Friday, 6 January 2017

గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి 'చార్ ధామ్' మరియు 'దో ధామ్' ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని 'భగీరథి' అని కూడా పిలిచేవారు.

భగిరథి నది ఎగువ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు ఉన్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుండి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప ఆల్పైన్ కానిఫేర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడవొచ్చు. ఈ అడవిని ఇండో-చైనా సరిహద్దు వరకు విస్తరించిన 'గంగోత్రి నేషనల్ పార్క్' గా ప్రకటించారు.

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు, అమర్ సింగ్ తాప18 వ శతాబ్దం లో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తి చెందింది.భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్లు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటి మట్టం తగ్గి ఉండటం వలన, ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల, ఈ రాయి మీదే భగీరథ రాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు, గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న 'గౌరికుండ్' మరియు 'సూర్య కుండ్' కూడా సందర్శించ వొచ్చు.

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా పొందవొచ్చు. ఈ పట్టణం నుండి చిన్న ట్రెక్ ద్వారా 'పాండవ గుఫా' చేరుకోవొచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గుహ (హిందీలో 'గుఫా') అని ఒక నమ్మకం.సముద్ర మట్టానికి 3000 మీ. ఎత్తున ఉన్న 'దయార బుగ్యాల్' ను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవొచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం, ఇక్కడ నుండి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవొచ్చు. దీనిని చేరుకోవాలంటే, రెండు గ్రామాలు, 'బర్సు' మరియు 'రైతల్' నుండి ట్రెక్కింగ్ దారులనుండి చేరుకోవొచ్చు. ఈ ట్రెక్కింగ్ దారులగుండా వెళ్ళేప్పుడు 'శేష్నాగ్ ఆలయాన్ని' సందర్శించవొచ్చు.ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలోనార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ కూడా అనుభూతి చెందవొచ్చు. ఆలి, ముండలి, కుష్ కళ్యాణ్, కేదర్ కాంత, టెహ్రీ గార్వాల్లోని, బెడ్ని బుగ్యల్ మరియు చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్ కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో, గంగోత్రి-గౌముఖ్ -తపోవన్ ట్రెక్కింగ్ స్థావర కాంప్ ఉన్నది. 'కేదార్తల్' ను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గాంజెస్ హిమనదం, మనేరి, కేదార్ తల, నందనవన్, తపోవన్ విశ్వనాధ్ ఆలయం, దోడి తల్, తెహ్రి, కుటేటి దేవి ఆలయం, నచికేత తల్, గంజ్ఞాని మొదలయిన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవొచ్చు.
దీనిని విమానం, రైల్, బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. డెహ్రడున్ లో ఉన్న జోల్ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలను అద్దెకు తీసుకుని ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,న్యూ ఢిల్లీ నుండి డెహ్రడున్ కు చాలా తరుచుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్ రైల్వే స్టేషన్ నుండి కూడా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న నగరాలనుండి గంగోత్రికి బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

Wednesday, 4 January 2017

కర్ణాటకలోని మురుడేశ్వర్‌ - సాగరతీరంలో సరదాగా

కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహం కోరుకుంటున్నారా..! 
అయితే మీ ఉల్లాసాన్ని పదింతలు చేసే ప్రయాణానికి సన్నద్ధమవ్వండి. కడలి కెరటాలపై ఎంచక్కా చక్కర్లు కొట్టేయండి. విహార యాత్రలోనే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. ఇన్ని రకాల అనుభూతులను మిగిల్చే పర్యాటక ప్రదేశం ఎక్కడుందంటారా..? 
ఈ సంక్రాంతి సెలవులకు కర్ణాటకలోని మురుడేశ్వర్‌కి వెళ్లండి. సాగర తీరంలో సరదాగా గడిపేయండి.

మూడు వైపులా అంతులేదనిపించే అరబిక్‌ కడలందం. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు.. ఆ కెరటాలపై తేలియాడే బోట్లు.. ఆహ్లాదంగా కనిపించే తీరం.. దాని వెంబడి పర్యాటకుల సందడి.. వెరసి మురుడేశ్వర్‌లో కనువిందు చేసే దృశ్యాలు. అక్కడే మరోవైపు వెండికొండంత ఎత్తులో కనిపించే పరమేశ్వరుని రజతవర్ణ విగ్రహం.. ఆ చెంతనే ఆకాశాన్నంటే రాజగోపురం.. యాత్రికులకు ఆధ్యాత్మికత ఆనందాన్ని పంచుతాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుందీ మురుడేశ్వర్‌. పౌరాణిక ప్రాశస్త్యం కలిగి ఆధ్యాత్మిక కేంద్రంగా పరిఢవిల్లిన ఈ ప్రదేశం.. కాలక్రమంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పసందైన విడిదిగా అరలారుతోంది.

పౌరాణిక ప్రశస్తి..
ఇక్కడున్న కందుక పర్వతంపై పరమేశ్వరుడు మురుడేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రావణాసురుడు శివుడి ఆత్మలింగం తీసుకుని వెళ్తుండగా.. గణపతి దానిని గోకర్ణంలో నేలపై ఉంచుతాడు. లింగాన్ని తిరిగి తీసుకోవడానికి రావణుడు విఫలయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో లింగం భిన్నమై.. ఒక భాగం మురుడేశ్వర్‌లోని కందుక పర్వతంపై వచ్చి పడుతుంది. అలా పరమేశ్వరుడు అక్కడ వెలిశాడని స్థానిక కథనం. ఇదే పర్వతంపై ప్రపంచంలోనే రెండో ఎత్తయిన పరమేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాదాపు 130 అడుగుల ఎత్తుండే ఈ మూర్తిని చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. మురుడేశ్వర్‌ ఆలయ రాజగోపురం 20 అంతస్తులతో ఠీవీగా కనిపిస్తుంది. ఆలయంలో స్వర్ణ వర్ణంలో ప్రకాశించే సప్తరుషుల మండలం ప్రధాన ఆకర్షణ. శివుడి జటాజూటం నుంచి గంగ జాలువారిన దృశ్యాన్ని కళ్లకుకట్టే మరో విగ్రహం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా మురుడేశ్వర ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక విశేషాలతో అలౌకిక ఆనందాన్ని పంచుతుంది.

