Monday, 23 April 2018

బాదామి ఐహోలె శిల్ప సంపద




DATE

అడుగడుగున గుడి ఉంది... ఆ గుడిలో దైవముంది..!
‘అక్కడ జలపాతాల జడినీ సుందర నదీతీరాలనీ వీక్షిస్తే పౌరాణిక గాథల్ని వినిపిస్తాయి. ఎర్రనినేలనీ రాతి కొండల్నీ గుహల్నీ పలకరిస్తే శతాబ్దాల చరిత్ర లోతుల్లోకి తీసుకెళతాయి. ఆ గోడలని కళ్లతో ఆర్తిగా తడిమితే నాటి శిల్పుల ఉలి విన్యాసాలు సాక్షాత్కరిస్తాయి. అటు ప్రకృతి అందాలకూ ఇటు చాళుక్యుల కళావైభవానికీ వేదికలుగా నిలిచిన ఆ ప్రాంతాలే ఐహోలె, పట్టడకల్‌, బాదామి...’ అంటున్నారు విశాఖవాసి డా.మాదాబత్తుల తిరుమలరావు.

విశాఖపట్నం నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి, కర్ణాటకలోని హోస్పేట్‌లో దిగి, అక్కడినుంచి ప్యాసింజర్‌లో బయల్దేరి బాదామి చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క రైల్వేస్టేషన్‌ బాదామి. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడం, ప్యాసింజర్‌ రైళ్లు కూడా నిమిషమే ఆగడంతో ఈ ప్రాంతం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ కర్ణాటకలోని భాగల్‌కోట్‌ జిల్లాలోని మలప్రభ నదీతీరంలోని బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రదేశాల గురించి సినీపరిశ్రమకి బాగా తెలుసు. అందుకే అక్కడ సందర్శకుల తాకిడి కన్నా సినిమా షూటింగులే ఎక్కువ. తమిళ, కన్నడ చిత్రాలతో బాటు తెలుగు చిత్రాలు కూడా షూట్‌ చేశారు. విక్రమార్కుడు, ఢమరుకం, దరువు, రౌడీ రాథోడ్‌, శక్తి, త్రిపుర... తదితర సినిమాలన్నీ చిత్రీకరించారక్కడ.

బసశంకరీదేవి...
ముందుగా మేం బసశంకరీదేవి ఆలయానికి బయల్దేరాం. బాదామికి దక్షిణాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. చాళుక్యుల ఆరాధ్యదేవత బసశంకరి. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఎందరికో ఆమె కులదేవత. చారిత్రకంగా చూస్తే- బాదామి చాళుక్యుల కన్నా ముందే ఇక్కడ బసశంకరీదేవి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ ఎత్తైన గోడలతో ముఖమండపం, అర్ధమండపం ఉన్నాయి. బసశంకరీదేవి సింహం మీద కూర్చుని, ఎనిమిది చేతులతో దుర్గాదేవి అవతారంలో దర్శనిమిస్తుంది. దేవాలయంలో ఉన్న ఓ శాసనం ప్రకారం- చాళుక్య రాజైన జగదేకమల్లుడు పురాతన దేవాలయానికి చాలా మార్పులు చేసి కట్టించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ఈ గుడిని పునర్నిర్మించగా, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మాత్రం విజయనగర రాజులు నిర్మించారట. తరవాత శివయోగ మందిరానికి బయల్దేరాం. ఇది బాదామికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రెండు మందిరాలు ఉన్నాయి. ఒక మందిరంలో హనగల్‌ కుమారస్వామిజీ, హనగల్‌ సదాశివ స్వామీజీ సమాధులు ఉన్నాయి. ఈ స్వామీజీలకి అతీతశక్తులుండేవని చెబుతారు. అక్కడి నుంచి అనేక ఆలయాల కూటమి అయిన మహాకూటకి వెళ్ళాం. దీన్నే ఒకప్పుడు దక్షిణ కాశీ అనేేవారు. ఇందులో అతి పెద్దది మహాబలేశ్వర ఆలయం. చాళుక్యరాజైన మొదటి పులకేశి ఈ శివాలయాన్ని నిర్మించాడట.

ఆలయాల సముదాయం... ఐహోలె..!
మహాకూటకి 25 కి.మీ. దూరంలో ఉంది ఐహోలె. ఇది కూడా అనేక ఆలయాల సమూహం. అన్నీ ఓ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి దుర్గగుడి, లాడ్‌ఖాన్‌ దేవాలయం, సూర్యనారాయణ, హచిమల్లి దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, మల్లికార్జున దేవాలయాలు. ఇక్కడే ఓ మ్యూజియం ఉంది. అందులో శాసనాలూ శిల్పాలూ చాళుక్యుల పాలనకీ శిల్పకళావైభవానికీ సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో 120కి పైగా హిందూ, జైన, బౌద్ధ ఆలయాలూ కట్టడాలూ ఉన్నాయి. అందుకే మ్యూజియంలో వాటికి సంబంధించిన మ్యాప్‌ కూడా సందర్శకుల సౌకర్యార్థం ఉంచారు. ఇక్కడి మలప్రభ నదీ తీరంలో గొడ్డలి ఆకారంలో ఓ రాయి ఉంది. ఇది పరశురాముడు సంచరించిన ప్రాంతమనీ, క్షత్రియుల్ని వధించాక గొడ్డలిని కడగడంవల్లే ఈ ప్రాంతంలోని నేలంతా ఎర్రబారిందనీ అంటుంటారు. నది ఒడ్డున ఉన్న రాతి పాదముద్రలు భార్గవరాముడివిగానే భావిస్తారు స్థానికులు.


దుర్గగుడి

శిల్పకళా సంపద
ఐహోలెకి 13 కి.మీ. దూరంలో ఉంది పట్టడకల్‌. బాదామి చాళుక్యుల శిల్పకళకి ప్రతీక పట్టడకల్‌. తొలినాటి ఉత్తర, దక్షిణ భారత ఆలయ వాస్తు సమ్మేళనాన్ని ఇక్కడ చూడొచ్చు అంటారు చరిత్రకారులు. ఇక్కడి ఆలయాలు రెండో విక్రమాదిత్య కాలానికి చెందినవి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కర్ణాటకలోని రెండు ప్రదేశాల్లో ఒకటి హంపి అయితే రెండోది పట్టడకల్‌. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉన్నాయి. ఎనిమిది ఆలయాలు ఒకే కూటమిగా ఒకేచోట ఉండగా, పాపనాథ దేవాలయం ఆ సముదాయానికి దక్షిణాన 0.5 కి.మీ. దూరంలోనూ, జైన నారాయణ దేవాలయం పశ్చిమంగా 1.5 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. ఇక్కడి కడసిద్ధేశ్వర, జంబులింగ ఆలయాలు ఏడో శతాబ్దం నాటివి. గలగనాధ, సంగమేశ్వర, కాశీ విశ్వేశ్వర, మల్లికార్జున, విరూపాక్ష ఆలయాలు 8వ శతాబ్దం నాటివి. వీటిల్లో ముఖ్యంగా చూడదగ్గవి విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు. విరూపాక్ష ఆలయానికి తూర్పున నల్లరాతితో చెక్కిన నంది అద్భుతంగా ఉంది. విక్రమాదిత్యుడు కాంచీపురం మీద విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. తూర్పుముఖంగా 18 ఎత్తైన స్తంభాలతో ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయాన్ని కట్టించారు. మల్లికార్జున ఆలయం కూడా దాదాపు అదే పద్ధతిలో ఉంది. చరిత్రలోకివెళ్లి నాటి శిల్పుల ఉలి చాతుర్యాన్ని అణువణువూ తడిమే మనసు ఉండాలేగానీ పట్టడకల్‌ ఆలయాల శోభని చూడ్డానికి ఎంతకాలమైనా సరిపోదు.


