Wednesday, 28 September 2016

భాన్‌గఢ్‌









భాన్‌గఢ్‌
భయం భయంగా


కొన్ని ప్రయాణాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఇంకొన్ని పర్యటనలు సాహసోపేతంగా చేయాల్సి వస్తుంది. భాన్‌గఢ్‌ పర్యటన మాత్రం భయం భయంగా సాగుతుంది. అక్కడి కోట అందాలు చూడాలని ఓ వైపు.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మరోవైపు.. వెరసి ఇక్కడి దెయ్యాల కోట సందర్శన పర్యాటకులకు వింత అనుభూతిని మిగులుస్తుంది.

రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో ఉంటుంది భాన్‌గఢ్‌. ఆల్వార్‌-జైపూర్‌ నగరాల మధ్య ఉన్న సారిస్కా టైగర్‌ పార్క్‌ను ఆనుకుని ఉంటుందీ పట్టణం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. ఎత్తయిన కొండల మధ్య నిర్మితమైన అందమైన పట్టణం భాన్‌గఢ్‌. పెద్ద పెద్ద కోటలు, బురుజులు చారిత్రక ఆనవాళ్లుగా దర్శనమిస్తుంటాయి. కోట లోపల పచ్చిక బయళ్లు, సెలయేళ్లు, తోటలు, ప్రాచీన ఆలయాలు అడుగడుగునా విశేషాలే. కానీ, ఈ నగరంలో మనుషులు మచ్చుకైనా కనిపించరు. ఎందుకని అడిగితే.. చుట్టుపక్కల జనాలు దెయ్యాల కథలు కోకొల్లలుగా వినిపిస్తారు.

చీకటి పడితే నో ఎంట్రీ
భాన్‌గఢ్‌ నగరాన్ని 1613లో నిర్మించారు. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ సర్వ సేనాని మాన్‌సింగ్‌ కుమారుడు మాదోసింగ్‌ దీనిని కట్టించారని చారిత్రక ఆధారాలున్నాయి. తర్వాతి కాలంలో ఒక సాధువు శపించడం వల్ల ఈ కోట దెయ్యాలకు ఆవాసంగా మారిందని, ప్రజలంతా కోటను విడిచి వెళ్లిపోయారని చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా భాన్‌గఢ్‌ పర్యటనపై ఆంక్షలు విధించింది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పట్టణంలోకి రాకుండా నిషేధాజ్ఞలు అమలుచేస్తోంది. అందుకే భాన్‌గఢ్‌ అందాలు చూడాలంటే ఉదయం వేళలో మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.

చుట్టూ ఎన్నో..
ఈ కోట ప్రాంగణంలోనే సోమేశ్వర ఆలయం, గోపినాథ, మంగళదేవి, హనుమద్‌ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు వందలయేళ్ల నాటి మర్రిచెట్లు కోటలో ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న జలపాతాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ పర్యాటకులకు ఆనందాన్ని పంచేవే. భాన్‌గఢ్‌ కోటకు సమీపంలో చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సారిస్కా టైగర్‌ పార్క్‌ చూడటం మర్చిపోవద్దు. ఈ కోట నుంచి టైగర్‌ పార్క్‌ 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భాన్‌గఢ్‌ నుంచి జైపూర్‌ 83 కిలోమీటర్లు. ఇక్కడికి చేరుకుంటే పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది.

ఎలా చేరుకోవాలంటే
ఢిల్లీ నుంచి భాన్‌గఢ్‌ దూరం 269 కిలోమీటర్లు. NH 8, NH 11A మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. - ముందు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ చేరుకుంటే అక్కడి నుంచి సులభంగా భాన్‌గఢ్‌ చేరుకోవచ్చు. జైపూర్‌ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్‌ వాహనాలు కూడా లభిస్తాయి. అయితే సూర్యాస్తమయం కాకముందే కోట నుంచి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది.



Saturday, 10 September 2016

లేపాక్షి





నిర్మాణ కౌశలానికి సాక్షి లేపాక్షి

రాచరిక ఠీవి అక్కడి శిల్పసౌందర్యంలో కనిపిస్తుంది. ఆ రాతిశిల్పాల మాటున చారిత్రక విశేషాలెన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి, శిల్పకళా నైపుణ్యానికి, చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి పర్యాటక ప్రదేశం. మరి అలనాటి అద్భుత రాతికట్టడాల విశేషాలను చూసొద్దాం పదండి! సరదాగా పిల్లలను తీసుకుని లేపాక్షి వెళదామని నిర్ణయించుకున్నాం. 'లేపాక్షే ఎందుకు? అక్కడ ఏంటి స్పెషల్?' అంటూ మా వాళ్లంతా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మాకు కాస్త ఎక్కువేలేండి! అందుకే ఈ చారిత్రక ప్రదేశాన్ని మా విహారానికి ఎంచుకున్నాం. ఎక్కువమందిమి కావడంతో ఓ సుమో మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రికే బయల్దేరాం. సుమో అంతా ఒక్కటే సందడి. రాత్రి 12 గంటల వరకు పాటలు, జోక్స్ నవ్వులతో సరదాగా గడిచిపోయింది. అలా పాటలు పాడుతూనే నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారే సరికి అక్కడికి చేరుకున్నాం. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి ఫ్రెష్సప్ అయ్యి, టిఫిన్లు పూర్తి చేశాం. పురాతన విశేషాలను ఔపోశన పట్టిన మా గురవయ్య తాతను అక్కడి నుంచి మాతో పాటే తీసుకెళ్ళాం.

అనంతపురం జిల్లా హిందూపూరుకి తూర్పుగా 14 కి.మీ. దూరంలోనూ, బెంగళూరు - అనంతపురం జాతీయ రహదారిపై గల కొడికండ అడ్డరోడ్డుకు 6 కి.మీల దూరంలోనూ ఉంది లేపాక్షి గ్రామం. క్రీ.శ. 15వ శతాబ్ది చివర ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కొలువులో పెనుకొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ పూర్తి గావించాడని గురవయ్య తాత చక్కగా వివరించారు. మొదటగా మేము లేపాక్షి బసవన్నను చూశాం.

లేపాక్షి బసవన్న

భారతదేశ మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ముందు భాగాన, మెడ కింద ఉన్న గొలుసుకు ఏనుగుకు ఎత్తి పట్టుకున్న రెండు తలల గండబేరుండం, కీర్తి ముఖం, ముత్యాల సరాలు, శిల్పులు సందర్శకులకు ముచ్చటగొలిపేలా ఉంటాయి. ఈ శిల్పం, అలనాటి విజయనగర కాలంలో వ్యవసాయానికి, అందుకు అవసరమైన పశుగణానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో అని తాతయ్య చెప్పుకొచ్చారు. తర్వాత మేమంతా లేపాక్షి ఆలయానికి వెళ్ళాం.

వర్ణ చిత్రాలు 

లేపాక్షి అనగానే గుర్తుకొచ్చేది రెండు విషయాలు. ఒకటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంటిరాతి ఎద్దు శిల్పం, రెండు మధ్యయుగ దక్షిణ భారత చిత్రకళా ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వర్ణచిత్రాలు. అక్కడ ఉన్న దేవాలయాల మండపాల కప్పుల కింద, నిలువెత్తు ప్రమాణంలో ఉన్న అనేక వర్ణ చిత్రాలున్నాయి. వర్ణ చిత్రాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కన్నులపండగనే చెప్పాలి. అక్కడి శిల్పసౌందర్యాన్ని పరిశీలిస్తే, చిత్రకారుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని, అంకితభావాన్ని తెలియజేస్తునట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రాకారం చుట్టుగల మండపం కప్పు కింద రామాయణంలోని ప్రధాన ఘట్టాలు, నాట్యమండపం తూర్పువైపు కప్పు కింద మహాభారత దృశ్యాలు చేయి తిరిగిన, చిత్రకారుల పనితనానికి గీటురాళ్లుగా ఉన్నాయి. ఇదే వరుసలో వటపత్రసాయి, వర్ణ చిత్ర మండపం విశేషం. మనం ఎక్కడ నుంచి చూసిన వటపత్రశాయి మమ్మల్నే చూస్తున్నట్లు మా అందరికీ అనిపించింది. కల్యాణ మండపం తూర్పు వైపున ద్రౌపది స్వయంవరం తరువాత, లేపాక్షి ఆలయ నిర్మాత, విరుపణ్ణ, అతని సోదరులు వీరన్న, కుటుంబ సభ్యులు, వ్యక్తుల చిత్రణకు చిత్రకారులు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. శయణాగారంలోనున్న అర్ధనారీశ్వర శివుని వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడింది. ప్రధానాలయ మహామండపం కప్పుకింద 13 అడుగుల నిడివి ఉన్న వీరభద్రుని వర్ణచిత్రం ఇప్పటివరకూ వెలుగుచూసిన వీరభద్ర వర్ణచిత్రాల్లో అతిపెద్దదని మా తాతయ్య చెప్పారు. లేపాక్షిలో దాదాపు 20 వరకూ శాసనాలున్నాయి. శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట విరుపణ్ణ తండ్రి పేరు లేపాక్షి నంది లక్కుశెట్టి అని తెలిసింది. లేపాక్షి గ్రామం పేరు లేపాక్షి, లేపక్ష, లేపక్షపుర, వీరేశ్వరపురం అని పిలిచేవారట!. ఈ గ్రామం పెనుగొండ రాజ్యం, రొట్టనాడు విషయంలో ఉందనీ శాసనాలను బట్టి తెలుస్తోంది. విరుపణ్ణ అక్కడ దేవాలయ నిర్మాణం చేపట్టక ముందు నుంచే లేపాక్షి గ్రామం ఉందని తెలుస్తోంది. అప్పటికే పాపనాశేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందట!. ఇక్కడ పాపనాశేశ్వరాలయం, వీరభద్రాలయం, రఘునాథాలయం, ఆంజనేయుడిగుడి, ఇటుకరాతి గుడి, నాగలింగం, గణేశ మండపం, యాగమండపం, సోమవార మండపం మొదలైనవి ఉన్నాయి.