కెరటాలపై ఆటలు
ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మురుడేశ్వర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా వస్తుంటారు. విదేశీ యాత్రికులు కూడా ఇక్కడ సేదతీరుతుంటారు. మురుడేశ్వర్‌ బీచ్‌లో ఆటపాటలకు కొదువేం ఉండదు. సముద్రంలో స్పీడ్‌ బోట్‌లో విహారం ఎప్పటికీ మరచిపోలేం. సాగరహోరులో సాగిపోయే జెట్‌ స్కీయింగ్‌, బనానా ట్యూబ్‌ బోట్‌ రైడింగ్‌, ఫ్లైబోర్డింగ్‌.. వంటి జలక్రీడలు టూరిస్టుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక్కడి నేత్రాని ఐలాండ్‌ స్కూబా డైవింగ్‌కు ప్రత్యేకం. సముద్ర గర్భంలోని వింతలను చూస్తూ సమయాన్ని మరచిపోవచ్చు. ఎందుకాలస్యం లెట్స్‌ గో టు మురుడేశ్వర్‌ .

ఎలా వెళ్లాలి
  • బెంగళూరు నుంచి మురుడేశ్వర్‌కు దూరం దాదాపు 455 కిలోమీటర్ల. రోడ్డు మార్గాన వెళ్తే బెంగళూరు నుంచి NH-206 మీదుగా హొన్నావర్‌ చేరుకుని అక్కడి నుంచి NH-17 మీదుగా మురుడేశ్వర్‌ చేరుకోవచ్చు.
  • మురుడేశ్వర్‌లో రైల్వేస్టేషన్‌ ఉంది. బెంగళూరు నుంచి మురుడేశ్వర్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదు. బెంగళూరు నుంచి భట్కల్‌ పట్టణానికి రైలులో చేరుకోవాలి. అక్కడ్నుంచి మార్మగోవా-మురుడేశ్వర్‌ ప్యాసింజర్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
  • మురుడేశ్వర్‌కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం మంగళూరు. అక్కడ్నుంచి మురుడేశ్వర్‌కు 180 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో గానీ, రైలులో గాని మురుడేశ్వర్‌ చేరుకోవచ్చు.

Tuesday, 3 January 2017

పోలెండ్

10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. 18వ శతాబ్దంలో ప్రపంచ పటం నుండి పోలెండ్ మాయమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ తిరిగి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హిట్లర్ సేనలు పోలెండ్‌ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని  కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల సమయంలో వేలాదిమంది పౌరులు, అధికారులు ఊచకోతకు గురయ్యారు. అటు రష్యా, ఇటు జర్మనీ సేనల మధ్య పోలెండ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది.

1. మాసూరియన్ సరస్సులు: పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మాసూరియా సరస్సు యాత్రికులకు స్వర్గం లాంటిది. దట్టమైన అడవులు, సరస్సులను కలిసే చిన్న చిన్న నదులతో ప్రయాణికులకు ఎంతో అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పోలెండ్ దేశానికి ఉత్తరంలో, లిథువేనియా, రష్యా దేశాల సరిహద్దులలో ఉంది. ఇక్కడ అందమైన గుహలు, అందమైన చర్చిలు, గతరాజుల నివాస భవనాలు ఎన్నో కనబడతాయి. ఈ ప్రదేశమే ఒకప్పుడు హిట్లర్ యుద్ధకేంద్రంగా వెలుగొందింది.

2. స్లోవిన్‌స్కీ ఇసుక తిన్నెలు: దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్‌స్కీ జాతీయ పార్కులో ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కనే బాల్టిక్ సముద్రం ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఇసుక తిన్నెలు గాలి వీచడం ద్వారా ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి 30 మీటర్లు ఎత్తు వరకు ఏర్పడతాయి.

3. క్రాకోవ్ నగరం: పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. లెస్సర్ పోలెండ్ ప్రాంతంలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇది మొదటగా నిర్మింపబడిందని చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో స్లావోనిక్ యూరప్ దేశాలతో గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉంది.

1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నగరంలో వావెల్ కెథడ్రాల్, రాయల్ కేజిల్, ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండే విస్తులా నది, సెయింట్ మేరీస్ బాసిలికా, జగిలోనియన్ విశ్వవిద్యాలయం, క్లాత్‌హల్, ప్యాలస్ ఆర్ట్, కనోనిక్జా వీధి, పావిలాన్ విస్పియన్‌స్కీ... ఇంకా మరెన్నో చూడదగ్గ స్థలాలు ఉన్నాయి.

4. వార్సా: ఇది పోలెండ్ దేశానికి రాజధాని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నగరం అభివృద్ధిలో ఊపందుకుంది. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. నగరంలో చాలావరకు భవనాలు నాలుగైదు అంతస్తుల్లో రంగుల్లో కనబడతాయి. నగరంలోని పురాతన మార్కెట్ స్థలం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. నగరంలో ఐరోపా సంస్కృతి బాగా కనబడుతుంది. నగరంలో ఓల్డ్‌టౌన్, రాయల్‌రూట్, చోపిన్ మ్యూజియం, జ్యుయిస్ ఘెట్టో మొదలైన ఎన్నోప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

5. వ్రోక్లా ద్వీపకల్పాల నగరం: వ్రోక్లా నగరం లోయర్ సిలేసియా ప్రాంతానికి రాజధాని. ఈ నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక బ్రిడ్జి చొప్పున నగరం మొత్తంలో 100కు పైగా బ్రిడ్జిలు కనబడతాయి. ఇది దేశానికి దక్షిణ-పశ్చిమ భాగంలో ఉంది. ఇదొక పురాతన నగరం. ఇక్కడే ఓద్రా నది ప్రవహిస్తుంది. దీని ఉపనదులే ఈ నగరాన్ని చిన్న చిన్న ద్వీపాలుగా మార్చేశాయి. ఈ నగరంలో మొత్తం 25 మ్యూజియంలు ఉన్నాయి. సెయింట్ జాన్ కెథడ్రాల్, నగరాన్ని ఆనుకొని సుడెటెన్ పర్వతాలు పరుచుకొని ఉండి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