పట్టడకల్‌


బాదామి రాతిగుహల్లో..!
తరవాత బాదామి చూడ్డానికి వెళ్లాం. బాదామి క్రీ.శ.500 నుంచి 757 వరకూ చాళుక్యుల రెండో రాజధానిగా ఉండేది. అందుకే వీళ్లకి బాదామి చాళుక్యులుగా పేరు. బాదామి, పట్టడకల్‌, ఐహోలె ప్రాంతాలు నాటి శిల్పుల ప్రయోగాలకు వేదికలు అని చెప్పవచ్చు. చాళుక్యులు వాళ్లను ఎంతగానో ప్రోత్సహించేవారు. అన్ని వందల ఆలయాలూ శిల్పాలూ అక్కడ కనిపించడానికి అదే కారణం. బాదామిలో ముఖ్యంగా చూడాల్సినవి భూతనాథ ఆలయం, అగస్త్యతీర్థం, రాతి గుహాలయాలు. భూతనాథ దేవాలయంలో పెద్ద ముఖమండపం, సభామండపం, అంతరాలయం ఉన్నాయి. కొండల మధ్య ఉండే పెద్ద కోనేరే అగస్త్య తీర్థం. పూర్వం అగస్త్యమహర్షి ఇక్కడే వాతాపి అనే రాక్షసుడిని సంహరించినట్లు పౌరాణిక కథనం.


భూతనాథ దేవాలయం

బాదామిలోని రాతి గుహాలయాలను చూడాల్సిందేే. పెద్ద కొండను తొలిచి నిర్మించిన ఈ నాలుగు ఆలయాల్లో మొదటి గుహనే శైవగుహ అంటారు. ఇందులో నటరాజమూర్తి కొలువుతీరాడు. 18 చేతులతో కమలంమీద నాట్యం చేస్తున్నట్లు ఉన్న ఆ మూర్తి నిజంగా అద్భుతం. ఇక్కడే మహిషాసుర మర్దని, అర్ధనారీశ్వర, హరిహర విగ్రహాలు కూడా ఉన్నాయి. రెండోది వైష్ణవ గుహ. దశావతారాల్లో ఐదవది అయిన వామనావతారాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వామనుడితోబాటు బలి చక్రవర్తి, ఆయన భార్య వింద్యావతి, విష్ణుమూర్తి శిల్పాలు ఉన్నాయి. రెండో గుహ పక్కనే ఓ బౌద్ధ గుహ కూడా ఉంది. అందులో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. మూడో గుహ మహావిష్ణువుది. రాజా కీర్తివర్మ పన్నెండేళ్ల పాలనకు గుర్తుగా అతని తమ్ముడు మంగళేష్‌ ఈ గుహని క్రీ.శ. 578లో రూపొందించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. నాలుగో గుహ ఓ జైన దేవాలయం. జైనుల్లో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం తపస్సు చేసుకుంటున్నట్లు చెక్కారు. ఇక్కడి కొండలమీద చెక్కిన ఆరో శతాబ్దం నాటి కన్నడ లిపిని కూడా చూడవచ్చు. నాటి చాళుక్యుల అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది బాదామి కోట. ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందా పట్టణం. జాలువారే జలపాతాల అందాన్నీ కొండగాలి గిలిగింతల్నీ మొత్తమ్మీద అక్కడి నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవాళ్లకి నాటి చాళుక్యుల రాజధాని బాగుంటుంది అని చెప్పవచ్చు.

ఐహోలెకి 35 కి.మీ. దూరంలో కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదుల సంగమం ఉంది. ఆనాటి చాళుక్య శిల్పశైలికి నిదర్శనం ఈ కూడల సంగమేశ్వర ఆలయం. 12వ శతాబ్దంనాటి శైవ మత వ్యాప్తికి కృషిచేసిన సుప్రసిద్ధ శివభక్తుడు బసవేశ్వరుడు ఇక్కడే జన్మించాడట. అందుకే బసవేశ్వర సమాధి ఒక పక్క మండపంలో ఉంది. చివరగా కూడల సంగమానికి పది కి.మీ. దూరంలో ఉన్న అతి పెద్ద ఆలమట్టి డ్యాం చూడ్డానికి వెళ్లాం. దాని చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిల్లో లవకుశ ఉద్యానవనమూ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఉన్న ఉద్యానవనాలను చూసి వెనుతిరిగాం.



Saturday, 14 April 2018

సింహాద్రి అప్పన్న






అపురూపం... అప్పన్న నిజరూప దర్శనం

వరాహ - నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడు ద్వయరూపాల్లో దర్శనమిచ్చే భక్తవరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవానికి విశాఖపట్నం జిల్లాలోని సింహగిరి ముస్తాబవుతోంది.

ఇదీ ఇతిహాసం:
ప్రహ్లాదుడిని రక్షించేందుకు అవతరించిన నృసింహస్వామి విగ్రహ రూపంలో సింహగిరిపై వెలిశాడు. ఆ విగ్రహానికి ఆరాధన లేకపోవడంతో దాని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. షట్‌ చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆకాశమార్గంలో విహరిస్తూ సింహగిరిపై రాత్రి విశ్రమించగా, అదే కొండపై తాను వున్నట్టు స్వామి అతని స్వప్నంలో కనిపించి చెబుతాడు. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగధారకు సమీపంలో పుట్టలో వున్న స్వామిని అక్షయ తృతీయనాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగధార జలాలతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ఆరాధిస్తాడు.తాను చాలా ఏళ్లు వల్మీకం (పుట్ట)లో వున్నందున అలాంటి చల్లదనం కోసం పుట్టమన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని పురూరవుడిని స్వామి ఆదేశిస్తాడు. దీంతో పుట్ట మన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు.

