ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే జల విహారం
పాపికొండల యాత్ర రమణీయం
అడవిలో ప్రకృతి మధ్య జలపాతాల నడుమ విహారం అద్భుతం
ప్రకృతి సంపదకు నెలవు ఆంధ్రప్రదేశ్, గలగలపారే గోదావరి, కృష్ణ నదులు, పచ్చని పొలాలు, ఆకుపచ్చని కొండలు విహార పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అరకు, బాపట్ల వద్ద ఉన్న సూర్యలంక బీచ్‌లలో ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను సిద్ధం చేసిన టూరిజం సంస్థ పాపికొండలకు బోట్ షికార్ నిర్వహిస్తున్నది. రాజమండ్రి లేదా పోలవరం నుంచి గోదావరిలో బోటులో పర్యటిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, జల విహారం చేస్తూ జీవితంలో కొత్త అనుభూతులను పొందవచ్చు.
రామాయణం ప్రకారం అయోధ్య రాముడు అరణ్యవాసం సందర్భంగా దండకారణ్యంలో భాగంగా ఉన్న భద్రాచలం ప్రాంతంలో కుటీరం ఏర్పాటు చేసుకుని కొన్ని నెలలు గడిపాడు. సీతారాములు అడుగు పెట్టిన ఆ ప్రాంతమంతా రమణీయమే.
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ప్రవహించే ప్రాంతం చక్కటి గృహిణి నుదుటి నుంచి తీసుకున్న పాపిడి మాదిరిగా రెండువైపులా కొండల నడుమ పాపిడిలా గోదావరి సాగుతుంది. అందుకే ఈ కొండలకు పాపి కొండలు అని వ్యవహారంలోకి వచ్చింది.
పాపి కొండలను చూడాలంటే రాజమండ్రి నుంచి బోటుద్వారా వెళ్లవచ్చు. రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలోని పోలవరం నుంచి, అలాగే కూనవరం, శ్రీరామగరి నుంచి బోటులో వెళ్లవచ్చు. శ్రీ రామగిరి భద్రాచలానికి 60 కిలోమీటర్లదూరంలో ఉంది. రాజమండ్రి నుంచి భద్రాచలానికి బోటు సర్వీసు ఉంది. వర్షాకాలం తప్ప అన్న సీజన్లలోనూ బోటు ప్రయాణానికి గోదావరి అనుకూలమే. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మే, జూన్ నెలల వరకూ పాపికొండలను బోటులో సందర్శించాలనే విహార యాత్రికులు ఇష్టపడతారు.
పాపికొండల సందర్శనపాపికొండల పర్యటనకు పలు ప్యాకేజీలను టూరిజం శాఖ సిద్ధం చేసింది. రాజమండ్రి నుంచి పాపి కొండలకు ఒకరోజు ప్యాకేజీ కూడా ఉన్నాయి. పట్టిసీమ దేవాలయం, పోలవరం ప్రాజెక్టు, గండి పోచమ్మ దేవాలయం సందర్శన నందీశ్వర దేవాలయం దర్శనం, కొల్లూరు వాగు , పాపి కొండలు, పేరంటాలపల్లి దేవాలయ సందర్శన ఈ పర్యటనలో భాగం. ఉదయం బయలు దేరితే రాత్రి కల్లా తిరిగి రాజమండ్రి చేరవచ్చు.
రాజమండ్రి భద్రాచలంరాజమండ్రి నుంచి భద్రాచలానికి నది మార్గంలోనూ, రోడ్డు మార్గంలోనూ వెళ్లి ఒకరోజులో తిరిగి రావచ్చు. రాజమండ్రి నుంచి భద్రచలానికి పట్టి సీమ గండి పోచమ్మ దేవాలయం, పాపికొండలు, పేరంటాలమ్మ పల్లి దేవాలయం నుంచి భద్రాచలం వె ళ్లి తిరిగి రావచ్చు. కొల్లూరులో వెదురుతో అల్లిన గుడిసెల్లో రాత్రి పూట ఉండడం ఓ అపూర్వ అనుభూతి. రాజమండ్రి నుంచి కొత్త జంటలు ముఖ్యంగా ఈ ప్యాకేజీ ఇష్టపడతారు. రాజమండ్రి నుంచి బయలుదేరి, పోచమ్మ గుడి, పాపి కొండలు, పేరంటాలపల్లి, మీదుగా కొల్లూరు. కేంప్ స్థలానికి చేరుతాం. అక్కడ రాత్రి పూట హాయిగా గడిపి మర్నాడు భద్రాచలానికి తీసుకువెళ్లి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. రెండు రోజులూ చక్కటి పౌష్టికాహారం, కోరుకున్న వారికి మాంసాహారం లేదా శాకాహారం ఇస్తారు. రాజమండ్రి నుంచి పాపి కొండలకు వెళ్లి శిరివాక వెదురు రిసార్‌టలలో రాత్రిళ్లు గడపడం మరో అనుభవం. బోట్ మేనేజర్, గైడ్ లు మీకు తోడుగా ఉంటారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని, దేవీ పట్నంను బోట్ ద్వారా సందర్శించవచ్చు. కొరటూరు క్యాంప్ సైట్‌లో విడిది కల్పిస్తారు.
