డార్జిలింగ్, సిక్కిం రాష్ట్రాల్లోని పెల్లింగ్, నాథులాపాస్, కంచనజంగా, లాచెన్, లాచుంగ్ హిమాలయాల సందర్శనకు బయలుదేరాం. మా యాత్ర మొత్తం పదిహేనురోజులు. దిల్లీ చేరుకుని, అక్కడ నుంచి బాగ్దోగ్రాకి విమానంలో వెళ్లాం. అక్కడనుంచి మా టూర్ నిర్వాహకులు పంపిన టాక్సీలో డార్జిలింగ్‌కు చేరుకున్నాం. డార్జిలింగ్, సిక్కిం పర్యటనలు ముగిశాక, ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాలైన లాచెన్, లాచుంగ్ హిమాలయాల సందర్శనకు బయలుదేరాం.
గాంగ్‌టక్ నుంచి లాచెన్ చేరడానికి ఆరుగంటల సమయం పట్టింది. దారిలో సింఘిక్ గ్రామంలో దిగి ఓ వ్యూ పాయింట్ నుంచి కంచనజంగా, సినియోల్‌చు హిమనగాల సొగసుని చూసి ఆశ్చర్యపోయాం. ఆ గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు దాటాక, లోతైన లోయగుండా ప్రయాణం సాగింది. తీస్తానదిమీద ఉన్న వూగే వంతెన దాటగానే తీస్తా- రాంగ్‌యుంగ్‌చు నదీ సంగమ ప్రదేశం వద్దకు వెళ్లాం. ఈ రెండు నదులూ ఒకటైపోయేది ఎప్పుడెప్పుడా అన్నట్లు వేగంగా పరవళ్లు తొక్కే దృశ్యం మమ్మల్ని చూపు తిప్పుకోనీయలేదు. మళ్లీ గోతులమయమైన దారి గుండా చుంగ్‌థాంగ్ అనే మరో చిన్న పట్టణానికి చేరుకున్నాం. ఇది ఉత్తర సిక్కింలోని మరో ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నుంచి దారి రెండుగా చీలుతుంది. ఎడమవైపుగా ప్రయాణిస్తే లాచెన్, కుడివైపుగా ప్రయాణిస్తే లాచుంగ్ చేరతాం. ఛోప్తాలోయ, గురుదంగ్‌మార్ సరస్సుకు వెళ్లాలంటే లాచెన్‌లో బస చేయాలి. యుమ్‌థాంగ్‌లోయ, జీరోపాయింట్‌లకు వెళ్లాలంటే లాచుంగ్‌లో బస చేయాలి. ఈ రెండు చోట్లకూ వెళ్లాలంటే యాత్రికులు టూర్ ఏజెన్సీల సాయంతో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ప్రాంతాలు భారత్- చైనా సరిహద్దుకి అతి దగ్గరగా ఉన్నాయి. అక్కడ పర్యటించాలంటే రక్షకదళం లేదా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. పర్మిట్లనూ ఐడీకార్డులనూ ఆర్మీ చెక్ పోస్టుల దగ్గర తనిఖీ చేసి మాత్రమే ముందుకు అనుమతిస్తారు.
లాచెన్‌లో...
మేం ముందుగా లాచెన్‌కు బయలుదేరాం. ఉత్తర సిక్కిం జిల్లా జనసందోహానికి చాలా దూరంగా ఉండటంవల్ల ప్రకృతి దృశ్యాలు స్వర్గాన్ని తలపిస్తాయి. లాచెన్‌కు వెళ్లే దారిలో ఒక్క వాహనాన్ని కూడా మేం చూడలేదు. దారిలో మేం ఏడుగురు అక్కాచెల్లెళ్ల జలపాతాలు, నాగా జలపాతాల దగ్గర ఆగి ఆ సుందర దృశ్యాలను చూశాం. దారంతా గుంతలమయం. ఎక్కడా రోడ్డే ఉండదు. గాంగ్‌టక్ నుంచి మొత్తం 120 కిలోమీటర్ల దూరాన్నీ మా నేపాలీ డ్రైవర్ కేవలం బ్రేకులూ క్లచ్‌లూ కొడుతూ 5-10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిపాడు. రాత్రి ఆరున్నర గంటలకు మా బసను చేరుకున్నాం. ఉష్ణోగ్రత -6 డిగ్రీలకు పడిపోయింది. అర్ధరాత్రికి -10 డిగ్రీలకు పడిపోతుందని చెప్పారు. హోటల్ సిబ్బంది రెండుసార్లు వేడివేడి టీ ఇచ్చి మమ్మల్ని సేదతీర్చారు. గదుల్లో హీటర్లు పెట్టడానికి అనుమతి లేదు. ఒకవేళ పెడితే ఐదువేల రూపాయల జరిమానా కట్టాలి. లాచెన్‌లో స్థానికుల ఇళ్లు చాలా తక్కువ. హోటల్స్ ఉన్నప్పటికీ సౌకర్యాలు ఉండవు. అద్భుత హిమ సౌందర్యాన్ని చూడాలన్న సంకల్పం ఉన్నవాళ్లే అక్కడకు వెళ్లగలరు. మా గది బాల్కనీలోంచే లాచెన్ చూ నదీ ప్రవాహ పరవళ్ళూ హిమశిఖర శ్రేణులూ మాకు కనువిందు చేశాయి.
