అరుణాచలం!
ఆ పేరు తలిస్తేనే పాపరాశి దగ్ధమవుతుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వర జ్యోతిర్లింగమే అరుణాచలమని విశ్వాసం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువుదీరి ఉన్నాడు. అరుణేశ్వరి, అరుణేశ్వరుల సాన్నిధ్యం సర్వసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వాసం. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడన్నది నమ్మకం.
అరుణాచలాన్నే అణామలై అనీ తిరువణ్ణామలై అనీ అంటారు. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అణామలై అంటే తమిళంలో పెద్దకొండ. ఈ కొండ సాక్షాత్తూ పరమేశ్వర లింగమేనని పెద్దలు చెబుతారు. కార్తిక పౌర్ణమినాడు ఇక్కడ విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ఒక పక్క నుంచి చూస్తే... కొండ నందీశ్వరుడిలా కనిపిస్తుంది. అరుణాచలం మీదనే రమణ మహర్షిలాంటి సిద్దులు తపస్సు చేశారు. గిరిప్రదక్షిణ కోసం రమణాశ్రమం దగ్గరున్న వినాయకుడి గుడి ముందునుంచీ నడక ప్రారంభిస్తారు. ఆ మార్గంలో ఎన్నో తీర్థాలూ, క్షేత్రాలూ. ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి మాసంలోనూ పౌర్ణమినాటి రాత్రి వేలాది భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తారు.
అగ్నిలింగ ఆవిర్భావం
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మవిష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అది ఏనాటికీ తేలలేదు. ఓ రోజున ఒక పెద్ద జ్యోతి స్తంభం రూపంలో వారిముందు అవతరించింది. ఆ జ్యోతి అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి.. ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని అశరీరవాణి పలికింది. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని చూడటానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంస వాహనం ఎక్కి ఆ వెలుగు స్తంభం పైభాగాన్ని దర్శించడానికి బయలుదేరాడు. ఆ స్తంభం తుదీ మొదలూ అటు బ్రహ్మకు కానీ, ఇటు విష్ణుమూర్తికి కానీ అంతుపట్టలేదు. ఇద్దరూ బయలుదేరిన చోటికే వచ్చారు. తామిద్దరిలో ఎవరూ గొప్ప కాదనీ, తేజోమయమైన అగ్నిస్తంభమే గొప్ప అనీ ఆమోదించారు. తమ అహంకారాన్ని నశింప చేసినవాడు తేజోలింగ రూపుడైన శివుడేనని అర్థమైంది. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడున్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడన్నది నమ్మకం.
ఎన్నెన్నో అద్భుతాలు
అరుణాచలం అద్భుతాలకు నిలయం. పరమశివుడి గణాలలో భృంగి ప్రధాన సేవకుడు. భృంగికి శివుడి మీద మాత్రమే భక్తి. అందుకే ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుండేవాడు. ఓ రోజున భృంగి ప్రదక్షిణ చేసే సమయానికి అమ్మవారు, శివుడి ఎడమవైపు అతుక్కొని అర్ధనారీశ్వరిగా ఉన్నారు. భృంగి తేనెటీగ రూపాన్ని ధరించి అమ్మవారికి, అయ్యవారికి మధ్యన దూరిపోయి శివ ప్రదక్షిణను పూర్తి చేశాడు. అందుకు మెచ్చుకున్న శివుడు భృంగికి మోక్షం ఇవ్వబోయాడు.. అమ్మవారు వద్దని వారించారు. ఈ ప్రణయ కలహాన్ని అర్చక స్వాములు ఓ ఉత్సవంగా జరుపుతారు. అరుణాచల గోపురాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు. ఇక్కడున్న ఓ గోపురానికి కిరిగోపురం అని పేరు. దీన్ని భళ్లాల మహారాజు కట్టించినట్లు చెబుతారు. భళ్లాలుడు శివభక్తుడు. గొప్పదాత. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం కలగలేదు.
ఆ రాజును పరీక్షించేందుకు శివుడే స్వయంగా బయల్దేరాడు. కొంతమంది జంగమ దేవరలను వెంటపెట్టుకొని తాను కూడా జంగమయ్య వేషం వేసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. తమకు సేవ చేసేందుకు కొందరు దేవదాసీలు కావాలని రాజును కోరాడు జంగమయ్య. రాజు అలాగే పంపాడు. ఆ జంగమ దేవరలలో మిగిలిన వారికి రాజు పంపిన దాసీలందరూ సరిపోయారు. పెద్ద జంగమయ్యకు మాత్రం ఒక్కరూ మిగల్లేదు. దాంతో రాజు రెండో భార్య తానే దాసీగా వెళ్లింది. ఆమె వెళ్లేసరికి పెద్ద జంగమయ్య నిద్రపోతున్నాడు. ఆయనకు ఫలాలను సమర్పించే ఉద్దేశంతో తాకి లేపింది. రాణి ఆయనను తాకగానే పెద్ద జంగమయ్య పసిబాలుడిలాగా మారిపోయాడు. అప్పుడామె ఆ బిడ్డను ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. రాజు బిడ్డను తాకగానే బిడ్డ అంతర్థానమై పోయింది. రాజు, రాణి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు "ఓ రాజా నీవు బాధపడవద్దు. నేను నీకు కుమారుడిని. నీ మరణానంతరం నీకు అగ్ని సంస్కారాన్ని కూడా నేనే చేస్తాను' అని వరమిచ్చాడు. భళాల రాజు మరణానంతరం శివుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ నాటికి కూడా, రాజు పరమపదించిన రోజున అరుణాచలేశ్వరుడికి ఆ దుర్వార్తను వినిపిస్తారు. ఆ తర్వాత, ఆలయం తలుపులు మూసివేస్తారు. అనంతరం స్వామి భళ్లాల రాజు పాలించిన పళ్లి కొండపట్టు వెళతాడు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి, భళ్లాల రాజుకు ఆబ్దికం పెట్టిస్తారు. ఆ తర్వాత, ఉత్సవమూర్తి తిరిగి ఆలయానికి చేరుకుంటాడు. ఇవన్నీ అయ్యాకే భక్తులకు దర్శన భాగ్యం. ఇలాంటి స్థల పురాణ గాథలు భక్తలోకంలో విశేష ప్రచారంలో ఉన్నాయి.
- శ్రీమల్లి, 7382927069
No comments:
Post a Comment