చందన యాత్ర అంటే:
ఏటా అక్షయతృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. సుమారు 12 మణుగుల (500 కిలోల) శ్రీచందనపు పూతతో స్వామిని నిత్య రూపంలోకి తీసుకువస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి నాలుగు విడతలుగా సమర్పిస్తారు. వైశాఖ శుక్ల పక్ష తదియ (అక్షయ తృతీయ) నాడు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందన ఒలుపు ప్రారంభిస్తారు. బంగారు, వెండి బొరిగెలతో చందనం తొలగిస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష పూజలు నిర్వహించి శిరస్సుపైన, ఛాతీపైన చందనాన్ని ముద్దలుగా పెడతారు. మొదట నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. అనంతరం భక్తులను అనుమతిస్తారు. నిజరూపంలోని స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుపుతారు. అదే రోజు రాత్రి భక్తుల దర్శనాల అనంతరం తొలివిడతగా మూడు మణుగుల (సుమారు 125 కిలోల) శ్రీచందనాన్ని పూతగా వేస్తారు. మిగిలిన తొమ్మిది మణుగుల చందనాన్ని వైశాఖ పూర్ణిమ, జేష్ట పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమలలో మూడేసి మణుగుల చొప్పున సమర్పిస్తారు. నాలుగు విడతల చందన సమర్పణతో స్వామి నిత్య రూపంలోకి వస్తారు.

ఎలా వెళ్ళాలి?:
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 13 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో, విశాఖ విమానాశ్రయం నుంచి సుమారు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో సింహాచలం ఉంది. సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం రైల్వే స్టేషన్‌ ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సింహాచలానికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండదిగువ నుంచి సింహగిరి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
వాసు, విశాఖపట్నం




Apr 15, 2018

సింహాచలం
అపురూపం అప్పన్న నిజరూపం

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి దేవుడి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి ఆ రూపాన్ని మదిలో నిలుపుకుని వెనుదిరుగుతారు భక్తులు. ప్రత్యేక సందర్భాల్లో ఆ మూర్తి అలంకరణలో భిన్నత్వం మినహా మిగతా సమయాల్లో దేవతా విగ్రహరూపం ఒకేలా ఉంటుంది. కానీ సింహాచలం కొండల్లో వెలసిన వరాహ నరసింహ మూర్తిని దర్శించుకోవాలంటే ఏడాది మొత్తంలో ఒకే ఒక్క రోజు వీలవుతుంది. మిగతా రోజుల్లో చందనలేపనంలో మునిగిపోయే అప్పన్న ఈ ఏడాది ఏప్రిల్‌ 18న నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు.

ఎటుచూసినా శ్రీచందన పరిమళాలూ సంపెంగల సౌరభాల్లాంటి ఎన్నో ప్రకృతి రమణీయతలతో విరాజిల్లే క్షేత్రం సింహాచలం. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో, మానవ శరీరంతో,  సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే.

చందనోత్సవం...
విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయ తృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది.

యాత్ర ఇలా...
నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచీ ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలుపెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది. రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలూ సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారుచేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.

నాలుగు విడతలుగా
వరాహలక్ష్మీనరసింహ స్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళల నుంచి కొనుగోలు చేస్తారు. మొదట అక్షయ తృతీయనాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు అయిదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట.

చందన ప్రసాదం
చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.

ఇలా చేరుకోవచ్చు
విశాఖపట్నంలో కొలువైన సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి ప్రతి పది నిమిషాలకూ ఓ బస్సు ఉంటుంది.

- ఎం.సత్యనారాయణ, న్యూస్‌టుడే, సింహాచలం





ముక్తిధామాలు - చార్‌ధామ్‌

ముక్తిధామాలు


హిందువులు ఎంతో పవిత్రంగా భావించే యాత్రల్లో ఉత్తరాఖండ్‌ ‘చార్‌ధామ్‌’ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం వేసవిలో మొదలై, శీతకాలంలో ముగిసే ఈ యాత్రకు లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. మంచుతో చలిగా ఉండే వాతావరణం మధ్య ఎగుడుదిగుడుగా ఉండే పర్వత సానువుల్లో సాగే ఈ యాత్రను సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రగా అభివర్ణించవచ్చు.

ఏమిటి ఉత్తరాఖండ్‌ చార్‌ధామ్‌ యాత్ర?:
భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న పూరి, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్‌లలో ఆది శంకరాచార్యులు మఠాలను స్థాపించారు. ఆ మఠాలు ఉన్న ప్రదేశాల్లోని ఆలయాల సందర్శనను చార్‌ధామ్‌ యాత్ర అని అంటారు. కాగా, హిమాలయ సానువుల్లో నెలకొన్న పవిత్రమైన నాలుగు ఆలయాల సందర్శనను కూడా (ఉత్తరాఖండ్‌) చార్‌ధామ్‌ (లేదా ఛోటా చార్‌ధామ్‌) యాత్రగా వ్యవహరిస్తారు. ఇవి ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌లలో ఉన్నాయి. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వీటిని స్థాపించినట్టు కథనాలున్నాయి. వీటి సందర్శన యాత్రను ‘ముక్తి యాత్ర’ అని కూడా అంటారు.

ఈ ఏడాది ప్రారంభ తేదీలు: యమునోత్రిలో, గంగోత్రిలో ఏప్రిల్‌ 18, కేదార్‌నాథ్‌లో 29, బదరీనాథ్‌లో ఏప్రిల్‌ 30.
ముగిసే తేదీలు: యమునోత్రి, గంగోత్రిలో, కేదార్‌నాథ్‌లో నవంబర్‌ 9, బదరీనాథ్‌లో ప్రకటించాల్సి ఉంది

ఎలా వెళ్ళాలి?:
అయిదు రోజుల నుంచి పదిహేను రోజుల వరకూ వివిధ ప్యాకేజీలను ట్రావెల్ప్‌ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. వివరాలను ఆ సంస్థల వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి హరిద్వార్‌ చేరుకొని అక్కడి నుంచి ఈ యాత్ర చేపట్టవచ్చు. హెలికాప్టర్లలో కూడా ఈ ధామాలను దర్శించుకోవచ్చు.

ఇదీ మార్గం :
యమునోత్రికి...ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు 210 కిలోమీటర్లు, అక్కడినుంచి యమునోత్రికి 236 కిలోమీటర్లుంటుంది, తరువాత ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.
గంగోత్రికి... అక్కడి నుంచి ఉత్తరకాశి మీదుగా గంగోత్రికి దాదాపు 220 కి.మీ..
కేదార్‌నాథ్‌కి... తిరిగి ఉత్తర కాశి, రుద్రప్రయాగ మీదుగా 254 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేసి కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు.
బదరీనాథ్‌కి... కేదార్‌నాథ్‌ నుంచి రుద్రప్రయాగ మీదుగా 160 కి.మీ. దూరంలో బదరీనాథ్‌ ఉంది. బదరీనాథ్‌ నుంచి రుషీకేశ్‌కు సుమారు 300 కి.మీ.. అక్కడి నుంచి ఢిల్లీకి 230 కి.మీ. పర్వత ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ వాహన ప్రయాణాలను అనుమతించరు.

విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...






విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...

