Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

నర్మద జన్మస్థలి








నర్మద జన్మస్థలి



యమునా నదిలో ఏడుసార్లు, సరస్వతిలో మూడుసార్లు, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులవుతారని ఓ నమ్మకం. అత్యంత పవిత్రమైన నర్మదానదిని చూస్తేనే.. అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాంటి పవిత్ర నదీమతల్లి నర్మద జన్మస్థానమే అమర్‌ కంటక్‌. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రదేశం.. అపురూపమైన జలపాతాలు.. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ విశేషాలు..

ఎటుచూసినా.. దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద. పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే... కనుచూపు మేరలో ఎత్తౖన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంకేముంది మీరు పడ్డ శ్రమనంతా.. అతి తేలిగ్గా మరిచిపోతారు. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్ కంటక్. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్ కంటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

పురూరవుడి తపోఫలితంగా...
పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై 'నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర'ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.

నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

పుట్టినచోటే గుడి
నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది.

అమర్ కంటక్ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతరలు సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్లాలంటే...
విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలా స్‌పూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో రైల్లో పిండ్రా వరకు వెళ్లి అద్దె వాహనాల్లో అమర్ కం టక్ వెళ్లవచ్చు. లేదా బిలాస్‌పూర్ నుంచే నేరుగా ట్యాక్సీలలో 120 కిలోమీటర్ల దూరం లోని అమర్ కంటక్ వెళ్ళవచ్చు.

కపిలధార
అమర్ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

ఏనుగు కాళ్ళ నుండి దూరితే పుణ్యం..!
నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుం ది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది.

నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించ వచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతా లనూ వీక్షించవచ్చు.

నర్మద పుట్టుకపై ఎన్నో పురాణాలు
నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ కథలు వినిపిస్తుంటాయి. క్రీ॥శ॥ 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద. అలా అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!



Saturday, 8 December 2018

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు









సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు
ఆరు ముఖాలు ఆరు ధామాలు


ఆదిదంపతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో వీధికొక మురుగన్‌ ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలయాలన్నిటికీ మకుటాయమైనవిగా, మహిమాన్వితమైనవిగా తమిళనాడులోని ‘ఆరుపడై వీడుగళ్‌’ (ఆరు దివ్యధామాలు) ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒక్కో ఆలయానిదీ ఒక్కో ప్రత్యేకత.


తిరుచందూర్‌
సాగరతీరంలో

ఆరుపడై వీడుగళ్‌ సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరింటిలో అయిదు కొండలపై ఉండడం విశేషం. ఒక్క తిరుచందూరు ఆలయం సాగరతీరంలో ఉంటుంది. అన్నిటికన్నా మహిమాన్వితమైనదిగా దీన్ని పరిగణిస్తారు. శూరపద్ముడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి దేవతల సేనాని అయిన కుమారస్వామి తన సేనలతో ఇక్కడ విడిది చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. రణసన్నద్ధుడైనట్టు సర్వాలంకారాలతో సమ్మోహనకరంగా కనిపించే మురుగన్‌ రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదంటారు భక్తులు. ఈ స్వామివారి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందనీ, దుష్ట శక్తుల పీడ నివారణ అవుతుందనీ నమ్మకం. ఆలయానికి సమీపంలోని సముద్ర తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి 92 కి.మీ. దూరంలో కన్యాకుమారి చక్కటి పర్యాటక ప్రదేశం.

ఎక్కడుంది?: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరన్‌) జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తూత్తుకుడికి 46 కి.మీ., తిరునల్వేలికి 53 కి.మీ., మదురైకి 180 కి.మీ. దూరంలో తిరుచందూర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి తిరునల్వేలికి నేరుగా రైలు సదుపాయం ఉంది. మదురై వరకూ రైలులో వెళ్ళి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాలలో తిరుచందూరు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి తిరునల్వేలి వరకూ ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రైళ్ళ కన్నా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. సమీప విమానాశ్రయం ట్యుటికోరన్‌లో
ఉంది.

తిరుప్పరన్‌కుణ్రమ్‌
పెళ్ళిళ్ళకు ప్రసిద్ధి

ఎక్కడుంది?: తమినాడులోని మదురై నగర శివార్లలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తిరుప్పరన్‌కుణ్రమ్‌ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: ఒకే కొండలో మలచిన ఆలయం ఇది. దీన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. దేవసేన (దేవయాని)తో సుబ్రహ్మణ్యస్వామికి ఇక్కడే వివాహం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అందుకే వివాహాలు చేసుకోవడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా తమిళులు భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. తిరుప్పరన్‌కుణ్రమ్‌ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గరలోని మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం మరో ముఖ్యమైన యాత్రాస్థలం.

పళని
కావడి మొక్కుల జ్ఞానక్షేత్రం

ఎక్కడుంది?: తమినాడులోని దిండిగల్‌ జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: దిండిగల్‌కు 57 కి.మీ., కోయంబత్తూరుకు 118 కి.మీ., మదురైకి 120 కి.మీ. దూరంలో పళని ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి ఈ మూడు ప్రాంతాలకూ నేరుగా రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది.
ప్రత్యేకతలు: పళనిని ‘తిరు ఆవినన్‌కుడి’ అని కూడా అంటారు. ఇక్కడి బాల సుబ్రహ్మణ్యుణ్ణి ‘దండాయుధపాణి’ అనీ, ‘వేలాయుధుడ’నీ పిలుస్తారు. కుడిచేత దండాన్ని పట్టుకొని, ఎడమ చేతిని నడుముకు ఆన్చి, కౌపీనంలో బాల సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. పళనిని ‘జ్ఞాన క్షేత్రం’ అంటారు. జ్ఞానప్రదాతగా దండాయుధపాణిని ఎందరో తమిళ కవులు స్తుతించారు. మురుగేశుడికి మొక్కుకొని కావళ్ళు ఎత్తే సంప్రదాయం ఇక్కడే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయాన్ని చేరుకోడానికి 690 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చిన్న రైలులో కూడా వెళ్ళవచ్చు.

స్వామిమలై
ఓంకార ఉపదేశ స్థలం

ఎక్కడుంది?: తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 6 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తిరుచురాపల్లి (తిరుచ్చి) నుంచి సుమారు 80 కి.మీ. దూరంలో స్వామిమలై ఉంది. తిరుచ్చికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల నుంచి కుంభకోణానికి నేరుగా (వీక్లీ) రైలు సౌకర్యం ఉంది. లేదా తిరుచ్చిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కుంభకోణం చేరుకోవచ్చు. సమీపవిమానాశ్రయం తిరుచ్చిలో ఉంది.
ప్రత్యేకతలు: స్వామిమలైలోని సుబ్రహ్మణ్యుణ్ణి ‘స్వామినాథుడు’ అని పిలుస్తారు. ఈ ఆలయానికి 60 మెట్లు ఉంటాయి. అవి భారతీయ సంప్రదాయంలోని అరవై సంవత్సరాలకు సంకేతమని పెద్దలు చెబుతారు. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని తండ్రి అయిన శివుడికి మురుగన్‌ ఉపదేశించాడనీ, ఆ ప్రదేశం ఇదేననీ స్థలపురాణం పేర్కొంటోంది. తండ్రికే గురువైన స్వామి వెలసిన చోటుగా దీన్ని ‘గురుమలై’ అని కూడా అంటారు. కుంభకోణం చుట్టుపక్కల అనేక సందర్శనీయ స్థలాలూ, ఆలయాలూ ఉన్నాయి.

పళముదిర్చోళై
అటవీ ప్రాంతంలో ఆరోగ్య దాత

ఎక్కడుంది?: తమిళనాడులోని మదురైకి సుమారు 24 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు: ‘ఆరుపడై వీడు’ ఆలయాల్లో తన దేవేరులు వల్లి, దేవసేనలతో కుమారస్వామి కొలువైన ఏకైక గుడి ఇది. అడవుల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. సమీపంలో ‘నూపురగంగ’ అనే జలప్రవాహం ఉంటుంది. ఈ స్వామిని కూడా ఆరోగ్యప్రదాతగా అర్చిస్తారు. ప్రముఖ తమిళ కవయిత్రి, సాధువు అయిన అవ్వయార్‌ను స్వామి పరీక్షించింది ఇక్కడే అని ఐతిహ్యం. ఈ ఆలయంలో స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి దగ్గరలో అనేక జలపాతాలున్నాయి. భక్తులు వీటిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. శివ, గణేశ ఆలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి.