వేలాడే స్తంభం 

ఈ పేరు విన్న వెంటనే అందరం వేలాడే స్తంభమా ఎలా ఉంటుంది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాం. లేపాక్షి దేవాలయాన్ని చూసిన వారికి స్థానిక టూరిస్ట్ గైడ్, 'ఇంతవరకూ మీరు చూసింది ఒక ఎత్తయిన, వేలాడే స్తంభాన్ని చూడటం మరో ఎత్తు' అని ఆసక్తిని రేకెత్తించాడు. ఇది ఈశాన్య భాగంలో ఉంది. ఆ స్తంభం అడుగుభాగాన 90 శాతం ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నుంచి ఒక బట్టముక్కను, కాగితాన్ని దూర్చి ఈ వైపు నుండి ఆ వైపుకు లాగాం. ఇదొక వింతలా అనిపించింది. నిజానికి, ఎంతో బరువైన ఆ స్తంభం, దానిమీద పడేకప్పు, దూలాల బరువును లెక్కలోనికి తీసుకొంటే ఆ స్తంభం వేలాడుతుందని చెప్పలేం. స్తంభం నిలబెట్టిన నేలపరుపురాయి, కొంచెం కుంగటం వల్ల, స్తంభం అడుగుభాగం ఒక మూల మాత్రం రాతినేలకు మధ్య ఖాళీ ఏర్పడిందని అనిపిస్తుంది. అన్నీ చూసేటప్పటికి చీకటి పడింది. అప్పటికి అందరం బాగా అలసిపోయాం. ఇంటికి తిరుగుముఖం పట్టాం.

శిల్ప సౌందర్యం 

లేపాక్షి ఆలయ గోడలు, స్థంబాలపైన రాతిశిల్పాలు అపురూపంగా తీర్చదిద్దబడ్డాయి. ఆలయాల్లో ప్రతిష్టించిన మూలమూర్తులనే కాక, అధిష్టానం, పాదవర్గం, స్తంభాలు, బోదెలు, ద్వార బంధాలు, దూలాలు, కప్పులపైన చివరకు ధ్వజస్తంభ, బలి పీఠాలపైనా అందమైన శిల్పాలనెన్నింటినో చెక్కారు. అక్కడి శిల్పాలలో నర్తకిలు, సంగీత కళాకారులు, వివిధ రకాల వృత్తిదారులు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఇలా చెప్పుకుంటూపోతే మొత్తం జనజీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని ఉన్నదున్నట్లుగా మలిచారు. శిల్పులు కల్పనా చాతుర్యానికి అద్దంపడుతున్న చంద్రకాంత, మంచకట్టు, మాళి, అశ్వపాద స్తంభాలపై లతలు, లతాంగులు మమ్మల్ని కట్టిపడేశాయంటే నమ్మండి! అక్కడి కళ్యాణ మండపం నాట్య మండపాల స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలు, అప్పటి శిల్పుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. లేపాక్షి శిల్పాన్ని శైవ, వైష్ణవ శిల్పాలుగా విభాజించారట. అలాగే, ఇక్కడ మనిషితో పాటు సహజీవనం సాగించిన పిట్టలు, జంతువులను కూడా రకరకాల భంగిమల్లో చెక్కారు. ఎలుక నుంచి ఏనుగు వరకు, చిలుక నుండి డేగ వరకు లేపాక్షి దేవాలయ శిల్పంలో చూడవచ్చు. జంతువుల్లో ఎలుక, పిల్లి, ఎలుగుబంటి, గుర్రం, సింహం, పులి, దున్న, ఆవు, ఎద్దు, కోతి, జింక, దుప్పి, ఏనుగు ఉండగా, పిట్టలో చిలుక, గుడ్లగూబ, కాకి, హంస, బాతు మొదలైన శిల్పాలున్నాయి. అలా అవన్నీ చూసేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక మండపంలో కూర్చుని భోజనాలు చేశాం. కొంతసేపు మా పిల్లలు ఆటలాడుకున్నారు.

ఎలా చేరుకోవాలి
బస్సురూట్ :
* లేపాక్షికి కొడికొండ చెక్‌పోస్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, అనంతపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు విరివిగా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. లేపాక్షి, హిందూపురంలో బస చేయవచ్చు.
విజయవాడ నుంచి గుంటూరు, నరసరావుపేట, నంధ్యాల, అనంతపురం, తాడిపత్రి, పెనుగొండ మీదుగా హిందూపురం చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా ఆటోలో 14 కి.మీ దూరంలోనే లేపాక్షికి చేరుకోవచ్చు.
రైలు మార్గం :
లేపాక్షికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో హిందూపురం రైల్వే జంక్షన్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, అనంతపురం, బెంగళూరు నుంచి హిందూపురానికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి.

నూకరాజు స్వర్ణలత



లేపాక్షి
గుండె మెచ్చే గండ శిలలు

లే.. పక్షిలో..
ఒక పక్షి ఉంది.
దాని త్యాగం ఉంది.


లేపాక్షిలో రెండు కన్నులున్నాయ్‌!
అవి కన్న కలలున్నాయ్‌!
ఈ రెండింటి కలబోత.. మరెన్నో కళల పూత.. లేపాక్షి.


తెలుగు రాష్ట్రాల్లో అపురూప శిల్ప సంపదతో అలరారుతోన్న క్షేత్రాలలో లేపాక్షి ప్రముఖమైనది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆద్భుత పర్యాటక కేంద్రంలో మార్చి 31 నుంచి రెండు రోజుల పాటు ‘లేపాక్షి ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారా.. అయితే లేపాక్షికి వెళ్లిపోదాం.


ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. నీలిరంగు అట్ట ఉన్న నోట్‌ పుస్తకాలు ఉండేవి. అదేనండి ‘లేపాక్షి నంది’ నోట్‌ పుస్తకాలు. ఆ ఆట్ట మీద వేలడంత సైజులో ఓ నంది చిత్రం ఉండేది. గుర్తొచ్చిందా. అట్టమీద అంగుళం పరిమాణంలో మురిపించిన నంది.. లేపాక్షిలో ఆకాశమంత కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది. 15 అడుగుల ఎత్తు.. 25 అడుగుల పొడవుతో.. మువ్వల పట్టీలతో.. మెడలో గంటలతో.. నిన్నో.. మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది. ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావొస్తోంది. అప్పుడే ఆశ్చర్యపోకండి. అంతకుమించిన విషయాలు.. విశేషాలు.. మరెన్నో ఉన్నాయి లేపాక్షిలో.

వీరభద్రుడి కోసం..
లేపాక్షి విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అచ్యుతరాయల పాలనా కాలంలో పెనుగొండ సంస్థానంలో విరూపణ్ణ కోశాధికారి. ఆయన వీరభద్రుడి వీరభక్తుడు. లేపాక్షిలోని కూర్మగిరిపై వీరభద్రుడికి ఆలయం కట్టించాలని భావించాడు. కోశాగారంలోని ధనం వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టాడు. రాయల వైభవానికి తులతూగే విధంగా.. ఏడు ప్రాకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభువుల అనుమతి లేకుండా ప్రజాధనంతో విరూపణ్ణ ఆలయం కట్టిస్తున్నాడని అచ్యుతరాయలుకు ఫిర్యాదు చేశారు గిట్టనివారు. ఆగ్రహించిన రాజు.. విరూపణ్ణుడి కనుగుడ్లు పెకిలించాల్సిందిగా ఆజ్ఞాపించాడట. ఆ విషయం తెలుసుకున్న విరూపణ్ణ తనకు తానుగా కను గుడ్లు పెకిలించి విసిరేశాడని గాథ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే.. లేపాక్షి ఆలయంలో ఓ రాతిగోడపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆలయంలోని కల్యాణ మంటపం అసంపూర్తిగా మిగిలిపోవడం వెనుక కారణం కూడా ఇదేనని చెబుతారు.

