పచ్చని కొండలూ దట్టమైన అడవులూ ఉరికే జలపాతాలూ గలగలా పారే నదీప్రవాహాలూ స్వచ్ఛమైన నీలి సరస్సులూ వాటి నడుమ విరిసిన ఆధ్యాత్మిక క్షేత్రాలూ... ఇలా ఎన్నో సుందర ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్. ప్రకృతిప్రేమికులనూ భక్తులనూ అమితంగా ఆకర్షించే అక్కడి కొండప్రాంతాల విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పులిపాక సాయినాథ్.
లాన్స్‌డౌన్, జిమ్‌కార్బెట్... ఈ పేర్లు వినగానే ఇవేవో విదేశాల్లో ఉన్నాయేమో అనుకుంటాం. కానీ ఇవి మనదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని నైనీతాల్, మసూరీ, రిషికేశ్, హరిద్వార్... ప్రాంతాలు ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందాయి. లాన్స్‌డౌన్, జిమ్‌కార్బెట్... కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ రెండూ కూడా తప్పక చూడదగ్గ ప్రదేశాలని తెలుసుకుని మేమంతా హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకి విమానంలో బయలుదేరి 11 గంటలకు దిల్లీ చేరుకున్నాం. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలనూ చూడ్డానికి కారు బుక్ చేసుకున్నాం.
దిల్లీ నుంచి నేరుగా డెహ్రాడూన్ మీదుగా మసూరీకి బయలుదేరాం. ఘజియాబాద్, ముజఫర్‌నగర్, మీరట్, రూర్కీ మీదుగా సాయంత్రానికి డెహ్రాడూన్‌కి చేరుకున్నాం. ఈ నగరం ఉత్తరాఖండ్ రాజధాని. అక్కడ నుంచి మసూరీకి 35 కిలోమీటర్లు. అయితే అది పూర్తిగా ఘాట్‌రోడ్డు. అన్నీ మలుపులే. కొండ ఎక్కుతూంటే మేం ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ రాత్రికి మసూరీలోనే బస. రాత్రివేళలో పై నుంచి చూస్తే కింద ఉన్న దీపాలు నీలాకాశంలోని చుక్కల్లా కనిపించాయి.
అక్కడి వాతావరణం కట్టిపడేసింది...
ఉదయం లేవగానే సన్నటిజల్లు పడుతూ ఉంది. బయటకు వచ్చి చూస్తే మేఘాల పైన ఉన్నామా అనిపించింది. మసూరీ పెద్ద పట్టణం కాదు కానీ, సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చూడచక్కని హిల్‌స్టేషన్. ప్రకృతిమాత పచ్చకోక కట్టుకున్నట్లుగా ఎటుచూసినా పచ్చనివృక్షాలే. అక్కడి కొండల్నీ గుట్టల్నీ అలాగే ఉంచి ఆ ఎత్తుపల్లాల్లోనే భవనాలను నిర్మించారు. ఇందులో ఎక్కువ భాగం హోటళ్లే కావడం విశేషం. దగ్గరలో 16 కిలోమీటర్ల దూరంలో కెంప్టీ ఫాల్స్ జలపాతం ఉంది. ఇక్కడ కొండల మధ్య సహజంగా ఏర్పడ్డ జలపాతాలూ సరస్సులూ చూసితీరాల్సినవే. దర్శనీయ స్థలాలు ఎక్కువగా లేకున్నా ఇక్కడి ఆహ్లాదకరమైన
వాతావరణం సందర్శకులను రారమ్మని పిలుస్తుంటుంది. రెండురోజులపాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడే ఉండి తరవాత రిషికేశ్, హరిద్వార్‌లకు ప్రయాణం అయ్యాం. మసూరీ నుంచి హరిద్వార్‌కు 105 కిలోమీటర్లు. డెహ్రాడూన్ మీదుగానే వెళ్లాలి. ఉదయం 11 గంటలకు రిషికేశ్ చేరుకున్నాం. అప్పుడు అక్కడ కావడ్ అనే భక్తుల దీక్షా యాత్ర నడుస్తోంది. ఈ కారణంగా రోడ్లూ, స్నానఘట్టాలు అన్నీ వాళ్లతోనే నిండి ఉన్నాయి. రిషికేశ్‌లో లక్ష్మణ్‌ఝూలా దాటి వెళ్లి పవిత్ర గంగానదికి ప్రణమిల్లి స్నానం చేసి దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకున్నాం. గంగానది పరవళ్లు తొక్కుతూ వేగంగా ప్రవహిస్తోంది. అక్కడి హస్తకళల షాపుల్లో వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. పాలరాయి, పంచలోహాలతో చేసిన దేవతా విగ్రహాలు చాలా బాగున్నాయి. వాటి ధరలు కూడా లక్షల రూపాయల్లో ఉన్నాయి. అక్కడినుంచి 37 కి.మీ.దూరంలోని హరిద్వార్‌కి వెళ్లాం. హరిద్వార్‌లో గంగమ్మతల్లికి దండంపెట్టుకుని దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో కాసేపు తిరిగి, లాన్స్‌డౌన్‌కి బయలుదేరాం. ఇది హరిద్వార్ నుంచి 110 కిలోమీటర్లు. మూడు గంటల ప్రయాణం.
