అగ్ని రూపం నిశ్చల దీపం
నేడు అరుణాచలంలో కార్తీక దీపం
గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.
అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం. ‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి. ‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి. ‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు. |
ఏమిటీ అరుణాచలం...
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.
అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.
మహా దీపం
అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి. ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ భరణి దీపంతోనే..పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ‘కార్తిగై దీపం’గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నేతిని వినియోగిస్తారు. ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ, గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.
రమణ సందేశం...
తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్