తిరుత్తణి
365 మెట్ల స్వామి వాసం


ఎక్కడుంది?: తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 67 కి.మీ., చెన్నైకి 83 కి.మీ. దూరంలో తిరుత్తణి ఉంది. ఆ నగరాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ బస్సు, రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరుపతి, చెన్నై నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో తిరుత్తణి చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: తమిళనాడుకు ఒక చివర ‘తిరుచందూర్‌’ ఉంటే, మరో చివర ‘తిరుత్తణి’ ఉంది. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఈ ఆలయానికి చేరుకోడానికి 365 మెట్లు ఎక్కాలి. అవి ఏడాదిలోని 365 రోజులకు సంకేతం అంటారు. వల్లి-సుబ్రహ్మణ్యుడు కలుసుకున్న చోటు, వారి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే అభీష్ట సిద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తిరుత్తణికి సుమారు 50 కి.మీ. దూరంలో ‘వల్లిమలై’ ఉంది. వల్లీదేవి స్వస్థలంగా దాన్ని భావిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తులకు పైన ఉండే గొడుగు రుద్రాక్షలతో చేసి ఉండడం విశేషం.

Thursday, 22 November 2018

అరుణాచ‌లం









అరుణాచ‌లం
అగ్ని రూపం నిశ్చల దీపం
నేడు అరుణాచ‌లంలో కార్తీక దీపం


గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం.
‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి.
‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి.
‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. 
అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.


ఏమిటీ అరుణాచలం...
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

మహా దీపం
అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి. ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ భరణి దీపంతోనే..పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ‘కార్తిగై దీపం’గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నేతిని వినియోగిస్తారు. ఈ దీపం పది రోజుల పాటు  వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ,  గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్‌ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.

రమణ సందేశం...
తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌




Wednesday, 21 November 2018

అరుణాచలం!









సర్వపాపహరం
అరుణాచలం!


ఆ పేరు తలిస్తేనే పాపరాశి దగ్ధమవుతుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వర జ్యోతిర్లింగమే అరుణాచలమని విశ్వాసం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువుదీరి ఉన్నాడు. అరుణేశ్వరి, అరుణేశ్వరుల సాన్నిధ్యం సర్వసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వాసం. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడన్నది నమ్మకం.

అరుణాచలాన్నే అణామలై అనీ తిరువణ్ణామలై అనీ అంటారు. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అణామలై అంటే తమిళంలో పెద్దకొండ. ఈ కొండ సాక్షాత్తూ పరమేశ్వర లింగమేనని పెద్దలు చెబుతారు. కార్తిక పౌర్ణమినాడు ఇక్కడ విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ఒక పక్క నుంచి చూస్తే... కొండ నందీశ్వరుడిలా కనిపిస్తుంది. అరుణాచలం మీదనే రమణ మహర్షిలాంటి సిద్దులు తపస్సు చేశారు. గిరిప్రదక్షిణ కోసం రమణాశ్రమం దగ్గరున్న వినాయకుడి గుడి ముందునుంచీ నడక ప్రారంభిస్తారు. ఆ మార్గంలో ఎన్నో తీర్థాలూ, క్షేత్రాలూ. ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి మాసంలోనూ పౌర్ణమినాటి రాత్రి వేలాది భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తారు.

అగ్నిలింగ ఆవిర్భావం
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మవిష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అది ఏనాటికీ తేలలేదు. ఓ రోజున ఒక పెద్ద జ్యోతి స్తంభం రూపంలో వారిముందు అవతరించింది. ఆ జ్యోతి అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి.. ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని అశరీరవాణి పలికింది. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని చూడటానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంస వాహనం ఎక్కి ఆ వెలుగు స్తంభం పైభాగాన్ని దర్శించడానికి బయలుదేరాడు. ఆ స్తంభం తుదీ మొదలూ అటు బ్రహ్మకు కానీ, ఇటు విష్ణుమూర్తికి కానీ అంతుపట్టలేదు. ఇద్దరూ బయలుదేరిన చోటికే వచ్చారు. తామిద్దరిలో ఎవరూ గొప్ప కాదనీ, తేజోమయమైన అగ్నిస్తంభమే గొప్ప అనీ ఆమోదించారు. తమ అహంకారాన్ని నశింప చేసినవాడు తేజోలింగ రూపుడైన శివుడేనని అర్థమైంది. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడున్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడన్నది నమ్మకం.

ఎన్నెన్నో అద్భుతాలు
అరుణాచలం అద్భుతాలకు నిలయం. పరమశివుడి గణాలలో భృంగి ప్రధాన సేవకుడు. భృంగికి శివుడి మీద మాత్రమే భక్తి. అందుకే ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుండేవాడు. ఓ రోజున భృంగి ప్రదక్షిణ చేసే సమయానికి అమ్మవారు, శివుడి ఎడమవైపు అతుక్కొని అర్ధనారీశ్వరిగా ఉన్నారు. భృంగి తేనెటీగ రూపాన్ని ధరించి అమ్మవారికి, అయ్యవారికి మధ్యన దూరిపోయి శివ ప్రదక్షిణను పూర్తి చేశాడు. అందుకు మెచ్చుకున్న శివుడు భృంగికి మోక్షం ఇవ్వబోయాడు.. అమ్మవారు వద్దని వారించారు. ఈ ప్రణయ కలహాన్ని అర్చక స్వాములు ఓ ఉత్సవంగా జరుపుతారు. అరుణాచల గోపురాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు. ఇక్కడున్న ఓ గోపురానికి కిరిగోపురం అని పేరు. దీన్ని భళ్లాల మహారాజు కట్టించినట్లు చెబుతారు. భళ్లాలుడు శివభక్తుడు. గొప్పదాత. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం కలగలేదు.

ఆ రాజును పరీక్షించేందుకు శివుడే స్వయంగా బయల్దేరాడు. కొంతమంది జంగమ దేవరలను వెంటపెట్టుకొని తాను కూడా జంగమయ్య వేషం వేసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. తమకు సేవ చేసేందుకు కొందరు దేవదాసీలు కావాలని రాజును కోరాడు జంగమయ్య. రాజు అలాగే పంపాడు. ఆ జంగమ దేవరలలో మిగిలిన వారికి రాజు పంపిన దాసీలందరూ సరిపోయారు. పెద్ద జంగమయ్యకు మాత్రం ఒక్కరూ మిగల్లేదు. దాంతో రాజు రెండో భార్య తానే దాసీగా వెళ్లింది. ఆమె వెళ్లేసరికి పెద్ద జంగమయ్య నిద్రపోతున్నాడు. ఆయనకు ఫలాలను సమర్పించే ఉద్దేశంతో తాకి లేపింది. రాణి ఆయనను తాకగానే పెద్ద జంగమయ్య పసిబాలుడిలాగా మారిపోయాడు. అప్పుడామె ఆ బిడ్డను ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. రాజు బిడ్డను తాకగానే బిడ్డ అంతర్థానమై పోయింది. రాజు, రాణి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు "ఓ రాజా నీవు బాధపడవద్దు. నేను నీకు కుమారుడిని. నీ మరణానంతరం నీకు అగ్ని సంస్కారాన్ని కూడా నేనే చేస్తాను' అని వరమిచ్చాడు. భళాల రాజు మరణానంతరం శివుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ నాటికి కూడా, రాజు పరమపదించిన రోజున అరుణాచలేశ్వరుడికి ఆ దుర్వార్తను వినిపిస్తారు. ఆ తర్వాత, ఆలయం తలుపులు మూసివేస్తారు. అనంతరం స్వామి భళ్లాల రాజు పాలించిన పళ్లి కొండపట్టు వెళతాడు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి, భళ్లాల రాజుకు ఆబ్దికం పెట్టిస్తారు. ఆ తర్వాత, ఉత్సవమూర్తి తిరిగి ఆలయానికి చేరుకుంటాడు. ఇవన్నీ అయ్యాకే భక్తులకు దర్శన భాగ్యం. ఇలాంటి స్థల పురాణ గాథలు భక్తలోకంలో విశేష ప్రచారంలో ఉన్నాయి.

- శ్రీమల్లి, 7382927069




Saturday, 20 October 2018

శక్తిపీఠాలు తెలుసుకుందామా!