మిగిలినవి మూడే..
లేపాక్షి ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించారు. కాలక్రమంలో నాలుగు ప్రాకారాలు శిథిలమై.. మూడు మాత్రమే మిగిలాయి. వీరభద్రుడి ఆలయం, ఉప ఆలయాలు, నాట్య మంటపం, కల్యాణ మంటపం అన్ని నిర్మాణాలూ ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. 246 స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు. కల్యాణ మంటపంలో పక్కనున్న లతా మంటపంలో 36 స్తంభాలపై 144 రకాల ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ డిజైన్లను ధర్మవరం చేనేతలో వాడటం విశేషం.




అచ్చెరువు.. చిత్తరువు..
లేపాక్షి ఆలయంలో అబ్బురపరిచే మరో విషయం తైలవర్ణ చిత్రాలు. తమ నైపుణ్యంతో ఎన్నో విశేషాలను శిలలపై పొదిగిన శిల్పకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. అద్భుతమైన చిత్రాలతో పురాణేతిహాసాలను కళ్లముందుంచారు చిత్రకారులు. ప్రకృతి సిద్ధమైన రంగులతో వీటిని తీర్చిదిద్దారు. శతాబ్దాలు దాటినా ఆ చిత్రాల్లోని వన్నె తగ్గలేదు. ప్రధాన ఆలయం గర్భగుడి పైకప్పుపై 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గీసిన వీరభద్రుడి చిత్రాన్ని చూశాక ఎలా చిత్రించారా అనిపిస్తుంది. నాట్య మంటపంలో ఎటువైపు నుంచి చూసినా మనవైపే చూసేలా ఉండే శ్రీకృష్ణుని చిత్తరువును చూసి అచ్చెరువొందాల్సిందే. రామయాణ, మహాభారత ఘట్టాలను తెలిపే చిత్రాలు కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల పరిణయం, శివతాండవం వంటి చిత్రాలు.. లేపాక్షికి వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. ఎన్నో అద్భుతాలకు నెలవైన లేపాక్షికి వారాంతాల్లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వందల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడి శిల్పాలను తరచి తరచి చూస్తారు. చిత్రాలను కోరి కోరి వీడియోలు తీస్తుంటారు. ఈ పర్యాటక ప్రాంత సందర్శన మరింత మధురానుభూతిగా మిగిలిపోవాలంటే.. ‘లేపాక్షి ఉత్సవాల’ కన్నా మంచి తరుణం ఏముంటుంది. సంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు.. ఇన్నిటి మధ్య లేపాక్షి విహారం భలేగా సాగిపోతుంది.
భళా నర్తనశాల

70 స్తంభాలతో నిర్మించిన నాట్య మంటపం మధ్యలో 12 స్తంభాలు ప్రత్యేకమైనవి. మధ్యనున్న స్తంభంపై రంభ నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు. బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టుగా, తుంబురుడు వీణను మీటుతున్నట్లుగా, భృంగీశ్వరుడు రంభకు నాట్యం నేర్పుతున్నట్టుగా, దత్తాత్రేయుడు, నటరాజు, శివుడు, పార్వతి తదితర దేవతలు నాట్యాన్ని చూస్తున్నట్టుగా స్తంభాలపై శిల్పాలు మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. మంటపం పైకప్పులో చెక్కిన శతపత్ర (వందరేకుల) పద్మం మరో ఆకర్షణ.
మూలాధారం ఇదే!

లేపాక్షికి వెళ్లే పర్యాటకులు నంది విగ్రహాన్ని చూశాక... వెంటనే ఓ స్తంభం చుట్టూ మూగిపోతారు. నాట్య మంటపం ఈశాన్య దిశలో ఉంటుంది. పైకప్పు ఆధారంగా భూమికి అర అంగుళం ఎత్తులో.. గాలిలో తేలాడుతున్నట్టు ఉంటుంది. యాత్రికులంతా కాగితాన్నో, దుస్తులనో స్తంభం కిందుగా పంపించి.. వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఈ స్తంభాన్ని నాట్య మంటపం మూలాధార స్తంభంగా చెబుతారు. 1902 ప్రాంతంలో.. బ్రిటిష్‌ ఇంజినీరు హ్యయిల్డన్‌ వేలాడే స్తంభాన్ని పరీక్షించాలని పక్కకు నెట్టించగా.. మంటపంలోని మిగిలిన స్తంభాలు కూడా పక్కకు జరిగాయట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట ఆ ఇంజినీరు. ఇప్పటికీ మంటపంలోని స్తంభాలు ఓ పక్కకు ఒరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఏడు పడగల నీడలో..
ఆలయ ప్రాకారాల మధ్యలో ఉన్న ఏడుతలల నాగేంద్రుడి విగ్రహం.. సెల్ఫీ జోన్‌గా మారిపోయింది. ఒక పెద్ద శిలను ఏడు తలల సర్పంగా చెక్కి.. పడగల నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లారట. అప్పటికి వారి తల్లి ఇంకా వంట చేస్తోందట. వంట పూర్తయ్యేలోపు శిల్పులంతా కలిసి.. భారీ శిలను నాగేంద్రుడిగా చెక్కేశారట.
రామాయణంలో..
లేపాక్షికి చారిత్రక గొప్పదనమే కాదు.. పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ తిరుగుతున్న రాముడికి ఈ ప్రాంతంలో రెక్కలు కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనిపించిందట. సీతమ్మను కాపాడేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ శ్రీరాముడు ‘లే.. పక్షి’ అన్నాడట. అదే నేడు లేపాక్షిగా రూపాంతరం చెందిందని అంటారు. లేపాక్షి ఆలయం సమీపంలోని పెద్ద రాతిగుండుపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జటాయువు పక్షి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది.







లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!

విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకూ శిల్పకళా చాతుర్యానికీ వాస్తు నైపుణ్యానికీ ప్రత్యక్ష నిదర్శనమే లేపాక్షి. ఆ శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం.



లే...పక్షీ!
అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో బెంగళూరుకు 122 కి.మీ దూరంలో ఉంది లేపాక్షి. ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఓ చిన్న పట్టణం. తాబేలు ఆకారంలో ఉన్న కూర్మ శైలమనే చిన్న కొండమీది ఆలయ సముదాయమే లేపాక్షి. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని పోతుండగా జటాయువు అడ్డగించిందట. రావణుడు దాని రెక్కలు నరికివేయడంతో అది ఇక్కడే పడి పోయింది. సీతను వెతుకుతూ వచ్చిన రాముడు జటాయువుని చూసి జాలితో ‘లే పక్షీ’ అని పిలిచాడట. అదే లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు.

అతి పెద్ద నంది విగ్రహం! 

లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.1 మీటర్ల (27 Feets) పొడవూ, 4.5 మీటర్ల (15 Feets)ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది. కాసుల పేరూ, చిరుమువ్వలూ, గంటలతో శోభాయమానంగా అలంకరించినట్లుగా చెక్కిన నంది విగ్రహాన్ని ఎంత చూసినా తనివితీరదు. మూపురం మీద శాలువా కప్పినట్లుగా చెక్కారు. నాటి విజయనగర శిల్పుల నేర్పరితనానికి ఆశ్చర్యపోవడం సందర్శకుల వంతవుతుంది. నందీశ్వరుని చెవులు రిక్కించి ఉన్నాయి. వీరభద్రాలయానికి వెనుకగా ఉన్న నాగలింగానికి అభిముఖంగా ఉంటుంది ఈ నంది. ఈ ఆలయం కేంద్రబిందువుగా చుట్టూ ఆలయాలు నిర్మించారు.


స్కంద పురాణంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి. ఉగ్రరూపంలో ఉన్న శివుడి ఝటాజూటం నుంచి పుట్టినవాడే వీరభద్రుడు. అగస్త్య మహామునే స్వయంగా వీరభద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఆయన తపస్సు చేసిన గుహ కూడా గర్భగుడికి పక్కనే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న గుడిని నిర్మించింది విరుపణ్ణ. అతని సోదరుడు వీరన్న నాయక్‌లు. 15-16 శతాబ్దాల మధ్యలో పెనుగొండ సంస్థానాన్ని పాలించిన విజయనగర రాజు అచ్యుతరాయని రాజ్యంలో విరుపణ్ణ కోశాధికారిగా ఉండేవాడు. ఓసారి కలలో వాళ్ల కులదైవం వీరభద్రస్వామి కనిపించి, నేను స్వయంభువుగా కూర్మశైలంపై అవతరించాను. అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. అంతట విరుపణ్ణ, రాజు అనుమతి లేకుండానే ఆలయనిర్మాణాన్ని ప్రారంభించాడట. దాంతో విరుపణ్ణ పేరుప్రఖ్యాతులు చూసి ఓర్వలేని కొందరు "కోశాగారంలోని నిధులన్నీ వీరభద్ర ఆలయ నిర్మాణానికి వెచ్చించాడు." అని రాజుకు చెప్పారట. అప్పటికే ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న రాజు కోపోద్రిక్తుడై విరుపణ్ణ కళ్లు పెరికి వేయమని ఆజ్ఞాపించాడట. విరుపణ్ణ తన కళ్లు తానే వూడపెరికి, గుడికి పడమటి దిక్కున ఉన్న గోడ పైకి వేసి కొట్టాడట. అక్కడ రాతిమీద ఉన్న రెండు గుంటలూ, ఎర్రని మరకలూ ఆ ఆనవాళ్లేనని చెబుతారు.