పరిపాలనా విభాగాలు: దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని  పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్‌లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్‌లుగా విభజించారు. పోలిష్ భాష నోరు తిరగనంత కఠినంగా ఉంటుంది. ఆ పేర్లను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి చెప్పుకుంటే బాగుంటుంది. 16 ప్రాంతాలు... గ్రేటర్ పోలెండ్, కువాయియణ్-పొమెరేనియన్, వెస్సర్ పోలెండ్, లోడ్జ్, లోయర్ సిలేసియన్, లుబ్లిన్, లుబుజ్, మాసోవియన్, ఒపోలే, పోడ్‌లాస్కీ, పోమరేనియన్, సిలేసియన్, సబ్‌కార్ఫాథియన్, స్వీటోక్రిజస్కీ. వార్మియన్-మాసూరియన్, వెస్ట్‌పోమరేనియన్. దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... వార్సా, క్రాకో, లోడ్జ్, వరోక్లా, పోజ్‌నన్, జిడాన్సక్, సెజెసిన్, బిడ్‌గోసెజ్, లుబ్లిన్, కటోవైస్, బైలిస్టాక్, జిడినియా, జెస్లోకోవా, రాడోమ్, సోస్నావిక్, టోరున్, కీలెస్, గ్లివైస్, జెస్‌జోన్, జబ్‌రెజ్.

ప్రజలు - సంస్కృతి: పోలెండ్ దేశానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కువగా యూరోపియన్ సంస్కృతి కనబడుతుంది. ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. ఉంది. పోలెండ్ ప్రజలను పోల్స్ అంటారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. దేశంలో జర్మన్‌లు, ఉక్రేనియన్‌లు, బెలారూసియ+న్‌లు, జిప్సీలు, లిధువేనియన్‌లు, జ్యుయిష్‌లు కూడా ఉన్నారు. ఇలా దేశంలో విభిన్న దేశాలకు చెందిన వారు ఉండడం వల్ల దేశమంతటా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనబడతాయి.

 నైసర్గిక స్వరూపం

 ఖండం - ఐరోపా
 వైశాల్యం - 3,12,679 చ.కి.మీ.
 జనాభా -  3,84,83,957 (తాజా అంచనాల ప్రకారం),
 రాజధాని- వార్సా, కరెన్సీ - పోలిష్ జోలోటీ,
 ప్రభుత్వం - పార్లమెంటరీ రిపబ్లిక్, అధికారిక భాష- పోలిష్,
 మతం - 97 శాతం క్రైస్తవులు,
 సరిహద్దులు -  బాల్టిక్ సముద్రం, రష్యా, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా,
 స్వాతంత్య్ర దినాలు -  కమ్యూనిస్ట్ పోలెండ్ - 8 ఏప్రిల్ 1945, రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ - 13 సెప్టెంబర్ 1989,
 పంటలు- తృణధాన్యాలు, చెరకు, నూనెగింజలు, బంగాళదుంపలు,
 ఖనిజాలు- బొగ్గు, సల్ఫర్, రాగి, జింకు, సీసం, ఇనుము,
 పరిశ్రమలు - యంత్రభాగాలు, బొగ్గు, రసాయనాలు, పెట్రోలియం శుద్ధి, ఆహార ఉత్పత్తులు,
 వాతావరణం - జనవరిలో -5 నుండి 0 (సున్న) డిగ్రీలు, 15 నుండి 25 డిగ్రీలు జూలైలో

బర్మా (Burma)

