కాఫీ తోటలు...
ఏలకుల పరిమళాలు...
నారింజ పండ్ల తోటలు...
జలపాతాలు...
కొండలతో దోబూచులాడే మేఘాలు...
పర్వతారోహకులకు అనువైన కొండలు...
ఇలాంటి చూడ ముచ్చటైన ప్రృతి అందాలు ఆ ప్రాంతం సొంతం.
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని ‘కక్కబె’ అనే గ్రామంలో ఈ రమణీయ దృశ్యాలు కొలువుదీరి ఉన్నాయి.
అంతేకాదు... ఆసియా ఖండంలోనే అత్యధిక పరిమాణంలో తేనె ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా కూడా ఈ కక్కబెకు మరో రికార్డు ఉంది.
ఓ చిన్న గ్రామం ఇది...
ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా తేనె తుట్టెలే దర్శనమిస్తాయి. దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతం ఓ కుగ్రామమైనప్పటికీ... స్టార్ హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా ఇక్కడున్నాయి. కాఫీ తోటల్లో ఉన్న పురాతన బంగళాలు... ప్రస్తుతం స్టే హోంలుగా సేవలందిస్తున్నాయి.
కొడగు ప్రజల సంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉండే కాఫీ తోటల్లో విహరిస్తూ... రమణీయమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉంటే... కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదంటారు పర్యాటకులు. కాఫీ తోటలతో పాటు... ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న తడియాండల్ కొండలు పర్వతారోహకులకు స్వర్గధామాలు. ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో శిఖరం నుంచి చూస్తే అరేబియా సముద్రం ప్రత్యేక అందాలను సంతరించుకుందా అనిపిస్తుంది. కక్కబెకు సమీపంలో ఉన్న సల్నాడ్ రాజప్రాసాదం మరో ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని పాలించిన దొడ్డవీరరాజు ఈ రాజప్రాసాదాన్ని నిర్మిం చినట్టు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నాటి ఈ ప్యాలెస్‌ను చూసేందుకు పర్యాటకులు విశేషంగా వస్తారు.
ఇలా ఎలా వెళ్లాలి...
బెంగళూరు, మైసూరు నగరాల నుంచి మడికెరెకు బస్సు సదుపాయం ఉంది. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కక్కబె చేరుకోవచ్చు. ప్రైవేట్ బస్సులు, టాక్సీల సదుపాయం కూడా ఉంది. ఈ గ్రామంలో ఉన్న హోంస్టేలు, రిసార్టులు, హోటళ్లలో బస చేసేందుకు రోజుకు వెయ్యి నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తారు.
No comments:
Post a Comment