శక్తిపీఠాలు తెలుసుకుందామా!


పురాణాల ప్రకారం... బ్రహ్మదేవుడి కుమారుడైన దక్షప్రజాపతి కుమారై సతీదేవి శివుడిని వివాహాం చేసుకుంది. ఒకానొక సమయంలో త్రిమూర్తులు దేవసభ ఏర్పాటు చేశారు. అ సభకు దేవాదిదేవతలంతా హాజరయ్యారు. దక్షుడు సభకు అలస్యంగా వచ్చారు. అ సమయంలో శివుడు లేనందున అవమానంగా భావించి వెళ్లిపోయాడు. శివతత్వం దృష్టి తెలియక దక్షుడు శివుడిని విస్మరించి నిరీశ్వర యాగం తలపెట్టాడు. అ యాగానికి దేవతలందరిని పిలిచి సతీదేవి, శివుడిని మాత్రం ఆహ్వానించ లేదు. తండ్రి తల పెట్టిన యాగానికి శివుడు ఎంత వద్దని చెప్పినా వినకుండా సతీదేవి వెళ్తుంది. అక్కడ దక్షప్రజాపతి శివుడిని అపహస్యం చేస్తూ నిందిస్తాడు. దీంతో మనస్తాపానికి గురైన సతీదేవి అక్కడే ఆత్మార్పణ చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయరుద్రుడై సతీదేవి మృతదేహంతో సృష్టిని మరిచి తాండవం చేశాడు. శివుడిని శాంతింప చేసే ప్రయత్నంలో దేవతలంతా కలసి విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. దాంతో శివుడి భుజంపై ఉన్న సతీదేవి మృతదేహాన్ని ఆ చక్రం 108 శకలాలుగా చేయడంతో ఒక్కొక్క శకలం ఒక్కో ప్రదేశంలో పడిపోయింది. అ భాగాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ప్రధానమైన శరీర భాగాలు 18. ఈ భాగాల్ని శక్తిపీఠాలుగా ఆది శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ చేశారు. భారత దేశంలో 17 శరీర భాగాలు, శ్రీలంకలో ఒక భాగం ఉంది.




శ్రీలంక శాంకరీదేవి

రావణస్తుతి సంతుష్టాకృత లంకాధివాసినీ
సీతాహరణ దోషేణ త్యక్తలంకా మహేశ్వరీ
సజ్జనస్తుతి సంతుష్టా కదంబవనవాసినీ
లంకాయాం శాంకరీదేవీ రక్షేత్‌ ధర్మ పరాయణా!!

‘రావణుని స్తోత్రాల చేత సంతుష్టురాలై, అతని లంకాపట్టణంలో నివసించడానికి అంగీకరించింది. కానీ రావణుడి దోషమైన సీతాపహరణం వల్ల లంకను వీడిన మహేశ్వరివి నీవే. శాంకరిగా, కదంబవనవాసినిగా సజ్జనుల చేత స్తుతించబడే వనదుర్గా.. మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్మల్ని... అంటూ శాంకరీదేవిని భక్తులు కొలుస్తారు. ప్రస్తుతం శ్రీలంకగా చెలామణీలో ఉన్న ఒకనాటి లంకాపట్టణమే శాంకరీదేవి నెలకొన్న శక్తి పీఠక్షేత్రం. పశ్చిమ సముద్రతీరాన ట్రింకోమలి పట్టణంలో ఈ మొదటి శక్తిపీఠం ఉంది. ఈ తల్లిని మహర్షులు వనశంకరి అని పిలిచేవారు. వనం అంటే నీరు, అడవి అనే అర్థాలున్నాయి. లంక చుట్టూ నీరు ఉండటం సహజమే. పైగా ఆమె కదంబవనవాసిని. ఏ విధంగా చూసినా వనశాంకరీదేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి. అమ్మను వనదుర్గా మంత్రంతోనూ పూజిస్తారు. ఈ తల్లి రాక్షసగుణాలను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ భక్తపాలన చేస్తుందని అంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న పోర్చుగీసువారు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినా అమ్మవారి విగ్రహం మాత్రం పదిలంగా ఉంది. పురాతన ఆలయం పక్కనే మరో ఆలయం నిర్మించారు.

కంచి కామాక్షమ్మ

శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః
గంగాప్లావ సముద్విగ్నా సైకతం లింగమాశ్రితా
భక్తానామిష్టదా నిత్యం కామాక్షీ కాంచికాపురే
ఏకామ్రనాధ గృహిణీ శుభం - కుర్యాన్మహేశ్వరీ!!

అష్ట దశ శక్తి పీఠాల్లో రెండో శక్తిపీఠం కామాక్షి అమ్మవారి ఆలయం, తమిళనాడు రాష్ట్రం, కాంచీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ వంశ రాజులు నిర్మించారని, ఆ తరువాత కాంచీపురాన్ని పాలించిన రాజులు అమ్మవారి ఆలయ విస్తరణకు అనేక పనులు చేపట్టి అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి శక్తి పీఠాన్ని నాభి స్ధాన శక్తి పీఠం అని పిలుస్తారు. ‘క’ అంటే సరస్వతీ రూపం, ‘మా’ అనేది లక్ష్మీ రూపం, ‘అక్షి’ అంటే నేత్రం అని అర్ధం. ఈమేరకు కంచిలో లక్ష్మి, సరస్వతిగా కామక్షి అమ్మవారు దర్శనిమిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్ర నామ జపమే అనువైన మార్గం అని భక్తులు నమ్ముతారు. కంచి రెండో శక్తిపీఠంగా గుర్తింపు పొందింది.

మూడు రూపాల్లో... కామాక్షి అమ్మవారి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను మొదటి మూడు రోజులు అమ్మవారిని దుర్గా దేవిగా, తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవిగా, చివరి మూడు రోజుల్ని సరస్వతీదేవిగా అలంకరించడం ఆనవాయతీ.

శృంఖలాదేవి

విశృంఖలా స్వయం దేవీ - భక్తానుగ్రహకారిణీ
భక్తానాం శృంఖలా హర్త్రీ - స్వయంబద్దాకృపాపరా
శృంఖలాకటి బద్దా చ - జగన్మాతా యశస్వినీ
మాంగల్య దా శుభకరీ - వేదమార్గాను పాలినీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవి బుష్యశృంగ సమర్చితా
శుభం తనో తు సా దేవీ - కరుణాపూర వాహినీ!!

పశ్చిమ బంగ, హుగ్లీ జిల్లా, పాండువా గ్రామంలో శృంఖలాదేవి శక్తి పీఠం ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 3వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం పడిందని చెబుతారు. శృంఖలా అంటే సంకెల అని అర్థం. మాతృమూర్తిగా, అప్పుడే ప్రసవించిన బాలింతరాలుగా, నడుము వద్ద ఉండే నడికట్టును శృంఖల అంటారు. అదేవిధంగా అప్పుడే ప్రసవించి, చంటి బిడ్డకు పాలిస్తున్నట్లుగా ఉండే అమ్మవారి రూపానికి శృంఖలానామం వచ్చిందంటారు. క్షేత్రంలోని మూర్తి మాతృప్రేమను ప్రతిబింబించేలా ఉంటుంది.

సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క బంగా(వంగ)లోనే పదికి పైగా ఉన్నట్లు స్థానికుల వాదన. పైగా మొదటినుంచీ వంగలో శక్తి ఆరాధన అధికం అనడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. వంగలో శక్తిగుడిలేని గ్రామం అంటూ ఏదీ లేదని చెప్పొచ్చు. అంగ, వంగ కళింగ దేశాలు మూడు శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందినవే! ఎన్ని ఆలయాలు ఉన్నా...శృంఖలాదేవి శక్తిపీఠంగా ప్రజలు విశ్వసిస్తున్నారు.

చాముండేశ్వరి

మహిషం సంహృత్యదేవి కంటకం త్రిషు జన్మసు
చండీ కాళీ స్వరూపేణ దుర్గా రూపేణ శాంకరి!
స్థితాసి లోక రక్షార్ధం చాముండా క్రౌంచపట్టణే
దేవి త్వం ప్రసీదాస్మాన్‌ సర్వదా సర్వదా శుభే!!

