ప్రతి ఒక్క భారతీయుడు... తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రదేశాలలో రామేశ్వరం... మదురై... కన్యాకుమారి ఉంటాయి. కేవలం భక్తికే కాదు అద్భుత శిల్పకళకూ, తరతరాల భారతీయ సంస్కృతికీ చక్కని చిరునామాలు..ఈ ఆలయాలు. గర్భగుడులలోకి హైందవేతరులకు ప్రవేశం లేదన్న సంగతి తెలిసినా ఈ ఆలయాల సందర్శనకు పర్యాటకులు వస్తుంటారు. ప్రాకారాల్నీ, మండపాల్నీ చూసి మైమరచిపోతుంటారు.
హైందవ మతంలో కాశీయాత్రకు ఉన్నంత ప్రాధాన్యం రామేశ్వరానికి ఉంది. బంగాళాఖాతంలో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం. అక్కడి నుంచి శ్రీలంక చాలా దగ్గరలో వుంది. సముద్రంలో కట్టిన ఇందిరా గాంధీ రైల్వే బ్రిడ్జి రామేశ్వరం దీవిని మండపం రైల్వేస్టేషన్‌తో కలుపుతుంది. వయా డక్ట్‌గా రూపొందించిన ఈ రైల్వే బ్రిడ్జి భారతీయ ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటి. స్టీమర్లు, నౌకలు లాంటివి వచ్చినప్పుడు బ్రిడ్జి రెండుగా విడి పైకి లేస్తుంది. మధ్యలోనుంచి నౌకలు వెళ్లగానే మళ్లీ యథాస్థానంలోకి వస్తుంది.
రామేశ్వరం చాలా చిన్నవూరు. ఇక్కడ సముద్రం లోతూ, అలలూ తక్కువే. ఆలయ గోపురం 126 అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో అద్భుత శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడి గుడిలో 22 తీర్థాలు ఉన్నాయి. రామేశ్వరానికి వచ్చిన వాళ్లు ముందుగా ఇక్కడి తీర్థాల్లో స్నానం చేసి దైవదర్శనానికి వెళతారు. ఒక్కొక్క తీర్థం చిన్న బావిలా ఉంటుంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన లింగంగా రామనాథస్వామి వారిని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ద్రవిడ శిల్పకళారీతికి ఆలవాలమైన ఈ ఆలయం నిర్మాణంలో పన్నెండో శతాబ్ది నుంచి ఎంతో మంది రాజులు పాలు పంచుకున్నారు. ఆలయ మూడు ప్రాకారాల్లోనూ మూడ మండపాలు ఉన్నాయి. మూడో ప్రాకారంలోని మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటూ ఇటూ 1200 రాతిస్తంభాలతో సుమారు కిలోమీటరున్నర విస్తీర్ణంలో ఉన్న ఈ మండపం అతి పొడవైనదిగా పేరు తెచ్చుకుంది.
రామేశ్వరానికి 12కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోడిలో కోదండరామస్వామి ఆలయం ఉంది. 1964లో సంభవించిన భయంకరమైన తుపాన్‌కు ఊరు అంతా కొట్టుకుపోయినా ఈ గుడి మాత్రం చెక్కు చెదరలేదట. రాముడిని విభీషణుడు శరణు కోరిన ప్రదేశమనీ, శ్రీరాముడు లంకాపురికి ఇక్కడి నుంచే వారధి నిర్మించాడనీ చెబుతారు. గంధమాదవ పర్వతం మీద ఉన్న రాతి మీద ఉన్న చిన్న పాదముద్రలను శ్రీరాముడివని చెబుతారు.
అక్కడికి సమీపంలోనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం నివాసం ఉంది.
No comments:
Post a Comment