ఆలయ నిర్మాణం విజయనగర చక్రవర్తుల శిల్పశైలినే ప్రతిబింబిస్తూ మూడు విభాగాలుగా ఉంటుంది. ముందుగా కనిపించేది ముఖమండపం. దీన్నే నాట్య మండపం లేదా రంగ మండపంగా పిలుస్తారు. తరువాతది అర్ధమండపం. దానికి లోపలగా ఉండేది గర్భగుడి. అప్పట్లో విరుపణ్ణ ఏడు ప్రాకారాల్లో కట్టించిన ఈ ఆలయంలో ఇప్పుడు మూడు మిగిలి ఉన్నాయి. మెట్లెక్కి ముఖద్వారం దాటి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎత్త‌యిన‌ గోడల మీద ఆనాటి దాతల పేర్లూ శాసనాలూ కన్నడ భాషలో కన్పిస్తాయి. అక్కడి నుంచి ముఖ మండపంలోకి అడుగుపెడితే అక్కడి స్తంభాలన్నింటి మీదా దేవతల శిల్పాలు చెక్కి ఉన్నాయి. డెబ్భై స్తంభాలతో నిర్మించిన ఈ నాట్య లేదా ముఖ మండపం మధ్యలో ఉన్న 12 స్తంభాల మీదా నిలువెత్తు రూపంలో ఉన్న స్వర్గవాసుల విగ్రహాలను చూస్తుంటే ఇంద్రసభ కళ్ల ముందు కనిపిస్తుంది. చిత్రాలు చెక్కిన శిల్పుల ఊహాచాతుర్యానికీ పనితనానికీ జోహారులు అర్పిచాల్సిందే. మండపం మధ్యలో పైకప్పులో అద్భుతమైన శత పత్రకమలం చెక్కబడి ఉంది. అది దాటి అర్ధమండపంలోకి అడుగుపెడితే అక్కడ ఉన్న సీలింగు మీద 23 అడుగుల పొడవూ 13 అడుగుల వెడల్పుతో చిత్రించిన చిత్రం ఆసియాలోకెల్లా అతిపెద్దదిగా చెబుతారు. ఇందులో యోగదక్షిణామూర్తి, చండేశ్‌ అనుగ్రహమూర్తి, భిక్షాటన, హరిహర, అర్ధనారీశ్వర, కళ్యాణసుందర, త్రిపురాంతక, నటరాజ, గౌరీప్రసాదక, లింగోద్భవ.. ఇలా మొత్తం శివుడి పద్నాలుగు అవతారాలనూ అక్కడ చిత్రించడం విశేషం. ఇవన్నీ దాటి గర్భగుడిలో అడుగుపెడితే వీరభద్రస్వామి నిత్యపూజలు అందుకుంటూ దర్శనమిస్తాడు. గర్భగుడిలో ఈశాన్యంలో వాస్తుపురుషుడు, ఆగ్నేయదిశలో ఉన్న స్తంభంలో గజాసుర సంహారం, నైరుతిలో నాట్యగణపతి, వాయువ్యంలో దుర్గాదేవి శిల్పాలు ఉన్నాయి. గర్భగుడికి ముందు తూర్పువైపు పాపనాధీశ్వరుడు, పడమటివైపు రఘునాథస్వామి ఆలయాలు ఉన్నాయి. శైవులూ, వైష్ణవులూ మా దేవుడే గొప్ప అని కొట్లాడుకునే రోజుల్లో శివకేశవులు ఎదురెదురుగా ఉండటమూ, శివుడు కాకుండా వీరభద్రుడు మూలవిరాట్టుగా ఉండటమూ లేపాక్షి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మండపంలోని స్తంభాలమీద సైతం శివకేశవుల రూపాలు పక్కపక్కనే చెక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఓ స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్యపూజలు నిర్వహించడం మరో విశేషం.

గాల్లో స్తంభం! 

గర్భగుడి పైకప్పుమీద వీరభద్రస్వామి వర్ణచిత్రం కనువిందు చేస్తుంది. విరుపణ్ణ భార్య పుత్రుల‌తో సేవ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వర్ణచిత్రం మనదేశంలోకెల్లా పెద్దదట. ఈశాన్యమూలలో ఉన్న అంతరిక్ష స్తంభం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.


లేపాక్షి విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకు ప్రసిద్ధి. చెట్ల లేపనాలతోనూ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులతోనూ పైకప్పుమీద వేసిన చిత్రాలు పర్యాటకులను ఆకట్టుకొంటాయి. గర్భగుడి ప్రాకారంలో తూర్పువైపుకి రాగానే ఆరు అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం మనల్ని ఆకర్షిస్తుంటుంది. పక్కనే బండమీద శివలింగానికి సాలెపురుగు, సర్పం, ఏనుగు, భక్తకన్నప్ప పూజ చేస్తున్న దృశ్యం కన్పిస్తుంది. సమీపంలోనే ఏడు పడగలతో మూడు చుట్టుల మధ్యన శివలింగంతో ఉన్న నాగ లింగాన్ని చూడగానే ఎంతటివారైనా గగుర్పాటుకు లోనవుతారు. నాగలింగానికి ఎదురుగా ఓ వంటశాల ఉంది. ఓ రోజు ప్రధాన శిల్పుల తల్లి వంట చేయడం ఆలస్యమైందట. అది పూర్తయ్యేలోగా సమయం వృథా కాకుండా శిల్పులు నాగలింగాన్ని మలిచారట. అది చూసి ఆమె ఆశ్చర్యపోగా ఆమె దృష్టి తగిలి ఆ విగ్రహానికి చీలిక ఏర్పడిందని చెబుతారు.

ఇదే ప్రాకారంలో అసంపూర్తిగా నిలిచిన కళ్యాణమండపం ఉంది. పార్వతీ కళ్యాణానికి స్వర్గవాసులంతా కదిలి వచ్చినట్లుగా ఇక్కడ శిల్పాలను చెక్కారు. ఐదు తలలూ పది చేతులతో సదాశివుని అవతారంలో పరమేశ్వరుడు అతిథులను స్వాగతించడం కనిపిస్తుంది. రెండు కోతులు నాలుగుగానూ, ఒకే శరీరం మూడు తలలతో చెక్కిన ఆవు బొమ్మ మూడు ఆవులుగానూ కనిపించే శిల్పాలన్నీ లేపాక్షికే తలమానికం. పక్కనే ఉన్న లతామండపంలో సుమారు 136 లతల డిజైన్లు కనిపిస్తాయి. లేపాక్షి ప్రింట్లకు అవే స్ఫూర్తి. ముఖ్యంగా చీరల అంచుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కళ్యాణ మండపానికి కొద్దిదూరంలో నేలమీద చెక్కిన పెద్ద పళ్లాలు ఉన్నాయి. ఆనాటి శిల్పులు వాటిలోనే భోజనం చేసేవారని కొందరూ, కాదు రంగులు కలుపుకునేవారని మరికొందరూ అంటారు. 


దగ్గర్లోనే సీతమ్మ వారి కుడిపాదం ఉంటుంది. ఆ కాలిబొటన వేలి నుంచి అన్ని కాలాల్లోనూ నీరు రావడం విచిత్రం.


ఎలా వెళ్లాలి 

హైదరాబాద్‌ నుంచి హిందూపురానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. హిందూపురం నుంచి లేపాక్షి 14 కి.మీ. దూరంలో ఉంది.
విమానం ద్వారా వెళ్లాలనుకునేవారు బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి 122 కి.మీ దూరంలో ఉన్న లేపాక్షి చేరుకోవచ్చు.





కొడైకెనాల్

ప్రకృతి పరిమళం కొడైకెనాల్

ప్రకృతికి పచ్చల మణిహారంలా... సహజసిద్ధ అందాలతో కొడైకెనాల్ పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. చక్కటి అనుభూతులు పంచే సందర్శనా ప్రదేశాలకు ఈ ప్రాంతం పెట్టిందిపేరు. విహార యాత్రలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన కొడైకెనాల్ పర్యాటక విశేషాలు ఈ వారం
జర్నీలో..

తమిళనాడు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న కొడైకెనాల్ సందర్శన కోసం శ్రీకాకుళం నుంచి మా బృందం బయలుదేరింది. నిజానికి, కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం అయినప్పటికీ ఏ సీజన్లోనైనా సందర్శకులను ఉల్లాసపరుస్తూనే ఉంటుంది. కోయంబత్తూర్ రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగి ముందే మాట్లాడుకున్న బస్సులో కొడైకెనాల్ బయలుదేరాం. పళని మీదుగా ఘాట్రోడ్డులో మా ప్రయాణం సుమారు రెండున్నర గంటలపాటు సాగింది. మధ్యాహ్నం రెండు గంటలకు మా బస్సు కొడైకెనాల్ చేరింది. బస్స్టాండును ఆనుకుని హోటళ్లు చాలా ఉన్నాయి. రోజుకు 250 రూపాయల నుంచి, వేయి రూపాయల వరకు గదులు అద్దెకు దొరుకుతాయి. బస్స్టాండ్ దగ్గరే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ కార్యాలయం ఉంది. అక్కడ స్థానిక హోటళ్ల వివరాలు, చూడదగిన ప్రదేశాల వివరాలు లభిస్తాయి. మేమంతా ముందుగానే హోటల్ రూం బుక్ చేసుకోవడంతో లగేజీ వాటిలో సర్దేసి అదే హోటల్లో మధ్యాహ్నం భోజనం చేశాం.

