చుట్టూ పచ్చని కొండలు... అల్లంత దూరాన విసిరేసినట్లుంటే గిరిజన పల్లెలు. పచ్చని పొలాల నడుమ అద్దాల రైలులో కూర్చుని ప్రయాణించే ప్రకృతి ప్రేమికులకు సహజ అందాల వీక్షణం ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. మధురమైన అద్దాల రైలు ప్రయాణాన్ని ఆనందమయం చేసుకోవాలంటే చక్కటి ప్రణాళికను రూపొందించుకోవాలి. పర్యటక ప్రాంతమైన అరకులోయ, పరిసర ప్రాంతాల్లో దర్శనీయ ప్రాంతాలు ఏమేం ఉన్నాయి, అరకులోయ స్టేషన్‌లో అద్దాల రైలు దిగినప్పటి నుంచి సాయంత్రం రైలు తిరిగి విశాఖపట్నం బయలుదేరే వరకు ఏఏ ప్రాంతాలను చుట్టి రావచ్చు, ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు ఉన్న రవాణా సదుపాయాలు, స్థానికంగా ఉన్న వసతులేంటో తెలుసుకుందామా..
ముందస్తు సన్నద్ధత అవసరం
విశాఖపట్నం - కిరండూల్ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్‌లో అద్దాల బోగీని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది. విశాఖపట్నం నుంచి అరకులోయకు అద్దాల బోగీలో ప్రయాణానికి టికెట్ ధర రూ.665 గా నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి బొర్ర వరకు అద్దాల బోగీలో వద్దామన్నా రూ.665 టికెట్ తీసుకోవాల్సిందే. ఈ బోగీలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండు అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందుస్తు రిజర్వేషన్ చేయించుకోవడం మంచిది. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.
అరకులోయ వరకు ఇలా..
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
గిరిజన మ్యూజియం
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్ లభిస్తుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మ్యూజియంలో గడపవచ్చు.
కటికి, తాటిగుడ జలపాతాలు
బొర్రా గుహలను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.
చాపరాయి జలపాతం
గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి జలపాతం ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము రూ.10. స్థానికంగా బొంగులో చికెన్ విక్రయాలు అధికంగా జరుగుతాయి. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను ఇక్కడు రుచి చూడవచ్చు.
పద్మాపురం ఉద్యాన వనం
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో ఉదయం 11.05 గంటలకు రైలు దిగిన తర్వాత పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్ స్కేపింగ్ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.
బొర్రా గుహలు
చాపరాయి జలపాతం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అరకులోయ చేరుకుని స్థానికంగా ఉన్న హోటళ్లలో భోజనం చేసి 17 కి.మీ. దూరంలో ఉన్న డముకు వ్యూపాయింట్, కాఫీ తోటలను తిలకించొచ్చు. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న బొర్రా గుహలకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవచ్చు. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.
No comments:
Post a Comment