పచ్చని చెట్లమధ్య రాసి పోసినట్లుండే తెల్లని మేఘాలు... రోడ్డు పక్క, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం తైలవర్ణచిత్రంలా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపు కనిపిస్తుంది. ఆ వాతావరణం ప్రశాంతతకు చిహ్నమేమో అనిపిస్తుంది. అటువంటి మేఘాలయకు వెళ్లడమంటే మేఘాలలో తేలిపోవడమే.
మేఘాలయ భారతదేశపు ఈశాన్యప్రాంతంలో 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమీటర్ల వెడల్పుతో పర్వతమయంగా ఉంటుంది. దీనికి ఉత్తరాన అస్సాం రాష్ట్ర సరిహద్దుగా బ్రహ్మపుత్ర నది.. దక్షిణాన షిల్లాంగ్ పట్టణం ఉంటుంది. ఇదే మేఘాలయ రాష్ట్ర రాజధాని కూడా...!
మేఘాలయ వాతావరణం మరీ వేడిగా, అలా అని మరీ చల్లగా ఉండదు. కానీ దేశం మొత్తంలో చూస్తే వర్షాలు మాత్రం ఈ ప్రాంతంలోనే అత్యధికం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 1200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. షిల్లాంగ్‌కు దక్షిణాన ఉన్న చిరపుంజి పట్టణం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ దగ్గర్లోని మాసిన్రామ్‌లో కూడా అంతే.
మేఘాలయలో మూడోవంతు అటవీ ప్రాంతమే. పశ్చిమాన 'గరో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి, జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి. కానీ ఇవి మరీ ఎత్తుగా ఉండవు. షిల్లాంగ్ శిఖరం అన్నింటికంటే ఎత్తైంది (1,965 మీటర్లు). పర్వతాల్లో విలక్షణమైన 'స్టేలక్టైటు, స్టేలగ్మైటు' సున్నపురాయి వుంటుంది.
వర్షాలు ప్రారంభమైన తర్వాత మేఘాలయలో పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లే ప్రదేశం ఒకటుంది. అదే షిల్లాంగ్‌కు సమీపంలోని చిన్న చిన్న గుట్టలు. మధ్యలో రాళ్లు... చుట్టూ పెరిగిన పెద్దపెద్ద చెట్లు కలిగిన ప్రదేశం ఇది. వీటిని ప్రకృతి శక్తులను తృప్తిపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించారని అక్కడుండే ఖాశీ తెగకు చెందిన ఆదివాసీలు చెబుతుంటారు. షిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణం కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో హాయిగా సాగిపోతుంది. దారి పొడవునా బంగ్లాదేశ్ మైదాన ప్రాంతాలు, సుడులు తిరుగుతూ పర్వతాలను కప్పేసే పొగమంచు, గలగలమనే చిన్న చిన్న జలపాతాలు... ఎంత చూసినా తనివి తీరదు. క్షణమైనా రెప్పవేయాలనిపించదు. అంతగా ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది. చిరపుంజిలో విశ్రాంతి తీసుకునేందుకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఇక ట్రెక్కింగ్ చేయడానికి సిద్ధపడితే సహజసిద్ధంగా ఏర్పడిన వంతెనలు ఉండనే ఉన్నాయి. ఇవి ఒక్కోటి 200 సంవత్సరాల పురాతనమైనవి. అన్నీ రబ్బరు చెట్లతో సహజసిద్ధంగా ఏర్పడినట్లు చెబుతుంటారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మాలినోంగ్ గ్రామం కూడా మేఘాలయలో చూడదగిందే. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ''మేఘాలయ టూరిజం డెవలప్‌మెంట్ ఫోరం'' ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చాలా శ్రమించింది. ఆ శ్రమ ఫలితమా అన్నట్లు నిజంగానే ఆ ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. రంగురంగు పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. అయితే వారిని ఫొటోలు మాత్రం తీయనీయరు. షిల్లాంగ్ బారా బజార్‌లో స్త్రీల కోసం ప్రత్యేక దుస్తులు దొరుకుతాయి. అక్కడి ఖాసీ మహిళలు వీటిని లేసులు, పూసలతో అందంగా అలంకరించి ధరిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో అంటే... 200 రూపాయల నుంచి వేల రూపాయల ఖరీదు చేసే దుస్తులు ఇక్కడ లభిస్తాయి.
డాన్, బోస్కో మ్యూజియం, బారా బజార్, షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ ఫాల్స్, సహజ వంతెనలు... మొదలైనవి మేఘాలయలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. ఆహారం, విషయానికి వస్తే... చైనీస్, టిబెటన్, భారతీయ వంటకాలు లభిస్తాయి. ఇక్కడి పోలీస్ బజార్ ప్రాంతంలో చాలా హోటళ్లున్నాయి. ఈ హోటళ్లన్నింటిలోనూ లభించే 'మొమో'లను అక్కడి వారు ఇష్టంగా తింటుంటారు.
ఎలా వెళ్లాలంటే...
