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్‌ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.

మండు:
మధ్యప్రదేశ్‌ మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది. మండు అంటే ఒక ఆనందాల భూమి. సాంప్రదాయక మాల్వా ఆహారాలు అయిన దాల్‌ బాత్‌ మరియు మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది. ఇక్కడ చూడవలసిన వాటిలో బాజ్‌ బహదూర్‌ మహల్‌, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటులు , తాజ్‌ మహల్‌ వలే మార్బుల్‌తో నిండిన హోశాంగ్‌ టూంబ్స్ మొదలైనవి ఉన్నాయి.

కూర్గ్:
కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటకలోని ప్రసిద్ది చెందిన హిల్‌ స్టేషన్‌లలో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుకనే కూర్గ్‌ను “ఇండియాలోని స్కాట్‌లాండ్‌” అని, “కర్నాటకలోని కాశ్మీర్‌” అని అభివర్ణిస్తారు. కూర్గ్‌లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలలో అబ్బే ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, టిబెట్‌ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్‌ చేసే వారికి పుష్ఫగిరి ఫాల్స్, కోటిబెట్ట, నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. కూర్గ్‌ను సందర్శించాలంటే, ఆగస్ట్ మాసం నుండి నుండి నవంబర్‌ మాసం వరకు అనుకూల సమయం.

మహాబలేశ్వర్‌:
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్‌ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్‌ పాయింట్‌ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్‌ స్టోన్‌ పాయింట్‌, మర్జోరీ పాయింట్‌, ప్రతాప్‌ ఘడ్‌ కోట వంటివి కూడా మహాబలేశ్వర్‌లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్‌ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. ఇంతటి వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్‌ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే ఆగస్టు మాసంలో తప్పక సందర్శించావల్సినదే!

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హేమకుండ్‌కు వెళ్ళే దారిలో ఉన్నది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ తెలుపు మరియు పసుపు అనేమోన్‌‌స,, డైసీలు, హిమాలయ నీలిరంగు గసగసాల మరియు పాము లిల్లీ వంటి అనేక 300 జాతుల పుష్పాలను చూడవొచ్చు. ఈ పుష్పాలతో పాటు నలుపు హిమాలయ ఎలుగుబంట్లు, తహర్‌‌స, కస్తూరి జింక, మంచు చిరుతలు మరియు సేరోవ్‌‌స వంటి అరుదైన జంతుజాలాన్ని మరియు అరుదైన సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.

ఉదయపూర్‌:
బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభయారణ్యాలకు ప్రసిద్ది పొందిన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ 'సరస్సుల నగరం' గా పిలువబడే అందమైన ప్రదేశం. మహారాణా ఉదయ సింగ్‌ నిర్మించిన, గోల్‌ మహల్‌ గా పిలువబడే రాజ్‌ ఆంగణ్‌ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగ్‌ మందిర్‌, నెహ్రూ గార్డెన్‌, ఏక్‌ లింగ జీ దేవాలయం, రాజీవ్‌ గాంధీ పార్‌‌క, శ్రీనాథ్‌ జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆగస్ట్‌ నెల నుంచి డిసెంబర్‌ మధ్య కాలం బాగుంటుందని పర్యాటకులు భావిస్తుంటారు.

కన్యాకుమారి :
కన్యాకుమారి పట్టణం మనదేశానికి దక్షిణ భూభాగాన చివరలో ఉంది. ఈ ప్రదేశంలో అరేబియన్‌ సముద్రం మరియు బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు, ప్రత్యేకించి పౌర్ణమి రోజులలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే అవి వివేకానంద రాక్‌ మెమోరియల్‌, తిరువల్లువార్‌ విగ్రహం. సీఫుడ్‌ లు కన్యాకుమారి ప్రసిద్ధి చెందినది. కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్ట్‌ నుండి డిసెంబర్‌ వరకు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

Friday, 12 February 2016

వింత విచిత్ర వినాయక ఆలయాలు

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్‌ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్‌) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంత కన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్‌ వినాయకర్‌ ఆలయం అని కూడా పిలుస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం:
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

చారిత్రక చరిత్ర:
ఆ రోజులలో కేరళ పురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్లడం జరుగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళ పురం రాజుకే ఇస్తూ, మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

పెన్నులతో పూజలందుకునే అయినవిల్లి వినాయకుడు

అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ, వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వం నుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తపుష్పార్చన, పుస్తకపూజ, అన్నప్రాశన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి.

సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభిషేకం చేస్తారు. ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.

అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదిశలు వ్యాపించడంతో ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.

ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు, ఆకాశాన్ని తాకినట్లుగా వుండే పర్వతశ్రేణులతో చల్లగా వీచే గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో రాష్ట్రంలో ఏకైక వేసవి విడిదిగా హార్సిలీహిల్స్ పేరుగాంచింది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతున్న ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నిత్యం హార్సిలీహిల్స్ కళకళలాడుతోంది.

ప్రభుత్వ ఏకైక వేసవి విడిదిగా, ఆంధ్రా ఊటీగా ఖ్యాతి పొందిన హార్సిలీహిల్స్ తన అందచందాలతో పర్యాటకులను పులకింపజేస్తోంది. పశ్చిమకనుమల్లోనే ఎత్తైన మూడో శిఖరంగా గుర్తింపుపొంది, సముద్రమట్టానికి 4312 అడుగుల ఎత్తులో, కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలకొండ కంటే 1200 అడుగుల ఎత్తులో హార్సిలీహిల్స్ ఆకర్షిస్తోంది. ఆంధ్రరాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన ఏకైక వేసవి విడిదిగా ప్రత్యేక గుర్తింపు పొంది, నిత్యం హరిత శోభితంగా ప్రఖ్యాతిగాంచింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో హార్సిలీహిల్స్ వుంది. ప్రకృతిలోని కొత్తకొత్త అందాలతో, మేఘాలతో సంతరించే అనుభూతితో, చల్లటివాతావరణం, పచ్చదనంతో నిండివుంటుంది. హార్సిలీహిల్స్ మదనపల్లె నుండి కదిరి వెళ్ళే ప్రధాన రహదారిలో కాండ్లమడుగు క్రాస్‌కు పది కిలోమీటర్ల దూరంలో వుంది. తిరుమల గిరుల కంటే 1200 అడుగుల ఎత్తున ఉన్నందున ఇక్కడి వాతావరణం అతి తక్కువ ఉష్ణోగ్రతతో వుంటుంది.

హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. బ్రిటీష్ పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్ రాబర్ట్ హార్సిలీ 1857 సంవత్సరంలో కడప నుండి మదనపల్లెకు వెళ్తూ మధ్యలో సరదాగా గుర్రంపై కొండపైకి చేరుకున్నారు. అప్పట్లో ఏనుగు మల్లమ్మ కొండగా వున్న దానిపై గల వాతావరణానికి సర్ రాబర్ట్ హార్సిలీ అమితంగా ఆకర్షితుడయ్యాడు. అప్పట్నుంచి ప్రతి వేసవికి ఏనుగు మల్లమ్మ కొండకు రావడం ప్రత్యేకంగా అలవర్చు కొన్నాడు. కొండపై బంగ్లా నిర్మించి బస చేసేవారు.

వేసవితాపం నుండి ఉపశమనానికి, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్నాటక, తమిళనాడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజంశాఖ కోట్లాది రూపాయల ఖర్చుతో ఆధునాతన సౌకర్యాలు కల్పించింది. అతిథి గృహాలు, భోజన ప్రియుల కోసం పున్నమి రెస్టారెంట్, మద్యం ప్రియుల కోసం బార్, పిల్లలుకోసం విశాలమైన ఆట స్థలం, స్విమ్మింగ్‌పూల్, ట్రెక్కింగ్ తదితర వసతులు ఇక్కడ వున్నాయి. దేశంలోని ఏ ప్రదేశం నుండైనా హిల్స్ లోని అతిథిగృహాలను బుకింగ్ చేసుకొనేందుకు ఆన్‌లైన్ సౌకర్యం వుంది. హిల్స్‌లోని చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిలారావాలు, దట్టమైన అడవుల సోయగాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌పార్క్, స్విమ్మింగ్ సెంటర్, మసాజ్‌సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి అధ్యయన కేంద్రాన్ని, మొసళ్ళ పార్కును ఏర్పాటుచేశారు. జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్ పక్షులు, చిలుకలు, గిన్యాపందులు, గుడ్లగూబలు తదితర వింత పక్షులు వున్నాయి. ప్రకృతి అధ్యయన కేంద్రంలో అటవీ జంతువుల లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటిపైన డాక్యుమెంటరీలు వున్నాయి.