భారత ఉప ఖండంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాల్లో చాముండేశ్వరి ఆలయాన్ని 4వ శక్తి పీఠంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారి కేశాలు పడ్డాయంటారు. మైసూరు, చాముండి కొండల్లో వెలసిన చాముండిదేవికి ఈ దసరా పర్వ దినాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. కర్ణాటక, మైసూరులో ప్రస్తుతం మనకు తెలిసిన చాముండి కొండను ఒకప్పుడు మహాబల గిరిగా పిలిచేవారు. 1659 వరకు అతితక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డ దేవరాజ ఒడెయార్‌ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూరు రాజ వంశస్థుల కులదేవతగా, మైసూరుకు నాడ దేవత(గ్రామ దేవత)గా చాముండి దేవి నిత్య పూజలు అందుకుంటోంది.

ఏటా మైసూరు మహారాజు వంశస్థులతోపాటు, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి. కాళికాదేవి ప్రతిరూపంగా ఉండే చాముండి దేవి తామస గుణ వదనంతో కనిపిస్తుంది. అష్టకరముల్లో ఆయుధాలను ధరించిన దేవిని చంపక పుష్పాలతో అలంకరిస్తారు. ఈ నవరాత్రులలో రోజు సాయంత్రం మహారాజుల కుటుంబ సభ్యులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు.

జోగులాంబ

అలంపురం మహాక్షేత్రం- తుంగాచోత్తర వాహినీ!
బాల బ్రహ్మేశ్వరో దేవః - జోగులాంబా సమన్వితః!!
తీర్థం పరుశురామస్య- నవ బ్రహ్మ సమన్వితం!
అలంపురే జోగులాంబా- విశాలాక్ష్యా సమాస్మృతా!!
భువికా శ్యా సమక్షేత్రం- సర్వదేవ సమర్చితం!
సదానఃపాతు సా దేవీ- లోకానుగ్రహ తత్పరా!!

సతీదేవి ఊర్ధ్వ దంత భాగం పడిన చోటే అలంపూర్‌. ఈ ప్రాంతంలోనే అమ్మవారు జోగులాంబగా అవతరించింది. ఇది ఐదోశక్తి పీఠం. ఈ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉండేది. ప్రత్యేక తెలంగాణ విభజించిన అనంతరం ఆ జిల్లా విడిపోవడం, అమ్మవారి పేరే కొత్త జిల్లాకు పెట్టారు. ఇది తెలంగాణాలో ఏకైక శక్తిపీఠం. ఇప్పుడు అలంపూర్‌ జోగులాంబ జిల్లాలో ఉంది. ప్రధానంగా నరఘోష, దృష్టి దోషం కలగకుండా అమ్మ ఆదర్శమూర్తిగా దర్శనం ఇస్తుంది. అత్యంత శక్తిమంతురాలిగా జోగులాంబని అభివర్ణిస్తారు. అమ్మవారు పీఠాసన రూపంలో మహాతేజోవంతమై దర్శనమిస్తుండటం విశేషం. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. అలంపూర్‌ జోగులాంబ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. 14వ శతాబ్దంలో బహమని సుల్తాన్‌ కాలంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం కావడంతో అమ్మవారి మూల విగ్రహాన్ని స్వామి వారి ఆలయంలో నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. తరువాత 2005లో మళ్లీ అమ్మవారి ఆలయాన్ని పునః నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. అందుకే అమ్మవారి పీఠం అడుగున జలగుండం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి వారోత్సవ పూజలు... అమావాస్య, పౌర్ణమికి చండీహోమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా పండగనాడు తుంగభద్ర నదిలో పెద్దఎత్తున తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది.

భ్రమరాంబిక

భ్రమరై రరుణం హత్వా భ్రామ్యన్తీ శ్రీగిరౌ స్థితా
భక్తాను కంపినీ దేవీ మల్లికార్జున తోషిణీ సుందరీ !!
శివనుగ్రహ సంధాత్రీ భక్తరక్షణ తత్పరా
సానః పాయాత్‌ సదా మాతా శ్రీశైలే భ్రమరాంబికా!!

సతీదేవి మెడభాగం పడిన ప్రాంతమే శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన భ్రమరాంబాదేవి పద్దెనిమిది మహాశక్తుల్లో ఒకరు. ఈ అమ్మవారి క్షేత్రం ఆరో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద రూపంలో అవతారమెత్తింది. దాంతో అమ్మవారికి భ్రామరీశక్తిగా పేరు వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక అరుణాసురుడి సంహారం తరువాత అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి, భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. ఆ సమయంలో సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతుండగానే, అద్భుతమైన మల్లె పొదల వాసన ఆమెను (తుమ్మెద రూపంలో ఉన్న ఆ దేవతను) ఆకర్షించింది. అక్కడ మల్లికార్జునరూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని గుర్తించింది. ఇక అక్కడే ఉండిపోదలచి, ఆ లింగానికి పశ్చిమాన కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరనివాసం ఏర్పరచుకుంది. అందుకే ఆ అంశని ‘భ్రమరాంబ’గా రుషులు, దేవతలు స్తుతించారు. అలా శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామికి ఇల్లాలై భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడ నిత్యం అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. దసరా సమయంలో నిత్యాభిషేకాలు, హోమాలు ఉంటాయి. శరన్నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో పూజలు అందుకుంటుంది భ్రమరాంబికా దేవి. శ్రీశైల క్షేత్రంలో నిత్యం అమ్మవారికీ, స్వామికీ కల్యాణం జరుగుతుంది.

కొల్హాపురి మహాలక్ష్మి

శ్లో: కోల్హతపః ప్రీతాదేవీ వరదాన మహోజ్జ్వలా
మహాలక్ష్మీర్మహామాతా లోకానుగ్రహ కారిణీ!
దత్తాత్రేయాది సుప్రీతా నానాతీర్థ నిషేవితా
కరవీర సుమారాధ్యా కోల్హ సద్గతిదాయినీ!
భవానీ చామలాదేవీ కరవీర సువాసినీ
కొల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ!!

శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మీ ఆలయం, మహారాష్ట్ర, కొల్హాపూరులో ఉంది. క్రీస్తు శకం 600-700 సంవత్సరాల మధ్య చాళుక్యుల నాటి కాలంలో ఏడవ శతాబ్దంలో పంచగంగా నది ఒడ్డున నిర్మించిన ఆలయమిది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో కొలువై ఉంటుంది. ఇది ఏడో శక్తిపీఠం. సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయని అంటారు. అమ్మవారు విష్ణుమూర్తి సమేతంగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠానికి కొల్హాపూర్‌తోపాటు కరవీరం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఎన్నో తీర్థ ఘట్టాలు, దేవతా ప్రతిష్టలు ఉన్నాయి. దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజూ అ అమ్మవారి వద్ద భిక్ష స్వీకరించేవాడని చెబుతారు. వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్యమహర్షి తిరిగి ఉత్తరాపధం వెళ్లకుండా దక్షిణాదిన సంచరిస్తూ ఇక్కడే శ్రీమహాలక్ష్మి సాక్షాత్కారం పొందినట్లు చరిత్రలో ఉంది. గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ప్రతిరోజూ అమ్మవారి పాదముద్రలకు కుంకుమార్చన చేస్తారు. అలాగే ఈ పూజలన్నింటినీ పురుషులతోనే చేయిస్తారు. ఏ ఆలయమైనా తూర్పు ముఖంగానే నిర్మించి ఉండటం సహజం. కానీ ఈ ఆలయం మాత్రం పశ్చిమముఖంగా ఉంటుంది.

అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. పైన ఉన్న కుడిచేతిలో పెద్ద గద, మరో చేతిలో మాదీఫలం, ఎడమచేతిలో డాలు, మరో చేతిలో పానపాత్ర ఉంటాయి.

జనవరి 31, ఫిబ్రవరి ఒకటి, రెండు తేదీలు సహా నవంబరు 9,10, 11 తేదీల్లో ఈ ఆలయంలో జరిగే అద్భుతాన్ని ‘కిరణ్‌ ఉత్సవ్‌’గా పిలుస్తారు. ఆ రోజుల్లో సాయంకాలపు సూర్య కిరణాలు అమ్మవారి విగ్రహం, పాదాలపై పడతాయి. ఈ రోజులను ప్రత్యేక దినాలుగా భావించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తండోప తండాలుగా వచ్చే భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది.

