Sunday, 29 January 2017

గోవా

సౌత్ గోవా vs నార్త్‌ గోవా

సౌత్ గోవాలో మిరామర్‌ బీచ్‌(Miramar Beach), ఓల్డ్‌ గోవా చర్చి(Old Goa Church), మంగేషి దేవాలయం(Mangeshi Temple), దొనపాల బీచ్‌(Dona Paula Beach), జువారీ నది (Zuari River), మార్మగో హార్బర్‌(Mormugao Harbour), మండోవి నదిలో బోటు షికారు(Mandovi River, Panjim) ఉంటాయి.

నార్త్‌ గోవాలోని కండోలిమ్‌(Calangute), బాఘా(Baga Beach), అంజునా బీచ్‌(Anjuna), వగేటర్‌ బీచ్‌ or బాగటర్‌ (Vagator Beach), కాలన్‌గ్యూట్‌ బీచ్‌ or కలన్‌గుటె బీచ్‌ (Calangute Beach)ల సందర్శనతో పాటు ఎన్నో వింతలు.

శ్రీకాళహస్తి ఆలయం

  శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే...తప్పక దర్శించుకోవాలనుకుంటారు
 
‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ...

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు.
 
         శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి... మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.
 
           శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

కర్ణాటక కోస్తా తీరం






ఆ ఉదయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం!
అరేబియా సముద్ర అందాలూ సుందర ప్రకృతి దృశ్యాలూ వాటి నడుమ వెలసిన పౌరాణిక క్షేత్రాలతో అలరారే అద్భుత ప్రదేశమే కర్ణాటక కోస్తా తీరం అంటున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన AVS ప్రసాద్‌.

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి, కొల్లూరు, శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ ఏకకాలంలో చూసి రావాలనుకుని పక్కా ప్రణాళికతో కాచిగూడలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడ దిగి, అక్కడ నుంచి తిరిగి ఉదయం ఏడు గంటలకు కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపికి బయలుదేరాం. కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌ వారానికి మూడుసార్లు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన్నే బయలుదేరుతుంది. ఇది కాకుండా బెంగళూరు నుంచి రోజూ రాత్రి 8 గంటలకు బయలుదేరే కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపి, కొల్లూరు చేరుకోవచ్చు.

మేం ఎక్కిన రైలు హాసన్‌ దాటాక కుక్కి క్షేత్రం వరకూ ప్రకృతి కనువిందు చేసింది. ఆ కొద్ది మేర కొండదారి కావడంతో రైలు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ప్రయాణ మార్గానికి ఓ వైపు కొండలూ మరోవైపు లోయలూ సెలయేళ్లతో అద్భుతంగా ఉంది. రైలు సుమారు 50 గుహల గుండా ప్రయాణం చేస్తుంది.

సాయంత్రం ఎనిమిది గంటలకు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని చేరుకుంది. రైల్వేస్టేషనుకు వూరు 5 కి.మీ. దూరం. ఆటోలో శ్రీకృష్ణ ఆలయానికి దగ్గరలోని ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లాం. ఈ ఆలయానికి దగ్గరలోని గీతా మందిర్‌, ఇతర మఠాలు, ఇంకా లాడ్జీల్లో పర్యటకులకు వసతి సౌకర్యం ఉంటుంది. ఆలయానికి వెళ్లేటప్పుడు బస చేసిన తాలూకు కాగితాలనూ మన ఐడీప్రూఫ్‌నూ మరిచిపోకుండా తీసుకెళ్లాలి. ఉదయాన్నే బయలుదేరి ఆలయానికి చేరి స్వామిని దర్శించుకున్నాం. ఒకప్పుడు భూకంపం తరవాత శ్రీకృష్ణ భక్తుడైన కనకదాసు ఎలాగయితే ఆయన్ని దర్శించుకున్నాడో అదేమాదిరిగా భక్తులు కిటికీలో నుంచే చూడాలి. ఉడుపి కృష్ణునికి చేసే అలంకారం ఎంతో ముద్దుగా ఉంటుంది. కృష్ణ జన్మాష్టమిని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. తరవాత మందిరం ముందున్న పుష్కరిణినీ పక్కనే ఉన్న అనంతేశ్వర స్వామినీ చంద్రమౌళీశ్వరుణ్ణీ దర్శించుకుని గదికి వచ్చి అన్నీ సర్దుకుని కారులో కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి బయలుదేరాం.

కొల్లూరు మూకాంబిక అమ్మ వారు
ఉడుపి నుంచి కుందపుర మీదుగా కొల్లూరుకి 80 కిలోమీటర్ల దూరం. కుందపుర నుంచి కొల్లూరు వరకూ 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు ప్రయాణం మనల్ని మరో లోకంలో విహరింపచేస్తుంది. కొండలూ, లోయలూ, జలపాతాలూ, కాఫీ తేయాకు తోటలూ, రబ్బరూ వక్క చెట్లతో ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లే అనిపిస్తుంది. సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో కొండల మధ్య కొలువైన మూకాంబిక అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని తరించాం. కౌమాసుర అనే రాక్షసుణ్ణి పార్వతీదేవి మూకాంబిక అవతారంతో సంహరించిందన్నది పురాణ కథనం. అక్కడకు పదికిలోమీటర్ల దూరంలోనే కొడ్చాద్రి హిల్స్‌ ఉన్నాయి. సమయాభావంతో మేం అక్కడకు వెళ్లలేదు గానీ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటాయట.

సాగర తీరంలో శివరూపం!
తరవాత బైందూరు మీదుగా 66 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న మురుడేశ్వర్‌ శివక్షేత్రాన్ని చేరుకున్నాం. ఇది ప్రపంచంలోకెల్లా రెండో అతి పెద్ద శివుని విగ్రహం. ఎంతో అందంగా నిర్మించిన ఆ విగ్రహాన్ని తనివితీరా చూసి తరించాం. ఇక్కడి ఆలయ గోపురం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. 21 అంతస్తులతో ఉన్న ఈ గోపురం పై అంతస్తులోకి ఎక్కేందుకు లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. అక్కడ నుంచి అరేబియా సముద్రాన్నీ శివుడి విగ్రహాన్నీ వీక్షించవచ్చు. ఈ విగ్రహం ఇక్కడి బీచ్‌ను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తూ ఆ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ఆ తరవాత ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం శృంగేరికి బయలుదేరాం.

సూర్యాస్తమయం... నయనానందకరం!
మేం శృంగేరికి అగుంటె మీదుగా బయలుదేరాం. ఎందుకంటే అగుంటె సూర్యాస్తమయ వీక్షణ ప్రదేశం. సముద్రమట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుంచి అరేబియా సముద్రంలో అస్తమిస్తోన్న సూర్యుణ్ని చూస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంతోమంది పర్యటకులు సూర్యాస్తమయ సమయానికి ఇక్కడకు చేరుకుని ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక్కడ నుంచి శృంగేరి 25 కి.మీ. మేం అక్కడకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావొచ్చింది. మర్నాడు ఉదయం శారదా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు స్వర్ణాభరణాలంకరణతో పుష్పార్చనలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. అమ్మ దర్శనంతో మా జన్మలు చరితార్ధమయ్యాయన్న భావన కలిగింది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన మొట్టమొదటి పీఠం శృంగేరి. మేం ఉదయాన్నే వెళ్లడంవల్ల భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. శారదా అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న అతి ప్రాచీనమైన విద్యాశంకరుల దేవాలయం కూడా దర్శించుకున్నాం. ఈ ఆలయం హొయసల నిర్మాణశైలిని కలిగి ఉంది. ఈ ఆలయాల పక్కనే తుంగానది వయ్యారంగా ప్రవహిస్తోంది.

ఉదయసంధ్య వేళలో...
ఈ ఆలయం నుంచి తుంగానది మీదుగా కాలినడకన వెళ్లే వంతెన ఉంది. ఆవలి వైపు పీఠాధిపతుల ఆశ్రమం ఉంది. ఉదయం వేళలో ఆ నది మీద కప్పేసిన పొగమంచూ ఆ పొగమంచును చీల్చుకుంటూ వస్తోన్న లేలేత బంగారు సూర్యకిరణాలూ నదిమీదుగా ఎగురుతోన్న పక్షుల గుంపులూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతా... చూస్తుంటే సృష్టికర్త ఓ అందమైన చిత్తరువుని గీసి అక్కడ పెట్టాడా అనిపించింది. ఆ నదిలోని చేపలు భక్తులు వేసే మరమరాల కోసం నీటిమీద ఎగిరెగిరి పడుతున్నాయి. తుంగానదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాంతో కింద ఉన్న భూమి కనిపిస్తుంటుంది. ఆ ఉదయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఇంతకన్నా  అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. అక్కడ అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఆది శంకరులు, తోరణ గణపతి ఆలయాలను దర్శించుకుని వీడలేక వీడలేక ఆ గుడి బయటకు వచ్చాం. అక్కడ నుంచి ఉదయం పది గంటలకే బయలుదేరి హోర్నాడు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాం. శృంగేరి నుంచి హోర్నాడు 45 కిలోమీటర్ల దూరం. ఈ మార్గం కూడా మనల్ని కళ్లు తిప్పుకోనీయదు. ఎత్తయిన కొండలూ వాటి మధ్యనే బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో నిండిన చిన్న చిన్న వూళ్లూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా తోచాయి. అమ్మవారి ఆలయానికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. లగేజీని బస్టాండుకు దగ్గరలోనే ఉన్న ఓ షాపులో పెట్టి దర్శనానికి వెళ్లాం. అరగంటలోనే ఆది శక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దివ్యమంగళ దర్శనం చేసుకుని తరించాం. అగస్త్యేశ్వరుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. దర్శనం తరవాత అమ్మవారి భోజనం చేశాం. ఇక్కడికొచ్చే వాళ్లంతా ఆలయంవారు పెట్టే భోజనం తప్పక తింటారు. అక్కణ్ణుంచి మధ్యాహ్నం మూడు గంటలకే ధర్మస్థలకు బయలుదేరాం.

హోర్నాడు నుంచి కొట్టిగర మీదుగా ధర్మస్థల చేరుకోవాలి. ఇది సుమారు 95 కిలోమీటర్ల దూరం. అయితే కొట్టిగర వరకూ 40 కి.మీ. ప్రయాణం పూర్తిగా కొండలతో ఘాట్‌ రోడ్ల మధ్య సాగిపోతుంది. కొట్టిగర నుంచి ధర్మస్థల వరకూ 45 కిలోమీటర్ల విశాలమైన కొండదారి కిందకి దిగుతూ ఉంటుంది. ఇలా దిగేటప్పుడు మాత్రం చాలా మలుపులు ఉంటాయి. సాయంత్రం ఐదు గంటలకు ధర్మస్థల చేరుకుని ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న గెస్ట్‌హౌస్‌లో దిగి బస చేశాం. ఈ ప్రదేశం తిరుమలలా ఉంది. వూళ్లొకి ప్రవేశించగానే త్రిశూలం పట్టుకుని ఉన్న పెద్ద శివుని విగ్రహం ఉంది. మేం వెళ్లిన రోజునా మర్నాడూ మంజునాథుణ్ణీ అమ్మవార్లనూ తనివితీరా దర్శించుకున్నాం. అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. ఆలయంలోపల చతురస్రాకారపు చెక్కమీద రకరకాలైన దేవతా రూపాలు చెక్కి ఉన్నాయి. లోపల వినాయకుడి ఆలయం కూడా ఉంది. అవన్నీ చూసుకుని సాయంత్రానికి అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని కుక్కి సుబ్రహ్మణ్యస్వామిని చూడ్డానికి వెళ్లాం.

