ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం... చంద్రోదయ దేవాలయం... మనదేశంలో రూపుదిద్దుకుంటోంది. కానీ, దాన్ని కట్టిస్తున్నది భారతీయుడు కాదు... ఓ విదేశీయుడు. ఆయనే ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ వారసుడు... అంబరీష ఉరఫ్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్.
బస్సులోనో రైల్లోనో వెళ్తుంటే మనం ఎలా వెళ్తామో, వెళ్లేదారిలో ఎలాంటి మలుపులు ఉంటాయో ముందే తెలుస్తుంది. కానీ, జీవన ప్రయాణం చాలా విచిత్రమైంది. అనూహ్యమైన మలుపులుంటాయి. అందుకు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ జీవితమే ఒక ఉదాహరణ.ఫోర్డ్... ఈ పేరు వింటే, ఫోర్డ్ కార్లే గుర్తుకొస్తాయి. హెన్రీ ఫోర్డ్... ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన కొడుకుల్లో ఒకరు ఎస్డెల్ ఫోర్డ్. ఆయన కొడుకే ఆల్ఫ్రెడ్ ఫోర్డ్.
చిన్నప్పట్నుంచీ ఆయనది రాజాలాంటి జీవితం. కష్టాలు తెలియవు... సుఖాలే తప్ప. కన్నీళ్లు తెలియవు... వేడుకలే తప్ప. కానీ, అవేవీ ఆయన్ను ఎక్కువకాలం సంతోషపెట్టలేకపోయాయి. ఆ జీవితంతో విసుగెత్తిపోయిన ఆయన కొత్తదనం కోసం వెతికారు. టావోయిజమ్, బౌద్ధం... ఇలా అన్ని ఇజాలూ చూశారు. కానీ, అవేవీ ఆయన్ను సంతృప్తిపరచలేకపోయాయి. అప్పటివరకూ భగవద్గీత అంటే తెలియని ఆయన మొదటిసారి గీతను చదివారు. అదీ... అంతర్జాతీయ కృష్ణ సమాజం (ఇస్కాన్) వ్యవస్థాపకులైన శ్రీలప్రభుపాదులు రచించింది.
ఆల్ఫ్రెడ్... అంబరీషుడయ్యాడు
'ఆ పుస్తకంలో శ్రీకృష్ణుణ్ణి ఒక గొప్పవ్యక్తిగా చిత్రించిన తీరు నాకు నచ్చింది. ముఖ్యంగా పురుషోత్తముడైన ఆయనతో మనందరికీ అనుబంధం ఉందని చెప్పిన తీరు ఆకట్టుకుంది. అప్పట్నుంచీ, నాక్కూడా శ్రీకృష్ణుడితో ఏదో అనుబంధం ఉన్న అనుభూతి కలిగింది. అలా నేను కృష్ణభక్తుణ్ణయిపోయాను. 1975లో ప్రభుపాదులను సందర్శించి హిందువుగా మారిపోయాను. అప్పుడే నా పేరును అంబరీష దాస అధికారిగా మార్చుకున్నాను. ప్రభుపాదుల సూచనతో శాకాహారినైపోయాను. మద్యం మానేశాను. నా ఆహారం నేనే వండుకోవడం మొదలుపెట్టాను. నేను ఏది తిన్నా ముందు... శ్రీకృష్ణుడికి అర్పించడం అలవాటుచేసుకున్నాను. జపమాలతో ధ్యానం చేసేవాణ్ణి' అని చెబుతారు
ఫోర్డ్.
ఫోర్డ్ 1975లో మొదటిసారి భారతదేశం వచ్చారు. ముంబై జుహూలోని శ్రీకృష్ణ మందిరంలోనే రెండునెలలు గడిపారు. తరవాత అమెరికా వెళ్లేసరికి ఆయన 48 కిలోలున్నారు. నీరసంగా తయారైన ఆయన్ను చూసి ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోయారు.
