వేసవిలో ప్రయాణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? ఆ జాబితాలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ పేరు రాసేయండి. ఏసీ గదిలో దొరికే చల్లదనం ఇక్కడ లభిస్తుంది. వేసవి విడిదిగా పేరొందిన ఆ చల్లని కొండ విశేషాలు తెలుసుకుందాం..
అది 1865-67 ప్రాంతం.. డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారినికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం.. చల్లదనం.. ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై ఒక బంగ్లాను నిర్మించారు. ఆ ప్రాంతాన్ని వేసవి విడిదిగా తీర్చిదిద్దారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.
సంపెంగ పరిమళాలు
తూర్పు కనుమల్లోని దక్షిణ భాగపు కొండల్లో విస్తరించి ఉన్న హార్సిలీ హిల్స్ సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంటుంది. అటవీ మార్గంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది. సంపెంగ పూల పరిమళాలతో వీచే కొండగాలికి కోటి రూకలిచ్చినా తక్కువే! హేమంతంలో చలిపంజా విసిరే హార్సిలీ హిల్స్.. గ్రీష్మతాపానికి విరుగుడు మంత్రం వేస్తుంది. మండు వేసవిలోనూ ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల లోపే నమోదవుతుంటుంది. అందుకే వేసవి విడిదిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది.
హార్సిలీ హిల్స్‌కు పూర్వనామం ఏనుగు మల్లమ్మకొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట. ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట. అలా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం. |
కావాల్సినంత వినోదం..
హార్సిలీ కొండపై పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలనూ, పెద్దలనూ అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకూ దుప్పటి కప్పుకొని నిద్దురోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు.
హార్సిలీ హిల్స్ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన, ప్రైవేట్ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి. |
తెల్లగడ్ల జాకీర్ హుస్సేన్
No comments:
Post a Comment