రాచరిక ఠీవి అక్కడి శిల్పసౌందర్యంలో కనిపిస్తుంది. ఆ రాతిశిల్పాల మాటున చారిత్రక విశేషాలెన్నో. 16వ శతాబ్దపు కౌశల్యానికి, శిల్పకళా నైపుణ్యానికి, చిత్రకళా విన్యాసానికి నిలువెత్తు నిదర్శనం లేపాక్షి పర్యాటక ప్రదేశం. మరి అలనాటి అద్భుత రాతికట్టడాల విశేషాలను చూసొద్దాం పదండి! సరదాగా పిల్లలను తీసుకుని లేపాక్షి వెళదామని నిర్ణయించుకున్నాం. 'లేపాక్షే ఎందుకు? అక్కడ ఏంటి స్పెషల్?' అంటూ మా వాళ్లంతా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మాకు కాస్త ఎక్కువేలేండి! అందుకే ఈ చారిత్రక ప్రదేశాన్ని మా విహారానికి ఎంచుకున్నాం. ఎక్కువమందిమి కావడంతో ఓ సుమో మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రికే బయల్దేరాం. సుమో అంతా ఒక్కటే సందడి. రాత్రి 12 గంటల వరకు పాటలు, జోక్స్ నవ్వులతో సరదాగా గడిచిపోయింది. అలా పాటలు పాడుతూనే నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారే సరికి అక్కడికి చేరుకున్నాం. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి ఫ్రెష్సప్ అయ్యి, టిఫిన్లు పూర్తి చేశాం. పురాతన విశేషాలను ఔపోశన పట్టిన మా గురవయ్య తాతను అక్కడి నుంచి మాతో పాటే తీసుకెళ్ళాం.
అనంతపురం జిల్లా హిందూపూరుకి తూర్పుగా 14 కి.మీ. దూరంలోనూ, బెంగళూరు - అనంతపురం జాతీయ రహదారిపై గల కొడికండ అడ్డరోడ్డుకు 6 కి.మీల దూరంలోనూ ఉంది లేపాక్షి గ్రామం. క్రీ.శ. 15వ శతాబ్ది చివర ప్రారంభించబడిన ఈ దేవాలయ కట్టడ సముదాయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల కొలువులో పెనుకొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ పూర్తి గావించాడని గురవయ్య తాత చక్కగా వివరించారు. మొదటగా మేము లేపాక్షి బసవన్నను చూశాం.
లేపాక్షి బసవన్న
భారతదేశ మొత్తం మీద ఇంత పెద్ద ఎద్దు శిల్పం ఇక్కడ తప్ప మరెక్కడా లేదట. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో చెక్కిన ఈ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ముందు భాగాన, మెడ కింద ఉన్న గొలుసుకు ఏనుగుకు ఎత్తి పట్టుకున్న రెండు తలల గండబేరుండం, కీర్తి ముఖం, ముత్యాల సరాలు, శిల్పులు సందర్శకులకు ముచ్చటగొలిపేలా ఉంటాయి. ఈ శిల్పం, అలనాటి విజయనగర కాలంలో వ్యవసాయానికి, అందుకు అవసరమైన పశుగణానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో అని తాతయ్య చెప్పుకొచ్చారు. తర్వాత మేమంతా లేపాక్షి ఆలయానికి వెళ్ళాం.