మహారాష్ట్ర ఏకవీరికాదేవి

శ్లో: దత్తాత్రేయ సమారాఢ్యా అనసూయాత్రి సేవితా
ఏకవీరా మహాదేవీ మస్తకే నైవ శోభినీ!
రేణుకా మాతా మాయా సంహార రూపిణీ
కృపయా పాతు నస్సర్వాన్‌ మాయూరే ఏకవీర్యకా!!

అష్టాదశ శక్తి పీఠాల్లో ఏకవీరికా దేవి ఆలయం ఎనిమిదో శక్తిపీఠం. దత్తాత్రేయస్వామి జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన మాహోర్‌ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది. నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో ఈ శక్తిపీఠ క్షేత్రం ఉంది. ఏకవీరికా ఆలయం వల్ల శక్తిపీఠంగా గుర్తించారు. ఈ ప్రదేశంలో మూడు కొండ శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరంపై అత్రి-అనసూయలు, మరో శిఖరంపై దత్తాత్రేయస్వామి నెలకొని ఉండగా - మూడో శిఖరంపైన ఏకవీరికాదేవి విగ్రహం ఉంది. ఈ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. ఈ శక్తిపీఠ క్షేత్రంలో సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు. కేవలం తల మాత్రమే ఇక్కడ శక్తిగా ఆరాధించబడుతోంది. మెడ కూడా ఉండదు. పైగా ఈ ముఖం రౌద్రం మరింత పెరుగుతోందా అన్నట్లుగా గంగ సింధూరం పూత పూస్తారు. ఈ అమ్మవారిని తుల్జాపూర్‌ భవానీ అని కూడా పిలుస్తారు. ఈ మాతను శివాజీ చక్రవర్తి ఆరాధించాడని ప్రతీతి. ఈ అమ్మవారికి కొంతకాలం వరకూ జంతువుల్ని బలిచ్చేవారు. ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును, పక్కన గల గోడలను తాకేటంత పెద్దదిగా ఉండటం ఈ క్షేత్రంలో చూడొచ్చు. మహామంత్ర శక్తి గల అమ్మవారని ప్రసిద్ధి.

ఉజ్జయినీ మహంకాళీ

శ్లో: త్రిపురాసుర సంహర్తా మహాకాలో త్రవర్తతే
యస్యాట్ట హాస సందగ్థం దుస్సహం తత్‌ పురత్రయమ్‌!
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా
ఉజ్జయిన్యం మహాకాళీ భక్తానామిష్టదాసదా !!

అష్టాదశ శక్తిపీఠాల్లోని తొమ్మిదో శక్తిపీఠం ఉజ్జయినీ మహంకాళి. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. హరసిద్ధిమాత, అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే. సప్తమోక్ష పురాలలో ఇదొకటి. అమ్మవారు మహాకాళి కాగా, అయ్యవారు మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగమూర్తి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడినట్లు చెబుతారు. ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ పురమే అవంతిక (రక్షించేది), ఉజ్జయిని (జయించేది), అదే (యజ్ఞాలకు యోగ్యమైన) కుశస్థలి. ఇవన్నీ ఉజ్జయినీ నగరానికి మారుపేర్లు. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని అంటారు. మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించిన శక్తి ఈ కాళీమాతే.

నగరానికి కొద్ది దూరంలో క్షిప్ర/సిప్ర, ఖాన, సరస్వతి నదుల సంగమం ఉంది. ఇక్కడ ఇదే త్రివేణి సంగమ స్థలం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగాన్ని ఎవరికి వారే అభిషేకించే అవకాశం ఉంది. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. అయితే దేవీ నవరాత్రుల్లో జరిగే ఉత్సవాలు మాత్రం భారీస్థాయిలో ఉంటాయి.

పురూహూతికా దేవి

శ్లో: ఏలర్షి పూజిత శ్శంభుః- తస్మై గంగా మదాత్‌ పురా
రురావ కుక్కుటో భూత్వా- భగవాన్‌ కుక్కుటేశ్వరః!!
దేవీ చాత్ర సమాయాతా- భర్తృ చిత్తానుసారిణీ
పురుహూత సమారాద్దా- పీఠాయాం పురుహూతికా!!

అమ్మవారి పిరుదు భాగం పడిన ప్రాంతం పిఠాపురం. ప్రసిద్ధ క్షేత్రాలన్నింటిలో ప్రత్యేకతగల ఆలయం పిఠాపురం పాదగయ క్షేత్రం. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం దశమ శక్తిపీఠం. దసరా సందర్భంగా అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. మహిళలు ఉపవాసంతో ఈ కుంకుమార్చన చేస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పురూహుతికా అమ్మవారికి తొలిరోజు కలశస్థాపన, ప్రతిరోజు ఉదయం శ్రీచక్ర నవార్చన, ఛండీ సప్తపతి పారాయణ, మధ్యాహ్నం చండీ హోమం, సాయంత్రం లక్ష కుంకుమార్చన జరుగుతాయి. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి భవానీ దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజులపాటు ఈ క్షేత్రంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే శతచండీయాగం, కుంకుమ పూజలు ఇక్కడ ప్రత్యేకతం.

గిరిజదేవి

శ్లో: ఓఢ్యాణే గిరిజాదేవీ పిత్రర్చన ఫలప్రదా
బిరజా పర పర్యాయా స్థితా వైతరణీతటే
త్రిశక్తీనాం స్వరూపా చ లోకత్రాణ పరాయణా
నిత్యం భవతు సా దేవీ వరదా కులవర్థినీ

ఓఢ్యాణం అంటే... ఓఢ్రదేశం. నేటి ఒడిశా. కటక్‌కి దగ్గర్లోని వైతరణీ నదీతీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణే. జాజ్‌పూర్‌ రోడ్డుకు సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది పదకొండో శక్తిపీఠం. అదే గిరిజాదేవి ఆలయం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడి గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి, గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూంటాడు. అంటే ఇక్కడికి సమీపంలో శ్వేతవరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉందని అర్థం! జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా? నరకానికి పంపాలా? అనే విషయాన్ని వైతరణీ నది తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది, న్యాయనిర్ణేత అన్నమాట. జాజ్‌పూర్‌ రోడ్డు చేరువలో ఉన్న ఈ వైతరణి ఆ నదీ అంశతో జన్మించింది కాబట్టి, పితృదేవతలకు - పిండ ప్రదానాలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి. అందుకే ఇక్కడ అంతా పిండ ప్రధానం చేస్తారు. స్థానికులు ఇక్కడి శక్తి పీఠాన్ని బిరజాదేవి అనీ వ్యవహరిస్తున్నారు. వైతరణి లేదా విరజా నదీ తీరంలో వెలసినందున వంగ/ఒరియా భాషల్లో విరజ, బిరజగా మార్పుచెంది, స్థానికుల నోట బిరజగా రూపాంతరం చెంది ఉండొచ్చు. త్రిశక్తి రూపిణిగా పూజలందుకొంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీలాలు అర్పించడం అనేది ఒక విశేషమే!

క్షేత్ర విశిష్టత
ఇక్కడి అమ్మవారు (గిరిజ) సింహాన్ని వాహనంగా కలిగి, ఒక చేత్తో ఖడ్గం, మరో చేతితో మహిషాసురుని తోక పుచ్చుకున్నట్లుగా దర్శనం ఇస్తుంది. దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు. ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రం పూరీలో కూడా రథయాత్రకు ప్రాముఖ్యం ఉంది. అదే తరహాలో ఈ దేవతకు కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహరూపుడైన విష్ణుమూర్తి ఆలయం నిర్మించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలు మార్గంలో, కటక్‌ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు.

మాణిక్యాంబ

శ్లో: స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబా త ధైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్తగోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే!!