ఆక్సిజన్ శాతం చాలా తక్కువ...
తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రయాణం. ఛోప్తా లోయ దాటి గురుదంగ్‌మార్ సరస్సు చేరడానికి ఆర్మీవారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారు. ఆ ప్రాంతం సముద్రమట్టానికి 17,100 అడుగుల ఎత్తులో ఉన్నందున ఆక్సిజన్ శాతం చాలా తక్కువ. ఉదయం 10 గంటల తరవాత వాతావరణం అతి భయానకంగా ఉంటుందట. కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు కమ్మేస్తుంది. ఓ పక్క చలి తీవ్రత, మరోపక్క వేగంగా వీచే గాలులతో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అందుకే తెల్లవారుజామున మూడు గంటలకే లేచి తయారై హోటల్ వాళ్ల నుంచి ఫ్లాస్క్ తీసుకుని, నిండా వేడి నీళ్లు నింపుకుని, గ్లోవ్సూ ఉన్నికోట్లూ టోపీలూ వేసుకుని బయలుదేరాం. అలా మూడు గంటలపాటు 30 కిలోమీటర్లు ప్రయాణించి ధంగూ అనే గ్రామం చేరుకున్నాం. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్‌లో అల్పాహారం, టీ తీసుకుని తిరిగి మా ప్రయాణం కొనసాగించాం.
రోడోడెండ్రాన్ చెట్లూ చంద్రకాంత మొక్కలతో ఛోప్తాలోయ పచ్చగా కనిపించింది. ఏప్రిల్-మే నెలల్లో ఈ ప్రాంతం అంతా తెల్లని మంచుతో నిండిపోతుంది. ఆ సమయంలోనే గులాబీ, ఎరుపు రంగుల్లో రోడోడెండ్రాన్ పూలు విరగబూసి పూలలోయని తలపిస్తాయి. అందులోనూ ఆ రోజు రాత్రే మంచువర్షం కురియడంతో పచ్చని చెట్లమీద తెల్లని మంచుపూలు పుష్పించినట్లున్న దృశ్యం మరింత అందంగా ఉంది. సగం మంచుతో గడ్డకట్టీ, సగం స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో తీస్తానది ఛోప్తాలోయలో మెలికలు తిరుగుతూ ప్రవహించే దృశ్యం కళ్లను కట్టిపడేస్తుంది. వీటన్నింటి వెనకగా వెండికొండల్ని తలపించే హిమశిఖరాలూ వాటి నుంచి ఉరికే జలపాత సంగీతం మనల్ని మరోలోకంలో విహరింపజేస్తాయి. నలుపు, తెలుపు రంగుల్లోని జడలబర్రెలు అక్కడక్కడా గుంపులుగా గడ్డిమేస్తూ కనిపిస్తాయి.
నీలాల సరస్సు చెంతన...
ఛోప్తా లోయ దాటాక దారి కాస్త మెరుగైంది. ఆర్మీ అవసరాలకోసం నిర్మించిన ఆ రోడ్డులో చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేసి, మా వయసుని దృష్టిలో పెట్టుకుని సరస్సు దగ్గర ఎక్కువసేపు ఉండొద్దని హెచ్చరించారు. మెల్లగా మా వాహనం ఎత్తైన కొండమీదికి చేరింది. సరస్సు దగ్గరకు వచ్చేశామన్న ఆనందంతో వాహనంలోంచి దిగేసరికి చలిగాలి ఈడ్చి కొట్టింది. ఆ వేగానికి నిలబడటమే కష్టమైంది. సమయం ఉదయం 9 గంటలు. మూడువంతులు మంచుతో గడ్డ కట్టి, ఓ వంతు మాత్రం నీలివర్ణపు నీళ్లతో మెరుస్తోన్న సరస్సు వైపు చూసి చకితులమయ్యాం. దానికి పక్కనే బౌద్ధగురువు పద్మసంభవుని ఆరామం, దాని చుట్టూ రంగురంగుల జెండాలు రెపరెపలాడుతూ ఆ సందేశాలను టిబెట్‌కి చేరుస్తున్నట్లున్నాయి. గురుదంగ్‌మార్ సరస్సులోని పవిత్ర జలాలను సేవిస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఓ గంటసమయం పాటు ఆ సరస్సు అందాలను కెమెరాలో బంధించాక చివరకు మా వేళ్లు పనిచేయకపోవడంతో ఇక అక్కడ ఉండటం ప్రమాదకరం అని గ్రహించుకుని కారెక్కి వెనుతిరిగాం. చేతివేళ్లు బాగా నొప్పెట్టసాగాయి. ధంగూలోని ఓ హోటల్‌లో మంట దగ్గర చేతులు కాపుకున్నాకగానీ అవి యథాస్థితికి రాలేదు. పెదాలు పగిలి రక్తంకారుతూ కనిపించాయి. అక్కడివాళ్లు నెలకోసారి మాత్రమే స్నానం చేస్తారని ఆ హోటల్ వాళ్లు చెప్పారు. జనవరి నెలలో ఇక్కడ ఉండటానికి వీలుకాని పరిస్థితిలో వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసపోతారట. ఇక్కడవాళ్లు గుర్రాలూ, కొండగొర్రెలూ, జడలబర్రెలూ పెంచుతారు. జడలబర్రెల పాలనుంచి వెన్న, కోవా... వంటివి తయారుచేసి విక్రయిస్తారు. మరే వృత్తులకూ ఈ ప్రాంతం అనుకూలం కాదు. మేం ధంగూ నుంచి లాచెన్ చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. ఆ రోజు అక్కడే బస చేశాం.
