తమిళనాడులోని వస్త్రపరిశ్రమకు కేంద్రంగా ఉన్న మదురై పెద్దనగరం. మీనాక్షి ఆలయం చుట్టూ నగరం అభివృద్ధి చెందిందని అంటారు. 150 అడుగులకు మించిన ఎత్తుతో ఉన్న నాలుగు ప్రధాన గోపురాల మధ్య ఆలయం ఉంది. ప్రతీ గోపురం మీదా లెక్కలేనన్ని శిల్పాలు ఇట్టే ఆకర్షిస్తాయి. అనంతమైన శిల్పసంపదకు అద్దంపట్టే ఈ గుడి ప్రపంచ వింతల్లో ఒకటి. తూర్పు దేశాల ఏథెన్స్ (ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్)గా పేరు తెచ్చుకుంది. నిజానికి సువిశాలమైన ఈ ఆలయాన్నే ఒక నగరంగా పేర్కొంటారు. ఆలయాన్నంతా చూడాలంటే కనీసం అయిదు గంటలైనా పడుతుందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న వేయిస్తంభాల మండపంలో ఎటు నుంచి చూసినా అన్ని స్తంభాలూ వరుసగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి మ్యూజియం సుమారు 1200 సంవత్సరాల గుడి చరిత్రనంతా కళ్ల ముందుకు తెస్తుంది.
అక్కడి నుంచి సుందరేశ్వరుని ఆలయానికి చేరుకుంటే సమీపంలోని మీనాక్షి ఆలయానికి వెళ్లినట్టే. అక్కడ మూడున్నర అడుగుల ఎత్తులో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివితీరదు.
No comments:
Post a Comment