  • బర్మదేశం అగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ మరియు తాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.
  • దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది.
  • పూరాతత్వ శాస్త్రజ్ఞులు సాక్ష్యాల ఆధారంగా బర్మా ప్రాంతాలలో 750,000 సంవత్సరాలకు పూర్వం ఆదిమానవుడు నివసించినట్లు ఉంది
  • ప్రజలు వ్యవహారికంగా మాట్లాడుకునే బామర్ భాష వలన బర్మా అనే పేరు వచ్చింది. నమోదు చేసుకున్న పేరును బామా లేక మియామా అని పలకబడుతుంది. బ్రిటిష్ పాలనా కాలంలో ఇది బర్మాగా పిలువబడింది.
  • క్రీ.శ1050 లో జరిగిన పాగన్ సామ్రాజ్యపు విస్తరణ కారణంగా బుద్ధిజం క్రమంగా ఈ దేశంలో ప్రధాన మతంగా మారింది. 277-1301 కాలంలో సంభవించిన మంగోలుల దండయాత్ర వలన పాగన్ సామ్రాజ్యం పతనం కావడంతో రాజ్యం ముక్కలుగా అయి చిన్న రాజ్యాలు తలెత్తాయి
  • 1824-1885 తరువాత సంభంవించిన మూడు వరుస యుద్ధాల అనంతరం బర్మాదేశం బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యంగా మారింది.బ్రిటిష్ పాలన దేశంలో సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక మరియు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న బర్మా దేశంలో పాలనా పరమైన మార్పులను తీసుకు వచ్చింది
  • 1937 ఏప్రిల్ 1 నాటికి బ్రిటిష్ కాలనీలలో బర్మా ప్రత్యేక పలనా నిర్వహిత కాలనీగా మారి బా మా ప్రీమియర్ బర్మాకు మొదటి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. 1940లో జపన్ రెండవ ప్రపంచ యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి ముందు ఔంగ్ సాన్ నాయకత్వంలో జపాన్‌లో బర్మా స్వాతంత్ర సేన రూపుదిద్దుకున్నది.
  • రెండవ ప్రపంచయుద్ధానంతరం ఔంగ్ సాన్ మధ్యవర్తిత్వంతో సంప్రదాయ సమూహాల నాయకులతో ఒప్పందం కుదిరిన తరువాత బర్మా స్వాతంత్రం నిర్ధారించబడి బడి సంయుక్త బర్మా అవతరించింది. 1947లో ఔంగ్ సాన్ బర్మకు దేఫ్యూటీ ఛైర్మన్‌గా నియమించబడ్డాడు.
  • మార్చి 1962 న, జనరల్ నే విజయాలు నేతృత్వంలోని సైనిక బలప్రయోగ విప్లవం ద్వారా బర్మా పలనాధికారం చేజిక్కించుకున్నారు.
  • 1962 మరియు 1974 మధ్య, బర్మా ప్రజల సాధారణ నేతృత్వంలోని ఒక విప్లవ మండలి పరిపాలన మరియు సమాజం యొక్క దాదాపు అన్ని అంశాలను కలిపి బర్మీస్ వే టొ సోషలిజం (సోవియట్ శైలి సొషలిజం) పేరుతో జాతీయ లేదా ప్రభుత్వ నియంత్రణ క్రిందకు తెచ్చారు.
  • 1988లొ సైనికాధికారులు బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టి ని స్తాపించి పాలన సాగించింది. 1962 జూలై 7 ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెసినందుకు రంగూన్ విశ్వవిద్యాలయం విద్యర్ధులను 15 మందిని కాల్చి వేసారు. 1988 లో, ప్రభుత్వం ఆర్థికపరమైన అసమర్ధత మరియు రాజకీయ అణచివేతకు ఫలితంగా దేశ వ్యాప్తంగా విస్తృత మైన ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు జరగడానికి దారితీసింది అశాంత పరిస్థితితి 8888 తిరుగుబాటు అని పిలుస్తారు . భద్రతా దళాలు ప్రదర్శనలపై వేలాది మంది ప్రజాస్వామ్య ప్రదర్శకులను చంపివేసింది
  • మే 1990 లో, ప్రభుత్వం దాదాపు 30 సంవత్సరాల మొదటి సారిగా స్వతంత్ర ఎన్నికలు నిర్వహించబడి ఔంగ్ సాన్ సూ రాజకీయ పార్టీ డెమోక్రసీ జాతీయ లీగ్ (ఎన్ ఎల్ డి) మొత్తం 489 స్థానాలలో 392 స్థానాలు స్వాధీనం చేసుకున్నది. అయినా అధికారం ఇవ్వడానికి నిరాకరించిన సైనిక ప్రభుత్వం 1997 వరకు ఎస్ ఎస్ ఒ ఆర్ సి ఆధ్వర్యంలోనే దేశపాలన కొనసాగించింది.
  • బర్మాదేశం ఏడు రాష్ట్రాలు, ఏడు ప్రాంతాలు (రీజియన్స్)గా విభజింపబడ్డాయి. 2010 ఆగస్ట్ 20 ప్రాంతాలకు తిరిగి పేరుపెట్టబడింది.
  • బర్మాదేశపు మొత్తం వైశాల్యం 678,500 చదరపు కిలోమీటర్లు దక్షిణ ఆసియా ప్రధాన ప్రదేశంలో ఇది పెద్ద రాజ్యం అలాగే ప్రపంచంలో ఇది 40వ స్థానంలో ఉంది. బర్మా రాజ్యాంగ పరంగా 14 రాష్ట్రాలను 67 జిల్లాలను 330 తాలూకాలు, 2914 వార్డులు, 14,220 మండలాలను 68,290 గ్రామాలను కలిగి ఉన్నది.
  • బర్మా వాయవ్యంలో బంగ్లాదేశ్ దేశానికి చెందిన చిటగాంగ్ డివిజన్, భారతదేశానికి చెందిన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. బర్మా ఉత్తరం మరియు ఈశాన్య సరిహద్దులలో టిబెట్ మరియు చైనాకు చెందిన యున్నన్ రాష్ట్రాలు ఉన్నాయి.
  • లంచగొండితనం అధికంగా ఉన్న 183 దేశాలలో బర్మా 180వ శ్రేణిలో ఉంది. 2011 నాటికి బర్మా అత్యంత అవినీతి కలిగిన దేశంగా గుర్తించబడింది.
  • ఏదిఏమైనప్పటికీ 2011 ఆగస్ట్ ఎన్నికల అనంతరం బర్మా మానవహక్కల పరిస్థితి అభివృధ్ధి సాధించంది




  • బర్మా పూర్తి పేరు : ప్యి-డువాంగ్-జు మ్యాన్-మా నైంగ్-న్గాన్-డావ్ ( మయాన్మార్ యూనియన్)
  • బర్మా జాతీయగీతం : కాబా మా క్యెయీ
  • బర్మా రాజధాని : Naypyidaw
  • బర్మా అధికార భాషలు : బర్మీస్
  • బర్మా ప్రధాన మంత్రి : en :Soe Win
  • బర్మా స్వాతంత్ర్యం : యునైటెడ్ కింగ్డం నుండి జనవరి 4 1948
  • బర్మా విస్తీర్ణం : 676,578 కి.మీ²
  • బర్మా జనాభా : 50,519,000²
  • బర్మా జీడీపీ : $93.77 బిలియన్
  • బర్మా కరెన్సీ : క్యాట్ (K) (mmK)

Sunday, 1 January 2017

చంద్రుడి మీదకి వెళ్లొచ్చినట్లే ఉంది..!

" హిమాలయాల అందాలనీ అక్కడి జీవనసౌందర్యాన్నీ ఆసాంతం ఆస్వాదించాలంటే ఆ పర్వతశ్రేణుల్ని అధిరోహించాల్సిందే. " అంటూ లేహ్ లద్దాఖ్ లోని ట్రెక్ అనుభవాలను వివరిస్తున్నారు బెంగళూరుకు చెందిన యామర్తి శ్రీనివాస్ శ్రీవాత్సవ్.

బెంగళూరు నుంచి దిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడనుంచి మరో విమానంలో 1325 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్‌ లద్దాఖ్‌కు గంటలో చేరుకున్నాం. లేహ్‌ అనేది జస్కర్‌, లద్దాఖ్‌ పర్వతశ్రేణుల మధ్య ఉన్న లోయ. ఇది చైనా, టిబెట్‌ సరిహద్దులో ఉంది.

