అనంత కల్పవల్లి
అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళిగా అమ్మవారి రూపాన్ని వర్ణించడం జరిగింది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళీశ్వరుని రూపం ఇక్కడ కనిపిస్తుంది. ఉజ్జయినిలో ఆ మహాకాళీదేవి హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందింది.
స్థల పురాణం ప్రకారం అంధకాసురుని వధించడానికి హరుడు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ రాక్షసునికి ఉన్న వరాల బలంతో మరణించకపోవడంతో మహంకాళిని పిలిచాడు శివుడు. ఆ తల్లి ప్రత్యక్షం అయి అంధకాసురుని సంహారానికి కారణం అయ్యింది. అలా రాక్షస సంహారం జరగాలన్న హరుని కోరిక సిద్ధింపజేయటం వలన ఆనాటి నుండి ఉజ్జయినీలోని మహాకాళిని ‘‘హరసిద్ధి’’ మాతగా కొలవటం ప్రారంభం అయ్యింది.
ఆ పరిసర ప్రాంతంలో ‘‘గడ్ కాళి’’ ఆలయం కూడా కనపడుతుంది. కొంతమంది ఈమెను మహాకాళిగా భావించటం కూడా కనిపిస్తున్నది. ఉజ్జయినీలో ఆ తల్లి రాత్రివేళ సంచరిస్తూ ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది.
ఉజ్జయినిలోనే కాళిదాస మహాకవికి నాలుక మీద వాశ్చీజాన్ని వ్రాసింది మహాకాళి.
విక్రమార్కుని ఇంటి ఇలవేల్పు ఉజ్జయినీ కాళి. విక్రమార్కుని అనుగ్రహించి వెయ్యేళ్ళు రాజ్యాధికారాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ప్రసాదించింది.
భర్తృహరి కవి కూడా ఉజ్జయిని కాళి కోసం తపస్సు చేసి ఆమె అనుగ్రహాన్ని పొందినవారని తెలుస్తున్నది. ఇప్పటికీ ఉజ్జయినిలో భర్తృహరి తపస్సు చేసిన గుహలు ఉన్నాయి.
నాథ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాథుడు కూడా ఉజ్జయిని కాళిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని; కాళీమంత్ర సిద్ధిని పొందటం జరిగింది. ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధుని సమాధిని కూడా స్థానికులు పూజించటం కనిపిస్తుంది.
ఇవాల్టికీ ప్రతిరోజు వేలమంది యాత్రికులు అక్కడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని ఆమె అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుంటున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు.
- మాతాజీ రమ్యానందభారతీ స్వామిని
No comments:
Post a Comment