కనువిందు చేసే కొడై సరస్సు
హోటల్ పక్కనే ఉన్న కొడై సరస్సు దగ్గరకు వెళ్లాం. ఇది కొడైకెనాల్ పట్టణ కేంద్రంలోనే ఉంది. బ్రిటీష్ హయాంలో 1863లో నిర్మించిన మానవ నిర్మిత సరస్సు ఇది. 45 హెక్టారులు (60 ఎకరాలు) విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా ఉంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది. మాతో వచ్చినవారిలో కొంతమంది బోటు షికారుకు వెళ్లారు. మరి కొంత మంది గుర్రం సవారీ చేశారు. ఇంకొంతమంది అక్కడే అద్దెకు ఇచ్చే సైకిళ్లను తీసుకొని, సరస్సు చుట్టూ ఉన్న రోడ్డుపై సైక్లింగ్కు వెళ్లారు. ఈ సరస్సులో ప్రతి ఏడాదీ మే నెలలో బోట్ రేసులు జరుగుతాయట.

పంపార్ జలపాతం
కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరనున్న పంపార్ జలపాతం దగ్గరకు వెళ్లాం. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించే సన్నని వాగు అది. కొన్ని సందర్భాలలో ఇది ఉదృతంగానూ, మరికొన్ని సమయాల్లో మామూలుగానూ ప్రవహించడం ఈ జలపాతం ప్రత్యేకత. ఈ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, చేతుల్లో ఉన్నవి లాక్కోడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ జలపాతం దగ్గరే కొడైకెనాల్ పరిసరాల్లో లభించే రకరకాల జాతుల పండ్లను అమ్మే దుకాణాలున్నాయి.

కోకర్స్వాక్ ఆహ్లాదకరం
కొడైకెనాల్లోని ఒక కొండ అంచునే ఉన్న కాలిబాట ప్రాంతం కోకర్స్వాక్. పంపార్ జలపాతం దగ్గరనుంచి మేమంతా ఈ కాలిబాట మార్గంపైకి వెళ్లాం. మేఘాలతాకిడితో ఉన్న ఈ కొండ చూసేందుకు కాలిబాటలో మేఘమాలికల మధ్య నడుస్తున్న అనుభూతులను పంచుతుంది. అక్కడక్కడా కూర్చోడానికి సిమెంట్ సోఫాలను కూడా పర్యాటకుల సౌకర్యార్ధమై ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ ఉన్న ప్రకృతి సోయగాలు ఆహ్లాదంతో మనసుని నింపేస్తాయి.

గ్రీన్ వ్యాలీ వ్యూ
కోకర్స్ వాక్ తర్వాత పక్కనే ఉన్న గ్రీన్వ్యాలీవ్యూకి వెళ్లాం. పర్యాటకులు కొండ అంచున నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ వ్యూ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైగై డ్యామ్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలతో మమేకం కావడానికి ఆఫ్లాట్ఫామ్పై చాలా సమయం గడిపాం. కొడైకెనాల్లో ఉన్న ప్రసిద్ధ నిర్మాణాలలో సెయింట్ మేరీ చర్చి ఒకటి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చర్చిలోకి అడుగుపెట్టాం. సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్లో నిర్మించిన మొట్ట మొదటి చర్చి ఇది అని అక్కడున్న ఫలకాలు సూచిస్తున్నాయి. ఈ చర్చిలో గోడలపైనా, ఇతర అలంకరణలోనూ నగిషీ పని ఎంతో కళాత్మకంగా ఉంది.

గుణ గుహ
రోడ్డు అంచులో ఉన్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగుతూ వెళితే, చిన్న కొండ అడుగుభాగంలో గుహ కనిపిస్తుంది. కానీ దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరలేదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనిని దయ్యాల గుహ అని వ్యవహరిస్తారు. అయితే విషసర్పాలు ఎక్కువగా ఈ గుహలో ఉంటాయని, అందువల్లే పర్యాటకులు లోపలికి వెళ్ళకుండా గుహ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసారని మా మిత్రుడొకరు చెప్పారు.

అందమైన పైన్ వృక్షాలు
మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఓ చోట సుమారు కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. కొడైకెనాల్కు ఈ పైన్ వృక్షాల అరణ్యం ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఇక్కడ చాలా సినిమాల చిత్రీకరణ జరిగింది. అలాగే, అవతార్ సినిమా చూసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన ఆకాశాన్ని తాకే సూదిమొన కొండల అందాలు. అటువంటివే కొడైకెనాల్లో రమణీయమైన పిల్లర్ రాక్స్. కొడైకెనాల్ నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. ఇక్కడ నుంచి సుందర ప్రకృతిలోని సమస్త అందాలను చూడవచ్చు. ఇక్కడ సహజ సిద్ధమైన మూడు పొడవైన శిలలు ఒకదానికొకటి ఆనుకుని సుమారు 400 అడుగులు ఎత్తు కలిగి ఉంటాయి. కొడైకెనాల్లో రెండు టెలిస్కోప్ హౌసులున్నాయి. ఒకటి కురింజి ఆండవర్ టెంపుల్ దగ్గర ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెరిచి ఉంటుంది. రెండోది కోకర్ప్ వాక్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇవి కాక కొడైకెనాల్లో దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన శాంతిలోయ, సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ, కొడైలో ఎత్తయిన ఆండవర్ టెంపుల్. పాయింట్ నుంచి చూస్తే ఉత్తరాన ఉన్న పళని హిల్స్ తదితర పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.

షాపింగ్
కొడైకెనాల్లో షాపింగ్ ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది. రకరకాల ఐటమ్స్ అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తాయి. ఇక్కడున్న ఖాది ఎంపోరియం, హ్యండ్లూం, కో- ఆపరేటివ్ స్టోర్, గవర్నమెంటు సేల్స్ ఎంపోరియం, మినీ సూపర్బజార్, స్పెన్సర్ అండ్ కంపెనీ వంటివి నిత్యం పర్యాటకుల షాపింగ్తో కళకళలాడుతుంటాయి.
ఎలా వెళ్ళాలి?
కొడైకెనాల్ సందర్శనకు ఏన్నో మార్గాలున్నాయి. మధురై ఎయిర్పోర్టు ఇక్కడికి 120 కి.మీ దూరంలో ఉంది. కోయంబత్తూరు ఎయిర్పోర్టు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొడై రైల్వేస్టేషన్కు ఇతర ప్రధాన నగరాల నుంచి రైళ్లు ఉన్నాయి ఈ స్టేషనకు పళని రైల్వే స్టేషనన్ 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, పళని, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, ఈరోడ్, కుయిలి నుంచి బస్సు సౌకర్యం ఉంది. కొడైకెనాల్ నుంచి మధురై 120 కి.మీ. కొడైకెనాల్ నుంచి పళని 65 కి.మీ, కోయంబత్తూరు నుంచి 178 కి.మీ, తిరుచ్చి నుంచి 197 కి.మీ, దిండిగల్ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్నాయి. కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మధురై నుంచి సుమారు నాలుగు గంట లు, పళని నుంచి రెండు గంటలు, దిండిగల్ నుంచి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.
- బెందాళం క్రిష్ణారావు

Friday, 9 September 2016

దేవాలయాలు

అక్కడ రావణుడూ దేవుడే
రాముడనగానే దేవుడంటాం. రావణుడంటే రాక్షసుడంటాం. కానీ ఈ దశకంఠుడికి లంకలోనే కాదు మన దేశంలోనూ ఆలయాలున్నాయి.
మహాభారతంలో దుష్టులుగా ముద్రపడిన దుర్యోధన, శకుని, కర్ణులకూ ఆలయాలున్నాయి. వీరికే కాదు మన ఇతిహాసాల్లో ప్రాధాన్యం ఉన్న ఎందరికో మందిరాలు వెలిశాయి. ఆ విశేషాలు..

లంకేశ్వరుడిగా కీర్తి మూట గట్టుకున్నా.. సీతను చెరపట్టి రావణుడు దుష్టుడిగా మిగిలిపోయాడు.
నక్కజిత్తులతో, కుతంత్రపు ఎత్తులతో భారతంలో తారసపడే ఓ పాత్రే శకుని.
ఇక పంచపాండవుల సతీమణి ద్రౌపది.
భీముడి భార్య, రాక్షస రూపిణి హిడింబి, కౌరవాగ్రజుడు దుర్యోధనుడు, కవచకుండలాలతో జన్మించిన వీరుడు కర్ణుడు, కోరుకున్నప్పుడు మరణం పొందే భీష్మాచార్యులు, భర్త కోసం జీవితాంతం అంధురాలిగా మారిన గాంధారి, శ్రీరామచరితను వినిపించిన లవకుశులు ఇలా ఆ ఇతిహాసాల్లో ప్రతి పాత్ర ఓ వైవిధ్యమే. వీరందరికి మనదేశవ్యాప్తంగా ఆలయాలుండటం ఓ ప్రత్యేకతే.