ఆనందం అనిర్వచనీయం!
మా ప్రయాణంలో ఎక్కువభాగం గంగానది వెంబడే సాగిందని చెప్పాలి. రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నా రెండువైపులా బ్రహ్మాండంగా పెరిగిన పచ్చగడ్డీ, దానికి ఆవలివైపున కాలువ నయనానందాన్ని కలిగించాయి. నజీబాబాద్ దాటాక మళ్లీ ఘాట్‌రోడ్డు ప్రయాణం. రోడ్డుకి ఒకవైపున పెద్ద లోయ. లోయంతా పచ్చని చెట్లూ జలపాతాలతో నిండి ఉంది. సాయంత్రానికి లాన్స్‌డౌన్‌లో బుక్‌చేసుకున్న హోటల్లో దిగాం. బాల్కనీ నుంచి చూస్తే ఎదురుగా లోయలూ...వాటిమీద దట్టమైన పొగమంచూ... తలుపులు తెరిస్తే చాలు... మేఘాలు లోపలికి వచ్చేస్తుంటాయి. అవి అలా వస్తుంటే మా ఆనందం అనిర్వచనీయం. ఆ కొండల్లో అక్కడక్కడా నివాసం ఏర్పరచుకున్న ఓ 50 ఇళ్లు ఓ వూరిలా కనిపిస్తాయి. సాయంకాలంవేళ ఘాట్‌రోడ్డులో రెండు కిలోమీటర్లు నడిచాం. తిరిగి వస్తూ అక్కడ కూర్చున్న ఓ పదిమంది స్థానికులను పలకరించాం. ఓ నాలుగు కిలోమీటర్లు పైకి పోతే ఓ బజారు ఉందట. అక్కడే ఓ స్కూలు కూడా ఉందనీ, పిల్లలు ప్రైవేటు వాహనంలో వెళ్లి వస్తారనీ చెప్పారు. అనారోగ్యం పాలైతే 40 కిలోమీటర్ల దూరంలో కింద ఉన్న కోట్‌ద్వారకి వెళ్లి చూపించుకుంటామని చెప్పారు. అక్కడివాళ్లలో ఎక్కువభాగం ఆర్మీలో పనిచేస్తారట.
మర్నాడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి లాన్స్‌డౌన్ బజారుకి వెళ్ళాం. ఇది ఆర్మీ హెడ్ క్వార్టర్స్. దీన్నే సదర్ బజార్ అనీ గాంధీ చౌక్ అనీ అంటారు. ఒకటే బజారు. ఇక్కడంతా ఆర్మీ జవాన్లు తిరుగుతుంటారు. వాళ్ల కార్యాలయాలూ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి. కానీ ఎక్కడకు వెళ్లాలన్నా కొండ పైకన్నా వెళ్లాలి, లేదా కిందకన్నా దిగాలి. ఇక్కడ కొండలమధ్య సహజంగా ఏర్పడ్డ సరస్సు భుల్లాతాల్ అని ఉంది. సరస్సులో పడవెక్కి షికారుకి కూడా వెళ్లవచ్చు. పక్కనే పిల్లలకి ఝాలా పార్కు కూడా ఉంది. ఆ సరస్సులో ఇటు నుంచి అటు దాటడానికి ఇనుప రెయిలింగ్ ఉన్న ఓ వంతెన ఉంది. ఒకసారికి పదిమంది మాత్రమే వెళ్లాలి అని చెప్పారు.
అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు పైకి పోతే లాన్స్‌డౌన్ వ్యూ పాయింట్ ఉంది. దాని పేరు టిప్ ఇన్ టాప్. ఈ ప్రదేశం అత్యంత ఎత్తైన ప్రదేశం. దీని ఎత్తు దాదాపు ఆరు వేల అడుగులు. అక్కడినుంచి చుట్టూ ఉన్న శివాలిక్ పర్వతశ్రేణుల్నీ వాటిమధ్యలోని పచ్చని లోయల్నీ కళ్లు విప్పార్చుకుని మరీ చూశాం. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అడ్డదారిలో 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే చైనా వస్తుందని చెప్పారు స్థానికులు. టిప్ ఇన్ టాప్ నుంచి కిందకి దిగుతుంటే మధ్యలో ఆంగ్లేయుల కాలం నాటి సెయింట్ మేరీ చర్చి ఒకటి వచ్చింది. అది చూశాక, దగ్గరలోనే ఉన్న మిలటరీ వాళ్ల దర్వాన్‌సింగ్ మ్యూజియంలోకి వెళ్లాం. పాతకాలంనాటి ఆర్మీకి సంబంధించిన వస్తువులను భద్రపరిచారక్కడ. నాలుగురోజులపాటు విశ్రాంతి తీసుకోవాలనుకునే వాళ్లకి ఇది చూడచక్కని విడిది. చూడాలనుకునేవాళ్లు ఇక్కడకు దగ్గరలో ఉన్న తారకేశ్వర్ మహదేవ్ ఆలయాన్నీ దుర్గాదేవి ఆలయాన్నీ కణ్వాశ్రమాన్నీ చూసి రావచ్చు. మేం ఆ పచ్చని ప్రకృతిలోనే రెండు రోజులు గడిపి అక్కడకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కార్బెట్‌కి బయలుదేరాం.