సతీదేవి నాభిభాగం పడిన చోటే ద్రాక్షారామ. సంస్కృతంలో నాభిని మణిపూర్వకచక్రం అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్రాక్షారామ అష్టాదశ పీఠాల్లో ఒకటిగానే కాకుండా శ్రీశైల భ్రమరాంబ, కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, ద్రాక్షారామ మాణిక్యాంబలను కలిపి అంబికాత్రయంగా చెబుతారు. దాక్షాయని ఆత్మాహుతి చేసుకొన్న ఇక్కడే పరమేశ్వరుడు భీమేశ్వరుడి రూపంలో స్వయంభువుడై వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది. ద్రాక్షారామలో మాణిక్యాంబ అమ్మవారు దక్షిణాభిముఖంగా సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రంపై ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ రూపాన్ని పునఃప్రతిష్ఠించించారు. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంపై నిలబడి ఉంటుంది. శ్రీచక్రానికి ఏకకాలంలో పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన రూప అలంకరణలు ఉండవు. దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రదోష కాలంలో ప్రత్యేకంగా రజిత, సువర్ణ, విశేష పుష్పార్చనలు నిర్వహిస్తారు. అనంతరం పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ చేరుకోవడానికి రైలుమార్గం ద్వారా అయితే రాజమహేంద్రవరం, సామర్లకోటలో దిగి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం నుంచి 60 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

కామాఖ్యాదేవి

కామాఖ్యే కామదే దేవి - నీలాచల నివాసిని
కామస్య సర్వదే మాతః - మాతృ సప్తక సేవితే!!
జామదగ్న్యస్య రామస్య మాతృహత్యా విమోచని
పంచ శంకర సంస్థానా భక్తపాలన తత్పరా !!
కల్యాణ దాయినీ మాతా విప్ర దర్శిత నర్తనా
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా !!

ఇది అసోం రాష్ట్రంలోని గువహటిలో ఉంది. సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యాక, అమ్మవారి యోనిభాగం ఇక్కడ పడిందని అంటారు. ఇది పదమూడో శక్తిపీఠం. కామాఖ్యదేవి అనేక మహిమలు చూపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయ సమీపంలోనే ఊర్వశీ (ఊర్చసి) కుండం ఉంది. ఈ కుండంలో స్నానం చేసిన తరువాతే ఆలయంలో ప్రవేశించాలి.

ఇక్కడ ఆలయం కిందకు ఉంటుంది. మెట్లు దిగి వెళ్లాలి. కామాఖ్య పీఠ దర్శనం చేసి, అక్కడి జలధారను తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు ప్రతీ ఏటా రజస్వల అవుతుంది. ఆ సమయంలో ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది. ఈ సమయాన్ని ‘అంబుబాషిమేళ’ అంటారు. ఈ కాలంలో మూడు రోజులపాటు అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని ఇతర ఆలయాలను మూసివేస్తారు.  అమ్మవారికున్న వస్త్రాలు కూడా ఎర్రగా మారతాయంటారు. నాలుగో రోజు అమ్మవారికి శిరః స్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు. భక్తులు మాత్రం అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు. మహా త్రిపుర సుందరిగా పరిగణిస్తారు. దసరా సమయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.


మాధవేశ్వరి

త్రివేణీ సంగమోద్భుతా- త్రిశక్తీ నాం సమాహృతిః
ప్రజాపతి కృతా శేష - యాగమాలాభివందితా!!
బృహస్పతి కరాంత స్థ- పీయూష పరిషేచితా
ప్రయాగే మాధవీదేవీ - సదా పాయాత్‌ శుభాకృతి!!

సతీదేవి కుడిచేతి నాలుగు వేళ్లు ప్రయాగ (అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అక్కడే మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం వెలసింది. ఇది పద్నాలుగో శక్తిపీఠం. ఈ క్షేత్రంలోని గంగానది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటే, యమున నీరు మాత్రం నల్లగా ఉంటుంది. యమున విష్ణు భక్తురాలు. విష్ణుపాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక, దీనికి మాధవక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కారణంతోనే ఈ శక్తిపీఠాన్ని మాధవేశ్వరీ పీఠంగానూ పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బింధుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ, సూర్యుడు అమ్మవారిని ఆరాధించే క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమనీ కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మూడు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పులో నలుచదరంగా ఉన్న ఒక పీఠం మాత్రమే కనిపిస్తుంది. ఆ పీఠం మధ్యలో గుంట ఉంటుంది. అక్కడే అమ్మవారి చేతి వేళ్లు పడిన చోటు అని చెబుతారు పురోహితులు. దాన్ని ముట్టుకుంటే చేతికి తడి తగులుతుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి అడుగున ఊయల మాదిరి కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది.

వైష్ణవీదేవి

కాలాధర సర్వతాగ్రే జ్వాలా రూపాను భాససే
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతి ర్మూర్తినిదర్శనా!!
రాధే శ్యామేతి నా దేన వర్థమానా త్విషాంతతిః
జ్వాలాయాం వైష్ణవీ దేవి సదారక్షతు శాంకరీ!!



ఈ జ్వాలాక్షేత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా వద్ద ఉంది. అమ్మవారి నాలుక నిట్టనిలువుగా ఈ ప్రాంతంలో పడిందని ప్రతీతి. ఈ ఆలయం కాలంజర పర్వతంపై ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. జ్వాలారూపిణిగా దర్శనం ఇస్తుంది. అమ్మవారి ఆలయం గుహలో ఉంటుంది. ప్రవేశద్వారానికి ఎదురుగా మూడు అడుగుల ఎత్తున్న గూట్లో ఆరు అంగుళాల పొడవున అగ్ని జ్వాల కనిపిస్తుంది. దాన్నే అమ్మవారి శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ నిరంతరం ఏడు జ్వాలలు వెలుగుతూంటాయి. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి, వైష్ణవీదేవి, విద్యేశ్వరీ దేవి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ గర్భాలయానికి రెండు అడుగుల చదరం ఆకృతిలో ఒక ప్రవేశ ద్వారం ఉంది. దీనిలోంచి తల మాత్రం దూర్చి ఆ జ్వాలను చూడొచ్చు. రాధేశ్యాం అని మనం ఎంత బిగ్గరగా అరిస్తే అంత ఎత్తున జ్వాల ఎగిసిపడటం ఇక్కడి ప్రత్యేకత. ఇది పదిహేనో శక్తిపీఠం.

సర్వమంగళాదేవి

గదాధర సహదోరి గయాగౌరి నమోస్తుతే
పితృణాంచ స కర్తృణాం దేవి సద్గతిదాయిని!!
త్రి శక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ
మహ్యం భవతు సుప్రీతా గయా మాంగళ్య గౌరికా!!



సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరి దేవీ... స్థలపురాణానికి తగ్గట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా పిలుస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. సర్వమంగళాలను దేవి ప్రసాదించడంతో, ఈ తేజోమూర్తిని దేవతలు, మునులు సర్వమంగళాదేవిగా కీర్తించారు. ఈ క్షేత్రంలో శ్వేత, మధుర, ఫల్గుణి అనే మూడు నదులు సంగమిస్తూ ఉండటంతో ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఉంది. ప్రస్తుతం మధుర, శ్వేతానదులు కనిపిస్తున్నాయి. ఫల్గుణీ నది అంతర్థానమై అంతర్వాహిని మారిపోయింది. ఈ శక్తి పీఠంలో యాభైరకాల దానాలతో కూడిన శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇది వైష్ణవక్షేత్రం కూడా. మంగళగౌరీ దేవిని విష్ణు మూర్తి భక్తులు చెల్లెలుగా పరిగణిస్తారు. ఇది పదహారో శక్తిపీఠం.



కాశీ విశాలాక్షీ

కాశీంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
విశ్వేశం దేవ మాలోక్య ప్రీతి విస్తారితే క్షణా!!
సానురాగా చ సా గౌరీ దద్యాత్‌ శుభపరంపరాం
వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణా పరాకృతిః!!
అన్నం జ్ఞాన చ దదతీ సర్వాన్‌ రక్షతి నిత్యశః
త్వత్ప్ర సాదా న్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే!!

అష్టాదశ శక్తిపీఠాల్లో పదిహేడో శక్తిపీఠం శ్రీవిశాలాక్షీ దేవి. కాశీ విశ్వేశ్వరుడి గుడికి కొంత దూరంలోనే విశాలాక్షీ అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ గుడి గోపురం అంతా దక్షిణాది సంప్రదాయంలో ఉంటుంది. సప్తమోక్ష పురాణాల్లో ఒకటిగా కాశీకి విశిష్టస్థానం ఉంది. ఇది సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) పడిన ప్రదేశం. ఆలయం బయటి నుంచి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. కానీ ఈ శక్తి పీఠంలోని విశాలాక్షీ అమ్మవారు గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకటి పెద్దది. మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైంది. స్వయంభువు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షీ అనే పేరు వచ్చిందని ప్రతీతి.

