
శృంగేరిలో పశ్చిమాన కేరే ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడున్నకొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నది. కోనేరు స్థానంలో ఇప్పుడు బస్ స్టాండ్ కట్టారు. చిన్న దేవాలయం అయినా చాలా అందంగా ఉంది. ప్రకృతి దృశ్యాలక మధ్య ఉంది. కేరే ఆంజనేయ స్వామిని దర్శించాలి అంటే 27 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. శృంగేరికి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ కేరే ఆంజనేయ స్వామిని దర్శించి , ఆ తర్వాత మిగతా దైవ దర్శనం చేస్తారు. ఆంజనేయస్వామి ఈ క్షేత్ర పాలకుడు కావటమే దీనిలోని విశేషం .
ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశాగా దర్శన మివ్వటం ఒక ప్రత్యేకత. స్వామి ఎడమ చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉంటాడు. కుడి చేయి అందరిని దీవిస్తున్నట్లు ఉండటం విశేషం. స్వామి వాలం శిరస్సు పైకి వ్యాపించి ఉంటుంది. తోక చివర చిన్న గంట కట్టి ఉంటుంది. కాలికి నూపురం ఉంటుంది. చేతికి కేయూరం ధరించి ఉంటాడు. ఆయన నేత్రాలు కృపా సింధువులై భక్త జనాల పై కరుణా కటాక్షాలు వర్షిస్తున్నట్లు విశాలంగా, తేజో పుంజాలను వేద జల్లేవిగా కనిపిస్తాయి .
కేరే ఆంజ నేయస్వామికి వైదిక మంత్రాలతో పూజ చేస్తారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శనివారాలలో కన్నుల పండుగగా దీపోత్సవం నిర్వహించటం ఇక్కడి రివాజు. ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు వరకు, సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు .
శృంగేరిలో జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది. కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి. ఋష్య శ్రుంగ మహర్షి తపస్సు చేసిన క్షేత్రం కనుక ఇది శృంగేరి అని ప్రసిద్ధి చెందింది .
No comments:
Post a Comment