హిడింబి - మనాలి
ఈ దేవాలయం ఓ గుహాలో ఉంటుంది. ఇది మనాలిలో ఉంది. భక్తులు మొక్కుగా ఇక్కడ రక్తతర్పణం చేస్తారు.

కర్ణ ఆలయం - ఉత్తరకాశీ
కర్ణుడి ఆలయం ఉత్తరకాశీలోని డియోర గ్రామంలో ఉంది. ఇక్కడ పాండవులకు కూడా చిన్నపాటి ఆలయాలు ఉండటం విశేషం. దీన్ని చెక్కతో నిర్మించారు.

వాల్మీకి ఆలయం - లాహోర్
రామాయణాన్ని రాసిన అపరబ్రహ్మ వాల్మీకి. ఆ వాల్మీకి మహర్షికి లాహోర్లో ఓ ఆలయం ఉంది. ఇక్కడ దీంతో పాటు శ్రీకృష్ణుడి ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. చెన్నైలోని తిరువాన్మయూర్లో కూడా వాల్మీకి మహర్షికి గుడి ఉంది. ఈ ఆలయానికి దాదాపు 1,300 సంవత్సరాల చరిత్ర ఉంది.

ద్రౌపది ఆలయం - బెంగళూరు
బెంగళూరులో ఉన్న ధర్మరాయ స్వామి ఆలయంలోనే పాండవుల సతీమణి ద్రౌపది పూజలందుకుంటోంది. ఈ ఆలయానికి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో ద్రౌపదికి ఆలయాలు ఉండటం విశేషం. అంతేకాదు తమిళులు ద్రౌపదిని కాళీమాత అవతారంగా భావిస్తారు. ఈ మాతను ద్రౌపది అమ్మాన్గా పిలుచుకుంటారు.

గాంధారి ఆలయం - మైసూరు
కౌరవుల తల్లి గాంధారికి మైసూరులో ఆలయం నిర్మించారు. దీనికోసం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు. ఇది 2008లో ప్రారంభమైంది.

రావణ ఆలయం - మధ్యప్రదేశ్
రావణుడిని చాలా ప్రాంతాల్లో దేవుడిగా పూజిస్తారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్లలో రావణుడికి ఆలయాలు ఉన్నాయి.

ఇక అలహాబాద్లో భీష్మ పితామహుడికి ఆలయం ఉండటం విశేషం. రామాయణ, భారతాల్లోని పాత్రలు ఇప్పటికీ ప్రజలచే పూజలందుకోవడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.

శకుని, దుర్యోధన ఆలయాలు - కొల్లం
మాట్లాడే ప్రతి మాట వెనుక ఏదో కుతంత్రాన్ని ఆలోచించే శకునికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల వల్లే శకున్ని ఆరాధించే భక్తులు పుట్టుకొచ్చారు. కేరళలోని కొల్లం జిల్లాలో పవిత్రేశ్వరం గ్రామంలో శకునికి ఆలయం ఉంది. అక్కడ నిత్య పూజలు జరగడం విశేషం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కొబ్బరికాయ, పట్టువస్ర్తాలు సమర్పిస్తుంటారు. ఇది చాలా పురాతనమైన ఆలయం.

శకుని ఆలయానికి దగ్గర్లోనే దుర్యోధనుడికి కూడా ఓ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు దుర్యోధనుడికి పోకవక్క, కోడిపుంజు, ఎర్రని వస్త్రం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు శకుని, దుర్యోధనులకు ఇక్కడ కల్లు (మద్యం)ను కూడా నివేదిస్తుంటారు. దుర్యోధనుడికి ఉత్తరాఖండ్లో కూడా ఓ ఆలయం ఉంది. అక్కడ ప్రతిరోజూ కౌరవాగ్రజుడు పూజలందుకుంటాడు.

సుగ్రీవ ఆలయం - బెంగళూర్
వానరవీరుడు, శూరుడు, కిష్కింధ రాజైన ‘సుగ్రీవుడి’ పాత్ర రామాయణంలో కీలకం. శ్రీరాముుని స్నేహితుడిగా ఆయనకు సీతామాతను వెతకడంలో సాయమందిస్తాడు. రామానుగ్రహాన్ని పొందిన సుగ్రీవుడు నిరంతరం భక్తులు పూజలందుకుంటున్నాడు. బెంగళూరులో ఉన్న సుగ్రీవుని ఆలయం ఎంతో పురాతనమైంది. ఆరు అడుగుల ఎత్తున్న సుగ్రీవుడి విగ్రహం చూడటానికి హనుమంతుడిలా ఉంటుంది. రామేశ్వరంలో కూడా సుగ్రీవ ఆలయం ఉంది.

జటాయువు ఆలయం - నాశిక్
నాశిక్కు 65 కిలోమీటర్ల దూరంలో జటాయువు ఆలయం ఉంది. దీన్నే జటాయు మోక్ష తీర్థంగా పిలుస్తారు. రావణునితో వీరోచితంగా పోరాడిన జటాయువు పక్షి ఇక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికుల కథనం. ఆ ప్రాంతానికి సమీపంలో ఓ చిన్న కొలను ఉంది. దాంట్లోని నీరు ఏ కాలంలోనైనా ఒకేలా ఉండటం విశేషం.

Thursday, 8 September 2016

దుర్యోధన దేవాలయం

మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను దుష్టత్వానికి ప్రతిబింబంగా భావిస్తారు. విలన్కి ఎప్పుడూ సాధారణంగా తిట్లూ శాపనార్థాలేతప్ప పూజలూ పునస్కారాలూ ఉండవుకదా! కానీ దుర్యోధనుణ్ణి మాత్రం ఆ ఊళ్ళో దేవుడిలా కొలుస్తారు. ఆ ఇతిహాస పురుషుడికి జాతర కూడా చేస్తారు. ఎక్కడ? ఏమిటి? అని తెలుసుకోవాలంటే కేరళ వెళ్ళాల్సిందే!

కొల్లం జిల్లా పోరువళి గ్రామంలో ఉంది పెరువిరుతి మలనాడి గుడి. ఇక్కడ దుర్యోధనుడే దైవం. నిజానికి అక్కడ ఏ విగ్రహమూ ఉండదు. ఆరుబయట ఓ వేదిక ఉంటుంది. భక్తులు తమలోతాము సంకల్పం చెప్పుకుని, ఆ వేదిక వద్ద మనస్సులో దైవాన్ని స్మరించుకుంటూ ప్రార్థన చేయాలి. దుర్యోధనుడు పేదలు, అణగారిన వర్గాల రక్షకుడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గుడిలో ఉపదేవతలుగా కొలువై ఉన్నదెవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఇంతకూ ఎవరో తెలుసా? దుర్యోధనుడి భార్య భానుమతి, అతడి తల్లి గాంధారి, సోదరి దుస్సల, గురువు ద్రోణుడు, ఆప్తమిత్రుడు కర్ణుడు. బాగుంది కదూ! అణగారిన వర్గాల రక్షకుడుగా దుర్యోధనుడు ఇక్కడ కొలువు తీరడం నిజంగా ఓ గొప్ప విశేషమే.

Tuesday, 6 September 2016

గణపతులు

ముక్కంటి గణపతి!
ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే!

ఏనుగు మొహం, చాట చెవులు, బానపొట్ట... గణపతి రూపం జగద్విఖ్యాతం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కొలువైన గజాననుడి రూపం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మరుగుజ్జు స్వామి కాస్తా మహాకాయుడిగా దర్శనమిస్తాడు. పదిహేను అడుగుల ఎత్తుతో, పన్నెండు అడుగుల వెడల్పుతో ఉంటుందా విరాట్ మూర్తి. ‘శుక్లాంబరధరం విష్ణుం...’ శ్లోకం గణనాథుడిని ‘చతుర్భుజం’ అని కీర్తిస్తుంది. కానీ, ఇక్కడి గణపతికి మొత్తం పదిచేతులుంటాయి. ఎడమవైపున అయిదు చేతులూ, కుడివైపున అయిదు చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ఆ రూపం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది. కుడివైపున మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడమ వైపున మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది. ఇలాంటి స్వరూపాన్ని ‘మహాగణపతి’గా ఉపాసిస్తారు ఆధ్యాత్మిక సాధకులు. కాళ్లకు గజ్జెలూ, కాలికింద మూషిక వాహనమూ ముచ్చటగొలుపుతాయి. ‘అచ్చంగా తండ్రిపోలికే...’ అన్నట్టు ఫాలభాగంలో మూడో కన్ను ఉంటుంది. ‘ప్రసన్న వదనం’ విషయంలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. మహా చిద్విలాసంగా కనిపిస్తాడు. పదిచేతులవాడు కావడంతో ‘దశభుజ గణపతి’గా పేరుతెచ్చుకున్నాడు. చేతలవాడు కూడా కావడంతో, కోరికల్ని సిద్ధింపజేస్తూ ‘సిద్ధి వినాయకుడు’ అనిపించుకుంటున్నాడు.