జిమ్‌కార్బెట్‌కి ముందు వూరైన రాంనగర్ వరకూ రైలు సౌకర్యమూ ఉంది. అక్కడి నుంచి జిమ్‌కార్బెట్ పార్కు 16 కిలోమీటర్లు. సాయంత్రానికి అక్కడకు చేరుకున్నాం. అది పూర్తిగా అరణ్య ప్రాంతం. జిమ్‌కార్బెట్ ఓ ఆంగ్లేయ దొర. మంచి వేటగాడు. పులుల సంరక్షణకోసం అభయారణ్యాన్ని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించడంతో ఆయన పేరునే పెట్టారు. సుమారు 1300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీన్ని కార్బెట్ టైగర్ రిజర్వ్ అనీ జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు అనీ పిలుస్తారు. ఇక్కడ దాదాపు 300 పైగా పులులు ఉన్నాయట. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ హోటళ్లూ రిసార్టులతోబాటు ప్రైవేటువి కూడా ఉన్నాయి. వాటిల్లో ఉన్నప్పటికీ అడవిలో ఉన్న భావనే కలుగుతుంటుంది. చుట్టూ దట్టమైన వృక్షాలూ పక్షుల కిలకిలారావాలతో మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ అడవి గుండా గంగానది ఉపనది అయిన కోసీ ప్రవహిస్తూ ఉంటుంది. మేం బసచేసిన రిసార్టు ముందు కూడా కోసీ నది ప్రవహిస్తుండటంతో ఆ ప్రదేశం మాకెంతో నచ్చింది.
అడవిలో ఆటవిడుపు
అటవీ అధికారుల అనుమతితో సఫారీకి వెళ్లవచ్చు. ఫొటో గుర్తింపుకార్డులు తప్పనిసరి. అటవీశాఖ ఆరు సఫారీ జోన్లనూ వాటికి గేట్లనూ ఏర్పాటుచేసింది. మమ్మల్ని ఆరోజు ఝిర్నా గేటు ద్వారా లోపలకు పంపారు. ప్రైవేటు జిప్సీ జీపులు కూడా తిరుగుతుంటాయి. వీటి ధరలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. సఫారీ సాహసభరితంగానూ థ్రిల్లింగ్‌గానూ అనిపించింది. ఈ జీపులను నదులూ కొండలూ గుట్టలూ బండరాళ్లూ ఎక్కించి నడుపుతారు. ప్రతి జీపులో ఓ గైడ్ కూడా వచ్చి అన్నీ వివరంగా చెబుతారు. ఎక్కడైనా జింకలూ ఏనుగులూ పులులూ కనిపిస్తే ఆపి చూపిస్తారు. అలా అడవిలోకి తీసుకుని వెళ్లాక, మధ్యలో ఓ పావుగంట విశ్రాంతి తీసుకోనిస్తారు. తిరుగు ప్రయాణం మరోదారిలో ఉంది. పులులసంఖ్య బాగానే ఉన్నా మనం వెళ్లినప్పుడు అవి కనిపించడం అనేది మన అదృష్టం. తరవాత కోసీనది అవతలి వైపు ఉన్న గార్జియా మాత ఆలయానికి వెళ్లాం.
సరస్సుల నగరం
మర్నాడు జిమ్‌కార్బెట్ పార్కుకి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనీతాల్‌కి వెళ్లాం. సుమారు మూడు గంటలు ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం. ఈ నగరం ఎప్పుడూ చల్లని పొగమంచుతో నిండి ఉంటుంది. కొండలమధ్య ఉన్న ఇక్కడి లోయల్లో మొత్తం తొమ్మిది సరస్సులు ఉన్నాయి. నైనీతాల్, భీమ్‌తాల్, నౌకుచియతాల్, సత్తాల్, ఖుర్పాతాల్, సడియాతాల్... మొదలైనవి. అందువల్లే దీనికా పేరు. దీన్ని ‘లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా’ అని కూడా అంటారు. ఈ సరస్సులలో రంగురంగుల పడవల్లో హాయిగా విహరించవచ్చు. దక్షయజ్ఞంలో మృతిచెందిన సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయనీ అవే నయన్ సరస్సుగా ఏర్పడ్డాయనీ కూడా చెబుతారు. ఈ ప్రాంతాన్ని 64 శక్తిపీఠాల్లో ఒకటిగానూ పేర్కొంటారు. ఈ సరస్సు ఒడ్డునే నైనాదేవి ఆలయం ఉంది. అప్పుడే తిరిగి రావాలనిపించకపోయినా మర్నాడు కార్బెట్ నుంచి దిల్లీకీ అక్కడినుంచి సాయంత్రానికి హైదరాబాద్‌కి చేరుకున్నాం.
No comments:
Post a Comment