దేశంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. హోయసలలు ఈ ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర దాగివుంది. ఆనాడు ఓ యుద్ధంలో గెలిచిన విజయసూచికగా, చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
ఆలయ చరిత్ర :
11-12 శతాబ్ద కాలాల్లో హోయసలుల రాజవంశస్థులు వుండేవారు. హళేబీడు ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘బేలూరు’ పట్టణాన్ని తమ రాజధానిగా నియమించుకుని వారు పాలించేవారు. ఈ రెండు పట్టణాలు జంట-పట్టణాలుగా పేరుగాంచాయి. ఆనాడు వారు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానంగా బేలూరులో నిర్మించిన ఈ ‘చెన్నకేశవాలయం’ చూడదగింది. ఈ ఆలయాన్ని హొయసలుల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు.
క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులు, హోయసలుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలులవారు గెలిపొందారు. ఆ విజయ సూచికగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పుడు వారు చోళులపై ‘తాలకాడ్’ యుద్ద విజయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనుక మరో కథనం కూడా వుంది. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడనన్న వాదనలూ వున్నాయి.
ఆలయ విశేషాలు :
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంగా కేశవాలయం పరిగణించబడుతుంది. ఈ ఆలయం చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆ రాజవంశస్థులు ద్రావిడ శైలిలో ‘సబ్బురాతి’తో నిర్మించారు. ఈ ఆలయంపై వున్న శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. అలాగే దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.
No comments:
Post a Comment