స్వామి ముక్కంటిగా దర్శనమిస్తున్న కారణంగా, పరమశివుడిలానే దుష్టశిక్షకుడనీ శిష్టరక్షకుడనీ విశ్లేషిస్తారు. విగ్రహానికి కుడివైపున సూర్యుడూ ఎడమవైపున చంద్రుడూ ఉండటంతో విశ్వగణపతిగా కీర్తిస్తారు. చేతిలోని నారికేళ ఫలం సుఫలాలకు ప్రతీక. అందుకే భక్తులు, మొక్కులు మొక్కుకునే ముందు కొబ్బరికాయల్ని సమర్పిస్తారు. అభీష్టం సిద్ధించాక మళ్లీ వచ్చి, ఇంకొన్ని కాయల్ని నివేదిస్తారు.

రాయలకాలం...
దశభుజ మహాగణపతి ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో భూపతిరాయలు అనే పాలకుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. నెలనెలా సంకష్టహర చతుర్థికి వందలాది భక్తులు వస్తారు. పక్కనే నరసింహుడి ఆలయం ఉంది. ఇది కూడా రాయల కాలం నాటిదే. లక్ష్మీదేవి సమేతంగా కొలువైన ప్రహ్లాద వరదుడిని కళ్లారా దర్శించుకోవచ్చు. ఆలయాలకు ఆనుకుని ఉన్న కొండమీదికి మెట్ల మార్గం ఉంది. పైకి ఎక్కితే, శిథిల నగరం కనిపిస్తుంది. కొలనులూ రాజప్రాసాదాలూ విపణులూ గతవైభవ ఘనకీర్తిని వివరిస్తాయి. జిల్లా కేంద్రం అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది రాయదుర్గం. కర్ణాటకలోని బళ్లారి నుంచి అయితే యాభై కిలోమీటర్లు.

- వునికిలి హరగోపాలరాజు, అనంతపురం డెస్క్, ఈనాడు
ఫొటోలు: సి.రామాంజినప్ప



కాటన్ దొర గంట!
అపర భగీరథుడు కాటన్ దొర పార్వతీ నందనుడి పరమభక్తుడు. ఆ గలగలల స్వాప్నికుడు రాజమహేంద్రిలో వెలసిన విఘ్నాధిపతికి గణగణల గంటను కానుకగా ఇచ్చాడు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం... రాజమహేంద్రవరంలోని నాళంవారి వీధిలో ఏటా వినాయక చవితికి మట్టి గణపతిని పూజించేవారు. 1830 ప్రాంతంలో, స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది స్థానికులకు. చిత్రపు వెంకటాచలం అనే భక్తుడు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చల్లా సూర్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రాజెక్టు నిర్మాణం కోసం కాటన్ దొర రాజమహేంద్రవరం వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోదావరి మీద ఆనకట్ట పనులు మొదలుపెట్టారు. అంతలోనే తొలి విఘ్నం. తీవ్ర అనారోగ్యంపాలై ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక కూడా ఏవో అవరోధాలు. గణపతిని అర్చిస్తే వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోతాయని కొందరు సలహా ఇచ్చారు. దీంతో, తొలిసారిగా నాళంవారివీధిలోని సిద్ధిలక్ష్మీగణపతి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచీ తరచూ ఇక్కడికి వచ్చేవారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయితే, గంటను కానుకగా ఇస్తానని విఘ్నాధిపతికి మొక్కుకున్నారు. నిరాటంకంగా పని పూర్తయిపోయింది. ఆ తర్వాత కృష్ణానది కాలువ పనులూ చకచకా జరిగిపోయాయి. మొక్కు ప్రకారమే, లండన్ నుంచి ఓ భారీ గంటను తెప్పించి సమర్పించారు. ఇప్పటికీ గణగణమంటూ కాటన్ దొర భక్తిప్రపత్తుల్ని చాటుతోందా గంట.

- సూర్యకుమారి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం

Monday, 5 September 2016

మంచుకొండల్లో మహేశ్వరుడు..!

మంచుకొండల్లో మహేశ్వరుడు..!

ప్రయాణం కష్టమైనప్పటికీ ఉత్తరాఖండ్లోని మంచుకొండల మధ్యలో 11,473 అడుగుల ఎత్తులోని మధ్యమహేశ్వర్ను చూడాలనుకున్నాం. రుషికేశ్కు 227 కిలోమీటర్ల దూరంలో ఉందీ శైవక్షేత్రం. ఉఖీమఠ్ నుంచి సుమారు 31 కిలోమీటర్ల దూరం మట్టిరోడ్డుమీద ప్రయాణించి రాన్సీ గ్రామం చేరుకున్నాం. ఈ రోడ్డు చిన్న వాహనాలు ప్రయాణించేందుకు మాత్రమే అనుకూలం. రాత్రికి రాన్సీ గ్రామంలోనే బసచేశాం. పొద్దున్నే గుర్రాలమీద బయలుదేరాం. రాన్సీ నుంచి మధ్యమహేశ్వర్కు 14 కిలోమీటర్లు. కాలినడకన లేదా గుర్రాలమీదగానీ వెళ్లాలి.

అక్కడ యాత్రికులు తక్కువ!
ఈ దారిలో గౌదర్ అనే గ్రామం వస్తుంది. ఇక్కడే మహేశ్వర్ గంగ, మార్త్యాండ గంగలు సంగమిస్తాయి. ఇక్కడ యాత్రికులకు కావలసిన భోజన, నివాస సౌకర్యాలు ఉన్నాయి. గౌదర్లో భోజనం చేసి కాసేపు విశ్రమించాం. ఈ దారిలోనే ఉన్న మరో గ్రామం కాళీమఠ్. దీన్నే సిద్ధపీఠం అంటారు. కాళీమఠ్లో కాళీ ఉపాసకులకు మంత్రసిద్ధి కలుగుతుందనే నమ్మకంతో సాధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి మందిరాలూ, భైరవుడి ఆలయమూ ఉన్నాయి. ప్రయాణమంతా దట్టమైన అడవుల మధ్య కాలిబాటనే సాగింది. మధ్యలో వచ్చే గ్రామాలదగ్గర మెట్ల సేద్యం కనిపిస్తుంటుంది. మిగిలిన ప్రాంతమంతా అడవే. ఈ అడవిలో చిరుతపులుల సంచారం ఎక్కువని స్థానికులు చెప్పారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా అనిపించినా ప్రయాణం మాత్రం కష్టమే. పొద్దున ఏడింటికి బయలుదేరిన మాకు గుర్రాలమీద మధ్యమహేశ్వర్కి చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు అయింది.

సముద్రమట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో చుట్టూ మంచుతో కప్పబడ్డ హిమాలయాల నడుమ పచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చికలోయలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి హడావుడీ ఆర్భాటమూ లేకుండా కనిపిస్తుంది మహేశ్వర్ మందిర్. అక్కడ రూములు కూడా చాలా సాధారణంగానే ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్లాం. ఆ సమయంలో సాయంత్రం హారతి ఇస్తున్నారు. గుడిలో మేమూ పూజారిగారూ తప్ప ఎవరూ లేరు. ఓ పక్కగా సన్నని సెలయేరులా ప్రవహిస్తున్న మధ్యమహేశ్వర్ గంగ ఒడ్డున పూజలు అందుకుంటోన్న నాభి ఆకారంలోని శివలింగాన్ని చూడగానే ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడికి కుడివైపున పాలరాతి జ్ఞానసరస్వతి విగ్రహం ఉన్న మందిరమూ, బయటఉన్న చిన్న మందిరాల్లో పార్వతీదేవి, అర్ధనారీశ్వరుల విగ్రహాలూ ఉన్నాయి. ఈ ప్రాంతం ఏడాదిలో ఆరునెలలకాలం మంచుతో కప్పబడిఉంటుంది. ఆ సమయంలో ఉత్సవమూర్తులను ఉఖీమఠ్లో ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