సర్పరక్షిత క్షేత్రం!
ధర్మస్థల, కుక్కి క్షేత్రాల మధ్య ప్రతి అరగంటకీ బస్సులు ఉంటాయి. కుక్కిలో అతి తక్కువ రుసుముతోనే బస చేయడానికి అన్ని వసతులతో కూడిన కుమార కృప, స్కంద కృప, కార్తికేయ మొదలైన అతిథిగృహాలూ ప్రైవేటు లాడ్జీలూ ఉన్నాయి. ఉదయాన్నే ఇక్కడ ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలో కింద శివలింగం, దానికి నాగాభరణం, పైన మళ్లీ నాగాభరణం, ఆపైన దేదీప్యమానంగా వెలిగిపోతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. సుబ్రహ్మణ్యుడికి కుడివైపున ఉమామహేశ్వర మందిరం ఉంది. బయట ఉన్న మరో చతురస్ర ప్రాకారంలో నాగప్రతిష్ఠమండపం, సంకల్ప మండపం, శృంగేరి మఠం, హోసొలిగమ్మ ఉన్నాయి. కుక్కి ముందుగా శివ క్షేత్రం. శివుడు పరీక్షిత్‌ మహారాజుకి వరమివ్వడంతో సుబ్రహ్మణ్యుడు ఇక్కడ వెలిశాడట. సుబ్రహ్మణ్యుడు, ఆది సుబ్రహ్మణ్యుడుగా పుట్ట రూపంలో ఇక్కడే ఉన్న వేరొక ఆలయంలో కొలువై ఉన్నాడు. భక్తులందరూ తప్పకుండా కుమారధారలో స్నానమాచరించి ఈ రెండు ఆలయాలనూ దర్శించుకుంటారు. కుమారధార అనేక ఔషధమొక్కల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి సర్వ శారీరక రోగాలనూ నయంచేయగల శక్తీ, దైవికంగా సర్వపాపాలనూ హరించే శక్తీ ఈ నదికి ఉన్నాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ వధ అనంతరం ఆ పాపాలను హరింపజేసుకునేందుకు ఇక్కడి కుమారధారలో స్నానమాచరించాడన్నది స్థల పురాణం. వాసుకి తపస్సు కారణంగా సర్పజాతి, గరుత్మంతుడి నుంచి ఈ కుక్కి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని చెంత రక్షణ పొందుతుందని ప్రతీతి.

ఇక్కడి ఆలయంవారు నిర్వహించే సర్ప సంస్కార సేవలో వరసగా రెండురోజులు పాల్గొన్నాం. ఈ క్రతువుకి ఓ ప్రత్యేక యాగశాల ఉంది. కుటుంబం నుంచి నలుగురిని పూజకు అనుమతి ఇస్తారు. పూజ రెండోరోజున ప్రధాన ఆలయంలో నాగప్రతిష్ఠ జరగడంతో సర్పసంస్కార పూజ ముగుస్తుంది. పూజలో పాల్గొన్న భక్తులకే కాకుండా కుక్కి వచ్చే మిగిలిన భక్తులందరికీ కూడా రోజూ రెండు పూటలా అన్నదానం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించామన్న ఆనందంతో వెనుతిరిగాం. అయితే ఆయా క్షేత్రాల్లోని ఆలయాలను పురుషులు తప్పకుండా పంచె, బనీనుతోనే దర్శించాలి. చొక్కా వేసుకోకూడదు. కండువా కప్పుకోవచ్చు. అదే స్త్రీలయితే చీర, లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ మాత్రమే వేసుకోవాలి.

లక్షద్వీప్‌






లక్షద్వీప్‌
పేరుకే లక్షద్వీప్‌... ఉన్నది 36 దీవులే!

లక్షద్వీప్‌... ఆ పేరు వినగానే అక్కడ అన్ని దీవులున్నాయేమో అనుకుంటారంతా. కానీ అది కేవలం 36 దీవుల సమాహారం. అరేబియా సముద్రంలో ఆణిముత్యాల్లా మెరిసే ఆ దీవుల్ని చూడాలని బయలుదేరాం. అక్కడ విహరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. హైదరాబాద్‌ నుంచి కొచ్చీ చేరుకుని ఆ దీవుల్లోని పర్యటకశాఖ నుంచి అనుమతి తీసుకున్నాం. పర్యటక శాఖవారి ఓడలో అయితే భోజన, వసతి సదుపాయాలూ సముద్ర క్రీడలూ అన్నీ వాళ్లే ఏర్పాటుచేస్తారు. నెల రోజుల ముందుగానే యాత్రకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం.

అది 150 గదుల ఓడ!
కొచ్చీలో లక్షద్వీప్‌ కేంద్రం దగ్గర ఉదయం 9 గంటలకు ఓడ ఎక్కడానికి అందరం కలిశాం. లగేజీ స్కానింగ్‌ చేశాక చెక్‌ఇన్‌ అయ్యాం. అక్కడే ఓడ బోర్డింగు పాసులు అందజేశారు. పర్యటకులందరికీ కాంప్లిమెంటరీ టీషర్టూ, ఆ దీవుల క్యాలెండరూ, టోపీలూ జ్ఞాపికలుగా ఇచ్చారు. బస్సులో కె.వి. సముద్రం అనే ఓడ దగ్గరకు సరిగ్గా 11 గంటలకు చేరుకున్నాం. మాతోపాటు ఆ దీవుల నివాసితులు కూడా ఆ ఓడ ఎక్కారు. ఐదు అంతస్తులతో 150 గదులతో మొత్తం 750 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంది. ఐదో అంతస్తులో మొదటి తరగతి AC గది తీసుకున్నాం. రైల్లోని రెండో AC మాదిరిగానే ఓడలో కూడా కిందొక బెర్తూ పైనొక బెర్తూలాంటి మంచాలు ఉన్నాయి. టేబులూ రెండు కుర్చీలూ లగేజీ పెట్టుకునేందుకు వీలుగా ఓ బీరువా, అటాచ్డ్‌ టాయ్‌లెట్‌ ఉన్నాయి. గది చిన్నగా సౌకర్యంగా ఉంది. కిటికీలోనుంచి చూస్తే కనుచూపుమేరా అనంతసాగరమే. లక్షదీవుల్లో 36 ఉన్నప్పటికీ పది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అధికార భాష మలయాళం. అయితే చాలామంది హిందీ మాట్లాడగలరు. మధ్యాహ్నం రెండుగంటలకు భోజనం ముగించుకుని ఓడ చూడ్డానికి బయలుదేరాం. సమాచార కేంద్రం, హాస్పిటల్‌, భోజనశాల, వినోదకార్యక్రమాలు నిర్వహించే హాలు... అన్నీ ఉన్నాయి. కెప్టెన్‌ అనుమతితో ఫ్రంట్‌ ఆపరేషన్‌ రూములో ఓడ వివరాలన్నీ తెలుసుకున్నాం. GPS నావిగేషన్‌, సెక్యూరిటీ, వాతావరణం, సిగ్నల్‌ వ్యవస్థ ఇలా సముద్రప్రయాణానికి అవసరమైనవాటి అన్నింటి గురించీ వివరించారు. మా టూర్‌ మేనేజర్‌ అన్ని అంతస్తుల్లోకి వెళ్లి ఓడలో ఉన్న సదుపాయాలూ భోజనవేళలతోపాటు యాత్ర గురించిన వివరాలు తెలియచేశాడు. సాయంత్రానికి అందరం ఓడ పైనున్న డెక్‌కు చేరుకున్నాం. సాగరతీర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అందరం ఆనందంగా గడిపాం. రాత్రి 8 గంటలకు డైనింగ్‌హాల్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రమించాం.

అక్కడ మద్యపానం నిషిద్ధం!
రెండోరోజు వేకువనే సూర్యకిరణాలు క్యాబిన్‌లోకి రావడంతో మెలకువ వచ్చింది. డెక్‌పైకి వెళ్లి సూర్యోదయాన్ని చూస్తే కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యుడు పైకి వస్తున్నాడా అనిపించింది. ఉదయభానుడి కిరణాలతో అలలు వెండి వెలుగులో మెరుస్తున్నాయి. అక్కడక్కడా పైకి ఎగురుతూ మళ్లీ నీళ్లలోకి దూకే టూనా చేపల్ని చూస్తుంటే ఆ కాంతికిరణాల మెరుపుకి ఆనందంతో అవి నృత్యం చేస్తున్నట్లే ఉంది. అల్పాహారం ఓడలోనే ముగించి లైఫ్‌జాకెట్‌లు ధరించి పడవల్లో తీరం చేరుకున్నాం. కనుచూపుమేరలో మినికాయ్‌ దీవి నీలిజలాలతోనూ కొబ్బరితోటలతోనూ ఆకర్షిస్తోంది. కొచ్చి నుంచి ఈ దీవికి సుమారు 400 కిలోమీటర్ల దూరం. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 గంటలపాటు ఓడలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం.

మినికాయ్‌దీవివాసుల ఆచార వ్యవహారాలూ మిగిలినవారికంటే భిన్నంగా ఉంటాయి. పురుషులు మలయాళీల వస్త్రధారణలోనే ఉన్నారు. స్త్రీలు రంగురంగుల బురఖాలు ధరించారు. ముస్లిం జనాభా ఎక్కువ. తీర ప్రాంతంలో ఉండే తేమ వాతావరణమే అక్కడా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడు. ఉక్కబోత ఉన్నా చెమట లేదు. ఎండ తీవ్రత మాత్రం తెలుస్తోంది. లక్షదీవుల్లో మద్యపానం నిషేధం. బంగారం అనే ఒక్క దీవిలోనే అనుమతిస్తారు. మేం 1885లో సర్‌ జేమ్స్‌ నికోలస్‌ డగ్లస్‌ నిర్మించిన వైట్‌హౌస్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడ చల్లని తీయని కొబ్బరిబొండాలతో స్వాగతించారు. ఐదు అంతస్తుల ఎత్తున్న లైట్‌హౌస్‌లో వృత్తాకారంలో ఉన్న 400 మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ నుంచి చూస్తే ఎక్కడా నేల కనిపించకుండా పైకి లేచిన కొబ్బరితోటలూ అలలు అంతగాలేని గంభీరముద్రలోని నీలిసాగరజలాలూ తీరంవెంబడి చూడచక్కగా కట్టిన రిసార్టులూ ఈతకొలనులతో ప్రకృతి అందాలన్నీ అక్కడే కొలువుదీరాయా అనిపించింది. అన్ని అంతస్తులు ఎక్కిన శ్రమంతా ఎటుపోయిందో తెలియదు. అక్కడ నుంచి అందరం రిసార్టుకి చేరుకున్నాం. అక్కడే పర్యటక శాఖ ఉచితంగా ఏర్పాటుచేసిన వాటర్‌స్పోర్ట్స్‌కు లైఫ్‌జాకెట్‌తో వెళ్లాం. చిన్న పడవలతో స్వయంగా తెడ్డు వేసుకుంటూ కయాకింగ్‌ చేసి ఆనందించాం. ముఖానికి మాస్క్‌ వేసుకుని సముద్రంలోపలున్న జీవుల్ని చూసే స్నోర్కలింగ్‌కి వెళ్లాం. వాటర్‌స్కూటర్‌, బనానా బోట్‌రైడ్‌లకు మాత్రం ఇష్టమైన వాళ్లు టిక్కెట్లు కొనుక్కుని వెళ్లారు. కొంతమంది స్కూబా డైవింగ్‌కి వెళ్లారు. భోజన సమయానికి అందరం తిరిగి రిసార్టుకి చేరుకున్నాం. టూనా చేప వంటకాలతో భోజనం వడ్డించారు.