కాశ్మీరే షు సరస్వతి

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యాస్వరూపిణి
రాగద్వేషాది యుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్ఛసి!!
కాశ్మీర దేశ వద్రమ్యా విశదా భవదా కృతిః
సాంత్వయన్తీ మహాదేవీం త దుక్త్యా శారికా అభూః!!
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీం శుభాం
విద్యా వృద్ధిం సదా దద్యాత్‌ కాశ్మీరే షు సరస్వతీ!!

సరస్వతీదేవిని కశ్మీరు పురవాసినిగా పిలుస్తారు. అక్కడి ప్రజలు ‘‘నమస్తే శారదా దేవీ కశ్మీరు పురవాసినీ-త్వాం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే’ అని భక్తితో పూజిస్తారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫ్ఫరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో నీలం నది పక్కన శారద అనే గ్రామంలో ఈ శక్తి పీఠం ఉంది. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడటం వల్ల ఈ పీఠం ఏర్పడిందని చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చాలాసార్లు శిథిలమైంది. పందొమ్మిదో శతాబ్దంలో కశ్మీర్‌ రాజు మహారాజా గులాబీసింగ్‌ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మతులు చేయించారు. 1948లో భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధంతో ఈ ప్రాంతం ఫస్తూన్‌ తెగల ఆక్రమణకు గురై వాళ్ల ఆధీనంలో ఉండిపోయింది. ఆపై ఆక్రమిత కశ్మీర్‌ వశంలోకి చేరింది. మరోసారి 2005లో జరిగిన అతిపెద్ద భూకంపంతో చాలా భాగం శిథిలమైపోయింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి మరమ్మతులు లేవు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది. అప్పుడప్పుడు పాకిస్థానీ హిందువులు దేవాలయాన్ని సందర్శిస్తారు. అలానే జమ్మూ కశ్మీరులో అమ్మవారిని కీర్‌ భవాని సరస్వతి శక్తి పీఠంగా భావిస్తారు చాలామంది. ఇది తుళుముల అనే ప్రదేశంలో (శ్రీనగర్‌కు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో) ఒక చెరువు మధ్యలో ఉంది. పాలతో చేసిన అన్నం పాయసం ఇక్కడ ప్రసాదం.


>

Sunday, 14 October 2018

బుద్ధుడి అడుగుజాడల్లో..!









బుద్ధుడి అడుగుజాడల్లో..!


‘మనదేశంలో బౌద్ధం ప్రాభవం కోల్పోవచ్చుగాక... కానీ అది పుట్టి పెరిగిన ప్రదేశం మనదేశంలోనే ఉంది. ప్రపంచంలోని బౌద్ధులందరికీ కూడా అదే ప్రముఖ బౌద్ధక్షేత్రం. అందుకే అక్కడ ఎటు చూసినా బౌద్ధ సన్యాసులే. అదే బీహార్‌ రాష్ట్రంలోని బుద్ధగయ’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన మత్స్యరాజ హరగోపాల్‌.

బౌద్ధ విహారాలకు నిలయమైన ప్రాంతాన్ని అప్పట్లో విహార్‌ అని పిలిచేవారు. అదే నేడు బీహార్‌గా మార్పు చెందింది. అందుకే అక్కడ అడుగడుగునా బుద్ధుడు నడయాడిన జాడలు కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది ఆయన జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి నిలయమైన బుద్ధగయ. అక్కడ ఉన్న మహాబోధి మందిరం బౌద్ధమత కేంద్రంగా విరాజిల్లుతోంది. బుద్ధగయ అసలు పేరు ఉరువెలా. సిద్ధార్థుడు దుఃఖకారణాల కోసం అన్వేషిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరించి ఉరువెలా అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఓ మర్రిచెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలోకి వెళ్లాడు. కొన్నిరోజులకు జ్ఞానోదయం కలిగింది. అలా బుద్ధత్వం సిద్ధించింది కాబట్టి సిద్ధార్థుడు బుద్ధుడుగానూ ఆయనకు నీడనిచ్చిన మర్రిచెట్టు బోధివృక్షంగానూ ఉరువెలా ప్రాంతం బుద్ధగయగానూ ప్రాచుర్యం పొందాయి.

వేలాది సంవత్సరాలుగా పూజలందుకుంటోన్న ఈ మందిరాన్ని ‘ద లివింగ్‌ టెంపుల్‌’గా పిలుస్తారు. 2013లో ఉగ్రవాద దాడుల తరవాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయిక్కడ. నిజానికి ఇది మధ్యలో కొంతకాలం మట్టితో కప్పబడిపోయింది. 13వ శతాబ్దంలో తుర్కుల దాడిలో ఇది ప్రాభవాన్ని కోల్పోయింది. తరవాత మనదేశంలో బౌద్ధానికి ఆదరణ కరవవడంతో ఇది మట్టి, ఇసుకలతో మూసుకుపోయింది. 1880-84 నాటి తవ్వకాల్లో ఇది మళ్లీ వెలుగుచూసింది.

మందిరంలోకి అడుగుపెట్టగానే ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ మంద్ర స్వరంతో వినిపించే పదాలు మనల్ని అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వాటిని వింటూ ప్రధాన మందిరంలోకి అడుగుపెట్టాం. గర్భాలయంలో భూమిని స్పర్శిస్తూ, భిక్షాపాత్రతో ధ్యానముద్రలో కూర్చున్న బుద్ధ భగవానుడు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అంతరాలయంలోకి వచ్చి చాలాసేపు బుద్ధుణ్ణి చూస్తూ కూర్చున్నాం. అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఏమీ అనరు. బాలభిక్షువులు ప్రార్థన చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తారు. వాళ్ల ముఖాల్లోని ప్రశాంతత సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది.

నాలుగు ముఖద్వారాలు ఉన్న ఈ ఆలయంలో అనేక స్తూపాలూ చైత్యాలూ ఉన్నాయి. ఈ మందిరాన్ని అశోకుడు నిర్మించాడనీ అంతరాలయంలోని బుద్ధుడిని ఆయనే ప్రతిష్ఠించాడనీ అంటారు. అయితే ప్రస్తుతం ఉన్న మందిరం క్రీ.శ. ఆరో శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న స్తూపాలు 2500 సంవత్సరాల నాటివిగానూ మెట్లు క్రీ.పూ.రెండో శతాబ్దంలోనూ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే బౌద్ధమతంలో భాగంగా అశోక చక్రవర్తి ఈ ప్రాంతంలోనే అనేక స్తూపాలనూ విహారాలనూ చైత్యాలనూ నిర్మించినట్లు ఆధారాలున్నాయి. భక్తులే కాదు, చారిత్రక పర్యాటకులెందరో అత్యంత ప్రాచీనకాలంనాటి ఈ ఆలయాన్ని చూసి ప్రశంసలతో ముంచెత్తుతారు.

మహాబోధి..!
తరవాత మహాబోధి వృక్షం దగ్గరకు వెళ్లాం. ఈ చెట్టును అసలు చెట్టుకి ఐదోతరానిదిగా చెబుతారు. దీనికిందే తూర్పుదిక్కుకి అభిముఖంగా బుద్ధుడు వజ్రాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్లాడనీ, వైశాఖ పూర్ణిమరోజు ఆయనకి జ్ఞానోదయం అయిందనీ అంటారు. ఇక్కడ బౌద్ధులతోబాటు సందర్శకులూ ధ్యానం చేసుకోవచ్చు. ప్రధాన మందిరం చుట్టూ ఉన్న ప్రాంగణం పచ్చదనంతో అలరారుతుంటుంది. దానిమీద చాపలూ పరుపులూ వేసుకుని దేశవిదేశీయులెందరో నెలలు, సంవత్సరాల తరబడి ధ్యానంచేస్తూ అక్కడ గడిపేస్తుంటారు. ఆ తరవాత దానికి పక్కనే ఉన్న ‘నిమేషలోచన చైత్యము’ అనే స్థలానికి వెళ్లాం. ఇక్కడినుంచే బుద్ధుడు వారంరోజులపాటు కనురెప్పలు కదల్చకుండా బోధివృక్షం వైపే చూస్తూ తన కృతజ్ఞతను చాటుకున్నాడట.

జ్ఞానోదయమైన తరవాత మూడో వారం గడిపిన ప్రదేశమే ‘చక్రమణ’. అక్కడ ఆయన పాదం మోపిన ప్రతిచోటా తామరపువ్వులు వచ్చినట్లు చెబుతారు.