ఆక్సిజన్‌ అందలేదు!
హిమాలయ పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి 3,500 వేల అడుగుల ఎత్తులోని లేహ్‌కి చేరగానే వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి కొంత ఇబ్బందికి గురయ్యాం. దీన్ని ఎక్యూట్‌ మౌంటెయిన్‌ సిక్‌నెస్‌గా పిలుస్తారు. అందుకే పర్వతారోహకులను రెండుమూడురోజులు వాతావరణానికి అలవాటు పడేవరకూ ఆ ప్రాంతంలోనే ఉంచుతారు. దాంతో మేం మూడు రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లద్దాఖ్‌లోని ప్రాంతాలన్నీ తిరిగాం. పట్టణంలోని ప్రధాన బజారుకి వెనకగా ఉన్న చాంగ్‌ గలి అనే రోడ్డులోని చిన్న దుకాణాల్లో ముత్యాలూ పగడాలూ లాపిస్‌ లాజులి వంటి రత్నాలూ బాగా దొరుకుతాయి. ఒకరోజు సాయంత్రం జపాన్‌వాళ్లు నిర్మించిన చాంగ్స్‌ పా అనే శాంతి స్థూపాన్ని దర్శించాం. దీన్ని 1985లో దలైలామా ప్రారంభించారట. ఇది తెలుపు రంగులో అద్భుతంగా ఉంది. రాత్రివేళ లైట్లలో అందంగా మెరుస్తూ కనిపించింది. దీన్ని చూడ్డానికి అనేకమంది సందర్శకులు ఏటా లద్దాఖ్‌ను సందర్శిస్తుంటారట.

నాలుగోరోజు లామాయురు - చిల్లింగ్‌ ట్రెక్‌కు బయలుదేరాం. లేహ్‌ పట్టణంలో ట్రెక్కింగ్‌కు సంబంధించిన ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. మేం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడంతో అక్కడకు వెళ్లగానే ఆ ఏజెన్సీకి వెళ్లి రిపోర్టు చేశాం. వాళ్లు మాకు గైడ్లనీ వంటమనిషినీ సామాన్లు చూసుకునే కేర్‌ టేకర్‌నీ ఏర్పాటుచేశారు. వాళ్లు మాకోసం కూరలూ వంటసామాన్లూ టెంట్లూ అన్నీ తీసుకుని మాతోపాటు బయలుదేరారు. సామాన్లు మోసేందుకు కంచరగాడిదలూ పొట్టి గుర్రాలూ కూడా తీసుకొచ్చారు. ఈ సామాన్లు వేసుకుని వంటమనిషీ కేర్‌టేకరూ మాకన్నా ముందుగానే వెళ్లిపోయేవారు. మేం చేరాల్సిన మజిలీకి ముందుగానే చేరుకుని టెంట్లు వేసి వంటలు చేసి ఉండేవారు.

సరస్సు మాయమైంది!
ముందుగా లేహ్‌ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లామాయురు అనే ప్రాంతానికి చేరుకున్నాం. నిజానికి ఈ లామాయురు అనేది ఒకప్పుడు పెద్ద సరస్సు అనీ లాట్సొవా నరోపా అనే బౌద్ధగురువు చేతి మహిమతో ఆ సరస్సు అంతర్థానమైందనీ చెబుతారు. ఇక్కడే పదో శతాబ్దంలో రింకె జాంగ్పొ స్థాపించిన బౌద్ధారామాన్నీ సందర్శించాం. లద్దాఖ్‌ ప్రాంతంలోకెల్లా పురాతనమైనది ఇదే. ఈ ట్రెక్‌లో హిమాలయాల సౌందర్యాన్నే కాదు, బౌద్ధారామాల్నీ అక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్నీ పరిశీలించవచ్చు.

బౌద్ధారామాన్ని సందర్శించాక గైడ్‌ సహాయంతో పర్వతారోహణ ప్రారంభించాం. ఆ కొండల్లో అన్నీ మెలికల దారులే. వాటి వెంబడి నడుచుకుంటూ వెళ్లాం. కొంతవరకూ తారురోడ్లూ మరికొంత మట్టిరోడ్లూ ఉన్నాయి. అక్కడ ఉన్న కొండల్ని చూస్తుంటే మాకేదో చంద్రగ్రహంమీద నడుస్తున్నామా అనిపించింది. అందుకేనేమో వాటిని మూన్‌ స్కేప్‌ అంటారట. నడక మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉన్నా కొంతసేపటికి ఆయాసం రావడంతో మెల్లగా వేగం తగ్గించాం. అలా కాసేపు వేగంగానూ మరికాసేపు నెమ్మదిగానూ నడుస్తూ 3750 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రింక్టి లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం.

అక్కడ నుంచి మళ్లీ సన్నని దారిలో కిందకు దిగుతూ షిల్లా అనే గ్రామం మీదుగా నడుస్తూ 3160 మీటర్లలోని వాన్లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. మేం అక్కడకు చేరుకునేసరికి టెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బాగా అలసిపోవడంవల్ల వెంటనే నిద్రపట్టేసింది. తరవాతి రోజు పొద్దునే అల్పాహారం తిని మళ్లీ నడక మొదలుపెట్టాం. దారిలో ఫెంజిల్లా, ఉరి అనే గ్రామాల మీదుగా 3740 మీటర్ల ఎత్తులోని హింజు అనే గ్రామానికి చేరుకుని ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాం.





మూడోరోజు ఉదయాన్నే హింజు నుంచి 4950 మీటర్ల ఎత్తులోని కాంజెస్కి లా అనే ప్రాంతానికి ఎక్కాం. మా పర్వతారోహణలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఇదే. అక్కడ నుంచి చూస్తే మేఘాలు కొండ శిఖరాన్ని తాకుతున్నాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అనిపించింది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని తరవాతి రోజు ఉదయాన్నే కాంజెస్కి లా నుంచి 3810 మీటర్ల ఎత్తుకి దిగాం. అక్కడక్కడా ఎత్తైన మంచు శిఖరాల మీద నుంచి జాలువారే నదీపాయల్ని దాటుకుంటూ సుందా చెన్‌మో అనే గ్రామానికి చేరుకున్నాం. ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అడవి గులాబీలు తలలూపుతూ స్వాగతిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ దారిలో మాకు జడలబర్రెలూ వాటిని మేపే వాళ్ల గుడిసెలూ కనిపించాయి.

