Tuesday, 13 March 2018

మంగళగిరి - పానకాల నరసింహస్వామి





సగం పానకం ఏమైంది?

గుటకలు వేస్తూ తాగే దేవుడు... బెల్లం చుట్టూ చేరని చీమలు
నృసింహ దేవుడు! పానకమే ఆయనకు అమృతం! నోటికి అందించగానే... గుటకలు వేస్తూ మింగుతాడు! ‘మీ కోసం’ అంటూ సగం వదిలేస్తాడు! గుంటూరు - విజయవాడ నడుమ ఉన్న మంగళగిరి క్షేత్రంలో ఈ వింత కనిపిస్తుంది.

దేశంలో... ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి ముందు నైవేద్యాలు పెట్టడమే! మంగళగిరిలో మాత్రం నేరుగా పానకాన్ని నరసింహుడి నోటికి అందిస్తారు. మనం పానీయాలను తాగేటప్పుడు గుటకలు వేయడం సహజం. అదే విధంగా... మంగళగిరి నరసింహుడి నోటికి పానకం అందించినప్పుడు గుటకల శబ్దం వినిపిస్తుంది. ఎగువ మంగళగిరిలో... ఒక చిన్న గుహలా ఉన్న కొండ అంచులో పది నుంచి 15 సెంమీల వ్యాసంలో బిలాకృతి ఉంటుంది. ఈ బిలానికి రెండువైపులా శంఖు చక్రాల ఆకారాలు కనిపిస్తాయి. ఇదే ఇక్కడి స్వామివారి నిజరూపం. భక్తులు సమర్పించే పానకాన్ని అర్చకులు ఈ బిలంలో శంఖు ద్వారా పోస్తుంటారు.

భక్తులు నివేదించే పాత్రలో కచ్చితంగా సగం మాత్రమే లోపలికి పోతుంది. మిగిలిన సగాన్ని భక్తులు తీర్థంగా సేవిస్తారు. వందల సంవత్సరాలుగా ఈ చిత్రం జరుగుతూనే ఉంది. లోపల ఉన్న పానకం ఒక్క చుక్క కూడా బయటకు రాదు. ఈ కొండ ఒక అగ్నిపర్వతమని.. అందులో ఉన్న గంధకాన్ని చల్లబరచేందుకే పూర్వీకులు ఈ బిలాకృతిని ఏర్పరిచి పానకం పోయడం మొదలుపెట్టారని కొందరు వాదిస్తారు. అయితే... ఈ కొండలో ఎలాంటి గంధకం నిల్వలు లేవని, అది సాధారణ కొండ మాత్రమేనని పరిశోధనల్లో తేలింది. మంగళగిరి పానకాల స్వామి క్షేత్రంలో మరో వింత ఏమిటంటే... నిత్యం బెల్లం పొడికొట్టి, లీటర్ల కొద్ది పానకం తయారు చేస్తున్నా ఒక్క చీమ కూడా రాకపోవడం గమనార్హం.

పురాణగాథ ఇది...కృతయుగంలో నముచి అనే రాక్షసుడు విష్ణువు వదిలిన చక్రాయుధం నుంచి తప్పించుకునేందుకు మంగళగిరి కొండపై ఉన్న చిన్న బిలంలో దాగున్నాడట! అప్పుడు స్వామి సూక్ష్మ సుదర్శన రూపంలో అదే బిలంలో చేరి నముచిని వధించాడట! ఉగ్రరూపంలో ఉన్న స్వామిని శాంతపరిచేందుకు దేవతలు అమృతాన్ని నివేదించారట. తదనంతరం స్వామివారు అక్కడే స్వయంవ్యక్తమై వెలిశారని... కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవుపాలను, ద్వాపరయుగంలో నేతిని, కలియుగంలో బెల్లం పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నారని పురాణ గాథ వివరిస్తోంది.

- మంగళగిరి





ఛాయా సోమేశ్వరాలయం





సోమేశ్వరాలయ రహస్యమిదీ!


నల్లగొండ పట్టణానికి కూతవేటు దూరంలో పానగల్లు ఉంది. ఆ ఊరి శివారులో ఉదయ సముద్రం.. దాని పక్కన పచ్చటి పొలాల మధ్య ఓ పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరు ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే దాని మిస్టరీ దాగి ఉంది. మనం ఉదయించే సూర్యుడి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనుక వైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది.

అయితే గుడిలోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుడిలో ఎనిమిది స్తంభాలుంటాయి, కాని ఆ నీడ ఏ స్తంభానిదో కూడా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి, దాని నీడ పడినప్పుడు దాన్ని పట్టుకుంటే మన చెయ్యి మీద పడాలి, కాని అలా పడదు. ఆ నీడ ఎక్కడినుంచి పడుతుంది. రోజంతా స్థిరంగా ఎలా ఉంటుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.

వందల ఏళ్ల చరిత్రఛాయా సోమేశ్వరాలయం వందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగి ఉంది. మూడు గర్భగుడులు కలిగి త్రికూటాలయంగా ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గణిత, భౌతిక శాస్త్ర మేధస్సుకు చిహ్నం. ఆలయంలో పశ్చిమాన ఉండి తూర్పునకభిముఖంగా ఉన్న గర్భగుడిలో స్తంభాకారం గల ఒక నిశ్చల ఛాయ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరుకు భానుడి స్థానంతో సంబంధం లేకుండా మహా శివలింగం మీదుగా నిలకడగా ఉంటుంది.

ఆలయం తూర్పు వైపు నుంచి లోనికి ప్రవేశించే పరిక్షేపణ సూర్య కాంతి వల్ల ఏక నిశ్చల ఛాయ ఏర్పడుతుంది. మిగతా రెండు గర్భ గుడులు కూడా ఒకే రీతి విమాన శైలి కలిగి ఉన్నా ఎలాంటి ఛాయలు ఏర్పడవు. ఆలయాన్ని నిర్మించిన వారు తెలివిగా పశ్చిమాన ఉన్న గర్భ గుడికి ఇరు వైపులా అడ్డంకులు ఏర్పాటుచేసి కాంతిని ఆలయంలోకి ప్రవేశించకుండా చేశారు. ఉత్తరాన ఉన్న గర్భగుడికి ఎదురుగా ఆలయం ప్రధాన ద్వారం ఉండటం వల్ల ఎలాటి ఛాయలు ఏర్పడవు. ఆలయ ద్వారం స్థానంలో నాలుగో గర్భగుడి నిర్మించినట్లైతే ప్రజలకు నాలుగు గదుల్లో ఏక ఛాయలను వీక్షించే అవకాశం ఉండేది.

అయితే ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఏర్పడిన ఏక ఛాయలు నిశ్చలంగా ఉండకుండా సూర్యుడు తూర్పునుంచి ప్రయాణించినప్పుడు అవి పడమర నుంచి తూర్పుకు కదులుతాయి. ఇకపోతే తూర్పు పడమర గర్భగుడుల్లో ఛాయలను కలిగిన తలము సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉండటం వల్ల ఆ ఛాయలు నిశ్చలంగా ఉంటాయని తెలుస్తుంది. ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఛాయలను కలిపే తలము సూర్యుడు ప్రయాణించే దిశకు లంబంగా ఉండటం వల్ల అవి కదులుతాయి.

భౌతికశాస్త్రంలోని కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ఉపయోగించి సోమేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఈ రహస్యానికి సంబంధించి తాను కనుగొన్న అంశాలను, ప్రయోగాలను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుకు చెందిన శివనాగిరెడ్డి ఆమోదించినట్లు సూర్యాపేటకు చెందిన భౌతిక శాస్త్రవేత్త మనోహర్‌ తెలిపారు.

జలాల్‌పురంలో..

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామంలోని శివాలయంలో కూడా నల్లగొండలోని ఛాయా సోమేశ్వరాలయం మాదిరిగానే పరిస్థితులుండటం విశేషం.. అక్కడ.. పానగల్లు ఆలయానికి పూర్వ నమూనాలో సోమేశ్వరాలయం నెలకొని ఉండడాన్ని భౌతిక శాస్త్రవేత్త శేషగాని మనోహర్‌ గౌడ్‌ కనుగొన్నారు. గతంలో పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో నీడగా పడే శివలింగం రహస్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మనోహర్‌ను ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సహించినట్లైతే మరుగున పడిన చరిత్ర వెలుగులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు.
(నల్లగొండ-ఆంధ్రజ్యోతి)


ఏక నిశ్చలాకార నీడకు నిలయం ఛాయా సోమేశ్వరాలయం!

Sun,September 10, 2017 01:14 AM
ఛాయా సోమేశ్వరాలయం కుందూరు చోడుల కాలం నాటిది.దీనిని వాస్తుశాస్త్ర అద్భుతంగా పేర్కొంటారు చరిత్రకారులు. ఛాయా సోమేశ్వరాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. ఈ ఆలయ గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకేస్థానంలో ఉన్నట్లుగా కనిపించే నీడ. రెండోది అక్కడికి దగ్గర్లోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి వస్తుంది.

ఎక్కడ ఉంది?: నల్లగొండ పట్టణానికి సుమారు
4 కిలోమీటర్ల దూరంలో పానగల్లులో ఉంది.

విశిష్టత ఏంటి?: నిరంతర ఏక నిశ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడమే ఈ ఆలయ విశిష్టత. గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు.

నిర్మాణం ఏ కాలం?: క్రీస్తుశకం 11, 12 శతాబ్దకాలానికి చెందినదిగా చెప్తుంటారు. కుందూరు చోడులు దీనిని నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

పేరెలా వచ్చింది?: సోమేశ్వరుడి ఆలయ గర్భగుడిలో నేరుగా నీడ పడటం వల్ల ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని కొందరంటే.. మరికొందరేమో.. శ్రీ సూర్యభగవానుడు తన సతీమణి ఛాయాదేవితో వచ్చి సోమేశ్వరుడిని పూజించాడనీ అందుకే ఛాయా సోమేశ్వరాలయం అనే పేరొచ్చిందని అంటున్నారు.

ఛాయా మహత్యం: ఛాయా సోమేశ్వరాలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. తూర్పు వైపు ముఖం ఉన్న గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చలాకార నిరంతర ఛాయ సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఏర్పడడం ఇక్కడి వింత. ఈ నీడ ఏ వస్తువుదన్న విషయం ఇంతవరకూ అంతు చిక్కలేదు. ఆలయ మధ్యభాగం చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే.. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో మూడు గర్భగుడులు ఉంటాయి. మూడు గర్భగుడులు ఒకేరీతి నిర్మాణ శైలిని కలిగి ఉన్నప్పటికీ కేవలం తూర్పువైపు ముఖం ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయ కనిపిస్తుంది. వాస్తవానికి ఈ నమూనా ప్రకారం.. కాంతి అంతరాలయంలోకి ప్రవేశించే క్రమంలో ప్రతీ గది కూడా ఎదురుగా ఉన్న గదిలో ఏకఛాయ ఏర్పడాలి. నాలుగు గదులలోనూ ఏకఛాయను వీక్షించే అవకాశం ఏర్పడేది. కానీ నీడలను ఏర్పరచడానికి శిల్పి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణం చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం విశేషం.

శిల్పకళా కేంద్రం: ఛాయా సోమేశ్వరాలయానికి రాళ్లతో కూడిన పునాదిని ఎంచుకున్నారు. భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందనేది శిల్పి ఆలోచన అయుండొచ్చు అని గ్రామస్థుల అభిప్రాయం. ఇక్కడ అద్భుతమైన శైలితో చెక్కిన కళా శిల్పాలతో కూడిన సంపద నిండి ఉన్నది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే శిల్పాలను విభిన్న రీతిలో ప్రతిష్టించారు. మధ్యయుగపు ఛాయలతో శిల్ప కళానైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతిలో చెక్కిన శిల్పకళాకృతులతో పశ్చిమ చాళుక్యులు.. కుందూరు చోడులు.. కాకతీయుల కళాతృష్ణకు నిదర్శనంగా ఛాయా సోమేశ్వరాలయం నిలిచింది. ఆలయానికి ముందు ఉదయ సముద్రమనే చెరువును తవ్వించారు నాటి రాజులు. దీనిద్వారా సాగునీరు.. తాగునీరు అందేది. పొలాల మధ్యలో నిర్మితమైన ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసిద్ధి చెందింది. ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులకు చెరువునీళ్లు పంటచేళ్లు నిండి దేవాలయ మార్గంలోకి, ఆలయ ప్రాంగణంలోకి పొంగి పొర్లడం గమనించవచ్చు.

ప్రత్యేక ఆలయం: పానగల్లులోని అన్ని దేవాలయాల్లో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఆలయం ఛాయా సోమేశ్వరాలయం. పురాతన కట్టడాలలో ప్రత్యేకమైందిగా.. విశిష్ట నేపథ్యమున్న ఆలయంగా దీనిని పిలుస్తారు. ప్రతిరోజూ భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పానగల్లు చెరువు.. ఆలయాలు.. చరిత్రను దృష్టిలో ఉంచుకుని దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
-సిలివేరు లింగస్వామి

Sunday, 11 March 2018

అప్పలాయిగుంట





అప్పలాయిగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

వైకుంఠనాధుడు శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా చిత్తూరు జిల్లా తిరుమలగిరుల్లో స్వయంభువుగా అవతరించారు. ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుని వివాహం పద్మావతి దేవితో అంగరంగవైభవంగా జరిగింది. తిరుమల కొండలకు వెళ్లే ముందు స్వామివారు జిల్లాలోని పలుప్రాంతాల్లో నివాసం ఉన్నారు. భక్తుల ప్రార్థనలు ఆలకించి కొన్ని రోజులు భక్తులను అనుగ్రహించేందుకు అక్కడే ఉండేవారు. నారాయణవరంలో వివాహం తరవాత అప్పలాయిగుంటలో నివాసమున్నారు. సాక్షాత్తు స్వామివారు నివసించిన పవిత్రప్రదేశమిది. ప్రసన్నంగా భక్తులను ఆశీర్వదించడంతో ప్రసన్న వేంకటేశ్వరస్వామిగా ఖ్యాతిచెందారు.

అప్పులయ్య కథపూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ (రుణం లేని) సరోవరం అని పిలిచేవారు. అప్పలాయిగుంట అని పేరు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగు అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరు అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరు వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద ‘ నేను ఋణం తీసుకోలేదు’ అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటి లో మునిగిపోకుండా తెలుతుంది. దీంతో గ్రామస్థులందరు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్ఱుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్యగుంట అనే పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయిగుంటగా ప్రసిద్ధి చెందింది.

స్థల పురాణంతిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకుని, పసుపు దుస్తులతోనే తిరుమలకు మరవలికి (వరుడు, వధువు ఇంట జరిగే లాంఛనాలు) బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు.

ఆలయ చరిత్రఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. దీని ముఖద్వార గోడ మీద క్రీ.శ. 1585 కాలం నాటి వేంకటపతిరాయల దానశాసనం ఉంది. కాబట్టి ఆలయం అంతకు ముందే నిర్మించి ఉంటారని అభిప్రాయం. ఇక్కడ పూర్వం స్థానికంగా కార్వేటి నగర రాజులు పరిపాలించారు కాబట్టి వారే ఆలయ ఆలనపాలనా చూసుకొంటూ వచ్చారు. తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని స్వాధీన పరచుకొని జీర్ణోద్ధరణ చేసి, ఏప్రిల్‌ 30, 2006న మహాసంప్రోక్షణ చేసి అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం నిర్వహిస్తారు. స్వామి ప్రసన్నవదనంతో అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. రోగాల బారిన పడిన భక్తులు ఇక్కడ ఉన్న భారీ వాయునందనునికి మొక్కితే రోగ విముక్తలవుతారని ప్రశస్తి.

* తోరణ ద్వారం ఉండటం వలన ఈ క్షేత్రాన్ని సులభంగానే గుర్తించవచ్చు.
* ఇది ప్రసన్న వేంకటేశ్వరస్వామి పద్మావతీ సమేతంగా వెలసిన చోటు.
* ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే గోదాదేవి కూడా ఆలయంలో అమ్మవారికి సమాంతరంగా ఆమెలాగే వెలుపల ఉంటుంది.

ఎలా చేరుకోవాలి
* ఈ క్షేత్రం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో, తిరుచానూరు నుంచి చెన్నైకు వెళ్లే దారిలో ఉంది.
* రైలు ద్వారా రేణిగుంట, తిరుపతి, పుత్తూరు రైల్వేస్టేషన్లకు చేరుకొని అక్కడ నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
* తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకునే సదుపాయముంది.






అనంతగిరి






ఆహ్లాదసిరి... అనంతగిరి

తెల్లారితే చాలు ఉరుకులు పరుగులు. గంటల కొద్దీ ట్రాఫిక్‌ తిప్పలు.. ఆఫీసులో సమస్యలు.. ఇంట్లో ఇబ్బందులు.. మానసిక బాధలు.. ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక. వామ్మో ఖర్చులకు భయపడి విరమణ. అయినా ఏదో పోగట్టుకుంటున్నామనే వేదన. కాస్త సేదతీరి మనసుని ఆహ్లాదపరుచుకోవాలనే ఆలోచన. ఇది సగటు మనిషి తపన.. వాస్తవమే... యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ ప్రజలకు విశ్రాంతి కావాలంటే ఏదైనా టూర్‌కు వెళ్లాలి మరి. అది ఎక్కడో దూరాన ఉన్న ఊటి, కోడైకెనాల్‌, వైజాగ్‌, అరకు వెళ్తేనే దొరుకుతుందనేది పాత మాట. ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో మనల్ని కనువిందు చేసే ప్రాంతం హైదరాబాద్‌కు అతి దగ్గర్లోనే ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అంతగా ప్రచారంలోకీ రాలేదు కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి చెట్ల కొమ్మల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, రయిమనిపించే రహదారులు, దూరం నుంచే హత్తుకునే కొండలు, ఉట్టిపడేలా కనిపించే సేలయేటిధారలు.. పురి విప్పిన నెమళ్ల నాట్యాలు, రమ్మని పిలిచేలా రాతి కట్టడాలు,సేద తీర్చుకొమ్మనే గుహలు ప్రకృతి ప్రేమికుల మనసును నిలువునా దోచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉదయించే బాలభానుని, అస్తమించే సూర్యచంద్రుని వాడియైన కిరణాలతో ఆ ప్రాంతం మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అవును అక్కడికెళ్తే మనసుకెంతో హాయి.. కుటుంబానికెంతో జారు.. కాస్త ఆధ్యాత్మికం.. ఇంకాస్త ఆహ్లాదం.. ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం.. హైదరాబాద్‌కి సుమారు 70 కిలో మీటర్ల దూరంలో మనల్ని కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి గురించి.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. 3,763 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య అనంత పద్మనాభస్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం వినే ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనంతగిరినే చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి పురాణ ప్రసిద్ధి కూడా ఉంది. విష్ణు పురాణంలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. ఆలయ సమీపంలో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలూ కనిపిస్తాయి. ఇందులో మహర్షులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. మహావృక్షాలతో నిండిన దట్టమైన అనంతగిరి అభయారణ్యంలోని ఈ ఆలయం ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో స్వామి రూపం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి కిలోమీటరున్నర దూరంలో బుగ్గరామ లింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ అందమైన జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వర్షాకాలంలో సందర్శకులు వస్తుంటారు. ఇంకో విషయేమంటే తాండూరు వాసులు ఈ అడవిని దాటుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోనే 10 ఎకరాల్లో రీ ప్లాంటేషన్‌ కింద యూకలిప్టస్‌ చెట్లను ప్రభుత్వం పెంచుతోంది. అనంతగిరి కొండల పైన వ్యూ పాయింట్‌ ఒకటి ఉంది. అక్కడి నుంచి చూస్తే దగ్గర గ్రామాలతో పాటు చుట్టూ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. 50 ఏళ్ల క్రితం ఉన్న అనంతగిరికి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు రాజీవ్‌ నగర్‌కాలనీ సమీపంలోని రెండు రోడ్ల వద్దనే అడవి జంతువులు దర్శనమిచ్చేవి. జన సంచారం కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఒక్కరు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిది లేదు. జనం తాకిడి ఎక్కువైంది. అడవిలో అణువణువు తిరిగే వీలుంది. అందుకే ప్రస్తుతం జంతువులు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం సుమారు 100 రకాల పక్షులు ఉన్నాయి. నెమలి, అడవి పంది, కొన్ని రకాల పాములు, కుందేళ్లు మాత్రమే ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జింకలను పెంచుతున్నారు. అనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో 11 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా ప్రజలతో పాటు, హైదరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. వారాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి అందమైన ప్రకృతి మధ్య ఆనందగా గడపడానికి అనువైన ప్రాంతమిది.

ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు. ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి, భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి సుఖంగా నిద్రించడానికి కావాల్సిన అహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా, అంతే కాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమివ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంతగిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు. ముచుకుందుడి చేత శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందానదిగా ప్రసిద్ధి చెందిందన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీనదిగా మారింది. ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్ల గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచికుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచికుందునకు 'అనంత పద్మనాభస్వామి' రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనానిశిని అని పిలిచే భగీరథగుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం జనాల్లో వుంది.

ఆకర్షణీయం..పర్యాటక భవనం..

పర్యాటకుల తాకిడిని పరిశీలించిన అప్పుడున్న వైఎస్‌ ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భవనాన్ని నిర్మించింది. రిసెప్షన్‌ రెస్టారెంట్‌ పేరుతో ఉన్న ఈ భవనంలో వెజ్‌, నాన్‌ వెజ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు లభిస్తాయి. తందూరి రోటీని ఇక్కడ బాగా ఇష్టపడుతారు. చిన్నారుల కోసం ఈతకొలను, రెస్టారెంట్‌, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులున్నాయి. సెమినార్‌ హాల్‌ అందుబాటులో ఉంది. ఇక్కడ సమావేశాలు జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇతర దేశాల్లో మాదిరిగా ఏకోటూరిజం, జంగిల్‌ పార్కు తదితర పర్యాటక అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు.

సినిమా షూటింగ్‌లకు విడిది...
అనంతగిరిలో సినిమా షూటింగ్‌లు బాగా జరుగుతుంటాయి. అందమైన రోడ్డు మలుపులు, రోడ్డుకిరువైపులా అల్లుకున్న వృక్షాలు, కోనేరు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో దర్శకులు చిత్రీకరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సినీ తారలు, కథానాయకులు, దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మంచి ప్రదేశమని ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సినిమాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అడ్డా, లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్‌, అరుంధతి, నువ్వునేను, అదుర్స్‌ సినిమాలతో పాటు మంచి పేరున్న హీరోల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. ఎన్‌టిఆర్‌ కాలం నుంచి నేటి ఆయన మనువడి వరకు ఈ ప్రాంతం సుపరి చితమని చెప్పొచ్చు. పద్మనాభ స్వామి ఆలయం కింది భాగాన ఉన్న మెట్లు చాలా ఆకర్షించే విధంగా ఉంటాయి. చుట్టూ అడవి విస్తరించి అందమైన చెట్లతో ఆకర్షిస్తుంటే ఔరా అనిపిస్తుంది. ఇక్కడున్న కొలను ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలా మంది విహారయాత్రకు వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు ఇక్కడే తింటుంటారు. ఇక్కడే నువ్వు నేను సినిమాలోని 'నువ్వే నాకు ప్రాణం.. నేనే నీకు లోకం'అనే పాటను చిత్రీకరించారు.

ప్రకృతి ఒడిలో... క్షయ చికిత్సాలయం
అనంతగిరిలోని గాలికి వెలకట్టలేని విలువ ఉంది. అదే తరహాలో ప్రకృతి ఒడిలో క్షయ వైద్య శాల ఒదిగి ఉంది. ఇక్కడి పర్యవరణానికి పరవశించి నైజాం నవాబులు వారి కాలంలోనే క్షయ చికిత్సాలయాన్ని నిర్మించారు. ఈ గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలు నయమవుతాయని నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షయ చికిత్సాలయ పరిధి తగ్గించి పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. మంచిదే కానీ క్షయ చికిత్సాలయంలో రోగులను చేర్చుకోవడం తగ్గించింది. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కంటే రోగులు తక్కువగానే ఉంటారు. 3 వందలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా రోగులు మాత్రం 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారు. అనంతగిరి క్షయ చికిత్సాలయం స్థానంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే ఉంది. ప్రభుత్వం మెడికల్‌ కళాశాలకు ప్రయ త్నం చేయకుండా ఎర్రగడ్డలో ఉన్న మానసిక, చాతి ఆసుపత్రిని ఇక్కడకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే క్షయ ఆసుపత్రి మరమ్మతులు శరవేగంగా జరుపుతోంది. స్థానికులు మాత్రం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గతంలో నిమ్స్‌ ఆసుపత్రి అధికారులు, కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు అనంతగిరిని, క్షయ హాస్పిటల్‌ను సందర్శించి వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను ఆరాతీశారు. ఇక్కడున్న పరిస్థితులపై ఓ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. కళాశాల ఏర్పాటైతే వికారాబాద్‌ అనే కంటే అనంతగిరి ఎక్కువ ప్రచారంలో ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు అనంతగిరి జిల్లా కేంద్రంగా పెట్టాలన్న ప్రతిపాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి.

అనంతగిరికి ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుండి ప్రతి అరగంటకు వికారాబాద్‌ వెళ్లే బస్సులుంటాయి. వాటితో పాటు తాండూరు, కర్ణాటక వెళ్లే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. రైలు సదుపాయం ఉన్న వాళ్లు వికారాబాద్‌కు రైళ్లో రావచ్చు. ముంబై వెళ్లే ప్రతి రైలు ఈ స్టేషన్‌లో ఆగుతుంది. బస్టాండ్‌, రైెల్వే స్టేషన్‌ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి అనంతగిరి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు, జీపుల్లో లేదంటే తాండూరు ధారుర్‌ వెళ్లే లోకల్‌ బస్సుల్లో వెళ్లొచ్చు. లేదంటే ప్రత్యేకంగా బైకులు, వాహనాల్లో వెళ్తే ఆనందంగా, సౌకర్యంగానూ ఉంటుంది. వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. అనంతగిరుల్లో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు స్వేచ్ఛగా ఆనందంగా గడిపే అవకాశం లభించింది. పోలీసులు అడవిలో మొబైల్‌ వాహనంలో తిరుగుతుంటారు.

ఆహ్లాదకరం.. 'దామగుండం'...
అనంతగిరికి ముందు దామగుండం గురించి చెప్పుకోవాలి. చుట్టూరా చూడ ముచ్చటైన కొండలు, ఆహ్లాదకరమైన వాతవరణంలో కనువిందు చేసే దామగుండంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. పర్యాటకుల తాకిడి బాగా ఉంటుంది. శని, ఆదివారాల్లో చాలా మంది విక్‌ఎండ్‌ ఎంజారు చేస్తుంటారు. వికారాబాద్‌ వెళ్లే దారిలో పూడూర్‌ ఎక్స్‌రోడ్‌, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన దామగుండం అభివృద్ధిలో పూర్‌ అనే చెప్పొచ్చు. బస్సు సౌకర్యం లేదు. మౌలిక వసతులు లేక పురాతన ఆలయనికి నిత్యం వచ్చే భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు ఎక్కువగా ద్విచక్రవాహనాలు, కార్లు, సుమోల్లో వస్తుంటారు. అక్కడ ఉగాది పర్వదినాల్లో జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కోనేటిలో స్నానాలు చేస్తారు. ఇక్కడ టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇక్కడి మర్రి చెట్లు, వాటి ఊడలతో చిన్నారులు ఆడుకుంటుంటారు. పర్యాటకులు ఫొటోలు కూడా దిగుతుంటారు. ఇక్కడ కొనేరు మండు వేసవిలో సైతం ఎన్నడూ ఎండిపోదు. దామగుండ ఆటవీ ప్రాంతంలో 2 వేల 900 వందల ఎకరాల్లో కేంద్ర నౌకదళానికి చెందిన సంబంధించిన ర్యాడర్‌ సిగల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామగుండ ఆలయనికి సంబంధించిన 42 ఎకరాల భూమిని సైతం నేవీలో పరిధిలోకి తీసుకుంటూ కేవలం ఆలయనికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఆధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీన్ని స్థానికులు, పర్యాటకులు తీవ్రంగా వ్యతిరేకించారు.






అనంతగిరి
ప్రకృతి అందాల సిరి

తరచి చూడాలే కానీ  మనకు దగ్గరరలోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి అనంతగిరి. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌కు కూతవేటులో ఉన్న అనంతగిరికి సాగే ప్రయాణం ఓ మధురానుభూతినిస్తుంది.

పసుపుపచ్చ లోగిలిలో ప్రకృతి అందాలు ఆరబోసినట్టు..!
ఊటీకి తీసిపోని కొండల్లో, కోనల్లో విహరించినట్టు...!
ఆకాశగంగే వచ్చి ఇక్కడ పారుతున్నట్టు...!
మునులు తపస్సు చేస్తున్నట్లు...!
దేవతలు కొలువుదీరినట్టు..!

గతమంతా పునరావృతమైనట్టు.. చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద... ప్రకృతి అందాలు.. చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి.

ఎన్నెన్నో అందాలను తన ఒడిలో నింపుకున్న అనంతగిరి రారమ్మని పిలుస్తోంది...

పిల్లగాలులు మేనును తాకుతుంటే... దారంతా ప్రకృతి అందాలు ఆహ్వానం పలుకుతుంటే మైమరిచిపోవాల్సిందే. కాలుష్యానికి దూరంగా, పచ్చని రమణీయత మధ్య ఉన్న అనంతగిరి ఆలయానికి చేరుకోగానే భారీ హనుమంతుడు, గరుత్మంతుడు భక్తులకు, పర్యాటకులకు దర్శనమిస్తారు! నిత్యం కాంక్రీట్ జంగిల్‌లో రణగొణ ధ్వనుల మధ్య నివసించేవారికి అక్కడికి చేరుకోగానే గొప్ప స్వాంతన చేకూరుతుంది. ఆలయ ముఖద్వారం, పరిసర ప్రాంతాలు పరవశింపచేస్తాయి. ఆధ్యాత్మిక చింతనకు చిగురులు తొడుగుతాయి. భక్తుల కొంగుబంగారంగా పిలుచుకొనే అనంతపద్మనాభుడి ఆలయంలో నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. ఇక్కడి ఆలయ ఆర్చకుల పూజావిధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయ కిందిభాగంలో కోనేరు ఉంటుంది. మెట్ల ద్వారా ఆ దారి గుండా వెళ్తుంటే వానరసమూహాలు... నెమళ్లు తారసపడుతాయి. ఆ దృశ్యాలు వర్ణించలేనివి! దారికిరువైపులా మునులు తిరుగాడిన స్థలాలు.. మార్కండేయుడి తపోవనం దర్శనమిస్తాయి. ఆలయం నుంచి కొంతదూరం వెళ్లగానే పుష్కరిణి కనిపిస్తుంది.అక్కడ భక్తులు స్నానమాచరిస్తారు.

ప్రకృతి రమణీయత:
పుష్కరిణినే మూసీ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నాటి గుహలు... చారిత్రాత్మక, పురాతన కట్టడాలు చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తాయనడానికి అనంతగిరి ఉదాహరణగా చెప్పుకోవచ్చు! పుష్కరిణి దాటగానే దట్టమైన అడవులు.. అందమైన లోకేషన్స్ ఇక్కడి ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఇక్కడ పర్యాటకులు ఆనందంగా గడుపుతూ సేద తీరుతారు. భక్తుల అనంతమైన కోరికలు తీర్చే పేరుండటంతో అనంతపద్మనాభుడిగా పిలుచుకుంటారు. కర్ణాటక, మహార్రాష్ట వాసులకు ఈ ఆలయం ఇంటిదైవంగా విరాజిల్లుతోంది.

మూసీ పుట్టుక ఇక్కడే:

బలరామకృష్ణుల పాదాలు కడిగిన నీరే జీవనదిగా మారింది. కాలక్రమేణా దీనిని మూసీనది అని పిలవడం జరుగుతోంది. ఇది హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మీదుగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి మూసీనది ఉపనది కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

కనువిందు చేసే కోనేరు:
పద్మనాభుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిని భవనాశిని అని పిలుస్తున్నారు. భక్తుల పాపాలను హరించి, వారికి సత్ఫలితాలు ప్రసాదించడంతో ఈ కోనేటికి ఈ పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఈ కోనేటితో పాటు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు ఈ కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పూజలు చేసినట్లయితే కోరికలు ఫలిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

మార్కండేయ గుహ:
పసివయస్సులో తనను యముడు అంతమొందిస్తాడని తెలిసిన మార్కండేయుడు శివసాక్షాత్కారంతో పూర్ణాయుష్కుడవుతాడు. అనంతరం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో తపస్సుకు పూనుకొంటాడు. కలియుగ ప్రారంభంలో మార్కండేయుని భక్తికి మెచ్చిన మహా విష్ణువు అనంత పద్మనాభస్వామి అవతారంగా మార్కండేయునికి దర్శమిస్తాడు.

ఏటా రెండు జాతరలు:
భక్తుల కోరికలు తీర్చడంలో కొంగుబంగారంగా పేరొందిన అనంత పద్మనాభస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏడాదిలో రెండుమార్లు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతర నిర్వహిస్తారు.

ఆలయ ప్రాశస్త్యం:
ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి పురాతనమైంది. 13 వందల ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకృతి ఒడిలో వెలసిన అనంత పద్మనాభ స్వామి పేరు మీదుగానే ఈ కొండలను అనంతగిరి కొండలుగా పిలుస్తున్నారు. అనంతగిరి ప్రత్యేకత గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం విశేషం.

సినిమా షూటింగ్ స్పాట్:
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు ఎంచుకుంటున్నారు. అనంతగిరి కొండలను, అక్కడే కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే రావడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు ఇక్కడి ప్రాంతాలు అనువైనవని సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. నేడు అగ్ర హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు విడిది, భోజన తదితర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని హంగులతో కూడిన హరిత రిసార్ట్ కూడా ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేందుకు అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. టూరిజం రిసార్ట్ ఏర్పాటుతో సినీ పరిశ్రమ వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా మారింది. అంజి, పౌర్ణమి, రెడీ, జయం వంటి ఎన్నో హిట్ సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి.

ఎన్నెన్నో అందాలు:
పక్షుల కిలకిల రావాలు... కుందేళ్ల పరుగులు... నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోట్‌పల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి అలలను ముద్దాడుతూ వచ్చే చల్లని గాలలు బరువెక్కిన శరీరాన్ని తేలికపరుస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టులో జలకాలడుతూ ఆనందంగా గడుపుతారు. వికారాబాద్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో, పెద్దేముల్‌కు సమీపంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు హాలీడే స్పాట్‌గా మారుతోంది.

ఇప్పటికీ రహస్యమే:
భూమి నుంచి గంగ బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గరామలింగేశ్వరాలయంగా పిలువబడుతుంది. శ్రావణమాసం, కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడి కోనేటిలో నిత్యం జలం ప్రవహించడం విశేషం. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికే అంతుపట్టని రహస్యమే!

సూర్యోదయం సరిగ్గా సాయంత్రం స్కూల్ బెల్ కొట్టినట్టు 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చని ప్రకౄఎతి తో కలిసి అద్భుతమైన దౄఎశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉదయాన్నే సూర్యోదయం చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం. ఈ ప్రాంతం పర్యాటకులకి రోజు వారీ బిజీ లైఫ్ స్టైల్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. వారాంతంలోని ఈ ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.

సాహసికులకు ట్రెక్కింగ్:
మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్‌లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు. అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవిలో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్‌గా వెళ్తే మంచిది. అడవిలో సాహసం చేయాలనుకునేవారికి అనంతగిరిలో ఎన్నో ట్రెక్కింగ్ మరియు కామ్పింగ్ అవకాశాలు కలవు. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరం లో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్‌లో ఉన్న కామ్పింగ్ సైట్‌ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో విహారం చాలా బాగుంటుంది.

వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్' మరియు టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.

కోటిపల్లి రిజర్వాయర్:
నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్ అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలంలో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.

రవాణా మార్గం అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో అలసట అస్సలు తెలియదు. కేవలం రెండు గంటల సమయం లోనే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయంలో కూడా తినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, అనంతగిరి లోని భోజన సదుపాయాలు అంతంత మాత్రమే కావడం మరొక ముఖ్య విషయం. ఒక్క మాటలో అనంతగిరి గురించి చెప్పాలంటే ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే వారికి హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న అందమైన ప్రదేశం అని అనవచ్చు.








అనంతగిరి పద్మనాభ స్వామి
ఈ పద్మనాభుడు పవళించడు..!


భక్తుల పాలిట కొంగుబంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు. ఇక్కడ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు.

మూసీ నది జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక। అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః।। అంటూ... అనంతమైన సిరిసంపదలు ఇచ్చే ఆ దేవదేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.

స్థలపురాణం
సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.

ముచుకుందే మూసీ...
రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలం పాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరవైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించు.’ అంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వెళతారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియజేస్తోంది.

ఏటా రెండు సార్లు...
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఇలా చేరుకోవాలి
అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి డెబ్భై  కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్‌ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

అన్నెపు దామోదరరావు


Monday, 26 February 2018

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం





ఈ గుడికి వెళ్తే... యమబాధలు ఉండవట!


దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 26 నుంచీ జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండదు.’ అనే నానుడి ప్రసిద్ధి చెందింది.

‘దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవోనృకేసరీ తత్ర శ్రీహృదయం తీర్థం కాశ్యాత్‌ శతగుణం భవేత్‌’... అనే శ్లోకం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విశిష్టతను చాటుతోంది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగానంద రూపుడై భాసిల్లుతున్నాడు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

స్థలపురాణంధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్లూగోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. దేవస్థానంలో పక్కపక్కనే ఉన్న ఉగ్ర, యోగస్వాముల ఆలయాలతోపాటు, శ్రీవేంకటేశ్వర, గోపాలస్వామి గుళ్లూ, ముందు భాగంలో శ్రీరామలింగేశ్వరుడి కోవెలా ఉన్నాయి.

ఉత్సవాలుఏటా ఈ ఆలయంలో శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలూ, శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణల్లో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలూ, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం, డోలోత్సవం, రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీకమాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ నిత్యం గంగాహారతి ఇస్తారు.

ఇలా చేరుకోవచ్చుజగిత్యాల జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు బయల్దేరుతుంది. కరీంనగర్‌ నుంచి ధర్మారం, వెల్గటూర్‌, రాయపట్నం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల స్టేషన్‌లో దిగి, లక్సెట్టిపేట మీదుగా 40 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు.

Sunday, 18 February 2018

మానస సరోవరం





మనోహరం మానస సరోవరం.

ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ...’ అంటూ కళ్లు మూసుకుని శివ ధ్యానం చేస్తే మనోఫలకం మీద నిత్యం చూసే శివరూపం సాక్షాత్కరమవుతుంది. కానీ ఆ శివ సాన్నిధ్యంలో తాదాత్మ్యం చెందాలంటే మాత్రం ఆయన కొలువైన ఆ కైలాసాన్నీ, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూసి రావాల్సిందే’ అంటున్నారు ఇటీవలే కైలాస మానస సరోవర యాత్ర చేసి వచ్చిన హైదరాబాద్‌ వాసి ఎస్‌. గీతాంజలి.

మంచుకొండల్లోని మానససరోవరాన్నీ కైలాస పర్వతాన్నీ కళ్లారా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ భోళాశంకరుడి అనుగ్రహం ఇన్నాళ్లకు లభించినట్లుంది. మిత్రులంతా కలిసి ఈ యాత్రకు వెళుతున్నారని తెలుసుకుని నేనూ మా అమ్మాయితో బయలుదేరాను. అక్కడికి వెళ్లేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ కోసం రెండు నెలల ముందు నుంచే వాకింగ్‌, యోగా, ప్రాణాయామం చేశాం. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌... అన్నీ సిద్ధం చేసుకున్నాం.

ఎందుకంటే మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి. టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి. కాబట్టి పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూకి విమానంలో వెళ్లాం. అక్కడికి చేరేటప్పటికి నేపాల్‌ ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు మమ్మల్ని ఆహ్వానించి నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళ్లడానికి కార్లతో సిద్ధంగా ఉన్నారు. నాలుగు గంటల రోడ్డు ప్రయాణం అనంతరం నేపాల్‌ గంజ్‌ చేరుకున్నాం. టూర్‌ నిర్వాహకులు అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గది ఇచ్చారు. భోజనం చేసి సాయంత్రం నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం. అక్కడ సాయంత్రం ధూపదీపాలూ, ఘంటానాదాలూ, భజనలతో సాగే హారతి కార్యక్రమాలను చూసి ఆనందించాం. నేపాల్‌ యాత్రా నిర్వాహకులు ఎంతో ప్రణాళికతో ఉన్నా ప్రకృతి సహకరించకపోవడంవల్ల సెమికోట్‌కి వెళ్లలేకపోయాం.

దేవలోకం!
ఆ మర్నాడు వాతావరణం అనుకూలించడంతో సెమికోట్‌కు చార్టర్డ్‌ విమానంలో బయలుదేరాం. కొండల మధ్యలో నుంచి మేఘాలను తాకుతూ ప్రయాణించడాన్ని ఆనందించేలోగానే మళ్లీ వాతావరణం బాగోలేదని ఓ కొండ ప్రాంతంలో విమానాన్ని ఆపేశారు. దాంతో అందరం కిందకిదిగి కెమెరాలకు పనిచెప్పాం. చుట్టూ ఉన్న మంచుకొండల్ని ఫొటోల్లో బంధించాం. దాదాపు అరగంట తరవాత తిరిగి సెమికోట్‌కు బయలుదేరాం. సెమికోట్‌ సముద్ర మట్టానికి 2910 మీ. ఎత్తున ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఇళ్లన్నీ కొండలమీదే ఉంటాయి. అదేరోజు హెలీప్యాడ్‌లో హిల్‌సా గ్రామానికి బయలుదేరాం.

హిల్‌సా సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ... ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా అనిపించింది. పైలట్‌ చాలా జాగ్రత్తగా విమానాన్ని నడుపుతున్నాడు. ఆ అరగంట ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించింది. హిల్‌సాలో దిగగానే మాకోసం వేడి వేడి భోజనం తయారుచేశారు. అప్పటికే మా అందరికీ ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి మొదలైంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. దాంతో హిల్‌సా నుంచి తిరుగు ప్రయాణం వరకూ రోజూ ఉదయంపూట మాకు ఆ ట్యాబ్లెట్లే శివప్రసాదం.

హిల్‌సా ప్రాంతం అంతటా సౌరశక్తినే వాడుతున్నారు. రాత్రి పది గంటలకు చీకటి పడింది. కాస్త వెలుతురు కూడా లేదు. చుట్టూ ఆ కొండల మధ్యలో, చందమామా నక్షత్రాల వెలుగులో ఆ రాత్రి మరో లోకంలో ఉన్నట్లే అనిపించింది. నిజంగా ఇది దేవలోకమేమో అనిపించిందో క్షణం.

మానస సరోవరం!
మర్నాడు ఉదయం హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలో ప్రవేశించడానికి మా యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి కాబట్టి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది. కానీ ఇటీవల అనేక ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని నిర్వహిస్తున్నాయి. చైనా ఇమిగ్రేషన్‌ చాలా స్ట్రిక్టు. అవన్నీ పూర్తిచేసుకుని, నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్‌లోని హోటల్‌కి చేరేటప్పటికి సమయం ఆరు గంటలు దాటింది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ అందరం మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకున్నాం. ఎప్పుడెప్పుడు మానస సరోవరాన్ని చూద్దామా అన్న ఆలోచనతోనే తెల్లవారిపోయింది. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాటి ఉదయం 11 గంటలకు మానస సరోవరానికి బయలుదేరాం. ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.

ఇక్కడకు చేరడంతోనే మంచు వర్షం కురవడం మొదలైంది. ఈ సరోవరంలో ఎవరూ స్నానం చేయరు. ఇది ఉప్పునీటి కొలను. ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది. రావణాసురుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకో తలను ఖండిస్తూ శివదర్శనం కోసం తపస్సు చేశాడనీ, పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడనీ చెబుతారు.

అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది. దాన్ని చూడగానే ఓ అద్భుతంలా తోచింది. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉందా సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉన్న ఆ సరస్సు చుట్టూ బస్సులోనే ప్రదక్షిణ చేశాం. అక్కడ మాకు స్నానాలు చేసేందుకు కూడా వీలుగా ఓ చిన్న టెంటు వేశారు నిర్వాహకులు. సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తున్నాయి. అందరం గబగబా మూడు మునకలు వేసి బయటకు వచ్చాం. అందులో స్నానం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది. ఒడ్డు దగ్గరే దీపాలు వెలిగించాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పూజ చేసుకున్నారు. కొందరు యాగాలూ హోమాలూ కూడా చేశారు. మాకు దాని సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే టెంటులు వేసి వసతి ఏర్పాట్లు చేశారు.

దేవతలే దిగి వస్తే...
రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా గోచరిస్తారనీ పురాణాల్లో వింటుంటాం. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు గానీ, మాకెందుకో రాత్రి 2.45 నిమిషాలకు ఆకస్మికంగా మెలకువ వచ్చింది. బయటకు వెళ్లి చూసేసరికి ఓ అద్భుతం మా కళ్లముందు నిలిచింది. సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపించాయి. వాటిని చూడ్డానికి రెండుకళ్లూ చాల్లేదు. రెప్ప వేయకుండా మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డ కట్టించే చలిలో దాదాపు 45 నిమిషాలపాటు ఆ కాంతుల్ని చూస్తూనే ఉన్నాం. మా జన్మ ధన్యమైనట్లుగా భావించాం.

మర్నాడు మానస సరోవరం నుంచి కైలాస పర్వత దర్శనం కోసం వెళ్లాం. ముందుగా యమ ద్వారం వచ్చింది. దానికి మూడు ప్రదక్షిణలు చేసి ఓ ద్వారం గుండా వెళ్లి, రెండో ద్వారం గుండా బయటకు వచ్చాం. ఇక్కడ అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది అనుకుంటూ అంతులేని ఆనందంతో అందరం ఆ శిఖరాన్ని దర్శించుకున్నాం. అయితే కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపించింది. దాని పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ లేదు. అది మాకు ఎంతో చిత్రంగా అనిపించింది. పరిక్రమణ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో హోటల్‌కు తిరిగి వచ్చేశాం. అదే కైలాస పర్వతం చుట్టూ పరికమ్రణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌... వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయట. అవన్నీ చూడలేకపోయినప్పటికీ పరమశివుడు కొలువైన ఆ కైలాసగిరినీ బ్రహ్మ సృష్టించిన ఆ దేవతల సరస్సునీ ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ఆ పరమేశ్వరుడికి మనసులోనే ప్రదక్షిణ చేసుకుని, తిరుగు ప్రయాణమయ్యాం.


Wednesday, 14 February 2018

వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం





వేళకు సన్నద్ధం హాయిగా వెళ్లొద్దాం

‘‘ఈ మధ్యాహ్నం ఎండను చూస్తుంటే.. వేసవి మొదలైందేమో అనిపిస్తోంది...!’’

రాత్రి చలి గిలి పెడుతున్నా.. భానూదయంతో సీను మారిపోతోంది.. వేసవి రావడానికి సిద్ధమవుతోంది. సమ్మర్‌ ఎంట్రీతో మండుటెండలు ఆ తర్వాత పిల్లలకూ, పెద్దలకూ హాయినిచ్చే సెలవులూ వచ్చేస్తాయి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. ఓ మాట అనేసుకుందామా! అప్పుడే ఎందుకంటారా? ముందస్తుగా సన్నద్ధమైతే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగానూ ఎంతో కొంత కలిసొస్తుంది. మీ ఆలస్యం ప్రయాణాన్ని భారం చేయవచ్చు. అందుకే ముందస్తు సన్నద్ధతతో.. అందుబాటు ధరల్లోనే ఆనందాన్ని ఆస్వాదించండి.

వేసవి వినోదాలలో విహారం కూడా ఒకటి. ప్రపంచ పటం ముందేసుకొని.. పిల్లలు వేలు పెట్టి చూపించిన దేశానికి తీసుకెళ్లే తల్లిదండ్రులూ ఉన్నారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లినా ఖర్చు తడిసి మోపెడవుతుందని పర్యటనను ఎప్పటికప్పుడు వాయిదా వేసే వాళ్లూ ఉంటారు. ఎవరి సౌకర్యం వారిది. ఎవరి కష్టం వారిది. ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తే.. వీలైనంత తక్కువ ఖర్చులో సమ్మర్‌ టూర్‌ ముగించేయొచ్చని చెబుతున్నారు పర్యాటక నిపుణులు. ఈ లెక్కలన్నీ ఎక్కడికి వెళ్తున్నాం.. ఎలా వెళ్తున్నాం.. ఎంత తొందరగా ప్లాన్‌ చేసుకుంటున్నాం అన్నదానిపైనే ఆధారపడి ఉంటాయంటున్నారు.

ఊరించే ధరలు.. ఊహించని ఆఫర్లు..
వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు విహార యాత్రల కంటే.. తీర్థయాత్రలకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. భక్త సంఘాలు, మిత్ర బృందాలు రకరకాల యాత్రలు చేస్తుంటాయి. నలుగురితో పాటు నారాయణ అనుకుంటే తప్ప దూర ప్రయాణాలు సాధ్యం కావు. తీర్థయాత్రల విషయంలో అయితే మరీనూ! వీటికి తోడు ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు ప్రకటించే ప్యాకేజీలు ఉండనే ఉన్నాయి. ఊరించే ధరల్లో.. ఊహించని ఆఫర్లు రారమ్మని పిలుస్తుంటాయి. రామేశ్వరం మొదలు చార్‌ధామ్‌ వరకు టూర్‌ ప్యాకేజీలు కోకొల్లలుగా ప్రకటిస్తూనే ఉంటాయి. అమర్‌నాథ్‌, చార్‌ధామ్‌, నైమిశారణ్యం, కాశి-ప్రయాగ, సోమ్‌నాథ్‌-ద్వారక ఇలా ఉత్తర భారతావని యాత్రలకు సంబంధించిన ప్యాకేజీలు ఎక్కువగా పలకరిస్తుంటాయి. వీటి ధర రూ.12,000 నుంచి రూ.35,000 వరకూ ఉన్నాయి. వాటిలో ఉన్నతమైన ప్యాకేజీని ఎంపిక చేసుకోవడమే మన పని. ట్రావెల్‌ సంస్థను ఎంచుకునే ముందు ఆ సంస్థ విశ్వసనీయత, గత చరిత్ర గురించి తెలుసుకోవడం మరచిపోవద్దు.

లాభంతో వెళ్లి.. క్షేమంగా రండి..
ఏ టూరిస్ట్‌ ఆపరేటర్లతోనూ సంబంధం లేకుండా.. సొంతంగా వెళ్లే వాళ్లూ ఉంటారు. అయితే మీరు వెళ్లదలచిన ప్రదేశం గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్‌, వీసా వగైరా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత తొందరగా విమాన టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు వెళ్లాలనుకుంటే బ్యాంకాక్‌ విమాన టికెట్‌ ధర రూ.11,000- రూ.18,000 మధ్య ఉంది. అదే.. మే రెండో వారం టికెట్‌ ఇప్పుడే బుక్‌ చేసుకుంటే రూ.8,000-రూ.12,000కే దొరుకుతుంది. అన్ని రకాల విమాన టికెట్ల ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పటికప్పుడు విహారానికి వెళ్దామని ఫిక్సయినవారికి ఈ ఆఫర్లు వర్తించవు. రెండు, మూడు నెలల ముందుగా ఓ నిర్ణయానికి వస్తే టికెట్ల దగ్గరే 20 శాతం లాభపడొచ్చు. ఇదే సూత్రం హోటల్‌ గదుల బుకింగ్‌కూ వర్తిస్తుంది. ముందుగా బుక్‌ చేసుకోవడం వల్ల పదోపరకో మిగుల్చుకోవచ్చు. యాప్‌ల సహకారం తీసుకుంటే.. ప్రయాణం స్మార్ట్‌గా సాగిపోతుంది. మొత్తానికి లాభంతో వెళ్లి.. క్షేమంగా తిరిగి రావొచ్చు.

భూటాన్‌ నుంచి బ్రిటన్‌ వరకు..
సంపన్నులే కాదు.. ఎగువ మధ్యతరగతి కుటుంబీకులూ విహారానికి విదేశాలకేగుతున్నారు. సిరిగలవారు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ వంటి ధనిక దేశాలకు విడిదికి వెళ్తుంటారు. కాస్త భిన్నత్వం కోరుకునేవారు టర్కీ, ఈజిప్ట్‌, ఒమన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తీరంలో ఆనందం వెతుక్కోవాలని భావించిన వారు మాల్దీవులు, సీషెల్స్‌ ద్వీపాలు, మారిషస్‌ బాట పడుతుంటారు. జంతు ప్రపంచంలో విహరించాలనుకునే వారు దక్షిణాఫ్రికా, కెన్యా, జాంబియా దేశాలకు పయనమవుతారు. బడ్జెట్‌ ధరలో విదేశాలను చుట్టి రావాలనుకునే వారు థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా (బాలి), నేపాల్‌, భూటాన్‌ దేశాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ప్రసిద్ధ ప్రైవేట్‌ టూరిస్ట్‌ సంస్థలు విదేశీ పర్యటన ప్యాకేజీలు ప్రకటించేశాయి. 7 నుంచి 14 రోజుల వరకు ఆయా దేశాలు తిప్పిచూపిస్తామని చెబుతున్నాయి. యూరప్‌ ట్రిప్‌ ప్యాకేజీ ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ పలుకుతోంది. కాస్త ముందుగా సంప్రదించే వారికి పది నుంచి పదిహేను శాతం తగ్గింపు లభించే అవకాశమూ ఉంది.

ఆలోచించి..
ఎక్కడికి వెళ్తున్నామన్నది ముందుగా తేల్చాలి. ఆ తరువాత ఎలా వెళ్లడం? అని ఆలోచించాలి. వేసవిలో చల్లటి నీడనిచ్చే ప్రదేశాలు మనదేశంలో ఎన్నో! ఉత్తరాదిలోనే కాదు... దక్షిణ భారతంలోనూ చాలానే ఉన్నాయి. కర్ణాటకలో కూర్గ్‌, తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో హార్స్‌లీహిల్స్‌ ఇవన్నీ వేస‘వినోద’ కేంద్రాలే! ఉత్తరాదిలోని కశ్మీర్‌ (లద్ధాఖ్‌, శ్రీనగర్‌, లెహ్‌, పహల్గామ్‌), ఉత్తరాఖండ్‌ (చార్‌ధామ్‌, రుషీకేష్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, నైనిటాల్‌, ముస్సోరి, అల్మోరా), హిమాచల్‌ప్రదేశ్‌ (సిమ్లా, కులు, మనాలి, డల్హౌసి), సిక్కిం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కావాల్సినన్ని పర్యాటక కేంద్రాలున్నాయి. వీటిలో మనసుకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకొని వేసవి విహారం మరచిపోలేని అనుభూతిగా మిగుల్చుకోండి.

ఆ రెండు నెలలు..
ప్రణాళిక ప్రకారం చేస్తే పనులన్నీ పక్కాగా జరిగిపోతాయి. ఇదే సూత్రం యాత్రలకూ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక యాత్ర విషయంలో గుంపులో గోవింద అనే అవకాశం ఉంది కానీ, విహార యాత్ర విషయంలో అన్నీ ఓ పట్టాన తెమలవు. ఎక్కడికి వెళ్లాలో తేల్చడానికే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఎలా వెళ్లాలో తేలేసరికి... అక్కడికి వెళ్లే రైళ్లన్నీ వెయిటింగ్‌ లిస్ట్‌ను సూచిస్తుంటాయి. ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థల ఆఫర్లన్నీ అడుగంటిపోతాయి. విమానం టికెట్‌ ధరలకు రెక్కలొచ్చేస్తాయ్‌! ఎక్కడికి వెళ్లాలో.. త్వరగా నిర్ణయించుకుంటే.. రైళ్లో బెర్త్‌లు కన్‌ఫర్మ్‌ అవుతాయి. విమానం టికెట్ల విషయంలో మంచి బేరం కుదిరే అవకాశాలు ఉంటాయి. మంచి ప్యాకేజీలు దొరుకుతాయి. మనం చేయాల్సిందల్లా ముందుగా నిర్ణయానికి రావడమే! సహజంగా మన దేశంలో ఏప్రిల్‌ నుంచి జులై వరకు సమ్మర్‌ వెకేషన్‌గా భావిస్తారు. అందునా పిల్లలకు సెలవులుండే ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎక్కువ యాత్రలు చేస్తుంటారు. ఫిబ్రవరి వచ్చేసింది. వెంటనే ఎక్కడికి, ఎప్పుడు, ఎలా వెళ్లాలో ఓ నిర్ణయానికి వచ్చేయండి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు మొదలెట్టండి. మీరు సిద్ధమే కదా! రెడీ వన్‌.. టూ.. త్రీ.. హ్యాపీ జర్నీ!!



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...