వర్ణ చిత్రాలు
లేపాక్షి అనగానే గుర్తుకొచ్చేది రెండు విషయాలు. ఒకటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంటిరాతి ఎద్దు శిల్పం, రెండు మధ్యయుగ దక్షిణ భారత చిత్రకళా ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వర్ణచిత్రాలు. అక్కడ ఉన్న దేవాలయాల మండపాల కప్పుల కింద, నిలువెత్తు ప్రమాణంలో ఉన్న అనేక వర్ణ చిత్రాలున్నాయి. వర్ణ చిత్రాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కన్నులపండగనే చెప్పాలి. అక్కడి శిల్పసౌందర్యాన్ని పరిశీలిస్తే, చిత్రకారుల అనుభవాన్ని, నైపుణ్యాన్ని, అంకితభావాన్ని తెలియజేస్తునట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రాకారం చుట్టుగల మండపం కప్పు కింద రామాయణంలోని ప్రధాన ఘట్టాలు, నాట్యమండపం తూర్పువైపు కప్పు కింద మహాభారత దృశ్యాలు చేయి తిరిగిన, చిత్రకారుల పనితనానికి గీటురాళ్లుగా ఉన్నాయి. ఇదే వరుసలో వటపత్రసాయి, వర్ణ చిత్ర మండపం విశేషం. మనం ఎక్కడ నుంచి చూసిన వటపత్రశాయి మమ్మల్నే చూస్తున్నట్లు మా అందరికీ అనిపించింది. కల్యాణ మండపం తూర్పు వైపున ద్రౌపది స్వయంవరం తరువాత, లేపాక్షి ఆలయ నిర్మాత, విరుపణ్ణ, అతని సోదరులు వీరన్న, కుటుంబ సభ్యులు, వ్యక్తుల చిత్రణకు చిత్రకారులు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. శయణాగారంలోనున్న అర్ధనారీశ్వర శివుని వర్ణ చిత్రం అద్భుతంగా చిత్రించబడింది. ప్రధానాలయ మహామండపం కప్పుకింద 13 అడుగుల నిడివి ఉన్న వీరభద్రుని వర్ణచిత్రం ఇప్పటివరకూ వెలుగుచూసిన వీరభద్ర వర్ణచిత్రాల్లో అతిపెద్దదని మా తాతయ్య చెప్పారు. లేపాక్షిలో దాదాపు 20 వరకూ శాసనాలున్నాయి. శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట విరుపణ్ణ తండ్రి పేరు లేపాక్షి నంది లక్కుశెట్టి అని తెలిసింది. లేపాక్షి గ్రామం పేరు లేపాక్షి, లేపక్ష, లేపక్షపుర, వీరేశ్వరపురం అని పిలిచేవారట!. ఈ గ్రామం పెనుగొండ రాజ్యం, రొట్టనాడు విషయంలో ఉందనీ శాసనాలను బట్టి తెలుస్తోంది. విరుపణ్ణ అక్కడ దేవాలయ నిర్మాణం చేపట్టక ముందు నుంచే లేపాక్షి గ్రామం ఉందని తెలుస్తోంది. అప్పటికే పాపనాశేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందట!. ఇక్కడ పాపనాశేశ్వరాలయం, వీరభద్రాలయం, రఘునాథాలయం, ఆంజనేయుడిగుడి, ఇటుకరాతి గుడి, నాగలింగం, గణేశ మండపం, యాగమండపం, సోమవార మండపం మొదలైనవి ఉన్నాయి.
వేలాడే స్తంభం
ఈ పేరు విన్న వెంటనే అందరం వేలాడే స్తంభమా ఎలా ఉంటుంది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాం. లేపాక్షి దేవాలయాన్ని చూసిన వారికి స్థానిక టూరిస్ట్ గైడ్, 'ఇంతవరకూ మీరు చూసింది ఒక ఎత్తయిన, వేలాడే స్తంభాన్ని చూడటం మరో ఎత్తు' అని ఆసక్తిని రేకెత్తించాడు. ఇది ఈశాన్య భాగంలో ఉంది. ఆ స్తంభం అడుగుభాగాన 90 శాతం ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నుంచి ఒక బట్టముక్కను, కాగితాన్ని దూర్చి ఈ వైపు నుండి ఆ వైపుకు లాగాం. ఇదొక వింతలా అనిపించింది. నిజానికి, ఎంతో బరువైన ఆ స్తంభం, దానిమీద పడేకప్పు, దూలాల బరువును లెక్కలోనికి తీసుకొంటే ఆ స్తంభం వేలాడుతుందని చెప్పలేం. స్తంభం నిలబెట్టిన నేలపరుపురాయి, కొంచెం కుంగటం వల్ల, స్తంభం అడుగుభాగం ఒక మూల మాత్రం రాతినేలకు మధ్య ఖాళీ ఏర్పడిందని అనిపిస్తుంది. అన్నీ చూసేటప్పటికి చీకటి పడింది. అప్పటికి అందరం బాగా అలసిపోయాం. ఇంటికి తిరుగుముఖం పట్టాం.
