తలకిందులు భంగిమలో ఉన్న శివుడు
చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. కానీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర యనమదుర్రులో మాత్రం శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ, ముఖం, పాదాలు, ఉదరం, మోకాళ్లు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది. జగన్మాత పార్వతిదేవి నెలలపిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత.
ఈ గుడి వెనుక ఒక పురాణకథ ఉంది. లోకాన్ని పట్టి పీడిస్తున్న శంభరున్ని అంతం చేయాలనుకున్న యమధర్మరాజు, శంభరుడు శివుని భక్తుడని శంభరున్ని అంతంచేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు. అదే సమయంలో కైలాసంలో తలకిందులుగా తపస్సు చేస్తున్నశివుడు, పక్కనే బాలింత పార్వతీ దేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్నచోట ప్రత్యక్షం అయ్యారని పురాణకథ. యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివున్ని ప్రతిష్టించి గుడికట్టి, గుడికెదురుగా ఒక కోనేరుని ఏర్పాటు చేసాడని, ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివున్ని దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల విశ్వాసం.
No comments:
Post a Comment