బుడా మహేశ్వర్!
మందిరంలోనుంచి బయటకు వచ్చిన మాకు ఓ పక్కగా ఉన్న టెంట్లోనే హోటల్ను నడుపుతోన్న దాని యజమాని రొట్టెలు తిని రూములోకి వెళ్లమన్నాడు. మరో అరగంటలో అతను హోటల్ మూసేస్తాడట. చలి బాగా పెరగడంతో మేం రాత్రి భోజనాలు కానిచ్చుకుని విశ్రమించాం. మర్నాడు ఉదయాన్నే మధ్య మహేశ్వరుడి హారతి చూసుకుని కొండపై ఉన్న బుడా మహేశ్వర్ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరాం. కిందనుంచి బుడామహేశ్వర్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుర్రాలు అంత పైకి ఎక్కవని చెప్పారు. మాక్కూడా వూపిరి పీల్చుకోవడం కష్టమైంది. అంత చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టాయి. కానీ పైకి చేరాక అక్కడి ప్రకృతి అందాలు మమ్మల్ని మరో లోకంలో విహరింపజేశాయి. అక్కడ ఓ చిన్నమందిరం, అందులో ఓ శివలింగం ఉన్నాయి. దాన్నే బుడా మహేశ్వర్ అంటారు. ప్రతిరోజూ ముందుగా బుడా మహేశ్వర్కి పూజలు చేశాకే మధ్య మహేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి చూస్తే చుట్టూ తెల్లని మంచుతో కప్పబడ్డ చౌఖంబా, కేదార్నాథ్, నీలకంఠ, త్రిశూల్, కామెట్, పంచోలి పర్వతశిఖరాల మధ్య స్వచ్ఛమైన జలాలతో ఉన్న సరస్సు కనువిందు చేస్తుంది. పర్వతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాత్ర సెప్టెంబరు, అక్టోబరులో పెట్టుకుంటే మంచిది. ప్రతి ఏడాదీ కేదార్నాథ్ మందిరం తెరిచిన పదిహేను రోజులకి దీన్ని తెరుస్తారు. కేదార్నాథ్ మూయడానికి ముందే దీన్ని మూసేస్తారు. ఈ మందిరంలో కర్ణాటకకు చెందిన లింగాయత శైవులు పూజారులుగా ఉంటున్నారు.

కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కపాలేశ్వర్లను పంచ కేదారాలు అని అంటారు. ఈ ఐదింటినీ అదే వరసలో దర్శించుకోవాలి అని చెబుతారు.ఈ పంచ కేదార మందిరాల్నీ పాండవులే నిర్మించి శివుణ్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ మందిరం కూడా కేదార్నాథ్ మందిర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మేం అక్కడ నుంచి కిందకి వచ్చి పది గంటలకల్లా తిరుగు ప్రయాణమయ్యాం.

Saturday, 3 September 2016

ఘృష్ణేశ్వర స్వామి

జ్యోతిర్లింగ స్వరూపుడు

ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా ఆదుకుని, కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవ శంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనేగానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు... భక్తితో రెండు చుక్కలు నీరు పోస్తే మహాదేవుడైన ఆ స్వామి పెద్ద మనస్సు చేసుకుని కటాక్షిస్తాడు. అయితే ఉండాల్సిందల్లా భక్తి, విశ్వాసం. శివుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి అనేక చోట్ల వెలిసినప్పటికీ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలే ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి. కారణం, ఆయా క్షేత్రాలతో శివుడు భక్తుల అభీష్టం మేరకు, లోక కళ్యాణం కోసం వెలిశాడు. అలా శివుడు తనకు తానుగా ఆవిర్భవించిన క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన పుణ్యథామమే ‘వెరూల్’.

మహారాష్టల్రోని ఔరంగాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వర స్వామిగా కొలువులందుకుంటున్నాడు. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అందమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపురులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలలారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.

సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారూళ్’ అంటారు. ‘వారుళే’ కాలక్రమంలో వెరూల్గా రూపాంతరం చెందినట్టు తెలుస్తోంది. అలాగే పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’ అనే పేరుగల రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్గా పేర్గాంచింది.

మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో అందంగా అలరారుతున్న శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అతి పురానతనమైంది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడం చేశాడు. అలాగే 24 రాళ్ల స్తంభాలతో సభా మండపాన్ని కూడా చేయించాడు. అతి పురానతమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పలు పురాణగాథ ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహాకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహం చేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోషభాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్ని పెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించింది చెరువులో పడవేయించిందట. శివ భక్తురాలైన ధుశ్శ, తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మం చేయడానికి ఉద్యుక్తుడవుతుండగా, తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టం మేరకు శివుడు అక్కడ ఘృష్ణేశ్వర స్వామి’ నామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.

మరో పురాణగాథ ప్రకారం ఒకసారి శివుడు, పార్వతి కామ్యకవనంలో ఏకాంతంలో వుండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యందట. ఆ లింగం నుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా, పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే, దీనికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం. ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. ఈ నంది శిల్పం అందం వర్ణనాతీతం. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాపహరణం. ముక్తిదాయకం... భూమిలోకి చొచ్చుకుపోయి ఉన్న ఈ జ్యోతిర్లింగానికి దిన వారాలతో పనిలేకుండా రోజూ జల, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఇంకా పార్వతిమాత, వినాయకుడు, ఆంజనేయ స్వామి తదితర దేవతామందిరాలు కూడా ఉన్నాయి.

దాసరి దుర్గా ప్రసాద్


తంజావూరు - బృహధీశ్వరాలయం A









దివ్యమైన శిల్పాలు
తంజావూరు అందాలు


తంజావూరు చూడాలని చాలా రోజుల నుంచి మేము అనుకొంటున్నాం. చివరకు మా కల ఫలించి తంజావూరును దర్శించడం జరిగింది. ఆ ఊరు చాలా మాములుగా ఉంది. రైలు దిగినపుడు ఈ ఊరిలో బృహధీశ్వరాలయం ఉందా? అన్న సందేహం కలిగింది. ఆ ఆలయంలోని శివుడు పేరుకు తగ్గట్టే ఉంటాడా లేడా అన్న అనుమానమూ పీడించింది. ఎందుకంటే నేను చాలారోజుల నుంచి ఈ గుడి గురించి అక్కడక్కడా వింటూన్నందువల్ల ఈ ఊరిలో దిగగానే గుడి చూడాలన్న ఆత్రం పెరిగిపోయింది. అందుకే చాలా త్వరగా గుడికివెళ్లాం. ఆహా! గుడి గోపురాన్ని చూడగానే నాలో మాటలు ఆగిపోయాయి. ఒక పెద్ద రాజకోటలాగా ఆ మందిరం కనపడి ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. అంత ఎత్తున ఉన్న ఆ గోపురంపై అనేకానేక రకాల శిల్పాలతో కనులకు విందునిస్తున్నాయి. చూసే కొద్దీ చూడాలనే అనిపిస్తుంది. అక్కడి వారిని ఆ గుడి గూర్చి వాకబు చేసాను.

శిల్ప సౌందర్యం గూర్చి వారు ఇలా అంటారు - ఈ గోపురం పై ఉన్న శిల్పాలను శిల్పులు చెక్కడానికి పొద్దున పూనుకొనేవారు. వారు పొద్దుట నుంచి సాయంత్రం దాకా చెక్కి మిగతా పని రేపు పూర్తి చేసుకొందాం అనుకొని వారిళ్లకు వెళ్లేవారట. కాని తెల్లవారి వారు పనికి వచ్చి చూసే సరికి నిన్న మొదలుపెట్టిన శిల్పం పూర్తి అయి ఉండేదట. ఇలా ఎలా జరిగేదంటే అంతా భగవచ్చిత్రం. దేవశిల్పులు వచ్చి ఈ పనిని పూర్తి చేసి వెళ్లేవారు. మానవ మాత్రులు ఎవరైనా ఇంతచక్కటి పనితనాన్ని చూపుతారా అని వారు అన్నారు. నిజమే! ఇంతటి శిల్ప సౌందర్యావిష్కరణ చేసినవారు నిజంగా దివ్యులే అయి ఉంటారు. ఏ మనిషిలోనైనా దైవత్వాన్ని చూడమని చెప్పే మన పురాణ గాధలు నాకు గుర్తుకువచ్చాయి. ఆ శిల్పులకు నేను చేతులెత్తి నమస్కరించాను.

ఇక ఆ కోవెలలోని దైవం ఇంక ఎంత గొప్పగా ఉన్నాడో అని ఆలోచిస్తూ వెళ్లాను. అంతే మహాదేవుడు, మహాశివుడు, పరమేశ్వరుడు, దేవదేవ దేవుడు ఎంతో ఎత్తుగా, ఎత్తుకు తగ్గ వెడల్పున పార్వతీపతి లింగరూపాన ప్రతిష్టించబడి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని లింగం చూడగానే అలౌకికానందం కలిగింది. ఆది అంతాలకు కారణమైన ఈశ్వరుడు సాకారుడయ్యాడా అన్న సందేహాన్ని కలిగించేలా నిలువెత్తు లింగం గర్భగుడిలో కొలువై చిన్మయానందాన్ని కలిగిస్తోంది. నాకు తెలీయకుండానే చేతులు పైకి లేచి ఆ లింగమయ్యకు నమస్కరించాయి. అంత ఎత్తున శివలింగం ఉండడం ఆ తంజావూరుకే కాదు శివభక్తులందరికీ ఆనందం కలిగించే విషయం అనిపించింది. శివభక్తులే కాదు ప్రతి ఒక్కరూ ఆ తంజావూరిలోని శివాలయాన్ని చూసి తీరాల్సిందే. అక్కడి శిల్ప సౌందర్యాన్ని వీక్షించాల్సిందే అనిపించింది.
- యం. కామేశ్వరి


బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...