శిల్ప సౌందర్యం
లేపాక్షి ఆలయ గోడలు, స్థంబాలపైన రాతిశిల్పాలు అపురూపంగా తీర్చదిద్దబడ్డాయి. ఆలయాల్లో ప్రతిష్టించిన మూలమూర్తులనే కాక, అధిష్టానం, పాదవర్గం, స్తంభాలు, బోదెలు, ద్వార బంధాలు, దూలాలు, కప్పులపైన చివరకు ధ్వజస్తంభ, బలి పీఠాలపైనా అందమైన శిల్పాలనెన్నింటినో చెక్కారు. అక్కడి శిల్పాలలో నర్తకిలు, సంగీత కళాకారులు, వివిధ రకాల వృత్తిదారులు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఇలా చెప్పుకుంటూపోతే మొత్తం జనజీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని ఉన్నదున్నట్లుగా మలిచారు. శిల్పులు కల్పనా చాతుర్యానికి అద్దంపడుతున్న చంద్రకాంత, మంచకట్టు, మాళి, అశ్వపాద స్తంభాలపై లతలు, లతాంగులు మమ్మల్ని కట్టిపడేశాయంటే నమ్మండి! అక్కడి కళ్యాణ మండపం నాట్య మండపాల స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలు, అప్పటి శిల్పుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. లేపాక్షి శిల్పాన్ని శైవ, వైష్ణవ శిల్పాలుగా విభాజించారట. అలాగే, ఇక్కడ మనిషితో పాటు సహజీవనం సాగించిన పిట్టలు, జంతువులను కూడా రకరకాల భంగిమల్లో చెక్కారు. ఎలుక నుంచి ఏనుగు వరకు, చిలుక నుండి డేగ వరకు లేపాక్షి దేవాలయ శిల్పంలో చూడవచ్చు. జంతువుల్లో ఎలుక, పిల్లి, ఎలుగుబంటి, గుర్రం, సింహం, పులి, దున్న, ఆవు, ఎద్దు, కోతి, జింక, దుప్పి, ఏనుగు ఉండగా, పిట్టలో చిలుక, గుడ్లగూబ, కాకి, హంస, బాతు మొదలైన శిల్పాలున్నాయి. అలా అవన్నీ చూసేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక మండపంలో కూర్చుని భోజనాలు చేశాం. కొంతసేపు మా పిల్లలు ఆటలాడుకున్నారు.
ఎలా చేరుకోవాలి
బస్సురూట్ :
* లేపాక్షికి కొడికొండ చెక్‌పోస్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, అనంతపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు విరివిగా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. లేపాక్షి, హిందూపురంలో బస చేయవచ్చు.
* విజయవాడ నుంచి గుంటూరు, నరసరావుపేట, నంధ్యాల, అనంతపురం, తాడిపత్రి, పెనుగొండ మీదుగా హిందూపురం చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా ఆటోలో 14 కి.మీ దూరంలోనే లేపాక్షికి చేరుకోవచ్చు.
రైలు మార్గం :
* లేపాక్షికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో హిందూపురం రైల్వే జంక్షన్ ఉంది. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం, బెంగళూరు నుంచి హిందూపురానికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి.
నూకరాజు స్వర్ణలత
గుండె మెచ్చే గండ శిలలు
లే.. పక్షిలో..
ఒక పక్షి ఉంది.
దాని త్యాగం ఉంది.
లేపాక్షిలో రెండు కన్నులున్నాయ్!
అవి కన్న కలలున్నాయ్!
ఈ రెండింటి కలబోత.. మరెన్నో కళల పూత.. లేపాక్షి.
తెలుగు రాష్ట్రాల్లో అపురూప శిల్ప సంపదతో అలరారుతోన్న క్షేత్రాలలో లేపాక్షి ప్రముఖమైనది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆద్భుత పర్యాటక కేంద్రంలో మార్చి 31 నుంచి రెండు రోజుల పాటు ‘లేపాక్షి ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారా.. అయితే లేపాక్షికి వెళ్లిపోదాం.

ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. నీలిరంగు అట్ట ఉన్న నోట్ పుస్తకాలు ఉండేవి. అదేనండి ‘లేపాక్షి నంది’ నోట్ పుస్తకాలు. ఆ ఆట్ట మీద వేలడంత సైజులో ఓ నంది చిత్రం ఉండేది. గుర్తొచ్చిందా. అట్టమీద అంగుళం పరిమాణంలో మురిపించిన నంది.. లేపాక్షిలో ఆకాశమంత కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది. 15 అడుగుల ఎత్తు.. 25 అడుగుల పొడవుతో.. మువ్వల పట్టీలతో.. మెడలో గంటలతో.. నిన్నో.. మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది. ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావొస్తోంది. అప్పుడే ఆశ్చర్యపోకండి. అంతకుమించిన విషయాలు.. విశేషాలు.. మరెన్నో ఉన్నాయి లేపాక్షిలో.
వీరభద్రుడి కోసం..