ఆ తరవాతి మజిలీ లానాఖ్‌ లా... అది 4370 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పైకి ఎక్కుతూ 4820 మీటర్ల ఎత్తులోని డూంగ్‌ డూంగ్‌ చాన్‌ లా అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడి నుంచి 3550 మీటర్ల దిగువన ఉన్న లోయలోని చిల్లింగ్‌ అనే ప్రాంతానికి దిగడంతో మా పర్వతారోహణ దిగ్విజయంగా పూర్తయింది. లద్దాఖ్‌ ప్రాంతంలో రాగి, ఇత్తడి, కంచు, వెండి, ఇనుము... వంటి లోహవస్తువులు విక్రయించే మార్కెట్‌ ఉన్న గ్రామం చిల్లింగ్‌ ఒక్కటే. ఆ గ్రామంలో కాసేపు తిరిగి చూశాం. తరవాత జస్కర్‌ నది, సింధూనది కలుసుకునే నిమ్మొ అనే ప్రదేశానికి వెళ్లాం. సింధూనది టిబెట్‌ నుంచి మనదేశంలోని లేహ్‌ పట్టణంగుండా ప్రవహిస్తూ పాకిస్థాన్‌కు చేరుకుని అటునుంచే అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

అన్నీ చెక్క ఆలయాలే!
సింధూనదీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే చిన్నా పెద్దా మొక్కలు కనిపిస్తాయి. మిగిలిన ప్రాంతమంతా ఎడారే. అక్కడ ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్‌, గోధుమ, బార్లీ పంటలు పండిస్తారు. అవే వాళ్ల ప్రధాన ఆహారం. అక్కడక్కడ గడ్డి తుప్పలు కనబడుతూ ఉంటాయి. సింధూనదిలో కనిపించే నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలకు తాగునీరూ సాగునీరూ అన్నీ సింధూ జలాలే. లేహ్‌కి తిరిగివచ్చి అక్కడి ప్రదేశాలన్నీ చూశాం. లేహ్‌ పట్టణమంతా బౌద్ధమతస్తులే. ఇక్కడి ఆలయాలన్నీ చెక్కతో చేసినవే. బుద్ధ విగ్రహాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఆలయాల్లో ఉండే పూజారులను లామాలు అంటారు. లేహ్‌లో 1672 సంవత్సరంలో కట్టిన హెమిస్‌ అనే ఆలయానికి వెళ్లాం. అక్కడినుంచి పదో శతాబ్దంలో నిర్మించిన ఆల్చీ అనే పురాతన ఆలయాన్ని సందర్శించాం. తరవాత పట్టణంలోని పురాతన వస్తుప్రదర్శనశాల చూడ్డానికి వెళ్లాం. అందులో లద్దాఖ్‌కు చెందిన చారిత్రక వస్తువులూ ఆయుధాలూ ఉన్నాయి.

కాలినడకే శరణ్యం!
కార్గిల్‌, లేహ్‌ రెండూ లద్దాఖ్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. లేహ్‌ పట్టణంలో స్కూళ్లూ కాలేజీలూ ఉన్నాయి. అక్కడి పర్వతశ్రేణుల్లో కూడా ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా దిగువన ఉన్న ప్రదేశాల్లో చిన్న గ్రామాలు చాలానే ఉన్నాయి. హింజు, వాన్లా... వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి. ఆయా గ్రామాల్లో ఇళ్ల సంఖ్య పదీ ఇరవైకి మించదు. జడలబర్రె, కుందేళ్లను పోలిన మార్‌మోట్‌, జింకలూ పష్మీనా గొర్రెల్నీ ఎక్కువగా పెంచుతారు. పష్మీనా గొర్రెల నుంచి తీసిన వూలు చాలా ఖరీదు. దాంతో వాళ్లు శాలువాలూ స్వెట్టర్లూ అల్లి విక్రయిస్తుంటారు. అదే వాళ్ల ప్రధాన ఆదాయం.

అక్కడ ప్రతి గ్రామంలోనూ ధర్మచక్ర అనే ప్రార్థనా చక్రాలు ఉంటాయి. వూళ్లలో చిన్న చిన్న స్కూళ్లు ఉన్నాయి కానీ కాలేజీ చదువుకి మాత్రం లేహ్‌కి రావాల్సిందే. కొండ ప్రాంతాలనుంచి కిందకి రావాలంటే కాళ్లే వాళ్లకి వాహనాలు. కిందకు వచ్చి కూరలూ సరుకులూ తీసుకెళుతుంటారు. సువాసన భరితమైన పూలు అక్కడ చాలానే దొరుకుతాయి. వాటితో అగరబత్తీలు తయారుచేస్తుంటారు.

తరవాతి రోజు టిబెట్‌ సరిహద్దులో ఉన్న పాన్‌గాంగ్‌ అనే సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఆ సరస్సు 4267 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉంది. లేహ్‌ నుంచి ఐదు గంటలు ప్రయాణం చేసి ఆ సరస్సుకి చేరుకున్నాం. అందులో సగ భాగం భారతదేశంలోనూ మిగిలిన సగం టిబెట్‌ ప్రాంతంలోనూ ఉంది. ఆ సరస్సు అందాన్ని మాటల్లో వర్ణించలేం. అందులోని నీరు సూర్యకాంతిని అనుసరించి రంగులు మారుతుంటుంది. వూదారంగు నుంచి ఆకుపచ్చా, నీలం రంగుల్లోకి మారుతూ సందర్శకుల్ని మరోలోకంలో విహరింపజేస్తుంది. ఆ సరస్సుకి వెళ్లే దారిలోనే చాంగ్లా అనే ప్రాంతం వస్తుంది. అది ప్రపంచంలోనే వాహనాలు వెళ్లే మూడో ఎత్తైన రోడ్డు. చాంగ్లా ప్రాంతంలో ఓ కేఫెటేరియా ఉంది. అక్కడ కాస్సేపు ఆగి టీ తాగాం. అక్కడే తుక్వా అనే ఓ వంటకాన్నీ రుచి చూశాం. మరో రోజు లేహ్‌కి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్దుంగ్‌ లా పాస్‌కీ వెళ్ళొచ్చాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు.