సాంఘిక జీవనం!
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక విలేజ్‌ టూర్‌కి ఆటోల్లో తీసుకెళ్లారు. అక్కడ మహిళలు స్వయంగా తయారుచేసిన కొబ్బరి స్వీటు, మసాలావడ, తేనీటిని అల్పాహారంగా ఇచ్చారు. పక్కనే వాళ్ల ఇళ్లు ఉన్నాయి. మధ్యలో అందరికీ ఉమ్మడిగా ఉన్న వంటగదిలో కొందరు స్త్రీలు సముద్రంమీదకి పనికి వెళ్లిన తమ మగవాళ్లకోసం కొన్ని వంటకాలు చేస్తూ కనిపించారు. పదిమంది స్త్రీలు రోజూ వంతులవారీగా అన్ని రకాల వంటల్నీ కొబ్బరి మట్టల్ని మండించే మట్టిపొయ్యిలమీద చేస్తుంటారట. వాళ్లలా సాంఘిక జీవనం కొనసాగించడం ఎంతో ముచ్చటగొలిపింది. గ్రామంలో జనాభా కేవలం రెండువేలమంది మాత్రమే. సాయంత్రం వరకూ ఆ పచ్చటి చెట్ల మధ్య గడిపి ఓడమీదకి చేరుకున్నాం.

అంతా అక్షరాస్యులే!
మర్నాడు ఉదయం ఆరు గంటలకు కాల్‌పెనీ అనే మరో దీవికి చేరుకున్నాం. అల్పాహారం ఓడలోనే ముగించి ఉత్సాహంతో ఈ దీవిలోకి అడుగుపెట్టాం. ఈ దీవి జనాభా నాలుగు వేలు కాగా అందరూ అక్షరాస్యులే. వాళ్లలో దాదాపు 500 మంది వైద్యులేనట. లక్షదీవుల్లో మెట్రిక్‌ పాసయిన మొదటి మహిళది కూడా ఈ దీవేనట. ఆమెకిప్పుడు 83 సంవత్సరాలు. ఓ గ్రామంలో ఉన్న ఆమెను చూశాం. ఆ దీవిలో దక్షిణంవైపు అలలు సముద్రక్రీడలకు అనుకూలంగా లేకపోవడంతో నార్త్‌ ఎండ్‌ టిప్‌కు తీసుకుని వెళ్లారు. పది నిమిషాల ప్రయాణంలో అటూ ఇటూ కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో మునగచెట్లు ఉన్నాయి.

నార్త్‌ ఎండ్‌ టిప్‌కు చేరుకోగానే మూడువైపులా సముద్రం కనిపించింది. అక్కడ అలలు అంత ఉధృతంగా లేవు. మధ్యలో బండరాళ్లూ అడుగున ఇసుకరేణువులు కనిపించేంత తేటగా ఉన్నాయక్కడి జలాలు. కాసేపు అక్కడ గడిపి తిరిగి రిసార్టుకి చేరుకుని సముద్ర క్రీడలకు వెళ్లాం. కాల్‌పెనీలో 1947లో సంభవించిన తీవ్ర తుఫానువల్ల కొంత భూభాగం విడిపోయింది. కాస్త దూరంలో ఉన్న ఆ దీవికి మమ్మల్ని పడవల్లో తీసుకువెళ్లారు. సముద్రంలోపల నాచుమొక్కలూ సీకుకుంబర్‌... వంటి జంతువులూ ఎక్కువగా ఉన్నాయి. ఆ జంతువుల్ని పట్టుకుంటే మెత్తని స్పాంజుల్లా ఉన్నాయి. స్నోర్కలింగ్‌కి వెళ్లినప్పుడు వివిధ ఆకారాల్లో రంగుల్లో ఉన్న కోరల్స్‌ కనిపించాయి. వాటిమధ్యలో అటూఇటూ తిరుగుతోన్న గోల్డ్‌ఫిష్‌లూ చారల చేపలూ స్నేక్‌ ఫిష్‌లూ... ఇలా చాలా రకాలు కనిపించాయి. మధ్యాహ్న భోజనానంతరం గ్రామంలో తిరుగుతూ అక్కడ నివసిస్తోన్న కుటుంబాలతో మాటలు కలిపాం.

అక్కడి ప్రజలు సౌమ్యులూ స్నేహశీలురూ. మా సంభాషణ అంతా హిందీలో సాగింది. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించాం. కొబ్బరినూనె, కొబ్బరిపొడి తయారీ చూపించారు. తరవాత మహిళలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి తయారుచేస్తోన్న టీషర్టు యూనిట్‌ని కూడా చూశాం. ధర తక్కువగా ఉండటంతో వాటిని కొనుక్కున్నాం. తిరిగి సాయంత్రానికి రిసార్టుకి చేరుకున్నాం. అక్కడ స్థానిక జానపద, సంప్రదాయ నృత్యరీతుల్ని ప్రదర్శించారు. మల్‌ అనే భాషలో వారు పాడుతున్న పాట అర్థం కాకపోయినా వారి లయవిన్యాసాలను చూసి ముగ్ధులమయ్యాం. చేతిలో డప్పులాంటి పరికరంతో శబ్దం చేస్తూ అడుగులు వేసే తీరు ఎంతో బాగుంది. రాత్రికి ఓడకు చేరుకున్నాం.