హార్సిలీహిల్స్‌లో గల గాలికొండ, మైక్రోవేవ్ రెసీవర్ స్థలాలు, వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు చారిత్రాత్మక ప్రాధాన్యంతో కూడిన ఏనుగుమల్లమ్మ గుడి ప్రశస్త్యమైంది. ఈ గుడిలో ప్రతి యేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్థానిక అటవీశాఖ అతిథిగృహం పక్కన వున్న 176 సంవత్సరాల వయస్సు గల సర్ రాబర్ట్ హార్సిలీ నాటిన నీలగిరి చెట్టు నేడు అతిపెద్ద చెట్టుగా ఎదిగి మహావృక్ష పురస్కారాన్ని పొందింది. అలాగే అటవీశాఖ అతిథిగృహం ప్రక్కన ఒక ఆశ్చర్యకరమైన వింత చోటు చేసుకొని వున్నది. అక్కడ వున్న రెండు ఎర్రపు రాయి చెట్ల కొమ్మలు పైకి ఎదిగి ఒకే కొమ్మగా రూపాంతరం చెందడం వింతగా చెప్పవచ్చు. చరిత్రలో రావి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మలు కలసిన దాఖలాలు వున్నాయి. కానీ ఎర్రపురాయి చెట్లు కలవడం కేవలం ఇక్కడే మనం చూడవచ్చు అని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాలినడకన వెళ్ళేదారిలో మానసగంగోత్రి వద్ద నీలిగిరి చెట్లు సైతం రెండు కొమ్మలుగా పైకి పోయి ఒకే కొమ్మ గా కలిశాయి. ఇవన్నీ వెరసి ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులను ఆర్షిస్తు న్నాయి.

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌పార్క్, స్విమ్మింగ్ సెంటర్, మసాజ్‌సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి అధ్యయన కేంద్రాన్ని, మొసళ్ళ పార్కును ఏర్పాటుచేశారు. జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్ పక్షులు, చిలుకలు, గిన్యాపందులు, గుడ్లగూబలు తదితర వింత పక్షులు వున్నాయి. ప్రకృతి అధ్యయన కేంద్రంలో అటవీ జంతువుల లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటి పైన డాక్యుమెంటరీలు వున్నాయి. హార్సిలీహిల్స్‌లో గల గాలికొండ, మైక్రోవేవ్ రెసీవర్ స్థలాలు, వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వేసవికాలంలో గవర్నర్, రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు విశ్రాంతి తీసుకోవడానికి వస్తుంటారు. ఇటీవల హార్సిలీహిల్స్‌కు గవర్నర్ నరసింహన్ దంపతులు వచ్చి గవర్నర్ బంగ్లా ఆధునీకరణ పనులు ప్రారంభించి హిల్స్‌లో సేదతీరారు. అలాగే ప్రస్తుతం విపరీతమైన ఎండ వేడి, ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందడానికి ఆంధ్రప్రదేష్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలనుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హిల్స్‌కు వస్తున్నారు. హార్సిలీహిల్స్‌ను మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు కోట్ల రూపాయలతో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు.