విద్యార్థులే గైడ్లు!
ఈ యాత్రలో గైడ్లూ కేర్‌టేకరూ మాకు అందించిన సహకారం మర్చిపోలేనిది. మా పర్వతారోహణ విజయవంతంగా ముగించడానికి వాళ్లే కారణం. ఉదయాన్నే వంటచేసి బాక్సుల్లో పెట్టి ఇచ్చేవారు. మేం బయలుదేరే సమయానికి టిఫెన్‌ రెడీ చేసి అందించేవారు. మళ్లీ రాత్రికి మేం చేరబోయే ప్రాంతానికి మాకన్నా ముందే వెళ్లి టెంట్లు వేసి వంటలు చేసి తయారుగా ఉంచేవారు. అక్కడ ఎక్కువగా చదువుకునే విద్యార్థులే గైడ్లుగా పనిచేస్తారు. ట్రెక్కింగ్‌ ఏజెన్సీల ద్వారా ఈ ఏర్పాటు చేసుకుని చదువుకి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వివిధ ప్రాంతాల యాత్రికులతో కలిసి తిరగడంవల్ల వాళ్లు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటుంటారు. ఆయా వ్యక్తుల ఆచార వ్యవహారాలూ జీవన విధానాలూ అన్నీ తెలుసుకుంటారు. రకరకాల భాషలు నేర్చుకుని ఏ రాష్ట్రం వారితో ఆ భాషలో మాట్లాడుతున్న పిల్లలను చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంతేకాదు, మాకు వండిపెట్టే వ్యక్తి పాకశాస్త్ర నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాం. ఉదయాన్నే ఉడికించిన గుడ్లూ అరటిపండ్లూ ఆలూపరాటాలూ అల్పాహారంగా ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజనానికి ఉడికిన బంగాళాదుంపలూ శాండ్‌విచ్‌లూ చాక్లెట్లూ ఫ్రూటీలూ బాక్సుల్లో అందించేవారు.

పగలంతా కొండలు ఎక్కీ దిగీ బాగా అలసిపోయి రాత్రికి మజిలీకి చేరుకునేసరికి వేడి వేడి అన్నమూ పప్పూ పన్నీరుతో కూరా పండ్లూ ఇచ్చేవారు. అవన్నీ తృప్తిగా తిని, అప్పటికే పక్కలు వేసి సిద్ధంగా ఉంచిన టెంట్లలో హాయిగా నిద్రపోయేవాళ్లం. ఆ విధంగా వాళ్ల సహకారంతో మా ట్రెక్కింగ్‌ను దిగ్విజయంగా పూర్తిచేసుకోగలిగాం.

Tuesday, 27 December 2016

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌... మహిష్మతి








మహిష్మతి
మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌


మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్‌’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖార్గోన్‌ జిల్లాలో ఉందీ మహేశ్వర్‌ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్‌ జాతీయ రహదారికి కేవలం 13 కిలోమీటర్లు, ఇండోర్‌ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి.

శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్‌ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్‌ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్‌ తన భర్త మరణా నంతరం మహేశ్వర్‌ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్‌ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్‌ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం.

రామాయణ కాలం నాటి సామ్రాజ్యం
మహేశ్వర్‌ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది.

ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట.

ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు
దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం.

అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది.

దేవాలయాల రాజ్యం
సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్‌ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్‌ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది.

వింధ్యవాసినీ శక్తిపీఠం
మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్‌ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్‌ వేవేల విధాలుగా మహేశ్వర్‌ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు.

ఉత్సవాల కోలాహలం
అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్‌ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది.

సినిమాలలో మహేశ్వర్‌!
నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ వీడియో, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్‌ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు
మహేశ్వర్‌ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు.

మధ్యప్రదేశ్‌ టూరిజమ్‌ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌లో ‘జల్‌ మహోత్సవ్‌’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్‌–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్‌ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది.

వివరాలకు: మధ్యప్రదేశ్‌ టూరిజమ్, టూరిస్ట్‌ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌. 9866069000 / 9951080605లలో సంప్రతించవచ్చు.

ఇలా వెళ్లచ్చు!
హైదరాబాద్‌ నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్‌ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కి 95 కిలోమీటర్లు.

–  నిర్మల చిల్కమర్రి



Saturday, 10 December 2016

పళని మురుగన్







కొండలలో కోటి జ్ఞానకాంతుల స్వామి పళని మురుగన్



శివపార్వతుల గారాల తనయుడు, దేవసేనాధిపతి, తారకాసురుడనే రాక్షస సంహారానికి ఉద్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. సకల విద్యాపారంగతుడిగా, జ్ఞానప్రదాతగా, దండాయుధపాణిగా, నిత్యయవ్వనుడుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పేరుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలకు, ఆయనను అర్చించే భక్తులకు తెలుగునాట కొదవలేనప్పటికీ తమిళనాడు, కర్ణాటకలలో మనకన్నా అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అడుగడుగునా గుడులు కట్టి పూజించడం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. తమిళనాట గల ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యక్షేత్రం పళని. దండాయుధపాణిగా, బాలమురుగన్‌గా, పళని మురుగన్‌గా తమిళులు కొలిచే ఈ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనదిగా, మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది.

స్థలపురాణం:
వినాయకచవితినాడు మనందరం చెప్పుకునే కథ ఒకటుంది. అదేమంటే గణాధిపత్యం కోసం పోటీపడుతున్న కుమారులతో భూమండలంలోని అన్ని పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసి, ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో, వారికే గణాధిపత్యమిస్తానని శివుడు చెప్పడం, ఆ మాట వినడంతోటే తన మయూర వాహనాన్ని అధిరోహించి, కుమారస్వామి వాయువేగంతో వెళ్లిపోవడం, వినాయకుడు తెలివి తేటలను ఉపయోగించి, నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, మూడుమార్లు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ మహిమతో కుమారస్వామి ఏ పుణ్యతీర్థానికేగినా అన్నగారే తనకన్నా ముందుగా వచ్చి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వెళ్లిన ఆనవాళ్లు కనిపించి ఖిన్నుడై, కైలాసం వచ్చేసరికి, ఈ పరీక్షలో గణేశుడే నెగ్గాడంటూ గణాధిపత్యాన్ని వినాయకుడికే కట్టబెట్టడం.. ఆ ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం...

ఇంత వరకూ కథ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో, వినాయకచవితి రోజున తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడు జరిగిన పరిణామానికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో బాధపడతాడు. తలిదండ్రుల మీద అలిగి, అన్నగారిలాగా తనకు కూడా పరిపక్వమైన జ్ఞానం లభించాలనే కాంక్షతో తన అలంకారాలన్నింటినీ వదిలేసి, భూలోకం వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఒక కొండమీద గల ప్రశాంతమైన వాతావరణంలో తపస్సులో మునిగిపోయాడు. కైలాసంలో కుమారుని జాడ తెలియక పార్వతీదేవి బెంగపడుతుంది. పరమేశ్వరుడు పత్నిని ఊరడించి, ఆమెను వెంటబెట్టుకుని కొడుకుని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు. ఇద్దరూ కలసి వెతుకుతుండగా, తమిళనాడులోని తిరు ఆవినంకుడి అనే ప్రదేశం వద్దకు రాగానే కొండశిఖరం బంగారు కాంతులతో మెరుస్తూ కనపడటంతో తమ కుమారుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుంటారు.