తరవాత రత్నగృహం అనే ప్రదేశానికి వెళ్లాం. జ్ఞానోదయానంతరం ఇక్కడ బుద్ధుడు నాలుగో వారం గడిపినట్లూ ఆయన శరీరంలోనుంచి అయిదు రంగులు వెలువడినట్లూ తెలుస్తుంది. ఆ అయిదూ కామ, క్రోథ, లోభ, మద, మాత్సర్యాలకు ప్రతీకలని అంటారు.

కర్మల ద్వారా మానవుడు సద్గతి పొందుతాడనీ జన్మ ద్వారా కాదని బుద్ధుడు గ్రహించి బోధించిన ప్రదేశమే కీర్తిఅజపాల. ఇవన్నీ చూసుకుంటూ సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఆరో వారంలో ఆయన ఈ సరస్సు దగ్గర గడిపాడనీ మానవ మేధస్సులోని అలజడులనూ ఆటుపోట్లనూ తట్టుకుని ఏకాగ్రత సాధించడం ఎలానో ఆయన గ్రహించి బోధించిన ప్రదేశం ఇదేననీ అంటారు. అక్కడినుంచి రాజాయితనమ్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడ బుద్ధుడు బర్మాలో బౌద్ధమత వ్యాప్తికోసం వెంట్రుకని ఇచ్చాడని చెబుతారు.

తరవాత అక్కడినుంచి దగ్గర్లోని 80 అడుగుల ఎత్తున్న బుద్ధ విగ్రహం దగ్గరకు వెళ్లాం. ధ్యానభంగిమలో ఉన్న ఈ విగ్రహానికి ఇరువైపులా పదిమంది ఆయన శిష్యుల ప్రతిమలు కూడా ఉన్నాయి. తరవాత థాయ్‌ మందిరంలోకి వెళ్లాం. అందులో ప్రతిష్ఠించిన స్వర్ణప్రతిమ శోభాయమానంగా ఉంది. టిబెట్‌ సంస్కృతిని అద్దంపట్టేలా నిర్మించిన కర్మ ఆలయం సందర్శకులను ఆకర్షిస్తుంది.

నలందాలో...
మర్నాడు ఉదయమే రాజగృహ, నలంద, పావాపురి చూడ్డానికి బయలుదేరాం. గయకి 80 కి.మీ. దూరంలోని రాజగృహ అన్న ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడే బుద్ధుడు అనేక సంవత్సరాలపాటు బౌద్ధ ధర్మాన్ని బోధించాడట. బింబిసారుడు ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించాడనీ మొదటి బౌద్ధ సమ్మేళనం ఇక్కడే జరిగిందనీ చెబుతుంటారు.

ఇక్కడి రత్నగిరి కొండలమీద నిర్మించిన శాంతి స్తూపాన్ని చూడ్డానికి రోప్‌వే ద్వారా వెళ్లాం. ఈ స్తూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడి బుద్ధుడి విగ్రహాన్ని చాలాసేపు అలాగే చూస్తుండిపోయాం. దీన్ని జపాన్‌కు చెందిన బౌద్ధులు నిర్మించారు. తరవాత రాజగృహకి 15 కి.మీ. దూరంలోని నలందాకి బయలుదేరాం. క్రీ.పూ. అయిదో శతాబ్దానికి చెందిన విశ్వవిఖ్యాత నలంద విశ్వవిద్యాలయం ఇక్కడే ఉండేది. గౌతముడు దాన్ని ఎన్నోసార్లు సందర్శించాడనీ క్రీ.శ. 5-12 శతాబ్దాల వరకూ ఈ ప్రాంతం బౌద్ధ మత సిద్ధాంతాల ప్రచారానికి కేంద్రంగా ఉందనీ చెబుతారు. ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయం ఇదే. ఇక్కడ 2000 మంది ఆచార్యులు, 10,000 పైగా విద్యార్థులు ఉండేవారనేదానికి చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్దంలో చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

ప్రస్తుతం ఇక్కడ 14 హెక్టార్లలో భారత పురాతత్వ శాఖ జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన నాటి అద్భుత కళాఖండాలూ కట్టడాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎర్ర ఇటుకలతో కట్టిన నాటి బోధనాలయాలూ వసతి గృహాలూ విహారాలూ చైత్యాల్లో కొన్ని ఇప్పటికీ కనిపిస్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యుల్లో ఒకడైన సారిపుత్ర ఇక్కడివాడే. ఆర్యదేవ, వసుబంధు, ధర్మపాల, సువిష్ణు, అసంగ, శైలభద్ర, ధర్మకీర్తి... వంటి వాళ్లంతా ఆచార్యులుగా ఉండేవారు. కుమారగుప్తుడు క్రీ.శ. ఐదో శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడనీ తరవాతికాలంలో హర్షవర్థనుడు, పాలవంశరాజులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. క్రీ.శ.1200 సంవత్సరంలో భక్తియార్‌ ఖిల్జీ దీన్ని కూలగొట్టాడట.

1970వ దశకంలో భారత పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో ఇక్కడ బౌద్ధంతోపాటు హిందూ దేవతా విగ్రహాలూ జైన విగ్రహాలూ నాటి శాసనాలూ నాణాలూ బయటపడ్డాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. గైడ్‌ ద్వారా నాటి చరిత్రని విని ఎంతో ఆనందించాం.

తరవాత అక్కడికి 18 కి.మీ. దూరంలోని పావాపురికి బయలుదేరాం. ఇక్కడ జైన తీర్థంకరుల్లో చివరివాడైన మహావీరుడు తన పార్థివ శరీరాన్ని త్యజించిన స్థలంలో ఓ మందిరాన్ని నిర్మించారు. అది చాలా అద్భుతంగా ఉంది. దాని చుట్టూ ఓ సరస్సు ఉంది. అందులో ఒకవైపు అంతా తెల్లని కమలాలూ మరోవైపు ఎర్రని కమలాలూ మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఈ పాలరాతి కట్టడంలో మహావీరుని పాదముద్రలు ఉన్నాయి. ‘అహింస పరమోధర్మ, ప్రశాంతంగా జీవించు-ఇతరులను జీవించనివ్వు, ప్రకృతిలోని ప్రతి ప్రాణినీ ప్రేమించు...’ అని అక్కడ రాసి ఉన్న శిలాఫలకాన్ని చూసే గాంధీజీ ప్రభావితుడైనట్లు చెబుతారు. అక్కడినుంచి తిరుగుప్రయాణంలో గయకి చేరుకున్నాం.

మోక్షగయ!
బుద్ధగయ-గయ జంటనగరాల్లా ఉంటాయి. బౌద్ధులకు బోధగయ ఎలాంటిదో, హిందువులకు గయ అలాంటిదే. గయలో ఫల్గుణీ నది, విష్ణుమందిరం, వటవృక్షం చూడదగ్గ ప్రదేశాలు ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఈ మూడు ప్రదేశాల్లో పిండప్రదానం చేస్తే పూర్వికులకి సద్గతి ప్రాప్తి కలుగుతుందనీ అందుకే గయాశ్రాద్ధం ఎంతో గొప్పదనీ హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఫల్గుణీ నదీతీరంలోనే విష్ణుమందిరం ఉంది. ఈ మందిర ప్రాంగణంలోనే వటవృక్షం ఉంది. ఈ మూడుచోట్లా పిండప్రదానం చేస్తారు. ఇక్కడ తెలుగు పండితులు కూడా ఉన్నారు. శ్రీమహావిష్ణువు తన ఎడమపాదాన్ని గయాసురుని హృదయంమీద నొక్కి ఇక్కడే సంహరించాడనీ అందువల్ల ఒక్క పాదం మాత్రమే ఈ మందిరంలో ఉందనేది ఓ పౌరాణిక గాథ. అయితే అది గౌతముడి పాదమన్నది బౌద్ధుల విశ్వాసం. ఆ పాదాన్ని భక్తులు తాకవచ్చు. ఈ మందిరానికి సమీపంలోనే 15వ శతాబ్దానికి చెందిన మంగళగౌరి ఆలయం ఉంది. దీన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెబుతారు. ఆలయంలోని గర్భగుడి చిన్నగా ఉంది. అందులోని అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతుంటుందట. అది చూసి వారణాశికి వెళ్లి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాం.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...