చరిత్ర ఇది..
హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. బ్రిటీష్ పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్ రాబర్ట్ హార్సిలీ 1857 సంవత్సరంలో కడప నుండి మదనపల్లెకు వెళ్తూ మధ్యలో సరదాగా గుర్రంపై కొండపైకి చేరుకున్నారు. అప్పట్లో ఏనుగు మల్లమ్మ కొండగా వున్న దానిపై గల వాతావరణానికి సర్ రాబర్ట్ హార్సిలీ అమితంగా ఆకర్షితుడయ్యాడు. అప్పట్నుంచి ప్రతి వేసవికి ఏనుగు మల్లమ్మ కొండకు రావడం ప్రత్యేకంగా అలవర్చుకొన్నాడు. కొండ పై బంగ్లా నిర్మించి బసచేసేవారు. అప్పటి నుండి ఆయన పేరు మీద ఏనుగు మల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవడం ఆరంభించారు. హిల్స్‌లో సర్ హార్సిలీకి ఒక కొడుకు జన్మించి అదే రోజు మృతి చెందడంతో అక్కడ జూనియర్ హార్సిలీ పేరిట సమాధిని నిర్మించారు. అలాగే తన పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో హార్సిలీ తన కుక్క జ్ఞాపకార్థం ఓ సమాధిని నిర్మించాడు. సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో వున్న హార్సిలీహిల్స్ ప్రకృతి ప్రసాదించిన అందాలకు మెరుగులు దిద్దుతూ తమిళనాడులోని ఊటిని మైమరిపించే విధంగా వుంటుంది. ఇలాంటి ప్రకృతి అందచందాలు కలిగిన హార్సిలీహిల్స్‌ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ అభివృద్ది పనులను చేపట్టింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వున్నాయి.

ప్రముఖుల విడిది...
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వేసవి విడిది కావడంతో గతంలో రాష్ట్ర గవర్నర్ ప్రతి వేసవిలోనూ ఇక్కడ విడిది చేయడం ఆనవాయితీగా వుండేది. గవర్నర్‌లు కుముద్‌బెన్ జోషి, కృష్ణకాంత్ తదితరులు ఇక్కడ వేసవిలో విడిది చేశారు. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ సైతం వారం రోజుల పాటు హార్సిలీహిల్స్‌ పై వుండి ప్రకృతి అందాలను తిలకించారు. పలువురు సినీనిర్మాతలు, రచయితలు, నటులు ఇక్కడ విడిది చేశారు. సీతామాలక్ష్మి, ఎన్‌కౌంటర్, జైత్రయాత్ర, లక్ష్మీకళ్యాణం తదితర ఎన్నో సినిమాలు హార్సిలీహిల్స్, పరిసర ప్రాంతాలలో చిత్రీకరించడం వల్ల సినీ కళాకారులు, ప్రముఖులతో హిల్స్ అప్పుడప్పుడు కొత్త అందాలను సంతరించుకుంటుంది.

రవాణా వసతులు...
హార్సిలీహిల్స్ నుండి తిరుపతి 150 కిలోమీటర్లు, మదనపల్లెనుండి 28 కిలోమీటర్లు, అనంతపురం నుండి 130 కిలోమీటర్లు దూరంలోవుంది. ప్రతి శని, ఆదివారాల్లో బెంగళూరు నుండి టూరిజం కార్పొరేషన్ స్పెషల్ ప్యాకేజీ బస్సులను నడుపుతోంది. తిరుపతి నుండి ప్రతిరోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆర్టీసి సర్వీసులు, మదనపల్లె నుండి ప్రతి రోజూ ఉదయం 6:30 గంటలకు, 9:00 గంటలకు, మధ్యాహ్నం 2:00 గంటలకు సాయంత్రం 5:00 గంటలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించారు.

హిల్స్ రూట్ మ్యాప్...
చెన్నై నుండి చిత్తూరు మీదుగా మదనపల్లెకు చేరి హార్సిలీహిల్స్ చేరుకోవచ్చు.
బెంగళూరు నుంచి మదనపల్లె మీదుగా హార్సిలీహిల్స్ చేరుకోవచ్చు.
హైదరాబాదు నుంచి కదిరి మీదుగా నేషనల్ హైవేలోని అమరనారాయణపురం క్రాస్‌కు వచ్చి అక్కడి నుండి పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణించి హిల్స్ చేరవచ్చు.