లేపాక్షి విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అచ్యుతరాయల పాలనా కాలంలో పెనుగొండ సంస్థానంలో విరూపణ్ణ కోశాధికారి. ఆయన వీరభద్రుడి వీరభక్తుడు. లేపాక్షిలోని కూర్మగిరిపై వీరభద్రుడికి ఆలయం కట్టించాలని భావించాడు. కోశాగారంలోని ధనం వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టాడు. రాయల వైభవానికి తులతూగే విధంగా.. ఏడు ప్రాకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభువుల అనుమతి లేకుండా ప్రజాధనంతో విరూపణ్ణ ఆలయం కట్టిస్తున్నాడని అచ్యుతరాయలుకు ఫిర్యాదు చేశారు గిట్టనివారు. ఆగ్రహించిన రాజు.. విరూపణ్ణుడి కనుగుడ్లు పెకిలించాల్సిందిగా ఆజ్ఞాపించాడట. ఆ విషయం తెలుసుకున్న విరూపణ్ణ తనకు తానుగా కను గుడ్లు పెకిలించి విసిరేశాడని గాథ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే.. లేపాక్షి ఆలయంలో ఓ రాతిగోడపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆలయంలోని కల్యాణ మంటపం అసంపూర్తిగా మిగిలిపోవడం వెనుక కారణం కూడా ఇదేనని చెబుతారు.
మిగిలినవి మూడే..
లేపాక్షి ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించారు. కాలక్రమంలో నాలుగు ప్రాకారాలు శిథిలమై.. మూడు మాత్రమే మిగిలాయి. వీరభద్రుడి ఆలయం, ఉప ఆలయాలు, నాట్య మంటపం, కల్యాణ మంటపం అన్ని నిర్మాణాలూ ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. 246 స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు. కల్యాణ మంటపంలో పక్కనున్న లతా మంటపంలో 36 స్తంభాలపై 144 రకాల ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ డిజైన్లను ధర్మవరం చేనేతలో వాడటం విశేషం.
విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకూ శిల్పకళా చాతుర్యానికీ వాస్తు నైపుణ్యానికీ ప్రత్యక్ష నిదర్శనమే లేపాక్షి. ఆ శిల్పకళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం.
లే...పక్షీ!
అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో బెంగళూరుకు 122 కి.మీ దూరంలో ఉంది లేపాక్షి. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఓ చిన్న పట్టణం. తాబేలు ఆకారంలో ఉన్న కూర్మ శైలమనే చిన్న కొండమీది ఆలయ సముదాయమే లేపాక్షి. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని పోతుండగా జటాయువు అడ్డగించిందట. రావణుడు దాని రెక్కలు నరికివేయడంతో అది ఇక్కడే పడి పోయింది. సీతను వెతుకుతూ వచ్చిన రాముడు జటాయువుని చూసి జాలితో ‘లే పక్షీ’ అని పిలిచాడట. అదే లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు.
అతి పెద్ద నంది విగ్రహం!
లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.1 మీటర్ల (27 Feets) పొడవూ, 4.5 మీటర్ల (15 Feets)ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది. కాసుల పేరూ, చిరుమువ్వలూ, గంటలతో శోభాయమానంగా అలంకరించినట్లుగా చెక్కిన నంది విగ్రహాన్ని ఎంత చూసినా తనివితీరదు. మూపురం మీద శాలువా కప్పినట్లుగా చెక్కారు. నాటి విజయనగర శిల్పుల నేర్పరితనానికి ఆశ్చర్యపోవడం సందర్శకుల వంతవుతుంది. నందీశ్వరుని చెవులు రిక్కించి ఉన్నాయి. వీరభద్రాలయానికి వెనుకగా ఉన్న నాగలింగానికి అభిముఖంగా ఉంటుంది ఈ నంది. ఈ ఆలయం కేంద్రబిందువుగా చుట్టూ ఆలయాలు నిర్మించారు.