వందల రకాల చేపలు!
మూడోరోజు ఉదయానికల్లా లక్షద్వీపాల రాజధాని అయిన కవరట్టి అనే దీవికి వెళ్లాం. 11 వేల జనాభా ఉన్న ఆ దీవి అన్నింటికన్నా పెద్ద దీవి కూడా. ఇక్కడ కొన్ని ఇళ్లు అధునాతనంగా ఉన్నాయి. అక్కడ సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్లారు. రంగురంగుల చేపలూ సీఅనీమోన్‌లూ బ్రెయిన్‌ కోరల్సూ ఫింగర్‌ కోరల్సూ లాంటివాటిని చూపించారు. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది. కోరల్స్‌ సేకరించడం నిషిద్ధం. కొందరు స్కూబాడైవింగ్‌ చేస్తే మిగిలిన వాళ్లు తీరందగ్గరే వాటర్‌స్కూటర్‌, నీబోర్డు... తదితర క్రీడలతో కాలం గడిపారు. భోజన సమయానికి అందరం రిసార్టుకి చేరుకున్నాం. కాసేపు విశ్రమించాక మినీ బస్సులో గ్రామ సందర్శనకు వెళ్లాం. రోడ్లన్నీ సిమెంట్‌తో వేసినవే. ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుచేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కనే మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. ఆ సాయంత్రం స్థానిక బాలికలతో ఏర్పాటుచేసిన జానపద నృత్య కార్యక్రమం ఎంతో అలరించింది. తేనీటి విందు అయ్యాక తిరిగి ఓడను చేరుకోవడానికి మరపడవల్లో బయలుదేరాం. రాత్రికి డెక్‌పై అందరం ఆనందంగా గడిపి అడ్రస్‌లు తీసుకుని, మర్నాడు ఉదయం 9 గంటలకు కొచ్చీ చేరుకున్నాం.

ప్రపంచంలోనే ధనిక దేశం!


ప్రపంచంలోనే ధనిక దేశం!
 
*ప్రపంచ సంపన్న దేశాల్లో మొదటిది. ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం 68 లక్షల రూపాయలకు పైమాటే.
* ఈ దేశం వాస్తవానికి ఆసియా ఖండానికి చెందినదే కానీ ఉన్నదేమో మధ్యప్రాచ్యంలో.
* ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రం అంత ఉంటుందంతే. దాన్ని 8 మున్సిపాలిటీలుగా, 98 జోన్‌లుగా విభజించారు.

జెండా : జెండాలో కుంకుమ రంగు దేశం కోసం రక్తం చిందించిన అమరుల త్యాగానికి, తెలుపు శాంతికి గుర్తు.
రాజధాని : దోహా

అధికారిక భాష : అరబిక్‌
జనాభా : 22,58,283
విస్తీర్ణం : 11,586 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ : ఖతారీ రియాల్‌

* బిరియానీ అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టం. మధ్యాహ్న భోజనం అనంతరం ‘కరాక్‌ టీ’ తాగడం ఇక్కడి వారందరికీ అలవాటు.

* 89 శాతం మంది అక్షరాస్యులే.
* ద్వీపకల్ప దేశమైన దీనిలో చాలా భాగం ఎడారే. అయితే చమురు, సహజవాయువులు ఎక్కువగా దొరుకుతాయి. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ)ని అధికంగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశమిది.
* దోహా దగ్గర సముద్రంలో ‘దపర్ల్‌’ పేరుతో ఓ కృత్రిమ దీవిని తయారు చేశారు. దానిపై అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాల్ని కట్టారు. 12,000 మంది ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. సముద్రపు అందాల్ని చూస్తూ ఇక్కడున్న షాపింగ్‌ కాంప్లెక్సుల్లో కావల్సిన వాటిని కొనుక్కోవచ్చు.
* 1971లో ఇది UK నుంచి స్వాతంత్య్రం పొందింది.


* ఈ బుల్లి దేశానికి మొత్తం 11,800 మంది సైన్యం ఉన్నారు.
* దోహాలో ఉన్న హామద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో తొమ్మిదోది.
* శీతకాలంలో ఇక్కడ కనిష్ఠంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవి కాలంలో గరిష్ఠంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
* ఇక్కడ శుక్రవారం అంతా ప్రార్థనల్లో పాల్గొంటారు. అందుకే మధ్యాహ్నం వరకు దుకాణాలు సైతం తెరవరు.
* ఇక్కడున్న వారిలో 80 శాతం మంది విదేశీయులే. 18 శాతం మంది భారతీయులున్నారు.
* దుస్తుల విషయంలో ఇక్కడ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తారు. స్త్రీ పురుషులెవరైనా మోకాళ్ల కింద వరకు దుస్తులు ధరించాలి. మహిళలు కచ్చితంగా చేతులు కప్పుకోవాలి.
* రాజధాని నగరంలో ఉన్న తేలియాడే మ్యూజియం ‘మెష్రిబ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ సెంటర్‌’ ఇక్కడ ప్రధాన పర్యటక ఆకర్షణ.

Friday, 27 January 2017

కోనసీమ






కోనసీమ

గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలి ఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. తూర్పుగోదావరి జిల్లాలో పదహారు మండలాలు కోనసీమలో ఉన్నాయి. అవి అమలాపురం, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, రావులపాలెం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలు.