మారేడుమిల్లి అడవిలో.. ప్రకృతి రమణయంప్రకృతి రమణీయత పూర్తిగా ఆస్వాదించాలంటే మారేడిమిల్లి అడవిలో ఏర్పాటు చేసిన హట్ లలో గడపాల్సిందే. యాంత్రిక జీవనంతో విసిగి పోయిన వారికి ఎంతో ఆహ్లాదం కలిగించే యాత్ర ఇది. హానీమూన్ జంటలకు, కుటుంబంతో వెళ్లే వారికీ ఇది గొప్పఅనుభూతి. పూర్తిగా అడవిలో ప్రకృతి సిద్ధమైన జలపాతాలను చూస్తూ గంటలకు గంటలు గడిపి వేయవచ్చు.
తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి అటవీ రిసార్‌ట్స లో చక్కటి అనుభూతిని అందిస్తున్నది అంధ్రప్రదేశ్ టూరిజం. అడవిలో పచ్చదనాన్ని చూస్తూ, చక్కగా ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ గడపవచ్చు. జింకలు, అడవి దున్నలు, నెమళ్లు ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతం, 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మామిడి చెట్ల మధ్య 50 అడుగుల ఎత్తు ఉన్న చెట్ల మధ్య ప్రయాణిస్తూ, ఎగసిపడే జలపాతాలను చూడడానికి రెండు కన్నులు చాలవు. మారేడు మిల్లీ నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని రంప జలపాతాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక రంపచోడవరానికి వెల్లాలంటే రాజమండ్రి వైపు 26 కిలోమీటర్లు ప్రయాణించాలి. రంపచోడవరం నుంచి జీపులో రంప జలపాతాలవద్దకు వెళ్లవచ్చు. సమీపంలోనే నందనవనం, కార్తీక వనం, వాలి సుగ్రీవ ఔషధ మొక్కల పెంపక కేంద్రం, మంండనికుంజ్ - విహారస్థల్ కూడా వెళ్లవచ్చు. వలమూరు నది పక్కనే అడవులో రిసార్‌ట్స ఉంటాయి. జీపులో ప్రయాణిస్తే ఆ ప్రాంతాలను చేరవచ్చు. ఈ యాత్రలో భాగంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తాటికొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం, జలపాతాలవద్ద గడపవచ్చు. ఉదయం రాజమండ్రిలో బయలుదేరితే రాత్రికి మళ్లీ రాజమండ్రికి రావచ్చు.
పచ్చదనాల ప్రత్యేకం కోనసీమ పర్యటనఆంధ్రప్రదేశ్ టూరిజం కోనసీమ స్పెషల్ టూర్ పర్యటనకు అవకాశం కల్పిస్తున్నది. ద్వారపూడి శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం, బిక్కవోలు శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, సామర్లకోట కుమార భీమేశ్వర దేవాలయం, ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం, కోటిపల్లి శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం దర్శింపజేసే కోనసీమ టూర్ ఎందరో భక్తులను ఆకట్టుకుంటున్నది. అలాగే వాడపల్లి, ర్యాలీ, అతర్వేది, దిండి రిసార్‌ట్స కు మరో ప్యాకేజీ, వాడపల్లి, ర్యాలీ, భీమవరం, పాలకొల్లు, పెనుగొండకు మరో ప్యాకేజీ ఉన్నాయి. భద్రాచలం నుంచి పాపికొండలు, పర్ణశాల, ద్వారక తిరుమలకు, భద్రాచలం నుం కొల్లూరుకు శిరివంక బాంబూ రిసార్‌ట్స కు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.