‘‘పదికొంపలు లేని పల్లెనైనను రామభజన మందిరమొండు వరలుగాత!’’ అనేది కవి వాక్యం.
మన దేశంలో గ్రామాలు ఎన్ని ఉన్నాయో దాదాపు అన్ని రామాలయాలున్నాయి. అయితే వీటిలో కొన్ని తమదైన విలక్షణతతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి రామాలయాల్లో కొన్ని.


మారుతి లేని రాముడు... మీసాల దేవుడు

‘‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం!’’
ఎక్కడ శ్రీరామ భజన, కీర్తన జరుగుతాయో అక్కడ హనుమంతుడు తన్మయంగా చేతులు జోడించి నిలబడతాడట! రామాలయాల్లో రాముని పాదాల దగ్గర ముక్త హస్తాలతో మారుతి విగ్రహం కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడు కనిపించడు! తెలంగాణలోని మెదక్‌ జిల్లా గుమ్మడిదలలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నగరానికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కేంద్రానికి హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలనుంచి బస్సులున్నాయి. అక్కడినుంచి దాదాపు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రత్యేకత ఏంటంటే.... 

హనుమంతుడు లేని రామాలయం ఇది. ఇక్కడి రాముడిని ‘కల్యాణ రాముడ’ని కూడా పిలుస్తారు. శ్రీరామ కల్యాణ సమయానికి ఆంజనేయునితో రాముడికి పరిచయం లేదు కనుక, హనుమ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాల మాట.
ఈ ఆలయం ప్రత్యేకత ఇదొక్కటే కాదు... 

సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు - ఊర్మిళ, భరతుడు - మాండవి, శత్రుఘ్నుడు - శ్రుతకీర్తి దంపతుల విగ్రహాలు కూడా గర్భగుడిలో దర్శనమిస్తాయి. ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. 
మరో విశేషం ఏమిటంటే.... 
ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తాడు. ఇది సుమారు 900 ఏళ్ళనాటి ఆలయం. శ్రీరామనవమి రోజున ఇక్కడ నిర్వహించే సీతారామ కల్యాణంలో పాల్గొనే అవివాహితులకు త్వరలోనే పెళ్ళి అవుతుందని భక్తుల విశ్వాసం.

యోగ రామప్రభో!
చిన్ముద్రతో, చిదానందంగా భక్తులను అలరిస్తూ, నమ్మినబంటు హనుమంతుడికి గురుస్థానంలో నిలిచిన ప్రత్యేకమైన రాముడిని ఆ గుడిలో చూడవచ్చు. అక్కడి శ్రీరామచంద్రుడు రణశూరుడైన విజయ రాఘవుడు. తమిళనాడులోని నెడుంగుణమ్‌ (లేదా నెడుంగుండ్రమ్‌)లో ఉందీ విశిష్ట ఆలయం. తమిళనాడులోని అరణికి 20 కిలోమీటర్లు, తిరువణ్ణామలై (అరుణాచలం)కి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో, వందవాసి పట్టణానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెడుంగుణమ్‌ ఉంది. చెన్నై నుంచి నేరుగా బస్సులున్నాయి.

ప్రత్యేకతలేమిటంటే.... 

కడప దగ్గరి పద్మాసన రాముడి మాదిరిగా ఇక్కడ కూడా శ్రీరాముడు యోగముద్రలో కనిపిస్తాడు. తమిళనాడులోని అతి పెద్ద రామాలయాల్లో ఇదొకటి. రాముడు యోగముద్రతో దర్శనమిచ్చే ఆలయాల్లో ప్రఖ్యాతమైనది కూడా ఇదే. రాముడు చిన్ముద్రతో - గురుస్థానంలో బోధిస్తున్నట్టు, హనుమంతుడు శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూ, స్వామి చెబుతున్నది ఆలకిస్తున్నట్టూ ఉంటారు. లక్ష్మణుడు ధనుర్ధారిగా కనిపిస్తాడు. సీతమ్మ కుడిచేత్తో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తూ ఆయన పక్కన ఆసీనురాలై ఉంటుంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, శ్రీరాముడు ఇక్కడ విడిది చేశారనీ, శుక మహర్షిని దర్శించుకున్నారనీ స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయరాఘవన్‌’ అని కూడా పిలుస్తారు.

కుడివైపు జానకమ్మ!
‘‘వామాంక స్థిత జానకీ పరిలసత్‌ కోదండదండం కరే!’’ అని ప్రార్థనాశ్లోకంలో మాట.
ఏ రామాలయంలోనైనా రామునికి ఎడమవైపున సీతమ్మ కనిపిస్తుంది. భద్రాచలంలో రామాంకం మీద కొలువుతీరుతుంది. కానీ తిరుపతిలోని కోదండ రామాలయంలో మాత్రం ఆయనకు కుడివైపున సీతమ్మ ఉంటుంది.


ప్రత్యేకత ఏమిటంటే... 

తిరుపతి నగరం మధ్యలో ఉండే ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని ఐతిహ్యం. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మితం అయిందని అంటారు. తరువాత కలియుగంలో జనమేజయ చక్రవర్తి దీన్ని అభివృద్ధి పరిచారనీ కథనాలు ఉన్నాయి. నిర్మాణ శైలిలో ఈ గుడి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడి కుడివైపున సీతమ్మ, ఎడమవైపున లక్ష్మణుడు ఉండడం విశేషం. అయితే అసలు వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా అంటే కుడివైపునే ఉండాలట! ఆ ప్రకారమే ఈ విగ్రహాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇలా కుడి పక్కన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం మోక్షదాయకమని పెద్దల మాట, నమ్మకం.

పద్మాసనంలో పరంధాముడు
ధనుర్బాణాలు ధరించి, నిలబడి ఉన్న శ్రీరాముడు! భక్తుల స్మరణలో, మననంలో ముద్రపడిన రూపం ఇదే!! కానీ శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని ఉండడం ఎప్పుడైనా చూశారా? పద్మాసనాసీనుడైన రాముడిని కడప జిల్లా పెద్దపుత్త గ్రామంలోని ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. కడప నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపుత్తకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకతలేమిటంటే.... 

ఇక్కడ సీతారాములు పద్మాసనాల్లో కూర్చొని దర్శనమిస్తారు. స్వామికి కుడివైపు లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. రాముడి కుడి చెయ్యి యోగముద్రతో, ఎడమ చెయ్యి స్పర్శముద్రతో-(నేలను చూపిస్తూ) ఉంటాయి. ఆయన చేతుల్లో ధనుర్బాణాలుండవు. లక్ష్మణుడు మాత్రం వాటిని ధరించి ఉంటాడు. వారికి ముందు హనుమంతుడు కూర్చొని, బ్రహ్మసూత్రాలు చదువుతున్నట్టు కనిపించడం మరో విశేషం.