వసతులు...
అటవీశాఖ ఆధ్వర్యంలో మిల్క్‌హౌస్‌లతో పాటు హార్సిలీ, పింఛా, కౌండిన్యా, మాండవి, బాహుదా, కళ్యాణి తదితర అతిథి గృహాలు కలవు. అద్దె రోజుకు రూ.300 వసూలు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.100లతో డార్మెటరీ వసతి, స్పెషల్‌ కాటేజీ రూ.600, డబుల్ కాటేజీ రూ.1000, ఎన్‌జిఓ బ్లాక్ రూ.840, ఎబ్లాక్ 1. రూ.2000, ఎ బ్లాక్2.రూ.1500, బి బ్లాక్2.రూ.1050, యాత్రినివాస్ రూ.1200, ఎడిసి బ్లాక్ రూ. 2200, గవర్నర్ సూటు రూ. 2000, గవర్నర్ బంగ్లా ్లరూ.2500 చొప్పున మొత్తం 48 గదులు, 40 డార్మెటరీలు అందుబాటులో వున్నాయి.

హాలిడే హోమ్‌లో 12 అతిథి గృహాలున్నాయి. అద్దె రోజుకు రూ.300 నుండి రూ.700వరకు పరిస్థితులను బట్టి వసూలు చేస్తారు. ఇదికాక పోలీసు, రైల్వే, రెవెన్యూ, కర్నాటక గెస్ట్ హౌస్, అభిరామ్ రిసార్ట్స్ తదితర అతిథి గృహాలు కలవు.

ప్రకృతి అందాల కొలమనం కుమర కోమ్


సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్‌ హిల్స్‌ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగు భూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదుల పైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం..
కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌.. కొచ్చి నుంచి 78 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధ మైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లోనూ...
ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీ రాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలు చేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయా ణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండి గానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమర కోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహా వసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్ల కంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు... కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీ జ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో..  కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు...
కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమర కోమ్‌ టూరిస్ట్‌ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

సీతమ్మ తనువు చాలించిన స్థలం

సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతతో ఐక్యమైందన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ పవిత్ర స్థలం అలాహాబాద్ వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సీతమ్మ భూమాతతో ఐక్యమైన స్థలం ఉంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు.



ఆ ప్రదేశాన్ని 'సీతా సమాహిత్ స్థల్' అనీ... 'సీతా మారీ' అనీ పిలుస్తారు. తమసానది పరిసరాలలో ప్రశాంతమైన వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఇక్కడ ఉంది. ఈ స్మారక నిర్మాణం జరుగక ముందు, ఇక్కడ అమ్మవారి జుత్తుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడివారు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు మేసేవి కావట. స్మారకం నిర్మించినపుడు, సితా కేశ వాటికను పాడు చేయకుండా అలానే ఉంచారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. పక్కనే, లవకుశులకు జన్మనిచ్చిన స్థలం అయిన సీతా వట వృక్షం కుడా ఉన్నది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది రెండతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉన్నది. క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ, ఎంతటివారికైనా కాస్తో కూస్తో బాధ కలిగించే విధంగా దర్శనమిస్తుంది.

వెనుక గోడ మీద ఆ సంఘటనను ప్రతిబింబిస్తున్న సన్నివేశపు శిళాచిత్రం కినిపిస్తుంది. ఇక ఈ కట్టడం గురించిన వివరాలలోకెళితే, దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థుల వారి నిర్దేశం మేరకు క/ట ్కఠn్జ ఔౌడఛీ సంస్థ ప్రమోటర్ అయిన శ్రీ సత్య నారాయణ్ ప్రకాష్ పన్జ్ ఈ పవిత్ర దేవాలయం నిర్మించారు. ఇక్కడ సీతమ్మ తల్లితో పాటు శివుడి విగ్రహం కూడా ఉన్నది. అంతేకాకుండా 20 ఫీట్ల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ రాతి నిర్మాణం క్రింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉన్నది.

SITA SAMAHIT STHAL, SITAMARHI, UP

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...