స్కంద పురాణంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి. ఉగ్రరూపంలో ఉన్న శివుడి ఝటాజూటం నుంచి పుట్టినవాడే వీరభద్రుడు. అగస్త్య మహామునే స్వయంగా వీరభద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఆయన తపస్సు చేసిన గుహ కూడా గర్భగుడికి పక్కనే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న గుడిని నిర్మించింది విరుపణ్ణ. అతని సోదరుడు వీరన్న నాయక్‌లు. 15-16 శతాబ్దాల మధ్యలో పెనుగొండ సంస్థానాన్ని పాలించిన విజయనగర రాజు అచ్యుతరాయని రాజ్యంలో విరుపణ్ణ కోశాధికారిగా ఉండేవాడు. ఓసారి కలలో వాళ్ల కులదైవం వీరభద్రస్వామి కనిపించి, నేను స్వయంభువుగా కూర్మశైలంపై అవతరించాను. అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. అంతట విరుపణ్ణ, రాజు అనుమతి లేకుండానే ఆలయనిర్మాణాన్ని ప్రారంభించాడట. దాంతో విరుపణ్ణ పేరుప్రఖ్యాతులు చూసి ఓర్వలేని కొందరు "కోశాగారంలోని నిధులన్నీ వీరభద్ర ఆలయ నిర్మాణానికి వెచ్చించాడు." అని రాజుకు చెప్పారట. అప్పటికే ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ విషయం తెలుసుకున్న రాజు కోపోద్రిక్తుడై విరుపణ్ణ కళ్లు పెరికి వేయమని ఆజ్ఞాపించాడట. విరుపణ్ణ తన కళ్లు తానే వూడపెరికి, గుడికి పడమటి దిక్కున ఉన్న గోడ పైకి వేసి కొట్టాడట. అక్కడ రాతిమీద ఉన్న రెండు గుంటలూ, ఎర్రని మరకలూ ఆ ఆనవాళ్లేనని చెబుతారు.
ఆలయ నిర్మాణం విజయనగర చక్రవర్తుల శిల్పశైలినే ప్రతిబింబిస్తూ మూడు విభాగాలుగా ఉంటుంది. ముందుగా కనిపించేది ముఖమండపం. దీన్నే నాట్య మండపం లేదా రంగ మండపంగా పిలుస్తారు. తరువాతది అర్ధమండపం. దానికి లోపలగా ఉండేది గర్భగుడి. అప్పట్లో విరుపణ్ణ ఏడు ప్రాకారాల్లో కట్టించిన ఈ ఆలయంలో ఇప్పుడు మూడు మిగిలి ఉన్నాయి. మెట్లెక్కి ముఖద్వారం దాటి ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎత్తయిన గోడల మీద ఆనాటి దాతల పేర్లూ శాసనాలూ కన్నడ భాషలో కన్పిస్తాయి. అక్కడి నుంచి ముఖ మండపంలోకి అడుగుపెడితే అక్కడి స్తంభాలన్నింటి మీదా దేవతల శిల్పాలు చెక్కి ఉన్నాయి. డెబ్భై స్తంభాలతో నిర్మించిన ఈ నాట్య లేదా ముఖ మండపం మధ్యలో ఉన్న 12 స్తంభాల మీదా నిలువెత్తు రూపంలో ఉన్న స్వర్గవాసుల విగ్రహాలను చూస్తుంటే ఇంద్రసభ కళ్ల ముందు కనిపిస్తుంది. చిత్రాలు చెక్కిన శిల్పుల ఊహాచాతుర్యానికీ పనితనానికీ జోహారులు అర్పిచాల్సిందే. మండపం మధ్యలో పైకప్పులో అద్భుతమైన శత పత్రకమలం చెక్కబడి ఉంది. అది దాటి అర్ధమండపంలోకి అడుగుపెడితే అక్కడ ఉన్న సీలింగు మీద 23 అడుగుల పొడవూ 13 అడుగుల వెడల్పుతో చిత్రించిన చిత్రం ఆసియాలోకెల్లా అతిపెద్దదిగా చెబుతారు. ఇందులో యోగదక్షిణామూర్తి, చండేశ్ అనుగ్రహమూర్తి, భిక్షాటన, హరిహర, అర్ధనారీశ్వర, కళ్యాణసుందర, త్రిపురాంతక, నటరాజ, గౌరీప్రసాదక, లింగోద్భవ.. ఇలా మొత్తం శివుడి పద్నాలుగు అవతారాలనూ అక్కడ చిత్రించడం విశేషం. ఇవన్నీ దాటి గర్భగుడిలో అడుగుపెడితే వీరభద్రస్వామి నిత్యపూజలు అందుకుంటూ దర్శనమిస్తాడు. గర్భగుడిలో ఈశాన్యంలో వాస్తుపురుషుడు, ఆగ్నేయదిశలో ఉన్న స్తంభంలో గజాసుర సంహారం, నైరుతిలో నాట్యగణపతి, వాయువ్యంలో దుర్గాదేవి శిల్పాలు ఉన్నాయి. గర్భగుడికి ముందు తూర్పువైపు పాపనాధీశ్వరుడు, పడమటివైపు రఘునాథస్వామి ఆలయాలు ఉన్నాయి. శైవులూ, వైష్ణవులూ మా దేవుడే గొప్ప అని కొట్లాడుకునే రోజుల్లో శివకేశవులు ఎదురెదురుగా ఉండటమూ, శివుడు కాకుండా వీరభద్రుడు మూలవిరాట్టుగా ఉండటమూ లేపాక్షి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మండపంలోని స్తంభాలమీద సైతం శివకేశవుల రూపాలు పక్కపక్కనే చెక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఓ స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్యపూజలు నిర్వహించడం మరో విశేషం.