ముగ్గురయ్యల ముచ్చటైన స్వరూపం!
ఆ ఆలయంలో శ్రీరాముడు విష్ణుమూర్తిలా కనిపిస్తాడు. అంతేకాదు, వేరే ఏ రామాలయంలోనూ కానరాని అనేక విశేషాల నెలవు ఈ శ్రీరాముడి కొలువు! కేరళలోని త్రిస్సూర్‌ (త్రిచ్చూర్‌) జిల్లా త్రిప్రాయర్‌లో ఉందీ గుడి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ త్రిస్సూర్‌కు నేరుగా రైళ్ళున్నాయి. అక్కడినుంచి 25 కిలోమీటర్ల దూరంలోని త్రిప్రాయర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకత ఏమిటంటే... 

‘త్రిప్రాయరప్పన్‌’, ‘త్రిప్రా దేవర్‌’గా ప్రసిద్ధుడైన త్రిప్రాయర్‌ శ్రీరాముడు చతుర్భుజుడు. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో కోదండం (విల్లు), నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతం అంటారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. సర్వసాధారణంగా ఏ వైష్ణవ ఆలయంలోనూ ఉండని విధంగా ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉండడం విశేషం. హనుమంతుడు, గోశాల కృష్ణమూర్తితోపాటు ఉపదేవతలుగా గణపతి, అయ్యప్ప కూడా ఇక్కడ కొలువు తీరారు. అందుకే దీన్ని త్రిమూర్తి స్వరూపమైన ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, ఆయన అవతార సమాప్తి తరువాత విగ్రహం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయిందనీ క్షేత్ర పురాణం చెబుతోంది. తరువాత బెస్తవారికి సముద్రంలో దొరికిన విగ్రహానికి ప్రతిష్ఠ జరిపారు. ఈ ఆలయం ‘తీవ్ర’ నది ఒడ్డున ఉంది.

పట్టాభి రాముడు
శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం చూసే ఉంటారుగా! అలాంటి భంగిమలో, విభీషణ వరదుడైన రాముడు కనిపించే ఇలాంటి అపూర్వ ఆలయం మరెక్కడా ఉండదేమో! తమినాడులోని అయోధ్యాపట్నంలో ఈ ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అయోధ్యాపట్నం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ సేలం వెళ్ళే రైళ్ళున్నాయి. అక్కడినుంచి రోడ్డు మార్గంలో అయోధ్యాపట్నం చేరుకోవచ్చు. 


ప్రత్యేకత ఏమిటంటే... 
ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని, వరద హస్తంతో దర్శనమిస్తాడు. ఆయన ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, ఈ ప్రాంతంలో విశ్రమించిన రాముడిని- తదనంతరం జరగబోయే పట్టాభిషేకంలో కూర్చొనే భంగిమలో దర్శనం ఇవ్వాలని విభీషణుడు కోరాడు. ఆ కోరికను రాముడు నెరవేర్చాడు. దానికి తార్కాణం అన్నట్టు ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం సీతారాముల ముందు నిలబడి ఉంటుంది. విభీషణుడు ప్రార్థిస్తూ ఉంటే, వారిద్దరూ అతన్ని ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది.





రామతీర్థం రామస్వామి దేవస్థానం






అక్కడ రెండుసార్లు పెళ్ళి!


భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా శ్రీరాముడికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కల్యాణం నిర్వహిస్తారు. అది కూడా శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. ఈ దేవస్థానం ఏర్పాటైన 16వ శతాబ్దం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

ఇక్కడ శ్రీరామ నవమి రోజునే కాదు, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనినే తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు. శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం పగటి పూట, తిరుకల్యాణ మహోత్సవం రాత్రి పూట జరుగుతాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ‘దేవుని పెళి’్ల జరిగాకే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం! రామతీర్థం సీతారాముల తొలి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది జనవరి 27న జరిగింది. రెండో కల్యాణోత్సవం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జరుగనుంది.

తిరుకల్యాణం కథ ఇదీ!
16వ శతాబ్ద కాలంలో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చిందట. ఆమెకు శ్రీరాముడు ప్రత్యక్షమై, ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది. అలాగే శ్రీరాముడు కుంబిళాపురం రాజుకు కూడా కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని కోరాడట. చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయనీ, తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట. అలాగే మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా ఆ భీష్మ ఏకాదశి నాడు సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీ!

ఏకుల వంశీయులే ఆడపెళ్లి వారు
రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు శ్రీరామచంద్రుడు తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదావారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లికి బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుగు శతాబ్దాల కాలం నుంచి ఏకుల వంశీయులే ఆడ పెళ్లివారు! వీరు రాముడి విగ్రహాలను కనుగొన్న మూగ వృద్ధురాలి వంశీయులని చెబుతారు. కేవలం పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు తెలిపారు. వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.

ఐదు రోజుల పెళ్ళి... ఆరుదైన పెళ్ళి!
రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్ర్తాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపె ధ్వజారోహణం చేస్తారు. కల్యాణోత్సవం జరిగిన నుంచి ఐదు రోజుల పాటు అర్చకులు ప్రత్యేక హోమాలు, గ్రామ బహిష్కరణ, సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజున సదస్యం అనే పేరుతో పండితులకు సత్కారం, పండిత పరిషత్‌ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగో రోజు రాత్రి పూలతోనూ, విద్యుత్‌ వెలుగులతోనూ అలంకరించిన ప్రత్యేక రథంపై నవ వధూవరులు సీతారామచంద్రులను, లక్ష్మణ స్వామిని రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాన్ని పక్క గ్రామమైన సీతారామునిపేట గ్రామస్థులు మాత్రమే లాగుతారు. ఐదో రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి, ఆ రోజు రాత్రి గరుడ పటాన్ని అవరోహణం చేస్తారు. పూర్ణాహుతి అనంతరం కల్యాణోత్సవాలకు ముగింపు ప్రకటిస్తారు.
పతివాడ రమణ, నెల్లిమర్ల, విజయనగరం

ఒంటిమిట్ట కోదండరామాలయం






కల్యాణ వైభోగమే.. వెన్నెల్లో కల్యాణం
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు...

అంటాడు పోతన.


రామయ్య పెండ్లిని వీక్షించు జన్మ జన్మ అంటారు భక్తులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి ఈ చివర రాయల సీమ వరకూ జరిగే సీతారామ కల్యాణాల్లో విశేషాలెన్నెన్నో!

రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిత్‌ లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో, ఆంధ్రా భద్రాద్రిగా వాసికెక్కిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చంద్రుని వెలుగుల్లో రాత్రి వేళ కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ వుంది. క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని స్వామి వరమిచ్చాడు. దాని ప్రకారమే చైత్ర శుద్ధ చతుర్దశి నాటి రాత్రి ఇక్కడ స్వామివారికి కల్యాణం జరుపుతారు.

పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ రామాలయం కడప-చెన్నై ప్రధాన రహదారిలో కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఒంటిమిట్టలో ఉంది. ఒక రాతి గుట్టపై మూడు గోపురాలతో 32 అద్భుత శిల్పమయ స్తంభాలతో రంగ మండపం, కల్యాణ మండపం ఉన్నాయి. సీతారామలక్ష్మణులు ఒకే శిలపై వెలసి ఉన్నందున ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా వినుతికెక్కింది. దేశంలో హనుమ లేని రామాలయాలు చాలా అరుదు. హనుమంతుడు లేకుండా నిర్మించిన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్టను ప్రభుత్వం టీటీడీ ఆధీనంలోని ఆలయాల్లో విలీనం చేసింది. ఈ నెల 24 నుంచి ఒంటిమిట్టలో 11 రోజుల పాటు తిరుమల తరహాలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 30న ఉత్సవంలో ప్రధానమైన సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది.

రామాలయ ఆవిర్భావం
మట్లి పాలకుల్లో ఒకరైన సదాశివరాయుల కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని 1350లో ఉదయగిరిని పాలించిన కంపరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. 1356లో ఉదయగిరి సింహాసనాన్ని అధిష్ఠించిన కంప సోదరుడైన బుక్కరాయలు ఒంటిమిట్ట కోదండరామాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. మట్లిరాజుల్లో ఒకడైన అనంతరాజు రామాలయ గుడిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ గోపుర నిర్మాణాలు మొదలు పెట్టగా అనంతరాజు కుమారుడైన తిరువెంగళనాఽథ రాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశాడు.

ఇతిహాసాలెన్నో...
రామడు అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ తపస్సు చేసుకొనే మునుల కోరికపై రామలక్ష్మణులు రాక్షస సంహారం చేసినట్లు చెబుతారు. అనంతరం మునుల యజ్ఞయాగాదులకు ఇబ్బందులు కలగకుండా ఒకే శిలలో నిర్మితమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేసినందున, దీనికి ‘ఏకశిలా నగరం’గా పేరువచ్చింది. శ్రీరాముడు అంబులపొది, పిడిబాకు, కోదండం చేతపట్టి రావడంతో ‘కోదండరాముడు’ అనే నామం వచ్చింది. కాగా, దండకారణ్యంలో పర్యటించిన సీతారామలక్ష్మణులు అలసి ఒక చెట్టునీడన చేరారట! ఆ సమయంలో సీతాదేవికి దాహంగా ఉండటంతో రాముడు బాణాన్ని భూమిలోకి సంధించగా గంగ పెల్లుబికింది. దీంతో వారు దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా భూమిలోకి బాణం సంధించగా గంగ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇవి శ్రీరామలక్ష్మణ తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.

జాంబవంత ప్రతిష్ఠ
త్రేతాయుగంలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చిన జాంబవంతుడు ఒక నాటి రాత్రి విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమిచ్చారట. జాంబవంతుడు ఉదయమే లేచి పరిసరాలను వెతకగా గుబురు పొదల్లో ఈ మూర్తులు కనిపించాయి. జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందువల్లే ‘జాంబవంత ప్రతిష్ఠ’ అని పేరు వచ్చింది.

ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చిందంటే..
ఒంటెడు-మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో వేట సాగించేవారు. కంపరాయలు, ఆయన పరివారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీర్చారట. ఈ అన్నదమ్ముల కోరికపై జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా దేవతామూర్తులకు కంపరాయలు గర్భాలయం నిర్మించారు. తరువాత వీరి పేరు మీద ఒంటిమిట్ట గ్రామాన్ని, చెరువును కట్టించారు.

ఇమాంబేగ్‌ పిలుపు.. రామయ్య పలుకు
క్రీ.శ.1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్‌ నభీఖాన్‌ ప్రతినిధి ఇమాంబేగ్‌ ఒంటిమిట్ట కోదండరాముని మహిమను పరీక్షించేందుకు వచ్చాడట. గుడి లోపలికి వెళ్లి ‘‘ఓ రామ..! ఒంటిమిట్ట రఘురామ..!’’ అని మూడు మార్లు పిలువగా గుడిలోంచి ‘‘ఓ.ఓ.ఓ...’’ అనే సమాధానం వినబడిందట. ఇమాంబేగ్‌ ఆనందంతో మోకరిల్లి రాముని భక్తునిగా మారాడు. రాముని కైంకర్యం కోసం బావిని తవ్వించాడు. ఆ బావి నేటికి ఉంది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె దర్గాకు వెళ్ళే ముస్లింలు కోదండరామున్ని దర్శించుకొంటారు.

భాగ్యనగరంలో అయోధ్యరాముడు






భాగ్యనగరంలో అయోధ్యరాముడు
ఎనిమిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్య మినహా దేశంలో మరెక్కడా కానరాని పట్టాభిషిక్త శ్రీరాముడు భాగ్యనగరంలో కొలువుదీరి ఉన్నాడు. 186 ఏళ్ల క్రితం ఆస్‌ఫజాహీల పాలనలో నగరం నడిబొడ్డున శ్రీ సీతారామ మందిరం నిర్మితమైంది. ఈ ఆలయం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఐదు ప్రధాన దేవాలయాలు, ఆరు ప్రధాన ద్వారాలు, ఏడు మెట్ల బావులు.. వెరసి మల్లేపల్లి, సీతారాం బాగ్‌లోని ‘శ్రీ సీతారాం మహరాజ్‌ సంస్థాన్‌’గా  వెలుగొందుతున్న రామాలయ విశేషాలు...

శ్రీరామచంద్ర మూర్తి, సీతా సమేత.. లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞ సహిత పట్టాభిషేక మహోత్సవ విగ్రహ మూర్తి కొలువుదీరిన దేవాలయం అయోధ్య మినహా భాగ్యనగరంలో మాత్రమే కొలువుదీరడం విశేషం. నగరం నడిబొడ్డునున్న మల్లేపల్లి, సీతారాంబాగ్‌లోని దాదాపు 25 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లు, పూలు, పండ్ల తోటల నడుమ 1832, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పునర్వసు నక్షత్ర యుక్త లగ్నంలో శ్రీరామ మందిరం నిర్మితమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కంచిలోని ప్రతివాది భయంకర మఠాధిపతి ‘అనంతాచార్యులు’ విచ్చేసినట్లు ఆలయ నిర్మాతల లిఖిత గ్రంథాల ద్వారా వెల్లడైంది. నాల్గో నిజాం ప్రభువు ఫర్కుందా అలీఖాన్‌ పరిపాలనలో సీతారామ మందిరం నిర్మితమైంది. రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన పురాన్‌మల్‌ గనేరివాల్‌ ఈ ఆలయాన్ని కట్టించారు. ఆయన కుటుంబానికి చెందిన ఆరోతరం వారసులు అనంత్‌ప్రసాద్‌ గనేరివాలా, అరవింద్‌ కుమార్‌ గనేరివాలా ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

పట్టాభిషేక ఘట్టం

రామాలయం ప్రధాన ద్వారం ఉత్తర భారతీయ సంస్కృతిని తలపిస్తూ, బద్రీనాథ్‌ ఆలయ శైలిని తలపిస్తోంది. ఆ ముఖద్వారం గోడలపై వివిధ రంగుల్లో లతలు, పుష్పాలు, కొమ్మల డిజైన్లతో స్టకో వర్క్‌ కనపడుతుంది. గర్భగుడిలో సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞలు సహితంగా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే పాలరాతి విగ్రహ మూర్తులు కొలువై ఉన్నారు. అయోధ్యలోని రామమందిరంలో నెలవైన విగ్రహ మూర్తుల పోలికతో జైపూర్‌లో రూపొందించిన మూలవిరాట్‌ మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామి వారి కైంకర్యాలు, పూజా విధానం ‘పాంచ రాత్ర ఆగమ’ పద్ధతిలో జరుగుతుంది. ‘ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న ఆంజనేయస్వామి దేవాలయం పురాతనమైందని’ పండితులు అన్నంగరాచార్యులు వివరిస్తున్నారు. మొదట శైవ ఆరాధకులైన గనేరివాలా కుటుంబీకులు రామ మందిరానికి పూర్వమే అదే ప్రాంగణంలో నిర్మించిన శివాలయానికి వెనుకభాగంలో దర్శనమిస్తోంది.