లాచుంగ్‌లో... యుమ్‌థాంగ్‌లోయలో...
లాచెన్ నుంచి లాచుంగ్ 45 కిలోమీటర్లు. ఆ రోజు హోటల్‌లో బస చేసి, తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరి యుమ్‌థాంగ్ లోయకు వెళ్లేసరికి ఓ గంట సమయం పట్టింది. ఆ లోయలో తీస్తానది వెంబడే ఉన్న బౌద్ధుల రంగురంగుల జెండాల రెపరెపల ధ్వని వీనులవిందుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలున్నాయి. వాటిల్లోని సల్ఫర్ కారణంగా చర్మసంబంధ రుగ్మతలు మాయమవుతాయని అంటారు. యుమ్‌థాంగ్ లోయ నుంచి చూస్తే పౌహురి, సుందుసెన్‌పా హిమశిఖర శ్రేణులు చూపుని మరల్చనీయవు. ఆ లోయ అందాలు చూస్తూ ముందుకి ప్రయాణించేకొద్దీ పచ్చని చెట్లు కనుమరుగై కొండలూ గుట్టలే కనిపించసాగాయి. కొంతదూరం వెళ్లాక హిమగిం¹ుల శ్రేణి మా కళ్లముందు సాక్షాత్కరించింది. అదే జీరోపాయింట్. ఉదయించే భానుడి కిరణాలు తాకి హిమగిం¹ులు వెండికొండల్ని తలపిస్తున్నాయి. వాటినుంచి మంచు కరిగి చిన్న ప్రవాహాలుగా మారి లోయలోకి చేరి తీస్తానదిగా పరుగులు తీస్తుంది.
తీస్తానదీ పాయమీద చిన్న చిన్న కొయ్యలతో కచ్చా వంతెన కట్టారు. దాన్ని దాటుతూ వంతెనమీద ఉన్న కొయ్యలు కదలడంతో ఒకతను జారి నీటిప్రవాహంలో పడిపోయాడు. ఓ క్షణం గుండె ఆగిపోయింది. వెనక ఉన్న వాళ్లు వెంటనే అప్రమత్తమై వేగంగా స్పందించి అతన్ని నీళ్ల ప్రవాహంలోంచి బయటకు లాగారు. దాంతో మేం కూడా చాలా జాగ్రత్తగా ఆ కొయ్య వంతెన దాటాం. అది దాటి హిమశిఖరాలపైకి ఆయాసపడుతూ చేరాం. ఫర్లాంగులకొద్దీ స్వచ్ఛంగా మెరిసే మంచుమీదా అక్కడక్కడా లోపలికి కూరుకుపోయే మంచుగుట్టలమీదా భయంభయంగా నడుస్తూ ఆ ప్రాంతం అంతా తిరిగాం. డ్రైవర్ హెచ్చరికతో మళ్లీ ఆ కొయ్య వంతెన జాగ్రత్తగా దాటి వచ్చి అక్కడ ఉన్న గుడారాల్లోని స్టాల్స్‌లో టీ తాగుతూ మరోసారి ఆ హిమశిఖర సౌందర్యాన్ని ఆసాంతం వీక్షించాం. మా వాహనం దగ్గరకు వచ్చేసరికి కొండగొర్రెలు కనిపించాయి. అవి మమ్మల్ని చూసి భయంతో కొండ అంచులకు చేరి అక్కడ నుంచి మమ్మల్ని బెదురుచూపులు చూడటం మాకెంతో నవ్వు తెప్పించింది. ఆ హిమశిఖరాలను మళ్లీ మళ్లీ చూస్తూనే వెనుతిరిగి లాచుంగ్‌కీ అక్కడ నుంచి గాంగ్‌టక్‌కు చేరుకుని ఇంటికి తిరిగొచ్చాం.
No comments:
Post a Comment