‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్ టూర్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని...
జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో.
ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.
ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.
వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్’ హిందీ సీరియల్ చిత్రీకరించారు.
వానంతా అక్కడే! మౌసిన్‌రామ్
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ ఖాసీహిల్స్ జిల్లాలో.
ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.
ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.
వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.
ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.
వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.
అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్ నుంచీ నవంబర్ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్, ఋషీకేశ్‌ల నుంచి టూర్ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు వెళ్ళే దారిలో హిమకుండ్ సాహిబ్ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.
వసతి:
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.
ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్, గోవింద్‌ఘాట్ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.
పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్ ఓక్ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్ డ్యామ్, దేవికుళం హిల్ స్టేషన్, అట్టుకల్ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్ మధ్య మున్నార్ టూర్ ప్లాన్ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్ (కొచ్చి)లో ఉంది.
వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.
పచ్చని ప్రకృతి ఒడిలో... కొడైకెనాల్
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్ డెస్టినేషన్‌గా కొడైకెనాల్ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్, బోటింగ్, ట్రెక్కింగ్, హార్స్‌ఏరైడింగ్ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్ పార్క్, బెరిజం చెరువు వ్యూ పాయింట్, కొడైకెనాల్ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.
ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)
వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.
No comments:
Post a Comment