'నేను ఇక జీవితంలో ఇండియా వెళ్లననుకున్నారు మావాళ్లు. కానీ, అప్పుడే నేను భారతదేశంతో ప్రేమలోపడ్డాను' అంటారు ఫోర్డ్. మతమార్పిడి వల్ల మొదట్లో ఫోర్డ్‌కి ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అమ్మానాన్నలు చివరికి ఒప్పుకున్నారు.
ప్రభుపాదుల ఆజ్ఞతో...
ఆ తరవాత ఫోర్డ్‌కి అంతా కృష్ణమయం అయిపోయింది. మరుసటి ఏడాది డెట్రాయిట్‌లో పేద్ద భవంతిని కొని కృష్ణ మందిరంగా మార్చేశారు. వాళ్ల అమ్మానాన్నా దాని ప్రారంభోత్సవానికి వచ్చారు. ప్రభుపాదులు కూడా వచ్చారు. అప్పుడే ఆయన తన మనసులోని మాటను ఫోర్డ్‌తో చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉన్న శ్రీధామం... ఇస్కాన్ ప్రధాన కేంద్రం. అక్కడ అంతర్జాతీయస్థాయి దేవాలయాన్నీ, ప్లానెటోరియాన్నీ, వైదిక విజ్ఞాన కేంద్రాన్నీ నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారాయన. అప్పటికి ఫోర్డ్ మాయాపూర్‌ని చూడకపోయినా ప్రభుపాదుల కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు.
అలా ఆయన నిర్మించాలనుకున్నదే చంద్రోదయ దేవాలయం. కానీ, అదంత సులభంగా జరగలేదు. ఎప్పుడు దాని గురించి ఆలోచించినా ఏవో అడ్డంకులు. 2006 వరకూ దాని డిజైన్ కూడా సిద్ధంకాలేదు. ఆఖరికి 2010లో దాని నిర్మాణం మొదలుపెట్టారు. మరో మూడేళ్లలో అది పూర్తయిపోతుంది.
ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆలయానికి సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో దాదాపు రూ.300 కోట్లు ఫోర్డ్ అందిస్తున్నారు. మిగతా మొత్తాన్ని దాతల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తారు. 300 మంది కూర్చోవడానికి అనువుగా భారీ ప్లానెటోరియం కూడా అక్కడ నిర్మిస్తున్నారు.
జీవిత భాగస్వామితో...
ఫోర్డ్ జీవితం భారతదేశంతోనేకాదు... ఒక భారతీయురాలితోనూ ముడిపడింది.
1980లలో సిడ్నీలో ఆయన ఇస్కాన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ రథయాత్రలో పాల్గొన్నారు. అందులో పశ్చిమబెంగాల్‌కి చెందిన ప్రవాస భారతీయురాలైన షర్మిల పరిచయమయ్యారు. ఆమె కూడా కృష్ణుడి భక్తురాలు. ఇద్దరి ఆలోచనలూ, అభిప్రాయాలూ కలిశాయి. తరవాత మనసులూ కలిశాయి. అలా 1983లో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇద్దరమ్మాయిలు... అమృత, అనీష. పిల్లలు పుట్టాక ఫోర్డ్... అమెరికాలోని మియామీ నుంచి గెయిన్స్‌విల్లేకి వెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ ఉత్తర అమెరికాలోకెల్లా అతిపెద్ద కృష్ణ మందిరం ఉందనీ... తమ పిల్లలకు కృష్ణతత్వం బాగా అలవడాలనీ!
ఇప్పటివరకూ ఫోర్డ్ దంపతులు ఎన్నోసార్లు భారతదేశం వచ్చారు. ఇప్పుడూ ఎక్కువ సమయం భారత్‌లోనే గడుపుతున్నారు... 'చంద్రోదయ' పనులు చూసుకోవడానికి.
No comments:
Post a Comment