గౌహతి వెళ్లాక, అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 13వందల రూపాయల అద్దెతో ట్యాక్సీలు దొరుకుతాయి. షేరింగ్ పద్ధతిలో అయితే మూడు వందలు అవుతుంది. ఇక షిల్లాంగ్‌లో తిరిగేందుకు కూడా ఈ షేరింగ్ ట్యాక్సీలే అనుకూలంగా ఉంటాయి.
సైకిలెక్కి హిమ పర్వతాల్ని చుట్టేద్దాం
ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్ నది పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారురోడ్డు, 50 నుండ 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి... ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపిచదు. ఇది మరెక్కడో కాదు... హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల్లో...
భగభగమండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి, యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే!
అక్కడ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ, నేషనల్ హిమాలయన్ మౌంటెన్ బైటింగ్ అనే కార్యక్రమంలో భాగంగా కొండల్లో సరదాగా సైకిల్ తొక్కుతూ వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చల్లగా వుండే 'కులు' పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని ఓట్ అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఓట్. ఇక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం 'జలోరీ పాస్'. ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో వుంటుంది. మొదటి రోజున సైకిల్ తొక్కుతూ... 16 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. యాత్రను ఏర్పాటు చేసిన నిర్వాహకులే సైకిల్ ఇస్తారు. ఇది గేర్ల సైకిల్. తలకు హెల్మెట్, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్, చేతులకు గ్లవ్స్, కళ్లకు గాగుల్స్ వేసుకుంటే... మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఉదయం 8 గంటలకు మొదలవుతుంది ఈ పర్యటన.
'ఓట్' వద్ద సుమారు 3 కిలోమీటర్లు పొడవుండే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. పల్లంగా ఉండే దారిలో సర్రున దూసుకుపోతూ... ఎత్తైన చోట సైకిల్ దిగి దాన్ని నడుపుకుంటూ... ఒక్కో మైలురాయి కనిపించినప్పుడల్లా ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేశామనే విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం.
మధ్యాహ్నానికి బియాస్ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని నీటి గలగలలు ఆస్వాదిస్తుంటే భలే వుంటుందిలే... అలసటమీద వెంట తెచ్చుకున్న భోజనాన్ని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయొచ్చు. నడక, సైకిల్ తొక్కడం పెద్దగా అలవాటులేని వారు రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.
రెండో రోజు యాత్రలో 'జిబి' అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే... మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం... సైకిల్ తొక్కడం కంటే ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా 'జిబి' చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దాటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళ్తే చూడముచ్చటైన చిన్ని జలపాతం ఆహ్వానిస్తుంది. అప్పుడే ఐస్ కరిగి నీరైనట్టుగా, ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీళ్లలో స్నానం కాదు కదా... నీళ్లు పట్టుకోడానికే వణికిపోతాం. అంత చల్లగా ఉంటాయి.
మూడో రోజున 'షోజా' అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే. అంటే మొదటి రెండు రోజులకంటే తక్కువ దూరమే. అయినప్పటికీ ఒక్క అడుగైనా సైకిల్ తొక్కలేని పరిస్థితి. ఎందుకంటే నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు... తక్కువ బరువున్న సైకిలైనా, చాలా బరువు అనిపిస్తుంది. ఇలాంటి కొండల్లో కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇళ్లలో ఫ్రిజ్ తప్ప అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఫ్రిజ్ అవసరం వుండదుగా మరి.
భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతం, చలికాలంలో అయితే అసలు ఊహించుకోడానికే వణికిపోతారు.
చివరి మజిలీ 'జలోరీ పాస్'. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందది. అయితే బాగా ఎత్తుగా ఉంటుంది. సైకిల్ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడిచే వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ, శ్రీశైలం మలుపులు కూడా బలాదూరే. ఇక్కడ పొరపాటున కాలుజారి కిందపడితే ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అయితే అక్కడక్కడ కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ నడుస్తుంటే కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
అలా జలోరీ పాస్ చేరుకున్నాక... అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే 'శేషనాగ సరస్సు' చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు, నల్లటి రంగులో నీళ్లు, చుట్టూ చెట్లున్నా సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవడం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు... దగ్గర్లోని మంచుకొండల సోయగాలు... చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.
పైకి ఎక్కడం కంటే... కిందికి దిగటం సులువే కాబట్టి... తిరుగు ప్రయాణానికి హాయిగా, ఆనందంగా బయలుదేరొచ్చు. అయితే ఆ ఆనందం వెనుక అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే సైకిల్ బ్రేక్ ఏ మాత్రం ఫెయిల్ అయినా.. అదుపు తప్పినా అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది.
చల్లటి ఐస్ లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు, సైకిల్ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర. ఆనందం... ఆహ్లాదం... ఆ వెనకే పొంచిఉండే ప్రమాదం ... చలి, ఆ చలిలోనే చెమట... మంచు, వర్షం... ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే ఇది.
నేషనల్ హిమాలరు మౌంటెన్ బైకింగ్ పేరుతో వ్యవహరించే ఈ టూర్‌ను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని పర్యటించొచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్‌ఏఐ ఇండియా డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
No comments:
Post a Comment