Wednesday, 27 September 2017

పంచముఖేశ్వరాలయం









పరమాద్భుతం పంచముఖేశ్వరాలయం



పవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతో పాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్‌లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్‌ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా.

ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామి వారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు.

బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది.

నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామి వారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలు భక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చే వరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు.

మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం:
12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: 
కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక:
8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది.

అదే విధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకేవస్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌



No comments:

Post a Comment

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...