కల్యాణ వైభోగమే..!
సీతారాం బాగ్‌ ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలో పగటిపూట రాములవారి కల్యాణం జరిగితే, ఇక్కడ మాత్రం రాత్రివేళ కల్యాణ మహోత్సవం జరుగుతుంది. నవమి నాలుగోరోజు రథోత్సవంలో సీతారాముల ఊరేగింపు సంబురాన్ని తలపిస్తుంది. ‘గతంలోరధోత్సవాన్ని తిలకించేందుకు నిజాం ప్రభుత్వాధికారులు కొందరు ఆలయాన్ని సందర్శించేవారని’ అన్నంగరాచార్యులు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి అనుమతి

రెండు శతాబ్దాల క్రితం జైపూర్‌కి చెందిన పురాన్‌మల్‌ గనేరివాలా కుటుంబం వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ రాజ్యానికి విచ్చేశారు. వర్తకంలో నిలదొక్కుకున్న వీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అనతికాలంలోనే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న గనేరివాలా కుటుంబీకులు నిజాం ప్రభువు అభిమానాన్ని చూరగొన్నారు. అలా పురాన్‌మల్‌ కుమారుడు ప్రేమ్‌సుఖ్‌దాస్‌ మరాట్వాడా (ఇప్పటి మహారాష్ట్ర)లోని ‘అమరావతి’ ప్రదేశానికి పన్ను వసూలుచేసే అధికారిగా నియమితుడయ్యాడు. సుఖ్‌దాస్‌ ఆ బాధ్యతను స్వీకరించిన కొద్దికాలానికే, ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన మొత్తం 200 ఎడ్ల బండ్లకి సరిపోయేంత సొమ్మును నాల్గో నిజాంకు అప్పగించాడు. అదే సమయంలో కంచిలోని ప్రతివాద భయంకర మఠం పీఠాధిపతి అనంతాచార్యులు బోధనలతో ప్రభావితుడైన పురాన్‌మల్‌ వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఆ స్వామీజీ ఆదేశానుసారం ధార్మిక సేవాకార్యక్రమాల్లో భాగంగా తన కొడుకు సుఖ్‌దా్‌సతో కలిసి రామాలయ నిర్మాణం తలపెట్టాడు. అందుకు మొదటగా నిజాం ప్రభుత్వానికి కొంత కప్పం చెల్లించి అనుమతి పొందాడు. 1820వ దశకంలో ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. 1832లో ఆలయంలోని మూల విరాట్‌ను ప్రతిష్ఠించారు.

విభిన్న సంస్కృతుల మేళవింపు

ఆలయం నిర్మాణంలో ఎక్కువ భాగం గ్రైనేట్‌, సున్నం రాయిని వినియోగించినట్లు చారిత్రక అధ్యయనకారులు అనూరాధా రెడ్డి చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశ సంప్రదాయాలతోపాటు, మొగలాయి, కుతుబ్‌షాహీలు, యూరోపియన్‌ నిర్మాణ శైలి ఆలయ కట్టడాల్లో కనిపిస్తుంది. కోట తలుపులను తలపించేలా ఆ దర్వాజాలు 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. రెండో ప్రవేశ ద్వారం పూర్తిగా హిందూ సంప్రదాయ శైలిలో నిర్మించారు. ఆ గోపురంపై దశావతార మూర్తులు, కోతి బొమ్మలు, తామర మొగ్గలు వంటి డిజైన్లు కనిపిస్తాయి. మూడో ప్రవేశ ద్వారం పూర్తిగా ఉత్తర భారతీయ నిర్మాణశైలికి అద్దంపడుతోంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే, అక్కడ గుమ్మటాలు, ద్వారాలు, విశ్రాంతి గదుల కిటికీలు వంటివి మొగలాయి సంస్కృతిని పోలి ఉంటాయని అనురాధారెడ్డి వివరిస్తున్నారు. అనంతాచార్యులు ఆదేశం ప్రకారం దక్షిణ భారతదేశ శైలితో వరదరాజస్వామి, లక్ష్మీదేవి ఆలయాలు నిర్మించారు. ఆ మందిరాల గోపురంపై ఆళ్వారుస్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి.

సౌభ్రాతృత్వానికి ప్రతీక
గంగా జమున తెహజీబ్‌ సంస్కృతికి హైదరాబాద్‌ ఆలవాలం. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచే సర్వమత సౌభ్రాతృత్వం నెలకొందనడానికి సీతారాంబాగ్‌ మందిరం కూడా నిదర్శనం. రామ మందిరం ప్రాంగణంలోనే మసీదు నెలవైంది. మందిరం, మసీదు మధ్య కేవలం ఒకే ప్రాకారం నిర్మితమైంది. ‘హిందూ, ముస్లిం ఐకమత్యానికి ఈ మందిరం ప్రతీక. నిత్యం ఎంతో మంది ముస్లిం కుటుంబాలవారు ఆలయ ప్రధాన ద్వారం వరకు విచ్చేసి, అర్చనలు చేయించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో కానుకలు సమర్పించుకుంటారు’ అని అన్నంగరాచార్యులు చెబుతున్నారు.

మెట్ల బావులు.. మండపాలు
ఆలయ ప్రాంగణంలో మొత్తం ఏడు బావులుండేవి. అందులో ప్రస్తుతం నాలుగు మెట్ల బావులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద నెలవైన మెట్లబావిని సుదర్శన కోనేరుగా పిలుస్తారు. ఒకప్పుడు ఈ బావి నీటిని స్వామి అభిషేకానికి ఉపయోగించేవారు. ఆలయ ప్రవేశ ద్వారం దాటిన తర్వాత ఎడమవైపున నెలవైన కోనేరును రామానుజ పుష్కరిణిగా పిలుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యతీశ్వరులు స్నానం చేసేందుకు బావిని నిర్మించారు. ఆ పక్కనే విశ్రాంతి మండపం కనిపిస్తుంది. దక్షిణాన గజేంద్ర మోక్ష మండపం, కోనేరు కనిపిస్తాయి.

