వేసవిలో AC ప్లేస్
తేయాకు తోటల పచ్చదనం, చేతికి అందే ఎత్తులో మేఘాలు, కనుచూపు మేరలో హిమాలయ పర్వతాల అందాలు... ఇలా చెప్పుకుంటూ పోతే డార్జిలింగ్ అందాలు వర్ణించడానికి మాటలు రావు. ఏడాదంతా సందర్శించడానికి అనువైన ప్రదేశమే అయినా వేసవిలో వెళితే చల్లటి ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు.
వేసవిలో హిల్‌స్టేషన్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ముందుగా డార్జిలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడి ప్రకృతి అందాలు మీకు కొత్త అనుభూతిని అందిస్తాయి. 2200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్‌స్టేషన్ మండు వేసవిలోనూ చల్లటి ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్
డార్జిలింగ్ వెళ్లినవారు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇది. ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్య కాలంలో డార్జిలింగ్ వెళితే తేయాకు ఆకులను తెంపి ప్రాసెసింగ్ చేయడాన్ని ఇక్కడ చూడొచ్చు. అక్కడి టీ ఎస్టేట్ ఉద్యోగులు మీకు గైడ్‌గా మారి అన్నీ చూపిస్తారు. ఆ తేయాకు తోటల అందాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి.
బటాసియా లూప్
డార్జిలింగ్ అందాలు పూర్తిగా చూడాలంటే టాయ్ ట్రెయిన్ ఎక్కాల్సిందే. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నడిపిస్తున్న ఈ టాయ్‌రైలులో ప్రయాణం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. 1999లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఐదు కిలోమీటర్ల రైలు ప్రయాణంలో హిమాలయాల అందాలను అద్భుతంగా వీక్షించవచ్చు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన గూర్ఖా సోల్జర్స్ గౌరవార్థం నిర్మించిన వార్ మెమోరియల్‌ను చూడొచ్చు. ఇక్కడి మార్కెట్‌లో షాపింగ్ తప్పక చేయాల్సిందే. చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే వస్తువులు లభిస్తాయి.
జపనీస్ పీస్ పగోడా
డార్జిలింగ్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి డార్జిలింగ్, హిమాలయ పర్వత అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. శాంతి, ప్రశాంతతకు చిహ్నంగా జపనీస్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్మించింది. డార్జిలింగ్ నుంచి అరగంట నడక దారిలో ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రార్థనలు జరిగే సమయంలో సందర్శిస్తే మరీ మంచిది.
టిబెటన్ రెఫ్యూజీ సెల్ఫ్ హెల్ప్ సెంటర్
టిబెటన్ల పునరావాసం కోసం 1959లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక స్కూల్, క్లినిక్, వృద్ధుల కోసం ఆశ్రమం, క్రాఫ్ట్ వర్క్‌షాప్ వంటివి ఉన్నాయి. కార్పెట్, లెదర్ ఉత్పత్తులు, ఉలన్ దుస్తులను ఇందులో తయారు చేస్తారు. ఆ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
టైగర్ హిల్
భానుడి లేలేత కిరణాలను తాకాలంటే టైగర్ హిల్ చేరుకోవాల్సిందే. కారులో 40 నిమిషాలు ప్రయాణం చేస్తే టైగర్ హిల్‌కు చేరుకోవచ్చు. ఆ రోజు ఆకాశం నిర్మలంగా ఉందంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరెస్ట్ పర్వతాన్ని చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే డార్జిలింగ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశం ‘గుమ్’ ఉంటుంది.
పద్మజా నాయుడు హిమాలయన్ జూపార్క్
అరుదైన జంతువులను చూడాలంటే ఈ పార్క్‌ను సందర్శించాలి. మంచు చిరుత, సైబీరియన్ టైగర్, హియాలయన్ బ్లాక్ బేర్ వంటి జంతువులను ఇక్కడ చూడొచ్చు.
ఎలా వెళ్ళాలి:
- దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్టు బాగ్‌డోగ్రా. ఇక్కడి నుంచి డార్జిలింగ్ 95 కి.మీల దూరంలో ఉంటుంది. ట్యాక్సీలు ఉంటాయి.
- డార్జిలింగ్‌కు 88కి.మీల దూరంలో న్యూ జల్‌పాయ్‌గురి రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ చేరుకోవచ్చు. షేరింగ్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
- కోల్‌కతా నుంచి సిలిగురి వరకు బస్సులో చేరుకోవచ్చు. అక్కడి నుంచి డార్జిలింగ్ వెళ్లడానికి ట్యాక్సీలు ఉంటాయి.
- డార్జిలింగ్‌ను సందర్శించడానికి అనువైన సమయం ఏప్రిల్ నుంచి జూన్, అక్టోబర్ నుంచి డిసెంబర్.
- మాట్లాడే భాషలు.. బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్, నేపాలీ.
No comments:
Post a Comment