సుగంధభరితం ఆ ప్రయాణం. సువర్ణ మిళితం ఆ లోకం. స్వర్గ లోకపు అంచు ఆ లోయ ప్రాంతం. మంచు తెరల మాటున రోజుకో వర్ణంలో సుమాల అందాల ఆరబోతే 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్'. ఉత్తరాఖండ్ నందాదేవి జీవ సంచితలో మలుపు. రంగురంగుల పూలను కప్పుకున్న ఆ పుష్ప లోయల్ని దేవకన్యల ఆట స్థలంగా అభివర్ణిస్తారు స్థానికులు. సుమ గంధాల్లో మునిగి వాటి మృదు స్పర్శల్లో అలసి పోయే ట్రెక్‌లకు ఇదే సరైన సమయం. దేవ కన్యలు విహరిస్తారో లేదో? కానీ, అక్కడకు వెళితే మాత్రం వారి ఆటల్లో పడేస్తుంది పూవుల్లో దాగున్న ఆ లోయ. రోజు రోజుకీ మారే సుమ వర్ణాల ప్రకృతి వైవిధ్య చిత్తరువు.
మృదువైన ట్రెక్..
అసలు ప్రయాణంలోని గొప్పదనమంతా ట్రెక్కింగ్‌లోనే ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో తప్పక చేయాల్సిన ట్రెక్కులో ఇది ఒకటి. కష్టంలేకుండానే ట్రెక్ సాగిపోవడం వల్ల దీన్ని వారు బిగినర్స్ ట్రెక్‌గా పిలుస్తారు. జోషిమఠ్ నుంచి గానీ, గోవింద్ ఘాట్ నుంచి గానీ, గంగురియా నుంచి గానీ ట్రెక్ ప్రారంభించొచ్చు. గంగురియా విడిదికి బాగుంటుంది. అక్కడ చాలా హోటళ్లు, లాడ్జిలు బసను కల్పిస్తాయి. గంగురియాలో సిక్కుల గురుద్వార్ చాలా అద్భుతంగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి నడుచుకుంటూ చాలా మంది సిక్కు భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనకు ఆహ్వానం తెలిపేవి కేవలం మైల్‌స్టోన్‌లు, సైన్‌బోర్డులే కాదు. మత్తెక్కించే సువాసనల్ని వెదజల్లుతూ అడవి గులాబీలు, మల్లెలు వంటివి స్వాగతం చెబుతాయి. రహదారికి ఇరువైపులా అడవి పళ్ల చెట్లు ఉంటాయి. జోషిమఠ్ దగ్గరలోని పట్టణం. అక్కడే శంకరాచార్యుల మఠం ఉంది. బద్రినాథ్ గుడి కూడా దగ్గరే. గోవింద్ ఘాట్ నుంచి అయితే 16 కిలోమీటర్ల ట్రెక్. హరిద్వార్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. ఢిల్లీ, హరిద్వార్, బద్రీనాథ్, డెహ్రాడూన్ నుంచి ఇక్కడకు రవాణా మార్గాలున్నాయి. ఢిల్లీ నుంచి 500 కి.మీ. ప్రయాణం. చమోలి, పౌరీ నుంచి కూడా గోవింద్ ఘాట్‌కు చేరుకోవచ్చు. హరిద్వార్ నుంచి 10 గంటల ప్రయాణం. ఋషీకేశ్ నుంచి రైలు మార్గం ఉంది. డెహ్రాడూన్‌లోని జాలీ గోరాంట్ విమానాశ్రయం ఉంది. అక్కడకు వాయు మార్గంలో చేరుకుని గోవింద్ ఘాట్‌కు రోడ్డు మార్గాన వెళ్లొచ్చు.