తపోదీక్షలో ఉన్న పుత్రుని చేరదీసి, ముద్దాడుతూ, ‘నువ్వే నా జ్ఞానఫలానివిరా బంగారుకొండా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులు కుమారుని అనుగ్రహిస్తారు. తల్లిదండ్రుల ఊరడింపుతో కుమారస్వామి అలకమానతాడు కానీ, ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చడంతో తన అంశను అక్కడే వదిలి, తలిదండ్రులతో తిరిగి కైలాసం చేరతాడు. ఇదీ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పురాగాథ. ఆ ప్రదేశమే ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అర్చించే పళని ఆలయం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు.

అన్ని విగ్రహాల్లాంటిది కాదు:
పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్ని విగ్రహాలలా రాతితో మలిచింది కాదు. నవపాషాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినది. ఈ నవ పాషాణాలనే తొమ్మిది విధాలైన మూలికలు అని కొందరంటారు, తొమ్మిది భయంకరమైన విషాలనూ ప్రత్యేకమైన పాళ్లలో కలిపితే అమృతం వంటి ఔషధం తయారవుతుందని, అందుకే దీనిని భోగార్ అనే ముని ఈ విగ్రహాన్ని ప్రత్యేకశ్రద్ధతో మలచాడని క్షేత్రపురాణం చెబుతోంది. ఈ ఆలయం దాదాపు పదహారు గంటలసేపు తెరిచే ఉంటుంది. అందరూ స్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా గర్భాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ మందిరం క్రీస్తుశకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ కట్టించగా, దానిని పాండ్యరాజులు పునరుద్ధరించారు.

అద్భుతమైన శిల్పసంపదతో, కేవలం కౌపీనం మాత్రమే కట్టుకుని, చేతిలో శూలాయుధం పట్టుకుని, చూడగానే ఆకట్టుకునే అందమైన విగ్రహంతో కనువిందు చేస్తాడు ఈ దేవసేనాని, దండాయుధ పాణి. కావడి మొక్కులంటే ఇష్టమట ఈస్వామికి. అంటే ఏదయినా ఆపద కలిగినప్పుడు తాము సమర్పించగలిగినదానిని కావిళ్లకొద్దీ సమర్పించుకుంటామని మొక్కుకుని, ఆపద తీరగానే, నియమ నిష్ఠలతో స్వామికి కావిళ్లలో కానుకలు మోసుకుంటూ నృత్యగానాలతో స్వయంగా సమర్పించుకుంటారు భక్తులు. తండ్రి అయిన శివునిలాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తికమాసంలో అయితే రోజుకు కనీసం 700 మార్లు భక్తుల అభిషేకాలందుకుంటాడు ఈ స్వామి. వల్లీ, దేవసేన ఆయన భార్యలు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిరోజున స్వామివారికి కన్నుల పండువగా కల్యాణోత్సవం జరుగుతుంది.

పర్యాటక స్థలాల పళని
పళని చుట్టూ బోలెడన్ని పర్యాటక స్థలాలున్నాయి. తిరునావినంకుడి ఆలయం, ఇదుంబన్ ఆలయం, పదగణపతి ఆలయం, తిరు అవినాకుడి ఆలయం, పెరియ నాయకి అమ్మన్ ఆలయం, పెరియన్ అవుడైయర్ ఆలయం, కన్నడి పెరుమాల్ ఆలయం, పళని కొండలు, పార్వతీదేవికి తల్లిగా పేర్కొనే మరియమ్మన్ ఆలయం, మురుగన్ విగ్రహ శిల్పి భోగర్ సమాధి ఆలయం, కురుంజి అందవార్ ఆలయం, లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ముఖ్యమైనవి. అసలు పళని కొండలే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ పళని ఆలయాన్ని చేరుకోవాలంటే మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం.

ఎప్పుడు వెళ్లాలి?
వాతావరణ పరిస్థితుల రీత్యా పళని వెళ్లేందుకు చలికాలమే అనకూలమని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్షాకాలంలో కొండ ఎక్కడం కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే హాయిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను తనివితీరా తిలకింవచ్చు. పళనిలో ప్రత్యేకమైన కొంగలు బారులు తీరుతాయి. నారాయణ పక్షులు, గోల్డెన్ వడ్రంగి పిట్టలు కనువిందు చేస్తాయి. వాటి కిలకిలరావాలతో మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలంలోనే పళనిలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కావడి ఉత్సవం, మార్గశిరశుద్ధ షష్ఠికి జరిగే కల్యాణోత్సవం ఒకటి.

వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, రాహు, కేతు, కుజగ్రహదోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం, నాగదోషం వగైరాలతో బాధపడేవారు పళని సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించుకుని స్వాంతన పొందుతారు. అంతేకాదు, జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుని బుద్ధిమాంద్యంతో బాధపడేవారు కన్నులారా సందర్శించుకుని ఆయా బాధలనుంచి విముక్తి పొందుతుంటారు.

ఎలా వెళ్లాలంటే..?
పళని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్లడం సులువే. రైలు, బస్సు, విమాన మార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి పళనికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. రైలు మార్గం: పొల్లాచ్చి మీదుగా మధురై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలుంది. అలాగే తిరుచెందూరు నుంచి మధురై మీదుగా పళని వెళ్లేందుకు రైలుంది. చెన్నై సెంట్రల్ నుంచి పళని వెళ్లేందుకు ప్రత్యేకంగా రైలుంది. ఎలాగైనా పళని చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు, బస్సులు విరివిగా ఉన్నాయి. వాయుమార్గం: పీలమేడు లేదా కోయంబత్తూరు, మధురై వరకు విమానంలో వెళ్తే అక్కడినుంచి పళనికి బస్సులు, రైళ్లు ఉన్నాయి.

D.V.R. భాస్కర్

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...