గోదావరిమీద బ్రిడ్జీలు నిర్మించడానికి పూర్వం కోనసీమనుంచి బయట ప్రదేశానికి రాకపోకలు లాంచీలమీద, పడవలమీద జరిగేది. ఇప్పటికీ లాంచీ ప్రయాణాలు పాతబడిపోలేదు. గోదావరినది దాటుతున్నప్పుడు దూరంగా మధ్య, మధ్యలో కనిపించే లంకల్లాంటి ఇసుకమేటలు, చిన్నచిన్న అలలు లాంచీ అంచులకి తగిలి నప్పుడు మీదపడే నీటి తుంపరలు, చల్లగా వీచే గాలి, లాంచీలో జనాల రణగొణద్వని- పదిహేను, ఇరవై నిమిషాల ప్రయాణం డ్రీం జర్నీలా ఉండేది.

సమృద్ధిగా నీటివనరులు, అత్యంత సారవంతమైన నేలా ఉన్న కారణంగా పంటలు చాలా బాగా పండుతాయి. కనుచూపుమేర విస్తరించిన వరిపొలాలు, కొబ్బరితోటలు, కాలువల్లో నింపాదిగా సాగే పడవలతో కేరళానుంచి ఒకముక్క కత్తిరించి ఆంధ్రాలో అతకించినట్టు ఉంటుంది కోనసీమ. కోనసీమలో రైతే రాజు. పొలానికి నీరు పెట్టుకోవడం, దుక్కిదున్నుకోవడం, విత్తనాలు జల్లుకోవడం, నాట్లువేసుకోవడం, కలుపుతీసుకోవడం, ఎరువులు, పురుగుమందులు జల్లుకోవడం, కోతలు కోసుకోవడం, కుప్పలునూర్చుకోవడం, ధాన్యాన్ని మార్కెట్టుకో, ఇంటికో చేర్చుకోవడం, మళ్ళీ పైర్లు చల్లుకోవడం... ఏడాదంతా పనే! దాళవాలకి నీరు వదలనప్పుడో, తుఫాన్లు కన్నెర్రజేసినప్పుడో, పంటలకి కిట్టుబాటుధర సరిగా లేనప్పుడు తనంతట తాను క్రాపు హాలిడే ప్రకటించుకొన్నప్పుడో తప్పించి రైతుకి శలవు లేదు. ఇక్కడ వరి తరువాత ఎక్కువగా పండించే పంట అరటి. రావులపాలెంలో అరటి మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖమైన వాటిల్లో ఒకటి. తెలతెల వారుతూ ఉండగా, మంచు తెరలు ఇంకా భూదేవి మేనిపై నుంచి తొలగకముందే సైకిళ్ళమీద రైతులు అరటిగెలలు మార్కెట్లకి తీసుకువెళుతుండడం ఒక మనోహరమైన దృశ్యం.



కోనసీమలో ఎన్నో దేవాలయాలున్నాయి. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి, మురమళ్ళలో వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వరస్వామి, అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి, అంతర్వేదిలో నరసింహస్వామి, అయినవిల్లిలో శ్రీ సిద్దివినాయకస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి ఇక్కడి కొన్ని ప్రముఖమైన దేవాలయాలు.

`గుళ్ళూ, గోపురాల్లాంటివేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?` అంటారా? అన్నీ చెప్పాలంటే ఒక్క టపా సరిపోదు. అలా అని చెప్పకుండా ఉండాలంటే మనసొప్పదు. అందుకే మీకోసం, నాకోసం కొన్ని విశేషాలని ఇక్కడ ఇస్తున్నాను. అవి ఏమిటంటే.. ఆదుర్రులో బౌద్ద స్థూపం, మలికిపురంలో దిండీ రిసార్ట్స్, ముమ్మిడివరంలో బాలయోగి ఆశ్రమం, అమలాపురంలో కోనసీమకే మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ ఎస్.కే.బీ.ఆర్ కాలేజ్. ఆత్రేయపురం పూతరేకులు, బండారులంక చీరలు, కోనసీమ కొబ్బరికాయలు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు ఈ ప్రాంతం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఎవరో చెప్పినట్టు కోనసీమ అంటే వర్షంలా కురిసిన చిలకాకుపచ్చరంగు కల. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు! కెమేరాని ఎటుతిప్పి తీసినా అందమైన దృశ్యమే వస్తుంది.

ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసామాన్యాన్ని కూడా చూడండి. కలుపుతీసే పల్లె పడుచులు, మైదానంలో మేకలని కాసుకొనే ముసలికాపరి, చెట్లకొమ్మలకి తాడు ఉయ్యాల కట్టి ఊగే చిన్నపిల్లల గుంపు, కాలువలో ప్రపంచాన్ని మరిచి ఈతలుకొట్టే యువకులు, సంధ్యా సమయంలో పడవ తెడ్డుమీద గెడ్డం ఆనించి సూర్యాస్తమయాన్ని చూస్తున్న నావవాడు, ఆవుల మందని ఇంటిదారి పట్టిస్తున్న కుర్రాళ్ళు... ఏదయినా మీ కెమేరా కంటికి అందమైన ఫోటోని ఇవ్వవచ్చు.



ఫేస్‌బుక్‌లో కోనసీమ అనే పేజీని ఇక్కడ చూడండి

ద్వారపూడి


కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. 

బయటనుంచి


పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం: 
ఇందులో స్తూపాకారంగా క్రిందనుంచి నాలుగవ అంతస్తువరకూ వ్యాపించిన శివలింగం ఉంది. రెండవ, మూడవ అంతస్తులలో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణగాధలో సన్నివేశాలని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటుచేశారు. నాలుగవ అంతస్తులో, శివలింగ శిఖరానికి అబిషేకం చేస్తే, అబిషేక జలం క్రిదకి వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసిఉన్న 18 చిన్న లింగాలని తాకుతూ క్రిందకి వస్తుంది. ఈ దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం అంటారు.
శివాలయం
శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, రెండువైపులా హనుమంతుడు, నందీశ్వరులు తమ తమ హృదయాలలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి.

(ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంచడం యొక్క ఉద్దేశ్యం, నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు ఎందుకు ఉన్నారో నాకు అర్ధంకాలేదు)


శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది ఉంది. ఆలయం నాలుగవ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలాగ దీనిని నిర్మించారు.


పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన మూడునాలుగు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రతీశివాలయంలోనూ శివలింగానికి అభిముఖంగా నందిని చూస్తుంటాం. నంది శివుని వాహనంగా మనకి తెలుసు. కానీ లింగపురాణంలో నంది సాక్షాత్తూ శివుని అవతారం అని చెప్పబడింది. శిలాదుడు అనే మహర్షి అమరుడైన(మరణం ఉండబోని చిరంజీవి అయిన) ఒక పుతృనికోసం శివునికి తపస్సుచేస్తాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని వరం ఇచ్చి, అలాగే చేస్తాడు. అంతేకాకుండా కైలాసంలో శివునికి ద్వారపాలకులిగా ఉండే ఇద్దరిలో ఒకరు నంది, రెండవవాడు మహాకాళి. శివుని ప్రమదగణాలకు అధిపతికూడా నందీశ్వరుడే. నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా ఉందని చెప్పే కథ ఏమిటంటే - ఈయన పురాణాలలో చెప్పబడిన ప్రధమగురువులలో ఒకడట. ఈ సారి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఇంకా మిగిలిన అంశాలుకూడా దృష్ఠిలో ఉంచుకొని చూడండి.

భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం: 
శివాలయానికి ఎడమవైపు భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్దంగా వెళ్ళాలి. లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచలు రెండురూపాయలకి అద్దెకి ఇస్తున్నారు. అందరికీ అవే ఇస్తూ ఉంటారు కనుక ఎవరైనా ధైర్యం ఉంటే అద్దెకితీసుకొని లోనికి వెళ్ళవచ్చు.   


ఇక్కడే విష్ణుమూర్తి యొక్క దశావతార దేవాలయం నిర్మాణంలో ఉంది. 

అయ్యప్పస్వామి దేవాలయం: 
ఈ గుడిని ఆంధ్రా శబరిమల అని అంటారు. అయ్యప్ప మాలదారులు అంతదూరం ప్రయాణించి శబరిమల వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వస్తారు. 1989లో అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహాన్ని కంచి పీఠాధిపతి స్వామీ జయేంద్ర సరస్వతి వారి చేతులమీదగా ప్రతిష్టించారు.  ఒకేరాతి మీద చెక్కిన 18 మెట్లను తమిళనాడు నుంచి తీసుకువచ్చారట. కేరళలోని శబరిమల ఆలయంలో జరిగిన విధంగానే ఇక్కడకూడా సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహిస్తారు.

మహిషాసురిడిని దుర్గాదేవి సమ్హరించిన తరువాత, అతని సోదరి మహిష బ్రహ్మగురించి తపస్సుచేసి శివుడి చేత కానీ, విష్ణువు చేత గానీ చంపబడకుండా ఉండాలని వరంపొందుతుంది. తరువాత కొంతకాలానికి మోహినీ రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు మోహించిన కారణంగా వారికి జన్మించిన పుత్రుడే ధర్మశాస్త అనబడే అయ్యప్ప. మహిషను చంపడానికి పుట్టిన కారణజన్ముడు.   అయ్యప్పని హరిహర పుత్రుడు అని కూడా అంటారు.  ఈ పురాణ గాధని సూచిస్తూ దేవాలయానికి ముందు ఎత్తైన్ శివకేశవ విగ్రహం ఉంది.
శివకేశవ విగ్రహం
దుర్గాదేవి ఆలయం: 
గుదిలోనికి  సింహపు నోటి ప్రవేశ ఆకారపు ద్వారంగుండావెళ్ళాలి.  
లోపల చిన్న అష్ఠలక్ష్ముల మందిరం, వివేకానంద, వేమన, బ్రహ్మంగారు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో దేవి.  

ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సాయిబాబా మందిరం, నాగదేవత ఆలయం, శనీశ్వరాలయం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం....

శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న  అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న అన్నింటిలోనూ నాకు బాగానచ్చింది. అందుకే ఒక ప్రత్యేకమైన పోస్టు వేశాను చూడండి.

పెద్ద గుడి. చూడటానికి ఎలా లేదన్నా గంట పడుతుంది. ఇక్కడి పరిసరాలు సుచీ శుబ్రతలతో ఉంటే దర్శనం ఒక గొప్ప అనుభూతిని మిగల్చడం ఖాయం. కానీ, ఎవరూ అంత శ్రద్ద తీసుకొంటున్నట్లు కనిపించడం లేదు.

దేవాలయం స్టాల్లో పద్దెనిమిది పిక్చర్ పోస్టుకార్డుల సెట్ పాతికరూపాయలకి అమ్ముతున్నారు. ఈ వాల్ మీద టైటిల్స్ ప్రింట్ చేసి ఉన్న ఫోటోలు అందులోనివే. మిగిలినవి నేను తీసినవి. కెమేరా అనుమతిస్తున్నారు. దానికి టిక్కెట్టు ముప్పై రూపాయలు. కారు పార్కింగి కి ప్రత్యేకమైన స్థలం లేకపొయినా, రోడ్డుప్రక్క నిలుపుకొన్నందుకు దేవాలయం వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టాలి. చిల్లర దగ్గర ఉంచుకోండే!

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...