ఆగస్టే బెస్ట్
సెప్టెంబర్ నుంచి మే వరకు ఈ లోయ పూర్తిగా మంచు దుప్పటి చుట్టుకుంటుంది. మొక్కలన్నీ 8 నెలల సుధీర్ఘ శీతనిద్రావస్తలోకి జారుకుంటాయి. ఆ సమయంలో లోయకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. తిరిగి పచ్చదనం సంతరించుకునేది మే నెల చివరి వారంలోనే. అప్పటి నుంచే పర్యాటకులకు అనుమతి దొరుకుతుంది. అయితే, ఈ లోయ పూల అందాల్ని చూడాలంటే మాత్రం జూన్, జూలై, అగస్ట్‌లే సరైన మాసాలు. వైవిధ్యమైన వర్ణాల పూలతో లోయంతా ఏదో ఆబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. మంచు తెరలు వాటిని చుడుతూ కాంట్రాస్ట్‌ను పెంచి మరింత అద్భుతంగా లోయ చిత్రాన్ని మలుస్తాయి. మంచు పూర్తిగా కరిగి పాల నురుగు లాంటి సెలయేళ్లు, జలపాతాల్ని వీక్షించే అవకాశం ఉంటుంది. అవి ఎంత శ్వేత వర్ణంలో ప్రవహిస్తుంటాయంటే దూరం నుంచి చూసి మంచేమో అని భ్రమ కలుగుతుంది. విస్మయానికి గురిచేసే విషయమేమిటంటే ఇక్కడ రోజుకో విధంగా లోయ వర్ణం, ఆకృతి తోస్తుంది. ఒక్కో వృక్షజాతి మత్తు వదిలించుకుని తిరిగి పూలను విప్పార్చుకుంటాయి. వాటి నిద్ర వదిలే కాలంలోని తేడానే ఈ మహత్తును లోయకు కలిగిస్తుంది. జూలై, అగస్ట్ మాసాల్లోనైతే ఈ వైవిధ్యం, వైరుధ్యం ప్రతి పక్షం రోజులకు మారిపోతుంటుంది. అప్పుడు స్పష్టంగా అబ్బురమైన మార్పును గమనించొచ్చు.ఈ లోయ విన్యాసాలను చూడాలంటే రతబాన్ శృంగాల సన్నిధికి చేరాల్సిందే. అక్కడి శిఖరం నుంచి చూస్తే దాదాపు 14 కిలోమీటర్ల మేర లోయ అందాల్ని తనివితీరా వీక్షించొచ్చు. ఒక్కసారి అక్కడికి చేరితే తిరిగి వెనక్కురావాలని అనిపించదు. అటవీ అధికారుల కన్నుగప్పి అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనే ఆరాటం కచ్చితంగా మనసును లాగుతుంది.
వేలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో కేవలం పూలే కాదు వన్యమృగాలు అబ్బురపరుస్తాయి. అతి అరుదైన మంచు చిరుత ట్రెక్‌లో కనిపించొచ్చు. అక్కడి పర్వత మంటి రంగులో కలిసిపోయే దీన్ని ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఎర్ర నక్కలు, నీలి పొట్టేళ్లుఎలుగుబంట్లు వంటి వాటిని చూడగలిగే అవకాశం దొరకొచ్చు. ఇవన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. పూల మకరందాల్ని సేకరిస్తూ సీతాకోకచిలుకలు తీరికే లేకుండా భ్రమిస్తుంటాయి. వీటికి తోడు ఎన్నో రంగురంగుల పక్షులు వాటి కిలకిలరావాలతో సంగీతాన్ని అందిస్తాయి. మంచు పావురాలు, బంగారు గ్రద్దలు, మంచు కాకులు, భిన్న వర్ణాల పిచ్చుకలు వంటివి ఇక్కడ కనిపిస్తాయి. పరుగులు పెట్టించే బిజీ జీవితాల్లో మానసిక ప్రశాంతతకు, కాంక్రీట్ కీకారణ్యం నుంచి ఎస్కేప్‌కు, కృత్రిమ అందాల నుంచి తప్పించుకునేందుకు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ చక్కటి మజిలీ. నడక తెలీనివ్వని అందమైన ప్రయాణం. అది మిమ్మల్ని అదృశ్యం చేసేస్తుంది.. ప్రకృతే తోటమాలి పని చేసిన పూల స్వర్గానికి.
No comments:
Post a Comment