గాల్లో స్తంభం!
గర్భగుడి పైకప్పుమీద వీరభద్రస్వామి వర్ణచిత్రం కనువిందు చేస్తుంది. విరుపణ్ణ భార్య పుత్రులతో సేవ చేస్తున్నట్లుగా ఉన్న ఆ వర్ణచిత్రం మనదేశంలోకెల్లా పెద్దదట. ఈశాన్యమూలలో ఉన్న అంతరిక్ష స్తంభం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.
లేపాక్షి విజయనగర రాజుల కాలంనాటి చిత్రకళలకు ప్రసిద్ధి. చెట్ల లేపనాలతోనూ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులతోనూ పైకప్పుమీద వేసిన చిత్రాలు పర్యాటకులను ఆకట్టుకొంటాయి. గర్భగుడి ప్రాకారంలో తూర్పువైపుకి రాగానే ఆరు అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం మనల్ని ఆకర్షిస్తుంటుంది. పక్కనే బండమీద శివలింగానికి సాలెపురుగు, సర్పం, ఏనుగు, భక్తకన్నప్ప పూజ చేస్తున్న దృశ్యం కన్పిస్తుంది. సమీపంలోనే ఏడు పడగలతో మూడు చుట్టుల మధ్యన శివలింగంతో ఉన్న నాగ లింగాన్ని చూడగానే ఎంతటివారైనా గగుర్పాటుకు లోనవుతారు. నాగలింగానికి ఎదురుగా ఓ వంటశాల ఉంది. ఓ రోజు ప్రధాన శిల్పుల తల్లి వంట చేయడం ఆలస్యమైందట. అది పూర్తయ్యేలోగా సమయం వృథా కాకుండా శిల్పులు నాగలింగాన్ని మలిచారట. అది చూసి ఆమె ఆశ్చర్యపోగా ఆమె దృష్టి తగిలి ఆ విగ్రహానికి చీలిక ఏర్పడిందని చెబుతారు.
ఇదే ప్రాకారంలో అసంపూర్తిగా నిలిచిన కళ్యాణమండపం ఉంది. పార్వతీ కళ్యాణానికి స్వర్గవాసులంతా కదిలి వచ్చినట్లుగా ఇక్కడ శిల్పాలను చెక్కారు. ఐదు తలలూ పది చేతులతో సదాశివుని అవతారంలో పరమేశ్వరుడు అతిథులను స్వాగతించడం కనిపిస్తుంది. రెండు కోతులు నాలుగుగానూ, ఒకే శరీరం మూడు తలలతో చెక్కిన ఆవు బొమ్మ మూడు ఆవులుగానూ కనిపించే శిల్పాలన్నీ లేపాక్షికే తలమానికం. పక్కనే ఉన్న లతామండపంలో సుమారు 136 లతల డిజైన్లు కనిపిస్తాయి. లేపాక్షి ప్రింట్లకు అవే స్ఫూర్తి. ముఖ్యంగా చీరల అంచుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కళ్యాణ మండపానికి కొద్దిదూరంలో నేలమీద చెక్కిన పెద్ద పళ్లాలు ఉన్నాయి. ఆనాటి శిల్పులు వాటిలోనే భోజనం చేసేవారని కొందరూ, కాదు రంగులు కలుపుకునేవారని మరికొందరూ అంటారు.
దగ్గర్లోనే సీతమ్మ వారి కుడిపాదం ఉంటుంది. ఆ కాలిబొటన వేలి నుంచి అన్ని కాలాల్లోనూ నీరు రావడం విచిత్రం.
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి హిందూపురానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. హిందూపురం నుంచి లేపాక్షి 14 కి.మీ. దూరంలో ఉంది.
విమానం ద్వారా వెళ్లాలనుకునేవారు బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి 122 కి.మీ దూరంలో ఉన్న లేపాక్షి చేరుకోవచ్చు.
No comments:
Post a Comment