రాతితో అత్యంత అరుదైన శైలిలో నిర్మించిన మెట్ల బావులన్నీ శుద్ధి చేయక నిరుపయోగంగా ఉన్నాయి. ఆలయంలో శుక్రవారం మండపం, కల్యాణమండపం, తులసీ కల్యాణ మండపం, ధనుర్మాస ఉత్సవాల మండపం వంటి పలు గ్రైనేట్‌ రాతి నిర్మాణాలు గుడి లోపల, బయట దర్శనమిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, అర్చకులు, మేళగాళ్లు, కైంకర్యాల నిర్వాహకులు, పూలదండలు కట్టే కుటుంబాలు తదితరులు నివసించేందుకు ఆలయ ప్రాంగణంలోనే గృహసముదాయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి 2010 ఇంట్యాక్‌ అవార్డు దక్కింది. ‘దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ మరమ్మతు పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అందుకు ఒక కమిటీ కూడా ఏర్పడిందని’ అరవింద్‌కుమార్‌ గనేరివాల్‌ తెలిపారు.





విజయదశమి - విజయిూభవ






విజయిూభవ

విజయదశమి’... విజయాల పండుగ.
జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దినిగా పూజలందుకున్న వేళ...
అర్జునుడు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు...
శరన్నవరాత్రుల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించే ఘడియ...
లక్ష్మీపూజ... సరస్వతీపూజ... ఆయుధ పూజ... శమీపూజ... అన్నీ శుభాలే.
మది నిండా సంతోషాలతో...
దసరా సరదాలతో...
తెలుగింటి ‘నవదుర్గల’ ఆశీస్సులతో...
విజయీభవ!

దేవీ జ్ఞానప్రసూనాంబికే!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వాయులింగేశ్వరుని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శన భాగ్యం కల్పిస్తారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో, 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండదేవి, 5వ రోజు స్కంధమాతాదేవి, 6వ రోజు కాత్యాయనీదేవి, 7వ రోజు కాళరాత్రీ దేవి, 8వ రోజు మహాగౌరీదేవి, 9వ రోజు సిద్ధిధాత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. 10వ రోజున విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

కరుణా సముద్ర.. కనకమహాలక్ష్మి
విశాఖలో కొలువుదీరిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేవస్థానం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏ సమయంలోనైనా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. విజయదశమి పర్వదినం సందర్భంగా స్వర్ణాభరణ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు.

భక్తిముక్తిదాయిని భ్రమరాంబిక
ద్వాదశ జ్యోతిర్లంగాల్లో ఒకటిగా మల్లికార్జునుడు, అష్ఠాదశ శక్తుల్లో ఒకరిగా భ్రమరాంబాదేవి వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఏటా శ్రీశైల దేవస్థానం మల్లికార్జునస్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భ్రమరాంబదేవికి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. భ్రమరాంబదేవి అమ్మవారి గర్భాలయం స్వామివారి ఆలయానికి వెనకభాగాన కొంత ఎత్తులో ఉంటుంది. తొమ్మిదిరోజులపాటు నవదుర్గ అలంకారాల్లో విశేషపూజలు అందుకునే భ్రమరాంబదేవి పదవ రోజు విజయదశమి పర్వదినం నాడు నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది.

శ్రీచక్రంపై మాణిక్యాంబ
అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తి పీఠం ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిని దక్షిణాభి ముఖంగా, సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రం బిందువుపై ఆదిశంకారాచార్యులు పున:ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఎక్కడా జరుగని విధంగా అమ్మవారికీ, శ్రీచక్రానికీ అర్చన ఏకకాలంలో జరగడం ఇక్కడి విశేషం. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో మాణిక్యాంబ అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. నిత్య చండీహోమం జరుగుతుంది. విజయ దశమి రోజున శమీపూజ అనంతరం గజ వాహనంతో నగరోత్సవం జరుగుతుంది.

శుభాల దేవి!
జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం త్రివేణీసంగమ క్షేత్రం. ఇక్కడి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో అష్టతీర్థాలు ఉన్నాయి. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అరు రెండు లింగాలు ఉండడం ఈ ఆలయ విశిష్టత. పైగా ముక్తీశ్వరుడు ఉన్న చోట శుభానందదేవికి, సరస్వతీదేవికి ప్రత్యేక ఆలయాలు ఉండడం విశేషం. శుభాలను కలిగించేటువంటి ఈ అమ్మవారిని శుభానందదేవిగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో దసరా ముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఉజ్జయినీ మహాకాళి!
నగరాన్ని కలరా వ్యాధి నుండి కాపాడిన మహిమాన్విత సికింద్రాబాద్‌లో వెలిసిన శ్రీ ఉజ్జయినీ మహాకాళి. 1813లో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌ వాస్తవ్యుడైన సురిటి అప్పయ్య ఆర్మీ డోలీ బేరర్‌గా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో అప్పయ్య, ఆయన అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళి దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడవలసిందిగా ప్రార్థించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్‌లోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు.

భక్తుల కొంగు బంగారం
వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తం. ఈ జగన్మాత మహా దుర్గాష్టమి వేళ భూ మండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఓరుగల్లు మహానగరమని ప్రతీతి. మహాష్టమి అని పిలిచే దుర్గాష్టమి వేళ జనగ్మాత కోటి యోగిని గణాలతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించినదని దేవీ భాగవతం చెబుతోంది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన దుర్గాష్టమినాడు తెలంగాణ నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి రోజు వివిధ ఆకారాల్లో అమ్మవారిని అలంకరించి, వాహన సేవలు నిర్వహించే ఈ వేడుకలు అమ్మవారి కల్యాణోత్సవంతో ముగుస్తాయి.

అన్నపూర్ణకు ప్రతిరూపం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటి. శ్రీరాజరాజేశ్వరస్వామివారు ఈ క్షేత్రంలో ప్రధాన దేవతామూర్తి. ప్రధాన ఆలయంలో శ్రీస్వామివారికి కుడివైపున శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు, ఎడమవైపున శ్రీలక్ష్మీగణపతిస్వామివారు కొలువై ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణదేవి ప్రతిరూపం వేములవాడ క్షేత్రంలో ఉందనీ, అదే కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశిగా పేరువచ్చిందని ప్రతీతి.

మహా ‘శక్తి’ స్వరూపిణి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉత్తర వాహిని తుంగభద్రానదీ తీరంలో కొలువైంది జోగులాంబ అమ్మవారు. 18 శక్తిపీఠాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఐదవ శక్తిపీఠం జోగులాంబదేవి. క్రీ.శ 17వ శతాబ్దంలో ఆదిశంకరుడు శ్రీచక్రప్రతిష్ఠ చేసి జోగులాంబదేవిని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణ చేస్తారు. 9వ రోజున తుంగభద్రా నదిలో హంసతూలిక పడవలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి భక్తులకు కనువిందు చేస్తారు.






బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...