భయం భయంగా
కొన్ని ప్రయాణాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఇంకొన్ని పర్యటనలు సాహసోపేతంగా చేయాల్సి వస్తుంది. భాన్‌గఢ్ పర్యటన మాత్రం భయం భయంగా సాగుతుంది. అక్కడి కోట అందాలు చూడాలని ఓ వైపు.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మరోవైపు.. వెరసి ఇక్కడి దెయ్యాల కోట సందర్శన పర్యాటకులకు వింత అనుభూతిని మిగులుస్తుంది.
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ఉంటుంది భాన్‌గఢ్. ఆల్వార్-జైపూర్ నగరాల మధ్య ఉన్న సారిస్కా టైగర్ పార్క్‌ను ఆనుకుని ఉంటుందీ పట్టణం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. ఎత్తయిన కొండల మధ్య నిర్మితమైన అందమైన పట్టణం భాన్‌గఢ్. పెద్ద పెద్ద కోటలు, బురుజులు చారిత్రక ఆనవాళ్లుగా దర్శనమిస్తుంటాయి. కోట లోపల పచ్చిక బయళ్లు, సెలయేళ్లు, తోటలు, ప్రాచీన ఆలయాలు అడుగడుగునా విశేషాలే. కానీ, ఈ నగరంలో మనుషులు మచ్చుకైనా కనిపించరు. ఎందుకని అడిగితే.. చుట్టుపక్కల జనాలు దెయ్యాల కథలు కోకొల్లలుగా వినిపిస్తారు.
చీకటి పడితే నో ఎంట్రీ
భాన్‌గఢ్ నగరాన్ని 1613లో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సర్వ సేనాని మాన్‌సింగ్ కుమారుడు మాదోసింగ్ దీనిని కట్టించారని చారిత్రక ఆధారాలున్నాయి. తర్వాతి కాలంలో ఒక సాధువు శపించడం వల్ల ఈ కోట దెయ్యాలకు ఆవాసంగా మారిందని, ప్రజలంతా కోటను విడిచి వెళ్లిపోయారని చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా భాన్‌గఢ్ పర్యటనపై ఆంక్షలు విధించింది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పట్టణంలోకి రాకుండా నిషేధాజ్ఞలు అమలుచేస్తోంది. అందుకే భాన్‌గఢ్ అందాలు చూడాలంటే ఉదయం వేళలో మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
చుట్టూ ఎన్నో..
ఈ కోట ప్రాంగణంలోనే సోమేశ్వర ఆలయం, గోపినాథ, మంగళదేవి, హనుమద్ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు వందలయేళ్ల నాటి మర్రిచెట్లు కోటలో ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న జలపాతాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ పర్యాటకులకు ఆనందాన్ని పంచేవే. భాన్‌గఢ్ కోటకు సమీపంలో చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సారిస్కా టైగర్ పార్క్ చూడటం మర్చిపోవద్దు. ఈ కోట నుంచి టైగర్ పార్క్ 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భాన్‌గఢ్ నుంచి జైపూర్ 83 కిలోమీటర్లు. ఇక్కడికి చేరుకుంటే పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది.
ఎలా చేరుకోవాలంటే
ఢిల్లీ నుంచి భాన్‌గఢ్ దూరం 269 కిలోమీటర్లు. NH 8, NH 11A మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. - ముందు రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకుంటే అక్కడి నుంచి సులభంగా భాన్‌గఢ్ చేరుకోవచ్చు. జైపూర్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్ వాహనాలు కూడా లభిస్తాయి. అయితే సూర్యాస్తమయం కాకముందే కోట నుంచి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment